రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

26, మే 2017, శుక్రవారం

రివ్యూ!




ర్శత్వం:  ల్యాణ్ కృష్ణ
తారాగణం : నాగచైతన్య, రకుల్ప్రీత్సింగ్, జగపతిబాబు, సంపత్, కౌసల్య, చలపతిరావు, అన్నపూర్ణ, పృథ్వీ, సప్తగిరి, వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ మురళి, రఘుబాబు, తాగుబోతు రమేష్ తదితరులు
కథ- మాటలు : కల్యాణ్ కృష్ణ,  స్క్రీన్ ప్లే:  త్యానంద్,  సంగీతం: దేవిశ్రీప్రసాద్, ఛాయాగ్రహణం: ఎస్‌.వి.విశ్వేశ్వర్
బ్యానర్ :  అన్నపూర్ణా స్టూడియోస్
నిర్మాత‌: నాగార్జున అక్కినేని
***
      నా
గార్జున ‘శివ’ తో నాగ చైతన్య  ‘జోష్’ చేసి, నాగార్జున ‘నిన్నే పెళ్ళాడతా’ తో  ‘రారండోయ్  వేడుక చూద్దాం’ చేశాడు.  దర్శకుడు కల్యాణ్ కృష్ణ కి కిటుకు తెలుసు- అక్కినేని నాగేశ్వరరావు ‘దసరా బుల్లోడు’ తో నాగార్జునకి ‘సోగ్గాడే చిన్ని నాయనా’ చేసి పెట్టిన  (ఒప్పించిన) కిటుకుతోనే మళ్ళీ నాగార్జునని ఆయనే నటించిన ‘నిన్నే పెళ్ళడతా’ ని చైతూకి  ఒప్పించుకుని ‘రారండోయ్ వేడుక  చూద్దాం’ చేశాడు. అక్కినేని ఫ్యామిలీ డాక్టర్- సారీ- డైరెక్టర్ కల్యాణ్ కృష్ణ  పనిలోపనిగా అఖిల్ కి కూడా  ‘ప్రేమనగర్’ తో చికిత్స చేస్తే అతడి సమస్య తీరిపోవచ్చని ప్రపంచం నమ్ముతోంది. ‘మనం’ తో మనం ఎక్కడికీ వెళ్ళనవసరం లేదనీ, మన  పాత సినిమాల్ని మనమే పునరుద్ధరించుకోవచ్చనీ ఒక  కొత్త బిజినెస్ మోడల్ ని కనుగొన్న అక్కినేని నాగార్జునకి  కల్యాణ్ కృష్ణ ఒక మోడీ లాంటి వాడు. 

          టైటిల్ చూడగానే ఇది  మరో  ‘హమ్  ఆప్కే హైన్ కౌన్’ ఫార్ములా ఫ్యామిలీ అని తెలిసిపోయే చైతూ కొత్త ప్రయత్నం నిజానికి తెలుగు వాళ్ళు ఎంత వెనకబడి వున్నారో తెలియజేస్తుంది. ఈ తరహా పాత ఫ్యామిలీలు దేశంలో ఎవరూ తీయడం లేదు- పక్కన తమిళులు కూడా. ఈ తరహా పాత ఫార్ములా ఫ్యామిలీలు దేశంలో ఎవరూ చూడ్డం లేదు, తెలుగు వాళ్ళు తప్ప. చూసిందే ఎన్ని సార్లయినా చూసే శక్తి సామర్ధ్యాలు, ఓపిక జన్యుపరంగా  తెలుగు వాళ్ళకే మెండుగా సాధ్యమయినట్టుంది.  ఇలా ఇంకో ముప్ఫయ్యో సారి ఈ వేడుక ఎలా వుందో ఒకసారి చూద్దాం... 

కథ 
      పాతికేళ్ళ క్రితం కృష్ణ (జగపతి బాబు), ఆది (సంపత్) లు స్నేహితులు. ఇష్టం లేని పెళ్లి తప్పించుకుంటూ ఆది చెల్లెలు వెళ్ళిపోయి కృష్ణ సహాయం కోరుతుంది. ఆమెని కృష్ణ లేపుకుపోయాడని  అపార్ధం చేసుకున్న సంపత్ శత్రుత్వం  పెంచుకుంటాడు. పాతికేళ్ళ తర్వాత ఇప్పుడు కృష్ణ కి కొడుకు శివ (నాగ చైతన్య), ఆది కి కూతురు భ్రమరాంబ (రకుల్ ప్రీత్ సింగ్) వుంటారు. ఇద్దరూ ఓ పెళ్లిలో  పరిచయమవుతారు. శివ ఆమె మీద ప్రేమ  పెంచుకుంటాడు. తర్వాత ఎంబీయే చదవడానికి ఆమె వైజాగ్ వస్తే, శివ ఇంకా సన్నిహితంగా తిరుగుతాడు. భ్రమరాంబ చాదస్తురాలు. పది మంది దేవుళ్ళని పూజించుకుంటూ,  ప్రపంచ జ్ఞానం లేని అమాయకురాలిలా వుంటుంది. ఓల్డ్ టైపులో లంగా వోణీ వేసుకు తిరుగుతుంది. ఎప్పుడెలా ప్రవర్తిస్తుందో తెలీదు. అబ్బాయిల్ని నమ్మకూడదని ఒకసారి తల్లి అన్న మాటల్ని పట్టుకుని, ప్రేమ కోసమైతే తన వెంట పడకూడదనీ, స్నేహం కోసమైతేనే రావాలనీ చెప్పేస్తుంది  శివకి. దీంతో ప్రేమ వెల్లడి చేయలేక స్నేహం చేస్తూంటాడు శివ. 

          ఈ స్నేహంలో ఇద్దరి  వైపూ ప్రేమ ఎలా బద్ధలయ్యిందనేది మిగతా కథ. ఈ ప్రేమకి అడ్డుగా వున్న తండ్రి గతం తాలూకు సమస్యని కూడా శివ ఎలా పరిష్కరించు కున్నాడనేది ఉపకథ. 

ఎలావుంది కథ 
       ఎలా వుందో పైన తెలిసిపోతూనే వుంది. తెలుగు సినిమాల్లో మారని కథ ఏదైనా వుంటే అది కుటుంబ కథే. ప్రపంచం 3017 లోకి వెళ్లిపోనీ- తెలుగు సినిమాల్లో చూపించే కుటుంబ కథలు తెలుగు కుటుంబాలింతే అన్నట్టుగా వుంటాయి. ఇలా ఎన్ని సార్లయినా  చూస్తారు తెలుగు ప్రేక్షకులు కూడా. 1990 లలో ‘హమ్ ఆప్కే హై కౌన్’ వచ్చి వుండక పోతే ‘నిన్నే పెళ్ళడతా’ వచ్చేది కాదు, ఇప్పుడు ‘రారండోయ్’ వచ్చేది కాదు. ఇంకా ఇలాటి వెన్నో వచ్చి వుండేవి కావు. ‘హమ్  ఆప్కే హై కౌన్’ వచ్చి వుండకపోతే-  మంచి కుటుంబాలు, పండంటి కాపురాలూ ఇవే వెల్లువెత్తేవేమో.

          కొత్త దర్శకులకి సమకాలీన కుటుంబ కథ చేసే ధైర్యం లేదు. కొత్త దర్శకులు పాత దర్శకుల ఛత్ర ఛాయలో భద్రత చూసుకునే అధైర్యవంతులు. కానీ ఇడ్లీ వేసేవాడు ధైర్యంగా క్యారట్ ఇడ్లీ, పాలకూర ఇడ్లీ వేసేస్తున్నాడు. జనం తింటున్నారు. క్యారట్ ఫ్యామిలీ స్టోరీ, పాలకూర ఫ్యామిలీ స్టోరీ అనేవి మన జీవిత కాలంలో చూడలేమేమో. పాతావకాయ ఫ్యామిలీలే వేస్తూంటారు. విసుగూ విరామం లేకుండా జనం ఇవే చూస్తూంటారు. ఇవే తీయకూడదనీ, ఇవే చూడ కూడదనీ చెప్పడం కాదు. ఈ  తీసే పాతావకాయ ఫ్యామిలీ లోనైనా  ఆవపిండి వుంటే మెంతు లుండవు, మెంతులుంటే ఆవపిండి వుండదు.ఇదైనా సరిదిద్దుకుని శ్రేష్ఠమైన పాతావకాయనే –కుటుంబ నియంత్రణ లేని  ‘హమ్ ఆప్కే హై కౌన్’ సంతానాన్నే కుప్పలు తెప్పలుగా  పది కాలాలు అందిస్తూ వుండమనే మనవి. 

