రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

15, సెప్టెంబర్ 2017, శుక్రవారం

515 : రివ్యూ!





రచన – దర్శకత్వం: కె.క్రాంతి మాధవ్
తారాగణం : సునీల్, మియాజార్జ్, ప్రకాష్ రాజ్, పోసాని, వెన్నెలకిషోర్,  ఆశీష్ విద్యార్థి, ల్లవేణు దితరులు
సంగీతం: జిబ్రాన్,  ఛాయాగ్రహణం : సర్వేష్ మురారి
నిర్మాత : పరుచూరి కిరీటి
విడుదల : సెప్టెంబర్ 15, 2017
***
          ల్లరి నరేష్, సునీల్ లు కలిసి ఒక మల్టీ స్టారర్ చేస్తే ఇద్దరి సమస్య తీరిపోతుందేమో. కామెడీలో స్పెషలైజ్ చేసే వాళ్ళకే  హీరోలుగా మారినా కామెడీ కరుణించకపోవడం కామెడీయే. సునీల్ కి ఇది ఇంకో భంగబాటు. ఈసారి మరీ చెప్పలేనంత నగుబాటు. ఒకసారి తను నటిస్తున్న సినిమాల్ని పరిశీలించుకుంటే అన్నీ ఒకే కాలం చెల్లిన పాత మూస పద్ధతిలో వుం టున్న సంగతి తెలుస్తుంది. ఈ పనిచేయకుండా ఇంకా  ఉంగరాలు, బంగారాలూ ఇలాగే నటిస్తూపోతే ఏమీ లాభం వుండదు. ఇప్పుడు వేరే కళ్ళద్దాలతో చూడాల్సి వుంటుంది. ‘ఉంగరాల రాంబాబు’ ని కూడా చూసిన కళ్ళద్దాలు నిలువుటద్దాలైతే తప్ప పరిస్థితి బాగుపడదు. ఒకసారి ఈ నిలుటద్దంలో ఏం కన్పిస్తోందో చూద్దాం...

కథ 
      రాంబాబు (సునీల్) అనే 200 కోట్ల ఆస్తికి వారసుడు తాత (విజయకుమార్) చనిపోగానే వీధిన పడతాడు. ఏం చేయాలో తోచక బాదం బాబా (పోసాని) ని ఆశ్రయిస్తాడు. ఒక కొండ ప్రాంతంలో తను ఇచ్చే మొక్క నాటితే పోయిన ఆస్తి  తిరిగి వస్తుందని బాబా ఆశీర్వదిస్తాడు. రాంబాబు ఆ మొక్క నాటుతూంటే 200 కోట్లు విలువజేసే బంగారం పెట్టె దొరుకుతుంది. దీంతో బాబా ఠారెత్తి పోయి, రాంబాబు దగ్గర నుంచి ఆ 200 కోట్లు లాగడానికి  ఏవో  సలహాలిస్తూ లక్షలు లాగుతూంటాడు. ఇందులో భాగంగా ఉంగరాల పెట్టె ఇస్తాడు. అవి ధరిస్తే శని వదుల్తుందంటాడు. భారీగా బస్సులు కొని ట్రాన్స్ పోర్టు కంపెనీ పెట్టిన రాంబాబుకి చీకాకులు ఎదురవుతూంటే, బాబా సలహామీద ఫలానా రాశిలో పుట్టిన అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని చూస్తాడు. ఆమె తన ఆఫీసులోనే పనిచేసే సావిత్రి (మియా జార్జి) అని తెలుస్తుంది. సావిత్రిని  ముందు నుంచే ప్రేమిస్తూంటే పట్టించుకోని ఆమెని,  కంపెనీ పని మీద అని చెప్పి దుబాయ్ తీసికెళ్ళి ప్రపోజ్ చేస్తాడు. ఆమె తండ్రిని ఒప్పించాలంటుంది. రాంబాబు ఆమెతో కేరళలో వాళ్ళింటికి వెళ్తాడు. కమ్యూనిస్టు నాయకుడైన ఆమె తండ్రి రంగ నాయర్ (ప్రకాష్ రాజ్) క్యాపిటలిస్టు రాంబాబుని వెంటనే తిరస్కరిస్తాడు. ఆ తర్వాత కొన్ని పరీక్షలు నెగ్గాలని ఇంట్లో చోటు కల్పిస్తాడు. ఈ పరీక్షల్లో పోటీగా రంగా అల్లుడుగా చేసుకోవాలనుకుంటున్న సుధాకర్ (వెన్నెల కిషోర్) కూడా దిగుతాడు.  ఇక ఈ పరీక్షల్లో రాంబాబు ఎలా నెగ్గి, రంగాని ప్రసన్నం చేసుకుని సావిత్రిని చేపట్టాడన్నది మిగతా కథ. 

ఎలావుంది కథ 
      బాగా అరిగిపోయిన మూస కథ. నిజానికి ఇదొక  కొత్త నేపధ్యంతో మాంచి  సెటైరికల్ కామెడీ కాగల కథ. వేసెక్టమీ అనే కొత్త నేపధ్యంతో  సెటైర్ చేస్తూ గత వారం విడుదలైన హిందీలో విజయవంతమైన  ‘పోస్టర్ బాయ్స్’ తరహాలో క్రియేటివ్ కామెడీ కాగల కథ.  మూస దృష్టి వల్ల ఎందుకూ పనికిరాకుండా పోయింది. పాయింటు కొత్తగానే  వుంది, దాని పాలనే  మూస టెంప్లెట్ సినిమాల చట్రంలో ఇరుక్కుంది. పెట్టుబడిదారీ వర్గానికి చెందిన హీరో - కమ్యూనిస్టు నాయకుడైన హీరోయిన్ తండ్రి – ఈ ఇద్దరి మధ్య  పరిష్కారం దొరకని తూర్పు పడమరల భావజాలాల సంఘర్షణ కి బదులు, కమ్యూనిస్టు తండ్రి ఇంకేవో ఫార్ములా పరీక్షలు  పెట్టడంతో – భావజాలాల నేపధ్యం బూజు పట్టిపోయింది. 

ఎవరెలా చేశారు 
     అన్నీ పాత సన్నివేశాలే కావడంతో సునీల్ కామెడీకి కొత్తగా నవ్వుపుట్టుకొచ్చే అవకాశం లేకుండాపోయింది. తను గొప్పగా వుంటుందని చేసిన కామెడీ సీన్లన్నీ పాతబడిపోయిన సీన్లే. ఎప్పుడో సత్యనారాయణ లాంటి నటులు కమెడియన్లు గా చేసినప్పుడు సీనుకో జోకర్ వేషంలో కన్పించి నవ్వించినట్టు, ఇప్పుడు సునీల్ చేయడం ఏంతో  సృజనాత్మక వెనుక బాటుతనంగా తేలింది. తను ఏం చేసినా ప్రేక్షకులు నవ్వడమే లేదు. లేచింది మహిళా లోకమని పిండి రుబ్బి పారేశారు ఎన్టీఆర్. సునీల్ రకరకాల  హీరోల బిట్ సాంగ్స్  వేసుకుంటూ ఎంత పిండి వొత్తినా,  ఎన్ని రొట్టెలు చేసినా అవుట్ డేటెడ్ గానే వేస్టయ్యింది. తను ఆల్ రౌండర్ అన్పించుకోవాలన్న కోరిక బలంగా వున్నట్టుంది సునీల్ కి. దీంతో తను నటుస్తున్నది కామెడీ కథా, కుటుంబ కథా, యాక్షన్ కథా అన్న తికమక ఏర్పడుతోంది. ఆడపిల్ల – తండ్రి సంబంధం గురించి బరువైన పాత  డైలాగులు చెప్పడం, సామ్యవాదం మీద ఉపన్యాసాలివ్వడం లాంటివి చేయడంతో ఒక పంథా లేకుండా పోయింది పాత్రకి. కనీసం తను  యాక్షన్ కామెడీలు నటించినా నటిస్తే ఫలితం వుంటుంది - కమెడియన్ అయిన తను సిక్స్ ప్యాక్ తో యాక్షన్ హీరో కావాలనుకున్నందుకు. దీన్ని కూడా అత్యాశకిపోయి ఆల్ రౌండర్ నంటూ గజిబిజి చేసుకోవడమే బాగాలేదు. 

          హీరోయిన్ గ్లామర్ బొమ్మ తప్పితే పాత్ర లేదు. ఈమె అక్క పాత్రకి ఏదో  కారణం చెప్పి మూగనోము పట్టించారు సరే, తల్లి పాత్రలో నటి కూడా ఎక్కడా ఒక్క మాట కూడా మాట్లాడకుండా ఫ్రేముల్లో ఉండడమేమిటి. షాట్ పెట్టగానే ఈ తల్లీ కూతుళ్ళు పేరంటాళ్ళా వచ్చి నించుని, షాట్ పూర్తవగానే చేతులూపుకుంటూ వెళ్ళిపోతారు. మళ్ళీ షాట్ పెట్టగానే హాజరు. సినిమా సాంతం ఇదే రిపీటవుతూంటుంది. ఆ నటికూడా – ఏంటయ్యా నన్ను ఫోటోలు దిగడానికి పెట్టుకున్నావా – అని దర్శకుణ్ణి అడిగి వుండదు పాపం. ఈ తల్లి పాత్ర ప్రకాష్ రాజ్ పాత్రకి భార్య. ఇలా కూడా ప్రాధాన్యం లేకుండా చేశారు. ప్రకాష్ రాజ్ కూడా తన భార్య కాదన్నట్టే వుంటాడు. ఆమెతో ఒక్క డైలాగూ వుండదు. కమ్యూనిస్టు భావాలు బలంగానే వున్నాయిగానీ, కూతురు పెట్టుబడి దారీ వ్యవస్థలోనే  హీరో దగ్గర పని చేసుకుని జీవించడమేమిటి? 

          బాబాగా పోసాని షరా మామూలు నటన.  శిష్యుడుగా శీను రొటీన్. వెన్నెల కిషోర్ కి ఈసారి మూస పాత్రే. విలన్ గా ఆశీష్  విద్యార్థి ఇప్పటికీ పకడ్బందీగా వుంటాడు. కానీ విలన్ గా ఏమీ చేయకుండానే చివరికి వెళ్ళిపోతాడు తన ముఠాతో. దీంతో నిర్మాతకి క్లయిమాక్స్ పోరాటాల ఖర్చు తప్పినట్టయింది – సునీల్ కూడా పోనీలే అనుకోవడంతో. 

