రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

3, ఫిబ్రవరి 2018, శనివారం

598 : రివ్యూ!




రచన - దర్శకత్వం: వెంకీ కె.
తారాగణం : నాగశౌర్య,  రశ్మిక,  నరేష్,  వెన్నెల కిషోర్, సత్య, వైవా హర్ష, పోసాని కృష్ణమురళి తదితరులు.
సంగీతం: మహతీ స్వర సాగర్, ఛాయాగ్రహణం : సాయి శ్రీరామ్   బ్యానర్‌: ఐరా క్రియేషన్స్ 
నిర్మాత: ఉషా ముల్పూరి
విడుదల :  ఫిబ్రవరి 2, 2018
***
      లవర్ బాయ్ హీరో నాగశౌర్య కొత్త దర్శకుడితో మరో కొత్త ప్రయత్నంగా విజయాన్ని కాంక్షిస్తూ వచ్చాడు. కొంత కాలంగా ప్రచారంలో వుంటూ ఆసక్తి రేపుతున్న ‘ఛలో’ తో అనిల్ కపూర్ ‘సాహెబ్’ లాగా, చిరంజీవి ‘విజేత’ లాగా ఎక్కడికో బయల్దేరినట్టు డఫెల్ బ్యాగు తగిలించుకుని విచ్చేశాడు. ఎక్కడికి బయల్దేరినా చేరాల్సింది తను కోరుకుంటున్న ఒక్క హిట్టు గట్టుకే. మరి ఆ డఫెల్ బ్యాగులో  హిట్టుకి తగ్గ ట్రావెల్ సరంజామా అంతా వుందా, లేక ఉత్తి బ్యాగేనా అది? ఆర్ట్ డైరెక్టర్ ఉత్తి బ్యాగే ఇస్తాడని మనకి తెలుసు. అందులో తన ఆలోచనలు, కొత్త దర్శకుడి  ఆలోచనలూ వుండాలిగా? అవి వున్నాయా? వుంటే ఏ మేరకున్నాయి? ఎంతవరకూ ప్రేక్షకుల్ని అలరించడానికి సరి తూగుతున్నాయి? ప్రేక్షకులు అలక పాన్పెక్కకుండా ఎంతవరకూ కాపాడుతున్నాయి?...ఒకసారి ఈ కింద టూరేసి చూద్దాం...

కథ 
      హరి (నాగశౌర్య) కి చిన్నప్పట్నుంచీ ఎవరైనా గొడవలు పడుతూంటే చూసి ఎంజాయ్ చేయడం అలవాటు. నాల్గు తన్ని తన్నించుకోవడంలో ఆనందం.  ఇది భరించలేక తండ్రి (నరేష్) ఇంజనీరింగ్ చదువుకోవడానికి ఆంధ్రా –తమిళనాడు సరిహద్దులో తిరుప్పురం అనే వూరుకి పంపేస్తాడు. పక్కనే తెలుగు వూరు వుంటుంది. ఆ తెలుగు వాళ్ళకీ,  తమిళులకీ పడక కొట్టుకుంటూ వుంటారు. రెండూళ్ళ మధ్య కంచె వేసుకుని, దాటి వస్తే చంపేస్తూంటారు. తెలుగు వూళ్ళో చేరిన హరి కాలేజీలో జాయినవుతాడు. రెండూళ్ళ ఆ ఉమ్మడి కాలేజీని తమ సాంప్రదాయ గొడవల్నుంచి మినహాయిస్తారు. రెండూళ్ళ విద్యార్ధులందరూ  అక్కడే చదువుకుంటూ వుంటారు.  అక్కడ హరి కార్తీక (రశ్మిక) ని  చూడగానే ప్రేమలో పడిపోతాడు. ఆమె కూడా ప్రేమిస్తుంది. తీరా చూస్తే ఈమె తెలుగు అమ్మాయి కాదనీ, అవతలి వూరు ఘరానా మనిషి తమిళ వీరముత్తు కూతురనీ  తెలుస్తుంది. కూతురి వ్యవహారం తెలుసుకున్న వీరముత్తు హరిని  చంపమని ముఠాని తోలుతాడు. హరి పారిపోతాడు. 

          ఇప్పుడు కార్తీకని పొందాలంటే హరి ఏం చేశాడు?  రెండూళ్ళ  మధ్య గొడవల్ని  చల్లా ర్చాలంటే ఏం చేశాడు? అలా చేసి కార్తీకని పొందగలిగాడా? ... అన్నదే మిగతా కథ.  

ఎలావుంది కథ 
      రోమాంటిక్ యాక్షన్ కామెడీ  జానర్ గా ప్రారంభమై,  అంతలో యూటర్న్ తీసుకుని,  బాధాకరంగా జానర్ మర్యాదని వదిలేస్తూ,  రోమాంటిక్ డ్రామా జానర్లోకి తిరగబెట్టింది. సగం వరకూ యూత్ అప్పీల్,  మార్కెట్ యాస్పెక్ట్, క్రియేటివ్  యాస్పెక్ట్ లకి  మంచి న్యాయంచేకూరుస్తూ కూడా, మిగతా సగాని కొచ్చేసరికి ఇవి అవసరం లేదనుకుని వదిలేసి, ఏటో వెళ్ళిపోయింది.  హీరోహీరోయిన్ల ప్రేమకి రెండూళ్ళు అడ్డు అనే ఐడియా ఇప్పటిది కాదు. గతంలో చాలా వచ్చాయి, ఇప్పుడింకా  ఒకటో రెండో కూడా రాబోతున్నాయి. కాబట్టి  ప్రస్తుత కథలో ప్రాంతాలు మార్చినంత మాత్రాన  కొత్తదనమేమీ రాలేదు. సాంస్కృతిక పరమైన విభేదాల కథ కూడా కాదు. కనుక ఏదో మెసేజీ వినాల్సిన బాధ కూడా ప్రేక్షకులకి లేదు. రెండూళ్ళ  జిగ్రీ దోస్తులైన ఇద్దరు తెలుగు తమిళ తాతలు మదమెక్కి తన్నుకుని,  రెండూళ్ళ మధ్య గీత గీసిపోయిన మూర్ఖత్వమిది. దీన్ని పట్టుకుని అసలు నిజమేంటో తెలీని ఇప్పటి జనం, తాతల మూర్ఖత్వాన్నే కంటిన్యూ చేస్తూ కొట్టుకు ఛస్తున్నారు. ఈ నేపధ్యంలో హస్యభరితంగా టైం పాస్ ప్రేమ కామెడీ చెప్పాలి. కానీ  పాతదే అయినా,  ఎంతో యూత్ ఫుల్  కాన్సెప్ట్ గా కొత్తగానే , హాస్య భరితంగానే  కొనసాగిస్తూ పోతున్న కొత్త దర్శకుడైన కథకుడు, తీరా ఒక్కసారిగా నస భరితం చేయడం చాలా శోచనీయమైన విషయం. నాణేలకి సైడ్ ‘బి’ వుంటుంది గానీ, ‘షోలే’ నాణేనికి రెండు  వైపులా సైడ్ ‘ఏ’ లే వుంటాయి. సినిమాల కథలు కూడా ‘షోలే’ నాణెం లాంటివే. పూర్వార్ధంలాగే ద్వితీయార్ధమూ కొనసాగాలని నాల్గు డబ్బులిచ్చుకుని కూర్చున్న ప్రేక్షకుడు ఆశిస్తాడు. అలా లేనిపక్షంలో బాక్సాఫీసు దగ్గర అచ్చు బొమ్మ జూదమాడేస్తాడు. 

