రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

21, ఆగస్టు 2018, మంగళవారం

674 : స్ట్రక్చర్ అప్డేట్స్


  సినిమా కథ పాత్రని పట్టుకుని ప్రయాణిస్తే పాత్ర యాక్టివ్ గా వుంటుంది, ఆ యాక్టివ్ పాత్ర కథని ముందుకు నడుపుతుంది Let's say in a story heroine and hero has two opposite philosophies towards life. Heroine on a noble side and hero on a selfish  mode. Heroine’s goal is to change the hero. Secretly she plans some thing which transforms the hero by the end. Is this in line what you said as per active role that drives the story!
టాలీవుడ్ నుంచి ఒక లేఖ



          కాకతాళీయంగా  ఇప్పుడు తెలుసుకోబోతున్న అంశమిదే. మొన్న ప్రచురించిన ‘రెండు ఒకే బాలీవుడ్ లు - రెండు ఒకే టాలీవుడ్ లు - కొత్త స్క్రీన్ ప్లే అయిడియాలు’ శీర్షిక రెండో భాగం ఇప్పుడు దీనికే కేటాయించాం. సినిమా కథ పాత్రని పట్టుకుని ప్రయాణిస్తే పాత్ర యాక్టివ్ గా వుంటుంది, యాక్టివ్ పాత్ర కథని ముందుకు నడుపుతుంది అనడం ప్రధాన పాత్ర గురించే. అయితే ప్రత్యర్ధి పాత్ర కూడా యాక్టివ్ గానే వుంటుంది, కాకపోతే కథ నడపదు. నడిపితే ప్రధాన పాత్ర పాసివ్ అయిపోతుంది. ఇక - హీరో హీరోయిన్లకి పరస్పర విరుద్ధ దృక్పథాలుండి, హీరోయిన్ దృక్పథం ఉన్నతంగా వున్నప్పుడు, హీరోని ఆ దిశగా నడిపిస్తే ఆమె యాక్టివ్ పాత్రవుతుందా, కథ నడుపుతుందా అని పై ప్రశ్న. ఆమె యాక్టివ్ పాత్ర అన్నది నిజం, కథ నడిపే పాత్ర అన్నది అబద్ధం. ఆమె ఇక్కడ ప్రత్యర్ధి పాత్ర. ప్రత్యర్ధి పాత్రెప్పుడూ కథ నడపదు. ప్రత్యర్ధి పాత్రగా ఆమె ప్రధాన పాత్రని ఇరికించి కూర్చుంటే, పీక్కునే పని ప్రధాన పాత్రగా హీరోదే. ప్రధాన పాత్ర అంటే ప్రత్యర్ధి పాత్ర సృష్టించిన సమస్యని ఎదుర్కొని పరిష్కరించేదే. అంతేగానీ సమస్యని సృష్టించేది కాదు. సమస్యని సృష్టించేది ప్రత్యర్ధి పాత్ర.  ‘శివ’ లో సమస్యని సృష్టించేది ప్రత్యర్ధి పాత్ర అయిన మాఫియా భవానీ, సమస్యని ఎదుర్కొని పరిష్కరించేది ప్రధాన పాత్రయిన శివ. ఏ కథలోనైనా ఇంతే. సమస్య ప్రత్యర్ధి పాత్ర చేతిలో వుంటే, పరిష్కారం ప్రధాన పాత్ర చేతిలో వుంటుంది. రెండూ యాక్టివ్ పాత్రలుగానే వుంటాయి. కానీ అక్కడ్నించీ కథ నడిపేది, అంతు తేల్చుకునేదీ ప్రధాన పాత్రే. ఇదొక గేమ్. దృశ్య మాధ్యమమయిన సినిమా కథ ఒక గేమ్. గేమ్ లేని దృశ్య మాధ్యమం కథ ఆత్మహత్యా సదృశ సోది. 

       ఇక్కడ హీరో దృక్పథానికి సవాలుగా హీరోయిన్ తన దృక్పథాన్ని ప్రతిపాదించింది. అందుకని ఈమె యాక్టివ్ ప్రత్యర్ధి పాత్ర (పాసివ్ ప్రత్యర్ధి పాత్రలుండవు). ఇప్పుడు వీళ్ళిద్దర్లో ఎవరు కరెక్టు? ఇది ఆర్గ్యుమెంటు. కథంటే ఆర్గ్యుమెంట్. ఇప్పుడు ఈ ఆర్గ్యుమెంట్ లో హీరో గెలవాలనుకోవడమో, ఓడిపోవాలనుకోవడమో అతను పెట్టుకునే గోల్. ఈ గోల్ తో హీరోయిన్ తో తన కెదురైన సమస్యతో సంఘర్షణ మొదలు పెడతాడు. ఆఖరికి అంతగా విలువలు లేని తన దృక్పథాన్ని మార్చుకుని ఆమె ఉన్నత దృక్పథానికి మారతాడా, లేదా అన్నది కథకి ముగింపు. 

          సమస్య ఎక్కడొస్తుందంటే, సమస్యని ప్రత్యర్ధి పాత్ర సృష్టించి, పరిష్కారం కూడా ప్రత్యర్ధి పాత్ర చేస్తేనే వస్తుంది. అది గేమ్ ఎలా అవుతుంది? దృశ్య మాధ్యమమైన సినిమా కథ గేమ్ కాకుండా ఎలాపోతుంది? ఈ గేమ్ మూలాలు సైకో థెరఫీలో కదా వుంటాయి? సినిమా కథ మూలాలు పామరులు కూడా కనెక్ట్  అయ్యే  సైకో థెరఫీలో కదా వుంటాయి? సినిమా కథంటే కాన్షస్ – సబ్ కాన్షస్ మైండ్ ల లడాయే కదా? నిత్యం మన సబ్ కాన్షస్ మైండ్ పెట్టే పరీక్షలనే కదా మన కాన్షస్ మైండ్ తో ఎదుర్కొంటాం? ఎదుర్కొని నేర్చుకుంటాం, నేర్చుకుని బాగుపడతాం? మన సబ్ కాన్షస్ పెట్టే పరీక్షల్ని సబ్ కాన్షస్సే  పరిష్కరించేస్తే, మన కాన్షస్ చేసే పనేమిటి, నేర్చుకునే దేమిటి? పైగా ఇది జరక్కుండా జరిగేదేమిటంటే, సబ్ కాన్షస్ పరిష్కారాల్ని కాన్షస్ అస్సలొప్పుకోదు. ఎందుకు ఒప్పుకోదంటే, అది ఇగో కేంద్రంగా పనిచేస్తుంది. ఆ ఇగో అస్సలొప్పుకోదు. పరీక్ష నువ్వే పెట్టి- పరిష్కారం కూడా నువ్వే చూపిస్తే, నేనేం దద్దమ్మనా? నేను ఇగోని! నేనే పరిష్కరించుకుంటా ఫో- అనేస్తుంది. అప్పుడేం చేస్తుంది? సబ్ కాన్షస్ (అంతరాత్మ) లోకి దూకి, అందులో వుండే పచ్చి నిజాలు, జీవిత సత్యాలు, నైతిక విలువలూ  మొదలైన వాటితో సంఘర్షించి, తప్పొప్పులు తెలుసుకుని, ఒడ్డున పడి పరిష్కరించుకుంటుంది. ఇగోని కాస్తా మెచ్యూర్డ్ ఇగోగా మార్చుకుంటుంది. 

          అంటే, పై విధివిధానాలతో ఇగోని మెచ్యూర్డ్ ఇగోగా మార్చేదే మంచి సినిమా కథన్న మాట. ఇగో మెచ్యూర్డ్ ఇగోగా మారకుండా, ఎలావున్న ఇగో అలాగే వుండిపోతే, జీవితాలకే కాదు, సినిమాలకీ చెడ్డ కథ. పురాణాల్లో జరిగేది ఈ సైకో థెరఫీలే. ఈ మూలాల్ని, బేసిక్స్ నీ  అర్ధం జేసుకోకుండా సినిమా కథల్ని రాయడమంటే కుక్క తోక పట్టుకుని గోదారి ఈదడమే.   

          ఇలా గోదారీది సినిమాల్ని తీస్తున్నారంటే, గుణాత్మకంగా అవి టికెట్టుకి సరిపడా విలువగల సినిమాలు కావు. బెజవాడకి టికెట్టు డబ్బులు వసూలు చేసి కోదాడలో దింపేసినట్టుంటాయి. అప్పుడు ప్రేక్షకులు కూడా ఫర్వాలేదు, కోదాడ దాకా లాక్కొచ్చాడు, 2.5 / 5 రేటింగ్ ఇవ్వొచ్చని అల్పసంతోషాన్ని ప్రకటించుకుంటున్నారు. ఇగోకీ, మెచ్యూర్డ్ ఇగోకీ మధ్య దూరం కోదాడ నుంచీ కంచికచర్ల మీదుగా బెజవాడ! 

          కథకుడు నీరోగారి ఫిడేలు మీటుతున్నంత  కాలం ఇగో సినిమాలే వస్తాయి.

***
      అందుకని పై వివరణ దృష్ట్యా, హీరోయిన్ తన దృక్పథం వైపు హీరోని నడిపించాలనుకుని, ఆ సమస్యని తనే పరిష్కరిస్తే అది కాన్షస్ – సబ్ కాన్షస్ ఫ్రేమ్ వర్క్ లోకి రాదు. ప్రత్యర్ధి పాత్రెప్పుడూ సబ్ కాన్షస్ మైండే. ఇది బాగా గుర్తు పెట్టుకోవాలి. ప్రధాన పాత్రెప్పుడూ కాన్షస్ ఇగోనే. ఇది కూడా గుర్తెట్టుకోవాలి. 

