రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

13, ఏప్రిల్ 2017, గురువారం

      క్రైం జానర్ మీద వ్యాసాలు  ఎవరి కోసం రాయాలన్న సందేహం వచ్చిందన్నాం  ప్రారంభ వ్యాసంలోనే. క్రైం జానర్ గురించి తెలియని పరిస్థితుల్లో పుట్టి పెరిగిన వాళ్ళకి దాని గురించి ఏం చెప్పినా సంస్కృతం చెప్తున్నట్టో, అరబ్బీ భాష మాటాడుతున్నట్టో వింతగా వుండొచ్చు. 2000 నుంచీ ఇప్పటిదాకా తెలుగులో ఇంకా ప్రేమ సినిమాల గొడవే  నడుస్తోంది, అవి ఆడినా ఆడకపోయినా. వీటితో బాటు యాక్షన్, హార్రర్ కామెడీలూ వున్నాయి. దాదాపు గత రెండు దశాబ్దాలుగా వీటిని మాత్రమే చూస్తూ పెరిగిన తరానికి, సినిమా తీయడానికి వస్తే, తమకి సినిమా జ్ఞానం కల్పించిన  అవే రోమాంటిక్ కామెడీలు, అవే హార్రర్ కామెడీలే  తప్పనిసరవుతున్నాయి.  ప్రతీ కొత్త దర్శకుడూ విసుగు లేకుండా వీటినే తీస్తూ కాలక్షేపం చేస్తున్నాడు. తమకి తెలిసిన జానర్స్ ఈ రెండే అయ్యాయి. వీటితో బాటు యాక్షన్ సినిమాలు కూడా చూస్తూ పెరిగినప్పటికీ,  ఆ చూసిన యాక్షన్ సినిమాలు క్రైం సినిమాలు కావు. యాక్షన్ కీ, క్రైం కీ చాలా తేడా వుంది. ఇలాంటప్పుడు ఈ డార్క్ (క్రైం) మూవీస్ ప్రపంచం గురించి కొత్తగా వ్యాసాలు  ఏమర్ధమవుతాయి?

          ‘కౌన్ కిత్నే పానీమే’ (ఎవరెంత మునిగారు) అనే ఒక ఛోటా హిందీ సెటైరికల్ సినిమాలో ఓపెనింగ్ డైలాగు వుంటుంది... ‘కాలం వినాశకారి. ఆదిమ కాలంలో  డైనోసారస్ లని అంతం  చేసింది, తర్వాత ఆధునిక ప్రజాస్వామ్య కాలంలో రాజుల్నీ రాజ్యాల్నీ అంతం చేసింది’ ... అని. ఇంతటి శక్తి వున్న కాలానికి  తెలుగు ‘రోమ్- కామ్’ (రోమాంటిక్ కామెడీలు) జనరేషన్ దర్శకులు వచ్చేసి  చచ్చినా లొంగడం లేదు. రోమాంటిక్ కామెడీలతో ఎవరెంత మునిగారో, ఇంకా మునుగుతున్నారో తెలిసినా, వారం వారం ఇంకా  తెలుస్తూనే వున్నా-  కాలాన్నే  ఓడించడానికి  కంకణం కట్టుకున్నారు. కొత్త కొత్త మొహాలతో నల్గురైదుగురు  ప్రేక్షకులే దొరకని అవే   ‘రోమ –కామ’ వికారాలకి పోతున్నారు. ఒకవేళ మునక్కూడదని వాళ్ళ తో బాటు వాళ్ళ నిర్మాతలకీ ఇంకేదైనా  చేద్దామని అన్పించినా – పట్టుకోవడానికి ఈ గడ్డిపోచ తప్ప ఇంకోటి కన్పించడం లేదు. చూసి చూసి ఇలా కాదని కాలమే ఒక పడవ పంపించింది పక్క రాష్ట్రాల నుంచి. అందులోకి ఈ నయా మేకర్స్ కాకుండా,  ప్రేక్షకులే ఎక్కేశారు. ఇక నవ్వుల నదిలో పువ్వుల పడవా  – పాటేసుకుని హైలెస్సా తెడ్డేసుకుంటూ సాగిపోతున్నారు జల్సాగా. 

           అయినా నయా  మేకర్స్ కి దీనర్ధమేమిటా అని బోధపడ్డం లేదు. అదృష్టానికో దురదృష్టానికో ఈ వ్యాసకర్తతో కనెక్ట్ అయి వున్న కొందరు నయా మేకర్స్ కి-  పడవా వచ్చిందే పిల్లా పండగ వచ్చిందే – పాటతో టీజ్ చేసినా స్పందనలే కరువవుతున్నాయి. ఇలాంటప్పుడు ఈ వ్యాసాలు  ఎవరికోసం? కాలం ఇంకేం చెయ్యాలి? కాలం  అంతం చేసిన రాక్షస బల్లులకంటే దళసరి చర్మాల  రోమ – కామ వికారాల ఆటలోంచి బయట పడెయ్యడమెలా? ఇక్కడో ఆదిత్యా నాథ్ పుట్టాలా? 

          ఈ సంవత్సరం మార్చి వరకూ మూడు నెలల్లో పక్క రాష్ట్రాల నుంచి కనుపాప, 16 -డి, నగరం, మెట్రో అనే నాల్గు తెలుగు ప్రేక్షకులకి తెలియని కొత్త పడవ లొచ్చాయి. కొత్త మొహాలతో వచ్చి పడుతున్న తెలుగు ప్రేమ సినిమాల వైపు చూడ్డం పూర్తిగా మానేసిన ప్రేక్షకులు,  ఈ డార్క్ మూవీస్  డబ్బింగుల్లో తెలియని  కొత్త వాళ్లున్నా విరగబడి చూశారు. సందీప్ కిషన్- రెజీనాలు లాంటి పాపులర్ స్టార్స్ నటించిన ‘నగరం’ లో పాటలూ కామెడీలూ   లేకపోయినా,  పదిరూపాయల టికెట్ ప్రేక్షకుడు కూడా సంతృప్తి కరంగా చూశాడు. ప్రేక్షకుల్లో ఈ మార్పుకి కారణ మేమిటి? ఈ డార్క్ మూవీస్ మిగతా జానర్స్ లా కాకుండా వాస్తవికతకి, నిజ జీవితాలకి దగ్గరగా వుంటాయి. నేల మీద నడుస్తాయి. ఇప్పుడు నేల మీద నడిచే చిన్న సినిమాలు కావాలి తెలుగు ప్రేక్షకులకి. ప్రేక్షకులు ఏ సినిమాని ఎలా చూడాలో అర్ధం జేసుకుంటున్నారు. నయా మేకర్లకే వాస్తవాలు తెలీక లేనిపోని భయాలతో అవే అవాస్తవిక రోమకామాలు తీసుకుంటున్నారు. ఇలా ఈ డబ్బింగుల సాక్ష్యంగా  కాలం ఇంత క్లియర్ గా పరిస్థితి చెప్తూంటే ఎవరైనా ఆగి ఆలోచించాల్సిందే. 

          డార్క్ మూవీస్ కి తెలుగులో నిర్మాతలు దొరుకుతారా అన్న ప్రశ్న కూడా రావొచ్చు నిజమే.  ఇంకో సినిమాకే కన్పించని కొత్త కొత్త మొహాలతో  అవే రొటీన్ ప్రేమ సినిమాలు తీస్తూ చేతులు కాల్చుకుంటున్న నిర్మాతలు కూడా పరిస్థితి గ్రహించి  సహకరిచాల్సి వుంటుంది. అలా తమిళ డబ్బింగు లైతే చూస్తారు గానీ, అవే తెలుగులో తీస్తే చూడరన్న ఒక అభిప్రాయం ఎప్పట్నించో వుంది. దృశ్యం, ధృవ లాంటి తమిళ సినిమాల్ని తెలుగులో రీమేక్ చేస్తే ఆడాయి. డబ్బుకోసం వ్యాపారం చేసే నిర్మాతల లెవరికైనా ప్రేమ సినిమాలకి  మార్కెట్ ఎలా మూసుకుపోయిందో, డార్క్ డబ్బింగుల ట్రెండ్ తో తిరిగి ఎలా వికసిస్తోందో మార్కెట్ స్పృహతో వివరిస్తే వాళ్ళే పునరాలోచనలో పడతారు. తమిళం లో 16- డి తీసిన 22 ఏళ్ల కొత్త దర్శకుడికి హీరోగా రెహమాన్ తప్ప నిర్మాతలే దొరకలేదు. తనే డబ్బు పోగేసుకుని తీసేసి  సక్సెస్ ని ఎంజాయ్ చేస్తున్నాడిప్పుడు. ఇలాంటివి కూడా నిర్మాతలకి ఇన్స్ పిరేషన్ అవుతాయి, కావాలి కూడా.   

