రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

12, డిసెంబర్ 2018, బుధవారం

712 : స్క్రీన్ ప్లే అంగతులు





          “Genres are different kinds of stories, like action, love or thriller… But, genre writing can kill you if you approach it as hack or commercial writing.”
John Truby
            మొన్న శుక్రవారం స్పై జానర్ కథ గురించి ఒక భేటీలో లవ్ ఇంట్రెస్ట్ ప్రస్తావన వచ్చింది. స్పై థ్రిల్లర్ జానర్ లో లవ్ ఇంటరెస్ట్, అంటే హీరోయిన్ పాత్ర,  రెగ్యులర్ యాక్షన్ కథల్లోని పాత్రలా వుండకూడదా? రెగ్యులర్ యాక్షన్ కథల్లో, మాఫియా కథల్లో, ఫ్యాక్షన్ కథల్లో, మూస టెంప్లెట్ కథల్లో, హీరోయిన్ పాత్ర ఏదైనా వుండొచ్చు - డాక్టర్, సాఫ్ట్ వేర్, సేల్స్ గర్ల్, స్టూడెంట్, ఆఖరికి పనిమనిషి  - ఎవరైనా వుండొచ్చు. ఇలాటి హీరోయిన్ పాత్రని స్పై కథల్లో  కల్పిస్తే అది స్పై సినిమాలా వుంటుందా? వుండదు. హాలీవుడ్ జేమ్స్ బాండ్ సినిమాల్లోనైనా, వీటికి అనుసరణగా కృష్ణ నటించిన నాటి తెలుగు జేమ్స్ బాండ్  సినిమాల్లోనైనా, హీరోయిన్ పాత్ర ఈ వర్గాలకి చెంది వుండదు. ఆ గూఢచార ప్రపంచంలోని ఇమిడిపోయే ‘జానర్ స్పెసిఫిక్’  పాత్రే అయివుంటుంది. అప్పుడే స్పై సినిమా చూస్తున్నట్టు వుంటుంది. అంటే హీరోతో పాటు అడ్వెంచర్ చేసే సహ గూఢచారిణియో, ఇంకేదో సంబంధిత శాఖ ఉద్యోగినియో, ఆఖరికి శత్రుదేశ స్పైనో అయివుంటుంది. ఒకవేళ డాక్టర్, సాఫ్ట్ వేర్, సేల్స్ గర్ల్, స్టూడెంట్, ఆఖరికి పనిమనిషి అయ్యుంటే,  అలా ఆ వేషంలో నటిస్తున్న గూఢచారిణియే అయ్యుంటుంది ఆ స్పై ప్రపంచంలో – దాని తాలూకు బిజినెస్ కి పాల్పడుతూ. స్పై సినిమాల్లో ఇతర కమర్షియల్ సినిమాల్లోలాగా, వూరికే అలా గ్లామర్ కోసం, రోమాన్స్ కోసం, పాటల కోసం వచ్చి పోతూ వుండే అనామక పాత్రయి కూడా వుండదు హీరోయిన్. హీరోయిన్ పాత్ర అనే  కాదు, మొత్తం స్పై సినిమాని రెగ్యులర్ యాక్షన్ మూస ఫార్ములా పాత్రలతో, దృశ్యాలతో నింపేస్తే కూడా బావుండదు. Conventions and codes of spy thrillers అనో, Spy film conventions అనో, హాలీవుడ్ సైతం ఎందుకు ప్రత్యేకించి జానర్ శుభ్రత కోసం రీసెర్చి చేస్తూ తలబద్దలు కొట్టుకోవాల్సి వస్తోందో ఒకసారాలోచించాల్సిన అవసరముంది.

         
లాగే ‘కవచం’ లో చూపించిన సస్పెన్స్  థ్రిల్లర్ జానర్ కథా కథనాల సంగతి. సమస్య ఎక్కడొచ్చిందంటే, కొత్త శతాబ్దానికి శ్రీకారం చుడుతూ దివ్యమైన 2000 ప్రారంభం కాగానే, దాన్ని ఆర్పేస్తూ తెలుగు సినిమాల స్క్రీన్ ప్లేలకి ఇక వదలని కొత్త జాడ్యాలు మొదలై పోయాయి. వాటిని దృష్టికి తెస్తూ అప్పట్నించీ పదేపదే వ్యాసాలు రాస్తూనే వున్నాం. పెన్నులతో మొదలెట్టి కీబోర్డు కొచ్చి రాస్తూనే వున్నాం. పెన్నులూ కీబోర్డులూ అరిగిపోయాయి. రేపు ఇంకేం అరిగిపోతాయో తెలీదు. అప్పట్లో పెన్నులతో రాసిరాసి పత్రికల పేజీలు, ఇప్పట్లో కీబోర్డు మీద కొట్టి కొట్టి ఈ బ్లాగూ నిండిపోయాయి. ఏం నిండినా, ఇంకేం ఎండినా పట్టించుకునే నాథుల్లేరు ఫ్లాపులు తీయడంలో బిజీ బిజీ అయిపోయి. మనకెందుకని వూరుకుందామంటే చేతులూరుకోవు. స్క్రీన్ ప్లే సబ్జెక్టే  అలాంటింది. రుచి మరిగామంటే జీవితాంతం వదలదు.ఇదొక వ్యసనం. మొన్న ఆదివారం అనుకోకుండా యూట్యూబ్ లో బాలీవుడ్ గీత రచయిత సమీర్ ఇంటర్వ్యూ చూస్తే, అందులో కొన్ని గొప్ప వాక్యాలు చెప్పాడు ఆయన తండ్రి, ప్రసిద్ధ గీత రచయిత అంజాన్ చెప్పినవి : ఈ ఇండస్ట్రీ ఏదైతే వుందో ఇదొక ప్రియురాలు వంటిది. ఇది కౌగిట చేర్చుకోనూ వచ్చు, వెన్నులో పొడవనూ వచ్చు. అయితే దీని ప్రేమలోపడ్డ వాడు నిజమైన ప్రేమికుడే అయితే - కౌగిట చేర్చుకున్నా, వెన్నులో పొడిచినా లెక్కచెయ్యడు – అని. కాబట్టి పనికొచ్చినా, రాకపోయినా లెక్కచేయకుండా ఇలా రాయడమే. 

       ఈ జాడ్యాల్లో బాగా రిపీటవుతున్నవి పాసివ్ హీరో పాత్రలు, మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లేలు, ఎండ్ సస్పెన్స్ కథనాలే. ఈ మూడిట్లో మొదటి రెండూ 2000 తో యూత్ సినిమాలంటూ ప్రారంభమైన కొత్త ట్రెండ్ లో, లైటర్ వీన్ రోమాంటిక్ కామెడీలుగా వచ్చిన చిల్లరమల్లర సినిమాల్లో తాండవమాడినవే. ఈ ట్రెండ్ లో ప్రసిద్ధ దర్శకుడు సింగీతం శ్రీనివాసరావు కూడా తానో చేయివేసి, 2003లో ‘విజయం’ అనే రోమాంటిక్ కామెడీ తీసి ఫ్లాపయ్యారు. ఇక ఇవి చూస్తూ పెరిగిన నయా మేకర్లు, ఇంకా ఇలాటి రోమాంటిక్ కామెడీలనే పాసివ్ పాత్రలతో, మిడిల్ మటాష్ కథనాలతో చేసేసే మోజులోనే వుంటున్నారు.        ఈ పసలేని రోమాంటిక్ కామెడీలతో పాటూ, మూస టెంప్లెట్ ఫార్ములా సినిమాలూ తప్ప, తెలుగులో ఇంకో జానర్ తో పరిచయమే లేకపోవడంతో - నవతరం  మేకర్లు - ఒకవేళ సస్పెన్స్ థ్రిల్లర్స్ తీయాల్సి వస్తే - వాటిని కూడా మూస టెంప్లెట్ లోనే బిగించి, పై మూడు జాడ్యాలూ జతచేసి సినిమాలు తీసేస్తున్నారు. అన్ని నదులూ వెళ్లి సముద్రంలో కలిసినట్టు, అన్ని జానర్లనీ తీసికెళ్ళి మూస టెంప్లెట్ లో ముంచేస్తున్నారు. ఏ కూరయినా సాంబార్ లో వేసేసి ఇది చిక్కుడుకాయ కూర, ఇది బెండకాయ వేపుడు, ఇది తోటకూర ఫ్రై అంటున్నారు. సాంబార్ అనే మూస టెంప్లెట్ ఒకటి పట్టుకున్నారు. దాంట్లోకి  ఏ కూర పడితే ఆ కూర పడేసి ఆ కూరల పేర్లతో సాంబార్ అమ్ముతున్నారు. ఇంతకన్నా లేబర్ భాషలో చెప్పడానికి ఉపమానం లేదు. చేస్తున్న పని ఇంత ఘోరంగా చేస్తున్నామా అని ఫీలయ్యే మాటే లేదు ఇప్పటికీ కూడా. రెండు ఫ్లాపులు ప్రసాదించిన ఒక నయా మేకర్ మళ్ళీ అదే వేడివేడి రెడీ మేడ్ సాంబార్ తో మూకుడు (టెంప్లెట్) పట్టుకొచ్చాడు. కుక్కపిల్ల అగ్గిపుల్ల శ్రీశ్రీ జాబితాలో మూకుడు లేదని, దాన్ని అతడికే అంకితమిచ్చి పంపించాం. 

