రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

4, మే 2018, శుక్రవారం

643 : స్క్రీన్ ప్లే సంగతులు



          విదేశీ సంస్కృతా అనుకుంటాం గానీ, ఆ విదేశీ సంస్కృతుల్లోనూ మనం ఫీలయ్యే విలువలు కన్పిస్తాయి. ముఖ్యంగా విలువలతో కూడిన కళలు, సినిమా. జీవితంలోంచి పుట్టించే కళలు, సినిమాలు. జీవితంలో అనుభవమైన  ప్రవర్తనలు, ప్రేమలు, భావోద్వేగాలు, సంబంధాలు వగైరా. కొరియన్ దర్శకుడు క్వాక్ జే యంగ్ 1989 లోనే ‘వాటర్ కలర్ పెయింటింగ్ ఇన్ ఏ రేనీ డే’ తో దర్శకుడుగా రంగప్రవేశం చేసి విజయం సాధించినా, ఆ  తర్వాత తీసిన రెండు సినిమాలూ అపజయాల పాలవడంతో ఎనిమిదేళ్ళూ తెరమరుగైపోయాడు. 2001 లో అతడికి 42 ఏళ్ళు. అప్పుడు తీసిన ‘మై సాసీ గర్ల్’ అనే క్రేజీ రోమాంటిక్ కామెడీతో సంచలన దర్శకుడైపోయాడు. దక్షిణ కొరియాలో ఇది ఆ సంవత్సరం రెండో టాప్ మూవీగా రికార్డు సాధించింది.  దీంతో ఇతర దేశాల్లో దీని రేమేకుల, ఫ్రీ మేకుల పరంపర మొదలయింది. హాలీవుడ్ లో ఇదే పేరుతో 2008 లో రీమేక్ చేస్తే హిట్టయ్యింది. అదే సంవత్సరం బాలీవుడ్ లో  ‘అగ్లీ ఔర్ పగ్లీ’ అని రీమేక్ చేస్తే హిట్టయ్యింది. చైనా, జపాన్, రష్యా, హంగేరీల లోనూ రీమేకులు హిట్టయ్యాయి. నేపాల్ లోనూ ‘సానో సంసార్’ గా హిట్టయ్యింది. ఇక టాలీవుడ్ లో ఎంత ఫ్రీమేకులు చేసినా హిట్టయ్యే మాటే వుండదు కాబట్టి, 2006 లోనే  ‘మా ఇద్దరి మధ్య’  అని తీస్తే ఫ్లాపయి కూర్చుంది ఆనవాయితీ  ప్రకారం. ‘మై సాసీ గర్ల్’ ని 2016 లో ‘మై న్యూ సాసీ గర్ల్’ గా వేరే కొరియన్ దర్శకుడు రీమేక్ చేస్తే ఫ్లాపయ్యింది. 

         
2003 లో దర్శకుడు క్వాక్ ‘ది క్లాసిక్’ తీశాడు. క్రిందటిది రోమాంటిక్ కామెడీ అయితే, ఇది జానర్ మార్చి  పూర్తిగా రోమాంటిక్ డ్రామా. ఈ సంవత్సరం జనవరిలో అతనిచ్చిన తాజా  ఇంటర్వూలో ఇలా చెప్పాడు – మెలోడ్రామా అంతరిస్తున్న జానర్ గా  స్ట్రగుల్ చేస్తోంది. ఒకప్పుడు హాలీవుడ్ ప్రేమ సినిమాలు తెగ చూసే వాణ్ణి.  నా యూత్ లో అవి నన్నుకట్టి పడేసేవి. ఇప్పుడా మెలోడ్రామాలు లేవు.  మెలోడ్రామాల మీద పెట్టు బడులు పెట్టే నిర్మాతలు లేరు.  అందరూ సైన్స్ ఫిక్షన్ ఆర్భాటాలు, హత్యలు, కుట్రలతో కూడిన యాక్షన్ థ్రిల్లర్లూ తీసే నిర్మాతలే వస్తున్నారు. కానీ అమెరికా ఇవతల చూస్తే ఇంకో దృశ్యం కన్పిస్తుంది. మా తూర్పు  ఆసియా వాసులం ఇంకా మెలోడ్రామాలూ, కంట తడిపెట్టించే ఎమోషన్లూ అంటే పడిచస్తాం. నన్ను ఓల్డ్ ఫ్యాషన్డ్ వ్యక్తి ననుకున్నా ఫర్వాలేదు. కానీ మెలో డ్రామాలు మన పాత సంస్కృతుల, సాంప్రదాయాల చిహ్నాలవల్ల , స్మరణల వల్ల చాలా లాభపడతాయి. అవి ఇంకో కాలపు జ్ఞాపకాలని తట్టి లేపుతాయి. ఆ జ్ఞాపకాల్ని ప్రేక్షకులు షేర్ చేసుకున్నా చేసుకోకపోయినా, అవి మనందరిలో భాగమే కాబట్టి సామూహికానుభవానికి లోనవుతాం... 

         ‘ది క్లాసిక్’ ఈ అనుభవాన్నే ఇస్తుంది. కొరియన్ ప్రేక్షకులు తమ నిజమైన సాంస్కృతిక, సంప్రదాయ విలువల్ని ఉటంకించిన ‘క్లాసిక్’ కి  దాసోహులైపోయారు. దక్షిణ కొరియా ప్రజలు విద్యాధికులు. చిల్లర సినిమాలు తీస్తే తిప్పి కొడతారు. ఈ సినిమా తట్టిలేపిన పాత స్మృతుల మజా ఎంతంటే, తమ జీవితాల్లోని జ్ఞాపకాలే ప్రత్యక్షంగా కళ్ళముందు పురులు విప్పుకున్నంత.  

          మరొకటేమిటంటే, పేసింగ్ విషయంలో పన్నిన వ్యూహం. సీన్లు వేగంగా కదుల్తూనే, కొన్ని కీలక సన్నివేశాలు వస్తున్నప్పుడు మందకొడివైపోతాయి. మనల్ని ఆపి ఆలోచింపచేసేందుకు. సారాన్నంతా మొదలంటా జుర్రుకునేందుకు. ఒక్కోసారి ఈ సీన్లలో నేపధ్య సంగీతం కూడా వుండదు. విలువలు తెలియడమే కాదు, విలువల్ని ప్రెజెంట్ చేయడంలో కూడా దర్శకుడు ఒక అవగాహనతో కన్పిస్తాడు. 

          దీని ఘనవిజయం తర్వాత నుంచి 2018 వరకూ ఇంకో ఏడూ దర్శకత్వం వహించాడు, మరో నాల్గింటికి కథలందించాడు. వీటిలో రోమాంటిక్ డ్రామాలు, కామెడీలు, థ్రిల్లర్లు, సైన్స్ ఫిక్షన్లు వున్నాయి. తాజాగా ఈ సంవత్సరం  జనవరి 18 న ‘కలర్స్ ఆఫ్ ది విండ్’ రోమాంటిక్ డ్రామా విడుదలైంది. ఇందులో గర్ల్ ఫ్రెండ్ చనిపోతూ, తనలాగే వున్న అమ్మాయి ఫలానా వూళ్ళో వుందని, అన్వేషించమని బాయ్ ఫ్రెండ్ ని పురిగొల్పుతుంది. ఇది కూడా సున్నిత డ్రామా. ఈ డ్రామా ‘ది క్లాసిక్’ లో కూడా ఎలా వర్కౌట్ అయ్యిందో ఇప్పుడు చూద్దాం...

సీన్ :
   తోటలో పాత పుస్తకాలు  సర్దుతూంటుంది టీనేజీ జీ హై. వాటిని ఎత్తుగా పేర్చుకుని ఇంట్లోకి వస్తుంది. రూంలోకి రాగానే కిటికీ మీద దృష్టి పడుతుంది. కిటికీ అద్దాలవతల మూడు పావురాలు కూర్చుని వుంటాయి. అలా చూస్తూంటే చేతిలో పట్టుకున్న పుస్తకాలు జారి పడి పోతాయి. వాటిని పట్టించుకోకుండా ఆసక్తిగా కిటికీ వైపే చూస్తూ కదుల్తుంది... ‘నా చిన్నప్పుడు  పేద్ద ఇంద్రధనుస్సు చూసింది గుర్తుంది నాకు నదీ తీరాన...’ అని వాయిసోవర్ వస్తూంటే, వచ్చి కిటికీ అద్దాలు పైకి లేపుతుంది. అక్కడున్న పావురాల్ని తరిమి కొడుతుంది. ఆకాశంలోకే అలా చూస్తుంది. పెద్ద ఇంద్రధనుస్సు కనబడుతుంది.... ‘అప్పుడు మా మదర్ చెప్పింది...ఇంద్రధనుస్సు స్వర్గానికి ద్వారమని...మరణించిన వారు ఆ ద్వారంలోంచి స్వర్గానికి పోతారనీ...’ అంటూ  మళ్ళీ వాయిసోవర్ వస్తుంది. 

         వచ్చి పుస్తకాలు  తీస్తూంటుంది. పావురాలు వచ్చి మళ్ళీ కిటికీ లో కూర్చుంటాయి... ‘నా చిన్నప్పుడే నాన్న పోయాడు. అమ్మ విదేశాల కెళ్ళింది. మళ్ళీ పెళ్లి చేసుకోమని చాలా చెప్పాను, విన్పించుకోలేదు...’  వాయిసోవర్ మీద  పుస్తకాలన్నీ పేర్చుకుని లేస్తూంటే మళ్ళీ కింద పడిపోతాయి. చిరు కోపంతో చూస్తుంది.

         ‘నా పేరు జీహై, నా బ్లడ్ గ్రూపు ‘ఓ’... నా ఏడేళ్లప్పుడే టెక్వాండో నేర్చుకోవడం మొదలెట్టా...’ వాయిసోవర్ కి దృశ్యం పడుతుంది- టెక్వాండోలో ఒకణ్ణి కొడితే ముక్కులోంచి రక్తం కారుతుంది.

          దృశ్యం పూర్తికాగానే,  పుస్తకాలు సర్దడం మొదలెడుతుంది. వాటిని అలమారలో పెట్టి మూస్తుంది. మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్టు అలమార తెరుస్తుంది. అక్కడొక పెట్టె వుంటుంది... ‘దీంట్లో నా పేరెంట్స్ ఉత్తరాలూ డైరీలూ వున్నాయి...ఇవి చదివినప్పుడల్లా అమ్మ ఏడ్చేది...’ వాయిసోవర్ కంటిన్యూ అవుతూంటే పెట్టెని అందుకుంటుంది. దాన్ని వొళ్ళో పెట్టుకుని కూర్చుని, వూదగానే గుప్పుమని  దుమ్ములేవడంతో దగ్గొచ్చి దగ్గుతుంది.

