రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

17, సెప్టెంబర్ 2016, శనివారం

రుస్తుం సంగతులు- 3






రుస్తుం ది ఒకే  అర్ధవంతమైన పెద్ద కథ కాదనీ,  రెండు అసమగ్ర  కథల కథావళీ అనీ గత రెండు వ్యాసాల్లో గుర్తించాం. ఒకటి భార్య ద్రోహ కథ ఫస్టాఫ్ లో- రెండు భర్త దేశభక్తి కథ సెకండాఫ్ లో. భార్య ద్రోహ కథగా మొదలై  భర్త దేశభక్తి కథగా మారిపోయేలాటి  డబుల్ సిమ్ సినిమా ఇది. సెకండాఫ్ సిండ్రోమ్ అంటారు ఈ వ్యాధిని. ఫస్టాఫ్ లో డెంగ్యూ దోమ కుడితే సెకండాఫ్ లో చికెన్ గున్యా దోమ కుట్టినట్టు వుంటుంది మనకి. అంతే గానీ  పరిశుభ్రమైన చికెన్ బిర్యానీ లాంటి డిష్ పెట్టాలనుకోరు మనకి. హిందీలో తక్కువేగానీ తెలుగులో ఈ మోజు ఎక్కువే వుంది- ధమ్, దొంగోడు, జ్యోతో లక్ష్మి, సైజ్ జీరో,  జనతా గ్యారేజ్, జ్యో అచ్యుతానంద- లాంటివి ఎన్నో వచ్చాయి, ఇంకా వస్తాయి. ‘రుస్తుం’ ఫస్టాఫ్ లో భార్య ద్రోహ కథైనా ఎంత అసహజంగా వుందో గత వ్యాసంలో చూశాక, ఇక సెకండాఫ్ లో సాగే భర్త దేశభక్తి కథ కూడా ఇంకెంత అసహజంగా వుంటుందో ఇప్పుడు చూద్దాం...
          హీరోని గొప్ప దేశభక్తుడిగా తేల్చడానికి  నేవీ స్కామ్ అనే ఒకదాన్ని సృష్టించారు. బ్రిటన్ లో  ఒక యుద్ధ నౌక అమ్మకానికొస్తుంది. దాన్ని కొనుగోలు చేయాలనీ నావికా దళం నిర్ణయిస్తుంది.  ఇన్స్ పెక్షన్ అధికారిగా రుస్తుం వెళ్లి పరిశీలిస్తాడు. అది కాలం చెల్లిన యుద్ధ నౌకలా వుందని అన్ ఫిట్ సర్టిఫికేట్ ఇస్తానంటాడు.  కాదు పాజిటివ్ రిపోర్టు ఇవ్వాలని నేవీ అధికారులు ఒత్తిడి చేస్తారు. బాగా డబ్బు కూడా ఇస్తామంటారు. ఈ అవినీతినికి ఒప్పుకోడు రుస్తుం. దీన్నాపాలని  నిర్ణయించుకుంటాడు. ఈ నేవీ అధికారుల వెనుక విక్రం (రుస్తుం భార్య ప్రియుడు) వున్నాడని కూడా తెలుసుకుంటాడు. నేవీ అధికారులకీ రుస్తుం కీ మధ్య ఈ సమస్య నలుగుతూ వుంటుంది. రుస్తుం డిఫెన్స్ సెక్రెటరీ దృష్టికి కూడా తీసుకుపోతే అతనూ ఈ స్కామ్  లో భాగస్థుడేనని అర్ధమౌతుంది. ఇక రుస్తుం ఒక ఆలోచన చేసి వాళ్ళు చేస్తున్న స్కామ్ తాలూకు పత్రాలు తన దగ్గరున్నాయనీ,  వాటిని బయట పెడతాననీ బెదిరిస్తాడు. 

        బ్యాక్ గ్రౌండ్ లో ఈ కథ నడుస్తూండగానే  తన భార్య- విక్రంల ఎఫైర్ తెలుస్తుంది రుస్తుం కి (ఈ ఎఫైర్ తెలియడమే స్క్రీన్ ప్లేకి  ప్రారంభం). అప్పుడు విక్రం ని చంపడానికి వెళ్తూ రుస్తుం మధ్యలో పోస్టాఫీసు కెళ్ళి డిఫెన్స్ సెక్రెటరీకి ట్రంక్ కాల్ చేసి వాదన పెట్టుకుంటాడు. ఇప్పుడు విక్రం ని వదలనని అనేస్తాడు. వెళ్లి విక్రం ని కాల్చి చంపేస్తాడు. 

        ఇదీ హత్య వరకూ జరిగిన స్కామ్ పూర్వ కథ. దీని తర్వాత కోర్టులో ఇదెలా తేలిందో చూద్దాం : విక్రం ని చంపి పోలీసులకి లొంగిపోతాడు రుస్తుం. నిజ కథలో అయితే నానావతి ప్రోటోకాల్ ప్రకారం నేవీ అధికారులకే లొంగిపోతాడు. నేవీ అధికారులు బొంబాయి పోలీసులకి అప్పగిస్తారు ఫార్మాలిటీస్ పూర్తిచేసి. అయితే ఇక్కడ కోర్టులో కూడా రుస్తుం వచ్చి అడుగుతున్న నేవీ అధికారుల కస్టడీకి వెళ్ళననీ, పోలీస్ కస్టడీలోనే ఉంటాననీ వాదిస్తాడు. ఎందుకిలా అంటున్నాడో మనకి అర్ధం కాదు. కథ చివర్లో నేవీ స్కామ్ ని రివీల్ చేసినప్పుడు అర్ధమవుతుంది- నేవీ అధికారులు తన విరోధులు కాబట్టి, వాళ్ళల్లో ఒకడైన విక్రంని తను చంపాడు కాబట్టి,  వాళ్ళ కస్టడీకి వెళ్ళ ననడాన్ని అర్ధం జేసుకోవచ్చు.       కానీ ఎవరి కస్టడీలో ఉండాలో నిందితుడికి కోర్టు ఛాయిస్ నిస్తుందా- కోర్టుదే నిర్ణయమవుతుంది గాని? ఇదీ ప్రశ్న. పోనీ దర్శకుడు తన ఇష్టానుసారం కథ నడుపుకోవడం కోసం కోర్టు కాస్త లైట్ తీసుకుని  పోలీస్ కస్టడీకే ఇచ్చిందనుకుందాం- అప్పుడా పోలీసులైనా ఒక నిందితుడుగా వున్న  రుస్తుంని కస్టడీలోకి తీసుకున్నాక,  ఇంకా అతణ్ణి నేవీ యూనిఫాంలోనే అనుమతించరు కదా? మళ్ళీ ఆ యూనిఫాంలోనే  జడ్జీ ఎదురుగా హాజరు పర్చరు కదా? నేవీలో అతను సస్పెండ్ అయ్యాక యూనిఫాం వేసుకునే అధికారమే వుండదు కదా- మెడల్స్ తో సహా అన్నీ సరెండర్ చేయాల్సిందే కదా? 
          సరే, పోలీసులు కూడా దర్శకుడి హంగామా చూసి రూల్స్ ని కాస్త  లైట్ గానే తీసుకున్నారే అనుకుందాం- అతణ్ణి జ్యుడీషియల్  కస్టడీకి జైలుకి తరలించినప్పుడైనా  జైలు మాన్యువల్ ప్రకారం ఖైదీ దుస్తుల్లోకి అతను మారిపోవాల్సిందే కదా? మళ్ళీ జైలు అధికారులు కూడా దర్శకుడి తడాఖాకి తట్టుకోలేక సరేలేరా బాబూ నీ కథ కోసం, హీరోగార్ని నేవీ డ్రెస్ లోనే  రిచ్ గా, గ్రాండ్ గా ప్రతీ ఫ్రేములో చూపించడం కోసం – డ్రస్సు వుంచుకోఫో- అనేసి  మరీ లైట్ గా తీసుకున్నారే అనుకుందాం- మరి హత్య చేసిన హీరో ఆ డ్రెస్ తీయకుండా ఎలాటి సంకేతాలు ఇస్తున్నట్టు  తన పాత్రపరంగా? - నేను దేశాన్ని రక్షించే నేవీ ఆఫీసర్ని, నన్ను మీరు చట్టాలకి అతీతుడుగా, ప్రత్యేకంగా చూడాలి, ఆమేరకు తీర్పు ఇవ్వాలి సుమా - అని కోర్టుని బెదిరిస్తున్నట్టు లేదూ పాత్ర?  ఎన్నిసార్లు ఎక్కడెక్కడ ఎలా ఈ డ్రెస్ లాజిక్ ని ఎగేసినా, అంతిమంగా పాత్ర చిత్రణనే  దెబ్బతీసింది కదా, ఈ యూనీఫాం ధారణ? లాజిక్ ని చూడొద్దు, సినిమాని సినిమాలాగే చూడాలన్న వితండ వాదన చేస్తే  ఇలాగే నాన్సెన్స్ గా తయారవచ్చు పాత్రలు!