ఎవరెలా చేశారు 
      ఇందులో నాగచైతన్యలోని నటుణ్ణి చూడాలంటే చివరి అరగంటే  చూడాలి. నటుడి వరకే, పోషించిన పాత్ర కాదు. పోషించిన పాత్ర పాసివ్ పాత్ర. తన పాత్ర తూకమంతా రకుల్ ప్రీత్ సింగ్ పాత్ర వైపే మొగ్గడంతో తను పాసివ్ అయిపోయాడు. ఫస్టాఫ్ అంతా ఆమెతో ఏకపక్ష ప్రేమతోనే సరిపెట్టాడు. ఈ రోజుల్లో ప్రేమని వెల్లడించడానికి ఇంకా పాత కాలపు పాట్లెవరూ పడరు, వెల్లడించాల్సి వచ్చినప్పుడు కూడా  వెనుకడుగు వెయ్యరు. నాగ చైతన్య గనుక ఇంటర్వెల్లో హెచ్చరించిన రకుల్ కి లవ్ చెప్పేసి వుంటే ఆమె ఏం పీక్కునేదో పీక్కునేది. అది చూపించడం ఆసక్తికర కథ య్యేది. పాత్ర ఇలావుండాలి గానీ, వెనక్కి తగ్గి పాసివ్ సుడి గుండంలో పడితే ఎవరికి ప్రయోజనం- తనకా? ఆమెకా? కథకా? ప్రేక్షకులకా? 

           హీరో అనేవాడు సంఘటన సృష్టిస్తాడు, సంచలనం పుట్టిస్తాడు. ప్రేమని  వెల్లడిస్తే ఆమె దూరమవుతుందనే ‘నువ్వే కావాలి’ నాటి మూగ ప్రేమ –రోమాంటిక్ డ్రామా ఇప్పుడెందుకూ? పాయింట్లు నవీకరణ చెందవా? ఇన్నోవేషన్ వుండదా? ఈ రోజుల్లో రోమాంటిక్ కామెడీ వుండాలి, రోమాంటిక్ డ్రామాలు కాదు.  నాని రోమాంటిక్ డ్రామా ‘మజ్నూ’  ఏమయింది. వీణ సినిమాలు కాదు, గిటార్ సినిమాలు కావాలిప్పుడు.

          ‘నేను లవ్ చెప్తే నాకు దూరమవుతావా? లవ్వే చెప్తాను- ఏదీ ఏం పీక్కుంటావో పీక్కో’ అనెయ్యాలి  తన ప్రేమ మీద తనకి నమ్మకమున్న ఏ లవరైనా. ఆమె పీక్కునేదేం వుండదని తనకి తెలుసు. నాగచైతన్య ఇలా చేసి వుంటే ఇది డైలాగులతో నడిచే నసగా కాక, యాక్షన్ లో పడే  బెటర్ కథ య్యేది-
What is character but the determination of the incident? And what is incident  but the illumination of the character ? – అన్నాడు హెన్రీ జేమ్స్ అని ఎన్నో సార్లు చెప్పుకున్నాం. ఇలా నాగచైతన్య ది కలర్ ఫుల్ క్యారక్టర్ అయ్యేది. విషాద పాత్ర ఈ రోజుల్లో యూత్ కి అవసరమా? 

          తండ్రి పాత్ర జగపతిబాబుతో నాగచైతన్య బాండింగ్ నీటుగా వుంది. చివరికి తండ్రి సమస్యని నీటుగా సాల్వ్ చేయడం కూడా బావుంది. ఇక పెళ్లింట్లో, బయటా హీరోయిన్ తో కామెడీ గుర్తుండి పోయే సీన్లయితే కావు. ‘హలోబ్రదర్’ లో రమ్యకృష్ణతో నాగార్జున సిట్యుయేష నల్ కామెడీ ఇంకా ఎందుకు పాపులరో ఆలోచించాలి. ఇక ఒక్క క్యాచీ సాంగ్ లేకపోవడం వల్ల కావచ్చు, పాటల్లో ఎక్కడా మెరిసిందీ లేదు. కొన్ని పాటలైతే అసంపూర్ణం గా వున్నాయి. క్లయి మాక్స్ ఫైట్, డ్రామా అంతా ఓకే. 

          ఈ సినిమా రకుల్ ప్రీత్ సింగ్ ది అన్పించేలా వుంటుంది. ఆమె పాత్ర కథే ఈ సినిమా. ఆమె మనస్తత్వంతోనే సంఘర్షణ. ఇలాటి పాత చాదస్తపు, చంచల స్వభావపు పాత్రలో,  తన హైటుతో శ్రీదేవిని తలపించేలా వుండడం ఒక బాక్సాఫీసు అప్పీలు అనుకోవాలి. ఎవరి మాటలో విని చప్పున నిర్ణయాలు తీసుకోవడం, ఇంకెవరి మాటలో విని చప్పున ఆ నిర్ణయాలు మార్చుకోవడం కలర్ఫుల్  యాక్టివ్ క్యారక్టర్ లా తయారు చేశాయి. తను ఒక సబ్ కాన్షస్ వరల్డ్ లా ఒక అర్ధంకాని పదార్ధమైతే, తన ప్రత్యర్ధి అయిన హీరో దీన్ని మధించే కాన్షస్ ఇగో కావాల్సింది- దర్శకుడి దురవగాహన వల్ల కాలేక పాసివ్ గా వుండిపోయాడు. ఇది సినిమా బేసిక్స్ కే విరుద్ధం.  కానీ తెలుగు సినిమాలు కమర్షియల్ సినిమాల ముసుగేసుకున్న ఆర్ట్ సినిమాలని ఎప్పుడో గమనించాం కదా? 

          జగపతి బాబు, సంపత్ ఇద్దరూ ఓకే. ఓకే కానిది కమెడియన్లందరూ. ఎందరో కమెడియన్లు, అందరూ క్రియేటివిటీకి  కింకరులు. వెన్నెల కిషోర్, అతడి భార్యల పాత్రలైతే మరీ అన్యాయం. వీళ్ళిద్దరి పెళ్ళయాక  భార్య వెళ్ళలేక పేరంట్స్ ని పట్టుకుని ఏడుస్తూ వుంటుంది. నాగ చైతన్య కల్పించుకుని ఉదాత్తమైన డైలాగులు చెప్పి ఆమెని సాగనంపుతాడు. అలాటి భార్య కాపురాని కెళ్ళి మొగుడితో (వెన్నెల కిషోర్) తో గయ్యాళిలా వుంటుంది. మొగుడితో  పనులు చేయించుకోవడం, వినకపోతే గిన్నెలూ చెంచాలతో మాడు పగుల గొడుతూ వుండడం – పాత సినిమాల్లోలాగా- ఎప్పుడు చూసినా ఇదే. నాగచైతన్య వున్నప్పుడు కూడా ఇదే. ఇది చాలా బ్యాడ్ గా వుంటుంది. పేరంట్స్ ని వదల్లేక ఏడ్చిన పెళ్లి కూతురెక్కడా, అంతలో గయ్యాళి పెళ్లామెక్కడా? ఈ రెండిటి మధ్య నాగచైతన్య  ఉదాత్త డైలాగుల విలువెక్కడా? అక్కడ రకుల్ ప్రీత్ సింగ్ విని ఇంప్రెస్ అవాలని మాత్రమే ఉదాత్త డైలాగులు పెట్టినట్టుంది- తర్వాత ఆ పెళ్లి కూతురి క్యారక్టరైజేషన్ గంగలో కలిసిపోయినా పట్టించుకోలేదు.
          దేవీశ్రీ ప్రసాద్ సంగీతం మాత్రం చెప్పుకోదగ్గది కాదు.
ఎస్‌.వి.విశ్వేశ్వర్ కెమెరా అంతంతమాత్రమే. 

