రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

18, ఆగస్టు 2017, శుక్రవారం

499 : డార్క్ మూవీస్ స్క్రీన్ ప్లే సంగతులు - 12


     ఇప్పుడు వచ్చేది ఇంటర్వెల్ సీను. అంటే మిడిల్ లో మొదటి భాగానికి ముగింపు అన్నమాట. ఈ సీనే ఇంటర్వెల్ తర్వాత వచ్చే మిడిల్ టూ కి ప్రారంభం. ఎప్పుడైనా ప్లాట్ పాయింట్ (పీపీ) వన్ కీ ఇంటర్వెల్  సీనుకీ సంబంధం వుంటుంది. ఎందుకంటే,  ఇంటర్వెల్ సీను అనేది ఇటు ఫస్టాఫ్ లో పీపీ వన్ నీ, అటు సెకండాఫ్ లో వచ్చే పీపీ  టూనీ కలిపివుంచే కొక్కెం లాంటిది. త్రాసుని రెండు వైపులా బ్యాలెన్స్ చేసే దండెం లాంటిది. అప్పుడే ఫస్టాఫ్,  సెకండాఫ్ లు చెదిరిపోకుండా వుంటాయి. అంతే  కాదు, ఇంకో రెండు లింకు సీన్లు కూడా వుంటాయి. మొదటి లింకు సీను ఇంటర్వెల్ కి ముందు  వుంటుంది, రెండో లింకు సీను పీపీ టూ కి ముందు  వుంటుంది. మొదటి లింకు సీను ఇంటర్వెల్ కి దారితీయిస్తే, రెండో లింకు సీను పీపీ  టూకి దారి తీయిస్తుంది. వీటిని పించ్ -1, పించ్ - 2  అంటారు. తెలుగులో ఉత్ప్రేరకాలనొచ్చు. పీపీ వన్, టూలు, ఇంటర్వెల్ ఈ మూడు సీన్లూ  కలిసి స్క్రీన్ ప్లేలకి మూల స్తంభాల్లాంటివి. వీటితోనే స్క్రీన్ ప్లే అనే సౌధం నిలబడుతుంది. ఇక పీపీ  వన్ దగ్గర ఏ సమస్య లేదా సంఘర్షణ మొదలయ్యిందో అది ఇంటర్వెల్లో తీవ్రస్థాయికి చేరాలి. తర్వాత ప్లాట్ పాయింట్ టూ దగ్గర అది సమసిపోగల పరిష్కార మార్గం దొరకాలి. ఈ రీత్యా ‘బ్లడ్ సింపుల్’ ఇంటర్వెల్  సీను చూద్దాం...

23.  మార్టీ ని రే అలాగే లాక్కెళ్ళి సజీవ సమాధి చేయడం.
     ఇలా రాశారు : కారు లాంగ్ షాట్-  డోర్ విసురుగా తెర్చుకుంటుంది. కారు నుంచి దూరంగా పరిగెడుతూంటాడు రే. నడుం లెవెల్లో కెమెరా ట్రాక్ చేస్తూంటే, హైవే దిగిపోయి పక్కనున్న  మైదానంలోకి వురుకుతూంటాడు.యాభై అడుగుల దూరంలో వగరుస్తూ ఆగిపోతాడు. లో-  యాంగిల్లో  ఫ్రేం లోకొస్తాడు. కీచురాళ్ళ ధ్వనితో కి అతడి వూపిరి శృతి. వెనక రోడ్డు కేసే అలా నిలబడిపోయి చూస్తూంటాడు.


              రే పాయింటాఫ్ వ్యూ - కారు లాంగ్ షాట్.  నిర్మానుష్యమైన హైవేమీద వదిలేసిన కారు. హైవేమీద ఫోకస్ అవుతూ హెడ్ లైట్లు. కారులో కదలిక లేదు.  
           
రే మీద ఫోకస్  - ఆయాసం తగ్గుతుంది. చెమట్లు. కొన్ని క్షణాల తర్వాత -  అయిష్టంగానే కారువైపు అడుగులేస్తూ రే.
            రే పాయింటాఫ్ వ్యూ - 
కారు కేసి ట్రాకింగ్ షాట్. కారులో కదలిక లేదు.
           
రే మీద ఫోకస్ నెమ్మదిగా  కారు వెనక వైపుకి అడుగులు. బ్యాక్ విండో లోంచి లోపలికి చూపు.
           
 రే పాయింటాఫ్ వ్యూ - ఖాళీగావున్న బ్యాక్ సీటు. ఇటు హైవే వైపు  తెర్చుకున్న డోర్.
           
రే మీదికి ఫోకస్ -  రియాక్షన్ లేదు.  కారు వెనుక నుంచి పక్కకొచ్చి హైవే మీదికి చూపు.
           
