రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

26, ఆగస్టు 2017, శనివారం

503 : డార్క్ మూవీస్ స్క్రీన్ ప్లే సంగతులు - 14

     ఎక్కువగా డెషెల్ హెమెట్ రాసిన డిటెక్టివ్ సాహిత్యం డార్క్ మూవీస్ (ఫిలిం నోయర్ - నియో నోయర్) జానర్ కి స్ఫూర్తి అని చెప్పుకున్నాం.  ప్రతీసారీ హెమెట్ నవలల్నే తీయకపోయినా, ఆ స్పూర్తితో ఎన్నో తీశారు. కోయెన్ బ్రదర్స్ కూడా హెమెట్ నవలల్లోని పాత్రల తీరుతెన్నుల్ని, వాతావరణాన్నీ రీక్రియేట్ చేస్తూ ‘బ్లడ్ సింపుల్’  తీశారు. అప్పటికి ఎప్పుడో ఎనభై ఏళ్లక్రితం రాసిన పాత్రల్ని దృష్టిలో పెట్టుకుని  ఇప్పుడు కోయెన్ బ్రదర్స్ సినిమాలుగా తీస్తే చూస్తారా అంటే, చూస్తారు. అరవై ఏళ్ల క్రిందటి ‘దేవదాసు’ని ఇప్పుడు ‘అర్జున్ రెడ్డి’ గా తీస్తే చూస్తున్నారు.  ఇతర డిటెక్టివ్ నవలలకీ హెమెట్ డిటెక్టివ్ నవలలకీ తేడా ఏమిటంటే, హెమెట్ అపరాధ పరిశోధక నవలలు రాయలేదు, అపరాధ పరిశోధకుల 
(డిటెక్టివ్స్) గురించి రాశాడు. ఇలా ‘బ్లడ్ సింపుల్’ లో డిటెక్టివ్ విస్సర్ అనే వాడు నేర పరిశోధనలతో తన వృత్తేదో తాను చేసుకోక, తానే నేరానికి పాల్పడ్డాడు. తన కథ లోకానికి చెప్పాల్సిన అగత్యాన్ని కథకులకి కల్పించాడు. నీతి కథలు రాసుకునే రచయిత తనే నీచానికి పాల్పడితే, ఎలా తనే ఒక  కథగా మారి లోకాన్ని ఎంటర్ టైన్ చేస్తాడో అలాగన్న మాట. అయితే హెమెట్ రాసినవన్నీ నీచ డిటెక్టివ్ ల గురించే కాదు, నేరకపోయి ఇరుక్కునే మంచి డిటెక్టివ్ ల కథలూ రాశాడు. హెమెట్ ఏం చెప్పాడో ఆయన మాటల్లోనే -"What I try to do is write a story about a detective rather than a detective story. Keeping the reader fooled until the last, possible moment is a good trick and I usually try to play it, but I can't attach more than secondary importance to it. The puzzle isn't so interesting to me as the behavior of the detective attacking it."

డెషెల్ హెమెట్  (1894 – 1961)
     మిడిల్ టూ ప్రారంభిస్తే, ఇందులో 13  సీన్లు వున్నాయి. ఇంటర్వెల్ తర్వాత మొదటి సీను ఇంటర్వెల్ సీనుకి కొనసాగింపే. అదే విషాదమయ మూడ్ ని క్యారీ చేస్తూ...
24. సమాధి దగ్గర నుంచి  రే బయల్దేరడం 
25. ఎడారిలా వున్న రోడ్డు మీద డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళడం
26. ఫోన్ బూత్ నుంచి ఎబ్బీకి కాల్ చేసి కుశలమడగడం
27. అమాయకంగా మాట్లాడే ఎబ్బీతో రే తికమక పడడం
28. విస్సర్ కి లైటర్ గుర్తుకొచ్చి కంగారు పడడం
29. ఎబ్బీ బ్యాగులో విస్సర్ లైటర్ వెతకడం
30. మార్టీ శవాన్ని తొలగించానని, ఇక ఫర్వాలేదనీ రే అంటూంటే ఎబ్బెకి అర్ధంగాకపోవడం 31. సేఫ్ లో డబ్బంతా రే దోచుకెళ్లాడని మార్టీ అన్నాడని, రేని మారిస్ దూషించడం
32. ఎబ్బీ బార్ కెళ్ళి పరిశీలించడం, అక్కడ దాక్కున్న విస్సర్ గమనించడం
32. ఎబ్బీకి మార్టీ తో పీడకల రావడం
33. మార్టీ హత్య గురించి ఎబ్బీ రేలు మాటామాటా అనుకోవడం
34. ఎబ్బీ వెళ్లి మారిస్ కి ఫిర్యాదు చేయడం
35. రే వెళ్లి బార్ లో సేఫ్ తెరిస్తే ఫేక్ ఫోటో బయట పడడం
***
24. సమాధి దగ్గర నుంచి  రే బయల్దేరడం  
       ఇలా రాశారు : తెల్లవారుతున్న నేపధ్యంలో సమీపంలో ఒక ఇల్లు. ఇంటి ముందు పర్ఫెక్ట్ గా దీర్ఘ చతురస్రాకారంలో లాన్. ఆ ఎడారి లాంటి మైదానంలో ఆ ఇల్లు పొసగకుండా వుంటుంది. 

