రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

26, జూన్ 2017, సోమవారం

స్క్రీన్ ప్లే సంగతులు!







          The genius of "Blood Simple" is that everything that happens seems necessaryRoger Ebert

          డార్క్ మూవీస్ వ్యాసాల్లో భాగంగా నియో నోయర్  మూవీస్ అయిన ‘టాక్సీ డ్రై వర్’, ‘చైనా టౌన్’ స్క్రీన్ ప్లే సంగతులు  పరిశీలిద్దామనుకున్నాం మొదట.  అయితే ఈ పాత క్లాసిక్స్  కంటే,  మరింత  కాలీన స్పృహతో  ట్రెండీగా వుండే మూవీస్ ని విశ్లేషిస్తే ఉపయోగకరంగా వుండ వచ్చని భావించడం వల్ల, ప్రస్తుతానికి పై రెండు నియో నోయర్స్ ని పక్కన పెట్టాం. మరింత ఆధునికంగా వుంటూ, ఇప్పుడు మనమున్న డిజిటల్ యుగంతో పోటీపడే  సబ్జెక్టులు, సాంకేతికాలూ వుండే నియో నోయర్స్ ని తీసుకోవడం వల్ల ఇప్పుడు వీటిని  ఎలా రాయాలో, ఎలా తీయాలో సులభంగా అర్ధం జేసుకోవడానికి వీలవుతుంది. ఫిలిం నోయర్ అయినా, నియో నోయర్ అయినా హాలీవుడ్ లో అవి  బిగ్ స్టార్స్, బిగ్ డైరెక్టర్స్ కూడా పట్టించుకుంటున్న జానర్  అని గతంలో చెప్పుకున్నాం. కనుక వాటి కథలు, బడ్జెట్లు కూడా ఆ స్థాయిలోనే వుంటాయి. కాబట్టి ‘బ్లేడ్ రన్నర్’, ‘షటర్  ఐలాండ్’ వంటి స్టార్ మూవీస్ కాకుండా, తెలుగు వాతావరణ పరిస్థితులకి తగ్గట్టు లో- బడ్జెట్స్ తీయడానికి హాలీవుడ్ లోనే తీసిన లో- బడ్జెట్స్ ని పరిశీలనకి తీసుకోవడం ఉత్తమం.

         
రీత్యా మొట్ట మొదట గుర్తుకొచ్చేవి రెండు మూవీస్ – 1984 లో కోయెన్ బ్రదర్స్ తీసిన ‘బ్లడ్ సింపుల్’, 2005 లో రియాన్ జాన్సన్ తీసిన ‘బ్రిక్’. మొదటిది అడల్ట్ సబ్జెక్టు అయితే, రెండోది యూత్ సబ్జెక్టు. తెలుగులో కావాల్సింది కూడా ఇవే. పిచ్చి పిచ్చి ప్రేమలు, పిశాచాలూ తీసేకన్నా వీటిని తీయడంవల్ల కొంత మార్పు కనపడి, ఇప్పుడు పెరిగిన –ప్రస్తుతానికి తెలంగాణాలో- టికెట్ల ధరలకి ప్రేక్షకులు మొహం చాటేయకుండా వుంటారు. 

       ముందుగా ‘బ్లడ్ సింపుల్’ నేపధ్యం, కథ, ఆ తర్వాత స్క్రీన్ ప్లే సంగతులు చూద్దాం. ఈ లో- బడ్జెట్ ని తీసుకోవడానికి ఇంకో కారణ మేమిటంటే కోయెన్ బ్రదర్స్ కిది మొదటి సినిమా, నిర్మాతల్లేరు, పెట్టుబడి కోసం కొత్త ప్లాన్ వేశారు, జానర్ కి కట్టుబడి రైటింగ్, టేకింగ్ ల మీద కసరత్తు చేశారు, ఇంకా జానర్ ని స్టడీ చేశారు...ఇవన్నీ తెలుగులో చిన్న సినిమాలు తీసే కొత్తదర్శకులకి మార్గ దర్శకాలవ్వొచ్చు. ఈ కారణం చేత కూడా దీన్ని తీసుకున్నాం. 

          అసలు 1930 లలో మనమింకా భక్త ప్రహ్లాదలు, సతీ సావిత్రులు తీస్తున్న కాలంలో హాలీవుడ్ ఎత్తుకున్న ఫిలిం నోయర్ సినిమాలకి స్ఫూర్తీ, ఆధారం ముగ్గురు రచయితల  డిటెక్టివ్  నవలలే. నోయర్ మూవీస్ అంటే డిటెక్టివ్ మూవీసే వాస్తవానికి. ఆ  ముగ్గురు రచయితలు- జేమ్స్ ఎమ్. కెయిన్ (1892-1977), డషెల్ హేమెట్ (1894-1961), రేమండ్ చాండ్లర్ (18
88-1959) లు రాసిన హార్డ్ కోర్ డిటెక్టివ్ నవలలు నోయర్ జానర్ కి ప్రామాణికమయ్యాయి.


        కాబట్టి కోయెన్ బ్రదర్స్ వీటిని చదవడం మొదలెట్టి, డషెల్  హేమెట్ రాసిన నవల్లోంచి స్ఫూర్తి పొంది టైటిల్ అనుకున్నారు. ఆ నవల ‘రెడ్ హార్వెస్ట్’. ఇందులో బ్లడ్ సింపుల్ అన్న పదాన్ని వాడేడు హేమెట్. దీనర్ధం ఉద్రిక్త పరిస్థితుల్ని ఎదుర్కొనే నేరస్థుడి మానసిక స్థితి. ఇదంతా భయంతో కూడుకుని వుంటుంది.  కోయెన్ బ్రదర్స్ కథలో హీరోది కూడా ఈ మానసిక స్థితే. అందుకే దాన్ని టైటిల్ గా పెట్టారు. జోయెల్ కోయెన్, ఎథాన్ కోయెన్ సోదరులిద్దరూ కలిసి స్క్రిప్టు రాశారు డార్క్ మూవీస్ శైలిని దృష్టిలో పెట్టుకుని. కానీ ఈ స్క్రిప్టు నిర్మాత లెవరికీ నచ్చలేదు. తెలుగులో, తమిళంలో ఇప్పుడున్న ట్రెండ్ ఏమిటంటే, షార్ట్ ఫిలిమ్స్ తీసి నిర్మాతలకి చూపించడం, ఆ నిర్మాత దాన్నిబట్టి టాలెంట్ అంచనా కట్టి అవకాశాలివ్వడం, లేదా ఇవ్వకపోవడం. 

       అప్పట్లో కోయెన్ బ్రదర్స్ ఇలా చేయలేదు. సాక్షాత్తూ తీయాలనుకుంటున్న  సినిమా స్క్రిప్టులోనే వున్న హత్యా దృశ్యాన్ని ఫేక్ టీజర్ గా షూట్ చేశారు. కేవలం ఐదు నిమిషాల నిడివి. దీన్ని మూడ్రోజులు  షూట్ చేసి, ఒక ప్రొజెక్టర్ అద్దెకి తీసుకుని ప్రజల ఇళ్ళకి, ఆఫీసులకీ వెళ్లి ప్రదర్శించడం మొదలెట్టారు. వేరే షార్ట్ ఫిల్ములో, డాక్యుమెంటరీలో చూపించికన్విన్స్ చేసే యకుండా- తీయాలనుకుంటున్న స్క్రిప్టులో దృశ్యమే ఎలా తీస్తామో తీసి శాంపిల్ చూపించేసరికి- టకటకా డబ్బులొచ్చి పడ్డాయి. బడ్జెట్ పదిహేను లక్షల డాలర్లు అయితే, ఏడున్నర లక్షల డాలర్లే వచ్చాయి. మిగిలిన మొత్తం చేతి నుంచి పెట్టుకున్నారు. ఆస్టిన్, హుటో, టెక్సాస్ మూడు నగారాల్లో,  ఎనిమిది వారాల్లో షూటింగు పూర్తిచేశారు. మొత్తం కలిపి ఏడు పాత్రలే. పోస్ట్ ప్రొడక్షన్ కి ఏడాదంతా పట్టింది చేతి నుంచి పెట్టాల్సి  వచ్చేసరికి. అప్పుడు అన్నదమ్ముల వయస్సు 27, 24.

          1984లో విడుదలై 39 లక్షల డాలర్లు వసూలు చేసింది. పెట్టుబడి 15 లక్షల డాలర్లు. తెలుగులో చిన్న సినిమాలకి పెట్టిందే రాదుగా? దీంతో కోయెన్ బ్రదర్స్  ప్రఖ్యాత దర్శకులైపోయారు. భారీ బాక్సాఫీసు విజయం సాధించకపోయినా విమర్శకుల మెప్పుపొంది వార్తల కెక్కారు. అమెరికన్ ఫిలిం ఇనిస్టిట్యూట్ వంద ఉత్తమ థ్రిల్లర్స్ జాబితాలో ‘బ్లడ్ సింపుల్’ కి స్థానం దక్కింది. ఆతర్వాత నుంచి క్రైం వేవ్, ఫార్గో, నో కంట్రీ ఫర్ ఓల్డ్ మెన్, అన్ బ్రోకెన్ మొదలైన 27 సినిమాలూ తీశారు. కోయెన్ బ్రదర్స్ ఒక బ్రాండ్ నేమ్ గా మారింది. ‘బ్లడ్ సింపుల్’ మీద ఎందరో మేధావులు పరిశోధనాత్మక వ్యాసాలూ రాశారు. కోయెన్ బ్రదర్స్సినిమాల్లో నటించిన ఇద్దరికి ఉత్తమ నటనకి ఆస్కార్ అవార్డులు వచ్చాయి. 

