రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

10, డిసెంబర్ 2017, ఆదివారం

563 : టీనేజి నోయర్ స్క్రీన్ ప్లే సంగతులు!

       బిగినింగ్ విభాగానికి – ఆ మాటకొస్తే మొత్తం స్క్రీన్ ప్లేలో కథకి -  ప్లాట్ పాయింట్ వన్ (పిపి-1) సీను అనేది  మూలస్థంభం లాంటిదని తెలిసిందే. ఈ మూలస్థంభం సీనుని ఆధారంగా చేసుకునే కథ ఇక్కడ్నించీ  ప్రారంభమవుతుందనీ, కథని ప్రారంభించేందుకు ఈ మూలస్థంభం సీనులో ఒక మలుపు వుంటుందనీ, ఈ మలుపులోనే కథలో చెప్పదల్చు కున్న పాయింటు లేదా సమస్య వ్యక్తమవుతుందనీ, దీన్ని సాధించడమే ప్రధానపాత్ర గోల్ అవుతుందనీ తెలిసిందే. ఇది బిగినింగ్ విభాగం ప్రారంభమైన సుమారు అరగంటకి రావొచ్చు. అరగంటకి కాకుండా మొదటి నిమిషంలోనే వచ్చేస్తే?
         
మొదటి నిమిషంలోనే కథలో పాయింటు, ప్రధాన పాత్ర గోల్ చెప్పేస్తే? ఎలా చెప్తారు? బిగినింగే ప్రారంభించకుండా, పాత్రలేమిటో తెలపకుండా కథెలా ప్రారంభిస్తారు? కనీసం ఓ పదినిమిషాలైనా బిగినింగ్ ని నడుపుతూ పాత్రల్ని పరిచయం చేసి, వాటిని సమస్యలో పడేసే ఘట్టాన్ని  సృష్టిస్తూ,  పిపి-1 ఇచ్చుకునే స్క్రీన్  ప్లేలు వుంటాయేమో గానీ (దొంగాట, చక్కిలిగింత),  ఏకంగా పిపి-1 సీనుతోనే స్క్రీన్ ప్లే ప్రారంభించడమనేది ఎప్పుడోగానీ జరగదు. ‘అర్జున్’ లో జరిగింది. మహేష్ బాబు కత్తి పట్టుకుని కూర్చునే పిపి-1 సీనుతో, దాని తాలూకు ఫైట్ తో. ఇది ముగిశాక, అసలేం జరిగి ఈ ఫైట్ వచ్చిందో తెలిపేందుకు బిగినింగ్ విభాగం ప్రారంభమవుతుంది వెనక్కి వెళ్తూ ఫ్లాష్ బ్యాక్ పద్ధతిలో. ఇది గంటా ఇరవై  నిమిషాల దాకా సాగి అప్పుడు ప్రారంభంలో చూపించిన పిపి-1 సీను దగ్గర వచ్చి కలుస్తుంది.

          అంటే పిపి-1 తో స్క్రీన్ ప్లే ప్రారంభించాలంటే బిగినింగ్ ని ఫ్లాష్ బ్యాక్ లో చెప్పక తప్పదన్న మాట. ఇది చాలా నయం. ఎందుకంటే, దీని తర్వాత మిడిల్ విభాగం వుండాల్సిన నిడివితోనే వుండి దాని నిర్వహణ కష్టం కాదు. మిడిల్ బారుగా రెండింతలు పెరిగిపోయి సాగితేనే నిర్వహణ కష్టమై తేలిపోతుంది. 

          ఇలా పిపి -1 తో ప్రారంభించకుండా,  పైన చెప్పుకున్నట్టు ఓ పదినిమిషాల్లో బిగినింగ్ ని ముగించి,  పిపి-1 కొస్తేనే మిడిల్ కష్టమవుతుంది. ‘చక్కిలిగింత’ లో చేసిన  పొరపాటు ఇదే. మొదటి పది నిమిషాల్లోనే  పాయింటు కొచ్చేసి (పిపి-1),  మిడిల్ ప్రారంభిస్తే ఇంటర్వెల్ కల్లా చెప్పాల్సిన కథ పూర్తయిపోయింది.  దీంతో ఫస్టాఫ్ లో మొదలెట్టి ఇలా అవగొట్టిన పిపి-1 కి,  సెకండాఫ్ లో ఇంకేదో పాయింటు జోడించారు.  దీంతో  సెకండాఫ్ సిండ్రోమ్ లో పడి   మొత్తం కథే గందరగోళమైంది. 

          ఓ గంట నిడివితో నిర్వహణ సుసాధ్యమయ్యే మిడిల్ ని రెండు గంటలు సాగదీసుకుంటే ఇదీ జరుగవచ్చు.  పదినిమిషాల్లో పిపి-1 అనేది హాలీవుడ్ సినిమాలకి, అదీ గంటన్నర సినిమాలకీ  పనికొస్తుంది. ఇప్పుడు హాలీవుడ్  సినిమాలు కూడా రెండు గంటలకి తక్కువ రావడం లేదు. ‘మర్డర్ ఆన్ ది ఓరియెంట్ ఎక్స్ ప్రెస్’  రెండు గంటల నిడివిగల సినిమాకి,  పిపి-1 పది నిమిషాల్లో  రాదు, మన సినిమాల్లాగే ముప్పావు గంట కొస్తుంది.  

          ఈ తేడా గమనించాలి : స్క్రీన్ ప్లేని పిపి – 1 సీనుతో ప్రారంభిస్తే, దీని కొనసాగింపుగా  చెప్పాల్సింది ఓ అరగంట బిగినింగ్ విభాగమే, అదీ ఫ్లాష్ బ్యాకులో. ఈ ఫ్లాష్ బ్యాక్ మళ్ళీ మొదలు పెట్టిన పిపి – 1 దగ్గరికే వచ్చి ముగుస్తుంది. అదే స్క్రీన్ ప్లేని నేరుగా బిగినింగ్ తో ప్రారంభించి, ఓ పది నిమిషాల్లో పిపి – 1 కొచ్చి ముగిస్తే, ఆపైన కొనసాగించాల్సింది  చాలా బారుగా  సాగే రెండు గంటల మిడిల్ ని! మొదటిది సులభం, ఈ రెండోది చాలా కష్టం. 

          పిపి – 1 ఎప్పుడూ స్క్రీన్ ప్లేకి, అందులోని కథకి ముఖచిత్రం లాంటిది. స్క్రీన్ ప్లేలో పిపి – 1 ని ఎప్పుడు ప్రారంభించినా, దాని  ప్రాధాన్యాన్ని ఇలా గుర్తించగల్గి నప్పుడే స్క్రీన్ ప్లే, అందులోని కథా సచిత్రంగా వుంటాయి, లేకపోతే  విచిత్రంగా వుంటాయి. 

      ఐతే మళ్ళీ ఇలా పిపి – 1 తో స్క్రీన్ ప్లేని ప్రారంభించడంలో రెండు రకాలున్నాయి. ఉదాహరణకి పైన చెప్పుకున్న ‘అర్జున్’ నే తీసుకుంటే, ఈ  పిపి – 1 తో ప్రారంభం కత్తి పట్టుకుని కూర్చున్న మహేష్ బాబు తో యాక్షన్ కి సిద్ధమైన పరిస్థితితో  వుంది. దేనికి యాక్షన్, మహేష్ బాబుకేం జరిగింది, మనకి తెలియకుండా వుంది. ఈ సీను కొనసాగి, ఫైటింగ్ జరిగి, ఫ్లాష్ బ్యాక్ మొదలై, ఆ బిగినింగ్ అంతా గంటకి పైగా నడిస్తేగానీ మనకి అర్ధంగాదు - పిపి – 1 దగ్గర ఏర్పడ్డ పరిస్థితి ఏమిటో. అంటే ఇది ముఖచిత్రమే గానీ పూర్తి ముఖచిత్రం కాదు. వివరాలకు లోపలి పేజీల్లో చూడండి అన్నట్టు వుంది. ఇలా ఈ పిపి – 1 తో స్క్రీన్ ప్లే ప్రారంభంలోనే మనకి సమస్యేమిటో తెలీదు, దాంతో మహేష్ బాబు గోల్ ఏమిటో తెలీదు, దీంతో కథేమిటో తెలీదు. కేవలం సస్పెన్స్ ని క్రియేట్ చేయడం కోసం తప్ప మరో ప్రయోజనం దీనికుండదు. ఈ సస్పెన్స్ కూడా విషయం తెలీని సస్పెన్సే. అందుకని ఇది పూర్తి  ముఖచిత్రం అన్పించుకోదు. 

          ఇక రెండో రకం చూద్దాం : పిపి – 1 సీనుతో స్క్రీన్ ప్లే మొదటి నిమిషం లోనే హీరోయిన్ చచ్చిపడి వుండి  కన్పిస్తే?  హీరో ఉద్రేకంగానో, విషాదంగానో ఆమెని చూస్తూంటే? అప్పుడెలా వుంటుంది? పిపి – 1 సీను పరిపూర్ణంగా ముగిసి వుంటుంది. ఇంకా ఈ సీనులో చెప్పడానికి బ్యాలెన్సు ఏమీ లేదు. సమస్య ఇదీ అనీ,  హీరో గోల్ ఇక ఆ చంపిన వాణ్ణి పట్టుకోవడమేననీ,  ఇదీ కథా అనీ, ఈ ఒక్క షాట్ తో  మనకి మొత్తమంతా అర్ధమైపోతోంది. అందువల్ల ఇది సంపూర్ణ ముఖచిత్రం అవుతుంది -  స్క్రీన్ ప్లేకీ, అందులో పాలు పంచుకునే కథకీ.

