రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

4, జులై 2017, మంగళవారం

డార్క్ మూవీస్ స్క్రీన్ ప్లే సంగతులు -4




    సినిమాల్ని కేవలం వినోదించడానికే ‘చూస్తాం’, కాబట్టి ‘చదవం’. సినిమాల్ని కేవలం ‘చూస్తున్నప్పుడు’  చాలా ఆణిముత్యాలు చేజారిపోతాయి. సినిమాల్లోని మంచో చెడో పూర్తిగా అనుభవం కాకుండా అరకొర ఫేక్  ‘వినోదం’ తో సంతృప్తి పడిపోతాం. సినిమాల్ని ‘చదువుతూ చూసినప్పుడు’ చాలా ఆణిముత్యాలు దొరుకుతాయి మంచో చెడో. అవి పూర్తి ఆనందాన్నిస్తాయి. మంచికి  ఎలాగూ ఆనందమే, చెడుకి  లోపం పట్టుకున్నామన్నఆనందం. మంచి కనిపిస్తే మనసుకి ఆనందం, చెడు కన్పిస్తే బుద్ధికి ఆనందం. అప్పుడే పరిపూర్ణ ఆనందం. బుద్ధిని ఇంట్లో వదిలి వచ్చి మనసుతో సినిమాలు చూస్తూంటే, ఇంటి  దగ్గరున్న బుద్ధి-  ఒరేయ్ మధ్యాహ్నం నువ్వు కేబుల్ వాడికి డబ్బులు కడతానన్నావ్, ఎక్కడి కెళ్లావ్ రా?... ఒరేయ్ బైక్ వాషింగ్ చేయించడం ఎగ్గొట్టి సినిమా కేసు కెళ్తావా?... ఒరేయ్ వీధి కుక్కలు వెంటాడితే ఈ నైట్ కూడా బైక్ స్పీడు లాగించి చావకు రొరేయ్  ....అని రకరకాల స్క్రోలింగ్స్ ఇస్తూ సినిమాని సరీగ్గా చూడనివ్వదు. అదే బుద్ధిని కూడా సినిమాకి లాక్కొస్తే అది మనసుతో బాటు కూర్చుని బుద్ధిగా సినిమా ఒకటే చూస్తుంది. అప్పుడు పరిపూర్ణ ఆనందం అనుభవం లోకొస్తుంది. ఈ క్షణంలో జీవించు అనే కదా సూక్తి?  జీవించడమంటే మెదడూ మనసూ ఒకటి చేసుకుని అనుభవాల్ని ద్విగుణీకృతం చేసుకోవడమే.      
   
          
సినిమాని చదవడమంటే ఏమిటి? ఉదాహరణకి క్రిందటి వ్యాసంలో చెప్పుకున్న ‘బ్లడ్ సింపుల్’ ఆరవ సీను పెంపుడు కుక్క ఇంట్లోకి రావడంతో ప్రారంభమవుతుంది, హీరోయిన్ ఇంట్లోంచి వెళ్లిపోవడంతో ముగుస్తుంది. ఈ ప్రారంభ ముగింపులు ఎంత అర్ధాన్నిస్తున్నాయి! విశ్వాసం గల కుక్క ఇంట్లోకొస్తూంటే, విశ్వాసం లేని భార్య (హీరోయిన్) ఇంట్లోంచి ప్రియుడితో వెళ్ళిపోతోంది... ఎంత కదిలించే, పోయెటిక్  ప్రారంభ ముగింపులు! ఇదెప్పుడు అర్ధమవుతుంది? వెండి తెర మీద దీన్ని  చూడడమే గాక, చదివి నప్పుడు కూడా. 

          అలాగే ఇదే సీనులో హీరోయిన్ రివాల్వర్ కోసం చాలా హేండ్ బ్యాగులు వెతుకుతుంది. ఎందుకు అన్ని బ్యాగులు వెతకాలి. ఓ రెండు బ్యాగులు, ఆ తర్వాత పెట్టెలు, సొరుగులూ వెతికినట్టు చూపించ వచ్చుగా? అలా చూపిస్తే అది సినిమా జ్ఞానం అన్పించుకుంటుందా? సినిమా జ్ఞానం లెక్కలు వేరే వుంటాయి.  ఏది చూపించినా అది పాత్రకో కథనానికో ఉపయోగపడాలి. ఒక సీను మూల సూత్రమేమిటి? పాత్ర గురించి సమాచార మివ్వడమో, లేదా కథని ముందుకి నడిపించడమో కదా? లేదూ ఈ రెండూ చేయడం కూడా కదా? అప్పుడు ఈ సీనులో హీరోయిన్ క్యారక్టర్ గురించి చెప్పాల్సింది ఏదైనా మిగిలుంటే అది చెప్పడానికే ప్రాధాన్యమిచ్చారు ఇక్కడ కోయెన్ బ్రదర్స్.

          బోలెడు హేండ్ బ్యాగులు పడేసి, అవే వెతుకుతున్నట్టు చూపిస్తే, అన్నేసి బ్యాగుల్ని చూస్తున్న మనకి, ఆమె బాహ్య చర్యలకి ( వివాహేతర సంబంధం పెట్టుకోవడం), లోపలి మనస్తత్వం తెలుస్తోంది. సైకలాజికల్ గా ఈ హేండ్ బ్యాగుల అబ్సెషన్ ని బట్టే  తను ఇంటిపట్టున వుండే మనిషి కాదని చెప్పకనే చెప్తోంది...

          ఇది ముందే చూపించకుండా ఇప్పుడెందుకు చూపిస్తున్నారు దర్శకులు? అసలు మూడో సీనులో మోటెల్ లో ప్రియుడితో ఈమె ఫలానా ఈ రకమని చూపించేశాక, ఇంకా ఈమె అంతరంగాన్ని ఫిజికల్ గా ఎస్టాబ్లిష్ చేయడం అవసరమా? చేస్తేనే ఈమె పాల్పడుతున్న చర్యల్ని పక్కాగా నమ్మగలం. మానసిక స్థితే  భౌతిక స్థితికి సర్టిఫికేట్ ఇస్తుంది. ఇక ఇదిప్పుడే ఎందుకు వెల్లడి చేయాలంటే,  ఇప్పుడు ఫైనల్ గా ఇల్లు వదిలి వెళ్ళిపోతోంది గనుక. ఇల్లువదిలే ఘట్టంలోనే స్వాభావికంగా ఆమె ఎలాటి మనిషో వెల్లడించడం సీనుకి చైతన్యం తెచ్చే డైనమిక్స్.

          2000 లో జేమ్స్ మొనాకో ‘హౌ టు రీడ్ ఏ ఫిలిం’ అని గొప్ప గ్రంథం రాశాడు. దీని పీడీఎఫ్ ఫ్రీ డౌన్ లోడ్ చేసుకోవచ్చు. సినిమాల్ని చదివే (స్క్రిప్టులు కాదు, స్క్రీన్ మీద) పధ్ధతి తెలుస్తుంది.
***

ఆర్డర్ లో సీన్ 7 లోకి వెళ్తే, రే బార్ కెళ్ళి జీతం డబ్బులు అడిగి మార్టీ ని రెచ్చ గొట్టడం.
      ఈ సీను ప్రారంభం  స్క్రిప్టు కీ, చిత్రీకరణకీ తేడా వుంది. స్క్రిప్టులో రే నేరుగా బార్ లోకి వచ్చి బార్ టెండర్ మారీస్ ని కలిసినట్టు  రాశారు. చిత్రీకరణలో మారీస్ ఫ్రెండ్ దెబ్రాతో మళ్ళీ అదే అగ్నిపర్వతాల  గురించి మాట్లాడుతూంటే, రే వస్తాడు. చిత్రీకరణలో చేసిన ఈ మార్పు మంచి డైనమిక్సే. బద్ధలవబోయే అగ్నిపర్వతంలా వున్న మార్టీ దగ్గరకి రిస్కు చేసి రే వచ్చిన అర్ధంలో వుంది. వెనక సీనులో బార్ కి వెళ్లనని  ఎబ్బీ కి చెప్పాడు. బార్ కే  వచ్చాడు. ఇప్పుడు మారీస్ తో మాట్లడుతోంటే,  బ్యాక్ గ్రౌండ్ లో ఒక లోగో కన్పిస్తూంటుంది. అది మార్టీ హంటర్ షూ లోగో. అంటే బూటు కాలితో కిక్ ఇవ్వబోతున్నాడా  మార్టీ ఇప్పుడు రేకి ? ఇలా ఒక ప్రశ్న రేకెత్తిస్తూ సీను ప్రారంభిస్తున్నారు కోయెన్ బ్రదర్స్. 

          కొంత సంభాషణ జరిగాక, మార్టీ వున్నాడా-  అని మారీస్ ని అడుగుతాడు.  లేడు - నిన్నకూడా లేడు , వెనక ఆఫీసులో అసలే లేడు - అని చెప్పేస్తూంటాడు మారీస్. రే థాంక్స్ చెప్పి వెళ్లిపోతూంటే,  ఎందుకు థాంక్స్? అంటాడు మారీస్ అర్ధంగాక. తను చెప్పిందాంట్లోనే సమాధానం వుందని తెలీదు- వెనక ఆఫీసులో అసలే లేడంటే ఏమనుకోవాలి? 