          రే మీద ఫోకస్ : ఏ ఎమోషనూ లేకుండా చూస్తూంటాడు.  చివరిదాకా సిగరెట్ దమ్ము పీల్చి పారేస్తాడు.కారెక్కుతాడు. స్టార్ట్ చేస్తాడు. స్టార్ట్ అయి ఆగిపోతుంది. మళ్ళీ ప్రయత్నిస్తాడు. మళ్ళీ ఆగిపోతుంది ఇంజన్. మరోసారి ప్రయత్నిస్తే, వూగిసలాడుతూ ఎలాగో అందుకుని రెడీ అవుతుంది. బయల్దేరి సమాధి మీదుగా దూరాన హైవే కేసి సాగిపోతుంది.

          ఇంటర్వెల్లో సమాధి చేసే సీను రాత్రి జరుగుతుంది. ఇంటర్వెల్ తర్వాత సీను చూస్తే ఇంకా అక్కడే వున్నాడు రే తెల్లారినా. ఇంతసేపు అతను ఆలోచనలతో గడిపినట్టే. ఏమాలోచించి వుంటాడో వూహించవచ్చు. మార్టీ చనిపోయాడు, మార్టీ ని చంపిన ఎబ్బీని తను కాపాడేడు, కానీ తనే అంతిమంగా మార్టీని చంపాల్సి వచ్చింది. సమాధి చేసి చేతులు దులుపుకున్నాడు. ఇప్పుడేమిటి? సుఖమేనా? ఎబ్బీతో సుఖవంతమైన జీవితమేనా> ఇలాటి ఆలోచనలతో గడిపివుంటాడు...

         
ఇందుకే ఇంటర్వెల్ తర్వాత మిడిల్ టూ ప్రారంభిస్తూ ఓపెనింగ్ షాట్ గా ఇల్లు కనపడుతుంది...ఆకుపచ్చటి దీర్ఘ చతురస్రాకార లాన్ తో ముచ్చటగా వున్న ఇల్లు. దీర్ఘ చతురస్రాకార లాన్ అని రాశారు, త్రికోణమో – వర్తులమో అని రాయలేదు. ఎందుకు రాయలేదు? అతడి ఆలోచనలతో సరిపోవాలి. దీర్ఘ చతురస్రాకారానికి అర్ధమేమిటి? కలలకర్ధం చెప్పే నిఘంటువు చూస్తే – “To see a rectangle in your dream, represents permanence, materialism and stability. Because of its four corners and four sides, it is also symbolic of the number 4

       ఇదన్నమాట! చీకూచింతా లేని, బాగా డబ్బూ దస్కమున్న హంగుతో లైఫ్ పర్మనెంట్ గా సెటిల్ అన్నమాట. ఇక నాల్గు మూలలు 4 అంకెని సూచిస్తున్నాయి. న్యూమరాలజీలో 4 అంకె కలిసిన వాళ్ళు మొనగాళ్ళయి వుంటారన్న మాట. రే ఇక మొనగాడన్న మాట. ఎబ్బీతో పర్మనెంట్ గా లైఫ్ సెటిల్ అన్నమాట. ఇలా ఇతడి ఆలోచల్ని బలపర్చే విధంగా తెల్లవారిన వెలుగులో ఈ ఇల్లు కనపడింది. ‘లా ఆఫ్ ఎట్రాక్షన్’ అని ఒక ‘సైన్స్’ చెప్తూంటారు (రోండా బైర్న్స్ చాలా చెప్పి వందలకోట్లు గడించింది), దీని ప్రకారం- మనం దేన్నైతే వూహించుకుంటూ వుంటామో- అదే భౌతిక రూపంలో నిజమై ఎదురవుతుందని. కాసేపు  దీని ప్రకారం చూస్తే, రే కిదే జరిగిందనుకోవాలి. 

          మళ్ళీ ఇంతా అర్ధం చెప్పి ఒక అడ్డుపుల్ల వేశారు – ఈ ఇల్లు
ఎడారి లాంటి మైదానంలో పొసగకుండా వుందని రాశారు. నిజమే, ఆ ఎడారిలాంటి మైదానమేమిటి, దాని మధ్య అందమైన ఇల్లేంటి? అంటే – మర్డర్ చేసి భౌతికంగా శ్మశానాన్ని సృష్టించుకున్నాక, అందమైన కలలు ఎలా సాధ్యమవుతాయని!  రే ఇలాటి ఆలోచనలు గనుక చేస్తే అది మూర్ఖత్వమని  హెచ్చరికగా మరుభూమిలో పొదరిల్లు.

          ఇక కారు ఇంజన్ స్టార్ట్ కాకపోవడం –  కారు స్టార్ట్ అవడానికి మొరాయిస్తోందంటే - నువ్వు మార్టీని చంపి సమాధిని చేసి ఎక్కడికీ వెళ్ళలేవు, ఎంజాయ్ చేయలేవు, ఇక్కడే నీకు కూడా ఇలాగే చావుందని కారు చెప్తోంది దాని భాషలో. పైగా కారుని సమాధి మీంచి పోనిచ్చే తప్పో, అపచారమో కూడా చేశాడు...

