రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

2, మే 2016, సోమవారం

జానర్ మర్యాద గురించి మరొక్కసారి - 2


  2015 లో తర్వాతి రేంజి హీరోలు 19 మంది - కల్యాణ్ రామ్, గోపీచంద్, రాజశేఖర్, రామ్,  నాగచైతన్య, నాని, అఖిల్, శర్వానంద్, సుధీర్, వరుణ్ తేజ్, అల్లరి నరేష్, విష్ణు, నిఖిల్, సుమంత్ అశ్విన్, సాయి ధరమ్ తేజ్, నారా రోహిత్, నాగశౌర్య, రాజ్ తరుణ్, సందీప్ కిషన్, సత్యకార్తీక్ లూ  కలిసి, హీరోయిన్ అనూష్కా శెట్టి ని కలుపుకుని  36 సినిమాలిచ్చారు. ఇందులో తొమ్మిదింటిని మాత్రమే ఓకే చేశారు ప్రేక్షకులు. మిగతా ఇరవయ్యేడూ వాళ్లకి నచ్చలేదు. 
కంచె, పటాస్, భలే భలే మగాడివోయ్,  ఎవడే సుబ్రహ్మణ్యం, మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు, భలే మంచి రోజు, కుమారి 21 ఎఫ్, సినిమా చూపిస్తా మామా, సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ ..ఇవే ప్రేక్షకులకి నచ్చాయి. ఇవన్నీ ఏఏ జానర్ సినిమాలో ఆ జానర్లకి కట్టుబడ్డాయి. వీటిలో కొన్ని పాత్ర చిత్రణల  పరంగా, కథాకథనాల పరంగా లోపాలతో వున్నాయి. రామాయణం చెబుతూ అందులో కొన్ని  లోపాలతో చెప్పినా ఫర్వాలేదుగానీ, భారతం కూడా కలిపి  చెప్పేస్తే  మొత్తం తేడా ఎలా కొడుతుందో, అలా ఫీలవుతున్నారు ప్రేక్షకులు సినిమా జానర్ల నిర్వహణ విషయంలోనూ. అలాగని జానర్ మర్యాదలకి కట్టుబడితే చాలు, ఇక ఎన్ని లోపాలతో నైనా సినిమాలు తీసేయ్యొచ్చని సంబర పడితే కాదు. జానర్ మర్యాదలకి కట్టుబడ్డ మంటే ఎత్తుకున్న జానర్ కథని కలుషితం చెయ్యకుండా చివరంటా చూపించడం మాత్రమే కాదు, ఏ జానర్ కా జానర్ డిమాండ్  చేసే కొన్ని లక్షణాలుంటాయి- వాటిని కూడా ప్రదర్శిస్తేనే మొత్తం కలిపి జానర్ మర్యాద అనే ప్యాకేజీ.          ఉదాహరణకి,  ‘శివం’ అనే సినిమా మాస్ యాక్షన్ జానర్ కి చెందింది. దీన్ని వేరే విజాతి జానర్లతో కలుషితం చేయలేదు. అయినా ప్రేక్షకులు తిరస్కరించారు. కారణం, అది మాస్ యాక్షన్ జానర్ కుండే లక్షణాలని ప్రదర్శించకపోవడమే. స్క్రీన్ ప్లే పరంగా లోపాల మయంగా ఉండడమే. జానర్ మర్యాద అంటే ఆ జానర్ కుండే స్క్రీన్ ప్లే రచన కూడా నన్నమాట. 

2015 లో 27 మీడియం రేంజి సినిమాలూ, ప్రధానంగా జానర్ల పాలన సరీగ్గా లేకే పరాజయాల పాలయ్యాయి.
1. షేర్ : జానర్ : మాస్ యాక్షన్, కలిపింది : సింగిల్ విండో స్కీము
        2. సౌఖ్యం : జానర్ : మాస్ యాక్షన్, కలిపింది : రీసైక్లింగ్ చేసిన అనేక కథలు
3. జిల్ :  జానర్ : మాస్ యాక్షన్, జరిగింది : జానర్ లక్షణాలు లోపించడం
4. గడ్డం గ్యాంగ్ : జానర్ : రియలిస్టిక్ క్రైం, జరిగింది : రియలిస్టిక్ అప్రోచ్ లోపించడం
5. పండగ చేస్కో : జానర్ : ఫ్యామిలీ యాక్షన్, జరిగింది : సింగిల్ విండో స్కీము
6. శివం : జానర్ : మాస్ యాక్షన్, జరిగింది : జానర్ లక్షణాలు లోపించడం
7. దోచేయ్ : న్యూవేవ్ క్రైం, కలిపింది : పాత మూస ఫార్ములా
8. జండాపై కపిరాజు : జానర్ : రాజకీయం, జరిగింది : కాలం చెల్లిన అప్రోచ్  
9. అఖిల్ : జానర్ : సోషియో ఫాంటసీ, చూపించింది : మూస ప్రేమకథ
10. కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ : జానర్ : లవ్, జరిగింది : కాలం చెల్లిన కథనం
11. మోసగాళ్ళకు మోసగాడు : జానర్ : క్రైం, కలిపింది : పాత మూస ఫార్ములా  
12. లోఫర్ : మాస్ యాక్షన్, కలిపింది : కాలం చెల్లిన గ్రామకక్షలు
13. బందిపోటు : జానర్ : క్రైం, కలిపింది : పల్లెటూరి రాజకీయాలు
14. జేమ్స్ బాండ్ : జానర్ : క్రైం కామెడీ, జరిగింది : జానర్ లక్షణాలు లోపించడం
15. మా. మంచు- అ. కంచు : జానర్ : ఫ్యామిలీ, జరిగింది : ఔట్ డేటెడ్ కామెడీ
16. డైనమైట్ : జానర్: యాక్షన్, జరిగింది : జానర్ లక్షణాలు లోపించడం
17. సూర్య వర్సెస్ సూర్య : జానర్ : సైన్స్ ఫిక్షన్, చూపించింది : మూస  ప్రేమ
18. శంకరాభరణం : జానర్ : మల్టీ ప్లెక్స్, జరిగింది : సింగిల్ స్క్రీన్ కి విస్తరణ
19. కొలంబస్ : జానర్ : రోమాంటిక్ కామెడీ, జరిగింది : రీసైక్లింగ్ కథ
20. కేరింత : జానర్ : రోమాంటిక్ కామెడీ, జరిగింది : రీసైక్లింగ్ కథ
21. రేయ్ : జానర్ : మాస్ యాక్షన్, జరిగింది : జానర్ తో ఔట్ డేటెడ్ అప్రోచ్
22. అసుర : జానర్ : క్రైం, జరిగింది : మూస ఫార్ములా అప్రోచ్
23. జాదూగాడు : జానర్ : మాస్ యాక్షన్, జరిగింది : జానర్ మిస్ మేనేజ్మెంట్
24. బీరువా : జానర్ : కామెడీ, జరిగింది : జానర్ మిస్ మేనేజ్మెంట్
25. టైగర్ : జానర్ : సామాజికం, జరిగింది : యాక్షన్ జానర్ కింద మార్చెయ్యడం
26. సైజ్ జీరో : జానర్ : హెల్త్, జరిగింది : జానర్ మిస్ మేనేజ్మెంట్
27. టిప్పు : జానర్ : మాస్ యాక్షన్, జరిగింది : అవుట్ డేటెడ్ అప్రోచ్

***


2015 ప్రత్యేకత ఏమిటంటే, అన్ని రకాల జానర్సూ హిట్ చేశారు ప్రేక్షకులు, అన్ని రకాల జానర్సూ ఫ్లాప్ చేశారు ప్రేక్షకులు. జానర్ నిర్వహణలో తేడా రాకపోతే కంచెలాంటి అపూర్వ ప్రయోగాన్నీ సక్సెస్ చేశారు ప్రేక్షకులు, తేడా వస్తే సైజ్ జీరోఅలాటి అపూర్వ ప్రయోగాన్నీ తిప్పి కొట్టారు.  జానర్  తేడా రాకపోతే  పటాస్ లాంటి పక్కా మాస్ యాక్షన్ జానర్స్ నీ ఇష్టపడ్డారు, తేడా వస్తే సౌఖ్యం’, ‘లోఫర్ల లాంటి జానర్ మర్యాద పాటించని మాస్ యాక్షన్స్ నీ వ్యతిరేకించారు. జానర్ల నిర్వహణలో తేడా రానంత వరకూ ప్రేక్షకులకి ఏ జానర్  సినిమా అయినా ఒకటేననీ, కేవలం మాస్ సినిమాలకే మడి గట్టుక్కూర్చోలేదనీ దీన్ని బట్టి తేలుతోంది. హిట్టయిన స్వామీ రారాలాంటి వ్యూవేవ్ క్రైం ని ఇచ్చిన సుధీర్ వర్మ లాంటి దర్శకుడి దోచేయ్కూడా జానర్  తేడా వచ్చినందుకే నచ్చలేదు ప్రేక్షకులకి. తేడా రాక పోవడం వల్లే  అతడి శైలిలోనే మరో కొత్త దర్శకుడు శ్రీరాం ఆదిత్య తీసిన భలే మంచిరోజుని దాని జానర్ మర్యాదతో ఆదరించారు ప్రేక్షకులు.

