రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

11, ఆగస్టు 2017, శుక్రవారం

494 : రివ్యూ!


 
రచన -  దర్శకత్వం : తేజ
తారాగణం : రానా, కాజల్
, కేథరిన్, పోసాని, తనికెళ్ళ, అజయ్, జయప్రకాశ్ రెడ్డి, ప్రదీప్ రావత్, సత్యప్రకాష్ తదితరులు
సంగీతం : అనూప్ రూబెన్స్, ఛాయాగ్రహణం : వెంకట్ సి.దిలీప్
బ్యానర్ : సురేష్ ప్రొడక్షన్స్, బ్లూ ప్లానెట్ ఎంటర్ టైన్మెంట్
నిర్మాతలు : డి సురేష్ బాబు, కిరణ్ రెడ్డి, భరత్ చౌదరి
విడుదల: ఆగస్టు 11, 2017
***
         ర్శకుడు తేజా టీనేజీ ప్రేమ సినిమాలతో రానురాను ఆదరణ కోల్పోయి, కొంతకాలం తెర మరుగై  రాజకీయ సినిమాతో ఇప్పుడు దర్శనం చేసుకున్నారు. గతం లో తీసిన వాటిలో ఒక్క ‘నిజం’  అనే సామాజికం తప్ప మిగిలిన దాదాపు పదిహేనూ టీనేజీ  ప్రేమ సినిమాలే. ‘నిజం’ అనే సామాజికంతో వైఫల్యం తర్వాత ఇప్పుడు ‘నేనే రాజు నేనే మంత్రి’  అంటూ రాజకీయంతో రావడం ఒక విధంగా సాహసమే. ప్రేమల నుంచి రాజకీయాలకి తన స్టీరింగు తిప్పుకున్న తేజా ఎలా డ్రైవ్ చేశారన్నదానిపైనే ఆయన గమ్యం చేరడం ఆధారపడుంటుంది. 

          
రానా కూడా ‘ఘాజీ’, ‘బాహుబలి’ ల తర్వాత రాజకీయ పాత్ర పోషించేందుకు పూనుకోవడం, అందులోనూ అపజయాలతో వున్న తేజకి అవకాశమివ్వడం రెండూ ప్రయోగాలే. ఒకరి సాహసం, ఇంకొకరి ప్రయోగం కలిసి తయారైన ‘నేనే రాజు నేనే  మంత్రి’ గురించి ఇద్దరూ మళ్ళీ ఇది రాజకీయ సినిమా కాదన్నారు- పదిశాతం మాత్రమే రాజకీయం, మిగిలింది ప్రేమ కథ అన్నారు. ఇది వినడానికి విచిత్రంగా వున్నా, అసలేం చేశారో ఒకసారి చూద్దాం...

కథ 
   స్వల్ప వడ్డీకి రుణాలిచ్చే వడ్డీ వ్యాపారి జోగేంద్ర ( రానా) భార్య రాధ ( కాజల్) ని బాగా ప్రేమిస్తూంటాడు. పెళ్ళయిన  మూడేళ్ళకి తండ్రి కాబోతున్నాననే సంతోషంతో గుడికి తీసుకుపోతాడు. గుడి బయట  దీపం వెలిగిస్తూంటే సర్పంచ్ భార్య కోపంతో రాధని తోసేస్తుంది. దాంతో గర్భంపోయి ఇక పిల్లలు పుట్టని పరిస్థితి వస్తుంది. తాము సామాన్యులు కాబట్టేగా ఈ పరిస్థితి వచ్చింది, ఇక ముందు ఇలా జరక్కుండా వుండాలంటే సర్పంచ్ కుర్చీని కైవసం చేసుకోమని రాధ అంటుంది. దీంతో ఎన్నికలో నిలబడి సర్పంచ్ సుబ్బయ్య (ప్రదీప్ రావత్)ని ఓడించేస్తాడు జోగేంద్ర. దీన్ని జీర్ణించుకోలేని సుబ్బయ్య తనని చంపబోతే అతణ్ణి చంపేస్తాడు జోగేంద్ర. ఈ హత్య నుపయోగించుకుని  ఎమ్మెల్యే చౌడప్ప (సత్య ప్రకాష్) జోగేంద్రని ఇరకాటంలో పెట్టేస్తే  అతన్నీ చంపేస్తాడు. అతడికి సహకరించిన సీఐ (అజయ్) ట్రాన్స్ ఫర్ అయ్యేలా చేస్తాడు. ఉపఎన్నికలో ఎమ్మెల్యే అయి మంత్రి కూడా అయిపోతాడు. ఇక్కడ హోంమంత్రి సుబ్బారెడ్డి (ఆశుతోష్) తో వైరుధ్యం వస్తుంది. 

          ఇలావుండగా ఓ ఛానెల్ బాస్ కూతురు దేవికారాణి (కేథరిన్) జోగేంద్రని  ప్రేమిస్తూ అతడి రాజకీయ చదరంగంలో సహకరిస్తూ వుంటుంది. దీన్ని రాధా సహించదు.  దీంతో ఈ ఇద్దరి  మధ్య నలిగిపోతూంటాడు. మరోవైపు ఎట్టిపరిస్థితిలోనూ సీఎం అవాలని ప్రయత్నాల్ని తీవ్రతరం చేస్తాడు.

          ఈ ప్రయత్నాల్లో అతడికెదురైన అడ్డంకులేమిటి, రాధ- దేవికలతో వచ్చిన చిక్కులేమిటి,  ఇవన్నీ ఏ మలుపులు తీసుకున్నాయన్నదే మిగతా కథ.

ఎలావుంది కథ 
      ఇది పక్కా పొలిటికల్ థ్రిల్లర్ జానర్ కింది కొచ్చే కథ.  ఇందులో ఎలాటి సందేహమూలేదు. కానీ ఇందులో  పది శాతమే  రాజకీయ కథ అనడంలోనే  తికమక వుంది. ఆ తికమక కథని కూడా తిప్పలు పెట్టింది. రాజకీయ పరమ పద సోపాన పటంలో కథానాయకుడి ఆరోహణా క్రమం చకచకా సగం దాకా సాగి, అక్కడ్నించీ పతనావస్థకి చేరడం 90 శాతం ప్రేమ కథ కోసమే చేసి వుంటే అది జానర్ మర్యాదని గల్లంతు చేసే పనే. ఎప్పుడైతే జానర్ మర్యాద గల్లంతయ్యిందో విషయం రిస్కులో పడి యాంటీ క్లయిమాక్స్ కి దారి తీసింది. ఈ యాంటీ క్లయిమాక్స్ బాక్సాఫీసు అప్పీల్ తో విభేదిస్తోంది. యాంటీ క్లయిమాక్స్ తో మెప్పించేందుకు ‘మరో చరిత్ర’ లోలాగా స్టోరీ క్లయిమాక్స్ కాస్తా ప్లాట్ క్లయిమాక్స్ గా మార్పు చెందే జగ్రత్తలేవీ  తీసుకోలేదు. 

          కథ నడక, పాత్రల తీరుతెన్నులూ  వగైరా చూస్తే  కోడి రామకృష్ణ తీసిన రాజకీయ సినిమాల శైలి గుర్తుకొస్తుంది. అయితే సిద్ధహస్థుడైన కోడి రామకృష్ణ ప్రేమల్ని గానీ, కుటుంబ సమస్యల్ని గానీ జానర్ మర్యాదకి అడ్డురాకుండా రాజకీయ కథల్ని ఒక లాజికల్ ఎండ్ కి తీసికెళ్లారు. విశాల ప్రాతిపదికన ప్రజలకోసం పోరాడే కథానాయకుల్ని చూపించారు. ప్రస్తుత కథలో కథానాయకుడు తన వ్యక్తిగత స్వార్ధం కోసం మాత్రమే హీరోగా ఎస్టాబ్లిష్ అవాలని ప్రయత్నించాడు. చివరిదాకా తన కోసం పోరాడిన ప్రజానీకాన్ని వదిలేసి భార్యకోసం వెళ్ళిపోయాడు. 

