రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

11, మార్చి 2017, శనివారం

రివ్యూ!






రచన -దర్శకత్వం:  అశోక్ .జి
తారాగణం: అంజలి, సింధుతులానీ,  దీపక్, రాజా వీంద్ర, ప్రకాష్, ప్తగిరి, స్వాతీ దీక్షిత్, సాక్షీగులాటీ  దితరులు
సంగీతం: సెల్వణేష్, స్వామినాథన్, ఛాయాగ్రణం: బాల్ రెడ్డి, జేమ్స్ క్వాన్
బ్యానర్ : శ్రీ విఘ్నేష్ కార్తీక్ సినిమా అండ్ క్రియేటివ్ డ్రావిడన్స్
నిర్మాతలు: గంగపట్నం శ్రీధర్, రెహమాన్
విడుదల : మార్చి10, 2017

***
         సైకలాజికల్ థ్రిల్లర్ తీసి ప్రేక్షకుల్ని మెప్పించాలంటే సైకియాట్రిస్టో, సైకాలజిస్టో అయి వుండనక్కరలేదు గానీ;  థ్రిల్లర్లు, మర్డర్ మిస్టరీలు తీయగల జానర్ పరిజ్ఞానంతో బాటు, డైనమిక్స్ తెలిసిన దర్శకుడు అయివుండడం అవసరం. దర్శకుడు జి. అశోక్ గతంలో తీసిన ‘పిల్ల జమీందార్’, ‘సుకుమారుడు’ అనే రోమాంటిక్ కామెడీల జానర్ నుంచి  కొత్తగా ‘చిత్రాంగద’ అనే సైకలాజికల్ థ్రిల్లర్ జానర్ కి మారినప్పుడు  చాలా కష్టపడాల్సి వుంటుంది. రోమాంటిక్ కామెడీల కుండేంత  మంది ప్రేక్షకులు హార్రర్ కామెడీల కుంటారేమోగానీ, సీరియస్ సైకలాజికల్ థ్రిల్లర్స్ కి వుండే అవకాశం లేదు- తెలుగులో కొద్దిపాటి మార్కెట్ వుండే ఈ జానర్ తో కెరీర్ కెటూ ఉపయోగం వుండదు. పైగా ఇప్పుడు దర్శకులు ఏవి పడితే అవి తీసేస్తూ ఒక ఐడెంటిటీ లేకుండా- ఫలానా ఈ దర్శకుడు ఫలానా ఈ తరహా సినిమాలకి పేరు అనే ముద్ర లేకుండా ప్రేక్షకుల దృష్టిలోనే పడలేకపోతున్న కాలంలో, దర్శకుడు  అశోక్ ఇప్పటికైనా తనకి ఏ జానర్ మీద పట్టుందో ఆ జానర్ కి కట్టుబడితేనే  బావుంటుంది. తోచిన జానర్ నల్లా తీసిన వాళ్ళు పేర్లు కూడా గుర్తురాకుండా పోయారు. ఏటా తొంభయ్యేసి శాతం ఫ్లాపులకి ఈ ‘జాక్ ఆఫ్ ఆల్ ట్రేడ్స్, మాస్టర్ ఆఫ్ నన్’ తత్త్వం  కూడా కారణమే. 

          ‘గీతాంజలి’ ఫేం అంజలి సినిమా మొత్తాన్నీ మొదలు పెడితే చివరి దాకా వదలకుండా భుజాన మోయగల సత్తావున్న హీరోయినే. దెయ్యంగా కనపడినా, సైకోగా కనపడినా అందులో పూర్తిగా జీవించిగానీ వదిలిపెట్టదు. అయితే ఈసారి జీవించడానికి ఎన్నో జీవితాలున్నాయి, ఒక్కో జీవితం ఒక్కో షేడ్ తో వుంది- ఈ షేడ్స్ ని  ప్రకటించిందో ఓ సారి చూద్దాం...
కథ
       వైజాగ్ లో సైకాలజీ బోధించే అసిస్టెంట్ ఫ్రొఫెసర్ చిత్ర (అంజలి) కాలేజీ అమ్మాయిలతో బాటు హాస్టల్లో వుంటుంది. హాస్టల్ లో దెయ్యం తిరుగుతోందనీ, ఆడ దెయ్యం మగవాడిలా మీద పడి కోరిక తీర్చుకుంటోందనీ అమ్మాయిలు హాస్టల్ ఖాళీ చేసి వెళ్లిపోతూంటారు. దెయ్యం చిత్రే  అని బయటపడుతుంది. తనెందుకు మగపిశాచిలా ప్రవర్తిస్తోందో తెలుసుకోవాలని  నీలకంఠ (జయప్రకాష్)  అనే సైకియాట్రిస్ట్ ని సంప్రదిస్తుంది. హిప్నాటిక్ సెషన్ లో  ఒకావిడ ఎవరో ఒక వ్యక్తిని చెరువులో చంపేస్తున్నట్టు కన్పిస్తోందని చెప్తుంది. హత్య కలలోకి కూడా వస్తోందని చెప్పి, చెరువు  అమెరికాలో వుందని తెలుసుకుని ఫ్రెండ్ సువర్ణ (స్వాతీ దీక్షిత్) తో అక్కడికి బయల్దేరుతుంది.

         
అక్కడ పరిచయమైన పోలీస్ కానిస్టేబుల్ సంయుక్త (సాక్షీ గులాటీ) ఇంట్లో వుంటూ చెరువు దగ్గర వుండాల్సిన అరేబియా రెస్టారెంట్  కోసం వెతుకుతూంటుంది. తన ప్రవర్తనకీ, తనకి వస్తున్న కలకీ ప్రాంతంతో వున్న సంబంధం ఏమిటా అని శోధిస్తున్నప్పుడు, ఆమె నమ్మలేని నిజాలు ఆమె గురించే బయటపడతాయి- ఏమిటవి? నిజాలు తెలుసుకుంటే ఆమెకేం జరిగింది? నిజాలు బయట పడకుండా ఎవరు, ఎందుకు ప్రయత్నిస్తున్నారు? మొత్తం మిస్టరీ ఏమిటి? దీంతో ఆమెకున్న సంబంధమేమిటి? ... ఇవన్నీ తెలుసుకోవాలంటే మిగతా కథ చూడాల్సిందే.


ఎలావుంది కథ 
     సైకలాజికల్ థ్రిల్లర్ జానర్ మర్యాదని కాపాడుతూ కొత్తగానే  వుంది కథ - ఇది నవలగా వచ్చిన నిజకథ అన్నారు.  గత డిసెంబర్ ఫస్టున విడుదలైన తమిళంలో  విజయ్ ఆంటోనీ నటించిన సైకలాజికల్ థ్రిల్లర్ ‘సైతాన్’ (‘బేతాళుడు’) కూడా  తమిళ రచయిత ‘సుజాత’ నిజ కథ ఆధారంగా రాసిన ‘ఆహ్’ అనే నవలకి చిత్రానువాదమే. సరీగ్గా ఈ కథని పోలి వుంటుంది ‘చిత్రాంగద’ కథ.  ‘బేతాళుడు’ లో హీరోకి కూడా ఇలాటివే పారానార్మల్ అనుభవాలెదురై, సైకియాట్రిస్టు దగ్గరికెళ్తే అతను పాస్ట్  లైఫ్ రిగ్రెషన్ ద్వారా గత జన్మలోకి తీసికెళ్తే- అక్కడ గతజన్మలో తానెవరో తెలుసుకుని- గతజన్మలో తన జీవితం ఎలాముగిసిందీ, తనని చంపినా భార్య  ఎందుకలా చంపిందీ తెలుసుకోవడానికి మాచర్ల ప్రయాణం కడతాడు.

         
‘చిత్రాంగద’ కథలో కూడా హీరోయిన్ ఇలాటివే పారానర్మల్ అనుభవాలతో డిస్టర్బ్ అయి, సైకియాట్రిస్టు చేసే  హిప్నాటిజంతో, తదనంతర ప్రయత్నాలతో, అమెరికా వెళ్లి అక్కడ  గత జన్మలో తాను  ఒక భర్త అనీ, తనని భార్య చంపేసిందనీ తెలుసుకుంటుంది...

          ‘
బేతాళుడులో గత జన్మ తాలూకు తన ఆత్మ తనని పట్టుకుని ఒకానొక  ‘జయలక్ష్మిని చంపమని  వేధించినట్టే, ప్రస్తుత కథలోనూ హీరోయిన్ ని పట్టుకున్న గతనజ్మలో భర్త అయిన ఆమె ఆత్మే, ప్రతీకారం కోసం రగిలిపోతుంది.

           
కాకపోతే బేతాళుడుజానర్ మర్యాద తప్పి- ఎత్తుకున్న కథ వల్లకాదని వదిలిపా రేసి- సెకండాఫ్ లో  అవయవాల అమ్మకపు మెడికల్ మాఫియా దుకాణం తెరిచి కూర్చుంది. అట్టర్ ఫ్లాప్ అయింది. కథ దివాలా తీశాక దుకాణాలెందుకుంటాయి. 

ఇది చాలనట్టు,  ప్రియుడితో కలిసి భార్య భర్తని చంపే నేరాలు ఘోరాల బాపతు క్షుద్ర కథగా బాక్సాఫీసు సెంటిమెంట్లకి విరుద్ధంగా తేల్చారు. ‘చిత్రాంగద’  కథలో గతజన్మలో భార్య భర్తని చంపాల్సివచ్చే కారణానికి బలమైన  పునాదులున్నాయి- బాక్సాఫీసుని ఒప్పిస్తూ.  