          ఇక సొంతంగా కేసు వాదించుకునే విషయం. ఇది కోర్టులు అనుమతించేదే (pro se legal representation).  ఐతే నానావతి తన కేసు తాను వాదించుకోలేదు.  ‘యే రాస్తే హై ప్యార్ కే’ లో నిందితుడైన సునీల్ దత్ కూడా తన కేసు వాదించుకోడు. అతడి తరపున లాయర్ పాత్రలో అశోక్ కుమార్ వాదిస్తాడు. సునీల్ దత్, అశోక్ కుమార్ వీళ్ళంతా ఆరోజుల్లో స్టార్స్. కాబట్టి ఒక స్టార్ నిందితుడి స్థానంలో పాసివ్ గా వున్నా, రెండో స్టార్ కేసు వాదిస్తూ యాక్టివ్ గా ఉండడంతో బాక్సాఫీసు లెక్క భర్తీ అయింది. కానీ ‘రుస్తుం’ లో ఫస్టాఫ్ లో హత్య చేసిన దగ్గర్నుంచీ పోలీసుల బందీగా ఏమీ చేయక పాసివ్ గా వుండిపోయే అక్షయ్  కుమార్ లాంటి స్టార్,  ఇక యాక్టివ్ అవకపోతే సినిమా లేదు. లాయర్ గా ఇంకో స్టార్ ని  తెచ్చిపెట్టాలనుకోలేదు. అందుకని సెకండాఫ్ లో కోర్టు విచారణలో అక్షయ్ ని యాక్టివేట్ చేసినట్టుంది- అందుకే తన కేసు తను వాదించుకునే పాయింటు తెరపైకొచ్చిందని అర్ధం జేసుకోవాలి. 


        సరే, రుస్తుం యాక్టివ్ పాత్ర అయ్యాడు. కేసు విచారణ రుస్తుం భార్యతో విక్రం శారీరక సంబంధం కారణంగా హత్య అనే కోణంలోనే సాగుతూండగా, రుస్తుం ఇంట్లో దుండగుల సోదాతో నేవీ స్కామ్ కోణం మళ్ళీ తెరపైకొస్తుంది. రుస్తుం భార్య జైలుకొచ్చి దుండగుల గురించి  రుస్తుంకి చెప్తే, అది ముఖ్యమైన పత్రాల కోసం నేవీ అధికారులు చేసిన కుట్ర అని చెప్పి, వాళ్లకి ఒక డిమాండ్ పెట్టమని కవర్ అందిస్తాడు. అందులో స్విస్ బ్యాంక్ ఎక్కౌంట్ వివరాలుంటాయి.


      ఇప్పుడు ప్రశ్న: రుస్తుం స్విస్ బ్యాంక్ ఎక్కౌంట్ ఎప్పుడు  ఓపెన్ చేశాడు? విక్రం ని చంపడానికి వెళ్తూ పోస్టాఫీసుకి వెళ్లి డిఫెన్స్ సెక్రెటరీతో  ట్రంకాల్ మాటాడినప్పుడే ఎక్కౌంట్ ఓపెన్ చేశాడని విచారణలో తేలుతుంది. అంటే అతను స్విస్ బ్యాంకు అధికార్లతో ఫోన్లో మాట్లాడేసి, ఎకౌంట్ ఓపెన్ చేయించుకుని, అప్పటికప్పుడే ఎక్కౌంట్ నంబర్ కూడా పొందేశాడా- ఇది సాధ్యమా?


        ఆ ఎక్కౌంట్ నంబర్ వున్న కవరు కూడా ఇంకా జేబులోనే పెట్టుకు తిరుగుతున్నాడా? పోలీసులుగానీ, జైలు అధికారులుగానీ స్వాధీనం చేసుకోలేదా?
        ఇక రుస్తుం భార్య వెళ్లి నేవీ అధికారులకి ఆ పత్రాలు కావాలంటే ఐదు కోట్లు ఇవ్వాలని బేరం పెడుతుంది. 1959 లో ఐదు కోట్లు అంటే మామూలు విషయం కాదు. ఆ రోజుల్లో లక్షాధికారులే వుండేవాళ్ళు గానీ కోటీశ్వరుల సంఖ్య తక్కువే. అన్ని కోట్లు ఆ రోజుల్లో నేవీ అధికారులైనా ఎక్కడ్నించి తెచ్చిస్తారో. లక్షల్లో బేరం పెడితే ఇప్పటి ప్రేక్షకులు నవ్వుతారని బిల్డప్ కోసం ఐదుకోట్లు పెట్టారేమో. బాక్సాఫీసు తూకం బాగానే సరిచూసుకుంటున్నారు. ఆ ఐదు కోట్లూ స్విస్ ఎక్కౌంట్ లో వేసేందుకు ఒప్పందం కుదురుతుంది. 


        ఇప్పుడు డిఫెన్స్ సెక్రెటరీతో వ్యవహారం చూద్దాం : కేసు విచారిస్తున్న పోలీసు అధికారి డిఫెన్స్ సెక్రెటరీకి రుస్తుం ట్రంక్ కాల్ చేసిన మాటాడిన ఎవిడెన్స్ కోసం ఢిల్లీ వెళ్లి డిఫెన్స్ సెక్రెటరీని కలుస్తాడు. అప్పుడు డిఫెన్స్ సెక్రెటరీ తన కొచ్చే కాల్స్ అన్నిటినీ రికార్డు చేస్తానని చెప్పి- రుస్తుం కాల్ చేసి మాటాడి నప్పటి ఆడియో టేపు విన్పిస్తాడు. ‘విక్రం ని వదలను’ అన్న మాటలున్న ఆ టేప్ తెచ్చి కోర్టులో పెడతాడు పోలీసు అధికారి. దాంతో కేసు ఓడిపోతాడు రుస్తుం. ఆత్మ రక్షణ కోసం తను హత్య చేయలేదనీ, హత్య చేయాలని ముందు నిర్ణయించుకునే విక్రం దగ్గరి కెళ్ళి చంపాడనీ  రుజువైన దరిమిలా జ్యూరీ ఇక తీర్పు కి సిద్ధమౌతుంది. 


       ఇక్కడ ప్రశ్నలు : డిఫెన్స్ సెక్రెటరీ రుస్తుం మాటల్ని కూడా రికార్డు చేయడం తన డెత్ వారంట్ ని తను రాసుకోవడం కాదా? ఎవడైనా స్కామ్  చేస్తున్న వాడు అలా రికార్డు చేసి దగ్గర వుంచుకుంటాడా అలాటి మాటలు-  అది కూడా అధికారికంగా తన సొంత కార్యాలయంలో? రుస్తుంని పట్టించే ‘విక్రం ని వదలను’  అన్న మాటలున్న మేరకే టేపుని కత్తిరించి కోర్టులో పెట్టినంత మాత్రాన- రుస్తుం కేసు ఓడిపోతాడా? అసలు డిఫెన్స్ సెక్రెటరీకి రుస్తుం భార్య - విక్రంల  శారీరక సంబంధంతో సంబంధమేంటయ్యా బాబూ చెప్పూ- అని కోర్టు అడగదా?  నా భార్యతో సంబంధం పెట్టుకున్నాడు కాబట్టి - విక్రం ని వదలనని రుస్తుం ఎక్కడో డిఫెన్స్ సెక్రెటరీకి కాల్ చేసి ఎందుకు చెప్తాడయ్యా స్వామీ- అని కోర్టు నిలదీయదా? అసలీ ‘విక్రం ని వదలను’ అన్న మాటకి ముందు- మాటకి తర్వాత  వాళ్ళిద్దరేం మాటాడుకున్నారో పూర్తి సంభాషణతో టేపు కోర్టుకి సమర్పిస్తావా, లేకపోతే ఇలాగే ఈ ముక్క పట్టుకుని నకరాలు చేస్తావా?- అని కోర్టు మొట్టికాయ వేయదా?

        అప్పుడు పూర్తి టేపు కోర్టుకి సమర్పించాల్సి వస్తే డిఫెన్స్ అయ్యగారి పనేమౌతుందో?! ఇలా వుంది కథా రచన! సినిమాల్లోనే ఇలాటి భయంకర కథా రచనలుంటాయి- అవి చెల్లిపోతాయి- సినిమాల్ని కళ్ళతో చూస్తారు కాబట్టి. సాహిత్యంలో ఇలాటి భయంకర కథా రచనలు చెల్లవు- మెదడుతో చదువుతారు కాబట్టి. 


        కోర్టు అడగకపోతే అడగకపోయింది- గెలుస్తానన్నట్టు అంత ఫోజుపెట్టి కేసు వాదించుకున్న రుస్తుం కూడా ఈ టేపు ముక్క చెల్లదని  అనడు. ఎందుకంటే స్కామ్   బయట పడుతుందని అట!
        తర్వాత జైల్లో అదే పోలీసు అధికారికి స్కామ్ గురించి మొత్తం చెప్పేస్తాడు- మరి దీన్ని బయట పెట్టి కేసునుంచి విడుదల కావొచ్చుగా? –అని అధికారి అంటే- స్కామ్ బయట పెడితే దేశానికి చెడ్డ పేరొస్తుందని అంటాడు రుస్తుం!
        దేశానికి చెడ్డ పేరొస్తుందని స్కాములు చేసుకునే వాళ్ళని చేసుకోనిస్తూ అలాగే వుండనిస్తా డన్నమాట!