      ప్రేమలూ పిశాచాలూ తీస్తే ఏమీ రాదు. పైగా థియేటర్లలో పార్కింగ్ వాళ్ళ, కేంటీన్ వాళ్ళ పొట్ట కొట్టడమే. వాళ్ళెలా తిట్టుకుంటూ వుంటారో వింటే తెలుస్తుంది. చిన్న సినిమాలు ఫీల్డు నిండా అందరికీ పనులిస్తున్నాయని సంబరపడితే కాదు, అవతల ప్రదర్శనా రంగంలో అందరి పొట్టలూ కొడుతున్నాయి. మల్టీప్లెక్సుల్లో వేరే సినిమాలు కవర్ చేయొచ్చు. సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ఆ ఒక్క అరిగిపోయిన ప్రేమే, ఆ ఒక్క అరిచే పిశాచమే ప్రేక్షకుల్ని రాబట్టాలి. దారితప్పి ఇద్దరో ముగ్గురో ప్రేక్షకులు వస్తున్నారు. నల్లగొండ జిల్లాలోని ఒక ముఖ్య పట్టణంలో ఎడింట్లో నాల్గు థియేటర్లు మూత బడ్డాయి. రెండు ప్రధాన థియేటర్లని కూల్చి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, షాపింగ్ మాల్ నిర్మిస్తున్నారు. నూట పది పారా బాయిల్డ్  రైస్ మిల్లులతో పట్టణం కళకళ లాడుతున్నా,  సినిమా బిజినెస్ నిల్. పిశాచాలు ప్రేమలూ వూరూరా ఇదే పరిస్థితి తెచ్చిపెడతాయి.

-సికిందర్
      

24, జూన్ 2017, శనివారం

రివ్యూ!




దర్శకత్వం : కబీర్ ఖాన్
తారాగణం : సల్మాన్ ఖాన్, సొహైల్ ఖాన్, ఝూ ఝూ, మతిన్ రే టంగూ, ఇషా తల్వార్, ఓం పురి, యశ్పాల్ శర్మ, జీషాన్ ఆయూబ్ తదితరులు
కథ : ‘లిటిల్ బాయ్’ ఆధారం, స్క్రీన్ ప్లే : కబీర్ ఖాన్, పర్వేజ్ షేక్; మాటలు : మనూ రిషీ చద్దా, సంగీతం : ప్రీతమ్, జూలియస్ పకియమ్; ఛాయాగ్రహణం : అసీమ్  మిశ్రా
బ్యానర్ :  సల్మాన్ ఖాన్ ఫిలిమ్స్, కబీర్ ఖాన్ ఫిలిమ్స్
విడుదల : జూన్ 23, 2017

***
        భజరంగీలు సల్మాన్- కబీర్ ఖాన్లు బిగ్ యాక్షన్ వదిలేసి క్యూట్ సెంటిమెంటుతో ‘ట్యూబ్ లైట్’ ని వెలిగించి, వెలుగులు నింపుకుందామనుకున్నారు ఈద్ కి. 1962 లో ట్యూబ్ లైట్ ఒక విలాస వస్తువు. ఇళ్లలోనే వుండేది కాదేమో, స్కూళ్ళల్లో వుండేందుకు వీల్లేదు. గ్రామాల్లో కరెంటే లేదు. అలాంటిది పట్టపగలు స్కూల్లో ట్యూబ్ లైటు వెలిగించబోయారంటే, ఎలాటి హాలీవుడ్ కథని ఎలా తయారుచేశారో అర్ధంజేసుకోవచ్చు. ఎవరికైనా  మంద బుద్ధి వుంటే ట్యూబ్ లైట్ అంటారు. ఇలా అనడం 1960 ల నుంచే మొదలైందా అనేది కూడా ఒక సందేహం. 

          ట్యూబ్ లైట్’  ఎన్నిసార్లు టపటప కొట్టుకున్నా వెలగకపోవడానికి కారణ మేమిటి? సమస్య స్టార్టర్ దా, ఫిలమెంటుదా, చోక్ దా? అసలు 1962 లో లెడ్ బల్బే వెలిగించివుంటే పోయేదా? తెలుగు హీరోలు సంక్రాంతికి వచ్చినట్టు, ప్రతీ రంజాన్ కీ వచ్చే ‘ఈద్’ హీరో సల్మాన్ ఖాన్ సంగతులేమిటో కథలోకి వెళ్లి చూద్దాం...

కథ 
     పర్వతాల మధ్య కుగ్రామం జగత్ పూర్. అక్కడ తల్లిదండ్రులు లేని అన్నదమ్ములు లక్ష్మణ్ (సల్మాన్), సోహైల్ (భరత్) లు. అనాధాశ్రయం నిర్వాహకుడు బన్నే చాచా (ఓంపురి) చేరదీసి పెంచుతాడు. కానీ లక్షణ్ కి వయస్సొచ్చినా మనసికంగా బాలుడిగానే వుండిపోయాడు. ఏ విషయాలూ అర్ధం కావు. చిన్న పిల్లాడి ప్రవర్తన. దీంతో స్కూల్లోనే తోటి పిల్లలు ట్యూబ్ లైట్ అని పేరు పెట్టేశారు. అదే స్థిరపడింది. 

          అప్పుడు చైనాతో యుద్ధం  వస్తుంది. సైన్యంలో చేరడానికి పిలుపు వస్తుంది. తమ్ముడు భరత్ సెలెక్ట్ అవుతాడు. తను సెలెక్ట్ కానందుకు హర్ట్ అవుతాడు లక్ష్మణ్. తనని వదిలి భరత్ యుద్ధరంగానికి వెళ్లిపోతూంటే కన్నీళ్లు పెట్టుకుంటాడు. తనని ఆటలు పట్టించే వాళ్ళనుంచి కాపాడే భరత్ ఇక తనతో లేనందుకు కుంగిపోతాడు. 

          ఊళ్ళోకి ఒక మెజీషియన్ (షారుఖ్ ఖాన్) వస్తాడు. అతను లక్ష్మణ్ చేత ఒక ఐటెం ప్రదర్శిస్తాడు. తదేక ధ్యానం,  ఆత్మ విశ్వాసం వుంటే కొండలైనా కదిలి దగ్గరికి వస్తాయని - కంటి చూపుతో (టెలికినెసిస్?)  సీసాని కదిలింపజేసి నిరూపిస్తాడు. దీంతో లక్ష్మణ్ ఆత్మబలంతో తమ్ముడు భరత్ ని రప్పించుకోగలనని నమ్ముతాడు. 

          ఒక చైనీస్ మూలాలున్న లీ (ఝూ ఝూ), ఆమె కొడుకు గువా (
మతిన్ రే టంగు) కోలకత నుంచి వచ్చి వూళ్ళో స్థిరపడతారు. చైనాతో జరుగుతున్న యుద్ధ్హాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళని ద్వేషిస్తాడు లక్ష్మణ్. కానీ శత్రువుతో నైనా స్నేహం చేయాలనీ గాంధీజీ సూక్తి చెప్తాడు బన్నే చాచా. దీంతో ఆ తల్లీ కొడుకులతో స్నేహం మొదలెడతాడు లక్ష్మణ్....ఇలా కథ సాగుతూనే వుంటుంది...సాగుతూనే వుంటుంది... ఎందుకంటే ఇది కథ కాదు, గాధ కాబట్టి.

ఎలావుంది కథ 
       2015 లో వచ్చిన ‘లిటిల్ బాయ్’ ని అధికారికంగానే రీమేక్ చేసిన కథ ఇది. మెక్సికన్ దర్శకుడు అలెజాండ్రో గోమేజ్ దీన్ని రెండో ప్రపంచయుద్ధ నేపధ్యపు కథగా తీశాడు.  ఇది తండ్రీ కొడుకుల మధ్య కథ. యుద్దానికెళ్ళి పోయిన తండ్రిని ఎలాగైనా ఆ యుద్ధాన్ని ఆపించి వెనక్కి రప్పించుకోవాలన్న ఎనిమిదేళ్ళ కుర్రాడి తపన ఇది. ఆత్మవిశ్వాసముంటే కొండలైనా కదిలివస్తాయన్న బైబిల్ సూక్తి కుర్రాడి  తపనకి ఆధారం. బైబిల్ సూక్తితో సాక్షాత్తూ కొండలే కదిలి వచ్చినట్టు చూపించడంతో కన్విన్స్ కాలేదు ప్రేక్షకులు. ఆత్మవిశ్వాసం వల్ల వ్యక్తిత్వ వికాసమో, మానసిక ప్రశాంతతో పిల్లలకి నేర్పేలా వుండాలిగానీ, కొండల్ని కదిలించే- యుద్దాల్ని ఆపించే మ్యాజిక్కులు కాదని ఈ సినిమాని తిప్పికొట్టారు. ఒక సీన్లో కుర్రాడు చేతులు జాపి, నోటితో భీకర శబ్దాలు చేస్తే నిజంగా భూకంపమే వస్తుంది!!  ఆవెంటనే కొండల్ని కూడా కదిలించాడని పేపర్లో వార్తలొస్తాయి!!

          దీన్ని సల్మాన్ తో రీమేక్ చేశారు. బాల పాత్రని బలిష్ట సల్మాన్ వేశాడు.  కథని 1962 లో చైనాతో యుద్ధం దగ్గర  స్థాపించారు. కానీ పుట్టడం మాత్రం స్వాతంత్ర్య పూర్వమే పుడతాడు.. దేశవిభజన, గాంధీజీ మరణం ఇవన్నీ చూసిన పాత్ర, 1962 నాటికీ ఎదిగి, చైనాతో యుద్ధాని కెళ్ళిన తమ్ముణ్ణి వెనక్కి రప్పించుకునే కథగా మారింది. ఆత్మవిశ్వాసంతో యుద్ధాన్నిఆపే పాయింటు లేదు. కాకపోతే నిడివి కోసమన్నట్టు  చైనీస్ తల్లీ కొడుకుల  ట్రాకు కల్పించి పెట్టారు.  ఈ కథలో హీరోయిన్ లేదు, ప్రేమలు లేవు, డ్యూయెట్లు లేవు, విలన్ కూడా లేడు.