          ఈ ఒక్క సీనుతో- ఎబ్బీతో రే కి జీవితముండదని, అతనూ చనిపోతాడనీ ఎస్టాబ్లిష్ చేస్తూ- సెకండాఫ్ ఎత్తుగడతోనే  ఒక్క సీనుతో విపరీతమైన సస్పెన్స్ - టెన్షన్ - టెర్రర్ సృష్టించి, ముందు జరగబోయే దానిపట్ల మనం నిటారుగా కూర్చునేట్టు చేశారు. లేజీగా ప్రేక్షకులు సినిమా చూడకుండా, అనుక్షణం ఇన్వాల్వ్ చేయడం కూడా ఆర్టే!

(సశేషం)
-సికిందర్
-     
         



         




           
           

.

              

              


25, ఆగస్టు 2017, శుక్రవారం

502 : రివ్యూ!




రచన - ర్శకత్వం: సందీప్ రెడ్డి
తారాగణం: విజయ్ దేవ కొండ, శాలినీ పాండే, కాంచన, రాహుల్ రామకృష్ణ, జియాశర్మ, ల్ కామరాజు, సంజయ్ స్వరూప్, దితరులు
సంగీతం: న్, ఛాయాగ్రహణం : రాజు తోట
బ్యానర్ : ద్రకాళి పిక్చర్స్
నిర్మాత: ప్రణయ్ రెడ్డి వంగా
విడుదల : ఆగస్టు 25, 2017
***
        ఇప్పుడొస్తున్న తెలంగాణా దర్శకులు తెలుగు సినిమాలకి  విసుగెత్తిన మూస ఫార్ములాల అలసత్వాన్ని వదిలించి, టాలీవుడ్ కలలో కూడా తలపెట్టని  వాస్తవిక కథా చిత్రాల్ని కాస్త మేధస్సుని కూడా జోడించి ప్రధానస్రవంతికి  అపూర్వంగా పరిచయం చేస్తున్నారు. ఇందుకు అలాటి నిర్మాతలు కూడా ముందుకొస్తున్నారు. రాష్ట్రం విడిపోవడం ఎవరికి లాభం, ఎవరికి నష్టమో గానీ భాషల అడ్డుగోడల్ని ఛేదించి తెలుగు సినిమాలు మరుగున పడిన ఇంకో పార్శ్వాన్ని ప్రదర్శించుకుంటున్నాయి. తెలుగు సినిమాలు  మూలన పడేసిన తెలుగుదనం తిరిగి పలకరించడంతో ఉభయరాష్ట్రాల్లోనూ భాషల కతీతంగా ద్వారాలు తెర్చుకుంటున్నాయి. ‘పెళ్లిచూపులు’, ‘అప్పట్లో ఒకడుండే వాడు’, ‘పిట్టగోడ,’ ఇప్పుడు ‘అర్జున్ రెడ్డి’, రేపు ‘నీదీ నాదీ ఒకే కథ’ ఈ కోవకి చెందుతాయి. 

          
తీస్తే ప్రేమని వెల్లడించలేకపోవడం, లేకపోతే అపార్ధాలతో విడిపోవడం – అనే ఈ రెండు  పాత చింతకాయ సిల్లీ నాన్సెన్స్  కథల చుట్టే ముష్టి ఫార్ములా ప్రేమ సినిమాల్ని తిప్పితిప్పి తీస్తున్న మిడిమేలపు జనాభా  ఇక మేల్కొనే టైం అయింది. మేల్కోకపోతే ఇంటికెళ్ళి పోయే టైం వస్తుంది. భవిష్యత్ టాలీవుడ్  తెలంగాణా ప్రైవేట్ లిమిటెడ్ అవుతుంది. 

          ‘అర్జున్ రెడ్డి’ ప్రేమ మామూలే.  పరిణామాలు మామూలైనవి కావు.  మూస దర్శకులు ధైర్యం చేయలేని చీకటి కోణాల్లోకి ప్రయాణించి ప్రేమంటే ఇదీ అని చెప్తుంది. ప్రేమలోకి వెళ్లేముందు పరిణామాల్నిదృష్టిలో పెట్టుకోవాలని హెచ్చరిస్తుంది. ఈ పని ‘దేవదాసు’ ఎప్పుడో చేశాడు. శరత్  ‘దేవదాసు’ ఇప్పుడు పనిచెయ్యకపోవచ్చు, అప్పుడున్న షరతుల్లేని ఆధునిక – విశృంఖల ‘దేవదాసు’  ఇప్పుడు కావాలి.  

       ఆర్జున్ రెడ్డి (విజయ్)  సంపన్న కుటుంబానికి చెందిన మెడికో. మంగళూరు మెడికల్ కాలేజీలో హౌస్ సర్జన్ చేస్తూంటాడు. అతను యూనివర్సిటీ టాపర్. కానీ కోపమెక్కువ.  ఈ  కోపంతో ఎవర్ని ఎప్పుడు కొట్టేస్తాడో తెలీదు. ఫుట్ బాల్ టీం ని అలాగే కొట్టి సస్పెండ్ అవుతాడు. ఆ సమయంలో ప్రీతీ శెట్టి (శాలినీ పాండే)  అనే జ్యూనియర్ ని చూసి ప్రేమిస్తాడు. ఆమెని ర్యాగింగ్ సమస్య నుంచి కాపాడతాడు. ఆమె కూడా ప్రేమిస్తుంది. అర్జున్ మాస్టర్స్ చేయడానికి ముస్సోరీ వెళ్ళిపోతాడు. అక్కడికి వచ్చేస్తుంది. ఇంకింత బలంగా  ప్రేమిస్తాడు. ఇక పెళ్లి విషయం ఆమె తండ్రితో మాట్లాడాలని కర్ణాటక వస్తాడు. తుళు భాషలో చెడామడా తిడతాడు ఆమె తండ్రి. కులం, ప్రాంతీయత ఇవన్నీ ముందుకు తెచ్చి రెండు దెబ్బలు కొట్టి వెళ్ళ గొట్టేస్తాడు. కూతురికి వేరే పెళ్లి చేసేస్తాడు. హతాశుడైన అర్జున్ మందూ మాదక
ద్రవ్యాలూ మరిగి,   ఒక పిచ్చి డాక్టర్ గా తయారై, హైదరాబాద్ లో జాబ్ చేస్తూంటాడు. హాస్పిటల్లోనే తాగి ఆపరేషన్లు చేసేస్తూంటాడు. ఒక కుక్క పిల్లని కొనుక్కుని  ప్రీతి అని పేరు పెట్టుకుంటాడు. ప్రీతిని మర్చిపోలేకపోతాడు. ఇదీ కథ. ఇదెలా ముగుస్తుందనేది ద్వితీయార్ధం. 