          అందుకని కథ ప్రారంభించి ముగించడం ప్రత్యర్ధి పాత్రయిన హీరోయినే చేసేస్తే, ఇక ప్రధాన పాత్రగా హీరో చేసేదేమిటి? నేర్చుకునేదేమిటి? ఆమె పెట్టిన పరీక్షని లెక్క చేయకుండా కూర్చున్నా, ఆ పరీక్ష పరిష్కారమైపోతుంది – ఎందుకంటే, ఆమే పరిష్కరిస్తుంది కాబట్టి. అలాంటప్పుడు హీరోతో ఆ కథంతా ఎందుకు? అప్పుడు హీరో యాక్టివ్ పాత్రెలా అవుతాడు, పాసివ్ పాత్రవుతాడు. అంటే గేమ్ లో వుండడు. ఫ్రేమ్ వర్క్ లోనూ వుండడు. మెచ్యూర్డ్ ఇగో సినిమా తయారు కాదు, ఇమ్మెచ్యూర్డ్ ఇగోని చూపించి ముగించేస్తుంది. 

          ఇదే జరిగింది ‘గీత గోవిందం’ లో, కొంచెం తేడాతో  ‘శ్రీనివాస కళ్యాణం’ లో. మొదటిది హీరో చేతిలో లేని సింగిల్ గోల్ కథయితే, రెండోది డబుల్ గోల్ కథ. వీటిలో మొదటిది దాని ప్లాట్ పాయింట్ వన్ ఎలా ఏర్పాటయిందో చూస్తే, బస్సులో నిద్రలో వున్న హీరోయిన్ తో సెల్ఫీ దిగబోతాడు హీరో. అప్పుడు తూలి ఆమె మీద పడ్డంతో అతడి పెదాలు వెళ్లి ఆమె పెదాలకి తగుల్తాయి. ఆమె గొడవ చేసి అన్నకి కాల్ చేస్తుంది. అతను భయపడిపోయి పారిపోతాడు. ఇలా సమస్యలో ఇరుక్కుంటాడు ప్రధాన పాత్రగా హీరో. ఇప్పుడు హీరో గోల్ ఏమిటి? ఈ సమస్యలోంచి బయట పడడమే. 

      సమస్యని ఇంకొంచెం పెంచి, హీరోయిన్ అన్నకి, హీరో చెల్లెలికీ పెళ్లి సంబంధం కుదిర్చారు. ఇక్కడ గోల్ తో మెచ్చదగ్గ క్రియేటివిటీ కనబడుతుంది. గోల్ తో మొనాటనీని ఛేదించడం గురించే కదా ఈ రెండు వ్యాసాల ఎజెండా. ఇక్కడ గోల్ తో మొనాటనీని ఛేదించడం కనిపిస్తుంది. ఎలాగంటే, బస్సు సీనుతో పారిపోయిన హీరోకి ఈ సీను ఆధారంగానే  గోల్ ఏర్పాటు చేసి కథనడపలేదు. నడిపివుంటే రొటీన్ మొనాటనీ అయ్యేది. దీంతో ఏముంటుంది, హీరోయిన్ అన్న బారి నుంచి హీరో తప్పించుకోవడం, ఎదుర్కోవడం, చివరికెలాగో అపార్ధం తొలగించడం...ఇదే కథయ్యి వుండేది. ఒకే సమస్య, దాంతోనే కథంతా, దానికే పరిష్కారమనే లీనియర్ ఫ్లాట్ గోల్ ట్రావెల్ వుండేది. దీనికి ప్రత్యాన్మాయాలు వెతుక్కోవాలనేగా ఈ ప్రయత్నం. 

          మరి గత వ్యాసంలో ‘గోల్డ్’ లో గోల్ తో ఒక క్రియేటివిటీని ఇలా చూశాం : హీరోకి గోల్ ఏర్పాటయిన వెంటనే రొటీన్ గా ఆ గోల్ తాలూకు ప్రత్యక్ష సంఘర్షణలో పడెయ్యలేదు హీరోని. సంఘర్షణని ఆలస్యం చేశారు. అంటే గోల్ నుంచి విడదీసేశారు. ఇది మెచ్చదగ్గ క్రియేటివిటీ. ఇన్నోవేట్ అయిన, అప్డేట్ చేసుకున్న గోల్ మేనేజ్ మెంట్.

          ఇదొక కొత్త పద్ధతయితే, ఇక్కడేం జరిగిందంటే, బస్సు సీనుతో ప్లాట్ పాయింట్ వన్ లో,  హీరోకి గోల్ ఏర్పాటయింది. ఇది మొనాటనీ బారిన పడకుండా ఇంకో సీను ఏర్పాటయింది. పారిపోయిన హీరో ఇంటికెళ్ళగానే అక్కడ తన చెల్లెలికీ హీరోయిన్ అన్నకీ పెళ్లి. దీంతో సమస్య తీవ్రత పెరగడమే గాక, గోల్ వ్యూహం మార్చుకోవాల్సిన అవసరమేర్పడింది హీరోకి. 

      ఇక్కడ హీరోయిన్ తనని ముద్దు పెట్టుకున్నది ఈ హీరోయేనని అన్నకి చెప్పేస్తే, హీరో ప్రాణాలు పోవడమే గాక, చెల్లెలి పెళ్లి చెడిపోతుంది. 

          ఇక్కడేం జరిగిందంటే, సాంప్రదాయంగా జరుగుతున్నట్టు, ప్లాట్ పాయింట్ వన్ ఒకే  సీనుతో, దాని గోల్ తో,  రొటీన్ గా అరిగిపోయిన ఏకోన్ముఖ మలుపుగా లేకుండా, ద్విముఖంగా డైమెన్షన్ పెంచుకుంది. అంటే, బస్సు సీను ఒకవైపు, పెళ్లి సీను ఇంకోవైపుగా రెండూ కలిసిన జంక్షన్ గా నిలబడింది. దీంతో కేవలం ఒక బస్సు సీనుతో రొటీన్ గా,  ఏకోన్ముఖంగా ఏర్పడ్డ హీరో గోల్, పెళ్లి సీనుని కలుపుకుని ద్విముఖంగా మారింది. అప్పుడు డైమెన్షనూ, దాంతో డైనమిక్సూ పెంచుకుంది. సాంప్రదాయంగా ప్లాట్ పాయింట్ వన్స్ ఒకే సీనుతో వుంటాయి, వుంటూ వస్తున్నాయి. అంటే, ఆ ఒక సీనులోనే వచ్చే మలుపుతో, అక్కడే గోల్ ఏర్పడుతూ రావడం ఆనవాయితీగా వుంది. దీన్ని ఇక్కడ బ్రేక్ చేశారు. 

          అంటే హీరో మీద రెండు సమస్యల్ని మోపు చేసే ట్రిక్ తో ద్విముఖ గోల్ అనే ఒక ఇన్నోవేషన్ జరిగిందన్న మాట. ఒక సమస్యలో ఇరుక్కున్న హీరోని ఇంకో సమస్యలో అక్కడే ఇరికించడం ద్వారా ఇది వీలైంది.
***
       మరి ఈ ద్విముఖ గోల్ నిర్వహణ ఎలావుంది? తన సంగతి హీరోయిన్ ఆమె అన్నకి చెప్పేస్తే తన ప్రాణాలకే ప్రమాదం, అదే సమయంలో ఆమె అన్నతో తన చెల్లెలి పెళ్లి సంబంధం చెడి పోతుంది. ఈ రెండూ జరక్కుండా చూడడం హీరో ద్విముఖ గోల్. ఇందుకేం చేయాలి? వ్యూహమేమిటి? యాక్షన్ కథల్లో కూడా కూడా హీరోకి వెంటనే వ్యూహం వుండదు. విలన్ తో ఢక్కా మొక్కీలు తింటూ పాసివ్ గానే వుంటాడు మొదట...ఆ ఒడుపు తెలిసేదాకా. ఒడుపు తెలిసిందో ఇక దాన్ని పట్టుకుని యాక్టివ్ గా విజృంభించి విలన్ అంతు చూస్తాడు. చూడాలంటే ప్లాట్ పాయింట్ వన్ దగ్గర సమస్యలో ఇరుకున్న పధ్ధతి బలంగా, సమగ్రంగా వుండాలి. లేకపోతే  దారీ తెన్నూ లేనివాడై పోతాడు. 

          ఉదాహరణకి ఇక్కడే చూద్దాం : బస్సు సీన్లో హీరోయిన్ చేతిలో హీరో ఇరుక్కున్నాడు. ఎలాటి ఇరుక్కోవడమది? సమగ్రమేనా? అక్కడికక్కడే ఆమెని తిప్పికొట్ట లేడా?  ఇంకా తను సెల్ఫీ క్లిక్ చేయనే లేదు. కాబట్టి ఆ ఫోటోఆధారం లేదు. తనకి కిస్ పెట్టడాన్న ఆమె ఆరోపణకి ఆమె మాటలు తప్ప ఆధారమే లేదు. ఆమెకి నిజంగా అతడి మీద చర్య తీసుకోవాలని వుంటే  అక్కడే బస్సాపించి అల్లరి చేయవచ్చు. అక్కడే అతణ్ణి పట్టించవచ్చు. సాధారణంగా ఏ అమ్మాయినా ఆత్మరక్షణతో ఇదే చేస్తుంది. ఇదేమీ చేయకుండా, ఎక్కడో అన్నకి కాల్ చేసి చెప్పిందంటే, ఈ లోగా హీరో పారిపోవడానికి అవకాశ మిచ్చిందంటే, ఇవన్నీ పాత్రలు వాటి నైజంతో చేస్తున్న పనులా? కథా సౌలభ్యం కోసం కథకుడు చౌచౌగా చేయిస్తున్న పనులా? పాత్రల్ని కథ నడిపుకోనిస్తున్నాడా, లేక వాటిని పాసివ్ గా చేసి తనే కథ నడుపుతున్నాడా?  కథకోసం సమస్యని ఏర్పాటు చేస్తున్నప్పుడు అందులో లోసుగులుండ కూడదు. కామన్ సెన్స్ కి దూరంగా వుండకూడదు. అప్పుడే ఆ పాత్రలూ ఆ కథా, దాని ముగింపూ అర్ధవంతంగా, బలంగా వుంటాయి. మొత్తం కథ ఆయురారోగ్యాలు ప్లాట్ పాయింట్ వన్ పటిష్టతతోనే వుంటాయి. 