        సినిమాల జయాప జయాల్ని నిర్ణయిస్తున్నవి  క్లాస్- మాస్- ఇంకేదో కొత్త ప్రయోగం కామెడీ, యాక్షన్, సెంటిమెంట్, ఫ్యామిలీ, హార్రర్, యూత్, బూతు అనే ఎలిమెంట్స్ ఎంతమాత్రం కావనీ,  ఎలిమెంట్ ఏదైనా, జానర్ నిర్వహణలో తేడా రాని  పనితనం  చూపిస్తే ప్రేక్షకులు తప్పక ఆదరిస్తారనీ, అదే  జానర్ నిర్వహణలో తేడా వస్తే ఎంత పెద్ద స్టార్ నటించిన  సినిమానైనా తిప్పి కొడతారనీ  గత సంవత్సరపు విశ్లేషణ ద్వారా అర్ధం జేసుకోవచ్చు. తేడా కి సంబంధించి  బ్యాలెన్సింగ్ యాక్ట్ ని గనుక సరీగ్గా నిర్వహించుకుంటే తప్ప, సక్సెస్సయ్యే మాటే లేదు.

        సినిమా సక్సెస్ అవడానికి ఒకే  మూసలో పడి  ఒకటే మూస  సినిమాలు ఇంకా తీయడం గాకుండా- ప్రేక్షకులు అంగీకరిస్తున్న వివిధ జానర్ల సినిమాల్లో ఉంటున్న జానర్ లక్షణాలని గుర్తించి, ఆ ప్రకారం పధ్ధతి మార్చుకుంటే తప్ప,  ప్రేక్షకులు సక్సెస్ చేసే మాట పగటి కలే అవుతుందని దీన్ని బట్టి తెలుస్తోంది.

 ఉదాహరణకి హాలీవుడ్ లో సక్సెస్ కోసం ఒక్కో జానర్  సినిమాకి ఒక్కో పధ్ధతిని  అవలంబిస్తారు.  సైన్స్ ఫిక్షన్  సినిమా అయితే సంబంధిత జానర్  ఎలిమెంట్స్ ని దానికి కలుపుతారు. యాక్షన్ సినిమా అయితే దాని పేస్ (నడక వేగం) ని  దృష్టిలో పెట్టుకుంటారు. ఫ్యామిలీ కథా చిత్రమైతే హృదయాలకి హత్తుకునే డైలాగులమీద మనసు పెడతారు. ఇలా ఏ జానర్ కా జానర్ కుండే ప్రత్యేక లక్షణాలని కలిపి అలరించేందుకు కృషిచేస్తారు. ఇదంతా ఒక శాస్త్రమే వుంది. కానీ శాస్త్రాలు అంతగా అక్కర్లేదుగా మనకి? 

తెలుగు సినిమాల్లో ఎలా మారిపోయిందంటే, సర్వ రోగ నివారిణి జిందా తిలిస్మాత్తే అన్నట్టు, అన్నిజానర్ల సినిమాలకీ కలిపి ఒకటే రొడ్డకొట్టుడు హీరోల పాత్రలు, ఒకటే రొడ్డకొట్టుడు కథనాలు, ఒకటే రొడ్డ కొట్టుడు కామెడీలు, ఒకటే రొడ్డ కొట్టుడు డైలాగులు, ఒకటే రొడ్డ కొట్టుడు నటనలు, ఒకటే రొడ్డ కొట్టుడు డాన్సులూ ... ఏ జానర్ సినిమా అయినా సరే, ఒకే తేల్ మాలీష్ - బూట్ పాలీష్ అన్నట్టు ఫుట్ పాత్ బిజినెస్. ఇలా ఇంత భావదారిద్ర్యాన్నీ, సృజనాత్మక దివాలాకోరు తనాన్నీ, నైపుణ్య లేమినీ కూడా ఒక ఫ్యాషన్ గానే  బిళ్ళ తగిలించుకుని ఇష్టారాజ్యంగా  సినిమాల్ని చంపేస్తున్నారు. సినిమాల్ని ఏ వెబ్సైటూ చంపడం లేదు. 25-34 ఏజి గ్రూపులో జనాభాలో 34 శాతంగా వుంటున్ననెటిజనులు, వెబ్సైట్ల రాతలు చూడ్డం వల్ల సినిమాలు ఫ్లాప్ అవవు. సినిమాల్ని తీస్తున్న వాళ్ళే  అరకొర జ్ఞానంతో తీసేసి చంపుకుంటున్నారు. కేవలం పది శాతమే హిట్టవుతున్నాయంటే టాలీవుడ్ లో వున్న టాలెంట్ పది శాతమే నని అర్ధం జేసుకోవాలి. మరి మిగతా 90 శాతం..??

 ఇక 2015 లో చిన్నా చితకా రొడ్డ కొట్టుడు సినిమాలు కూడా 42 దాకా తీస్తే,  వాటిలో దొంగాట, రాజుగారి గది – రెండు మాత్రమే మాన మర్యాదలతో వున్నాయని సర్టిఫికేట్ ఇచ్చారు ప్రేక్షకులు.

జానర్ మర్యాదని గనుక మర్యాదగా పాటిస్తే, మాస్ సినిమాలో ఒకలా వున్న హీరో పాత్ర, సస్పెన్స్ థ్రిల్లర్ లో ఇంకోలా రూపు దిద్దుకుంటుంది. మాస్ పాత్రకి మించిన కుశాగ్రబుద్ధితో, హేతుబద్ధ ఆలోచనలతో హేండ్ సమ్ గా వుండి, మాస్ పాత్ర కంటే ఎక్కువ ఆకట్టుకునే అవకాశముంటుంది. ఆవారా బంజారా మాస్ పాత్రని  ‘సరైనోడు’ కి వచ్చేసరికి ఏకంగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కొడుకుగా తయారు చేసే స్థితికి చేరుకున్నారు. రాష్ట్రపతి కొడుకుని కూడా ఆవారా తిరగుబోతుగా చూపించుకునే పూర్తి స్వేచ్చ తెలుగు సినిమా దర్శకులకి ఎంతైనా వుంది, కాదనం.  కానీ జానర్ల పరంగా ఆలోచించినా, అన్ని జానర్లకీ కలిపి అవే రొడ్డ కొట్టుడు ఆవారా మాస్ పాత్రలే ఎలా వుంటాయి? 'రాజా చెయ్యేస్తే' లో అసిస్టెంట్ డైరెక్టర్ అయిన సినిమా పాత్ర కూడా రొడ్డ కొట్టుడుగా ఎలావుంటుంది?

         తెలుగు ప్రజలు పౌరులుగా మంచి నాగరికంగానూ, సినిమా ప్రేక్షకులుగా చంఢాలపు అనాగారికంగానూ ఉంటారని నమ్మడం వల్ల ఇలా పుడుతున్నాయా పాత్రలు? ? సత్యజిత్ రే జీవిత కథ రాసిన మేరీ సెటన్, భారతీయ సినిమాలు వీధి భాగోతాల స్థాయి దాటి రాలేదని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు తెలుగు సినిమాల వరస చూస్తే, గుంటూరులో బాషా నాటకాలని ఆడేవి. ఆ నాటకాల్లో హీరోల పాత్రలూ ఆ కథల స్థాయీ దాటి రావడం లేదు తెలుగు సినిమాలు!