          ఇప్పుడు బార్ బ్యాక్ సైడ్ ఓపెన్ చేస్తే, తెరచి వున్న బ్యాక్  ఆఫీసు ‘డోర్ ఫ్రేం’ బ్యాక్ డ్రాప్ లో కూర్చుని మార్టీ, ఆఫ్ స్క్రీన్ లో తదేకంగా దేన్నో చూస్తూంటాడని రాశారు. ఇక్కడ ‘డోర్ ఫ్రేం’ అనే నోయర్ ఎలిమెంట్ ని వాడారు. డోర్ ఫ్రేం నేపధ్యంలో పాత్రని చూపించడమంటే పాత్ర బందీ అయినట్టు చెప్పడం. 

          అతను అటు ఏం చూస్తున్నాడో అతడి పాయింటాఫ్ వ్యూలో ఓపెన్ అవుతుందని రాశారు- అటు దూరంగా భగభగ మండుతున్న ఫర్నేస్ లో ఇద్దరు మనుషులు గార్బేజ్ ని వేస్తూంటారు. ఇది మార్టీ గుండె మంటకి ప్రతీక కాదు, అగ్నిపర్వతానికి సింబాలిజం కూడా కాదు. ఎందుకంటే ఆ ఫర్నేస్ లో గార్బేజ్ (చెత్త)  వేసి కాల్చేస్తున్నారు.  మనం ఒకటి అనుకుంటే చాలా నేర్పుగా పాత్రకి అవసరమైన, కథకి అవసరమైన కొత్త డెవలప్ మెంట్ ని దృష్టికి తెస్తున్నారు కోయెన్ బ్రదర్స్. అవును, ఇప్పుడు ఇది చెప్పడమే అవసరం. ఎటూ తేల్చుకోలేక అస్థిమితంగా వున్నట్టు గతంలో చూపించిన మార్టీని ఇప్పుడు ఒక కొలిక్కి తెస్తున్నారు ఇంకా నాన్చకుండా. మన తెలుగు ప్రేమ సినిమాల్లో మనసులో మాట చెప్పలేక హీరోనో, హీరోయినో సినిమా చివరిదాకా ప్రేక్షకుల్ని ఏడ్పించినట్టు గాక- మార్టీ సమస్యని కొలిక్కి తెచ్చి, కథ ముందుకు సాగడానికి ఈ సీనులో ఏర్పాటు చేశారు కోయెన్ బ్రదర్స్. 

        అతను డిసైడ్  అయిపోయాడు. మనసులోని చెత్తంతా ఊడ్చేసి కొలిమిలో కాల్చేస్తున్నాడు!  భార్యతో  ఇక రాంరాం. అదీ అర్ధం! 

          ఈ క్యారక్టర్ మన్నుతిన్న పాములా పడి లేదు. కథ ముందుకు సాగడానికి క్యారక్టర్ డెవలప్ మెంట్ (ఆర్క్) ని కనబరుస్తోంది. మనసులో చెత్త కాల్చేస్తున్నాక ఇప్పుడేమిటి? –అని తదుపరి విషయాన్ని కదుపుతోంది. మనసుంటే ఒక్క సీనులో చెప్పకనే చాలా విషయాలు చెప్పవచ్చు. బోరు కొట్టించకుండా కథ ముందుకు వెళ్తోందనే ఆశాభావాన్ని కల్పించవచ్చు. భార్య గురించి మార్టీ ఫైనల్ వెర్షన్ ఇప్పుడతని మాటల్లోనే తెలుసుకోవచ్చు...

          ఇప్పుడు మార్టీ వెనక డోర్ లోంచి రే వస్తూంటాడని రాశారు. ఆ వస్తున్నప్పుడు అతణ్ణి చూపించడం నడుం వరకే చూపించారు. ఆ డోర్ ఫ్రేం లోనే మార్టీ తో సీను ఓపెన్ చేశాక, ఇప్పుడు అదే  డోర్ ఫ్రేం లోంచి రే వస్తున్నట్టు రాశారు. ఇద్దరూ ఒక చక్రబంధంలో ఇరుక్కుంటున్న మనుషులే నన్నమాట. అదెలా? - అన్న ప్రశ్నతో సస్పెన్స్ ని రేకెత్తిస్తున్నారు ఈ తరహా రైటింగ్ తో,  చిత్రీకరణతో. 

          వస్తూనే - మార్టీ? - అంటాడు రే. మోటెల్ లో ఎబ్బీతో వున్నప్పుడు మార్టీ ఫోన్ చేసినప్పుడే అతడికి తెలిసిపోయిందని తెలిసీ రే ఇలా రావడం, పైగా ఎబ్బీని తన ఇంటికి తీసికెళ్ళి పోయే తీవ్ర నిర్ణయం తీసుకునీ రావడం, అదీ జీతం డబ్బుల కోసం – చాలా సిగ్గులేని తనం. ఇలాగే వుంటాయి  నోయర్ పాత్రలు. తాము చేస్తున్నవి నార్మల్ అనుకుంటాయి. 

          మార్టీ ముందుకొచ్చి-  ఓకే,  ఏంటి? – అంటాడు రే. ఏంటి ఏంటి? – అంటాడు  మార్టీ. పీకేశావా నన్ను? కక్ష తీర్చుకుంటున్నావా?- అని రే అంటే, నిజంగా నీతో మాట్లాడాలని లేదు నాకు- అంటాడు మార్టీ. ఓకే, నువ్వు నన్ను పీకేయ్యకపోతే నేనే పని మానుకుని వెళ్లి పోతానంటాడు రే. ఫైన్, నీకు నచ్చింది చెయ్, బాగా ఎంజాయ్ చేస్తున్నట్టున్నావ్ ?- అని కవ్విస్తాడు మార్టీ.  టెన్షన్ గా చూసి, క్షణం తర్వాత రే - ఇలా మాట్లాడ్డం నాకు నచ్చదు- అంటాడు. అయితే దేని కొచ్చావిక్కడికి? –మార్టీ  ప్రశ్న. 

          ఏమాత్రం రాజీపడే ఉద్దేశంలేక- నాకు నువ్వు రెండు వారాల జీతం బాకీ- అనేస్తాడు రే. మార్టీ తలవిదిల్చి- నో, ఆమె చాలా కాస్ట్లీ గుంట...అనుకుని, ఫైనల్ గా రే వైపు చూసి- నేను రీఫండ్ ఇస్తా, అదింకెవర్ని పిండుకుంటోందో చెప్పు- అంటాడు.

          వ్యాపారిలా మారిపోయాడు మార్టీ లాభ నష్టాలు చూసుకుంటూ. ఇప్పుడంతే,  భార్యాభర్తల సంబంధం తెంచుకున్నాక!   భార్య తన షోకులతో ఆర్ధికంగా తనకి చాలా భారమై వుంటుంది. భరించాడు. ఇప్పుడామె ప్రియుణ్ణి  చూసుకుంటే,  ఆ ప్రియుడికి తను జీతం డబ్బులిస్తే,
ఆమెకిచ్చినట్టే. ఇంకా ఆమె మీద వేస్ట్ ఎందుకు చేసుకుంటాడు? అందుకే ఎగ్గొడతాడు. ఇదీ వరస! 

       ఐతే ఒక ఆఫర్ ఇచ్చాడు - నా భార్యని వాడుకుంటున్నందుకు, జీతం రూపంలో నువ్వు వదులుకున్న నీ డబ్బుని నీకు రీఫండ్ ఇస్తా- అదింకెవర్ని పిండుకుంటోందో నువ్వు చెబితే!- అని.   

          ఇవన్నీ కసికొద్దీ అంటున్న మాటలే- పనిలోపనిగా ఎబ్బీ మీద  రే కి  అనుమానాలు రేకెత్తించడం కూడా జెలసీతో!

          నాకా డబ్బుకావాలి, నువ్వింకేదైనా  చెబితే మంచిదే- అంటాడు రే పట్టువదలకుండా. ఎవరనుకుంటున్నావ్ నువ్వు- మ్యారేజ్  కౌన్సెలర్ వా?- అని తిప్పికొడతాడు  మార్టీ. ఈ మాటకి వచ్చీ రాని  స్మైల్ ఇస్తాడు రే. 