చివరికేమిటి 
       దర్శకుడు కల్యాణ్ కృష్ణ ఈ రెండో సినిమాని మాత్రం ‘సోగ్గాడే చిన్ని నాయనా’ స్థాయిలో ఇవ్వలేదు. కథలో కొత్తదనం లేదు. పాత కథని కూడా ఆసక్తికరంగా చెప్పలేకపోయాడు పాత్రచిత్రణల లోపాలవల్ల. ఫస్టాఫ్ లో విషయం  లేదు, సెకండాఫ్ సీరియస్. ఫస్టాఫ్ ముప్పావు గంటవరకూ వెన్నెల కిషోర్ పెళ్లి తంతే. ఈ తంతులో వంతుల వారీగా కమెడియన్లు రావడం, హీరోయిన్ వెంట  హీరో పడడం ఇవే జరుగుతాయి. ముప్పావు గంట సేపు పాటలు సహా, వినోదం అనుకుంటున్న కామెడీ సహా, ప్రేమ అనుకుంటున్న హీరో ప్రయత్నాలు సహా పెళ్లి తంతుతో కాలక్షేపం చేస్తూ, తీరా పెళ్లి పీటల మీద చూపించిన పెళ్లి కూతుర్ని చూసేసరికి ఉస్సూరంటుంది ప్రాణం!  ఇదెంత మాత్రం బాక్సాఫీసు అప్పీల్ కాదు. 

          ఇదయ్యాక హీరోయిన్ ఎంబీఏ చదివే నెపంతో వైజాగ్ వచ్చాక అకస్మాత్తుగా డల్ అయిపోతుంది సినిమా. ఇంటర్వెల్ తర్వాత కథ లేక సెకండాఫ్ డల్  అయితే ఎలా వుంటుందో అలాటి వెలితి  ఇప్పుడొచ్చేస్తుంది. ఇక్కడ్నించీ ఇంటర్వెల్ వరకూ మరో అరగంట సేపూ కూడా హీరో హీరోయిన్ల మధ్య కథ పుట్టదు. కేవలం ఇంటర్వెల్ సీన్లో సడెన్ గా హీరోయిన్ అల్టిమేటం ఇవ్వడంతో హీరో వెనక్కి తగ్గడంతో కథ మొదలయ్యిందనుకుంటాం కానీ కాదు. ఈ ఇంటర్వెల్ సీను  అత్యంత నీరసమే. కథ మొదలెట్టకపోతే ఇంతే. 

          భయంకొద్దీ హీరో ప్రేమని దాచుకున్నాక, ఫ్రెండ్ షిప్ చేస్తూ హీరోయిన్ అన్ని పనులకీ వాడుకుంటుంది. ఒక్కసారి కూడా తానుగా వెళ్లి హీరో కలవడు, ఫోన్ కూడా చెయ్యడు. ప్రతీసారీ ఆమె ఫోన్ చేస్తేనే  వెళ్లి కలుస్తాడు. ఇలా వుంది పాసివ్ పాత్ర. హీరోకి గోల్ లేదు. ప్రేమ చెప్పకూడదని కథతో కటాఫ్ అయిపోయాడు. ఇలా ఇంకో అరగంటలో ముగింపు కొస్తుందనగా హీరో ఓపెన్ అయిపోయి అప్పుడు ఫైర్ అవుతాడు. అప్పుడు తెలుస్తుందామెకి ప్రేమిస్తున్నాడని. తనూ ఫయిర్ అవుతుంది. బ్రేకప్ అయిపోతుంది. ఇలా ఇంటర్వెల్ దగ్గర రావాల్సిన  ఈ సీను ఇంకెప్పుడో మిడిల్ కూడా దాటి పోయి ఎండ్ విభాగంలో వచ్చిందంటే ఇది మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే కాక  మరేమిటి?  హీరో హీరోయిన్ల మధ్య కథ పుట్టడానికి రెండు గంటల సేపూ ప్రేక్షకులు వేచి వుండాలా? 

          ‘రారండోయ్ వేడుక చూద్దాం’ టైటిల్ ఫ్యామిలీ కథలా అన్పించవచ్చు. కానీ ఇది చివర్లో తప్ప ఏ ఫ్యామిలీ ప్రమేయమూ లేని ఒక ప్రేమ కథ మాత్రమే. మరి వేడుక ఎక్కడ జరిగిందంటే, ఫస్టాఫ్ లో  ముప్పావు గంట సేపూ  వెన్నెల కిషోర్ పెళ్లి తంతే వేడుక! దీనికే రారండోయ్ అన్నారు. చివరికి చూపించిన పెళ్లి కూతురు కూడా అలా వుంది మరి. 

          కానీ ఇవన్నీ పట్టించుకోవద్దు. ఇదేదో రాశామని మానెయ్యకూడదు. తెలుగు ఫ్యామిలీ సినిమాల స్టాండర్డ్ ఇంతే నని  ప్రతీ సారీ వెళ్లి ఎలా చూస్తున్నారో దీన్నీ అలా చూడమనే అంటున్నాం. తెలుగోళ్ళ  ఫ్యామిలీ సినిమాకి ఇంకోసారి చెయ్యెత్తి జైకొట్ట మంటున్నాం.


-సికిందర్ 
http://www.cinemabazaar.in/






  




20, మే 2017, శనివారం

రివ్యూ + పేపరు పెన్నులు



దర్శకత్వం :  రాంగోపాల్ వర్మ
తారాగణం : అమితాబ్ బచ్చన్, అమిత్ సాద్, యామీ గౌతం, మనోజ్ బాజ్ పాయ్, జాకీ ష్రాఫ్, భజరంగ్ బలి  సింగ్, రోణిత్ రాయ్ తదితరులు
కథ : నీలేష్ గిర్కార్, రచన : పి. జయకుమార్, మాటలు : రాం కుమార్ సింగ్, సంగీతం : రవిశంకర్, రోహన్ వినాయక్, ఛాయాగ్రహణం : అమోల్ రాథోడ్
బ్యానర్స్ : అలంబ్రా ఎంటర్ టైన్మెంట్, వేవ్ సినిమాస్, కంపెనీ ప్రొడక్ట్, ఎబి కార్ప్ లిమిటెడ్
నిర్మాతలు :  రాహుల్ మిత్రా, ఆనంద్ పండిట్, గోపాల్ శివరాం దాల్వీ, కృషన్ చౌదరి
విడుదల : మే 12, 2017

***
          మితాబ్ బచ్చన్ తో ‘సర్కార్’ స్రవంతిలో  మూడవదైన ‘సర్కార్ -3’ లో రాం గోపాల్ వర్మ లోని  మేకర్ కంటే టెక్నీషియనే ఎక్కువ ప్రకాశిస్తాడు.   గత మూవీ ‘కిల్లింగ్ వీరప్పన్’  తో  మేకర్ గానూ టెక్నీషియన్ గానూ బాలీవుడ్ లో  తిరిగి ప్రతిష్ట పెంచుకున్న వర్మ, ఈ తాజా సర్కార్ తో  ఆ ప్రతిష్టకి సరితూగడం కష్టమైపోయింది. సర్కార్ సినిమాలంటే అమితాబ్ బచ్చన్ గాడ్ ఫాదర్ తరహా పాత్రకి బాల్ థాక్రే  స్ట్రోక్ తో  గ్లామరైజ్ చేసి తీస్తున్న పొలిటికల్ థ్రిల్లర్సే కాబట్టి- వీటిలో టాప్ యువ గ్లామర్ తారలు కూడా లేకపోతే నేటి జనరేషన్ కి మన వ్యవహారం కాదన్నట్టే వుండిపోతాయి. ఎప్పుడో రెండు తరాల కిందటి హాలీవుడ్ క్లాసిక్ ‘గాడ్ ఫాదర్’ తో  నేటి జనరేషన్ కి  ఎలాటి సంబంధ బాంధవ్యాలూ వుండేందు కవకాశం లేదు భావోద్వేగాలు రెచ్చ గొట్టుకుని చూడ్డానికి. ఒకటవ సర్కార్ లో (2005) అభిషేక్ బచ్చన్ - కత్రినా కైఫ్, రెండవ సర్కార్ లో  (2008) అభిషేక్ బచ్చన్ - ఐశ్వర్యారాయ్ లలాంటి టాప్ యువ స్టార్ హీరోహీరోయిన్ల ఆకర్షణ లుండబట్టి వాటిని చూసి హిట్  చేశారు. 