        
         రొడ్డ కొట్టుడుకి అతీతంగా ఆలోచించాల్సింది ముందు జానర్ మర్యాద గురించి. ఇక్కడే సమస్య  వస్తోంది. ఈ సమస్యని తొలగించుకుని సినిమాలు తీస్తే ఏ జానర్ సినిమా నైనా ఆదరించడానికి సిద్ధంగా వున్నారు ప్రేక్షకులు.  పాత్ర దగ్గర్నుంచీ కథా కథనాల వరకూ; చిత్రీకరణ, మేకింగ్ అప్రోచ్ వరకూ ఏజానర్ మర్యాద ఆ జానర్ కిచ్చి కాపాడితే అది సినిమాల్నే  కాపాడుతుంది- 2016 లోనైనా ఇది అమలయ్యే అదృష్టానికి నోచుకుంటోందా? ఒకసారి చూద్దాం...

***

2016 ఏప్రెల్  ఆఖరు వరకూ ఈ నాలుగు నెలల కాలంలో 40 స్ట్రెయిట్ చిత్రాలు విడుదలయ్యాయి. డబ్బింగులని వదిలేద్దాం. స్ట్రెయిట్ చిత్రాల్లో  6 పెద్దవి, 15 మధ్య తరహా, 19 చిన్నవీ. పెద్ద వాటిలో నాన్నకు ప్రేమతో, డిక్టేటర్, సోగ్గాడే చిన్ని నాయనా, ఊపిరి, సర్దార్ గబ్బర్ సింగ్, సరైనోడు వున్నాయి. వీటిలో నాన్నకు ప్రేమతో, డిక్టేటర్, సర్దార్ గబ్బర్ సింగ్, సరైనోడు నాలుగూ వెంటనే హిట్ టాక్ వచ్చినవి కావు. తర్వాత నిలబెట్టే ప్రయత్నం చేస్తే అతి కష్టంగా నిలబడ్డవి నాన్నకు ప్రేమతో, సరైనోడు మాత్రమే. కానీ రియల్ హిట్స్ రెండూ నాగార్జున నటించినవే. ఇంకో మాటే లేకుండా మొదటి ఆటకే సోగ్గాడే చిన్నినాయనా, ఊపిరి రెండూ తక్షణం ప్రేక్షకుల ఆమోదం పొందాయి. కారణం? జానర్లని కాపాడ్డం.  

కానీ నాన్నకు ప్రేమతో లో నాన్న లేకుండా అర్ధంకాని సైన్స్ ఫిక్షన్ జానరే స్వారీ చేస్తే, డిక్టేటర్ లో ఫ్యామిలీ యాక్షన్ జానర్  కాస్తా మళ్ళీ ఔట్ డేటెడ్ బాషా ఫార్మాట్ తో తేలిపోతే, సర్దార్ గబ్బర్ సింగ్ మళ్ళీ కిక్-2 కి లాగా ఫారిన్ ఇష్యూ జానర్ పాలబడింది. ‘కంచె’ అనే ఇదే ఫారిన్ ఇష్యూ జానర్ మరెందుకు హిట్టయ్యిందంటే, ఆ ఫారిన్ ఇష్యూ జానర్ లో వున్నది పసిపాప ప్రాణం. పసివాళ్ళు నేటివిటీకి అతీతులు. హిట్టయిన భజరంగీ భాయిజాన్ లోని పసిది పరాయి పాకిస్తానీ. ‘పోలీస్’ లో బాక్సాఫీసు అప్పీలున్న, కీలక కూతురి పాత్ర విలువ తెలీక,  బార్బీ బొమ్మలా చూపించి సరిపెట్టేశాడు దర్శకుడు.
ఇక సరైనోడు మాస్ యాక్షన్ నే గానీ  ఫ్యాక్షన్ సబ్ జానర్ కింది కొచ్చింది. పాత్రల పేర్లూ ప్రదేశాలూ మారాయంతే. ఫ్యాక్షన్ సబ్ జానర్ వాసన ఇంకెన్నాళ్ళు భరిస్తారు ప్రేక్షకులు. 

        ఇలాకాక, సోగ్గాడే చిన్నినాయనా ఫాంటసీ జానర్  నుంచి పక్కకి తొలగకుండా, ఊపిరి వరల్డ్ మూవీ జానర్ కి అన్యాయం చేయకుండా, విచ్చేస్తే అక్కున జేర్చుకున్నారు ప్రేక్షకులు. అదే పనిగా వస్తున్న హార్రర్ కామెడీ జానర్ తో విసుగెత్తిన ప్రేక్షకులకి, సోగ్గాడే చిన్నినాయనా లోని ఆత్మఫాంటసీ పెద్ద ఉపశమనం. ఊపిరిలో కార్తీ పాత్ర ఇంటి కథతో కాలుష్యమున్నా, కొత్తగా వరల్డ్ మూవీ జానర్ ని చూస్తున్న అనుభూతి ముందు అది దిగదుడుపే అయింది ప్రేక్షకులకి.


        ఇక ఈ జనవరి - ఏప్రెల్ మధ్య,  మధ్య తరహా  సినిమాలు 18 విడుదలైతే,  14 ఫ్లాప్ అయ్యాయి. ఈ రేంజి హీరోలైన రామ్, నాని, శర్వానంద్, అడివి శేష్, సందీప్ కిషన్, శ్రీకాంత్,  విష్ణు, మంచు మనోజ్, సునీల్, నారా రోహిత్, ఆది, రాజ్ తరుణ్, నాగశౌర్య, బెల్లంకొండ శ్రీనివాస్, సత్య కార్తీక్ మొత్తం 15 మందీ కలిసి 18 సినిమాలిస్తే ఒక్కటే నచ్చింది ప్రేక్షకులకి. ఇంకో ఓ మూడింటిని మాత్రం  ఏవరేజిగా సరిపెట్టేశారు.
        క్షణం, నేనూ శైలజ, ఎక్స్ ప్రెస్ రాజా, కృష్ణగాడి వీర ప్రేమ గాథ...వీటిలో ‘క్షణం’ క్రైం జానర్ ని కాపాడుతూ ఇంటెలిజెంట్ రైటింగ్ తో ప్రేక్షకుల్ని థ్రిల్ చేసి హిట్టయితే, నేనూ శైలజ జానర్ వచ్చేసి ఓల్డ్ ఫ్యామిలీ డ్రామా ప్లస్ లవ్. వీటిని అప్ డేట్ చేసివుంటే ఫలితాలు వేరేగా ఉండేవి. ఎక్స్ ప్రెస్ రాజా  ఇంటర్వెల్ కి అయిపోయిన మల్టీ ప్లెక్స్ జానర్ కథని, అతికించిన వేరే కథతో సింగిల్  స్క్రీన్ కి పెంచారు. కృష్ణ గాడి వీర ప్రేమ గాథ ఏ జానర్ కీ చెందని అన్ని జానర్ల సినిమా. అందుకే ఏం చూశామో  అర్ధం గాలేదని కామెంట్లు వచ్చాయి. 


        ఫ్లాపయిన 14 సినిమాల జానర్ల తీరుని పరిశీలిస్తే...