       సమస్యల్లా డార్క్ మూవీస్ తీసే విషయ పరిజ్ఞానం గురించే. డార్క్ మూవీస్ గురించిన విషయ పరిజ్ఞానం లేకపోతే  ధృవ లాంటిది తీసేసి ఇది కూడా నేర పరిశోధనే కదా అనొచ్చు. యాక్షన్ మూవీస్ లో వుండేది  అచ్చమైన నేర పరిశోధన కాదు, అచ్చోసి వదిలిన నేర పరిశోధన. యాక్షన్ మూవీస్  ఏ లాజిక్ నీ పట్టించుకోవు, వాస్తవికతా  వుండదు. కానీ క్రైం –డార్క్ మూవీస్ కి ఈ రెండూ ప్రాణం. ‘రోమ్ – కామ్’ ట్రెండ్ నయా మేకర్లు ధృవ లాంటి యాక్షన్ మూవీస్ సులభంగా తీసి పడెయ్యొచ్చు. ఎందుకంటే తాము ఇలాటి యాక్షన్ మూవీస్ కూడా చూస్తూనే కదా పెరిగారు. కాబట్టి వీటి వరకూ విషయ పరిజ్ఞానం వుంటుంది. కానీ క్రైం జానర్ లో తీయాలంటే కొత్తగా  అ- ఆ- లంటూ అక్షరాలు దిద్దుకోవాలి.  లేకపోతే  జన్మలో కనుపాప, 16 -డి, నగరం, మెట్రో, పింక్, కహానీ- 2 లాంటివి తీయనే తీయలేరు. ఏవో ఆషామాషీ యాక్షన్ సినిమాలు తీసుకుంటూ దయనీయంగా మిగిలిపోవాల్సిందే. 

           సరే, ఏ ఒకరికో ఇద్దరికో ఈ సుడిగుండం లోంచి బయటపడితేనే గుర్తింపూ భవిష్యత్తూ వుంటాయని  ఖచ్చితంగా  అన్పించి ఇటు వైపు కొనసాగాలన్పించిందనుకుందాం - ఇలాటి వాళ్ళ కి ఈ వ్యాసాలు పనికి రావొచ్చు. ఇతరులు  కాలక్షేపంగా చదివి వదిలేసి,  అవే రోమాంటిక్ కామెడీలూ, ఈ జానర్ కూడా తెలీక రోమాంటిక్ కామేడీ లనుకుంటూ ఈ కాలంలో చెల్లని రో మాంటిక్ డ్రామాలూ,  చాదస్తాలూ తీసుకుంటూ వుంటే  సరిపోతుంది. 

          కానీ ఈ డార్క్ మూవీస్ తోనే రచయితలకీ, దర్శకులకీ  ప్రొఫెషనలిజం వస్తుందనేది నిజం.  ఎందుకంటే అడుగడుగునా ఇవి ప్రొఫెషనలిజాన్ని డిమాండ్ చేస్తాయి. ప్రధానంగా పోలీసు వ్యవస్థ, న్యాయవ్యవస్థల గురించి విషయపరిజ్ఞానాన్ని ఇవి డిమాండ్ చేస్తాయి. ఇవి లేకపోతే వీటిలో రాణించలేరు. కేవలం ప్రేమ సినిమాలూ, హార్రర్ కామెడీలూ ఇతర యాక్షన్ సినిమాలూ వంటివి  చూస్తూ ఈ రెండు దశాబ్దాల కాలం గడిపేసినందువల్లే  వ్యవస్థల పరిజ్ఞానం లేకుండా పోయిందనీ, డిటెక్టివ్ నవలలు  చదివుంటే, క్రైం సినిమాలూ  చూసి  అర్ధం జేసుకుని వుంటే పోలీసు- న్యాయవ్యవస్థల పనితీరులు తెలిసి వుండేవనీ చెప్పడం కూడా కాదిక్కడ. ఆర్ధిక సంస్కరణల పుణ్యమాని 2000 నుంచి అన్ని రంగాల్లో చోటుచేకున్న బూమ్ తో రకరకాల చదువులూ, ఉద్యోగాల  వేటా తప్ప సాంస్కృతికంగా, సామాజికంగా, సృజనాత్మకంగా  ఇంకేదీ పట్టకుండా యువతరం తయారైన మాట మాత్రం నిజం.  కొందరు ఎంబీయే  చదివిన వాళ్ళనే  అడగండి, పోలీస్ స్టేషన్లో సిబ్బంది ఎవరెవరుంటారో తెలీదు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ అంటే ఎవరో తెలీదు. పోనీ బెయిల్, ఛార్జిషీట్ల గురించి తెలుసా అన్నా కూడా తెలీదనే తలూపుతారు.  ఇదీ  పరిస్థితి.

          అయితే ఇదే సమయంలో టెక్నాలజీ అర చేతిలో కొచ్చేసి షార్ట్ ఫిలింలు తీయడం అందరికీ వచ్చేశాక- ఒక శుభపరిణామం సంభవిస్తోంది. ఈ షార్ట్ ఫిలిమ్స్ పుణ్యమా అని రచన చేయడం నేర్చుకోవడం మొదలెట్టారు!  షార్ట్  ఫిలిమ్స్ వచ్చేసి వూరూరా టీనేజర్స్ ని కూడా రైటర్స్ గా  మార్చేస్తున్నాయి. ఇలా ఏదో ఒకటి వూహించి కథ రాస్తున్నాడంటే  అదొక సృజనాత్మక, కాల్పనిక, సాంస్కృతిక, సామాజిక  వ్యక్తీకరణే కదా ఇన్నాళ్ళకి! లేకపోతే ఏం కథలు చదివేవాడని వీడు? ఏం రాసేవాడని? ఆనాడు డిటెక్టివ్ సాహిత్యం  వచ్చేసి సామాన్యుల్లో చదివే ఆసక్తి పెంచినట్టు, ఈనాడు షార్ట్ ఫిలిమ్స్  కథలు రాయడాన్ని నేర్చుకునేలా చేస్తున్నాయన్న మాట. 

         అయితే ఈ షార్ట్ ఫిల్మిస్టులు కూడా ఏవో జోకులూ, తమ వయసుకి  తెలిసిన అచ్చి బుచ్చి ప్రేమలూ రాసుకుంటూ ఇంకొక  డేంజరస్ వ్యవహారంగా తయారవుతున్నారు తెలుగు సినిమా ప్రేక్షకుల ప్రాణానికి. అసలే సినిమా ఫీల్డు లోపల అచ్చి బుచ్చి రోమ కామీయులు క్రిక్కిరిసి వున్నారనుకుంటూంటే, ఫీల్డు బయట కూడా ఇలా తయారై  ఫీల్డు మీదికి దండెత్తి రాబోతున్నారన్న మాట. ముందుకాలంలో ఇంకా రోమ్- కామ్ లతో ప్రేక్షకుల్ని రాచిరంపాన పెట్టేందుకు కత్తులు నూరుతున్నారన్న మాట!

          యాంటీ వైరస్ అవసరం. అదేమిటో ఇప్పుడే మనం కనిపెట్టలేక పోతున్నాం. కానీ తమిళనాడులో షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చిన ప్రతీ వాడూ క్రైం జానర్ సినిమా తీసిన వాడే. దీనికి ఆద్యుడు కార్తీక్ సుబ్బరాజ్. పిజ్జా, జిగర్తాండ లతో అతను వేసిన ముద్ర షార్ట్ ఫిలిం మేకర్లని క్రైం జానర్ వైపు- డార్క్ మూవీస్ వైపు -  మళ్లేలా చేసింది.  చివరికి 16 –డి తీసిన  22 ఏళ్ల కార్తీక్ నరేన్ సహా! 