         
ప్పుడు తొమ్మిదేళ్ళ తర్వాత,  మూడవ సర్కార్ కొచ్చేసరికి - అమితాబ్ తప్ప మరే టాప్ యువ స్టార్ హీరో హీరోయిన్ల గ్లామరూ  లేని సాదా వ్యవహారమైపోవడంతో,  దేశవ్యాప్తంగా ఓపెనింగ్స్ కే ఎసరొచ్చింది. అమిత్ సాద్- యామీ గౌతంలు టాప్ యువ స్టార్ లైతే కాదు. పెద్దగా తెలీని నటులు. కనుక టాప్ యువ స్టార్ హీరో హీరోయిన్లు మిస్సయితే ఏ సర్కారూ గాడ్ ఫాదర్ ఫార్ములాతో  వర్కౌట్ కాదని తేలుతోంది. 1930-50 ల నాటి ఫిలిం నోయర్ అనే డార్క్ మూవీ జానర్,  1960 లకల్లా కొత్త రూపాన్ని సంతరించుకుని ఇప్పటివరకూ నియో నోయర్ గా వర్ధిల్లుతోంది. గాడ్ ఫాదర్  ప్రేమికుడైన వర్మ,  ఇంకా ఆ నాటి గాడ్ ఫాదర్  టెక్నిక్ నే  నేటి గ్లోబల్ తరానికి అందిస్తున్నారు తప్ప, నవీకరించి ప్రధాన స్రవంతిలో కలపలేక పోతున్నారు. 

          ఈ మూడో సర్కార్  అన్నివిధాలా మార్కెట్ యాస్పెక్ట్ కి దూరంగా వుండిపోయింది. మేకింగ్ పరంగా ఈ కథ రాసినతను, కథనం చేసినతను, మాటలు రాసినతనూ ముగ్గురూ కూడబలుక్కుని అవుట్ డేటెడ్ రచయితలుగా బాగా ఎస్టాబ్లిష్ అయ్యారు. వీళ్ళతో వర్మ జత కలిశారు. అసలు ఈ సినిమాకి కథ చేశారా, గాథ  చేశారా; పొలిటికల్ థ్రిల్లర్ చేశారా, ఎండ్ సస్పెన్స్ చేశారా; ఆర్ట్ సినిమా తీశారా, కమర్షియల్ సినిమా తీశారా వంటి  బేసిక్స్  కూడా సరిచూసుకున్నట్టు కన్పించదు. 2010 లో ప్రకాష్ ఝా తీసిన రాజకీయ డ్రామా ‘రాజనీతి’ కీ దీనికీ తేడా లేదు. ‘రాజనీతి’ ఏ కారణాలతో అట్టర్ ఫ్లాప్ అయిందో అవే  మూడో సర్కార్ లో  జొరబడకుండా చూసుకోలేదు. సినిమాలు ఫ్లాపవడానికి ఎక్కువగా పేపర్ పెన్నులే కారణమవుతాయి. ఇది ఒప్పుకోకుండా  తప్పించుకుంటే, చాపకింద కన్నీరులా ఆ పేపర్ పెన్నులే  ఇంకా ఫ్లాపులు కొడుతూ పోతూంటాయి. 

          మూడో సర్కార్ కి  గత రెండు  సర్కార్ లతో సంబంధం లేదు, ఇది సపరేట్ కథ. రెండో సర్కార్ కథ  ఐశ్వర్యా రాయ్ పాత్ర సర్కార్ గా పగ్గాలందుకోవడంతో ముగుస్తుంది. ఇప్పుడు మూడో సర్కార్ లో దీని కొనసాగింపు గానీ, ఐశ్వర్యారాయ్ పాత్రగానీ కనపడవు. ఒకటవ, రెండవ సర్కార్లలోని శంకర్ (అభిషేక్ బచ్చన్), విష్ణు (కేకే మీనన్)  ల గురించి మూడో సర్కార్ లో  పాత్రలు  మాట్లాడుకుంటాయి గానీ, రెండో సర్కార్ లో పగ్గాలందు కున్న అనిత ( ఐశ్వర్యారాయ్) ఏమయ్యిందో  మాట్లాడుకోకపోవడం విచిత్రం. ఇంట్లో మనిషి కన్పించకపోతే వెతకరా?

         మనవడు శివాజీగా అమిత్ సాద్ ఎంటరవుతాడు. బహుశా ఇతనొస్తే అనిత (ఐశ్వర్యారాయ్) పనిబడతాడని తప్పించేశారు.  మళ్ళీ ఇక్కడ కథ రెండో సర్కార్  ఎత్తుగడతోనే వుంటుంది. దీంతో ఈ మేరకు మూడో  సర్కార్ లో  నావెల్టీ లేదు. గాంధీ (భజరంగ్ బలి సింగ్) అనే కార్పొరేట్ శక్తి, 1400 కోట్ల ప్రాజెక్టుతో ధారవీ ఏరియా బస్తీలమీద కన్నేసి సుభాష్ నాగ్రే (అమితాబ్) సహకారం కోరడం పాత విషయమే.  సుభాష్ నాగ్రే మహారాష్ట్రలో ఏ ప్రభుత్వమున్నా తన చెప్పు చేతల్లో వుంచుకునే రాజ్యాంగేతర శక్తి. అతడి మాటకి ఎదురు లేదు, చేతకి  చెదలు లేదు. అతడి అనుమతి తీసుకోందే పూచికపుల్ల కూడా కదలదు. పేద ప్రజలకి దేవుడులా వుంటాడు. ఆ పేద ప్రజలకి ఎసరు పెట్టే ప్రతిపాదనతో గాంధీ రావడంతో తిప్పికొడతాడు. దీంతో మొదలవుతాయి కుట్రలు. 

          గోవింద్ దేశ్ పాండే (మనోజ్ బాజ్ పాయ్) అనే నాయకుడు తన రాజకీయ ఎదుగుదలకోసం సుభాష్ ని నిర్మూలించాలనుకుంటూంటాడు.  అతడి తల్లి రుక్కుబాయీ దేవి (రోహిణీ హటంగడి) కి ఇదే కోరిక బలంగా వుంటుంది. దుబాయ్ లో వుంటూ  ఆపరేట్ చేసే  ప్లేబాయ్ మల్టీ మిలియనీర్ మైకేల్ వాల్యా ( మాల్యా? - జాకీష్రాఫ్)  ధారవీ ప్రాజెక్టుని మూవ్ చేస్తున్న అసలు శక్తి. ఇతను గోవింద్ ని కలుపుకుని సుభాష్ ని చంపే పథకం వేస్తాడు.

          ఈ పరిస్థితుల్లో సుభాష్ మనవడు శివాజీ విదేశం నుంచి వస్తాడు. సుభాష్ కి విష్ణు (కేకే మీనన్), శంకర్ (అభిషేక్ బచ్చన్) అనే ఇద్దరు కొడుకులు వుండేవాళ్ళు. అన్న విష్ణుని తమ్ముడు శంకర్ చంపేశాడు. ఆ విష్ణు కొడుకే ఇప్పుడు వచ్చిన సుభాష్ మనవడు శివాజీ. 

          ఇతడి రాక సుభాష్ అనుచరుడైన గోకుల్ (రోణిత్ రాయ్) కి నచ్చదు.  సుభాష్ వారసత్వాన్ని తను అందిపుచ్చుకోవాలనుకుంటున్నాడు. దీంతో తన కడ్డుగా వున్న శివాజీ మీద ద్వేషంతో వుంటాడు. శివాజీకి అన్నూ  (యామీ గౌతమ్) అనే గర్ల్ ఫ్రెండ్ వుంటుంది. ఈమె తండ్రిని గతంలో సుభాష్ చంపించాడని సుభాష్ మీద పగదీర్చుకోవాలని చూస్తూంటుంది. శివాజీకి ఆవేశం ఎక్కువ. గణేష్ ఉత్సవాల్లో తాత సుభాష్ మీద గోవింద్ హత్యాయత్నం చేస్తే అతణ్ణి చంపి పారేస్తాడు. దీంతో సుభాష్ శివాజీని బహిష్కరిస్తాడు. తాత మీద కోపంతో వెళ్లి శత్రువులతో కలిసిపోతాడు శివాజీ.
***
      ఈ కుటుంబ డ్రామా అంతా మరో బాహుబలిలా భారీగా వుంటుంది. గందరగోళంగానూ వుంటుంది. ఒకదశ కొచ్చేటప్పటికి ఎవరు ఎవరి వైపున్నారు, ఎవరు ఎవరి మీద కుట్ర చేస్తున్నారనే తికమక ఏర్పడిపోతుంది. కథ పేరుతో బోలెడంత  ఇన్ఫర్మేషన్ ఏ రూపంలో (16- డి, వెంకటాపురం) ఇచ్చినా కొంత సేపటి తర్వాత తల బొప్పికట్టి ఫాలో కావడం మానేస్తాం. వర్మ ‘కంపెనీ’ అనే మాఫియా తీశారు. అందులో అపార్ధమనే ఎలిమెంటుతో యాక్షన్ సీన్స్ పరుగులుపెడుతూంటాయి. కథ యాక్షన్ ఓరియెం టెడ్ గా వుంటుంది. కానీ ఈ మూడో సర్కార్ లో విశ్వాసమనే ఎలిమెంటుతో డైలాగులతో కథ  నడుస్తూ ఎక్కడేసిన గొంగళిలా వుంటూ సహన పరీక్ష పెడుతుంది!