          సినిమాకి ఓపెనింగ్ ఇమేజి అనేది, లేదా ఓపెనింగ్ టీజర్ అనేది హాలీవుడ్ వాళ్ళు అనుసరిస్తున్న పధ్ధతి. (ఇక్కడ క్లిక్ చేయండి) హీరోయిన్ చచ్చి పడి వుండి కన్పించే దృశ్యమంత బలమైన ఓపెనింగ్ ఇమేజి, లేదా ఓపెనింగ్ టీజర్ ఏముంటుంది? (ఇక్కడ క్లిక్ చేయండి) నిజమే, ముందే హీరోయిన్ ని చంపి చూపిస్తే ఆతర్వాత ఫ్లాష్ బ్యాక్ లో ఆమె రోమాంటిక్ సీన్స్ ని ఏం  ఎంజాయ్ చేస్తాం, ఎలాగూ  చచ్చిపోయేదే అని తెలిశాక మనం ఎంజాయ్ చేయలేమనుకోవడం కరక్టే. అందుకని ఈ రకమైన పిపి – 1 తో సినిమా ప్రారంభం బెడిసి కొడుతుందని సందేహం రావడమూ  కరెక్టే. 

          మళ్ళీ ఇక్కడ రెండున్నాయి :  హీరోయిన్ డెడ్ బాడీని మాత్రమే చూపించడం, హీరోయిన్ ని చంపుతున్నప్పుడు చూపించడం.  ఈ రెండోది చూపిస్తే పైన  అనుకున్నట్టు ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ లో ఆమె రోమాన్స్ ని ఎంజాయ్ చేయడం కష్టమే కావచ్చు. మొదటిది చూపిస్తే, కేవలం ఆ డెడ్ బాడీతో అంత జుగుప్సాకర ఫీలింగ్ ఏర్పడదు. 

       ‘ఏక్ విలన్’ (2014)  అనే హిందీలో హీరోయిన్  శ్రద్ధాకపూర్ ని దారుణంగా చంపి బిల్డింగ్ పై నుంచి విసిరేసే బీభత్సం వుంటుంది. ఇది పిపి -1 తో చేసిన స్క్రీన్ ప్లే ప్రారంభం. ఇది పూర్తి ముఖచిత్రమే గానీ,  మరీ గ్రాఫికల్ గా వుండేసరికి-  ఆమెతో ఈ బీభత్సం మనసులో ముద్రేసుకుని,  ఆతర్వాత ఫ్లాష్ బ్యాక్ ఆస్వాదన కష్టమే అవుతుంది. ఇది రాంగ్ ఓపెనింగ్. దీనిగురించే  సందేహపడాలి.

          ఇలాకాక, కేవలం హీరోయిన్ డెడ్  బాడీనే  చూపిస్తూ,  పిపి- 1 తో ప్రారంభమయ్యేదే ‘బ్రిక్’  స్క్రీన్ ప్లే!  ఫీల్ చెడకుండా కథేమిటో ఈ ఒక్క ఓపెనింగ్ ఇమేజితో –పరిపూర్ణ ముఖచిత్రంతో చెప్పేశారు!

         
ఎందుకిలా చూపించాలి, ఇలా చూపిస్తే స్క్రీన్ ప్లేకి ఒనగూడిన ప్రయోజనమేమిటి అనే ప్రశ్నలకి సమాధాణాలు వన్ లైన్ ఆర్డర్ చూసుకుంటూ పోతే దొరుకుతాయి. అయితే టీనేజి నోయర్ కథల్ని ఇలాగే ప్రారంభించాలని లేదు. ఈ కథ ఇలా ప్రారంభించారంతే. బిగినింగ్ ని బట్టి, ఆ బిగినింగ్ కథనానికుండే  బలాబలాల్ని బట్టి ప్రారంభాలుండొచ్చు. అన్నిసార్లూ బిగినింగ్ కథనాలు బలంగానే రావాలని లేదు. రాకపోతే బలవంతంచేసి సీన్లు ఇరికించనే కూడదు. ఇరవై సీన్ల తర్వాత వచ్చే పిపి -1 సీను బిగినింగ్ కథనాన్ని డిసైడ్ చేస్తుంది. దానికనుగుణమైన సీన్లే పడతాయి తప్ప,  అవి బలహీనంగా వున్నాయని వేరే సీన్లు పడవు. ‘బ్రిక్’ లో బిగినింగ్ బలహీనతని జయించడానికే బలమైన పిపి -1 సీను ముఖచిత్రంగా వేసి, విషయం చెప్పేస్తూ  స్క్రీన్ ప్లే ప్రారంభించారని, ఈ క్రింద వన్ లైన్  ఆర్డర్ చూసుకుంటూ పోతే తెలుస్తుంది...

వన్ లైన్ ఆర్డర్ 
         1. సూపర్ మెయిన్ టైటిల్స్. 
          2. టనెల్ దగ్గర కూర్చుని ఎమిలీ శవాన్ని చూస్తూ బ్రెండన్.
          3. రెండు రోజుల క్రితమని టైటిల్ కార్డు.
          4. హై స్కూల్ లాకర్ రూంలో బ్రెండన్ కి చీటీ దొరకడం.
          5. చీటీ ప్రకారం ఫోన్ బూత్ కెళ్ళి ఎమిలీ కాల్ రిసీవ్ చేసుకోవడం, ఆమె తనని కాపాడమని కోరడం; టగ్, పిన్ అని సంకేతపదాలు చెప్పడం.
          6. బ్రెండన్ హై స్కూలో ఫ్రెండ్ బ్రయిన్ ని కలిసి ఎమిలీ ఆచూకీ గురించి అడగడం, తెలీదని బ్రయిన్ అనడం.
          7. తిరిగి లాకర్ తెర్చుకోవడం.
          8. జిమ్ వెనకాల బ్రెండన్ ఎమిలీ ఫోటో చూస్తూ కూర్చోవడం.
          9. స్కూలు విడిచిన విద్యార్థులు వెళ్ళిపోవడం.
          10. స్కూల్ థియేటర్లో బ్రెండన్ కారాని కలిసి ఎమిలీ గురించి అడిగితే  ఆమె చెప్పకపోవడం, డ్రెస్సింగ్ రూంలో బ్రెండన్ కి ఒక ఇన్విటేషన్ దొరకడం.
          11. తన రూంనుంచి బ్రెండన్ లారాకి కాల్ చేసి ఇన్విటేషన్ ప్రకారం పార్టీకి తనొస్తానంటే, ఆమె అడ్రసు చెప్పక పోవడం.
          12. పార్టీ జరిగే ప్లేస్ ని కనిపెట్టి బ్రెండన్ వెళ్లి లారాని పట్టుకోవడం, ఎమిలీ గురించి లారా తెలీదనడం, ఇప్పుడే వస్తానని వెళ్ళిన ఆమెని బ్రెండన్ ఫాలో అవడం.
          13. బయట ఒక నల్లటి ఆకారంతో లారా మాటాడుతోంటే బ్రెండన్ చూడ్డం, లారా తిరిగి వచ్చి డ్రింక్ తాగెయ్యడం.
          14. ఉదయం బ్రెండన్ డోడ్ ని కలిసి ఎమిలీ గురించి అడిగితే అతను కూడా తెలీదనడం. అతడి నేస్తాలు బ్రెండన్ తో తలపడడం, వాళ్ళని చిత్తు చేసి, లంచ్ దగ్గర తనని కలవమని ఎమిలీకి చెప్పమంటూ డోడ్ కి బ్రెండన్ సీరియస్ గా చెప్పడం.
          15. డోడ్ ని బ్రెండన్ ఫాలో అవడం, ఒక కారు దగ్గర ఆమెకి డోడ్ ఒక చీటీ అందించడం, వెళ్ళిపోతున్న ఆ కారువెంట బ్రెండన్ పడడం.
          16. స్కూలు థియేటర్ వరకూ బ్రెండన్ డోడ్ ని ఫాలో అవడం.
          17. స్కూలు వెనకాల లంచ్ చేస్తున్న బ్రెండన్ దగ్గరికి ఎమిలీ రావడం.
          18. ఏదో తొందర పడి నీకలా చెప్పాను, ఇప్పుడు ప్రమాదమేమీలేదు, నువ్వేం వర్రీ అవకని బ్రెండన్ తో ఎమిలీ అనడం, ఇలా డోడ్ చెప్పమన్నాడా అంటే, నువ్విలా ఆలోచిస్తావనే నీకు బ్రేకప్ చెప్పానని ఆమె అనడం, కనీసం టగ్ ఏంటి,  పిన్ ఏంటి చెప్పమంటే కూడా చెప్పకుండా వెళ్ళిపోవడం, వెళ్ళిపోతూ అడ్రసు బుక్ పడేసుకోవడం.
          19. క్లాస్ రూంలో కూర్చుని బ్రెండన్ అడ్రసు బుక్ చూస్తూంటే, అందులో డోడ్ ఆమెకిచ్చిన చీటీ కన్పించడం, ఆ చీటీమీదున్న సింబల్ కేసే బ్రెండన్ తీక్షణంగా చూడడం.
          20. బ్రయిన్ కి సింబల్ చూపించి బ్రెండన్ అడిగితే, అతను చెప్పకపోవడం, ఎమిలీ ఇక జోక్యం చేసుకోవద్దన్నప్పుడు వూరుకోవడమే బెటరనడం.
          21. ఆ సింబల్ నే చూస్తూ నిద్ర లోకి జారుకున్న బ్రెండన్ కి పీడకల రావడం.
          22. తెల్లారే బ్రెండన్ టనెల్ కేసి పరుగెత్తడం, అక్కడ ఎమిలీ శవాన్ని చూడడం
(pp - 1)