          పెట్టెని టీపాయ్ మీద పెట్టి తెరుస్తూంటే, ‘మా అమ్మ తొలి ప్రేమ ఇందులో వుంది...’ అని వాయిసోవర్. ఒక కవరు లోంచి ఉత్తరం తీసి చదువుతూంటే ఫోన్ మోగుతుంది. రిసీవ్ చేసుకోవడానికి అవతలి గదిలోకి వెళ్తే కిటికీ లోంచి గాలి వీచి, పెట్టెలోని ఉత్తరాలన్నీ ఎగిరిపోతాయి. వాటి కిందున్న ఒక డైరీ పేజీలు  రెప రెప లాడుతూంటాయి.

      అవతల ఫోన్లో ఫ్రెండ్ మాటలు వింటుంది జీహై – ‘సాంగ్ మిన్ తో ఆర్ట్ మ్యూజియంకి వస్తావా?’ అని. జీహై ముఖకవళికలు మారిపోతాయి, ‘నన్నెందుకు ట్యాగ్ చేస్తున్నావ్?’ అంటుంది సీరియస్ గా.  సాంగ్ మిన్నే రమ్మన్నాడని చెప్తుంది ఫ్రెండ్. విచారంగా చూస్తుంది జీహై.... ‘సాంగ్ మిన్  కి ఈమెయిల్ లెటర్స్ రాయమని ఒక రోజు నన్నడిగింది  సూ క్యుంగ్....’ అనే వాయిసోవార్ తో  దృశ్యం పడుతుంది – కంప్యూటర్ లో జీహై  లెటర్ టైపు చేస్తూంటే వాయిసోవర్ – ‘రెండు నెలలు సూ క్యుంగ్ కోసం లెటర్లు రాశా...’  అని.

          అక్కడే సూక్యుంగ్ వుంటుంది సూచనలిస్తూ...
          (సమాప్తం)

పాయింట్ :         మొత్తం ఐదున్నర నిమిషాల ఒకే సీను ఇది. ఇందులోనే రెండు మాంటేజీలు. ఇది ప్రధాన కథ. ఇందులో జీహై ప్రధాన పాత్ర, ఈ ప్రధాన కథలో ఈ సీను బిగినింగ్ విభాగంలో భాగం. బిగినింగ్ విభాగపు  బిజినెస్ ప్రకారం, ఈ ఒక్క సీనులోనే ప్రధాన పాత్ర  జీహై పరిచయమైపోయింది. ఆమె తండ్రి చిన్నప్పుడే పోయాడు. తల్లి విదేశాల కెళ్ళింది ప్రస్తుతం. తను ఏడేళ్ళప్పుడే  టెక్వాండో నేర్చుకుంది. తన బ్లడ్ గ్రూప్ ‘ఓ’ – అంటే తనది మంచి ఆత్మ విశ్వాసంగల పర్సనాలిటీ. స్వయం నిర్ణయాధికారం గలది. సిక్స్త్ సెన్స్ కూడా ఎక్కువ. ఇదంతా టెక్వాండో లో ఆమె ఇచ్చుకునే మాంటేజ్ షాట్ లో బయటపడుతుంది. అంటే, ఆమె ఫలానా ఇలాటిదని చెప్పి వదిలెయ్యకుండా, సీను వేసి చూపించాడు దర్శకుడు. ‘రంగస్థలం’ లో ఒక పాటలో, ‘వినపడేట్లు కాదురా, కనబడేట్టు కొట్టండెహె’ అని అరుస్తాడు. అలాగే  సినిమా అంటే వినపడేట్లు చేయడం కాదు, కనబడేట్టు సీనెయ్యడం!  

          హీరోయిన్ కి  సూక్యుంగ్ అనే ఫ్రెండ్ వుంది. ఆమెకి సాంగ్ మిన్ అనే బాయ్ ఫ్రెండ్ వున్నాడు. ఇలా హీరోయిన్ జీహైతో  బాటు ముక్కోణ ప్రేమలో సాంగ్ మిన్ అనే హీరో, సూక్యుంగ్ అనే సెకండ్ హీరోయినూ పరోక్షంగా పరిచయమై పోయారు. 

     ఇక బిగినింగ్ విభాగపు బిజినెస్ లో భాగంగా వచ్చే సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన కూడా ఈ మొదటి సీనులోనే ప్రారంభమైపోవడం గొప్ప క్రియేటివిటీ. క్రియేటివిటీ అంటే బ్రెవిటీయే. సీన్లకి సీన్లు లొట్టపీసు సీన్లు వేయకుండా సంక్షిప్తతని సాధించే వాడే ప్రేక్షకుల పాలిట పుణ్యాత్ముడు. ఫ్రెండ్ సూక్యుంగ్ తో కాల్ మాట్లాడుతున్నప్పుడు, జీహై ముఖభావలు గమనించినప్పుడు తను సాంగ్ మిన్ ని ప్రేమిస్తున్నట్టు అర్ధమైపోతుంది. కానీ ఫ్రెండ్ ప్రేమిస్తున్నాక డైలమాలో పడింది. ఇక్కడ మాంటేజీ కూడా వేసి ఫ్రెండ్ కోసం ఉత్తరాలు రాస్తున్న పరీక్షని కూడా ఎదుర్కొంటున్నట్టు చూపించాడు దర్శకుడు. 

          ఇలా మొదటి సీనుతోనే ప్రధాన కథ పాయింటులోకి తీసి కెళ్ళిపోయాడు దర్శకుడు. ఇక ఈ విభాగం మరో బిజినెస్ అయిన కథా  నేపధ్యంకూడా చూపించేశాడు. ఇది తల్లి ప్రేమ కథ బ్యాక్ డ్రాప్ లో కూతురి ప్రేమ కథ అని. దీంతో ఈ ప్రేమ కథ జానర్ ని కూడా ఎస్టాబ్లిష్ చేశాడు ఇది రోమాంటిక్ డ్రామా అనే విధంగా. ఈ జానర్ మర్యాదని పాటిస్తూ, ఈ సీనంతా ఒక పవిత్ర భావం ద్యోతకమయ్యేలా చిత్రీకరణ చేశాడు. పింక్ కలర్ టింట్ లో ఇంటీరియర్ సెట్టింగ్,  కిటికీ బయట ఆహ్లాదకర వాతావరణం. మంద్రంగా మీటుతూ సంగీతం. హీరోయిన్ ప్రతి కదలికా, చేతా, ముఖభావాలూ సున్నితత్వం, సౌకుమార్యం, అమాయకత్వమూ ఉట్టిపడేలా మంద్రంగా.  మందాకినిలా అనుకుందాం. మాంటేజీలు వేసినప్పుడు కూడా స్మూత్ ట్రాన్సిషన్ కి వాయిసోవర్ నే వేసుకున్నాడు. దీంతో నడుస్తున్న సీనులో వున్న పవిత్రభావం  డిస్టర్బ్ అయినట్టే కన్పించదు. ఇదే రోమాంటిక్ కామెడీ జానర్ అయితే చిత్రీకరణ ఇలా వుండదు. స్పీడుగా అల్లరల్లరిగా వుంటుంది. ఈ అల్లరిలో ఒక్క సీనులో పొందికగా, ఒద్దికగా ఇన్ని సంగతులు చెప్పడం కుదరదు. సీన్లకి సీన్లు లొట్టపీసు సీన్లు వేసుకుంటూ వుండడమే.  

      ఇప్పుడు ఈ మొదటి సీనులో చెప్పుకొస్తున్న ప్రధాన కథలోనే దాచి పెట్టి,  ఫ్లాష్ బ్యాక్ కథకి హింట్స్ కూడా ఇస్తున్నాడు దర్శకుడు. ఈ లేయర్, ఈ డెప్త్ కూడా గమనించాలి.
ఇంట్లోపాత పుస్తకాలు  గడచిన కాలానికి గుర్తులు. అంటే హీరోయిన్ తల్లి తాలూకు గతం అన్న మాట. ఆ గతాన్ని భారమైన పుస్తకాలుగా లేత చేతుల మీద మోసుకుంటూ ఇంట్లోకొచ్చింది. చిందర వందరైన తల్లి గతాన్ని పేర్చి,  ఇంట్లోకి తెచ్చి  స్థానం కల్పిస్తున్న అర్ధంలో. ఇంట్లోకొచ్చి ఆ పుస్తకాలన్నీ జారవిడిచేసింది. కిటికీలో మూడు పావురాల్ని చూసింది. ఆ పావురాలు సింబాలిజమ్స్. దేనికి సింబలిజమ్స్? గతంలో తన అమ్మకీ, ఆమెతో ఇద్దరబ్బాయిలకీ సింబాలిజమ్స్. అదే సమయంలో ఆమె కిటికీ లోంచి కన్పిస్తున్న ఇంద్రధనుస్సుని చూసింది. అటు వైపు కదిలింది. కిటికీ అద్దాలు ఎత్తింది. అక్కడున్న పావురాల్ని తరిమేసింది. పావురాల్ని చీదరగా తరిమేయడమేమిటి? అంటే ఆ పావురాలు  డిస్టర్బ్ అయిన పాత ప్రేమలకి గుర్తులని హింట్ ఇస్తున్నాడు దర్శకుడు. ఆమె ఇంద్రధనుస్సుని చూడడం, చనిపోయిన వారు ఇంద్రధనుస్సు గుండా స్వర్గానికి వెళతారని తల్లి చెప్పింది గుర్తు చేసుకోవడం...వూరికే కాదు. ఇదంతా ఫ్లాష్ బ్యాక్ లో మనం చూడబోయే  ముగింపే.  హీరోయిన్ తండ్రి మరణించినట్టు ఎలాగూ మనకిప్పుడు  తెలిసింది, ఇక ఆ రెండో అబ్బాయి కూడా చనిపోయాడా? వాళ్ళిద్దరూ స్వర్గానికి వెళ్లిపోయరా? లేకపోతే, చనిపోయిన వాళ్ళు ఇంద్రధనుస్సు గుండా ... అని అంత ప్రత్యేకంగా తల్లి చెప్పడమెందుకు? 

          ఈ ఇంద్రధనుస్సే ఫ్లాష్ బ్యాక్  ముగింపులోనూ వస్తుంది! ప్రధాన కథ ప్రారంభంలో ఈ ఇంద్ర ధనుస్సు, ఫ్లాష్ బ్యాక్ ముగింపులో ఇంద్ర ధనుస్సు-  తల్లికథ, కూతురు కథలకి ఇంద్రధనుస్సులతో ఒక ముడి. 

          అలాగే రెండవ మాంటేజిలో,  సెకెండ్ హీరోయిన్ కోసం హీరోయిన్ లవ్ లెటర్ టైపు చేస్తున్నప్పుడు, సెకెండ్ హీరోయిన్ చికెన్ పీస్ ని కసాపిసా నమిలి తింటుంది. అంటే న్యాయంగా హీరోయిన్ కి దక్కాల్సిన ప్రేమని అలా నమిలేస్తోందన్న మాట! 