          ప్రకాష్ ఝా ‘రాజనీతి’ తీసినప్పుడు మహాభారతంలో నేటి రాజకీయాల్ని చూపించానని చెప్పుకున్నారు. అది కూడా మనం ఫాలో కాలేని బోలెడు మహాభారత్ మోడల్ పాత్రలతో డైలాగుల మీద డైలాగులు మోగించుకుంటూ వుంటాయే తప్ప- అమీ తుమీ తేల్చుకోవాలని యాక్షన్ లోకి దిగవు.  వర్మ కూడా తన రోల్ మోడల్ గాడ్ ఫాదర్ ని మహాభారతం చేసి పాత తరం డైలాగులతో సరిపెట్టారు.  

          ఉదాహరణకి-
         
విలువల్ని పట్టుకు వేళ్ళాడే వాడికి స్నేహితులు తగ్గిపోయి శత్రువులు పెరిగిపోతారు
         
అత్యాశ, భయమూ  ద్రోహిగా మార్చేస్తాయి’
         
ప్రతీ మంచికీ నిర్ణీత మూల్యం  వుంటుంది. అది డబ్బు కావచ్చు, జ్ఞానం కావచ్చు, బాధ కావచ్చు’
         
మంచి పని అన్పిస్తే నేను చేస్తాను. అది దేవుడికి వ్యతిరేకమైనా, సమాజానికి వ్యతిరేకమైనా; పోలీసులూ చట్టం, మొత్తం  వ్యవస్థకే వ్యతిరేకమైనా సరే!’
         
మనుషుల్ని కలిపితేనే శక్తి, విడదీస్తే కాదు’
         
ఆట వాళ్ళు  మొదలెట్టారు, నేను ముగిస్తాను
         
నేను సర్కార్ మనవణ్ణని మర్చిపోకు!’
         
నేను సింహాలకి సింహాన్ని!’’
         
ఎలుకలన్నీ ఒక్కటైనా పులిని కాదుకదా పిల్లిని కూడా ఏం చేయలేవ్!
          పులి తోలు కప్పుకున్న కుక్క కుక్కే!’’
         
కుక్కలన్నీ ఒక్కటైతే సింహాన్ని చంపగలవ్!

          అప్పట్లో ధర్మేంద్ర-  నీచ్- కమీనే –కుత్తే – మై తేరా ఖూన్ పీజావూంగా!- అనే కుక్కల్ని తిట్టే డైలాగులే పేల్చేవాడు. దీంతో భరించలేక కుక్కలన్నీ బయల్దేరి వచ్చి  వెండి తెరని   చించేశాయంటూ రాజూ శ్రీవాస్తవ్ కామెడీ షో చేశాడు!  ఇలా వర్మ జంతుజాలాన్ని కూడా దూరం చేసుకున్నారు డైలాగులతో. కుక్కలు ఎలుకలు పిల్లులు పులులు సింహాలతో జూ చూపిస్తున్నట్టు చేశారు. ఇతర డైలాగులతో  నస పెట్టారు –

          ‘ప్రతీ మంచికీ నిర్ణీత మూల్యం  వుంటుంది. అది డబ్బు కావచ్చు, జ్ఞానం కావచ్చు, బాధ కావచ్చు....’  ఈ ఉపోద్ఘాతమంతా ఎందుకు? ‘ప్రజల బాధకి మూల్యం చెల్లించుకో!’ అనేసి ఒక్క ముక్కలో ఆర్డరేస్తే  సర్కార్ పాత్రకి తగ్గట్టుగా బలంగా  వుంటుందిగా? 

          ‘మంచి పని అన్పిస్తే నేను చేస్తాను. అది దేవుడికి వ్యతిరేకమైనా, సమాజానికి వ్యతిరేకమైనా; పోలీసులూ చట్టం, మొత్తం  వ్యవస్థకే వ్యతిరేకమైనా సరే!’  - ఈ నసపెట్టే సొంత డబ్బా ఎందుకు- ‘మంచి పని అన్పిస్తే నేను చేస్తాను’  అనే నీతి డైలాగు ఎందుకు?  తనలాంటి  ఓట్లతో గెలవని రాజ్యాంగేతర శక్తి చేసేది మంచో చెడో ప్రపంచం నిర్ణయిస్తుంది. మంచే  చేస్తున్నానని ఎలా చెప్పుకుంటాడు? ఇదంతా లేకుండా- దేవుడు, సమాజం, పోలీసులూ చట్టం, వ్యవస్థా- ఈ గొప్ప మాటల జోలికి పోకుండా -  ఒక్క ముక్కలో -‘మిన్ను విరిగి మీద పడ్డా చేసేది చేసేస్తా!’ – అని అంటే అతడి అధార్టీ బాగా ఎస్టాబ్లిష్ అవుతుందిగా? అధార్టీ ని చూపించి, జడ్జి మెంటుని ప్రేక్షకులకి వదిలెయ్యాలి గానీ -  సంజాయిషీ లిచ్చుకోవడ మెందుకు - బలహీన పాత్ర అవడానికి కాకపోతే? పెదరాయుడు, బొబ్బిలి బ్రహ్మన్న పాత్రలు అధార్టీ చూపిస్తాయి, సంజాయిషీ లిచ్చుకోవు.

          ‘విలువల్ని  పట్టుకు వేళ్ళాడే వాడికి స్నేహితులు తగ్గిపోయి శత్రువులు పెరిగిపోతారు’ -  ఇదింకో  మైకేల్ వాల్యా నీతి డైలాగు. ఈ విలన్ చిట్ట చివర్లో సర్కార్ తో  ముఖాముఖీ అయి- దీన్ని ఓపెనింగ్ డైలాగుగా చెప్తాడు ఈ మాత్రం జ్ఞానం సర్కార్ కి లే నట్టు. ఈ డైలాగుతో సర్కార్ మారిపోతాడన్నట్టు అజ్ఞానాన్ని వెల్లడించుకుంటాడు. బలహీన విలన్ అయిపోతాడు. ‘ఇంకెన్నాళ్ళు నీ విలువల రాజకీయాలు చేస్తావ్?’ అని సవాలు విసిరేట్టుగా వచ్చి మాటాడితే, కనీసం ఈ క్లయిమాక్స్ దృశ్యంలోనైనా యాక్షన్ ఓరియెంటెడ్ గా సీను ఓపెన్ అయి,  థ్రిల్ చేసేది. తను బలమైన విలన్ అన్పించుకునే వాడు. 

          ‘విలువల్ని  పట్టుకు వేళ్ళాడే వాడికి స్నేహితులు తగ్గిపోయి శత్రువులు పెరిగిపోతారు’ -  సర్కార్ తను నమ్మిన విలువలకోసం అందరికీ దూరమయ్యాడని కథాక్రమంలో తెలుస్తూనే వుంది. తెలిసిన విషయాన్నే  ప్రేక్షకులకి కామెంటరీ చెప్పడమెందుకు? ప్రేక్షకులు ఫీలవుతున్న సబ్ టెక్స్ట్ ని చెడగొట్టడమెందుకు? ఏ డైలాగుకి ప్రేక్షకుల మూడ్ ఏమౌతుందోనన్న వివేచన వుండాలిగా? 

          ఇలాటిదే ఇంకోటి- ‘అత్యాశ, భయమూ  ద్రోహిగా మార్చేస్తాయి’- అని సర్కార్ డైలాగు. శివాజీ రాకతో అనుచరుడు అభద్రతకి లోనవుతున్నాడనీ, వారసత్వం కోసం ఏదో చేస్తాడనీ, దేనికో పాల్పడతాడనీ, పాల్పడ్డాడనీ కూడా కథాక్రమంలో ప్రేక్షకులు క్యారక్టరైజేషన్ ని  గమనించారు. మళ్ళీ దీన్నిప్రేక్షకులకి  కామెంటరీ చెప్పడ మెందుకు? ప్రేక్షకులకి ట్యూషన్లు చెప్పడం, స్పూన్ ఫీడింగ్ చేయడం ఇదే జరిగింది ఎక్కువగా.  కనపడుతున్న విషయాన్ని చెప్పడం, చెప్పాలనుకున్న విషయాన్ని కనపడకుండా చేయడం ఇదే జరిగింది. 