          వీళ్ళ సినిమాల్ని స్టడీ చేసినా నియో నోయర్ సినిమా అంటే ఏమిటో అర్ధమవుతుంది. అసలు డార్క్ మూవీస్ (ఫిలిం నోయర్) అనేవి హాలీవుడ్ లో 1930లలో డిటెక్టివ్ సాహిత్యంలోంచి పుట్టాయని చెప్పుకున్నాం. కలర్ సినిమా లొచ్చేటప్పటికి అవి నియో నోయర్ గా అభివృద్ధి చెందాయి. తెలుగులో ఇలా జరగలేదు. 1970 లలో బ్లాక్ అండ్ వైట్  లో క్రైం సినిమాలంటూ చాలా వచ్చాయి. వీటిలో హీరో కృష్ణ నటించినవే ఎక్కువ. అయితే ఇవి నోయర్ సినిమాలు కావు, యాక్షన్ సినిమాలు. తెలుగు డిటెక్టివ్ నవలలు కూడా పెద్దగా తెర కెక్కిన చరిత్ర లేదు. కొమ్మూరి సాంబ శివరావు నవలలు   ‘పట్టుకుంటే లక్ష’,  ‘నకిలీ మనిషి’ రెండే సినిమాలుగా కన్పిస్తాయి. ‘పట్టుకుంటే లక్ష’ ( 1971-బ్లాక్ అండ్ వైట్) లో డిటెక్టివ్ యుగంధర్ గా నాగభూషణం నటిస్తే, అసిస్టెంట్ రాజుగా కృష్ణ నటించారు. ‘నకిలీ మనిషి’ (1980- కలర్) అపరాధ పరిశోధక కథ కాకుండా సస్పెన్స్ థ్రిల్లర్.  ఇందులో చిరంజీవి నటించారు. ఈ రెండు తప్ప ఇంకో డిటెక్టివ్ నవల తెరకెక్కిన ఆధారాలు కన్పించవు.

       అయితే ఇప్పుడు నియో నోయర్ డార్క్ మూవీ తీయాలంటే డిటెక్టివ్ సాహిత్యాన్ని పరిశీలించక తప్పదు.  ఇందుకే గత రెండు వ్యాసాల్లో తెలుగు డిటెక్టివ్ సాహిత్యాన్ని పరిచయం చేశాం. ఈ వ్యాసాల్ని  బాగా అర్ధం చేసుకోగలగాలి. డిటెక్టివ్ అన్న పదం కూడా ఈరోజుల్లో చాలా మందికి తెలీదు. ముందుగా ఈ సాహిత్యం చదివితే నేరపరిశోధన గురించి అవగాహన ఏర్పడుతుంది. చదివితే వచ్చే  జ్ఞానం చూస్తే రాదు. కొమ్మూరి సాంబశివరావు నవలలు కొత్తగా మార్కెట్ లో కొచ్చాయి. ఇవి నలభై రూపాయల చొప్పున దొరుకుతున్నాయి. వీలైనన్ని కొనుక్కుని చదువుకుంటే మంచిది. ఇంగ్లీషు భాష తెలిస్తే ఇంగ్లీషులో బోలెడు డిటెక్టివ్ సాహిత్యం ఇప్పటికీ అందుబాటులో వుంది. 

          ఇప్పుడు డిటెక్టివ్ లేడు. పోలీస్ అధికారులతోనే మర్డర్ ఇన్వెస్టిగేషన్ కథలు / సినిమాలు వస్తున్నాయి. కాబట్టి పోలీసు వ్యవస్థ గురించి తెలుకోవడం అవసరం. న్యాయవ్యవస్థ గురించి కూడా- కనీసం సెక్షన్ 302 అంటే ఏమిటో లాంటి ప్రాథమిక జ్ఞానం పొందడం అవసరం. ఫోరెన్సిక్ లాబ్ గురించి కూడా తెలుసుకోవాలి. ఈ వ్యవస్థలు సమాజంతో, మన నిత్య జీవితంతో ముడిపడి వున్నాయి- వీటి పరిజ్ఞానం లేకుండా పౌరులుగా కొనసాగడం కూడా  కష్టమే.

Next : డార్క్ మూవీస్ వర్సెస్ యాక్షన్ మూవీస్

-సికిందర్
http://www.cinemabazaar.in/






         


12, ఏప్రిల్ 2017, బుధవారం








     ‘‘హాలీవుడ్లో సిడ్ఫీల్డ్‌  అని రచయిత ఉన్నాడు. స్క్రీన్ప్లే ఎలా రాయాలనే విషయంలో ఆయన సబ్కా బాప్‌. స్క్రీన్ప్లే మీద బుక్స్రాశాడు. హాలీవుడ్అంతా ఆయన్నే ఫాలో అవుతోంది. నేనూ బుక్చదివా. అలాంటాయన రెండు సినిమాలకు కథలు రాస్తే, రెండూ ఫ్లాపే. థియరీ వేరు, ప్రాక్టికల్వేరు. సినిమా హిట్టూఫ్లాపులు మన చేతుల్లో ఉండవు’’ – ‘రోగ్’  విడుదల సందర్భంగా ప్రెస్ మీట్ లో పూరీ జగన్నాథ్ స్టేట్ మెంట్. 

         కలం కోతికి ఇలా అన్పించడం లేదు. దాని ఇన్ఫర్మేషన్ వేరే వుంది : సిడ్ ఫీల్డ్ హాలీవుడ్ లో సినిమాలకి కథలూ స్క్రీన్ ప్లేలూ రాశారు నిజమే, కానీ అది ‘స్క్రీన్ ప్లే గురు’ గా మారడానికి చాలా ముందు. 1967 లో డాక్యుమెంటరీ ఫిలిం మేకర్ గా ప్రవేశించి ‘స్ప్రీ’ అనే ఒక డాక్యుమెంటరీకి రాశారు. తర్వాత హలీవుడ్ లో స్ట్రగుల్ చేస్తూ ఏడు స్క్రీన్ ప్లేలకి సహ రచయితగా పనిచేశారు. అక్కడ విసిగి ‘సినీమొబైల్’ అనే కంపెనీలో స్క్రిప్టులు చదివే ఉద్యోగంలో కుదిరారు. అక్కడ రెండు వేల స్క్రిప్టులు చదివి, వాటిలో స్క్రీన్ ప్లే శాస్త్రాన్ని పట్టుకున్నారు. ఇక తన గమ్యం ఏమిటో అర్ధమైంది. దానివైపు సాగిపోయారు. స్క్రీన్ ప్లే శాస్త్రాన్ని కొత్తగా నిర్వచిస్తూ మూడు స్క్రీన్ ప్లే పుస్తకాలూ రాశారు. అవి బ్రహ్మాండాన్ని బద్దలు చేశాయి. 1979 నుంచీ స్క్రీన్ ప్లే ట్యూటర్ గా మారిపోయారు. ఇంకా పుస్తకాలూ రాశారు. 29 భాషల్లో ఈ పుస్తకాలు అనువాదమయ్యాయి. ‘స్క్రీన్ ప్లే వర్క్ బుక్’ అన్న పుస్తకం ఒక్కటే 40 సార్లు పునర్ముద్రితమైంది. ఈ పుస్తకం 400 విశ్వ విద్యాలయాల్లో పాఠ్య పుస్తకమైంది. సిడ్ ఫీల్డ్ కి హాలీవుడ్ సినిమాలకి కథలు రాసేంత తీరికా ఆసక్తీ లేవు. ప్రపంచవ్యాప్తంగా వర్క్ షాపులు నిర్వహిస్తూ తన స్టూడెంట్స్ కి  శిక్షణ ఇవ్వడంతోనే సరిపోతోంది. ఆయన స్కూల్ నుంచి వచ్చిన శిష్యులు ఎవరంటే- ఆస్కార్ అవార్డ్ విజేత  దర్శకుడు ఆల్ఫాన్సో క్వారాన్ (గ్రావిటీ),  గోల్డెన్ గ్లోబ్ అవార్డుకి నామినేట్  అయిన  రచయిత/ దర్శకుడు జడ్ అపటోవ్ (బ్రైడ్స్ మెయిడ్స్, గర్ల్స్),  మూడు సార్లు ఆస్కార్ కి నామినేట్ అయిన రచయిత/ నిర్మాత ఫ్రాంక్ డరబొంట్ (షషాంక్ రిడెంప్షన్, ది గ్రీన్ మైల్), ఆస్కార్ కి నామినేట్ అయిన రచయిత్రి  అన్నా హేమిల్టన్ ఫెలాన్ ( మాస్క్, గోరిల్లాస్, మిస్ట్),  రెండు సార్లు ఆస్కార్  కి నామినేట్ అయిన దర్శకుడు/రచయిత జాన్ సింగిల్టన్ ( బాయ్స్ అండ్ ది  హుడ్, పోయెటిక్ జస్టిస్), రచయిత్రి రాండీ మేయన్ సింగర్ (మిసెస్ డౌట్ ఫైర్), రచయిత్రి లారా ఎస్క్యూవేల్ (లైక్ వాటర్ ఫర్ చాకొలేట్), రచయిత కెవిన్ విలియంసన్  (వాంపైర్, స్క్రీమ్  -1,2,3,4) తదితరులెందరో  వున్నారు. ఇంతే కాదు, సిడ్ ఫీల్డ్ ముంబాయి వచ్చి అమీర్ ఖాన్ నటించిన ‘రంగ్ దే బసంతీ’,  షారుఖ్ ఖాన్ నటించిన ‘మై నేమ్ ఈజ్ ఖాన్’  అనే రెండు విజయవంతమైన బాలీవుడ్  సినిమాలకి పనిచేసి వెళ్లారు కూడా. 