ఎవరెలా చేశారు 
      అంజలి నంబర్ వన్. కాకపోతే స్కర్ట్స్ లో ఆమె వేషధారణ భరించలేం. ఆమె ఫిజిక్ కి స్కర్ట్స్ ఎబ్బెట్టుగా వున్నాయి,  ‘బి’ గ్రేడ్ మూవీ ఫీలింగ్ కల్గించేలా.  తను అంత బరువెక్కి పోవడం కూడా ఎందుకో తెలీదు. వైజాగ్ లో స్కర్ట్స్ వేసుకు తిరిగే అసిస్టెంట్ ప్రొఫెసర్ ఎక్కడుంటుందో దర్శకుడికే తెలియాలి. నటించడంలో గానీ, జీవించడంలో గానీ ఏ తేడా రానివ్వలేదు. ముందే చెప్పుకున్నట్టు పాత్రకి చాలా  షేడ్స్ వున్నాయి : స్ప్లిట్ పర్సనాలిటీతో ప్రారంభమై, పారానార్మల్ బిహేవియర్ తో కొనసాగి, పాస్ట్ లైఫ్ సిండ్రోంకి వచ్చి ... మళ్ళీ వీటన్నిటినీ పూర్వపక్షం చేస్తూ తన తప్పే తెలుసుకునే రియలైజేషన్ ... ఇవన్నీ కలగలిసిన సంక్షుభిత వ్యక్తిత్వాన్ని సమర్ధవంతంగా  ప్రకటించింది. ఒకటి : తాను ఆడేపాడే గ్లామర్ హీరోయిన్ కాలేనప్పుడు సమస్యాత్మక పాత్రల్ని నటించే సామర్ధ్యం పెంచుకోవడమే. అయితే తను చేసిన  ఈ ప్రయత్నానికి దర్శకుడి పని తనంగానీ,  సంగీతదర్శకుడి సరిగమలు గానీ ఏమేరకు సహకరించాయో తర్వాత చూద్దాం. 

          రెండో బలమైన పాత్ర సింధూ తులానీ పోషించిన భార్య పాత్ర. ఆశ్చర్యకరంగా  సింధూ తులానీ స్లిమ్ గా తయారయ్యింది! స్లిమ్ గా వున్నందుకే ‘కంచె’లో క్షత్రియ యువతి పాత్ర పోషించిన ప్రగ్యా జైస్వాల్ లాంటి  పర్ఫెక్షన్ తో వుంది క్షత్రియురాలి పాత్రలో తను కూడా తులానీ. తను ఎందుకు హత్య చేయాల్సి వచ్చిందో వివరించే ఘట్టాలతో పాత్ర పట్ల సానుభూతి రేకెత్తే విధంగా పాత్రపోషణ చేసింది. 

          ఇక స్వాతీ దీక్షిత్, సాక్షీ గులాటీలవి కూడా నీటైన పాత్రలు. సైకియాట్రిస్టుగా జయప్రకాష్ ది ఏదో చక్రం తిప్పుతున్నట్టు వుండే పాత్ర గానీ, ఏం తిప్పుతూంటాడో మనకి అర్ధం గాదు. పైగా క్లయిమాక్స్ లో అర్జెంటుగా అమెరికాలో కళ్ళముందు చూస్తున్న యాక్షన్ దృశ్యానికి తొత్తు ఒకడు ఫోన్ చేస్తే, టకటకా కొన్ని ఆర్డర్స్ పాస్ చేసేసి, తాను ఇప్పుడే వస్తున్నానంటాడు- అమెరికా వెళ్ళడమంటే గాజువాక సెంటర్లో అర్జెంటుగా వాలిపోయే పనే అన్నట్టు.  పైగా తను అమెరికా చేరుకునే వరకూ రీళ్ళకి రీళ్ళు  క్లయిమాక్స్ జరుగుతూనే వుంటుందన్నట్టు (ఇప్పుడు రీళ్ళు లేకపోయినా ఇలాగే అనుకోవచ్చు తన తెలివి తేటలతో).  ఇంతా చేసి ఏమైపోతాడో అమెరికాకే వెళ్ళడు! 

          ఇక కామెడీ వుండాలన్నట్టు సప్తగిరీ రొటీన్ నాటు కామెడీ వుంటుంది. 
          టెక్నికల్ గా కెమెరా  వర్క్, ఆర్ట్ వర్క్ ఉన్నతంగా వున్నాయి- ఎంచుకున్న లొ కేషన్స్ , తీసిన విజువల్స్ చాలాచోట్ల కళాత్మకంగా వున్నాయి. సెకండాఫ్ నుంచి పూర్తిగా యూఎస్ లోనే వుంటుంది- అక్కడి దృశ్యాల చిత్రీకరణకి ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. పోతే పాటల నాణ్యతే నొచ్చుకునే విధంగా వుంది. 

చివరికేమిటి 
      మంచి కథకి జరగాల్సిన న్యాయం జరగ లేదు. 2015 లో జానర్ మర్యాదని కాపాడిన తెలుగు సినిమాలే విజయాలు సాధించాయని గుర్తించిన మీదట, 2016లో జానర్ మర్యాద అవసరం గురించి ఈ బ్లాగు ద్వారా చేయాల్సిన ప్రచారమంతా చేశాం. అయితే తెలుగు సినిమాల విజయాలకి తప్పనిసరై పోతున్న జానర్ మర్యాద అనే డిసిప్లిన్ కి- ఇంకో విధంగా కూడా విఘాతం కలిగే అవకశం పొంచి వుందని  ఈ సినిమా చూస్తూంటే బోధపడుతుంది. జానర్ మర్యాదని కాపాడుతూ చిత్రీకరణ అంతా చేస్తే చాలదనీ, ఈ చిత్రీకరణకి తగిన నేపధ్యసంగీతం కూడా జతపడకపోతే జానర్ మర్యాదంతా పోతుందనీ తెలుసుకోగలుగుతాం. సంగీత దర్శకుడు సెల్వ గణేష్ స్క్రిప్టులో, పాత్రలో లీనమయ్యే నేపధ్యసంగీతాన్ని అందించకుండా రొడ్డకొట్టుడుగా వాయించుకుంటూ పోయాడు. ఈ కథ ఎంత బలమైనదో, ఒకమ్మాయి జీవితంతో  అంత సున్నితమైనది కూడా. సున్నితమైన అంశాల్ని స్పృశిస్తున్నప్పుడు కూడా ఫంక్షన్ హాల్లో బాజాలు మోగిస్తున్న చందాన చెలరేగిపోయాడు. చాలా వరస్ట్! నిజానికి ఈ చిత్రీకరణ చాలా వరకూ నిశ్శబ్దాన్నే డిమాండ్ చేస్తోంది. నిశ్శబ్దమే ఈ సినిమా బలం. సమయమెరిగి సంగీతదర్శకుడు కీబోర్డు కట్టేసినప్పుడే తన నేపధ్య సంగీతపు బలమేమిటో తెలుపుకోగల్గుతాడు. నిశ్శబ్దం కూడా సంగీతమే. పారితోషికం తీసుకుంటున్నాం కదా అని మొత్తమంతా వాయించుకుంటూ కూర్చుంటే సినిమానే నాశనం చేస్తాడు. ప్రేక్షకులు కథనీ, పాత్రనీ ఫీలవ్వడానికి సంగీతపరంగా ఏ మాత్రం అవకాశమివ్వలేదు. ఈ కథ మన వాకిట వాలిన పిట్ట లాంటిది. ఏ మాత్రం అలికిడి చేసినా ఎగిరిపోతుంది. 

          దర్శకుడు కూడా దీనికి బాధ్యత వహించాలి. స్క్రిప్టు రాస్తున్నప్పుడే సౌండ్ డిజైన్ తెలిసిపోతూంటుంది. సౌండ్ ని అనుభవిస్తూ  రాసినప్పుడు స్క్రిప్టు కూడా సంగీతం పలుకుతుంది. సౌండ్, కథ వేర్వేరు కాదు. సౌండ్  అంటే నేపధ్య సంగీతమే కాకుండా, స్పెషల్ ఎఫెక్ట్స్ కూడా. ఇదంతా దర్శకుడికి తెలీదని కాదు- కానీ రొటీన్ గా ఏం జరిగిపోతూందంటే, అన్ని సినిమాలకీ ఒకే మూసలో  ఆర్ ఆర్ (నేపధ్య సంగీతం) చేసేస్తున్నారు. అలాటి మూసే ప్రస్తుత ప్రయత్నం. 

          ఇక కథనంతో ఇక్కడ వచ్చిన ఒక ఇబ్బంది ఏమిటంటే, సకాలంలో కథని ప్రారంభించకపోవడం.  కథ ఎప్పుడు ప్రారంభమయ్యింది? హీరోయిన్ కి గతజన్మలో తానెవరో తెలిసినప్పుడు. ఇదెప్పుడు తెలిసింది? సెకండాఫ్ సగంలో. అప్పటివరకూ ఏం నడిచింది? ఫస్టాఫ్ నుంచీ సెకండాఫ్ సగం వరకూ హీరోయిన్ తనకేం జరుగుతోందో తెలుసుకునే ప్రయత్నమే. ఒకవిధంగా ఇది ఎండ్ సస్పెన్స్ అనే సినిమాలకి పనికి రాని  కథనం. పాత్ర ఎవరో, కథేమిటో తెలియకుండా మూసి పెట్టినడపడం సస్పెన్స్ అన్పించుకోదు. ప్రేక్షకులకి సహన పరీక్ష అవుతుంది. 

          ఇలాటిదే కథ ‘బేతాళుడు’ లో హీరోకి తన గత జన్మ గురించి ఎప్పుడు తెలిసింది? ఫస్టాఫ్ సగంలో. కథ ఎప్పుడు ప్రారంభమయ్యింది? అప్పుడే – తానెవరో తెలియడం ప్లాట్ పాయింట్ వన్ అయితే- అక్కడ్నించీ ప్రారంభమైన మిడిల్ తో కథ ప్రారంభమయ్యింది. 