          ఇప్పుడు మార్టీలో కోపం పెరుగుతూ-  దేనికి నవ్వుతావ్? ఫన్నీ గైలా కన్పిస్తున్నానా? యెదవలా  కన్పిస్తున్నానా? నో నో నో నో- ఫన్నీగా వున్నది నేను కాదు, ఫన్నీగా వున్నది నీ లవర్. నేను మీ ఇద్దరి మీద నిఘా పెట్టించాను చూడూ అదీ ఫన్నీ. ఎందుకంటే నువ్వు కాకపోతే అదింకొకడితో పడుకునేదే,  కాబట్టీ అదీ ఫన్నీ. నీకింకా చాలా ఫన్నీగా ఎప్పుడన్పిస్తుందంటే, ఏంటీ రే నువ్వు మాట్లాడుతున్నదీ... ఫన్నీగా నేనేం  చేశాననీ? అని అమాయకంగా అది మొహం పెట్టి అంటుంది చూడూ, అప్పుడూ! – అని కసికసిగా అనేస్తాడు. 

          ఈ డైలాగులతో ఇక్కడ మనమనుకుంటున్న కథ, పాత్రలు చాలా వూహించని మలుపులు తిరగడం ఆశ్చర్యమేస్తుంది...
      ఇప్పుడు- ఇప్పుడు- అసలు డ్రామా ఎస్టాబ్లిష్ అవుతోంది. కచ్చితంగా ఎవరేమిటో తేలిపోతోంది. ఎవగింపు కలిగే పాత్ర సానుభూతిని మూట గట్టుకుంటూ, సానుభూతి పొందిన పాత్ర ఏవగింపుని సంపాదించుకుంటోంది...హీరోయిన్ ని నెగెటివ్ గా చూపించడం కమర్షియల్ సినిమా లక్షణం కాదని చెబుతోందీ సీను. చెడ్డది- చెడ్డది- చెడ్డదీ - అనుకుంటున్న హీరోయిన్ పాత్ర గుడ్ అయిపోతోంది, గుడ్ -గుడ్ -గుడ్ -అనుకుంటున్న భర్త పాత్ర చెడ్డదిగా బయటపడుతోంది...

          ఇదీ నిజమైన డ్రామా అంటే. కేవలం ఒక డైలాగు, ఒక నిగూఢార్ధం, ఒక ఎలిమెంట్ మొదలైనవి చాలా మ్యాజిక్కులు చేస్తూ కథని రక్తి కట్టిస్తున్నాయి. 

          ఇప్పుడు మార్టీ వెళ్లగక్కుకుంటున్న అక్కస్సుతో మనకేమైనా సానుభూతి కలుగుతోందా? అస్సలు లేదు. ఫూలిష్ గా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే,  రెండవ సీన్లో వర్షంలో కారులో పోతున్నప్పుడు- మా ఆయన మూడీగా అదోలా వుంటాడు- అని రే తో అంది ఎబ్బీ. అదీ డబ్బున్న మార్టీ ని వదిలేసి, సామాన్యుడైనా సరే రే ని చూసుకోవడానికి ఆమెకి గల కారణం! 

          మార్టీ ఏమో అది నా డబ్బుని ఎంజాయ్ చేసి హేండ్ ఇచ్చిందను కుంటున్నాడు. ఆమెకి డబ్బే ముఖ్యమనుకుంటే మార్టీ డబ్బునే  ఎంజాయ్ చేస్తూ మార్టీతోనే వుండేది. డబ్బుకన్నా మానసిక తృప్తే ముఖ్యమనుకుంది గనుక, అది మూడీ మార్టీతో లభించక హేండ్ బ్యాగుల అబ్సెషన్ మొదలై,  బయట షికార్లు కొట్టింది. ఇంట్లో సుఖమంటే బయట షికార్లు ఎందుకు తిరుగుతుంది. కాబట్టి ఆమె హేండ్ బ్యాగుల అబ్సెషన్ కి అసలు కా మేమిటో ఇప్పుడు బయట పడ్డాక- సానుభూతి ఆమెకి లభిస్తుంది. డబ్బులేని వాడు రే అయినా సరే అతడితో వెళ్ళిపోయింది...దీనికంతటికీ బాధ్యుడైన మార్టీ మంచి వాడనే పేరుని కోల్పోయాడు.

          మార్టీ అక్కస్సుతో,  రే చేస్తున్నది తప్పనిపించదు ఈ డైలాగుల తర్వాత. ఇలా మంచి వాళ్ళెవరు- చెడు ఎవరు - బలాబలాల సమీకరణ ఫైనల్ గా ఈ సీనుతో పూర్తయింది. భార్యతో వుండే అర్హత మార్టీకి లేదు, రేకే వుందని లాజికల్ గా సమర్ధిస్తూ. 

          ఇక ఫైనల్ గా తేల్చి చెప్తున్నప్పుడు మార్టీ అగ్నిపర్వతం బద్దలైనట్టే బరస్ట్ అవుతాడు. మాట్లాడకుండా వెళ్ళిపోతాడు రే. మళ్ళీ ఇటు వస్తే షూట్ చేస్తానంటాడు మార్టీ. ఇదంతా ప్రేలాపనే అన్పిస్తుంది మనకి.

          ఈ సీనుతో కథలో టెన్షన్ తీవ్రత కూడా పెరిగింది. అంటే టైం అండ్ టెన్షన్ థియరీ అమలవుతోంది. స్క్రీన్ టైం గడిచేకొద్దీ అంతకంతకూ కథలో టెన్షన్ పెరుగుతూ పోవడం టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ ని ఏర్పరుస్తుంది. సీను సీనుకీ టెన్షన్ ఎంతెంత పెరుగుతోందో ఈ గ్రాఫ్ ద్వారా మానిటర్ చేయడం  ముఖ్యం!

- సికిందర్  
http://www.cinemabazaar.in/
         





         



        
         

                                   














         

2, జులై 2017, ఆదివారం

డార్క్ మూవీస్ స్క్రీన్ ప్లే సంగతులు -3





   ర్వసాధారణంగా ఒక కంగారు వుంటుంది. తక్కువ పాత్రలతో సీన్ టు సీన్ ఎత్తుకున్న అదే పాయింటుతో సూటిగా సాగుతూంటే కథ సాదాగా వుందని, ఫ్లాటై పోతోందనీ. అందుకని సబ్ ప్లాట్స్ కలపాలని నిర్ణయించుకుంటారు.  కథకి ఉపకథల మణిహారం వేస్తారు. ఇలా కాక ఉన్న కథని ఎలా చెబుతున్నామని కాదు, ఎలా చూపిస్తున్నామని పునరాలోచించుకుని ‘బ్లడ్ సింపుల్’ లాంటి నోయర్ మూవీస్ కుండే పంథాని  అనుసరిస్తే? నిగూఢార్ధాలు చూపిస్తున్నప్పుడు ఇంకా ఉపకథలు అవసరపడతాయా? చిన్న కథే అయినా క్షణం క్షణం ఆలోచింపజేయకుండా, జీవం నింపకుండా వెండితెర మీద తీసికెళ్ళి పడేస్తే,  ఎన్ని ఉపకథలైనా దాన్ని కాపాడుతూ కూర్చుంటాయా?  కథనంలో నాటుతున్న నిగూఢార్ధాలు, బలమైన పాత్ర చిత్రణలు, సైకలాజికల్ ట్రాక్ లు  ‘బ్లడ్ సింపుల్’ ఒక్కోసీనుని ఎంత సార్ధకం చేస్తున్నాయో గమనిస్తూ వస్తున్నాం. సబ్ ప్లాట్స్ లేకపోయినా  ఈ చిన్న కథ కళాత్మక విలువలతో కూడిన ఎలిమెంట్స్ తోనే ఎంత బలంగా, వ్యాపారాత్మకంగా మారిందో  ఇంకా గమనిద్దాం...      

          నిన్నటి నాల్గవ సీనులో డిటెక్టివ్ విస్సర్ తన ఫిలాసఫీని ఎలా వర్కౌట్ చేసుకుని బాగుపడుతున్నాడో గమనించాం. ప్రారంభంలో అతడి స్వగతమే అతడి ఫిలాసఫీ. అవసరం కొద్దీ నిన్ను ఆశ్రయించిన వాళ్ళని నీ అవసరాలకి వాడుకుని విసిరిపారేయ్ -అనే ఫిలాసఫీని  చక్కగా వర్కౌట్ చేసుకుంటూ, చూసి రమ్మంటే కాల్చి వచ్చాడు. ఆ ఫోటోలతో మార్టీని తన అవసరాలకి వాడుకోవాలని ఉద్దేశం. మార్టీ ఇల్లు కాలి ఏడుస్తూంటే దానికి ఫ్రేము కట్టి చూపిస్తున్నాడు విస్సర్. నిజానికి ఆ ఫోటోలకి భయపడకూడదు మార్టీ. భార్య మీద సాక్ష్యాలు సంపాదించి విడాకులకి పోవాలనుకుంటే,  ఈ ఫోటోలు బాగానే  పనికొస్తాయి. కానీ అతను భార్య గురించి మనసు మార్చుకున్నాడు, కనుక ఈ ఎఫైర్ బయటపడకూడదని విస్సర్ కి లొంగి డబ్బిచ్చాడు. మళ్ళీ రావద్దన్నాడు. ఇక్కడ దర్శకులు ఒక పాయింటుని ఉపేక్షించారు. మార్టీ నెగెటివ్ లు అడగలేదు. మళ్ళీ ప్రింట్లు తీసి బ్లాక్ మెయిల్ చేయవచ్చు విస్సర్. 