       విషయం ఇలా వుండగా, ‘హాలీవుడ్లో సిడ్ఫీల్డ్‌  అని రచయిత ఉన్నాడు’ - అని పూరీ తేలిక చేసి మాట్లాడడం అన్యాయం. ‘అలాంటాయన రెండు సినిమాలకు కథలు రాస్తే, రెండూ ఫ్లాపే. థియరీ వేరు, ప్రాక్టికల్వేరు’ అనడం ఇంకా అన్యాయం. సిడ్ ఫీల్డ్  రచయితగా స్ట్రగుల్ చేస్తున్న కాలంలో అదృష్టవశాత్తూ తన గమ్యం ఏమిటో తెలిసిపోయాక, తను కనుగొన్న స్క్రీన్ ప్లే శాస్త్రాన్ని పట్టుకుని అటువైపుగా సాగిపోయారు. విశ్వవిద్యాలయ్యాల్లో పాఠ్యాంశమయ్యారు. ఆస్కార్ స్థాయి రచయితల్ని, దర్శకులని అందించిన అంతర్జాతీయ గురువు అయ్యారు. 70 ఏళ్ల  వయసులో బాలీవుడ్ వచ్చి రెండు హిట్ సినిమాలకి రాసిపోయారు. థియరీ వేరు- ప్రాక్టికల్ వేరు అని  అలవాటుగా అనేస్తూంటారు. అసలు థియరీ తెలుసుకోకుండా చేస్తున్న ప్రాక్టికల్స్ తోనే వరస ఫ్లాపులు. పాత మూసగా, అవే ఫార్ములా నమ్మకాలతో రాసుకుంటున్న స్క్రీన్ ప్లేలకి దీటుగా స్క్రీన్ ప్లే శాస్త్రాన్ని నవీకరించి సులభంగా అర్ధమయ్యేట్టు చేసిన  ఒక ప్రఖ్యాత పండితుడి సేవల్ని గుర్తించకుండా,  చులకన చేసి మాటాడ్డం సీనియర్ దర్శకుడుగా తనకి ఎంతవరకు సబబో పూరీ విజ్ఞతకే వదిలేద్దాం.

-సికిందర్





8, ఏప్రిల్ 2017, శనివారం

రివ్యూ!


రచన దర్శకత్వం : మణిరత్నం
తారాగణం : కార్తీ, అదితీ  రావ్ హైదరీ, రుక్మిణీ విజయ్ కుమార్, ఆర్ జె బాలజీ, ఢిల్లీ గణేష్  తదితరులు
మాటలు : కిరణ్,  పాటలు: సిరివెన్నెల సీతారామశాస్త్రి, సంగీతం: ఏఆర్ రెహమాన్,
ఛాయాగ్రహణం : ఎస్‌. వివర్మన్
నిర్మాణ సంస్థలు: ద్రాస్ టాకీస్, శ్రీ వెంకటేశ్వ క్రియేషన్స్
ర్ప: దిల్రాజు
నిర్మాతలు: ణిరత్నం, శిరీష్
విడుదల : మార్చి 7, 2017
***
1983 నుంచి ఇప్పుడు 2017 వరకూ 34 ఏళ్ళూ తన సమకాలీనుల్ని బీట్ చేస్తూ అప్రతిహతంగా మార్కెట్ వున్న దర్శకుడుగా కొనసాగుతున్న మణిరత్నం విజయరహస్యమంతా , తను తీసే సినిమాలకి జాతీయ అంతర్జాతీయ ప్రమాణాలని కల్పించడంలోనే వుంది, కథా వస్తువులు విశ్వజనీన మానవ సంబంధాల చుట్టూ పరిభ్రమించడంలోనే వుంది.  అయితే ఎక్కువగా ప్రేమకథల మీదే దృష్టిపెట్టే తను, వాటినీ సమకాలీన ట్రెండ్స్ ని అనుసరించి తీయడం ప్రారంభించారు.  2015 ఏప్రెల్ లో ‘ఓకే బంగారం’ అనే ప్రేమకథతో సహజీవనం  సమస్యని చూపించారు. కానీ ఈసారి మాత్రం అలాటి మరో సమకాలీన సమస్య జోలికిపోకుండా సీదా సాదా పీరియడ్ ఫిలిం తీసేశారు. తీస్తూ దీన్నొక రోమాంటిక్ డ్రామా చేశారు. రోమాంటిక్ డ్రామాలు ఇప్పుడు ఆకట్టుకుంటాయా? ప్రేమలో చర్యకి పాల్పడకుండా హీరో హీరోయిన్లు రోమాంటిక్ డ్రామాని నిలబెట్టగలరా? తను ‘ఏ’ సెంటర్ డైరెక్టర్ గా పేరుబడ్డాక  ఆ వర్గం ప్రేక్షకులనైనా సంతృప్తి పర్చగల్గారా? ఇవన్నీ ఈ కింద పరిశీలిద్దాం...

కథ 
       వరుణ్ (కార్తీ) శ్రీనగర్ బేస్ లో ఏర్ ఫోర్స్ పైలట్. అక్కడి కల్నల్ కూతురు గిరిజ (రుక్మిణీ విజయ్ కుమార్) తో ప్రేమలో పడతాడు. ఆమె కారణంగా ఓ రోడ్డు ప్రమాదానికి గురై  స్పృహ లేని స్థితిలో మిలిటరీ ఆస్పత్రిలో చేరతాడు. కొత్తగా వచ్చిన మిలిటరీ డాక్టర్ లీలా అబ్రహాం (అదితీరావ్ హైదరీ) చికిత్స చేసి కాపాడుతుంది. ఆమె మీద ఇష్టం పెంచుకుని ప్రేమించడం ప్రారంభిస్తాడు. లీలా అన్న ఒకప్పుడు వరుణ్ కొలీగ్ కావడంతో, వరుణ్ గురించి అతను  ఉత్తరాల్లో రాసిన విషయాలు ఆమెని వరుణ్ ని ప్రేమించేలా చేస్తాయి. ఈ ప్రేమ సంబంధం ఒడిదుడుకుల మయంగా వుంటుంది. వరుణ్ ఏ క్షణంలో ఎలా నొప్పించే విధంగా ప్రవర్తిస్తాడో తెలీదు. కొంచెం ప్రేమ కొంచెం ఖర్మ అన్న చందాన  ఈ వ్యవహారం కొనసాగిస్తూనే  గర్భవతవుతుంది. దీంతో  అతను అప్పుడే బాధ్యతలు తీసుకోవడానికి వెనుకాడి పెళ్లిని కాదంటాడు. అదే  సమయంలో కార్గిల్ యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో పాల్గొన్న అతను విమానం కూలిపోయి  పాకిస్థాన్ లో పారాచూట్ లాండింగ్ అవుతాడు. పాక్ సైనికులు పట్టుకుని బంధిస్తారు. అలా మూడేళ్ళూ  జైల్లో మగ్గుతూ ఎప్పుడెప్పుడు లీలాని కలుస్తానా  అని కలవరించడమే అతడి దిన చర్యవుతుంది.