          ఇంతేకాదు, ఐతే లైటర్ వీన్ రోమాంటిక్ కామెడీలు, కాకపోతే మూస టెంప్లెట్ ఫార్ములాలు తప్ప, ఇంకో తెలుగు సినిమా ప్రపంచం తెలియని నయా మేకర్లు కింది స్థాయిలో వున్న పాపులర్ హీరోలనీ, పై స్థాయిలో వున్న స్టార్లనీ కూడా దెబ్బ తీస్తున్నారు – ఇప్పుడిలా బెల్లంకొండ శ్రీనివాస్ వరకూ. ఈ సినిమాలు తీయాలంటే కూడా నమ్ముకుంటున్నది సీనియర్ స్టార్ల ఒకప్పటి సినిమాలనే.  ఇప్పటి యంగ్ స్టార్స్ కోసం వీటినే తిప్పి తిప్పి రీసైక్లింగ్ చేస్తున్నారు. యంగ్ స్టార్స్ సినిమాలు పూర్వం చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, రాజశేఖర్ మొదలైన సీనియర్ స్టార్లు నటించేసిన కమర్షియల్ సినిమాలకి నకళ్ళే. ఐతే ఈ నకళ్ళు తీయడంలో కూడా ఏం జరుగుతోందంటే, తమకి తెలిసిన – ఈ ఇరవై ఏళ్ళల్లో టీనేజీ వయసు నుంచీ తాము చూస్తూ పెరిగిన – తెలుగు లైటర్ వీన్ రోమాంటిక్ కామెడీల కథనాలే  చేసేస్తున్నారు. తెలుగు లైటర్ వీన్ రోమాంటిక్ కామెడీల్లో వుండేవి బలహీన గోల్స్, వాటితో పాసివ్ పాత్రలే. ఎక్కడో ఒకటీ అరా తప్ప, యంగ్ స్టార్స్ తో పాటు ఇతర పాపులర్ హీరోలూ నటిస్తున్న సినిమాలు అట్టర్ ఫ్లాప్స్ అవడానికి కారణమిదే.  
***
బయోడేటాలు – చిట్టాలు 

       దాసరి నారాయణరావు, కె. రాఘవేంద్రరావు, ఏ. కోదండ రామిరెడ్డి, కోడి రామకృష్ణ, బి. గోపాల్ మొదలైన సీనియర్ దర్శకులు, పరుచూరి బ్రదర్స్, సత్యానంద్, జంధ్యాల వంటి సీనియర్ రచయితలూ చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్, రాజశేఖర్ మొదలైన సీనియర్ స్టార్ల సినిమాలకి పనిచేసినప్పుడు, అవన్నీ పవర్ఫుల్ గోల్స్ తోనే, యాక్టివ్ పాత్ర చిత్రణలతోనే వుండేవి.


          2000 నుంచి తెలుగులో లైటర్ వీన్ రోమాంటిక్ కామెడీలు వెల్లువెత్తడంతో, ప్రేక్షకులుగా ఆ లోకంలోనే  విహరించడం నేర్చుకున్న నయా మేకర్లు -  తెలుగు సినిమాలకి కొత్తగా బలహీన గోల్స్ తో వుండే  పాసివ్ హీరో పాత్రల బెడద తెచ్చి పెట్టారు. రెండేళ్ళ క్రితం ఒక నయా మేకర్ అసలు స్టార్ కి గోల్ వుండద్దు అంటాడు, ఆ స్టార్ ఏమీ చేయకుండా అలా అలా ఎంటర్ టైన్ చేస్తూ సాగిపోవాలంటాడు. ఇలా కాదని  స్టార్ కి కథలోనే వున్న గోల్ నిచ్చి, యాక్టివ్ పాత్రగా చేస్తే – నచ్చక, తాను అనుకున్నట్టే  చేశాడు. పైగా ఇలాటి వాళ్ళని ఎంకరేజి చేయకూడదని ఈ వ్యాసకర్త నుద్దేశించి చెప్పుకున్నాడు. ఇతను ఎంకరేజి చేయడమేమిటి, ఎంకరేజి చేయడమే పనిగా ఈ వ్యాసకర్త పెట్టుకుంటే? అలా రాసుకున్న ఆ కథని ఒక పెద్ద కాంపౌండులో విన్పించడానికి పెద్ద రికమెండేషన్ తోనే వెళ్లి,  గోడకి కొట్టిన బంతిలా వెనక్కొచ్చాడు అక్షింతలేయించుకుని. మళ్ళీ అవకాశాలు రాలేదు. ఆ కాంపౌండు పెద్దలు అది కాకమ్మ కథ అని ఎలాగో గుర్తించి, అక్షింతలతో షాకిచ్చారు. చాలా చోట్ల ఇలాటి కథలకి ఫిదా అయిపోయే దృశ్యాలే వుంటాయి.  

          ఆ మధ్య ఇంకో పాపులర్ హీరోకి జీవితమంతా ధారబోసి ఓ కథ చేశాడు ఇంకో నయా  మేకర్. చూస్తే అదే పాసివ్ క్యారెక్టర్ తో అదే బలహీన కథ. ఏం చేయాలి? దీన్ని యాక్టివ్ పాత్రగా మారిస్తే కథ మారుతుంది. మార్చకుండా ఇలాగే  చెప్పేస్తే హీరోని మోసం చేసినట్టవుతుంది. హీరోని మోసం చేయలేక, కథని మార్చలేకా ఆగిపోయాడు. ఇది నయం. హీరోలు  కథలు వింటున్నప్పుడు యాక్టివ్ - పాసివ్ క్యారెక్టర్ తేడాలు తెలీక మోసపోతున్నారనేది పచ్చి వాస్తవం. మోసం చేస్తున్నామని నయా మేకర్లకీ తెలీదు. ఎందుకంటే, అది పాసివ్ క్యారెక్టర్ అని వాళ్ళకే తెలీనంతగా  ‘లైవీరోకా’ ల కాలం కాని కాలం జోష్ లో పెరిగారు. ఎన్ని ఫ్లాప్స్ తీస్తున్నా ఈ జోష్ వదలదు. 