      ఆమె పెట్టె లోంచి ఉత్తరం తీసి చదవబోయింది. ఫ్రెండ్ నుంచి ఫోన్ వచ్చింది. ఫోన్ రాకపోతే ఆ ఉత్తరాలన్నీ చదువుకుంటూ కూర్చునేదేమో... ఫోన్ రావడంతో వెళ్ళడంతో, ఇక్కడ గాలికి ఉత్తరాలన్నీ కొట్టుకుని పోయాయి. అడుగున డైరీ బయట పడింది...ఆమె చదవాల్సింది ఇదీ అని గాలికి పేజీలు రెపరెప కొట్టుకుంటున్నాయి... 

          ఇలా ఏకకాలంలో రెండు కాలాల ప్రేమ కథలకి అంకురార్పణ చేసిన సీన్ క్రియేషన్ ని ప్రేక్షకుల మనోఫలకాల మీద ముద్రించేస్తాడు. ఆ మత్తు వీడి పోలేరు ఇక ప్రేక్షకులు.

(ఇంకా వుంది)

సికిందర్

          (నోట్ : నియోనోయర్ థ్రిల్లర్ ‘బ్రిక్’, సర్క్యులర్ థ్రిల్లర్ ‘ట్రయాంగిల్’ ల గురించి రాయడం తలపెట్టి ఆపేయాల్సి వచ్చింది. కారణం, థ్రిల్లర్స్ పట్ల తెలుగులో ఆదరణ కన్పించకపోవడమే. ప్రేక్షకుల్లో కాదు, మేకర్స్ లో. ప్రేక్షకులకి కాస్త వెరైటీ నివ్వాలని మర్చిపోయినట్టున్నారు. దగ్గర దగ్గర రెండు దశాబ్దాలుగా స్టార్ మూవీస్ కైతే యాక్షన్ కామెడీలు, స్మాల్ మూవీస్ కైతే రోమాంటిక్ కామెడీల కాలాన్ని ఇంకా సాగదీస్తున్నారు.  కాబట్టి థ్రిల్లర్స్ గురించి రాయడాన్ని పక్కన పెట్టేశాం. అప్పుడప్పుడు ఒకరిద్దరు గుర్తు చేస్తూంటారు. గత సంవంత్సరం నియోనోయర్ ‘బ్లడ్ సింపుల్’ గురించి రాస్తే కూడా ఒకరిద్దరే ఆసక్తి చూపారు. కనీసం ఆ ఒకటి పక్కన సున్నా పడ్డా రాయవచ్చు. ఆ సున్నా కోసం ఎదురుచూద్దాం. ఒకటి పక్కన సున్నా = 10 మంది).

1, మే 2018, మంగళవారం

642 : స్క్రీన్ ప్లే సంగతులు


        నాల్గు రోజుల క్రితం పరిశీలన కోసం ప్రకటించిన కొరియన్ రోమాంటిక్ డ్రామా ‘ది క్లాసిక్’  ని చూసేసే వుంటారు ఈ పాటికి. చూడాలనే ఈ వ్యాసానికి విరామం ఇచ్చాం. తెలుగు రోమాంటిక్ డ్రామాల్ని ఫ్యామిలీ డ్రామాల తరగతికి తరలిస్తే, ఇటు రోమాంటిక్  డ్రామాలకీ,  అటు ఫ్యామిలీ డ్రామాలకీ రెండిటికీ న్యాయం చేయవచ్చేమో నన్న ఒక ఆలోచనకి బీజం వేసిన  ‘ది క్లాసిక్’ (2003) ని చూస్తే,  ఒక విషయం  అర్ధమయ్యే వుంటుంది.  తెలుగులో వస్తున్న రోమాంటిక్ డ్రామాలకీ, దీనికీ తేడా ఫీలయ్యే వుంటారు. ముగింపు ఒక తియ్యటి  బాధగా మిగిలిపోయే వుంటుంది. ఐతే  సాధారణ ప్రేక్షకులుగా ఫీలవ్వడం వేరు, కథకులుగా అలాటి  ఫీల్ ని ఫీలై  రాయడం వేరు. రాసినా ఆ ఫీల్ ని  తెలుగు దర్శకత్వంలో ప్రకటించడం ఇంకా వేరు. ఇక్కడే తేడా కొట్ట వచ్చు. ఎంత విరివిగా కొరియన్ ఆధునిక సినిమాల్ని కాపీ కొట్టినా, తెలుగు దర్శకత్వంలో అవి ఇంకా పాత చింతకాయ మూసలోకే  తిరగబెడుతున్నాయి. కాబట్టి కాసేపు తెలుగు వాళ్ళమని మర్చిపోయి, కొరియన్ కుర్రాళ్ళుగా అవతార మెత్తితే తప్ప (వరల్డ్ మూవీస్ వీరులే  వుండగా కొరియన్ కుర్రాళ్లుంటే  తప్పేంటి? వరల్డ్ మూవీస్ కంటే ఇదింకా కమర్షియల్ కూడా), వైవిధ్యమనేది  తెలుగులోకి తీసుకురావడం అస్సలు వీలుకాదు. కథ ప్రకారం ‘ది క్లాసిక్’  కి ‘మా నాన్న – మీ అమ్మ’  అని బ్రహ్మాండంగా తెలుగులో తనివితీరా టైటిల్ పెట్టుకోవచ్చు. అంత వరకే అనుమతి.  మిగతా కథా కాకరకాయ మూస తెలుగు వూరగాయ వేస్తూ కూర్చుంటే మాత్రం ఫ్యామిలీస్ కి ఉద్దేశించాలనే రోమాంటిక్ డ్రామాలు మళ్ళీ మొదటికే వస్తాయి. ఇవ్వాళ్టి ఫ్యామిలీస్ వాళ్ళ తాతల కాలంలో లేరు. కాబట్టి ఫ్యామిలీ డ్రామా అనగానే తాత ముత్తాతల మీద కూడా పడిపోయి, కుర్రకుంకలకి కట్ట బెడితే, ఇది మల్లెల వేళయనీ ...అని ఫ్యామిలీ బాణీలు విన్పించవు బాక్సాఫీసు దగ్గర సరికదా, ఎండ మండిపోతూంటుంది పాత ముక్కిన చాదస్తానికి. ఒక్క అమాయక ప్రేక్షకుడూ నక్కి వుండడు గేటు లోపల!

          విశేషమేమిటంటే,  ‘ది క్లాసిక్’ డ్రామాలో పెద్ద వయసు పాత్రలే లేవు. ఇది చాలా ఆనందం కల్గించే విషయం. పెద్దలూ వాళ్ళ మూతికి నీతులూ ఇక్కడ బంద్ (వయసులో వున్నప్పుడు వాళ్లకేం నీతులుండేవో ఎవరికి తెలుసు). ఒకటి రెండు పెద్ద పాత్రలున్నా (తాత, తండ్రి) అవి ఒకటి రెండు సీన్లకే పరిమిత మయ్యాయి. నాణేనికి ఇంకో వైపుచూస్తే, రోమాంటిక్ డ్రామాల్లో వయసు మళ్ళిన పాత్రలు వుండి తీరాలని, అప్పుడే అవి ఫ్యామిలీస్ కి కూడా ఆముదంలా పట్టుకుంటాయనీ  రూలేమీ లేదు. ప్రతీ వయసు మళ్ళిన వ్యక్తీ తన టీనేజీకి బందీయే. ఇంకా బాల్యం గుర్తుండక పోవచ్చుగానీ, తమ టీనేజీ రోజుల్ని మర్చిపోలేరు. ఈ మనః స్థితి మీద ప్లే చేస్తే పెద్ద వాళ్ళు కూడా రోమాంటిక్ డ్రామాలకి కనెక్ట్ అవుతారు. దీన్నెలా కనెక్ట్ చేశాడూ దర్శకుడంటే, కథలో టీనేజీ హీరోయిన్ - ఆమె తల్లి ప్రేమ కథలో కూడా ఆమె  తల్లిది టీనేజీ వయసు – పైగా ఈ రెండు పాత్రల్నీ ఒకే టీనేజీ నటి నటించడం. తల్లీ కూతుళ్ళ ఇద్దరి ప్రేమ కథలూ వాళ్ళ టీనేజీ అప్పటివే.  ఇలా యూత్ కి యూత్, ఫ్యామిలీ ప్రేక్షకుల్లో పేరెంట్స్ కీ గతంలో వాళ్ళ యూత్ – ఇలా టూ ఇన్ వన్ షో!

దర్శకుడు క్వాక్ జే యంగ్.  
        అంతేగానీ తల్లి కదా అని చెప్పి,  ఓ గొప్ప తెలుగు చిల్లరాలోచన చేసి, ఓ మాంచి దిట్టంగా వున్న పెద్దావిడని తెచ్చి పడేసి, అడల్ట్ ప్రేమ కట్టబెట్టి  వుంటే – ఆ నటీ, ఆమె సహ నటుడూ సీనియర్ నటులుగా కలిసి వ్రతం చెడగొట్టే వాళ్ళు. ఇలాకాక ఇక్కడ ప్రెజెంట్ స్టోరీ టీనేజీ పాత్రలతో ఎంత ఫ్రెష్ నెస్ తో వుంటుందో, ఫ్లాష్ బ్యాక్ కథ కూడా అప్పటి టీనేజీ పాత్రలతో అంతే ఫ్రెష్ నెస్ తో ఆసక్తి గొల్పుతుంది. వెరసి రెండూ భిన్న కాలాల టీనేజి ప్రేమలై  ఒక వైవిధ్యం. ఇది కూడా  మార్కెట్ యాస్పెక్టే. మొత్తంగా యూత్ అప్పీల్ కూడా (పేరెంట్స్ కూడా ఒకప్పటి యూతే కదా). 

          ఇప్పుడు తెలుగులో కావాల్సింది సినిమాకో లుక్ మార్చుకునే హీరోల మేకోవర్ ప్రయత్నాలు కాక, కథల మేకోవర్ తంటాలేమో ఆలోచించుకోవాలి. కథల లుక్ ని మార్చేసే మేకోవర్ల కోసం అతి సింపుల్ గా వుండే కొరియన్ డ్రామాల్ని చూడొచ్చు. 

          ఒక్కో చోట ఈ రోమాంటిక్ డ్రామాలో భావోద్వేగాలతో కూడిన సన్నివేశాలు ఒకనాటి మణిరత్నం సినిమా చూస్తున్నామా అన్నట్టుంటాయి. ఐతే మణిరత్నం లాగా పంచ భూతాల్ని చూపించలేదు. ప్రకృతి కాలాల్ని చూపించాడు దర్శకుడు క్వాక్ జే యంగ్.  టైటిల్స్ నుంచే దీన్ని గమనించవచ్చు. కొండకోనలూ సెలయేళ్ళూ వృక్షాలూ ... వీటి  రెండు కాలాలు  మార్చి మార్చి  చూపిస్తూంటాడు. పిల్ల కథ,  తల్లి కథ అనుకోవాలనుకున్నట్టుగా. ఒక పక్క లేలేత ప్రకృతి, ఫేడవుట్ అయి ముదిరిన ప్రకృతి. ఇలా మార్చి మార్చి చూపిస్తూ టైటిల్స్ చిట్టచివర, మహా వృక్షాల మొదళ్ళ దగ్గర నేలని తాకుతూ కుంగుతున్న సూర్యబింబాన్ని చూపిస్తాడు.... ఇది ఆందోళన కల్గిస్తుంది. ఇక్కడ అన్యాపదేశంగా ఒక అస్తమయాన్ని చూపిస్తున్నాడు – దేని అస్తమయాన్ని? అక్కడున్న మహా వృక్షాల్ని బట్టి చూస్తే తల్లి కథ అస్తమయాన్నే... ఇలా ఈ ‘ఓపెనింగ్ టీజర్’ తోనే కథని వెంటనే చూసెయ్యాలన్న ఆత్రుత కల్గిస్తాడు. మంచి మార్కెట్ యాస్పెక్ట్ వున్న క్రియేటివిటీ. 