          వరుణ్ పాక్ జైల్లోంచి బయటపడ్డాడా? బయటపడి  లీలాని కలుసుకోగలిగాడా? కలుసుకుంటే ఏం  జరిగింది? ఈ మూడేళ్ళ కాలంలో తను వూహించని పరిణామాలు ఏమేం  చోటు చేసుకున్నాయి? ఇవన్నీ తెలుసుకోవాలంటే ఈ మణిరత్నం  ప్రేమ సినిమా పూర్తిగా చూడాల్సిందే.


ఎలా వుంది కథ        
        మణిరత్నం సినిమా అనే బంగారు పళ్ళేనికి  గోడచేర్పు మాత్రం బలంగా వుంది ఏర్ పోర్స్- మిలిటరీ నేపధ్యాలతో. కానీ పళ్ళెంలో వడ్డించిన కథ అనే భోజనమే, రుచికరంగా  బలవర్ధకంగా లేదు. ముఖ్యంగా వినోదమనే సాంబారు లేదు. ప్రేమ అనే కూర కూడా ఉప్పుతగ్గి కారం ఘాటు ఎక్కువైపోయింది. ‘ఓకే బంగారం’ లో సహజీవనం కథ అభాసు అయినట్టే, ప్రస్తుత సాదా ప్రేమకథ కూడా జావకారిపోయింది. ఇంత ఖర్చుపెట్టి తీసిన ఈ మిలిటరీ - ఏర్ ఫోర్స్ బ్యాక్ డ్రాప్ తో ప్రేమకథని ఒక అనిర్వచనీయమైన అనుభూతుల దొంతరగా మార్చెయ్యవచ్చు నిజానికి మణిరత్నం స్థాయి దర్శకుడు. 

          కానీ తెలుగులో ఇప్పటికీ లైటర్ వీన్ ప్రేమకథలని వస్తున్న పసలేని రోమాంటిక్ డ్రామాలకి ఏ మాత్రం తీసిపోని విధంగా నూలు దారమంత మందం కథతో  భారీ ప్రయత్నం చేశారు. రోమాంటిక్ డ్రామా ఇగోల గోలతో నిలబడే అవకాశం ఏమాత్రం వుండదు. ఇగోలతో మూతి విరుపులు, తగాదాలు, విడిపోవడాలు, సారీ చెప్పడాలు, కలవడాలు; మళ్ళీ ఇగోలతో మూతి విరుపులు, తగాదాలు, విడిపోవడాలు, సారీ చెప్పడాలు, కలవడాలూ... ఇలా కథని వున్నచోటే వుంచి గిర్రున రంగులరాట్నంలా తిప్పుతూ పోయారు.  బయస్కోపులా అవే బొమ్మల్ని చూపిస్తూ చూపిస్తూ పోయారు.  ప్రేమికుల మధ్య ఒక ప్రధానమైన, బలమైన  సమస్యంటూ లేకపోతే, దాంతో సంఘర్షణంటూ లేకపోతే, దానికో అర్ధవంతమైన పరిష్కారమూ  లేకపోతే అది కథెలా అవుతుంది? 

          మణిరత్నం కథలో ఆమె గర్భవతవడమనే మలుపుతో సమస్య ఏర్పాటయితే,  దీని నిర్వహణ  కూడా లైటర్ వీ(ణ)న్  సినిమాల ధోరణిలోనే వుంది. ఈ ఘట్టం క్లయిమాక్స్ దగ్గర వస్తుంది. అంటే మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే అన్న మాట. ఇందుకే ఇంత సేపూ ప్రేమలో ఏమీ జరక్క రంగులరాట్నంతో బోరు కొట్టే పరిస్థితి ఏర్పడింది. ఎంతసేపూ ఈ రంగుల రాట్నం తిప్పే బదులు, ఫస్టాఫ్ లోనే  పాత్రల్ని చర్యకి దింపి వుంటే- పాత్రల్ని సమస్యలోకి నెట్టేసే ఆ చర్య వల్ల కథ ఆసక్తికరంగా తయారయ్యేది. 

       ఈ సందర్భంగా మనకి ‘సన్ ఫ్లవర్’ అనే క్లాసిక్ ప్రేమకథ గుర్తుకురాక మానదు. 1970 లో అప్పటి టాప్ హీరోయిన్ సోఫియా లారెన్, మార్సెల్లో మాస్ట్రోవన్నీలు నటించిన ఈ కథలో ప్రేమలో వున్న సోఫియా- సైనికుడైన మార్సెల్లో రెండో ప్రపంచ యుద్ధంలో డ్యూటీని ఆలస్యం చేయడానికి పెళ్లి అనే తతంగం నడుపుతారు. దీంతో పన్నెండు రోజులు డ్యూటీని ఎగ్గొట్టే అవకాశం లభిస్తుంది. ఇది చాలదన్పించి, పిచ్చెక్కినట్టు మరొక నాటకానికి తెర తీస్తాడు మార్సె ల్లో. ఆఖరికి అతన్ని పట్టుకుని రష్యా పంపేస్తారు. అక్కడ యుద్ధంలో ఏమయ్యాడో ఆచూకీ దొరకదు.  అతను చనిపోలేదనీ,  బతికే వుంటాడనీ బలంగా  నమ్ముతుంది సోఫియా. ఈ నమ్మకంతో వెతకడానికి తనే రష్యా బయల్దేరుతుంది. అక్కడ పొద్దు తిరుగుడు (సన్ ఫ్లవర్) పువ్వుల పంటల్లోకి  వెళ్తుంది. ఆ మొక్కలన్నీ యుద్ధంలో చనిపోయిన ఒక్కో సైనికుడి సమాధి మీద నాటినవని తెలుసుకుని ఏడుస్తుంది. అయినా భర్త మీద తన ప్రేమ ఓడిపోదనీ, ఎక్కడో బతికే వుంటాడనీ నమ్ముతుంది. రష్యాలోనే ఇంకా గాలిస్తే అతను కన్పిస్తాడు భార్యతోనూ,  కూతురుతోనూ. 

          గుండె పగులుతుంది. అయినా తను ప్రేమించే భర్త సుఖసంతోషాల్ని భగ్నం చేయలేక, అతడికి ఎదురు పడకుండానే  స్వదేశానికి వచ్చేస్తుంది.  ఒక ఫ్యాక్టరీలో పని చేయడం మొదలెడుతుంది. అప్పుడెన్నేళ్ళకో  అతను తిరిగొస్తాడు, ఆమె కిస్తానని ప్రామీస్ చేసిన ఫర్ కోటుతో...ఇప్పుడింకా ఏడ్పించేస్తుందీ క్లాసిక్ ప్రేమకథ. దీన్ని రోమాంటిక్ డ్రామా అంటారు. 

          రోమాంటిక్ డ్రామాకి  పాత్రలు పాల్పడే చర్యలతోనే బలం వస్తుంది- బలమైన సంఘటనలు పుడతాయి- మాటా మాటా అనుకుని విడిపోతే కాదు!  ఫిలిం ఈజ్ బిహేవియర్ అన్నారు, కబుర్లు అనలేదు. కబుర్లతో కాకరకాయలే వస్తాయి. 