          ఇదీ పరిస్థితి. ఎవరి చేతిలో చూసినా పాసివ్ క్యారెక్టర్లతో అవే బలహీన కథల బండిల్సు. ఏం చేస్తున్నావయ్యా అంటే, ‘రోమ్ కామ్’ (రోమాంటిక్ కామెడీకి స్టయిలిష్ నేమ్) అని తలెగరేసి చెప్పడం. రోమకామ పురాణాలతో కథా కాలక్షేపం. వాటిలో ఏమీ వుండదు. లైటర్ వీన్ రోమాంటిక్ కామెడీలనే వీణ సినిమాల ట్రెండ్ వల్ల చాలా సృజనాత్మక అలసత్వం వచ్చేసింది. సృజించే అవసరం లేకుండా చూస్తూ పెరిగిన రోమకామాలు స్పృశించడమే. వాటిలో కథా మకరందాన్ని గ్రోలడమే. పూర్వం అన్ని రకాల - అన్ని జానర్స్ తో - తెలుగు సినిమాలు చూస్తూ పెరిగిన బయోడేటా జేబు నిండా వుండేది. 2000 నుంచీ  ‘లైవీరోకా’ లూ, సీనియర్ స్టార్ల రీసైక్లింగ్ మూస టెంప్లెట్ నకళ్ళూ చూస్తూ పెరిగిన నకిలీ చిట్టా మాత్రమే మకిలి పట్టి వుంటోంది. దీంతో అసలీ సినిమా టికెట్లకి నకిలీ సినిమాలు తీసి చూపిస్తున్నారు. దీంతో యూత్ అంతా యూట్యూబ్ వైపు పరుగులు తీసి పాత సినిమాలు తెగ చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. లక్షలకి లక్షలు వ్యూవ్స్ ఇచ్చేస్తున్నారు. తెలుగు సినిమాలకి పైరసీ పెద్ద భూతంలా వుందని ఇంకా వాపోతూ వుండడం కాదు, యూట్యూబ్ లో యూత్ ని ఆకట్టుకుంటున్న పాత సినిమాలే వున్నాయని కళ్ళు తెరవక పోతే ఇంతే సంగతులు. డిజిటల్ ప్లాట్ ఫామ్స్ పెరుగుతున్న కొద్దీ తెలుగు సినిమాలకి కొత్త సవాళ్లు తప్పవు. ఈ సవాళ్ళని మరచి సినిమాలు తీస్తూపోతే ఎన్నటికీ అపజయాల శాతాన్ని90 నుంచి కిందికి లాక్కురాలేరు. ఇంత పనీ చేస్తున్నాడు ‘లైవీరోకా’ లకి పుట్టిన పాసివ్ క్యారెక్టర్ వీరుడు. కొత్తగా వచ్చే చిన్నా చితకా హీరోలనుంచీ మహేష్ బాబు దాకా కాటేస్తున్నాడు పాసివ్ క్యారెక్టరే! ‘లైవీరోకా’ లు ఒక క్యాన్సర్ లా  తెలుగు సినిమా ఈ మలి వ్యాపారయుగాన్ని పట్టి తినేస్తున్నాయి.
***
స్మాల్ స్కేల్ స్టార్లు         ‘కవచం’ ఇలాటి పాసివ్ క్యారెక్టర్ తో బాటు, మూస టెంప్లెట్ లో ఇరుక్కున్న   సస్పెన్స్ థ్రిల్లరే. ఇందులో పాసివ్ హీరో క్యారెక్టర్ ‘లైవీరోకా’ ల్లోంచి వస్తే, మూస టెంప్లెట్ కథనం సీనియర్ స్టార్ సినిమాల రీసైక్లింగ్ లోంచి పుట్టింది. తెలిసిన విద్య ఈ రెండే కాబట్టి – ఈ రెండూ కలిపి ఈ సస్పెన్స్ థ్రిల్లర్ తీసేయడం. టెంప్లెట్ స్కూలు వదిలి స్ట్రక్చర్ స్కూల్లోకి మేకర్లు రానంత వరకూ ఇంతే. అయితే స్ట్రక్చర్ స్కూల్లోకి రావాలంటే హలీవుడ్డంత కష్టపడాలి. అంత కష్టం ఎందుకు పడాలి, హాయిగా కడుపులో చల్ల కదలకుండా టెంప్లెట్ తో పనై పోతూంటే? అవే పాత్రలు, అవే సీన్లు, అవే ప్రేమలు, అవే కామెడీలు, అవే డైలాగులు, అవే నటనలు, అవే పాటలు, అవే ఫైట్లు, అవే షాట్లు, అదే మేకింగ్ అనుకుని – టెంప్లెట్ లో వుండే ఆయా అరల్లో ఒకటొకటిగా వాటిని పడేసుకుంటూ పోతే తెలుగు సినిమా తయార్ కదా! 30 కోట్ల సినిమాకైనా ఇంత సులువైన పనే కదా? 

          కానీ వస్తున్న ఎంత టెంప్లెట్ మాస్ యాక్షన్ సినిమాలకైనా ప్లాట్ పాయింట్ అనేది ఎక్కడో ఇంటర్వెల్లో పడ్డా దానికో  అర్ధంపర్ధం వుంటోంది. ఈసారి ప్లాట్ పాయింట్ ని కూడా ఉత్తిదే అని చెప్పే అమాయకత్వమో, అతి తెలివో ‘కవచం’ లో బయటపడి బుర్ర తిరిగినంత పనైంది. బహుశా ప్రపంచంలోనే ఇది మొదటిది - ఇలా ఫేక్ విలన్ తో, ఫేక్ ప్లాట్ పాయింట్ పెట్టి  సినిమా తీసేయడం!

          అసలు విషయమేమిటంటే, ఓ సినిమా తీయడానికి ప్రాధాన్యాల్లో మొట్ట మొదటి స్థానంలో వుండేది మార్కెట్ యాస్పెక్ట్. ఓ హీరోతో ఓ కథ అనుకుంటే, మొట్ట మొదట చూడాల్సింది ఆ కథ మార్కెట్ యాస్పెక్ట్ నే, ఆ తర్వాతే మిగతా క్రియేటివ్ యాస్పెక్ట్ సంగతి. ఇది తెలుసుకోవడం లేదు. స్ట్రక్చర్ స్కూల్లోకి వస్తేనే తెలిసేది. టెంప్లెట్ స్కూల్లో పగటికలల రాతలే, తీతలే వుంటాయి- వాస్తవాలతో పనుండదు. ఇక్కడ మొదటి సినిమా నుంచీ తనని ఒక స్టార్ గానే ప్రమోట్ చేసుకుంటూ బిగ్ బడ్జెట్ సినిమాలతో మాత్రమే వస్తున్న బెల్లంకొండ శ్రీనివాస్, అలాటి స్వయం ప్రకటిత స్టార్ గా మాస్ యాక్షన్ సినిమాలే చేయవచ్చు. కానీ ఇలా సస్పెన్స్ థ్రిల్లర్ చేయడానికి  – ఇది తెలుగులో 30 కోట్ల బిగ్ బడ్జెట్ తో తీయదగ్గ స్టార్ రేంజి కథ కాదు. మార్కెట్ యాస్పెక్ట్ ఇక్కడే అడ్డు పడుతుంది. ఇలా సైకో థ్రిల్లర్, రోమాంటిక్ థ్రిల్లర్, హార్రర్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ వంటివి కూడా తెలుగులో స్టార్ రేంజికి, ఇమేజికీ సరిపడే బిగ్ బడ్జెట్ స్కేలు గల కథలు కావు, స్మాల్ స్కేలు కథలు. మహేష్ బాబుతో సైకో థ్రిల్లర్ ‘స్పైడర్’  తీస్తే కూడా ఏమయిందో తెలిసిందే. 

          విజయ్ దేవరకొండ తననో స్టార్ గా ప్రమోట్ చేసుకోకుండా, చిన్న బడ్జెట్స్ తోనే విభిన్న కథలతో ఒక్కో మెట్టూ ఎక్కుతూ వచ్చాడు. ఇప్పుడతను స్టార్ అయ్యాడంటే వెరైటీ కథలతోనే తప్ప మూస టెంప్లెట్ కథలు చేసి కాదు. అందుకని  ‘టాక్సీవాలా’ లో హార్రర్ థ్రిల్లర్ అనే స్మాల్ స్కేల్ కథలో నటించినా ఇమేజికి అడ్డురాలేదు. ఇది టెంప్లెట్ కాకపోయినా, ఏ రెగ్యులర్ మూస మసాలాలూ లేకపోయినా, మాస్ కూడా చూసి హిట్ చేశారు. మాస్ ప్రేక్షకుల్లో వచ్చిన మార్పుని ఇది తేటతెల్లం చేసింది.
***
కోయిల తల కాకి

         కాబట్టే  ‘కవచం’ ని అంత మూస మసాలా టెంప్లెట్ యాక్షన్ గా తీసినా, మాస్ ప్రేక్షకులు కూడా చూడడం లేదని ఆంధ్రా ఏరియా నుంచి కూడా రిపోర్ట్స్ వస్తున్నాయి.  ఇదేదో హఠాత్పరిణామం కాదు. ఒకటొకటే చాలా మూస మాస్ టెంప్లెట్ సినిమాల్ని మాస్ ప్రేక్షకులే కొంత కాలంగా చూడ్డం మానేస్తూ వచ్చారు. ఈ తిరస్కారాన్నే ‘కవచం’ విషయం లోనూ చూపెట్టారు. కాబట్టి బెల్లంకొండకి ఇక ఇలాటి పాత మూస రీసైక్లింగ్ కథలు కూడా ప్రమాదమే. ఈ ప్రమాదమే వుండగా, ఇంకా పెనం మీంచి పొయ్యిలో పడ్డట్టు - తన ‘స్టార్ రేంజి’  కాని సస్పెన్స్ థ్రిల్లర్ స్మాల్ స్కేల్ కథని, దీనికి అతికించు కోవడం!  