          ఈ సమస్య హీరోకి ఓ సమస్యే కాదు. అయినా హీరోయిన్ కి భయపడుతూ, ఆ భయంలోంచి కథకుడు కోరుకున్న కామెడీ సృష్టిస్తూ, మంచి వాడుగా నిరూపించుకునే ప్రయత్నాలు చేస్తూ – ఒక గోల్ అంటూ లేకుండా పాసివ్ గానే వుండిపోతాడు. ఇక ఇతడి సమస్యని కూడా హీరోయినే పరిష్కరించి బయట పడేస్తుంది!  అంటే సమస్యని సృష్టించిన ప్రత్యర్ధి పాత్రే సమస్యని తీర్చేయడమన్న మాట! ప్రధాన పాత్రగా హీరో చేసిందేమీ లేదు, నేర్చుకుందేమీ లేదు, పరిష్కరించుకుందేమీ లేదు. ప్రత్యర్ధి పాత్రే సమస్యని తీర్చే ఈ అవకరం గురించి – కథా అన్యాయం గురించి పై పేరాల్లోనే శాస్త్రీయంగా చెప్పుకున్నాం. శాస్త్రీయత, సూత్ర బద్ధత అవసరం లేదనుకుంటే అది వేరే విషయం. గుణాత్మకం కాకుండా వ్యాపారాత్మకం కాగలవు సినిమాలు. అయితే అన్ని సార్లూ అందరు హీరోలతో సాధ్యంకాదు. నితిన్ తో కానిది విజయ్ దేవరకొండతో అయింది. కానీ విజయ్ దేవరకొండతో ఇలాగే మరోసారి వ్యాపారాత్మకం అవుతుందన్న గ్యారంటీ లేదు.  

      ఇక, ఇది మళ్ళీ మరొక మభ్య పెట్టే ప్రయత్నం. హీరోయినే సమస్య తీర్చడం. హీరో ఒక కవ్వించే అమ్మాయికి లొంగకుండా, ఆమెని దారిలో పెట్టాడని ఎవరో చెప్పగానే నమ్మేసి, హీరోయిన్ కి అపార్ధాలు తొలగిపోయి, హీరోకి ప్రేయసై పోతుంది!  తన అపార్ధం గురించి పగబట్టిన అన్నకి చెప్పేసి చల్లబర్చేస్తుంది. అంతే, ఆమె పుణ్యాన ప్రధాన పాత్ర హీరో హేపీ. 

          ఇక్కడ మభ్య పెట్టడం ఎలా జరుగుతుందంటే, హీరో ఆ అమ్మాయిని దారిలో పెట్టింది హీరోయిన్ తో పాడు పని చేసి బ్యాడ్ అన్పించుకోక మునుపు కాదు. చాలా తర్వాత. హీరోయిన్ పరిచయం కాక మునుపు ఒకమ్మాయిని దారిలో పెట్టాడంటే, పాపం నిజంగా అమాయకుడేనని హీరోయిన్ నమ్మవచ్చు. హీరోయిన్తో పాడు పని చేసిన చాలా తర్వాత ఆ అమ్మాయిని దారిలో పెట్టాడంటే, అది హీరౌయిన్ తెలుసుకునేలా చేసే నాటకమైనా అయివుండాలి, లేదా తను పరివర్తన చెందే ప్రయత్నం కొద్దీ అలా చేసి వుండాలి. పరివర్తన చెందాలను కోవడానికి తను చెడ్డ వాడేమీ కాదు, కథలో మొదట్నుంచీ మంచోడే. కాబట్టి, అది కావాలని హీరో ఆడిన నాటకమై వుంటుందని మనకి అన్పించేలా పొరపాటు కథనం చేశారు. అంతే కదా? యథా ప్లాట్ పాయింట్ వన్ – తథా ప్లాట్ పాయింట్ టూ. సౌజన్యం : ఆరు ఆస్కార్ అవార్డుల బిల్లీ వైల్డర్.

       ఇక హీరోయిన్ ప్రేమిస్తున్నాక హీరో యాక్టివ్ అన్పించుకుంటూ (హీరోయిన్ పుణ్యానే) ఆమెతో పెళ్లి దగ్గర బింకాలకి పోయి, ముందరి కాళ్ళకి బంధం వేసుకుని ఇంకోలా ఇరుక్కుంటాడు. చివరికి అతిధి పాత్రగా వచ్చే నిత్యామీనన్ సలహా పాటించి  కొత్త సమస్య పరిష్కరించుకుంటాడు. అలాటి సలహా ఇచ్చి ఆమె ఫెమినిజపు ట్రిక్కు ప్లే చేసి తిక్క కుదిర్చినట్టే అన్పిస్తుంది ఇది కూడా. వెరసి ఈ కథకి ఈమే ప్రధాన పాత్ర అన్పిస్తుంది!
***
          రొటీన్ ని బ్రేక్ చేసే ఈ ద్విముఖ గోల్ ఏర్పాటు కొత్తదే. ఒక ఇన్నోవేషన్. అయితే  దీని నిర్వహణ మళ్ళీ షరా మామూలు తెలుగు సినిమా లోపాలతో వుంది. అయినా ప్రేక్షకులు ఒప్పుకున్నారు, బాక్సాఫీసు నిండింది. దీనికి స్క్రీన్ ప్లే సంగతులు రాయాలనుకోలేదు. ప్రేక్షకులు ఒప్పుకున్నసినిమాలో లోపాలెన్నితే విమర్శలొస్తాయి. మనకెందుకని వదిలెయ్యాలి. కానీ ‘గోల్డ్ లో గోల్ తో ఒక ఇన్నోవేషన్, ‘సంజు’ లో ఇంకో ఇన్నోవేషన్ లాగే, ఇందులో మరింకో ఇన్నోవేషన్ కన్పిండం వల్ల, దీన్ని దృష్టికి తెచ్చే ఉద్దేశంతో రాయాల్సి వచ్చింది. రాయాల్సి వచ్చినప్పుడు గోల్ నిర్వహణలో సకల లోపాలూ దాని వెంటే రాయాల్సి వచ్చింది. 

     రోమాంటిక్ కామెడీల గొప్పతనం టాలీవుడ్ కి తెలియడం లేదు. హాలీవుడ్ రోమాంటిక్ కామెడీలు (వెన్ హేరీ మెట్ శాలీ, మై బెస్ట్ ఫ్రెండ్స్ వెడ్డింగ్, లవ్ యాక్చువల్లీ, బ్రిజెట్ జోన్స్ డైరీ మొదలైన వెన్నో) గొప్ప స్టడీ మెటీరియల్స్ అని అమెరికన్ యూనివర్సిటీల్లో భాగం చేశారు ప్రొఫెసర్లు. వీటిలో లవర్స్ మధ్య వుండే వ్యూహ ప్రతివ్యూహాలు, వాటి అమలు, ఫలితాల అధ్యయనం నిత్య వ్యవహారాల్లో, కార్పొరేట్ వ్యవహారాల్లో సైతం దిక్సూచిలా వుంటాయని తేల్చారు. మరోపక్క చెత్త కూడా ఉత్పత్తి అవుతోందని  టైం మ్యాగజైన్ రాసింది. ప్రేమల్ని తప్పుడుగా చూపించడం, ప్రేమల్లో ఎదురయ్యే సమస్యలకి ప్రేమికులు రెస్పాండ్ అయ్యే తీరూ, అపరిపక్వ పరిష్కారాలూ వగైరా అవే నిజమని యువత నమ్మేలా చేస్తున్నాయని తప్పు బట్టింది. దురదృష్ట వశాత్తూ టాలీవుడ్ ఈ రెండో వర్గంలో వుంది. కానీ తెలుగు ప్రేక్షకులు ఇంకా లోకల్ గా లేరు, వాడ వాడలా ఎప్పుడో గ్లోబలైజ్  అయ్యారు. మనోవికాసం కల్గించే కొత్త గాలికి ముక్కు మూసుకోరు. కథకులే ముక్కులు దులుపుకోవాలి. ఆఘ్రాణ శక్తిని పెంచుకోవాలి. ఆ గ్రంథులేమైనా మూసుకుపోతే సర్జరీలు చేయించుకోవాలి. ఫిడేలు, పెన్ను పక్కన పడేసి, పలకలు ఎత్తుకోవాలి.

సికిందర్

19, ఆగస్టు 2018, ఆదివారం

673 : స్ట్రక్చర్ అప్డేట్స్


       సినిమా పాత్ర కథని పట్టుకుని ప్రయాణిస్తుందా, లేక కథని పుట్టిస్తూ ప్రయాణిస్తుందా? మొదటిది జరిగితే నష్టమేమిటి? రెండోది జరిగితే లాభమేమిటి? రెండోది జరిగితే  ‘గోల్డ్’  లాంటి లాభం. మొదటిది జరిగితే ‘శ్రీనివాస కళ్యాణం’ లాంటి నష్టం. ఇవాళ్ళ ఇది కొత్తగా చెప్పుకునే విషయం కాదు. చాలా పాత విషయమే. సినిమా కథ పాత్రని పట్టుకుని ప్రయాణిస్తే పాత్ర యాక్టివ్ గా వుంటుంది, ఆ యాక్టివ్ పాత్ర కథని ముందుకు నడుపుతుంది. సినిమా పాత్రే కథని పట్టుకుని ప్రయాణిస్తే పాసివ్ పాత్రవుతుంది, ఆ పాసివ్ పాత్ర కథని కూల్చేస్తుంది. నూటికి తొంభై సార్లు ఏం జరుగుతోందంటే, రెండున్నర గంటల పాత్రని ఆలోచించకుండా, కేవలం రెండున్నర గంటల కథని ఆలోచించడం వల్ల పాసివ్ పాత్రలు పుట్టి, 90 శాతం సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి.
          ‘గోల్డ్’ లో పక్కకి తొలగకుండా పూర్తిగా రెండున్నర గంటల పాత్రని ఆలోచించారు. అందుకని ప్రేక్షకులు పాత్రని పట్టుకుని ప్రయాణిస్తూ, అది పుట్టిస్తున్నకథని అనుభవించే అదృష్టానికి నోచుకుంటున్నారు. పాత్ర కథని పుట్టించక పోతే, కథని కథకుడి పెంపుడు కుక్కలు కూడా అనుభవించ లేవు. దొంగలు పడ్డా మాకేంటని కునుకు తీసి, కథకుడి ఇంటిని దొంగల పాల్జేసి కక్ష తీర్చుకుంటాయి. కథకుడు సినిమా కథ రాయడం మొదలెట్టినప్పుడు ఈ కనీస జ్ఞానం లేకపోతే, నీరో చక్రవర్తి అవుతాడు. తను రాసి పక్కన పడేస్తున్న ఒక్కో పేజీ మీద లక్షో, కొన్ని లక్షలో బడ్జెట్ భస్మీపటలమవడానికి సిద్ధమవుతోంటే, తన లోకంలో తాను వీరోచితంగా రాసుకుంటూ భావప్రాప్తి పొందుతూంటాడు. ఇతడి ముందు నీరో చక్రవర్తి అట్టర్ ఫ్లాపవుతాడు. ఫిడేలు పడేసి పెన్ను అడుక్కుంటాడు. 