ఎలా వుంది కథ 
   ప్రేమకథలో ప్రేమకథ చెప్పకుండా, పాత్ర కథ చెబితే ప్రేమ సినిమాల స్వరూపం ఎలా మారిపోతుందో తెలియజేసే వాస్తవిక కథ. దీన్ని ‘దేవదాసు’ లో పట్టుకున్నట్టుందీ కథ. కొన్ని పాత్రలు కూడా అలాగే వున్నాయి- అర్జున్ దేవదాసులాగా, ప్రీతి పార్వతి లాగా, మిత్రుడు భగవాన్ లాగా, సినిమా హీరోయిన్ చంద్రముఖి లాగా. రోడ్డున పడి  అరుగుమీద చేరాక అర్జున్  పక్కన కుక్క కూడా దేవదాసు కుక్క లాగా. ముగింపులో తప్ప సెకండాఫ్ లో హీరోయిన్ కన్పించక
పోయినా హీరో పాత్ర ప్రవర్తనతోనే, మార్పులు చెందే జీవితంతోనే ఏకోన్ముఖంగా కథ నడపడం కత్తిమీద సామే. దీన్ని అత్యున్నతంగా సాధించిందీ కథ. కథ కంటే క్యారక్టర్ స్టడీ మీద ఎక్కుపెట్టి మూస ప్రేమలు
అలవాటైన ప్రేక్షకుల గుండెల్లో బాధని రగిలించే, రాణించే కాన్సెప్ట్. ఈ వాస్తవికతని కూడా బంగారు పళ్ళెంలో తియ్యగా పెట్టి ఇవ్వలేదు, ఇందులో ధారాళంగా అశ్లీల పదాలూ, అశ్లీల దృశ్యాలూ, ప్రేమలో కరకు వాస్తవాలూ  ‘ఏ’ సర్టిఫికేట్ కి న్యాయం చేస్తూ బోనస్ గా వున్నాయి – న్యూసినిమా ధోరణిలో. పోతే ముగింపే రాజీపడి వాస్తవిక ధోరణి తప్పుతూ మూస ఫార్ములాలోకి తిరగబెట్టడం మింగుడుపడదు. ఈ ముగింపుతో పాత్రలే అర్ధంలేనివిగా తేలాయి. ఈ వాస్తవిక కథకి కథా ప్రయోజనమే దెబ్బతింది. 

ఎవరెలా చేశారు
      విజయ్ ఆశ్చర్య పరుస్తాడు. కమర్షియల్ సినిమా నటనల ఛాయలు పడకుండా వాస్తవిక పాత్రని అత్యంత సహజంగా నిర్వహించాడు. బావున్న రోజుల్లో ఆ రోషం, చెడిపోయాక పిచ్చి చూపులు, కన్ఫ్యూజన్ బాగా ప్రాక్టీసు చేసి నటించాడు. ఫస్టాఫ్ వరకూ యాక్టివ్ పాత్రే, సెకండాఫ్ లో పాసివ్ గా మారిపోతాడు. వాస్తవిక కథా చిత్రాలకి యాక్టివ్ – పాసివ్ లు వర్తించవు. ఎక్కువగా కథే పాత్రని నడిపిస్తుంది. సినిమా సాంతం ఆయా కాలాల్ని బట్టి విభిన్న గెటప్స్ లో కనిపిస్తాడు. ఆ గెటప్స్ లో అప్పటి పాత్రలాగే అన్పిస్తాడు. అత్యంత పరాకాష్టకి చేరడం- హస్పిటల్లో ఉద్యోగంపోయి,  ఇంట్లోంచి తండ్రి వెళ్ళగొట్టి, ఫ్లాట్ లోంచి యజమాని కూడా వెళ్ళ గొట్టి, డబ్బులేక వస్తువులు అమ్ముకుంటూ రోడ్డున పడ్డాక- రెండు సీన్లలో. విజయ్ ఆంటోనీ కి ‘బిచ్చాగాడు’ ఎలాగో, విజయ్ కి ‘అర్జున్ రెడ్డి’ అలాగ. ‘దేవదాసు’ – ‘బిచ్చగాడు’  రెండూ కలిసి ‘అర్జున్ రెడ్డి’ అయ్యాడు- ఇది బాగా తరచి చూస్తే  తప్ప దొరికిపోని క్రియేటివిటీ. 