ఎవరెలా చేశారు 
      రానా పోషించింది పవర్ఫుల్ పాత్ర ఫస్టాఫ్ లో. ఇంత యాక్టివ్ పాత్ర సెకండాఫ్ మొదలైన దగ్గర్నుంచీ పాసివ్ రియాక్టివ్ పాత్రగా బలహీనంగా మారిపో
తుంది- రాజకీయ కథలోనూ, దాని ఉపకథ అయిన ప్రేమ కథలోనూ. పవర్ఫుల్ పాత్రలో రానా ఆశ్చర్య జనకమైన నిర్ణయాలు తీసుకుంటూ ప్రత్యర్ధుల్ని మట్టు బెట్టడం మనల్ని కళ్ళప్ప గించి చూసేలా చేస్తుంది. అదే సెకండాఫ్ కొచ్చేసరికి,  ప్రధాన శత్రువు తీసుకునే పవర్ఫుల్ నిర్ణయాలకి గిలగిల లాడే రానాని  కళ్ళు తిప్పుకుని చూసేలా చేస్తుంది. ఇద్దరు అతివల మధ్య రానా నలిగే దృశ్యాలు సానుభూతిని రాబట్టుకోగల్గినా, ప్రధాన శత్రువుతో బలహీనంగా కన్పించడంతో, రెండిటా ఒకే రస పోషణ జరిగి పాత్ర ఫ్లాట్ గా మారింది. ఇలా కాకుండా అతివల విషయంలో  బలహీనంగానూ, శత్రువు విషయంలో బలంగానూ వుంటే డెప్త్ వచ్చేది. రానా తిరుగులేని పవర్ఫుల్ నటుడు- అయితే అతడి రాణింపుకి బాహుబలి, ఘాజీల్లోలాగా సమగ్ర పాత్ర చిత్రణలుండాల్సిన అవసరముంది.  

          సెంటిమెంట్ల కాజల్ పాత్ర మరీ సెంటి మెంట్లు ఎక్కువైపోయి సినిమాకి అడ్డదిడ్డంగా కాటుక (కాజల్) పూసేసింది. గ్లామర్ పోషణ బావుంది. పాటల్లో బాగానే కన్పిస్తుంది. ముక్కోణ ప్రేమలో త్యాగమనే భారం తనమీదేసుకుని చేసే పని చివరికి రానా చేసే పనిలాగే పిచ్చి పని. రానాని మోటివేట్ చేసే పాత్ర కాస్తా తనే తీవ్ర నిర్ణయం తీసుకోవడం విస్తుపోయేలా చేస్తుంది. పాత్ర చిత్రణలకి  సంబంధించి ఒక కొటేషన్ వుంది : పాత్రని పై దాకా చెట్టెక్కించాలి, ఆ తర్వాత రాళ్ళు తీసుకుని కొట్టాలి. అప్పుడా పాత్ర ఏం చేస్తుందో చూడాలని... అయితే రానా కాజల్ ల లాగా కూడబలుక్కుని చెట్టు దూకి పారిపోకూడదు!  జైసీ  కాజల్ వైసా రానా అయ్యారిక్కడ. 

          టీవీ జర్నలిస్టు పాత్రలో కేథరిన్ కి రానా తగిన బుద్ధి చెప్తూ, తనకి జరిగింది ఆమె చెప్పుకోలేని ‘టెక్నాలజీ’ నుపయోగించడం చాలా బావుంది. ఇలాటి ఆడవాళ్ళకి ఇలాగే బుద్ధి చెప్పాలి. అయితే ఒక జర్నలిస్టు కాపురాల్లో ది ఆదర్ వుమన్ గా చొరబడ్డం లాజికల్ గా ఏమీ వుండదు. ఈమె పాత్రకూడా సెకండాఫ్ లో ఇంకేం చెయ్యాలో తోచక మిస్ అయి, క్లయిమాక్స్ లో భారీ జనసందోహాన్నేసుకుని మళ్ళీ జర్నలిస్టు సోకు వెలగబెడుతుంది. ప్రేమాగీమా ఏమయ్యాయో తెలీదు. ప్రేమ కథకి కూడా న్యాయం జరగలేదు. 

          ‘నక్షత్రం’ లో రేజీనా తండ్రిగా గతవారమే హడలగొట్టిన  శివాజీ రాజా మళ్ళీ ఈసారి కాజల్  ఫాదర్ గా ప్రత్యక్షమయ్యారు. శివాజీ రాజా అప్పుడే పెద్ద పెద్ద హీరోయిన్లకి తండ్రి అయిపోవడం ఒక ఎట్రాక్షన్. ఇక విలన్ కి పక్కవాద్యం
పోసాని, సీఎంగా తనికెళ్ళ, సీఐగా అజయ్, జైలర్ గా జయప్రకాశ్ రెడ్డి, సర్పంచ్ గా ప్రదీప్ రావత్, ఎమ్మెల్యే గా సత్యప్రకాష్ అంతా రాజకీయ సన్నివేశాల్ని బాగా బాగా వేడెక్కించడానికి పనికొచ్చారు. 

          అనూప్ రూబెన్స్ ఈసారి లూప్ లో కొచ్చి సరైన బాణీల్ని అందించారు. సంగీతపరంగా సినిమాకివ్వాల్సిన సోల్ నంతా ఇచ్చారు. కాకపోతే కథాపరంగా ఆ సోల్ చెదిరిపోయింది. దిలీప్ కెమెరా వర్క్ కూడా ఉన్నతం. యాక్షన్, ఆర్ట్, ఎడిటింగ్ తదితర సాంకేతిక విభాగాలన్నీ ఉన్నతంగా  వున్నాయి.

          తేజా  దర్శకత్వంలో ఈసారి కొట్టొచ్చినట్టు కన్పించేదేమింటంటే,  ఎక్కడా ఇది తేజా సినిమా అన్పించక పోవడం. లేకపోతే ప్రేమ సినిమాల్లో అంతా ఆయనే కన్పించేవారు డామినేట్ చేస్తూ. ఈసారి అంత ఇగో లేదు. తను కాకుండా కథ మాత్రమే, పాత్రలు మాత్రమే  కన్పించేట్టు జాగ్రత్తలు తీసుకున్నట్టు కన్పిస్తుంది. 

          ఈ సినిమాకి మరో బలం సంభాషణలు. సంభాషణల రచయితకి సన్నివేశాలతో పనేగానీ,  ఆ సన్నివేశాల కూర్పు సరిగానే వుందా, ప్రధాన పాత్ర బలహీనంగా మారిపోయి,  ప్రధాన కథని ఉప కథ ఆక్రమిస్తూ,  ఉప కథే ప్రధాన కథగా ముగుస్తోందా అన్న బాదరబందీతో  పనుండదు. అవి దర్శకుడు చూసుకుంటాడు. అలాగే డైలాగ్ రైటర్ లక్ష్మీ భూపాల సామెతలు దట్టించి మాటలు పేల్చుకుంటూ బిజీగా గడిపేశారు. తన పనిని తాను  కమర్షియల్ రైటర్ అన్పించుకుంటూ సమర్ధవంతంగా నిర్వహించారు. పరుచూరి బ్రదర్స్ కూడా రచనలో చేయి వేసి న్యాయం చేసేందుకు తమ వంతు కృషి చేశారు. ఎవరైనా కృషి మాత్రమే చేయగలరు. ఫలితం మాత్రం బాక్సాఫీసే చెప్తుంది. ఎలాటి కృషి చేశారనేది మాత్రం అర్ధం గాకుండా వుండిపోతుంది.