ఎవరెలా చేశారు 
     నాగశౌర్యకి  చాలాకాలం తర్వాత ఓ మంచి సినిమాయే దొరికింది.  కాకపోతే పాక్షికంగా మాత్రమే. తను కథ వినేటప్పుడు - తన పాత్ర పుట్టు లక్షణమైన కొట్లాటల పిచ్చి, సెకండాఫ్ లో చచ్చిపోయిందేమిటని అనుమానమే రాలేదా? యాక్టివ్ క్యారెక్టర్ పాసివ్ క్యారెక్టర్ అయిందేమిటని అన్పించనే లేదా? ఇక్కడే తను సినిమాని నిలబెట్టడంలో పూర్తిగా సఫలం కాలేకపోయాడు. రోటీన్ మూస –మాస్- ఆవారా పాత్రచిత్రణలకి  భిన్నంగా,  ఎంతో ఫ్రెష్ గా, విలక్షణమైన ఫన్నీ పాత్రగా అలరిస్తున్న తను, నవ్విస్తున్న తను, ప్రేక్షకుల చేత ఈలలేయించుకుంటూ వున్న తనే, తీరా సెకండాఫ్ కొచ్చేసరికి  ఆ కిక్ నంతా వదిలేసుకోవడమేమిటి? అక్కడ్నించీ యూత్ అప్పీల్ కి దూరమైపోవడమేమిటి? ముగింపు ఉస్సూరు మన్పించడమేమిటి? అంతవరకూ సన్నివేశ బలాలతో,  వాటిలోంచి పుట్టిన పర్ఫెక్ట్ పాటలతో అంతకంతకూ పాత్రని ప్రేక్షకులు ప్రేమించేలా చేసుకోగల్గిన తను, ఒక్క పాట విషయంలో పప్పులో కాలేసినట్టు గమనించలేదా? అప్పటికే డీలా పడిపోయిన కథని లేవనెత్తకుండా, ఇంకా డీలా పడిపోయేలా చేస్తూ,  బార్ లో ఆ భగ్న ప్రేమ తాలూకు తాగుడు పాటేమిటి?  

          నాగశౌర్యకి ఈసారి మంచి క్రియేటివ్ విజన్, తనదైన ఒక శైలి నేర్పాటుచేసుకుని ముద్ర వేయాలన్న తపనా గల, కొత్త దర్శకుడు దొరికాడు. కానీ కథకుడుగా పాక్షిక రైటింగ్ పవరే వుండడంతో,  కొత్త దర్శకుడి చేతిలో తను పూర్తిగా రాణించలేకపోయాడు. ఈ సినిమా తో నాగశౌర్య  మెసేజీ లేమీ ఇవ్వలేదు గానీ, సినిమాయే శౌర్యకి గట్టి మెసేజి ఇస్తోంది – భవిష్యత్తులో పూర్తిస్థాయి రైటింగ్ పవర్ వుండేట్టు కూడా చూసుకోవాలని. 

          కొత్త హీరోయిన్ రస్మిక,  వూళ్ళల్లో వుండే  కామన్ గర్ల్ పాత్రకి సరిపోయే శారీరక తత్వంతో, హీరోతో ఎత్తు చాలకపోయినా  సహజ నటనతో,  కాలేజీ అమ్మాయిలతో కలిసిపోయే క్రేజీ యూత్ అప్పీల్ తో వుంది. సహజ నటనే అయినా, స్పాంటేనియస్ గా నటించడం తెలియడంతో ఆమె వున్న సీన్లు చైతన్యవంతంగా వున్నాయి.

       ఇక తెలుగు, తమిళ కాలేజీ గ్యాంగ్ అంతా ఫన్నీ కమెడియన్స్. వీళ్ళల్లో సత్యకి ఫుటేజీ ఎక్కువ. ఎవరూ వెకిలి కామెడీలు చేయకపోవడం పెద్ద రిలీఫ్. లెక్చరర్ గా పోసానీ కామెడీ పర్ఫెక్ట్. ప్రిన్సిపాల్ గా రఘుబాబు కూడా మోటు కామెడీకి దూరంగా,  నీటుగా తక్కువ మాటలతో నవ్వించడం ఎక్సెలెంట్. సెకండాఫ్ లో పెళ్లి కొడుకుగా వెన్నెల కిశోర్ ది మెంటల్ కామెడీ.
         
మహతీ స్వర సాగర్ ఇచ్చిన సంగీతం చాలా పెద్ద ఎసెట్ ఈ సినిమాకి. ఆ రెండూళ్ల నేటివిటీని  దృష్టిలో పెట్టుకుని కూర్చిన నేటివ్ బాణీలూ, అందుకు తగ్గ సాహిత్యం పాటల్లో ఇన్వాల్వ్ చేసేట్టున్నాయి ప్రేక్షకుల్ని. చాలాకాలం తర్వాత తెలుగు తెరమీద ఇది చూస్తున్నాం. ఒక్క చివరి బార్ సాంగ్ మాత్రం కథ బలహీనపడ్డ నేపధ్యంలో గల్లంతయ్యింది. 