        దీనికి ‘నువ్వు చాలా గొప్ప దేశభక్తుడివి’ – అని మెచ్చుకుంటాడు పోలీసు అధికారి. ‘అయితే స్కామ్ చేస్తున్నాడని విక్రంని దేశభక్తితో చంపావన్న మాట- నీ భార్యతో సంబంధం పెట్టుకున్నందుకు పత్నీ భక్తితో కాదన్న మాట?’ అని మాత్రం అడగడు. అడిగితే ఇరకాటంలో పడతానని దర్శకుడు అడగనిచ్చి వుండడు. 


        కానీ ఒకటి అడిగేస్తాడు పోలీసు అధికారి- ‘ఐదు కోట్లు తీసుకుని స్కామ్ పత్రాలు నేవీ వాళ్లకి ఇచ్చేశావా?’- అని. అప్పుడు  రుస్తుం కొంటెగా నవ్వి- ‘అసలా పత్రాలుంటేగా- వూరికే బుకాయించా’ అంటాడు!


        మరి స్విస్ బ్యాంకు ఎక్కౌంట్లో ఐదు కోట్ల సంగతి అడగాలిగా అధికారి? అదికూడా అడగడు- అడిగితే దర్శకుడు చాలా కన్ఫ్యూజ్ అయిపోతాడని వదిలేసినట్టున్నాడు. 
ఇలా తలతిక్కగా వుంటుంది కథానిర్వహణ! 


        ఇన్ని లోపాలు ఎత్తి చూపిస్తూంటే ఇది చదువుతున్న వాళ్లకి కోపాలు రావొచ్చు. ఇన్ని లోపాలే ఒక దర్శకుడో, రచయితో వెళ్లి హీరోకో, నిర్మాతకో కథ వినిపిస్తే వాళ్ళ అవగాహన కొద్దీ ఎత్తి చూపి- మార్చి రాసుకు రమ్మంటారు. మార్చి మార్చి మళ్ళీ మళ్ళీ  రాయిస్తూంటారు. ఆ టార్చర్ నంతా భరిస్తూ అప్పుడు రాని కోపాలు, ఇప్పుడెందుకు రావాలి?


       ‘రుస్తుం’ లో ఇదంతా కాదు- దేశానికి చెడ్డ పేరొస్తుందని హీరో స్కామ్ ని బయట పెట్టక పోవడం పెద్ద నేరం కాకపోవచ్చు దర్శకుడి దృష్టిలో. కానీ దర్శకుడు పాల్పడ్డ అసలు నేరం వేరే వుంది- దేశానికీ, ఆనాటి నావికా దళానికీ చెడ్డ పేరొచ్చేలా రాసుకున్న ఈ కథతో.          ఈ కథాకాలం 1959 అంటే, దేశానికి స్వాతంత్ర్యం వచ్చి పట్టుమని పదిహేనేళ్ళు పూర్తికాలేదు. అప్పట్లో ఏ నాయకులకి కూడా దేశాన్ని దోచేసుకుందామన్న అవినీతి బుద్ధుల్లేవు. కొత్త దేశం, కొత్త బాధ్యతలు, భయభక్తులు -ఇవే వుండేవి.  అందులోనూ రక్షణ శాఖలో స్కామ్ అప్పట్లో వూహకే అందనిది. నిజమే, 1948 లో ఒక ఉదంతం జరిగింది. జీపుల కుంభకోణం. ఇంగ్లాండ్ నుంచి 80 లక్షలకి రెండు వందల జీపుల్ని రక్షణ శాఖ కొనుగోలు చేస్తే 155 మాత్రమే వచ్చాయి. అప్పటి ఇంగ్లాండ్  హై కమీషనర్ వీకే కృష్ణ మీనన్ ఈ  ఉదంతంలో ఇరుక్కున్నారు. తర్వాత జీపుల లెక్క క్లియర్ చేశారు. దీన్ని స్కామ్ అని కూడా అనలేం- రక్షణ శాఖలో మొట్ట మొదటి స్కామ్ చేసేందుకు సాహసించింది – స్వాతంత్య్రం వచ్చిన 40 ఏళ్ళకి-  1987లో-  బోఫోర్స్ తుపాకులతో మాత్రమే,  అంతే!


        కానీ ‘రుస్తుం’ దర్శకుడు ఈ కథలో  1959 లోనే రక్షణ శాఖలో స్కామ్ ని సృష్టించినప్పుడు అప్పుడప్పుడే పుట్టిన దేశ ప్రతిష్టకి, నావికాదళ గౌరవానికీ భంగంకల్గిస్తున్నా నన్న స్పృహతో లేడు! అప్పట్లో నేవీ అధికారులు అవినీతి పరులని చూపడం చాలా దుర్మార్గమని కూడా గ్రహించలేదు!



 (ఇంకా వుంది)


-సికిందర్  

16, సెప్టెంబర్ 2016, శుక్రవారం

రివ్యూ!






రచన- దర్శకత్వం : జి. నాగ కోటేశ్వర రావు

తారాగణం : రోషన్, శ్రియ శర్మ, నాగార్జున, ఎల్బీ శ్రీరాం, తాగుబోతు రమేష్,  రోషన్ కనకాల తదితరులు
సంగీతం: రోషన్ సాలూరి,  ఛాయాగ్రహణం : ఎస్వీ విశ్వేశ్వర్
బ్యానర్ : అన్నపూర్ణా స్టూడియోస్, మాట్రిక్స్ టీమ్ వర్క్స్
నిర్మాతలు : నాగార్జున, నిమ్మగడ్డ ప్రసాద్
విడుదల : 16 సెప్టెంబర్, 2016
  
***

హీరో శ్రీకాంత్ కుమారుడు రోషన్ ని టీనేజి హీరోగా పరిచయం చేస్తూ అక్కినేని నాగార్జున- నిమ్మగడ్డ ప్రసాద్ లు సంయుక్తంగా నిర్మించిన ‘నిర్మలా కాన్వెంట్’ అనే ఈ కొత్త సినిమాలో  రోషన్ పేరుతో ఇంకో ఇద్దరు పరిచయమయ్యారు- సంగీతదర్శకుడు కోటి కుమారుడు సాలూరు రోషన్ సంగీత దర్శకుడిగా, రాజీవ్ కనకాల కొడుకు రోషన్ కనకాల ఓ సహాయ పాత్రగా. ఇంతమంది రోషన్ లు ఒకేసారి ఏదో సాధిద్దామని తెలుగు ప్రేక్షకుల ముందుకొచ్చేశారు.  అంతే కాదు నేనున్నానంటూ ఏఆర్  రెహమాన్  పుత్రరత్నం  అమీన్ కూడా గానం చేస్తూ తెలుగు శ్రోతలకి పరిచయమయ్యాడు. ఈ నవ తరపు ప్రతినిధుల పేర్లు వింటేనే, అందులోనూ ‘నిర్మలా కాన్వెంట్’  అనే సింపుల్ టైటిల్ చూస్తేనే,  ఇదెంతో ఫ్రెష్ ఫీల్ తో యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ అయ్యుంటుందని మనబోటి అమాయకులకి అన్పిస్తుంది. తీరా వెళ్లి చూస్తే ఏమనిపిస్తుందో ఈ కింద చూద్దాం...

కథ!
      అనగనగా ఎస్. కోట దగ్గర ఓ భూపతి నగరంలో ఓ భూపతి రాజు గారి పట్టుమని పదహారేళ్ళ శాంతి (శ్రియా శర్మ) అనే కాన్వెంట్ స్కూలు బాలిక  నిశిరాత్రి వేళ విరహం తాళలేక, పిన్నికి చెప్పుకుని  స్నానం గట్రా చేసేసి, ప్రబంధనాయికలా ముస్తాబై, అభిసారికలా తన కలల రాకుమారుడి (రోషన్) రాక కోసం నిట్టూర్పులతో  శృంగారభరితంగా ఎదురు చూస్తూ ఫ్లాష్ బ్యాక్ వేసుకుంటుంది- తన బాలికోన్మత్త  ప్రణయ కావ్యం పూర్తిగా అర్ధమవ్వాలంటే మూడు తరాల వెనకనుంచీ చూసుకుంటూ రావాలట. తన తాతగారికి 99 ఎకరాల పొలముంది (ఇంతేనా! దీనికే రాజుగారూ ఆయనకో  రాజకోట లాంటి అంత పేద్ద భవనమా? ). ఈ 99 ఎకరాలకి నీరు పారాలంటే పైనున్న ఒక్క ఎకరం మీదుగా పారాలి. ఆ ఎకరం ఆసామి దళిత ఈరిగాడు (ఎల్బీ శ్రీరామ్) ఇందు కొప్పుకోడు. దీంతో కసక్ మని రాజుగారు జాతరలో  పొడిపిస్తే,  జివ్వు మని రక్తం చిమ్ముకుని  చచ్చిపోతాడు ఈరిగాడు.  చచ్చిపోతూ ఆ ఎకరం భూమీ  కొడుకు (సూర్య) చేతిలో పెట్టి అమ్మవద్దంటూ మాట తీసుకుంటాడు. రాజుగారి మీద తెగ కోపంతో ఈరిగాడి కొడుకు ఏకంగా మతమే మారిపోయి- డేవిడ్ గా అవతరిస్తాడు. ఆ ఎకరం సాగు చేస్తూ, చెప్పులు కుట్టుకుంటూ కొడుకు సామేల్ అలియాస్ సామ్ (రోషనే) ని కాన్వెంట్ స్కూల్లో చదివిస్తూంటాడు. ఇదే కాన్వెంట్ స్కూల్లో చదువుతున్న శాంతి, సామ్ ని పడేస్తానని పిల్ల మూకతో బెట్ కడుతుంది. స్కూల్ యూనిఫాంలో తిరిగే పిల్లవాడు సామ్ తనేం తీసిపోకుండా ఆమెకి ‘లవ్ లాంగ్వేజ్’ నేర్పుతానంటూ వెంటపడతాడు. సామ్ తోటి పిల్లలు కిలకిలా నవ్వుతూ సామ్ వెంట పోకిరోళ్ళ లా తిరుగుతూంటారు.