          ప్రస్తుత కథలో సెకండాఫ్ సగంలో కథ ప్రారంభమవడం వల్ల ఇంకేం జరిగింది? సినిమా నిడివి రెండున్నర గంటలకి చేరింది. ఫస్టాఫ్ ఉపోద్ఘాతాన్ని తగ్గించి, ఫస్టాఫ్ లో కథ ప్రారంభించి వుంటే నిడివి అరగంటకి తగ్గేది - ఈ అరగంటలో కామెడీ కోసం పెట్టిన కామెడీ కూడా కలుపుకుని. 

          థ్రిల్లర్స్, మర్డర్ మిస్టరీలు ఎండ్ సస్పెన్స్ సుడిగుండంలో పడే ప్రమాదాన్ని ఎల్లవేళలా కాచుకోవాల్సి వుంటుంది. ఇలాటి హీరో లేకుండా కేవలం రెండు స్త్రీ పాత్రల మధ్య జరిగే కథ నిజానికి చాలా బ్యూటీఫుల్ గా, మహిళా ప్రేక్షకులనే టార్గెట్ ప్రేక్షకుల్ని నిర్ణయించుకుని, ఆ మేరకు మార్కెట్ యాస్పెక్ట్ తో  తీసి వుండాల్సింది.

 -సికిందర్ 
http://www.cinemabazaar.in

 

         










6, మార్చి 2017, సోమవారం

రివ్యూ!







రచన-  దర్శకత్వం: ఎస్‌.కె. సత్య

తారాగణం: మంచు మనోజ్, ప్రగ్యా జైస్వాల్, సంపత్ రాజ్‌,
రాజేంద్రప్రసాద్, కోట శ్రీనివాసరావు, ప్రవీణ్, సత్య తదితరులు
సంగీతం: శ్రీవసంత్, ఛాయాగ్రహణం: సిద్ధార్థ రామస్వామి
బ్యానర్‌: క్లాప్స్ అండ్ విజిల్స్
నిర్మాత: శ్రీవరుణ్ అట్లూరి
విడుదల : మార్చి 3, 2017
***


       మంచు మనోజ్ కి ముచ్చటగా ఒక హిట్  అనేది హిమాలయాల ఎత్తున వుండిపోతోంది. ఎప్పుడో 2010 లో బిందాస్అనే సక్సెస్ తర్వాత వరుసగా 8 సినిమాలూ ఘోరపరాజయాలపాలయ్యాకా నైనా, తన ధోరణిలో మార్పు రావడం లేదు- సినిమా  అంటే తన దృష్టిలో ఏమిటో? సినిమాలు చూసే ప్రేక్షకుల గురించి తన అభిప్రాయమేమిటో?  సినిమా అంటే రద్దయిన పెద్ద నోట్లనీప్రేక్షకులంటే ఆ నోట్లు దగ్గరుంచుకున్న నేరస్థులనీ బెదిరిస్తూ  తన నటజీవితం రుద్దుతోంటే సినిమాలు భరిస్తున్న నేరస్థులకీ ఒక రోజొస్తుంది మనోజ్ మంచి సినిమాలు తీసి జన్మ ధన్యం చేసుకోవాలనీ ప్రార్ధించే రోజు! నేరస్థులైనా ప్రేక్షకులు శాంతికాముకులే.

          నేరాలు ఘోరాలు ఇప్పుడు టీవీలో రాకపోవచ్చు- కానీ సినిమాల రూపంలో అవి వారంవారం వస్తూనే వున్నాయి. తీసే విధానమంతా నేరమేచూపించే తీరంతా ఘోరమే. తప్పించుకునే యుక్తీ ఇంతా అంతా కాదు. 2014 లో ఏ స్థాయిలో దర్శకుడు ఎస్కే సత్య తన మొదటి ప్రయత్నం  ‘నా రాకుమారుడుతో చేశాడో, అంతకి  ఒక్క అంగుళం మించని టాలెంట్ తో   ‘గుంటూరోడుకి ప్రయత్నించడం విచిత్రం. వెనక్కి తిరిగి సుదూరంగా 1980ల నాటి కాలంలోకే చూస్తున్నంతవరకూ ఇంతే. ఆ యుగంలోకి చూస్తే టాలెంట్ తో పనుండదు, టెంప్లెట్ తో నింపెయ్యవచ్చు.  టెంప్లెట్ ని నెట్ యుగంలో కనిపెట్టారు. నెట్ యుగపు టెంప్లెట్ లోకి గడచిన వ్యాపార యుగపు స్టోరీ! 


          ‘గుంటూరోడుఇలాటి మరో టెంప్లెట్ సినిమా. విన్నర్కి నేనేం తక్కువా అన్నట్టు పోటీపడే 80 లనాటి కథతో, మారని కథనంతో  మూసఫార్ములా టెంప్లెట్ ఆమ్లెట్. వీటి వ్యవహారం ప్రేక్షకులు పసిగట్టేశారు, కాబట్టి వీటిని పాకిస్తాన్, చైనాలకి ఎగుమతి చేస్తే అక్కడి వాళ్లని  కొత్త ట్రెండ్ గా బుట్టలో వేసుకోవచ్చు - ఒకప్పుడు హాంకాంగ్ కరాటే సినిమాలు డబ్బింగ్ చేసి  మనదేశం మీదికి వదిలినట్టు.

          ఎక్స్ పోర్ట్ బ్రాండ్  గుంటూరోడు80 ల నాటి యాంగ్రీ యంగ్ మాన్ లా గుంటూరులో అన్యాయాల్ని అక్రమాల్ని  సహించడు. ఎవడైనా రోడ్డుమీద మందు తాగుతున్నాకొట్టేస్తాడు. వాడు గాల్లోకి ఎగిరి కన్పించకుండా పోతాడు. డైలాగ్ బలంతో బాటు కండబలం కూడా మెండు గుంటూరోడుకి. గుంటూరోడి  పేరు మాస్ గా కన్నా. మాస్ కన్నా అంటే కన్న తండ్రికి  పడదు.  కన్న తండ్రి చెప్పినట్టు మాస్ కన్నా మారడు. పైపెచ్చు ఒక పెద్ద కరుడుగట్టిన గూండా లాంటి లాయర్ని కొట్టేస్తాడు. ఆ లాయర్ పగబట్టి చంపడానికి వెతుకుతూంటాడు. ఆవారా మాస్ కన్నా పెళ్లి చూపులకి పోతాడు. అక్కడ వేరే అమ్మాయిని చూసి ప్రేమలో పడతాడు. ఆ అమ్మాయి ఫార్మాలిటీగా ఛీఛా అంటూ సందు చూసుకుని ఓకే అనేస్తుంది. ఈమె ఎవరంటే ఆ గూండా లాయర్ చెల్లెలే.

          ఇదీ విషయం. ఇక కన్నా పెళ్ళికి ఈ లాయరే  అడ్డు. నేను లోకల్లో పెళ్ళికి అమ్మాయి తండ్రే  అడ్డు, ‘విన్నర్లో పెళ్ళికీ  కన్నతండ్రే అడ్డు-  ఇదే టెంప్లెట్ పాయింటు తో ఇవే సినిమాలు వారం వారం వచ్చి పడ్డం తెలుగునాట  పెళ్లి పండగే! ఇంతకంటే ఏం కావాలి!

          గుంటూరోడు ఇంకా తన స్థూలకాయంతో హీరోలా కనపడకపోయినా, నాటుగా మొరటుగా నటించినా, అరిచినా అదంతా బాక్సాఫీసు మసాలే. బాక్సాఫీసుకి ఇంతకంటే గత్యంతరం లేదు. ప్రేక్షకుల కోసం ఎదురుచూసే  దౌర్భాగ్యం దానికి తప్పదు. ప్రేక్షకులు ఎవరు, మనోజ్ ఎవరు? ప్రేక్షకుల్ని మనోజ్ లీడ్ చేసే ఇంద్రచాపం లాంటి దృశ్యం  సమీప భవిష్యత్తులో కన్పించే అవకాశంలేదు- అతడికి ప్రేక్షకులతో పనిలేదు, సినిమాల తీరుతోనూ పనిలేదు- తను ఉన్నాడు కాబట్టి సినిమాలు తీయాలంతే! ప్రేక్షకుల కోసం తనూ  కాదు, తనకోసం ప్రేక్షకులూ కాదు- ఆ ప్రేక్షకులెప్పుడో సెలవు తీసుకున్నారు ఎనిమిది  వరస దెబ్బల తర్వాత!

-సికిందర్



3, మార్చి 2017, శుక్రవారం

రివ్యూ!








రచన- దర్శత్వం: శ్రీనివాస్ వీంద్ర


తారాగణం: విజయ్దేవరకొండ
పూజా  ఝవేరీ, ప్రకాష్రాజ్, మురళీ శర్మ, పృథ్వీ, రఘుబాబు, ప్రభాకర్, కృష్ణభగవాన్, షకలక శంకర్ దితరులు
సంగీతం: సాయికార్తీక్, ఛాయాగ్రహణం : శ్యాం కె నాయుడు
బ్యానర్ : లెజెండ్ సినిమాస్
నిర్మాతలుః ప్రద్యుమ్న, ణేష్
విడుదల : మార్చి 3, 2013
***

      చాలా తెలుగు సినిమాలు ఎందుకు తీస్తూంటారో, ఎవరికోసం తీస్తూంటారో   అస్సలు అంతుచిక్కని పరిస్థితి ఇంకా కొనసాగుతోంది. ఈ సినిమాలు చూస్తే మనశ్శాంతి కరువయ్యే వాతావరణం నెలకొంటోంది. ఇలాటి సినిమాలు తీస్తున్న వాళ్ళు మాత్రం  గృహమేకదా స్వర్గ స్వీమ అన్న టైపులో కలలతో, గ్లామర్ తో కళకళ లాడుతూంటారు సినిమా విడుదలయ్యేంత వరకూ. జడివాన వెలసిన వెనుక జరిగింది తెలుస్తుంది కదా- అప్పుడు విడుదలయ్యాక  జడుసుకుని చెల్లా చెదురైపోతారు.