          ఒక అస్తమయంతో ఇంకో సూర్యోదయం. తల్లి కథ అస్తమించక పోతే పిల్ల కథ ఉదయించదు. తల్లి కథకి సమాధానం పిల్ల కథలోనే వుంది. పిల్ల కథకి ఆధారం తల్లి కథతో నే వుంది. ఇదొక చక్ర భ్రమణం. ఇద్దరూ సార్ధకమయ్యే ఒక పరస్పరం, ఒక ద్వంద్వం.

స్థూలంగా ఇదీ కథ
      కాలేజీ స్టూడెంట్ జీహై (సన్ యే జిన్), డ్రామా దర్శకుడూ  స్టూడెంటు అయిన   సాంగ్ మిన్ ( జో ఇన్ సియోంగ్) ని ప్రేమిస్తూంటుంది. ఫ్రెండ్ సూ క్యుంగ్ (లీ సంగ్ క్యుంగ్)   కూడా అతన్నే ప్రేమిస్తూంటే సందిగ్ధంలో పడుతుంది. ఒకరోజు తన తల్లి పాత  ఉత్తరాల్ని, డైరీ నీ చూస్తుంది. డైరీలో 1960 లనాటి తల్లి జూహీ (సన్ యే జిన్ ద్విపాత్రాభినయం) ప్రేమకథని ఆసక్తిగా చదువుతుంది.  అప్పట్లో జూహీ, జూన్ హా (జో సియోంగ్ వూ) తో ప్రేమలో వుంటుంది. కానీ ఆమె తాత ఆమె పెళ్లిని టీసూ ( జున్ టీసూ) తో నిశ్చయం చేశాడు. ఇప్పుడు తల్లి ప్రేమ కథ ఎలా ముగిసింది? తల్లి ప్రేమ కథ తెలుసుకున్న జీహై ప్రేమకి ఎలాటి ముగింపు దొరికింది? ఇదీ విషయం. 

          ఐతే కొరియన్ దర్శకుడు అటక మీంచి పాతావకాయ జాడీనే దించాడనడానికి ఎలాటి మొహమాటమూ పడనక్కర్లేదు. వాళ్ళ జాడీ కూడా తెలుగు జాడీ లాగే వుంది. ఇందులో సమకూరిన దినుసులు ఇవీ : తొలిప్రేమ మరిచిపోలేని క్షణాలు, అందమైన అమ్మాయికి కష్టాలు, వర్షంలో విహారం, కాలు బెణికి హీరో వీపున స్వారీ, వెచ్చటి చెట్టు కింద పుచ్చకాయ ఆరగింపు, మిణుగురు పురుగులు పట్టడం, ఇంత చేసిన హీరోకి నెక్లెస్ తీసి కట్టేయడం, ఉత్తరాలు, పావురాలు, ప్రేమిస్తున్న అమ్మాయికి తన ఫ్రెండ్ తో ఉత్తరాలు రాయించడం, స్నేహాలు, త్యాగాలు...


          పల్లెటూళ్ళో ఎడ్ల బండి మీద పట్నం అమ్మాయి, చిల్లర నేస్తాలతో అల్లరి చేస్తున్న హీరో పేడ పురుగు తీసి ఆమెకి చూపించడం -  వాట్ పేడ పురుగు హై దిసీజ్ - అని జీవితంలో మొదటిసారి చూస్తున్న పట్నం అమ్మాయి షాక్ అవడం, నేస్తాలు ఎడా పెడా పేడ పోసుకుంటూ పోకిరీతనాలు పోవడం, రాజకీయ నాయకుడి మనవరాలికీ, బిజినెస్ మాన్ కొడుక్కీ పెళ్లి సంబంధం, వాళ్ళే అమ్మాయి అబ్బాయి చనువు పెంచుకోవాలని స్వేచ్ఛగా  వదిలెయ్యడం, ఐనా  ప్రేమించని కొడుకుని బిజినెస్ మాన్ బెల్టు తీసి చెమ్డా లెక్కదీయడం, నీయబ్బ నువ్వే ఇలా చేస్తావా అని ఆ కొడుకు అదే బెల్టుతో ఉరేసుకోవడం...


          ఐతే చాలా క్లాస్ గా, అర్ధవంతంగా చెప్పాడు చెబుతున్న విషయం. ఇందులో ఏడ్పించే సన్నివేశాలు అనేకం వున్నాయి. పాత్ర చిత్రణ, సన్నివేశ బలంలేని ఉత్తుత్తి ఏడ్పులు కావు. ఎవరికైనా పుట్టినప్పటి పాత ఫేసే వుంటుంది. మేకోవర్ తో కొత్తగా మెరుస్తుంది. పాత మసాలా దినుసుల్నే అలా ఆచితూచి వాడుకుంటూ, పాతని తిరగమోతతో కొత్తగా చూపించడమే రోమాంటిక్ ఫ్యామిలీ డ్రామాలకి కొత్త మార్కెట్ ని సంతరింప జేయవచ్చు. 


          ఇంత కథా రెండు గంటలే. రెండు మాంటేజ్ సాంగ్స్ వుంటాయి. అడుగడుగునా తెలుగు సినిమాలకి ఏ అంశం ఎలా అప్లయి అవుతుందాని చూసుకుంటూ వెళ్తూంటే, ఏదీ తీసేయడానికి వుండదు. అలాగని కాపీ కొట్టాలని కాదు. మేకింగ్ ని తులనాత్మకంగా పరిశీలించడం. తెలుగులో రోమాంటిక్ ఫ్యామిలీ డ్రామాల్ని ఇలా రెండు మాంటేజ్ సాంగ్స్ తో రెండు గంటల నిడివితో తీస్తే ఆడవా? –అంటే తప్పకుండా  ఆడే అవకాశముంది. ‘శివ’లో పాటలు తీసేస్తే కథ తప్ప,  వేరే ఏ కామెడీ ట్రాకులూ ఉప కథలూ లేవుగా? సూటి కథనే సీను తర్వాత సీనుగా చూసుకుంటూ వెళ్ళారుగా  ప్రేక్షకులు?


          ఈ మూవీలో వున్న దృశ్య పరంపరని చూస్తే, తెలుగులో ఇలాటి కథా కథనాలతో కాస్త హృద్యంగా రెండు గంటల్లో తీస్తే,  ఇంకే లోటూ ప్రేక్షకులు ఫీలవలేరనేది రూఢీ అయిపోతుంది. రెండు గంటల కథే  కడుపు నిండా కథై పోతుంది. 


          మేకింగ్ కి సంబంధించి మరొకటేమిటంటే, నటీనటుల ఎంపిక. ఆరుగురు యువ నటులూ మాంచి ఫిజిక్ తో, ఫోటో జెనిక్ గా, కంటికింపైన కాస్ట్యూమ్స్ తో, గడ్డాలూ మీసాల రౌడీ ఫేసులు  లేకుండా,  ఎల్లడెలా రోమాంటిక్ ఫీల్ ని వెదజల్లుతూ కథతో పాటు ట్రావెల్ అవడం. ఇలా అందరూ కొత్త వాళ్ళతో తక్కువ బడ్జెట్ లో తీసినా వర్కౌట్ అయిపోతుంది. ఇందులో తల్లీ కూతుళ్ళ రెండు పాత్రలూ వేసిన నటి సన్ యే జిన్ కి,  అప్పుడు వయసు పద్దెనిమిదే. అద్భుతంగా నటించింది.


కథా, గాథా? 
      ఈ మూవీని చూసిన స్ట్రక్చరాశ్యులకి  ఇందులో స్ట్రక్చర్ ఏమిటా; ఇదసలు కథా, గాథా;  పాత్రలేమిటి పాసివా, యాక్టివా అని సవాలక్ష సందేహాలు రావచ్చు. ఫ్లాష్ బ్యాక్ తో వుండే స్క్రీన్ ప్లేలు ఫ్లాష్ బ్యాక్ ని ప్రధాన కథకి సమాచారం కోసం వాడుకుంటాయి. ఫ్లాష్ బ్యాక్ ఎప్పుడూ కథ కాదు. కనుక అది గాథ అయి వున్నా ఫర్వాలేదు. ఫ్లాష్ బ్యాక్ తో కమర్షియల్ సినిమా ఆడదు కాబట్టి. ప్రధాన కథతోనే  ఆడుతుంది కాబట్టి. ఫ్లాష్ బ్యాక్  అనేది ప్రధాన కథకి అవసరమున్న  సమాచారాన్నందించే వనరు మాత్రమే కాబట్టి, ఆ ఫ్లాష్ బ్యాక్ కథ అయి వుండనవసరం లేదు.  గాథ కావొచ్చు. అందుకని సహజంగానే ఫ్లాష్ బ్యాక్ లో పాత్రలు పాసివ్ గానే వుంటాయి. ఫ్లాష్ బ్యాక్ అందించిన సమాచారంతో ప్రధాన కథలో తలెత్తిన సమస్య పరిష్కారమౌతుంది, అదే సమయంలో ఫ్లాష్ బ్యాక్ లో పాసివ్ గా వుండిపోయిన బాధిత పాత్రలకీ, ప్రధాన కథలో సమస్యా పరిష్కారంతో న్యాయం చేకూరుతుంది. 

          అందుకని ప్రధాన కథ కథ అయితే, దాని ఫ్లాష్ బ్యాక్ గాథ అయి తీరాల్సిందే. రెండూ కథలై పోతే కథే (స్క్రీన్ ప్లే నే ) కుదరదు. రెండు విడివిడి కథలవుతాయి. 


          ఫ్లాష్ బ్యాక్ తో వుండే సినిమాల్లో స్ట్రక్చర్ ని ప్రధాన కథకే చూసుకోవాలి. స్ట్రక్చర్ వుందంటే యాక్టివ్ పాత్ర లున్నట్టే. సమస్య – సంఘర్షణ – పరిష్కారమనే త్రీ యాక్ట్ లో స్క్రీన్ ప్లే కుదిరినట్టే. ఫ్లాష్ బ్యాక్ లోని సమాచారాన్ని ఆ  స్క్రీన్ ప్లేలో అక్కడక్కడా వెదజల్లుకుంటూ పోవడమే – ప్రధాన కథలో పాత్రలకి తలెత్తిన సమస్యకి తగిన పరిష్కారం మొలకెత్తే వరకూ. 