    లవ్ లాంగ్వేజ్  తర్వాత,  పిల్లవాడు సామ్ ఏ కిస్సు ఎక్కడ పెడితే దానికేం పేరుంటుందో అద్భుతమైన  కవిత్వ భాషలో వర్ణించి పాడుతూ శాంతికి వొళ్ళంతా మైకం తెప్పిస్తాడు. ఈ ముద్దుల తర్వాత వీడు ఇంకేం  నేర్పిస్తాడోనని ఒక తోటి పిల్ల కామెంట్ చేస్తే, నేనే వాడికి లైన్ వేసుకుంటా నని ఇంకో పోకిరీ స్కూలు పిల్ల పళ్లికిలిస్తుంది!

    ఈ మొత్తానికీ ఓ పిల్ల విలన్ ఉంటాడు- వీడు నేటికాలపు పిల్ల విలనే అయినా పాతకాలపు విలన్ లా,  లవ్ బర్డ్స్  అయిన సామేల్ - శాంతి ల ప్రేమ ఫోటోలు తీసి శాంతి తండ్రికి పంపించేసి చేతులు దులుపుకుంటాడు. అంతేగానీ  నేటికాలపు విలన్ లా ఆ ఫోటోలతో ఆ పిల్లనే  బ్లాక్ మెయిల్ చేసి లొంగ దీసుకోవాలనుకోడు! ఆ ఫోటోలు చూసి ఆ పిల్ల తండ్రి తనివిదీరా ఆమెకి దేహశుద్ధి చేసి స్కూలు మాన్పించేస్తాడు. అదిక కుయ్యోమంటూ ఇంట్లో పడుంటుంది చదువుమానేసి! ఈమె కున్న పిన్ని గారైతే ఎప్పుడో ఈమెకి నాగార్జున లాంటి మొగుడొస్తాడని, నాగార్జునెందుకు- అఖిల్ లాంటి మొగుడే  దొరుకుతాడనీ చాలా కబుర్లు చెప్పి,  మత్తెక్కించి, మదమెక్కిన మగువలా తయారుచేసి వుంచింది.

       ఇంకా అటువైపు ప్రబంధ నాయకుడైన పిల్ల సామ్ గారి కాళ్ళూ చేతులూ కూడా విరిచేసి హాస్పిటల్లో పడేస్తాడు పిల్లదాని తండ్రి.  స్కూలు చదువు కూడా దాటని   పిల్ల టీనేజి సామ్- ఆ పిల్లలేక పోతే బతక లేనంటాడు అమ్మ ఇచ్చిన పాయసం కూడా ముట్టుకోకుండా. వెళ్లి వెంటనే పెళ్లి సంబంధం మాట్లాడమంటాడు స్కూలు చెడ్డీ  సామ్!

    అలాగే తండ్రి డేవిడ్ వెళ్లి పెళ్లి సంబంధం మాట్లాడేస్తాడు! తన బడి కెళ్ళే  చిత్తకార్తె కొడుకు పెళ్లి కోసం ఏమైనా చేస్తానని  ఆ వివాదాస్పదమైన ఎకరం పొలం కూడా రాసిచ్చి పారేస్తాడు!  ఎంచక్కా ఆ ఎకరమూ వుంచుకుని,  ఇంకా బోల్డు డబ్బు సంపాదించుకురా ఫో- అని వెళ్ళగొడతాడు పిల్ల తండ్రి.

    దీంతో పిల్లోడు సామ్  అచ్చం – ప్రేమ కోసమై వలలో పడెనే పాపం పసివాడు- అనే టైపులో బ్యాక్ గ్రౌండ్ లో వచ్చే సాంగ్ తో,  బ్యాగు సర్దుకుని స్లమ్ డాగ్ లా ఎక్కడికో వెళ్లి పోతూంటాడు. వెళ్లి వెళ్లి  ఉమ్మడి రాజధాని హైదరాబాద్ లో అన్నపూర్ణా స్టూడియోస్ గేటు ముందు తేలతాడు.  నాగార్జునని కలవాలని పట్టుబట్టి కూర్చుంటాడు- సారీ- అండర్ డాగ్ లా నించుంటాడు రోజంతా!

    ఇలా నిర్మలా స్కూల్ సామ్ బాబు ఎందుకని నాగార్జునని కలవాలి? ఎందుకంటే  ‘మా’ టీవీలో ఆయన నిర్వహించే  ‘మీలో ఎవరు కోటీశ్వరుడు’ ప్రోగ్రాం లో పాల్గొని కొట్లాది  రూపాయలు సంపాదించుకెళ్ళి- తన జగదేక బాల సుందరి శాంతిని సొంతం చేసుకునేందుకు!

ఎలావుంది కథ 
      ఎలా వుందో పైనే చెప్పుకుంటూ వచ్చాం. పెద్ద హీరోలు చేయాల్సిన కథ (కథేనా?) పెద్ద హీరోలు దొరక్క పిల్లల మీద తీసేసినట్టుంది. లేకపోతే అన్ని సినిమాల కథలూ పెద్ద హీరోల మూసఫార్ములా  మాస్ కథల్లాగే వుంటాయన్న బలమైన నమ్మకంతో ఇలా బోల్డ్ గా బాలల వృత్తాంతం రచించుకున్నట్టుంది. గతంలో ఇలాటి హైస్కూలు ప్రేమ-  టీచరుతో ప్రేమ లాంటి కథలు కొన్ని వచ్చి పచ్చి విమర్శల పాలయ్యాయి. ప్రస్తుత కాన్వెంట్  ప్రేమ- మోహ  పాఠాల కథ, పెద్ద బ్యానర్ కింద పెద్దవాళ్ళు, ప్రముఖులూ అయిన నాగార్జునా నిమ్మగడ్డ ప్రసాద్ లాంటి వాళ్ళు  ఇష్టపడి తీశారు కాబట్టి-  కొందరు ప్రముఖుల పిల్లలూ నటించి- సంగీతించి- గానించి- అందించారు కాబట్టీ విమర్శల కతీతం అవుతుందనుకుంటే- అభ్యంతరకరం అవదనుకుంటే- చెప్పేదేమీ లేదు. తీసేవాళ్ళు గొప్పవాళ్ళయితే ‘సి’ గ్రేడ్ సినిమాల ‘విషయం’  క్లాస్  సినిమాగా మారిపోతుందనుకుంటే ఇలాటివి ఇంకా తీయవచ్చు.  స్కూలు కెళ్ళే పిల్లలు ప్రేమించుకోవడం, పెళ్లి గురించి పట్టు బట్టడం ఈ రోజుల్లో తప్పుకాదని చెప్పి, ప్రోత్సహించాలనుకుంటే మంచిదే! ఇంతకంటే కావాల్సిన అభివృద్ధి ఏముంటుంది? గో ఎహెడ్!

ఎవరెలా చేశారు 
       కొత్త యంగ్  హీరో రోషన్ నటించగలడు,  అయితే నటించడానికి కావాల్సింది ఇలాటి పాత్ర కాదు. ఈ పాత్రకి భారమైన ప్రేమ గోల ఎక్కువైపోయింది. ఛానెల్స్ లో ఏ డిస్నీ టీనేజి సిరీస్ చూసినా  వాటిలో వయసురీత్యా టీనేజి హీరోల చేష్టలు, దూకుడు, ఫాస్ట్ నటన- చాలా  ఫన్నీగా వుంటాయి. కానీ రోషన్ పాత్ర ఈ ఉత్సాహాన్ని పట్టుకోలేక పెద్ద హీరోలా చాలా సార్లు లేనిపోని గాంభీర్యంతో కన్పిస్తుంది. ‘పెళ్లి సందడిలో’ శ్రీకాంత్ లా హూందాగా వుండేందుకు ప్రయత్నిస్తుంది. ఇదంతా దర్శకత్వ లోపమే. స్కూలుపిల్లల్లో పెద్ద హీరోని చూసిన ఫలితం. పెద్ద హీరో పాత్రలా వుండి, పెద్ద హీరోలా బాధ్యతలు మీదేసుకునే కథనంతో రోషన్ ఎటూ తేల్చుకోలేని నటనతో ఓ సినిమా అయిందన్పించాడు.