        1. రన్ : జానర్ : ఇండీ ఫిలిం, జరిగింది : ఇండీ ఫిలిం ని రీమేక్ చేసే చోద్యం
        2. టెర్రర్ : జానర్ : క్రైం లో టెర్రర్ సబ్ జానర్, జరిగింది : అప్డేట్ కాని అప్రోచ్
        3. ఈడో రకం- ఆడో రకం : జానర్ : కామెడీ, జరిగింది : అవుట్ డేటెడ్ అప్రోచ్
        4. శౌర్య : జానర్ : క్రైంలో థ్రిల్లర్ సబ్ జానర్, జరిగింది : సబ్ జానర్ ఖూనీ
        5. ఎటాక్ : జానర్ : గ్యాంగ్ స్టర్ సబ్ జానర్, జరిగింది : నిర్వహణలో ఒక లోపం
        6. కృష్ణాష్టమి : జానర్ : ఫ్యామిలీ, యాక్షన్, జరిగింది : జానర్ల ఔట్ డేటెడ్ నిర్వహణ
        7. తుంటరి : జానర్ : స్పోర్ట్స్, జరిగింది :  రాంగ్ కాస్టింగ్
        8. సావిత్రి : జానర్ : లవ్, జరిగింది : అప్డేట్ చేసుకోని కథ
        9. రాజా చెయ్యేస్తే : జానర్ : క్రైం, జరిగింది : జానర్ లక్షణాలు లోపించడం
        10. గరం : జానర్ :  మాస్, జరిగింది : ఔట్ డేటెడ్ అప్రోచ్
        11. సీ. అందాలు-రా. సిత్రాలు : జానర్ ; లవ్, జరిగింది :  ఔట్ డేటెడ్ అప్రోచ్
        12. క. వైభోగమే : జానర్ : ట్రెండీ లవ్, జరిగింది : సెకండాఫ్ లో ఔట్ డేటెడ్ అప్రోచ్
        13. స్పీడున్నోడు : జానర్ : రియలిస్టిక్ లవ్, జరిగింది : మాస్ యాక్షన్
        14. పడేసావే : జానర్ : లవ్, జరిగింది :  కాలం చెల్లిన ముక్కోణ ప్రేమ
***

     క విడుదలైన  19 చిన్న సినిమాల్లో ఒకటే హిట్టయ్యింది : గుంటూరు టాకీస్. క్రైం లో ఇది అడల్ట్ క్రైం జానర్ కి చెందినా, మరే పక్క చూపులు చూళ్ళేదు. దీని అప్రోచ్ కూడా noir జానర్ (crime fiction featuring hard-boiled cynical characters and bleak sleazy settings) లో అతికినట్టు వుంది. మిగిలిన 18 చిన్న సినిమాల విశ్లేషణ కూడా అనవసరం. 


        అంటే ఈ నాలుగు నెలల్లో కూడా రికార్డు స్థాయిలో జానర్లని పట్టించుకోనే లేదన్న మాట. మొత్తం  విడుదలైన 40  లో నాలుగే జానర్ మర్యాద కాపాడుకుని సొమ్ములు చేసుకున్నాయి. పెద్దవి రెండు, మధ్యస్థం ఒకటి, చిన్నది ఒకటి. ఇక రాబోయే నెలల్లో ఇంతకి మించి జరిగేదేమీ వుండదని వాతావరణ సూచన లిచ్చెయ్యొచ్చు. అసలేం చేస్తున్నారో తెలిస్తే కదా పరిస్థితిలో మార్పు రావడానికి!


(ఇంకా వుంది)

–సికిందర్

         




30, ఏప్రిల్ 2016, శనివారం

స్పెషల్ ఆర్టికల్ :

త సంవత్సరం హిట్టయిన చిన్నా పెద్దా సినిమాలు ఎందుకు హిట్టయ్యాయో ఇదివరకు కొన్నిసార్లు చెప్పుకున్నాం. కేవలం ఏ జానర్ ప్రధానంగా ఆ సినిమాలు తీశారో తూచా తప్పకుండా ఆ జానర్స్ ని కలుషితం చేయకుండా, వాటి మర్యాదని కాపాడుతూ తీసిన సినిమాలే హిట్టయ్యాయి. అంటే ప్రేక్షకులు సినిమాలు చూసే పద్ధతిని మార్చుకున్నారా?
ఎలాటి నాన్సెన్స్ నీ అంగీకరించడం  లేదా? కథ ఏదైనా  దాన్ని స్వచ్ఛంగా, సరళంగా, అర్ధవంతంగా చూపించాలని కోరుకుంటున్నారా? ఏమో చెప్పలేం గానీ, అలాటి సినిమాలే 
హిట్టయ్యాయి...ఈ నేపధ్యంలో ఈ జానర్ మర్యాద అంటే ఏమిటో, దాన్నెలాకాపాడుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం


      జానర్ అంటే కేటగిరీ, వెరైటీ, తరహా, జాతి, గ్రూపు, టైపు, మోడల్...ఇలా అనేక పర్యాయ పదాలున్నాయి. జానర్ అనే మాట ఎందుకు అవసరమైందంటే సినిమాల్ని గుర్తు పట్టడానికే.  మీదే జానర్ సినిమా అంటే యాక్షన్ అనో, లవ్ అనో, ఫ్యామిలీ అనో చెప్పొచ్చు.  జానర్ గురించి ఇంకా బాగా అర్ధమవాలంటే,  మీదే జానర్ సినిమా అని అడిగారంటే, ఏ రస ప్రధానమైన సినిమా అని అడిగినట్టే - హాస్య రస ప్రధానమా, భక్తి  రసప్రధానమా అని! ఇలా సినిమాల్ని  వివిధ జానర్లుగా గుర్తిస్తున్నారు. పైన చెప్పుకున్న యాక్షన్, లవ్, ఫ్యామిలీ లతో బాటు, కామెడీ, క్రైం, హార్రర్, ట్రాజెడీ, డ్రామా, అడ్వెంచర్, స్పోర్ట్స్ , హిస్టారికల్, బయోపిక్, మ్యూజికల్, ఫాంటసీ, సైన్స్ ఫిక్షన్, వార్, కౌబాయ్..ఇంకా జానపద, పౌరాణిక, భక్తి, ఉద్యమ, విప్లవ, దేశభక్తి, రాజకీయ, సామాజిక, ప్రయోగాత్మక, బాలల ...చెప్పుకుంటే పోతే ఎన్నో. మళ్ళీ వీటిలో కొన్నిటికి సబ్ జానర్లు కూడా వున్నాయి. ఈ సబ్ జానర్లు వందల్లో వుంటాయి. ఎప్పటికప్పుడు కొత్తకొత్తవి చేరుతూనే వుంటాయి. 

        యాక్షన్ జానర్ కి  సబ్ జానర్లు గా  యాక్షన్ కామెడీ, థ్రిల్లర్, ఫ్యాక్షన్, టెర్రరిజం, మార్షల్ ఆర్ట్స్, ఎపిక్, స్పై, డిజాస్టర్, సూపర్ హీరో..ఇంకెన్నో  వున్నాయి. క్రైం జానర్ లో  డిటెక్టివ్, గ్యాంగ్ స్టర్, మాఫియా, రోడ్ మూవీ, రేప్ రివెంజి, లీగల్ థ్రిల్లర్స్, కోర్ట్ రూమ్ డ్రామాలు మర్డర్ మిస్టరీ, సైకలాజికల్ థ్రిల్లర్..ఇంకా మరెన్నో సబ్ జానర్లుగా వున్నాయి. అలాగే లవ్ జానర్లో రోమాంటిక్ డ్రామా, రోమాంటిక్ కామెడీ, రోమాంటిక్ థ్రిల్లర్, చిక్ ఫ్లిక్స్ లాంటివి అనేకం  సబ్ జానర్లుగా వున్నాయి. హారర్ర్ జానర్ కి ఘోస్ట్ హార్రర్, హార్రర్ కామెడీ, పారానార్మల్, జాంబీ, క్షుద్ర శక్తులు, చేతబడి లాంటివెన్నో వున్నాయి...