          ఈ మూవీ స్క్రిప్టింగ్ ఇలాగే వుంది. హీరోయిన్ ప్రేమకథ కథే. ఇందులో హీరోయిన్,  ఆమె  ప్రేమిస్తున్న హీరో, ఆ హీరోని  ప్రేమిస్తున్న సెకండ్ హీరోయిన్, ముగ్గురూ లక్ష్యం కోసం (ప్రేమని పొందడం)  ప్రయత్నించే యాక్టివ్ పాత్రలే. ఈ ప్రధాన కథలో ప్రధాన పాత్ర హీరోయినే. తన సమస్యకి ఆమె నిర్ణయం తీసుకుని సంఘర్షిస్తుంది. 


          ఇదే ఫ్లాష్ బ్యాక్ లో చూస్తే, ప్రధాన కథలోని హీరోయిన్ తల్లి కి సంబంధించిన ఆ  ప్రేమకథ కథలా వుండదు. తనూ తనకి ప్రేమలో తారస పడ్డ  ఆ ఇద్దరు హీరోలూ ముగ్గురూ పాసివ్ పాత్రలే. ప్రధాన పాత్ర తనే. లక్ష్యముంది ప్రేమకోసం. కానీ నేరవేర్చుకోలేని, నిర్ణయం తీసుకోలేని  అశక్తురాలు. ఆ ఇద్దరూ అంతే. అదొక ట్రాజెడీ, ఓ గాథ.


ముక్కోణాల సంగతి 
     ఇక ప్రధాన కథలో, ఫ్లాష్ బ్యాకులో వున్నవి రెండూ కూడా ముక్కోణ ప్రేమలే. ప్రధాన కథలో ఇద్దరమ్మాయిలు, ఒకబ్బాయి. ఫ్లాష్ బ్యాక్ లో ఒకమ్మాయి, ఇద్దరబ్బాయిలు. ఈ బ్లాగులో ఏప్రెల్ 24,  Q & A లో, ముక్కోణ ప్రేమ కథలు ఎందుకు ఆకట్టుకోవడంలేదో చెప్పుకుంటూ, దీనికి పరిష్కారంగా జేన్  ఆస్టెన్  ఫార్ములా  ప్రస్తావించుకున్నాం. సరీగ్గా ఆ ఫార్ములా ఇక్కడ అమలైంది! 

          జేన్ ఆస్టెన్ సక్సెస్ ఫుల్ ఫార్ములా ప్రకారం, ఈ ముక్కోణ ప్రేమలో హీరోయిన్ హీరోని ప్రేమిస్తూంటే,  సెకెండ్ హీరోయిన్ కూడా ప్రేమిస్తూంటుంది. కానీ సెకండ్ హీరోయిన్ తో వున్న స్నేహానికి విలువిచ్చి హీరోయిన్ తప్పుకుంటుంది. 


          హీరో వైపు చూస్తే, ఇతను ఇద్దరమ్మాయిలతో వున్నా ఎవర్ని ప్రేమిస్తున్నాడో తెలీదు. హీరోయిన్ చేసిన త్యాగం తెలియడంతో, అప్పుడు సెకెండ్ హీరోయిన్ని రెండు పీకి హీరోయిన్ వైపు వచ్చేస్తాడు. మొదట హీరోయిన్నే  ప్రేమించాడు, కానీ బయట పెట్టుకోలేదు. ఆస్టెన్ ఫార్మలా ప్రకారం పాత్ర ఇద్దరితో ఒకేసారి ప్రేమలో వుండదు. అదే ఇక్కడ జరిగింది. హీరో హీరోయిన్నే ప్రేమించాడు, దొరికింది కదాని సెకెండ్ హీరోయిన్ని కూడా ప్రేమించడు. 


          ఇక ఫ్లాష్ బ్యాక్ లో హీరోయిన్ తల్లితో ఇద్దరబ్బాయిలు ఇంటరాక్ట్ అవుతున్నా, ఆమె హీరో ఒక్కడినే  ఇష్టపడి, సెకండ్ హీరోని  అస్సలు పట్టించుకోదు. ఇష్టపడ్డ హీరో అనుకోని ట్రాజెడీకి గురై, ఆమెకి ముఖం చూపించలేక వేరే పెళ్లి చేసుకోవడంతో, చేసేది లేక ఆమె సెకండ్ హీరోతో పెద్దలు నిశ్చయించిన పెళ్ళే చేసుకుంటుంది. ఇక్కడ కూడా పాత్ర ఏకకాలంలో ఇద్దరితో ప్రేమలో పడదు, పడి ఎవర్ని ఎంపిక చేసుకోవాలో తెలీని డ్రామాలో పడదు ఆస్టెన్ ఫార్ములా ప్రకారం...   ఆస్టెన్ ఫార్ములా వెండి తెర కొచ్చేసి స్క్రీన్ ప్లే లో,  కాన్షస్ - సబ్ కాన్షస్ మైండ్స్ ఇంటర్ ప్లేని  ఎలా సపోర్టు చేస్తుందో కూడా,  పైన చెప్పుకున్న Q & A లో వివరించుకున్నాం.


          ఇలా బ్యాక్ గ్రౌండ్ సందేహాలన్నీ తీర్చుకున్నాక, ఇక ఒక్కో సీనేమిటో, దాని పాయింటేమిటో వరసగా తెలుసుకుందాం...


సికిందర్
(దీని కొనసాగింపు వ్యాసాల కోసం  బ్లాగులో సెర్చి చేసుకోవచ్చు)

28, ఏప్రిల్ 2018, శనివారం

    ఐతే రోమాంటిక్ డ్రామాలకి మార్కెట్ లేదా? యూత్ కోసమే అనుకుంటే మార్కెట్ లేదు. యూత్ కి ఒక పద్ధతిగా తీసిన,  జానర్ మర్యాదతో కూడిన  రోమాంటిక్ కామెడీలు కావాలి, రోమాంటిక్ డ్రామాలు కాదు. యూత్ కోసం రోమాంటిక్ డ్రామాలు తీయడం పాత చాదస్తం, మార్కెట్ యాస్పెక్ట్ కి వ్యతిరేకం.  ఇవి ఇటు యూత్ కి కాకుండా, అటు ఫ్యామిలీస్ కీ కాకుండా శుభ్రంగా థియేటర్ల ముంగిట్లో వారంవారం ఆత్మహత్యలు చేసుకుంటున్నాయి. ఒకవేళ రోమాంటిక్ డ్రామాలని  యూత్ కి కాకుండా, ఫ్యామిలీ ఆడియెన్సెస్ కే టార్గెట్ చేసి తీస్తే? దీనికి చాలా నేర్పు కావాలి. నేర్పుతో తీస్తే రోమాంటిక్ డ్రామాలు ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ గా వర్కౌట్ అవచ్చు.  రోమాంటిక్ కామెడీల జానర్ మర్యాదలో, మార్కెట్ యాస్పెక్ట్ లో పెద్ద వయసు పాత్రలు లేకుండా చూసుకోవడం ముఖ్యమైతే, ఫ్యామిలీ ఆడియెన్సెస్ కోసం తీయాలనుకున్న రోమాంటిక్ డ్రామాల జానర్ మర్యాదలో, మార్కెట్ యాస్పెక్ట్ లో  పెద్ద వయసు పాత్రలు కూడా ప్రధానమై వుండాలి. ఎలా ప్రధానమై వుండాలి? పిల్లల ప్రేమలకి అడ్డు తగులుతూనా? నో, నెవ్వర్! అది పనీపాటా లేని పాత సుత్తి.  మరెలా?  ఇది తెలుసుకోవడం కోసం కొరియన్ రోమాంటిక్ డ్రామా ‘ది క్లాసిక్’ ని పరిశీలించాలి...

      పరిశీలన త్వరలో!   

26, ఏప్రిల్ 2018, గురువారం

716 : సందేహాలు -సమాధానాలు




Q :    కాన్షస్ -  సబ్ కాన్షస్ ఇంటర్ ప్లేని ముక్కోణ ప్రేమ కథలకెలా అన్వయించాలి? ఏమైనా మూవీస్ ఉదాహరణకి చెప్తారా? ఈ ప్రశ్న మిమ్మల్ని ఇరిటేట్ చేస్తుందని తెలుసు. కానీ ఇప్పుడు నేనొక ఎసైన్ మెంట్ చేస్తున్నా, అందుకే అడిగాను. పోతే, హిందీలో రాజ్ కుమార్ హిరానీ సినిమాలు కాన్షస్ -  సబ్ కాన్షస్ ఇంటర్ ప్లేనే పోలి వుంటాయంటారా?
జయసింహా, రచయిత 

 A :   ఇరిటేడ్ అవడానికేముందని. అసలెందుకు ఇరిటేట్ అవాలని. అది విక్టిమ్ మెంటాలిటీ. ముక్కోణ ప్రేమ కథలకి  కాన్షస్ -  సబ్ కాన్షస్ ఇంటర్ ప్లేని కల్పించాలంటే ఇంటర్ ప్లేని ముక్కోణంలో వుండే మూడు పాత్రల్లో రెండిటికే పరిమితం చేయాలి. ఏ కథల్లోనైనా ఇంటర్ ప్లే ఎప్పుడూ రెండు పాత్రల మధ్యే వుంటుంది గనుక. ఐతే ముక్కోణ ప్రేమకథలు ఒక పాత్ర వర్సెస్ రెండు పాత్రలుగా వుంటాయి. కథంటేనే ఒక పాత్రకి వ్యతిరేకంగా ఇంకో పాత్ర పనిచేయడం. ఇలా ఇతర జానర్ల కథల్లో ఇంటర్ ప్లే హీరోకీ విలన్ కీ లేదా,  హీరోకీ హీరోయిన్ కీ, తండ్రికీ కొడుక్కీ,  అన్నకీ తమ్ముడికీ ...ఇలా రెండు పాత్రల  మధ్యే వుంటుంది. 

          కానీ ముక్కోణ ప్రేమల్లో కథ హీరోదైతే, ఎదుటి పాత్రలుగా రెండు  హీరోయిన్ పాత్రలుంటాయి. కథ హీరోయిన్ దైతే,  ఎదుటి పాత్రలుగా  రెండు హీరో పాత్రలుంటాయి. అదే ఇతర జానర్స్ లో హీరోకి ఇద్దరు విలన్లు విడివిడిగా వుండరు. వుంటే ఒకే లక్ష్యంతో కుమ్మక్కై వుంటారు. ఎందుకంటే హీరోకి రెండు లక్ష్యాలు కుదరదు కాబట్టి. ఇద్దరు విలన్లు వేర్వేరు లక్ష్యాలతో వుంటే, ఒక విలన్ సద్దాం హుస్సేన్ లా ఎందుకో ‘బంకర్’ లాంటి  దాంట్లో దాక్కుని పడుకుని, హీరో చేతిలో ఉత్తి పుణ్యాన చచ్చిపోతాడు  ‘రంగస్థలం’ లో లాగా. హీరోకి కూడా ఇతడితో లక్ష్యం లేదు కాబట్టి, కథలో వేస్టుగా వేలాడుతున్న అన్ వాంటెడ్ ఫెలోని సరదాకి స్వచ్ఛ భారత్ కార్యక్రమం లాంటిది చేపట్టి, ప్రక్షాళన చేసే స్తాడు సైకో కిల్లర్ లాగా – భంగ స్థలం చేస్తూ. దీనికి సరేలే సంబడమని వూరుకోవాలి మనం. 