        మణిరత్నం సర్ కథలో,  కార్గిల్ యుద్ధంలో పైలట్ అదృశ్యమైతే ప్రభుత్వానికి తెలీదా? అతను యుద్ధ ఖైదీగా బందీ అయివుంటే విడిపించే ప్రయత్నం చెయ్యదా? హీరోయిన్ తో బాటు హీరో తల్లిదండ్రులు కూడా అతడి గురించిన ఆందోళనతో గడపరా? అతడి కోసం ప్రభుత్వం చుట్టూ తిరగరా? సోఫియా లారెన్ యుద్ధంలో మిస్సయిన భర్త ని వెతుక్కుంటూ పరదేశం వెళ్ళడం సార్వజనీన భావోద్వేగం కాదా? ఈ యూనివర్సల్ ఎమోషన్ ని మణిరత్నం హీరోయిన్ కి లేకుండా చేసి కథని ఎలా నిలబెట్టగలరు? సోఫియా లారెన్ పాత్ర గర్భవతి కూడా కాదు. అయినా భర్తంటే అంత ప్రేమతో వుంటుంది. మణిరత్నం హీరోయిన్ గర్భవతి అయి వుండి కూడా హీరోకోసం పాకిస్థాన్ అయినా, ఇంకే స్థాన్ కైనా వెళ్ళకుండా ఎలా వుండగల్గుతుంది? 

          పాకిస్థాన్ వెళ్లి వుంటే ఈ ప్రేమకథ సరైన దార్లో పడేది. ఒక బ్యాక్ డ్రాప్ అంటూ పెట్టుకున్నాక,  ఆ బ్యాక్ డ్రాప్ తో ప్రధాన కథ స్పర్శించక పోతే  మొత్తం కథంతా కుప్ప కూలుతుందని  మహేష్ బాబు ‘బాబీ’ ఎప్పుడో నిరూపించింది. ఏర్ ఫోర్స్- మిలిటరీ బ్యాక్ డ్రాప్ అంటూ వున్నాక, ఇంకా కార్గిల్ యుద్ధం లాంటి తీవ్రమైన అంశమూ కూడా వున్నాక- ఇవేమీ లేనట్టు- ఈ బ్యాక్ డ్రాప్ తో స్పర్శే లేకుండా, ఇకేదో లోకంలో ప్రేమ కథ ఎలా నడపగలరు? పళ్ళెం లో అన్నం తింటూ గోడచేర్పుకి తగలకుండా తినగలమా? 

ఎవరెలా చేశారు 
     తెలుగు ప్రేక్షకుల ఫాలోయింగ్ వున్న, తెలుగు మాట్లాడగల తమిళ కమర్షియల్ మాస్ హీరో కార్తీ కి మణిరత్నంతో ఇది అరుదైన అవకాశం. ఏర్ ఫోర్స్ పైలట్ పాత్రలో పూర్తి మేకోవర్ తో అత్యంత సహజంగా కన్పించడం బావుంది. ‘కంచె’ లో సైనికుడి పాత్రలో ఇలాటి మేకోవర్ తో వరుణ్ తేజ్ కన్పించిన తర్వాత కార్తీ కన్పిస్తున్నాడు. రక్షణ దళాల పాత్రల్ని మూస తరహాలో మొహానికి పౌడరు కొట్టి నాటుగా చూపించే పద్ధతికి భిన్నంగా- ఏ అంతర్జాతీయ ప్రేక్షకులు చూసినా ఒప్పే విధంగా  సహజత్వానికి ప్రాణంపోయడం ఇప్పుడిప్పుడే దక్షిణాది సినిమాల్లో అలవాటవుతోంది.

          కార్తీ పాత్రచిత్రణ విషయానికొస్తే, అతడిది నిలకడ లేని మనస్తత్వమని కూడా అనలేం, ప్రేమలో పూటకో విధంగా ప్రవర్తిస్తూంటే. తను వెంటపడి ప్రేమిస్తున్నది ఒక మిలిటరీ లేడీ డాక్టర్ నని కూడా ఆలోచించకుండా ఆమెతో పదుగురిలో కూడా దురుసుగా ప్రవర్తిస్తాడు. అవమానిస్తాడు. మళ్ళీ సారీ చెప్తాడు, బుజ్జగిస్తాడు. మళ్ళీ దురుసుగా ప్రవర్తిస్తాడు. 

          తీరా మనకి అర్ధమయ్యే దేమిటంటే ఇతనేదో కమిట్ మెంట్ ఫోబియాతో బాధపడుతున్నట్టు నటిస్తున్నాడని. ఇది క్రిమినల్ మెంటాలిటీయే. ప్రేమిస్తే ఎక్కడ పెళ్ళికి కమిట్ అవాల్సి వస్తుందోనని భయపడేవాళ్ళు ప్రేమలకి దూరంగా వుంటారు. ఆర్ధిక పరిస్థితులో మరోటో చక్కబడితే ఫోబియా దానికదే పోతుంది. కార్తీ పాత్ర ఆమెకి నెలతప్పించే దాకా పోయాక అప్పుడు-  భర్త పాత్ర, తండ్రి పాత్రా ఇప్పుడే వహించలేనని, నేను నీకు సరిపోనని, వర్కౌట్ అవదనీ  ‘కమిట్ మెంట్ ఫోబియా’ వెల్లడించుకుని బై చెప్పేస్తాడు. అంటే ఆమెతో  అన్నీ అనుభవించి తీరా ఈ మాట అంటున్నాడంటే ఈ ఒక ఫోబియా నాటకమే. 

        పాత  సినిమాల్లో ఇలా మోసం చేసి పారిపోయే పాత్రల్ని హీరోయిన్ పాత్రలు చీటింగ్ కేసులు పెట్టేవి. లేదా ఆ చీటర్స్ ఇళ్ళ ముందు మౌన పోరాటానికి దిగేవి. ఇంకా యాక్షన్ హీరోయిన్ పాత్రలైతే చంపి పారేసేవి. మణిరత్నం ఈ రక్షణ శాఖ ఉద్యోగి పాత్రని ఎలా అర్ధం చేసుకోమన్నారో అస్సలు  అర్ధం కాదు. ఇతణ్ణి పాకిస్తానీయులు పట్టుకుని జైల్లో వేశారంటే మంచి పనే చేశారు శాస్తిగా!  

          అసలు మొదటి హీరోయిన్ తో ఎంజాయ్ చేస్తున్నప్పుడు ఆమె కారణంగానే యాక్సిడెంట్ అవడం కూడా అతడికి గుణపాఠంగానే  జరిగిందనుకోవాలా? ఆ విధంగా మొదటి హీరోయిన్ ఇతడి బారిని పడకుండా బాగానే ఎస్కేప్ అయ్యిందనుకోవాలా? ఇలా అడుగడుగునా ఈ కథనం, పాత్ర చిత్రణలూ సెల్ఫ్ డ్యామేజింగ్ గానే వున్నాయి. ఇంకా పాయింట్లు తీస్తే మణిరత్నం పట్ల అపచారమే అవుతుందేమో...

          హీరోయిన్ అదితీ రావ్ హైదరీ మణిరత్నం విజువల్స్ తో దేవతా మూర్తి దర్జా పొందింది. అద్బుతమైన రూపమామెది. ఆమె మణిరత్నానికీ, కెమెరా మాన్ రవి వర్మన్ కీ జీవితాంతం రుణపడి వుండాల్సిందే. రూపమే కాకుండా నటనలో కూడా అందె వేసిన చేయామె. కానీ ఏం  లాభం,  డాక్టర్ పాత్రయిన తనని సగటు టీనేజర్ కన్నా అపరిపక్వంగా మణి సర్ చూపించిన ప్పుడు? ఎందుకు పదే పదే తనని అవమానించే  పైలట్  వెంట పడ్డం? మోటివ్ ఏమిటి? 