       తెలుగులో ఇప్పుడు ఎక్కువగా చెలామణి లో వుంటున్నవి  యాక్షన్, కామెడీ, ఫ్యామిలీ, లవ్, హార్రర్, అడ్వెంచర్, టెర్రర్, ప్రయోగాత్మకాలతో బాటు మాస్....పక్కా మాస్ అనే లోకల్ జానర్ సినిమాలు. ఇక్కడ గమనించాల్సిన విషయమేమిటంటే కేవలం ఏదో ఒక జానర్ మీద ఆధారపడి  సినిమాలు తీయడం అరుదు. రెండు మూడు జానర్ లు కలిపి హైబ్రిడ్ గా తీసే సినిమాలే ప్రపంచంలో ఎక్కడైనా ఎక్కువగా వుంటున్నాయి. తెలుగులో యాక్షన్ తీస్తే, అందులో కామెడీ, ఫ్యామిలీ కూడా కలప వచ్చు – తప్పని తద్దినం  మాస్ అనే పదార్ధాన్ని కూడా అందులో ఎటూ కలపాల్సిందే. హార్రర్ తీస్తే దాన్ని కామెడీతో కలిపి ఇప్పుడు హార్రర్ కామెడీ గా తీయాల్సిందే. లవ్ తీస్తే దాంట్లో కామెడీ కలిపి రోమాంటిక్ కామెడీగా, లేదా డ్రామా కలిపి రోమాంటిక్ డ్రామాగా, థ్రిల్లర్ కలిపి రోమాంటిక్ థ్రిల్లర్ గా తీస్తున్నారు.

        ఈ కలపడంలో ఎక్కువ తక్కువల దగ్గరే తేడా వస్తోంది. రెండు మూడు జానర్ లు కలిపినప్పుడు వాటిలో ఒకటే మెయిన్ జానర్ గా వుంటుంది, వుండాలి కూడా. మిగిలినవి పక్క వాద్యాలుగా వుండాలి. ఒకవేళ పక్క వాద్యాలలో ఒకటి లేదా రెండూ కలిసి  మెయిన్ జానర్ గా మారిపోయి,  మెయిన్ జానర్ ని పక్కకి తోసేస్తే ఏం జరుగుతుంది? అది జానర్ మర్యాదని కాపాడని సినిమాగా అట్టర్ ఫ్లాప్ అవుతుంది. మైక్రోఫోన్ ముందు నుంచి మెయిన్ సింగర్ని తోసేసి కోరస్ పాడేవాళ్ళు పాటెత్తుకుంటే ఎలావుంటుందో,అలావుంటుంది
మెయిన్ జానర్ తో డ్రెయిన్ (సైడుకాల్వ) జానర్ల  పెత్తనం.


         తాజాగా ఈ ఏప్రెల్ 29 న విడుదలైన ‘రాజా చెయ్యి వేస్తే’ కూడా ఇంతే. డ్రైనేజీ జానర్ల దెబ్బకి మెయిన్ జానర్ మూసీ నదిలా పారింది. సినిమా తీసే దర్శకుడు అసలు సినిమా లెందుకు ఫ్లాపవుతున్నాయో వేయి కళ్ళతో గమనిస్తూ, పరిశీలిస్తూ ఉండడమనే  మార్కెట్ మూల్యాంకన చేసుకునే ఓపిక వుంటే  తప్ప, తనూ ఇంకో అలాటి ఫ్లాప్ ఇవ్వకుండా ముందు జాగ్రత్త పడలేడు. ప్రేక్షకుల అభిరుచులు వేగంగా మారిపోతున్నాయి. తీసిన సినిమా ఎందుకు ఫ్లాపయయిందో అర్ధం కానంతగా కొత్త కొత్త కారణాలు వచ్చి చేరుతున్నాయి. గత సంవత్సరం కల్తీ లేని జానర్లకే పట్టం గట్టి నట్టే, సింగిల్ స్క్రీన్ సినిమా కథలకే ఓటేశారు ప్రేక్షుకులు. అంటే జానర్ల పరిరక్షణతో బాటు, సింగిల్ స్క్రీన్ కథలు- మల్టీప్లెక్స్ కథలు అనే తేడా కూడా దర్శకులు గుర్తించాల్సిన అగత్యం ఏర్పడిందన్నమాట!

        పెద్ద,  మధ్య తరహా సినిమాలు విడుదల అవుతాయి. చాలా కొన్నే హిట్టవుతాయి. వీటికి రెట్టింపు సంఖ్యలో చిన్న చిన్న సినిమాలు  విడుదల అవుతాయి. అన్నీ ఫ్లాపవుతాయి. ఇది ఆన్ స్క్రీన్ దృశ్యం. కానీ చిన్న సినిమాలు ఎన్ని విడుదలై ఫ్లావుతాయో, అన్నేసి  అసలే విడుదల కాకుండా బుట్ట దాఖలై పోతున్నాయన్న వాస్తవం కూడా గమనించాలి. ఇది ఆఫ్ స్క్రీన్ గా కన్పించే సీను. చిన్నా చితకా సినిమాలు నిర్మాణ రంగంలోనే తప్ప, ప్రదర్శనా రంగంలో ఎవ్వరికీ నయా పైసా  అందించని మొండి ఘటాలైపోయాయి. ఇవి తీసినా  ఒకటే తీయకపోయినా ఒకటే అన్నట్టు తయారయ్యింది పరిస్థితి. 



         గత సంవత్సరం జయాపజయాల్ని ఆయా  సినిమాల జానర్ మర్యాద కిచ్చిన ప్రాధాన్యమే నిర్ణయించింది. అంటే జానర్ మర్యాద పాటించిన సినిమాలనే తమకి తెలీకుండానే  ఎక్కువ చూశారు ప్రేక్షకులు. ఒకసారి ఆ వివరాల్లోకి వెళ్దాం... 2015 లో మొత్తం చిన్నా పెద్దా తెలుగు స్ట్రెయిట్ సినిమాలు 88 విడుదలయ్యాయి.  డబ్బింగ్ సినిమాలు 39 విడుదలయ్యాయి. మొత్తం కలిపి విడుదలైన  సినిమాల సంఖ్య  127. విడుదలైన 88 స్ట్రెయిట్ చిత్రాల్లో పెద్ద సినిమాలు 10 వుంటే, మధ్య తరహా 36, చిన్నవి 42 వున్నాయి. పెద్ద సినిమాలు పదింటిలో 5 విజయం సాధించగా, మధ్యతరహా 36 లో 9, 42 చిన్న సినిమాల్లో 2 సక్సెస్ మాత్రమే అయ్యాయి. మొత్తం  88 లో 16 హిట్టయ్యాయి. ఈ పదహారూ జానర్ మర్యాదని కాపాడుకున్నవే.

        పెద్ద సినిమాల్లో  శ్రీమంతుడు, గోపాల గోపాల, టెంపర్, బాహుబలి, రుద్రమదేవి, లయన్, బ్రూస్ లీ, సన్నాఫ్ సత్యమూర్తి, కిక్-2, బెంగాల్ టైగర్ అనే  10 వుండగా,  శ్రీమంతుడు, గోపాల గోపాల, బాహుబలి, రుద్రమ దేవి, టెంపర్ –ఈ ఐదు  మాత్రమే హిట్టయ్యాయి.

        హిట్టయిన శ్రీమంతుడు జానర్ మర్యాద ఎలా కాపాడుకుందో చూద్దాం. ఇది ఫ్యామిలీ –యాక్షన్ రెండు సజాతి జానర్ల కలబోత కాగా, దీంట్లోకి మళ్ళీ పక్కా మాస్ ని చొరబెట్టలేదు.  అలాగే పెద్ద సినిమాల్లో అదేపనిగా వస్తున్న ‘సెకండాఫ్ లో విలన్ ఇంట్లో హీరో చేరుట మరియు బ్రహ్మానందంతో  కన్ఫ్యూజ్ కామెడీ చేయుట అవశ్యము’  అనే సింగిల్ విండో స్కీములోకి కథని తోసెయ్యకుండా ఆ రెండు యాక్షన్- ఫ్యామిలీ జానర్లనే కాపాడుకుంటూ కథ నడిపారు. ఇందులో మహేష్ బాబు పాత్ర పూర్తి డొల్లగా వుంటుంది. ఈ సూక్ష్మం ప్రేక్షకులు తెలుసుకోవడం కష్టం. వాళ్లకి డిస్టర్బెన్స్ లేకుండా రెండు జానర్లతో ‘అర్ధమయ్యేలా’ కథ నడిపించారు. 