      అసలు కాన్షస్ -  సబ్ కాన్షస్ ఇంటర్ ప్లేలో ఎదురురెదురు రెండే పాత్రలుంటాయి. ప్రధాన పాత్ర, ప్రత్యర్ధి పాత్ర. కారణం, మనుషులనే వాళ్ళకి కాన్షస్ మైండ్ ఒకటి, సబ్ కాన్షస్ మైండ్ ఒకటి మాత్రమే ఆలోచించి దేవుడు అమర్చాడు.  లేకపోతే  ఈ ప్రపంచాన్ని మనుషులెప్పుడో ఖతం చేసి పారేసే వాళ్ళు. అలాటిది ముక్కోణంలోకి తెచ్చి  ఒక పాత్ర వర్సెస్  రెండు పాత్రలు పెడితే ఇంటర్ ప్లే ఎలా సాధ్యమవుతుంది? కాన్షస్ మైండ్ వర్సెస్ సబ్ కాన్షస్ మైండ్ + అదనపు సబ్ కాన్షస్ మైండ్ అసహజమూ, ప్రకృతి విరుద్ధమూ కదా?

          ఇందుకే ఒక పెళ్ళికాని హీరో x ఇద్దరు పెళ్లి కాని  హీరోయిన్లు, లేదా ఒక పెళ్ళికాని హీరోయిన్ x ఇద్దరు పెళ్లి కాని హీరోల ముక్కోణాలు పెద్దగా కనెక్ట్ కావు. 

          ఎప్పుడు కనెక్ట్ అవుతాయంటే,  మూడింట్లో రెండు పాత్రలకి పెళ్ళయిపోయి వుంటే. ఈ రకం ముక్కోణాల్లో సంజయ్ లీలా భన్సాలీ బలమైన ఇంటర్ ప్లేలని సృష్టిస్తాడు ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ (1999) లోనైనా, ‘బాజీరావ్ మస్తానీ’ (2015) లోనైనా. ‘కాసా బ్లాంకా’ (1942) లాంటి హాలీవుడ్ లో కూడా ఇంతే. ‘ఆప్ కీ కసమ్’ (1975), ‘ఏక్ హసీనా దో దీవానే’(1972) లాంటి బాలీవుడ్స్ లో కూడా ఇంతే. ‘మేఘ సందేశం’ (1982), ‘జీవిత చక్రం’ (1971) లాంటి టాలీవుడ్స్ లో కూడా ఇంతే. ‘దేవదాసు’ (1953) లో పార్వతి (సబ్ కాన్షస్) అంటే భయపడి పారిపోతాడు దేవదాసు (కాన్షస్). చంద్రముఖితో కాన్షస్ వరల్డ్ లోనే వుండి పోతాడు. విడిగా కాన్షస్ మైండ్ కి జీవితం లేదు. సబ్ కాన్షస్ (అంతరాత్మ)తో కలిసుంటేనే జీవితం, లేకపోతే  పతనం. దేవదాసు పతనం ఇలాంటిదే. ఇందులో నీతి ఇదే.

          ఒకసారి కింది జేమ్స్ బానెట్  పటం చూస్తే,  గొప్ప కథల మెంటల్ మేకప్ ఇదీ : ఎడమ కాన్షస్, కుడి సబ్ కాన్షస్, పైన స్పిరిచ్యువల్, కింద ఫిజికల్ – ఈ నాల్గిటి కలబోతే మనిషి. స్పిరిచ్యువల్ శిఖరంతో ‘దేవదాసు’ గొప్పకథల స్థాయికి చేరింది. స్పిరిచ్యువాలిటీ ఏం చెప్తుందంటే, నువ్వు అంతరాత్మ (సబ్ కాన్షస్) తో కలిసివుంటే, సద్గతి పొందుతావని, ఆథ్యాత్మిక ఫలాల్ని అందుకుంటావని. దేవదాసు అంతరాత్మతో కలిసి లేడు. అందుకే ఫిజికల్ (తామసిక) స్థాయిలో వుండిపోయి పతనమయ్యాడు. 


        సరే, గొప్ప కథలిప్పుడు అవసరం లేదు. గొప్ప సినిమాలు తీయాలంటే ఆస్తికులై వుండాల్సిందే, నాస్తికుల వల్ల కాదు. స్టీవెన్ స్పీల్ బెర్గ్ ‘ది రైడర్స్ ఆఫ్ ది లాస్ట్ ఆర్క్’ తో ప్రేక్షకుల ఆత్మిక దాహాన్నిఅంత గొప్పగా తీర్చగాలిగాడంటే, నాస్తికుడై కాదు. 

          ఈ కాలంలో గొప్ప కథలు కాక, సింపుల్ కథలే అర్ధవంతంగా చెప్పాలంటున్నాం కాబట్టి, దీని గురించే మాట్లాడుకుందాం. 

          పై పెళ్ళయిన సెటప్ లో ఏం జరుగుతుందంటే - పూర్వం ప్రేమించి, పెళ్ళయిపోయిన పాత్రని మర్చిపోలేక సొంతం చేసుకోవాలని సంఘర్షిస్తూంటుంది ప్రధానపాత్ర. ‘హమ్ దిల్ దే చుకే సనమ్’ లో పెళ్ళయిన ప్రేయసి ఐశ్వర్యా రాయ్ కోసం తపిస్తూంటాడు ప్రధాన పాత్ర సల్మాన్ ఖాన్. ఇక్కడ సల్మాన్ పాత్ర కాన్షస్  అయితే, ఐశ్వర్య పాత్ర సబ్ కాన్షస్. ప్రధాన పాత్ర సాధించాలనుకున్న దేదైనా సబ్ కాన్షసే అవుతుంది. ఐశ్వర్య భర్త పాత్ర అజయ్ దేవగణ్ కాన్షస్ - సబ్ కాన్షస్ ల మధ్య గార్డియన్. మనుషుల సబ్ కాన్షస్ లో వుండే తొమ్మిది రకాల ఎమోషన్స్ లో ఒకటైన గార్డియన్ ఎమోషన్. ఇలా మూడో పాత్ర విడిగా మరో సబ్ కాన్షస్ గా  కాకుండా,  సబ్ కాన్షస్ లోనే  భాగమైన గార్డియన్  ఎమోషన్ కి ప్రతీకగా సర్దుకుంటుంది. కనుక మొదటి  రెండు పాత్రలతో కాన్షస్ – సబ్ కాన్షస్ ల ఇంటర్ ప్లే చెక్కుచెదరదు. ఆ గార్డియన్ ఎమోషన్ తో కూడా హీరో తలపడాల్సిందే ఆమెని (సబ్ కాన్షస్ ని) పొందాలంటే. ఈ గార్డియన్ ఎమోషన్ నిర్ణయం పైనే ఆ ప్రేమికుల భవిత్యం ఆధారపడుతుంది. సాధారణంగా ఈ గార్డియన్ పాత్ర సంఘర్షిస్తున్న తన భార్యని , ఆమె ప్రేమికుడిని కలిపేసి విముక్తి కల్గిస్తుంది. 

      పెళ్లి హీరోకే  అయ్యిందనుకుందాం. ఆ హీరోకి పూర్వ ప్రేయసో, తాజా ప్రేయసో తగిలి తెగులు పుడుతుంది. ఈ ఇద్దర్లో ప్రేయసి ఏ  తరగతికి చెందినా,  హీరోకి సబ్ కాన్షస్ వరల్డ్ అవుతారు. కథల్లో ప్రధాన పాత్ర సాధించాలనుకున్న దేదైనా సరే, అది సబ్ కాన్షస్ వరల్డ్ కి ప్రతీకే అవుతుంది. తను కాన్షస్ ఇగో. అప్పుడు తనతో వున్న భార్య సబ్ కాన్షస్ లో గార్డియన్ ఎమోషన్ అవుతుంది. ఇలా హీరోకైనా, హీరోయిన్ కైనా పెళ్ళయి పోతే – ఆ లైఫ్ పార్టనర్ పని గార్డియన్ ఎమోషన్ గా కాపలా కాసి, సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడమే. ఒక్కోసారి పీవీ నరసింహా రావులా ఏ నిర్ణయమూ  తీసుకోకపోవడం కూడా నిర్ణయమే అని ఇక్కడంటే కుదరదు. ఆ కథ తెగదు. గంటలకి గంటలు సినిమా గడిచిపోతున్నా తెరపడక చించేసి పోతారు ప్రేక్షకులు. పీవీ నరసింహారావు బతికిపోయారు గానీ, సినిమాలు బతక లేవు.  

          భర్తకి ఆ ప్రేయసి పూర్వ  ప్రేయసి అయితే,  భార్యే త్యాగం చేస్తుంది. ఎందుకంటే లవ్ ఎట్ ఫస్ట్ సైట్ కే పెద్ద పీట వేయాలి కాబట్టి. లేకపోతే ఆ పూర్వ ప్రేయసి బాధితురాలై, ప్రేక్షకులు ఒప్పుకోరు. ప్రేక్షకులు ముక్తకంఠంతో ఒప్పుకోకపోతే పోయార్లే  అని మనకెందుకనుకుంటే కుదరదు. ముక్తకంఠం అంటే వాళ్ళందరి కలెక్టివ్ కాన్షసే. ఎన్నో సబ్ కాన్షస్ (అంతరాత్మ) ల సమ్మేళనం ఆ సామూహిక కాన్షస్. దీన్ని  గౌరవించాల్సిందే. 

          భర్తకి ఆ ప్రేయసి తాజా సెటప్ అయితే మాత్రం, ఆ సబ్ కాన్షస్ కి ప్రతీక అయిన తాజా ప్రేయసి కోసం సంఘర్షించి సంఘర్షించి, ఆ భర్త నగ్న సత్యాలు తెలుసుకుని (సబ్ కాన్షస్ లో వుండేవి నగ్న సత్యాలే) పరివర్తన చెంది భార్య వైపుకి వచ్చేస్తాడు. తొలిప్రేమ భార్యే అన్నది కూడా ప్రేక్షకుల కలెక్టివ్ కాన్షస్ కి అర్ధమవుతుంది. మనుషులు సంఘజీవులు కాకుండా రాజకీయ జీవులైనప్పుడు,  కలెక్టివ్ కాన్షస్ ఫీలవరు –సెలెక్టివ్ కాన్షస్ ని కలిగి వుంటారు. 