          సర్వేష్  మురారీ ప్రతిభనంతా చూపించుకుంటూ కెమెరా వర్క్ చేశాడు - కానీ ఏం లాభం, తనకి దీటుగా కథా కథనాలూ దర్శకత్వాలూ లేవు. జిబ్రాన్ సంగీతం డిటో. భారీగా ఖర్చు పెట్టి సినిమా తీశారు- కానీ విషయమే నాసి.

చివరికేమిటి 
        పెట్టుబడిదారీ – కమ్యూనిస్టు పాత్రల మధ్య సరికొత్తగా, స్ఫూర్తిమత్వంతో కొత్త నవ్వులు పుట్టించాల్సిన కామెడీ - ఫస్టాఫ్ టెంప్లెట్ గానూ,  సెకండాఫ్ సింగిల్ విండో  స్కీము గానూ సర్దుకుని వృధా యింది. ఫస్టాఫ్ ఒక ఫైట్, ఒక గ్రూప్ సాంగ్, హీరోయిన్ తో లవ్ ట్రాక్, ఇంకో సాంగ్, ఇంకాస్త  లవ్ ట్రాక్,  ఇంకో సాంగ్, లవ్ ఓకే, ఇక ప్రత్యర్ది పాత్ర ఎంట్రీ, ఇంటర్వెల్  లాంటి టెంప్లెట్ సినిమాలు ఎన్ని రాలేదు.  ఇక  సెకండాఫ్ లో హీరో ప్రత్యర్ధి ఇంట్లో మకాం వేసే సింగిల్ విండో స్కీముతో ఎన్ని సినిమాలు వచ్చి ఈ స్కీమే బంద్ అయిపోలేదు. అయినా ఏదో సామెత లాగా  మళ్ళీ దీన్నితీశారు. పాత దర్శకులు తమ టైం అయిపోయిందని రిటైరయ్యారు. కానీ టైం అయిపోలేదు- ఇప్పటి దర్శకుల తీరూ అలాగే వుంది. పాత దర్శకులు మళ్ళీ వచ్చేసి తమ తమ సినిమాలు నిశ్చింతగా తీసుకోవచ్చు. ఏమీ మారలేదు.

          ‘మిస్టర్’ అని ఈ మధ్యే వచ్చింది. అందులో గాంధేయ వాదుల గ్రామమని ఒక కృత్రిమత్వాన్ని సృష్టించి, ఏవో చాదస్తపు పాత్రల డ్రామాలతో బోరు కొట్టించి ఫ్లాప్ చేశారు. అక్షయ్ కుమార్ తో ‘జోకర్’  అని వచ్చింది. అందులో మొత్తం పిచ్చి వాళ్ళ గ్రామమంటూ సృష్టించి అభాసు చేసుకున్నారు. చాలా పూర్వం ‘మరో ప్రపంచం’ వచ్చింది. అందులో బాలలకంటూ కొత్త ప్రపంచాన్ని సృష్టిస్తే ఆది కూడా ఆడలేదు. విజయవంతంగా కొన్నేళ్ళ పాటు ఆడింది బహుశా  ‘రాంపూర్’  అనే  కాల్పనిక గ్రామాన్ని సృష్టించిన ‘షోలే’ ఒక్కటే. 

          మళ్ళీ ఇప్పుడు కూడా కేరళలో కమ్యూనిస్టుల  గ్రామమని సృష్టించి భంగపడ్డారు. నాటి  సోవియట్ రష్యాలో లాంటి పరిస్థితులు- సిద్ధాంతాలు – ఎవరికీ సొంతంగా ఏదీ వుండదు (వుండనివ్వదు ప్రకాష్ రాజ్ పాత్ర). ఉమ్మడి వ్యవసాయ క్షేత్రాలు, ఉమ్మడి నివాసాలు, ఉమ్మడి భోజనాలు...ఒకే చోటా వండి ఇంటింటికీ పంపుతారు. సోవియెట్ లోనే ప్రజలు తిప్పికొట్టిన ఈ వ్యవస్థని ఇక్కడెవరు కోరుకుంటున్నారో గానీ, దీంతోనూ ప్రకాష్ రాజ్ పాత్రకి నిబద్ధత లేదు. పెట్టుబడిదారీ హీరో తను పెట్టే  పరీక్షల్లో నెగ్గితే కూతుర్నిచ్చేస్తాడా? ఆ వ్యవస్థని వదులుకుని రమ్మనడా? 

          హీరో తను  పెట్టుబడి దారీ వ్యవస్థా గివస్థా తెలీని అమాయకప్రాణిని అంటాడు. హీరో ఇలా తగ్గిపోతే ఇక కథలో బలాబలాల సమీకరణ ఎక్కడిది? ఇంకోటేమిటంటే,  హీరో సొంతంగా రూపాయి సంపాదించలేదు. తాత వున్నప్పుడు తేరగా అనుభవించాడు. పోగానే ఆస్తులు పోయి వీధిన పడ్డాడు. అప్పుడు దొరికిన బంగారంతో బిజినెస్ మాన్ అయిపోయాడు. ఆ బంగారం విలన్ ది. అది నాల్గు వందల కోట్లకి పెరిగింది. ఈ పరాయి సొమ్ముని చివరికి కేరళ గ్రామానికి ఎసరు పెడుతున్న ప్రభుత్వ ప్రాజెక్టు కిచ్చేసి గొప్ప సామ్య వాదంతో ‘కమ్యూనిస్టు’ అయిపోతాడు- ప్రకాష్ రాజ్ పాత్ర కి అల్లుడైపోతాడు!

          అడ్డగోలు సినిమాలు తీసేసి ఆడతాయనుకుంటే నిజంగా ఆడతాయా? ఆడుతున్నాయా? తీ స్తున్నవి అడ్డగోలు సినిమాలని ఇంకెప్పుడు తెలుస్తుంది???

-సికిందర్   
www.cinemabazaar.in
         
         






14, సెప్టెంబర్ 2017, గురువారం

514 : డార్క్ మూవీస్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ - 17




       
     మొన్న మంగళవారం ఒక  30 నిమిషాల షార్ట్ ఫిలిం ప్రేమకథ స్క్రిప్టు టేబుల్ పైకొచ్చింది. అందులో హీరోయిన్ కి తెలిసిన విషయాలు  హీరోకి తెలీకపోవడం, ప్రేక్షకులకి కూడా తెలీకపోవడంగా వుంది.  హీరోకీ, ప్రేక్షకులకీ ఇంకో పాత్ర చెప్పడం ద్వారా పూర్తి పాఠం చివర్లో తెలుస్తుంది. ఈ పూర్తి పాఠం  హీరోకీ, ప్రేక్షకులకీ చివర్లో అర్ధమవడానికి మళ్ళీ మొదటి నుంచీ కథనంలో ఎప్పుడెప్పుడు  ఫలానా ఫలానా విషయాలు ఎలా ఎందుకు జరిగాయో కార్యకారణ సంబంధాలు చెప్పుకొచ్చే తతంగంవుంది. ఇలా పాత్రతో బాటు ప్రేక్షకులకి కూడా విషయాలు దాచి చివర్లో సస్పెన్స్ లాగా  విప్పితే అది ‘ఎండ్ సస్పెన్స్’  కథనమవుతుంది. పూర్తిగా వ్రతం చెడుతుంది.  ఈ టెక్నిక్ దృశ్యమాధ్యమం కోసం కాదు.  అచ్చులో కథగా చదువుకోవడం కోసం,  తెర  మీదికి అచ్చోసి వదిలే  కథకి కాదు.  ‘ఆ ఒక్కడు’, ‘జాదూగాడు’, ‘భద్రం’, ‘బెంగాల్ టైగర్’ లాంటి సినిమాలెన్నో ఇందుకే జనాలకి నచ్చలేదు. ‘కిక్ -2’ లోలాగా కథలో చిన్న చిన్న ఎపిసోడ్లకి ఎండ్ సస్పెన్స్ వుంటే అది వర్కౌట్ అవుతుంది. ప్రధాన కథకి కాదు. ఎందుకని?

         
అంతవరకూ పాత్రతో బాటు ప్రేక్షకులని సస్పెన్సులో  పెడితే  మొట్ట మొదట జరిగేది కథేమిటో అర్ధంగాక పోవడం చివరిదాకా.  దాంతో కథలో పాలుపంచుకోలేం. ఒక పాత్ర కథంతా తన గుప్పెట్లో దాచుకుని ప్రవర్తిస్తే, అది చివర్లో చెప్పుకు రావడం ప్రారంభిస్తే, పెద్ద సహనపరీక్ష అయిపోతుంది ప్రేక్షకులకి (ఎండ్ సస్పెన్స్ తో కూడా మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే చేతి కొస్తుందన్న మాట).  చల్లకొచ్చి ముంత దాచకూడదు, దృశ్య మాధ్యమాని కొచ్చి కథ దాచకూడదు. చెప్పాలనుకుంటున్న కథ ఓపెన్ గా చెప్పేస్తూ, పాత్రలకి తెలియకుండా సస్పన్స్ పోషించవచ్చు. అప్పుడది  ప్రేక్షకులకి ఆసక్తి కల్గించే సీన్ -  టు - సీన్ సస్పెన్స్ కథనమవుతుంది. దృశ్యమాధ్యమానికి సీన్  - టు -  సీన్ సస్పెన్సే కావాలే తప్ప, ఎండ్ సస్పెన్స్ కాదు.

          ఇలా పై ప్రేమకథ విషయంలో కూడా హీరోయిన్ సంగతులన్నీ ప్రేక్షకులకి తెలిసిపోతూ వుండి, హీరోకి తెలియకుండా వుంటే  సీన్ - టు - సీన్ సస్పెన్స్ తో ప్రేక్షకులు కథలో పాలు పంచుకునే అవకాశముంటుంది. చివర్లో కార్యకారణసంబంధాల (కాజ్ అండ్ ఎఫెక్ట్)  చిట్టా విప్పి తలబొప్పి కట్టించే అవస్థ తప్పుతుంది.