        ‘గోపాల గోపాల’ నాస్తికుడికీ, దేవుళ్ళ పేర్లతో దందాలు చేసే ఆస్తికులకీ మధ్య సంఘర్షణగా  ప్రయోగాత్మకంగా తీశారు. ప్రయోగాత్మకంలో మాస్- కామెడీ ల వంటి విజాతి జానర్ లని  చొరబెడితే  చాలా అనాగరికంగా  వుంటుంది  కాబట్టి ఆ జాగ్రత్త పడ్డారు. ఈ కథలో కూడా పెద్ద లోపముంది- తన వ్యాపారం మీద పిడుగుపడి నష్ట పోయినందుకుగాను, ఆ నష్ట పరిహారం దేవుడు చెల్లించాలని దేవుడి మీద కేసు వేస్తాడు నాస్తికుడైన హీరో. కానీ ఇలాటి వాటికి ప్రకృతి  వైపరీత్యాల ఖాతాలో నష్ట పరిహారం ఇస్తూనే వుంటాయి  ప్రభుత్వాలు.  ఈ సూక్షం కూడా ప్రేక్షకులు పట్టించుకోలేదు. పట్టించుకున్నా క్షమించేయ గలరేమో  జానర్ మర్యాద దృష్ట్యా.

       
‘టెంపర్’ని  సామాజిక జానర్లో తీశారు. రేప్ అనే సామాజిక సమస్యతో సినిమాటిక్ పరిష్కారంకోసం ప్రయత్నించారు. ఇందులో దాదాపు సగం సినిమా మాస్ ఎలిమెంట్స్ తో గడిచిపోతుంది. సామాజికం - మాస్ సజాతి జానర్లే  కాబట్టి చెల్లిపోయింది. కథా పరంగా ఇందులో లక్ష తప్పులున్నా పట్టించుకోలేదు ప్రేక్షకులు. 

       
మూడు మాత్రమే జానర్ల పాలన సరిగ్గా వుండి హిట్టయిన పెద్ద స్టార్ల రెగ్యులర్ సినిమాలు. బాహుబలి, రుద్రమ దేవిల్లాంటి ఫాంటసీ, చారిత్రక సినిమాల్ని కూడా రెగ్యులర్ సినిమాలకి లాగే వాటి జానర్ మర్యాదని చూసి సక్సెస్ చేశారు ప్రేక్షకులు. వీటిలో కథల్లో  ఇమడని మాస్, కామెడీ లాంటి జానర్లని తెచ్చి కలపలేదు. రెండిట్లో మళ్ళీ స్క్రీన్ ప్లే పరంగా  పెద్ద లోపాలు చాలానే వున్నాయి


        ఫ్లాపయిన లయన్, బ్రూస్ లీ, సన్నాఫ్ సత్యమూర్తి, కిక్-2, బెంగాల్ టైగర్ ఐదింటి జానర్లూ మానభంగానికి గురయ్యాయి.  లయన్ ని క్రైం జానర్లో సస్పెన్స్ థ్రిల్లర్ సబ్ జానర్ గా తీశారు. దీంట్లోకి వేరే జానర్లు కలపకపోయినా సస్పెన్స్ థ్రిల్లర్  ఎలిమెంట్స్ నే ప్రవేశపెట్ట లేకపోయారు- ‘రాజా చెయ్యి వేస్తే’ లో  క్రైం ఎలిమెంట్స్ ని కలపలేకపోయినట్టు. కనీసం టెంపో గానీ, స్పీడు గానీ ఉండాలన్నా ఆలోచనే చెయ్యలేదు.

        బ్రూస్ లీ ని ఒక దుష్టుడి బారి నుంచి తన కుటుంబాన్ని- అక్కనీ  కాపాడుకునే ఫ్యామిలీ జానర్లో,  సిస్టర్ సెంటిమెంట్ అనే సబ్ జానర్ గా తీయబోయారు. దీనికి సజాతి యాక్షన్ జానర్ ని కూడా జోడించారు.  ఈ మొత్తాన్నీ మెడబట్టి  సింగిల్ విండో స్కీం లోకి నెట్టేశారు. 

        సన్నాఫ్ సత్యమూర్తి లోనైతే ఓపెనింగ్ లోనే  ఇదొక నరుక్కునే రాక్షసుల కుటుంబ కథ అన్న సీనేశారు. దీంతో మొత్తం ఫ్యామిలీ జానర్ ఖూనీ అయిపోయింది. ఇందులో హీరో పాత్ర తప్పులతడకయినా, కల్తీ జానరే  ప్రాణం తీసింది. యాక్షన్ జానర్ లో కాలం చెల్లిన సబ్ జానర్ ఫ్యాక్షన్ పట్ల విసుగెత్తింది ప్రేక్షకులకి. 



       కిక్-2 సింపుల్ గా తెలుగులో వర్కౌట్ కాని, యాక్షన్ జానర్ లో ‘ఫారిన్ (పరాయి) ఇష్యూ’  సబ్ జానర్ కిందికొస్తుంది. ఎక్కడో రాజస్థాన్ వాళ్ళ సమస్యలు అక్కర్లేదు తెలుగు ప్రేక్షకులకి. ఇక బెంగాల్ టైగర్ మాస్, యాక్షన్ సజాతి జానర్ల కథలోకి, క్రైం జానర్ ని దింపారు. లాజిక్ ని డిమాండ్ చేసే  క్రైం జానర్ ని, మాస్ యాక్షన్ తో కలపి,  దానికి కూడా లాజిక్ లేకుండా చేయడంతో- మొత్తం మాస్ యాక్షనే సెకండాఫ్ లో డొల్లగా మారింది.

        ఇలా జానర్ మర్యాదని కాపాడుకుని ఐదు పెద్ద సినిమాలని ప్రేక్షకులు హిట్ చేస్తే, కాపాడుకోలేని ఐదు పెద్ద సినిమాల్ని ఫ్లాప్ చేశారు.

(ఇంకా వుంది)
-సికిందర్
http://www.cinemabazaar.in









29, ఏప్రిల్ 2016, శుక్రవారం

షార్ట్ రివ్యూ!


రచన- దర్శకత్వం:  ప్రదీప్‌ చిలుకూరి
తారాగణం: నారా రోహిత్‌, నందమూరి తారకరత్న, ఇషా తల్వార్‌, అవసరాల శ్రీనివాస్‌, రఘు కారుమంచి, శశాంక్‌, శివాజీరాజా తదితరులు
సంగీతం: సాయి కార్తీక్‌, ఛాయాగ్రహణం: భాస్కర్‌ సామల
బ్యానర్‌ : వారాహి చలనచిత్రం, నిర్మాత : రజని కొర్రపాటి
విడుదల : ఏప్రిల్‌ 29, 2016
***
న సినిమాల కోసం తెలుగు ప్రేక్షకులు రోడ్డెక్కి ఆందోళన చేయకుండా, అకుంఠిత  దీక్షతో నెలకి రెండు మూడు  సినిమాలు చొప్పున యుద్ధ  ప్రాతిపదికన నటించేసి విడుదల చేయిస్తున్న నారా రోహిత్,  మండుటెండల్లో మరో బంపర్ ఆఫర్ ఇచ్చాడు ప్రేక్షకులకి- ‘రాజా చెయ్యి వేస్తే’ కూడా దయచేసి చూడమని. నారా వారబ్బాయి సినిమాలు అమరావతి అంత అద్భుతంగా వుంటాయన్న నమ్మకం ప్రేక్షకులకి ఏనాడో సడలిపోయినా, తనకి మాత్రం తన టాలెంట్ మీద విపరీతమైన నమ్మకం రోజురోజుకీ  పెరిగిపోతోంది. తరలి వస్తున్నకొత్త కొత్త దర్శకులు మొక్కు తీర్చుకోవడానికి తనే ఒక ఇలవేల్పులా అవతరించి ఆశీర్వదించేస్తున్నాడు.  గత నెలలోనే ‘తుంటరి’ ఇచ్చి, వెంటనే అర్జెంటుగా ఈ నెల ఫస్టున ‘సావిత్రి’ కూడా  ఇచ్చేసి, మళ్ళీ హడావిడిగా   ఈ నెలాఖర్లోనే  నారా - కాదు కాదు- ‘రాజా చెయ్యి వేస్తే’ కూడా సరఫరా చేశాడు. రాబోయే రోజుల్లో ఇంకో ఆరు సినిమాలు  తన నారావారి  అమ్ముల పొదిలోంచి ప్రేక్షకుల మీదికి సంధించేందుకు శరవేగంగా పూర్తి చేస్తున్నాడు.