          మూస టెంప్లెట్ కథనానికి కి సస్పెన్స్ థ్రిల్లర్ కథని అతికించడం! కోయిల తల తెచ్చి కాకికి తగిలించినట్టు. జానర్ మర్యాద లేకుండా జానర్ జంప్. సస్పెన్స్ థ్రిల్లర్ కి సీన్- టు- సీన్ సస్పెన్స్ కథనం చేయక ఎండ్ సస్పెన్స్ కథనం చేయడం. ప్రతీనెలా కనీసం ఒక ఎండ్ సస్పెన్స్ తో కూడిన సినిమా వచ్చి ఫ్లాపవుతోంది. ఎండ్ సస్పెన్స్ కథనమంటే ఏమిటో, అది కమర్షియల్ సినిమాలకి ఎందుకు పనికిరాదో తెలియాలంటే స్ట్రక్చర్ స్కూలు తెలియాలి. ‘కవచం’ దేనికి కవచమైందో గానీ, ఈ రక్షక కవచంలోకి  జానర్ జంప్, ఫేక్ విలన్ తో ఫేక్ ప్లాట్ పాయింట్, పాసివ్ హీరో, ఎండ్ సస్పెన్స్ తో బాటు మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే కూడా దూరిపోయి క్రియేటివ్ యాస్పెక్ట్ కి గండి కొట్టాయి. మార్కెట్ యాస్పెక్ట్ లేక, క్రియేటివ్ యాస్పెక్ట్ లేకా ఇంకేం సినిమా వుంటుంది. టెంప్లెట్ తో స్క్రీన్ ప్లే వస్తుందా, లేక స్ట్రక్చర్ తో స్క్రీన్ ప్లే వస్తుందా? స్క్రీన్ మీద ఎలా పడితే అలా ప్లే చేస్తే స్క్రీన్ ప్లే అయిపోతుందా??
***
జానర్ జంప్ కథ        ప్రారంభమే ఒకమ్మాయితో యాక్షన్ సీను. ఆమె తొడుక్కున్నవి రబ్బర్ సోల్ షూస్ అయితే, లెదర్ సోల్ షూస్ అడుగుల చప్పుడు ఎడాపెడా డిటిఎస్ లో మార్మోగుతుంది!  ఈమెతో యాక్షన్ సీన్ తర్వాత ఎస్సై విజయ్ గా బెల్లంకొండ ఎంట్రీ. ఒక యాక్షన్ సీను, తర్వాత గ్రూప్ సాంగూ వచ్చేసి టెంప్లెట్ కథనం మొదలయినట్టు గంట మోగుతుంది. తర్వాత ఎంత సిన్సియర్ పోలీసాఫీసరో చూపించి, ఇంట్లో మదర్ సెంటిమెంటు పూర్తి చేస్తారు. హీరోయిన్ మెహ్రీన్ ని దుండగుల బారినుంచి కాపాడతాడు. ఆమెకి తన ప్రేమ కథ ఫ్లాష్ బ్యాక్ చెప్తాడు. ఆ ఫ్లాష్ బ్యాక్ లో కాజల్ తో లవ్ ట్రాక్, ఒక లవ్  సాంగ్. ఇది పూర్తయ్యాక, ఉన్నట్టుండి మదర్ కి యాక్సిడెంట్. వైద్యానికి 50 లక్షలు కావాలి. మెహ్రీన్ తనని కిడ్నాప్ చేసినట్టు నాటకమాడి మేనమామ నుంచి డబ్బు లాగమంటుంది. అలాగే చేసి తల్లిని బతికించుకుంటాడు. మెహ్రీన్ ని ఒకచోట డ్రాప్ చేసి బై చెప్తాడు. కిడ్నాపర్ డబ్బు తీసుకుని తన మేనకోడల్ని వదల్లేదని మేనమామ అనడంతో బెల్లంకొండ ప్రమాదంలో పడతాడు. ఆ మేనకోడలు మెహ్రీన్ కాదనీ, కాజల్ అనీ కూడా తెలుసుకుని షాక్ తింటాడు. మెహ్రీన్ ఎందుకిలా చేసింది?  కాజల్ ఏమైంది? ఇంతలో విలన్ గా అజయ్ ఫోన్ చేసి బెల్లంకొండని బెదిరిస్తాడు. కిడ్నాప్ కేసులో ఇరుక్కున్నావని చెప్తాడు. విజయ్ కన్ఫ్యూజై పోతాడు. కాజల్ ని వదలమని వార్నింగ్ ఇస్తాడు...మెహ్రీన్, కాజల్, విజయ్, అజయ్, కాజల్  బావ నీల్ నితిన్ ముఖేష్ ల ఫోటోలు వరసగా తెర మీద పడతాయి- హఠాత్తుగా ప్లేటు ఫిరాయించి, ఒక సస్పెన్స్ థ్రిల్లర్ భావాన్ని – జానర్ ని ప్రకటిస్తూ ఇంటర్వెల్.
***
మిడిల్ ని మింగేసి మటాష్ 
       ఈ ఫస్టాఫ్ లో చెప్పుకుంటూ వచ్చిన రొటీన్ టెంప్లెట్ కథనానికీ ఇంటర్వెల్లో సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ మలుపు. మూస ఫార్ములా కథగా సాగుతున్నది కాస్తా సడెన్ గా సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ వేషం తొడుగుతుంది. పైన చెప్పుకున్నట్టు, ఇంటర్వెల్ సీను చూస్తూంటే కాకికి కోయిల తల తగిలించినట్టు ఎబ్బెట్టుగా అన్పిస్తుంది. ఫస్టాఫ్ ని కూడా సస్పన్స్ థ్రిల్లర్ జానర్ లక్షణాలతో నడిపితే  ఈ వికృతి వుండేది కాదు. 

          ఫస్టాఫ్ టెంప్లెట్ లో దేనికీ లాజిక్ వుండదు. హీరో ప్రాబ్లంలో పడాలి కాబట్టి కావాలని మదర్ యాక్సిడెంట్ సీను వస్తుంది. ఎస్సై మదర్ కి యాక్సిడెంట్ అయితే ప్రభుత్వం చూసుకోనట్టు, ఆ డబ్బుకోసం కిడ్నాప్ కి పాల్పడి ఇరుక్కోవడమంతా ఎస్సై గా చేస్తున్నట్టు వుండదు- నిరుద్యోగి పాట్లుగా వుంటుంది. టెంప్లెట్ కథల్లో ఇష్టానుసారం ఈ లొసుగులన్నీ మామూలే. ఇది కాదు ఈ సినిమాతో వచ్చిన సమస్య- కథని మలుపుతిప్పే ప్లాట్ పాయింటుగా పెట్టుకున్న ఇంటర్వెల్ సీను తోపాటు, అక్కడ చూపించిన ప్రత్యర్ధి పాత్రే సమస్య! 

          సెకండాఫ్ లో వెంటనే ఈ రెండూ బోగస్ అని తేలిపోతుంది. ఇంటర్వెల్లో విలన్ గా  చూపించిన అజయ్ ని హీరో పట్టుకుంటే, అతను పాత కోపంతో ఉత్తినే అలా బెదిరించాననేస్తాడు  అంటే విలన్ ఇతను కాదన్న మాట. కనుక చూపించిన ఇంటర్వెల్ మలుపు, అంటే ప్లాట్ పాయింట్ కూడా ఉత్తదేనన్న మాట. ఇలాటి ఇంటర్వెల్ తో ప్రేక్షకుల్ని  ఫూల్స్ చేయడమన్న మాట. 

          అంటే ఇంటర్వెల్లో కూడా కథ ప్రారంభం కాలేదన్నమాట. అంటే కథనంలో బిగినింగ్ విభాగం ఇంకా ముగియలేదన్న మాట. అంటే బిగినింగ్ విభాగం ఇంటర్వెల్ మీదుగా కూడా అక్రమంగా సాగి, సెకండాఫ్ ని దురాక్రమిస్తూ ఎక్కడో ఎప్పుడో ముగుస్తుందన్న మాట. అంటే అప్పుడు అక్కడ మిడిల్ విభాగం ప్రారంభమవుతుందన్న మాట. అంటే అప్పుడు ప్లాట్ పాయింట్ ఏర్పడి, అక్కడ కథ ప్రారంభమవుతుందన్న మాట. అంటే  హీరోకి అప్పుడు సమస్య తెలిసి, అప్పుడు గోల్ ఏర్పడుతుందన్న మాట. అంటే ఫస్టాఫ్ బిగినింగ్ బిజినెస్ అంతా సెకండాఫ్ లో కూడా సాగుతోందన్న మాట. అంటే మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అయిపోయిందన్న మాట!
***
పాసివ్ పురాణం        సెకండాఫ్ లో ప్రారంభమయ్యే సస్పెన్స్ థ్రిల్లర్ కథనం విశ్లేషించలేనంత గజిబిజిగా వుంది. దీని జోలికి పోకుండా ఈ కథనంలో ప్లే అయిన  స్క్రిప్టింగ్ టూల్స్  గురించి చెప్పుకుంటే, అజయ్ విలన్ కాదని వెంటనే తేలిపోతుంది. ఇంటర్వెల్లో ఇతనే విలన్ అని చూపించి ప్రేక్షకుల్ని ఫూల్స్ చేశాడన్న మాట కథకుడు. చాలా వేళాకోళం కథ. విలన్ కాజల్ బావ నీల్ నితిన్ ముఖేష్ అని ఫస్టాఫ్ లో అతను కన్పించగానే తెలిసిపోతూనే వుంటే,  సస్పెన్స్ కోసం దాచి పెడుతున్నట్టు, వేరే అజయ్ ని బూచిగా చూపించి సెకండాఫ్ సస్పెన్స్ థ్రిల్లర్ కథనానికి తీవ్ర హాని చేశాడు. 