ఎవరెలా చేశారు 
        టైటిల్ రోల్ వేసిన సల్మాన్ వొరిజినల్ లోని ఎనిమిదేళ్ళ లిటిల్ బాయ్ పాత్ర నటించాడు. ఒక బాల పాత్రని యుక్త వయసులోనో, నడి వయసులోనో వున్న నటుడు నటించడానికి సాహసం చేయడం  ఇదే ప్రథమం కావొచ్చు. ఇదెంత పొరపాటు నిర్ణయమో తెలుస్తోంది. ఎంత సేపూ  సల్మాన్ మానసికంగా ఎనిమిదేళ్ళ వయసు దగ్గరే ఆగిపోయిన పాత్రగా నటించాల్సి వచ్చి, ఒరిజినల్లోని బాల నటుడు జాకబ్ సల్వటిని వూహించుకుని వాడితో పోటీ పడ్డంతోనే సరిపోయినట్టు అన్పిస్తాడు. ఇక్కడే ఆత్మవిశ్వాసమంతా అవసర పడేసరికి, తమ్ముణ్ణి రప్పించడానికి ఏమీ మిగలక, చైనీస్ తల్లీ కొడుకులతో కాలక్షేపం చేస్తు నట్టు కన్పిస్తాడు. ఇదొక ట్యూబ్ లైటు. 

          చుట్టూ పాత్రలు సల్మాన్,  అంటే లక్ష్మణ్ పట్ల సానుభూతి చూపిస్తూంటాయి. ఈ సానుభూతి ప్రేక్షకులకి కలగదు. ఇక పాత్ర ప్రయాణానికి బ్రేకులు చాలా వున్నాయి- పెద్ద బ్రేకు చైనీస్ తల్లీ కొడుకులైతే, ఇంకోబ్రేకు బన్నే చాచా తీసుకునే పాత క్లాసులు. సల్మాన్ బాల పాత్రకి ఇంకో పోటీ ఏమిటంటే,  చైనీస్ బాలుడిగా నటించిన మతిన్ రే టంగూ. వంద కోట్లు పెట్టి తీశామంటున్న సినిమాలో పాత్రల పొందిక మాత్రం ఆత్మహత్యా సదృశంగా వుంది. ఒకవైపు సల్మాన్ ఇమేజికి వ్యతిరేకంగా ఇంత రిస్కు తీసుకుని, ప్రయోగాత్మకంగా బాల పాత్ర నటింపజేస్తూనే - ఈ వైవిధ్యాన్ని హైలైట్ గా నిలిపే ప్రయత్నం చేస్తూనే - ఇంకో వైపు దీన్ని దెబ్బతీసుకునే సృష్టి చేసి,  పోటీకి ఇంకో బాలనటుణ్ణి దింపవచ్చా? 

          దీంతో ఏమయ్యింది- సల్మాన్ కృత్రిమ బాల వేషాలకంటే, ప్రకృతి సిద్ధంగా రెడీగా తాజాగా వున్న వొరిజినల్ బాలుడే ప్రేక్షకుల్ని ఆకర్షించేట్టు తయారయ్యాడు. సల్మాన్ వీడితో నటించి తేలిపోయాడు. ఒకవైపు ఒరిజినల్ మూవీలోని బాల నటుడికి తీసిపోకుండా నటించే విషమ పరిస్థితి వుండగా, ఇంకోవైపు ఎదురుగానే వున్న టంగూ గాడితో కాంపిటేషన్ ప్రాణాల మీదికొచ్చింది సల్మాన్ కి.  జోడు మద్దెలతో వాచిపోయింది. ఇది మరో ట్యూబు లైటు. 

         టంగూ గాడు బెటర్ ఆప్షన్ సల్మాన్ పాత్రకి. ఇలా ఒక కథని ఎవర్ని పెడితే ఎవరికి దెబ్బ పడుతుందో చూసుకోకుండా ఎలా రాశారో  ‘వందకోట్ల’ సినిమాకి అనేది ప్రశ్న. ఇలా ఒక ట్యూబ్ లైటు కాదు, చాలా ట్యూబ్ లైట్లు వున్నాయి. 

          ఒరిజినల్ లిటిల్ బాయ్ వాడి అమాయకత్వంతో రెండో ప్రపంచ యుద్దాన్ని ఆపి తండ్రిని రప్పించుకోవాలనుకుంటాడు. ఇందులో వాడి విశాల హృదయం కన్పిస్తుంది. కానీ సల్మాన్ పాత్ర యుద్ధం ఎటైనా పోనీ, యుద్ధం చేయకుండా తమ్ముడు వెనక్కి రావాలని సంకుచితంగా ఆలోచిస్తుంది. చైనీస్ తల్లీ కొడుకులతో మాత్రం దేశభక్తి గురించి మాట్లాడుతుంది. ఈ దేశభక్తి షరతులతో వుంటుంది. నువ్వు భారత మాతాకీ జై అనకపోతే భారతీయుడివే కావు, చైనీయుడివే -  అని టంగూతో  అని థర్డ్ క్లాస్ దేశభక్తిని ప్రదర్శిస్తాడు. ఇది ఇప్పుడు కనిపిస్తున్న పరిణామంలాగే వుంటుంది తప్ప- 1962 ఇలాంటి దబాయింపు దేశభక్తి  లేదు. ఇదొక ట్యూబ్ లైటు. 

          ‘లిటిల్ బాయ్’ అని టైటిల్ పెట్టడంలో ఒక అర్ధముంది. రెండో ప్రపంచ యుద్ధంలో హిరోషిమా మీద వేసిన అణుబాంబు సంకేత  నామం లిటిల్ బాయ్. ఇది స్ఫురించేలా ఈ వార్ డ్రామాకి ఈ టైటిల్ పెట్టారు. టైటిల్ తో లిటిల్ బాయ్ ఆ బాలపాత్ర కూడా కావొచ్చు. ఆ పాత్రని ‘పెప్పర్’ అని ఇంకో పేరుతో పిలుస్తూ ఆట పట్టిస్తూంటారు. ఎందుకంటే వాడు ఎనిమిదేళ్ళ వయస్సుకి తగ్గ ఎత్తు పెరగలేదు. 

          ఆ బాల పాత్ర శారీరకంగా పెరక్క పోతే, సల్మాన్ పాత్రని మానసికంగా ఎదగకుండా నిర్బంధానికి గురి చేశారు.  పైగా ‘ట్యూబ్ లైట్’ టైటిల్ కి జస్టిఫికేషన్ లేదు. ఆ కాలంలో ట్యూబ్ లైట్ల లభ్యత గురించి రివ్యూ ప్రారంభంలోనే చెప్పుకున్నాం. అదలా వుండగా, సల్మాన్ బాలావస్థ  పాత్ర ట్యూబ్ లైట్ ఎలా అవుతుంది? మానసికంగా ఎదుగుల ఆగిపోయిన వాణ్ణి ట్యూబ్ లైట్ అనరు కదా? మానసిక ఎదుగుల వుండి  బుర్ర పనిచెయ్యక పోతే ట్యూబ్ లైట్ అంటారేమో!  ఇలా టైటిల్ని కూడా  సరీగ్గా ఆలోచించ లేకపోయారు. ఇది మరో  ట్యూబ్ లైటు. 

          సల్మాన్ సోదరుడు సొహైల్ సైనికుడుగా నటించాడు. ఒక యుద్ధ సన్నివేశం తర్వాత సైన్యంలో చేరినందుకు బాధ పడుతున్నట్టు వుంటాడు. చైనీస్ నటి ఝూ ఝూ సింపుల్ గా నటించుకుపోయింది. ఇక బన్నే చాచాగా ఒంపురి నటించిన చివరి మూవీ ఇది. పాత్ర గాంధీజీ సూక్తుల్ని వల్లిస్తూంటుంది. అయితే,  ఒకవైపు ద్వేషం నింపుకుని ఇంకోవైపు ఆత్మ విశ్వాసంతో వుండలేవనే డైలాగు  ఒరిజినల్ లోదే. ఇక శత్రువుతోనైనా స్నేహం చేయాల్సిందే నని గాంధీజీ సూక్తి చెప్పినప్పుడు- దీన్ని గాంధీజీ ఎలా నిజం చేశారో వివరిస్తాడు : శత్రువులైన బ్రిటిష్ వాళ్లతో సంఘర్షించకుండా గాంధీజీ స్నేహపూర్వకంగా మెలగడం వల్లే వాళ్ళు స్వాతంత్ర్యం  ఇచ్చేసి వెళ్లిపోయారని. 

          ఇదివేరు. దేశం శత్రువు చేతిలో వున్నప్పుడు శత్రువుతో స్నేహంగా వుంటూ పని జరుపుకోవాలనుకోవడం విజ్ఞతే. కానీ, పొరుగు దేశం యుద్ధానికి దిగినప్పుడు స్నేహం చేయాలనడం అవివేకం. గాంధీజీ  ఈ నేపధ్యంలో చెప్పి వుండరు. ఇప్పుడు కాశ్మీర్ లో సంభవిస్తున్న పరిణామాలకి ఈ డైలాగుతో తెలివిగా బ్రెయిన్ వాష్ చేస్తున్నట్టు కన్పిస్తుంది. కాశ్మీర్ లో పాక్ మూకలు కరాళనృత్యం చేస్తూంటే- పాకిస్తాన్తో చర్చలు ప్రారంభించాలని దేశీయ శక్తులే చేస్తున్న ప్రచారానికి ఈ డైలాగుతో  మద్దతు ఇస్తున్నట్టుంది. చైనా మనతో యుద్ధానికి దిగితే మనం స్నేహం ఎలా చేస్తామని సల్మాన్ నిలదీసినా, చేయాల్సిందే నని దబాయిస్తాడు ఓంపురి! దీనికి మాయ చేస్తూ గాంధీజీ సూక్తి అన్వయింపు! ఇది మళ్ళీ మరొక ట్యూబ్ లైటు...