          పాత్రల తత్త్వాల్ని విడమర్చి చెప్పనవసరం లేని డైలాగులు ఓ పక్కనుంటే, కొన్ని సామాజిక స్పృహతో కూడిన  డైలాగులు బావున్నాయి. అయితే ఇవి రెండు మూడే కన్పిస్తాయి-  

          ‘మీరు గాంధీ విగ్రహాన్ని పూజిస్తున్నప్పుడు  గూండాల్ని పూజించడం మానె య్యండి’ - మనోజ్ బాజ్ పాయ్.
          ‘ఒక చేతిలో మాల, ఇంకో చేతిలో భాలా (ఈటె)’ -  
మనోజ్ బాజ్ పాయ్.
          ‘స్వ పక్షానికి ద్రోహం చేసి వచ్చిన వాడితో నేను చేతులు కలపను’ – సీఎం.
          రెండో సర్కార్ లో మరపురాని  అభిషేక్ బచ్చన్ డైలాగు వుంటుంది- ‘జనాలకి డెవలప్ మెంట్ అక్కర్లేదు, ఎంటర్ టైన్మెంట్ కావాలి’ అని. 

         
రెండో సర్కార్ తర్వాత తొమ్మిదేళ్ళలో ఈ మూడో సర్కార్ కి వార్ధక్యం వచ్చేసింది. ఇది దిలీప్ కుమార్ సినిమా అయినట్టూ- ప్రాణ్ విలన్ గా వున్నట్టూ-  రాహీ మాసూం రజా వచ్చేసి డైలాగులు లిఖిస్తున్నట్టూ- పాత మోడల్ డైలాగులన్నీ తెచ్చి,   ఉమర్ ఖయ్యాం మధుపానశాలకి  పాలరాతి మెట్లకి మల్లే పేర్చారు.
***
     మనవడు శివాజీ మొదటి సర్కార్ లో  పుట్టాడు. ఇప్పుడు పెరిగి మూడో సర్కార్ లోకి  వచ్చాడంటే, ఇప్పటికి కనీసం పాతికేళ్ళ కథాకాలం గడిచినట్టు. ఈ పాతికేళ్ళూ సుభాష్ నాగ్రే  ఏమీ మారలేదు. ఒకటవ, రెండవ సర్కార్ లలో ఎలా వున్నాడో, ఇప్పుడు పాతికేళ్ళ కాలాన్ని సూచిస్తున్న మూడవ సర్కార్ లోనూ అలాగే వున్నాడు. ఇదంతా ఎందుకంటే గాడ్ ఫాదర్, ఆ తర్వాత వచ్చిన దాని రెండు సీక్వెల్స్ లో  కథాకాల విస్తృతిని దృష్టిలో పెట్టుకునే కథ, పాత్రలు వుంటాయి. ఆషామాషీగా తీసి ఆస్కార్లు క్లెయిమ్  చేయలేదు.  

          మార్పుకి పాతికేళ్ళ కాలావధిని తీసుకోకపోయినా, రెండో సర్కార్ తర్వాత ఇప్పటికి ఈ తొమ్మిదేళ్ళుగా చూసుకున్నా సుభాష్ నాగ్రే  ఏమీ మారలేదు. అప్పుడెలా వున్నాడో ఇప్పుడూ అలాగే వున్నాడు. పాత్ర ఇక ఏం ఆసక్తి కల్గిస్తుంది? ఈ రీత్యా కూడా బాక్సాఫీసు అప్పీల్ ని కోల్పోయింది కథ. అవే నల్ల వస్త్రాలతో, అదే చీకటి బంగళాలో, అలాగే కూర్చుని,  అదే చాయ్ తాగుతూ వుంటాడు.  అదే పాత రాజకీయం చేస్తూంటాడు. మారిపోయిన రాజకీయ సామాజికార్ధిక పరిస్థితులు అతడి చుట్టూ కన్పించవు. కాలం కూడా తనలాగే స్థంభించినట్టు వుంటుంది. ఈ మారని నేపధ్య సృష్టితో  కూడా బాక్సాఫీసు అప్పీల్ కి దూరమైపోయింది కథ. ఈ పరిస్థితుల్ని సమకాలీనం చేసివుంటే తేజోవంతంగా వుండేది కథ. ఒకటవ రెండవ మూడవ సర్కార్ లన్నిటినీ – పాతికేళ్ళూ ఒకే కాంగ్రెస్ కాలపు కథల్లా చూపించడం మింగుడుపడని వ్యవహారం. తొమ్మిదేళ్ళ క్రితం చనిపోయిన చిన్న కొడుకు శంకర్ ఫోటో పెట్టుకుని, అక్కడున్న మొక్కకి నీళ్ళు పోస్తూ వుంటాడు. అది బొన్సాయి మొక్క. చిన్న కొడుకు చంపిన పెద్ద కొడుకు ఫోటో వుండదు. 

          ఈ పరిస్థితుల్లో పిలవని పేరంటంలా చనిపోయిన పెద్ద కొడుకు కొడుకు (శివాజీ) రావడం,  బాధ్యతలు చేపడతానడం కూడా అర్ధం కాదు. తన తండ్రిని చంపిన కుటుంబంలోకి తనెందుకు రావాలి?  ఎందుకు ఉద్ధరించాలి? తన తండ్రిని చంపిన బాబాయ్ ఫోటో పెట్టుకుని తాత వుంటే ఎందుకని ప్రశ్నించడు తన తండ్రికి ఇస్తున్న విలువ గురించి? అసలిలా వచ్చి కలిసిన మనవణ్ణి  తాత  సర్కార్ ఎందుకు అనుమానించడు? 

          సర్కార్ మీద పగ పెంచుకున్న అమ్మాయిని మనవడు ప్రేమిస్తూంటాడు. అంటే ఆమె పగకి ఆమోద ముద్ర వేసినట్టేనా? ఆమె సర్కార్ ని చంపితే ఓకేనా? మరి స్వయం ప్రకటిత సర్కార్ వారసుడిగా తను వచ్చాడే? ఒకసారి సర్కార్ అడుగుతాడు- ‘నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి తండ్రిని నేను చంపించాను, అయినా నీకు సరేనా’ – అని. అభ్యంతరం లేదంటాడు మనవడు శివాజీ. అభ్యంతరం ఇతడి కెందుకుంటుంది? వుంటే ఆ అమ్మాయికుండాలి. వీడు తాతని చంపనిస్తాడో లేదోనని ఇతణ్ణి  దూరంపెట్టాలి, ప్రేమించకూడదు. 

          అయితే సర్కార్ మనవణ్ణి అలా అడగడం పూర్తిగా మిస్ లీడింగ్ సీను.  ఎందుకంటే, హీరోయిన్ తన తండ్రిని చంపించింది సర్కార్ కాదని తెలుసుకుని చంపిన అసలు వాణ్ణి చంపేస్తుంది చివర్లో. అలాంటప్పుడు –‘నువ్వు ప్రేమిస్తున్న అమ్మాయి తండ్రిని నేను చంపించాను’ అని సర్కార్ ఎలా అంటాడు? ఏమిటిదంతా మనకి అర్ధంగాదు. ఫాల్స్ డ్రామాతో సస్పన్స్ క్రియేట్ చేసే ప్రయత్నం చేశారని మాత్రం అర్ధమౌతుంది. 

          ఇక జాకీ ష్రాఫ్ విలన్ లా కాక జోకర్ లా వుంటాడు. ఎంతసేపూ దుబాయిలో బికినీ బేబీని పట్టుకుని స్విమ్మింగ్ పూల్స్  దగ్గర తచ్చాడుతూ ఫోన్ కాల్స్ మాట్లాడ్డమే. ఇదంతా కామెడీగా వుంటుంది తప్ప సీరియస్ నెస్ వుండదు. జయప్రకాష్ రెడ్డిని బ్యాంకాక్ లో వూహించుకుంటే ఎలా వుంటుందో అలాగే వుంటుంది. అలాగే మొదట్లో ప్రపోజల్ తో సర్కార్ దగ్గరికి గాంధీ అనే ఇంకో విలన్ వచ్చి శృంగభంగమయ్యాక - లవ్ యూ- అని సర్కార్ కి చెప్పేసి వెళ్ళిపోతాడు. అంత చనువుగా, చులకనగా మాట్లాడినందుకు సర్కార్ అంతటి వాడు ఏమీ అనుకోడు- అదే సమయంలో ఇలా కామెడీగా అనేసి వెళ్ళిపోయిన  గాంధీ కమిట్ మెంట్ ఉత్తదే అన్పించేలా వుంటుంది.  