          అలాగే సాయిశ్రీరాం ఛాయాగ్రహణం మంచి విజువల్స్ ని క్రియేట్ చేయగల్గింది విషయ పరమైన ఫీల్ ని దృష్టిలో పెట్టుకుని. కొత్త దర్శకుడి షాట్ కంపోజింగ్ లో లాలిత్యముండడంతో  కెమెరా వర్క్ నాణ్యత కూడా పెరిగింది. అందమైన కొత్త లొకేషన్స్ బాగా కలిసి వచ్చాయి.  బ్రిటిష్ కాలంనాటి కాలేజీ, హాస్టల్ భవనాలు కాలేజీ సీన్స్ కి మంచి డాబుసరి నేపధ్యాలు. ప్రొడక్షన్ ప్రమాణాలన్నీ ఉన్నతంగా వున్నాయి. 

చివరికేమిటి 
        కొత్తదర్శకుడు వెంకీ ‘ఛలో’ అన్నాడే గానీ, సెకండాఫ్ ని కూడా వెంట తీసికెళ్ళ లేదు. ఫస్టాఫ్ తో సెకండాఫ్ ‘చలేంగే సాథ్ మిల్ కే’  అని చేయిచాపి అడుగుతున్నా, కలిసి సాగేందుకు ఫస్టాఫ్ ఒప్పుకోలేదు. రెండూళ్ళ పంచాయితీ లాగే అయింది. ఇంత మాత్రానా కొత్త దర్శకుణ్ణి తక్కువ చేయడానికి వీల్లేదు. అతడి క్రియేటివిటీనీ, సెన్సాఫ్ హ్యూమర్ నీ  గుర్తించాల్సిందే. ఈ సెన్సాఫ్ హ్యూమర్ తో కూడిన డైలాగుల్ని కింది క్లాసు ప్రేక్షకులు కూడా తెగ ఎంజాయ్ చేయడాన్నిబట్టే కొత్త దర్శకుడి టాలెంట్ తెలుస్తోంది. డైలాగులకి ఈ తాజాదనం పాత్రలు మాటాడ్డం వల్ల వచ్చింది. దీంతో టెంప్లెట్ మూస డైలాగుల బాధ తప్పింది. టెంప్లెట్ మూస డైలాగులు పాత్రలు మాట్లాడేవి కావు, అవి దర్శకుడో రైటరో సినిమా ప్రపంచంలో మునిగి వుండి  రాసేవి. పాత్రలు సినిమా ప్రపంచంలో ఛస్తే వుండవు, , అవి వాటివైన  కథా ప్రపంచంలోనే వుండి మాట్లాడాలనుకుంటాయి. అందుకని అవి మాట్లాడితే మూస వాసనెయ్యదు. 


          కొత్త దర్శకుడి దగ్గర అపారమైన క్రియేటివ్ టాలెంట్ వుంది. దీనికి స్ట్రక్చర్ జతపడక పోవడంతో  సెకండాఫ్ కి సమస్య వచ్చింది. ఇది చూసైనా ఇప్పటికైనా ఇంకెవరైనా స్ట్రక్చర్ కూడా ఎంత ముఖ్యమో  గ్రహిస్తే క్రియేటివిటీకి అర్ధముంటుంది.  ఈ కొత్త దర్శకుడే విలన్ తో ఒక డైలాగు అన్పిస్తాడు - ఇక పంచాయితీలుండవ్, పంచనామాలే వుంటాయని. ఇలాగే  ఈ ఫస్టాఫ్ - సెకండాఫ్ ల పంచాయితేమిటో, పంచనామా ఏమిటో,  స్క్రీన్ ప్లే సంగతులు చేసి సోమవారం చూద్దాం.

సికిందర్




         


  



         

2, ఫిబ్రవరి 2018, శుక్రవారం

597 : రివ్యూ!


దర్శకత్వం : విక్రం సరికొండ
కథ : వక్కంతం వంశీ, టెంప్లెట్  : దీపక్ రాజ్, మాటలు : శ్రీనివాస రెడ్డి , అడిషనల్ డైలాగ్స్ : రవి రెడ్డి, కేశవ్
తారాగణం : రవితేజ, రాశీ ఖన్నా, సీరత్ కపూర్, ఫ్రెడ్డీ దారూవాలా
సంగీతం : జామ్ 8,  ఛాయాగ్రహణం : ఛోటా కే నాయుడు
బ్యానర్ : శ్రీ లక్ష్మీ నరసింహా ప్రొడక్షన్స్
నిర్మాత : నల్లమలుపు బుజ్జి,  వల్లభ నేని వంశీ
విడుదల : ఫిబ్రవరి 2, 2018

***
          క త్వరత్వరగా సినిమాలు చేసెయ్యాలనుకుంటున్న రవితేజ మూడు నెలలకల్లా మరో సినిమాతో వచ్చాడు. దీనికి కొత్త దర్శకుడికి అవకాశమిచ్చాడు. పాత్రలు, నటన, కథలు కూడా మారకుండా అవే రిపీట్ చేస్తూ చేస్తూ మాస్ మహారాజా అన్పించుకుంటున్న రవితేజకి,  ఈ వ్యూహం ఇంకెంత కాలం వర్కౌటవుతుంది? రవితేజ అంటే ఇదేనా, ఇంకేమైనా వుందా?  మాస్ మహారాజా మూస మహారాజాగా వుండి పోవాల్సిందేనా? ఇలా వుంటేనే చూస్తారా ప్రేక్షకులు? ఇప్పుడు ఇదే వ్యూహంతో  మళ్ళీ టచ్ చేసి చూడ మంటున్నాడా? ఏ సంగతి ఈ కింద రివ్యూలో చూద్దాం ...

