రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

12, జనవరి 2018, శుక్రవారం

584 : రివ్యూ!

స్క్రీన్ ప్లే – దర్శకత్వం :  కె ఎస్ రవికుమార్
తారాగణం : బాలకృష్ణ, తార, రిప్రియ, టాషా దోషి, ప్రకాష్ రాజ్, జయప్రకాష్ రెడ్డి, మురళీమోహన్, బ్రహ్మానందం, అశుతోష్ రాణా, ప్రభాకర్ దితరులు
కథ- మాటలు : ఎం.త్నం, సంగీతం : చిరంతన్ ట్, ఛాయాగ్రణం : రాంప్రసాద్
బ్యానర్  : సి.కె.ఎంటర్టైన్మెంట్స్
నిర్మాత : సి. కళ్యాణ్
విడుదల : జనవరి 12, 2018
***
          నందమూరి బాలకృష్ణ – సంక్రాంతి కాంబినేషన్  కొత్తేమీ కాదు. కాకపోతే 1999 నుంచి 2017 వరకూ 18 ఏళ్ళలో  నటించిన సినిమాలు ఏడే సంక్రాంతికి వచ్చాయి. వాటిలో నాలుగు హిట్టయ్యాయి. 2016 సంక్రాంతికి ‘డిక్టేటర్’ ఎంత ఫ్లాపయ్యిందో, 2017 సంక్రాంతికి ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ అంత హిట్టయ్యాక ఇప్పుడు ‘జై సింహా’ తో పండగ ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఏం తీసుకొచ్చారు? ‘శాతకర్ణి’ లాంటి చారిత్రికాలో, ‘శ్రీ రామరాజ్యం’ లాంటి పౌరాణికాలో నటించకపోతే ఆయన నటించేదొక్కటే - 1999 ‘సమరసింహా రెడ్డి’ నుంచి మారిన ఆయన బాక్సాఫీసు ఫార్ములా ప్రకారం ఫ్యామిలీ యాక్షన్లు నటిస్తారు. మరీ ‘డిక్టేటర్’,  ‘పైసా వసూల్’ లాంటి మాఫియాలు నటిస్తే దెబ్బతింటారు. తిరిగి ఇప్పుడు ‘జై సింహా’ అనే ఫ్యామిలీ యాక్షన్ కే వచ్చి సక్సెస్ అయ్యారా? నిర్మాత సి కళ్యాణ్, తమిళ సీనియర్ దర్శకుడు కె ఎస్ రవికుమార్ లు బాలకృష్ణకి ఏ ప్యాకేజీ ఇచ్చి పండగ చేసుకుందామనుకున్నారు? ....ఒకసారి చూద్దాం...

కథ 
      వైజాగ్ ఆస్పత్రిలో ప్రసవించిన బిడ్డ కనపడక బావురుమంటుంది గౌరీ (నయనతార). బిడ్డతో రైలెక్కేస్తాడు నర్సింహా (బాలకృష్ణ). కొన్ని వూళ్ళు తిరిగి, ఏ వూళ్ళోనూ రౌడీలూ గూండాలతో బిడ్డకి భద్రత లేక,  చివరికి తమిళనాడులోని కుంభకోణం చేరుకుంటాడు. అక్కడ ఆలయ ధర్మకర్త ( మురళీమోహన్ ) దగ్గర కారుడ్రైవర్ గా చేరతాడు. ఆయనకి ధాన్య (నటాషా దోషి) అనే కూతురుంటుంది.  డ్రగ్స్ బానిస అయిన ఈమె కారు యాక్సిడెంట్ చేస్తుంది.  ఈ యాక్సిడెంట్ లో కనియప్పన్ (ప్రభాకర్) అనే లోకల్ గూండా తమ్ముడు గాయపడతాడు. దీంతో కనియప్పన్ దాడికొస్తే, యాక్సిడెంట్ తన మీదేసుకుని వాళ్ళ చేతుల్లో దెబ్బలు తింటాడు నర్సింహా. వూళ్ళో ఒక ఏఎస్పీ వుంటాడు. ఇతను అలయ పూజారీని అవమానించడంతో పూజారులంతా ఆందోళనకి దిగుతారు. వాళ్ళని హింసించి ఫైరింగ్ చేయబోతే, నర్సింహా అడ్డుకుని క్షమాపణ చెప్పిస్తాడు. దీంతో నర్సింహా మీద పగ పెంచుకుంటాడు ఏఎస్పీ. ఇటు ధాన్య నర్సింహాని  ప్రేమిస్తుంది. ఇంతలో గాయపడిన తమ్ముడు చనిపోవడంతో నర్సింహాని  చంపెయ్యాలని వస్తాడు కనియప్పన్. ఈ పోరాటంలో గౌరీ వచ్చేస్తుంది. నర్సింహా దగ్గర్నుంచి బిడ్డని లాక్కుని,  మళ్ళీ మొహం చూపించ వద్దని వెళ్ళిపోతుంది. ఎవరీ గౌరీ? నర్సింహాకీ, గౌరీకీ మధ్య అసలేం జరిగింది? దీన్ని నర్సింహా ఎలా పరిష్కరించుకున్నాడు? ... అన్నదే మిగతా కథ. 