(సశేషం)

సికిందర్  

9, డిసెంబర్ 2017, శనివారం

562 : సందేహాలు - సమాధానాలు




Q :    మా రోమాంటిక్ కామెడీ నిర్మాణం పూర్తయి విడుదలకి సిద్ధమవుతోంది. టైటిల్ ని మీరే సరిదిద్దారు. రోమాంటిక్ కామెడీల గురించి మీరు చెప్పే థియరీలు మేం పాటించలేదు. ఒకరు చెప్పింది పాటించాలంటే ప్రాబ్లం వస్తోంది. ఎవరికి వచ్చింది, నచ్చింది  వారు రాసుకుని  తీసుకునే స్వేచ్ఛ లేదా? రోమాంటిక్ కామెడీలని మీరెందుకు అంత చిన్న చూపు చూస్తారు?
- శ్రీనివాస్ ఆర్,  కో- డైరెక్టర్
A
:    మీ హిందీలో పెట్టిన  టైటిల్ తెలుగు అక్షరాలు సరిచేయమంటే సరిచేశామంతే. మీ రోమాంటిక్ కామెడీ సబ్జెక్ట్ ఏమిటో తెలీదు. ఇన్ని సంవత్సరాల పరిచయంలో మీరెన్నో సబ్జెక్టులు చెప్పారు, దీని గురించి చెప్పలేదు, మనం అడగలేదు. చెప్పడం మీ చేతిలో లేకపోవచ్చు. ఐతే ఈ బ్లాగులో సొంత థియరీలు చెప్పడం లేదు. ఎవరో ప్రూవ్ చేసుకున్న మేధావులు చెప్పినవి, చెబుతూ వున్నవీ  మాత్రమే తెలుగుకి పరీక్షించి నాణ్యమైనవి చేరవేస్తున్నామంతే. పరీక్షించగల్గేంత సొంత తెలివితేటలు మాత్రమే మనకున్నాయి. థియరీలు మనవల్ల కాదు. వాటిని తీసుకోవడం, తీసుకోకపోవడం మీ ఇష్టం. ఐతే ఒకటి – అటు మేధావుల్నీ ఒప్పుకోక, ఇటు రివ్యూ రైటర్లనీ ఒప్పుకోక సాధిస్తున్నదేమిటి?  90 శాతానికి  పైగా అట్టర్ ఫ్లాపులేగా?  ఒకటేమిటంటే- అర్ధవంతమైన స్వేచ్ఛ, అనర్ధదాయకమైన స్వేచ్ఛ అని రెండుంటాయి. మీరు గుండెల మీద చెయ్యేసుకుని చెప్పండి, మీదే స్వేచ్ఛ? అర్ధవంతమైన స్వేచ్చే అయితే ఇన్నేళ్ళుగా తీస్తున్న రోమాంటిక్ కామెడీలన్నీ బాక్సాఫీసు దగ్గర ఎందుకు తన్నేస్తున్నాయి? ఇలాటి స్వేచ్ఛ మీదే చిన్నచూపు తప్ప, రోమాంటిక్ కామెడీల మీద కాదు. రోమాంటిక్ కామెడీల్ని ఎంత బాగా ఎప్పుడు ఎంజాయ్ చేయవచ్చంటే, ఒక ‘హేపీ భాగ్ జాయేగీ’  లాగా, ఒక ‘బరేలీకి బర్ఫీ’ లాగా, ఒక ‘ఖరీబ్ ఖరీబ్ సింగిల్’ లాగా, ఆఖరికి ‘అహ నాపెళ్ళంట’ లాగా తీయగల్గినప్పుడు! రాసుకునే, తీసుకునే స్వేచ్ఛ అంటూ ఇవాళ్టి తెలుగు దర్శకులు పక్కన పెడుతున్న రోమాంటిక్ కామెడీ జానర్ థియరీ పాలన అంతా ఈ హిట్టయిన  రోమాంటిక్ కామెడీల్లో వుందంటే నమ్ముతారా?  థియరీల్నిఅంగీకరించే మనసున్నప్పుడే  అర్ధవంతమైన స్వేచ్ఛ అనుభవంలో కొచ్చి, ఏవో మంచి పనులు చేయగల్గుతాం. స్వేచ్ఛ స్వతంత్రంగా వుండదు, అది సాపేక్ష పదం.
Q :    కథకి అదెక్కడ జరుగుతోందో ప్రాంతాన్ని / లొకేషన్ ని  తెలియజేసే అవసరముంటుందా?
-దిలీప్ కుమార్,  ఈఎఫ్ఎల్ యూనివర్సిటీ
 
A :   ప్రొడక్షన్ రీత్యా అవసరమే. సీను పేపరు మీద ప్రాంతం / లొకేషన్ రాసినప్పుడే అదెక్కడ తీయాలో తెలుస్తుంది. కథాపరంగా అయితే తప్పనిసరి కాదు. ఎన్నో కథలు, నవలలు ఆ  ఇతివృత్తాలు నడిచే ప్రాంతాల్ని తెలపకుండానే వస్తూంటాయి. ఐతే సినిమా కథల్లో  ప్రాంతం పేరు ప్రస్తావిస్తే, ఆ ప్రాంతానికి వెళ్లి తీయక తప్పదు. పాత్ర జూబ్లీ హిల్స్ వెళ్తున్నానని చెప్తే, దాని వెంట వెళ్లి జూబ్లీ హిల్స్ చూపించాల్సిందే – అక్కడ సీను అవసరముంటే. ఒకవేళ పాత్ర జూబ్లీ హిల్స్ వెళ్తున్నానని చెప్పివెళ్లి, తర్వాత వచ్చి పడుకుంటే జూబ్లీ హిల్స్ వెళ్లి వచ్చినట్టే  అర్ధం వస్తుంది. ‘అది రాజోలు పట్టణం’  అని అక్షరాలేస్తే మాత్రం,  రాజోలు చూపించాల్సిందే. పాత్రని ఒక రిచ్ అపార్ట్ మెంట్ ఇంటీరియర్ లో చూపిస్తూ,  అది అమెరికాలో వున్నట్టు చెప్పి చీట్ చేయవచ్చు. ఫారిన్ లో పాటలు తీస్తే, ఆ దేశాల పేర్లు వేస్తే  నవ్వుకుంటారు ప్రేక్షకులు. ఫారిన్లో కథ నడుస్తూంటే దేశం పేరు చెప్పాలి తప్పదు. ఐతే కథ రాసేటప్పుడు ప్రాంతాల్ని/ లొకేషన్స్ ని బడ్జెట్టే నిర్ణయిస్తుంది. కోటి రూపాయలతో తీసే కథకి జూబ్లీ హిల్స్ సీన్లు రాస్తే ఐదు కోట్లు బడ్జెట్ అవుతుంది. హీరో చీప్ లొకేషన్ అనుకుని బతుకమ్మ కుంట వెళ్తున్నానని చెప్పినా కష్టమే. షూటింగ్ అయ్యేసరికి నల్లకుంట నాలా అవుతుంది బ్యానర్ పరిస్థితి. బడ్జెట్ భారీగా వుంటే ఎలాగూ బతుకమ్మ కుంట సెట్ వేస్తారు. కథ ఫలానా ప్రాంతంలో జరుగుతున్నట్టు రిజిస్టర్ చేయాలి తప్పదనుకున్నప్పుడు ఈ ప్రశ్నలుంటాయి-  దేనికి? కథ డిమాండ్ చేస్తోందా లేక కథకుడు సొంత కోరికలు పెట్టుకున్నాడా? (సొంత వూళ్ళో తీసుకోవాలని ఉబలాటంగా వుంటుంది), కథ డిమాండ్ చేయకపోయినా, కథని అక్కడ తీస్తే కథకే సొగసు వస్తుందా? (ఈవీవీ సత్యనారాయణ ‘చెవిలో పువ్వు’ గుంటూరులో తీస్తే కథకి ఆ నేటివిటీ, ఫీల్ ప్లస్ అయ్యాయి),  ఇతర సినిమాలు ఆ ప్రాంతాల్లో తీశారనా? ( మలయాళ సినిమాలు గ్రామాల్లో తీయాలంటే ముందు ఆ గ్రామాలు చూసి సీన్లకి లొకేషన్స్ డిసైడ్ చేసుకుని ఆ నేపధ్యంలో రాసుకుంటారు. ప్రతీ గ్రామంలో ఏదోవొక లాండ్ మార్క్ స్థలం వుంటుంది. అక్కడ కీలక సన్నివేశాలో, పతాక సన్నివేశమో తీసేలా ప్లాన్ చేస్తారు. అంతవరకూ సినిమాలో ఆ లాండ్ మార్క్ ప్లేసులు ఎక్కడా ఫ్రేములోకి కూడా రాకుండా జాగ్రత్త తీసుకుంటారు).
          మరిన్ని వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి –బడ్జెట్ స్క్రిప్టు  పరిమితులు...