చివరికేమిటి
       ఫస్టాఫ్ రానా యాక్షన్ తో కళ్ళుతిప్పుకో నివ్వదు. రాజకీయ కథ కొత్త పుంతలు తొక్కుతుంది. సెకండాఫ్ లో కుటుంబ సెంటిమెంట్ల బారిన పడి ఎత్తుకున్న కథ యూత్ అప్పీల్ కి దూరమైపోతుంది. విషాద ముగింపు ఇంకో మైనస్ కాగా, దీనికికూడా అర్ధం కన్పించదు. ఇలాటి ముగింపు అవసరమే లేదు. ఫస్టాఫ్ లో పదవుల కోసం రానా చేసే హత్యాపరంపర – సెకండాఫ్ కొచ్చేసరికి కేవలం విలన్ చేసే అకృత్యాలని తిప్పి కొట్టే ప్రహసనంగా మారిపోతుంది. ఒక అకృత్యానికి కాజల్ గాయపడినప్పుడైనా విలన్ మీద వేటు వేసే ఆలోచన చేయకపోవడం సెకండాఫ్ సమస్యలన్నిటికీ మూలం. పోతే ఇది సీరియస్ సినిమా. ఇందులో వినోదం పాలు వెతుక్కోకూడదు.

-సికిందర్
http://www.cinemabazaar.in




10, ఆగస్టు 2017, గురువారం

493 : డార్క్ మూవీస్ స్క్రీన్ ప్లే సంగతులు - 9





(జులై 22 ఆర్టికల్ తరువాయి)
         
బ్లడ్ సింపుల్’ మీద విశ్లేషణలు రాసిన ఎందరెందరో పండితులు మనకి తెలిసి ఒక విలువైన స్క్రిప్టింగ్ టూల్ ని గుర్తించనట్టు కనపడతారు.  రైటర్స్ దృక్కోణంలో విశ్లేషించకపోవడం వల్ల కావొచ్చు, ఆ స్క్రిప్టింగ్ టూల్ ప్రాథాన్యాన్ని విస్మరించారు. ఇంతవరకూ మనం చూస్తూ వచ్చిన సినిమాల్లో ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఏ గోల్ ఏర్పడిందో ఆ గోల్ ప్రకారమే మిడిల్ నడుస్తుందనీ గమనిస్తూ వచ్చాం. ఆ గోల్ కొన్ని ఎలిమెంట్స్  తో కలిసి వుంటుందనీ, అవి కోరిక, పణం, పరిణామాల హెచ్చరిక,  ఎమోషన్ గా వుంటాయనీ తెలిసిందే. ఈ నాలుగూ కాక మరొకటి వుంటే? అది రహస్య ఎజెండా అయితే? అప్పుడు కోరిక, పణం, పరిణామాల హెచ్చరిక,  ఎమోషన్ లకి తోడూ రహస్య ఎజెండా కూడా కలిసి ప్లాట్ పాయింట్ వన్ ఏర్పడితే? కాకపోతే రహస్య ఎజెండా వుందని ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ప్రేక్షకులకి తెలియదు. ఏర్పాటు చేసిన గోల్ ప్రకారమే మిడిల్ ని చూస్తూ వెళ్లి ఎక్కడో కంగారుపడతారు. అంటే ఏర్పాటు  చేసిన గోల్  అసలు గోల్ కాకుండా పోతుందన్న మాట. ఫేక్ గోల్ ని ఏర్పాటు చేయడమన్న మాట. ప్రేక్షకుల్ని కాసేపు భ్రమల్లో వుంచడానికి ఫేక్ సన్నివేశాల్ని సృష్టించడం కద్దు. కానీ  ఏకంగా గోల్ నే ఫేక్ గోల్ గా ఏర్పాటు చేయడం బహుశా ‘బ్లడ్ సింపుల్’ లోనే వుంది. ఇదెలా జరిగిందో చూద్దాం...

         
ప్లాట్ పాయింట్ వన్ లో  ఎబ్బీ, రేలని చంపే కాంట్రాక్టుని మార్టీ నుంచి విస్సర్ పొందాడని తెలుసుకున్నాం. ఇలా విస్సర్ గోల్ లో  పైన చెప్పుకున్న నాల్గు ఎలిమెంట్స్  వున్నాయని గమనించాం. అయితే జరిగిందేమిటి? 19 వ సీను (గతవ్యాసం) లో విస్సర్ మార్టీని చంపి సంచలనం సృష్టించాడు. కన్నింగ్ ఫెలో మార్టీ అని ముందే చెప్పుకున్నాం. తనని నమ్మిన వాళ్ళ గొంతు కోసి బాముకునే రకం. ఒకసారి చూసి రమ్మంటే ఫోటోలు తెచ్చి  బ్లాక్ మెయిల్ కి పాల్పడ్డ విస్సర్ ని మళ్ళీ నమ్మి చంపే పని అప్పగించాడు మార్టీ. ఫలితం అనుభవించాడు. ఇది ప్లాట్ పాయింట్ వన్ ని తలకిందులు చేసిందా? ప్లాట్ పాయింట్ వన్ ఇలా ఉల్టా పల్టా అవడం ఎక్కడైనా చూశామా? ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఏ  గోల్ ఏర్పడిందో ఆ గోల్ ని దృష్టిలో పెట్టుకునే మిడిల్ ని  నడపడం సర్వసాధారణం. ప్లాట్ పాయింట్ వన్ దగ్గర ఎబ్బీ, రే లని చంపేందుకు మార్టీ నుంచి  కాంట్రాక్టు పొందాడు విస్సర్. ఆ ప్రకారం ఎబ్బీ, రేలని చంపిన ఫోటోలు మార్టీ కి చూపించాడు. మార్టీ దగ్గర రావాల్సిన డబ్బులు తీసుకుని మార్టీని చంపేశాడు. పైకి చూస్తే  ఇది ఎబ్బీ, రే ల హత్యలతో ముందుముందు తనకి మార్టీ తో సమస్యలు రాకూడదని మార్టీని కూడా అంతమొందించి నట్టు కన్పిస్తోంది.  మార్టీ  హత్యని ఎబ్బీ మీదికో, రే మీదికో తోసేయ్యడానికి ఎబ్బీ రివాల్వర్ని ఉపయోగించాడని కూడా అర్ధమవుతోంది. 

          ప్లాట్ పాయింట్ వన్ లో విస్సర్ గోల్ ఎబ్బీ, రేలని చంపడమే కదా, వాళ్ళని చంపాక దాని పరిణామాల్లో భాగంగానే మార్టీ ని కూడా చంపి వుండవచ్చని  అన్పించవచ్చు. అంటే ప్లాట్ పాయింట్ వన్ కి కొనసాగింపుగా మార్టీ హత్య తోచవచ్చు. ముందు ఎబ్బీ, రేలని చంపి, దానికి  సాక్షిగా వుండే  మార్టీ బతికి వుండకూడదని మార్టీని కూడా చంపినట్టు కన్పిం
చవచ్చు. 


         కానీ అసలు ఎబ్బీ, రే లనే విస్సర్ చంపి వుండకపోతే? చంప 
లేదు కూడా! చంపదల్చుకోలేదు. ప్లాట్ పాయింట్ వన్ లో మార్టీ ఆఫర్ ని స్వీకరించడం ఒక పెద్ద దగా.అలా నటించాడు. అప్పుడే ఎబ్బీ, రేలకి బదులుగా మార్టీ నే చంపి, ఈ హత్యని ఎబ్బీ, రేల మీదికి
తోసెయ్యదల్చు
కున్నాడు. పదివేల డాలర్లు అవసరమే. కాకపోతే రిస్కు తీసుకో తీసుకోదల్చుకోలేదు. తను ఏబీ, రేలని చంపేస్తే,  రేపొకవేళ మార్టీ దొరికిపోతే, తనని కూడా కేసులోకి లాగవచ్చు. మార్టీ నే చంపి ఎబ్బీ, రే ల మీదికి తోసేస్తే ప్రమాదం వుండదు- తను వాళ్ళకి తెలీదు గనుక. 