          పాత్ర కథనెలా పుట్టిస్తుందంటే, పాత్రకో అవసరం (గోల్) వుంటుంది, ఆ అవసరాన్ని పొందేందుకు కథని పుట్టిస్తూంటాడు. పాత్ర లేకుండా ‘అవసరం’ వుండదు. ఏ కథైనా పుట్టేది పాత్ర ‘అవసరం’ తోనే. అవసరమే కథకి పుట్టిల్లు. అక్కడ్నించీ కథని అత్తారింటికి పంపడమే పాత్ర చేసే పని, చింతామణి దగ్గరికి కాదు. పాత్రని పక్కన బెట్టి కథకుడు అవసరాన్ని వూహించ గలడా? తన కథైతే వూహించగలడు. అప్పుడు తన ‘అవసరం’ పాత్ర ‘అవసరం’ గా కల్పించి, పాత్ర చేతిలో కథని పెట్టడు. తన జీవితంలో ఆ ‘అవసరం’ తో అయిన అనుభవాలే పాత్ర అనుభవాలుగా నమ్మిస్తూ చిత్రించుకు పోతాడు. తన ఆనుభవాలతో పాత్రని నడిపిస్తాడు. కానీ జీవితం అచ్చంగా సినిమాకి తర్జుమా అవాలంటే అది ఆర్ట్ సినిమా అవుతుందని అర్ధం జేసుకోడు. ఫిడేలు రైటర్నే అవ్వాలనుకుంటాడు. పెన్ను కోసం నీరో చక్రవర్తి వచ్చినా తనే హీరో ఐపోవాలనుకుంటాడు. పెన్ను పెట్టి ఫటేల్మని ఫిడేలుని చీరేస్తాడు!
***
        ‘గోల్డ్’ లో ముఖ్యంగా గమనించాల్సింది,  గోల్ (అవసరం) అనే పాత్ర పరికరం అప్డేట్ అయిన విధం. ఏ సినిమా చూసినా, ‘పాత్ర గోల్ - దానికోసం సంఘర్షణ – విజయం’ – అనే బ్రాకెట్లోనే వుంటాయనేది తెలిసిందే. అయితే ఇదొక టెంప్లెట్ బారిన పడి మొనాటనీ వచ్చేసింది. మొదటి అరగంట కథలో గోల్ ఏర్పడడం, తర్వాత గంట కథలో గోల్ కోసం సంఘర్షించి ఓ పరిష్కార మార్గాన్ని కనుక్కోవడం, దాంతో చివరి అరగంటలో గోల్ ని సాధించుకోవడం. ఇదే టెంప్లెట్ లో, అందులో ఇవే యాక్ట్ బ్రేక్స్ ప్లేస్ మెంట్స్ తో సినిమాలు వస్తూంటాయి. వీటికి రివ్యూలు రాయాలన్నా థ్రిల్ వుండదు, యాంత్రికమే. ఈ బ్రాకెట్ ని బ్రేక్ చేయకూడదా? బ్రాకెట్ ని బ్రేక్ చేయడమంటే త్రీ యాక్ట్ స్ట్రక్చర్ ని బ్రేక్ చేయడం కాదు. త్రీ యాక్ట్ స్ట్రక్చర్ త్రీ యాక్ట్ స్ట్రక్చరే కమర్షియల్ సినిమాలకి. దీన్ని కాదనుకున్న వాళ్ళు నాన్ కమర్షియల్ యూరోపియన్ సినిమాలు తీసుకోవచ్చు. 

          హాలీవుడ్ లో పూర్వం అరిస్టాటిల్ నాటక నమూనాతో ప్రారంభించుకుని, తర్వాత జోసెఫ్ క్యాంప్ బెల్ పురాణ కథల నమూనా కొచ్చి, దీని తర్వాత సిడ్ ఫీల్డ్ ఆధునిక  నమూనా స్వీకరించారన్నసంగతి తెలిసిందే. సుమారు మూడు దశాబ్దాలుగా సిడ్ ఫీల్డ్ నమూనాతోనే హాలీవుడ్ సినిమా లొస్తున్నాయి. హాలీవుడ్ ని అనుసరించే ఇతర దేశాల కమర్షియల్ సినిమాలు సైతం ఈ బ్రాకెట్లోకే వచ్చేశాయి. ఇన్నేళ్ళుగా ఈ బ్రాకెట్లో సినిమాలు చూసి చూసి విసుగేయడం లేదూ?

          తప్పకుండా విసుగేస్తోంది. రివ్యూ రైటర్ అనే శాల్తీ, గోల్ ఎప్పుడొస్తుందాని టైము చూసుకుంటూ – అరగంటకి రాకపోతే ఇంకా ఎదురు చూస్తూ, ఇంటర్వెల్ కొస్తే అసంతృప్తి చెందుతూ, ఇంటర్వెల్ తర్వాత వస్తే మటాష్ అనుకుంటూ గడపాల్సి వస్తోంది.  గోల్ అరగంటకే ఎందుకు రావాలి? ఇంటర్వెల్ కి వస్తే ఫస్టాఫ్ డొల్లగా మారుతుంది గనుక. ఇంటర్వెల్ తర్వాత వస్తే మిడిల్ మటాష్ అవుతుంది గనుక. అయినా సరే, గోల్ అరగంటకే ఎందుకు రావాలి?

          గోల్ అరగంటకి రావాల్సిందే! అది స్ట్రక్చర్. వీలయితే అరగంట లోపు పావుగంటకే రావొచ్చు, నష్టం లేదు. స్ట్రక్చర్ ని బ్రేక్ చేయలేరు. స్ట్రక్చర్ లోపల టెంప్లెట్ గా మార్చుకున్న క్రియేటివిటీని బ్రేక్ చేయాలి.  క్రియేటివిటీ మన ఇష్టం, స్ట్రక్చర్ ఎవడబ్బ సొత్తూ కాదు.  అరిస్టాటిల్, జోసెఫ్ క్యాంప్ బెల్ ల నమూనాలని ఆధునిక కాలానికి తగ్గట్టూ సరళీకరించి,  సిడ్ ఫీల్డ్ ఇచ్చిన నమూనా శాశ్వతం. ఇంతకంటే సరళీకరణ ఇక కుదరదు. ఉన్నతీ కరించడం కూడా కుదరదు. కుదిరేది దీని లోపల కథతో క్రియేటివిటీ ని ఇన్నోవేట్ చేసుకోవడమే, అప్డేట్ చేసుకోవడమే. అప్పుడే స్ట్రక్చర్ లోపల మొనాటనీ బ్రేక్ అవుతుంది. ఫ్రెష్ సినిమాలొస్తాయి.

***
        అరగంట లోనో, అంతకి మునుపో గోల్ వస్తే అది టెంప్లెట్ బారిన పడకుండా ఎలా మేనేజ్ చేయాలి? ఒక్కటే మార్గం : దాని కోసం మొదలయ్యే  ప్రత్యక్ష సంఘర్షణని ఆలస్యం చేయడం. గోల్ ఒక ప్రొడక్టు అనుకుంటే, సంఘర్షణ దాన్నుంచి వచ్చే బై ప్రొడక్టు. దీన్నాలస్యం చేయాలి. ముందు శోభనం జరిపించెయ్యాలి, సంసారం పిల్లాపీచూ తర్వాతెప్పుడో! వాటి కోసం ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసేట్టు చేయాలి. ‘గోల్డ్’ లో ఇదే చేశారు. ఒలింపిక్స్ పోటీలు ఎప్పుడెప్పుడాని ఎదురుచూసేట్టు చేశారు. క్రియేటివిటీ అంటే ప్రేక్షకులతో ఆడుకోవడమే (నరకం చూపించే ఆట కాదు).  
       
          మామూలుగా టెంప్లెట్ లో ఎలా వుంటుందంటే, హీరోకి గోల్ ఏర్పడిన వెంటనే ప్రత్యర్ధితో, లేదా వ్యతిరేక పరిస్థితులతో ప్రత్యక్ష పోరాటం మొదలైపోతుంది. దీన్నాలస్యం చేయాలి. ‘గోల్డ్’ లో ఇదే చేశారు. కానీ గోల్ ని ఆలస్యం చేయలేదు. ఆట ప్రారంభమైన పది నిమిషాల్లోనే గోల్ ని ఏర్పాటు చేసేశారు. ఇందులో హీరో గోల్,  1948 ఒలింపిక్స్ లో గోల్డ్ మెడల్ సాధించడమే. అంటే తనకి సవాలు విసురుతున్న అంశం ఒలింపిక్స్. అలాగని ఈ గోల్ ఏర్పడిన వెంటనే ఒలింపిక్స్  కూడా ప్రారంభమై పోరాటం మొదలు కాలేదు. ఈ ప్రత్యక్ష పోరాటాన్ని క్లయిమాక్స్ కి జరిపేశారు. 

          ‘మెకన్నాస్ గోల్డ్’ లో గోల్డ్ కోసం పోతే క్లయిమాక్స్ లో భూకంపం వస్తుంది. ఇది బిగ్ ఈవెంట్. ఒక ‘స్టార్ వార్స్’  సీక్వెల్ లో బిగ్ ఈవెంట్ క్లయిమాక్స్ లో డెత్ స్టార్ ని నాశనం చేయడం. వెంకటేష్ ‘బొబ్బిలి రాజా’ లో బిగ్ ఈవెంట్  చివర్లో వచ్చే ‘బలపం పట్టి భామ వొడిలో’ పాట. రిపీట్ ఆడియెన్స్ ఈ పాట చూసేసి వెళ్ళిపోయే వాళ్ళు. అలాగే ‘గోల్డ్’ లో బిగ్ ఈవెంట్ వచ్చేసి క్లయిమాక్స్ లో వచ్చే ఒలింపిక్స్ గేమ్! 