          సినిమా ప్రమోషనల్ కార్యక్రమంలో సల్మాన్ ఇలాగే  పాక్ తో చర్చలు జరపాలని కామెంట్ చేసి ఇరుక్కున్నాడు. సినిమా నిర్మాణంలో వుండగానే, దివంగత ఓంపురి కూడా ఈ భావజాలాన్నే ప్రదర్శించి విమర్శల పాలయ్యారు. సినిమాలో మాత్రం ఇంకో రూపంలో వున్న వీళ్ళిద్దరి సన్నివేశం సెన్సార్ కత్తెరని తప్పించుకున్నట్టుంది. చైనీస్ తల్లీ కొడుకుల పాత్రల్ని ఈ భావజాల వ్యాప్తికే అడ్డు పెట్టుకున్నారన్నట్టుంది. సినిమా పాకిస్తాన్ లో ఆడాలిగా!  చైనాలో కూడా ఆడించుకో వచ్చు, అమీర్ ఖాన్ వేసిన బాటలో.

          లొకేషన్స్ అద్భుతంగా  వున్నాయి. దీనికి తగ్గట్టు మరోసారి ‘భజరంగీ  భాయిజాన్’ ఫేం అసీం మిశ్రా ఛాయాగ్రహణం క్లాస్ గా వుంది. ప్రీతమ్ పాటల విషయానికొస్తే మాత్రం- హిందీ పాటలకి ఇంకా పంజాబీ బాణీల జ్వరం ఇప్పట్లో వదిలేలా లేదు. హిందీ సినిమాల్లో మెయిన్ స్ట్రీమ్  సంగీతాన్ని వదిలేసి అందరికీ పట్టని  ఈ ప్రాంతీయ సంగీతాన్ని రుద్దుతున్నారు. 

చివరికేమిటి 
      ఇది కథకాదు, గాథ. ఒరిజినల్లో పిల్లాడి సినిమాకి గాథ అయినా సరిపోయింది- చిల్ద్రెన్ ఫిలిమ్స్ ఎక్కువగా  గాథలుగానే వుంటాయి. కానీ ఆ పిల్లాడిగా సల్మాన్ అనే సూపర్ స్టార్ నటిస్తున్నప్పుడు  గాథ సపోర్టు చేయడం కష్టం. అది కమర్షియల్ కథగా మారాల్సిందే. మారలేదు కాబట్టి ఇదొక ట్యూబ్ లైటు. ఫస్టాఫ్ – దీనికి మించి సెకండాఫ్ చాలా బోరుగా, బక్వాస్ గా తయారయ్యాయి. ఈ రీమేక్ తో అన్నిటా తప్పటడుగులే వేశారు. కబీర్ ఖాన్ రచనా బలం కూడా సన్నగిల్లిపోయింది. దర్శకత్వానికి ఈ రచన దన్ను కాలేకపోయింది. వెలగని ఎన్నో ట్యూబ్ లైట్లని వెలిగించేందుకు విఫలయత్నం చేసి అంధకారంలో వుండిపోయారు. ప్రారంభ దృశ్యాల్లో స్కూల్లో వెలగని ట్యూబ్ లైటు వెలిగించే ప్రయత్నం చేసినప్పుడే సినిమా సౌరభం తెలిసిపోయింది. ఇలాటి ఆత్మవిశ్వాసంతో ఇంత  సినిమా తీశాక కొండల్ని కదిలించగలరని పిల్లలకేం చెప్తారు...

-సికిందర్

         


         


.

23, జూన్ 2017, శుక్రవారం

రివ్యూ!

రచన - దర్శత్వం: రీష్  శంకర్
తారాగణం :  అల్లు అర్జున్, పూజా హెగ్డే, రావు మేష్, తనికెళ్ళ భరణి, పోసాని కృష్ణ మురళి. మురళీ శర్మ, సుబ్బరాజు, చంద్ర మోహన్, వెన్నెల కిషోర్, సనా దితరులు
స్క్రీన్ ప్లే: మేశ్ రెడ్డి, దీపక్ రాజ్;  సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, ఛాయాగ్రహణం : ఐనాక బోస్
బ్యానర్ : శ్రీ వెంకటేశ్వరా  క్రియేషన్స్
నిర్మాతలు: దిల్రాజు - శిరీష్
విడుదల : జూన్ 23, 2017
***
          ‘దువ్వాడ జగన్నాథం’ తో అల్లు అర్జున్- హరీష్ శంకర్ లు కొత్త కాంబినేషన్ గా ఏర్పడి అభిమానులకి ‘ఫాంటాస్టిక్ - ఎక్స్ ట్రార్డినరీ- మైండ్ బ్లోయింగ్’ గా కన్పించారు. బ్రాహ్మణ వెరైటీ పాత్రతో ఒక అద్భుతాన్ని ఇస్తున్నట్టు ఫ్యాన్స్  ఆనందించారు. దిల్ రాజు నిర్మాణంలో 25 వ చలన చిత్రంగా ఆయనా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు.  ఇవన్నీ కలిసి ఏం బొమ్మ చూపించాయి? తేడాగల బొమ్మేనా, తేడా కొట్టిన బొమ్మా? ఈ కింద చూద్దాం...

కథ 
     దువ్వాడ జగన్నాథం (అల్లు అర్జున్) బ్రాహ్మణ వంట వాడిగా వుంటూ, మరోవైపు డిజే పేరుతో అన్యాయాలు  చేసే వాళ్ళని చంపుతూంటాడు. ధర్మాన్ని నిలబెడితేనే ధర్మం మనల్ని కాపాడుతుందని నమ్ముతాడు. చిన్నప్పుడే పిస్తోలు పట్టి చంపడం చేసి ఒక పోలీసు అధికారి ( మురళీ శర్మ ) ని కాపాడతాడు. చెడుని నిర్మూలించడానికి మనం చేతులు  కలుపుదామని ఆ పోలీసు అధికారి పదేళ్ళు లేని డిజే ని చేరదీస్తాడు. అప్పట్నుంచీ ఇద్దరూ దుష్టుల్ని చంపుతూంటారు. డిజే తండ్రి (తనికెళ్ళ భరణి) ఇతడి ఆవేశాన్ని గమనించి ఒక రుద్రాక్ష మాల మెళ్ళో వేసి, హింసకి పాల్పడనని  ఒట్టేయించుకుంటాడు. చంపుతున్నప్పుడు డిజే ఆ మాల తీసేసి చంపుతూంటాడు.

          మిత్రుడు విఘ్నేశ్వర శాస్త్రి (వెన్నెల కిషోర్) పెళ్ళిలో వంట కెళ్ళి నప్పుడు అక్కడ పూజా ( పూజా హెగ్డే) ని చూసి ప్రేమలో పడతాడు డిజే. వంట వాణ్ణి చేసుకోనని పూజా వెళ్ళిపోతుంది. ఇలా వుండగా డిజే మావయ్య (చంద్రమోహన్ ) ఆత్మహత్య చేసుకుంటాడు. అగ్రి డైమండ్ అనే సంస్థ చేసిన మోసానికి ఇంకా చాలా మంది బలై పోతారు. దీంతో డిజే ప్రతీకారం తీర్చుకోవడానికి సిద్ధమవుతాడు.

          అగ్రి డైమండ్ కుట్రదారు రొయ్యల నాయుడు (రావు రమేష్). ఇతను ఈ కేసు లోంచి బయట పడడానికి హోం  మంత్రి పుష్పం ( పోసాని) ని కలుపుకుంటాడు. పుష్పం తనకి ప్రమాదం తల పెట్టకుండా అతడి కూతుర్ని తన కివ్వాలని షరతు పెడతాడు. పుష్పం కూతురే డిజే ప్రేమించిన పూజా.
          ఇదీ విషయం. ఇప్పుడు ఈ కుట్రదారుల్ని డిజే  ఎలా నిర్మూలించాడనేది మిగతా కథ. 

 
ఎలా వుంది కథ : 
      ఇది టెంప్లెట్ కథ. దిల్ రాజు స్టార్స్ తో తీస్తున్నప్పుడు అనివార్యంగా ఆయనకి టెంప్లెట్ కథలు తప్పవు.  స్టార్స్ తో ఆయన ఇలాగే  సినిమాలు తీస్తూ వుండక తప్పదు. ఒకప్పుడు సీనియర్ స్టార్లు వున్నప్పుడు వాళ్ళ రోటీన్లు చూసి ఇమేజి చట్రంలోఇరుక్కున్నారని కామెంట్స్ వెలువడేవి. ఇప్పుడు స్టార్లు టెంప్లెట్ చట్రంలో ఇరుక్కుని అందులోంచి బయట పడలేక పోతున్నారు. అర్జున్ – హరీష్ ల కొత్త కాంబినేషన్ ఈ చట్రంలోనే ఇరుక్కుని దాని ఫలితం అనుభవించదానికి సిద్ధపడింది.  ఈ సంవత్సరం ఇప్పటి వరకూ పెద్ద సినిమాలు ఎనిమిది విడుదలైతే – డిజే  తో కలుపుకుని ఆరూ టెంప్లెట్ సినిమాలే. వీటిలో విన్నర్, కాటమ రాయుడు, రాధ, రోగ్, మిస్టర్ ఐదూ అట్టర్ ఫ్లాపయ్యాయి. డిజే దీన్నుంచి తప్పించుకుంటుందా? కొత్త వాళ్ళు  తీస్తే  అవే ప్రేమలు, దెయ్యం కామెడీలు, టాప్ స్టార్లు- డైరెక్టర్ లు నిర్మాణ సంస్థలూ తీస్తే అవే టెంప్లెట్ సినిమాలు ఎంతకాలం? టెంప్లెట్ లు ఫ్లాపవుతున్నాయని తెలిసే తీస్తున్నారా, తెలియక తీస్తున్నారా? 