          కానీ భార్య చేస్తున్న తప్పుకంటే మార్టీ చాలా పెద్ద తప్పే చేశాడు విస్సర్ ని ఆశ్రయించి. విస్సర్ ప్రొఫెషనల్ డిటెక్టివ్ అయితే, ప్రొఫెషనల్ గానే  మార్టీ కి రిపోర్టిచ్చి ఫీజు తీసుకుని వెళ్ళిపోతాడు. అంతేగానీ డబుల్ క్రాస్ చెయ్యడు. కానీ విస్సర్ అసాంఘీక శక్తిగా మారాడు వృత్తిని ఉపయోగించుకుని. డబుల్ క్రాస్ మరిగాడు. అసాంఘీక శక్తుల సాయం కోరడం ఎంత తప్పో, మధ్యలో మనసు మార్చుకుని తప్పుకోవాలనుకోవడం అంతకంటే పెద్ద తప్పే అవుతుంది.  ఏ అసాంఘీక శక్తి వూరుకోదు మధ్యలో తప్పుకుంటానంటే. అయితే ఇప్పుడు భార్య గురించి మనసు మార్చుకుని, తను చేసుకున్న రొష్టు లోంచి బయటపడాలనుకుని మార్టీ ఇలాగే వుంటే విస్సర్ ఏం చేసేవాడో గానీ, వెళ్లి వెళ్లి మళ్ళీ మార్టీ ఇంకో అవసరానికి విస్సర్ నే ఆశ్రయించడం అతి ఘోరమైన తప్పు....ఇదెలా జరుగుతుందో ఇక ముందుముందు చూద్దాం...

5. బార్ లో మార్టీ బార్ టెండర్  ఫ్రెండ్ తో విచిత్రంగా ప్రవర్తించడం. 
      నాల్గవ సీను ఫ్లాష్ బ్యాకుగా చూశాం,  దాని  కొనసాగింపే ఈ ఐదో సీను. నాల్గో సీను చివర్లో మార్టీ అద్దంలోంచి బార్ లోకి చూస్తాడు. ఒకతను బల్లలెక్కి  పోతున్న దృశ్యం కనపడుతుంది. ఇప్పుడు ఐదో సీనుకి కట్ చేస్తే, ఆ బల్లలెక్కిపోతున్న అతను  ఇటు అదే అద్దంలో కన్పిస్తూంటాడు. మార్టీ ఆఫీసులోంచి చూస్తే  ఇది ప్లెయిన్ గ్లాస్,  బార్లోంచి చూస్తే మిర్రర్. నోయర్ మూవీస్ లో మిర్రర్స్ కూడా ఒక ఎలిమేంటే అని తెలుసుకున్నాం. ప్రేక్షకుల్ని కన్ఫ్యూజ్ చేయడానికి, పాత్ర స్ప్లిట్ పర్సనాలిటీ అయితే అది చెప్పడానికీ మిర్రర్స్ ని వాడతారు. 

          ఇక్కడ కన్ఫ్యూజ్ చేయడానికే వాడారు. ఈ సీనులో పెద్దగా ఆశ్చర్యాలు లేవు. కాబట్టి మిర్రర్ తో ఒక ఝలక్ ఇస్తూ సీను ఓపెన్ చేశారు. ప్రేక్షకులు అవులించేట్టు సీన్లు వుండ  కూడదని ఉద్దేశం. ఆ జంప్ చేస్తూ తిరుగుతున్న అతను బార్ టెండర్ మారీస్. అతను ఎవరెవరికి ఏం కావాలో చూసి, హడావిడి చేసి, జ్యూక్ బాక్సులో సాంగ్ వేసి, ఒంటరిగా కూర్చుని బ్రాందీ సిప్ చేస్తున్న ఒకమ్మాయి దగ్గర కొస్తాడు. వచ్చి కూర్చుని, ‘ఎక్కడిదాకా వచ్చాను?’ అంటాడు. 

          రింగ్ ఆఫ్ ఫైర్ గురించి చెప్తున్నావ్ –అంటుంది. అందుకుని చెప్పడం మొదలెడతాడు మారీస్. అంటే ఇంతకి ముందు నుంచే వీళ్ళు మాట్లాడుకుంటూ వున్నారన్నమాట. ఇలాకాక ఇప్పుడే ఆమెని చూసినట్టు పలకరించడం, బొట్టు పెట్టి కబుర్లకి కూర్చోబెట్టడం లాంటి ఇంట్రడక్షన్ అంతా కథనం మీద పట్టులేని తనం కింది కొస్తుంది. ఆల్రెడీ వాళ్ళు కబుర్లలో వున్నారని హాల్ఫ్ వేలో సీను నడిపిస్తే,  ఏ విషయం మాట్లాడుతున్నారో ఆ విషయం మీదికే నేరుగా వెళ్ళిపోయి ఆసక్తి రేపవచ్చు- టైం సేవ్ చేయవచ్చు. 

          రింగ్ ఆఫ్ ఫైర్ గురించి చెప్తున్నావ్ – అని ఆమె అనేసరికి అతను  కొనసాగించడం మొదలెడతాడు. ఇక్కడ వీళ్ళు మాట్లాడుకుంటున్న విషయం కూడా పరోక్షంగా  కథనే తెలియ జేస్తోందని గమనించాలి. ఏదీ కాలక్షేప బఠానీగా లేదు ఈ కథనంలో. మారీస్ చెప్పుకుపోతున్నప్పుడు ఆమె జియాలజిస్టు అని తెలుస్తుంది. కాబట్టి ఒక జియాలజిస్టుగా అగ్నిపర్వతాలు పేలితే ఎంత శక్తిని విడుదల చేస్తాయో చెప్పమంటున్నాడు. ఆ శక్తితో లాస్ వెగాస్ నగరంలో ఎన్నేళ్ళ పాటు విద్యుదీపాలు వెలిగించుకోవచ్చు? 

          గొప్ప ఆశావాది. అప్పుడు వస్తూంటాడు అగ్నిపర్వతం లాంటి మార్టీ. ఇది డైనమిక్స్. డైలాగుతో మ్యాచయ్యే డైనమిక్స్. తెలుగులోనైతే- ఒకడున్నాడు, వస్తాడు, వచ్చేస్తున్నాడు- అని రాస్తారు టెంప్లెట్ ముందు పెట్టుకుని. వచ్చి, రే ఇంకా రాలేదా?- అంటాడు మార్టీ.

          ఇదేమిటి, రే మోటెల్ లో ఎబ్బీతో వున్నాడని తెలుసుగా?  అంటే సంధి చేసుకుంటున్నాడా సమస్యతో... రే గురించి ప్రశ్నోత్తరాలు అయ్యాక, ఆ అమ్మాయికేసి చూస్తాడు. ఆమె తన ఫ్రెండ్ దెబ్రా అని పరిచయం చేస్తాడు మారీస్. కౌంటర్ లో ఎవరో ఎదురు చూస్తున్నారు వెళ్ళమంటాడు మార్టీ. మారీస్ వెళ్ళిపోయాక, దెబ్రాతో మాటలు కలుపుతాడు. మారీస్ ఎప్పట్నించీ తెలుసు?- అంటాడు. పదేళ్లుగా తెలుసంటుంది.

          అప్పుడు మార్టీ ఏటో దిక్కులు చూస్తున్నట్టుగా రాశారు కోయెన్ బ్రదర్స్. దిక్కులు చూసి,  ప్రత్యేకంగా దేని గురించీ అని కాకుండా ఓ రెండు సార్లు తలూపి- ఆమెతో అంటాడని రాశారు- ఈ నైట్ నీ ప్రోగ్రాం ఏమిటి? 

          మారీస్ తో ఔటింగ్  కెళ్తున్నానని అంటుంది. తలనొప్పిగా వుందని చెప్పమంటాడు. సరేనంటుంది. అప్పుడు మొహం దగ్గరగా పెడుతూ, మనం సరీగ్గా కమ్యూనికేట్ అవడం లేదంటాడు. ఆమె రియాక్ట వుతుంది. చీవాట్లు పెట్టి, ఇప్పుడు కమ్యూనికేటయ్యాను పొమ్మంటుంది. మారిస్ రావడంతో, మార్టీ వెళ్ళిపోతూ- రే వస్తే తను లేడని చెప్ప
మంటాడు...