సికిందర్



8, డిసెంబర్ 2017, శుక్రవారం

561 : రివ్యూ!


రచన - దర్శత్వం : గౌతమ్
తారాగణం : సుమంత్, ఆకాంక్షా సింగ్, కిరణ్, కార్తీక్, సాత్విక్, ప్రీతీ తదితరులు
సంగీతం
:  శ్రణ్ రద్వాజ్,   ఛాయాగ్రణం : తీష్ ముత్యాల
బ్యానర్ :   స్వర్మ్ ఎంటర్టైన్మెంట్
నిర్మాత : రాహుల్ యాదవ్ క్క
విడుదల : డిసెంబర్ 8, 2017
***
కథ 
          కార్తీక్ (సుమంత్), అంజలి (ఆకాంక్ష) లు రాజోలులో తొమ్మిదో తరగతి చదువుతూ ప్రేమలో పడతారు. దీంతో ఇద్దరి ఇళ్ళల్లో పేరెంట్స్  గొడవపడతారు. అంజలి తల్లి కార్తీక్ ని ఫెడీ మని కొడుతుంది. అప్పుడు అంజలి వయసుకి మించిన ఇష్టాలు పెంచుకోకూడదని కార్తీక్ కి బ్రేకప్ చెప్పేసి పేరెంట్స్ తో ముంబాయి వెళ్ళిపోతుంది. పదమూడేళ్ళ తర్వాత హైదరాబాద్ లో మళ్ళీ కార్తీక్ ని చూస్తుంది.  ప్రేమని వ్యక్తం చేస్తుంది. ప్రేమని మనసులో దాచుకున్న కార్తీక్ ఓకే చెప్తాడు. పెళ్లి చేసుకోవాలనుకుంటారు. సరీగ్గా పెళ్లి సమయానికి అంజలి వచ్చి, ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పేసి వెళ్ళిపోతుంది. అంజలి ఎందుకిలా చేసింది? కార్తీక్ ని చేసుకోవడం ఆమెకి ఎందుకిష్టం లేదు? ఇది తెలుసుకోవాలంటే మిగతా ‘కథ’ వెండి తెర మీద చూడాల్సిందే.

ఎలావుంది కథ
         కథ కాదు, గాథ. అందులోనూ రోమాంటిక్ డ్రామా జానర్. కాబట్టి కథల్లోలాగా సమస్య – సంఘర్షణ – పరిష్కారం అనే కోణంలో దీన్ని చూడకూడదు. ప్రధాన పాత్రలైన ఇద్దరు ప్రేమికుల మధ్య సంఘర్షణ ఆశించకూడదు. కథల్లో లాగా ఆ సంఘర్షణకి ఒక పరిష్కారం కోసం వెతక్కూడదు. కథల్లోలాగా టెన్షన్ టెంపో థ్రిల్ లాంటివి చూడకూడదు. కథల్లోలాగా పాయింటు ఏమిటని అన్వేషించకూడదు. కమర్షియల్ సినిమాల కథల కుండే ఇవేవీ వుండని, పక్కా  గాథ కుండే లక్షణాలతో, పాత్రల దయనీయ స్థితికి జాలి పడుతూ -  ఈ పాసివ్ పాత్రల్ని మనం కూడా పాసివ్ గా చూస్తూ పోవాల్సిన డ్రామా. దీనినే లైటర్ వీ(ణ)న్ స్టోరీ అనీ, ఫీల్ గుడ్ మూవీ అనీ అంటున్నారు. రెండు వారాల క్రితమే  ‘మెంటల్ మదిలో’ అనే ఇలాటిదే ఫీల్ గుడ్ మూవీ వచ్చి వుండకుండా వెళ్ళిపోయింది రివ్యూల్లో ఎంత వూదరగొట్టినా! (ఆ రివ్యూ రాయలేక ఈ వ్యాసకర్త వూరుకున్నాడు). 

     ఐతే ఈ గాథలో సమస్య ప్రేమికురాలిదే  అయినప్పటికీ ఆ సమస్యకి ఓ అర్ధం కన్పించని చిత్రణని చూస్తాం. 14 ఏళ్ల కౌమార్యంలో ఎట్టకేలకు వయసుకి మించిన ఇష్టాలు పెంచుకోకూడదని తెలుసుకోగల్గిన తనే, పెద్దయ్యాక 27 ఏళ్ల వయసులో వయసుకి తగ్గ మెచ్యూరిటీతో ఎందుకుండదో అర్ధం గాదు. నీ తండ్రి ఎలాంటి వాడో నువ్వు చేసుకోబోయే వాడూ అలాటి వాడేనని తల్లి నూరిపోసినంత మాత్రాన,  నమ్మేసి పెళ్లి వద్దనుకుని వెళ్లి పోతుందా? మళ్ళీ,  ఇది నేను –అది వాడూ  అని తండ్రి ఏదో తేడా చెప్పినంత మాత్రాన,  చేసుకుంటున్న వేరే పెళ్లి వదిలేసి వచ్చేసి, ఏడ్చి తనే శుభం కార్డు వేసుకుంటుందా? ఫారిన్లో ఉద్యోగాలు చేసిన, లోకాన్ని చూసిన పాత్రలు ఇంకా 2000 – 2005 మధ్య నాటి లైటర్ వీ(ణ)న్ టీనేజీ ప్రేమ సినిమాలు వదిలి బయటికి రావా? వ్యవహార దక్షత తెలీని,  ఇలాటి అపరిపక్వ పాసివ్ కేండిడేట్స్ కి  కూడా కంపెనీలు ఉద్యోగాలిస్తున్నాయా? 

 ఎవరెలా చేశారు
      అప్పుడప్పుడు వీలు చూసుకుని వచ్చే సుమంత్ కి దేంతోనూ సంబంధం వుండదు. ఇమేజీ, ట్రెండ్, పోటీ, హిట్టు – ఫ్లాపు, డిమాండు  దేంతోనూ సంబంధం లేని  ఏకైక అదృష్ట జాతకుడుగా తను వుంటున్నాడు. ఈసారి ప్రేమ సినిమా నటించాడు. గొప్పతనం ఏమిటంటే-  దర్శకుడూ, కెమెరా మాన్ కలిసి తనని అత్యంత అందగాడుగా అప్డేట్ చేసి చూపించారు. సినిమా ఎవరికెంత గుర్తున్నా గుర్తులేకపోయినా, ఈ గ్లామరస్ ప్రెజెంటేషన్ తో తను గుర్తుండిపోతాడు. పాత్రకూడా జంటిల్ మాన్ లాగా నీటుగా బిహేవ్ చేయడం అదనపు ఆకర్షణ. పాత్రలో తనేం చేశాడనేది, ఔత్సాహిక ప్రేమికులకి ఏం సందేశ మిచ్చాడనేది అనవసరం. పాసివ్ గా బతకాలని చెప్పుండొచ్చు. ఔత్సాహిక లవర్ బాయ్స్ దీన్ని కళ్ళ కద్దుకుని పాటించనూ వచ్చు. 

          అయితే సుమంత్ కన్పించని, సుమంత్ చిన్నప్పటి సీన్లతో చిక్కు రావొచ్చు. మల్టీపుల్ ఫ్లాష్ బ్యాక్స్  రూపంలో ఫస్టాఫ్ – సెకండాఫ్ అంతా అనంత వాహినిగా వస్తూ వుండే చిన్నప్పటి దృశ్యాల్లో సుమంత్ కాకుండా బాలనటుడు సాత్వికే కన్పిస్తూంటాడు, బాలనటి ప్రీతీయే కన్పిస్తూంటుంది. ఫస్టాఫ్ లోనైతే సుమంత్ – హీరోయిన్ ఆకాంక్షల కంటే ఈ బాలనటుల ఫ్లాష్ కట్సేఎక్కువ సంఖ్యలో డామినేట్ చేస్తూంటాయి. దర్శకుడు వీళ్ళకిచ్చిన స్క్రీన్ స్పేస్ – ముగింపు వరకూ కూడా – అసలు హీరో హీరోయిన్లకి ఇవ్వకపోవడం వెనుక,  పూర్తిగా సుమంత్ భుజాల మీద సినిమా బరువంతా వేస్తే వర్కౌట్ కాదేమోనన్న అనుమానం వుందేమో తెలీదు. 