కథ 
      కార్తికేయ (రవితేజ)  పాండిచ్చేరిలో వ్యాపారం చేస్తూంటాడు. కుటుంబం వుంటుంది. కుటుంబం మీద ఈగ వాలనివ్వడు. పెళ్లి చేద్దామనుకుంటారు తల్లిదండ్రులు. పెళ్లి చూపుల్లో పుష్ప (రాశీ ఖన్నా) ని చూస్తాడు. ఆమె కాదన్నా వెంటపడి తనకి పడేలా చేసుకుంటాడు. ఆమె ఎందుకో అలుగుతుంది. వేరే పెళ్లి చూపులని నాటకమాడతాడు.  ఆమె పూర్తిగా  దూరమవుతుంది. ఇంతలో అతడి చెల్లెలు ఒక హత్య చూస్తుంది. సాక్ష్యం చెప్పమని పోలీసుల దగ్గరికి తీసుకుపోతాడు. ఆమె చూసిన హంతకుడు ఇర్ఫాన్  లాలా (ఫ్రెడ్డీ దారూవాలా)  అని కార్తికేయకి తెలుస్తుంది. అంతలో అట్నుంచి  పోతున్న ఇర్ఫాన్ లాలా వెంట పడతాడు. ఇర్ఫాన్ లాలా తప్పించుకుంటాడు. కార్తికేయ కమీషనర్ ( మురళీ శర్మ) కి ఫోన్ చేసి,  ఐదేళ్ళ క్రితం చనిపోయిన ఇర్ఫాన్ లాలా ఎలా బతికున్నాడని నిలదీస్తాడు. ఇక ఏసీపీ క్యాప్ పెట్టుకుని పోలీసు ఆఫీసర్ గా ఇంటర్వెల్ కి బయల్దేరతాడు. మనం కూడా బయల్దేరతాం. 
          ఇంతకీ ఎవరీ ఇర్ఫాన్ లాలా? ఇతడికీ కార్తికేయకీ ఏమ  సంబంధముంది? గతంలో అసలేం జరిగింది? ఇవి తెలుసుకోవడానికి  ఇంటర్వెల్ తర్వాత లోపలి కెళ్ళాలి.

ఎలా వుంది కథ
     కథా? అదేమిటి?  కథేమైనా వుంటుందా తెలుగు సినిమాకి? వున్నా అదే పురాతన అరగదీసిన మూస ఫార్ములా టెంప్లెట్ కాక వేరే ఏదైనా వుంటుందా? కథ ఎలా వుందని  అడగడమంటే అమాయకత్వాన్ని వెళ్ళబోసుకోవడమే. అయితే ఇక్కడ ఈ టెంప్లెట్ గురించే  కొంత చెప్పుకోవాలి.  టెంప్లెట్ ని కూడా స్టార్ హీరోతో ‘బి’ గ్రేడ్ టెంప్లెట్ గా తీసేసిన ధైర్యానికి మెచ్చుకుని తీరాలి.  టెంకాయ కొట్టక ముందే ఫస్టాఫ్ ఫ్లాప్, సెకండాఫ్ అట్టర్ ఫ్లాప్ అని తెలిసిపోయే 'బి'  గ్రేడ్ టెంప్లెట్ ని,  ‘ఏ’ గ్రేడ్ స్టార్ తో నిర్లక్ష్యంగా తీసి అవతల పడేసే స్థాయికి చేరుకోవడమంటే మామూలు మాట కాదు. కోటప్పకొండ తిరునాళ్ళ ల్లో రికార్డింగ్ డాన్స్ నాటకాల  స్థాయికి  టెంప్లెట్ కూడా పడిపోయింది. ఈ వ్యాసకర్త ఇంటర్వెల్ కల్లా పారిపోయే ప్లానేస్తే, అవతల బండి  తీయరాక మళ్ళీ బందీ అయిపోవాల్సివచ్చింది  హారిబుల్  మహారాజాకి!  ఇక శివరాత్రికి కోటప్పకొండ కెళ్ళి నాల్గు రికార్డింగ్ డాన్సులు  టచ్ చేసి చూస్తేనే బూజు వదిలేది! 

ఎవరెలా చేశారు 
      ‘బి’  గ్రేడ్ లో ఎవరైనా బేకారుగానే కన్పిస్తారు. మాస్ మహారాజా మనసు పెట్టి నటించలేదు. అది బిగుసుకుపోయిన ముఖ భావాల్లోనే స్పష్టంగా తెలిసిపోతూంటుంది. పైగా వయసు కూడా తెలిసిపోతూం
డడంతో ఫైట్లూ, పాటల్లో డాన్సులూ తప్ప, మిగతా హీరోయిన్లతో  రెగ్యులర్ కామెడీలు, టీజింగులూ వగైరాలు  ఇదివరక
టంతటి గ్లామరస్ గా కన్పించవు. ఎక్కడో వ్యాపారం చేసుకునే పాత్ర, పోలీసు ఆఫీసర్ గా బయటపడే ఫ్లాష్ బ్యాక్ లాంటి ఫ్యాక్షన్ వయా బాషా క్యారెక్టర్లకి ఇది కాలమా అని ఆలోచించకుండా నటించిన రవితేజ,  అభిమానులకి కూడా ‘అజ్ఞాత వాసి’ తో పవన్ కళ్యాణ్  ఇచ్చినంత షాకు నిచ్చాడు. రవితేజ కెరీర్ లోనే ఇది అట్టడుగు స్థాయి ప్రయత్నం. 

         టెంప్లెట్ హీరోయిన్లు ఇద్దరి గురించీ నో కామెంట్. ఇతర నటుల గురించి కూడా చెప్పుకోవడానికి లేదు. విలన్ గా  నటించిన ఫ్రెడ్డీ దారూవాలాకి  విలన్ కి సరిపోయే సీను లేదు.  

          ఎందుకనో ఛోటా కే నాయుడు ఈసారి తనదైన మార్కు కెమెరా పనితనం చూపెట్ట లేకపోయారు. పెద్ద సినిమాలు తీసే నల్లమలుపు శ్రీనివాస్ ప్రొడక్షన్ విలువలు ‘బి’గ్రేడ్ గా వున్నాయి. బాలీవుడ్  ప్రీతమ్ గ్రూపు జామ్ 8 సంగీతంలో పాటలు కుదరలేదు. మణిశర్మ నేపధ్య సంగీతం మొదట్లో కుదిరి, తర్వాత ఆయనా చేతులెత్తేశారు. రవితేజకి మాటలేం రాశారు – అవే అటు ఇటు మార్చిన టెంప్లెట్ డైలాగులు. ఇవ్వాళ్టి  హీ- మాన్ డైలాగుల సరళిని ‘ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ – 8’  చూసి ఎప్పుడు నేర్చుకుంటారో!  


చివరికేమిటి 
       కొత్త దర్శకుడు విక్రం దృష్టిలో సినిమా అంటే తలపోటు తెప్పించే  షాట్లు అన్నట్టుంది. ఆ షాట్లకీ నేపధ్య సంగీతానికీ లంకె కుదరకపోతే తలపోటే వస్తుంది. ఇది గతంలో బాలకృష్ణ నటించిన ‘లక్ష్మీ నరసింహా’ తోనే స్పష్టమయింది. మైక్రో షాట్లతో పరుగులెత్తే ‘బోర్న్ సుప్రమసీ’ కి  డీఐనే చేయలేక చేతులెత్తేశారు టెక్నీషియన్లు. అది డీఐ లేకుండానే విడుదలయ్యింది. ఇక అందులోని మైక్రో షాట్లతో చిన్న చిన్న బిట్లుగా వేగంగా మారిపోయే సీన్లకి ఎఫెక్ట్సూ, మ్యూజిక్కూ ఇవ్వడం దుస్సాధ్యమై పోయింది.