          ఈ ప్రవర్తనకి అర్ధమేమిటి? మనిషి స్థిమితంగా లేడు. క్షణం క్షణం మారిపోతున్నాడు. ఎటూ తేల్చుకోలేక పోతున్నాడు. భార్య పరాయి మగాడితో వుంటే ఏ మగాడైనా స్థిమితంగా వుండలేడు. ప్రేమకొద్దీ ఆమెతో రాజీపడితే చులకనై పోతాడేమో తెలీదు. లోలోపల మార్టీ నలిగిపోతున్నాడు- ఆ  నలుగుడులోంచే ఈ  సైకో లాంటి ప్రవర్తన. అక్కడ బార్ టెండర్ తన భార్యతో సరసాలడుతూంటే, ఇక్కడ ఈ బార్ టెండర్ ఫ్రెండ్ తో తను ఫ్లర్ట్ చేసి కచ్చి తీర్చుకోబోవడం...  ఇలాటి పరిస్థితుల్లో సైకో కిల్లర్స్ అయితే బార్ టెండర్స్ భార్యల్నీ, గర్ల్ ఫ్రెండ్స్ నీ చంపుకుంటూ పోతారు. తానెదుర్కొంటున్న పరిస్థితిలో పాత్ర నిండా సింక్ అయినప్పుడే ఇలాటి బలమైన సన్నివేశాలొస్తాయి.
          ఈ సీను మార్టీ సైకలాజికల్ ట్రాకు ప్రోగ్రెస్ చూపించడానికి రాశారు.
***
6. ఎబ్బీ  రివాల్వర్ తీసుకుని మార్టీ ఇంటినుంచి రే తో వెళ్ళిపోవడం 
         మార్టీ ఇంట్లో సీను వివరం ఇలా రాశారు- 

          జర్మన్ షెపర్డ్ హాల్లో నడుచుకుంటూ హాలు చివర వార్మ్ లైటింగ్ వున్న రూము వైపు వెళ్తూంటుంది. దాని అడుగుల చప్పుడు, లీలగా బిలియర్డ్ బాల్స్ చప్పుడూ వినపడుతూంటాయి.
          బిలియర్డ్ రూం లో ఓపెన్ చేస్తే- ఇది గోడలకి పానెల్స్ తో, కింద కార్పెట్ తో, బ్లాక్ లెదర్ ఫర్నీచర్ తో, ఒక తొమ్మిదడుగుల బిలియర్డ్ టేబుల్ తోనూ  వుంటుంది. రూంలో రకరకాల జంతు కళేబరాల ట్రోఫీలుంటాయి. వాటిలో ఒక దుప్పి కూడా వుంటుంది. రే ఒంటరిగా బిలియర్డ్స్ ఆడుతూంటాడు. ఒక వెలిగించని సిగరెట్ అతడి నోట్లో వుంటుంది. రూం చాలా నిశ్శబ్దంగా వుంటుంది. డోర్లోంచి జర్మన్ షెపర్డ్ రావడాన్ని నిశ్శబ్దంగా చూస్తాడు.
 


         పై రెండు పేరాలకి అర్ధం  ఒకసారి చూస్తే, పెంపుడుకుక్క (జర్మన్ షెపర్డ్) హాల్లో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు నోయర్ ఎలిమెంట్ కమ్మేసి వుంటుంది. పక్కన కిటికీలకి అమర్చిన వెనీషియన్ బ్లయిండ్స్ లోంచి వెలుతురు కిరణాలు  ఇటు గోడల నిండా కటకటాల్లాంటి నీడల్ని ఏర్పరుస్తూంటాయి. మోటెల్ లో సీను తర్వాత ఇది మళ్ళీ ఒకసారి బార్స్, డయాగోనల్ఫ్రేమ్స్ వితిన్ ఫ్రేమ్స్ షాట్స్ ఎలిమెంట్ లోని ‘బార్స్’ భాగం. ఈ వర్ణన స్క్రిప్టులో ఇవ్వలేదు గానీ చిత్రీకరణలో వుంది. కటకటాల నీడల్ని ఏర్పర్చే వెనీషియన్ బ్లయిండ్స్ నోయర్ మూవీస్ లో కామన్. అంటే ఒక విపత్తులో ట్రాప్ అవబోతున్నారనేం సూచన.  

          పెంపుడు కుక్క ఇలా కటకటాల్లాంటి నీడల మధ్య నడుచుకుంటూ పోతోందంటే దానికి  విపత్తా? కథలో ఇది కొత్త సంగతి కదూ? ఎవరి వల్ల విపత్తు? లవర్స్  రే - ఎబ్బీలతోనా?  మరి  ఈ పెంపుడు కుక్క ఈ కటకటాల్లాంటి వాతావరణంలోంచి అటు ‘
వార్మ్ లైటింగ్’ వున్న రూము వైపు పోతోందని రాశారే? అంత నులి వెచ్చని గాఢ పరిష్వంగ మాధుర్యాన్ని అనుభవించడానికి అది పోతున్నట్టు రాస్తే, అక్కడ రే ఎబ్బీలే కదా వున్నారు? అంటే వాళ్లతో అది అంత వార్మ్ గా, సేఫ్ గా వుండగలదన్న మాట. మరెవరితో నాట్ సేఫ్? ఆ బద్మాష్ డిటెక్టివ్ గాడితోనేనా?  మొదటి షాట్ లోనే ఇంత కథ, ఇంత సస్పెన్స్  పెట్టి చంపారే! ఒకే ఒక్క షాట్ ఇంత కథని, సస్పెన్స్ నీ సృష్టిస్తుందా? వేకప్ టాలీవుడ్ మేకర్స్, వేకప్! కోటి రూపాయలతో బంగారాన్ని ఇవ్వచ్చు జీఎస్టీ బాధిత ప్రేక్షకులకిక,   గిల్టుతో ఇంకా మోసాలు చేయడం కాదు. 

          ఇక ఇక్కడొకసారి 4 వ సీనుని గుర్తు చేసుకుంటే, బార్ లో మార్టీ టేబుల్ మీద కాళ్ళు జాపుకుని కూర్చున్నప్పుడు, కాళ్ళకి హంటర్ బూట్లు వుంటాయి. ఇప్పుడు ఇక్కడ ఇంట్లో చూస్తే ఇన్ని జంతు ట్రోఫీలున్నాయి- అంటే మాంచి వేటగాడే నన్న మాట- వేటగాడికి ఆడదాని విషయంలో మాత్రం గురి లేని బలహీనత,  ఇదీ క్యారక్టరైజేషన్ అంటే.

          ఆ డాగ్ తోకూపుకుంటూ విశ్వాసం ప్రకటిస్తుంది రేకి. రే దాన్ని సున్నితంగా తాకి, ‘ఓపల్’ అని పిలుస్తాడు. ఐరనీ ఏమిటంటే, తన యజమానికి  ఈ రే అనే పనివాడు విశ్వాస ఘాతకుడిగా మారేడని దానికి తెలీదు. 

        పై గదిలో ఎబ్బీ ఏమిటో వెతుకుతూంటుంది. ఒక డబ్బీని తలకిందులు చేస్తే బుల్లెట్లు పడతాయి అరచేతిలో. రెండవ సీనులో మా ఆయన రివాల్వర్ గిఫ్ట్ ఇచ్చాడని చెప్పిందానికి, ఇక్కడ వస్తు రూప సాక్ష్యం. ఏకంగా రివాల్వర్ చూపించలేదు టాలీవుడ్ స్టయిల్లో. సస్పెన్స్ ని సస్టెయిన్ చేస్తున్నారు ముందు బుల్లెట్లు మాత్రమే బయట పెట్టి. బుల్లెట్లు వుంటే రివాల్వర్ కూడా వుండాలి కదా? అది వుందా లేదా? ఇక ఒకటే వెతకడం మొదలెడుతుంది. ఒకవేళ మార్టీ తీసికెళ్ళి పోయి వుంటే!

          కింద హాల్లో రే గోడకున్న పెద్ద పెద్ద ఫోటోలని చూస్తూంటాడు. పైన ఎడాపెడా హేండ్ బ్యాగులు వెతికేస్తూంటుంది ఎబ్బీ ఒకటే నెర్వస్ గా. కింద హాల్లో గోడకి పైన పెంపుడు కుక్క ఓపల్  ఫోటో ఫ్రేము వుంటుంది. కింద ఎబ్బీ, మార్టీల ఫోటోలుంటాయి. తమ జీవితాల్లో ఓపల్ కిస్తున్న స్థానమేమిటో దీన్ని బట్టి తెలుస్తోంది. కెమెరా పాన్ చేస్తూంటే,  కింది వరసలో  ముందుగా  ఎబ్బీ ఫోటో ఫ్రేములో కొస్తుంది, తర్వాత ఎబ్బీ మార్టీ లు కలిసున్న ఫోటో...చివర్లో ఇంకో పాత  ఫోటో వుంటుంది-  ఇద్దరూ బీచిలో దిగిన ఫోటో...ఈ బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో స్విమ్మింగ్ సూటులో వున్న ఎబ్బీని ని సున్నితంగా తాకుతాడు రే. 4 వ సీనులో మార్టీ కూడా బ్లాక్ అండ్ వైట్ ఫోటోలో ఎబ్బీని తాకాడు. ఎబ్బీని మార్టీ కేవలం అలా తాకి వూరుకున్నాడు. ఇక్కడ రే మాత్రం పాదాల దాకా తాకుతూ వెళ్లి- ఈమె నాకే సొంతం అని సిగ్నల్ ఇస్తున్నాడు. ఈ చర్యతో కథలో టెన్షన్ పెరిగింది. ఈ ఆటలో మార్టిన్ ఓడిపోబోతున్నాడా? 