        హీరోయిన్ ఆకాంక్ష అత్యంత అందగత్తె. ఈ మధ్యవచ్చిన కొత్త హీరోయిన్లందరిలో కంటే  ఏ క్లాస్ బ్యూటీ క్వీన్. క్వీన్ లాంటి గ్రేస్ ఉట్టిపడుతూ వుంటుంది. పాత్రగా ఏం చేసిందనేది తర్వాతి సంగతి. ఔత్సాహిక లవ్ గాళ్స్ ఫాలో అయి దెబ్బతిన్నా నష్టం లేదు. ఆకాంక్ష తీర్చుకున్నట్టు వుంటుంది తృప్తిగా.

          కానీ బాల నటుడు సాత్విక్ పుట్టు నటుడు. సుమంత్ కంటే మాంచి కిక్కిచ్చే నటనతో వుంటాడు. అయితే ఇతడికి బాలనటి ప్రీతి మ్యాచ్ కాదు. ఈమె బలమైన బాడీతో, సాత్విక్ కి అక్కలా వుంటుంది. సాత్విక్ బక్కపలచన, ఎత్తు తక్కువ. 

          టెక్నికల్ గా మంచి విలువలతో వుంది. సతీష్ ముత్యాల కెమెరా వర్క్ సినిమాలో విషయమెలా వున్నా, దృశ్యాల్ని చాలా అందంగా చూపించింది. అలాగే మ్యూజిక్ దీనికింకో హైలైట్. నేపధ్యంలో మాంటేజెస్ కి వచ్చే పాటల్లో, మొత్తం బిజిఎంలో
శ్రణ్ రద్వాజ్ ఇచ్చిన ట్రెండీ బీట్స్ లేకపోతే ఈ గాథ ఒక నిమిషం  కూడా చూడలేని పరిస్థితి వుండేది.

చివరికేమిటి 
       కొత్త దర్శకుడు గౌతంకి యూత్ ఫుల్ ప్రెజెంటేషన్ తెలుసు. మంచి నటనలు రాబట్టుకోవడం, అర్ధవంతమైన దర్శకత్వం వహించడం లాంటి బేసిక్స్ తెలుసు. కాకపోతే తెలిసో తెలీకో కథ కాకుండా గాథ తీయడం,  మళ్ళీ తెలిసో తెలీకో దీన్ని ఎండ్ సస్పెన్స్ చేయడం, ఎండ్ సస్పెన్స్ చేయడంతో మళ్ళీ తెలిసో తెలీకో స్క్రీన్ ప్లేని మిడిల్ మటాష్ చేయడం....చకచకా జరిగిపోయాయి (నూటికి నూరు శాతం ఇవన్నీ తెలియకే చేసుకుపోతారు, ఎలాటి సందేహం అక్కర్లేదు). 

          ఇలా  గాథ, ఎండ్ సస్పెన్స్, మిడిల్ మటాష్ అనే  స్ట్రక్చరేతర క్రియేటివ్ విఫల యత్నాలుండగా, ఇక మల్టీపుల్ ఫ్లాష్ బ్యాక్స్ అనే ఇంకో అపశృతి వీటన్నిటి మీదా స్వారీ చేసింది. మళ్ళీ ఈ మల్టీ పుల్ ఫ్లాష్ బ్యాకుల్లో రెండు కథా (కథకాదు, గాథ) కాలాలు. ఒకటి 1999 నాటి బాల ప్రేమికుల గాథ, ఇంకోటి 2012 నాటి పెద్దయ్యాక కలుసుకుని విడిపోయేప్పటి గాథ. 

          ఈ రెండు కాలాల ఫ్లాష్ బ్యాకుల నేపధ్యంలో 2017 లో నడుస్తుంది అసలు వర్తమాన గాథ – ప్రెజెంట్ టైం ‘స్టోరీ’.  ఈ బహువిధ  కమర్షియలేతర విన్యాసాలతో తెరమీద కదిలే దృశ్యాలు చాలా తికమక పెట్టేస్తాయి. 1999 -2012-2017...ఇలా త్రికాల గాథలు ఖండ ఖండాలుగా త్రిశూలాల్లాగా వచ్చి పడుతూండడంతో,  శివశివా అనుకుని ఏదీ పట్టుకోలేని  నిస్సహాయ స్థితిలో శివుడికే వదిలేస్తాం. దర్శకుడు తను కథ చెప్పడంలో గొప్ప నేర్పు గల వాడని టాలెంట్ ప్రదర్శించుకోదలిస్తే అది ఇమ్మెచ్యురిటీ అన్పించుకుంటుంది. అతి టాలెంట్ అన్పించుకుంటుంది. నిలువెల్లా బ్యాడ్ రైటింగ్ అన్పించుకుంటుంది.  చివరి వరకూ ముక్కలుముక్కలుగా వచ్చే బాల్యపు గాథ తాలూకు దృశ్యాల్ని  గుర్తు పట్టి ఫాలో అవచ్చు- ఎందుకంటే వాటిలో వున్నది బాల నటులు కాబట్టి ప్రత్యేకం గా కన్పిస్తాయి. కానీ పెద్దయ్యాక సుమంత్ – ఆకాంక్ష లతో వచ్చే 2012 - 2017 కాలాల సీన్లలో ఏవి ఫ్లాష్ బ్యాకు సీన్లో, ఏవి ప్రెజెంట్ టైం సీన్లో  ‘క్షీర నీర న్యాయం’ చేస్తూ చూడ్డం సినిమా చూడ్డం అన్పించుకోదు. శ్రమకోర్చి కథని వెతుక్కుంటూ జోడించుకుంటూ చూడాల్సిన అగత్యానికి లోనుజేయడం దేనికి? 

          సింపుల్ గా చిన్నప్పటి కథని మొదట్లోనో, ఓ ఫ్లాష్ బ్యాకులోనో పూర్తిగా చూపించేసి, పెద్దయ్యాక మొత్తం ఒకే గాథగా చూపిస్తే వచ్చే నష్టమేమిటి? స్క్రీన్ ప్లే అంటే ఇదే కదా? పై విధంగా చేసుకొచ్చిందంతా  స్క్రీన్ ప్లే ఎందుకవుతుంది? అది స్క్రీన్ ప్లే లేని ఒట్టి వ్యక్తిగత క్రియేటివిటీ కదా? స్క్రీన్ ప్లేలేని వ్యక్తిగత క్రియేటివిటీ ఎలా వుంటుందో చెప్పడానికి ఇది నిదర్శనం కాదా? 

          2017 లో పెళ్లి ఏర్పాటుతో ప్రారంభించారు. హీరోయిన్ వచ్చి ఈ పెళ్లి  ఇష్టం లేదని చెప్పి వెళ్లి పోవడం అనే ముడి వేశారు గాథకి. ఎందుకిష్టం లేదనే ప్రశ్నకి సమాధానం చివరి వరకూ చెప్పకుండా ఆపారు. అంటే ఎండ్ సస్పన్స్ అయింది. దీంతో గాథ మిడిల్ మటాష్ అయింది. మిడిల్ లేకుండా పోయింది. ఎలాగంటే, చివరి దృశ్యాల్లో ఆ ప్రశ్నకి సమాధానం చెప్పేవరకూ కాలక్షేపం చేసింది 1991, 2012 కాలాల మల్టిపుల్ ఫ్లాష్ బ్యాకులతోనే. ఏదైనా మిడిల్ మిగిలిందంటే,  ఆపైన ఎండ్ కి దక్కిందంటే, 2017 లో బొటాబొటీ దృశ్యాల్లోనే. అసలు గాథ 2017 నాటి దృశ్యాలే అవుతాయి గానీ, 1991, 2012 లనాటి దృశ్యాలు కావు. ఫ్లాష్ బ్యాకులెప్పుడూ అసలు గాథ – లేదా  కథ కాబోవు. అవెప్పుడూ బిగినింగే, ఉపోద్ఘాతమే. స్క్రీన్ ప్లే రచనలో ఇవి ఎలిమెంటరీ పాఠాలు. ఇది కూడా తెలుసుకోక పోతే ఎలా?

          ఇక విషయపరంగా చిన్ననాటి ప్రేమ ‘కథ’ - తొమ్మిదో తరగతి చదువుతున్న పిల్ల, పిల్లాడి మధ్య ఆ ప్రేమలు చాలా ‘ఫీల్’ తో ఆకట్టుకుంటాయని కాబోలు దర్శకుడి ఉద్దేశం. ఈ వయసు పిల్లలు ఈ సినిమా చూసి – స్కూల్లో పిల్లకి ఎలా లైనెయ్యాలో, ఎలా లవ్ చెప్పాలో - పిల్ల కూడా ఎలా తపించిపోవాలో – ఇంకో పిల్ల రోమియోగాడు  ఎలా అడ్డుతగలాలో సినిమా సాంతం గుర్తుచేస్తూ వేస్తూ  పోయిన దృశ్య ఖండికలు అపూర్వంగా, అనిర్వచనీయంగా, ‘నా  బూతూ - నో భవిష్యత్’ గా వున్నాయి. బాలవికాసానికి బలవర్ధక ఔషధం అనుకోవచ్చు.


సికిందర్



7, డిసెంబర్ 2017, గురువారం

560 : రివ్యూ!