          ప్లాట్ పాయింట్ వన్ దగ్గరే అతడికీ రహస్య ఎజెండా వుంది. ఇది మార్టీకీ, ప్రేక్షకులకీ తెలీదు. అందుకే ఇలా ప్లాట్ పాయింట్ వన్ ట్విస్టు ఇచ్చాడు విస్సర్. ప్లాట్ ట్విస్టులుంటాయి, కానీ ప్లాట్ పాయింట్ వన్ ట్విస్టే కొత్తది! ఈ ట్విస్టు పెట్టాలంటే పాత్రకి పైకి కన్పించే గోల్ కాక   లోలోపల రహస్య పథకం వుండాలి. ఇది అచ్చిబుచ్చి తెలుగు ప్రేమసినిమాల్లో కూడా పెట్టుకోవచ్చు. కానీ అచ్చిబుచ్చి తెలుగు ప్రేమసినిమాల్లో అలిగి విడిపోవడాలు, ప్రేమదీపం మలిపేసుకుని ఈసురో మని మిగిలిపోవడాలూ ఇవే ప్లాట్ పాయింట్ వన్ లుగా గొప్పగా అన్పిస్తాయి రోమకామ ( రోమాంటిక్ కామెడీ)   రైటర్లకి.


          ఏ ఆధారాలతో విస్సర్ ప్లాట్ పాయింట్ ట్విస్ట్ ఇచ్చాడని తెలుస్తోంది?  అతను ఎబ్బీ రివాల్వర్ తో మార్టీని చంపడమే ఆధారం. ఎబ్బీ, రేలని చంపి వచ్చి ఎబ్బీ రివాల్వర్ తో మార్టీని ఎలా చంపుతాడు అంత కన్నింగ్   డిటెక్టివ్? ఎబ్బీ, రేల మరణ సమయం, మార్టీ మరణ సమయం విభేదిస్తాయి. రేపు పోస్ట్ మార్టమ్స్ లో తెలిసే మరణ సమయాల ప్రకారం ముందు చనిపోయిన ఎబ్బీ,  రేలు తర్వాత వచ్చి మార్టీని ఎలా చంపుతారు? అంటే వాళ్ళిద్దరూ బతికే వున్నారన్నమాట. విస్సర్ చంపి రాలేదన్న మాట. అలా ఫేక్ చేసిన ఫోటోలు చూపించి మార్టీని మోసం చేసి, డబ్బులు వసూలు చేసుకుని ఎబ్బీ రివాల్వర్ తో చంపేసి  పోయాడన్న మాట. ఇప్పుడు పీకలదాకా ఎబ్బీ, రే లు ఇరుక్కోవడమే!

          ఈ ప్లాట్ పాయింట్ ట్విస్టుతో చాలా బలమైన పరిణామాన్ని సృష్టించాడు విస్సర్. ఇప్పుడు దీని తర్వాతి దృశ్యం చూద్దాం... ఎంత తెలివిగల డిటెక్టివ్ అయినా నేరస్థుల్ని  పట్టుకోగలడేమో గానీ, నేరం చేసి బయట పడలేడు. ఇప్పుడు తర్వాతి  సీను దగ్గర్నుంచే అతనూహించి నట్టుగాక, అనూహ్యంగా అతడి పతనావస్థకి ఎలా బీజం పడిందో చూద్దాం...

 (సశేషం )
- సికిందర్


         
         




         


         


5, ఆగస్టు 2017, శనివారం

492 : రివ్యూ!

రచన - దర్శకత్వంహరిప్రసాద్
తారాగణం : అశోక్‌,  ఈషా రెబ్బా, పూజిత,  సుదర్శన్, కేదార్శంకర్, జెమిని సురేష్, నోయల్షాన్
సంగీతం: సాయి కార్తీక్‌, ఛాయాగ్రహణం: ప్రవీణ్అనుమోలు
బ్యానర్‌: సుకుమార్రైటింగ్స్, ప్లేబ్యాక్ పిక్చర్స్  
నిర్మాతలు: బి.ఎన్‌.సి.ఎస్‌.పి. విజయ కుమార్, థామస్రెడ్డి ఆడూరి, రవిచంద్ర సత్తి
విడుదల : 4 జులై, 2017
***
        సు
కుమార్ రైటింగ్స్ ఇంకొకటి వచ్చింది. రోమాంటిక్ రైటింగ్స్ కి అలవాటు పడిన కలం ఈసారి రాయకుండా రోమాంటిక్ డ్రామా తీసింది. క్యాంపులో స్టూడెంట్ హరిప్రసాద్ ని దర్శకుడుగా, దర్శకుడి పాత్రలో బంధువు అశోక్ బండ్రెడ్డి ని హీరోగా పరిచయం చేస్తూ  ‘దర్శకుడు’ సిద్ధం చేసింది. క్రితం వచ్చిన ‘కుమారి 21 ఎఫ్’ రైటింగ్స్ కీ, రైటింగ్ ని అవుట్ సోర్స్ చేసిన ‘దర్శకుడు’ కీ చాలా తేడా వుంది. అదేమిటో చూద్దాం...

 కథ 
        చిన్నప్పట్నించీ తండ్రి ప్రోత్సాహంతో సినిమా దర్శకుడవాలని దర్శకత్వ శాఖలో చేరతాడు మహేష్ (అశోక్). రెండేళ్లకే ఓ నిర్మాతకి కథ విన్పించి ఓకే చేయించుకుంటాడు. అయితే కథలో ప్రేమ ట్రాకు బలంగా లేదని, దాన్ని సరి చేస్తేనే తీస్తానని నిర్మాత పదిహేను రోజులు గడువు పెడతాడు. తనకి  ప్రేమలో అనుభవముందా అని కూడా అడుగుతాడు. దీంతో మహేష్  ప్రేమ ట్రాకు గురించి ఆలోచిస్తూ తన వూరు వెళ్తాడు. తిరుగు ప్రయాణంలో వైజాగ్ నుంచి హైదరాబాద్ వస్తున్న నమ్రత (ఈషా) అనే ఫ్యాషన్ డిజైనర్ పరిచయమవుతుంది. ఈ ప్రయాణం కొన్ని అవాంతరాలతో, అపదలతో రకరకాలుగా సాగుతుంది. అతను సినిమా దర్శకుడని తెలుసుకున్న ఆమె సినిమాల్లో చూపించేవన్నీ అబద్ధాలని వాదిస్తుంది. ఈమెతో ఈ అనుభవాలు తన కథకి పనికొస్తాయని ఆలోచిస్తూంటాడతను. ఈ క్రమంలో తనతో ప్రేమలో పడిందని గ్రహిస్తాడు. అ ప్రేమని ఆమె వ్యక్తం చెయ్యదు. హైదరాబాద్ చేరాక అతడికి సినిమాలే తప్ప, తనమీద ప్రేమలేదని, తన ప్రేమని సినిమా కథకి వాడుకుంటున్నాడనీ తెలుసుకుని లెంపకాయ కొట్టి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత ఏం జరిగింది? అది వెండి తెర మీద చూడాలి.