        రే  సిగరెట్టే ముట్టించకుండా నోట్లోనే  పెట్టుకుని  వుంటాడు. సైకలాజికల్ మీనింగ్ : ఏం జరిగినా ఈ  కొంపలో  నిప్పులు పోయదల్చుకోవడం లేదా తను? మరి ఎబ్బీని ఎలా గెల్చుకుంటాడు?  

          చిట్టచివరికి ఒక బ్యాగులో రివాల్వర్ని దొరికించుకుంటుంది ఎబ్బీ. ఆమె గదిలో ఇరవై ముప్ఫై హేండ్ బ్యాగులు పడుంటాయి. ఈ బ్యాగుల హాబీతో ఈమె ఇంటిపట్టున వుండే మనిషి కాదని ఈమె క్యారక్టర్ని ఇప్పుడు స్పష్టం చేస్తున్నారు. 

          ఎబ్బీ వచ్చేసి ఇక పోదామంటుంది. మోటెల్ కి పోదామంటే, లేదు నా యింటికి పోదాం, అక్కడ వుండమంటాడు. తను ఒకచోటికి వెళ్లి వస్తానంటే, బార్ కి మాత్రం వెళ్ళ వద్దంటుంది. మార్టీ ఎలాంటి వాడో నాకు తెలుసు, వెళ్ళ వద్దంటుంది. ఇంకొకర్ని కలవడానికి వెళ్తున్నానంటాడు. దీంతో ఈ సీను ముగుస్తుంది. ఈ రే మార్టీ దగ్గరకి వెళ్తున్నాడన్న సీరియస్ విషయంతో టెన్షన్ పుట్టించే ముగింపు ఇది. ఇలాటి సీన్లు వుంటే ఇంకా సబ్ ప్లాట్స్ అవసరమా?


 (ఇంకా వుంది)
- సికిందర్

1, జులై 2017, శనివారం

డార్క్ మూవీస్ స్క్రీన్ ప్లే సంగతులు -2





     నిన్న ‘బ్లడ్ సింపుల్’ బిగినింగ్ 13 దృశ్యాల కథనం గురించి చెప్పుకోవడం మొదలెట్టాం. ఏ సినిమాకైనా మొత్తం బిగినింగ్ కి సీన్ల కలబోత వుంటుంది. బిగినింగ్ విభాగంలో ఏమేం కలపాల
న్నది బిగినింగ్ చివర్న అంటే ప్లాట్ పాయింట్ – 1  దగ్గర ఏర్పాటు చేసే సమస్యని బట్టి వుంటుంది. కాబట్టి బిగినింగ్ విభాగపు సీన్ల కలబోతని  ప్లాట్ పాయింట్ వన్నే నిర్ణయిస్తుంది. ముందుగా  ప్లాట్ పాయింట్ -1 దగ్గర సమస్యేమిటో నిర్ణయించకుండా బిగినింగ్ విభాగాన్ని రాయడం అసాధ్యం. గమ్యమేమిటో తెలీని ప్రయాణం లాంటిది. విజయవంతమైన సినిమాల సరళిని గమనిస్తే బిగినింగ్ లో పాత్రల్ని పరిచయం చేస్తూ జానర్ నీ, జానర్ సంబంధ నేపధ్య వాతావరణాన్నీ ఏర్పాటు చేశాక,  అప్పుడు ప్లాట్ పాయింట్ –1  అనే బిగినింగ్ ముగిసే గమ్య స్థానాన్ని దృష్టిలో పెట్టుకుని, దానికి దారి తీసే పరిస్థితుల కల్పన చేసుకొస్తారు. 

         
ప్లాట్ పాయింట్ -1 దగ్గర ఏర్పాటు చేసే సమస్య –ప్రేమ ఇష్టంలేని ప్రవల్లిక ప్రఫుల్ ని కొండ మీంచి తోసి పారేద్దామని అనుకుందనుకుందాం- అప్పుడా  కొండ మీదికి తీసికెళ్ళే ఉద్దేశంతో సీన్లు పడుతూంటాయి. సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పనకి ఇంతకి మించి ఏమీ లేదు- ప్లాట్ పాయింట్ -1 తెలిస్తే. మరొకటేమిటంటే,  ఏ కథయినా  ప్లాట్ పాయింట్ -1 దగ్గరే ప్రారంభమ
వుతుంది. కొండ మీంచి తోసిపారేసి ప్రవల్లిక చేతులు దులుపుకున్నాక, సమస్యలో పడ్డ ప్రఫుల్  ఏం చేశాడన్నదే కథ, అంతకి ముందుది కథకాదు. కేవలం కథకి సన్నాహం. బిగినింగ్ లో జరిగేదంతా కథకి సన్నాహాలే. అలాగే సమస్యంటూ- కథంటూ పుట్టాక - ఆ పుట్టిన చోటైన ప్లాట్ పాయింట్-1  కథని ముందుకి నెడుతూ నడిపిస్తుంది తప్ప, మరొకటి కాదు. కథని నెట్టుకుపోయే ప్లాట్ పాయింట్- 1 డ్యూటీ ప్లాట్ పాయింట్ -2 దగ్గర ముస్తుంది. తలెత్తిన సమస్యకి అక్కడో పరిష్కారం చూపించి క్లయిమాక్స్ కి వదిలేస్తుంది. కాబట్టి మొత్తం స్క్రీన్ ప్లేలో కథంటూ వుంటే అది ఈ రెండు ప్లాట్ పాయింట్ల మధ్యే వుంటుంది. అంటే మిడిల్ లో వుంటుంది.

          ఇంత కీలక పాత్ర వహించే ప్లాట్ పాయింట్ -1 నియో డార్క్ మూవీ  ‘బ్లడ్ సింపుల్’  లో ఎలా ఏర్పాటయ్యిందో తెలుసుకుంటున్నాం. నిన్నటి వ్యాసంలో గమనించిన బిగింగ్ వన్ లైన్ ఆర్డర్లో, చివరి సీను- అంటే పదమూడోది- ప్లాట్ పాయింట్ -1 ని నిర్ణయిస్తోంది.  బార్ ఓనర్ మార్టీ, తన భార్యనీ ఆమె ప్రియుణ్ణీ చంపమని డిటెక్టివ్ విస్సర్ కి ‘సుపారీ’ ఇచ్చే సీను. ఇదీ సమస్య ఏర్పాటు. కాబట్టి ఈ సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన – సీన్ల కలబోత ఇప్పుడు చూడబోతున్నాం. నిన్నటి వ్యాసంలో మొదటి రెండు సీన్లు తెలుసుకున్నాం. జానర్ ఏర్పాటుకీ, పాత్రల  పరిచయానికీ రెండు  సీన్ల సమయమే తీసుకున్నారు కోయెన్ బ్రదర్స్.  ఇది చాలా గ్రేట్. ఆ తర్వాత మూడో సీను నుంచి సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పనేమిటో ఇప్పుడు చూద్దాం...

 3. మోటెల్ లో ఎబ్బీ , రే లు శృంగారంలో పాల్గోవడం.
     ఎబ్బీ, రే లు బెడ్ మీద శృంగారం జరుపుకుంటున్నప్పుడు  వెంటనే ప్రారంభమయ్యే సీనుకి,  పుల్ బ్యాక్ అని రాశారు కోయెన్ బ్రదర్స్. కెమెరాని ఎందుకు పుల్ బ్యాక్ చేయాలి? అంటే అటు వెనకాల వీళ్ళని గమనిస్తున్న నేత్రాలున్నాయా?  ఇలా ఒక మిస్టరీని క్రియేట్ చేశారు పుల్ బ్యాక్ తో. 

          ఇప్పుడు రెండు నిగూఢార్ధాలు రాశారు - స్క్రిప్టులో హైలైట్స్ చూడండి :
          1. బయట హైవే మీద పోతున్న కార్ల హెడ్ లైట్స్ వెలుతురు  మాత్రమే అప్పుడప్పుడూ రూంలో పడుతున్నట్టూ, వెలుతురు  పోగానే చీకటి ఆక్రమిస్తున్నట్టూ రాశారు. ఇది సహజమే హైవే అంటూ వున్నాక. కానీ ఈ చీకటి వెలుగుల సయ్యాటకి ఇంకో అర్ధమేమైనా వుందా?

          2. పుల్ బ్యాక్ వైడ్ షాట్ వరకూ సాగుతుంది. చివరి కారు వెళ్ళగానే చీకటి కమ్ముతుంది. ఏమిటిది? కెమెరా భాషలో చెప్పాలంటే పుల్ బ్యాక్ వైడ్ షాట్ వరకూ సాగిందంటే, బెడ్ మీద వాళ్ళ శృంగారం సువిశాలంగా ప్రపంచానికి రట్టవుతున్నట్టా? 