దర్శకత్వం : చరణ్ ఎల్. 
తారాగణం : సప్తగిరి, కశిష్ వోహ్రా, సాయికుమార్, శివప్రసాద్ తదితరులు 
కథ –స్క్రీన్ ప్లే : సుభాష్ కపూర్, మాటలు : పరుచూరి బ్రదర్స్, సంగీతం: బుల్గానిన్, ఛాయాగ్రహణం : సారంగం, నిర్మాత : డా రవికిరణ్
బ్యానర్ : సాయి సెల్యులాయిడ్ సినిమాటిక్ క్రియేషన్స్ ప్రి లి.
విడుదల : డిసెంబర్ 7, 2017

***
          మాస్ హీరోగా మారేందుకు ప్రయత్నిస్తున్న కమెడియన్ సప్తగిరి ‘సప్తగిరి ఎక్స్ ప్రెస్’ అనే పాసింజర్ తో హీరోయిజాన్ని అందుకోలేక,  ‘సప్తగిరి ఎల్ ఎల్ బి’ తో ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ ఎక్కేయాలని  సిద్ధమయ్యాడు. ఆ బుల్లెట్ ట్రైన్ అందిందాలేదా తర్వాత చూద్దాం, కానీ ఈ ప్రయత్నంలో ఆధారంగా పట్టుకున్న ‘జాలీ ఎల్ ఎల్ బి’ అనే హిందీ ఒరిజినల్ ని ‘మర్డర్ ఆన్ ది ఓరియెంట్ ఎక్స్ ప్రెస్’  ఎక్కించింది మాత్రం వాస్తవం. హైదరాబాద్ జనం మెట్రోనే ఎక్కలేక అవస్థలు పడుతున్నారు. సప్తగిరి ‘జాలీ ఎల్ ఎల్ బి’ తో  ముందు మెట్రో ఎక్కగలిగితే భవిష్యత్తులో బుల్లెట్ ట్రైన్ సంగతి చూడొచ్చు. మాస్ హీరోయిజం అంత వీజీగా విజిలేసి రాదు మరి.

         
కొత్త దర్శకుడు ఎంత సీనియర్ కో - డైరెక్టర్ అయితే అంత నీరసంగా వుంటుంది వ్యవహారం. అదీ రీమేకే తొలి ప్రశ్నా పత్రమైనప్పుడు అగ్ని పరీక్షయి పోతుంది. ప్రశ్నా పత్రంలో అసలు ప్రశ్నేమిటో అర్ధంగాకపోతే, లేదా అర్ధమై అర్ధాన్ని మార్చేసుకుని తెలిసిన జవాబే  రాసుకుందామనుకుంటే,  రిజల్టు దానికి తగ్గట్టుగానే వస్తుంది. ప్రశ్నా పత్రానికి అటు తమిళంలో ఒక జవాబు కన్పిస్తున్నప్పుడు, అదైనా చూసి కాపీ చేయకపోతే మరీ కష్టంగా వుంటుంది వ్యవహారం.

          దేశంలో న్యాయ వ్యవస్థ మీద ఒక ఇంటలిజెంట్ సెటైర్ కాస్తా తెలుగులో తెలుగు ప్రేక్షకుల కోసమని, సప్తగిరి వీర మాసిజం కోసమనీ నిగ్రహం తప్పి ఎలా మూస ఫార్ములాగా తయారయిందో ఓసారి చూద్దాం... 

కథ 
       పల్లెటూళ్ళో వుండే సప్తగిరి (సప్తగిరి) ఎల్ఎల్ బి చేసి వూళ్ళో పంచాయితీలు గెలుస్తూ, టౌన్లో కేసులు ఓడిపోతూ వుంటాడు. వృత్తిలో ఎదిగి, మరదల్ని పెళ్లి చేసుకుని, జీవితంలో సుఖపడాలంటే ఇలా కాదని హైదరాబాద్ మకాం మారుస్తాడు. అక్కడ కోర్టులో ఒక హై ప్రొఫైల్ కేసు చూస్తాడు. ఆ కేసులో కారు ప్రమాదం చేసి పేవ్ మెంట్ మీద నిద్రపోతున్న ఆరుగురు యాచకుల్ని చంపిన కేసులో నిందితుడి  మీద కేసు సులభంగా వీగిపోయేట్టు చేస్తాడు రాజ్ పాల్ (సాయికుమార్) అనే బడా లాయర్. తనకి పేరూ డబ్బూ రావాలంటే ఇదే దెబ్బ అని సప్తగిరి దీని మీద పిల్ వేసి మళ్ళీ విచారణ జరిగేట్టు చూస్తాడు. దీంతో లాయర్ రాజ్ పాల్ ఆగ్రహానికి గురవుతాడు. అన్ని అవినీతులకీ పాల్పడి రాజ్ పాల్ ఈ కేసు గెలిస్తే ఇప్పుడు సప్తగిరి అడ్డుకోవడంతో ముప్పు తిప్పలు పెట్టడం ప్రారంభిస్తాడు. దీన్ని ఎదుర్కొంటూ సప్తగిరి విడుదలై పోయిన నిందితుణ్ణి దోషిగా ఎలా రుజువుచేశాడనేదే మిగతా కథ. 

ఎలా వుంది కథ 
       1999 లో సంజీవ్ నందా హిట్ అండ్ రన్ కేసుని ఆధారంగా చేసుకుని  2013 లో హిందీలో అర్షద్ వార్సీ – అమృతారావ్ – బొమన్ ఇరానీ – సౌరభ్ శుక్లా లతో న్యాయవ్యవస్థ మీద సుభాష్ కపూర్ తీసిన ‘జాలీ ఎల్ ఎల్ బి’ అనే హిట్టయిన సున్నిత హాస్య వ్యంగ్యాస్త్రం ప్రస్తుత కథకి మాతృక. దీన్ని  2016 లో ఉదయనిధి స్టాలిన్ – హంసిక – ప్రకాష్ రాజ్ – రాధారవి లతో  ఐ. అహ్మద్ దర్శకత్వంలో తమిళంలో 'మనిథన్' గా రీమేక్  చేశారు. తెలుగులో కథ- మాటలు- స్క్రీన్ ప్లే అని తన పేరే వేసుకున్నాడు దర్శకుడు చరణ్! నిజానికి ఈ కథ, మాటలు, స్క్రీన్ ప్లే సుభాష్ కపూర్ వి. తెలుగులో అనువాదమయ్యాయి అంతే. ఇక హిందీ వున్నంత వాస్తవికంగా, సున్నితంగా, సెన్సిబుల్ గా తమిళ రీమేక్ వుంటే – తెలుగులో కొచ్చేసరికి సప్తగిరి మసాలా అలా వుంచి, అసలు కాన్సెప్టునే మార్చేశారు. న్యాయవ్యవస్థతో సామాన్యుడి బాధలుగా వున్న ఒరిజినల్ ని కాస్తా, రైతు జీవితాల ఘోషగా మార్చేశారు. న్యాయవ్యవస్థ మీది కంటే,  రైతు జీవితాల ఏకరువే తెలుగు ప్రేక్షకులకి బాగా అర్ధమవుతుందని అనుకున్నారో, లేక ఒరిజినల్ లోని పాయింటు అసలు అర్ధం గాలేదో – మొత్తానికి తెలుగుకి ఒక అర్ధవంతమైన ఫ్రెష్ కథ లేకుండా చేశారు. హిందీలో తీసిన వాళ్ళు, దాన్ని తమిళంలో తీసిన వాళ్ళూ అంత వివేకం గల వాళ్ళు కారనేమో. 

          ఒరిజినల్  కాన్సెప్ట్ ఏమిటి-  నేరన్యాయవ్యవస్థలో బిచ్చగాళ్ళు మనుషులే కారన్న భావం ప్రబలడాన్ని ప్రశ్నించడం. రోడ్డు ప్రమాదం చేసి బిచ్చగాళ్ళని చంపేస్తే అదేమంత పెద్ద విషయం కాదన్నట్టుగా, వాళ్ళు పురుగులతో సమానమన్నట్టుగా వ్యవస్థలు పనిచేయడాన్నే చూపిం
చిందీ ఒరిజినల్. అట్టడుగు బిచ్చగాళ్ళ ప్రాణాలకి  కాంట్రాస్ట్ గా అత్యున్నత ధనికుడి మదం చూపించారు. ప్రాణం విలువని నిర్ణయిస్తున్న ఈ  ఆర్ధికపరమైన అంతరంతోనే  కాన్సెప్ట్ కి అర్ధం వుంటుంది. ఇలాకాకుండా దీన్ని రైతుల జీవితాలు వర్సెస్ ధనికుల ఆగడాలుగా మార్చేయడంతో సామాజిక గొడవై పోయింది!  సున్నితమైన ఒరిజినల్ కాన్సెప్టు బలై పోయింది. ఏమో, ఇలా వుంటేనే తెలుగు ప్రేక్షకులు బాగా అర్ధం జేసుకోగలుగుతారేమోనని మనం అర్ధంజేసుకోవాలేమో! 