         
క సినిమా మీద పెట్టుబడి పెట్టాలంటే ముందుగా చూడాల్సింది దాని ఐడియాకి సంబంధించిన మార్కెట్ యాస్పెక్ట్ వుందా లేదా అని కదా? మార్కెట్ యాస్పెక్ట్ కి అనుగుణంగా క్రియేటివ్ యాస్పెక్ట్ కూడా చూసుకోవాలి కదా? కానీ మార్కెట్టూ పట్టదు, క్రియేటివిటీ వుండదు, సినిమాలు మాత్రం  ఎవరికోసం, ఎందుకోసం తీస్తున్నారో తెలియకుండా చుట్టేస్తూంటారు. ఇంకే ఉత్పత్తి రంగమూ ఇంత గుడ్డిగా వుండదు. కొత్తగా వచ్చి సబ్బులు ఉత్పత్తి  చేయాలన్నా మార్కెట్ లో ఇతర సబ్బులు ఎలావున్నాయో,  వాటి కథాకమామిషు ఏమిటో పరిశీలించి   మరీ తమ సబ్బెలా  అమ్ముడుబోయేలా భిన్నంగా ఉత్పత్తి చేయాలో ఆలోచిస్తారు. కానీ సినిమాలు ఉత్పత్తి చేయాలనీ సంస్థలు పెట్టుకున్న, పెట్టుకుంటున్న ఎందరో  మహానుభావులకి  ఉత్పత్తి విధానమే తెలీడం లేదు. ఇండస్ట్రీ అనీ పరిశ్రమ అనీ గొప్ప మాటలు వాడతారు.  ఎవరికి వాళ్ళే  కుటీర పరిశ్రమగా మార్చుకున్నాక ఈ గొప్ప మాట లెందుకు. ఈ మాటలకి తగ్గ వ్యాపార పోకడే వుండదు. మార్కెట్ లో ఏ సరుకు అమ్ముడుబోతోందో  చూడరు. ఎవరి కోసం తీయాలో, ఎలా తీయాలో పట్టించుకోరు. పట్టిందే కథ, చుట్టిందే సినిమా, చచ్చిందే ప్రేక్షకులు. 

         
వారం ఇంకో విజువల్ మీడియా తెలీని కొత్త దర్శకుడు ‘ద్వారక’ అని నరకద్వారాలు చూపించాడు. విజువల్ మీడియాని  వెర్బల్ గా చుట్టేస్తే వెండి తెరమీద చూడదగ్గ సినిమా అయిపోతుందా? ఈ సినిమా తీయడానికి తనకి తట్టిన ఐడియాకి మొట్ట మొదట వుండాల్సిన మార్కెట్ యాస్పెక్ట్, దాంతో వుండే  క్రియేటివ్ యాస్పెక్ట్ ఏమైనా వున్నాయా? గత వ్యాసాల్లో వివరించుకున్న ఈ రెండు యాస్పెక్ట్స్ ని  తిరిగి ఇంకోసారి  గుర్తు చేసుకుంటే, మార్కెట్ యాస్పెక్ట్  వచ్చేసి - ట్రెండ్  + టార్గెట్ ప్రేక్షకులు + జానర్ మర్యాదగా వుండాలి. క్రియేటివ్ యాస్పెక్ట్ వచ్చేసి-  ఆర్గ్యుమెంట్ + స్ట్రక్చర్ + లాగ్ లైన్ గా వుండాలి.

          మార్కెట్ యాస్పెక్ట్ లో ‘ట్రెండ్’ అంటే ఇప్పుడు ఏఏ జానర్ల సినిమాలు ప్రేక్షకులు చూస్తున్నారనేది తెలుసుకుని ఆ జానర్స్ లో సినిమాలు  తీయడం;  ‘టార్గెట్  ప్రేక్షకులు’ అంటే ఏ ఏజి గ్రూపు వాళ్ళు ఇప్పుడు ఎక్కువగా సినిమాలు చూస్తున్నారో తెలుసుకుని, ఆ ఏజి  గ్రూపు ప్రేక్షకుల నుద్దేశించి సినిమాలు తీయడం; ‘జానర్ మర్యాద’ అంటే, ఏ జానర్లో తీస్తున్నారో పూర్తిగా ఆ జానర్ కే కట్టుబడి, ఆ జానర్ లక్షణాలే ప్రతిబింబించేలా సినిమాలు తీయడం. 

          ఐడియాలు అవే వుంటాయి. అంతమాత్రాన అవి మార్కెట్ యాస్పెక్ట్ కి న్యాయం చేయాలని లేదు. ఇది అండర్ లైన్ చేసుకోవాలి : ఐడియాలు పాత సినిమాలవే వుండొచ్చు- వాటిని తీస్తున్నప్పుడు మార్కెట్ యాస్పెక్ట్ ని పట్టించుకోకుండా తీస్తే, అట్టహాసంగా తీసిన 30 కోట్ల ‘విన్నర్’ కూడా విన్ చేయదు. ఏ ఐడియానైనా, ఏనాటి ఐడియానైనా  వర్తమాన కాలపు మార్కెట్ యాస్పెక్ట్ కి తగ్గట్టుగా,  కథగా మల్చుకున్నప్పుడే  పైన చెప్పుకున్న
ట్రెండ్  + టార్గెట్ ప్రేక్షకులు + జానర్ మర్యాద అనేవి ముమ్మూర్తులా ఒనగూడతాయి. ఇంత స్పెసిఫిక్ గా మార్కెట్ యాస్పెక్ట్ గురించి తెలీకపోతే  ప్రొడక్టు  ఫ్లాపు అవుతుంది. 90 శాతం ఫ్లాపులే వుంటున్నాయి. 

         
ఐడియాతో ఏం చేస్తున్నారన్నదే మొట్టమొదటే కొన్నాళ్ళపాటు అన్ని కోణాల్లో క్షుణ్ణంగా ఆలోచించాల్సిన పని. ఐడియా దొరకడమంటే కోతికి కొబ్బరి కాయ దొరినట్టు అయిపోతే ఆతర్వాత చేసేదంతా ప్యూర్  మంకీ బిజినెస్సే. నిజంగానే ఒక ఐడియా దొరికితే ఏం చేసుకోవాలో తెలీడం లేదు. ఈ నెట్ యుగపు మూవీ బిజినెస్ మేనేజ్ మెంట్ అస్సలు తెలియడంలేదు. చక్కగా ఫ్రీ టికెట్ తీసుకుని, వ్యాపార యుగం @ 1971 -91 అనే లోకంలో కెళ్ళి పోయి, అక్కడే  పర్ణశాల వేసుక్కూర్చుని, కవిసార్వభౌములై  సేదదీరుతూ, కృష్ణా రామా  అనుకుంటూ  రచనా వ్యాసంగం  మొదలెట్టుకునే చేతికి మట్టి అంటని పనైపోయింది. కథకుడు ప్రాచీన యుగంలో యాగాలు చేస్తూంటాడు, గేయరచయితేమో  నెట్ యుగంలో  స్వాంకీ ట్యూన్స్ తో పాటలు సృష్టిస్తూంటాడు- ఈ రెండిటికీ ఎలా  పొసగి చస్తుందో అస్సలు అర్ధమై చావదు!
***
‘ద్వారక’ ఐడియా విస్తరణ వ్యవహారం  మార్కెట్ యాస్పెక్ట్ పరంగా చూస్తే  ఎలా వుంది?  కథా కథనాలు వచ్చేసి ఎప్పటివో  1980 మోడల్ వి, టార్గెట్ ప్రేక్షకులు వచ్చేసి ఇప్పుడు ఎక్కువగా సినిమాలు చూడని మిడిలేజి, ఒల్డేజీ గ్రూపుల వాళ్ళూ, ఇక  జానర్ మర్యాద జీరో. ఇది తెలిస్తే నిజానికి ఈ దశలోనే సినిమా ప్రయత్నం ఆపేసి ఇంకో పని చూసుకోవాలి.          
ఆపకుండా, పూర్తిగా యూత్ అప్పీల్ ని కోల్పోయిన అవుట్ డేటెడ్ వస్తువుని అమ్మాలని చూశారు. ఏ  సేలేబుల్ హీరో ని  చూపించి ఈ ఉత్పత్తిని అమ్మాలని చూశారు? ‘పెళ్లి చూపులు’ అనే గత  హిట్ తో నవతరం హీరోగా కొత్తగా పాపులర్ అవుతున్న విజయ్ దేవరకొండని చూపించి ఈ  ఎక్స్ పైరీ డేట్ దాటిపోయిన సరుకు అమ్మాలని చూశారు. ‘పెళ్లి చూపులు’ కంటే ముందే నిర్మాణం ప్రారంభమై వుండొచ్చు గాక, పదేళ్ళ క్రితమైతే కాదుగా? దశాబ్దం  క్రితం కూడా సినిమాలు ఇలావుండేవి కావుగా? మరి ఇంత పురాతనమైన 1971 – 91 ల నాటి ముగిసిపోయిన వ్యాపార యుగపు  సినిమా ఇప్పుడెలా వచ్చింది? 