       మంచి ప్రేమకథల  ముగింపులు హృదయాల్ని తాకేట్టు వుంటాయి. ఆ సమయంలో మెదడుకి పని పెడుతూ కూర్చుంటే బావుండదు.  మెదడుకి పని పెట్టే  సంగతులన్నీ ఆ లోగానే ముగిసిపోవాలి. హృదయాలకి తాకాల్సిన ముగింపు ఘట్టాల్లో మెదడుకి పనిపెట్టే పాత సంగతుల సస్పెన్సు తవ్వకాలు మొదలెడితే రసభంగ మవుతుంది. ఒక కథలో ఉప కథలుంటే ఉపకథల్ని ముందు ముగించేసి చివర్లో కథని ముగిస్తారు. అంతేగానీ కథ ముగించాక  ఉపకథలు ముగిస్తూ కూర్చోరు. అలాగే ప్రేమకథల్లో మెదడు ప్రశ్నావళి ఏదైనా వుంటే ముందు దాన్ని అవగొట్టి, హృదయ సంబంధ గులేబకావళుల కోసం ముచ్చటగా ముగింపుని కేటాయించుకోవాలి. 


           ‘బ్లడ్ సింపుల్’  దృశ్యాల్లో   ఈ ఎండ్ సస్పెన్స్, సీన్ - టు - సీన్ సస్పెన్స్ ల తేడాల్ని చక్కగా అర్ధం జేసుకోవచ్చు. దృశ్యాల్లో  లో కథని ఎక్కడా మన నుంచి దాచలేదు. పాత్రల  మధ్యే దాచారు. మార్టీ ని విస్సర్ సగం చంపాడని మనకి తెలుసు. ఈ సగం ఎబ్బీ చంపిందనుకుని పూర్తిగా చంపేశాడు రే. దీంతో ఫైనల్ గా తను హంతకుడయ్యాడు. ఇది మనకీ తెలుసు,  అతడికీ తెలుసు. మనకి తెలిసి అతడికి తెలీనిదేమిటంటే,  సగం చంపింది ఎబ్బీ కాదనీ, విస్సర్ అనీ. ఇక్కడే ఆట రక్తి కట్టింది. ఇక బంతి అంతా రే కోర్టులోనే వుంది. ఇతనెప్పుడు ఈ నిజం తెలుసుకుంటాడనేది, అప్పుడేం  చేస్తాడనేది సీన్ -  టు - సీన్ సస్పెన్స్ గా వుంది. 

          దీన్నే ఎండ్ సస్పెన్స్ కథనంతో చూపిస్తే - మార్టీని విస్సర్ షూట్ చేసినట్టు మనకి చూపించకుండా, రే అనుమానించినట్టు ఎబ్బీ మీద మనకూ అనుమానం కల్గించి, కథ నడిపిస్తే, కథాక్రమంలో ఎప్పుడో రేతో బాటు మనం కూడా, మార్టీ ని షూట్ చేసింది ఎబ్బీ కాదని, విస్సర్ అనీ తెలుసుకుంటాం. అప్పుడేం జరుగుతుంది? రే విస్సర్ ని పట్టేసుకుంటాడు ఆధారాలతో. అప్పుడు విధిలేక విస్సర్ తన నేరం చెప్పేయడం మొదలెడతాడు. అది ఈ కింది విధంగా వుంటుంది :

          “ ఔను చేశానబ్బా నేనే చేశాను, మిమ్మల్ని కనిపెట్టమని మార్టీ నాకు చెప్పాడు (విజువల్స్!), మీరిద్దరూ కలిసి వున్న ఫోటో తీశాను (విజువల్స్!!), ఇక మిమ్మల్ని చంపెయ్యమని మార్టీ నాకు కాంట్రాక్టు ఇచ్చాడు(విజువల్స్!!!), నేను మిమ్మల్నిచంపకుండా మార్టీనే షూట్ చేశాను (విజువల్స్!!!!), తర్వాత తెలిసింది మార్టీ నాకు ఫోటోఇవ్వలేదని (విజువల్స్ !!!!) , పైగా నా లైటర్ మిస్సయిందని తెలిసింది(విజువల్స్ !!!!!), లైటర్ కోసం, ఫోటో కోసం వప్రయత్నించాను (విజువల్స్!!!!!!), లైటర్ దొరకలేదు, ఫోటో కోసం బార్ కెళ్ళి  సేఫ్ తెరవడానికి ప్రయత్నించాను (విజువల్స్ !!!!!!!), అప్పుడు ఎబ్బీ వచ్చేస్తే దాక్కున్నాను (విజువల్స్ !!!!!!!!),  మార్టీ చనిపోయాడని ఆమెకి అర్ధమై పోయింది (విజువల్స్ !!!!!!!!!) ఎబ్బీ తర్వాత నువ్వొచ్చి సేఫ్ తెరచి ఫోటో చూశావ్ (విజువల్స్ !!!!!!!!!!), విజువల్స్ విజువల్స్ విజువల్స్ మోర్ విజువల్స్, రొంబ మోర్ విజువల్స్  !!!!!!!!!!!!!!!! ఇదీ జరిగింది...”

          ఇలా చివరి వరకూ కథని తన చేతిలో వుంచుకుని, ఇప్పుడు ఎడాపెడా విజువల్స్ వేసుకుంటూ పాఠం చెప్పుకొస్తూంటాడు- బోర్డు మీటింగులో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ లాగా. ఇదేమైనా ఆసక్తి కల్గిస్తుందా?   అతను చెప్పేదంతా, ఆ విజువల్సూ, వాటికి ఒకదాంతో మరోకదాని కుండే సంబంధాన్నీ  అర్ధంజేసుకుంటూ ఫాలో అవడమే కష్టమైపోతుంది. ఇందులో థ్రిల్ వుంటుంద
నుకుంటే ఎక్కడ వుంటుంది? ఈ చెప్పేదంతా అయిపోయిన కథకి వివరణ, పునశ్చరణ, ఘనీభవించిన సస్పెన్స్. చలనంలో వున్న సస్పెన్స్ కాదు. ఇదీ తేడా. 

          ఒక సస్పెన్స్ తో కూడిన పరిస్థితికి రెండు పార్శ్వాలుంటాయి. ఎవరు? ఎందుకు?  - అన్న ప్రశ్నలతో. వీటిలో ఒకదాన్ని లేదా రెండూ ఓపెన్ చేసేసి కథ నడిపితే సీన్ - టు - సీన్ సస్పెన్స్ ఏర్పడుతుంది. రెండూ మూసి పెట్టి నడిపిస్తే ఎండ్ సస్పెన్స్ అవుతుంది. ఏర్పడిన ఒక పరిస్థితికి కారకులెవరో దాచిపెట్టి, ఆ పరిస్థితి ఎందుకేర్పడిందో కూడా దాచి పెట్టి,  చివర్లోనే  ఈ రెండూ చెబితే అంతసేపూ కథ  నడపడానికి పాయింటు ఏదీ వుండదు.  

          పరిస్థితికి కారకులెవరనే ప్రశ్నకి జవాబుగా పాత్రని చూపించేస్తే, ఎందుకీ పరిస్థితిని ఆ పాత్ర సృష్టించిందన్న రెండో ప్రశ్నని పట్టుకుని దాని జవాబుకోసం కథనంచేస్తే, సీన్ - టు - సీన్ సస్పెన్స్ ఏర్పడుతుంది. ఎవరు చేశారు? ఎందుకు చేశారు? రెండు ప్రశ్నలకీ జవాబులిచ్చేసి కథనం ప్రారంభిస్తే, ఇక ఆ పాత్ర ఎలా  పట్టుబడుతుందన్న సీన్ - టు - సీన్ సస్పెన్స్ తో కథనం సాగుతుంది. మార్టీ ని షూట్ చేసింది విస్సర్ అని మనకి చూపించేసి, ఎందుకలా చేశాడో కూడా అతడి సీక్రెట్ ఎజెండా కూడా మనకి చెప్పేశారు. ఇక ఎలా దొరుకుతాడన్న ప్రశ్నతో సీన్ - టు - సీన్ కథనం సాగడానికి బాట పడింది. కథఎప్పుడూ ఓపెన్ గా ఉంటూ, సస్పెన్స్ లైవ్ గా వుండాలి.
***

31. సేఫ్ లో డబ్బంతా రే దోచుకెళ్లాడని మార్టీ అన్నాడని, రేని మారిస్ దూషించడం 
      ఇలా రాశారు :  రే చేతి వేలు ఫ్రేములోకి వస్తుంది. కారు వెనుక సీటుని వొత్తి చూస్తూంటాడు. వేలికి రక్తం అంటుకుంటుంది,  సీటులో ఇంకిన రక్తం. 
       రే క్లోజ్ షాట్. సీటు వైపే అలా చూసి, ఇంటి వైపు నడుస్తాడు. తీసి వున్న స్వింగ్ డోర్లోంచి లోపలికొస్తాడు. వస్తూంటే డోర్ చటుక్కున మూసుకుంటుంది. ముందుకి నడుస్తూంతే మారీస్ కారు రావడం కిటికీ లోంచి కన్పిస్తుంది. చటుక్కున టేబుల్ మీదున్న వస్త్రాన్ని లాగుతాడు. 

            రే మీద ట్రాకింగ్ షాట్. ఇంట్లోంచి బయటికొస్తూంటే స్వింగ్ డోర్ చటుక్కున మళ్ళీ మూసుకుంటుంది. వేగంగా కారు కేసి నడుస్తాడు.

          ట్రాకింగ్ షాట్. రే పాయింటాఫ్ వ్యూ. మారీస్ వచ్చేస్తూంటాడు. కారులోకి వంగి సీటు మీద వస్త్రాన్ని కప్పేస్తూంటాడు రే. మారీస్ వచ్చేసి, వూరొదిలేస్తున్నావనుకుంటాను? – అంటాడు.
ఏమైనా ప్రాబ్లమా? - అంటాడు రే.