           
రెండు గంటల 50 నిమిషాల నిడివి గల ‘గోల్డ్’ లో చివరి అరగంటకే ఒలింపిక్స్ గేమ్స్ తో క్లయిమాక్స్ వస్తుంది. అంతవరకూ దాని కోసం ఎదురు చూసేలా చేస్తారు. రెండు గంటలకి పైగా ఎదురు చూసేలా చేయడమంటే చాలా రిస్కు తీసుకోవడమే. అంత సేపూ ఏమేం చూపిస్తూ ప్రేక్షకుల్ని కూర్చోబెట్టాలి? భరిస్తారా, గొడవ చేస్తారా? 

       ఆట ప్రారంభమైన పది నిమిషాల్లోనే, 1936 జర్మనీ ఒలింపిక్స్ గోల్డ్ గెలిచినప్పుడు, ఆ గెలుపు క్రెడిట్ బ్రిటిష్ పాలకులు వాళ్ళ ఖాతాలో వేసుకున్నప్పుడు, హీరో అక్షయ్ కుమార్ కి రగిలిపోయి గోల్ ఏర్పడుతుంది. ఇక వచ్చే ఒలింపిక్స్ లో స్వతంత్ర ఇండియాకి గోల్డ్ సాధించాలని. దీంతో స్క్రీన్ ప్లేలో బిగినింగ్ విభాగం ముగుస్తుంది. 

          ఈ గోల్ తో వెంటనే సమస్యతో సంఘర్షణకి దిగాడా? లేదు, ఇదే క్రియేటివిటీ లోని బ్యూటీ. ఈ గోల్నే గనుక రొటీన్ టెంప్లెట్ లో పెడితే ఇలా వుంటుంది – హీరో బ్రిటిష్ వాళ్ళని వెళ్ళగొట్టడానికి వెంటనే  స్వాతంత్ర్య పోరాటంలోకి దూకుతాడు. ఈ మిడిల్ విభాగమంతా గాంధీ నెహ్రూ మొదలైన నాయకుల వెంట వుండి పోరాడుతూ, లాఠీ దెబ్బలు, తూటా దెబ్బలూ తింటూ, గొప్ప దేశ భక్తిని రగిలిస్తాడు. తట్టుకోలేక స్వాతంత్ర్య మిచ్చేసి బ్రిటిష్ వాళ్ళు విమానాలెక్కగానే - ఇంకా అయిపోలేదురా – వస్తా, మీ ఇంటికే వస్తా, నా ఒక వైపే చూశారు, రెండో వైపు చూడలేదు, మీ ఇంటికొచ్చి చూపిస్తా- ఒలింపిక్ గోల్డ్ కొట్టు కెళ్ళిపోతా – అని మృదుమధురమైన భాషలో హెచ్చరించి, మిడిల్ విభాగాన్ని ముగిస్తాడు.  

          ఇక ఎండ్ విభాగంలో టీముకి ట్రైనింగు ఇప్పించుకుని లండన్ బయల్దేరతాడు. అక్కడ ఒలింపిక్స్ లో బ్రిటిషర్లని ఓడించి, గోల్డ్ ని కైవసం చేసుకుని గోల్ పూర్తి చేసుకుంటాడు.

          ఇలావుంటుంది, గోల్ తో వెంటనే సంఘర్షణ ప్రారంభిస్తే. స్వాతంత్ర్య పోరాటమంతా జొరబడి జానర్ మర్యాద దెబ్బతినిపోతుంది. ఈ కథ హాకీ క్రీడ గురించే గానీ ఫ్రీడం ఫైట్ గురించి కాదు. దాన్ని చొరబెట్టి కలుషితం చేయడం కాదు. ఒక గోల్ పెట్టుకుని దాన్నే గుర్తు చేస్తూ, సీను తర్వాత సీను దానికోసం సంఘర్షణే  చివరంటా చూపిస్తూ పోతూంటే, కథనం ఫ్లాట్ గా మారుతున్న, ముందేం జరుగుతుందో తెలిసిపోతున్న, పాత్ర తెగ బోరు కొడుతున్న, ఒకేలాంటి సినిమాలొస్తున్నాయి. టెంప్లెట్ తో వచ్చిన సమస్యే ఇది.  

        తాజాగా విడుదలైన జాన్ అబ్రహాం ‘సత్యమేవ జయతే’ చూస్తే కూడా ఇది బాగా అర్ధమవుతుంది. అతడికి యాంగ్రీ యంగ్ మాన్ గా అవినీతి పోలీసుల్ని అంతమొందించడం గోల్. చివరి దాకా ఈ గోల్ తో సాగే కథని నిలబెట్టడానికి, ఆ గోల్ తాలూకు యాక్షన్ ని అత్యంత హింసాత్మకంగా, జుగుప్సాకరంగా చూపించాల్సి వచ్చింది. గోల్ ఏమిటో తెలిసిపోయాక, ఇంకేం జరుగుతుందో తెలిసిపోయాక మిగిలేది మొనాటనీయే కాబట్టి- దీన్ని కప్పి పెట్టడానికి,  అత్యంత వయొలెంట్ యాక్షన్ గా మార్చి, దృష్టి మరల్చాల్సి వచ్చింది.

          ‘గోల్డ్’ లో గోల్ తాలూకు యాక్షన్ ని – అంటే ఒలింపిక్స్ అనే బిగ్ ఈవెంట్ ని పక్కకు పెట్టేశారు. జర్మనీలో గెలిచి వచ్చాక హీరో స్వాతంత్ర్యం కోసం ఎదురు చూస్తూంటాడు. ఇక స్వాతంత్ర్యం దగ్గర పడుతూ, 1948 ఒలింపిక్ ప్రకటన వెలువడగానే టీము అన్వేషణలో బయల్దేరతాడు. ఫస్టాఫ్ అంతా అతడి కుటుంబం గురించి, కొందరు టీం మెంబర్ల కథల గురించి, అవి హీరో ప్రయత్నాలని ప్రభావితం చేయడం గురించి, చివరికి అంతా రెడీ అనుకున్నాక, దేశ విభజన జరిగి టీము ముక్కలవడం గురించీ! ఇది ఇంటర్వెల్ పాయింట్.  

          బాగానే వుంది, మరి ఇక్కడ్నుంచీ ఎలా? మళ్ళీ ఇంకో టీము వెతుక్కోవాలా? ఇది మళ్ళీ ఫస్టాఫ్ కథలాగే వుండదా? ఉంటుంది, కాకపోతే ఫస్టాఫ్ కథకంటే కష్టాల - టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ - తీవ్రత ఎక్కువుంటుంది. ఈ టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ ఎలా పెరుగుతూ పోతుంది? కథని (యాక్టివ్) పాత్ర నడిపితేనే పెరుగుతూ పోతుంది. ఇక్కడే అక్షయ్ కుమార్ పాత్రని వ్యూహాత్మకంగా నడిపారు. ఎలాగైతే  ‘భలే భలే మగాడివోయ్’ లో నాని పాత్ర కథలో పది నిమిషాల కో బ్యాంగ్ చొప్పున ఇచ్చుకుంటూ స్ట్రక్చర్ నే ఎగేసుకుంటూ వెళ్ళిపోతుందో,  అలా అక్షయ్ పాత్ర కథకున్న ఏకరూప ఫస్టాఫ్ – సెకెండాఫ్ అనే బోరు ఎక్కడా కలక్కుండా, జోడు గుర్రాల్లా వురికించే సన్నివేశాలు సృష్టించుకుంటూ సాగిపోతుంది. ఏ సినిమా కథయినా ప్రధాన పాత్రని పట్టుకుని కథకుడు ప్రయాణిస్తేనే కరెక్టుగా వస్తుంది. ఎందుకంటే కథంటే ప్రధాన పాత్రే. ఇంకెక్కడో వేరేగా వుండదు. ఇలా కాకుండా, కథకుడే తోచిన కథని ప్రధాన పాత్రకి పూస్తూ పోతూంటే, పోతూనే వుంటాడు అట్టర్ ఫ్లాప్ గోతి లోకి. గోతిలో పడ్డాక గానీ పెన్ను పడేసి ఫిడేలు అందుకోడు – అప్పుడు ఫిడేలు రైటర్. మళ్ళీ అదొక భయానక పుట్టుక. 

      ఈ సుదీర్ఘంగా సాగే మిడిల్ విభాగంలో పలక శుభ్రంగా తుడిచేసి కొత్త వ్రాత రాశారు. బిగినింగ్ విభాగంలో జర్మనీలో హీరో గెలిచాక, ఆ బ్రిటిషీయుల ఛాయలు మిడిల్లో ఎక్కడా పడనివ్వకుండా, పలక శుభ్రంగా తుడిచేశారు. ఆ క్లీన్ స్లేట్ మీద ఫ్రెష్ గా మిడిల్ రాసుకొచ్చారు. టీముల ఏర్పాటుకోసం హీరో చేస్తున్న ప్రయత్నాలకి బ్రిటిష్ పాత్రలు  జొరబడి గండి కొట్టడం ఎక్కడా వుండదు. ఎందుకు వుండదంటే, ఏర్పాటు చేసిన గోల్ తో వెంటనే సంఘర్షణలోకి స్క్రీన్ ప్లే వెళ్ళడం లేదు కాబట్టి. అదంతా ఎండ్ విభాగానికి జరిపేశారు కాబట్టి. బ్రిటిష్ పాత్రలు కూడా కన్పించవు మిడిల్లో. స్ట్రక్చర్లో ఒక కొత్త క్రియేటివిటీకి సమకట్టినప్పుడు దానికి కట్టుబడి వుండాల్సిందే. నిగ్రహం తప్పో, అభద్రతతోనో ఆ సమకట్టిన క్రియేటివిటీని అక్కడక్కడైనా చెరచడం చేస్తే, ఉద్దేశమే ఉల్ఫా అయిపోతుంది. 