      ఇతడి గురించి అన్న అంత గొప్పగా రాశాడని- చనిపోయిన అన్న సెంటిమెంటుతో ఇతడే దైవం అనుకుంటున్నట్టు పట్టుకు వేళ్ళాడ్డమేమిటి?  ఇతడిలో అన్నకి గొప్ప లక్షణాలు కన్పించడం హాస్యాస్పదం. ఇప్పుడితడి వరస చూస్తూ కూడా అన్న రాసింది నాన్సెస్ అనుకోకుండా, రేపేం చేస్తాడో తెలీని వాడికా శరీరాన్ని  కూడా అప్పగించడం? అప్పగించినా డాక్టర్ గా జాగ్రత్త తీసుకోక పోవడం? పోతే పోయాడనుకుని పిల్లనీ కనీ పెంచడం? పెళ్ళికాని తల్లి అన్పించుకోవడం?  ఇలా జీవితాన్ని సరిపెట్టుకోవడం? ఈమెని ఎలా అర్ధం జేసుకోవాలి? ఇలాటి ఆషామాషీ,  బలహీన మోటివ్స్ తో పాత్రచిత్రణలు చేశారు. 

          ఇంకో గమ్మత్తుంది ఈ కథలో. ఈ గమ్మత్తు చూసయినా  హీరోయిన్ జాగ్రత్త పడాలి. ఆ గమ్మత్తేమిటంటే,  హీరో అన్న పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లి కూతురిని  ఆల్రెడీ దర్జాగా గర్భవతిని చేసిపారేసి  తొమ్మిదో నెల తాళి  కడతాడు. పెళ్లి పీటల మీంచే ప్రసవాని కెళ్తుంది. ఈ డార్క్ కామెడీ నంతా పెళ్లి పాట సహా మనం ఎంజాయ్ చేసే నిర్బంధానికి మణి సర్ గురిచేసినా ఏమీ అనుకోం. కానీ అన్న రూట్లోనే తను ప్రేమిస్తున్న తమ్ముడు కూడా పోతున్నాడని హీరోయిన్ జాగ్రత్త పడాలిగా? ఈ వంశమింతే అన్నట్టు, తోడి కోడల్లాగే పెళ్ళవకుండానే సంతానవతి అయి అడ్జెస్ట్ అయిపోదామనుకోవడమేమిటి?  అసలు హీరో క్యారక్టర్ అన్న  అడుగుజాడల్లోనే హీరోయిన్ ని ట్రాప్ చేసి గర్భవతిని చేసి వదిలేశాడనుకోకూడదా మనం? మణిరత్నం మీద గౌరవంతో పాయింట్లు లాగవద్దను కుంటూనే లాగాల్సి వస్తోంది. 

          మణి సర్ అసలేం చేస్తున్నారో అర్ధమే  గాదు. వెనక పేజీల్లో ఏం రాసుకుంటే ఏం అర్ధాలొ స్తున్నాయో చూసుకోకుండా,  సెల్ఫ్ డ్యామేజింగ్ గా రాసుకుంటూ పోయినట్టు కన్పిస్తుంది. ఇంకో చోట, పెళ్లి అని చెప్పి హీరోయిన్ని రిజిస్ట్రార్ ఆఫీసుకి తీసికెళ్ళి, ఎంతో ‘కౌన్సెలింగ్’ చేసి ఒప్పిస్తాడు హీరో.  తీరా టైం  అయిపోయిందని, రేపు వద్దామని వెళ్ళిపోతాడు. మర్నాడు ఆమె రిజిస్ట్రార్ ఆఫీసుకొచ్చి ఎదురు చూసి చూసి వెళ్ళిపోతుంది. తర్వాత ఎన్ని రోజులకో వచ్చి,  అనుకోకుండా ఢిల్లీ వెళ్ళానంటాడు! ఇలాటి వాణ్ణి ఎలా నమ్ముతుందో విద్యాధికురాలైన హీరోయిన్ అర్ధం గాదు. ఈ పాత్రల్లో పైలట్ కన్పించడు, లేడీ డాక్టర్ కన్పించదు. కాలేజీ ప్రేమల టెంప్లెట్ పాత్రలే కన్పిస్తాయి. వీళ్ళ  తగాదాలు, అలకల సీన్లూ చూస్తూంటే ఇరాన్ బాలల సినిమాలే గుర్తుకొస్తూంటాయి. మణి రత్నమే ఇలా చేస్తే, రేపింకో కొత్త దర్శకుడూ దీన్నే ఫాలోయి వీరాధి వీరుడుగా మన౦ ప్రాణాలు తీయడా? ఇది గుర్తిస్తే బావుంటుందేమో మణిరత్నం. 

        శ్రీనగర్, లేహ్, లడక్ ఒరిజినల్ లొకేషన్స్ తో బాటు, బెల్ గ్రేడ్ లో చీట్ చేసిన లొకేషన్స్  ఒక బలమైన విజువల్ పవర్ నిస్తాయి సినిమాకి. మరోసారి మణిరత్నం పంచభూతాల్ని ప్రేమ కథకి సాక్ష్యం చేశారు. వొళ్ళు గగుర్పొడిచే ఎత్తైన లేహ్ పర్వత శ్రేణుల్లో  మంచు తూఫానులో ప్రేమికుల సంఘర్షణ ఒక దృశ్య కావ్యం లాంటి అద్భుత సీను.  ఇంకా సందర్భాన్నిబట్టి  వర్షాన్నీ, మండే సూర్యుణ్ణీ, హోరు గాలినీ, నీలాకాశాన్నీ సాక్ష్యంగా చేసి ప్రేమ కథ చెప్పారు. ఈ ప్రేమ కథలోనే దమ్ములేదు. 

          పాకిస్థాన్, ఆఫ్ఘనిస్థాన్  లొకేషన్స్ నీ, అక్కడి మిలిటరీ, పోలీసు పాత్రల్నీ అద్భుతమైన నేటివిటీతో చిత్రీకరించారు. క్లయిమాక్స్ లో హీరో తప్పించుకునే యాక్షన్ దృశ్యాలూ బ్రహ్మాండం. ప్రతీ దృశ్యాన్నీ ఛాయాగ్రాహకుడు రవి వర్మన్ ఒక పెయింటింగ్ లా సృష్టించాడు. అయితే తన కష్టానికి తగ్గ ప్రేమ కథే లేకపోయింది...

           ఏఆర్ రెహ్మాన్ కూడా క్యాచీ ట్యూన్స్ ఇవ్వడానికి ఏమీ ప్రయత్నించలేదు. సీరియస్ రోమాంటిక్ డ్రామా ఆ తీరు పాటలనే ఇచ్చేలా చేసింది.

చివరికేమిటి? 
      ఇది రోమాంటిక్ డ్రామా అంటున్నాం గానీ, రోమాంటిక్ డ్రామాకాదు, అలాగని రో మాంటిక్ కామెడీ కాదు. రెండూ కలిపేసిన మిశ్రమం. జానర్ మర్యాద పాటింపు లేదు.  రోమాంటిక్ డ్రామాకి ప్రేమికుల మధ్య సమస్య బాహ్య శక్తులు, లేదా బాహ్య పరిస్థితుల్లోంచి వస్తుంది. ‘సన్ ఫ్లవర్’ రోమాంటిక్ డ్రామాలో యుద్ధమనే బాహ్య పరిస్థితి విడదీస్తుంది భార్యాభర్తల్ని. అంతే గానీ వాళ్ళు తగాదాలాడుకుని విడిపోరు. మణిరత్నం సినిమాలో తగాదాలాడుకునే విడిపోయారు. ప్రేమికులు తగాదాలాడుకుని విడిపోవడం రోమాంటిక్ కామెడీ లక్షణం. రోమాంటిక్  కామెడీల్లో బాహ్య శక్తులు, బాహ్య పరిస్థితులు ప్రేమికులని విడదీయవు. ప్రేమికులే  పరస్పర ప్రత్యర్ధులుగా, విరోధులుగా వుంటారు. నువ్వా నేనా అన్నట్టు సిగపట్లు పట్టుకుంటారు. ఏ వొక్కరూ పాసివ్ కారు. ఇద్దరూ యాక్టివ్ పాత్రలుగానే వుంటారు. అయితే కార్గిల్ యుద్ధం లాంటి  నేపధ్యంలో రోమాంటిక్ కామెడీ  తమాషా కష్టమే. యుద్ధ నేపధ్యంలో గొప్ప సినిమాలన్నీ సీరియస్ రోమాంటిక్ డ్రామాలుగానే వున్నాయి. అద్భుతమైన విజువల్ పవర్ తో మణిరత్నం సినిమాకి అంత బలమైన యుద్ధ నేపధ్యం వున్నాక,  ఈ రోజుల్లో కూడా ఎమోషనల్ గా రోమాంటిక్ డ్రామాతో కట్టి పడేయవచ్చు. మణిరత్నం రెండు జానర్స్ నీ కలిపేయడం వల్ల ఎటూ కాకుండా పోయింది. 