          హీరోయిన్ శాలినీ పాండే చాలా లో- ప్రొఫైల్ పాత్ర నటించింది. మాటలుకూడా తక్కువే. హా వభావాలే ఆమె భాష. వేరే పెళ్ళయి పార్వతి లాగా వెళ్ళిపోవడం వరకూ ఓకే గానీ, ఆ తర్వాతే ఆమె పాత్ర  రొటీన్ మూస ఫార్ములా పాత్రగా మారిపోయి, తీవ్ర అసంతృప్తికి లోనుజేస్తుంది చివర్లో. 

          ఇక విజయ్ ఫ్రెండ్ పాత్రలో రాహుల్ రామకృష్ణ  ఒక కొత్త ఆకర్షణ. ఇతను కూడా హాస్యాన్ని వంకర్లు తిరిగిపోతూ నాటకీయంగా, కమర్షియల్ గా నటించలేదు. పాత్రపరంగా పక్కా ఆధునిక భగవాన్ పాత్ర,  ‘దేవదాసు’ లో పేకేటి శివరాంని గుర్తుకు తెస్తూ. అర్జున్ అన్న పాత్రలో కమల్ కామరాజు, తండ్రి పాత్రలో సంజయ్ స్వరూప్ సహజనటులు. ఇక నానమ్మగా అలనాటి హీరోయిన్ కాంచన ఒక వండర్ఫుల్ చేరిక. 

          టెక్నికల్ గా కెమెరా వర్క్ సాంప్రదాయ షాట్స్ తో వుంది. ఎడిటింగ్ లో కూడా గిమ్మిక్కులు చేయలేదు. విజయ్ మీద బిల్డప్ షాట్స్, డీటీఎస్ మోతా లేవు. పాటలు ఏడువున్నాయి- ఏదీ దృశ్య, శబ్ద కాలుష్యాల్ని పరివ్యాప్తం చేయకుండా ఆరోగ్యకరంగా వున్నాయి. లొకేషన్స్ కథని డామినేట్ చేయకుండా కథకి తగ్గట్టుగా వున్నాయి. దర్శకుడు కొత్తవాడయినా కొత్త విజన్ లో ఈ ప్రేమకథని చూశాడు. మామూలుగా అయితే కాలేజీ సీన్లు, క్లాస్ రూమ్ సీన్లు ఇంకా చూపించడానికేమీ లేనట్టుగా వెటకారంగా,  విషయలేమితో వుంటాయి. కానీ ఇక్కడ ఆ ఫార్ములాకి దూరంగా, సహజంగా, విషయంతో కొత్తగా వుంటాయి. 

చివరికేమిటి 
      కొత్త దర్శకుడు సందీప్ రెడ్డి వినోదాత్మక వాస్తవికత ఎలా
వుంటుందో ‘పెళ్లిచూపులు’ నుంచి ఇంకో మెట్టు పైకి తీసికెళ్లి చూపిం
చాడు. చిత్రీకరణ మీద మంచి పట్టు సాధించాడు. రచనాపరంగా బయట మాట్లాడుకునే భాష వాడి దృశ్యాల్ని ప్రేక్షకులకి సన్నిహితంగా చేశాడు. అయితే దీన్ని మూడుగంటల సినిమాగా తీయక్కర్లేదు. అరగంటకి పైగా తగ్గించవచ్చు. ఫస్టాఫ్ ఇంటర్వెల్ కే గంటన్నర పట్టింది. ఇక్కడ పాయింటు కొచ్చి, సెకండాఫ్ లో హాస్పిటల్లో ఉద్యోగం పోయే దగ్గర పరిష్కార మార్గానికొచ్చి,  ఆ తర్వాత పరిష్కరించిన విధానంతోనే ముగింపు చెడిపోయింది. ఏదో కాలక్షేప బఠానీ అనుకుని ఈ మూవీ తీసి వుంటే అది వేరు. కానీ సీరియస్ వాస్తవిక పాత్రని చర్చిస్తూ దాన్ని మూసఫార్ములా  ముగింపుతో సరిపెట్టేస్తే ఎలా? దీంతో హీరో హీరోయిన్ల పాత్రల మౌలిక తత్త్వాలే  దెబ్బతినిపోయాయి. వాళ్ళు మెడికల్ రంగంలో వున్నారు. అంత అజ్ఞానంగా ఎలా వుంటారు తమ శారీరక కలయిక విషయంలో? ఫార్ములా ముగింపు కోసమే కదా హీరోయిన్ పాత్రతో ఈ అసంగతాలు. 

          దీంతో ఏం చెప్పాలనుకుంటున్నారు? భగ్నప్రేమలతో అలమటించిపోండి, పెళ్ళయిన ప్రేయసిని వదలకండి- అనా? భగ్న ప్రేమలు సరే, వేరే పెళ్ళిళ్ళు సరే- move on man, move on- ఇంకా జీవితం చాలా ఇస్తుందని  చెప్పడమా? చివరికి అర్జున్ వ్యసనాలు మానుకుని పరివర్తన చెంది, విదేశీ యాత్రకి వెళ్ళినప్పుడు చాలా ఫ్రెష్ గా అన్పిస్తాడు. హాయిగా- he is certainly moving on – అన్పించి ఏంతో  బావుంటాడు. అలా తిరిగి వచ్చి - నాకు సంబంధం చూడండి డాడ్ -  అంటాడేమో, తనలాంటి పరిస్థితుల్ని ఎదుర్కొనే యూత్ కి ఇన్స్పైరింగ్ గా కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడేమో అనుకుంటే, ఎందుకు భయపడ్డాడో దర్శకుడు- పెళ్ళయిన ప్రేయసి దగ్గరికే పంపి లాజిక్ లేని ఫార్ములా ముగింపుతో - వాస్తవిక కథా చిత్రాన్ని  అవాస్తవికంగా మార్చాడు. 