    చిన్న పిల్ల శ్రియా శర్మ అన్ని శృంగార భావాలూ చక్కగా పలికించింది. మోహం, తాపం, విరహం, సిగ్గులు, హొయలు, స్కూలు వయసప్పుడే పెళ్లి మాటలు, మగాడు ఎలా వుండాలో కొటేషన్లు చెప్పే అనుభవం, శాంతి తో పెట్టుకుంటే మనశ్శాంతి ఉండదని పెద్ద హీరోయిన్లా మాస్ డైలాగులు, పాతికేళ్ళ హీరోయిన్ పలికే అన్ని ప్రేమ పలుకులూ, సినిమా ప్రారంభమే మొదటి షాట్ దగ్గర్నుంచీ సెక్సీ తనంతో రెచ్చ గొట్టే వొంటి విరుపులూ - ఇలా బాల శృంగార నాయికలా తను నటించడమూ, ఇలా ఈ పాత్రని దర్శకుడు తీర్చి దిద్దడమూ అపూర్వం, అమోఘం, అద్భుతం! తెలుగు సినిమా చరిత్రకి గర్వకారణం!

    ఈ సినిమాలో పాటల గురించి మనం చెప్పుకోవడం లేదు- ఎందుకంటే స్కూలు పిల్లలమీద ఈ ప్రేమ గీతాలు రాయడమూ, వాటికి బాణీలు కట్టడమూ ఎబ్బెట్టు కాదు, ఎబ్బెట్టున్నర!

చివరికేమిటి? 
         స్కూలు పిల్లలకి ప్రేమలూ పెళ్లిళ్ళనే  కోరికలు పుడతాయా-  దోస్తానా మస్తానా ఆకర్షణ లుంటాయా తెలుసుకోకుండా పెద్ద హీరో హీరోయిన్ల లవ్ ట్రాకులు పెట్టేసి భారీగా ప్రేమ పాటలూ  పెట్టేస్తే ఎట్లా? సున్నితత్వమనేదే లేకుండా మొరటు చిత్రీకరణలు చేస్తే అయిపోయిందా? ఇక్కడ చూపించాల్సింది స్కూలుపిల్లల మనస్తత్వాలా, లేకపోతే  మదమెక్కిన పోకిరీల వేషాలా? జానర్ మర్యాదని కూడా కాపాడకుండా ఆ విలనిజా లేంటి, ఆ కేకలేంటి, తాగుబోతు పాత్రలేంటి, మాస్ కమర్షియల్ మసాలా లేంటి? నిర్మలా కాన్వెంట్ అనే టీనేజీ కథని నీటుగా- క్లాసుగా- పిల్లలు చూసినా చప్పట్లు కొట్టేలా పిల్లల మనస్తత్వ చిత్రణలతో తీయలేరా? ప్రేమలో పడతారేమో, అది ప్రేమ కాదు ఆకర్షణ -అన్న ఆదుర్దా, సస్పెన్స్ సృష్టించి థ్రిల్లింగ్ గా కథని చెప్పలేరా? దాసరి నారాయణ రావు తీసిన ‘నీడ’ ని ఒకసారి చూస్తే, వయసురీత్యా అపాయపు టంచున వుండే టీనేజర్ తో కథ, పాత్ర ఎలా ఉంటాయో తెలుస్తుంది. స్కూలు పిల్లల కథకి కావాల్సింది వాళ్ళు తెలియకుండా చేసే ప్రయోగాలు, సాహసాలు- వెరసి ఒక అపాయకర పరిస్థితి!

    టీనేజి కథలో కూడా ఫార్ములా హీరోలాగా కోట్లు సంపాదించే హీరోయిజం వుం టుందా? స్కూలు పిల్లాడు వెళ్ళేసి  నాగార్జునని కలిసి – ప్రోగ్రాం చేసి- అదీ  తనూళ్లోనే ప్రోగ్రాం పెట్టించి - రాత్రికి రాత్రి రెండు కోట్లు గడించేసి- ఆ డబ్బు తీసికెళ్ళి విలన్ ముందు పడేసి – పిల్లనివ్వమనడం అప్పుడే రోషన్ లాంటి లేత కుర్రాడికి అవసరమైన యాక్టింగా?

    సెకండాఫ్ అంతా ఆ టీవీ ప్రోగ్రామేగా? సినిమా కెళ్ళి టీవీ ప్రోగ్రాం చూడాల్సి రావడమేమిటి? ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ కథకి ఒక ప్రేమ కథేదో కలిపి తీసేస్తే అదొక సినిమా అయిపోతుందా? ‘స్లమ్ డాగ్ మిలియనీర్’ కుర్రాడి పాత్ర వేరు, అవసరం వేరు,  సన్నివేశం వేరు. కాన్సెప్టే లేని  ‘నిర్మలా కాన్వెంట్’ కథాకమామిషు పూర్తిగా వేరు! ఇది టీనేజి సినిమా కాదు- పెద్ద హీరోల మూస మాస్ ఫార్ములా సినిమా. 


-సికిందర్
http://www.cinemabazaar.in

14, సెప్టెంబర్ 2016, బుధవారం

నాటి సినిమా!




క రీడర్స్ డైజెస్ట్ జోకు వుంది-
        స్వర్గంలో దేవుడు సుఖాసీనుడై వుంటే సైంటిస్టు వచ్చాడు.
          ‘దేవుడు గారూ! మాకు మీ అవసరం తీరింది. ఇక మీరెళ్ళి పోవచ్చు. ప్రాణిని ఎలా సృష్టించవచ్చో కిటుకు మాకు తెలిసిపోయింది. అన్నిటికంటే బిగినింగ్ లో మీరేం చేశారో అది మేమూ చేయగలం’ అన్నాడు యమ సీరియస్ గా.
           ‘అలాగా?’ అని ఆసక్తిగా  చూశాడు దేవుడు.
          ‘ఔను. ఇంతమట్టిని ఉండలా చేసి ఫిగరొకటి తయారు చేస్తాం. అందులోకి ఉఫ్ ఫ్... మని ప్రాణాన్ని వూదేస్తాం. దట్సాల్, మనిషి తయార్. చూస్తారా?’
          ‘ఏదీ చూపించు నాయనా!’
          సైంటిస్టు ఉత్సాహంగా వంగి, మట్టిని తీయబోతున్నాడు. అది చూసి దేవుడు వెంటనే, ‘ఆగు నాయనా, ముందు నువ్వు తయారు చేసిన నీ మట్టేదో నువ్వు చూపించాలి కదా?’ అన్నాడు  నవ్వుతూ. ఈ మాటలకి గతుక్కుమన్నాడు సైంటిస్టు. జవాబు దొరక్క బుర్ర గోక్కో సాగాడు వెర్రివాడిలా...


       కాబట్టి ఏ మట్టి ఎవరి సొంతం? ఏ మట్టిని ఎవరు తయారుచేయగలరు?  ఏ సినిమా కథ మీద ఎవరికి హక్కులు? ఏ సినిమా కథ ఎవరు సొంతంగా తయారు చేయగలరు? పది పాత సినిమాల కలబోతే కొత్త సినిమా కథ. మోహన్ బాబు వచ్చేసి ప్రతిష్టాత్మకంగా తీసిన ‘పెదరాయుడు’, తాము రాసిన ‘బొబ్బిలి బ్రహ్మన్న’ లాగే వుందని పరుచూరి బ్రదర్స్ వెళ్ళేసి ఈరోడ్ సుందర్ ( ‘పెదరాయుడు’ తమిళ మాతృక ‘నాట్టమాయి’ రచయిత) ని పట్టుకుంటే, అతడింకెన్ని  సినిమాల్లోంచి తీసుకుని  ఆ కథ రాశాడో తవ్వుకుంటూ పోతే ఎక్కడ తేలతాం...మట్టి తీసిన సైంటిస్టూ, కథలు తీసిన రచయితా ఒక్కటే. ఏ కథా ఎవ్వరి సొంతమూ కాదు! 

        ‘బొబ్బిలి బ్రహ్మన్న’ ఛాయలు ‘పెదరాయుడు’ లో చాలా కనిస్తాయి. వాటి పాయింట్లే వేర్వేరు, పాత్రలు మాత్రం అవే. హీరోల ద్విపాత్రాభినయాలు అవే. రెండిట్లో అన్నల పొరపాటు తీర్పులే. తమ్ముళ్ళకి అన్యాయపు బహిష్కరణలు, అన్నల భార్యల వేదనలు, వాళ్ళ మీదా బహిష్కరణల వేట్లూ,  అన్నల మీద ఎదుటి జమీందార్ల కుట్రలు కుహకాలూ, పూర్వీకుల బలిదానాలూ వగైరా వగైరా రెండిట్లో ఒకటే. తేడా అల్లా ‘పెదరాయుడు’ రామాయణాన్ని కలిపి చెబుతుంది- ఫలితంగా హుందాగా ఉదాత్తంగా కన్పిస్తుంది. 