          మారీస్ ఆరోపణలు చేస్తాడు. తన ఆన్సరింగ్ మెషిన్లో మార్టీ మెసేజి వుందనీ, తను టూర్ వెళ్ళినప్పుడు మార్టీ బార్ లో జొరబడి సేఫ్ లో డబ్బంతా కొట్టేసినట్టున్నాడని, వాణ్ణి పట్టుకుని ఆ డబ్బు లాక్కురమ్మన్నాడనీ అంటాడు మారీస్.

         
రే తేరుకునే లోపు డబ్బు రిటర్న్ చేయమని చెప్పేసి వెళ్ళిపోతాడు మారీస్. ఫ్రేములోంచి తప్పుకుంటాడు రే. ఇంటి వైపు వెళ్తాడు. కెమెరా స్లోగా కారు బ్యాక్ విండో కేసి ట్రాక్ అవుతుంది. సీటు మీద కప్పిన వస్త్రం ఉబికి వస్తున్న రక్తంతో ఎర్రబారుతూంటుంది.




               ఇదీ సీను. సీను ఉద్దేశమేమిటి? హత్య చేసిన రేకి ఇక నిజాలు తెలుసుకునే ట్రాక్ ఏర్పాటు చేయడం. ఆ నిజలెలా తెలియాలి? విస్సర్ చేసిన  పొరపాట్లతో కూడిన ట్రాక్ తోనా, లేక సమాధి లోంచి ఇంకా వెంటాడే మార్టీ ప్రతీకారపు ట్రాక్ తోనా? మొదటిదైతే డైరెక్టుగా వుంటుంది. డైరెక్టు కథనాలు రుచించవు. ఇండైరెక్టుగా కథనాన్ని నడిపితేనే ఫ్లాట్ ఫీలింగ్ వుండదు. అందుకని మార్టీ ప్రతీకారపు ట్రాక్ ని ప్రారంభించారు.

            సమాధిలోంచి మార్టీ ప్రతీకారం తీర్చుకుంటాడా, అదెలా? చాలా ఇంటరెస్టింగ్ క్వశ్చన్. ఇది ముందుముందు చూద్దాం. మార్టీ ప్రతీకారం తీర్చుకునే ట్రాక్ లోంచే రే నిజాలు తెలుసుకోవడం రిలేటెడ్ గా వుంటుంది, కథలో మార్టీని ‘సజీవంగా’ వుంచి థ్రిల్ పెంచినట్టూ వుంటుంది. పాత్ర ఒక నేరం చేశాక ఆ నేరం వెంటాడే ట్రాకే వుండాలి తప్ప మరొకటి కాదు. సోల్ పోతుంది. నిజాలు తెలుసుకోవడానికి  విస్సర్ పొరపాట్లతో కూడిన ట్రాక్ లోకి  రే ని పంపిస్తే కథంతా చల్లారిపోయి కూర్చుంటుంది. ఇంకేముంది,  విస్సర్ దొరికిపోవడమే కథ అని పెదవి విరుస్తారు ప్రేక్షకులు. విస్సర్ దొరకడమే కథకి అవసరం. దానికి  డైరెక్టు కథనం చేస్తే ప్రేక్షకులకి తెలిసిపోతుంది. దొడ్డి దారిన కథ నడిపిస్తే డిఫరెంట్ గా ఆలోచిస్తూ కూర్చుంటారు. ఇందుకే- మార్టీ ప్రతీకార ట్రాక్ అనే డిఫరెంట్ కథా పథకం.

       ఇలా ఈ సీను సీటులో రక్తంతో ప్రారంభమై, మారీస్ వచ్చి చేసే సీరియస్ ఆరోపణతో ముగిసింది. రెండూ మార్టీ కి  సంబంధించిన విషయాలే. రక్తం, డబ్బు. నిన్ను వొదిలి పెట్టనని రక్తం అంటోంది, నీ కథ  ముగించడానికి పదా - అని డబ్బు అంటోంది.  రెండూ వూహించని పరిణామాలే.  మార్టీ కథ పూడ్చిపెట్టాక ఖతం, ఇక ప్రాబ్లం లేదనుకుంటే సీట్లోంచి రక్తం ఉబికి రావడం!  ఎబ్బీతో కట్ చేసుకుని వూరొదిలి  వెళ్లి పోదామని తయారవుతూంటే, అనూహ్యంగా మార్టీ ఫోన్ మెసేజ్ బయట పడి- ఎక్కడికి పోతావ్,  ఇక్కడే వుంటావ్ – అంటోంది.

            రే డబ్బు కాజేశాడన్న ఈ ఆరోపణేమిటి?  ఇది అబద్ధపు ఆరోపణ. కసికొద్దీ చేసి వుంటాడు మార్టీ. ఫస్టాఫ్ లో తను ఎబ్బీ మీది కెళ్ళి ఎటాక్ చేసినప్పుడు అక్కడ,  ఎబ్బీతో వున్న  రే ని చూసిన మంట చల్లారక, ఇలా తీర్చుకుని వుంటాడు. అయితే ఈ ఫోన్ మెసేజ్ ఇప్పుడు బయటపడి మార్టీ ప్రతీకారానికి లీడ్ చేయడం జస్ట్ రే ఫేట్!

            రే ఫేట్ ఇంకెలా వుందంటే, ఈ సీనులో డోర్ కూడా పాత్ర పోషించి కథ చెప్పింది.
అతను వస్త్రం కోసం ఇంట్లో కొచ్చినప్పుడు, వెనుక డోర్ చటుక్కున  మూసుకుంటుంది. అప్పుడే కారులో మారీస్ వస్తాడు. అంటే రే బుక్కై పోవడమన్న మాట. అలాగే వస్త్రంతో రే బయటి కెళ్ళినప్పుడు మళ్ళీ డోర్ చటుక్కున మూసుకుంటుంది. ఈసారి దీనర్ధం, ఇక ఈ ఇంటితో -  జీవితంతో నీకు ఋణం తీరిపోబోతోందని.  ఈ అర్ధాలు కన్వే చేయడానికే డోర్ మూవ్ మెంట్స్ ని స్క్రిప్టులో పొందుపర్చారు...

(సశేషం)
-సికిందర్

 






13, సెప్టెంబర్ 2017, బుధవారం

513 : డార్క్ మూవీస్ స్క్రీన్ ప్లే సంగతులు - 16

    సీను చేసే పనులు రెండు అని చెప్పుకున్నాం. ఒకటి,  పాత్ర గురించి కొత్త విషయాలు చెప్పడం; రెండు, సీనుని ముందుకి నడిపించడం. పాత్ర గురించి పది విషయాలు చెప్పినా ఫర్వాలేదు. ఎందుకంటే వాటి బిజినెస్ సీనుని  ముందుకి నడిపించడం కాదు. సీనుని ముందుకి నడిపించడానికి కథకి సంబంధించిన సమాచారమే కావాలి. ఈ సమాచారం సీను కొక్కటి మాత్రమే వుండాలి. రెండు మూడు సమాచారాలిస్తే సీను ఎటు పోవాలో అర్ధం కాదు. సొనాలిక ఫోన్ చేసి మాయాంక్ తో- వచ్చేటప్పుడు నీ సర్టిఫికెట్లు పట్రా  – అంటే, తర్వాతి సీన్లో మాయాంక్ సర్టిఫికేట్లతో  రావడానికి ఇది లీడ్ లేదా సమాచారమవుతుంది. తర్వాతి సీనులో  సర్టిఫికెట్లతో వస్తే ఏం జరుగుతుందోనన్న ఆసక్తి ఏర్పడుతుంది. ఇలాకాక సర్టి ఫికెట్లు, కాఫీ పౌడరు, సపోటాలు పట్రా అంటే, మర్చిపోయా- అగ్గిపెట్టె కూడా కావాలి- అంటే  సర్టిఫికెట్ల ప్రాధాన్యం తగ్గిపోతుంది. తర్వాతి సీను దేని గురించో కూడా స్పష్టత వుండక ఆసక్తి కల్గించదు. ఆసక్తి కల్గించే దృష్టితోనే సమాచారమివ్వాలి, అదీ పాయింటెడ్ గా ఒకే సమాచార  మిచ్చినప్పుడే ఆసక్తి పుట్టిస్తుంది. ఐతే ఒక్కోసారి సీనులో రెండేసి సమాచారాలు కూడా వుంటాయి. ఈ రెండేసి  సమాచారాలు సీను సాదాగా వుండకుండా, మలుపులు (ట్విస్టులు) సృష్టించడానికి ఉపయోగ పడతాయి. అంతిమంగా బాబు లాంటి ఒక్క సమాచారమే సీనుని ముందుకి నడిపిస్తుంది. అంటే మొదటి సమాచారాన్ని తలదన్నేట్టు రెండో సమాచారం ట్విస్టు ఇవ్వాలన్న మాట. ఇది  ‘బ్లడ్ సింపుల్’  లో ఎలా ప్లే అయిందో చూద్దాం!


          ‘బ్లడ్ సింపుల్’ గత సీనులో  విస్సర్ ఫోటోలనికాలుస్తున్నప్పుడు సిగార్ లైటర్ ని వెతుక్కుని కంగారు
పడ్డంలో పెద్ద బ్లండర్ వుంది గమనించారా? మనకి చూపించిన ప్రకారం అతను మార్టీ ని షూట్ చేసిప్పుడు లైటర్ ని ఆ నేర స్థలంలోనే టేబుల్ మీద మర్చిపోయాడు. అందుకే లైటర్ ఇప్పుడు జేబుల్లో  లేదు. మరి ఇక్కడ ఫోటోలని ఎలా కాలుస్తు
న్నట్టు? 

          ఇలాటి బ్లండర్ ఇంకొకటి, మార్టీ ‘చనిపోయాక’ రే బార్ కొచ్చి హెడ్ లైట్స్ ఆఫ్ చేయకుండా కారుని పార్క్ చేసిన సందర్భంలో గమనించాం. సీనులో ఒక మిర్రర్ ఎఫెక్ట్ కోసం లాజిక్ ని అలా త్యాగం చేశారు. కారు హెడ్ లైట్స్ తో అంత బాహాటంగా  కొట్టొచ్చినట్టూ వుంటే, అప్పుడు బార్ కొచ్చిన మారీస్ అది చూడకుండా వుంటాడా? చూడనట్టే చూపించారు. ఇలాటి లాజికల్ బ్లండర్స్  మామూలు ఫార్ములా థ్రిల్లర్స్ లో చెల్లిపోవచ్చు గానీ, ప్రొఫెషనల్ గా  వుండాల్సిన డార్క్ మూవీస్ లో పంటికింద రాయిలా వుంటాయి.