         
 -సికిందర్
cinemabazaar.in

24, ఆగస్టు 2017, గురువారం

501: రివ్యూ!


రచన - దర్శకత్వం: శివ
తారాగణం: అజిత్, కాజల్అగర్వాల్, అక్షరా హాసన్, వివేక్ఒబెరాయ్, శరత్సక్సేనా, భరత్రెడ్డి, కరుణాకరన్, ఆరవ్చౌదరి, కరుణాకరన్ తదితరులు
రచన : శివ, కనిలన్ వైరముత్తు; మాటలు
: రాజేష్, సంగీతం : సంగీతం: అనిరుధ్రవిచంద్రన్,
ఛాయాగ్రహణం : వెట్రి, బ్యానర్ :
సత్యజ్యోతి ఫిలింస్, సమర్పణ : టి.జి.త్యాగరాజన్
నిర్మాతలు: అర్జున్త్యాగరాజన్, సెంథిల్త్యాగరాజన్
విడుదల : ఆగస్టు 24, 2017
***
        తమిళ స్టార్ సినిమాలు లోకల్ మాస్ ఇమేజిని  పక్కనబెడుతూ నెమ్మదిగా గ్లోబల్ కంటెంట్ ని అందుకుంటున్నాయి. రంగూన్, 24, సింగం 3, భైరవ, విశ్వరూపం 2, ఇప్పుడు వివేకం...అజిత్ -  దర్శకుడు శివాల కాంబినేషన్ లో గతంలో వీరం, వేదాలం అనే రెండు పెద్ద హిట్స్ వచ్చాయి. తిరిగి ఇప్పుడు వివేకంతో వచ్చారు. వివేకంని పూర్తిస్థాయి విదేశీ స్పై థ్రిల్లర్ గా తీస్తూ తమిళ సినిమాని మరో మెట్టు పైకి ఎక్కించే ప్రయత్నం చేశారు ఏ హాలీవుడ్ ప్రమాణాలకీ తీసిపోకుండా. వంద కోట్ల బడ్జెట్ తో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించామంటున్న ఈ స్పై థ్రిల్లర్ అజిత్ ని నిలబెట్టిందా, లేక సూర్యకి సింగం 3 మిగిల్చిన అనుభవం లాంటిది అందించిందా అన్నది ప్రశ్న. రెండేళ్ళ తర్వాత అజిత్ నటించిన వివేకంలో వివేకం పాలెంత,  అవివేకం పర్సెంటేజీ ఎంత అనేది ఓ సారి చూద్దాం...

కథ 
     తూర్పు యూరప్ లోని సెర్బియాలో టెర్రరిజం  వ్యతిరేక సీక్రెట్ ఏజెన్సీ పని చేస్తూంటుంది. అందులో ఏకే అనే అజయ్ కుమార్ (అజిత్) ఏజెంట్ గా వుంటాడు. కన్నుగప్పి తిరిగే విద్రోహులు ఎక్కడున్నా వెతికి పట్టుకుని చంపడంలో ఇతను స్పెషలిస్టు. ఇతడికో అందమైన భార్య హాసిని (కాజల్ అగర్వాల్)  వుంటుంది. ఈమెకి భర్త ఏ ప్రమాదకర డ్యూటీ మీద వెళ్ళినా క్షేమంగా తిరిగి వస్తాడనే నమ్మకం వుంటుంది. ఈ నమ్మకమే అతణ్ణి గెలిచేలా చేస్తూంటుంది. ఏజెన్సీలో నల్గురు ప్రాణమిత్రులు కూడా వుంటారు. వాళ్ళల్లో ముఖ్యుడు ఆర్యన్ (వివేక్ ఒబెరాయ్). నటాషా (అక్షరా హాసన్)  అనే ఒక గుర్తు తెలియని హ్యాకర్ వుంటుంది. ఆమెదగ్గర అణుబాంబుల్ని పేల్చగల సీక్రెట్ కోడ్స్ తో కూడిన డ్రైవ్స్ వుంటాయి. కొన్ని కార్పోరేట్ శక్తులు సీక్రెట్ సొసైటీగా ఏర్పడి, అణుశక్తితో ప్రపంచంలో భూకంపాల్ని సృష్టించి వ్యాపారం చేసుకుంటూ వుంటాయి. అలాటి ప్లుటోనియం బాంబుల్ని పేల్చే కొడ్సే నటాషా దగ్గరవుంటాయి. ఈమెని పట్టుకుని ఆ ప్రమాదాన్ని నివారించే బాధ్యత జేకేకి అప్పగిస్తారు. ఆమె వేటలో బయల్దేరిన జేకేకి ఆమె దొరికేసరికి వూహించని విధంగా కొన్ని సంఘటనలు జరిగి షాక్ అవుతాడు. అక్కడ్నించీ అతను  తీవ్ర ప్రమాదంలో పడతాడు. ఇలామిత్రులు శత్రువులై అతణ్ణి వాడుకున్న ద్రోహాన్ని ఎలా ఎదుర్కొన్నాడనేది మిగతా కథ.