ఎలావుంది కథ 
      ముందే చెప్పుకున్నట్టు ఇది ఫార్ములా @ 1999 ‘సమరసింహా రెడ్డి’ జానర్ కథ.  కాకపోతే ఫ్యాక్షన్ లేని ఫ్యామిలీ యాక్షన్. ఇద్దరు హీరోయిన్లు, పుట్టిన బిడ్డ,  భగ్నప్రేమ అనే రొటీన్ పాత ఫ్యామిలీ కథనే,  దీంతో సంబంధంలేని యాక్షన్ సబ్ ప్లాట్ తో కలిపి నడిపించే ప్రయత్నం చేశారు. బాలకృష్ణతో కథ అనగానే ఆయనకి  ప్రొఫెషనల్ బ్యాగేజీని కట్టబెట్టడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో ఆయనతో  1999 నుంచీ మారని అవే తరహా కథలొస్తున్నాయి. ఆ కథల్ని కూడా  అదే టైం జోన్ లో అలాగే పెట్టి చూపిస్తున్నారు. ప్రస్తుత కథకి టెంప్లెట్ 1999 నాటిదే అయినా,  ఫ్యామిలీ కంటెంట్ వచ్చేసి ఇంకా పురాతనమైనది. ఇది బాలకృష్ణకి కురచ అయిపోయింది. అయితే పండగ కథ (సినిమా) కాబట్టి ఇంత చాలు.

ఎవరెలా చేశారు 
      సీనియర్ స్టార్లు వాళ్ళ కాలంలో పాపులర్ చేసుకున్న పాత్రలు, కథలు వాళ్ళకొక బ్రాండ్ ఇమేజీ. ఆ బ్రాండ్ ఇమేజీతో వాళ్ళుండి పోతే ఎవరికీ అభ్యంతర ముండాల్సిన అవసరం లేదు. ఆ బ్రాండ్ ఇమేజీని నేటి యువస్టార్లు నిలువునా  పూసుకుని నటిస్తేనే ఎబ్బెట్టుగా వుంటుంది కాలం చెల్లిపోయి. అయినా ఎంత మంది యువస్టార్లు అలాటివే  సినిమాలు, పాత్రలు నటించడం లేదు ఇవ్వాళ ?  యువస్టార్ల హిట్టు ఫ్లాపులన్నీ,  సీనియర్ స్టార్లయిన చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ లు వాళ్ళ కాలంలో పాపులర్ చేసుకున్న టెంప్లెట్సే. ఇందులో ఎలాంటి సందేహమూ పెట్టుకోనక్కర్లేదు. అలాంటప్పుడు ఇప్పుడు బాలకృష్ణ వచ్చేసి తన గేమే తాను ఆడుకుంటే వేలెత్తి చూపాల్సిన పనిలేదు. బాలకృష్ణ సినిమాలెలా వుంటాయో  తెలిసే వెళ్తారు ప్రేక్షకులు. ఆ టైటిల్సే చెప్తాయి.

          చూడాల్సింది వయసు పెరిగిన బాలయ్య ఇప్పుడెలా నటిస్తున్నారనేది. ఆయన బ్రహ్మాండంగానే  నటిస్తున్నారు. ‘సమరసింహా రెడ్డి’ @ 1999 లేకపోతే ఆయనొక తనదైన కొత్త బ్రాండ్  నటనని ప్రారంభించుకునే వారు కాదు. అదే ‘ముద్దుల మేనల్లుడు’ లు, ‘మంగమ్మగారి మనవడు’ ల టైపు నటనలతో వుండిపోయేవారు. ట్రేడ్ మార్క్ @ 1999 ఆయనకి పెద్ద ఎసెట్. ఇప్పుడొచ్చేసి  ఇంకో పరిణామక్రమంలో ఆయన్ని వూహించలేం. కాబట్టి ఇప్పుడు వున్న రౌద్ర రస పోషణకి, భగ్న ప్రేమికుడి టచ్ ఇచ్చారు. బాగానే వుంది కానీ, ముగింపు భగ్న ప్రేమికుడి త్యాగంగా కాకుండా వుండాల్సింది.  పాత్ర ప్రారంభ ముగింపులు చూస్తే ఒకదానికొకటి  వ్యతిరేకంగా, మిర్రర్ ఎఫెక్ట్ తో అద్భుతంగా వున్న మాట నిజమే. కానీ ఇది క్లాస్ కథకైతే బావుటుంది, మాస్ కథకి కాదు. భగ్నప్రేమికుడి ముగింపుగా కాక, సబ్ ప్లాట్ లోని యాక్షన్ హీరో ముగింపుగా ఇచ్చివుంటే  బాక్సాఫీసు అప్పీల్ పెరిగేది. 