ఎలావుంది కథ 
     సుకుమార్ రైటింగ్స్ నుంచి అవుట్ సోర్స్ కాంట్రాక్టు  పొందిన కొత్త దర్శకుడు అందరు కొత్త దర్శకులకి లాగే టెంప్లెట్ ప్రేమని కథగా చేశాడు. దీనికి సుకుమార్ రైటింగ్స్ అనే బ్రాండింగ్ లేకపోతే ప్రతీవారం వచ్చే చిన్నా చితకా రోమాంటిక్ కామెడీల్లో ఇదొకటిగా ఎవరికీ తెలిసేది కాదు. ఇందులో చూపిన ప్రేమకి కథా ప్రయోజనం లేదు సరే, వృత్తిపరంగా ఔత్సాహిక దర్శకులకి ఏమైనా నేర్పి కథా ప్రయోజనం సాధించిందీ లేదు. అదీ సమస్య. ఒకప్పటి కాలేజీల్లో టీనేజీ ప్రేమ కథలే ఇప్పుడు పాతికేళ్ళు దాటిన ప్రొఫెషనల్ పాత్రలకి పెట్టి తీసేస్తున్నారు. అన్ని రోగాలకీ ఒకటే జిందా తిలిస్మాత్ లాగా, అన్ని ప్రేమలకీ ఒకటే అచ్చిబుచ్చి టీనేజి ప్రేమ కథలు. ఈ చూపిస్తున్న ప్రొఫెషనల్స్ ప్రేమల తీరు, మాటల తీరు, ప్రవర్తనల తీరూ, అలకలూ వియోగాల బాధ అంతాకూడా అపరిపక్వ-   ఇన్ఫాచ్యుయేషన్ బాపతు టీనేజి మనస్తత్వాలే. చాలా నాన్సెన్స్ ఇది. సుకుమార్ రైటింగ్స్ కూడా దీనికే పూనుకోవడం వింత. ఈ చూపిస్తున్న ఏనాటివో కాలం తీరిన మూస టెంప్లెట్ ప్రేమలకంటే, టాలీవుడ్ బయట యూత్ తీస్తున్న షార్ట్ ఫిలిమ్స్ ఎంతో బెటర్. ఇప్పుడు టీనేజీ ప్రేమలైనా ఎలావుంటున్నాయో వాస్తవికంగా చూపిస్తున్నారు. దీంతో వూరూవాడా యూత్ వీటికి కనెక్ట్ అయిపోయి టాలీవుడ్ రోమాంటిక్ కామెడీల వైపే  కన్నెత్తి చూడ్డం లేదు. ఎప్పుడో ఒకటీ అరా బ్రాండింగ్ తో వస్తే మొక్కుబడిగా చూస్తున్నారు. ఒకప్పుడు కుటుంబ సినిమాలకి టీవీ సీరియల్స్ దెబ్బకొట్టి ఫ్యామిలీ ఆడియెన్స్ ని దూరం చేసినట్టు, టాలీవుడ్ రోమాంటిక్ కామెడీలకి షార్ట్ ఫిలిమ్స్ పోటీగా తయారై సినిమాలకి యూత్ డుమ్మాకొడుతున్నారని గమనిస్తే మంచిది.

ఎవరెలా చేశారు 
      కొత్త వాడు కాబట్టి అశోక్ కి ఇంకాస్త సమయమివ్వాలి. కానీ ముందుగా అతను ఏం చేస్తే ముఖభావాలు కనీస స్థాయిలో పలికించగలడో తెలుసుకుని ఆ ప్రయత్నం చేయాలి. అవసరమైతే ప్లాస్టిక్ సర్జరీ కూడా. ముఖభావాలే పలకని, అన్నిటికీ ఒకటే ఫేసుపెట్టే స్టాటిక్ ఎక్స్ ప్రెషనిస్టు యువహీరో ఆల్రెడీ వున్నాడు. ఇంకా స్ట్రగుల్ చేస్తున్నాడు. అశోక్ కి అశోకవనం కాకూడదు టాలీవుడ్. 

          పాత్ర విషయానికొస్తే, గోల్ అనేది సినిమాల కోసమే పెట్టుకున్నాడు. బావుంది. ఆ సినిమా కథలో ప్రేమ బాగాలేదన్నాడు నిర్మాత. ప్రేమలో అనుభవం లేదా అని కూడా చెత్త ప్రశ్న వేశాడు. అశోక్ పాత్ర గనుక మర్డర్ మిస్టరీ చెప్తే, మర్డర్స్ లో అనుభవం లేదా, వెళ్లి మర్డర్ చేసిరా అంటాడేమో. సరే, ప్రేమలో అనుభవంకోసం కాకపోయినా, ప్రేమలో పడేందుకే దర్శకుడు హరిప్రసాద్ తనని వూరు పంపాడు. అక్కడ ఫ్యాషన్ డిజైనర్ పరిచయమైంది. ఆమెతో ట్రావెల్ చేస్తున్నప్పుడు ప్రేమంటే ఎలావుంటుందో అనుభవమయ్యింది. ఈ బాపతు ప్రేమ రెండు టాలీవుడ్ టెంప్లెట్ రోమాన్సులు  చూసేస్తే తెలిసిపోతుంది- వేరేగా అనుభవం అవసరం లేదు. మిత్రుడు (సుదర్శన్ రెడ్డి) నయం. ఏవేవో రోమాంటిక్ సినిమాలు చూసి ఐడియా లిస్తూంటాడు. అంతకంటే తక్కువరకం ప్రేమానుభవం పొందుతున్నాడు తను. అయితే ఈ ప్రేమలో తను పడడమే పాత్ర వృత్తితత్వాన్ని దెబ్బ తీసింది. దర్శకుడుగా కథకోసం ఆమెని స్టడీ చేయాల్సింది పోయి ప్రేమలో పడిపోయాడు. ఈ ప్రేమ ట్రావెల్ లో కథకోసం రీసెర్చి ఎలా చేస్తారో, ఎలాటి చిక్కుల్లో పడతారో చూపించే అవకాశాన్ని కోల్పోయాడు. ఎందుకంటే, పాత్ర వృత్తి నుంచి విడిపోయి ప్రేమ ఒక్కటే అనుకుంది. 

          సాధారణంగా ఇలాటి సందర్భాల్లో ఏం జరుగుతుందంటే, ఇలా ప్రేమలో పడిపోతే గోల్ ని మర్చిపోతుంది పాత్ర. ఆ ప్రేమలో దెబ్బ తిన్నాకే బుద్ధి తెచ్చుకుని  మళ్ళీ గోల్ వైపు మళ్ళుతుంది. అశోక్ పాత్ర ఈ పని చేసి డెప్త్ తీసుకురాలేదు, పోనీ ప్రేమలో పడకుండా ప్రేమని స్టడీ చేయలేదు. ప్రేమా కావాలి, ప్రొఫెషన్ కూడా కావాలీ అనుకున్నాడు. ఇది ఇమ్మెచ్యూర్ పాత్ర లక్షణం. హీరోకి కాక ఇతర పాత్రలకి వుండొచ్చు ఈ స్పష్టత లేని లక్ష్యం. ఎదురుగా ప్రేమించిన హీరోయిన్ వున్నప్పుడు ఆమెతోనే వుండాలి సంఘర్షణ. తనలో రెండు కోరికలు పెట్టుకుని వాటితో కాదు. 

        ఈ కథ ప్రేమ గురించా, దర్శకుడిగా ప్రొఫెషన్ గురించా? ఇక్కడ కూడా తప్పులో కాలేయడం
వల్ల ప్రేమే కథని మింగేసి, దర్శకుడి పాత్ర చిత్రణకి గ్రహణం పట్టించింది. పాత్రకి వృత్తితత్త్వంతో కూడిన అద్భుత రసమే ప్రధాన రసంగా వుండి,  చెరో పక్క రెండు అంగాలుగా శృంగార, హాస్య రసాలు పలకాల్సింది. ‘ముత్యాలముగ్గు’ వియోగ కథని అద్భుత రస ప్రధానంగా ఎందుకు తీశారో అర్ధం చేసుకోవాలి. ఇక్కడ దర్శకుదు అద్భుత రస ప్రధానంగా నడకపోవడంవల్ల,  పాత్ర గందరగోళంలో పడిపోయి ముగింపు కొచ్చేసరికి, తన షరతుల మీద ఆమెని చేపట్టడం కాక,  పాసివ్ క్యారక్టర్ గా మారిపోతూ వచ్చి, హీరోయిన్ అచ్చిబుచ్చి కబుర్లకి పడిపోయి శుభం వేశాడు. 