ఎలావుంది కథ 
       ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ - 8 తిరగేసిన కథలా వుంది. ఇందులో ఐదుగురు మిత్రులైన సీక్రెట్ ఏజెంట్లు. ఏ డేటాబేస్ లోనూ వివరాల్లేని సిఫర్ అనే ఒక ఆడ సైబర్ టెర్రరిస్టు. ఈమె విన్ డిసిల్ భార్యనీ చిన్నారి కొడుకునీ కిడ్నాప్ చేసి అతణ్ణి తన కార్యకలాపాలకి వాడుకుంటుంది. విన్ డిసిల్ మిత్రులు తమకి ద్రోహం చేసి ఏదో కుట్రకి పాల్పడుతున్నాడని అతడి కార్యకలాపాల్ని అడ్డుకోవడం. ఇంతే. ఈ కథ కాస్తా ‘వివేకం’ లో మిత్రులే ద్రోహులై, సిఫర్ లాంటి నటాషా మంచి పిల్లగా తేలి, మిత్ర ద్రోహులు వర్సెస్ హీరో యాక్షన్  కథగా  రూపాంతరం చెందింది. ఇందులో హీరో ఒక మాటంటాడు- దేవుడు తన వైపు వున్నాడని. దీనికి విలన్ నవ్వి- కోతి నుంచి మనిషి ఎలా పరిణామం చెందాడో,  దేవుడు కూడా అలాగే పరిణామం చెందాడు డబ్బుగా – అంటాడు. బాగానే వుంది కానీ,  ఈ తిరగేసిన కథ బాక్సాఫీసు దగ్గర డబ్బుగా పరిణామం చెందడం కష్టమే.

ఎవరెలా చేశారు 
      దేశంలో నెరసిన జుట్టుతో అజిత్ ఒక విలక్షణ హీరో. చాలా గ్లామరస్ ఫేసు కూడా. ఈయనకి స్పై యాక్షన్ తోడైతే అది హై వోల్టేజ్ యాక్షన్ గా పరిణామం చెందడం ఖాయం. ఇదే చూస్తామిక్కడ. పైగా తను విసిరే రెండు లైన్ల పంచ్ డైలాగులు. ఫ్రెండ్ షిప్ మీద ఎన్నిసార్లు మార్చి మార్చి రెండు లైన్ల పంచ్ లు  విసురుతాడో లెక్కేలేదు. ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ -8  లో విన్ డిసిల్ సహా నల్గురు మిత్రులూ పేల్చే సింగిల్ లైన్ డైలాగులు ఎంత ఉర్రూతలూగించాయో తెలిసిందే. స్టార్ ని హీమాన్ గా చూపిస్తున్నప్పుడు ఆ స్థాయిలో అతడి నోట్లోంచి మాటలు వూడి  పడకపోతే పేలవంగా వుంటాడు. డైలాగ్స్ పరంగా కూడా అజిత్ వండర్ చేశాడు. ఆధునిక తెలుగు స్టార్ యాక్షన్ మూవీస్ కి డైలాగ్స్ పరంగా ఎఫ్ ఎఫ్ -8 ఒక గైడ్ అని ఆ రివ్యూలో రాశాం. అదిప్పుడు తమిళ ‘వివేకం’ లో కన్పిస్తోంది. 

          హాలీవుడ్ కూడా కళ్ళప్పగించి చూసే స్థాయిలో అజిత్ చేసిన స్టయిలిష్ స్పై పోరాటాలు ఈ సినిమాకి పెద్ద హైలైట్. అయితే ఇవే మైనస్ కూడా సరైన కథ లేకపోవడం వల్ల. ఇక భార్య పాత్రలో కాజల్ అగర్వాల్ చాలా బ్యూటిఫుల్. చాలా అందంగా ఆమె చెప్పే మాటలకి కళ్ళు చెమ్మగిల్లుతాయి. కానీ ‘నేనేరాజు - నేనే మంత్రి’ లోలాగా ఆమెది  అర్ధం లేని పరాజితురాలి పాత్ర కాదు. అనుక్షణం భర్తకి దన్నుగా వుండే, ఎట్టి  పరిస్థితుల్లో ప్రమాదాలనుంచి లాక్కు వచ్చే బలమైన సతీసావిత్రి పాత్ర. మహేష్ భట్ హిట్  ‘రాజ్’ (రహస్యం) అనే హార్రర్ లో దుష్ట శక్తి నుంచి భర్తని కాపాడుకునే కసితో వుండే బిపాషా బసు పోషించిన పాత్ర కూడా ఇలాటిదే సతీసావిత్రి పాత్ర. ఈ హార్రర్ కి మహిళలు కూడా ఎగబడి పెద్ద హిట్ చేశారు. కానీ ‘వివేకం’ కి ఈ అదృష్టం లేదు. కాజల్ పాత్ర ఎంత బావున్నా, యాక్షన్ హోరు దాన్ని మింగేసింది. అదే ఎఫ్ ఎఫ్ -8 లో విన్ డిసిల్ ఫ్యామిలీ స్టోరీ కథలో కలిసిపోతుంది. విన్ డిసిల్ కి పుట్టిన ఉయ్యాలూగే బుడ్డోడి కామెడీ జేసన్ స్టాథంతో ఎప్పటికీ గుర్తుండిపోయే ఎపిసోడ్స్. 