          ఐతే భగ్న ప్రేమికుణ్ణి తీసుకున్నా,  యాక్షన్ హీరోని తీసుకున్నా రెండూ యమ స్పీడుతో వుండడం జరిగిన ఒక పెద్ద మేలు. భగ్న ప్రేమికుడితో ముగింపు తప్పిస్తే,  ఈ రెండు షేడ్స్ ఎక్కడా బోరు కొట్టవు.  ఒకచోట - భార్య చనిపోయినప్పుడు ఆయన సైలెంట్ గా వుండడం  ప్రేక్షకులు భరించ లేకపోయారు. బాలయ్యకీ జై అంటూ ఆయన్ని తట్టి లేపేందుకు ప్రయత్నించారు. ఆయన డైలాగులు కొడుతూనే వుండాలి, ఎగిరేసి ఎగిరేసి కొడుతూనే వుండాలి తప్ప  సైలెంట్ గా వుంటే కాదు.  

          ఫైట్స్ లో ఎంత పవర్ఫుల్లో,  పాటల్లో అంతే పవర్ చూపించారు. ఈ పాటలు చూడ్డం మాంచి ఎంటర్ టైన్మెంట్ మనకి. ముగ్గురు హీరోయిన్లతో రోమాన్సు  ఎక్కడా చప్పగా లేదు. కాకపోతే పాత మోడల్ లో వుంది. పాత మోడల్లో ఇంకా చాలా వున్నాయి – పాటలు  ఫైట్లు తప్పితే. కామెడీ అంతా పాత మోడలే. కానీ బాలకృష్ణ  మొదలెట్టింది లగాయతు చివరి వరకూ ఎక్కడా బోరు కొట్టించ లేదు, అదే సమయంలో ఓవరాక్షన్ చేయలేదు. 

          నయనతారకి మంచిపాత్రే దొరికింది.  పాత మూస ఫార్ములా పాత్రలో గ్రేస్ ఫుల్ గా నటించింది. హాస్పిటల్లో అమెకి రెండు సార్లు జరిగే అదే అనుభవం ఈ కథ మొత్తానికి రెండు మూల స్థంభాల్లాంటివి. ఇలాటి విచిత్ర కాకతాళీయాలు పాత డినైస్ రాబిన్స్ సెంటిమెంటల్ రోమాంటిక్ నవలల్లో కన్పిస్తాయి. ఈమె నవలల్లోంచి కొన్ని హిందీ సినిమాలు కూడా కాపీ కొట్టారు. 

          బాలకృష్ణకి అసిస్టెంట్ మెకానిక్ గా మంచి పర్సనాలిటీగల హరిప్రియది పెడసరి పాత్ర. డ్రగ్ బానిస పాత్రలో నటాషాది అంత స్కోపు లేని పాత్ర. బ్రహ్మానందం చాలాకాలానికి తెరపైకొచ్చి  తన మార్కు కామెడీ నిర్మొహమాటంగా ఆడుకున్నారు. ఇప్పటికీ ఆయన కొంత మంది ప్రేక్షకుల్ని బాగానే నవ్వించ గల్గుతున్నారు. ఆశుతోష్ రాణా, ప్రభాకర్ లది వాళ్ళ రొటీన్ విలనీ.