          విలన్ నీల్ నితిన్ ముఖేష్ అని హీరోకి తెలియనవసరం లేదు, ప్రేక్షకులకి చూపించెయ్యవచ్చు ఈ కథనంలో. అప్పుడదొక సస్పెన్స్ ఏర్పడుతుంది. అయితే ఇలా సెకండాఫ్ లో చేశారు. విలన్ అజయ్ కాదని వేళాకోళమాడేక, ఇక నితినే అని ప్రేక్షకులకి తెలిసిపోయింది, హీరోకే  తెలీదు. మంచిదే. అయితే ఈ ప్లే సెకండాఫ్ లో మొదలెట్టారు. దీంతో ఏమైందంటే, విలన్ ఎవరో హీరోకి చివరిదాకా తెలియకపోవడం ఎండ్ సస్పెన్స్ కథనానికి దారి తీసింది. ఎండ్ సస్పెన్స్ కథనాలు రెండు రకాలుగా వుంటాయి – చివరిదాకా  హీరోతో బాటు ప్రేక్షకులకీ తెలియకపోవడం, చివరిదాకా హీరోకి మాత్రమే తెలియక ప్రేక్షకులకి ముందే తెలియడం. ఇక్కడ బెల్లంకొండతో మొదటిదే  అమలైంది. విలనెవరో ప్రేక్షకులకి తెలిసిపోయి  బెల్లంకొండకి తెలియకపోవడం. ఇప్పుడేమవుతోందంటే, తనతో జరుగుతున్న తతంగం దేనికి ఎవరు జరిపిస్తున్నారో తెలీక బెల్లంకొండ పాసివ్ గా తిరుగాడడం. ఫస్టాఫ్ లో యాక్టివ్ పాత్రగా వున్న తను,  సెకండాఫ్ లో కొచ్చేసరికి అయోమయపు పాసివ్ పాత్ర ఐపోవడం. ఇలా వెళ్లివెళ్లి విలన్ నితిన్ అని తెలుసుకునేప్పటికి అప్పుడతను ఏం కుట్ర చేశాడో తెలిసి - అప్పుడు తనకి కథ అర్ధమవడం! అంటే ఇక్కడ ప్లాట్ పాయింట్ వన్ రావడం! ఎక్కడో ఫస్టాఫ్ లో ప్లాట్ పాయింట్ వన్ వచ్చి హీరోకి అర్ధమవాల్సిన కథ, లేదా విషయం – దీంతో మొదలవాల్సిన సంఘర్షణ- ఇప్పుడు ఇక్కడ క్లయిమాక్స్ ప్రారంభమయ్యే చోట క్లయిమాక్స్ లో కలిసిపోయి- మిడిల్నే మింగేసింది! ఈ  మిడిల్ లేని స్క్రీన్ ప్లే(?) మిడిల్  మటాష్ స్క్రీన్ ప్లే అయిపోయింది!
***
ఇరువైపులా మరణమృదంగం 

        ఎలా జరిగిందీ అనర్ధం? కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్ అనుకోవడం వల్ల జరిగింది. ఫస్టాఫ్ లో వుండాల్సిన ఈ కథనం సెకండాఫ్ లో పెట్టేయడం వల్ల జరిగింది. టెంప్లెట్ కి కుడి ఎడమ లేముంటాయి. ఇరువైపులా మరణమృదంగం వాయించడమే బాక్సాఫీసుకి వినిపించేలా. కథ డిమాండ్ చేస్తే హీరో పాసివ్ గా వుండొచ్చు. ఎక్కడ ఎంతవరకూ వుండొచ్చు? ఫస్టాఫ్ లో ఇంటర్వెల్ వరకూ వుండొచ్చు. సెకండాఫ్ లో పాసివ్ గా వుండే అనుమతి లేదు. సెకండాఫ్ అనేది సమస్యతో ముఖాముఖీ సంఘర్షణా ప్రాంగణం. ఈ ప్రాంగణంలో ఇంకా కథ, దాని పాత్రా వామప్ (warm – up)  చేసుకుంటూ కూర్చుంటామంటే కుదరదు. బరిలో బాహాబాహాకి దిగిపోవడమే. సెకండాఫ్ లో ఇంకా ఫస్టాఫ్ బిగినింగ్ బిజినెస్ వుండదు. వామప్ ప్రక్రియ ఫస్టాఫ్ లోనే జరిగిపోవాలి. హీరోకి జరుగుతున్న దేమిటో తెలీక, ఆ తెలుసుకునే ప్రయత్నంలో ఢక్కా మొక్కీలు తింటూ బేలగా, పాసివ్ గా ఇంటర్వెల్ వరకూ వుండొచ్చు. ఇంటర్వెల్లో విషయం తెలిసిపోయిందంటే ఇక దాంతో యాక్టివ్ పాత్రగా ఐపోవాల్సిందే. ఈ డైనమిక్స్ పాత్రకి ఎంతో అవసరమైన క్యారెక్టర్ ఆర్క్ ని సృష్టిస్తాయి. ఇక సెకండాఫ్ లో ముఖాముఖీ సంఘర్షణ జరపాల్సిందే. ప్రేక్షకులకి తెలిసి, హీరోకి తెలియని సస్పెన్స్ కథనమైనా ఇంతే. 

          ఫస్టాఫ్ లో విలన్ ఎవరో ప్రేక్షకులకి చూపించేసి, హీరోకి చూపించకుండా అతను తెలుసుకునే ప్రయత్నంలో – ఎలా తెలుసుకుంటాడా అని సీను తర్వాత సీను ప్రేక్షకులకి సస్పెన్స్ సృష్టిస్తూ – సీన్ టు సీన్ సస్పెన్స్ కథనం చేసినప్పుడు - ఈ కథనానికి ఇంటర్వెల్ వరకే అనుమతి వుంటుంది. ఆ తర్వాత ప్రేక్షకులు భరించలేరు. ఇంటర్వెల్లో హీరోకి ఓపెన్ చేసి ముఖాముఖీ యాక్షన్ మొదలెట్టాల్సిందే. 

          దీన్ని బెల్లంకొండతో సెకండాఫ్ లో ప్లే చేయడంతో  అది ఎండ్ సస్పెన్స్ కి దారి తీసి బోరు కొట్టింది. చివరిదాకా విలన్ ఎవరో కనుక్కునే పనిమీదే హీరో వుంటే అది ఎండ్ సస్పెన్స్ కథనం బారిన పడుతుంది. ఎండ్ సస్పెన్స్ దృశ్యమాధ్యమమైన వెండి తెర మీద చూడ్డానికి పనికి రాదు, థ్రిల్ చేయదు. అచ్చులో కథగా, నవలగా చదువుకోవడానికి థ్రిల్లింగా వుంటుంది. ఎండ్ సస్పెన్స్ అంటే రహస్యం ఎక్కడా ఓపెన్ చేయకుండా చిట్ట చివర్లో ఓపెన్ చేయడం. ఒక హత్యో ఇంకేదో నేరమో జరిగితే ఆ హంతకుడో నేరస్థుడో ఎవరనేది సస్పెన్స్ లో పెట్టి – నల్గురైదుగురు అనుమానితుల్ని చూపిస్తూ, చివర్లో త్రాష్టుడెవడో రివీల్ చేయడం. ఇలాటి సినిమాలు పాత రోజుల్లో వచ్చేవి. దీంట్లో మజా లేదని ప్రేక్షకులకీ, హాలీవుడ్ కీ తెలిసిపోయి మానేశారు. ఈ ఎండ్ సస్పెన్స్ సినిమాల్లో సస్పెన్స్ వుండేది మొదటి షో ప్రేక్షకుల వరకే. వాళ్ళు సినిమా చూసొచ్చి – ఓరే,  ఆ మల్లిగాడు లేడూ, ఆడేరా విలన్!– అని బయట కూశారంటే అయిపోతుంది సస్పెన్స్ పని, సినిమా పనీ. తర్వాతి ఆటనుంచి త్రాష్టుడు మల్లిగాడని తెలిసిపోయిన ప్రేక్షకులు అనుభవించే సస్పెన్స్ ఏమీ వుండదు. బాక్సాఫీలో రూపాయలు కనపడవు, గుక్కపట్టి ఏడుస్తున్న ఫ్లాప్ కి పుట్టిన పాపాయిలే  కన్పిస్తూంటాయి. 