          సరే, విస్సర్ కి లైటర్ లేదని తెలిసింది. పరుగెత్తాడు. ఈ సీనులో సమాచారమేమిటి? లైటర్ మిస్ కావడమే. అంటే తర్వాతి సీన్లో వెళ్ళాల్సిన చోటికి వెళ్లి వెతుక్కుంటాడన్న మాట. ఆ సీను మార్టీ ఆఫీసులో వుండదు, ఎందుకంటే లైటర్ అక్కడ మర్చిపోయాడని అతడికి తెలీదు. ఐతే ఈ లైటర్ లేకపోవడం గమనించడానికంటే ముందు, మార్టీ  కవర్లో ఫోటో పెట్టకుండా చేసిన మోసం అతడికి తెలిసింది. ఇది ఈ సీనులో ముందు దొర్లిన సమాచారం. దీని ప్రకారం ఈ సీను అప్పుడే మార్టీ ఆఫీసులో ఫోటో వెతుక్కునే సీనుకి దారితీయాలి. అయితే అంతలో లైటర్ మిస్సయిందనే ఇంకో సమాచారం బయటపడింది. ఇది ముందు సమాచారాన్ని తలదన్నే రెండో సమాచారం. మొదటి సమాచారానికి ట్విస్టు ఇచ్చింది. ముందు సమాచారంతో ఫోటో ఎక్కడుందో విస్సర్ కి తెలుసు. మార్టీ ఆఫీసుకి వెళ్లి దాన్ని తొలగించగలడు. అది సమస్య కాదు. కానీ లైటర్... లైటర్ ఎబ్బీ బ్యాగులో పడిపోయి వుంటుంది!  ఎబ్బీ బ్యాగులో తను రివాల్వర్ ని దొంగిలిసున్నప్పుడు పొరపాటున అందులో లైటర్ పడిపోయివుంటుంది. ఆమె గనుక చూస్తె కొంపలంటుకుంటాయి, బ్యాగులో రివాల్వర్ లేకపోవడం, లైటర్ వుండడం తన మెడకి చుట్టుకుంటాయి. 

          ఇలా మొదటి సమాచారానికి రెండో సమాచారం ట్విస్టు ఇవ్వడంతో ఈ ఒక్క సమాచారంతో అతను పరిగెత్తాడు.

30. ఎబ్బీ బ్యాగులో విస్సర్ లైటర్ వెతకడం
         ఇలా రాశారు : పైన లయబద్ధంగా తిరుగుతున్న సీలింగ్ ఫ్యాను శబ్దం. టిల్ట్ డౌన్ చేస్తే రే ఫ్లాట్ లో లివింగ్ రూమ్.  

          ఫోర్ గ్రౌండ్ లో చైర్ లో టెలిఫోన్ వొళ్ళో పెట్టుకుని,  డో ర్ వైపు తిరిగి కూర్చుని వుంటాడు విస్సర్.  డోర్ ఓపెనై వుంటుంది. టేబుల్ మీద ఎబ్బీ బ్యాగులోని వస్తువులన్నీ చెల్లా చెదురుగా పడుంటాయి. ఆమె పర్సు వుండదు. ఒక క్షణం తర్వాత విస్సర్ లేచి ఆ వస్తువులన్నీ తిరిగి  బ్యాగులో పడేస్తూ వుంటాడు.

          ఇదీ సీను.  పైన సీలింగ్ ఫ్యాను తిరుగుతూ వుండడం వెనుక సీనులో ఫోనులో ఎబ్బీ విన్న శబ్దానికి అర్ధం. విస్సర్ వొళ్ళో టెలిఫోన్ అతనే ఫోన్ చేశాడనడానికి నిదర్శనం. బ్యాగులో వస్తువులన్నీ చెల్లా చెదురుగా పడి వుండడం అతను లైటర్ కోసం వెతికేశాడనడా నికి తార్కాణం. 

          సీను గమ్మత్తుగా భూతకాలంలో వుంది. సీను ఓపెనై విస్సర్ లైటర్ని వెతుక్కుంటూ కూర్చునే వర్తమాన కాలంలో లేదు. సీనులో జరగాల్సిందంతా ఆల్రెడీ జరిగిపోయింది. స్పిరిట్యువల్ మీనింగ్. కాలానికి కాలాల్లేవు. ఏకకాలంలో అన్నీ జరిగిపోతాయి. మనకి జరిగినవీ, జరగాల్సినవీ అన్నీ ఆల్రెడీ ఏకకాలంలో జరిగిపోయి వుంటాయని శాస్త్రవేత్త  ఆల్బర్ట్ ఐన్ స్టీన్ కూడా అంటాడు. 

          సిడ్ ఫీల్డ్ కూడా అంటాడు, సీను చివర్లో ఎంటరై చప్పున బయటికి వచ్చేయమని. దెబ్బకి సీను ఖతం. సినిమా కళలో మనకి తెలియని కోణాలెన్నో వున్నాయి. ఇంకే కళ లోనూ ఇన్నిన్ని కోణాలుండవు. 

          ఈ సీనులో సమాచారం లైటర్ మీద ఇక ఆశ వదులుకున్నాడని. ఇది అతడి ఫేసు చూస్తేనే తెలుస్తుంది. ఇక వెనుక సీనులో సెకండరీ సమాచారం ప్రకారం ఫోటో కోసం మార్టీ బార్ కి వెళ్ళడమే మిగిలింది...


(సశేషం)

(యూనివర్సిటీ ఆఫ్ హోస్టన్ స్కూల్ ప్రాజెక్టు కోసం విద్యార్ధులు ఎనాక్ట్ చేసిన ‘బ్లడ్ సింపుల్’ లో విస్సర్ మార్టీని చంపే దృశ్యం కోసం  ఇక్కడ క్లిక్ చేయండి 

-సికిందర్
         





 


              




512 : స్పెషల్ ఆర్టికల్

        తెలుగు సినిమాల కర్తలు ఒక విచిత్రమైన – కొంపలు ముంచుకునే  కమ్యునికేషన్ గ్యాప్ తో హాయిగా గడిపేస్తున్నారు. దేశంలో లేదా రాష్ట్రంలో  ఏ పరిణామం సంభవించినా సినిమాలకది  శాశ్వత కమర్షియల్ ముడి సరుకవుతుందని సంబరపడి  సినిమాలు నిర్మించేస్తున్నారు. మాసి పోయిన పరిణామాలు ఇంకా సమసిపోని బాక్సాఫీసు దినుసులే అనుకుంటూ అహోరాత్రాలు కష్టపడిపోతున్నారు. వాటిని సజీవంగా వుంచడానికి పదుల కోట్ల రూపాయలు పణంగా పెడుతూ ప్రతిష్టాత్మకంగా ఫీలవుతున్నారు. తీరా బాక్సాఫీసు ఇస్తున్న సందేశాలు చూసి లబోదిబోమంటున్నారు. బాక్సాఫీసు ఎప్పుడూ వర్తమానంలో వుండి,  రియల్ టైం ఫలితాలనే అందిస్తుందనీ,  ‘The Power of Now’ ని ఎత్తిచూపుతుందనీ తెలుసుకోలేక పోతున్నారు. బిజినెస్ అంటే ప్రేక్షకుల మార్కెట్ అని కాక, బిజినెస్ అంటే బయ్యర్లే అనుకుంటున్నారు. మార్కెట్ యాస్పెక్ట్ అనే ఒక నిర్లక్ష్యం చేస్తున్న పదాన్ని అర్ధంజేసుకోలేక, క్రియేటివ్ యాస్పెక్ట్ లకి పాల్పడుతున్నారు. మార్కెట్ యాస్పెక్ట్ లేని క్రియేటివ్ యాస్పెక్ట్ ఎందుకూ కొరగాదని తెలుసుకోలేకపోతున్నారు. పూర్తిగా ప్రేక్షకులతో, సమాజంతో, దేశంతో సంబంధాలు తెగిపోయిన కూపస్థ మండూకపు కళలు పోతున్నారు. ఇలా కఠినంగా చెప్పాల్సి వస్తున్నా చెప్పక తప్పడంలేదు. సినిమాలు  తీయడానికి నక్సలిజాన్ని వాడుకోవడం అయిపోయింది, ఫ్యాక్షనలిజాన్ని అరగదీయడం అయిపోయింది, మాఫియాయిజంని  అడపాదడపా సానబట్టడం జరుగుతోంది; నక్సలిజానికీ, ఫ్యాక్షనలిజానికీ  కాలదోషం పట్టిందని వదులుకున్న ప్రాప్త కాలజ్ఞత, మాఫియాయిజంతో కలగడం లేదు. సరే, మాఫియాలు ఎప్పుడూ వుండే అసాంఘీక శక్తులే అనుకుందాం, బాలీవుడ్ దీన్ని వాడుకోవడం ఎప్పుడో మానేసింది.  తీస్తే గీస్తే  గతంలో కి వెళ్లి ‘ఒన్స్ అపాన్ ఎ టైం....’ బాపతు  గతకాలపు మాఫియా వ్యవహారాలు  తీస్తున్నారు.  రెండు వారాల క్రితం విడుదలైన ‘డాడీ’ 1980 లనాటి ముంబాయి డాన్ అరుణ్ గావ్లీ కథే. ఇక ప్రత్యేక శ్రద్ధ తీసుకుని తనకంటూ ప్రియమైన  తెలుగు మాఫియాల్ని సృష్టించుకుని, మూవీ మేకింగ్ మేడీజీ చేసుకున్న పూరీ జగన్నాథ్ కూడా తన కెరీర్ ని ‘నిల్లేరు’ మీద నడకలా ఫీలవుతున్న చారిత్రక సందర్భంలో, ఇంకోపక్క ఇంకొందరు ఆరిపోయిన టెర్రరిజపు నిప్పుల్ని రాజేస్తున్నారు. దీపపు పురుగుల్లా అందులోపడి ఆహుతైపోతున్నారు. ఇదీ ఇప్పటి సమస్య!