           అందుకని మార్కెట్ + క్రియేటివ్ యాస్పెక్ట్స్ రెండూ  కలగలిసిన
ఐడియాని పూర్తి  స్థాయిలో వర్కవుట్ చేసుకున్నాకే,  స్క్రిప్టుతో ముందు కెళ్లాలన్న గుణపాఠాన్ని వారం వారం వస్తున్న ఎన్నో సినిమాల్లాగే ఇదీ మరోసారి  నేర్పుతోంది. ఎవరికి నేర్పుతోంది? ఎవరు నేర్చుకునేది? ఎవ్వరూ నేర్చుకోరు. ఎవరికి  వాళ్ళు గ్రాండ్ మాస్టర్లుగా యమ ఫీలై పోతు న్నప్పుడు నేర్చుకునేదీ, తెలుసుకునేదీ, ఇలాటి రాతలు చదివేదీ చీప్ యాక్టివిటీ, టైం వేస్టు కూడా. ఇంకో యాభై  సినిమాలు గబగబా ఇలాటివే చుట్టేసి  ఇంటికెళ్ళి పోయే తొందరలో వున్నారు!

          అసలు సెలెక్టు చేసుకున్న
ఐడియా డీఎన్ఏనే  బాగోకపోతే ఇంకేం బావుంటుంది? ఎవరు బాముకుంటారు దాంతో? ఎంతటి కథకుడైనా కావొచ్చు, కాలీన స్పృహ లేకపోతే  కలం మూసెయ్యల్సిందే. 

          ఇక తీసుకున్న ఐడియాలో మార్కెట్ యాస్పెక్ట్ ననుసరించి-  ఆర్గ్యుమెంట్, స్ట్రక్చర్, లాగ్ లైన్ అనే  క్రియేటివ్ యాస్పెక్ట్ కన్పించకపోతే కథ రాయడం ఎలా మొదలెట్ట బుద్ధవుతుంది?  
‘ద్వారక’ ఐడియా వచ్చేసి, ‘చిల్లర దొంగ దొంగ బాబాగా మారి, ప్రేమకోసం బాబాని కాదని, దారి మార్చుకున్నాడు’ అన్నట్టుగా  వుంది. ఈ ఐడియాలో ఆర్గ్యుమెంట్, స్ట్రక్చర్, వీటితో కూడిన లాగ్ లైన్ కనపడుతున్నాయా? ఐడియా విస్తరణ సినిమాలో ఇలాగే  కనపడుతోంది- దొంగోడు బాబాగా మారాడు, ప్రేమకోసం బాబాని కాదని దారిమార్చున్నాడు క్రమంలోనే వున్నాయి కథా కథనాలు. కథంటే ఏమిటి? కథంటే ఆర్గ్యుమెంట్. మరి ఈ ఐడియాలో ఆర్గ్యుమెంట్ ఎక్కడుంది? 

          దొంగోడు బాబాగా మారి  ప్రేమకోసం బాబాని కాదన్నాడు, దీన్ని లోకం నమ్మని పరిస్థితుల్లో ఇరుక్కుని, ఎలా తిరిగి దొంగోడన్పించుకుని బయటపడ్డాడు - అన్నదాంట్లో ఆర్గ్యుమెంట్ వుంటుంది. అప్పుడది స్ట్రాంగ్ క్యారక్టర్ కూడా అవుతుంది. తను బాబా కాదు దొంగోడనడమే ఆర్గ్యుమెంట్. ఇది నిరూపించుకుని, ప్రేమకోసం దొంగబాబా అవతారాన్ని చాలించడమే ఆర్గ్యుమెంట్ తో కూడిన కథవుతుంది. తను దొంగోడని నిరూపించుకుంటే ప్రేమించిన హీరోయిన్ ఇంకింత  ఛీ కొడుతుందనా? నో!  ఇప్పటి బాబా వేషాలే కాదు, గతంలో చేసిన పాపాలు కూడా లోకానికి చెప్పుకుని ప్రాయశ్చిత్తం  చేసుకున్నవాడే నిజమైన కథానాయకుడు. పాత జీవితం దాచి, కన్పిస్తున్న కొత్త జీవితాన్ని మాత్రమే  మార్చుకుంటానంటే, ఆ  ప్రేమ పట్ల కూడా అతడి నిజాయితీని శంకించాల్సిందే. ప్రేమంటే  దాపరికాల్లేకుండా మనసుని వలువలు విడిచి పూర్తి నగ్నంగా చూపించుకోవడమే. ప్రేమలో మానసిక నగ్నత్వం లేకుండా శారీరక నగ్నత్వానికి చోటు లేదు. 

          కనుక- దొంగోడు బాబాగా మారాడు, ప్రేమకోసం బాబాని కాదని దారిమార్చున్నాడు- అన్నట్టున్న ఐడియాలో ఆర్గ్యుమెంట్ లేదు. స్టేట్ మెంట్ వుంది. స్టేట్ మెంట్ కథవదు. ‘గాథ’ అవుతుంది. గాథ స్టేట్ మెంట్ నే ఇస్తుంది. అందుకని గాథలు సినిమాలకి పనికి రావు. గాథలనేవి   సబ్జెక్టు తో బాటు క్యారక్టర్ ని కూడా పాసివ్ గా మార్చేస్తాయి. ఇవి ఆర్ట్ సినిమాలకే పనికొస్తాయి. కథకీ – గాథకీ తేడాల  గురించి కూడా గతంలో  చాలా సార్లు చెప్పుకున్నాం.
***

     దర్శకుడి ఐడియా క్రియేటివ్ యాస్పెక్ట్ లో ‘ఆర్గ్యుమెంట్’ తర్వాత ‘స్ట్రక్చర్’ వుందా లేదా అని చూస్తే- దొంగోడు బాబాగా మారాడు, ప్రేమకోసం బాబాని కాదని దారిమార్చున్నాడు- అన్నదాంట్లో దొంగోడు బాబాగా మారాడనడం స్ట్రక్చర్ లో  బిగినింగ్ విభాగం. ప్రేమ కోసం బాబాని కాదని దారి మార్చుకున్నాడనడం స్ట్రక్చర్ లో ఎండ్ విభాగం. మరి వెన్నెముక లాంటి మిడిల్ విభాగం ఏది? మిడిల్ లేదు, మిడిల్ వుంటే ఆర్గ్యుమెంట్ వుండాలి. అది లేదు. కాబట్టి ఈ స్ట్రక్చర్ కాని స్ట్రక్చర్ తో మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అనే వింత శిశువు జన్మిస్తుంది. అది పురిట్లోనే హరీ మంటుంది. దాన్ని బాక్సాఫీసు దాకా తీసి కెళ్ళడం మోసం. అంటే బిగినింగే దాదాపు చివరిదాకా సాగిసాగి  ఎండ్ మొదలవుతుందన్నమాట తెగ బోరు కొట్టేస్తూ. శిశువుకి ముద్దొచ్చే శిరస్సు వుంది, చిట్టి చిట్టి పాదాలున్నాయి- మధ్యలో శరీర భాగమే లేదు!