          సస్పెన్స్ అనే నాణేనికి రెండు ముఖాలుంటే, ఒక ముఖం ఎవరు? అని వుంటే, రెండో ముఖం ఎందుకు? అని వుంటుంది. ఈ రెండు ముఖాలూ మూసి నడిపిస్తే అది సస్పెన్స్ సినిమా కథ అవదు, సహన పరీక్ష అవుతుంది. తెలుసుకోవడానికి హీరోతో బాటు ప్రేక్షకులూ చివరి వరకూ సస్పెన్స్ తో వుండాల్సిందే. ఆ సస్పెన్స్ తెలిశాక మలి ఆటకి సస్పెన్స్ వుండదు. బుకింగ్ క్లర్క్  సస్పెన్స్ తో వుంటాడు బాక్సాఫీసులో కూర్చుని. 

          అందుకని సీన్ టు సీన్ సస్పెన్స్ కథనాలు చేయడం మొదలెట్టారు హాలీవుడ్ లో. మనమింకా ఎక్కడో వుండి పనికిరాని ఎండ్ సస్పెన్స్ కథనాలు చేసుకుంటున్నాం. సీన్ టు సీన్ సస్పెన్స్ కథనంలో నాణేనికి ఒక ముఖాన్ని చూపించేస్తారు. అంటే ఎవరు? అనే పాయింట్ ఓపెనై పోతుంది హీరోకీ, ప్రేక్షకులకీ. ఇక ఎందుకు? అనే పాయింట్ చివరి వరకూ బ్యాలెన్స్ పెడతారు. ఆ ఎవరు? అనే వాడు దొరికితే, ఎందుకు చేశాడో తెలుస్తుంది. ఎందుకు చేశాడో తెలుసుకోవడం ప్రేక్షకులకి అత్యవసరం కాదు. హీరో వాణ్ణి ఎలా పట్టుకుంటాడన్నదే ప్రధానం. ఆ పట్టుకునే ప్రయత్నంలో పుట్టేదే వాడితో ఎత్తుకు పైఎత్తుల సీన్ టు సీన్ సస్పెన్స్ తో కూడిన ఓపెన్ గేమ్. దీంతో హీరో యాక్టివ్ గా వుంటాడు. కథనమూ లైవ్ గా ఉజ్వలంగా వుంటుంది. ప్రేక్షకులూ థ్రిల్ తట్టుకోలేక బుట్టల మీద బుట్టలు పాప్ కార్న్ లేపేస్తూంటారు. క్యాంటీన్ వాడికి ఆదాయం.
***
ఇదిగో  ఎగ్జాంపుల్ 
        బెల్లంకొండ తను ఇందులో పోలీసు పాత్ర పోషించడానికి,  అమితాబ్ బచ్చన్ పోలీసు పాత్రలు నటించిన సినిమాలు పరిశీలించినట్టు చెప్పాడు. ఆ నటనల్లో ఏం తెలుసుకుని నటించాడో గానీ, తల్లిపాత్రకి యాక్సిడెంట్ అయి 50 లక్షలు కావాల్సి వచ్చిన పేలవమైన సీన్లు చూస్తున్నప్పుడు – అమితాబ్ బచ్చన్ నటించిన ‘మజ్బూర్’ గుర్తుకు వచ్చింది. హీరోని ఒక తెగింపుకి పురిగోల్పే మలుపు ‘మజ్బూర్’ లోలాగా బాధాకరంగా, భావోద్వేగాలతో, హీరోని పాతాళంలోకి నెట్టేసేలా వుండాలికదా అన్పించింది. అమితాబ్ ఇంకా స్టార్ కాకముందు, రవీ టాండన్ దర్శకత్వంలో 1974 లో ‘మజ్బూర్’ అనే సస్పెన్స్ థ్రిల్లర్ హిట్ విడుదలైంది. సలీం – జావేద్ లు రచయితలు. 1976 లో దీన్ని శోభన్ బాబుతో రాఘవేంద్ర రావు దర్శకత్వంలో తెలుగులో ‘రాజా’ గా రీమేక్ చేశారు. 

          ఆమితాబ్ ఏర్ వేస్ లో ట్రావెల్ ఏజెంట్. తల్లీ చెల్లీ వుంటారు. ఒకనాడు తనకి బ్రెయిన్ ట్యూమర్ వుందని తెలుస్తుంది. ఆరునెలలే బతుకుతాడు. తల్లీచెల్లీ ఏమైపోతారని ఆందోళన పడతాడు. ఒకడు ఒక ఆఫరిస్తాడు. అమితాబ్ గనుక ఒక హత్య మీదేసుకుని జైలుకిపోతే ఐదు లక్షలిస్తానని. ఇదేదో బావుందన్పిస్తుంది. ఎలాగూ ఆర్నెలల్లో చనిపోయే వాడు  జైలుకిపోతేమిటి, ఎక్కడికిపోతే ఏమిటి- ఈ డబ్బుతో తల్లికీ చెల్లికీ ఆర్ధిక భద్రత వుంటుందనుకుని ఒప్పుకుంటాడు. శిక్షపడి జైలుకెళ్ళి పోతాడు. జైలు అధికారులు బ్రెయిన్ ట్యూమర్ కి ఆపరేషన్ చేయించి పారేస్తారు. ఆరోగ్యం బాగుపడ్డాక ఉరికంబం ఎక్కడంలో అర్ధం లేదని పారిపోతాడు. హత్య కేసులోంచి ఎలాగైనా బయట పడాలని, తనకి ఆఫర్ ఇచ్చిన వాణ్ణి పట్టుకునే వేట మొదలెడతాడు... సీన్ టు సీన్ సస్పెన్స్ కథనానికి ఇంతకంటే తార్కాణం ఏం కావాలి. 

          సస్పెన్స్ థ్రిల్లర్ జానర్ ని టెంప్లెట్ లో వేసి తమాషా చేయడానికి వుండదు. దీని జానర్ మర్యాదలు వేరే వుంటాయి. అయినా రోమాంటిక్ కామెడీల బాధిత జనరేషన్ మేకర్లు, ఇతర జానర్లతో మూస టెంప్లెట్ చేయడమే తెలిసినప్పుడు, మరిన్ని కవచాలు తీసుకుంటూ పోవచ్చు, ఎవరికీ అభ్యంతరం లేదు. టెంప్లెట్ లోంచీ, రోమాంటిక్ కామెడీల కథనాల్లోంచీ బయటికి రావడం కష్టం. మనసొప్పదు కూడా.  

సికిందర్



3, డిసెంబర్ 2018, సోమవారం

711 : పాలపిట్ట ఆర్టికల్, విస్మృత సినిమాలు -2

       

    అభినయంతో ఆమె కవిరాసిన పాత్రని ఇట్టే కవిత్వం చేసి పెట్టేయగలదు మరి ఆమె అభినయ కళావిరుపుల మెరుపుల్ని అక్షరాల్లో పట్టగల కవి కుమారుడెవడు కలాలు మొరాయించాల్సిందేగా! కలాల్నే ఓడించే కళా స్వామ్యమామెది! శ్రమలేని జీవితం నేరమైనట్టే, కళ లేని శ్రమా ఘోరమే. జీవితంలో కళనంతా కోల్పోయి, శ్రమలోనే కళని రెండు కళ్ళుగా చేసుకుందామె. తుది యంటూ లేని సుషుప్తావస్థలో తనుంటే, పైలోకాల్లో దేవతలకి స్వాగత సన్నాహాలు పూర్తి చేయడానికి నెలలకి నెలలూ పట్టేసిందని స్వయంగా ఆత్రేయ రాసేశాక, మానవ మాత్రులకి ఎన్నెన్ని జన్మలు కావాలి ఆమెకి సరితూగే నాల్గక్షరాలు ఏర్చి కూర్చడానికి...ఏవో తోచిన నాల్గు విశేషణాలు జోడించుకుని ఆనందించడం మినహా!
             సావిత్రియే ఒక విశేషణం, పర్యాయపదం. ఈమాట ఎవరు చెప్పారు? సాక్షాత్తూ వైజయంతీ మాలే చెప్పింది. అలా  నటనలో అత్యున్నత శిఖరాల అధిరోహణకి ఒక్క ముక్కలో సావిత్రీ అని అభివర్ణిం చెయ్యొచ్చు. గమనిస్తే - ఇంత  సులువు చేసి పోయింది సావిత్రి పెన్ మాస్టర్లకి!

          సినిమా అంటే జీవితమే అని ఆమె నిర్వచనమాయ్యాక, రౌద్ర రసంలో గాజులు పగిలి రక్తం చిందేంత, శోక రసంలో శోష వచ్చి పడిపోయేంత నటనా పటిమే ఆమె జీవితం నిండా చదివించే  పేజీలైపోయాయి. పేజీల్ని ఆబగా తిప్పేస్తూంటే, మూడు చోట్ల చెవులు పట్టి ఆపి చాచి కొడుతుందామె!ముందు మిస్సమ్మచదువుకోవోయ్, తర్వాత మాయాబజార్చూసుకో, ఇంకా తర్వాత చివరకుమిగిలేదితెలుసుకుని ముందుకుపో! ఫో!! అనేసి. 