రే పాయింటాఫ్ వ్యూ –మోకాళ్ళ మీద ప్రాకుతూ మార్టీ. రక్తపు జాడలు. కారు హెడ్ లైట్స్ తో రోడ్డు మీద  అతడి పొడవాటి నీడ.
            రే మీదికి ఫోకస్  - ఇంకా రియాక్షన్ లేదు.  కారులో కూర్చుని ఎదర అద్దంలోంచి చూస్తూ ఇగ్నిషన్ కీస్ కోసం తడుములాట.
            రే పాయింటాఫ్ వ్యూ  - ప్రాకుతున్న మార్టీ.
              రే మీదికి ఫోకస్ - కారు స్టార్ట్ చేసి టార్గెట్ (మార్టీ) కేసి చూపు. ఆలోచన. నిర్ణయం. ఇగ్నిషన్ నుంచి కీ లాగివేత.  వెనక్కి వెళ్లి డిక్కీ తీసి అందులోంచి షావెల్...
            లో యాంగిల్లో మార్టీ - ఫ్రంట్ నుంచి ఫోకస్.  హెడ్ లైట్స్ నేపధ్యంలో ప్రాకుతూ.  షావెల్ ని ఈడ్చుకుంటూ రే అనుసరణ. మార్టీ ఎదుటకొచ్చి షావెల్ తో కొట్టబోతూ...
            రే క్లోజ్ షాట్ – షావెల్ తో ఆగిపోతూ మార్టీ కేసు చూపు. నిశ్శబ్దం. దూరంగా శబ్దం.
            రే పాదాల క్లోజప్  - రే కాలిని పట్టేసుకుని మార్టీ చెయ్యి.
            రే మీదికి ఫోకస్ –షావెల్ ని సరిగా పట్టుకుంటూ వణుకు. పెద్దదవుతూ ఏదో శబ్దం.
            రే పాదాల మీద ఫోకస్ –మార్టీ పట్టునుంచి కాలు విదిలింపు.
            రే మీద ఫోకస్ – మార్టీ మీది నుంచి చూపులు రోడ్డు పైకి.  మరింత పెద్దదవుతూ శబ్దం.
            రే పాయింటాఫ్ వ్యూ - దూరంగా హెడ్ లైట్స్ కాని హెడ్ లైట్స్ లాంటి వెలుగు.
            రే మీదికి ఫోకస్ –  షావెల్ ని దించుతూ రోడ్డు కేసే చూపు. ఉక్రోషంగా  వెళ్లి షావెల్  డిక్కీలో షావెల్ పడవేత.  మార్టీ వెనకవారగా అడుగులు.
             మార్టీ క్లోజ్ షాట్ – చంకల్లోకి చేతులు పోనిచ్చి మార్టీని కారు దగ్గరికి ఈడ్చివేత. కార్లోకి ఎక్కిస్తూంటే మార్టీకి  దగ్గు. దగ్గుతో రక్తం. హోరుమని ఇంజన్ శబ్దం.
            కారు పైకప్పు వారగా మీడియం షాట్ – కారు డోర్  వేసేసి దానికి అతుక్కుపోయి రే. వెనుక నుంచి భారీ ట్రక్కు దాటవేత.
            ఓపెన్ మైదానం – రే కారు ఫుల్ షాట్.
            కట్ చేస్తే ఆకస్మిక  నిశ్శబ్దం. ప్రొఫైల్ లో రే కారు. మైదానంలో నడి  మధ్య ఆపి వున్న కారు.  ఆఫ్ స్క్రీన్ లో షావెల్ తో తవ్వుతున్న శబ్దం.
            లెటరల్ ట్రాక్ షాట్ - కారు దగ్గర్నుంచి హెడ్ లైట్స్ వెలుగు వారగా లెటరల్ ట్రాక్ షాట్. సమాధి తవ్వడం పూర్తి చేసిన రే,  అందులోంచి పైకి రాక. షావెల్ ని మట్టిలో గుచ్చి, కారు వైపు నడక.
            వెరీ వైడ్ షాట్ -  మిడిల్ బ్యాక్ గ్రౌండ్ లో కారు.  అవతల కారు హెడ్ లైట్స్ . మార్టీ ని సమాధి కేసి ఈడ్చి అందులో పడవేత.
            హై షాట్ లో సమాధి – సమాధిలో వెల్లికిలా మార్టీ.
            క్లోజ్ షాట్ లో రే – చెమటలు కక్కుతూ షావెల్ తో మట్టి లాగుతున్న సవ్వడి.
            హై  షాట్ లో సమాధి – ఫోర్ గ్రౌండ్ లో  రే. మార్టీ మీద మట్టి వేస్తూ. మార్టీలో చిన్న కదలిక.
            లో షాట్ లో రే – ఆగి సమాధిలోకి చూపు. తిరిగి మట్టి  విసరడం మొదలు. ఫ్రేములో కొస్తూ పోతూ కదలిక.
            హై షాట్  లో – మట్టి పడుతూంటే దాని కింద మార్టీ కదలిక. బలహీన శబ్దం. పైకి లేస్తూ కుడి చెయ్యి.
            సమాధిలోంచి లో- షాట్ - సమాధి అంచు మీద రే. హెడ్ లైట్స్ బ్యాక్ డ్రాప్.  నీడపడుతున్న ఫోర్ గ్రౌండ్ లో పైకి లేస్తున్న మార్టీ చెయ్యి. చేతిలో ఎబ్బీ రివాల్వర్.  చూపుడు వేలికి అలాగే బ్యాండేజీ.
            క్లోజ్ షాట్ లో రే – నిటారుగా, నిశ్చలంగా. బిక్క మొహంతో చూపులు. రివాల్వర్ రేంజిలో అలాగే నించుని.
            హై షాట్ లో మార్టీ – రివాల్వర్ మరింత ముందుకు. చూపుడు వేలితో కుదరక,  మధ్య వేలితో ట్రిగ్గర్ బిగింపు.
            లో షాట్ లో రే – అదే చూపు.
            హై  షాట్ లో మార్టీ  - వణుకుతూ రివాల్వర్.  ట్రిగ్గర్  లాగివేత.  ఖాళీ ఛాంబర్ క్లిక్ మన్న శబ్దం.
            లో షాట్ లో రే – బ్లాంక్ గా మార్టీ కేసి చూపులు.
            సైడ్ షాట్ లో – రే సమాధిలోకి వంగుతూ, రివాల్వర్ వున్న మార్టీ చెయ్యి వెనక్కిపోతూ. ఇంకో రెండు సార్లు ట్రిగ్గర్ లాగివేత.  క్లిక్ క్లిక్ మన్న ఖాళీ ఛాంబర్. నెమ్మదిగా రివాల్వర్ బ్యారెల్ ని పట్టుకుని రే చెయ్యి. మార్టీ చేతిలోంచి రివాల్వర్ లాగివేత.

         
క్లోజ్ షాట్ లో షావెల్ అంచు – మట్టిని తవ్వుతూ.
            మీడియం షాట్ లో రే – క్రోధంగా సమాధిలోకి మట్టి విసురుతూ.
            హై షాట్ లో సమాధి – మట్టి కింద మాయమవుతూ మార్టీ.
            మీడియం షాట్ లో రే – వగరుస్తూ మట్టిని తోస్తూ.
            హై షాట్ లో   – సగం మట్టితో నిండిపోయిన సమాధి.

         
మీడియం షాట్ లో రే – సమాధిని కప్పేస్తూ.
            హైషాట్ లో సమాధి – పూర్తిగా కప్పేసి. చదును చేస్తూ రే.
            క్లోజ్ షాట్ లో  షావెల్ అంచు – సమాధి మీద పెట్టి ఎడాపెడా కొడుతూ...
***
   ఇంటర్వెల్  సీను పీపీ వన్ కి వ్యతిరేకంగా వుంటుంది, వుండాలి. కానీ తెలుగు సినిమాల్లో పీపీ వన్నే ఇంటర్వెల్ సీనుగా వుంటున్నప్పుడు,  కథ దాని సొగసు కోల్పోవడమే జరుగుతోంది. అంటే ఒక మూలస్థంభం మిస్ అవుతోంది.  ఇంటర్వెల్ లోపు పీపీ  వన్ ఒక ఘట్టం, ఇంటర్వెల్ ఇంకో ఘట్టం. ఈ రెండు వేర్వేరు ఘట్టాల బదులు ఒకటే చూపించి సరిపెట్టేస్తూంటారు ఇంటర్వెల్లో.   దీంతో  పీపీ  వన్ సీను అదే, ఇంటర్వెల్ సీను కూడా అదే అన్నట్టు వుంటోంది. పీపీ వన్ అనే గుంటూరు దాటిపోయి ఇంటర్వెల్ అనే విజయవాడ చేరాక  ఇదే గుంటూరు అంటున్నారు. బెజవాడ చూపించి విజయవాడ అనొచ్చు.  గుంటూరుని  విజయవాడ ఎలా అంటారు? 

            ఇంటర్వెల్ సీను పీపీ వన్ బైప్రొడక్టు మాత్రమే. దానికి సొంత అస్తిత్వం లేదు. పైగా పీపీ వన్ తర్వాత వచ్చే పించ్- వన్ సీను వల్లే ఇంటర్వెల్ ఏర్పడుతుంది-మంగళగిరి టచ్ చేయకుండా విజయవాడ చేరలేమన్నట్టు. ఇన్ కం టాక్స్ ఎగ్గొట్టినట్టు పీపీలు, పించులు ఎగేసి ఇంటర్వెల్ మీద వెళ్లి పడిపోతే ఎలా? 

            ఇంటర్వెల్ సీను పీపీ వన్ సీనుకి వ్యతిరేక ప్రతిబింబం. పీపీ వన్ సీనులో ఎబ్బీ,  రేలని చంపే ఒప్పందం మార్టీ విస్సర్ తో చేసుకున్న సంగతి చూశాం. ఇంటర్వెల్ సీన్లో తనే కొనవూపిరితో సజీవ సమాధి అయ్యాడు మార్టీ. ఇలా ఇంటర్వెల్ అనే నిలువుటద్దంలో పీపీ వన్ రూపం చెడి కన్పిస్తోంది. ఇలా ఎన్ని సినిమాల్లో వుంటుంది? దీని టెక్నిక్ ఏమిటి? పించ్ వన్ సీను ఏర్పాటులోనే టెక్నిక్ వుంటుంది.  పించ్ వన్ సీ ను ఏది? మార్టీ బతికే వున్నాడని రే కారు దూకి  పారిపోయే 22 వ సీను. 