          ఇలాకాక -దొంగోడు బాబాగా మారి  ప్రేమకోసం బాబాని కాదన్నాడు, దీన్ని లోకం నమ్మని పరిస్థితుల్లో ఇరుక్కుని, ఎలా తిరిగి దొంగోడన్పించుకుని బయటపడ్డాడు- అన్నదాంట్లో స్ట్రక్చర్  అంతా వుంది. ‘దొంగోడు బాబాగా మారి  ప్రేమకోసం బాబాని కాదన్నాడు’ - అన్నదాంట్లో స్ట్రక్చర్ లో బిగినింగ్ విభాగపు కథని  చూడొచ్చు. తను బాబా కాదనడమే  ప్లాట్ పాయింట్ వన్ అని అర్ధం జేసుకోవచ్చు. ఇక- ‘దీన్ని లోకం నమ్మని పరిస్థితుల్లో ఇరుక్కున్నాడు’ - అనడంలో స్ట్రక్చర్ లో మిడిల్ విభాగపు కథని దర్శించవచ్చు. మిడిల్ అంటే ఆర్గ్యుమెంట్ ని పుట్టించేది, సంఘర్షణ పెట్టేది, కథని రగిలించేదీ. లోకం కాదంటోంది, తను అవునంటున్నాడు- ఇదీ ఆర్గ్యుమెంట్. ఇక- ఎలా తిరిగి దొంగోడన్పించుకుని బయటపడ్డాడు’ అన్నది చెప్పక్కర్లేకుండా జడ్జిమెంట్ సహిత ఎండ్ విభాగం.  ఆర్గ్యుమెంట్ సహిత కథ అనేది  - కథనంలో పుట్టే అన్ని సంశయాల్నీ చివరకి తీరుస్తూ సమగ్రంగా జడ్జి మెంట్ నిచ్చేదే. ఇందుకే పైన కథానాయకుడు పాత పాపాలకీ ప్రాయశ్చిత్తం చేసుకోవా లన్నాం. అదే గాథకి  ఇంత  సీను వుండదు- పాత్ర ఏదో నా గొడవ నేను పడి ఇలా ముగించుకున్నానూ అనిపించేలా,  దానికదే ఏకపక్షంగా  వివరణ నిచ్చుకుని, అయ్యోపాపమన్పించుకునేది.
***
       ఇప్పుడు ‘లాగ్ లైన్’ గురించి. క్రియేటివ్ యాస్పెక్ట్ లో వుండే ‘ఆర్గ్యుమెంట్’ నీ, ‘స్ట్రక్చర్’ నీ కలిపితే వచ్చేదే ‘లాగ్ లైన్’- ఇప్పుడిది పైన చెప్పిన విధంగా- దొంగోడు బాబాగా మారి  ప్రేమకోసం బాబాని కాదన్నాడు, దీన్ని లోకం నమ్మని పరిస్థితుల్లో ఇరుక్కుని, ఎలా తిరిగి దొంగోడన్పించుకుని బయటపడ్డాడు- గా అర్ధవంతంగా వస్తోంది. అంటే రెండు యాస్పెక్ట్స్ కూడా ఈ రూపంలో సర్దుబాటయ్యేలా కసరత్తు చేస్తూ, చేస్తూ వుంటే వచ్చేదే సరైన ఐడియా అవుతుందన్న మాట!  లేకపోతే  పుచ్చిపోయిన ఐడియాతో పసలేని కథ రాసుకోవాల్సి వస్తుంది.
***
       ఇలాగే వుంది ఈ ‘కథ’.  ఎర్రశీను స్నేహితులతో కలిసి దొంగతనాలు చేస్తూంటాడు. డబ్బు తప్ప వేరే సెంటిమెంట్స్ వుండవు. ఒకరోజు పారిపోతూ ద్వారక అనే అపార్ట్ మెంట్ లో దూరి దాక్కుంటాడు. ఒక గురువు లాంటి వాడు అక్కడ జోస్యం చెప్తూంటాడు- లోకాన కృష్ణుడు అవతరించే సమయం ఆసన్నమైందని. ఎర్రశీను కన్పించేసరికి అతడే శ్రీ కృష్ణానంద స్వామి అని అపార్ట్ మెంట్ వాసులు హరతులుపట్టి బాబాని చేసేస్తారు. అక్కడే కూర్చోబెట్టేస్తారు. భక్తులు నగదూ నగలూ సమర్పించుకుంటూ సమస్యలు చెప్పుకుంటారు. బాబాని దర్శించుకుంటే కష్టాలు తీరాయని ప్రచారం చేస్తారు. ఇదేదో బావుందని ఈ బాబా డబ్బులు దండుకుంటాడు. ఒక ఎమ్మెల్యే, ఇంకో లాయర్ వీడు దొంగోడు అని పసిగట్టి బ్లాక్ మెయిల్ చేస్తారు. ఈ డబ్బులు దండుకోవడానికి ట్రస్టు ఏర్పాటు చేస్తారు. ఓ రాత్రి బాబా ఉన్నకాడికి డబ్బులు ఊడ్చుకుని పారిపోబోతూంటే, ఎదురైన  హీరోయిన్ ని చూసి, లవ్ లో పడి ఆగిపోతాడు. తిరిగి బాబాగా కూర్చుంటాడు. ఆ హీరోయిన్ కి పెళ్లి కావడం లేదని బాబా దగ్గరికి తీసుకొస్తే ఆమెని ప్రేమిస్తాడు. వీడు దొంగోడని ఆమె దూరం పెడితే, ఆమెకి దగ్గరవడానికి తను బాబాకాదనీ, దొంగ అనీ లోకానికి చెప్పేస్తాడు. అల్లర్లు జరుగుతాయి. లాయర్, ఎమ్మెల్యే వచ్చి తన్నబోతారు-  దాంతో బాబా ప్లేటు మార్చి,  భక్తుల్ని పరీక్షించడానికే అలా ప్రకటన చేశానంటాడు. మళ్ళీ భక్తులు చేరిపోతారు. విలన్ల ట్రస్టు కోట్లతో నిండు తూంటుంది. ఇప్పుడీ బాబా ఈ విలన్లని ఎదుర్కొని ఎలా హీరోయిన్ ని పొందాడనేది మిగతా ‘కథ’.
***
  ఐడియా ఆలోచించడం ఎంత లోపభూయిష్టంగా వుందో, దాన్ననుసరించే ‘కథ’ కూడా అంత లోపభూయిష్టంగా వచ్చింది. మధ్యలో బాబాని కాదు, దొంగోడిని అనడం,  వాళ్ళు తన్నబోతే  ప్లేటు ఫిరాయించడం  కొంప ముంచింది. వాళ్ళు తన్నబోతే మాట మార్చి- లేదు నా  భక్తుల్ని పరీక్షించడానికే నేను దొంగోడ్ని అని అన్నాడంటే, అది కథానాయక లక్షణం కాకపోగా, పాసివ్ గా మారిపోయే ఛేష్ట. భక్తులతో బాటు హీరోయిన్ నీ ఇంకా మోసం చేస్తూ వుండే బుద్ధి. ఆ హీరోయిన్ దీన్ని నమ్మేస్తుంది. 

          దీంతో సెకండాఫ్ ప్రారంభం నుంచీ లెంపలేసుకుని వచ్చి పడుతున్న భక్తులతో కథకి జరిగిన నష్టం, ప్రేక్షకులకి కలిగే కష్టమేమిటంటే –‘కథ’ ఎక్కడేసిన గొంగళిలా వుండిపోవడం.
 మళ్ళీ ఫస్టాఫ్ లో వచ్చేసిన లాంటి భక్తులు  కానుకలు సమర్పించుకునే బాపతు సీన్లే రిపీట్ అవడం. అంటే బిగినింగ్ విభాగంలో ముగిసిపోవాల్సిన బిజినెస్ మళ్ళీ ఇక్కడ చొరబడిందన్నమాట. కానీ సెకండాఫ్ లో ఇదంతా వచ్చేసి మిడిల్ విభాగపు ఇలాకా. ఇక్కడ  బిగినింగ్ ఆటలు సాగవు. పూర్తిగా మిడిల్ విభాగపు బిజినెస్ లక్షణాలతోనే  కథ  ముందుకెళ్ళాలి. అప్పుడు బోరు కొట్టదు. 

          కథలు కలగాపులగమవడానికి కారణం కథకుడు తనలోకంలో తాను మజా చేస్తూ ఆత్మాశ్రయ ధోరణిలో సబ్జెక్టివ్ గా రాసుకోవడమే. ఎండమావుల్ని చూస్తూ కళా తృష్ణ తీర్చేసుకుంటున్నట్టు ఎంజాయ్ చేయడమే. లేదా కోట శ్రీనివాసరావు కోడిని వేలాడదీసి దాన్ని చూస్తూ చికెన్ తింటున్న ఆనందాన్ని జుర్రుకోవడం లాంటిది. మతం మత్తుమందు లాంటిదని మార్క్స్ అంటే అన్నాడు- కాస్త కథ కూడా కథకుడి చేతిలో కోతికి కొబ్బరి లాంటిదని అనివుంటే బావుండేది. కథకి ప్రథమ శత్రువు కథకుడే. ఎందుకంటే పాత్ర మాట అస్సలు వినడు. తనే కథని  సృష్టిస్తున్నట్టు ఫీలై పోతాడు- వాడి చేతిలో పాసివ్ గా మారిపోయిన పాత్ర వెక్కిరింతగా నవ్వుతూంటుంది - పోరా నువ్వు ఫ్లాప్ అనేసి! 

          కథకుడు కథని పాత్ర కిచ్చేస్తే 90 శాతం ఫ్లాపులుండవు. సంఘటన సృష్టించే పాత్రే తన దృక్కోణంతో తను కథ నడిపించే అవకాశం లభిస్తే అది కథకి స్ట్రక్చర్ ఏర్పాటు చేస్తూ పోతుంది. స్ట్రక్చర్ ని ఏర్పాటు చేసినప్పుడే పాత్ర యాక్టివ్ పాత్రగా వుంటుంది. అప్పుడే స్క్రీన్ ప్లేలో అన్ని నట్లూ బోల్టులూ వాటి స్థానాల్లో అవి వుండి- సదరు చలచిత్ర సౌధాన్ని పటిష్టంగా నిలబెడతాయి. లేకపోతే  జయలలిత చేతిలోనో, శశికళ చేతిలోనో, సోనియా గాంధీ చేతిలోనో ప్రాక్సీ సీఎంలూ, పీఎమ్మూ పాలించినట్టు వుంటుంది ఆ చలనచిత్ర సౌధంలో సంసారం!

          ఇక మనం పాసివ్ హీరోలు  అనడం మానేసి, ప్రాక్సీ హీరోలు  అనడం బావుటుంది- కథకుడి కుచేష్టలు బట్టబయలయ్యేలా. లేకపోతే  పెద్ద స్కాం చేస్తున్నారు  కథకులు.

           కాన్సెప్ట్ ఏమిటి?  దొంగోడు బాబా అయి ప్రేమ కోసం బాబా తనంతో బాటు దొంగతనాలూ చెప్పేసి పునీతుడవడం. అంటే పాత్ర తనతో తానూ సంఘర్షించే కథ. తను దొంగోడే అని పాపాలు కడిగేసుకుందామన్నా, లోకం  నువ్వు బాబావే అని పడనీయడం లేదు. ఇదీ సంఘర్షణ. హీరోయిన్ వల్ల పొందిన అంతటి ప్రేమ బలంతో తను నైతికంగా సమూలంగా పునీతుడవ్వాలన్న ప్రయత్నంతో ఈ కథ వుంటుందా-  లేక ఎవరో తనని అడ్డుపెట్టుకుని దోచుకుంటున్న విలన్లని ఆపాలని కథ వుండాలా? 

          హీరో తను దొంగోడ్ని అని ఓపెన్ అయినప్పుడు ప్లేటు ఫిరాయించకుండా వుంటే యాక్టివ్ గా వుంటాడు. అప్పుడు దొంగోడు కాదు బాబాయే  అని విలన్లు నమ్మిస్తూంటే,  బాబా కాదు తను దొంగోడే అని నిరూపించుకోవడానికి హీరో నానా పాట్లు పడతాడు. స్వచ్ఛ మైన ప్రేమకి అర్హుడవడానికి, తన పాతతప్పుల్ని నివేదించుకుని హీరోయిన్ తీర్పు ని కాంక్షించడమే హీరోకి వున్న ఏకైక మార్గం. అంతేగానీ ఇంకా బాబాలా నటిస్తూ తనని ఎక్స్ ప్లాయిట్ చేస్తున్న విలన్లని పట్టుకునే కథే అయితే ఆబ్జెక్టివ్ గా ఇది హీరో కథే కాదు- ఆబ్జెక్టివ్ గా కథకుడి  స్వైరకల్పన! 