         
టెర్రరిజం ఆరిపోయిన నిప్పా? ఆరిపోయిన నిప్పే కాశ్మీర్ ని వదిలేసి. దేశంలో నగరాల మీద జరిగిన టెర్రర్ దాడుల్లో 2013 లో హైదరాబాద్ దిల్ సుఖ్ నగర్ దాడి చిట్ట చివరిది. ఆ తర్వాత జరుగుతున్నవన్నీ కాశ్మీర్ లోనే. ‘రా’ వెబ్సైట్, ‘ఎన్ ఐ ఎ’ వెబ్సైట్ ఇది చెప్తాయి. నిన్నటికి నిన్న ‘టైమ్స్ నౌ’ బయట పెట్టిన టేపుల్లో కాశ్మీర్ నాయకుడి ప్రగల్భాలు చూస్తే, వాళ్ళ లక్ష్యం సిరియా ఐఎస్ తో కలిసి కాశ్మీర్ ని ఇస్లామిక్ రాజ్యంగా మార్చడమే. ఇందుకే గత కొంత కాలంగా కాశ్మీర్ కే పరిమితమవుతున్నాయి దాడులు. అమెరికా ప్రభుత్వం విడుదలచేసిన ఒక రిపోర్టులో,  2016 లో పాకిస్తాన్ లో కంటే ఇండియాలో ఎక్కువ దాడులు జరిగాయని పేర్కొంది. అదీ కాశ్మీర్, ఛత్తీస్ ఘర్, ఝార్ఖండ్, మణిపూర్ లలో. మావోయిస్టు దాడుల్ని కూడా కలిపి ఈ రిపోర్టు ఇచ్చింది. ఛత్తీస్ ఘర్, ఝార్ఖండ్, మణిపూర్ లలో మావోయిస్టు దాడుల్ని తీసేస్తే, టెర్రర్ దాడులు జరిగింది ఒక్క కాశ్మీర్ లోనే.

          ఈ పరిస్థితుల్లో ఇంకా 2013 నాటి దిల్ సుఖ్ నగర్ బాంబు పేలుళ్ళ మీదే  గ్లామర్ పెంచునుని నక్షత్రాలూ, యుద్ధం శరణాలూ  తీస్తే ఏమౌతుంది? మూడవుతాయి : ఒకటి - ప్రేక్షకులకి పరమబోరు; రెండు - టెర్రరిస్టులకి పరమానందం; మూడు - ప్రభుత్వానికి పరాభవం. 

          మూడోదే చాలా విచారకరమైనది. సినిమా కర్తల సెన్సిటీవిటీని వెల్లడిస్తుంది. 2014 నుంచి రాష్ట్రాల్లో ఎలాటి దాడులు జరక్కుండా నిఘా సంస్థలూ బలగాలూ కట్టు దిట్టం చేసుకు వస్తూంటే, సినిమాలుతీసి దాడులు చూపించడం ప్రభుత్వం మీద జోకేయడమే అవుతుంది. ఆల్రెడీ విమెన్ సేఫ్టీ విషయంలో పోలీసులకి ఈ పరాభవం ఎదురవుతూనే వుంది. పోలీసులో పక్క స్త్రీల భద్రత కోసం బయటికెళ్ళి నప్పుడు ఫలానా యాప్ వాడండీ, ఈఈ  జాగ్రత్తలు తీసుకోండీ - అని వూర ప్రచారం చేస్తూంటే, ఇదేం పట్టక సినిమాల్లో అజ్ఞానపు హీరోయిన్ పాత్రల్ని సృష్టించి ప్రమాదాల్లోకి నెట్టేయడం చేస్తున్నారు. ఎవేర్నెస్ బదులు పోలీసుల ప్రచారానికి గండి కొట్టడం. ఇది వరకు సినిమాల్లో సామాజిక సృహ అంతగా అవసరపడలేదు. ఇప్పుడు అత్యవసరంగా స్పృహ తెచ్చుకోకపోతే, వ్యతిరేక సంకేతాలివ్వడాన్ని డీఫాల్టు యాప్ గా ఇన్ స్టాల్ చేసుకునే ప్రమాదం వుంది.

          అలాగే ఇంకా బాంబు దాడులు జరిపించి టెర్రరిస్టు కథలతో సొమ్ము చేసుకోవా
లనుకోవడం, ప్రభుత్వాన్ని పరిహసించడమవుతుందో కాదో మైండ్ పెట్టి ఆలోచించాలి. దేశభక్తి నినాదాల వల్ల ఈ పరిహాసం నీరాజనమైపోదు. అయినా సరే పరిహాసం కాదనుకుంటే ఇలాగే మరిన్ని నిరభ్యంతరంగా తీసుకోవచ్చు, ఏం ఫర్వాలేదు. బాక్సాఫీసు చూసుకుంటుంది.  ముందు ఏ విషయం స్పష్టత తెచ్చుకోవాలి.  బాలీవుడ్ కూడా ఈ దాడుల సినిమాలు వదిలేసిందని గుర్తుంచుకోవాలి. 2013 లో వర్మ తీసిన ‘ది ఎటాక్స్ ఆఫ్ టెర్రర్ - 26 /11’ ఆఖరిది. ఆ తర్వాత “పాంథమ్’ (2015), ‘బేబీ’ ( 2015), ‘నీరజ’ (2016) వచ్చాయి. మొదటి రెండూ  విదేశాల్లో టెర్రరిస్టుల్ని పట్టుకోవడం గురించి. రెండోది,  1983  లో అబూ నిదల్ హైజాక్ చేసిన అమెరికా విమానం గురించి.

          అసలు విషయమేమిటంటే,  టీవీ సీరియల్స్ వచ్చేసి ఫ్యామిలీ కథలనే జానర్ ని సినిమాలకి లేకుండా చేశాక, అచ్చమైన ఫ్యామిలీ కథలు ఇక చెప్పలేమని, వాటిని ఫ్యాక్షన్ కథల రూపంలో తీసి తిరిగి ఫ్యామిలీ ప్రేక్షకుల్ని సంపాదించుకోవడం మొదలెట్టారు. ఫ్యామిలీ కథలకి హింసని జోడిస్తే తప్ప ఈ జనాలు చూసేట్టు లేరని అలా ఫ్యాక్షన్ సినిమాలు తీసి తగిన శాస్తి చేయడం మొదలెట్టారు. ఆ సినిమాల్లో అన్నీనరుక్కునే దుర్మార్గుల కుటుంబాల కథలే. ఇవే గొప్ప కుటుంబకథా చిత్రాలుగా తరించారు ప్రేక్షకులు కూడా. రానురాను ఫ్యాక్షన్ కి కాలదోషం పట్టి మాఫియాలు దొరికారు. ఇక మాఫియాల కుటుంబాల కథలు. ఒక మాన మర్యాదలున్న వాళ్ళ కుటుంబ కథలిక లేవ్!  అమాయక ప్రేక్షకులు కూడా మానమర్యాద ల్లేవ్, బొంగూ లేదన్నట్టుగా తయారయ్యారు.ఇలా వుండగా దిల్ సుఖ్ నగర్లో ధనా ధనా  బాంబులు పేలాయ్. దీంతో కుటుంబ కథలు దీని మీద పడ్డాయి. కుటుంబ కథ పరాన్న జీవి అయిపోయింది. ఎక్కడ కొత్త హింస వుంటే  అక్కడ దాన్ని పట్టి పల్లార్చడం మొదలెట్టింది. 

          ఇంతే గానీ, ఈ బాంబు దాడులతో సందేశాలిచ్చేదేమీ వుండదు. కుటుంబ కథలకోసం కరివేపాకులా వాడుకోవడమే. అయితే దారుణంగా ఇవే అట్టర్ ఫ్లాపవుతున్నాయి. ఇలాటిదే ఇంకో టెర్రర్ కథ (దీంట్లో కుటుంబ కథలేదు)  మూడేళ్ళుగా నలుగుతోంది. ఇప్పుడుదాన్ని మార్చాలని, ఇప్పుడున్న పరిస్థితులతో అప్ డేట్ చేసుకోవాలని చెప్పి చేయందించినా, బావిలోంచి పైకి రాలేని పరిస్థితి –  ఫ్లాపైన ‘నక్షత్రం’, ‘యుద్ధం శరణం’ టైపులోనే  ఆలోచనలు!



-సికిందర్ 
https://www.cinemabazaar.in

12, సెప్టెంబర్ 2017, మంగళవారం

511 : స్పెషల్ ఆర్టికల్





      నిర్మాతలకి కథలు విన్పించే ముందు, ఒకటికి రెండు సార్లు క్రాస్ చెక్ చేసుకుని విన్పించక పోతే త్రిశంకు స్వర్గంలో పడతారు. ఏ నటీనటీనటులకో, టెక్నీషియన్లకో, మిత్రులకో   విన్పించి క్రాస్ చెక్ చేసుకుంటే సరిపోదు. కథల మీద అవగాహన వుండే రచయితలకో, దర్శకులకో విన్పించుకోవాలి. సమస్య – దాని సాధన- పరిష్కారం నిర్దుష్టంగా వున్నాయని ధృవీకరించు కున్నాకే నిర్మాతలకి విన్పించేందుకు అడుగెయ్యాలి. నిర్మాతలతో మూడు జరగవచ్చు :  కథ అసలు నచ్చక పోవచ్చు, నచ్చి కొన్ని మార్పులుసూచించ
వచ్చు, నచ్చిఉన్నదున్నట్టు ఓకే చేయవచ్చు. మొదటి రెండిటితో పేచీ లేదు. నచ్చకపోతే చేసేదేం లేదు, నచ్చి మార్పులు సూచిస్తే ఇష్టముంటే వాటికి అంగీకరించవచ్చు – లేకపోతే  నో  చెప్పేసి వెళ్లిపోవచ్చు. వీటితో సమస్య లేదు. సమస్యల్లా మూడో దాంతోనే. 