            చాలా డిస్టర్బింగ్ సీను. ఎబ్బీ కోసం రే ఏమైనా చేసే నిర్ణయాత్మక ఘట్టం. ఎలాగంటే, ముందు ఎబ్బీయే చంపిందనుకుని, అది శవమనుకుని, దాన్ని పాతి పెట్టబోయాడు. తీరా శవం కాదని తెలిశాక ఆగలేదు. మార్టీ బతికి వుంటే ఎబ్బీకి ఇంకా ప్రమాదమనుకున్నాడు. అందుకే తనే సజీవ సమాధిచేసేసి  హంతకుడయ్యాడు ఆమె బదులు. ఆమె షూట్ చేస్తే మార్టీ పూర్తిగా చావకపోతే హంతకురాలవదు. పూర్తిగా చంపిన రే హంతకుడవుతాడు. ఆమె మీద హత్యాయత్నం నేరం మాత్రమే వుంటుంది ఒకవేళ బయటపడితే. ఇది రే అభిప్రాయంలో. రే కి తెలిసి విస్సర్ లేడు. 

            మనకి తెలిసి విస్సర్ వున్నాడు. మన అభిప్రాయంలో ఇప్పుడు విస్సర్ హత్యాభియోగం నుంచి తప్పించుకోగలడు. రే ఇరుక్కుంటాడు హంతకుడై! ఇదీ పించ్ వన్ సీను. ఎంత ఉల్టాపల్టా!  హంతకుడు విస్సర్ అని మనం అనుకుంటున్నప్పుడు, రే హంతకుడుగా మారాడు. ఇలా పించ్ వన్ సీను మార్టీని సజీవ సమాధి చేసే అతి భయానక ఇంటర్వెల్ సీనుకి దారితీసింది. 

            ఇలాకాకుండా, ఆఁ... మార్టీ చచ్చాడా. ఐతే నేరం ఎబ్బీ మీద పడకుండా మాంచి  లవ్ ఎమోషన్ తో రే తీసికెళ్ళి పాతేస్తాడు డెడ్ బాడీని. ఇంకేంటి? దటీజ్ అవర్ బ్లాస్టింగ్ ఇంటర్వెల్ బ్యాంగ్- అని సంబరపడితే జాలి పడాల్సిందే. శవాన్ని పాతిపెట్టబోవడం ప్రేక్షకులు వూహించేదే. ప్రేక్షకులు వూహించే ఇంటర్వెల్ అదొక ఇంటర్వల్ అవుతుందా? శవాన్ని పాతిపెట్టడంలో లవ్ ఎమోషన్ బలంగా వుంటుందా? శవం కొనవూరితో వున్నా మనిషిగా ట్విస్ట్ ఇచ్చి, ఆ కొనవూపిరితో వున్న మనిషిని పాతిపెట్టి ఆమె బదులు తను హంతకుడవడం గాఠ్ఠి ఎమోషన్ అవుతుందా?  చిక్కు ముడిగా తయారవుతున్న నేరకథ ఆలంబనంగా ప్రేమకథ కూడా బలీయం అవుతూపోయే కథాపథకమే  బ్లడ్ సింపుల్ ది.
***
     కామెడీ అయితే కామెడీగా, ప్రేమ అయితే రోమాంటిక్ గా, ఫ్యామిలీ అయితే అనుబంధాల పరంగా, యాక్షన్ అయితే యాక్షన్ పరంగా,  ఏదైతే దాని  జానర్ మర్యాదతో కూడిన కథనం టైం అండ్ టెన్షన్ (టీటీ) గ్రాఫ్ ని ఏర్పరుస్తుంది. కథ మొదలయ్యే- లేదా సమస్య ఏర్పడే- లేదా గోల్ ఏర్పాటయ్యే పీపీ వన్ దగ్గర్నుంచీ,  ఈ టీటీ గ్రాఫ్ అంతకంతకూ పైకి లేస్తూ పోతుంది. లేవలేదంటే చేవలేనట్టే కథనంలో. 

            ఈ మిడిల్ వన్ లో,  పీపీ వన్ నుంచీ ఇంటర్వెల్ వరకూ టీటీ గ్రాఫ్ ఎలా వుందో ఒకసారి చూద్దాం :  పీపీ వన్ గా వున్న 13వ సీనులో ఎబ్బీ, రే లని చంపే ఒప్పందం మార్టీ, విస్సర్ ల మధ్య కుదిరిన నేపధ్యంలో-

          14.  ఎబ్బీ తనకోసం వేరే ఫ్లాట్ చూసుకుంది. సీను ఎలా వుందంటే, తామిద్దర్నీ విస్సర్ చంపబోతాడని తెలీక ఆమె జీవితాన్ని తనకి నచ్చిన  విధంగా ప్లాన్ చేసుకుంటున్న కాంట్రాస్ట్ తో వుంది.  ఇది టెన్షన్ ని పుట్టిస్తోందా లేదా?
         
15.  ఎబ్బీ బార్ కెళ్ళి మార్టీకీ రేకీ మధ్య మళ్ళీ గొడవ జరక్కుండా చూసుకోమని చెప్పింది. ఇది కూడా కాంట్రాస్టే. ఒకపక్క తామిద్దరూ చావబోతూంటే,  తను శాంతి ప్రయత్నాలు చేస్తున్న ఐరనీతో కూడిన టెన్షన్.
         
16.  రే బెడ్రూంలో ఎబ్బీ అలికిడి విని మార్టీ వచ్చినట్టున్నాడని రే కి అనుమానం వ్యక్తం చేసింది. వచ్చింది మార్టీ అనుకుంటున్నారు, మనకి విస్సర్ అని తెలుసు. ఇది  కూడా ఐరనీ తో కూడిన  టెన్షన్.
         
17.  విస్సర్ రహస్యంగా రే ఫ్లాట్ కొచ్చి ఎబ్బీ రివాల్వర్ కొట్టేశాడు. వాళ్ళిద్దర్నీ చంపేశాడు- ఇదెంత టెన్షన్!
         
18.  విస్సర్ మార్టీకి ఫోన్ చేసి వాళ్ళిద్దర్నీ చంపేశాననడం మరింత టెన్షన్.
          19.  విస్సర్ మార్టీ దగ్గరికెళ్ళి మర్డర్ ఫోటో చూపించి డబ్బు తీసుకుని, మార్టీని షూట్ చేయడం ఇంకింత టెన్షన్. అతను లైటర్ మర్చిపోవడం మరీ టెన్షన్.
          20.  రే బార్ కొచ్చి మార్టీ శవాన్నీ, రివాల్వర్నీ చూసి హత్య ఎబ్బీ చేసిందను
కున్నాడు. ఇప్పుడు శవాన్ని ఏం చేస్తాడనే టెన్షన్.

         
21. కారులో శవంతో రే బార్ లోంచి బయట పడడం థ్రిల్ల్ తోడైన  టెన్షన్.
          22. మార్టీ ఇంకా బతికే వున్నాడని కారుదూకి పారిపోయాడు రే. మార్టీ బతికే వుండడం వూహించని టెన్షన్.
          23. మార్టీ ని సజీవంగా  సజీవ సమాధి చేయడం ఇంటర్వెల్ కి తారాస్థాయికి చేరిన టెన్షన్.