          అప్పుడు టెలిఫోన్ రింగవుతుంది. ఇదేమిటి? ఇప్పుడెవరు కాల్ చేస్తున్నారు?
          చాలా మిస్టీరియస్ వాతావరణం తెర  వెనుక జరుగుతున్నదాని గురించి...

          ఇదే వైడ్ షాట్ నైట్ సీన్,  మార్నింగ్ ఎఫెక్ట్ కి మారుతుంది. అంటే గుట్టు రట్టవడం సువిశాలంగానే కాక, పట్టపగలు కూడా నన్నమాట.
          మార్నింగ్ ఎఫెక్ట్ లో వాళ్ళిద్దరూ బెడ్ మీదే నిద్రలో వుంటారు. ఫోన్ రింగ్ కంటిన్యూ అవుతుంది...
          రే తీసి మాట్లాడి స్థాణువవుతాడు. ఎవరది?-  అని ఎబ్బీ అంటే, మీ ఆయన- అంటాడు.

          ఇది  డిస్టర్బింగ్ డైలాగు. ఈ ఒక్క డైలాగుతో అనేక  ప్రశ్నలు తలెత్తుతున్నాయి.  దెబ్రా భర్త మార్టీ సరీగ్గా మోటెల్ కి కాల్ చేయడ మేమిటి? అతడికెలా తెలిసింది? ఆ రహస్య నేత్రాలు అతడివేనా?  వర్షంలో కారులో వున్నది అతనేనా? అది మార్టీయే అయితే అతనెందుకు అలాటి స్వగతం వేసుకుంటూ వచ్చాడు? అతను మోటెల్ కే వస్తే ఎందుకు రెడ్ హేండెడ్ గా పట్టుకోలేదు?  తీరిగ్గా వెళ్ళిపోయి తెల్లారి ఫోన్ చేయడమేమిటి? ఏమాశిస్తున్నాడు?

          ఎవరో బ్లాక్ మెయిలర్ కాల్ చేయాల్సింది నిజానికి. మనం మొదట్నించీ అజ్ఞాతంగా వున్నాడని భావిస్తున్న కన్నింగ్ ఫెలో నుంచి ఇలాటిది ఎక్స్ పెక్ట్ చేస్తున్నాం. వాడు కాల్ చేసి బ్లాక్ మెయిల్ చేయాలి నిజానికి. వాడు కాకుండా భర్త మార్టీ కాల్ చేశాడంటే,  అసలేం జరుగుతోంది తెర వెనకాల? ఈ స్క్రీన్ ప్లేలో మనం ఎక్స్ పెక్ట్ చేస్తున్నదాన్ని ఉల్టా పల్టా చేసేస్తూ జరగడమేనా అన్నీ?

          ఇలా మూడో సీనుకల్లా మార్టీని లాగి, పాత్రల సమీకరణలతో సమస్యకి దారి తీసే పరిస్థితుల కల్పన వెంటనే ప్రారంభమయ్యింది.
          ‘మీ ఆయన ’  – అన్నప్పుడు రే కిటికీ దగ్గర నిలబడి వుంటాడు. కిటికీ చువ్వల బ్యాక్ డ్రాప్ లో ట్రాప్ అవుతున్నట్టు వుంటాడు. డార్క్ నోయర్ లో ఇదొక ఎలిమెంట్ : బార్స్
డయాగోనల్ఫ్రేమ్స్ వితిన్ ఫ్రేమ్స్ షాట్స్ పాత్రలు పరిస్థితులకి బందీలై నట్టు, కర్మఫలం అనుభవిస్తున్నట్టూ  ఫీల్ కలగడానికి ఇలాటి  షాట్స్ తీస్తారని చెప్పుకున్నాం.  
***
4. డిటెక్టివ్ విస్సర్  ఫోటోలని మార్టీకి చూపించి డబ్బు తీసుకుని పోవడం.


క్రితం రాత్రి బార్ లో జరిగే ఈ సీను ఫ్లాష్ బ్యాక్ గా ఓపెనవుతుంది. టేబుల్ ముందు కూర్చున్న మనిషిని పాస్ అవుతూ ట్రాకింగ్ షాట్ వేస్తామని రాసుకున్నారు కోయెన్ బ్రదర్స్. అప్పుడొక ఫోటో వచ్చి టేబుల్ మీద ఆ మనిషి ముందు పడుతుందని పేర్కొన్నారు. కానీ చిత్రీకరణలో ఆ మనిషి టేబుల్ మీద కాళ్ళు జాపుకుని కూర్చుని వుంటాడు. అప్పుడు ఫోటో కాకుండా ఫోటో వున్న కవరు వచ్చి కాళ్ళ పక్కన పడుతుంది. దాని పక్కనే ఒక హేటు పెడుతూ ఎదురుగా కుర్చీలో ఒకతను కూర్చుంటాడు. ఇతడి ఫేస్ ఫ్రేములోకి రాదు- గొంతు వరకే కన్పిస్తూంటాడు. ఇది డైనమిక్స్. ఈ క్షణంలో సీను ప్రాధాన్యం ఆ ఫోటోకే. ఈ కూర్చున్నతనెవరో ఫేసు చూపించి దృష్టి మరల్చకూడదు. ఇతన్ని సస్పెన్స్ లో వుంచి ప్రీక్షకుల దృష్టి ఫోటో మీదే కేంద్రీకరింప జేయాలి. 

            కాళ్ళు జాపుకున్న మనిషి నిదానంగా ఆ కవరు అందుకోబోతున్నప్పుడు, బ్యాక్ గ్రౌండ్ లో పాట వస్తూంటుంది :  నీ తియ్యటి పెదాలు ఫోనుకి ఇంకా దగ్గరగా రానీయ్... మనిద్దరం కలిసి వున్నామన్న భావన రానీయ్ ...విడివిడిగా...ముందా  జ్యూక్ బాక్సు సొద తగ్గించమని చెబుదూ...

           
కవరు లోంచి ఫోటో లాగి చూస్తాడు. కానీ అతడి ఫేసు రివీలవదు, ఎదురుగా కూర్చున్నతని  ఫేస్ ఇప్పుడు రివీలవుతుంది. ఇది డైనమిక్స్. ఇతను  భారీ మనిషి, ఎల్లో సూటులో వుంటాడు. తమాషాగా చూస్తూంటాడు.  

            ఇతను రివీలైన తర్వాత,  ఇప్పుడు ఫోటో చూస్తున్న మనిషి రివీల్ అవుతాడు. ఇది డైనమిక్స్. ఇతను ఎబ్బీ  భర్త మార్టీ! చాలా మిశ్రమ అనుభూతుల దృశ్యమిది!
            ఎందుకంటే, ఓపెనింగ్ లో టేబుల్ మీద కాళ్ళు జాపి దర్జాగా ఒంటరిగా కూర్చుని వున్నాడు. అంటే పరిస్థితి తన కంట్రోల్లోకి వచ్చిందన్న ధీమా. ఇక  దెబ్రా, రే లతో ఓ ఆటాడు కోవచ్చన్న విశ్వాసం. ఈ అనుభూతికి శృంగారానుభూతితో అదే భార్య ఎబ్బీ ని గుర్తుకు తెచ్చే పాట!  ఏం చెయ్యాలి?  వేటు వెయ్యాలా, చేపట్టాలా? 

            ఆ ఫోటోలో మోటెల్ లో బెడ్ మీద వున్న ఎబ్బీ, రే లని చూస్తాడు.  అప్రయత్నంగా చేతి వేలితో ఫోటోలో రే పక్కన పడుకున్న ఎబ్బీని  స్పృశిస్తాడు. అంటే ప్రేమ వున్నట్టే!
            అప్పుడు ఎదురుగా కూర్చున్నతను మాట్లాడతాడు.
            ఈ గొంతు ప్రారంభంలో స్వగతం పలికిన గొంతే అని, ఇతడి పేరు విస్సర్ అనీ,  ఇప్పుడు తెర పైకి తెస్తూ రాశారు కోయెన్ బ్రదర్స్. 

            ఇప్పుడా అజ్ఞాత కన్నింగ్ ఫెలో పూర్తిగా మన కళ్ళెదుట వున్నాడన్న మాట.  చూస్తే  వీడు కన్నింగ్ గానే వున్నాడు. పైగా  ఈ కథకి ప్రధాన పాత్ర ఇతనే అని తెలుస్తోంది!
            ఇక్కడ ఇద్దరి మధ్య విషయమేమిటంటే,  చూసి రమ్మంటే కాల్చి వచ్చావెందుకని  (ఫోటోలు తీసుకుని)మార్టీ అడగడం. దీనికి వంకరటింకరగా విస్సర్ చెప్పడం.
            ఇప్పుడు వెనక సీనులో మోటెల్ లో ఆ వెలుగు  నీడ సయ్యాటల అర్ధం తెలుస్తోంది!
            అవి పోతున్న కార్ల హెడ్ లైట్స్ వెలుగులే కావచ్చు. దాన్ని అంత హంగామాగా చిత్రీ కరించడ మెందుకు? ఎందుకంటే అది ఫోటోలు తీస్తున్నాడనేందుకు సింబాలిజం!