          కొత్త దర్శకుడు సినిమాలో కంటెంట్ సరీగ్గా వుండేట్టు చూసుకోవాలి గానీ, కంటెంటే లే ని విషయం కప్పిపుచ్చుతూ ఇలాటి టెక్నికల్ హంగామాలు చేస్తే తలపోటు వచ్చే కాలుష్యమే మిగులుతుంది. టెంప్లెట్ సినిమాలు ఫ్లాపవుతున్నాయని తెలిసి కూడా టెంప్లెట్ నే ఆశ్రయించాడంటే,  తీస్తున్నది టెంప్లెట్ అని తెలియక తీశాడనుకోవాలా? చిన్న పిల్లలు కూడా నవ్విపోయే కంటెంట్ ఒక కంటెంటేనా స్టార్ హీరోకి? ఎవరైనా పాత మూస కంటెంట్ తో సెకండాఫ్ లో గంటపాటు ఫ్లాష్ బ్యాక్ పెడతారా? అసలు స్క్రీన్ ప్లే అంటే ఏమిటి?  తోచినట్టూ తోసేసే సొంత క్రియేటివిటీలా? స్క్రీన్ ప్లే అని వేసుకోకూడదు దాని విలువ తీస్తూ – టెంప్లెట్ అని వేసుకోవాలి. 

          రవితేజయినా టెంప్లెట్ ఇప్పుడిక మాస్ మహారాజా స్టేటస్ కి కష్టమని గ్రహించి, కాస్త ఈడియెట్ మార్కు నటనలు కూడా మార్చుకుని, పదిహేనేళ్ళ క్రిందటి ప్రేక్షకులు ఇప్పుడు లేరని గ్రహించి, ఇప్పటి మార్కెట్ కి   ఏది సూటవువుతుందో అదిచ్చే ప్రొఫెషనల్ దర్శకులని చేరదీస్తే, ఇంకో పదేళ్ళు నిలదొక్కుకోగలిగే అవకాశముంటుంది. లేకపోతే ఇంకా క్వాలిటీ పడిపోయి ‘సి’ గ్రేడ్ కి చేరుకోవాల్సి వస్తుంది.

సికిందర్

         
         











1, ఫిబ్రవరి 2018, గురువారం

596 : సందేహాలు - సమాధానాలు




Q :     మీ రివ్యూలు ఆసక్తికరంగా వుంటాయి లెంగ్త్  కాస్త ఎక్కువనిపించినా. అయితే మీరు తరచుగా వాడే పదంజానర్ అంటే ఏమిటి?
విన్నకోట నరసింహా రావు  (ఊరి పేరులేదు)
 A :    మీ అభిమానానికి థాంక్స్. జానర్ గురించి చెప్పాలంటే, కళల్లో ఒక నిర్ణీత కేటగిరీని జానర్ అంటారు.  దీనికి తెలుగు అర్ధం ‘కళాప్రక్రియ’.  కథల విషయానికొస్తే జానపద కథలకి ఒక నిర్ణీత కళా ప్రక్రియ వుంటుంది, కామెడీకి ఒక నిర్ణీత కళా ప్రక్రియ వుంటుంది. ఇలా ఒక్కో కళాభివ్యక్తికి ఒక్కో నిర్ణీత ప్రక్రియ వుంటుంది. ఆ ప్రక్రియలోనే సృష్టి జరగాలి. దీన్నే జానర్ మర్యాద అంటారు. జానర్ అనే మాటని పక్కనబెట్టి సింపుల్ గా పిలుచుకోవాలంటే, అది జానపద కేటగిరీ, ఇది కామెడీ కేటగిరీ...ఇలా  చెప్పుకుంటే చక్కగా  అర్ధమైపోతుంది. ఫలానా కేటగిరీ అన్నాక ఆ కేటగిరీ కుండే లక్షణాలతోనే సృష్టి జరగాలని, జరిగి వుంటుందని  కూడా చప్పున అర్ధమైపోతుంది.
          జానర్ అనేది ఇంగ్లీషు ‘genre’ కి తెలుగు నుడికారం. ఇంగ్లీషులో ‘ఝాన్ర’ అని పలుకుతారు. తెలుగులో అలా పలికినా  రాసినా ఎబ్బెట్టుగా అన్పిస్తుంది. కాబట్టి ‘జానర్’ అని తెలుగైజుడు అయింది. ఇంగ్లీషులో మాటాడేప్పుడు ‘ఝాన్ర’ అనే పలకాలి. తెలుగులో మాటాడేప్పుడు ‘జానర్’ అనాలి. కొందరు సినిమా వాళ్ళు ఏదోలా నోరు తిప్పుతూ ‘జోనర్’  అంటారు. అంత నోరు ఏదోలా తిప్పాల్సిన అవసరంలేదు. ‘జొన్నలు’ అన్పించేలా నోరూరిస్తూ పలకాల్సిన అవసరమూ లేదు.

Q :  త్రీ యాక్ట్ లో రెఫ్యూజల్ ఆఫ్ కాల్ తప్పని సరి అని ఒక చోట చదివాను. మీరు కూడా రాసినట్టు గుర్తు.శివ’  సినిమా త్రీ యాక్ట్ స్ట్రక్చర్ లో రెఫ్యూజల్ ఆఫ్ కాల్ ఎందుకు లేదు?లేకపోయినా అంత పర్ఫెక్ట్ గా ఆర్డర్ ఎందుకు వుంది?
 