          ఇప్పుడు పెళ్ళికాని ముక్కోణాలు చూద్దాం. ఇవి  ఒక హీరో ఇద్దరు హీరోయిన్లలో ఎవర్ని ఎంపిక చేసుకోవాలన్న ప్రశ్నతో, లేదా ఒక హీరోయిన్ ఇద్దరు హీరోల్లో ఎవర్ని కోరుకోవాలన్న ప్రశ్నతో సంఘర్షిస్తూ వుంటారు. ఇక్కడ ఎదుటి ఇద్దరు హీరోయిన్లు, లేదా ఇద్దరు హీరోలు సబ్ కాన్షస్ వరల్డ్స్. కానీ మనలో వుండేది ఒకటే అంతరంగం, మన మనసు దాంతోనే సంఘర్షిస్తూ వుంటుంది. రెండో అంతరంగం మనకుండే అవకాశమే లేదు. దీని వల్ల ఆ హీరో లేదా ఆ హీరోయిన్,  ఆ రెండు అంతరంగాలతో చేసే సంఘర్షణ మనకి సిల్లీగా అన్పిస్తుంది. ఎదుటి ఇద్దర్లో ఒకరు మెయిన్ హీరోయిన్, ఇంకొకరు సెకండ్ హీరోయిన్ అయి వుంటారు. మెయిన్ హీరోయిన్నే చేసుకోమని మనసు చప్పున చెప్పేస్తుంది. ఇంకా సెకండ్ హీరోయిన్ తో సంఘర్షణేమిటి? ఒకామె సాంప్రదాయం కలదిగా వుంటే, రెండో ఆమె నాగరికత వెర్రితలలు వేసి వుంటుంది. రెండో ఆమెనే  చేసుకోవాలని మనసు చెప్తుందా?  హీరో ఈ టైపే అయితే అలాగే చేసుకుంటాడు. కానీ హీరో మారాలని కదా కలెక్టివ్ కాన్షస్? మనం మారినా మారక పోయినా హీరో మారాలనే అరుస్తాం. మనదాకా వస్తే చూసుకుంటాం, కానీ ముందు హీరో మారాలనే అరుస్తాం. 

          పెళ్ళికాని  ముక్కోణంలో ఇలా పాత్రకి రెండు సబ్ కాన్షస్ వరల్డ్స్ ఎదురుకావడం, లేదా సబ్ కాన్షస్ రెండుగా చీలిపోవడంతో కథలు కృత్రిమత్వాన్నే ప్రోది చేసుకుంటున్నాయి. 

         ముక్కోణంలో ఈ సమస్యనే  18 వ శతాబ్డంలో  ప్రఖ్యాత రచయిత్రి జేన్ అస్టెన్ పరిష్కరించింది ( సోర్స్ : స్టోరీ కన్సల్టెంట్ కైట్లిన్ హెచ్ ). ఇందులో ఏకకాలంలో హీరోయిన్ ఇద్దరితో ప్రేమలో పడదు. ఒకరి మీదే  ఫీలింగ్స్ బాగా పెంచుకుంటుంది. అతడి అసలు వ్యక్తిత్వం బయటపడ్డాక ఫీలింగ్స్ ని ఆపేస్తుంది. రెండో అతనికి హృదయాన్ని  విప్పుతుంది. (ప్రైడ్ అండ్ ప్రిజుడిస్).

          హీరోయిన్ తనని ఆకర్షించాలని ప్రయత్నిస్తున్న అతని  వయస్సెక్కువనీ, రోమాంటిక్ గా లేడనీ ఉపేక్షిస్తుంది. డాషింగ్ గా వుండే ఇంకో అతనితో ప్రేమలో పడుతుంది. అతడామెని అంత  సీరియస్ గా తీసుకోకుండా వదిలెయ్యడంతో గాయపడుతుంది. మెల్లమెల్లగా మొదటి అతని వైపు మొగ్గుతుంది (సెన్స్ అండ్ సెన్సి బిలిటీ).

      ఈ రెండు సందర్భాల్లోనూ  హీరోయిన్ ఒక సమయంలో ఒకే  సబ్ కాన్షస్ తో ఇంటర్ ప్లేలో  వుంటోంది. అందుకని ఈ నవలలు చిరస్థాయిగా నిలిచి పోయాయి. 

          నిర్ణయం తీసుకోవడంలో ఆమె తాత్సారం చెయ్యదు. ఒకడు పరిచయమయ్యాక నిర్ణయం తీసుకునే దృష్టితోనే ఆమె క్రియాశీలకంగా వుంటుంది. వూరికే అతడితో ఎంజాయ్ చేస్తూ గడపదు. తీరా నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు నిర్ణయం తీసుకోలేక ఏడ్పులూ గట్రా ప్రదర్శించదు. ఏకకాలంలో ఇద్దరూ తనని ఆకర్షించాలని ప్రయత్నిస్తున్నా,  ఆమె ఒక్కరి పైనే దృష్టి  పెట్టి వర్కౌట్ చేస్తుంది. కాబట్టి  జేన్ కథల్లో ఈ పెళ్ళికాని ముక్కోణాల్లో ఇలా కాన్షస్ – సబ్ కాన్షస్ ఇంటర్ ప్లే ప్రకృతి సిద్ధంగా కుదిరి అలరిస్తుంది. 

          ఇదీ విషయం. ఇకపోతే హిందీలో రాజ్ కుమార్ హిరానీ సినిమాలు కాన్షస్ -  సబ్ కాన్షస్ ఇంటర్ ప్లేనే పోలి వుంటాయా అనడం గురించి. స్ట్రక్చర్ ఎనిమిదవ భాగంలో ఆల్రెడీ హిరానీ సినిమాని  ఉదహరించాం, కాన్షస్ -  సబ్ కాన్షస్ ఇంటర్ ప్లే దృష్ట్యా.

Q :   Hi Sir,  hello, I am very much thankful  to you for teaching movie structural basics in your site. Please tell me about ‘Kung Fury’,  directed  by  David Sandberg,  who has produced thr. crowd funding, inspiring the world cinema.
―Hare  e  Sh, Asst
. Dir. 

A :   థాంక్స్. టీచింగ్ చేయడం లేదు. టీచింగ్ మన వృత్తి కాదు. మీరు చెప్పిన మూవీ గురించి రాయలేం. అది ముప్ఫై నిమిషాల షార్ట్ మూవీ, పైగా వరల్డ్ మూవీ జానర్. అందులోనూ క్రౌడ్ ఫండింగ్. ఈ సెక్షన్ ని ఈ బ్లాగులో డీల్ చేయడం లేదు. మీరు కమర్షియల్ సినిమా సెక్షన్ కి చెందితే ఇలాటి మూవీస్ కి దూరంగా వుంటే మంచిదని మా అభిప్రాయం. ఒకవైపు స్ట్రక్చర్ తెలుసుకుంటూ, ఇంకోవైపు స్ట్రక్చర్ వుండని షార్ట్ మూవీస్, వరల్డ్ మూవీస్ అంటే రెంటికీ కుదరని పని. ఏదో ఒక సెక్షన్ నిర్ణయించుకుని అందులో కృషి చేయగలరు. టాలీవుడ్ షార్ట్ మూవీస్ అడ్డా కాదు. టాలీవుడ్ వరల్డ్ మూవీస్ గిడ్డంగి కాదు. బ్లాగులో తాజాగా రాసిన వ్యాసమే షార్ట్ మూవీస్ బదులు  అదే ఖర్చుతో మెయిన్ స్ట్రీమ్ కమర్షియల్ మూవీ తీసుకోమని. సినిమాని చందాలడుక్కుని తీసే స్థాయికి దిగజార్చ వద్దని. ఇది చదివి కూడా మీరు షార్ట్ మూవీని విశ్లేషించమంటున్నారు....

 Q :  స్ట్రక్చర్ ఎనిమిదవ భాగం అద్భుతం. అయితే మీరు తెలుగు సినిమాకు ఇది చాలు అనకుండా. ‘ది హీరో విత్ ఏ థౌజండ్ ఫేసెస్’ బుక్ లో హీరో జర్నీ గురించి (అన్ని మజిలీలు) కొంచెం వివరంచగలరు.   బుక్ చదివి, అర్థం చేసుకునేంత ఇంగ్లీషు రాని నాలాంటి వాళ్ళ కోసం.
అజ్ఞాత అసోషియేట్

A :    జోసెఫ్ క్యాంప్ బెల్ ‘ది హీరో విత్ ఏ థౌజండ్ ఫేసెస్’ థియరీ క్లాసిక్ స్టోరీ స్ట్రక్చర్ కి పనికొచ్చేది. హాలీవుడ్ స్క్రీన్ ప్లేల కోసం అరిస్టాటిల్ మోడల్ నుంచి ప్రారంభమై, జోసెఫ్ క్యాంప్ బెల్ మీదుగా,  సిడ్ ఫీల్డ్ కొచ్చి స్థిరపడినట్టు ఒక ప్రొఫెసర్ రాసిన వ్యాసాన్ని గతంలో ఈ  బ్లాగులో పోస్టు చేశాం. అది చదివే వుంటారు. ’90 లనుంచి హాలీవుడ్ సినిమాలు సిడ్ ఫీల్డ్ ని అనుసరిస్తూ వస్తున్నాయి. క్యాంప్ బెల్ స్ట్రక్చర్ తో అమెరికన్ నవలలు వస్తున్నాయి, రోమాంటిక్ నవలలు సహా.  మారుతున్న కాలాల్లో మారుతున్న  ప్రేక్షకాభిరుచిని దృష్టిలో పెట్టుకుంటూ హాలీవుడ్ స్క్రీన్ ప్లే లని సరళీకృతం చేసుకుంటూ వస్తోంది. తెలుగులో ‘బాహుబలి’ యే తీసినా అందులో సిడ్ ఫీల్డ్ వుంటాడే తప్ప క్యాంప్ బెల్ వుండడు. ఎప్పుడో అరుదుగా ‘దంగల్’  లాంటి దానిలో వుంటాడు. ‘టైగర్ జిందా హై’లో కొంత వుంటాడు.

          హాలీవుడ్ కే అవసరం లేనిది మనకి అవసరం లేదు. వాళ్ళని మించిన కలల బేహారు లెవరుంటారు. హాలీవుడ్ కి అవసరం లేనిది మనదగ్గర ఏవి వచ్చి పడుతున్నాయంటే వరల్డ్ సినిమా నకళ్ళు . ఇది చాలనట్టు క్యాంప్ బెల్ కూడా ఎందుకు. ఉన్న టాలీవుడ్ ని ఇంకింత ఖాళీవుడ్ చేయడానికి కాకపోతే. ఆఫ్ కోర్స్, ఎవరూ ఎవరి మాటా వినరు. అది వేరే విషయం. ఎవరికివారే కింగులమనుకుంటారు. కింగ్ మేకర్లు అవసరం లేదు. అందుకే రాజకీయాలకన్నా అధ్వాన్నంగా వుంటోంది పరిస్థితి. రాజకీయాల మీద కొందరు సినిమాలు తీస్తే ఇందుకే నవ్వొచ్చేలా వుంటున్నాయి. 