          సారాంశ మేమిటంటే, స్ట్రక్చర్ లో గోల్ తో గల క్రియేటివ్ మొనాటనీని బ్రేక్ చేయడానికి, గోల్ నుంచి సంఘర్షణని విడదీసేయాలి…గోల్ నుంచి సంఘర్షణని విడదీసేయాలి
గోల్ నుంచి సంఘర్షణని విడదీసేయాలి మిడిల్లో ఆ గోల్ తాలూకు సన్నివేశాలే నడపాలి. కొన్ని తెలుగు సినిమాల్లో ఎలా వుంటుందంటే,  గోల్ ని ఏర్పాటు చేశాక,  దాన్ని పక్కన పెట్టేసి, ఇంకేవో గోల్ తో సంబంధంలేని కామెడీ కాలక్షేపాలు చేసుకుపోతారు. చిట్టచివర్లో ఎక్కడో గోల్ గుర్తొచ్చినట్టు ఉలిక్కి పడి కళ్ళు తెర్చి, కాసేపు ఆ గోల్ ని చికెన్ ఫ్రై చేసుకుని ముగించేస్తారు. సినిమా విడుదలయ్యాక ఖాళీ జేబులతో చికెన్ ఫ్రై కోసం తిరుగుతూంటారు. అది గోల్ ని చికెన్ ఫ్రై చేస్తే చికెన్లు పెట్టే శాపం. గోల్ గోల్డెన్ ఎగ్స్ పెట్టాలంటే ఇలాకాదు. 

          గోల్ నుంచి సంఘర్షణని విడదీసి, తర్వాత ఉపయోగంలోకి తెచ్చుకోవాలంటే ఏమిటి? ఆ సంఘర్షణని మొదలెట్టే సన్నివేశాలని తీసికెళ్ళి సంఘర్షణకి కలిపి సంఘర్షణని ప్రారంభించడమే. ‘గోల్డ్’ మిడిల్లో వున్నది సంఘర్షణని  మొదలెట్టడానికి కావలసిన ఇంధనం సమకూర్చుకున్న సన్నివేశాల సృష్టే!  ఏర్పాటయిన గోల్ కీ, సంఘర్షణ మొదలవడానికీ మధ్య వున్న స్పేస్ ని, సంఘర్షణకి సన్నద్ధం చేసే సన్నివేశాల కల్పనకి సద్వినియోగం చేసుకోవడమే. ప్రత్యక్షంగా ‘గోల్డ్’ ని చూసి ఆలోచిస్తే ఇది బాగా అర్ధమవుతుంది.
***
     ‘గోల్డ్’ లాగే గోల్ తో క్రియేటివిటీ కనబర్చే మూవీ ‘సంజు’. ఇక్కడ గోల్ రివర్సల్ జరుగుతుంది. అంటే కథ నడిపిస్తున్న హీరో కాస్తా డీలాపడిపోయి పాసివ్ గా మారిపోతాడు. కానీ కథ నడిపిస్తున్నంత సేపూ హీరోకి ఏ గోల్ ఏర్పడుతుందన్న ఆసక్తి క్రియేట్ అవుతుంది. తీరా చూస్తే గోల్ హీరోకి ఏర్పడదు. గోల్ రివర్సల్ ఎదురవుతుంది. అనూహ్యంగా గోల్ అతడి తండ్రికి ఏర్పడుతుంది. ఎందుకంటే డ్రగ్స్ కి బానిసై, ప్రేమలో విఫలమై హీరో అశక్తుడై పోయాడు. అందుకని హీరోని బాగు పర్చే గోల్ తో, కథని ముందుకు నడిపే యాక్టివ్ పాత్రగా, తండ్రి ప్రవేశించాడు.

          ఇది కూడా గోల్ తో వుండే మొనాటనీని ఛేదిస్తోంది. షానన్ అనే రచయిత ఏమంటాడంటే... ‘1 – గోల్’ లేదా లీనియర్ ప్లాట్ తో వస్తున్న సినిమాలు కథ తెలిసిపోతూ ఫ్లాట్ గా, ఏ మాత్రం ఆసక్తి రేకెత్తించని విధంగా వస్తున్నాయి. హీరోకి ఒకే గోల్ వుంటుంది, దానికోసమే సినిమా అంతా పాటుబడుతూ వుంటాడు. అదే కథ విసుగ్గా నడుస్తూ వుంటుంది. అయితే ఇంకో సినేరియాలో అప్పుడప్పుడు ‘2 – గోల్’ ప్లాట్ తో సినిమాలు కూడా వస్తున్నాయి. స్టీవెన్ స్పీల్ బెర్గ్ తీసిన రెండు సినిమాలే వున్నాయి. ‘ఈటీ’ లో హీరోకి గ్రహాంతర జీవిని తనతోనే వుంచుకోవాలన్న గోల్ వుంటుంది. కానీ సెకండాఫ్ లో ఈ గోల్ మారిపోతుంది. గ్రహాంతర జీవి తిరిగి దాని గ్రహానికి వెళ్ళిపోయేందుకు సాయపడే  గోల్  ఏర్పడుతుంది. ‘జురాసిక్ పార్క్’ లో కూడా, హీరోకి పార్క్ ని సురక్షితంగా వుంచాలన్న గోల్ వుంటుంది. ఎప్పుడయితే డినోసారస్ లు అదుపు తప్పుతున్నాయన్న సూచనలం|దుతాయో, అప్పుడిక పార్క్ ఓనర్ పిల్లల సంరక్షణే గోల్ గా మారిపోతుంది...

         
గోల్ రివర్సల్ కి ఇంకో ఉదాహరణ చెప్పాడు షానన్. రెండు జెట్ విమానాలు చెరో గమ్యం వైపు దూసుకు పోతూంటాయి. మధ్యలో గుద్దుకుని పేలిపోతాయి. ఇక రెండు గమ్యాలూ క్యాన్సిల్ అయిపోయి, మూడో గమ్యం మొదలవుతుంది...

         దీన్నిలా కూడా చెప్పొచ్చు : హీరో ఒక గోల్ తో వెళ్తున్నాడు. అట్నుంచి హీరోయిన్ ఇంకో గోల్ తో వస్తోంది. ఇద్దరి కార్లూ పంజా గుట్ట సెంటర్లో గట్టిగా గుద్దుకుని పెద్ద ప్రమాదం జరిగింది. దాంతో ఇద్దరి గోల్సూ దుర్గం చెర్వులో పడి, ఇద్దరికీ కలిపి ఇంకో ఉమ్మడి గోల్ పుట్టుకొచ్చింది...


          ఇవీ గోల్ రివర్సల్ కి కొన్ని ఉదాహరణలు. ఒకే గోల్ ని సినిమా అంతా సింగిల్ ట్రాక్ మీద ఈడుస్తూ హీరోకే రోత పుట్టించేకన్నా, ఇలాటి 2 – గోల్ ప్లాట్స్ సృష్టించి, మొదటి గోల్ ని క్యాన్సిల్ చేసి, ఫ్రెష్ గా రెండో గోల్ ని ప్రారంభిస్తే మొనాటనీ పోతుంది. 

          ఇదిప్పుడు ఎందుకు అత్యవసరమో ఇంకో కారణం కూడా చెప్పుకుంటే, ప్రేక్షకుల అటెన్షన్ స్పాన్ అనేది పది సెకన్లకి పడి పోయిందని ఏనాడో సిడ్ ఫీల్డ్ చెప్పాడు. అంటే ఒక విషయం మీద పది సెకన్లకి మించి దృష్టిని పెట్టి చూడలేక పోతున్నారు ఆధునిక జీవన వేగం పెరిగిపోవడం వల్ల. అందుకే కథనంలో వేగమే కాదు, కదిలిపోయే దృశ్యాల్లో వేగం, గ్రాఫిక్స్ తో హంగామా ఇత్యాది టెక్నిక్స్ వాడాల్సి వస్తోంది.

         ఈ అటెన్షన్ స్పాన్ పరిధిలోకి  స్టోరీ గోల్ ని కూడా తీసుకొచ్చుకుని చూసినప్పుడు, ఒకే గోల్ తో రెండు గంటల కథ ఎంత బోరు కొడుతుంది... కనుక గోల్ తో రకరకాల క్రియేటివిటీలు అత్యవసరమే కావొచ్చు.

17, ఆగస్టు 2018, శుక్రవారం

విదేశీ పాఠక వర్గంలో కొత్తగా నెదర్లాండ్స్, పోర్చుగల్, రష్యా, ఖతర్, 
ఐర్లాండ్ దేశాల నుంచి పాఠకులు చేరుతున్నారు.
అందరికీ కృతజ్ఞతలు!
***

స్ట్రక్చర్ అప్డేట్స్ :


16, ఆగస్టు 2018, గురువారం

672 : రివ్యూ!





దర్శకత్వం : రీమా కాగ్తీ
తారాగణం : అక్షయ్ కుమార్, మౌనీరాయ్, కునాల్ కపూర్, సన్నీ కౌశల్, అమిత్ సాథ్, వినీత్ కుమార్ సింగ్, నికితా దత్తా తదితరులు
కథ : రీమా కాగ్తీ, రాజేష్ దేవరాజ్, స్క్రీన్ ప్లే : రాజేష్ దేవరాజ్, మాటలు : జావేద్ అఖ్తర్,సంగీతం : ఆర్కో ప్రావో ముఖర్జీ, తనిష్క్ బాగ్చీ, నేపథ్య సంగీతం : సచిన్ – జిగర్, ఛాయాగ్రహణం : అల్వరో గుట్రేజ్
బ్యానర్ : ఎక్సెల్ ఎంటర్ టైన్మెంట్
నిర్మాతలు : రీతేష్ శిధ్వానీ, ఫర్హాన్ అఖ్తర్
విడుదల : ఆగస్టు15, 2018

***
          క్షయ్ కుమార్ స్పోర్ట్స్ డ్రామాల్లో ‘బ్రదర్స్’ తర్వాత  ‘గోల్డ్’ బాక్సాఫీసు గోల్ కొట్టేందుకు సిద్ధమై వచ్చింది. ‘బ్రదర్స్’ లో మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ ని పరిచయంచేస్తే, ‘గోల్డ్’ లో 1948 నాటి ఇండియన్ హాకీ టీం లండన్లో సాధించిన ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ సువర్ణాధ్యాయ ఘట్టాన్ని పరిచయం చేశాడు. బాలీవుడ్ లో దీపామెహతా (1947 –ఎర్త్, వాటర్), మేఘనా గుల్జార్ (రాజీ) ల తర్వాత పీరియడ్ మూవీస్ తీసిన దర్శకురాళ్ళ జాబితాలో ఇప్పుడు రీమా కాగ్తీ చేరిపోయింది. బిగ్ కాన్వాస్ మీద బృహత్ ప్రాజెక్టులుగా మేల్ డైరెక్టర్స్ మాత్రమే తీస్తూ వచ్చిన పీరియడ్ మూవీస్ సెగ్మెంట్ లో, వాళ్ళకే మాత్రం తీసిపోకుండా పాదం మోపింది. ఒక యదార్థ ఘట్టంతో భారీ కమర్షియల్ ప్రయోగం చేసింది. ఇదెలా వుందో ఒకసారి చూద్దాం...