పేరు వెల్లడించ వద్దన్న టాలీవుడ్ దర్శకుడు  
A : కథనంలో రెఫ్యూజల్ ఆఫ్ కాల్ అనే మజిలీ 1950 లలో జోసెఫ్ క్యాంప్ బెల్ సూత్రీకరణ లోంచి వచ్చింది. అది పురాణ గాథల  నిర్మాణంలో ఆయన పట్టుకున్న మజిలీ, దాని సూత్రీకరణ. హాలీవుడ్ దాదాపు ’80 ల వరకూ జోసెఫ్ క్యాంప్ బెల్ మిథికల్ స్ట్రక్చర్ నే మార్పు చేర్పులు చేసుకుంటూ స్క్రీన్ ప్లేలు, వాటితో సినిమాలూ సృష్టించుకుంటూ వచ్చింది. (విచిత్రమేమిటంటే యూఎస్ నుంచి వచ్చిన దర్శకుడు దేవా కట్టా 2010 లో తీసిన  ‘ప్రస్థానం’ క్యాంప్ బెల్ ప్రభావంతోనే తీశారు. ఆ ఉన్నత కళావిలువల ఛాయలన్నీ అందులో కనపడతాయి. 2005 లోనే ఈ వ్యాసకర్తని ఆయన అడిగిన మొదటి ప్రశ్న కూడా - క్యాంప్ బెల్ ని చదివారా? అనే).  తర్వాతి కాలానికి – అంటే ’80 లలోనే  ఇది అవుట్ డేటెడ్ అయిపోయింది. స్ట్రక్చర్ ని మరింత సరళీకరించి, కథనానికి స్పీడు పెంచేలా కొత్త పారడైంని అందించిన సిడ్ ఫీల్డ్ ని ఫాలో అవడం మొదలెట్టింది హాలీవుడ్. ’90 లనుంచీ  ఇప్పటి వరకూ హాలీవుడ్ స్ట్రక్చర్ కి సిడ్ ఫీల్డ్ పారాడైంనే ఫాలో అవుతూ వస్తోంది. ఈ స్ట్రక్చర్ లో ‘రెఫ్యూజల్ ఆఫ్ కాల్’ అనే  మజిలీని తొలగించాడు సిడ్ ఫీల్డ్. పరిస్థితి డిమాండ్ చేస్తున్నా హీరో చర్యకి పూనుకోవడానికి తిరస్కరించే ఘట్టాన్నే ‘రెఫ్యూజల్ ఆఫ్ కాల్’ మజిలీ అన్నారు. ఇది బిగినింగ్ విభాగంలో ప్లాట్ పాయింట్ వన్ కి ముందు వస్తుంది. అప్పుడు ఒక సీనియర్ పాత్రో, ఇంకో సన్నిహిత పాత్రో (థ్రెషోల్డ్ క్యారక్టర్ అంటారు) వచ్చి హీరోకి నచ్చజెప్తుంది. అప్పుడు హీరో సరేనని చర్యకి పూనుకోవడానికి సిద్ధమవుతాడు ప్లాట్ పాయింట్ వన్ దగ్గర పరిస్థితి తీవ్రతరం కూడా అవడంతో. 
          ఇది పాత్ర చిత్రణకి సంబంధించిన ఒక షేడ్. సిడ్ ఫీల్డ్ పారాడైంలో దీని అవసరం లేదని తొలగించారు. ఎవరో వచ్చి నచ్చజెప్తే హీరో అప్పుడు ఫీలై చర్యకి పూనుకోకుండా, ఈ సెకండ్ హేండ్ ఫీలింగుకంటే,  తానుగా ఫీలై రంగంలో దిగాలన్న కథనానికి స్పీడు పెంచే ఇన్నోవేషన్ లో భాగంగా ఆ మజిలీ ఎగిరిపోయింది. ఇప్పటి హాలీవుడ్ సినిమాల్ని చూస్తే అవి హీరో పాత్రచిత్రణ సంగతుల్ని బాగా కుదించి, యాక్షన్ ఓరియెంటెడ్ గానే వుంటాయి. సినిమా వ్యాపారానికి  క్యారక్టరైజేషన్ కంటే, ప్లాట్ ప్రొగ్రెషన్  ముఖ్యమని వాళ్ళ కొత్త విధానం.
          ఇందుకే ‘శివ’ లో ఆ మజిలీ – లేదా క్యారక్టర్ షేడ్ లేకపోయినా ఆర్డర్ లో బిగువు తగ్గలేదు. అయితే బిగినింగ్ ఆర్డర్ లో ఆ మజిలీ వుంటుంది. ఒకేసారి హీరో సైకిలు చైన్ తో జేడీని కొట్టడు ప్లాట్ పాయింట్ వన్ లో. అంతకి ముందు జేడీ చేష్టల్ని గమనిస్తూనే వుంటాడు. ఎప్పుడైతే చేష్టలు ముదిరి హీరోయిన్ ని టీజ్ చేస్తాడో,  అప్పుడు చర్యకి పూనుకుని ఫైనల్ గా జేడీని కొట్టి ప్లాట్ పాయింట్ వన్ని సృష్టిస్తాడు. ఇక్కడ హీరోకి ఇంకో సీనియర్ పాత్రో, ఇంకెవరో కొట్టమని నచ్చజెప్పలేదు. ఇక్కడ హీరో స్వయంపోషకత్వం, స్వశక్తీ గలవాడు.
          సిడ్ ఫీల్డ్ తరచూ 19 వ శతాబ్దపు అమెరికన్ నవలారచయితా హెన్రీ జేమ్స్,  ‘ది ఆర్ట్ ఆఫ్ ఫిక్షన్’ వ్యాసంలో రాసిన మాటల్ని ప్రస్తావిస్తూంటాడు -
“What is character but the determination of incident? And what is incident but the illumination of character?” అని.
 
        ఈ తరహా యాక్షన్ ఓరియెంటెడ్ పాత్రచిత్రణే  క్యాంప్ బెల్ పాసివ్ మజిలీని తొలగించింది. యాక్షన్ ఓరియెంటెడ్ పాత్రచిత్రణంటే యాక్షన్ సినిమాలకనే కాదు, ఫ్యామిలీ ప్రేమా, కామెడీ గిమిడీ ఏ రకం సినిమాలకైనా హీరో స్వయం నిర్ణాయక శక్తితో తానుగా సంఘటనల్ని సృష్టించి ఆశ్చర్య పర్చే వాడుగా,  మెరుపులు మెరిపించే వాడుగా వుండాలని అర్ధం. ఇలావుంది కాబట్టే ‘శివ’ లో సైకిలు చైను సంఘటన అంత పాపులరైంది. క్లాసిక్ గా వుండిపోయింది.
         