       క్యాంప్ బెల్ చెప్పింది పురాణాల కథా నిర్మాణాన్ని. వాటిలో కథానాయకుడికి ప్రయాణంలో పన్నెండు మజిలీ లుంటాయని  చెప్పాడు. ఈ పురాణాల నిర్మాణాన్ని అనుసరించి స్టార్ వార్స్ సిరీస్, ఇండియానా జోన్స్ సిరీస్ వంటి సినిమాలు అనేకం వచ్చాయి. తర్వాత ఈ పన్నెండు మజిలీల్ని పదికి తగ్గించి మైకేల్ హాగ్ ఒక మోడల్ నిచ్చాడు. పది కూడా అవసరం లేదని,  సిడ్ ఫీల్డ్ ఆరుకి తగ్గించి పారడైం ఇచ్చాడు. హీరో మజిలీలకి మజిలీలు చేసుకుంటూ కూర్చుంటే కాలం మారిన ప్రేక్షకులు నిద్ర పోవడం ఖాయం. సిడ్ ఫీల్డ్ ప్లాట్ పాయింట్ -1, పించ్ -1, ఇంటర్వెల్, పించ్ -2, ప్లాట్ పాయింట్ -2 అనే  ఆరు స్టేజీలకి తగ్గించి  స్పీడు పెంచడంతో,  దీనివెంటే పడింది వ్యాపార స్పృహ దండిగా  వున్న హాలీవుడ్. 

          తెలుగు ఫీల్డులో అసలు సిడ్ ఫీల్డే లేదు, అది వేరే విషయం. ఇంకా క్యాంప్ బెల్ ని తెలుసుకోవాలన్న ఆసక్తి ఎందుకు? భక్తి సినిమాలు తీయాలంటే క్యాంప్ బెల్ ని ఖచ్చితంగా అనుసరించాల్సిందే. ఇప్పటి కమర్షియల్ సినిమాలకి అవసరం లేదు. ఇంకోటేమిటంటే, అతి సింపుల్ గా వుండే సిడ్ ఫీల్డ్  పారాడైం పట్టుబడకుండా క్యాంప్ బెల్ ని అర్ధం చేసుకోవడం కష్టం. కాబట్టి ముందు  సిడ్ ఫీల్డ్ మీద పట్టు సాధిస్తే, క్యాంప్ బెల్ తో హయ్యర్ ఎడ్యుకేషన్ కి పోవచ్చు. పోయి బ్రహ్మాండమైన కళాత్మక సినిమాలు తీయాలనుకుంటే తీయొచ్చు. ‘స్టోరీ’ అనే ఉద్గ్రంథం రాసిన రాబర్ట్ మెక్ కీ ఇదే చెప్తాడు - ముందు మామూలు కమర్షియల్ సినిమాలతో చేయి తిప్పుకున్న తర్వాత, కళాత్మక సినిమాలు ఆలోచించవచ్చని.


Q :  మీ పాత రివ్యూలు చదవాలంటే ఎలా?  ఉదాహరణకి ‘రేసు గుర్రం’  చదవాలి... అలాగే స్ట్రక్చర్ గురించి ఎక్కువ మాట్లాడుకుంటున్నాము కాబట్టి, సమయం దొరికినప్పుడు ‘శివ’ లాగా త్రీ యాక్ట్ స్ట్రక్చర్ లో ఒదిగిన సినిమాల విశ్లేషణలు రాయండి. లేకపోతే  మీ బ్లాగు బోసిపోయినట్టుంటుంది.
అజ్ఞాత దర్శకుడు 

A :  బోసిపోయినా వదలరు. గణపతి కాంప్లెక్స్ దగ్గర వేలాడుతున్నట్టు బ్లాగుని పట్టుకుని వేలాడుతూ వుంటారు. బ్లాగుకుండే పరిమితుల దృష్ట్యా, కావాల్సిన వ్యాసాలు పొందాలంటే కొన్ని అసౌకర్యాలున్నాయి విజిటర్స్ కి. దీన్ని వెబ్ సైట్ గా మారిస్తే సెర్చింగ్ సమస్యలన్నీ తీరిపోతాయి. అయితే బ్లాగులో పోగు పడిన వందల ఆర్టికల్స్ ని వర్గీకరణ చేసి,  వెబ్సైట్ కి బదిలీ చేయడమే పెద్ద పనై కూర్చుంది. ప్రస్తుతానికి ఇలా చేయవచ్చు –  ఏ సినిమా రివ్యూ కావాలో ఆ సినిమా విడుదల తేదీని బ్లాగు ఆర్కివ్ లో కెళ్ళి క్లిక్ చేస్తే  రివ్యూ దొరికిపోతుంది. విడుదల తేదీ ఆ సినిమాల వికీపీడియాలో వుంటుంది. ఒకవేళ రివ్యూ ఇవ్వడం ఒకటి రెండు రోజులు ఆలస్యం  జరిగివుంటే, ఆ ఒకటి రెండు తేదీలు కూడా కలిపి క్లిక్ చేసి చూడండి. ఇక మీరన్నట్టు సినిమాల విశ్లేషణలు తప్పక చేద్దాం. ఒక కొరియన్ లవ్ మూవీతో మొదలెడదాం.

***
         ఔను 95 వేలతో తీశా’ వ్యాసానికి సంబంధించి కడపనుంచి ‘Seven Roads’ అనే షార్ట్ మూవీ మేకర్ ఒక విషయాన్ని దృష్టికి తెచ్చారు. వ్యాసంలో పేర్కొన్న అస్సామీ కమర్షియల్ ‘లోకల్ కుంగ్ ఫూ 2’ ని క్రౌడ్ ఫండింగ్ తో నిర్మించారని.  ఇందులో వాస్తవం లేదు. కేవలం పోస్ట్ ప్రొడక్షన్ నిమిత్తమే  ఎనిమిది లక్షలు క్రౌడ్ ఫండింగ్ ద్వారా సమీకరించారు. మిగతా వ్యయం 22 లక్షలు దర్శకుడితో బాటు ఇంకో ముగ్గురు నిర్మాతలు భరించారు. ఇదివరకు ‘లోకల్ కుంగ్ ఫూ’ అందించి పాపులరైన నేపధ్యంవుండడంతో  క్రౌడ్ ఫండింగ్ తేలికయ్యింది. 

          ఇక్కడ తెలుగు క్రౌడ్ ఫండింగ్ అభిమానులు గమనించాల్సిందేమిటంటే, మిగతా దేశంలో క్రౌడ్ ఫండింగ్ తో లో- బడ్జెట్ కమర్షియల్ సినిమాలు తీసి వ్యాపారం చేసుకుంటూంటే, తెలుగులో వ్యాపార దృష్టి లేక, కళాత్మక దృష్టితో ప్రపంచానికి తమదేదో చాటాలని, కమర్షియలేతర ఇండిపెండెంట్ మూవీస్ తలకెత్తుకుంటున్నారు. ఇది చాలా సిల్లీ. ఎలాగంటే, ప్రపంచీకరణ వల్ల అన్నీతెలుస్తున్నాయి. ఆ తెలుస్తున్నవన్నీ మనం అందుకోవాల్సినవి కావు. ప్రపంచీకరణ వల్ల మనకన్నీ గొప్పగా తెలుస్తున్నాయి కదాని చెప్పి ఎక్కడెక్కడి వరల్డ్, ఇండిపెండెంట్, షార్ట్ మూవీస్ తెచ్చి ఇక్కడ దుకాణం పెడితే అమ్ముడుపోవు.   హాలీవుడ్ లో ఇలాటి పని చేస్తే  గేట్లు వేసేస్తారు. హాలీవుడ్ కైనా, టాలీవుడ్ కైనా కలెక్షన్లు వచ్చే కమర్షియల్సే కావాలి. వరల్డ్ మూవీస్ బాపతు సినిమాలు కాదు.

          హాలీవుడ్ లోనూ  క్రౌడ్ ఫండింగ్ తో సినిమాలు తీస్తున్నారు. అవి పక్కా హాలీవుడ్ మార్కు కమర్షియల్ సినిమాలే. హాలీవుడ్ లో జే చంద్రశేఖర్ అనే అతను 3 మిలియన్ డాలర్ల క్రౌడ్ ఫండింగ్ తో  ‘సూపర్ ట్రూపర్స్’  అనే పక్కా యాక్షన్ కామెడీ తీస్తే, 24 మిలియన్ డాలర్లు వసూలు చేసింది! ఇదీ క్రౌడ్ ఫండింగ్ సద్వినియోగమంటే. 


          తెలుగులో క్రౌడ్ ఫండింగ్ తో తీసినవే రెండు. ఇవి ఏమయ్యాయో తెలిసిందే. కమర్షియల్ సినిమాలకి భిన్నంగా ఏదో ప్రయోగాలు చేద్దామనుకుని,  క్రౌడ్ ఫండింగ్ తో ఏం తీసినా,  ఏ సొంత క్రియేటివ్ కోర్కెలు తీర్చుకున్నా,  మళ్ళీ వాటిని విడుదల చేయాల్సింది వ్యాపారులే. ఎన్నో  కమర్షియల్ సినిమాల విడుదలలకే దిక్కులేదు,  కమర్షియలేతర సమాంతర సినిమాల మొహం ఏ వ్యాపారి చూస్తాడు. వచ్చిన చిక్కేమిటంటే,  వస్తున్న కొత్త తరం బిజినెస్ సైడే చూడరు. కమర్షియల్ సినిమాల్ని విమర్శిస్తూ వాటికంటే మెరుగైన తమ టాలెంటేదో  చూపించాలనుకుంటారు. అమాంతం వెళ్లి వరల్డ్ సినిమాల మోజుతో ఇండీ మూవీస్ తీసి పడేస్తారు. వ్యాపార తెలివే చేతకాదు. వరల్డ్ మూవీస్ కి ఇక్కడింత ఫ్యాన్ క్లబ్ పెరిగి పోతూ వుంటే, వాటి జన్మ స్థానమైన యూరోపియన్ దేశాల్లో 80 శాతం మార్కెట్ ని హాలీవుడ్ సినిమాలు ఏలుకుంటున్నాయి. ఇంకెక్కడి వరల్డ్ మూవీస్!  ఎప్పుడైనా మెయిన్ స్ట్రీమ్ అభిరుచులే యూనివర్సల్. ఎక్కడైనా వర్కౌటవుతాయి. సమాంతర సినిమాలకి విడుదలే కష్టం. వరల్డ్ మూవీస్ అంటే మనం మర్చిపోయిన భాషలో ఆర్టు సినిమాలే. ఆర్ట్ సినిమాలకి తెలుగులో మార్కెట్ వుందా? సింపుల్ లాజిక్! మన కోరికలు నెరవేరాలంటే ప్రేక్షకుల ఆశలతో మన కోరికలు కలవాలి. బిజినెస్ సైడు చూడని సినిమా కోరికలు నేరవేరవు. నమ్మి క్రౌడ్ ఫండింగ్ చేసిన వందలాది చందాదారులకి మొహం కూడా చూపించలేం.



సికిందర్