          ఈ మాస్ మసాలా ప్రొడక్షన్ విలువలు రిచ్ గా వున్నాయి. మొన్న ‘టూ కంట్రీస్’  లో పేలవమైన కెమెరా వర్క్ చేసిన సీనియర్ రాం ప్రసాద్, తిరిగి  ఇప్పుడు తన రూటు లోకొచ్చి, వైభవోపేతంగా చిత్రీకరణ చేశారు.  ఇంకో హైలైట్ చిరంతన్ భట్ మ్యూజిక్, పాటలూ  ఎంతో ఫ్రెష్ గా వున్నాయి. దృశ్యాల్ని స్పీడుగా పరుగెత్తించిన ప్రవీణ్ ఆంథోనీ ఎడిటింగ్ కూడా హైలైటే. అలాగే రామ్  - లక్ష్మణ్ యాక్షన్ సీన్స్. ఇక కథ, మాటలు అందించిన రత్నం ఓల్డ్ స్కూలుకే కట్టుబడి పనిచేశారు. కథెలా వున్నా మాటలు బాగా రాశారు. తమిళ సీనియర్ దర్శకుడు తనకాలంలోనే వుండిపోయి, ఓల్డ్ స్కూలు దర్శకత్వంతోనే సరిపుచ్చారు. కథ. సన్నివేశాలు పాతవన్న మాటేగానీ, వాటిని నడిపించడంలో మాత్రం యమ స్పీడు పాటించారు.

చివరికేమిటి 
       మరో పండగ సినిమా. ఇంతే వుంటుంది. పండగ సినిమాలు పండగని డామినేట్ చేయకూడదు. మళ్ళీ ఇంటి కెళ్ళి పండగ పూర్తి చేసుకునేట్టు, హేంగోవర్ లేకుండా అలా అలా  పైపైన ‘పానీయం’ సిప్ చేసినట్టుండాలి. ఇక్కడ  రిలీఫ్ ఏమిటంటే, ఇది మరీ బ్యాడ్ గా లేకపోవడం. కారణం,  రిచ్ ప్రొడక్షన్ విలువలతో, చిన్నచిన్న సీన్లు వేగంగా పరిగెత్తడం. ఫస్టాఫ్ పూర్తయ్యేవరకూ కళ్ళు తిప్పుకోకుండా చూసేట్టు చేయడం. మళ్ళీ సెకండాఫ్ పూర్తయ్యే దాకా తల తిప్పుకోకుండా చూసేట్టు చేయడం. ప్రతీ చిన్న సీనూ ఏదోవొక సంఘటన జరుగుతుంది, లేదా మలుపు తీసుకుంటుంది. చైన్ రియాక్షన్ లా ఇవి కథని ముందుకు తోస్తూంటాయి. ఇంటర్వెల్ దగ్గరకొచ్చేసి ఇచ్చిన ఫ్యామిలీ ట్విస్టు చాలా అనూహ్యమైనది. అసలు గతంలో ఏం జరిగుంటుందాని ఆలోచింప జేస్తుంది. ముగింపు  కూడా ఇలాటిదే ఫ్యామిలీ ట్విస్టుతో  ఆలోచనాత్మక మైనదే... కానీ యాక్షన్ జానర్ కి లోబడకుండా పోయింది.  సినిమా ప్రారంభం, ఇంటర్వెల్, ముగింపు సీన్లు ఫ్యామిలీ బేస్డ్ గా బాగానే వున్నాయి – ఈ ప్రారంభ మధ్యమ ముగింపులు శిల్పం చెడకుండా బాగానే వున్నాయి కానీ, కమర్షియాలిటీ కోసం శిల్పాన్ని చెడగొట్టక తప్పదు.  భగ్న ప్రేమికుడి పాసివ్ ముగింపుగా గాక, యాక్షన్ హీరో వీరోచిత ముగింపు ఇచ్చివుంటే కమర్షియాలిటీ వచ్చేది.


సికిందర్


.
         
         




                  





11, జనవరి 2018, గురువారం



ధన్యవాదాలు!
పాఠకులకి, పరిశ్రమ వర్గాలకి ధన్యవాదాలు. బ్లాగులో ‘అజ్ఞాతవాసి’ రివ్యూకి దేశవిదేశాల నుంచి వెల్లువలా హిట్స్ వస్తున్నాయి.  బ్లాగు చరిత్రలో ఇది రికార్డు.  మీ ప్రోత్సాహం ఇలాగే కొనసాగుతుందని ఆశిస్తాం. కొందరు కొన్ని ప్రశ్నలు, వివరణలు అడిగారు. వాటికి త్వరలో  సమాధానం ఇవ్వగలమని తెలియజేస్తున్నాం.
సికిందర్

10, జనవరి 2018, బుధవారం

583 : రివ్యూ!