          ‘డోర్స్’ అని ఎడ్ మెక్ బెయిన్ రాసిన నవలవుంది- అందులో ఇలాగే దోపిడీకి వెళ్లి ఆ ఇంట్లో హీరోయిన్ ని చూసి ఆగిపోతాడు. ఆ తర్వాత అతడి ప్రేమకథకి అడ్డుపడుతున్న తన  నేర చరిత్రతో ఎలా సంఘర్షించాడో చాలా హృద్యంగా, ఉన్నతంగా వుంటుంది. జీవితాంతం మర్చిపోలేం. మన దొంగబాబాకి  కూడా హీరోయిన్ తో రొమాంటిక్ గా అంత  సమస్య ఎదురైనప్పుడు, ఎవరో విలన్లతో కాని సమస్యతో ఎందుకు విలవిల్లాడతాడు- ఇలా ఇది కళ్ళముందున్న బలమైన రోమాంటిక్ ఎలిమెంట్ ని  నిర్లక్ష్యం చేసినప్పుడే యూత్ అప్పీల్ లేక, టార్గెట్ ప్రేక్షకులైన యువతీ యువకుల మద్దతుని కోల్పోయింది!
***
       విజయ్ దేవరకొండ ఈ పాత్రలో  చేసిందేమిటంటే కూర్చుని వుండి  కానుకలు స్వీకరించడం. అక్కడక్కడా మాటాడాలి కాబట్టి కొన్ని మాటలుంటాయి. ఎంతసేపూ ఇతరులు మాటాడు కుంటే, వస్తూపోతూంటే, కళ్ళప్పగించి వాళ్ళ మొహం వీళ్ళ మొహం చూస్తూ కూర్చోవడమే. సాక్షాత్తూ  విలన్ వచ్చి మోహంలో  మొహం పెట్టి బెదిరించినా, అలా కళ్ళప్పగించే చూస్తాడు!

          దొంగోడు అనుకోకుండా ఇంకా బాగా డబ్బు గడించే దొంగ బాబా అయ్యాక ఇంకా రెచ్చిపోక, గిమ్మిక్కులతో మాయలూ మంత్రాలూ చేయక, ఉత్సవ విగ్రహంలా కూర్చోవడానికి తనెందుకు, విగ్రహాన్నే ఏర్పాటు చేస్తే సరిపోతుందిగా?. భక్తులముందు  చారడేసి కళ్ళతో  ఆరేళ్ళ అమాయకపు ముద్దు బిడ్డలా వుంటూ, భక్తులు పోగానే డబ్బెగరేసుకుంటూ గంతు  లేయడమెంటో? 

          ఈ పాత్రకుండాల్సిన డైనమిక్స్ లేకపోవడం కూడా సహన పరీక్షే. ఇదేరోజు విడుదలైన ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ లో దొంగబాబాగా రఘుబాబు కదా అన్ని డైనమిక్సూ గిమ్మిక్కులూ ప్రదర్శిస్తూ సీన్లని  ఆకాశానికెత్తేసేది- అది నాటు హాస్యమైనా! ‘అయ్యారే’ లో రాజేంద్ర ప్రసాద్ లేడా? విజయ్ దేవరకొండకి  దొంగ బాబాగా నటించడం కూడా వచ్చునా? ద్వారకలో నరక ద్వారాలు చూపించడం వచ్చునా?  మనమైతే ఇదంతా రాయాల్సిన గురుతర బాధ్యత వుంది కాబట్టి ఈ నరకాన్నంతా అనుభవిస్తూ కూర్చున్నాం- లేకపోతే బయటికి పరారైన కొందరిలాగే మనమూ నగర రోడ్ల మీద పడేవాళ్ళం బతుకు జీవుడా అని!
***
     విజయ్ ప్రేమ సన్నివేశాలు చూస్తే తనకి తగ్గ హీరోయిన్ కూడా దొరికింది- ఇద్దరి ప్రేమ సంభాషణలు, పొడిపొడి  హావభావాలూ చూస్తే వీళ్ళు నటులా అన్పించేలా వుంటారు. వీళ్ళ తప్పేమీ లేకపోవచ్చు. ఏ జోళ్ళలో ఎవరి కాళ్ళు  పెట్టించాలో అంచనా లేని   దర్శకుడి లోపమే. నటింప జేసుకోవడం తెలీక పోవడమే గాక, సీన్లని వేగంగా పరుగెత్తించలేని ఓల్డ్ స్కూల్ డైరెక్షన్. 

          కానీ విజయ్ మూస ఫార్ములా హీరో కాలేడనీ,- డాన్సులు కూడా తన జోన్ కాదనీ  తేలిపోయింది. ఇంకో అన్ని గిమ్మిక్కులూ వొంట బట్టించుకున్న మూసఫార్ములా కమర్షియల్  హీరో వేయాల్సిన పాత్రని తను వేశాడు. తను మాత్రం నటించకుండా డైలాగులతో వెళ్ళిపోయే సెమీ రియలిస్టిక్ సినిమాలకి పనికొస్తాడని మాత్రమే ప్రూవ్ చేశాడు. 

          ఇంకో క్యారక్టర్ వుంది- వచ్చితొంగి  చూసి పోతూ వుంటుంది. ఈ హేతువాది పాత్రధారి మురళీ శర్మ. ఈయన ఎందుకో మాటిమాటికీ వస్తాడు, భక్తుల వైపూ బాబావైపూ చూసి వెళ్లి పోతాడు. ఇవ్వాలి కాబట్టి ఒకసారి హేతువాద లెక్చర్ ఇస్తాడు. కానీ బాబా బోగస్ అంటూ కూడా ఎలా బోగస్సో  నిరూపించే ప్రయత్నాలు మాత్రం చేయడు. రావడం, మొహాలు చూసి వెళ్ళిపోవడం.  ట్రస్టు విలన్ల ఖాతాలు కావాలంటాడు. ఏం చేసుకుంటాడు వాటిని-  ముందు యంగ్ బాబా బోగస్ కింగ్ అని నిరూపించే పని చేయకుండా? తను హేతువాదియా, ఎక్కౌంటెంటా?
          ఇప్పటికిది చాలు. ‘గుంటూరోడు’  చూద్దాం...

-సికిందర్
http://www.cinemabazaar.in



 



 


 



రివ్యూ!





దర్శకత్వం : వంశీకృష్ణ ఎం.
తారాగణం : రాజ్ తరుణ్, అనూ ఇమ్మాన్యుయేల్, అర్బాజ్ ఖాన్, పృథ్వీ, నాగేంద్ర బాబు, రఘుబాబు, రాజా రవీంద్ర తదితరులు
సంగీతం : అనూప్ రూబెన్స్, ఛాయాగ్రహణం :  బి. రాజశేఖర్
బ్యానర్ : ఏకే ఎంటర్ టైన్మెంట్స్
నిర్మాత : రామబ్రహ్మం సుంకర
విడుదల: మార్చి 3, 2017

***
         యంగ్ స్టార్ రాజ్ తరుణ్ యువప్రేక్షకుల్లో ఆకర్షణ పెంచుకుని ఓపెనింగ్స్ ని రాబట్టుకునే స్థాయికి ఎప్పుడో ఎదిగాడు. ఏ భేషజాలూ పెట్టుకోకుండా అవసరమైతే ఇంకో హీరోతో కలిసి నటించడమో, లేదా అతిధి పాత్రలు సైతం పోషించడమో కూడా చేస్తూవస్తున్నాడు. తను సోలోగా నటించిన ‘సీతమ్మ అందాలు- రామయ్య సిత్రాలు’ తో బాగా చేదు అనుభవం ఎదురయ్యాక, మరో సోలోగా ఇప్పుడు ‘కిట్టు ఉన్నాడు జాగ్రత్త’ లో నటించాడు. రొటీన్ గా నటిస్తున్న లవర్ బాయ్ సినిమాలనుంచి కొంచెం తేడాగా ఈ సారి ఓ  యాక్షన్ కామెడీలో ప్రయత్నించాడు.  ఈ యాక్షన్ కామెడీ కూడా పరమ రొటీన్ గా వున్నా ఫర్వా లేదనుకున్నట్టు, మొహమాటం లేకుండా నటించేశాడు. క్రితంసారి ‘దొంగాట’ అనే కిడ్నాప్ కామెడీ తీసి ఫర్వాలేదన్పించుకున్న దర్శకుడు వంశీకృష్ణ, ఈసారి కూడా కిడ్నాప్ మూవీనే  కొంచెం తేడాగా తీద్దామనుకున్నట్టుంది. వీళ్ళిద్దరి ఈ తేడా గల ప్రయత్నం ఏ మేరకు తేడా కనబర్చిందో చూద్దాం...