ఎవరెలా చేశారు 
       అల్లు అర్జున్ వెరైటీగా వేసిన బ్రాహ్మణ పాత్ర, అదే రొటీన్ యాక్షన్ పాత్రలా కాకుండా, యాక్షన్ తో టచింగ్ క్యారెక్టర్ గా తీర్చి దిద్దమని దర్శకుణ్ణి అడగవచ్చు. కానీ టెంప్లెట్ చట్రంలో కుదరలేదేమో. టెంప్లెట్ చట్రాల్లో పాత్రలు పేరుకే వెరైటీ గానీ, పాత్ర చిత్రణల  దగ్గర కాదు.  ‘జంటిల్ మేన్’ లో అర్జున్, ‘అపరిచితుడు’ లో విక్రమ్, ‘విశ్వరూపం’ లో కమల్ హాసన్ లు పోషించిన బ్రాహ్మణ పాత్రలు ఎందుకు గుర్తుండి పోతాయో ఆలోచించాలి. 

          నటన విషయానికొస్తే, ‘అదుర్స్’ లో ముద్దుముద్దుగా, రిథమిక్ గా డైలాగులు పలకడంలో ఈజ్ చూపించడం వల్ల ఎన్టీఆర్ బ్రాహ్మణ పాత్ర ఫన్నీగా వుంటే, అర్జున్ కొచ్చేసరికి, అంత ఈజ్ లేకపోయినా బ్యాడ్ గా మాత్రం లేదు. ఇక కామెడీ, ఫైట్లు, డాన్సుల్లో సిద్దహస్తుడే. కథకి ఎత్తుకున్న పాయింటుని టెంప్లెట్ పాలుచేయకుండా వుండుంటే,  పాత్ర చిత్రణ వేరేగా వుండేది. 

          హీరోయిన్ పూజా హెగ్డే రోటీన్ గ్లామర్ తారే. రావు రమేష్  ఏదో వొక వేషం మార్చి విలన్ వేషాలేస్తారు. ఈసారి తన తండ్రి రావు గోపాల రావులా నిక్కరు వేసుకుని విలనిజం చేశారు. క్లయిమాక్స్ లో ఈ విలనిజం బావుంది. చనిపోయిన తల్లితో మాట్లాడే కొడుకుగా కామిక్ క్యారక్టర్ గా సుబ్బరాజు క్లయిమాక్స్ ని నిలబెట్టాడు. మురళీ శర్మా ఇంకా ఇతర నటులూ పాత్రలకి తగ్గట్టే నటించారు. ‘అమీతుమీ’ హేంగోవర్ లోవున్న ప్రేక్షకులకి  వెన్నెల కిషోర్ ని చూడగానే హుషారు!
          పాటలు ఓ రెండు బావున్నాయి. ఇక మిగతా సాంకేతికాలు బ్యానర్ కి తగ్గట్టే వున్నాయి. 

చివరికేమిటి   
      హింసే పరిష్కారమనుకునే విజిలాంటీ హీరో పాత్ర, సహకరించే పోలీసుపాత్రల మీద ఆధారపడి ఈ సినిమాకి పూనుకున్నారు. కానీ దీనికి కట్టుబడి వుండలేకపోయారు. ముందుగా ఫస్టాఫ్ లో వంటవాడైన హీరోతో ఒక్క గుర్తుండి పోయే మేజర్ సీనుకూడా లేకపోవడం డెప్త్ పరంగా పెద్ద లోపం. ‘క్రిష్ణవేణి’ లో వంటవాడుగా రాజబాబు గుర్తొస్తే ఇప్పటికీ నవ్వొస్తుంది. డిజే లో వంటలతో హీరో చేసే కామెడీ ఏమీలేదు. ఫోటో- ఆప్ కోసం అన్నట్టు గరిటె తిప్పుతూ ఇతర విషయాలు మాట్లాడడం తప్పితే. 

          యాక్షన్ విషయానికి వస్తే, మావయ్య చనిపోవడంతో కుట్ర దార్ల మీద పగదీర్చుకోవాలని హీరో నిర్ణయం తీసుకోవడం కథకి మొదటి మలుపు. ఇది గంట సేపటి కొస్తుంది (సినిమా నిడివి మొత్తం రెండు గంటలా 40 నిమిషాలు). ఐతే దీనికి ముందు హీరో అన్యాయాలు చేసే వాళ్ళని చంపుతూ వుండడంతో, ఈ మొదటి మలుపు దగ్గర తీసుకున్న నిర్ణయం బలంగా అన్పించదు. ఎందుకంటే మొదటి మలుపు నుంచి హీరో కొత్తగా ఏదోచేయాలి. కానీ ముందు నుంచీ ఏదైతే చంపడాలు చేస్తున్నాడో, మావయ్య చనిపోయిన కీలక ఘట్టం దగ్గర్నుంచీ మళ్ళీ అదే చేస్తున్నాడు. దీంతో కథనంలో మొనాటనీ ఒకటి, డైనమిక్స్ లేకపోవడం వొకటీ, పాత్ర ఎదుగుదల లేకపోవడం ఒకటీ జరిగి చప్పగా సాగుతూంటుంది కథ. 

          హీరోని చిన్నప్పుడే కిల్లర్ గా చూపించాక, దాన్నే పెద్దయ్యేవరకూ కంటిన్యూ చేస్తూ అదే కొనసాగించడం వల్ల వచ్చిన సమస్య ఇది. తనని కాపాడి నంత మాత్రాన,  పోలీసు అధికారి ఆ చిన్నపిల్లాణ్ణి పెట్టుకుని, తెర వెనుక తను వుంటూ,  చంపడాలు చేయించడమే కన్విన్సింగ్ గా లేదు. చిన్న పిల్లాడితో ఒప్పందాలేమిటి చెడ గొట్టడానికి కాకపొతే. ఆ తండ్రి అడ్డుపడి దూరం పెట్టి వుండాల్సింది. పెద్దయ్యాక హీరో వంట వాడిగానే వుండేవాడు. మావయ్య  చనిపోయాక పగ రగిలినప్పుడు- అసంఖ్యాక  ప్రజల్ని బాధితులుగా చూసినప్పుడు- చిన్న తనం గుర్తుకు వస్తే, అప్పుడు నిర్ణయం తీసుకుని వెతుక్కుంటూ వెళ్లి ఆ పోలీసు అధికారికి సై  అనివుంటే అది రియల్ డ్రామాగా వుండేది. మొదటి మలుపు బలంగా వుండేది. పాత్ర ఎదుగుదల, ఎవేర్ నెస్ కన్పించేవి.

          కథనానికీ పాత్రకీ ఏ నియమాలూ అవసరంలేదన్నట్టు ఏదో స్క్రీన్ ప్లే రాసేశారు. ఇకపోతే, ఏది ప్రధాన కథ అనే దానికి కూడా స్పష్టత తెచ్చుకోలేదు.  ముప్పావు భాగం కథ హీరోకి హీరోయిన్ తో రోమాన్సులూ పాటలే. మావయ్య చావుతో అంత నిర్ణయం తీసుకున్న హీరో అది వదిలేసి (కథ వదిలేసి) హీరోయిన్ తో ఎంజాయ్ చేస్తూంటాడు.  ఇక్కడ చాలా విచారకర విషయమేమిటంటే, హీరోయిన్ తో విలన్ కుట్ర చేస్తున్నాడని కూడా హీరోకి సెకండాఫ్ లో ఎవరో చెప్పే వరకూ తెలీదు. ఫస్టాఫ్ లో హీరోయిన్ ని తన కొడుక్కు చేసుకోవాలని డిసైడ్ ఐపోయి హీరోమీద దాడులు జరిపిస్తూంటాడు విలన్. కానీ హీరో తెలుసుకోడు. ఇలా పాసివ్  పాత్రగా కూడా తయారయ్యింది.

          కథలో వున్న మెలికని తెలుసుకుని ఆ ప్రకారం నడపకపోవడంతో ప్రధాన కథకంటే ఉప కథే ఎక్కువై మింగేసింది. విలన్ అగ్రి డైమండ్ కుట్ర వొకటే చేయలేదు, అందులోంచి బయట పడేందుకు మంత్రి కూతురైన హీరోయిన్ ని కోడల్ని చేసుకోవాలని కూడా కుట్ర చేస్తున్నాడు. అంటే కథా ఉపకథా కలిసి పోవాలన్న మాట. వ్యక్తిగతంగానూ విలన్ హీరోని దెబ్బ తీస్తున్నప్పుడు, ఇది హీరో తెలుసుకోక హీరోయిన్ తో ఎంజాయ్ చేయడం వల్ల, ఈ ఉపకథ ఉప కథ లాగే వుంటూ- అసలు రివెంజి కథ కన్పించకుండా పోయింది. ఎప్పుడో సెకండాఫ్ లో దుండగులు హీరో చెల్లెల్ని తగుల బెట్టబోయినప్పుడు, హీరో ఫ్రెండ్ ని వురి తీసినప్పుడు- ఇంకా జనాలకి బెదిరింపు కాల్స్ చేసినప్పుడు గానీ- హీరోకి  హీరోయిన్ తో చేస్తున్న మజా అంతా  ఎగిరిపోయి దారికి రాడు! ఎంతకీ కథలోకి రాని హీరో గార్ని ఇలా  కథలోకి లాగినట్టయ్యింది విలన్!  మావయ్య చావుకి హీరో బాధ్యుడు కాదు, కానీ తను చేయాల్సింది  వదిలేసి,  హీరోయిన్ తో మజా  చేసుకోవడం వల్లే చెల్లికీ ఫ్రెండ్ కీ ప్రాణాల మీది కొచ్చినట్టు కథనమూ,  పాత్రచిత్రణా తయారయ్యాయి. 