ఎవరెలా చేశారు 
      అసలుకి ఇదొక కమెడియన్ నటించాల్సిన కథేనా అని ఎలిమెంటరీ ప్రశ్న వచ్చేస్తుంది. హిందీలో, తమిళంలో కమెడియన్లు దీని కథానాయకులుగా లేరు. అలాగని వాళ్ళు కమర్షియల్ హీరోలూ కారు. అందుకని వాళ్ళు పోషించిన పాత్రలు అంత సహజత్వంతో వున్నాయి. సప్తగిరి వచ్చేసి ఈ పాత్ర పోషించే సరికి మొత్తం వాతావరణమే మారిపోయింది. ఫీల్, టోన్, సున్నితత్వం, సహజత్వం అన్నీ గూడ్సు బండెక్కేశాయి. సప్తగిరికి అర్జెంటుగా మాస్ హీరో ప్రతాపం చూపించుకోవాలని ఉబలాటం. ఇక ఉబలాటం కొద్దీ ఊగులాట. వంకర్లు తిరిగిపోవడం, పిల్లి మొగ్గ లేయడం, కితకితలు పెట్టుకోవడం, దొంగోడి మారు వేషాలెయ్యడం, వీర ఫైట్లు చేయడం, ఫారిన్ కెగిరిపోయి హీరోయిన్ తో  డ్యూయెట్ వేసుకోవడం, ఇది చాలనట్టు పాత ఎన్టీఆర్, ఏఎన్నార్ ల స్టయిల్లో బెల్ బాటమ్స్ వేసుకుని స్టెప్పు లేయడం – అన్నిట్లో తను ఫస్ట్ అని తనని తాను  ప్రమోట్ చేసుకుంటున్నట్టు రెచ్చిపోవడం - ఇదంతా చేయడానికి ఎక్కడో బతుకుతున్న హిందీ ఒరిజినల్ ని తెచ్చుకుని బలి చేయనవసరం లేదు. ఈ పాటి కథ ఇక్కడే తనే రాసుకోవచ్చు. ఇలా తీసిన దీన్ని సుభాష్ కపూర్ కి కూడా చూపించి ఇన్స్ పైర్ చేయాల్సిన అవసరం  తప్పకుండా వుంది.  

        చివరి కోర్టు దృశ్యాల్లో తను రక్తి కట్టించి వుండొచ్చు. అంతవరకే తన గురించి ఇక్కడ చెప్పుకోవాల్సింది. కానీ ఈ రక్తి కట్టించిన దృశ్యాలు కూడా రైతుల గురించి - కాన్సెప్టుని ఇంకో దారి పట్టిస్తూ. 

       ఇక్కడ కాన్సెప్టు గురించి తప్ప ఒరిజినల్ తో వేరే పోలికలు తేకూడదు. హిందీకి ఆ నటులు (అర్షద్, బొమన్, సౌరభ్) కరెక్టు. వాళ్లతో తెలుగులో పోల్చనవసరం లేదు. ఈ దృష్ట్యా తెలుగుకి బడా లాయర్ పాత్రలో సాయికుమార్, జడ్జి పాత్రలో శివ ప్రసాద్ లు తమ పాత్రలకి చాలా చాలా న్యాయం చేశారు. ఒక్క న్యాయం చేయలేకపోయింది - మాస్ హీరోయిజపు యావకొద్దీ – సప్తగిరి మహాశయుడే. నటనంటే గూడ్సు బండి సరుకనుకుంటే ఇలాగే వుంటుంది. బుల్లెట్ ట్రైను ఇలా తప్పిపోతుంది. 

          హీరోయినమ్మ కశీషమ్మ కషాయపు బొమ్మ.  బుల్గానిన్ సంగీతం పిట్ట కొంచెం కూత ఘనమన్నట్టుంది. ఒక చిన్నపాటి సరళమైన కథని చెవులు చిట్లే రణగొణ ధ్వనులతో చూడాలా? ఇక పాటలకి కట్టిన ట్యూ న్లేమిటో అస్సలు మాస్ హీరోయిజానికి పనికిరావు. సారంగం కెమెరా వర్క్ సగటుగానే వుంది. 

చివరికేమిటి 
       తెలుగుకి కలిపిన దృశ్యాలు, ముఖ్యంగా పల్లెటూళ్ళో ఓపెనింగ్,  సప్తగిరి ఎంట్రీ లాంటివి చాలా  పురాతన సినిమా చూస్తున్నట్టు వుంటాయి. ఒరిజినల్ హిందీ – వాస్తవిక ధోరణిలో ఫ్రెష్ గా, కళ్ళకి కొత్తగా అన్పిస్తే, ఈ రీమేక్ జానర్ మర్యాదని కూడా కాపాడు కోకుండా రొటీన్ కమర్షియల్ మాస్ లాగా,  మూస ధోరణిలో చిత్రీకరించేశారు. కొత్త దర్శకుడు పాత వాసనతోనే తీశాడు. మాస్ హీరోగా సప్తగిరి కోరిక ప్రకారం సప్తగిరిని  ఎంత ఓవర్ యాక్షన్ తో, ఎంత ఒన్ మాన్ షోగా చూపించాలా అన్న ధ్యాసే సరిపోయింది మొత్తమంతా. సినిమాలో విషయంతో కాదు, సప్తగిరికి వేషాలతో కనెక్ట్ అవ్వాలన్న స్కీముతో చేసిన ఈ  ఓవరాక్షన్ హంగామా అన్నిటినీ తొక్కేస్కుంటూ వెళ్ళిపోయింది. ఇక అనుకున్నట్టు మాస్ ప్రేక్షకుల్ని  ఎంత తొక్కుతుందో, బాక్సా ఫీసుని ఇంకెంత  తొక్కుతుందో  ఎవరికి  వాళ్ళే చూసుకోవాలి.


సికిందర్
         



         





560 : రివ్యూ!


6, డిసెంబర్ 2017, బుధవారం

559 : టీనేజి నోయర్ స్క్రీన్ ప్లే సంగతులు -2

   ఎంపైర్ మేగజైన్ ఎంపిక చేసిన 500 గొప్ప చలన చిత్రాల్లో 449 వ స్థానం సంపాదించుకున్న ‘బ్రిక్’ కథ టీనేజి నోయర్ అనే కొత్త జానర్ ని ప్రతిపాదించింది. అంతవరకూ తొలితరం ఫిలిం నోయర్, మలితరం నియోనోయర్ సినిమాలన్నీ సీనియర్ పాత్రలతో  థ్రిల్లర్స్ గా వుండేవి. ‘బ్రిక్’ వచ్చేసి టీనేజి పాత్రలతో, టీనేజర్ల ప్రపంచాన్ని ఆవిష్కరించే, టీనేజి థ్రిల్లర్ గా యౌవనాన్ని సంతరించుకుంది. ఇందులో బ్రెండన్ హై స్కూల్ విద్యార్థి. అక్కడ హై స్కూల్ అంటే ఇక్కడ మన జ్యూనియర్ కాలేజి. ఇతను తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ ఎమిలీ మృత దేహాన్ని కనుగొనడంతో కథ ప్రారంభమవుతుంది. ఈమె చనిపోక ముందు ఒక కాల్ చేసి, ప్రమాదంలో వున్నాననీ, రక్షించమనీ కోరింది. బ్రిక్ అనీ,  టగ్ అనీ, పిన్ అనీ, పూర్ ఫ్రిస్కో అనీ  ఏవో మాటలు పలికి అర్ధాంతరంగా కట్ చేసింది. బ్రెండాన్ ఆమె శవాన్ని దాచిపెట్టి, ఈ నాలుగు మాటల కర్ధాన్నీ,  వాటితో ఆమె మరణానికి గల సంబంధాన్నీ కనుగొనాలని అన్వేషణ మొదలెడతాడు.   

         
అన్వేషణలో హైస్కూల్లో ఐదుగురు అనుమానితులుగా కనిపిస్తారు. హైస్కూల్లో డ్రగ్స్ సరఫరా చేసే ‘పిన్’ కి ఏజెంట్లుగా పనిచేస్తున్న విద్యార్ధులు లారా, కారా, టగర్, బ్రాడ్, డోడ్ అనే వాళ్ళు. వీళ్ళ ప్రమాదకరమైన నెట్ వర్క్ ల్ తలదూర్చి ఎమిలీ హత్యకి కారణాలు తెలుసుకుని,  ప్రతీకారం తీర్చుకుంటాడు. క్లాస్ మేట్ బ్రయిన్ తోడుగా వుంటాడు. 