            ఆ వెలుగు నీడల్ని కెమెరా ఫ్లాషెస్ గా పసిగట్టమని నివేదన. ఆ పుల్ బ్యాక్, వైడ్ షాట్, ఒక పాయింటాఫ్ వ్యూలో దృశ్యం, వెలుగు నీడలు- ఇదంతా ఫోటోలు తీస్తున్న కుట్రకి అర్ధాలే!  ఇంత బ్యూటిఫుల్ రైటింగ్ ఎక్కడైనా వుంటుందా? 

            మనోడు ముందు నుంచీ వాళ్ళని కార్లో వెంటాడి వస్తూనే వున్నాడు, ఫోటోలు తీశాడు, మార్టీ ముందు హాజరై పోయాడిప్పుడు. 

            ఇక మోటెల్ కి మార్టీ ఎందుకు ఎలా ఫోన్ చేశాడో ఇప్పుడు స్పష్టమైపోయింది. అప్పటికే విస్సర్ నుంచి అతడికి సమచార ముందన్నమాట. మీ గుట్టు నాకు తెలిసిపోయిందని చెప్పడానికే కాల్ చేశాడు తప్ప మరొకందుకు కాదు.  

            ఇలా ఈ నాల్గవ సీనులో 2, 3 సీన్లలోని సస్పెన్స్ తో కూడిన అంశాల్ని, సందేహాలనీ ఇంకేం పెండింగులో వుంచకుండా ఓపెన్ చేసేశారు. ఎందుకంటే ఇంకా ఇవి కొనసాగిస్తే, ఇక్కడ్నించీ వేరే టాపిక్ తో నడిచే సీన్లు గజిబిజి అవుతాయి. ఆ వేరే టాపిక్ ఇప్పుడా జంటని మార్టీ ఏం చేస్తాడనేది. 

            మార్టీ తో ఈ మాటల మధ్యలో విస్సర్ సిగరెట్ కేస్ తీసి సిగరెట్ వెల్గించుకుని,  ఆ కేస్ ని టేబుల్ మీద పెడతాడని రాశారు కోహెన్ బ్రదర్స్. అలాగే దాని క్లోజ్ షాట్ లో చూపించారు. ఎందుకు దీన్ని ఇంత ప్రత్యేకంగా ఎస్టాబ్లిష్ చేస్తున్నారు? ఎందుకంటే పైకి కన్పిస్తూ నడిచే పాత్రల కథే గాక, అంతర్గతంగా వాటి సైకలాజికల్ ట్రాక్ ని కూడా ఏర్పాటు చేస్తున్నారు ఈ దర్శకులు.
            ఈ సైకలాజికల్ ట్రాక్ లో భాగం గానే ఈ సిగరెట్ కేస్ ని ఎస్టాబ్లిష్ చేయడం. దీనర్ధమేమిటి? తెలుసుకుందాం. 

            ఇక్కడ మార్టీ అనే ఒక మాట అతిపెద్ద క్యారక్టర్ రివర్సల్ కి దారితీస్తుంది. అలాటి ఫోటోలో కూడా భార్యని స్పృశించి ప్రేమని చాటుకున్న అతడికి,  కీడు తలపెట్టే ఆలోచనే తొలగిపోయిందేమో. అందుకే, ‘ఇలాటి చెడు వార్త మోసుకొచ్చే వాణ్ణి  గ్రీస్ లో తల తీసేస్తారు!’ అనేస్తాడు. 

            చెడు జరుగుతోందని తెలిసినప్పుడు చెడు వార్త కాకుండా ఎలా వుంటుంది?  అంటే ఇప్పుడది  చెడు కాదని నమ్ముతున్నాడా? భార్య గురించి మనసు మార్చుకున్నాడా? మనం ఆశిస్తున్న దానికి భిన్నంగా తిరగబడింది ఇంతలోనే పాత్ర. 

            మార్టీ ఇలా అన్నాక, ఇంకో నిగూఢార్ధం రాశారు- ఆఫ్ స్క్రీన్ లోంచి సిగరెట్ పొగ ఫ్రేములోకి వస్తుందని (స్క్రిప్టు 8 వ పేజీలో హైలైట్ చూడండి)- నువ్వు మారాలనుకున్నా పరిస్థితులు అందుకనుమతించవు -  అనే అర్ధంలో. ఆ సిగరెట్ పొగ మేఘం కమ్మేయడం ఆ డిటెక్టివ్ కంట్రోల్లోకి తను వెళ్ళబోతున్న సంకేతం. నిత్య జీవితంలో మనకిలాటివి జరుగుతూంటాయి- కానీ మనం తెలుసుకోం. బయటికెళ్ళి పొగ వూదురా వెళ్ళు-  అని నెట్టి పారేస్తాం, వాడి బాడీ లాంగ్వేజికి అర్ధం గ్రహించకుండా. మార్టీ ధోరణీ ఇదే. 

            మార్టీ సేఫ్ దగ్గరకి వెళ్తాడు. అప్పుడు గ్రీస్ సంగతి తనకి తెలీదనీ, ఇక్కడ నిర్దుష్టమైన చట్టాలున్నాయనీ అంటూ, తను వార్తలు మోసుకొచ్చే మెసెంజర్ కాదనీ, ప్రైవేట్ డిటెక్టివ్ ననీ చెప్తాడు విస్సర్. ఇలా ఇతను డిటెక్టివ్ అన్న సంగతిని సీను చివరి వరకూ అట్టి పెట్టారు దర్శకులు. దీన్ని గమనించాలి. ఏ విషయం ఎక్కడ ఎప్పుడు చెప్తే థ్రిల్  చేస్తుందో తెలుసుకోవాలి.

            డిటెక్టివ్ అయ్యుండీ బ్లాక్ మెయిల్ ఎందుకు చేస్తున్నాడు క్రిమినల్ లా? చూసి రమ్మంటే ఫోటోలు తెచ్చి? డార్క్ మూవీస్ లో కొన్నిసార్లు నీతి లేని డిటెక్టివ్ పాత్ర లుంటాయి. అలాంటిదే ఇదీ.

            అప్పుడు మార్టీ డబ్బున్న కవరు తెచ్చి విస్సర్ కేసి విసురుతాడు.
            ఇక్కడ మరో నిగూఢార్ధం రాశారు ప్రత్యేకించి...(స్క్రిప్టు 9 వ పేజీలో హైలైట్
చూడండి).  ఆ కవరు విస్సర్ కేసి విసిరినప్పుడు,  వెళ్లి ఛాతీకి కొట్టుకుని రివర్స్ లో వచ్చి కింద పడుతుందనీ. 

       విస్సర్ కి కూడా లాక్ పడబోతోంది ఈ ఆటలో!  దుర్నీతితో అతను గుంజుతున్న డ బ్బు, తపిస్తున్న  గుండెలకి తగిలింది గానీ, నేలపాలయ్యింది. ఏ మాత్రం అతడికి దుష్కర్మ ఫలాలు దక్కబోవని హెచ్చరిక. 

            మళ్ళీ రావద్దంటాడు మార్టీ. విస్సర్ పెద్దగా నవ్వేస్తూ కిందపడ్డ కవర్ని తీసుకుని వెళ్ళిపోతూ వెనక్కి వస్తాడు. ఇక్కడ ఇంకో నిగూఢార్ధం (9 వ పేజీ)...వెనక్కి వచ్చి టేబుల్ మీద పెట్టిన సిగరెట్ కేస్ తీసుకుని వెళ్ళిపోతాడని... దీన్ని క్లోజప్ తో రిజిస్టర్ చేస్తారు.


            ఇది విస్సర్ సైకలాజికల్ ట్రాక్ కొనసాగింపు. ముందు టేబుల్ మీద సిగరెట్ కేస్ పెట్టేయడం, వెళ్తూ మర్చిపోయి వెళ్ళబోవడం, వెనక్కి వచ్చి తీసుకోవడం...ఇదంతా అతడి సైకలాజికల్  ట్రాక్. ఈ ప్లేస్ లో సిగరెట్ కేస్ వదిలెయ్యకుండా భద్రంగా తీసికెళ్ళగల్గిన విస్సర్, ఇంకోసారి ఏదైనా మర్చిపోయి వెళ్తాడా? అలా మర్చిపోయి వెళ్ళడం పీకల మీదికి తెస్తుందా? ముందు ముందు సీన్లలో చూద్దాం...ఈ నాల్గవ సీను ముగిసింది. ఈ సీన్ స్ట్రక్చర్ ని స్టడీ చేసి, ఈ ఒక్క సీనులో చిన్న చిన్న మాటల  ద్వారా, చర్యల ద్వారా ఎన్నెన్ని విషయాలు వెల్లడై, వల్లో పడి, కథనం ఎంత లోతుగా,  చిక్కగా రూపొందుతోందో  ఒకటికి పదిసార్లు పరిశీలించుకోవాలి.


-సికిందర్