ర్శత్వం : త్రివిక్రమ్ శ్రీనివాస్
తారాగ
ణం : న్ ళ్యాణ్, కీర్తీ సురేష్, అనూ ఇమాన్యుయేల్, ఖుష్బూ, బొమన్ ఇరానీ, ఆది పినిశెట్టి, రావు మేష్, మురళీశర్మ, ప్రరాగ్ త్యాగీ, అజయ్, వెన్నెల కిషోర్ తదితరులు
కథ : జెరోమ్ సాల్ (‘లార్గో వించ్’), సంగీతం : అనిరుధ్, ఛాయాగ్రణం : ణికందన్
బ్యానర్ : హారిక అండ్ హాసిని క్రియేషన్స్
నిర్మాత : ఎస్‌.రాధాకృష్ణ
విడుదల : జనవరి 10, 2018
***

       మధ్య  ఇతర స్టార్ల కంటే ఎక్కువ వార్తల్లో వుంటున్న పవన్ కళ్యాణ్ పండగ సీజన్లో కొత్త సినిమాతో రావడం ఇంకా ఎక్కువ క్రేజ్ ని సృష్టించింది. గత మూవీ కాటమరాయుడుకి లేనంత పవన్ మేనియాతో తెలుగు రాష్ట్రాలు వూగిపోతున్నాయి. అర్ధరాత్రి నుంచే థియేటర్లు కిటకిట లాడిపోతున్నాయి. అజ్ఞాత వాసితప్ప ఇంకేమీ జీవితంలో లేనట్టు ప్రేక్షకులు మైమరచిపో
తున్నారు
. హిట్ సూపర్ హిట్ మెగా హిట్  అంటూ కేరింతలు కొడుతున్నారు. ఒక స్టార్ ఇంతకంటే ఆనందం ఏమివ్వగలడు. ఇంత ఆనందాన్ని పంచిస్తున్న పవన్ కళ్యాణ్ కింకేం కావాలి. థియేటర్ల ముందు విజయ బాజాలు ఢమా ఢమా మోగుతూంటే దారినపోయే పండగ జనం ఉలిక్కిపడి టికెట్ల కోసం పరుగులు తీస్తున్నారు. ఆగకుండా రేయింబవళ్ళూ షోలతో సంక్రాంతికే శివరాత్రిని రప్పించిన పవన్ కళ్యాణ్ ఇంతకంటే హిట్ ఏం కొట్టాలి. 
       ఇటీవల త్రైమాసిక సీరియల్ గా హల్చల్ చేసిన వివాదంలో కూడా అజ్ఞాతంగా వుంటూ, నిజమైన అజ్ఞాత వాసి అన్పించుకున్న తను, ఆఖరికి అజ్ఞాతవాసి లో కళలు బైట పెట్టుకున్నారో ఓసారి చూద్దాం...

కథ 
       విందా (బొమన్ ఇరానీ) అనే కార్పొరేట్ బాస్ ని, అతడి కొడుకునీ పాత పగతో సీతారాం (ఆది పినిశెట్టి)  చంపేస్తాడు. చంపేసి కంపెనీని హస్తగతం చేసుకునే పథకమేస్తాడు. దీంతో విందా భార్య ఇంద్రాణి (ఖుష్బూ) హంతకుల్ని పట్టుకోవడానికి అజ్ఞాతంలో పెరిగిన భార్గవ్ (పవన్ కళ్యాణ్) ని  రప్పిస్తుంది. ఇతను విందా మొదటి భార్య కొడుకు. ఒక ఉద్దేశంతో విందా,  భార్గవ్ ని అప్పాజీ (తనికెళ్ళ) కిచ్చి సుదూరంగా అస్సాంలో పెంచాడు. ఇప్పుడు భార్గవ్ వచ్చి కంపెనీలో చేరి, తండ్రిని చంపిందెవరో తెలుసుకునే ప్రయత్నాలు మొదలెడతాడు. కంపెనీ మేనేజర్లు శర్మ, వర్మ (మురళీ శర్మ, రావు రమేష్) ల కూతుళ్ళు (కీర్తీ సురేష్, అనూ ఇమాన్యుయేల్) తో ప్రేమలో పడతాడు. ఈనేపధ్యంలో సీతారాం ఏం కుట్రలు చేశాడు, భార్గవ్ తను విందా కొడుకేనని నిరూపించుకుని, సీతారాం ని ఎలా శిక్షించాడనేది మిగతా కథ. 