          అన్న మాట కోసం తమ్ముడు త్యాగం చేయడంతోనే  ధర్మం నిలబడదు, అన్న కూడా తనవల్ల తమ్ముడికి హాని జరిగిందనుకుంటే ప్రాయశ్చిత్తం చేసుకుని తనూ వెళ్లి పోయినప్పుడే ధర్మం నిలబడుతుంది. ఇది కూడా గుర్తు చేస్తుందీ గాథ. ‘పెదరాయుడు’ ... కలెక్షన్  కింగ్ మోహన్ బాబు బాక్సాఫీసు చరిత్రని తిరగరాసిన తమిళ రీమేకు. ఇది తన జీవితంలో మర్చిపోలేని అధ్యాయమంటాడాయన. ఇందులో తన పాపులర్  మేనరిజమ్స్ ని పూర్తిగా పక్కన పెట్టేశారు.  అరిస్తే చరుస్తా చరిస్తే కరుస్తా లాంటి మాస్ ఊతపదాలు, వీర హీరోయిజాలతో భీకర రావాలూ లాంటి ఫార్ములా చేబదుళ్ళకి దూరంగా,  అర్ధవంతమైన సహజ పాత్ర పోషణ చేశారు.

        రీమేకుల రాజా రవిరాజా పినిశెట్టి  కూడా తన క్వాలిటీ  స్పృహని కోల్పోకుండా, ఉన్నత విలువలతో విషయాన్ని మనోజ్ఞంగా ప్రెజెంట్ చేశారు. మోహన్ బాబు సహా నటీ నటులందరూ ఆయా పాత్రల్లో అచ్చు గుద్దినట్టు ఒదిగిపోగా, ఆ కథంతా వచ్చేసి రవిరాజా గుప్పెట్లో ముఖమల్ వస్త్రంలా ముడుచుకుంది.  సన్నివేశాల కల్పనలో ఏమాత్రం కృత్రిమత్వానికీ పాల్పడకపోగా, వాటిలో ఏయే విభిన్న రసపోషణలు జరిగినా, అంతర్వాహినిగా ఒకే నిశబ్ద మెలోడీ అనుభవమయ్యేలా ఏక సూత్రత్వాన్ని అమలుచేశారు. దాని పేరే కథాత్మ. ఈ కథాత్మ, బలీయమైన అన్నదమ్ముల అనుబంధం వల్ల ప్రాణం పోసుకుంది. 

        పాత దర్శకుడు డాన్ లివింగ్ స్టన్ ‘ఫిలిం అండ్ ది డైరెక్టర్’ అని రాసిన పుస్తకంలో, ‘మూవ్ మెంట్’ అన్న విభాగంలో ఇలాగంటాడు- ‘కెమెరా మూవ్ మెంట్ ని ఇంటలిజెంట్ గా నిర్వహించడం  దర్శకుడి విజువల్ టెక్నిక్స్ లో ప్రథమ స్థానం వహించాలి. అప్పుడే అతను  ప్రేక్షకుల్ని చాలా ఈజ్ తో సినిమా చూసేట్టు చేసేయగలడు. పాత్రల వ్యక్తిత్వాల చిత్రణ సుబోధకం చేయగలడు. అంతే కాదు, ప్రేక్షకుల్ని ఫీల్ గుడ్ మూడ్ లోకి ఇట్టే తీసికెళ్ళి కట్టిపడెయ్యనూ గలడు- ‘ అని.  రవిరాజా దిగ్విజయంగా సాధించిందిదే : స్లో మూవ్ మెంట్స్ తో, కథా నడకలో ఒక లయని స్థాపించి, కథాత్మ (సోల్) ని పోషించడం!

       నిజ ప్రపంచంలో ఎక్కడెలా వున్నా,  కనీసం సినిమాల్లో చూపించే ఫ్యూడల్ వ్యవస్థకో నీతివుంటుంది. సినిమా జమీందార్లు బయట ఎలాటి తీర్పులు చెప్తారో, ఇంట్లో జరిగే తప్పులకీ తడుముకోకుండా అలాటి తీర్పులే చెప్పి పడేస్తారు. జమీందారీ వ్యవస్థ కాల గర్భంలో కలిసిపోవచ్చు-  ఇప్పుడు నయా జమీందార్లుగా వెలసిన కొందరు ఎమ్మెల్యేలు, ఏంపీలూ జమీందార్ల స్టయిల్లో ఇంట్లో జరిగే తప్పులకి తీర్పులేం చెప్పరు. కొడుకులో తమ్ముళ్లో పాత జమీందార్ల వారసుల పాత్రలు పోషిస్తూ ఏ అఘాయిత్యానికో పాల్పడితే. సదరు ప్రజాప్రతినిధి గారు తీర్పులు చెప్పరు గాక చెప్పరు- ఏకంగా కేసే లేకుండా మాయం చేసేస్తారు.

        వెండితెర జమీందార్లు ధర్మం తప్పరు. ‘తీర్పు చెప్పేవాడి దృష్టిలో అందరూ ఒకటే. న్యాయం మన ఊపిరి, ధర్మం మన ప్రాణం’ అంటూ ప్రాణం విడవడానికీ సిద్ధపడతారు. ఈ గాథలో పెద్ద జమీందారు పాత్రయిన రజనీ కాంత్ ఇలాగే చేస్తాడు. బావ చేతిలో వెన్ను పోటుకి గురైన పెద్ద జమీందారు రజనీ కాంత్. తమ్ముడు మోహన్ బాబు కి అన్న మాటే శిరోధార్యం. అందుకే, ‘నువ్వే పాపం చేయలేదని అన్నకి ఎందుకు చెప్పవు?’ అని భార్య సౌందర్య అడిగినప్పుడు –ఆయన అడగలేదు కాబట్టి చెప్పలేదంటాడు. ఆయన అడగంది ఏదీ తను చెప్పలేదనీ, ఆయన చెప్పంది  ఏదీ తను చేయలేదనీ అంటాడు.  ‘ఆరోజు రాముడు నేను అడవుల కెందుకెళ్లాలని ప్రశ్నించి వుంటే రామాయణం జరిగుండేది కాదు. తండ్రి మాటని గౌరవించి రాముడు అడవులకెళ్లాడు. తండ్రి కంటే గొప్పవాడైన అన్న మాటని గౌరవించి నేనిక్కడికొచ్చాను’ అంటాడు. 

         చూస్తే రామాయణంలో రఘువంశమంతా పాసివ్ క్యారక్టర్ల మయమే, కైకేయితప్ప. ఈమె యాక్టివ్ గా తన లక్ష్య దృష్టితో దశరధుడి మీద కోర్కెల బాణం విసరకపోతే, రామాయణమే లేదు. గాథల్లో యాక్టివ్ పాత్రలు నిప్పు రాజెయ్యకపోతే పాసివ్ పాత్రలకి ఉనికే లేదు. ట్రాజడీల్లేవు. వాటి త్యాగాలూ గొప్పతనాలూ తేలవు. ‘బొబ్బిలి బ్రహ్మన్న’ లో కృష్ణం రాజు పోషించిన రెండు పాత్రలకీ లక్ష్యం వుండదు. ఉన్న లక్ష్యమల్లా రావుగోపాల రావు ప్రతినాయక పాత్రకే వుంటుంది. అలాగే ‘పెదరాయుడు’ లోనూ మోహన్ బాబు రెండు పాత్రలూ డిటో. ఏదో ఒక టార్గెట్ వున్న వాడు విలన్ పాత్ర అనంత్ రాజ్ ఒక్కడే. 

        ఈ అనంత్ రాజ్ మేనమామ రజనీకాంత్ హయాంలో ఒక మనభంగం చేసి, రజనీ కాంత్ ఇచ్చిన తీర్పు ప్రకారం ఆమెనే పెళ్లి చేసుకోవాల్సి వస్తే, ఆ  తీర్పుకి తాళలేని అనంత్ రాజ్ తండ్రి చలపతి రావు, రజనీకాంత్ ని చంపేస్తాడు. చనిపోతూ  రజనీకాంత్,  ఈ ధిక్కారానికి మరో తీర్పు చెప్తాడు- తన బావ అయిన ఈ చలపతి రావు కుటుంబానికి 18 ఏళ్ళూ  సాంఘిక బహిష్కారం విధిస్తాడు. దీంతో ఎక్కడో అతిహీనంగా బతికిన అనంత్ రాజ్ ఆ శిక్షా కాలంపూర్తి కాగానే, రజనీకాంత్ తమ్ముడు మోహన్ బాబు మీద పగదీర్చుకోవడానికి వచ్చేస్తాడు. 