పాత్రలు 
బ్రెండన్ – ఎమిలీ – లారా – కారా 
       1. బ్రెండన్ :  కథానాయకుడు. ఒంటరి టీనేజర్. సీనియర్ నోయర్ హీరోలకి తీసిపోని టీనేజి నోయర్ హీరో, టీనేజి డిటెక్టివ్. సిగరెట్లు, మందు తాగని పాత్ర ఇతనొక్కడే. ఇతడి పాత్రోచిత చాపం (క్యారక్టర్ ఆర్క్) చూస్తే - ఇతను వేసుకునే ఫ్రెష్ గా వుండే వైట్ షర్టు పోనుపోనూ మాసిపోతుంది, చివరికి రక్తంతో ఎర్రబారిపోతుంది. డిటెక్టివ్ ల కుండే మెళకువలతో ఫ్రెండ్ బ్రయిన్ ఇచ్చే సమాచారంతో ఎమిలీ హత్యా శోధన చేస్తూంటాడు. కఠినంగా మాట్లాడతాడు.
          2. బ్రయిన్ : బ్రెండన్ ఫ్రెండ్. మాస్టర్ బ్రెయిన్. స్కూల్లో ఎవరేమిటో క్షుణ్ణంగా  తెలిసినవాడు. బ్రెండన్ కి సమాచారం చేరవేస్తూ, అనుమానితుల మీద నిఘా వేసి వుంటాడు.
          3. ఎమిలీ : కథానాయిక. బ్రెండన్ కి బ్రేకప్ చెప్పేసే, డ్రగ్ రాకెట్ లో ఇరుక్కుని ప్రాణాల  మీదికి తెచ్చుకునే టీనేజర్.
          4. లారా : వాంప్ పాత్ర. దుర్బుద్ధితో కథానాయకుడిని తప్పుదోవ పట్టిస్తూ వుండే తేనే పూసిన కత్తి.
          5. కారా : డ్రగ్ గ్రూపులో గ్లామర్ గర్ల్.
          6. టగ్ అలియాస్ టగర్ : స్కూల్లో డ్రగ్ ఏజెంట్, పిన్ కుడి భుజం.
          7. డోడ్ : ఎమిలీ కొత్త  బాయ్ ఫ్రెండ్.
          8. బ్రాడ్ :  ఫుట్ బాల్ ప్లేయర్, డ్రగ్స్ బానిస. 
          9. ది పిన్ : విలన్. డ్రగ్ రాకెట్ బాస్.
          10. ట్రూమన్ : హై స్కూల్ వైస్ ప్రిన్సిపాల్.

బ్రయిన్ - టగ్ - ది పిన్ -  డోడ్ - బ్రాడ్
***
            బ్రిక్స్క్రీన్ ప్లే 111 పేజీలుంది.  ఈ షూటింగ్ స్క్రిప్టులో ‘బ్లడ్ సింపుల్’ లో వున్నట్టు నిగూఢార్థాల వివరం లేదు. పాత్రల స్థితిగతులు, స్థల వర్ణనలు, వాతావరణ సృష్టి మాత్రమే వున్నాయి. ఈ టీనేజి నోయర్ లో  సాంప్రదాయ నోయర్ ఎలిమెంట్స్ అన్నిటినీ వాడుకోలేదు.  అంటే, 1. చారుస్కూరో లైటింగ్, 2. హై కాంట్రాస్ట్ , లాంగ్ షాడోస్3. డీప్ ఫోకస్, 4. ఎక్స్ ట్రీం హై,  ఎక్స్ ట్రీం లో- యాంగిల్స్, 5. టైట్ క్లోజప్స్,  6. కాంప్లెక్స్ షాట్స్,  7. కాంప్లెక్స్ మీసాన్సెన్ షాట్స్, 8. ఎసెమిట్రికల్ కంపోజిషన్, 9. బార్స్ డయాగోనల్, ఫ్రేమ్స్ వితిన్ ఫ్రేమ్స్, 10.  లాంగ్ ట్రాక్ షాట్స్11. అబ్ స్క్యూర్ సీన్స్12. డచ్ యాంగిల్స్ఇన్వర్టెడ్ ఫ్రేమ్స్13. వాటర్ అండ్ రిఫ్లెక్షన్స్14.మిర్రర్స్, 15. మోటిఫ్స్  మొదలైనవన్నీ లేవు. 

        ఇక్కడ క్లిక్ చేయండి  చిత్రీకరణ పరంగా ఈ కాలానికి కూడా సరిపోయే కొన్ని ఎలిమెంట్స్ నే వాడుకున్నారు. నోయర్ సాంప్రదాయంలో నేరస్థ ప్రపంచాన్ని చిత్రించదానికి వాడుకునే లో- యాంగిల్ షాట్స్, హై యాంగిల్ షాట్స్ నీ,  కొన్ని చోట్ల ఆందోళనకర పరిస్థితికి డచ్ యాంగిల్స్ నీ  వాడారు. లైటింగ్ తో నీడల్ని సృష్టించే టెక్నిక్ అనేక చోట్ల వుంది. పాత్రలతో చారుస్కూరో లైటింగ్ కూడా వుంది. చీకటిని ఎక్కువ ఆశ్రయించకుండా,  ఎక్కువగా ప్రకాశవంతమైన వాతావరణంతో వుండడం నోయర్ రూల్స్ ని బ్రేక్ చేయడమే. నోయర్ మూవీస్ నగర వాతావరణంలో, సంపన్న వర్గాలు  రాత్రి వేళల్లో పాల్పడే అనైతిక  బాగోతాలతో వుంటాయి. ఎలాటి మాస్ పాత్రలు గానీ, వాతావరణం గానీ కన్పించవు. రిచ్ క్యారక్టర్స్ తో క్లాస్ లుక్ తో వుంటాయి. ‘బ్రిక్’ కూడా టీనేజికి మారినప్పటికీ అదే రిచ్ క్యారక్టర్స్ తో క్లాస్ లుక్ తో వుంటుంది గానీ, నగర వాతావరణానికి బదులు టౌను వాతావరణానికి మారుతుంది. అదీ సాంప్రదాయ సెటప్ అయిన సంపన్న నివాస భావనాల్నుంచి హై స్కూలుకి మారిపోతుంది. ఈ ప్రొడక్షన్ డిజైన్ నోయర్ జానర్ మర్యాదల్ని జాగ్రత్తగా పునర్నిర్వచించినట్టు వుంటుంది. 

       నోయర్ మూవీస్ డిటెక్టివ్ ప్రధాన పాత్రగా వుంటాయి. అతను దారితప్పిన సంపన్నుల భరతం పట్టడమో, లేక ఆ సంపన్నులే తన భరతం పడితే పీక్కోలేక పోవడమో జరుగుతుంది. ‘బ్రిక్’  లో హీరో డిటెక్టివ్ అంటే వృత్తిగతంగా కాదు, డిటెక్టివ్ లా పనిచేసుకుపోయే పాత్ర మాత్రమే. ఇబ్బందుల్లో పడే హీరోయిన్, ఇబ్బందులు పెట్టే వాంప్ హీరోయిన్, ఒక విలన్, అతడి అనుచరులూ అనే సాంప్రదాయ సెటప్ అంతా వుంది. ఇక నోయర్ కథనాల్లో వాడే స్వగతం అనే వాయిసోవర్ ఇక్కడ లేదు. కలర్స్ విషయానికొస్తే లైట్ బ్లూ, గ్రే,  వైట్ టింట్స్  కనిపిస్తాయి. ముదురు రంగులు లేకపోవడంతో యూత్ ఫుల్ లుక్ తో వుంటుంది. లొకేషన్స్ నిర్జనంగా వుంటూ ఒకలాంటి మిస్టీరియస్ ఫీల్ ని కలగజేస్తూంటా యి. ఇక డైలాగుల విషయానికొస్తే సాంప్రదాయ హార్డ్ కోర్ నోయర్ డైలాగులే వుంటాయి, కాకపోతే ఇప్పుడు వాడే మాటలు కలిసివుం
టాయి. ఫిలిం నోయర్ డైలాగుల ఒక డిక్షనరీయే వుంది. నాటి  1930- 40 కాలపు  హాలీవుడ్ ‘మహా రచయితలు’ సృష్టించిన గమ్మత్తైన పదాలు. అలాటి భాష నేటి హై స్కూలు పాత్రలు మాట్లాడడాన్ని జాగ్రత్తగా సింక్ చేశాడు దర్శకుడు - రచయిత రియాన్ జాన్సన్. దీంతో ఈ భాషే ఒక ఆకర్షణ అయింది ఈ టీనేజి నోయర్ కి. 

          టీనేజి నోయర్ యూనివర్సల్. ఈ గ్లోబలైజేషన్ యుగంలో హద్దులు చెరిగిపోయాయి. ఎక్కడైనా ఏ భాషలో నైనా తీయవచ్చు. కాకపోతే అభిరుచి అవసరం. ఏ రుచీపచీ లేని పోసుకోలు కబుర్ల సినిమాలు తీయడానికి అలవాటు పడ్డ వాళ్లకి ఇదెలా తీయాలో ఎక్కదు. తీస్తే మాత్రం చుక్కెదురు లేదు. లేకపోతే ఇంకెన్నాళ్ళు ఇలా వొట్టి పోయిన రోమకామాలతో, దెయ్యం కేకలతో దివాలా తీయిస్తూ పోతూంటారు. తెలుగు రాష్ట్రాల్లో పెరుగుతూపోతున్న ఆధునిక  థియేటర్లలో అవే  లేకి ప్రేమలు! అవే వెకిలి దెయ్యాలు!! పల్లెటూళ్ళలో కూడా పనికిరాని పోకడలతో సినిమాలు తీసి ఆధునిక కాలపు 
థియేటర్ల పరువు మట్టిపాలు చేయడం !!!

(సశేషం)
సికిందర్