         కొత్త దర్శకుడు ప్రదీప్ చిలుకూరి మంచి బ్యానర్, మంచి హీరో, మంచి విడుదల వంటి ప్లస్ పాయింట్స్ కి నోచుకునే అదృష్టం దక్కడం మామూలు విషయం కాదు. నారా రోహిత్ ఎందుకు మంచి హీరో అంటే, కొత్త తరహా కథలకి తను ఒకప్పటి నాగార్జునలా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తున్నాడు. అలా మంచి బ్యానర్, మంచి హీరో, మంచి విడుదల దక్కిన దర్శకుడు ఇక చూసుకోవాల్సింది తను వెనకబడిపోకుండానే!  రోహిత్ లెవెల్లోనే తనూ ఉండిపోతే బ్యానర్, విడుదల వంటి ప్లస్ పాయింట్స్ వృధా చేసుకున్నట్టే అవుతుంది. ఈ రెండిటిని అడ్డు పెట్టుకుని రోహిత్ లాంటి ఫ్లాప్ హీరోతో సక్సెస్ కొట్టి దర్శకుడుగా తను ఒడ్డున పడిపోయే ప్రయత్నం చేయాలి. ఇది జరిగిందా? ఓసారి కథలోకి వెళ్లి చూద్దాం...

 క్రైం మసాలా!
         
రాజారాం (నారా రోహిత్) సినిమా రంగంలో ఒక అసిస్టెంట్ డైరెక్టర్. మూడేళ్ళలో దర్శకుణ్ణి అవుతానని ఇంట్లో చెప్పి వచ్చేశాడు. కథలు రాసుకుని ప్రయత్నాల్లో ఉంటాడు. మాణిక్ (నందమూరి తారకరత్న) అని రాజకీయ నాయకుల కోసం హత్యలు చేసే ఒక ప్రొఫెషనల్ కిల్లర్ ఉంటాడు. ఇతను బహిరంగంగా హత్యలు చేసినా సాక్ష్యం  చెప్పడానికి ఎ వరూ ముందుకు రాకపోవడంతో పోలీసులు ఏమీ చేయలేకపోతారు. రాజారాం ఒక థ్రిల్లర్ కథ రాసుకుని నిర్మాతని కలుస్తాడు. నిర్మాత ప్రేమ కథ అడుగుతాడు. రాజారాం తన ప్రేమ కథే రాయడం మొదలెడతాడు. ఆప్రేమ కథలో,  ఒకసారి తను షార్ట్ ఫిలిం తీస్తున్నప్పుడు ఒకమ్మాయి కెమెరాకి అడ్డొస్తుంది. ఆమెని చూసి పడిపోతాడు. కొంత తిప్పుకుని అతడికి ఓకే చెప్పేస్తుందామె. ఆమె పేరు చైత్ర (ఇషా తల్వార్). సాఫ్ట్ వేర్.  అలా అలా ప్రేమకథ పూర్తి చేసి పంపిస్తే,  క్లయిమాక్స్ లో విలన్ ని చంపిన తీరు బావుందని సమాధానం వస్తుంది. ఆ విధంగానే ఒకణ్ణి చంపమని, కొరియర్ లో  రివాల్వర్, ఫోటో అందుతాయి. ఆ ఫోటోలో వున్నది మాణిక్. ఇతణ్ణి  చంపకపోతే నువ్వు చస్తావ్, నీ లవర్ చస్తుంది – అనేసి  బెదిరిపులు వస్తాయి. ఈ పరిస్థితుల్లో రాజారాం ఏం చేశాడు, మాణిక్ ని చంపాడా, దీని వెనుక ఎవరున్నారో తెలుసుకున్నాడా, చంపడానికి గల కారణాలు తెలుసుకున్నాడా – అన్నవి ఇక్కడ్నించీ ద్వితీయార్ధంలో సాగే కథలో తేలే విషయాలు. 

ఎలావుంది కథ
       
మొదలెట్టింది ఒక క్రైం కథ, తిరగబెట్టింది మాత్రం పాత మూస మసాలా లోకి. ఈ మూసలో మదర్ సెంటి మెంట్, చైల్డ్ సెంటి మెంట్, లాలిపాట, మెలోడ్రామా, పూజలూ పురస్కరాలు వంటి వన్నీ తెచ్చి  పెట్టేశాడు దర్శకుడు. ఇక ఫ్రెండ్స్ తో రొటీన్ మూస  ఆవారా తనాలూ, తాగుళ్ళూ, కామెడీలూ వేరే. ఇవేవీ ఈ తరహా కథలో ఇమిడేవి కావు. చాలా చిరాకు  తెప్పిస్తాయి దర్శకుడి చాదస్తానికి. చిన్నప్పటి కోరికలన్నీ ఈ కొత్త దర్శకుడు అవకాశం దొరికింది కదాని తీర్చుకున్నట్టుంది. అసలు చెప్పాల్సిన క్రైం కథకి వుండాల్సిన ఎలిమెంట్స్ కోసం కృషి చేయకుండా, ఇలాటివన్నీ తెచ్చి అడ్డమేశాడు. ఒక అసిస్టెంట్ డైరెక్టర్  తను రాసుకున్న కథతో  ఒక ప్రొఫెషనల్ కిల్లర్ ని చంపాల్సి వస్తే ఏం చేస్తాడు? అన్నసూటి ప్రశ్న దర్శకుడు వేసుకుని, దానికి కట్టుబడి వుంటే,  ఈ క్రైం కథ ‘క్షణం’ లా మరో ప్రొఫెషనలిజం తో కూడిన మంచి ప్రొడక్టు అయ్యేది.

ఎవరెలా చేశారు.
       
నారా రోహిత్ ఏం చేయగలడని  ఆశిస్తాం. అదే స్థూలకాయం, అదే భావాలు పలకని ముఖారవిందం, అదే రాయల్ గా నవ్వే  ఫేసు- ఏ పాత్రకైనా ఇంతేగా? సాయంత్రం పూట ఏ పేజ్ త్రీ పార్టీకో  వెళ్లినట్టు వుంటుంది గానీ, షూటింగ్ కి వెళ్తున్నట్టు వుంటుందా వాలకం? పాత్ర ప్రకారం తానొక సినిమా ప్రయత్నాల్లో వున్న దర్శకుడిగా కొంతైనా  డిఫరెంట్ గా కనపడాలిగా? వాడిలా నేనెందుకుంటాను, నేను నారావాణ్ణి అనుకుంటే ఎలా? చంద్రబాబే నిత్యం జనాల్లో పడి నిద్ర పోనివ్వడం లేదు.
        తను వెరైటీ కథల్ని ప్రోత్సహిస్తున్నప్పుడు తన వైపు నుంచి హోం వర్క్ లేకపోతే వెరైటీ కథలన్నీ ఇలాగే మట్టి కొట్టుకు పోతాయి. కొత్తగా దర్శకత్వ ప్రయత్నాల్లో వుండే ఔత్సాహికుల్ని ఏ కాస్తా తను పరిశీలించినా ఆ క్యారక్టర్ వచ్చేసేది.  కానీ ప్రతీ సినిమాలో ప్రతీ పాత్రలో  ఒకేలా కనపడ్డం, ఒకేలా ఎక్స్ ప్రెషన్ ఇవ్వడం అనే అశ్రద్ధ, అలసత్వాలతో తను ఎంత దూరం ప్రయాణించగలనను కుంటున్నాడో తనకే తెలియాలి. కనీసం సెకండాఫ్ లోనైనా ఒక థ్రిల్లర్ కథకి అతికే హీరో పాత్రలా కన్పించే ప్రయత్నం చేయలేదు. పైగా వొళ్ళు పెంచేసి అలాగే వదిలెయ్యడం చాలా విజువల్ టార్చర్ ప్రేక్షులకి.
        నారా వారసుణ్ణి పక్కన పెడితే,  ఇందులో నందమూరి వారసుడు కూడా నటించడం ఆసక్తి రేపింది. నందమూరి తారకరత్న ఇక లాభంలేదని విలన్ గా వచ్చేశాడు. ట్రూ ప్రొ ఫెషనలిజాన్ని ప్రదర్శించాడు. విలన్ గా తను కంటిన్యూ అవొచ్చు. అయితే ఈ సినిమాలోలా కాకుండా పాత్రకి కాస్త డెప్త్, అర్ధవంతమైన పగా ఉండేట్టు చూసుకోవాలి. నిజానికి నారా - నందమూరి వారసులతో మంచి అవకాశం కొత్త దర్శకుడికి. ‘బ్యాట్ మాన్ వర్సెస్ సూపర్ మాన్’ లా ఓ సంచలన, క్రేజీ ఘట్టం దర్శకుడికి. దీన్ని కూడా జా రవిడుచుకుని, ఇద్దరి మధ్యా  సంఘర్షణని ఈ స్పాట్ లైట్ లో హైలైట్ చేసి ప్రత్యేకాకర్షణగా నిలబెట్ట లేకపోయాడు.
        హీరోయిన్ ఇషా తల్వార్ కత్తిలా వుంది. ఈమె టాలెంట్ ని కూడా పాత్ర సరిగ్గా లేక వృధా చేసుకున్నాడు దర్శకుడు. పాటల విషయం చెప్పుకోనవసరం లేదుగానీ, కెమెరా, ఇతర సాంకేతిక హంగులు బ్యానర్ హోదాకి తగ్గట్టు వున్నాయి. కానీ నిర్మాతగా సాయి కొర్రపాటి విషయపరంగా ఓ క్వాలిటీ మూవీని మాత్రం అందించలేదు. 