          ఇప్పుడు మళ్ళీ భీకర ప్రతిజ్ఞలు చేస్తాడు. ఇదెప్పుడో ఫస్టాఫ్ లోనే చేశాడు. సెకండాఫ్ మరీ దిగదుడుపుగా తయారయ్యింది. విషయంలేదు. విషయమంతా క్లయిమాక్స్ లో టెంప్లెట్ ప్రకారం ఫోక్ సాంగ్ తర్వాత విలన్ తో అమీ తుమీ తేల్చుకోవడమేనని తెలుసు. ఎందుకోసం ప్రేక్షకులు కూర్చోవాలో అర్ధంగాని సెకండాఫ్ ఇది. క్లయిమాక్స్ లో విలన్ కొడుకుగా సుబ్బరాజు మదర్ ప్రేమ క్యారక్టరైజేషన్ వల్ల ఫన్నీగా మారింది. ఈ మొత్తం బిగ్ కమర్షియల్ లో అనూహ్యంగా ఏదైనా వుందంటే అది ఈ క్లయిమాక్స్ ఒక్కటే.

          హరీష్ శంకర్ కీ ఇలా టెంప్లెట్ సినిమాలు తప్పేలా లేవు. దీని వల్ల అతడి దర్శకత్వ  ప్రతిభ ఏమిటో బయట పడ్డం లేదు. దృశ్యాల చిత్రీకరణలో వైవిధ్యం లేదు. ఐదు టెంప్లెట్ సినిమాల పరాజయాల తర్వాత డిజే పరిస్థితేమితో ప్రేక్షకులే నిర్ణయించాలి.

-సికిందర్
http://www.cinemabazaar.in


21, జూన్ 2017, బుధవారం

స్పెషల్ ఆర్టికల్!





        నేటి నియో నోయర్ లేదా డార్క్ మూవీస్ కి మాతృక బ్లాక్ అండ్ వైట్ ల కాలం నాటి  (1930-60) ఫిలిం నోయర్  అని చెప్పుకున్నాం. దీన్నే క్లాసిక్ నోయర్ అంటారు. కథా కథనాల పరంగా ఈ రెండిటికీ తేడా ఏమిటంటే, టెక్నాలజీ అభివృద్ధి చెందని ఆ కాలంలో బలమైన పాత్రచిత్రణలు చేసి, బరువైన కథనాలు చేసి ప్రేక్షకుల్ని కూర్చో బెట్టే వారు. తర్వాత టెక్నాలజీ అభివృద్ధి చెందాక పాత్ర చిత్రణల్ని, కథనాలనీ లైట్ తీసుకుని టెక్నికల్ గా ఆకర్షించడం మొదలెట్టారు. తెలుగుకి వస్తే, డార్క్ మూవీస్ కథనాల్లో హాలీవుడ్ నోయర్ రీతులన్నిటినీ అనుసరించడం కాసేపు ఆపి, స్థానిక అభిరుచుల్ని దృష్టిలో పెట్టుకుని, ఒక ‘లోకల్ నోయర్’ ని రూపొందించుకుంటే బావుంటుంది. చిత్రీకరణలో- అంటే ఎలిమెంట్స్ విషయంలో మాత్రం - ఫిలిం నోయర్- లేదా నియో నోయర్ రీతుల్నే  అవలంబించవచ్చు. హాలీవుడ్ లో నియో నోయర్ బిగ్ బిజినెస్. బిగ్ స్టార్స్, బిగ్  డైరెక్టర్స్ వీటికి పట్టం గడుతూంటారు. క్రిస్టఫర్ నోలన్ ‘మెమెంటో’ (2001- తెలుగులో ‘గజినీ’) తీసినా, లేదా  మార్టిన్ స్కోర్ససీ ‘షటర్ ఐలాండ్’  (2010) తీసినా,  1940 ల నాటి ఫిలిం నోయర్ రీతుల్ని  పరిశీలించే తీశామని చెప్పుకున్నారు. ఒక రిఫరెన్స్ లేకుండా ఒక అద్భుతం రాదు.    

          గత వ్యాసాల్లో డార్క్ మూవీస్ కథలు అప్పుడున్న సామాజిక పరిస్థితుల్లోంచి ఎలా పుడతాయో చెప్పుకున్నాం. ఏఏ పాత్రలుంటాయో చెప్పుకున్నాం. డార్క్ మూవీస్ కథలు సంపన్న వర్గాల కుసంస్కృతుల నుంచి పుడతాయి. డార్క్ మూవీస్ కథలు పర్సనల్ కథలు. ఆ వ్యక్తి లేదా ఆ కుటుంబానికి సంబంధించి మాత్రమే వుంటాయి. అదే మాఫియా గానీ, లేదా ఇంకే గ్యాంగ్ స్టర్ మూవీస్ కథలు గానీ మొత్తం సమాజాన్ని డిస్టర్బ్ చేసేవిగా వుంటాయి. వీటిని డార్క్ మూవీస్ కథలని పొరబడకూడదు. డార్క్ మూవీస్ కథలు పర్సనల్ కథలు. హిందీలో, తమిళంలో, మలయాళంలో  కూడా ఇలాగే తీశారు- కహానీ, కహానీ -2, పింక్, షైతాన్, జానీ గద్దార్, యాక్సిడెంట్ ఆన్ హిల్ రోడ్, 16- డి, సూదు  కవ్వం, నగరం, కనుపాప మొదలైనవి. 

          మోహన్ లాల్ నటించిన మలయాళ డబ్బింగ్ ‘బ్లాక్ మనీ’ డార్క్ మూవీ కాదు. ఇది ఒక మంత్రి చేసే రాజకీయ కుట్రకి సంబంధించిన యాక్షన్ థ్రిల్లర్.  డార్క్ మూవీస్ లో సీఎం, హోం మంత్రి, ఇంకో ప్రతిపక్ష నాయకుడు వంటి రాజకీయ పాత్రలకి స్థానం లేదు. వుంటే ‘పింక్’  లోలాగా కొడుకుని కాపాడుకునే పర్సనల్ కథగా వుంటాయి. అవికూడా సీఎం కొడుకు, హోం మంత్రి కొడుకు లాంటి పాత మూస ఫార్ములా పాత్రలై వుండవు. ఓ రాజకీయనాయకుడి కొడుకు, అంతే. రాజకీయ కుట్రలు చేసుకుని రాజకీయ, సామాజిక అస్థిరతలకి  పాల్పడే కథనాలు డార్క్ మూవీస్ లో వుండవు. కేవలం వ్యక్తిగత కథలే వుంటాయి. 

      ఫిలిం నోయర్ కాలంలో ప్రధానపాత్ర నేరాల్ని పరిశోధించే డిటెక్టివ్ లేదా పోలీస్ అధికారి పాత్ర, నేరంలో ఇరుక్కున్న సామాన్యుడి పాత్ర, యాంటీ హీరో పాత్ర...ఈ మూడు రకాలుగా వుండేది. నియో నోయర్ ప్రారంభమయ్యాక, మరికొన్ని నమూనాలు చేరాయి : లాయర్, రిపోర్టర్, రైటర్, ఫోటోగ్రాఫర్... ఎందుకంటే, ఈ పాత్రలకి నేరప్రపంచంలో చొచ్చుకు పోవడానికీ, పరిశోధించడానికీ వృత్తిపరమైన వెసులుబాటు,  చొరవ వుంటాయి.
          
       కాబట్టి తెలుగుకి వచ్చేసి, ఈ ప్రొఫెషనల్ పాత్రలు కాక, ఇష్టానుసారం పాత్రల్ని పెట్టుకుంటే జానర్ మర్యాదని దెబ్బతీస్తుంది. అది డార్క్ మూవీ అవదు. నల్గురు స్టూడెంట్స్ అడవిలోకి వెళ్లి ప్రమాదంలో ఇరుక్కునే టెంప్లెట్  హార్రర్, థ్రిల్లర్ సినిమాలు వస్తూంటాయి. ఈ స్టూడెంట్స్ ని డార్క్ మూవీస్ లో పెట్టి కథ నడిపితే జానర్ మర్యాద దెబ్బతినిపోతుంది. డార్క్ మూవీ అవదు. 2013 లో ఈ వ్యాసకర్త ఒక దర్శకుడికి డార్క్ మూవీ స్క్రిప్టు రాసినప్పుడు, పాతికేళ్ళు నిండని యంగ్ హీరో ప్రొఫెషనల్ గా ఏమీ కాకపోయినా, అతడికి లీ చైల్డ్ థ్రిల్లర్  నవలల పిచ్చి వున్నట్టు పాత్రచిత్రణ చేయడం జరిగింది. అతను లీ చైల్డ్ ని వూ హించుకుని సంభాషిస్తూంటాడు కూడా. కాబట్టి క్రైం వరల్డ్ తో ఈ సాహిత్య స్పర్శతోనే అతడికి నల్గురు దుష్ట ఇన్స్ పెక్టర్లని ఎదుర్కొనే తెలివి, తెగువా సమకూరినట్టు చిత్రించడం జరిగింది. బాధిత పాత్ర అయినప్పటికీ  (నేర) కథాప్రపంచంలో పాల్గొనడానికి దానికో క్వాలిఫికేషన్ ఇవ్వడంజరిగింది. 