          సొంతంగా రాసేసి, ఏ క్రాస్ చెక్ చేసుకోకుండా నమ్మేసి,  నిర్మాతకి  విన్పిస్తే  – ఆ నిర్మాతకి ఉన్నదున్నట్టు ఆ కథ నచ్చేసి, ఓకే చెప్పేశాక – అదే కథని ఇంకెవరికో విన్పించినప్పుడు, అందులో పెద్ద పెద్ద సుడిగుండాలు వున్నాయని  క్రాస్ చెకింగ్ లో బయటపడితే, అప్పుడు సదరు రచయిత పరిస్థితి / దర్శకుడి దుస్థితి ఏమిటి?

          కుమారి 21 ఎఫ్ లో పాటలాగా – కథని  సరిదిద్ది నిర్మాతకి చెప్పాలా వద్దా? చెప్పాలా వద్దా? చెబితే మొదట చెప్పినప్పుడు కథతో కలిగిన ఇంప్రెషన్ వుంటుందా పోతుందా?  వుంటుందా పోతుందా? ఛత్, వున్నదున్నట్టే తీయాలని ఆయనంటే  హిట్టవుతుందా అవదా? హిట్ట వుతుందా అవదా? అసలు నిర్మాత డిస్టర్బ్ అయి వుంటాడా వదులుకుంటాడా? వుంటాడా వదులుకుంటాడా? ఇలావుంటుంది పరిస్థితి. 

          ఇలాటి కేసులు తరచూ తగుల్తున్నాయి ఈ వ్యాసకర్తకి. ఇలాంటప్పుడు చివరిదే జరిగే అవకాశా లెక్కువ వుంటాయి. నిర్మాత డిస్టర్బ్ అయి సెట్ అయిన ప్రాజెక్టు ఇక వుండకుండా పోతుంది. ఒకవేళ గుట్టు చెప్పకుండా ముందు చెప్పిన కథతో అలాగే ముందు కెళ్తే నిర్మాత డబ్బు నష్టపోవడంతోబాటు, సదరు దర్శకుడు లేదా రచయిత కేరీర్ ని కోల్పోతాడు. ఇలా చేయడం కూడా మనస్కరించదు. త్రిశంకు స్వర్గంలో వూగిసలాడుతూంటారు.

          అందుకే ముందే క్రాస్ చెక్ చేసుకోవడం మంచిదనేది. చాలా మందికి చెప్పి క్రాస్ చెక్ చేసుకున్నాం,  వాళ్ళు బావుందన్నారు అంటే,  ఎవరు వాళ్ళు?  అనే ప్రశ్న వస్తుంది. కథలతో సంబంధం లేనివాళ్ళతో క్రాస్ చెకింగ్ కరెక్టేనా? తెలిసిన దర్శకుడికో,  రచయితకో విన్పిస్తే సరయిన ఫీడ్ బ్యాక్ వచ్చే అవకాశముంటుంది. ప్రేమలో త్యాగం ఉదాత్తమైనదని చెప్పడం ముగింపు అనుకుందాం. ఈ ముగింపు సీన్లకి సృష్టించిన డ్రామాకి, ఫీల్ కి పడిపోయి కథలతో సంబంధం లేని వాళ్ళంతా బావుంది బావుంది అన్నారనుకుందాం. ఓ నిర్మాతకి చెబితో  ఆయన కూడా ఆ ముగింపుకే  ఫ్లాట్ అయిపోయి ఓకే చేశానుకుందాం -  తీరా ఇంకో క్రాస్ చెకింగ్ లో ఆ ముగింపులో చేసిన త్యాగంలో  స్వార్ధం, క్రౌర్యం, పరిహాసం వగైరా వగైరా నెగెటివిజాలు ఎన్నో కనబడుతున్నాయని లాజికల్ గా తేలితే?  ఇది కరెక్టే అని తన కామన్ సెన్సుకే ఇప్పుడనిపిస్తే అప్పుడేమిటి? ఏం చేయాలి? ముగింపులతోనే కాదు, కథా నడకలతో, హీరోగారి పోకడలతో, ఇంకా చాలాచాలా వాటితో ఇలాటి పరిస్థితులు ఎదురవుతున్నాయి.

          నిర్మాత చేత ఆఫీసుకూడా ప్రారంభించి,  తీరా కథలో కృష్ణ బిలాలున్నాయని బయటపడితే, ఆఫీసు వుంటుందా పోతుందా అని పీడకలలతో గడపడం భావ్యమేనా?  దీనికి పరిష్కారమేమిటి? ఒక్కటే మార్గం :  ఒకసారి సొంతంగా రాసుకుని నిర్మాతని ఒప్పించుకున్నాక ఇంకెవరికీ విన్పించుకోవద్దు. క్రాస్ చెకింగ్ జోలికిపోవద్దు. అప్పుడు కనీసం నిర్మాతని వంచిస్తున్నామనే గిల్టీ ఫీలింగ్ వుండదు. అజ్ఞానమే చాలా మనశ్శాంతినిస్తుంది. కాబట్టి ఎవరి సహకారం లేకుండా కథ రాసేసుకుని నిర్మాతని ఒప్పించాక, ఇక అందులో లోపాలెన్నే ప్రయత్నం చేయకూడదు. తీర్పుని బాక్సాఫీసుకే వదిలెయ్యాలి. 

          ఇంకో ఝలక్ కూడా ఇచ్చుకుంటున్నారు నిర్మాతలకి. నోటి దూలతో ఝలకానందాన్ని తీర్చుకుంటున్నారు. నల్గురితో కూర్చుని పర్ఫెక్ట్ కథ తయారుచేసుకుని నిర్మాతకి విన్పిస్తే –చాలా బావుందయ్యా దీన్ని టేకప్ చేస్తానని ఆయన అంటే, వెంటనే ఆ మాట పట్టుకుని ముందు కెళ్ళాలా? లేదు, నోటి దూల అలా చేయనివ్వదు. సార్ , ఇంకో వెర్షన్ కూడా వుందండీ, అది ఈ టైపులో వుంటుంది...అని మొదలెడితే, తలుపు తట్టిన అదృష్టం వుండేనా పోయేనా? ఈ ఝలక్ తో ఆ నిర్మాత - అది రేపు వింటా - అంటాడు. ఆ రేపు ఇక రాదు. ఓకే చేసిన వెర్షన్ కూడా ముందుకు పోదు. 

          నువ్వు రాసిన మొదటి ప్రతి షిట్ అన్నాడు సోమర్సెట్ మామ్. దాన్నుంచి వచ్చిన మేలు ప్రతి ఓకే అయ్యాక, షిట్ లాంటి చిత్తు ప్రతితో నిర్మాత టేబుల్ ని అశుద్ధం చేయమేమిటి?

          సినిమాలంటే క్రియేటివిటీ ఒక్కటే కాదు, సేల్స్ మాన్ షిప్ కూడా. ఇది లేకపోతే  క్రియేటివిటీ లేదు, దాని పిల్లా పాపలూ లేవు.


-సికిందర్




         
         
         
         


9, సెప్టెంబర్ 2017, శనివారం

509 : రివ్యూ!

ర్శత్వం : జి. ప్రజిత్
తారాగణం : అల్లరి రేష్, నిఖిలా విమల్, అవరాల శ్రీనివాస్, హైపర్ ఆది,త్యం రాజేష్ప్రకాష్, తులసి, సుధ, దితరులు
కథ - స్క్రీన్ ప్లే : వినీత్ శ్రీనివాసన్, మాటలు : చంద్రశేఖర్
సంగీతం :
 షాన్ రెహమాన్, ఛాయాగ్రహణం : ఉన్ని ఎస్‌.కుమార్
బ్యానర్ :
 జాహ్నవి ఫిలింస్, నిర్మాత : బొప్ప చంద్రశేఖర్
విడుదల : సెప్టెంబర్ 8, 2017

***
        అల్లరి నరేష్ అపజయాల బాట పట్టి ఆరేళ్ళయ్యింది. 2012 లో ‘సుడిగాడు’ తర్వాత సుడి లేకుండా పోయింది. బిగ్ స్టార్స్ కూడా సినిమాల్లో ఫస్టాఫ్ కామెడీలు చేయడానికి కేటాయించుకోవడంతో,  తన ఏకైక కామెడీ హీరోగిరీకి  ప్రమాదం వచ్చి పడింది. జంధ్యాల, ఈవీవీ ల్లాగా కామెడీలు తీసే దర్శకులు లేకపోవడంతో, నరేష్ నటిస్తున్న  సినిమాలు అల్లరైపోసాగాయి. తెలుగులో కామెడీ దర్శకుల లోటు ఎంత వుందో వరసగా ఫ్లాపైన  అల్లరి నరేష్ పన్నెండు సినిమాలని చూస్తే చాలు. 

         
పరిస్థితుల్లో అటు మలయాళ తీరంనుంచి ఋతుపవనాలు వచ్చినట్టు ప్రజిత్ వచ్చి వాలిపోయాడు. నరేష్ మారిపోయాడు. రొటీన్ ప్రేమలు, పాటలు, పేరడీలు, టెంప్లెట్ కామెడీలు తీసి అవతల పెట్టి,  మనసున్న కామెడీ చేసుకుందామని, సైబర్ నేరగాళ్ళ సమస్యని కాస్త సెన్సిబుల్ గా చెబుదామని ‘మేడ మీద అబ్బాయి’ గా దిగాడు. 

          ఒక రొటీన్ కి అలవాటయ్యాక వెంటనే మార్పు ఆకట్టుకోదు. అందులోనూ మలయాళ వెరైటీ ఏదోగా అన్పిస్తుంది. పైగా దర్శకుడు కూడా మలయాళీ. అయినా సరే, సీరియస్ గా ఇన్వాల్వ్ చేసి వాస్తవికతకి దగ్గరగా సింపుల్ కామెడీతో తనపని తాను చేసుకుపోతుంది.  ఒక సెల్ఫీ జీవితంలో ఎంత పనిచేస్తుందో మలుపులు తిప్పేస్తూ చెప్పుకు పోతుంది...