        ఇంకోసారి ఇలా చూద్దాం : 13 వ సీన్లో పీపీ వన్ దగ్గర చంపాలన్న నిర్ణయం తర్వాత రెండు సీన్లలో టెన్షన్ కోసం  చావబోయే పాత్రల్లో ఒకటైన ఎబ్బీతో ఐరనీని వాడుకుని మొదటి రెండు మెట్లు ఎక్కించారు. 

          ఐరనీ అనే ఎమోషన్ తర్వాత 16 వ సీన్లో – చంపే కార్యక్రమం మొదలెడుతూ విస్సర్ ని ఎంటర్ చేస్తూ,  హార్రర్ అనే ఎమోషన్ తో  మూడో మెట్టు ఎక్కించారు. 

          17 వ సీన్లో – వాళ్ళిద్దర్నీ విస్సర్ చంపుతున్నట్టు చూపిస్తూ హార్రర్ ఎమోషన్ తో నాల్గో  మెట్టు ఎక్కించారు.
          18 వ సీన్లో - చంపేశానని విస్సర్ మార్టీకి ఫోన్ చేయడం ద్వారా – ఇప్పుడేమిటి? అన్న ప్రశ్నరేకెత్తించే హార్రర్ ఎమోషన్ తో ఐదో మెట్టు ఎక్కించారు.
          19 వ సీన్లో – విస్సర్ అనూహ్యంగా మార్టీని చంపడంద్వారా షాకింగ్ గా విస్సర్ అసలు రంగు జోడిస్తూ హర్రర్ ఎమోషన్ తో ఆరో  మెట్టు ఎక్కించారు.
          20వ సీన్లో- రే మార్టీ శవాన్ని మాయం చేయాలనుకోవడం ద్వారా హార్రర్ ఎమోషన్ కి లవ్ ఎమోషన్ జోడించి ఏడో మెట్టు ఎక్కించారు.
          21 వ సీన్లో- మార్టీ శవాన్ని రే కారులో వేసుకెళ్లడాన్నిచూపడం ద్వారా థ్రిల్ తో  కూడిన హార్రర్ ఎమోషన్ తో  ఎనిమిదవ  మెట్టు ఎక్కించారు.
          22 వ సీన్లో – మార్టీ బతికే వున్నాడని చూపడం ద్వారా  హార్రర్ ఎమోషన్ కి అనేక ప్రశ్నలు జోడిస్తూ తొమ్మిదవ మెట్టు ఎక్కించారు.
          23 వ సీన్లో- మార్టీని సజీవ ససమాధి  చేస్తూ, విస్సర్ బదులు రే హంతకుడవుతూ, మరింత బలీయమైన లవ్ ఎమోషన్ ని హార్రర్ ఎమోషన్ కి కలిపి,  ఇంటర్వెల్ అనే పదవ మెట్టు ఎక్కించారు. 

          అంటే టెన్షన్ అనేది ఒక టూల్ అయితే, ఈ టూల్ ని వాడుకోవడానికి హార్రర్ అనే ఎమోషన్ ని రెచ్చగొడుతూ పోయారు. ఐతే కేవలం ఈ హార్రర్ ఎమోషన్ తో  టెన్షన్ ని ఇంటర్వెల్ కి చేరేస్తే అది డొల్లగా వుండొచ్చు. అందుకని కథలోనే, పాత్రలోనే  వున్న లవ్ ఎమోషన్ ని కూడా సమాంతరంగా ఇంటర్వెల్ కి  పతాకస్థాయికి చేర్చి సజీవం చేశారు విశ్రాంతి దృశ్యాన్ని. ఎబ్బీతో ఐరనీ  తో ప్రారంభమైన  ఈ మిడిల్ వన్ విభాగం,  రే తో బలీయమైన లవ్ ఎమోషన్ తో ముగిసింది. ఎబ్బీ ఇంకా జీవితం హాయిగానే వుందనే భ్రమల్లో వుంటే, ఇక జీవితం లేదన్న వాస్తవంలో రే వున్నాడు. పాత్రలతో ఈ కాంట్రాస్ట్ – ఈ ద్వంద్వాలు కూడా ఇంటర్వెల్ దృశ్యాన్ని నగిషీ చెక్కాయి.
***
       స్క్రిప్టులో రాయలేదు గానీ, ఈ ఇంటర్వెల్ సీను ఓపనింగ్ లో,  మార్టీ బతికే వుండడంతో రే కారు దూకి  పారిపోయే ముందు, రోడ్డు పక్క  ఎరుపురంగు డామినేటింగ్ గా మూడు హోర్డింగ్స్ వుంటాయి.. ఇది ఈ సీనులో కల్పించిన నిగూఢార్ధం. మూడు ఎరుపులు అంటే మూడు రాబోయే ప్రమాదాలు. ఇలాటి  ఒక హోర్డింగ్ పక్క నుంచే  వురుకుతాడు. ఆ మూడు ప్రమాదాలు – వాస్తవాలు తెలుసుకోకుండా ఇప్పుడు తను పాల్పడే చర్యలద్వారా- 1. సమాధిలోంచి మార్టీ రివాల్వర్ని గురి పెట్టడం, 2. మార్టీని సజీవ సమాధి చేస్తూ తను హంతకుడవడం, 3. విస్సర్ తప్పించుకోవడం. ఈ మూడు ప్రమాదాల్ని కొని తెచ్చుకుంటున్నానని అతను తెలుసుకోవడం లేదు. మొదటి ప్రమాదాన్ని అదృష్టం కొద్దీ తప్పించుకున్నాడు : ఎబ్బీ రివాల్వర్ని శవం జేబులోపెట్టి పాతి పెట్టేద్దామనుకుంటే, శవం లేచి అదే రివాల్వర్ గురి పెట్టింది. 16వ సీన్లో విస్సర్ ఆ రివాల్వర్ని తస్కరించి చూసినప్పుడు,  అందులో మూడు గుళ్ళున్నాయి. ఒక గుండుతో మార్టీని చంపి వెళ్ళిపోయాడు. ఇంకో గుండు రే కాలికి తగిలి పేలింది. అంటే మిగిలిన మూడో గుండు రివాల్వర్ లోనే వుండాలి. సమాధి లోంచి మార్టీ పేల్చాలని మూడు సార్లు ట్రిగ్గర్ లాగినా పేలలేదు. సిలిండర్ లో అది ఇంకో ఛాంబర్ లో  వుండుండాలి. షోలే  గబ్బర్ సింగ్ – అబ్  తేరా క్యాహోగా కాలియా-  లాంటి సిట్యుయేషన్ అన్నమాట. అలా బతికిపోయాడు రే!
***
       విస్సర్ మార్టీని చంపే  19 సీనులో, మార్టీ సేఫ్ ముందు కూర్చుని డబ్బు తీస్తున్నప్పుడు ఒక నిగూఢార్ధాన్ని గుర్తించాం. హై యాంగిల్లో మార్టీ వెనకాల టాప్ లో, రెడ్ కలర్ లైటు కాంతి పర్చుకుని వుండడం, దాంట్లో నల్లటి గడుల్లాగా నీడలు వుండడం, అలా ఆ రెడ్ కలర్ అతడి చావు రక్తపాతంతో వుంటుందని సూచించడం, నల్లటి గడులు అతడి పరలోక ప్రయాణం అంత సాఫీగా వుండదనీ, కష్టాలతో కూడుకుని వుంటుందనీ చెప్పడం.
 