          కాబట్టి డార్క్ మూవీస్ కథా ప్రపంచంలో జరిగే ‘బిజినెస్’ లో ఇమిడే సజాతి పాత్రలుండాలి.  పాప్  మ్యూజిక్ కార్యక్రమంలో జానపద గాయకుడు వచ్చి పాడినట్టు విజాతి పాత్రలుండకూడదు. ఈ వ్యాసకర్త ఇంకో డార్క్ మూవీ స్క్రిప్టు రాసినప్పుడు ఆ హీరో, అతడి ఫ్రెండ్ న్యూస్  ఛానెల్ నిఘా టీం పాత్రలయ్యాయి. డిటెక్టివ్ పాత్రలకి తెలుగు నేటివిటీ లేదని చెప్పుకున్నాం. ఆ డిటెక్టివ్ కి ప్రత్యాన్మాయాలే పోలీసు అధికారి, లాయర్, రిపోర్టర్, రైటర్, ఫోటోగ్రాఫర్ మొదలైన నేటివిటీ కలిసే పాత్రలు.

***
         డార్క్ మూవీస్ ని బిగ్ స్టార్స్, బిగ్ డైరెక్టర్లే కాదు, గొప్ప గొప్ప మేధావులూ పట్టించుకున్నారు. డార్క్ మూవీస్ ఒక పెద్ద శాస్త్రం. అసంఖ్యాక  అధ్యయనాలూ గ్రంధాలూ కోర్సులూ ఇప్పటికీ వెలువడుతూంటాయి. ఈ సమాచారారణ్యంలోంచి తెలుగు నేటివిటీకి నారు తీసుకొచ్చి నాట్లు వేయాలంటే మాటలు కాదు.  తెలుగు నేటివిటీతో బాటు, చూసే ప్రేక్షకులెవరనేది కూడా దృష్టిలో పెట్టుకోవడం అవసరం. ఒకప్పుడు వున్నట్టు ఇప్పుడు పాఠక  ప్రపంచం లేదు, ప్రేక్షక ప్రపంచమే వుంది. పాఠక ప్రపంచం వున్నప్పుడు లోతైన కథలు, పాత్రలు, సమస్యలు సినిమాల్లో వుండేవి.  ప్రేక్షక ప్రపంచంగా మారేక, ఇవన్నీ అప్రస్తుతాలై పోయాయి. ఈ సినిమాలో ఈ హీరో తానుగా నిర్ణయం తీసుకోక,  మరొకరు చెప్తేనే యాక్షన్ లోకి దిగాడు కదాని పాత్ర చిత్రణ చెప్తే - ఐతే ఏంటి అనేస్తున్నారు. అది అవుట్ డేటెడ్ పరిశీలన అంటున్నారు. డెప్త్ వుంటే అవుట్ డేటెడ్, డెప్త్ లేకపోవడం అప్ డేటెడ్. కాబట్టి ఫిలిం నోయర్ కథనాల్లోని బరువైన విషయాల్ని  తెలుగులో దించితే ఇప్పుడు లాభించదు.
            నియో నోయర్ మూవీస్ ని చూసే ముందు వీటి మాతృకలైన ఫిలిం నోయర్ మూవీస్ ని కూడా చూడాలి. 

          1.  నియో నోయర్ మూవీస్ అస్తిత్వ సమస్యలు, ప్రభుత్వ విప్లవాత్మక నిర్ణయాలు ( పెద్ద నోట్ల రద్దు వంటివి), టెక్నాలజీతో వచ్చే సమస్యలు, మెమరీ కి సంబంధిన సమస్యలు మొదలైన వాటితో వుంటున్నాయి. ఫిలిం నోయర్ కాలంలో హత్యల  చుట్టూ వుండేవి.

          తెలుగుకి సేఫ్ బెట్  : హత్య, లేదా హత్యాయత్నం, లేదా కిడ్నాప్ చుట్టూ కథలు (కహానీ, కహానీ -2, పింక్, షైతాన్, జానీ గద్దార్, యాక్సిడెంట్ ఆన్ హిల్ రోడ్, 16- డి, సూదు కవ్వం, నగరం, కనుపాప మొదలైనవి). 

          2. నోయర్ మూవీస్ కుట్రకి పథకం పన్నడంతోనో, హత్యకేసు పరిశోధన చేపట్టడంతోనో ప్రారంభమవుతాయి. హింసాత్మక ఘటన ప్రారంభంలో ఒకసారి జరిగి, మళ్ళీ చివర్లో ముగింపులో వుంటుంది. హింస రెండు మూడు సంఘర్షిస్తున్న పాత్రల మధ్య వ్యక్తిగతంగానే  వుంటుంది. అదే యాక్షన్ మూవీస్ లోనైతే  అనేక హింసాత్మక ఘటనలు జరుగుతూనే  వుంటాయి. ఇవి సమాజాన్ని అట్టుడికిస్తూంటాయి. నోయర్ మూవీస్ లో సామాజిక మార్పులు పాత్రలకి ఎఫెక్ట్ అవుతూంటాయి. వేలకోట్లు సంపాదించిన పాత్రకి ఆ డబ్బు ప్రపంచీకరణ వల్లే వచ్చింది. దాంతో అతడి జీవన శైలి మారిపోయింది. పబ్ లో రాత్రంతా ఎంజాయ్ చేసి హై ఎండ్ కారులో దూసుకెళ్ళి  పిల్లర్ కో, పిల్లాడికో గుద్దాడు. ఆ నేరం లోంచి తప్పించుకోవడానికి ఎత్తుకు పై ఎత్తులేశాడు...

         తెలుగుకి సేఫ్ బెట్ :  కుట్రతో మొదలెట్టుకోవచ్చుగానీ, హత్యకేసు దర్యాప్తుతో మొదలెడితే అది ఫ్లాష్ బ్యాక్ కి దారి తీస్తుంది. హత్య ఎలా జరిగిందో ఫ్లాష్ బ్యాక్ లో అదంతా చెప్పుకు రావాల్సి వస్తుంది. అత్యధిక నోయర్ మూవీస్ ఇలాటి ఫ్లాష్ బ్యాక్సే. కాబట్టి జరిగిపోయిన హత్య కేసు దర్యాప్తుతో మొదలెట్టడం కంటే, హత్య జరిపించి మొదలెట్టడం మంచిది. లైవ్ గా వుంటుంది. ‘జానీ గద్దార్’ హత్యతో మొదలై దాని పుట్టుపూర్వోత్తరాల ఫ్లాష్ బ్యాక్ కి వెళ్తుంది. తమిళ డబ్బింగ్  ‘16-డి’ హత్యతో మొదలై, ఐదేళ్లు ముందు కెళ్తుంది కథ. అక్కడ్నించీ దర్యాప్తు మొదలవుతుంది. ‘జానీ గద్దార్’ ఫ్లాష్ బ్యాక్ కథ అయితే, ‘16- డి’  ఐదేళ్ళ తర్వాత రియల్ టైం స్టోరీ. ఇది లైవ్ గా వుంటుంది. ఇప్పుడు జరుగుతున్న కథ ఆసక్తిగా వుంటుంది ఎప్పుడైనా. 

          3. నోయర్ మూవీస్ లో అనుకోని ప్రమాదాలతో కథలు  మొదలవుతాయి. బిల్లీ వైల్డర్ తీసిన  ‘సన్ సెట్ బోలెవార్డ్’ (1950 ) లో పన్నెండో నిమిషంలో ప్లాట్ పాయింట్ వన్ వచ్చి కథ మొదలవుతుంది. అప్పుల వాళ్ళు కారు స్వాధీనం చేసుకోవాలని హీరోని వెంటాడు తూంటారు. కారు టైరు  పేలడంతో హీరో ఒక బంగాళా లోకి టర్న్ తీసుకుని తప్పించుకుంటాడు. ఆ బంగళా లోనే అతడి కథ మొదలవుతుంది.

          తెలుగుకి సేఫ్ బెట్ : యధాతథంగా తీసుకోవచ్చు. ‘పింక్’ లో హత్యాయత్నంగా మారిపోయే అనుకోని ఆత్మరక్షణా ప్రయత్నం, ‘షైతాన్’ లో అనుకోని కారు ప్రమాదం మొదలైనవి. 

          4. నోయర్ లో  సుఖాంతాలే వుండవు, దుఖాంతాలూ ఎదురవుతాయి. బాధితుడైన హీరో చనిపోయే కథలుంటాయి (సన్ సెట్ బోలెవార్డ్),  యాంటీ హీరోలు బతికి బాగుపడే కథలుంటాయి. హీరోని ట్రాప్ చేసే వాంప్ చనిపోయే ముగింపు (డబుల్ ఇండెమ్నిటీ) కూడా వుంటుంది. 

         తెలుగుకి సేఫ్ బెట్ :  హీరోకి సుఖాంతం. యాంటీ హీరోకి దుఃఖాంతం. యాంటీ హీరో రిస్కీ పాత్ర. ఒకర్ని  చంపి తను చనిపోతే బ్యాలెన్స్ అవుతుంది. లేదా ‘కహానీ -2 లోలాగా  ప్రత్యర్ధిని చంపిన హీరోయిన్ని పోలీసు అధికారి తప్పించేసినట్టు  సుఖాంతం చేయవచ్చు. కానీ ఒక హత్య చేసే యాంటీ హీరో తెలివితేటలతో చట్టాన్నుంచి తప్పించుకున్నట్టు ముగిస్తే రిస్కే. 