          నిజానికి తను గర్భవతి అయి హీరో వర్కౌట్ కాదని వెళ్ళిపోయాక ఏర్ బేస్ కి వెళ్తుంది హీరోయిన్. ఎంత మిలిటరీ డాక్టర్ అయినా టూవీలర్ మీద రన్ వే  దాకా ఎలా వెళ్ళిపోతుందో తెలీదు.  అప్పుడు ఒకదాని తర్వాత ఒకటి యుద్ధ విమానాలు భీకరంగా బయలుదేరుతూంటాయి. అంటే కార్గిల్ యుద్ధం మొదలయ్యిందని మనకి తెలుస్తూనే వుంటుంది. కానీ అక్కడ హీరో హీరోయిన్లు ఈ విషయమే పట్టకుండా తగాదా పడతారు. అక్కడున్న పరిస్థితుల నేపధ్యంలోంచి వాళ్ళ మాటలే రావు. ఎట్టి  పరిస్థితుల్లోనూ దర్శకుడు బ్యాక్ డ్రాప్ తో ప్రేమ కథకి స్పర్శ లేకుండా చేస్తున్నాడన్న  మాట. 

        ఆ విమానాలేంటి అలా ఎగురుతున్నాయని హీరోయిన్ అడగదు, నేనిప్పుడు యుద్ధానికి వెళ్తున్నాను-  తర్వాత మాట్లాడకుందామని హీరో కూడా  అనడు.  ఇలా అనుకుంటే కథ పాత్రలు అనుకున్నట్టు సాగుతుంది. కానీ మణిరత్నం తాను  అనుకున్నట్టుగా సాగాలనుకున్నారు రాంగ్ రూటులో. ఇప్పుడైనా పాత్రలు గనుక బ్యాక్ డ్రాప్ లో విషయాన్నీ పట్టించుకుని మాట్లాడుకుంటే, ఈ సమయంలో  దేశం కన్నా ప్రేమలు ఎక్కువ కావనుకుం టాయి. కానీ దేశంకన్నా ప్రేమే ముఖ్యమన్నట్టు తగాదాలాడుకుని మణిరత్నం చేతిలో దిగజారిపోయాయి!

          ఈ మొత్తం ప్రేమ కథని మణిరత్నం అనేక ఫ్లాష్ బ్యాకులతో చెప్పారు. ఈ ఫ్లాష్ బ్యాకులు ఒకరి దృక్కోణంలో వుండవు. ఒక తడవ పాక్ జైల్లో వున్న హీరో దృక్కోణంలో, ఇంకో తడవ శ్రీనగర్ లో వున్న హీరోయిన్ దృక్కోణంలో వస్తూంటాయి. ఈ ఫ్లాష్ బ్యాకులన్నీ మూడేళ్ళ క్రితానికి సంబంధించినవి. ఒకరి ఫ్లాష్ బ్యాక్, ఇంకొకరి ఫ్లాష్ బ్యాక్, మధ్యమధ్యలో ప్రెజెంట్ లో ఇద్దరి పరిస్థితీ- ఇవన్నీ వున్న ఈ కాస్తా  ప్రేమకథని కూడా ఏకధాటిగా చూడనివ్వకుండా చేశాయి. మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులనేవి టీవీలో ఒక ఇంటరెస్టింగ్ ప్రోగ్రాం చూస్తూంటే ఉన్నట్టుండి వచ్చే యాడ్స్ లాంటి చీకాకు పెట్టే వ్యవహారం. కథలో దమ్ములేనప్పుడే, దాన్ని కప్పి పుచ్చడానికే,  ఫ్లాష్ బ్యాకులతో హంగామా చేస్తారని  అంటాడు సిడ్  ఫీల్డ్. మణిరత్నం కథలో ఎ పాటి దమ్ముందో చూశాం. 

          ఇక హీరో దృక్కోణంలో ఫ్లాష్ బ్యాకుల పరంపరకి తెర తీసే ముందు,  దేన్ని రిఫరెన్స్ పాయింటుగా పెట్టుకుని ప్రారంభించాలి? ఒక ప్రేమికుడు ప్రేమికురాలితో గొడవపడి వెళ్ళిపోయి-  యుద్ధ ఖైదీగా వేరే దేశంలో బందీ అయ్యాక - అతడి స్మృతి  పథంలో మొట్ట మొదట ఏది  మెదలుతుంది? ప్రేమికురాలితో గొడవ పడ్డ ఘట్టమేనా? ఆమె గర్భవతి కూడా అయివున్న నేపధ్యంలో ఇప్పుడామె ఏమై పోతుందన్న ఆందోళనకూడా తోడయిన రిఫరెన్స్ పాయింటేనా? లేక ఈ ఫీలింగే లేకుండా హేపీగా కవిత్వం వల్లిస్తూ,  ఆమె తో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ ఎలా జరిగిందో హేపీగా ఫ్లాష్ బ్యాకులు ప్రారంభించుకోవడమా?  ఏది రిఫరెన్స్ పాయింటు? ముందు వియోగ బాధ అనుభవించి,  ఇప్పుడు తను చేసేది లేక క్రమక్రమంగా ఆమెతో మధుర స్మృతులతో గడపడం అనే మానసిక స్థితి వస్తుంది. మైండ్ అలా వర్క్ చేస్తుంది. ఇలా లేనప్పుడు కథ ఫ్లాట్ అయిపోతుంది. ఆనంద  విషాదాలతో కూడిన ద్వంద్వాల  పోషణతోనే కథకి డెప్త్ వస్తుంది. ‘మై మేరీ పత్నీఔర్ వోహ్’  అనే హిట్ లో రాజ్ పల్ యాదవ్ తన ట్రాజిక్ పరిస్థితిని మర్చిపోవడానికి,  నానా కామెడీ వేషాలతో ద్వంద్వాల పోషణ అద్భుతంగా చేసి సజీవపాత్రని  స్థాపిస్తాడు. 

      మల్టీపుల్ ఫ్లాష్ బ్యాకులతో ఇంకో నష్టం ఏమిటంటే స్ట్రక్చర్ చెదిరిపోతుంది. ఎప్పుడో ముప్పావు గంటలో రావాల్సిన కథలో పాయింటు రెండు గంటల తర్వాత వస్తుంది. పాయింటు ఎప్పుడు వస్తే అప్పుడు కథ ప్రారంభమైనట్టు. మణిరత్నం కథలో ఫ్లాష్ బ్యాకుల వల్ల స్ట్రక్చర్ చెదిరిపోయి దాదాపు రెండు గంటలకి ( యుద్ధ నేపధ్యంలో ఏర్ బేస్ లో పైన చెప్పుకున్న హీరో హీరోయిన్ల గొడవ) పాయింటు ఎస్టాబ్లిష్ అయి అప్పుడు కథ ప్రారంభమవుతుంది. దాంతో ఇది మిడిల్ మటాష్ స్క్రీన్ ప్లే కింద జమ అయ్యింది. ఇందుకే ఈ కథ సహన పరీక్ష అయిపోయింది.  కథకి వెన్నెముక లాంటి మిడిల్ విభాగమే లేకపోయాక, ఏర్ ఫోర్స్-మిలిటరీ, కార్గిల్ యుద్ధం లాంటి ఎంతబలమైన బ్యాక్ డ్రాప్ వుండీ ఏం లాభం? 

          మణిరత్నం కెరీర్ లోనే భారీ బడ్జెట్ తో తీసిన ఈ ‘చెలియా’ కి బాక్సాఫీసు చెల్లింపులు చేసిన పొరపాట్ల వల్ల చేతికి రాకుండా పోవడమే జరుగుతుంది.


-సికిందర్