        ఇదంతా ఇంటర్వెల్ సీన్లో రూపం ధరిస్తుంది. విస్సర్ చేతిలో మార్టీ పూర్తిగా చచ్చిపోతే బావుండేది. కానీ బతికి రోడ్డు మీద ప్రాకడం, షావెల్ ఎత్తి రే చంపాలనుకోవడం, అలా కాదని కారుతో ఢీకొట్టి చంపాలనుకోవడం, అలా కూడా కాదని గొయ్యి తీసి అందులో పడెయ్యడం...చావడానికి అతడికిన్ని చావులు. సేఫ్ దగ్గర చూపించిణ  ఎరుపు నలుపు గడులు ఈ జీవన్మరణ పోరాటానికి సింబాలిజం అయితే, ఇప్పడు సమాధి దగ్గర వ్యవసాయ భూమి కూడా అదే గడులు తీసి వున్న దృశ్యంగా  ఎదురవుతుంది (ఫోటో చూడండి). ఈ మొత్తం ఇంటర్వెల్ సీను లో ఒక్క డైలాగు కూడా వుండదు- చిట్ట చివర సమాధిలోంచి మార్టీ అరుపులు తప్ప.  డైలాగులు వుంటే సీను చెడిపోయేది. 

          టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ లో టెన్షన్ క్రమం పైనంతా చూసుకుంటూ వచ్చాం. టైం స్పాన్ చూస్తే,  ఈ మిడిల్ వన్ విభాగం 30 నిమిషాలతో వుంది. పది సీన్లున్నాయి. ఈ పది సీన్లతో   30 నిమిషాల్లో టెన్షన్ గ్రాఫ్ పది మెట్లు ఎక్కింది. సగటున మూడు నిమిషాలకో మెట్టు. అంటే ఎంత పకడ్బందీగా కథనం వుందో అర్ధమవుతోంది.
***
    టెక్నికల్ గా షాట్స్ తో ఈ దృశ్యం లయాత్మకంగా వుండడాన్ని కూడా గమనించ వచ్చు. మొత్తం ఈ ఇంటర్వెల్ సీను 48 షాట్స్ తో వుంటే, ఇందులో ఓపెనింగ్ లో మూడు ఎస్టాబ్లిష్ మెంట్ షాట్స్ తీసేస్తే, ఆతర్వాత ఒక లయగా వరసగా రే పాయింటాఫ్  వ్యూ షాట్స్, రే మీదికి ఫోకస్ షాట్స్ పది వరకూ మార్చి మార్చి పడతాయి.

          మార్టీ ని ఎంటర్ చేస్తూ ఎస్టాబ్లిష్ మెంట్ షాట్స్ వేశాక, ఒక వరసలో రే క్లోజప్ షాట్స్,  పాదాల మీద ఫోకస్ షాట్స్ మార్చి మార్చి పడతాయి. 

          మళ్ళీ సమాధి దగ్గర ఎస్టాబ్లిష్ మెంట్ షాట్స్ తీసేస్తే, హైషాట్స్ – లో షాట్స్- క్లోజప్స్ మార్చి మార్చి పడతాయి. 

          ఈ లయాత్మక షాట్స్ కంపోజిషన్ ని సన్నివేశం లోని ఆయా ఉద్విగ్న క్షణాలు డిమాండ్ చేశాయి. ఒకటి గుర్తుంచుకుంటే, ఇలా ట్రాడిషనల్ షాట్స్ తీసిన సినిమాలే కలకాలం నిలబడతాయి. జూములు, రివాల్వింగులు, ఏరియళ్ళు వేసి, ఎడిటింగులో  స్వైపులు, స్ప్లిట్లు, రాంపులు వేసి చూపిస్తే టెక్నాలజీ అదిరిందని అన్పించ వచ్చు- అందులో జీవం వుండదు. డ్రామా పండదు. ఎక్కువకాలం నిలబడదు.                     
***
       మిడిల్ వన్ బిజినెస్ ఏమిటి?  ఏర్పాటైన గోల్ కోసం ప్రధాన పాత్ర పోరాటం  చేయడం, పోరాటంలో వ్యతిరేక శక్తులతో తలపడడం, యాక్షన్ రియాక్షన్ చర్యలకి తెర తీయడం, అంతకంతకూ వెళ్లి మిడిల్ వన్ ఎండ్ లో,  అంటే ఇంటర్వెల్లో అగాథంలో పడ్డం. 

          ప్రధాన పాత్ర విస్సర్ ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఏర్పాటైన  గోల్ కే ట్విస్ట్ ఇచ్చి గొప్ప గేమ్ ప్రారంభించాడు. మార్టీని చంపి ఎబ్బీ మీదికి తోసేసి వెళ్ళిపోయాడు. ఇది అప్పర్ హేండ్. వెళ్తూ లైటర్ ని మర్చిపోయాడు. ఇది లోయర్ హేండ్. రే శవాన్ని మాయం చేయాలనుకున్నాడు. ఇది విస్సర్ అప్పర్ హేండ్. శవం లేచి కూర్చుంది.  ఇది విస్సర్ లోయర్ హేండ్. లేచిన వాణ్ణి రే సమాధి చేశాడు. ఇది మళ్ళీ విస్సర్ అప్పర్ హేండ్ ముగింపులో.  కానీ  అతను హత్యా స్థలంలో మర్చిపోయిన లైటర్ కి సంజాయిషీ చెప్పుకోవాల్సి వుంటుంది. ఇది ముగిపు కొచ్చేసరికి అతడి బ్యాడ్ కండిషన్. ఇలా అతడి క్యారక్టర్ ఆర్క్ అప్ అండ్ డౌన్స్ తో బాగా ఎస్టాబ్లిష్ అయింది. 

          ఇలాటి పకడ్బందీ కథనంతోనే మన ఇన్వాల్వ్ మెంటు పెరిగి -  అబ్బా,  ఇలా కాకుండా ఇలా జరిగుంటే బావుండదన్న భావోద్వేగాలకి లోనవుతాం. అప్పుడు సదరు బాధిత పాత్ర పక్షం వహిస్తాం. మార్టీ బతికున్నాడని తెలిశాక,  రే గనుక ఒక్క క్షణం భిన్నంగా ఆలోచించి వుంటే,  అతను హంతకుడయ్యే పరిస్థితి ఏర్పడేది కాదు. ఎబ్బీయే  షూట్ చేసి వుంటే ఆమె తన రివాల్వర్ని  అక్కడే పడేసి ఎందుకుపోతుంది?  ఈ ప్రశ్న వేసుకుని వుంటే, ఎవరు షూట్ చేశారో మార్టీ నోటి నుంచే చెప్పించి వుండేవాడు. అప్పుడు మార్టీని హాస్పిటల్లో పడేసి, విస్సర్ ని పోలీసులకి పట్టించే వాడు. ఒక్క క్షణం – ఒక్క క్షణం అతనిలా ఆలోచించలేదు...
          దీంతో మిడిల్ వన్ విభాగం ముగిసింది.