ఎలావుంది కథ 
      పండగ పూట కథ జోలికి పోకుండా వుంటే మంచిది, పండగ మూడ్ పోతుంది.  కథ ఎవరిక్కావాలి. పవన్ సినిమా చూశామా లేదా కావాలి. కాబట్టి పైపైన  కొంత పరిచయం చేసుకుని వదిలేద్దాం. ఇది సినిమా తీశాక 10 కోట్లు ఇచ్చి కొనుక్కున్న కథ అని తెలిసిందే. అందుకే ఇలా తీశారు. తీయక ముందు 10 కోట్లతో ఆ హక్కులేవో కొనుక్కుని వుంటే చాలా జాగ్రత్తలు తీసుకునే వారేమో. ఓ లక్ష ఇస్తే ఇలాటి 10 కథలు ఎడం చేత్తో రాసిచ్చే వాళ్ళుండగా, ఫ్రెంచి  సినిమా కథకి 10 కోట్లు దండగ పెట్టాల్సిన అవసర మేమొచ్చిందో తెలీదు. ఫ్రెంచి వాడు ఫిలింనగర్ కంటే ఎక్కువా? వాడు తన మానాన వరల్డ్ మూవీస్ తీసుకునే జోన్ వదులుకుని హాలీవుడ్ బాటలో నడవాలని వేసిన తప్పటడుగులు ‘లార్గో వించ్’. ఇది పవనోవిచ్ కి, అందునా తెలుగుకి సూటయ్యే ఛాన్సే లేదు. అది కార్పొరేట్ గూఢచార కథ. దాంట్లోకి  తెలుగు సలాడ్ కూరి శాండ్ విచ్ చేసి రిచ్ అవాలనుకోవడం చాలా ఖరీదైన 10 కోట్ల తప్పవుతుంది.  లార్గో విచ్ 1970 లనాటి ఫ్రెంచి కామిక్ బుక్ పాత్ర. అది టీవీ సిరీస్ గా కూడా పాపులరైంది. ఇరవై ఏళ్ల నాడు దాని హక్కులు ఓ ఫ్రెంచి నిర్మాత కొనుక్కుని ఫ్రెంచ్ జేమ్స్ బాండ్ సినిమాలు తీయాలనుకున్నాడు. కానీ చనిపోయాడు. 2008 లో జెరోమ్  సాల్ దాన్ని సినిమాగా తీశాడు - ఫక్తు యాక్షన్ థ్రిల్లర్ గా. అక్కడి చిన్న మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని తక్కువ బడ్జెట్లో. హాంగ్ కాంగ్ లో తీసిన యాక్షన్ సీన్లు లొకేషన్ పర్మిషన్ తీసుకోకుండా, పోలీసులు వస్తూంటే ఎలర్ట్ చేయడానికి మనుషుల్ని పెట్టుకుని మరీ లాగించేశారు. ఈ మూవీ మీద వెలువడ్డ రివ్యూలు ఏమంత బాగా కూడా లేవు. 

ఎవరెలా చేశారు 
         పవన్ కళ్యాణ్ వైభోగం అనుభవించారు. అసలే ప్రిన్స్ ఇన్ ఎగ్జైల్ అని ట్యాగ్ లైన్ కాబట్టి, అందుకు తగ్గట్టుగానే రాకుమారుడి అందచందాలతో సుకుమారంగా కన్పిస్తూ,  అదిరిపోయే విజువల్స్ తో రాజభోగా లనుభవించారు. పవర్ స్టార్ ని ఇలా చూపెట్టిన కెమెరా మాన్ నిజంగా గొప్పవాడు. పాటల్లో అలా అలా పైపైన స్టెప్పు లేసినా, ఫైట్స్ లో చెమట పట్టకుండా అలా అలా కొట్టేసినా, హీరోయిన్లతో రోమాన్సు పైపైన అలా టచ్ చేసి వదిలేసినా, చివరి దృశ్యంలో ఖుష్బూ తో పొడిపొడి మదర్ సెంటిమెంటు డైలాగులు పైపైన చెప్పేసినా,  అదే పదివేలు అభిమానులకి. ఇక పాత్ర తీరుకొస్తే, తండ్రిని చంపిందెవరో తెలుసుకోమని అజ్ఞాతంలో వున్న తనని మారు తల్లి ఖుష్బూ పిలిపిస్తే వచ్చి- డామినేటింగ్ గా, అందర్నీ దడదడ లాడించాల్సిన పవర్ స్టార్ ఇమేజిని పూర్తిగా పక్కన బెట్టేసి, సీన్లని క్రేజీ సీన్లుగా మార్చెయ్యడం మానేసి, ఎంతో  అందమైన రాంగ్ స్ట్రాటజీ తో ఆడపిల్లలా అభినయించారు దాదాపు సినిమా అంతా. ఆడపిల్లలా సిగ్గులుపోవడం, కోపం తెచ్చుకోవడం, వంకర్లుపోతూ, హొయలు పోతూ ముద్దుముద్దుగా, గోముగా మాట్లాడ్డం...చేస్తూ  చాలా కొత్తగా కన్పించారు సినిమా అంతా. 