          హీరోయిన్ యామీ గౌతం కూడా పగదీర్చుకోవాలంటుంది గానీ, ఆ పనే మొదలెట్టదు. అదిరిపోయే మేకప్ వేసుకుని ముంబాయిని  సిడ్నీలా వూహించు కుంటున్నట్టు టూరిస్టులా తిరుగుతూంటుంది. గాంధీకి లాగే ఈమె కమిట్ మెంట్ ఎంతటిదో తెలిసిపోతూంటుంది. 


          ఇక సర్కార్ ని చంపాలనుకునే నయా నేత  మనోజ్ బాజ్ పాయ్ ఆ ప్రయత్నం విఫలమైతే పారిపోయి తలదాచుకోడు. తలకాయ హీరోకి అప్పజెప్పి హరీ మంటాడు. ‘నా కొడుకుని సర్కార్ అన్యాయం గా చంపే శాడయ్యో!’ అని అతడి తల్లి గగ్గోలు పెడుతుంది. అంతకి ముందు - ‘సర్కార్ ని యెయ్యాలి, యేసెయ్యాలి!’  అని కొడుకుని రెచ్చగొట్టి  మరీ సర్కార్ మీదికి పంపింది తనే. ఆ కొడుకు ఛస్తే సర్కార్ అన్యాయంగా చంపేశాడట!   
***
     అసలు ఈ సినిమాకి కథ చేశారా, గాథ చేశారా అనేది పెద్ద సందేహం.  కథ చేసివుంటే ప్లాట్ పాయింట్స్ కన్పించాలి. మొదటి ప్లాట్ పాయింట్లో సంఘర్షణ పుట్టి మిడిల్ లో పడాలి కథ. మిడిల్లో పడి మరింత సంఘర్షణాత్మకం అవాలి కథ. రెండో ప్లాట్ పాయింట్లో ఆ సంఘర్షణకి సమాధానం దొరికి ఎండ్ లో పడాలి కథ. చాలా సింపుల్.

          ఈ స్ట్రక్చర్  కన్పించదు. కథా  ప్రారంభంలోనే  ప్రపోజల్ తో గాంధీ రావడం, దాన్ని సర్కార్ కాదనడం జరిగి సంఘర్షణ పుట్టేస్తుంది. అంటే ఇది ప్లాట్ పాయింట్ వన్ అనుకోవాలి. అయితే ఈ పుట్టిన సంఘర్షణ జాడ వుండదు. ప్రాజెక్ట్ కోసం గాంధీ, విలన్  వాల్యాతో కలిసి ఏదో  చేయబోవడం, దాన్ని సర్కార్ అడ్డుకోవడం లాంటి యాక్షన్ రియాక్షన్ల ఇంటర్ ప్లే వుండదు. మాటలే వుంటాయి. పైగా వివిధ పాత్రల పరిచయాలే అవుతూంటాయి. డైలాగులతోనే సీన్లు మొదలవుతాయి, డైలాగులతోనే ముగుస్తాయి, మళ్ళీ డైలాగులతోనే మొదలవుతాయి. అరగంటయ్యేసరికి హీరో ప్రవేశిస్తాడు. ఇతడితో కూడా కథలో మార్పు రాదు. కూర్చుని మాట్లాడుకునే అవే డైలాగులు. గంటా పది నిమిషాలు గడుస్తున్నా ఏమీ జరగదు. ఇలా చెయ్యాలి, అలా చెయ్యాలీ అని పాత్రలు అనుకోవడమే గానీ ఏమీ చెయ్యవు. పగతో వున్న హీరోయిన్ కూడా ఏమీ చెయ్యదు. దుబాయ్ లో విలన్ అయితే ఎప్పుడు చూసినా ఎంజాయ్ చేస్తూంటాడు.  ప్రపోజల్ గాంధీ అయిపు వుండడు. నయా నేత గోవింద్ ఉపన్యాసాలతో గడిపేస్తూంటాడు. అన్నీ వదరుబోతు పాత్రలే, ఏవీ పనిమంతులు కావు. 

          అప్పుడు ఇంటర్వెల్ వచ్చి ఒక యాక్షన్ సీను జరుగుతుంది- గోవింద్ సర్కార్ మీద హత్యాయత్నం చేస్తాడు. మళ్ళీ సెకండాఫ్  షరా మామూలే. ఇదంతా చూస్తూంటే స్ట్రక్చర్ వుండని గాథలా వుంటుంది. కమర్షియల్ సినిమాకి పనికి రాని ప్రక్రియ గాథ. కమర్షియల్ సినిమాలకి కథలే వుండాలని గతంలో ఎన్నో సార్లు చెప్పుకున్నాం. కథంటే ఆర్గ్యుమెంట్. హీరోకీ విలన్ కీ మధ్య వాళ్ళ వాళ్ళ వాదాలు చెలరేగుతాయి. ఎవరికి  వాళ్ళు తమ వాదాన్ని గెలిపించుకోవడానికి పోరాటం మొదలెడతారు. చివరికి ఎవరి వాదం కరెక్టో జడ్జిమెంట్ ఇస్తుంది కథ. 

          గాథ ఇలాకాదు. ఇది స్టేట్ మెంట్ మాత్రంగా వుంటుంది. నేనిలా చేస్తే, నాకిలా జరిగి, ఇలా ముగిసిందీ  నా కథా అని స్టేట్ మెంట్ మాత్రమే ఇచ్చుకునేదిగా వుంటుంది.
కథ ఆర్గ్యుమెంట్ ని ప్రతిపాదిస్తుంది. గాథ స్టేట్ మెంట్ నిస్తుంది. అనిల్ కుమార్ రోడ్డు మీద పోతూంటే యాక్సిడెంట్ జరిగింది. హాస్పిటల్లో చేరాడు. కాలు ఫ్రాక్చరైందని తేల్చారు. తిరిగి నడవాలంటే కొన్ని నెలలు పడుతుందని చెప్పారు. కొన్ని నెలల తర్వాత తిరిగి ఎప్పటిలా నడవసాగాడు. ఇది గాథ. ఇది ఇలా  స్టేట్ మెంట్ మాత్రంగా వుండిపోతుంది. ఇలాగే వుంటుంది మూడో సర్కార్ కథనం.

         
అనిల్ కుమార్ రోడ్డుమీద పోతూంటే యాక్సిడెంట్ జరిగింది. హాస్పిటల్లో చేరాడు. వాహనదారుడి మీద కేసు పెట్టాల్సిందే నని  పట్టుబట్టాడు. కోర్టులో కేసు వేశారు. అనిల్ కుమార్ కేసు పోరాడి గెలిచాడు. వాహనదారుడిదే తప్పని తేలింది. అనిల్ కుమార్ కి నష్ట పరిహారం లభించింది. ఇది కథ . ఇది  ఆర్గ్యుమెంట్ ని ప్రతిపాదిస్తోంది. ఇలావుండదు మూడో సర్కార్ కథనం. 

          పైన చెప్పుకున్న
స్టేట్ మెంట్ మాత్రంగా వుండిపోయిన  గాథ ఎంత  చప్పగా వుందో, ఆర్గ్యుమెంట్ ని ప్రతిపాదిస్తున్న కథ అంత  ఆసక్తి కరంగా వుందని తేలుతోంది. ఇందుకే సినిమాలకి పనికొచ్చేది కథలే గానీ, గాథలు కాదు. ఇంకోటి గమనిస్తే- గాథకి స్ట్రక్చర్  వుండదు, కథకి వుంటుంది. సినిమాకి స్ట్రక్చరే ముఖ్యం.  గాథలో బిగినింగ్ మాత్రమే వుండి, సాగి సాగి  బిగినింగ్ తోనే ముగుస్తుంది. మూడో సర్కార్ ఇలాగే వుంటుంది. అందుకని సినిమాకి పనికి రాదు. కథ కి బిగినింగ్ తో బాటు మిడిల్, ఎండ్ కూడా వుండి  సంతృప్తికరంగా ముగుస్తుంది. గాథకి ప్లాట్ పాయింట్స్ వుండవు- మూడో సర్కార్ కీ లేవు. కథకి వుంటాయి. గాథకి క్యారక్టర్ ఆర్క్ వుండదు, ఎలా వున్న పాత్ర అలా నిస్తేజంగా పడి వుంటుంది. మూడో సర్కార్ ఇంతే. కథకి క్యారక్టర్ ఆర్క్ తో పాత్ర ఉద్విగ్నభరితంగా వుంటుంది. గాథకి టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ వుండదు, కథనం నేలబారుగా సాగుతూ వుంటుంది. దీన్ని మూడో సర్కార్ లో గమనించవచ్చు. కథకి టైం అండ్ టెన్షన్ గ్రాఫ్ వుంటుంది, కథనం ఉత్థాన పతనాలతో కట్టి పడేస్తుంది. గాథలో ఇవి వుండవు- మూడో సర్కారే ఉదాహరణ.