కథ
          1936 లో జర్మనీలోని బెర్లిన్ ఒలింపిక్స్ లో బ్రిటిషిండియా హాకీ టీముకి జ్యూనియర్ మేనేజర్ గా వున్న తపన్ దాస్ (అక్షయ్ కుమార్), అడాల్ఫ్ హిట్లర్ సమక్షంలో జర్మనీని చిత్తుగా ఓడించి గోల్డ్ మెడల్ సాధిస్తాడు. అయితే ఇండియా ఇంకా బ్రిటిష్ పాలనలోనే వుంది గనుక బ్రిటిష్ పతాక మెగరేసి, బ్రిటిష్ జాతీయ గీతం పాడేసరికి వొళ్ళు మండిపోతుంది తపన్ కి. అప్పుడే గట్టి ప్రతిన బూనుతాడు. ఇక ఎట్టి పరిస్థితిలో స్వతంత్ర భారత్ ని ఒలింపిక్స్ లోకి నడిపించి గోల్డ్ మెడల్ కొట్టాలన్న ధ్యేయంతో వుంటాడు. అయితే ఆ స్వాతంత్ర్యమూ, ఒలింపిక్సూ రావడం లేటవుతూంటాయి. హిట్లర్ వెలగబెట్టిన రెండో ప్రపంచ యుద్ధంతో 1940, 44లలో జరగాల్సిన ఒలింపిక్స్ వాయిదా పడతాయి.1945 లో యుద్ధం ముగిశాక, 1946 లో ఒలింపిక్స్ గురించి ప్రకటన వస్తుంది.1948 లో లండన్లో నిర్వహిస్తామని. ఈ మధ్య కాలమంతా మనసు విరిగిన తపన్ తాగుడికి బానిసవుతాడు. చివరికి 1947 లో అతను ఎదురుచూసిన స్వాతంత్య్రం లభిస్తుంది. అయితే దీనికి ముందే హాకీ ఫెడరేషన్ ని కదిలించి ఆటగాళ్ళని వెతికి వెతికి కష్టపడి టీముని తయారు చేసుకుంటాడు. ఇంతలో స్వాతంత్ర్యం లభించి, దేశ విభజన పరిణామాల్లో టీము మూడు ముక్కలవుతుంది. తపన్ తీవ్ర సంక్షోభంలో పడిపోతాడు. ఇప్పుడేం చేయాలి? కొత్త టీముకి ఫెడరేషన్ సహకరించడం లేదు. సొంత డబ్బులు పెట్టుకుని కొత్త టీముని  తానే తయారు చేసుకోవాలా? ఏం చేసి గోల్డ్ కొట్టాలి?

ఎలావుంది కథ 
      1948 లో స్వతంత్ర భారత్ అందుకున్న మొదటి ఒలింపిక్స్ గోల్డ్ మెడల్ - అదీ లండన్లో బ్రిటిష్ గడ్డ మీద బ్రిటిష్ టీముని ఓడించి సాధించిన స్వర్ణపతకం వరకూ యదార్థ ఘట్టమే. దీన్ని స్పూర్తిగా తీసుకుని కథ అల్లేశారు. ఈ కథలో అన్నీ కల్పిత పాత్రలే, కల్పిత సంఘటనలే, కల్పిత థ్రిల్స్ - డ్రామాలే. ఇలా చేయవచ్చా అంటే ఏమో - అక్షయ్ కుమారే నటించిన ‘ఏర్ లిఫ్ట్’ (2015) లో కువైట్ యుద్ధంలో చిక్కుకున్న భారతీయుల తరలింపు ఘటనని కూడా ఫిక్షన్ చేసి ప్రభుత్వ వర్గాల నుంచే విమర్శలెదుర్కొన్నారు. 

          ‘గోల్డ్’ లో కేవలం రెండే పాత్రలకి యదార్థంలో మూలాలు కన్పిస్తాయి. కథలో సృష్టించిన కెప్టెన్ ఇంతియాజ్ అలీ షా, ప్లేయర్ హిమ్మత్ సింగ్ పాత్రలు. మొదటి దానికి హాకీ స్టార్ కేశవ్ దత్ ఆధారం.1947 లో దేశవిభజన నేపధ్యంలో జరిగిన మత హింసలో లాహోర్ కి చెందిన కేశవ్ దత్ ఇరుక్కుంటే, టీం సభ్యుడు షారుఖ్ తన ఇంట్లోదాచి పెట్టాడు. ఇంటి మీద దాడి జరిగే సరికి రైలెక్కించి ఢిల్లీ పంపించేశాడు. ఆ తర్వాత వీళ్ళిద్దరూ 1948 లో రెండు దేశాల తరపున టీం మెంబర్లుగా లండన్ ఒలింపిక్స్ లో కలుసుకున్నారు.


హాకీ లెజెండ్ బల్బీర్ సింగ్ 
        కథలో ఇప్పుడు జాయింట్ మేనేజర్ గా వున్న తపన్ దాస్ (అక్షయ్ కుమార్), టీం కెప్టెన్ గా ఇంతియాజ్ అలీ షా పాత్రని ఎంపిక చేస్తాడు. టీములో ఇంకొందరు ముస్లిములుంటారు. మత హింస జరిగినప్పుడు అమృత్ సర్ లో వున్న ఇంతియాజ్ ని చంపడానికి వెంట బడతారు. తపన్, మరో ఇద్దరు టీం మెంబర్లు కాపాడతారు. అప్పుడు ఇంతియాజ్ - నా లాహోర్ ఇప్పుడు ఈ దేశంలో లేదు, నేనిక్కడి వాసిని కాను - అంటాడు. అతణ్ణి బాధాకరంగా లాహోర్ రైలెక్కిస్తారు. అతను పాక్ కి నాయకత్వం వహిస్తూ లండన్ ఒలింపిక్స్ కొస్తాడు. ఇక్కడ – విద్యాబాలన్ నటించిన ‘బేగం జాన్’ (2017) ఛాయలు కన్పిస్తాయి. ఈ కల్పిత కథలో దేశ విభజన రేఖ గీసే ఇద్దరు స్నేహితులైన హిందూ ముస్లిం రెవిన్యూ అధికారులు, విభజన రేఖ కిరువైపులా చేరిపోయిన తమ స్వస్థలాల ఖర్మాన స్నేహితులుగా తామూ విడిపోవాల్సి వస్తుంది. 

          రెండో పాత్ర పంజాబుకి చెందిన హిమ్మత్ సింగ్. దీనికి ఆధారం ఇప్పటికీ జీవించి వున్న హాకీ లెజెండ్ బల్బీర్  సింగ్. ఈయన ఒకటి కాదు,  మూడు సార్లు ఒలింపిక్స్  గోల్డ్ మెడల్ ఛాంపియన్ గా వినుతి కెక్కారు. అయితే వాస్తవంగా లండన్ ఒలింపిక్స్ లో బల్బీర్ సింగ్ రెండు కీలక గోల్స్ కొట్టి 4-0 స్కోరుతో బ్రిటన్ ని ఓడించారు. కథలో హిమ్మత్ సింగ్ రెండు కీలక గోల్స్ కొట్టి, 3 - 1 స్కోరుగా చూపించారు. టీం మెంబర్ తో హిమ్మత్ తాగి ఘర్షణ పడ్డం, బహిష్కరణకి గురికావడం, అప్పుడు ఇండియా ఒకే గోల్ కొట్టి ఓడిపోయే ప్రమాదంలో పడినప్పుడు, అతనే గత్యంతరమై పిలిస్తే వచ్చి రెండు గోల్స్ కొట్టి టీముకి గోల్డ్ మెడల్ సాధించి పెట్టడం ఈ డ్రామా అంతా కల్పితం. ఈ డ్రామా కోసం, అతడి (బల్బీర్?) హీరోయిజం కోసం, టీము మొదట ఒకే గోల్ కొట్టి చేతులెత్తేసినట్టు చూపించారు.

1948  ‘గోల్డ్’ హీరోలు 
      నిజానికి దేశం ముక్కలైనప్పుడు ఇండో – పాక్ జాయింట్ టీముగా లండన్ ఒలింపిక్స్ కి పంపాలన్న ఆలోచన వచ్చింది. దేశవిభజనతో చాలా మంది ముస్లిం ప్లేయర్స్ ని ఇండియన్ టీము కోల్పోయింది. అయితే తర్వాత ఈ ఆలోచన విరమించుకున్నారు. కథలో మాత్రం తపన్ దాస్ టీములో కెప్టెన్ ఇంతియాజ్ సహా మరికొన్ని ముస్లిం పాత్రలుంటాయి. దేశవిభజన తర్వాత కొత్త టీములో వీళ్ళెవరూ వుండరు. అయితే వాస్తవంలో  గోల్డ్ మెడల్ కొట్టిన టీములో ఎనిమింది మంది క్రిస్టియన్లు, ఇద్దరు ముస్లిములు వున్నారు. కథలో వీళ్ళు కన్పించరు. క్రిస్టియన్లు ఆస్ట్రేలియా వెళ్లిపోయినట్టు, ముస్లిములు పాకిస్తాన్ వెళ్ళిపోయినట్టు  విచిత్రంగా చెప్తారు! 