          ఇక ఇద్దరు హీరోయిన్లు
కీర్తీ సురేష్, అనూ ఇమాన్యుయేల్ లు రాకుమారుడంత సహజ గ్లామర్ తో కాక,   కృత్రిమ అందాలన్నట్టు కన్పిస్తారు. వీళ్ళని చూస్తే రాకుమారుడికి ఎలా రోమాన్సు  పుడుతుందో అర్ధంగాదు.  కానీ ఇదికూడా చల్తా హై పండగపూట. ఖుష్బూ కూడా జాతీయ ఛానెల్స్ డిబేట్స్ లో ఆదరగొట్టినంత స్ట్రాంగ్ వుమన్ గా కన్పించక విషాదమయిగా, బోరుగా   కన్పించడం దేనికో అర్ధంగాదు. విలన్ ఆది పినిశెట్టి మాత్రం పవర్ఫుల్  పాత్రగా కన్పిస్తాడు  తన కున్న కంపెనీని కాజెయ్యాలన్న  బలమైన లక్ష్యంకొద్దీ. బొమన్ ఇరానీ ప్రారంభ సీనులో చనిపోయి ఫ్లాష్ బ్యాక్ లో కన్పించే పాత్ర. మిగతా సినిమా కంటే అతడి ఫ్లాష్ బ్యాక్, అతడి పాత్రే బావున్నాయి. 

          ఇకపోతే శర్మ, వర్మ అంటూ పాత అల్లురామలింగయ్య- సత్యనారాయణల జంటలా కాలం చెల్లిపోయిన కామెడీతో  సింహ భాగం సినిమాని  ఆక్రమించి,  హింస పెట్టడంలో రావురమేష్, మురళీ శర్మలది ఆరితేరిన నటన. వీళ్ళు ఇలాటి పాత్రలు మళ్ళీ మళ్ళీ చేసి వెయ్యేళ్ళు వెనక్కి తీసికెళ్ళాలి. 

          సాంకేతికంగా అద్భుతంగా వుండకుండా ఎలావుంటుంది. రిచ్ గా తీశారు. లొకేషన్స్ గ్రాండ్ గా వున్నాయి. కళ్ళప్పగించి అలా అలా చూసేయడమే. 

చివరికేమిటి 
        ఈ స్ట్రాటజీయే కరెక్టు. పండగ సినిమా ఇంతకంటే గొప్పగా వుండనవసరం లేదు. పండగ సీజన్ ని దృష్టిలో పెట్టుకుని తీసే స్టార్ సినిమాలకి ఈ స్థాయి సరిపోతుంది. విషయం గురించి పెద్దగా పట్టించుకోకుండా, పాత విషయంతోనే విజువల్ హంగామా చేస్తే చాలు. పండగ రోజుకూడా పాత మొగుడేనా అని ప్రేక్షకులనుకోరు. ఓ పదికోట్లున్న తెలుగు ప్రజల్లో పండగ రోజుల్లో ఓ కోటి మంది చూసినా 100 కోట్లు వచ్చేస్తాయి. పండగ రోజుల్లో సినిమా చూడకపోతే పండగ పూర్తయినట్టు కాదు కాబట్టి  - ఒకవేళ స్టార్ సినిమాలు కాక,  చిన్న సినిమాలు విడుదలైనా బ్రహ్మాండంగా ఆడేస్తాయి. ఇదే ‘అజ్ఞాతవాసి’ ని ‘కాటమ రాయుడు’ లా అన్ సీజన్లో విడుదల చేస్తే అట్టర్ ఫ్లాపవుతుంది. విషయం లేని పండగ సినిమాలతో బయ్యర్లు కూడా బయటపడతారు. ఏమిటీ ఇలాటి ఫూలిష్ సినిమా తీశామా అని ఫీలవనవసరం లేదు. ఆ యెత్తున చూస్తున్న పండగ ప్రేక్షకులు ఫూల్స్ ఏమీ కారు. పండగ సినిమాకి క్రియేటివ్ యాస్పెక్ట్ అవసరం లేదు, మార్కెట్ యాస్పెక్ట్ సరిపోతుంది. కాబట్టి ఈ బ్యాడ్ రైటింగ్ ని చూసి ఆశ్చర్య పడనవసరం లేదు. 