అయితే గత డిసెంబర్ లో వచ్చినటైగర్ జిందా హైలో   రెఫ్యూజల్ ఆఫ్ కాల్ మజిలీ సహా, జోసెఫ్ క్యాంప్ బెల్ పురాణ ప్రక్రియలు అనేకం వున్నాయి. అవతల ఘోరాలు జరుగుతున్నాయ్ రారా బాబూ అంటే ససేమిరా అంటాడు సల్మాన్ (రెఫ్యూజల్ ఆఫ్ కాల్).  వచ్చిన అధికారులు ఖర్మ అనుకుని వెళ్ళిపోతారు. తర్వాత థ్రెషోల్డ్ క్యారక్టర్ గా కత్రినా కల్పించుకుని,  బుజ్జగిస్తే బయల్దేరతాడు. అయితే ఆనాటి క్యాంప్ బెల్ స్ట్రక్చర్ లో ఈ మిథికల్ క్యారక్టర్ లు, కథనమూ సీరియస్ గా వుంటే ఈ యాక్షన్ మూవీ నిలబడేది కాదు. ఆ మిథికల్ క్యారక్టర్స్ తో, కథనంతో ఎక్కడా సీరియస్ నెస్ అనేది లేకుండా,  తెగ నవ్విస్తూ పోవడడంతో ఈ టెర్రరిజం మూవీ మంచి కమర్షియల్ ఎంటర్ టైనర్ అయింది.


Q :     Just now, I read your review on 'Padmavath' movie. It's outstanding. I want to represent this review in my 'media policy' class. Cause, we discussed this controversy in the previous class. Could you please send me, the English version of this movie review.
-
Dileep Kumar, EFLU
A :     Thanks for your compliment,  and as well as your idea of presenting the review in your class. But the shortcoming is that it cannot be had in English. I only write in Telugu for the blog, for Telugu audience. Hence I request you to make other arrangements of value, for translation.


Q :  మీరు అప్పుడప్పుడు స్క్రీన్ ప్లే టిప్స్ ఇచ్చేవారు సరదాగా చదువుకోవడానికి. మళ్ళీ ఎప్పుడిస్తారు?
కె. ఏ. రాగిణి, హైదరాబాద్
A :
ఈ ప్రశ్న మరికొందరు కూడా అడుగుతున్నారు. తప్పక వచ్చేవారం ప్రారంభిద్దాం. ఇప్పటికి 140 దాకా టిప్స్ ఇచ్చాం.