(సశేషం)
-సికిందర్ 

ఒరిజినల్ సీన్ కాపీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి 
         
         
         











17, ఆగస్టు 2017, గురువారం

498 : డార్క్ మూవీస్ స్క్రీన్ ప్లే సంగతులు -11




‘బ్లడ్ సింపుల్’  1984లో తీశారు. ‘టర్మినేటర్’ కూడా 1984 లోనే తీశారు. ‘టర్మినేటర్’ కీ ‘బ్లడ్ సింపుల్’ కీ తేడా ఏమిటంటే, పేసింగ్. అప్పటికి ప్రేక్షకుల అటెన్షన్ స్పాన్ లో పెను మార్పు వచ్చింది.  అటెన్షన్ స్పాన్ (ఏఎస్) అంటే, ఒక దృశ్యంపై ప్రేక్షకులు దృష్టి నిలపగలిగే ఏకాగ్రతావధి. 1980 ల నాటికే ప్రేక్షకుల ఏఎస్ పది సెకన్లకి పడిపోయిందని తేల్చాడు సిడ్  ఫీల్డ్. అంటే నిదానంగా, బారుగా నడిచే సన్నివేశాల్ని తీరిగ్గా కూర్చుని చూసే ఓపిక ఇక ప్రేక్షకులకి లేదన్న మాట. ఈ మార్పు  టీవీ ఛానెల్స్ పైన కూడా ప్రభావం చూపిందని  అన్నాడు. ఒకే ప్రోగ్రాంని ఓపికగా చూడలేక, చేతిలో వున్న రిమోట్ తో ఛానెల్స్ మార్చేసుకుంటూ అక్కడక్కడ  అదో కాసేపు, ఇదో కాసేపూ చూసుకుంటూ పోతున్నారని చెప్పాడు. బిజీ లైఫ్ ఇందుకు కారణమని మనం భావించవచ్చు. ఒకప్పుడు హైదరాబాద్ లేజీగా వుండేది. పదకొండు గంటలకి ఆవులిస్తూ నిద్రలేచేవారు. తీరుబడిగా, మొక్కుబడిగా  ఈ పనులేంటిరా భగవంతుడా అన్నట్టు ఏడుస్తూ పనులు చేసుకునేవారు. యధారాజా తథాప్రజ- నవాబుల బుద్ధులు జనాలకీ నచ్చాయి, వచ్చాయి. 1983లో బ్రహ్మ ముహూర్తం లో నిద్రలేచే ఎన్టీఆర్ వల్ల, సడెన్ గా హైదరాబాద్ బద్ధకం వదిలించుకుని బిజీగా మారడం మొదలెట్టింది. కాబట్టి ఈ బిజీతో పోటీపడుతూ సినిమాల్లో పేసింగ్ కూడా స్పీడందుకుంది. పేసింగ్ అంటే సీన్ల నడక. ‘టర్మినేటర్’  ఈ పేసింగ్ నీ, ఏఎస్ నీ సీజీతో  సాధించిందని  సిడ్ ఫీల్డ్ వివరించాడు. ‘టర్మినేటర్’  సీజీ తో సినిమాల కథ చెప్పే విధానమే మారిపోయిందనీ, ప్రేక్షకుల ఏకాగ్రతావధిని దృష్టిలో పెట్టుకుని సీన్ల నిడివి తగ్గి, అవి  వేగవంతంగా సాగిపోయే పద్ధతి వచ్చిందనీ చెప్పాడు. 


          బ్లడ్ సింపుల్’  దీనికి విరుద్ధం. ఇదింకా తీరుబడి సీన్ల సాంప్రదాయాన్నే పాటించింది. అదే ‘ఫార్గో’, ‘నో కంట్రీ ఫర్ ఓల్డ్ మెన్’ ల నాటి కొచ్చేసరికి కాలాన్ని బట్టి పేసింగ్ ని  పెంచి ప్రేక్షకుల ఏఎస్ కి న్యాయం చేశారు  కోయెన్ బ్రదర్స్. ఇప్పుడు మనం ‘బ్లడ్ సింపుల్’ ని డార్క్ మూవీస్ కి దృష్టాంతంగా పెట్టుకుని చర్చిస్తున్నాం. కొందరికి సందేహాలున్నాయి – అంత  స్లో మూవీ కాబట్టి డార్క్ మూవీ ఎలిమెంట్స్ ని,  వివిధ నిగూఢార్ధాలనీ  ప్లే చేయడం దాంతో సాధ్యమైంది; కానీ నేటి స్పీడ్ పేసింగ్ ల  కాలంలో ‘బ్లడ్ సింపుల్’ శైలిలో  స్లో మూవీ తీయలేం కదాని.

          నిజమే. కానీ పాత సినిమాల్ని చూడాల్సింది పేసింగ్ నే దృష్టిలో పెట్టుకుని కాదు. పేసింగ్ కాలం చెల్లినా  కళాత్మక విలువలు మాసిపోవు.  ఎన్టీఆర్ ‘పాండురంగ మహాత్మ్యం’ని అలాగే ఇప్పడు తీయలేం. కానీ అందులో హాలీవుడ్ స్క్రీన్ ప్లే సంగతులెన్నో వున్నాయి. ఎన్టీఆర్ పాత్ర మారక ముందు అతిగొప్ప డార్క్ మూవీ పాత్ర.  మరి పేసింగ్, ఏఎస్ లని దృష్టిలో పెట్టుకునే నిగూఢార్ధాలతో 1985 లో ‘బ్యాక్ టు ది ఫ్యూచర్’  అనే ఫాస్ట్ పేసింగ్ గల ఫాంటసీ కూడా తీశారు. కాబట్టి ఇవాళ్టికి మారేది పేసింగే.  మిగతా ఎలిమెంట్స్- నిగూఢార్ధాలు వగైరాలు నేర్చుకోవడానికి ‘బ్లడ్ సింపుల్’ కి కాలంతో సంబంధంలేదు.

          పేసింగ్ గురించి మాట్లాడేప్పుడు తెలుగు సినిమాల్లో వుంటున్న స్పీడుగా సీన్లు కదిలే  పేసింగ్ దేనికి పనికొస్తోంది? గంటన్నరకి ఇంటర్వెల్ వరకూ కథలోకే వెళ్ళదు బిగినింగ్ ఉపోద్ఘాతం.  బిగినింగ్ తో అంతసేపు కాలక్షేపం చేయడం పేసింగ్ అన్పించుకుంటుందా? తెలుగు సినిమాలు ఆడే  థియేటర్లలో ప్రేక్షకుల మొహాలు వెలిగిపోతూంటాయి. అదేమిటంటే స్మార్ట్ ఫోన్ల లైటింగ్. తెరమీద ఓపికని పరీక్షించే ఫస్టాఫ్ ని కట్ చేసి సెకండాఫ్ చూసుకునే రిమోట్ లేదు కాబట్టి, స్మార్ట్ ఫోన్లు చూసుకుంటూ అందులో ఏవేవో మార్చుకుని చూసుకుంటూ కాలక్షేపం చేస్తున్నారు. నిర్మాతలకి దర్శకులకీ ఇదేం పట్టదు. ఫస్టాఫ్ బ్రహ్మాండంగా తీసి మెప్పించామనుకుంటారు. తీయడమే తప్ప థియేటర్లలో ఎవరి పరిస్థితేమిటో తొంగి చూడ్డం వుండదు.
          ఇక ‘బ్లడ్ సింపుల్’ మిడిల్ వన్ లో 20వ సీను దగ్గర్నుంచి చూద్దాం...

***
20. రే బార్ కొచ్చి మార్టీ శవాన్నీరివాల్వర్నీ చూసి  హత్య ఎబ్బీ చేసిందనుకోవడం.
    గత సీన్లో విస్సర్ మార్టీ ని చంపి, ప్లాట్ పాయింట్ వన్ కి ఒక ఝలక్ ఇచ్చి వెళ్ళిపోవడం చూశాం. ఇప్పుడు ఈ 20వ సీను ఇలా రాశారు కోయెన్ బ్రదర్స్ :  అదే రాత్రి బార్ లోంచి బయటి  దృశ్యం ఇలా వుంటుంది- పూర్తిగా నిశ్శబ్దం. ఆవరణ ఖాళీగా వుంటుంది. విండోస్ మీద వీధి లైట్ల బ్లూ కాంతి పడుతూంటుంది. అంతలో విండో గ్లాస్ మీద హెడ్ లైట్లు పడతాయి. ఆ వెలుగు ప్రకాశవంతమవుతుంది. కారు ఆగిన శబ్దమవుతుంది. కారు డోర్ తీసినట్టు, వేసినట్టూ శబ్దమవుతుంది. నడిచివస్తున్న బూట్ల శబ్దం. ఒక ఆకారం హెడ్ లైట్స్ ని క్రాస్ చేస్తూంటే, పెద్ద నీడ విండో గ్లాస్ మీద పడుతుంది. అతను ఆ విండో గ్లాస్ తో వున్న డోర్ ని తెరవబోతాడు. అది లాక్ చేసి వుంటుంది. బలవంతంగా లాక్ తీస్తాడు. డోర్ ఓపెనవుతుంది. డోర్ ఫ్రేములో అతడి సిల్హౌట్ కన్పిస్తుంది. 