          5. నోయర్ లో యాంటీ హీరోయిన్ హీరోని ట్రాప్ చేసి తన ఎదుగుదలకి వాడుకుంటుంది (డబుల్ ఇండెమ్నిటీ). ఆమె ప్రేమిస్తోందనుకుని హీరో గాఢంగా ప్రేమించి మోసపోతాడు. కుట్ర బుద్ధితో చివరికామె అరెస్ట్ అవచ్చు, చనిపోవచ్చు.
          తెలుగుకి సేఫ్ బెట్ :  యధాతథంగా తీసుకోవచ్చు.

          6. నోయర్ సినిమాలు ఎక్కువగా వర్తులాకార కథనంతో వుంటాయి. అంటే ఒక సంఘటనతో మొదలై,  ఫ్లాష్ బ్యాక్ కి వెళ్లి,  మళ్ళీ ఆ సంఘటన దగ్గరికొచ్చి ముగియడం. 

          తెలుగుకి సేఫ్ బెట్ : మొత్తం కథ ఫ్లాష్ బ్యాక్ లో చెప్పడం పాత పద్ధతి. ప్రత్యక్షంగానే కథ చెబుతూ ఎక్కడైనా అవసరముంటే ఫ్లాష్ బ్యాక్ చూపించ వచ్చు. 

          7. చాలా నోయర్ మూవీస్ ఎక్కువగా స్వగతంతో ప్రారంభవుతాయి. కథనంలోనూ అక్కడకడా స్వగతం వస్తూంటుంది. స్వగతంతోనే ముగుస్తుంది.   
       
          తెలుగుకి సేఫ్ బెట్ :  స్వగతం అవసరంలేదు. హీరో తన గురించి తాను చెప్పుకుంటూంటే అబద్దాలు చెప్పడం లేదని ఎలా నమ్మాలి? అతడి స్వగతానికి విశ్వసనీయత ఏమిటి? కనుక ఈ ఆత్మకథ చెప్పుకోవడం, ఆత్మాశ్రయ ధోరణి ప్రదర్శించడం అవసరం లేదు. పైగా ఇది కథనాన్ని బరువెక్కిస్తుంది. సినిమా విజువల్ మీడియా, ఆడియో ప్రసారం కాదు. కనుక రచయిత / దర్శకుడు మాత్రమే హీరో కథ చెప్తే నమ్మదగినదిగా, తేలికగా వుండే అవకాశముంది. 

          8. నోయర్ మూవీస్ డైలాగులు పంచ్ లతో కవితాత్మకంగా వుంటూ, మరోవైపు కొత్త పదాల్ని కాయిన్ చేస్తూ రఫ్ అండ్ టఫ్ గానూ, హస్యాయుతంగానూ  వుంటాయి. ఉదాహరణకి : Ameche: Telephone, Barber: Talk, Bean-shooter: Gun,  Beezer: Nose,  Berries: Dollars,  Big house: Jail, Blip off: To kill, Cabbage: Money,  Chicago lightning: gunfire…ఇలా నోయర్ మూవీస్ సృష్టించిన  పదాలకి డిక్షనరీలే వున్నాయి. 

         
తెలుగుకి సేఫ్ బెట్ :  ఇతర సినిమాల్లో రొటీన్ గా వాడుతున్న తోపు, క్లారిటీ, మావా, బావా, జఫ్ఫా లాంటి మాటలు తెలుగు నోయర్ లో వాడేస్తే  శబ్దపరంగా జానర్ మర్యాద మంట గలిసి పోతుంది. సృష్టించ గలిగితే  ఫ్రెష్ పదాల్ని ఫన్నీగా కాయిన్ చేయాలి. డైలాగులు కవితాత్మకంగా వుండనవసరం లేదు, బావుండదు కూడా. అదే సమయంలో సినిమాటిగ్గానూ వుండకుండా రియలిస్టిక్ గా వుంటే మంచిది. డైలాగుల్ని పాలిష్ చేస్తూ ఎన్ని సార్లు తిరగరాస్తే అంత మంచిది. క్రిస్టఫర్ ‘మెమెంటో’  కి పదిహేడు సార్లు తిరగరాశారు. వారం రోజులో డైలాగ్ వెర్షన్ రాసి అవతల పడేసే వాళ్ళున్నారు. అదిక్కడ కుదరదు. ఈ జానర్ ని అర్ధం చేసుకున్న రచయిత / దర్శకుడు మాత్రమే కనీసం రెండు నెలల సమయం తీసుకుంటే గానీ డార్క్ మూవీ డైలాగ్ వెర్షన్ రాదు.

         
9. నోయర్ పాత్రల మానమర్యాదల గురించి  క్రిమినాలజిస్టు నికోల్ రాఫ్టర్ మాట ల్లో...నోయర్  సినిమాలు అధోగతి పాలైన ప్రపంచానికి అద్దం పడతాయి.ఇందులో ప్రతీ ఒక్కరికీ ఏదో పాపం అంటుకునే  వుంటుంది. అదేసమయంలో నిరాశా నిస్పృహలతో వుంటారు. నోయర్ సినిమాల్లో హీరో హీరోయిన్లు అనే మాటకి తావులేదు- ప్రతీ ఒక్కరూ తమ తమ దుర్బుద్ధులతో స్వార్ధంగా బతికెయ్యడానికి ప్రయత్నిస్తారు.
          ఇంకో విధంగా నోయర్ సినిమాల ఫిలాసఫీని ఈ కింది పంక్తుల్లో చూడొచ్చు :
         
          Birds abandon a tree whose fruits are gone,
                   swans abandon a pond that has dried up.
                   A woman abandons a man of no means,
                   counselors abandon a fallen leader.
                   Bees abandon a flower that’s lost its freshness,
                   deer abandon a forest that’s been burned.
                   Every one has an agenda;
                   who is appreciative, who is whose beloved?

(Translated from Sanskrit by Thomas Cleary)

          తెలుగుకి సేఫ్ బెట్ :  శాశ్వత సత్యమిది. సార్వజనీనమైనది.

***
        కథనంలో పైన సూచించిన సేఫ్ బెట్లు మార్చుకోవాలన్పిస్తే  మార్చుకోవచ్చు. జానర్ మర్యాదా, నేటివిటీ, టార్గెట్ ప్రేక్షకులూ అనుమతించిన మేరకు మార్చుకోవచ్చు. కథనం మీద ఎవరికైనా పూర్తి  క్రియేటివ్ స్వేచ్ఛ వుంటుంది.  అయితే డార్క్ మూవీస్ తో ఎలా పడితే అలా క్రియేటివ్ స్వేచ్ఛ  తీసుకోలేరు. వేరే డైలాగులెందుకు, రొటీన్ తోపు, క్లారిటీ...లాంటివి పెట్టేద్దామనుకుంటే అప్పుడు డార్క్ మూవీ శిల్పం, జానర్ మర్యాదా  చెడతాయి. ఫ్లాష్ బ్యాక్ తో మొదలెడితే ఏమౌతుంది - అనుకుంటే శిల్పం చెడకపోవచ్చు, కానీ టార్గెట్ ప్రేక్షకులకి రుచించదు. హీరో స్వగతంతోనే కథ నడిపిద్దామనుకుంటే  అదీ టార్గెట్ ప్రేక్షకులకి నచ్చక పోవచ్చు. 

          కథకి స్ట్రక్చర్ అనేది ఏ తరహా కమర్షియల్ సినిమాకైనా మారేది కాదని తెలిసిందే. స్ట్రక్చర్ వేరు, క్రియేటివిటీ వేరని చాలా సార్లు చెప్పుకున్నాం. స్ట్రక్చర్ కి నియమాలుంటాయి. క్రియేటివిటీకి వుండవు. ఎవరి అభిరుచుల్ని బట్టి వాళ్ళ క్రియేటివిటీని ప్రదర్శించుకుంటారు. అయితే కథలో మొదటి మలుపు అరగంటలోనే ఎందుకు రావాలి- చెప్పడానికి అరిస్టాటిల్ ఎవరు- సిడ్ ఫీల్డ్ ఎవరు- నా క్రియేటివిటీ నా ఇష్టమని తీసికెళ్ళి క్లయి మాక్స్ దగ్గర పెడితే, అది క్రియేటివ్ చమత్కృతి అవదు. మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అవుతుంది. ఎందుకంటే స్ట్రక్చర్ ని చెడ గొట్టారు కాబట్టి. అందుకే  స్ట్రక్చర్ వేరు, క్రియేటివిటీ వేరు. స్ట్రక్చర్ మీద క్రియేటివ్ ప్రతాపం చూపించలేరు. ఆ స్ట్రక్చర్ మీద కథ అల్లుకోవడం మీదే క్రియేటివ్ ప్రతిభా వ్యుత్పత్తులు దండిగా ప్రదర్శించు కోవచ్చు. ఫ్లాష్ బ్యాకులు పెట్టుకుంటారో, స్వగతాలు పెట్టుకుంటారో ఇంకేం  పెట్టుకుంటారో పెట్టుకోవచ్చు. అయితే డార్క్ మూవీస్ ఈ క్రియేటివ్ స్వేచ్ఛ కూడా ఇవ్వడం లేదు. అదీ పాయింటు!  క్రియేటివిటీ ని కూడా ఇలాగే వుండాలని కొన్ని నియమాలు పెట్టి శాసిస్తున్నాయి. ఇది అర్ధం జేసుకున్నప్పుడే డార్క్ మూవీస్  కథనాల్ని డార్క్ మూవీస్  కథనాలుగా చేసుకోగలరు.

-సికిందర్