       ‘వెన్నెల’ సినిమా తీసిన ఎన్నారై దర్శకుడు కట్టా దేవ కౌషిక్ ఓ సిట్టింగ్ సందర్భంగా ఓ ముఖ్యమైన విషయాన్ని దృష్టికి తెచ్చారు. చాలా  సినిమాలు ఫ్లాపవడానికి సెకండాఫ్ లో రెండో పాట తర్వాత- క్లయిమాక్స్ కి ముందు - కథలో కొత్త మలుపు రాకపోవడమే కారణమని. తరచి చూస్తే, ఇది నిజమన్పించడానికి అనేక సినిమాలు కన్పిస్తాయి. అయితే, దాదాపు దశాబ్దంన్నర క్రితం తీసిన ‘పెదరాయుడు’ లో ఇలాటి తప్పు జరిగినట్టు కన్పించదు. పైగా దీనికి విరుగుడు కన్పిస్తుంది. మొదట్నించీ కథనంలో ప్రేక్షకులు ఏమాత్రం అనుమానించడానికి వీల్లేని విషయాన్ని క్లయిమాక్స్ కి ముందు ముందుకు లాగి- కథని కొత్త మలుపు తిప్పుతాడు విలన్ అనంత్ రాజ్! ఫస్టాఫ్ లో ఎందుకు జరిగిందో లాజిక్ కి అందక, గాల్లో వేలాడుతూ వుండిన టీచర్ పాత్ర ఆత్మహత్యా  ఘటన వెనుక అసలు కథ అనూహ్యంగా ఇప్పుడు వెలుగులోకి రావడంతో-  ఈ సినిమా క్లయిమాక్స్ కి కొత్త బలం వచ్చి అమాంతం పైకి లేస్తుంది. స్క్రీన్ ప్లే పరిభాషలో ఇలా అప్రధానంగా వుండిపోయి తర్వాత ప్లే అయ్యే టీచర్ పాత్ర ఆత్మహత్యా  ఘటనలాంటిది కావొచ్చు, లేక ఏదైనా క్లూ కావొచ్చు, ఇంకేదైనా వస్తువూ లేదా పాత్ర కావొచ్చు- ఈ ప్లాట్ డివైస్ ని ‘మెక్ గఫిన్’ అంటారు. 

        ఒక విధంగా చెప్పాలంటే ఈ సినిమా ఒక స్క్రీన్ ప్లే లెసన్. ఇందులో గోపీ- మోహన్ లు రాసిన బ్రహ్మానందం - బాబూ మోహన్ ల కామెడీ ట్రాకు కూడా కథాశిల్పంలో ఇమిడిపోయి కన్పిస్తుందే తప్ప- పక్క వాటుగా తెచ్చి అతికించినట్టుండదు. ముందే చెప్పుకున్నట్టు,  పాత్రలన్నీ ఒద్దికగా కన్పిస్తాయి. ప్రధానపాత్రలో మోహన్ బాబు హూందా తనం, రెండో పాత్రలో  వినయ విధేయాలు, భార్యల పాత్రల్లో భానుప్రియ, సౌందర్యల సౌమనస్యాలు, మేనత్త పాత్రలో జయంతి దైన్యం, పెద్ద జమీందారు పాత్రలో రజనీకాంత్ దర్పం ... ఇలా హృదయాల్ని తాకని పాత్రంటూ వుండదు. వీటికి జి. సత్యమూర్తి రాసిన మాటలు అంతే  ఉన్నతంగా వుంటాయి. 

        మోహన్ బాబు సినిమా అంటే తప్పకుండా ఓ జేసుదాస్ పాట! ఇక్కడ కూడా ‘కదిలే కాలమా’ అంటూ జేసుదాస్ తన కంఠాన్ని ఖంగుమన్పించాడు. సంగీత దర్శకుడు కోటి స్వరపర్చిన మిగతా మెలోడీ పాటలు కూడా కథ మూడ్ ని ఎలివేట్ చేసేట్టే వుంటాయి. 

        సౌభాతృత్వం అనే థీమ్ ని ఆలోచనాత్మకంగానూ, అంతే వినోదాద్మకంగానూ తెరమీద దృశ్యమానం చేసిన ‘పెదరాయుడు’ - రీమేక్ లో కూడా ఒరిజినల్ సోల్ ని తెచ్చి ధారాళంగా ప్రవహింపజేయవచ్చని నిరూపిస్తోంది.


-సికిందర్
(సెప్టెంబర్ 2009, ‘స్సాక్షి’)
http://www.cinemabazaar.in
       

 

       



12, సెప్టెంబర్ 2016, సోమవారం

సాంకేతికం :

      ఫిలిం  మేకింగ్ ఎలాంటి సంక్లిష్ట వ్యవహారమో మనకు తెలుసు. అన్ని శాఖల మీద సరైన  నియంత్రణ లేకపోతే చాలా సమస్య లెదురవుతాయి. ప్రతి పనికీ యంత్రపరికాల మీద ఆధారపడుతున్న దర్శకులు,  ఆ యంత్రపరికరాలతో పనిని సులభతరం చేసుకునే వీలుంటే అంతకంటే అదృష్టం వుండదు. అలాటి వీలు మరెక్కడో లేదు. చేతిలో వున్న ఐ పాడ్, ఐ ఫోన్ లేదా ఆండ్రాయిడ్ స్మార్ట్ ఫోన్ల లోనే వుంది. చేయాల్సిందల్లా ఆయా యాప్స్ ని డౌన్ లోడ్ చేసుకోవడమే. కాకపోతే కొంత ఖర్చవుతుంది. గూగుల్, ఇ ఫోన్ లు ఇటువంటి అనేక అప్లికేషన్స్ ని అందుబాటులోకి తెచ్చాయి. అటువంటి తొమ్మిది  యాప్స్ ఏమిటో ఈ క్రింద చూద్దాం:

1.వ్యూ ఫైండర్ యాప్స్

      ఆర్టెమిస్ డైరెక్టర్స్ వ్యూ ఫైండర్ : ఐ ఫోన్, ఐ పాడ్, ఆండ్రాయిడ్ డివైస్ లకు మాత్రమే, ధర: రూ. 1875.99, ఐ ట్యూన్స్ లేదా గూగుల్ డౌన్ లోడ్
        ఇది దర్శకులకి, ఛాయాగ్రాహకులకి చాలా ఉపయోగపడుతుంది. ఇందులో వాడుతున్న కెమెరాని, లెన్స్ ని చూజ్ చేసుకుంటే, యాప్ వివిధ ఫోకల్ లెంత్స్ లో ఏ ఏ వ్యూస్ ని పొందవచ్చో చూపిస్తుంది. రిహార్సింగ్ చేస్తున్నప్పుడు, బ్లాకింగ్ చేస్తున్నప్పుడు ఈ యాప్స్ ఎంతో సహాయకారిగా వుంటుంది. 

        క్యాడ్రేజ్ :  ఐ ఫోన్
, ఐ పాడ్, ఆండ్రాయిడ్ డివైస్ లకు మాత్రమే,ధర : రూ. 590.00, ఐ       ట్యూన్స్ లేదా గూగుల్ డౌన్ లోడ్
        తక్కువ ధరలో ఇది ఆర్టెమిస్ కి ప్రత్యాన్మాయం. ఆర్టెమిస్ స్ లో వున్న సౌకర్యాలే ఇందులోనూ వున్నాయి, కాకపోతే ఫోటో కెమెరా ఫార్మాట్స్ కి, లెన్సులకీ కూడా అనువైనది.

2. క్లాపర్ యాప్స్

        డిజిటల్ క్లాపర్ : ఆండ్రాయిడ్ కి మాత్రమే, ధర : ఉచితం, గూగుల్ డౌన్ లోడ్ 
        సాధారణ క్లాప్ బోర్డులా పనిచేసే ఇది సౌండ్ ఎడిటర్ కోసం టైం స్నాప్ షాట్ ని క్రియేట్ చేస్తుంది. చిత్రీకరించిన షాట్స్ జాబితాని సేవ్ చేసుకోవచ్చు, ఎక్స్ పోర్ట్ కూడా చేసుకోవచ్చు. ఇందులో అదనం గా టైం కోడ్ జనరేటర్ కూడా వుంది. 

        మూవీ స్లేట్ : ఐ ఫోన్
, ఐ పాడ్ లకు మాత్రమే, ధర : రూ. 1494.15, ఐ ట్యూన్స్ డౌన్        లోడ్
        ఈ టైం కోడెడ్ డిజిటల్ స్లేట్ లో అదనంగా ప్రొడక్షన్ పేరు
, దర్శకుడి పేరు వంటి మౌలిక సమాచారాన్ని యాడ్ చేఉకోవచ్చు. కెమెరా ఆప్టిక్ ఇన్ఫర్మేషన్ అయిన ఫైల్ నేమ్, నాయిజ్, ఉపయోగిస్తున్న ఎక్విప్ మెంట్ ఏ రకం,  మొదలైన వివరాల్ని  ఇందులో యాడ్ చేసుకోవచ్చు. 

3. స్క్రీన్ రైటింగ్ యాప్స్
        ఫెడ్ ఇన్ మొబైల్ : ఆండ్రాయిడ్ 2.2, అప్ / ఐ ఓ ఎస్ లకు మాత్రమే, ధర : ఉచితం,        గూగుల్, ఐ ట్యూన్స్ డౌన్ లోడ్ .
        రైటింగ్ కీ
, ఫార్మాటింగ్ కీ ఉపయోగపడే యాప్ ఇది. ఒక టచ్ తో సీన్లు, పాత్రలు, డైలాగులు మొదలైన వాటిని చూసుకోవచ్చు. పూర్తయిన స్క్రిప్టుని డ్రాప్ బాక్స్ కి ఎక్స్ పోర్ట్ చేసుకోవచ్చు. పెయిడ్ వెర్షన్ లో అదనంగా డాక్యుమెంట్స్ ని ఇంపోర్ట్ చేసుకోవచ్చు, అలాగే రెండు మూడు స్క్రిప్టు ల్ని ఎక్స్ పోర్ట్ చేసుకోవచ్చు. 