          క్రియేటివిటీ తక్కువ వున్నప్పుడు ఎక్కువ ఆలోచన చెయ్యకూడదని తనికెళ్ళ పలికే పలాయన వాద డైలాగు వుందిందులో. కాబట్టి క్రియేటివిటీ తగ్గినప్పుడు పండగల్ని దృష్టిలో పెట్టుకుని పండగ సినిమాలు మాత్రమే తీస్తే బతికిపోతారు. ఇంకో డైలాగు వుంది – కొత్త ఐడియా రాకపోతే వచ్చిన అయిడియానే కొత్తగా చెయ్యాలని. ఈ కథా రచనతో తనపాట్లు తను పడాల్సిన పరిస్థితి డైలాగుల రూపంలో సినిమాలో కెందు కెక్కాలో అర్ధంగాదు. ఈ  డైలాగులతో ప్రేక్షకుల కేం సంబంధం? హోటలతను ఇంత చాకిరీ చేసి మీకు తిండి పెడుతున్నానని చెప్పుకుంటాడా? సిల్వర్ లైనింగ్ ఏమిటంటే,  ఇలా ఆఫ్ స్క్రీన్ డైలాగులు వాడిన  సినిమాలు ఫ్లాపయ్యాయి. 

          బాగా డబ్బు గడించాక  కొత్త ఐడియాలే రాని వాళ్ళుంటారు. డబ్బు దెబ్బ వడదెబ్బ లాంటిది. అక్కడ డబ్బు కళకి అడ్డుపడ్డం మొదలెడుతుంది. అప్పుడు కెరీర్ ప్రారంభ దినాల్లో  తన కళని  హీరోలు,  నిర్మాతలు ఎందుకు చంపేసేవారో తెలిసివస్తుంది. అదే చక్రభ్రమణంలో తనూ పడిపోతాడు. అప్పుడు ఇలాటి డైలాగులే బయటపడతాయి. కొత్త అయిడియాలు రాకపోతే పదికోట్లు తీసుకోవడమెందుకన్న సందేహం  ప్రేక్షకులకి రాకుండా వుంటుందా ఇలాటి డైలాగులకి. అందరూ వందలకోట్లు గడించిన రాజూ హిరానీలా వుండలేరు, రాజమౌళిలా వుండలేరు. 

          కొత్త అయిడియా రాకపోతే వచ్చిన అయిడియానే కొత్తగా చెయ్యవచ్చు- కనీసం ఈ కాలం చెల్లిన పాత మూస కామెడీ డ్రామా విషయంలో. కొత్తగా మైండ్ లెస్ కామెడీ చేసి – ‘గోల్ మాల్ -4’ లో రోహిత్ శెట్టి చేసినట్టు,  సినిమా సాంతం పడీపడీ నవ్వేలా చేసి బైటికి వెళ్ళ గొట్టచ్చు ప్రేక్షకుల్ని ఎంతో ఆధార్టీగా. ‘అజ్ఞాత వాసి’ లో వచ్చిన ఐడియాని కొత్తగా ఏం చేశారు. కాబట్టి పండగ సినిమాకి ఏ శ్రమా అవసరం లేదు. ఓ పది సీన్లు ప్రేక్షకుల్ని అలరిస్తే చాలు మొత్తం బ్రహ్మాండంగా కన్పిస్తుంది. అది కార్పొరేట్ ఆఫీసు అన్న స్పృహ లేకుండా దుకాణం పెట్టి,  సైకిల్ మీద తిరుగుతూ బెల్టుతో కొట్టే ఓ దృశ్యం, కొడకా అనే ఓ పాటా, హీరో కోసం హీరోహీరోయిన్లు జుట్లు పట్టుకుని కొట్టుకునే ఇంకో దృశ్యం, ప్రారంభంలో పవన్ ఎంట్రీ సీను, రావు రమేష్ కి చెయ్యి పడిపోతే అతను చేసే కామెడీ ...ఇలా ఓ పది సీన్లతో బాటు,  పదికోట్లు- కొత్త నోట్లు, సింహం పార్టీ ఇస్తే జింక జీన్స్ ప్యాంటు వేసుకెళ్ళిందట – లాంటి ఓ నాల్గైదు డైలాగులూ  ప్రేక్షకులు బాగా ఎంజాయ్ చేశారు.  మిగిలిన కథ లేని సీన్లు ఎంత బోరు కొట్టినా, హీరోయిన్లతో లవ్ ట్రాకులు ఎంత చప్పగా వున్నా, తండ్రిని చంపిన పగ హీరో మర్చిపోయినా, పవన్ కళ్యాణ్ ట్రాకు తప్పి చంటబ్బాయ్ లా నటించినా కవరై పోయాయి. ఇదీ పండగ సినిమా టెంప్లెట్. పండక్కి సినిమా చూశామా లేదా ముఖ్యం, మిగతా క్వాలిటీ గ్వీలిటీ అనవసర విషయాలు.

-సికిందర్