Q :  మిడిల్  మాటాష్ స్క్రీన్ ప్లే  అంటుంటారు కదా, అసలు ఒక కథకి మిడిల్  లో వుండాల్సిన బేసిక్ పాయింట్స్ ఏంటి? మిడిల్  లో ఎలాంటి సంఘటనలు జరగాలి? పాత్రలు ఎలా వుండాలి?  రూల్స్ పాటించకపోవడం వల్ల మిడిల్  మాటాష్ స్క్రిప్ట్స్ వస్తున్నాయి?
శ్రవణ్, అసోసియేట్ దర్శకుడు
          మిడిల్లో వుండాల్సిన బేసిక్ పాయింట్స్ ప్లాట్ పాయింట్ వన్ దగ్గరే ప్రాణం పోసుకుంటాయి. కథ అనేది ఎప్పుడైనా ప్లాట్ పాయింట్ వన్ దగ్గరే  పుడుతుంది. అంతకి ముందుది కథ కాదు, ఉపోద్ఘాతం. వొళ్ళు మండిన సగటు ప్రేక్షకుడి భాషలో చెప్పుకోవాలంటే సోది చెప్పడం. ప్లాట్ పాయింట్ వన్ దగ్గర పుట్టిన కథ ప్లాట్ పాయింట్ టూ దాకా వుంటుంది. ప్లాట్ పాయింట్ టూ దగ్గర్నుంచి కథకి ముగింపే వుంటుంది. ఈ ప్లాట్ పాయింట్ వన్ నుంచి ప్లాట్ పాయింట్ టూ వరకూ స్క్రీన్ ప్లేలో 50 శాతం కథ ఆక్రమించి వుంటుంది. అంటే ఈ భాగమంతా మిడిల్ అన్న మాట. ఈ మిడిల్ భాగం తగ్గే కొద్దీ  కథాబలం కూడా తగ్గుతుంది.
          ప్లాట్ పాయింట్ వన్ దగ్గర కథ పుట్టాలనే బేసిక్ పాయింటుతో బాటు, అక్కడ్నించీ మిడిల్లో ఆ కథని నడిపించే మరికొన్ని బేసిక్స్ వుంటాయి. అవి : 1. సమస్య, 2. హీరోకి గోల్, 3. హీరో గోల్ ఎలిమెంట్స్ లో a. కోరిక, b. పణం, c. పరిణామాల హెచ్చరిక, d. ఎమోషన్ (‘శివ’ చూస్తే ఇవి బాగా అర్ధమౌతాయి).
          ఇవీ కథ, ఆ కథతో హీరోతో, ఆ హీరోతో ప్లేతో వుండే బేసిక్స్. కథే హీరో హీరోయే కథ - ఈ బేసిక్ బాగా గుర్తు పెట్టుకోవాలి. ఇందిరాయే ఇండియా - ఇండియాయే ఇందిరా అన్న స్లోగన్ తల్చుకుంటే ఇది బాగా గుర్తుంటుంది. ఇందిర నచ్చకపోతే, వాజ్ పాయే ఇండియా షైనింగ్ – ఇండియా షైనింగే వాజ్ పాయ్ అని ఎగ్జాంపుల్ పెట్టుకున్నా గుర్తుంటుంది. కథే హీరో హీరోయే కథ - కథలో పుట్టే సమస్య క్యాన్సర్. కాబట్టి ఆ క్యాన్సర్ ని తొలగించి కథనీ దాంతో తననీ పునీతం చేసుకోవడమే హీరోకుండే గోల్.
          ఇవన్నీ ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఏర్పడే సమస్యతో కథ పుట్టినప్పుడే వుండే బేసిక్స్. కథలో పుట్టే సమస్య  క్యాన్సర్ అయినప్పుడు, ఆ సమస్య లేదా క్యాన్సర్ అనేది వ్యతిరేక పాత్రకి ప్రతీక, లేదా సింబల్. అంటే ఇది హీరోకి వ్యతిరేక పాత్ర. దీన్ని నిర్మూలించడానికే హీరో సంఘర్షిస్తాడు. దీన్నే మిడిల్ బిజినెస్ అంటారు. ఈ మిడిల్ బిజినెస్ లో - సంఘర్షలోంచి అనేక సంఘటనలు పుడతాయి. వ్యతిరేక పాత్రతో ఈ సంఘర్షణలో హీరో పడుతూ లేస్తూ వుంటాడు. మిడిల్ బిజినెస్ కి ఇదే  బేసిక్ పాయింటు. ఈ మిడిల్ బేసిక్ పాయింటుని డైనమిక్స్ అంటారు. ఈ డైనమిక్సే మిడిల్లో టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ ని ఏర్పరుస్తాయి.
          ఇప్పుడు వెళ్లి వెళ్లి ఈ సంఘర్షణ ప్లాట్ పాయింట్ టూ కి చేరుతుంది. ఇక్కడి వరకే కథ లేదా ఆ సమస్య, లేదా క్యాన్సర్, లేదా వ్యతిరేక పాత్ర  ప్రతాపం చూపించడం వుంటుంది. ఈ ప్రతాపం తీవ్రత ఇక్కడ ఇంకా పెరిగి,  హీరోకి జ్ఞానోదయమై,  ఒక పరిష్కారం దొరుకుతుంది. వ్యతిరేక పాత్రని  ఇక శాశ్వతంగా నిర్మూలించ గలిగే పరిష్కార మార్గం. ప్లాట్ పాయింట్ టూ ధర్మమే పరిష్కార మార్గాన్ని అందించడం.
          ఇప్పుడు చూస్తే మిడిల్ ప్రారంభంలో,  ప్లాట్ పాయింట్ వన్ దగ్గర పుట్టే సమస్యకి, ప్లాట్ పాయింట్ టూ దగ్గర అది సమసిపోయే పరిష్కార మార్గమన్న మాట. అంటే ప్లాట్ పాయింట్ వన్ సమస్య అయితే, ప్లాట్ పాయింట్ టూ పరిష్కారం అవుతాయన్న మాట. ఇవి రెండూ స్క్రీన్ ప్లేకి  ప్లేకి మూల స్థంభాల్లాంటివి. వీటి మధ్య జరిగే సంఘర్షణంతా  మిడిల్ బిజినెస్. ఇక మిడిల్ బిజినెస్ పూర్తి చేసిన ఆ హీరో,  ఆ పరిష్కార మార్గంతో ఎండ్ విభాగాన్ని ప్రారంభించి క్లయిమాక్స్ కెళ్ళిపోతాడు.
          ఇప్పుడు మిడిల్ మటాష్ కొస్తే, మిడిల్ శాతం తగ్గిపోవడం. ఇదెలా తగ్గుతుంది? మిడిల్ కి ముందుండే బిగినింగ్ విభాగం పెరగడం వల్ల. మరి బింగినింగ్   నిడివి ఎంత వుండాలి? మొత్తం స్క్రీన్ ప్లే మొత్తంలో పాతిక శాతమే వుండాలి. మిడిల్ ఎంత వుండాలి? స్క్రీన్ ప్లేలో సగం అంటే యాభై  శాతం వుండాలి. మరి ఎండ్? ఇది మిగిలిన పాతిక శాతం వుంటుంది.
          ఇప్పుడు పాతిక శాతమే వుండాల్సిన  బిగినింగ్ విభాగం యాభై శాతానికి పెరిగితే 
ఏమవు
తుంది? ఆ మేరకు బిగినింగ్ కీ ఎండ్ కీ మధ్య వుండే  మిడిల్ నిడివి సగానికి  సగం తగ్గిపోయి, పాతిక శాతం మిగులుతుంది. అప్పుడు స్క్రీన్ ప్లేలో  మిడిల్ ఉనికి ఎక్కడ వుంటుంది? ఇంటర్వెల్ అవతలికి జరిగిపోయి అక్కడ కన్పిస్తుంది. అప్పుడేమవుతుంది?  ఇంటర్వెల్ అవతలి వరకూ, అంటే  సెకండాఫ్ సగం వరకూ బిగినింగే వ్యాపించి వుంటుంది.  అయినంత మాత్రాన ఏమవుతుందని? ఈ బిగినింగ్ సెకండాఫ్ సగం దగ్గర ముగిసినప్పుడు,  ప్లాట్ పాయింట్ వన్ కూడా ఫస్టాఫ్ నుంచి సెకండాఫ్ సగానికి జరిగిపోయి అక్కడే ఏర్పాటవుతుంది. అంటే కథ అక్కడ పుడుతుందన్న మాట. ఆ పుట్టిన కథ అక్కడ కుంచించుకు పోయివున్న మిడిల్లో పావు శాతమో ఇంకా తక్కువో వుంటుంది. 
          ఇలా సెకండాఫ్ సగం దాకా కథే ప్రారంభం కాకపోవడం, ఆ ప్రారంభించిన  కథ కూడా ఇట్టే ముగిసిపోవడం జరుగుతాయన్న మాట.  కొండంత రాగం తీసి...అన్నట్టుగా వుంటుందన్న మాట సినిమా. ఫస్టాఫ్ అంతా వెస్ట్ చేసి, అక్కడెక్కడో  సెకండాఫ్ లో కథ ప్రారంభమయ్యే దాకా మునిసిపాలిటీ వాళ్ళు డ్రైనేజీ తవ్వుతున్నట్టు బారుగా కంపు కొడుతూ బిగినింగ్ విభాగమే పర్చుకుని వుంటుంది గనుక,  సినిమా భరించలేకుండా తయారవుతుంది.
          బిగినింగ్ విభాగమంటే ఉపోద్ఘాతమని కదా? వొళ్ళు మండిన సగటు ప్రేక్షకుడి భాషలో సోది అని కదా? ఈ సోది నిర్దేశించిన దాని పాతిక శాతం కంటే కూడా ఎంత తక్కువ వున్నా ఫర్వాలేదు, దాటిపోయి ఇలా మిడిల్ ని మటాష్ చేస్తూ దాడి చేస్తే, ఇప్పుడు  సగటు ప్రేక్షకుడికి ఇంకా మండిపోయి  -  ఎదవ సోది - అనేస్తాడు సినిమాని.  ఇలా పచ్చి నిజాలు మాటాడు కోకపోతే అంత సులభంగా మిడిల్ మటాషులు వదిలిపోయేలా లేవు.
          ఈ బేసిక్స్ రాసిరాసి బ్లాగు బాగా  అరిగిపోయింది.  బేసిక్స్ తెలియకుండానే పేజీలకి పేజీలు వీధి నాటకాల్లాగా రాసేస్తూంటారు. ఇలాగని తెలుగు నాటకరంగ అభివృద్దికి పనికొస్తారా  అంటే అదీ లేదు, ఆ బేసిక్స్ అసలే తెలీవు.

సికిందర్