        మొదటి రెండూ తను అజరామరం చేసిన అమోఘ పాత్రలే. చివరిదే జాతీయంగా గెలిచిన గర్వించే పాత్ర. దేవదాసుగా అక్కినేని ఎక్కడెక్కడి వెండి తెర దేవదాసులందర్నీటోకున జయించేసినట్టే, ‘చివరకు మిగిలేదితో సావిత్రి ఇటు బెంగాలూ అటు బాంబే అభినేత్రులందర్నీ ఓడించి పారేసి, వచ్చి అక్కినేని సరసన నించుంది సగర్వంగా - తెలుగు జాతి బలిమిని చాటుతూ. చిత్ర రాజాన్ని ఒక మాగ్నం ఓపస్ గా చరిత్ర కెక్కించి చేతులు దులిపేసుకుంది!

         
క్లయిమాక్స్ సీనే ముగ్గురు తెలుగు బెంగాలీ హిందీ నటీమణుల టాలెంటు కి గీటురాయి అయింది. క్లైమాక్స్ అంటూ చిత్రీకరిస్తే అది రాత్రి పూటే వుండాలని నిబంధన పెట్టింది సావిత్రి. షాట్ పూర్తయ్యాక తన సమీపంలోకి ఎవరూ రావొద్దని ఆక్షలు విధించింది. రీటేకు లేమాత్రం లేని షాట్స్ తో, మతి చలించిన విధివంచిత పాత్ర ఆక్రందనని గుండె పగుల గొట్టుకుని మరీ ప్రతిష్టించేసి, వెళ్లి మూల కూలబడి వెక్కి వెక్కి ఏడ్వడమే! పాత్ర తాలూకు గుండె కోతంతా వదిలాక,  చక్కాలేచి గుడ్ నైట్ చెప్పేసి సొంత గూటికి వెళ్ళిపోవడమే!

              అమృత తుల్యమైన షాట్సే అటు బెంగాలీ మాతృక దీప్ జలే జాయేలో సుచిత్రా సేన్ నీ, ఇటు మళ్ళీ హిందీ రీమేక్ 'ఖామోషీలో వహీదా రెహమాన్ నీ ఆలౌట్ చేసేశాయి. స్వయంగా ఓటమి ఒప్పేసుకుంది కూడా వహీదా.

          మనసులాట ఇదంతా. వికటించే ఒక వింత ప్రయోగం. అయినా రిటైర్డ్ కల్నల్ డాక్టర్ (డాక్టర్ ప్రభాకర రెడ్డి) కి ప్రయోగమే కావాలి. మానసిక రోగులకి మందులతో గాక, ప్రేమతో వైద్యం చేయాలనే సూత్రీకరణ. విఫల ప్రేమలతో పిచ్చివాళ్ళయిన పెషంట్లకి ప్రేమ నటించి బాగు చేస్తే బావుంటుందని ఆలోచన. అప్పటికి ప్రపంచంలో మొట్ట మొదటిదైన ప్రయోగాన్ని ఎలాగైనా విజయవంతంగా పూర్తిచేసి  పేరు ప్రతిష్టలు గడించాలన్నఆశ.  ఇందుకు సాధనం అదే ఆస్పత్రిలో పనిచేసే పద్మ ( సావిత్రి) అనే అమాయక నర్సు.  

       కేస్ – 1 : భాస్కర్ ( టి.ఎల్. కాంతారావు)అనే పేషంట్ తో, నర్సు పద్మ వలచి ప్రేమిస్తున్నట్టు నటిస్తూ నిజంగా తనే ప్రేమలో పడిపోయింది. మనసారా అతను కోలుకుని వెళ్తూ, ఆమె చూపించిన ప్రేమ అంతా ప్రయోగంలో భాగంగా ఉత్తి నటనే అని అపార్ధం జేసుకుని వెళ్ళిపోయాడు. కాదూ నిజంగానే ప్రేమించానూ అని అతడికైనా, డాక్టర్ కైనా ఎలా చెప్పుకోవాలామె? ఎలా?

          కేస్ – 2 : ప్రకాష్ (ఎం. బాలయ్య) అనే ఇంకో పేషంట్ ని కూడా ఇలాగే నయం చేసి పంపించాలని డాక్టర్ ఇంకో హుకూం. వల్లకాదంది, తనవల్ల ఇక కాదంటే కాదంది. మనసంతా వెళ్లిపోయిన భాస్కరే నిండి వుంటే, బరితెగించి మళ్ళీ ఇంకోడితో నటనా? ఐనా ఉద్యోగ ధర్మం కొద్దీ ఓర్చుకుని ఎలాగో ప్రకాష్ కి సపర్యలు చేస్తూ, ఇతడి ప్రేమ కథలో మోసగించిన ప్రియురాల్ని తెచ్చి అప్పగించేస్తే, ఛీ కాదు పొమ్మన్నాడు. నువ్వే నా ప్రేయసీ అంటూ గలాభా సృష్టించాడు. మతిపోయి తలుపులు బిడాయిం చుకుని పిచ్చి చూపులు చూసింది. పచ్చిగా పిచ్చిదై తెరలుతెరలుగా నవ్వడం మొదలెట్టింది. అదే ఆస్పత్రిలో అదే పేషంట్లకి నయం చేసిన అదే గదిలో, తనే పేషంటైపోయి ఈసురోమంటూ చీకటిని మిగుల్చుకుని చతికిల బడింది. అప్పుడు మిన్నంటే అక్రందన -

          “నేను అభినయం చేయలేదూ , నిజంగా నేను అభినయం చేయలేదు! నేనెన్నడూ అభినయం చేయలేదు! అభినయించడం నాకు చేత గాదు, నా చేత గాదు, నా చేత గాదూ ..అనేసి!

          “చిగురంటి వయసులో చిక్కని జీవితాన ...చివరకు మిగిలేది చీకటేనా కారు చీకటేనా” –(కృష్ణ శాస్త్రి)...సేవికగా, నటించే నాయికగా, మనసిచ్చిన మానినిగా, భగ్నహృదయిని గా, భయవిహ్వలగా, బలిపశువుగా... పాత్ర నడక (క్యారక్టర్ ఆర్క్) ని అంకురం దగ్గర్నుంచీ చివరాఖరికి విధ్వంసం వరకూ ఒంటి చేత్తో లాక్కెళ్ళేసి, నిటారుగా నింగి నంటించిన సినిమా ప్రపంచపు సామ్రాజ్ఞిని వృత్తి నైపుణ్యాన్ని వర్ణించడానికి భరతముని దిగివచ్చినా బలాదూరే!

         
మతి పోగొట్టుకోవడంలో కళ్ళు తిప్పడం వుందే...అదే  సుచిత్రా వహీదా నటద్వయం చాపకిందికి నీరు తెచ్చేసింది! బేసిగ్గా కళ్ళు తిప్పే టెక్నిక్ ని అఖండ తారామణు లిద్దరూ ఎందుకు విస్మరించారో వాళ్ళకే తెలియాలి. పైపెచ్చు సుచిత్రా సేన్ లో పాత్ర డిమాండ్ చేసే సగటు ఆడదాని అణుకువ కంటే కూడా మోడరన్ గాళ్ పాయిజే పెల్లుబికింది బాగా. వహీదా రెహమాన్ లో సగటు స్త్రీ తొంగి చూసినా, కీలక మతి చాంచల్య ఘట్టంలో ఉల్లాస ఛాయలు దేనికో. మొత్తానికి ఇలా సావిత్రిదే పైచేయై పోయింది!

        1960 లో మంజీరా ఫిలిమ్స్ బ్యానర్ లో వచ్చిన సినిమా బెంగాలీ మాతృక, ‘నర్స్ మిత్రఅనే నవలకి తెర రూపం. ఆశుతోష్ ముఖోపాధ్యాయ నవలా రచయిత. అసిత్ సేన్ ని దర్శకుడిగా పెట్టుకుని, అనిల్ చటర్జీ, సుచిత్రాసేన్ లని హీరో హీరోయిన్లుగా తీసుకుని ప్రఖ్యాత సంగీత దర్శుకుడు హేమంత్ కుమార్ సినిమా నిర్మాణం చేపట్టాడు. అది సూపర్ హిట్టయ్యింది. 1969 లో ఇదే దర్శకుడు రాజేష్ ఖన్నా వహీదా రెహమాన్ ధర్మేంద్ర లతో ఖామోషీగా రీమేక్ చేస్తే అట్టర్ ఫ్లాపయ్యింది. 