           బాలీవుడ్ లో కనుమరుగవుతున్న హీరో వివేక్ ఒబెరాయ్ విలన్ గా నటించాడు. హీరోని పోగుతూ వుండే విలన్. విలనీ పండలేదు. కంప్యూటర్ స్క్రీన్స్ ముందే  కూర్చుని తెగ వాగుతూ వుండే వీక్ విలన్. 

          అక్షరా హాసన్ ఎందుకో నటాషా పాత్రకి సరిపోలేదు. ఈ పాత్రలో కొత్త హీరోయిన్ కంటే, ఎవరైనా ప్రముఖ సీనియర్ నటి వుంటే వూపు వచ్చేది. కనీసం నయనతార. ఎఫ్ ఎఫ్ -8  లో ఇదే అడవిలన్ సిఫర్ గా ప్రముఖ ఆస్కార్ నటి చార్లీజ్ థెరాన్ నటించి కథకి  మరింత క్రేజ్ తెచ్చింది. 

          కళ్ళప్పగించి చూసే కెమెరా వర్క్ వెట్రి చేశాడు. కళ్ళుతిరిగే యాక్షన్ కొరియోగ్రఫీ దర్శకుడు శివ చేశాడు. కిక్ ఇచ్చే సంగీతాన్ని అనిరుధ్ ఇచ్చాడు. ఇండియాలో ఈ స్థాయి యాక్షన్ మూవీ ఇదే. ఒక స్థాయిగల స్టార్ సినిమాలతో సరిపెట్టుకోలేకపోతున్న ప్రేక్షకులకి స్పై మూవీస్ తో అంతర్జాతీయ స్థాయికి తీసికెళ్ళి సంతృప్తి పర్చాలేమో. కానీ మొన్న తెలుగు ‘లై’, ఇవ్వాళ తమిళ ‘వివేకం’ ఇది సాధించాయా? 

చివరికేమిటి?
          ఏమీ లేదు, ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్సే. ఇప్పుడు మనం కొత్తగా కళ్ళు తెర్చి తీస్తున్న సీరియస్ స్పై సినిమాలు హాలీవుడ్ తీసి తీసి బోరు కొట్టించుకుని, ఎంటర్ టైనర్ స్పైలు తీస్తున్నారు. ‘లై’ లోనూ ‘వివేకం’ లోనూ లోపించింది ఇదే. ఫస్టాఫంతా ఇంటర్వెల్ ముందు వరకూ తెరపైకే రాని నటాషాని పట్టుకునే వెతుకులాటే సరిపోతుంది. హీరో పక్కన కమెడియన్ కరుణాకరన్ నవ్విస్తూంటాడు గానీ, సెకండాఫ్ లో మాయమైపోతాడు. సెకండాఫ్ అంతా విలన్ అయిన ఫ్రెండ్ మీద పగతీర్చుకునే వ్యవహారమే. ఇదీ సీరియస్సే. చీటికీ మాటికీ రిలీఫ్ లేకుండా యాక్షన్ సీన్లు. ‘సింగం త్రీ’ పరిస్థితే ఇక్కడా ఎదురవుతుంది. హాలీవుడ్ సినిమాల్లో యాక్షన్ హీరోకి ఇంటి దగ్గర హీరోయిన్ తో ఏదో టెన్షన్ వుండే ఫార్ములా వుంటుంది. ఇదే ఫార్ములా  కొన్నిసార్లు అజిత్ - కాజల్ ల మధ్య బెడిసి కొట్టింది. అతను భీకర పోరాటంలో వున్నప్పుడు ట్రింగు ట్రింగు మని సెల్ మోగడం, అతను పోరాటం చేస్తూనే ఆమె కబుర్లు వినడం. ఆమెతో ఒక సీను మాత్రం బాగా పండింది. ఆమెని చంపడానికి శత్రువులు చుట్టుముట్టినప్పుడు, ఎక్కడ్నించో బుల్లెట్ దూసుకురావడం, భర్త వచ్చాడనే ఆనందాన్ని ప్రకటిస్తూ ఆమె చేసే యాక్షన్ బాగా పేలింది.  అజిత్ కంటే కాజల్ ఫన్నీ క్యారక్టర్. 

          ఇక ఈ మొత్తం గందరగోళంలో స్క్రీన్ ప్లే అనే పదార్ధం ఎప్పుడు నోట్లో పడుతుందా అని నోరు తెర్చుకుని చూడడమే. అది పడదు, మనకి ఆశ తీరదు. ఫ్రెండ్స్ తో సెంటిమెంట్లు దెబ్బ తిన్న కథ, భార్యతోమళ్ళీ అదే సెంటి మెంట్ల కథా చెప్పుకురావడం వల్ల  ఏదీ హత్తుకునేలా  లేకుండా పోయింది. ఫ్రెండ్స్ ని ఎఫ్ ఎఫ్ -8 ఫ్రెండ్స్ లాగే ఎంటర్ టైనింగ్ యాక్షన్ లో వుంచి, భార్యతో ఎమోషనల్ ట్రాక్ వుండివుంటే - కాంట్రాస్ట్ తో కాస్తయినా కథ అనే పదార్ధం కనబడేది.


-సికిందర్