          ఇక హీరోయిన్ ఈషా మంచి నటి. భావప్రకటనా సామర్ధ్యం బాగా వుంది. ఆమె రొటీన్ కమర్షియల్ సినిమాల జోలికి పోకుండా ఈ తరహా సినిమాలకి పరిమితమైతే ఎక్కువ కాలం వుండగల్గుతుంది. పాత్రకి వచ్చేసరికి,  కనీసం పాతికేళ్ళ వయసున్న ప్రొఫెషనల్ తను. పైగా ఫ్యాషన్ డిజైనర్.  కానీ హీరో దర్శకుడని తెలిశాక, మరీ టీనేజీ పిల్లల చేష్టలు పోతూ – తనకి  సినిమాలంటే ఇష్టముండదనీ, అన్నీ అబద్ధాలే చూపిస్తారనీ,  ఇంకా ఏదేదో అంత సిల్లీగా ఎలా మాటాడి గిల్లి కజ్జాలు పెట్టుకుంటుంది. ఇద్దరిదీ ఒకే రంగమైనప్పుడు ప్రొఫెషనల్ గా అతడితో వెంటనే కనెక్ట్ అయిపోవాలి. అతడితో కలిసి పనిచేసే దృష్టితో మెచ్యూర్డ్ గా మాటాడాలి.  అతనెప్పుడో సెకండాఫ్ లో పిలిచి పనిలో పెట్టుకుంటే కాదు. తనతో సాన్నిహిత్యంలో అతను  కథని వెతుక్కుంటే తప్పేముంది? కళాకారులకి ఇది తప్పదు కదా, ఆమెకీ తప్పదు. అతను కథనే చూస్తాడు, కథనే చూసినా తను ప్రేమనే చూడవచ్చు. తను ప్రేమకి ప్రతినిధి అయితే, అతను కళకి  అయినప్పడు,  బలాబలాల సమీకరణ గీతగీసి స్పష్టంగా కనపడుతుంది కదా? అతను  కథనే చూశాడనీ, ప్రేమించలేదనీ, ఏ ఎమోషన్సూ లేవనీ  లెంపకాయ కొట్టి ఎలా వెళ్ళిపోతుంది. ఇది ఇమ్మెచ్యూరే కాదు, ప్రిమెచ్యూర్ కూడా. ముందు అతడితో ప్రొఫెషనల్ గా స్థిరపడాలి, ఆ తర్వాతే ప్రేమ గొడవలు లేవనెత్తుకోవాలి. అప్పుడది కథనం అవుతుంది. అతను ఆమెతో అయిన అనుభవాలే సీన్లుగా తీస్తూంటే, ఒక చోట షూటింగు చూసి, ‘నీయబ్బ ఈ సిను ఇంటర్వెల్లో వాడేశాడా!’ అని ఉడుక్కుంటుంది. టోటల్లీ నాన్సెన్స్. అతడి సినిమాకి తను స్ఫూర్తి అయితే మంచి విషయమే కదా? ఏ పల్లెటూరి పిల్లయినా ఎగిరి గంతేస్తుంది. 

          అతను కూడా సినిమా తీసి. నిర్మాతతో సమస్య వచ్చి పేరేసుకోకుండా ఎటో వెళ్లి పోవడం బాగానే వుంది కానీ, ఆ సినిమా కథకి  స్ఫూర్తి అయిన హీరోయిన్ ని తెర మీద పరోక్షంగానైనా ప్రస్తావించకుండా ఎలా వెళ్ళిపోతాడు. అద్భుత రసం ప్రధానంగా పాత్ర కొనసాగుతూ వుంటే ఈ పనే చేసి వెళ్ళిపోయేవాడు. ప్పుడు అన్ని శంకలూ తీరి ఆమే తన దగ్గరికి వచ్చేసేది. ఇలాకాక, నేనింత ప్రేమించాను, అంత ప్రేమించానూ అని ఎన్ని చెప్పుకుంటే ఏం లాభం.  సినిమానే ఆమెకి అంకితమిచ్చి పారేస్తే అంతకంటే ఏది బలపరుస్తుంది తన ప్రేమని. 

          ఫ్రెండ్ పాత్రలో కమెడియన్ సుదర్శన్ రెడ్డి డీసెంట్ గా నటించాడు. నిర్మాతా,  ఆయన కో డైరెక్టర్ పాత్ర ధారులిద్దరూ బావున్నారు. కానీ నిర్మాత ఫస్టాఫ్ లో రెండు సినిమాలు తీసి నష్టపోయానంటాడు. మళ్ళీ ఫస్టాఫ్ లో ఆస్తులన్నీ అమ్మి ఈ సినిమా తీస్తున్నా, పోయిందంటే కుటుంబం సహా  రోడ్డున పడతానంటాడు. ముగింపులో మళ్ళీ,  ముందు తీసిన రెండు సినిమాలకి డబ్బులొచ్చాయంటాడు. ఏది నమ్మాలి? అంత పెద్ద హైఫై నిర్మాత కోటి రూపాయల సినిమాకే రోడ్డున పడతాడా. సుకుమార్ రైటింగ్స్ కి ఇలాటి అవగాహన వుంటుందనుకోలేం.  

          ప్రొడక్షన్ విలువలు చాలా బావున్నాయి. ఆర్ట్ డైరెక్షన్ వున్నట్టు తెలీకుండా తీసిన ట్రెండీ లుక్ బావుంది. కెమెరా వర్క్ స్ఫటిక స్వచ్ఛతతో వుంది. పాటలుకూడా హుషారుగా వున్నాయి. అవుట్ డోర్ లొకేషన్స్  కథకున్న ఫీల్ కి పట్టం గట్టాయి. రాతపని బలహీనంగా వున్నా, నటనల్ని రాబట్టుకునే, దృశ్యాల్ని చిత్రీ కరించే దర్శకత్వపు పనులు చక్కగా వున్నాయి. 

చివరికేమిటి 
         ప్రధాన పాత్రకి సరైన అస్త్ర శస్త్రా లుంటే స్క్రీన్ ప్లే సరీగ్గా వుంటుంది. ప్రధాన పాత్ర తప్ప  దర్శకుడు లేదా రచయిత ఏం చేసీ స్క్రీన్ ప్లేని ఏర్పరచలేరు. ప్రధాన పాత్రని సృష్టించాక కథ కథకుడి చేతిలో వుండదు. అతను ఇష్టారాజ్యం గా పాత్రని క్యాట్ వాక్ చేయించుకుంటూ వెళ్ళలేడు. పాత్ర వెంటే కథకుడు వెళ్ళాలి. ఇలా జరక్కపోవడం వల్ల, ప్లాట్ పాయింట్స్ ఎక్కడ ఏర్పడ్డాయో తెలియనంత అస్పష్ట అష్టావక్ర చట్రం ఈ ప్రేమ సినిమాలో ఏర్పడింది. అంక విభజన అదృశ్యమై గాథ స్టయిల్లో ఆర్గ్యుమెంట్ లేని ఉత్త స్టేట్ మెంట్ చందాన మిగిలింది. టెంప్లెట్ నుంచి బయటికి రాకపోతే,  ప్రేమ సినిమాలు ఏవో పెద్ద బ్యానర్లు వాటి హంగులతో తప్పితే, మిగతావి హంగులూ లేక, కథా కాకరకాయా సరైన స్ట్రక్చర్ లో లేకా చప్పగా తేలిపోతాయి.

-సికిందర్
Cinemabazaar.in











4, ఆగస్టు 2017, శుక్రవారం

491 : రివ్యూ!