          బెంగాలీలో హేమంత్ కుమార్ పాడిన అయి రాత్ తుమార్ అమార్’ ( రాత్రి నీదీ నాదీ) అనే హమ్మింగ్ సాంగ్ వుంది. ట్యూన్ నే తెలుగు రీమేక్ చివరకు మిగిలేదిలోనూ వాడుకుంటూ సుధవో సుహాసినీఅని మల్లాదితో  పాట రాయించుకుని, ఘంటసాల చేత పాడించుకున్నాడు సంగీత దర్శకుడు అశ్వత్థామ. వేరే ట్యూన్ తో హిందీ రీమేక్ లో కిషోర్ కుమార్ పాడిన గుల్జార్ రాసిన పాట- వో హ్ షామ్ కుచ్ అజీబ్ థీగుండెల్లో సాయంకాలపు రాగాల్ని నాటుతుంది. ఇకపోతే బెంగాలీ మాతృక, హిందీ రీమేక్ కథనం కథానాయిక దృక్కోణంలో సాగుతుంది. 

          మొదటి కేసులో సాగే ఆమె ప్రేమ కథ ఫ్లాష్ బ్యాక్ లో, అది కూడా నీడలా భగ్న ప్రేమికుడ్ని చూపించే టెక్నిక్ తో, డైరీలో ఆమె జ్ఞాపకాల్ని తోడుకునే కథనంతో లీలామాత్రంగా వుంటుంది. తెలుగులో దీన్నిదర్శకుడి దృక్కోణం (పాయింటాఫ్ వ్యూ) కి మార్పు చేశారు. రెండు కేసుల్నీ కేసుని వర్తమానంలో నడిచే కథలుగానే చూపించారు. దీనికి కారణాలేమిటో ఎగ్జిక్యూటివ్ నిర్ణాత ఎం.ఆర్. కొండల రెడ్డి వివరిస్తారు (కింది సెక్షన్లో చూడండి). అలాగే ఏసుప్రభు, పాలగ్లాసు, రేడియో దృశ్యాలతో పాటు; రాజబాబూ రమణా రెడ్డిల మెంటలోళ్ళ కామెడీ ఒరిజినల్ లో లేని చేరికలే. అప్పటి పాపులర్ హీరో హరనాథ్ కూడా ప్రత్యేకపాత్ర పోషించిన సినిమాకి గుత్తా రామినీడు దర్శకుడు. ఈయన అప్పుడప్పుడే మా ఇంటి మహాలక్ష్మిఅనే సినిమాతో జాతీయ ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డు పొంది వున్నాడు.

చరిత్రలో ఒక పేజీ..
    చివరకు మిగిలేది నిర్మాతలుగా కాంగ్రెస్ సీనియర్ నాయకులు యు. పురుషోత్తమ రెడ్డి, ఎం. సత్యనారాయణ లున్నా, పర్యవేక్షణంతా ఎగ్జిక్యూటివ్ నిర్మాతగా డా. ఎం.ఆర్. కొండలరెడ్డి తన భుజానేసుకున్నారు. ఈయన హైదరాబాద్ లో రాజధాని బ్యాంక్ ఉపాధ్యక్షులుగా, సెన్సార్ బోర్డు మాజీ మెంబరుగా వున్నారు.  నీలకంఠ తీసిన షోచిత్రం మీద ఎం.ఫిల్ చేశారు. మృదుభాషి అయిన ఈయన దగ్గర చివరకు మిగిలేదిసమాచారం పుష్కలంగా వుంది!

           1959 లో సినీ అడ్వాన్స్అనే పత్రికలో బెంగాలీ చిత్రం దీప్ జలే జాయేరివ్యూ చదివి ఉత్తేజితుడైన ఈయన( అప్పట్లో ఒక ఆంగ్ల పత్రికలో సినిమా రివ్యూలు రాసేవారీయన) పురుషోత్తమ రెడ్డిని, దర్శకుడు గుత్తా రామినీడునీ వెంట బెట్టుకుని కలకత్తా వెళ్ళిపోయారు. అక్కడ నిర్మాతా సంగీత దర్శకుడూ అయిన హేమంత్ కుమార్ దగ్గర పది వేలకి సినిమా తెలుగు రైట్స్ కొని, మద్రాసు వచ్చేశారు. ముందు జమునని అనుకున్నారు. ఆమె పారితోషికం ఎక్కువ చెప్పడంతో, సావిత్రిని కలిశారు. సినిమా చేయడానికి సావిత్రి సాహసించక పోవడంతో, అక్కినేని నాగేశ్వర రావుతో చెప్పించారు. అలా ఒప్పుకున్న సావిత్రి అప్పుడే తన పారితోషికం 40 వేలలోంచి పాతిక వేలూ పెట్టి నిర్మాతల దగ్గరే తమిళ డబ్బింగ్ రైట్స్  కొనేశారు. ఐతే తెలుగులో రీమేక్ ఫ్లాప్ కావడంతో సావిత్రి తమిళ డబ్బింగ్ జోలికెళ్ళ లే దు. అది వేరే విషయం.
\
                   సావిత్రి బిజీ కారణంగా నెలకి మూడు రోజులు మాత్రమే డేట్స్ ఇవ్వడంతో, వీనస్ స్టూడియోలో వేసిన సెట్లో అలాగే ఆరు నెలల  పాటు షూటింగ్ జరిపారు. ప్రఖ్యాత దర్శకుడు కె.వి. రెడ్డి ప్రారంభోత్సవం చేశారు. మూడు లక్షల బడ్జెట్ తో నిర్మాణం పూర్తి చేసి,  1960 అక్టోబర్ లో 12 ప్రింట్లతో విడుదల చేస్తే, వెనువెంటనే తిప్పికొట్టారు తెలుగు ప్రేక్షకులు. పిచ్చి సినిమాలో సావిత్రికి కాదు, ఇలాటి సినిమా తీసిన నిర్మాతలకి పట్టిందని చెడ తిట్టుకుంటూ వెళ్ళిపోయారు. విజయవాడలో ఒకే ఒక్క ఆటకి బాక్సు వెనక్కొచ్చేసింది. కాకినాడ, వైజాగ్, హైదరాబాద్ లలో మాత్రం రెండు వారాలాడింది. మద్రాసులోని సౌత్ ఇండియన్ ఫిలిం క్రిటిక్స్ సంఘం దీనికి మూడు అవార్డులిచ్చింది(ఉత్తమ చిత్రం, ఉత్తమ నటి, ఉత్తమ దర్శకుడు). 1990 లో హైదరాబాద్ లో జరిగిన అంతర్జాతీయ చలన చిత్రోత్సవాల్లో ప్రదర్శిస్తే క్రిక్కిరిసి చూశారు డెలిగేట్లు. ఇప్పుడీ సినిమా ప్రింట్లు ఎక్కడా లేవు. చివరి ప్రింటు కూడా శిథిలమౌతూంటే, జాగ్రత్త పడి సీడీలు తీసి భద్రపర్చారు. సీడీలే రాస్తున్న ఆర్టికల్ కి మూలాధారం

         
అట్లూరి పిచ్చేశ్వర్రావు చేత మాటలు రాయించారు. తర్వాత కృష్ణశాస్త్రి వీటిని సంస్కరించారు. అయితే కథనంలో పాయింటాఫ్ వ్యూ పరంగా ఒరిజినల్ కీ రీమేకుకీ  వ్యత్యాసాన్ని కొండల రెడ్డి వివరిస్తూ- అలా తెలుగు ప్రేక్షకుల సౌలభ్యం కోసమే  చేశామన్నారు. కాంతారావుతో సావిత్రి ప్రేమాయణాన్ని అలా ప్రత్యక్షంగా చూపించక పో తే తెలుగు ప్రేక్షకులకి నచ్చేది కాదన్నారు. అలాగే సావిత్రి బాలయ్యని డీల్ చేస్తున్నప్పుడు, ఒరిజినల్ లో లాగా తల్లి ప్రేమ యాంగిల్ ని ప్రవేశపెట్టినా కూడా మన ప్రేక్షకులకి రుచించేది కాదన్నారు. సూడో ఫీనియా, ఎక్యూట్ మేనియా, వంటి వైద్య భాషని, బాల్యం నించీ వివిధ దశల్లో పురుషుడి మానసికావస్థ కి సంబంధించిన డిస్కషన్ నీ ఇందుకే పరిహరించామన్నారు. తర్వాత 1964 లో కొండల రెడ్డి తానొక్కడే నిర్మాతగా జగ్గయ్య, కృష్ణ కుమారి లతో వీలునామానిర్మించి విజయం సాధించారు.


 -సికిందర్ 
(‘పాలపిట్ట’ సాహిత్య మాసపత్రిక, నవంబర్ -2018 సంచిక)