        స్క్రీన్ రైటర్: ఆండ్రాయిడ్ 1.5 డివైస్ కి మాత్రమే
, ధర : రూ. 54.37, గూగుల్ డౌన్ లోడ్
        ఇది స్టాండ్ ఎలోన్ యాప్, అంటే పిసి కంపానియన్  సాఫ్ట్వేర్ అవసరం వుండదు. రైటర్లు ఆలోచనలను రాసుకోవడానికి, రఫ్ ప్రతిని రాసుకోవడానికీ   ఉపయోగ పడే ఈ యాప్ నుంచి పూర్తయిన పాఠాన్ని పిసి కి అప్లోడ్ చేసుకోవచ్చు. సినాప్సిస్, క్యారక్టర్, లోకేషన్స్, సీన్స్ మొదలైన వాటిని సులభంగా ట్యాబింగ్ చేసుకునే సౌకర్యం ఇందులో వుంది. ఫైనల్ స్క్రిప్ట్ ని షేరింగ్ కి, ఎడిటింగ్ కీ సులభంగా ఈ మెయిల్ చేసుకోవచ్చు. 

        సెల్ టెక్స్  : ఆండ్రాయిడ్ 2.2
, ఐ ఫోన్,  ఐ పాడ్ లకు మాత్రమె,  ధర : ఉచితం,       గూగుల్,ఐ ట్యూన్స్ డౌన్ లోడ్.
        ఇది మార్కెట్ లో లభిస్తున్న పవర్ఫుల్ డెస్క్ టాప్ స్క్రీన్ రైటింగ్ ప్రోగ్రాంలలో ఒకటి. స్క్రీన్ ప్లే, స్టేజి ప్లే, కామిక్స్ వంటి ఆప్షన్స్ ఇందులో వున్నాయి. వీటిమీద వర్క్ చేసుకుంటూ కామెంట్స్ ని, నోట్స్ నీ యాడ్ చేసుకుంటూ పోవచ్చు. స్క్రిప్ట్ ని  సులభంగా ఎక్స్ పోర్ట్, ఇంపోర్ట్ చేసుకోవచ్చు.

4. కెమెరా అసిస్టెన్స్ యాప్స్

         పాకెట్ ఏసీ :  ఆండ్రాయిడ్ కి మాత్రమే, ధర : 644.80, గూగుల్ డౌన్ లోడ్
        కెమెరాఅసిస్టెంట్ లకు ఉపయోగపడే ఈ యాప్స్ లో వివిధ టూల్స్, క్యాలికులేటర్స్, రిఫరెన్సెస్ వున్నాయి. డెప్త్ ఆఫ్ ఫీల్డ్ క్యాలికులేటర్, డిజిటల్ రన్ టైం క్యాలికులేటర్, కెమెరా స్పెక్స్ రిఫరెన్స్, ఫిలిం స్టాక్స్ రిఫరెన్స్, ఎక్స్ పోజర్, ఫీల్డ్ ఆఫ్ వ్యూ క్యాలికులేటర్, ఫోకస్, ఛార్ట్ ఇన్సర్ట్ స్లేట్, ఇంకా అనేకం ఇందులో వున్నాయి. 

        కోడక్ సినిమా టూల్స్ : ఆండ్రాయిడ్ 2.2
, ఐ ఫోన్స్, ఐ పాడ్ లకు మాత్రమే, ధర :    ఉచితం, గూగుల్, ఐ ట్యూన్స్ డౌన్ లోడ్
        ఇందులో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ క్యాలికులేటర్, ఫిలిం క్యాలికులేటర్,  గ్లోసరీ వున్నాయి. డెప్త్ ఆఫ్ ఫీల్డ్ క్యాలికులేటర్ ద్వారా ఫిలిం ఫార్మాట్, ఎఫ్ స్టాప్, సబ్జెక్ట్ డిస్టెన్స్,/ ఫోకల్ డిస్టెన్స్ మొదలైన సమాచారాన్ని చేర్చుకుంటే,  తీస్తున్న షాట్స్ వాస్తవ డెప్త్ ఎంతో తెలియ జేస్తుంది.

        షాట్ డిజైనర్ : ఆండ్రాయిడ్ 2.2
, ఐ ఫోన్స్, ఐ పాడ్ లకు మాత్రమే, ధర : ఉచితం, అప్       గ్రేడ్ వెర్షన్  : రూ. 1202. 00, గూగుల్ ఐ ట్యూన్స్ డౌన్ లోడ్
       
లైటింగ్, కెమెరా, బ్లాకింగ్ డయాగ్రమ్స్ కిది ఏకైక యాప్.ఇది సింపుల్ గావుండే  అతి పవర్ఫుల్ యాప్. 

5. లైటింగ్ యాప్స్ 
       సన్ స్కౌట్ : ఐ ఫోన్, ఐ పాడ్ లకు మాత్రమే, ధర : 597.00, ఐ ట్యూన్స్, ఆండ్రాయిడ్ కి    సన్ పొజిషన్
       
అవుట్ డోర్ లైటింగ్ వల్ల అవుట్ డో ర్ షాట్స్ ని సమన్వయపర్చడం కష్టమౌతుంది. లొకేషన్ లోవున్నప్పుడు సూర్యుడు ఏ సమయంలో ఎక్కడ ఉంటాడో ఈ యాప్స్ తెలియజేస్తుంది. ఫలానా టైం లో ఆ రోజే కాక, రానున్న రోజుల్లో సూర్యుడు ఎక్కడుంటాడో పొజిషన్ ని తెలియజేస్తుంది. స్మార్ట్ ఫోన్ లో వుండే కెమెరాని, కంపాస్ ని, జిపీస్ నీ ఉపయోగించుకుని ఇది సూర్యుడి పొజిషన్ ని ఖచ్చితంగా నిర్ధారిస్తుంది. 

        లైట్ మీటర్  టూల్స్ : ఐ ఫోన్
, ఐ పాడ్ లకు మాత్రమమే,ధర : రూ. 178.77, గూగుల్  డౌన్ లోడ్
        ఈ యాప్  ఆండ్రాయిడ్ డివైస్ ని లైట్ మీటర్ గా మార్చేస్తుంది. డివైస్ లోని కెమెరాని ఉపయోగించుకుని స్పాట్ మీటరింగ్ ని
, డివైస్ లోని లైట్ సెన్సార్ నుపయోగించుకుని ఇన్సిడెంట్ మీటరింగ్ నీ నిర్ణయిస్తుంది.

ఇతర యాప్స్
         6. రోడ్ రెక్ : ఐఫోన్, ఐ పాడ్ లకు మాత్రమే, ధర : ఉచితం, ఐ ట్యూన్స్ డౌన్ లోడ్
        ఇది స్మార్ట్ ఫోన్ ని
48Khz సామర్ధ్యం గల ఫెల్డ్ రికార్డర్ గా మార్చుకుని పని చేస్తుంది. ఇది నేరుగా  AIFF, WAVE, AAC లకు రికార్డింగులు చేయగలదు. అంతే గాక, సౌండ్ క్లౌడ్, డ్రాప్ బాక్స్ లకు అనుసంధానం కాగలదు. 

        7.
హిచ్ కాక్ స్టోరీ బోర్డ్ కంపోజర్ : ఐ ఫోన్, ఐ పాడ్ లకు మాత్రమే, ధర : రూ. 920.00, ఐ ట్యూన్స్ డౌన్ లోడ్
        సొంతంగా స్టోరీ బోర్డ్ రూపొందించుకో లేని వారికి ఇది చక్కటి ప్రత్యాన్మాయం. 

        8. ప్రొడ్యూసర్ :
ఐ ఫోన్, ఐ పాడ్ లకు మాత్రమే, ధర : రూ. 896. 25, ఐట్యూన్స్ డౌన్ లోడ్
        ఇందులో వివిధ ప్రాజెక్టుల సమాచారాన్ని పొందు పరచుకో వచ్చు. విడివిడిగా ఒక్కో ప్రాజెక్టు ఆప్షన్ లో లోకేషన్స్
, తారాగణం, సిబ్బంది, బడ్జెట్ వివరాలను నమోదు చేసుకోవచ్చు. లోకేషన్స్ ని ఎంపిక చేసుకునే టప్పుడు ఇమేజెస్ తీసుకుని వాటిని ఆయా ప్రాజెక్ట్ ఆప్షన్స్ కి యాడ్ చేసుకోవచ్చు. సిబ్బంది అందరి కాల్ షీట్స్, షాట్ లిస్ట్స్,  స్క్రిప్ట్ రైట్ అన్నిటినీ  యాడ్ చేసుకుని రెడీ రిఫరెన్స్ గా ఉంచుకోవచ్చు.

        9.రిమోట్ ప్రాంప్టర్ : ఆండ్రాయిడ్ 2.2 కి మాత్రమే. ధర : ఉచితం
, గూగుల్ డౌన్ లోడ్
        ఇది నటులు డైలాగులను గుర్తుపెట్టుకునే టెలీ ప్రాంప్టర్ టూల్. ఇది వైర్లెస్ గా పనిచేస్తుంది. స్క్రోలింగ్ స్పీడు, ఫాంట్ సైజ్, కలర్ మొదలైన వాటిని వైర్లెస్ గానే కంట్రోల్ చేయవచ్చు. కొత్తనటీ నటు లకి, రిహార్శల్స్ కి బాగా ఉపయోగపడుతుంది.          

   ***