రచన- దర్శకత్వం : కృష్ణవంశీ 
తారాగణం : సందీప్ కిషన్, సాయిధరమ్ తేజ్, తనీష్, రేజీనా కాసాండ్రా, ప్రగ్యా జైస్వాల్, శ్రియా శరణ్, ప్రకాష్ రాజ్, జేడీ చక్రవర్తి, వీవా హర్ష, రఘుబాబు, శివాజీ  రాజా, బ్రహ్మాజీ తదితరులు
సంగీతం : భీఎమ్స్ , భరత్ మధుసూదన్, హరిగోరా, మణిశర్మ, ఛాయాగ్రహణం : శ్రీకాంత్ నరోజ్
బ్యానర్ : శ్రీ చక్ర మీడియా, బుట్ట బొమ్మ క్రియేషన్స్, విన్ విన్ విన్ క్రియేషన్స్
నిర్మాతలు  : ఎస్ వేణుగోపాల్, సజ్జు
విడుదల : ఆగస్టు 4. 2017
***
     ‘నక్షత్రం’ విడుదల సందర్భంగా ప్రతీ సినిమా తనకో పాఠమని చెప్పుకున్న సీనియర్ దర్శకుడు కృష్ణ వంశీ, నేర్చుకోవడానికి ఇంకా పాత పాఠమే మిగిలివుంది.  గత రెండు సినిమాలప్పుడే నేర్చుకోవాల్సిన   పాఠాల్ని నిర్లక్ష్యం చేసిన ఫలితంగా ‘నక్షత్రం’ ప్రత్యక్షమైంది. చాలా నవ్వొచ్చే విషయం. ఇప్పుడాయన ‘నక్షత్రం’ నుంచి ఏం పాఠం నేర్చుకున్నారో చెప్పగలరేమో చూడాలి. ఒకవేళ తెలుగు సినిమాల కంటూ తనే ఒక కొత్త పాఠాన్ని ఇతరులకి నేర్పాలనుకుంటున్నారేమో తెలీదు. సినిమాలు రెగ్యులర్ గా అలాగే ఎందుకుండాలి, ఇర్రెగ్యులర్ గా ఇలా ఎందుకు ఇరగ దీయకూడదని ఉద్దేశపూర్వకంగానే ‘మొగుడు’, ‘పైసా’, తర్వాత ఇప్పుడు ‘నక్షత్రం’ తీసి పారేస్తున్నారా ఒకవేళ, ఈసారి ఏకంగా 12 కోట్లని ప్రమాదంలోకి నెడుతూ? 

     సందీప్ కిషన్, సాయి ధరమ్ తేజ్, తనీష్, రేజీనా కసాండ్రా, ప్రగ్యా జైస్వాల్, ప్రకాష్ రాజ్ పేర్లతోనే ఇంత ప్రకాశించిపోతున్న ‘నక్షత్రం’ నఖశిఖపర్యంతం నగుబాటుపాలు కావడానికి కారణాలేమిటో ఈ కింద చూద్దాం. 

కథ
       రామారావ్ (సందీప్ కిషన్) తన తాతా తండ్రుల్లాగే పోలీసుద్యోగం చేయాలనుకుంటాడు. చదువు సరీగ్గా లేక (చిన్న చిన్న ఇంగ్లీషు ముక్కలు కూడా రావు) ఎస్సై పోస్టుకి ప్రతీసారీ రాత పరీక్ష తప్పుతూంటాడు. ఓ తల్లి (తులసి) వుంటుంది. ఇంకో  పోలీసు అయిన మావయ్య (శివాజీరాజా) వుంటాడు. అతడి కూతురు  జమున (రేజీనా) సినిమాల్లో కొరియో గ్రాఫర్ (వైవా హర్ష) కి అసిస్టెంట్ గా వుంటుంది.  ఇంకో ఘరానా దొంగ కిరణ్ రెడ్డి ( ప్రగ్యా) వుంటుంది. ఓ పోలీస్ కమీషనర్ గా రామబ్రహ్మం (ప్రకాష్ రాజ్) వుంటాడు. ఇతడికో  కొడుకు మత్తుబానిస అయిన రాహుల్ (తనీష్)  వుంటాడు. ఈ రాహుల్ రామారావ్ వల్ల ఓసారి అవమానపడి  అవకాశం కోసం చూస్తూంటాడు. మరోసారి రామారావ్ రాతపరీక్ష పాసవుతాడు. ఇక ఇతర పరీక్షలకి వెళ్తున్నప్పుడు రాహుల్ అడ్డుకుంటాడు. ఆ పరీక్షలకి వెళ్ళలేకపోయిన రామారావ్, మావయ్య మాటలతో పోలీసుకాని పోలీసు అవుతాడు. ఓ పోలీసు యూనిఫాం వేసుకుని తిరుగుతూంటాడు. ఇది చూసి కిరణ్ రెడ్డి అతణ్ణి పట్టుకుని కమీషనర్ రామబ్రహ్మం ముందు ప్రవేశపెడుతుంది. ఈ యూనిఫాం ఎక్కడిదని రామబ్రహ్మం ఇంటరాగేషన్ చేస్తాడు. ఆ యూనిఫాం కనిపించకుండా పోయిన పోలీసాఫీసర్ అలెగ్జాండర్ (సాయి ధరం తేజ్) ది. ఐతే నగరంలో జరిగిన బాంబు పేలుళ్ళ కేసు దర్యాప్తుకి నియమితుడైన అతను ఏమైపోయాడు? ఆ శత్రువులెవరు? దీన్ని రామారావ్ ఎలా పరిష్కరించాడు?...ఇదీ మిగిలిన కథ (?)

ఎలావుంది కథ 
      కథే లేదు. ఏవేవో పోగేసిన గాలి విషయా లున్నాయి. ప్రారంభంలో నగరంలో బాంబు పేలుళ్లు చూపించినప్పుడే ఈ సినిమాకి కాలీన స్పృహ బొత్తిగా లేదని, బద్దకించి అవుట్ డేటెడ్ విషయం చూపిస్తున్నారని, ఏ పాటి రీసెర్చ్ చేశారో తెలిసిపోతోందనీ మనకి అన్పిస్తుంది. మార్కెట్ స్పృహ, క్రియేటివ్ స్పృహా లేకుండా అందరి సమయమూ వృధా చేశారని తోస్తుంది. కనీసం ఓ నాల్గేళ్ళుగా దేశంలో టెర్రర్ దాడులు జరగడం లేదు. టెర్రరిజం కాశ్మీర్ కి పరిమితమయ్యింది. టెర్రరిస్టుల ఎజెండాలు మారిపోయాయి. పాక్ సహా కాశ్మీర్ లో కరుడుగట్టిన వహాబీ ఇస్లాంని స్థాపించాలని చూస్తున్నారు. భారత్- పాక్ లలో వున్నది లిబరల్ సూఫీ ఇస్లాం. ఈ సినిమాలో విషయం ఇంకా ఏనాటిదో గోకుల్ చాట్  పేలుళ్ళ దగ్గరే తిష్ట వేసుకుని వుంది. ఇది చాలనట్టు తర్వాత్తర్వాత మరో రెండు పేలుళ్లు కూడా అలాగే చూపిస్తారు. దీంతోబాటు అక్రమాయుధాల దందా, డ్రగ్స్ స్మగ్లింగ్, బాలల అక్రమరవాణా, దేశభక్తీ  వగైరా వగైరా బోలెడు పాయింట్లతో ఏకసూత్రత అనే కనీస లక్షణాన్నే వదిలేసి, ఏం చెప్తున్నారో అర్ధంగాని పెద్ద గందరగోళాన్నే  సృష్టించారు. కథే లేనప్పుడు కథా ప్రయోజనమూ, సినిమా ప్రయోజనమూ ఏవీ లేవు. 

ఎవరెలా చేశారు
      ఎవరూ  బాగా చేయలేదు. చేసింది నటన అనుకుంటే ఇంతకంటే  నటనకి పట్టిన దుర్గతి వుండదు. ప్రతీ ఒక్కరూ అరిచి లౌడ్ గా మాట్లా
డతారు. బి గ్రేడ్, సి గ్రేడ్ సినిమాల్లో కూడా ఇలావుండదు. కానీ కృష్ణవంశీ కిలాదబాయించి, అరిచి గోలగోలగా  మాటాడితే తప్ప అది
నటన 
లా అన్పించదు. సినిమా మొదలయ్యింది లగా యత్తూ  చివరి షాటు వరకూ, రెండు గంటలా 47 నిమిషాలూ,  ఎవరో రాజకీయ నాయకులు  మైకులు పెట్టి ఒకటే  అరుస్తున్నట్టు వుంటుంది డైలాగులమీద డైలాగుల మోత. దీనికి తోడూ దాదాపు ప్రతీ ఆల్టర్నేట్ సీనులో ఇరవయ్యేసి, ముప్పయ్యేసి మంది గుంపులు గుంపులుగా జనం వుంటారు. ఎక్కడా కాస్త  రిలీఫ్ అనేదే వుండదు. నరాలమీద భరించలేని సమ్మెట పోట్లు. కృష్ణవంశీ దృశ్య, శబ్ద కళల కి జోహార్లు అర్పించాలి. 