          పైన చెప్పుకున్న అప్పుడప్పుడే స్వాతంత్ర్యం లభించిన నేపధ్యంలో ఇండో – పాక్ సమిష్టి టీముని లండన్ ఒలింపిక్స్ కి పంపాలని యదార్ధంగా చేసిన ఆలోచనలాంటిది, ఏకంగా కార్యరూపంలో పూర్తి స్థాయిలో, బంపర్ గా సల్మాన్ ఖాన్ నటించిన ‘టైగర్ జిందాహై’ (2017) లో దర్శనమిస్తుంది. కాకపోతే క్రీడల ఖాతాలో కాకుండా  యుద్ధ ఖాతాలో వేశారు. ఇందులో, సిరియాలో ఐసిస్ పనిబట్టడానికి ఇండియన్ ‘రా’ ఏజెంట్ టీము వెళ్తే, ఇదే పని మీద పాక్ ఐఎస్ఐ టీం కూడా వస్తుంది. కాసేపు ఆధిపత్యపు పోరులాడుకుని, రాజీపడి, కలిసి ఐసిస్ ని ఖతం చేస్తారు. అప్పుడు ఒకే వాహనానికి తమ రెండు దేశాల జెండాలు రెపరెప లాడించుకుంటూ బయల్దేరతారు. నవ్వొచ్చే వ్యవహారం.

          ఇక తపన్ దాస్ పాత్ర. వాస్తవంలో ఏసీ ఛటర్జీ అనే అతను టీం మేనేజర్ గా వున్నాడు. ఆయనకి తపన్ దాస్ పాత్ర కథంతా లేదు. 1936 లో జర్మనీ గోల్డ్ గెలవడం దగ్గర్నుంచీ,1948 లో లండన్ గోల్డ్ వరకూ తపన్ దాస్ స్ట్రగుల్ అంతా సినిమా కష్టాలే. 

      కథకి అపూర్వ దేశభక్తిని జోడించారు. తెలుగు సినిమాల్లో పిచ్చి పిచ్చి కథలకి దేశభక్తిని జోడించినట్టుగాక, నమ్మదగ్గ దేశభక్తిని ఎంతో ఫీలయ్యేలా కల్పించారు. ఆనాటి దేశభక్తికి ఆలంబన స్వరాజ్య కాంక్ష. దేశభక్తి గురించి మాట్లాడే, నినదించే అర్హత, ఆనాడు బ్రిటిష్ పాలనలో మగ్గిన, లాఠీ దెబ్బలుతిన్న ప్రజా సమూహాలకే వుంటుందేమో. ఆ వేడిలో ఈ కథ నడవబట్టి దేశభక్తి అంత మౌలికంగా హైలైట్ అయింది. 

          ఇందులో జావేద్ అఖ్తర్ రాసిన అనేక బలమైన డైలాగుల్లో ఒక  డైలాగు- ‘మీరు మీమీ రాష్ట్ర్రాల్ని చూసుకోండి, నగరాల్ని చూసుకోండి,  వీధుల్ని చూసుకోండి, మీమీ అహంకారాలనీ, ఇగోల్నీ చూసుకోండి... నేను ఇండియాని చూస్తా!’ అని. స్వాతంత్ర్యం తర్వాత కొత్త టీం మెంబర్లు వాళ్ళ వాళ్ళ ప్రాంతాలుగా, భాషలుగా విడిపోయి గ్రూపులు కట్టి కొట్టుకుంటే, అక్షయ్ కుమార్ కొట్టే పవర్ఫుల్ దేశభక్తి డైలాగు. 

           కేవలం ‘1948 ఒలింపిక్స్ గోల్డ్’ అనే యదార్థ పాయింటుని తీసుకుని, దాని చుట్టూ సినిమా కథ అల్లేసి, శక్తివంతంగా ప్రేక్షకుల ముందుంచారు.

ఎవరెలా చేశారు
     అక్షయ్ కుమార్ ది బెంగాలీ బాబు పాత్ర. దోవతీ కట్టుకునే వుంటాడు. విచారం కలిగితే తాగేస్తాడు. హుషారొస్తే తాగి చిందులేస్తాడు. రెండు సార్లు ఆఫీసర్ల మధ్య తాగి అల్లరల్లరి పాటలు పాడతాడు. ఇది కలెక్షన్లు రాబట్టాల్సిన సినిమా అని దర్శకురాలికి తెల్సు. నిజజీవితంలో ఒక ధ్యేయం కోసం పోరాడిన వ్యక్తుల్ని పాత్రలుగా చేసి సినిమాలు తీస్తే అవి  త్రెడ్ తెగకుండా పవర్ఫుల్ గా ధ్యేయం కోసం ముందుకు దూసుకెళ్తూ వుంటాయి. అదే ఇతర సినిమాల్లో హీరోగారి గోల్ ఏమవుతుందో ఏమో, పాసివ్ పరమానందయ్యలాగా మారిపోయి హీరోనే అన్పించుకోడు. 

          అక్షయ్ కుమార్ ప్రారంభంలో జర్మనీలో గోల్డ్ గెలిచి పొందిన పరాభవంతో, ఇక ఫ్రీ ఇండియాగా గోల్డ్ కొట్టాలన్న బలమైన గోల్ ఏర్పర్చుకుంది లగాయతూ అదే సంకల్ప బలంతో ఎడతెగని యాక్షన్ లో వుంటాడు. రెండు గంటల 50 నిమిషాల నిడివిగల సినిమాలో, చివరి అరగంట తప్ప, మిగతా స్క్రీన్ టైమంతా తన టీం ఏర్పాటు కోసం తన స్ట్రగుల్ గురించే నడిచే సుదీర్ఘ కథలో, ఎక్కడా బలహీనపడనీయకుండా భగభగ మండిస్తూంటాడు పాత్రని. చివరి అరగంటకి గానీ అసలు షో – లండన్ లో ఒలింపిక్ హోరాహోరీ ప్రారంభం కాదు. అప్పుడుండే నటన పరాకాష్ట. 

        ఇంటర్వెల్ కొచ్చేసరికి ఫస్టాఫ్ లో అప్పటివరకూ టీంని పోగేసి ట్రైనింగ్ కూడా ఇప్పించాక, దేశ విభజనతో ఆ చేసుకుంటూ వచ్చిన ఏర్పాట్లన్నీ వృధా అయిపోతాయి. అప్పుడు అక్షయ్ పరిస్థితి ఘోరంగా వుంటుంది. ఈ సీనుని కూడా అపూర్వంగా నిలబెట్టాడు.  తనకి రోమాంటిక్ యాంగిల్ లేకపోలేదు. అయినా ఇది పాత్ర మౌలిక ప్రయాణానికి అడ్డుపడదు. చిర్రుబుర్రులాడే బెంగాలీ భార్య మనోబినా (మౌనీరాయ్) తో చాలా తంటాలు పడుతూ కామెడీలు చేస్తాడు. పిడికిట్లో ఇమిడేంత సన్నగా వుండే హీరోయిన్ మౌనీరాయ్ ఎక్కడా నవ్వదు.

          హాకీ ప్లేయర్స్ ముఖ్య పాత్రల్లో సామ్రాట్ గా కునాల్ కపూర్, రఘువీర్ ప్రతాప్ సింగ్ గా అమిత్ సాద్, ఇంతియాజ్ అలీ షాగా వినీత్ కుమార్ సింగ్, హిమ్మత్ సింగ్ గా సన్నీ కుశాల్ కనిపిస్తారు. సీనియర్ నటుడు దలీప్ తహిల్ హాకీ ఫెడెరేషన్ బాస్ గా కనిపిస్తాడు. 

          ఈ పీరియడ్ మూవీకి ఆనాటి నేపధ్య వాతావరణ కల్పన, స్టేడియాలు సహా రకరకాల ఇతర కట్టడాలు వగైరాల్ని పకడ్బందీగా ఆ కాలాన్ని తలపించేట్టు పునఃసృష్టి చేశారు. లండన్ స్టేడియంలో హోరాహోరీ ఆట- మధ్యలో వర్షం మొదలై ఆ సస్పన్స్ డ్రామా – థ్రిల్లింగ్ గా చిత్రీకరించారు. టీంకి ‘తురప్ ఇక్కా’ (తురుపు ముక్క) అయిన హిమ్మత్ సింగ్ రెండో గోల్ కొట్టే షాట్స్ ని స్లోమోషన్ లో తీయడం డ్రామాని పతాక స్థాయికి చేర్చింది. 

     ‘దంగల్’ అయినా మరొకటైనా బాలీవుడ్ సీరియస్ సినిమాల్లో హాస్యం వొలికే డైలాగులు తప్పకుండా  వుండేట్టు చూసుకుంటున్నారు. పదేళ్ళ తర్వాత ఇప్పుడు డైలాగులు రాసిన జావేద్ అఖ్తర్, హాస్యంతో బాటు మిగతా భావోద్వేగాల డైలాగుల సంగతి చూసుకున్నారు (హమారా సర్ పర్ బ్రిటిష్ ఫ్లాగ్ ఫడ్ ఫడాకే హమ్ సబ్ కో మానో యహీ బోల్ రహా థా – యూ ఆర్ నాట్ ఫ్రీ!)

          క్రీడని, దేశభక్తిని దర్శకురాలి దృక్కోణంలో చూడ్డమే ఒక కొత్త అనుభవం – అందునా పీరియడ్ మూవీగా. ఇండియాని చూడాలంటే మల్టీ ప్లెక్సులకి వెళ్తే కాదు, హైదరాబాద్ అబిడ్స్ లో రామకృష్ణ సింగిల్ స్క్రీన్ థియేటర్లకి వెళ్ళాలి. అన్ని జాతులు ఇక్కడ చేరతాయి, బాల్కనీ నుంచీ బెంచి దాకా. అందరి ప్రతిస్పందనలు ఒకేసారి తెలుస్తాయి. క్రిక్కిరిసి కూర్చుని ఊపిరి బిగబట్టుకుని ఆటంతా చూశాక, ముగింపులో లేచి నిలబడి జై భారత్ నినాదాలు చేసి వెళ్లారు. ఇదీ నిజమైన ఇండియా అంటే!

సికిందర్