కథ

          కిట్టు (రాజ్ తరుణ్) ముగ్గురు ఫ్రెండ్స్ తో కారు గ్యారేజీ నడుపుకుంటూ వుంటాడు. కారు రిపేరు కిచ్చిన ఇన్ కం టాక్స్ కమీషనర్ (నాగబాబు) కూతురు జానకి (అనూ ఇమ్మాన్యుయేల్) తో ప్రేమలో పడతాడు. ఓ రోజు జానకి తండ్రి ఆమెకి పాతిక లక్షలు ఇచ్చి, కిట్టూ నిజాయితీని పరిశీలించడానికి కారులో మర్చిపోయినట్టు నటించామంటాడు. ఆమె  కారులో పెట్టిన ఆ డబ్బుని  కిట్టూ ఫ్రెండ్స్ లో ఒకడు కొట్టేసి పారిపోతాడు. ఈ దొంగతనం ఆమెకి తెలీకుండా అడ్జెస్ట్  చేయడం కోసం ఒక గ్యాంగ్ లీడర్ (ప్రభాకర్) దగ్గర అప్పు తీసుకుంటాడు కిట్టూ.  గడువు దాటిపోవడంతో ఆ గ్యాంగ్ లీడర్ సతాయించడం మొదలెడతాడు. అప్పుడు అర్జెంటుగా ఆ పాతిక  లక్షలు సంపాదించడం కోసం ఫ్రెండ్స్ తో కలిసి పెంపుడు కుక్కల్ని కిడ్నాప్ చేయడం మొదలెడతాడు. కిడ్నాపులతో ఆ డబ్బు ఇంకా సమకూరకముందే, చూడకుండా జానకి పెంపుడు కుక్కనే కిడ్నాప్ చేస్తాడు. అదే సమయంలో జానకిని ఇంకో గ్యాంగ్ కిడ్నాప్ చేస్తుంది. కిట్టూ దగ్గర్నుంచీ, ఇంకా  అటు ఏర్ (అర్బాజ్ ఖాన్) అనే మాస్టర్ క్రిమినల్ నుంచీ కమీషనర్ కి డిమాండ్ కాల్స్ రావడంతో అతను ఇద్దరూ ఒకటే అనుకుంటాడు. యాక్సెస్ కార్డు కోసం కూతుర్వే కిడ్నాప్ చేశారనుకుంటాడు. తను మాస్టర్ క్రిమినల్ ఆఫీసు మీద రెయిడ్ చేసినప్పుడు ఒక సేఫ్ ని సీజ్ చేసి దాని యాక్సెస్ కార్డు పట్టుకుపోయదు. ఈ యాక్సెస్ కార్డుకోసం ఇతను జానకిని కిడ్నాప్ చేస్తే, కిట్టూ డబ్బుకోసం జానకి పెంపుడు కుక్కని కిడ్నాప్ చేశాడు – ఆ కుక్క అమేదని తెలీక.

          ఇదీ సంగతి. ఇక ఈ చిక్కు ముడి ఎలా వీడింది, కన్ఫ్యూజన్ క్లియర్ అయి ఎలా కథ సుఖాంతమయ్యిందీ అన్నది మిగిలిన కథాకమామిషు.

ఎలావుంది కథ
          ఇది రొటీన్ యాక్షన్ కామెడీ. కొత్తదనమేమీ లేదు. కిడ్నాప్ కథలూ వాటితో  కామెడీలూ ఎలా వుంటాయో తెలిసిందే. కాకపోతే ఇక్కడ అది హీరోయిన్ అని తెలీక ఆమె మీద పొగగొట్టి, ఆమె పెంపుడు కుక్కనే  హీరో కిడ్నాప్ చేయడం, అదే సమయంలో  వేరే క్రిమినల్ ఆమెనే కిడ్నాప్ చేయడమనే   టూ ఇన్ వన్  హిలేరియస్ ఇంటర్వెల్ సీన్ ఒక కొత్తదనం అనుకోవాలి. అయితే దీన్ని ఇంతే థ్రిల్లింగ్ కథగా కొనసాగించడంలో మాత్రం కొత్తదనాన్నేం ప్రదర్శించలేక పోయారు. వివిధ గ్యాంగులతో కామెడీ మీదే ఎక్కువ దృష్టి పెట్టి గట్టెక్కిం చడానికి ప్రయత్నించారు. అదే సమయంలో ఈ యాక్షన్ కామెడీలో ప్రధాన మలుపు తీసుకున్న హీరో హీరోయిన్ల ప్రేమని కూడా గల్లంతు చేశారు.  ఇలాకాకుండా గతంలో ‘దొంగాట’ లో దర్శకుడు ప్రధాన కథ మీదే కథనాన్ని బాగా ఫోకస్ చేశాడు.

ఎవరెలా చేశారు
          పెంపుడు కుక్కల్ని కిడ్నాప్ చేసే రాజ్ తరుణ్ పాత్ర మాత్రం కొత్తదే. అయితే దీని వల్ల తన ప్రేమ ఎంత రిస్కులో పడిందో, ఆ భావోద్వేగాలతో పాత్ర రాయించుకోవాల్సింది. ఒక ఎమోషనో, ఫీలింగో  లేకుండా ఎంత కామెడీ అయినా నిలబడదు. రాజ్ తరుణ్ తనకున్న రేంజిలో టాప్ స్టార్స్ వైపు చూడకుండా, వాస్తవానికి దగ్గరగా వుండే పాత్రల కోసం కృషి చేస్తే అది తన ప్రత్యేకత కింద వుంటుంది. ఈ యాక్షన్ కామెడీలో కూడా మరీ పగలబడి నవ్వేంత సీన్లు లేవు తన పాత్రకి. 

          హీరోయిన్ అనూ ఇమ్మాన్యుయేల్ పెద్ద మైనస్ మార్క్ ఈ సినిమాకి. అలాగే ఆమె తండ్రిగా నాగబాబు పాత్ర ఇన్ కం టాక్స్ ఆఫీసర్ గా ఎంత ధూమ్ ధామ్  చేస్తుందో, కూతురు  కిడ్నాపవగానే అంత పిరికిగా  ప్రవర్తిస్తుంది. అందరు విలన్స్ కంటే టాప్ రేంజిలో సీన్లు నిలబెట్టిన వాడు సల్మాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్. ఇంతకీ అతడి దగ్గరున్న సేఫ్ లో ఏముందన్నది  ఓపెన్ కాని సస్పెన్సే. ‘పల్ప్ ఫిక్షన్’ లో ఒక బ్రీఫ్ కోసం జరిగే యాక్షన్ కామెడీలో చివరికి కూడా ఆ బ్రీఫ్ కేసులో ఏముందో చెప్పరు- హిచ్ కాక్ పరిభాషలో ఇలా ప్లే చేయడాన్ని మెక్ గఫిన్ అంటారు. ఇది ప్రస్తుత సినిమాలోనూ అర్ధవంతంగా వుంది. 

          రేచీకటి పాత్ర నటించిన పృథ్వీ  ఈ యాక్షన్ కామెడీ కొక ఆకర్షణగా చెప్పవచ్చు. ఈ మధ్యే హృతిక్ రోషన్, మోహన్ లాల్ లు సీరియస్ అంధపాత్రలు నటించారు గానీ, పృథ్వీ నటించిన చీకటి పడితే కళ్ళు కన్పించని ఛోటా క్రిమినల్ పాత్ర బాగా కామెడీ. క్లయిమాక్స్ లో అన్ని గ్యాంగులకీ  అతను సృష్టించే కన్ఫ్యూజన్ ఇంతా అంతా కాదు.

          నిమాసి బాబాగా రఘుబాబుది ఇంకో దిక్కుమాలిన జీవితం. ఈ పాత్రకూడా కామెడీకి బాగానే పనికొచ్చింది. ఎన్ కౌంటర్ ప్రియుడుగా రాజారవీంద్ర కూడా ఓకే. 

          నిర్మాణ విలువల పరంగా సినిమాకో స్థాయి మాత్రం లేదు. కెమెరా, సంగీతం రెండూ మైనస్సే.  సెకండాఫ్ లో కేవలం ఒకే పాట వుండడం మంచి రిలీఫ్. 

చివరికేమిటి
          డబుల్ ట్రబుల్ తో కిడ్నాపుల కాన్సెప్ట్ ఓకే  గానీ, స్క్రీన్ ప్లే మాత్రం రొడ్దకొట్టుడు స్క్రీన్ ప్లే.
 ఫస్టాఫ్ మరీ రొటీన్ కథనం, సీన్లు. సెకండాఫ్ కి వచ్చాక కథ కనపడినా,  అసలు పాయింటుకి దూరంగా కిడ్నాపుల కథ ఫ్లాట్ గా మారింది. అసలుకి ఇంటర్వెల్ కి ముందు హీరో కుక్కల్ని కిడ్నాప్ చేసి డబ్బు సంపాదిస్తున్నాడని తెలిసి హర్ట్ అయి అతణ్ణి తిరస్కరించిన హీరోయిన్, తీరా  ఆ డబ్బు దేని కోసం – ఎందుకోసం చేసిన అప్పు తీర్చడానికి సంపాదిస్తున్నాడో స్పష్టమై,  అతడి ప్రేమని అంగీకరిస్తూ పిల్చినప్పుడు, వస్తూ వస్తూ ఆమె అని తెలీక ఆమె కుక్కనే కిడ్నాప్ చేయడమనే ఐరనీ చాలా బలమైనది. ఇలా ఈ ఐరనీ ప్రధానంగా  కిడ్నాపుల కథని నడపకుండా- ఏదో యాక్షన్ కామెడీ చేయడంతో, డైలాగుల ఫన్ తో ఎక్కడికక్కడ సీన్లు వినోదత్మకంగానే వున్నా-  ఈ సీన్లన్నిటినీ కలిపి ఉంచగల ఒక ఎమోషనల్ థ్రెడ్ లేకపోవడంతో, వెలితిగానే ఫీలవుతాం. ఈ యాక్షన్ కామెడీకి ఉన్న కాస్తా ఆ ప్రేమ కథే బలం, దీన్ని లేకుండా చేశారు.

-సికిందర్
http://www.cinemabazaar.in