     

          కెమెరా అతణ్ణి ట్రాక్ చేస్తుంది. బార్ టేబుల్ పైనుంచి అవతలికి వెళ్తాడు.  క్యాష్ రిజిస్టర్ దగ్గర లైటు వేస్తాడు. ఆ వెలుగులో అతను రే అని రివీల్ అవుతుంది. బాక్సు ఓపెన్ చేసి చూస్తాడు. అందులో డబ్బుండదు. తిట్టుకుంటాడు. చుట్టూ చూస్తాడు. మార్టీ ఆఫీసు తలుపు కింద సందులోంచి లైటు వెలుతురు ప్రసరిస్తూంటుంది. తలుపు దగ్గరి కెళ్ళి కొట్టి మార్టీని పిలుస్తాడు. సమాధానం వుండదు. డోర్ నెట్టుకుని లోపలి కెళ్ళిపోతాడు. 

          రే సజెషన్ లో టేబుల్ ముందు అటు తిరిగి కూర్చున్న మార్టీ వుంటాడు. ఒక కాలు టేబుల్ మీద జాపి వుంటుంది. మార్టీనే  చూస్తాడు - పలకవే? చెవుడా? – అంటాడు. అప్పుడు ముందుకు అడుగులేస్తూంటే, కాలికేదో తగిలి ఒక్కసారి పెద్దగా పేలుతుంది. తూలి పడబోతాడు. నేల మీద విసురుగా ఏదో మెటల్ వస్తువు అవతలికి దూసుకెళ్తుంది. 

          తేరుకుని మార్టీ వైపు చూస్తాడు. కదలకుండా అలాగే వుంటాడు మార్టీ. నెమ్మదిగా గోడ పక్కకెళ్ళి స్విచ్ బాక్స్ ఓపెన్ చేసి లైటేస్తాడు రే.  గదిలో వెలుగు పర్చుకుంటుంది.  మార్టీని అలా ఓ చూపు చూస్తూంటే, చెయిర్ కింద మడుగుకట్టిన రక్తం మీదకి  దృష్టి మళ్ళుతుంది. మార్టీ కుడి చెయ్యి జార విడిచి  అలాగే కూర్చుని వుంటాడు. రే ముందుకు కదుల్తాడు. సేఫ్ దగ్గర కింద కూర్చుని, దాని కిందికి తొంగి చూస్తాడు. తెల్లగా మెరుస్తూ గొట్టం లాగా కన్పిస్తుంది. అతి కష్టంగా  దాన్ని బయటికి తీస్తాడు. అది రివాల్వర్.  ఇందాక కాలికి తగిలి పేలిన ఎబ్బీ రివాల్వర్. 

          కొద్ది క్షణాలు విస్మయంగా దాన్నే చూస్తాడు. నెమ్మదిగా లేచి నిలబడతాడు.
వైడ్ షాట్ తీసుకుంటే, టేబుల్ దగ్గర మార్టీ  దృశ్యం. రివాల్వర్ మీంచి మార్టీ మీదికి చూపులు మళ్ళిస్తాడు. నెమ్మదిగా రివాల్వర్ని టేబుల్ మీద పెడతాడు. మార్టీ వెనక్కి వెళ్లి మార్టీని లేపడం మొదలెడతాడు.

          అవతల బార్ లో ఏదో శబ్దమవుతుంది, ఎవరో వచ్చినట్టు. చటుక్కున అటు తిరిగి చూస్తాడు. గబగబా వెళ్లి ఓరగా వేసివున్న డోర్ మూసేసి లాక్ చేసేస్తాడు. లైట్ స్విచ్ ఆఫ్ చేసేస్తాడు. కాచుంటాడు. మార్టీ, ఇంటికెళ్ళి పోయావా - అని బార్ టెండర్ మారిస్ గొంతు విన్పిస్తుంది. అడుగులు  సమీపిస్తాయి. సైలెంట్ గా  వుంటాడు. అడుగులు దూరమవుతాయి. తేరుకుని, ఓవర్ కోటు తీసి కుర్చీ కింద రక్తాన్ని తుడవడం ప్రారంభిస్తాడు. 

          బాత్రూం లో కెళ్ళి సింక్ లో ఆ రక్తాన్ని పిండుతాడు. అవతల బార్ లో మారిస్ గర్ల్ ఫ్రెండ్ తో వున్నట్టు నవ్వులు విన్పిస్తూంటాయి. జ్యూక్ బాక్స్ ప్లే అవుతూంటుంది. సింక్ లో రక్తాన్ని పిండేశాక, నేలమీద రక్తం మరకల్ని తుడుచుంటూ మార్టీ వున్న కుర్చీ దాకా పోతాడు. 

          మార్టీ క్లోజ్ షాట్. వెనక్కొచ్చి అతణ్ణి పట్టుకుని లేపుతాడు. అప్పుడు టేబుల్ మీద రివాల్వర్  కనబడుతుంది. ఆగిపోతాడు. దాన్నందుకుంటాడు. క్లోజ్ షాట్ లో మార్టీ జేబులోకి దాన్ని తోస్తాడు. మార్టీని పైకి లేపుతాడు.
          ఇదీ సీను.

***
పై సీనులో ఓపెనింగ్  నిజానికి మూసి వున్న బార్ బయటి వైపు నుంచి చూస్తున్నామన్నట్టు వుంటుంది. రే డోర్ తీసుకుని లోపలి కొస్తే గానీ లోపలి నుంచి చూస్తున్నట్టు అన్పించదు. డార్క్ మూవీస్ ఎలిమెంట్స్ లో ఒకటైన అద్దాలతో మరోసారి ట్రిక్ చేశారు కోయెన్ బ్రదర్స్. రే బార్ కి రావడం లాంటి ఓ మామూలు షాట్ ని కూడా మనం ఉలిక్కిపడి చూసేలా చేశారు అద్దాలతో. మనం ఎక్కడా లేజీగా షాట్లు చూసేటట్టు చేయడం లేదు. సాధారణమనుకున్న షాట్స్ ని కూడా ఉలిక్కిపడి చూసేట్టు చేస్తున్నారు. ఒక సినిమా తీస్తూ ఇన్ని చేయవచ్చన్న మాట. ఇంకోటేమిటంటే, వెనక సీన్లో బార్ లో యజమాని మార్టీ హత్య జరిగిన తర్వాత,  ఈ సీన్ ఓపెనింగ్ చూస్తే, మూతబడిన బార్ క్లోజైన అతడి చాప్టర్ కి సింబాలిక్ గా, విషాదంగా వున్నట్టు అన్పించడం. కథనాన్ని ఎంతగా తవ్వితీసి వాడుకుంటున్నారో 
దీన్ని బట్టి తెలుస్తోంది. ఈ సినిమా పూర్తి చేసేనాటికి ఆలోచనలతో బుర్ర చితికి, చిక్కి శల్యమయ్యారు కోయెన్ బ్రదర్స్. పిచ్చి షాట్లు తీస్తూ పోజులు కొడుతూ తిరగలేదు. 