     సందీప్ కిషన్ రామారావ్ పాత్ర ఏం చేయాలో కొలిక్కి రావడానికే ఫస్టాఫ్ గంటంపావంతా పట్టింది. ఇక్కడ బాంబు పట్టుకుని చావబోవడం, ముగింపులో మళ్ళీ విలన్ కట్టిన బాంబులతో మానవ బాంబుగా మారి రక్షించమని గగ్గోలు పెట్టడం అనేది హీరోగారి పాత్రచిత్రణ. సెకండాఫ్ గంటన్నరలో దాదాపు గంట వరకూ  తనెక్కడున్నాడో  మర్చిపోతాం- సుదీర్ఘంగా సాయి ధరమ్  ఫ్లాష్ బ్యాక్, అందులో విలన్ కట్టిన బాంబులతో ఎంతకీ ముగియని అతడి చావు తతంగమూ ఇవే ఆక్రమిస్తాయి. ఇదొక చేతకాని పాత్ర.

     పై రెండు పాత మూస ఫార్ములా పాత్రల్లాగే ప్రగ్యా జైస్వాల్ దొంగగా వుంటూ పోలీసుగా బయటపడడం ఇంకో పురాతన –పురావస్తు శాలలోంచి వొళ్ళు దులుపుకుని బయటికొచ్చిన  అయోమయపు పాత్ర. అన్నీ పాత సినిమా మూస పాత్రలే, ఈ కాలపు సహజ పాత్రలు కానరావు. రేజీనా అంగాంగ ప్రదర్శనా వైభవమే నటన అనుకుని చాలా పాటు పడింది పాపం ఆ కళలో. ఏమీ చెయ్యని పాత్ర కూడా గొప్ప పాత్రే అనునుకుని వగలుపోయింది. 

      ఇక ప్రకాష్ రాజ్ అయితే అందరి కంటే పెద్ద లౌడ్ స్పీకర్. దేశం గురించి, పోలీసుల  గురించి, ప్రజల గురించీ చెవులు పగిలేలా  అన్నన్ని భీకర  కేకలు వేసే తన ఇంట్లోనే రేపిస్టు, డ్రగ్గిస్టు, శాడిస్టు, సైకో కిల్లర్, మాఫియా, స్మగ్లర్, టెర్రరిస్టుల తొత్తూ అయిన కొడుకు వున్నాడని, బ్లాక్ అండ్ వైట్ సినిమాల్లోలాగా ముగింపు సీను వరకూ తెలుసుకునే పాపాన పోడు. ఇలా వుంది ఈ పాత్ర చిత్రణ కూడా ఈ రోజుల్లో. 

     తులసి, శివాజీరాజాలది చీప్ గోల కామెడీ.  బొత్తిగా సున్నితత్వం లేని తోలు మందం  వ్యవహారం. సాంకేతికంగా చూసినా కూడా చాలా దిగదుడుపు.  కెమెరావర్క్ మరీ చీప్ గా వుంది ఏకత్వం కూడా లేకుండా. సంగీతమూ డిటో. ప్రతీ రెండో సీనూ పరమ హింసాత్మకంగా వుంటుంది. మాటాడితే పోరాటాలకి దిగుతారు. ఒకటే కొట్టుకుంటారు. దాదాపు ముప్పాతిక సినిమా ఫైట్ మాస్టర్ల పనే అన్నట్టు వుంటుంది. దర్శకుడి పనేమిటో అర్ధంగాదు. కిందటి శతాబ్దంలో తమిళ డబ్బింగ్ యాక్షన్ సినిమా లొచ్చేవి – కుక్కలు గుర్రాలూ కౌబాయ్ ల ఎడతెరిపి లేని ఫైట్లతో. కృష్ణవంశీ దీన్ని మళ్ళీ కళ్ళకి కట్టారు. 

చివరికేమిటి?  
       పోలీసులు గొప్పోళ్ళే . అందరికీ తెలిసిందే. అయితే ఏమిటి? ఎన్నిసార్లు అదే డబ్బాకొడతారు సినిమాల్లో? వూర మాస్ డైలాగులతో కృష్ణవంశీ లాంటి స్థాయి వున్న దర్శకుడు కూడా డబ్బా కొట్టమేమిటి- నీటుగా చేతలు చూపించకుండా?  ఈకాలపు సినిమా ఎందుకు తీయలేకపోయారు తను. పోలీసు హీరోకి హనుమంతుడి ఇమేజి ఇస్తే,  అతనేం చేశాడు రెండు సార్లూ- మెడకి బాంబులు తగిలించుకుని ఒకటే మొత్తుకు న్నాడు. వాయు
పుత్రుడి వ్యాపకం ఇదేనా? ఇంకో పెద్ద పోలీసాయనేమో ఏమీ చేయకుండా కూర్చుని అరుపులు అరుస్తూంటాడు. మరో యువపోలీసాఫీసర్ ఏదో చావడానికి కూడా అల్లరల్లరై,  బతికించమని బతిమాలుకుని మరీ చస్తాడు. వీళ్ళా పోలీసులు? అసలు చెప్పాలనుకున్న దేమిటి, ఏం చెప్పారు? ఏమీ చెప్పలేదు. ఎందుకంటే....

     కథే  చెప్పాలనుకుంటే ఇదంతా, ఇంత గందరగోళమంతా  వుండదు. చెప్పాలనుకున్నది ‘గాథ’  అయింది. లేదా చెబుతున్నది ‘గాథ’ అని తెలియక చెబుతూ కూర్చున్నారు. ‘మొగుడు’ తో గాథే  ఫ్లాప్ అయ్యింది. వెంటనే ‘పైసా’తో మళ్ళీ గాథే ఫ్లాపయ్యింది. ముచ్చటగా మూడోసారి, నక్షత్రమూ గాథే అయింది. నేర్చుకున్న పాఠమేమిటి? ముచ్చటగా మూడుసార్లు గాథలు తీసిన కృష్ణ వంశీ అని గోడ మీద వ్రాత. మూడు గాథలు- ఆరు వెతలు అని తలవ్రాత. 

     ‘గాథ’ తో అంతంత కమర్షియల్ సినిమాలెలా తీయడానికి సాహసిస్తారు. ‘గాథ’ గాబట్టే అంజనీపుత్రుడైన గాలి హీరోకి గోలీ మార్ గా గోల్ లేదు. పాసివ్ ఆట బంతి అయిపోయాడు. గోల్ లేకపోతే  స్ట్రక్చర్ వుండదు. కృష్ణవంశీ స్ట్రక్చర్ అని దేన్ని అనుకుంటున్నారో. స్ట్రక్చర్ ఏర్పడకపోతే ఏం చెప్తున్నారో అంతుపట్టదు. అనేక విషయాలు చొరబడి పోతాయి. ఇలా ఎటుపోవాలో అంతు పట్టక జీడిపాకంలా సాగుతూ సాగదీస్తూ మూడు గంటలకి చేరింది. హీరో చేయాల్సిన పనులన్నీ  ఎవరెవరో చేసేస్తున్నారు. ఇలా ఇంత జరిగాక, ఇప్పుడు  ‘నక్షత్రం’ తర్వాత కూడా గాథేతోనే ఇంకోటి తీస్తారా? గాథలతోనే కృష్ణవంశీ కాలక్షేపమా? ‘కథలు’ మర్చిపోయారా? లేక రెగ్యులర్ కథలు కాక, అందరికీ భిన్నంగా ఇర్రెగ్యులర్ గాథలతో మార్గదర్శి అవాలనా?

-సికిందర్
http://www.cinemabazaar.in