         
గాథలో సంఘర్షణ వుండదు- మూడో సర్కార్ లోనూ లేదు. సంఘర్షణ లేనిది కథ వుండదు. గాథకి ప్రతినాయక పాత్ర వుండదు- మూడో సర్కార్లో వున్నా లేనట్టే వున్నారు. కథకి ప్రతినాయక పాత్ర కీలకం. గాథలు ఆర్ట్ సినిమాలకి బావుంటాయి- ఆర్ట్ సినిమా లాంటిదే  మూడో సర్కార్ గాథ.  కథలు కమర్షియల్ సినిమాలకి బావుంటాయి.  గాథతో జరిగే మోసమేమిటంటే, అది గాథ  అని చాలాసేపటి వరకూ తెలీదు. ఇంకా ప్లాట్ పాయింట్ వన్ వస్తుందనే ఎదురు చూస్తూంటాం. ఎంతకీ రాదు, విశ్రాంతి వచ్చేస్తుంది. అది కూడా ప్లాట్ పాయింట్ వన్ కాదని తేలడంతో అప్పుడు తెలుస్తుంది మోసం. మోసపోయామే అని లేచిపోవడమో లేకఏం చేస్తాం ఖర్మ అనుకుని మిగతాదంతా చూడడమో చేస్తాం. సర్కార్ తోనూ ఇదే అనుభవం. కాకపోతే ప్రారంభంలో చూపించింది ప్లాట్ పాయింట్ వన్ అని మోసపోయాం. 

         
చేస్తున్నది కథలనుకుని  గాథలు రాసుకుంటూ తీసినవన్నీ అట్టర్ ఫ్లాపయ్యాయి- కృష్ణ వంశీ ‘మొగుడు’, ‘పైసా’; శర్వానంద్ ‘రాజాధిరాజా’, మహేష్ బాబు ‘బ్రహ్మోత్సవం’, సునీల్ ‘జక్కన్న’  సుధీర్ ‘కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ’, విజయ్ దేవరకొండ ‘ద్వారక’ ...చెప్పుకుంటూపోతే చాలా  వున్నాయి.
                                                                        
***


     సెకండాఫ్ లో సర్కార్ మీద హత్యాయత్నం చేసిన గోవింద్ ని హీరో చంపి ఇంట్లోంచి బహిష్కృ తుడవడం ముఖ్య ఘట్టం. ఇది కథయ్యుంటే ఇంటర్వెల్ లోనే ఈ ఘట్టం వస్తుంది. స్ట్రక్చర్ చెదిరిపోయి సెకండాఫ్ లో వచ్చిందంటే ఇది కథ కాదు, గాథ. ఇలా బహిష్కృ తుడైన హీరో వెంటనే ఒక మాఫియా దగ్గరి కెళ్ళి పోయి – ‘తాతతో నాకు పడలేదు, మనం మనం ఒకటీ’  అంటాడు. ఓకే అని చేతులు  కలుపుతాడు మాఫియావెంటనే గాంధీ దగ్గరికి వెళ్ళిపోయి ఇదే మాట చెప్తాడు. గాంధీ కూడా ఓకే అనేస్తాడు. తాత వెళ్ళగొడితే ఇంత చిల్లరగా వాళ్ళ పంచన చేరుతున్నాడే హీరో అన్పించేలా వుంటాయి దృశ్యాలు. ఇలా వచ్చిన వాణ్ణి శత్రువు లెందుకు నమ్ముతారో అర్ధం గాదు.

          హీరో స్వతంత్రంగా అడ్డా తెరచి కూర్చుంటే ఒక అర్ధం వుంటుంది. వీడేంటి ఇలా వచ్చాడని 
శత్రువులే మంచీ చెడులు నిర్ధారించుకుని ఎలాగూ  వచ్చి చేతులు కలుపుతారు. ఇది ఎత్తుగడ, చేసింది మాత్రం అందరి పాత్ర చిత్రణల్నీ దెబ్బతీయడం. మళ్ళీ మాట్లాడుకుంటూనే వుంటారు. మాటలతోనే సీన్లు నడుస్తూంటాయి. అప్పుడు సర్కార్ అనుచరుణ్ణి నువ్వే సర్కార్ అవుతావని విలన్ లొంగ దీసుకుంటాడు. సర్కార్ కి నమ్మక ద్రోహం చేసిన అనుచరుడు హతమవుతాడు. తను కోరుకుంటున్న వారసత్వానికి హీరో తనకి అడ్డు తొలగిపోయాక, ఈ  అనుచరుడికి ఈ విశ్వాసఘాత మెందుకు, చావడమెందుకు?  

 ఇలా పరస్పర విరుద్ధంగా సాగుతూంటాయి సీన్లు. చివరికి తేలేదేమంటే – హీరోని సర్కార్ వెళ్ళగొట్టడం అంతా ఒక నాటకమట. ఇలా నాటక మాడితే ఎవరెవరు శత్రువు లున్నారో బయటపడి  హీరోకి దగ్గరవుతారనీ, అప్పుడు ఒక్కొక్కర్నీ చంపి శత్రువుల్లే కుండా చేసుకోవచ్చనీ తాతా మనవళ్ళ పథకమట. 

          ఈ సంగతి దాచి పెడుతూ  సీన్లు నడిపి చివర్లో ఓపెన్ చేయడంతో-  కమర్షియల్ సినిమాలకి పనికిరాని ఎండ్ సస్పెన్స్ ప్రక్రియ అయ్యిందన్న మాట. గాథ అనుకుంటే ఆ గాథకి  ఎండ్ సస్పన్స్ కూడా తగిలించారు. దీంతో ప్రధాన పాత్ర అయిన సర్కార్ లక్ష్యం ఏమిటో మనకి అస్సలు తెలీక, ఏ పాయింటుతో ఈ గాథకి సీన్లు నడుస్తున్నాయో అస్సలు అర్ధంగాక- మన ఇన్వాల్వ్ మెంట్ కి దూరంగా – స్పష్టం కాని వాటి వాటి ప్రపంచాల్లో పాత్రలు బతికేస్తూంటే, డైలాగులు వల్లిస్తూంటే చూస్తూ తెగ బోరు ఫీలవుతాం. 

          ఎవరెవరు శత్రువులో సర్కార్ కి తెలిసే వున్నారు, మనకి కూడా చూపించేశారు. సర్కార్ కి తెలియకుండా వుండి పోయిన శత్రువు అనుచరుడొక్కడే.  ఈ ఒక్కడి కోసమే ఇంత డ్రామా నడిపినట్టయింది. మొదట్లో ఏదో అనుకుని మొదలు పెట్టిన గాథ  కూడా ఇంకేదోగా తేలింది.
***
సినిమా విజువల్ మీడియా అని తెలిసిందే. పాత్రలు చర్యలకి పాల్పడితేనే విజువల్ మీడియా అవుతుంది. కూర్చుని బాతా ఖానీ వేసుకుంటే విజువల్ మీడియా అవదు, స్టేజి నాటకమవుతుంది. ఈ గాథని కూడా సీన్లకి సీన్లు డైలాగులతోనే నడిపినప్పుడు సినిమా తీయనవసరం లేదు- ఆడియో రూపొందించి రిలీజ్ చేస్తే మొత్తం అర్ధమైపోతుంది  రేడియో నాటికలా. మహా అయితే కోటి రూపాయలతో పనైపోతుంది. ఆడియో స్క్రిప్టుని 35 కోట్లు పెట్టి సినిమా తీస్తే 34 కోట్లూ బొక్క. సినిమా కథని కంటారు, వినరు. సినిమాకి కనే కథే  కావాలి, వినే కథ కాదు. పేపరు పెన్నులు పడరాని చేతుల్లో పడితే  చాలా ప్రమాదం. ముగ్గురు పండితులు, ఆరు చేతులు, అరవై తప్పులు! 

  జీవితంలో మొదటిసారిగా రాం గోపాల్ వర్మ ప్రయోగాత్మకంగా ఆడియో స్క్రిప్టుని సినిమాగా తీశారు. కనే కథగాని వినే కథ, రామన్న గాథ!

-సికిందర్