          ఈ సీనులో దర్శకుల ఉద్దేశం మార్టీని ఎబ్బీ చంపినట్టు రేకి అర్ధమవాలని. కానీ రే ఇలా వస్తాడని మార్టీని చంపిన విస్సర్ వూహించి వుండడు. ఇంకెవరో చూసి, పోలీసులూ వచ్చి, రివాల్వర్ని చూసి, ఎబ్బీ - రే లిద్దర్నీ పట్టుకోవాలని అతడి కుతంత్రం. కానీ దర్శకులు ఇలా రే ని పంపించి అతడి కుతంత్రాన్ని దెబ్బ తీశారు. పాత్రలు పక్క పక్క సీన్లలో పైకి లేవడం, కింద పడ్డం జరిగిపోతున్న స్క్రీన్ ప్లే ఇది. మన సినిమాల మిడిల్లో పైకి లేచిన పాత్ర,  మళ్ళీ ఎప్పుడో పది సీన్ల తర్వాత గుర్తు చేసుకుని, కింద పడ్డం వుంటుంది. 

          ప్రేమకి ఒకసారి కమిటయ్యాక ఆ కమిట్ మెంట్ నే ఇక్కడ చూపిస్తున్నారు. కమిట్ మెంట్ కి ముందు ఇద్దరి అపార్ధాలతో విడిపోయేదాకా వచ్చింది. ఇక కమిటయ్యాక ఇంకేం జరిగినా ప్రేమకే కట్టు బడాలనుకున్నారు. అపార్ధాలొచ్చినా,  అరమరికలొచ్చినా కమిటైన  ప్రేమ డిస్టర్బ్ కాకూడదన్న అంతరార్ధం ఇక్కడ తొంగి చూస్తోంది. 

          ఇందుకే బాబోయ్ ఎబ్బీ హత్య చేసిందని రే పారిపోలేదు. ఎబ్బీ చేసిందనుకుంటున్న హత్యకి ఆమెని తిట్టాలని కూడా ఫోన్ చేయలేదు. తనకి విషయం తెలిసిపోయిందని ఆమెకి తెలీకూడదన్న తపన కూడా వుంది. ఏమీ ఎరగనట్టు తను వుండి,  ఆమెని కాపాడాలను కుంటున్నాడు. నిజంగా గొప్ప ప్రేమే. ఆమె మీద సాక్ష్యాధారాలు లేకుండా చేయడానికి శవాన్ని కూడా మాయం చేసేందుకు  సిద్ధపడ్డాడు. ఇలాటి అతడికి ఆమె ఏమిస్తుందో చూడాలి. 

          అయితే ఈ సీన్లో ఒక లోపం వుంది. రే బార్ బయట కారు దిగి వస్తున్నప్పుడు కారు హెడ్ లైట్లు వేసే వుంటాయి. అలా ఎవరూ హెడ్ లైట్లు వదిలేసి రారు కదా. సీనిక్ ఎఫెక్ట్ కోసం లాజిక్ ని వదిలేశారనుకుందాం, మరి తర్వాత బార్లోకి మారీస్ వచ్చినప్పుడు ఇది చూడడా? రే బార్లోనే వున్నాడని తెలుసుకోడా? రే హెడ్ లైట్స్ ఆఫ్ చేసినా కూడా బయటే  వున్న అతడి కారు మారిస్ చూస్తాడుగా? అసలు ఆ సమయంలో మారిస్ రావడమెందుకు, ఆడియెన్స్ కి ఫేక్ టెన్షన్ పుట్టించడానికి కాకపోతే?

          మొత్తానికి ఈ సీనులోంచి రే శవాన్నిలా  బయటికి తీసికెళ్ళిపోయాడు. ఇది విస్సర్ కి యాంటీ సీను. శవం జేబులో ఎబ్బీ రివల్వర్ని పెట్టేసి మాయం చేయాలనుకున్నాడు.
***
21. కారులో శవంతో రే బార్ లోంచి బయట పడడం.
    ఈ సీనులో బార్ వెనుక పార్కింగ్ వైపు చెక్క మెట్ల మీంచి శవాన్ని లాక్కుపోతూంటాడు రే. దూరంగా మండుతున్న కొలిమి కన్పిస్తూంటుంది.  శవాన్ని కారు బ్యాక్ సీట్లో పడేసి,  కారు పోనిస్తూ రక్తపు గుడ్డల్ని కొలిమిలో విసిరేసి పోతాడు.
22. హైవేమీద ప్రయాణంలో మార్టీ ఇంకా బతికే వున్నాడని రే తెలుసుకుని పారిపోవడం.
           ఈ సీను ఇలా వుంటుంది :  నిర్మానుష్యంగా వున్న  హైవే మీద కారుపోతూంటే రే డియోలోంచి ఇవాంజలిస్టు ప్రవచనం వస్తూంటుంది. రానున్న మూడు ఉపద్రవాల గురించి హెచ్చరిస్తూంటాడు.  ఆఫ్రికాలోనూ, భారత ఉపఖండంలోనూ కరువుకాటకాల గురించి. భూకంపాల గురించి. గ్రహాలన్నీ ఏకమై కల్లోలం సృష్టించడం గురించి. ఇంకా బైబిల్లో చెప్పిన పొంచి వున్న దుష్టుడి గురించి. 

          మార్టీ టెన్షన్ తో డ్రైవ్ చేస్తూంటాడు, మొహం చెమటలు పడుతూంటుంది. అప్పుడప్పుడు వెనక సీట్లోకి చూస్తూంటాడు. మార్టీ శవం అలాగే పడుంటుంది. ఒక కారు పక్కనుంచి దూసుకుపోతుంది. రేడియో కట్టేస్తాడు. అప్పుడు రేకి ఎగశ్వాశ దిగశ్వాశ తీసుకుంటున్న శబ్దం విన్పిస్తుంది. టైట్ క్లోజప్ లో రే – ఉన్నట్టుండి అతడి దవడ ఎముకలు బిగుసుకుంటాయి- గిరుక్కున తల తిప్పి వెనుక  సీట్లో చూస్తాడు. గబుక్కున ముందుకు తిరిగి  సడెన్ బ్రేకేస్తాడు.

  ఈ సీనులో రేడియో ప్రవచనమంతా రానున్న సీన్ల గురించే. దుష్టుడు పొంచి వున్నాడని రే కి హెచ్చరిక వెళ్తోంది. కరువుకాటకాలు,  భూకంపాలు సంభవిస్తాయని భవిష్యవాణి. గ్రహాలన్నీ ఏకమై విధ్వంసక శక్తిని విడుదల చేస్తాయని కూడా మత పెద్ద హెచ్చరిస్తున్నాడు. పొంచివున్న దుష్టుడు విస్సర్ కావచ్చు. భూకంపం ఈ తర్వాతి సీన్లో శవంతో రే చూడబోతాడు. విధ్వంసక శక్తి విడుదల అన్నది క్లయిమాక్సే.

          ఇక్కడ ఊహించని ట్విస్టు మార్టీ బతికే వున్నాడని తెలిసి రే ఠారెత్తిపోవడం...
          మార్టీ హత్య తర్వాత యాక్షన్ ఓరియెంటెడ్ గా వెళ్తున్నాయి మిడిల్ వన్ సీన్లు.
రేపు మిడిల్ వన్ చివరి సీను చూద్దాం

-సికిందర్
ఒరిజినల్ సీన్స్ కాపీ కోసం
 ఇక్కడ క్లిక్ చేయండి