కథ 
     చదువంటే  శ్రద్ధ లేని శీను (నరేష్) ఎన్నటికీ గట్టెక్కలేని బీటెక్ బ్యాక్ లాగ్స్ (24) తో వుంటాడు. ఇంకోసారి పరీక్షలు రాసి గోదావరి జిల్లా పల్లెటూళ్ళో ఇంటికొస్తాడు. కిరాణా షాపు నడుపుకుంటూ అప్పుచేసి చదివించినా ప్రయోజకుడు కాని కొడుకు మీద పీకలదాకా వుంటుంది తండ్రి (జయప్రకాష్) కి. తల్లి (తులసి) వెనకేసుకొస్తూంటుంది. మేడ మీద గది వుంటుంది. ఆ గదిలో సెటిలై తిని పడుకోవడం తప్ప ఏమీ చేయడు. తండ్రి తిడుతూంటే ఇక లాభం లేదని, చదువు తనకి అబ్బదని, సినిమా డైరెక్టర్ అవుదామనుకుంటాడు. దాంతో తన దర్జా చూసి తండ్రి గర్వపడతాడనుకుంటాడు. వూళ్ళో  నల్గురు ఫ్రెండ్స్ వుంటారు. వాళ్ళల్లో బండ్ల బాబ్జీ (హైపర్ ఆది), (కార్తీ) సత్యం రాజేష్ లు ముఖ్యులు. వాళ్ళతో ప్లాన్ చేసి షార్ట్ ఫిలిం తీయాలనుకుంటాడు. సినిమాల్లోకి అదొక సర్టిఫికేట్ అవుతుందనుకుంటాడు. ఆ తీసిన షార్ట్ ఫిలిం తాగి ఎంజాయ్ చేస్తూంటే వాగులో కొట్టుకుపోతుంది. అప్పుడు పక్కింట్లో ఒక అందమైన అమ్మాయి సింధు (నిఖిలా విమల్) పేరెంట్స్ తో వచ్చి దిగుతుంది. ఆమె మీద మనసు పారేసుకుంటే  ఛీ కొడుతుంది. అంతలో రిజల్ట్స్ వచ్చి ఫెయిలవుతాడు. దాంతో రైలెక్కి టాలీవుడ్ పారిపోతాడు. అదే ట్రైన్లో  వుంటుంది జాబ్ ఇంటర్వ్యూ కి వెళ్తూ సింధు. ఆమెకి తెలీకుండా ఒక సెల్ఫీ తీసుకుని బండ్ల బాబ్జీకి పంపుతాడు. కానీ వారం పాటు తిరిగినా టాలీవుడ్ లో ఎవరూ గేట్లోంచి రానివ్వరు. తిరిగి ఇంటికొచ్చేస్తాడు. వచ్చేస్తే, సింధుని ఏం చేశావని  వూళ్ళో జనం తిరగబడతారు  సెల్ఫీ చూపించి. ఆమె అదృష్యంతో తనకేం సంబంధం లేదన్నా విన్పించుకోరు, తండ్రి గెంటేస్తాడు.

          సింధు ఏమయ్యింది? ఆమెతో  తనకెలాంటి సంబంధం లేదని శీను ఎలా నిరూపించుకున్నాడు? సింధు అసలు కథ ఏమిటి? హైదరాబాద్ లో ఒక ప్రైవేట్ డిటెక్టివ్ యుగంధర్ (అవసరాల శ్రీనివాస్) సాయంతో ఆమెని పట్టుకుని శీను తెలుసుకున్న రహస్యాలేమేమిటి? ఆమె శీనుకి దక్కిందా లేదా? ...ఇవన్నీ తెలియాలంటే వెండి తెరని ఆశ్రయించాల్సిందే. 

ఎలావుంది కథ 
        మలయాళ ‘ఒరు వడక్కం సెల్ఫీ’  కి రీమేక్. ఫేస్ బుక్  లాంటి సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ లో వర్చువల్ స్నేహలతో అవతలి వ్యక్తుల్ని నమ్మి మోసపోయే అమ్మాయిలకి ఓ విన్నపం చేసే కథ. రాద్ధాంతం చెయ్యకుండా సింపుల్ గా, వాస్తవికంగా  చేప్పే కథ. ఒకప్పుడు కలం స్నేహాలుండేవి. అప్పుడు లేని అనర్ధాలు ఇప్పుడు బాగా జరుగుతున్నాయి ఆన్ లైన్ స్నేహాలతో, ప్రేమలతో. ఇది స్థూలంగా కామెడీ కథలా అన్పించినా, జానర్ మిక్స్ చేసిన కామిక్ – రోమాంటిక్ – థ్రిల్లర్. సున్నిత హాస్యమే దీని బలం. 2015 లో మలయాళంలో పెద్ద హిట్టయిన కథ. 

ఎవరెలా చేశారు  
     అల్లరి నరేష్ మారిపోయాడు. సినిమాతోనే కాదు, శరీరంతో కూడా. బరువు పెరిగి మొహంలో ఆకర్షణ తగ్గింది. అర్జెంటుగా బరువు తగ్గాల్సి వుంటుంది. ఇలాగే బొద్దుగా వుంటే కామెడీ హీరో లుక్ పోయి, రాముడు మంచి బాలుడు టైపుకి  సర్దుకోవాల్సి వస్తుంది. ఈ తరహా పాత్ర, సినిమా తనకెంత మేలు చేస్తుందో చెప్పడం కష్టమే. కానీ కీడు మాత్రం  చేయదు. అయితే ఈమధ్య  తన సినిమాలు చూడ్డం మానేసిన ఫ్యామిలీలు విశేష సంఖ్యలో దీనికి రావడం,ఇబ్బంది పడకుండా చూడడం ఒక విజయమే. కామెడీ కైనా క్వాలిటీని నమ్ముకుంటే ప్రయోగాలు  చేయడం సమస్యనిపించుకోదు. అన్నితరగగతుల ప్రేక్షకులు మారుతున్నారు. కృత్రిమ ఫార్ములా సినిమాలు ఇంకెన్నాళ్ళు చూస్తారు. నరేష్ చేసిన ఇంకోమంచి పని, ఒరిజినల్ దర్శ కుడీకే ఈ రీమేక్ ని అప్పగించడం. 

          హీరోయిన్ నిఖిలది ఒక సమస్యతో సైలెంట్ గా వుండే పాత్ర. ఉండుండి ఆ మౌనం బ్రద్దలయ్యే చివరి దృశ్యాలతో తారాస్థాయికి చేరింది. ఆన్ లైన్లో ప్రేమించిన వాడితో చివరిదాకా ఆమె విశ్వాసం అతి పెద్ద సస్పెన్స్ థ్రిల్లర్ నే, మిస్టరీనే క్రియేట్ చేస్తుంది. మలయాళంలో సినిమాలు వూహించుకుని పాత్రల్ని దిగుమతి చేసుకోరు. చుట్టూ ఎవడేం చేస్తున్నాడో  కనిపెట్టి సినిమాల్లో పెట్టేస్తారు. అందుకే సినిమాలు కల్తీ లేని కల్ట్ సినిమాలు. 

          మూడో పాత్ర హైపర్ ఆదిది. ఇతను లేకుండా సినిమాని వూహించడం కష్టమే. వండర్ఫుల్ కమెడియనితను. చివరి దాకా ఒక్కో డైలాగుకి అందరూ నవ్వడమే. పైకొస్తాడు. అవసరాల శ్రీనివాస్ డిటెక్టివ్ యుగంధర్ పాత్ర పోషించాడు. అసలు డిటెక్టివ్ పాత్రే తెలుగు సినిమాల్లో వుండదు, మలయాళ దర్శకుడు కాబట్టి తెలుగులోకి కూడా తేగలిగాడు. ఈ పాత్ర కొంత హాస్యాన్ని జోడించి పోషించాడు శ్రీనివాస్. ఈ పాత్ర కూడా సస్పెన్స్ పాత్రే. చివర్లోగానీ తెలియదు అసలు ఇతనెవరో.

          ఇంకా జయప్రక్షాష్, తులసి, సుధా, సత్యం రాజేష్ తడితులన్దరివీ సహజ పాత్రలే. మాటలో చేతలో ఫార్ములా డ్రామాల్లేవు, కృత్రిమత్వం లేదు.

          ఈ సినిమా ఒరిజినల్లోని ఫ్రేముకి ఫ్రేము, డైలాగుకి డైలాగు పక్కా అనుసరణే. కెమెరా వర్క్, లొకేషన్స్ చాలా పోయెటిక్ గా వున్నాయి –చిత్రీకరణలో  వెలుగు నీడల పోషణతో. ఆరోగ్యకరమైన హాస్యంతో క్రియేటివ్ డైలాగులు -  విసుర్ల రూపంలో తెగ నవ్విస్తూంటాయి. మలయాళంని తెలుగు చేసిన డైలాగ్ రైటర్ చంద్ర శేఖర్ పైకొస్తాడు - టెంప్లెట్ డైలాగులు సినిమాలకంటూ పెట్టుకున్న మసాలా డైలాగులూ  రాయకుంటే.
          ప్రజిత్ దర్శకత్వం ఉన్నతంగా వుంది.

చివరైకేమిటి?
      కామెడీగా మొదలై, మిస్టరీగా మారి, సస్పన్స్ థ్రిల్లర్ గా సాగే, ముగిసే, సజాతి జానర్ల వాడకం ఈ సాదా కథని నిలబెట్టింది. హీరో హీరోయిన్ల మధ్య ఎక్కడా ప్రేమ వుండదు. ఆమె దొరికాక, ఆమె సమస్య తీర్చడానికి తను – డిటెక్టివ్ – ఫ్రెండ్ – చేసే ప్రయాణం సెకండాఫ్ సగం నుంచి ఒకెత్తు. కథ ఒక్కో పొర విప్పుకుంటూ, కొత్త విషయాలు కలుపుకుంటూ,  ఆద్యంతం కదలకుండా కూర్చోబెడుతుంది. దీనికి ఉప కథలు అవసర పడలేదు. అతి పెద్ద రహస్యమంతా చివర్లో ఓపెనవుతుంది. పూర్తిగా కంటెంట్ ఓరియెంటెడ్ ఎంటర్ టైనర్ ఇది. లవ్, పాటలు, డాన్సులు, ఫైట్లు, వూర కామెడీ మాస్ డైలాగులు, వేషాలూ  కోరుకునే వాళ్ళకి ఇది నచ్చక పోవచ్చు.


-సికిందర్
cinemabazaar.in