 చివరికేమిటి?
         
స్టాఫ్ లో  ప్రేమ కథ రాసే పేరుతో  చూపించిన,   అమ్మాయిని లవ్ లో పడేసే స్టోరీ - ప్రతీ సినిమా ఫస్టాఫ్ లో వుండే అరిగిపోయిన పాత రొటీనే.  దీన్నుంచి రిలీఫ్ నివ్వలేకపోయాడు దర్శకుడు. ఈ లవ్ స్టోరీలో అనాధ శరణాలయం సన్నివేశం ఒక్కటే  కాస్త హాస్యభరితంగా వుంది. హీరో కుక్కని దొంగిలించే సీను అనవసర సాగతీతతో ‘బి’ గ్రేడ్ సినిమా బిట్ లా అభాసు అయ్యింది. ఫస్టాఫ్ లో కథలోకి వెళ్ళకుండా ప్రేమ కథనే  లాగించి ఎలాగో ఇంటర్వెల్ కి చేర్చినా అక్కడి మలుపు పేలవంగానే వుంది. దీని  తర్వాత సెకండాఫ్ అంతా చాలా పాత చాదస్తంతో వుంది. విలన్ ని ఎందుకు చంపాలో కారణం చెప్పేందుకు వేసిన ఫ్లాష్ బ్యాక్, అందులో లాలిపాట  మరో మైనస్. ఇంతా  చేస్తే ఆ పగా హీరోది కాదు, ఆ లక్ష్యమూ హీరోది కాదు- ‘ఊసరవెల్లి’ లో ఎన్టీఆర్ టైపు విఫలమైన హీరో పాత్ర. ఇక తర్వాతంతా  లాజిక్ లేని కథా కథనాలే. ఈ కథా కథనాలు, నటనలు పక్కన పెడితే, కొత్త కాంబినేషన్ ని కనీసం బాక్సాఫీసు అప్పీల్ కోసం ప్లాన్ చేసుకోవాలని కూడా ఆలోచన చేయలేదు. బ్యానరూ నారా రోహితూ కంటిన్యూ అవగలరు. ఈ సినిమాని ఇలా అమెచ్యూరి ష్ గా తీసిన ఈ  కొత్త దర్శకుడు???


-సికిందర్ 

27, ఏప్రిల్ 2016, బుధవారం

రైటర్స్ కార్నర్ :

  కప్పటి జంట రచయితలు సలీం - జావేద్ లు కలిసి స్క్రిప్టులు రాసినా డైలాగులు జావేదే  రాసినట్టు, పరుచూరి బ్రదర్స్ సెంటిమెంటల్ సీన్లు ఒకరు, యాక్షన్ సీన్లు మరొకరు పంచుకుని  రాసినట్టు, కవల సోదరులైన హాలీవుడ్ జంట రచయితలు  చాడ్ హేస్- కేరీ హేస్ లు యాక్ట్ లు పంచుకుని రాస్తారు. కలిసి 16 సినిమాలకి రాసిన ఈ కవల రచయితల తాజా సినిమా ‘కంజూరింగ్-2’ జూన్ 10 న విడుదల కాబోతోంది. వీరి పని విధానమేమిటో, కలిసి ఎలా పనిచేస్తారో ఒకసారి తెలుసుకుందాం..

     1. రాకెట్ డ్రాఫ్ట్ :కలిసి రాయడమంటే ఇద్దరూ కలిసి సీక్వెన్సులో రాసుకుపోవడం కాదు. సోలో రైటర్లు ఇలా రాయడానికే అలవాటు పడతారు. ముందు బిగినింగ్ రాసి, తర్వాత మిడిల్, ఆ తర్వాత  ఎండ్ పద్ధతిలో.  మా రాకెట్ డ్రాఫ్ట్ కోసం, అంటే ఫస్ట్ రఫ్ డ్రాఫ్ట్ కోసం- మా మెదడులో అప్పటికే రూపుదిద్దుకున్న సీన్లనీ, సీక్వెన్సుల్నీ రాస్తాం. వీటికి కనెక్టింగ్ మూమెంట్స్ ని రాకెట్ డ్రాఫ్ట్ పూర్తయాక రాస్తాం. దీంతో మేమనుకుంటున్న అతి ముఖ్యమైన సీన్లు, సీక్వెన్సులు పేపర్ పైకి వచ్చేస్తాయి. దీంతో ఈ సీన్స్ నీ, సీక్వెన్సుల్నీ కలిపే లింకుల గురించి చర్చిస్తాం. ఈ చర్చల్లో కోపతాపాలు, వాగ్యుద్ధాలూ మామూలే. ఇవి  కూడా భాగమే మా పని విధానంలో.  

          
2. యాక్ట్ ఎసైన్ మెంట్స్ : కలిసి రాయడమంటే సీక్వెన్సు లో రాసుకుపోవడం కాదని ఇందాకే  చెప్పుకున్నాం. మేమిద్దరం చెరొక యాక్ట్ పంచుకుంటాం.  ఫస్ట్ యాక్ట్ (బిగినింగ్) ఒకరు  తీసుకుంటే, సెకండ్ యాక్ట్ (మిడిల్) మరొకరు  తీసుకుంటాం.  ఈ తీసుకునే దగ్గర కూడా తీవ్ర చర్చ, గొడవ  జరుగుతుంది. ఇలా విడివిడిగా పంచుకుని ఈ రెండు యాక్టులూ రాశాక, థర్డ్ యాక్ట్ (ఎండ్) ని ఇద్దరం కలిసే  రాస్తాం. ఎందుకంటే ఇది అత్యంత కష్ట తరమైన భాగం.  ఈ రోజుల్లో ప్రేక్షకులు పెట్టే డబ్బుకి సరిపడా సంతృప్తితో కథని ముగించి ఇంటికి పంపించడమనేది చాలా కష్టంతో కూడుకున్న పనై పోయింది. థర్డ్ యాక్ట్ కలిసి  రాశాక, మొదట్లో విడివిడిగా రాసిన రెండు యాక్ట్స్ ని పరస్పరం మార్చుకుని వాటి మీద విడివిడిగా పని చేస్తాం. ఒకరు రాసిన యాక్ట్ ని మరొకరు దిద్దుతాం తప్పులేమైనా వుంటే. అలాగే నోట్స్ రాస్తాం, కొత్త అయిడియాలు స్ఫురిస్తే అవీ రాస్తాం. అప్పుడు ఆ రెండిటినీ చర్చిస్తాం. ఒక రూపానికి తీసుకొస్తాం.

        3. డ్రాఫ్ట్ ప్రాసెస్ : ఇప్పుడు సీన్లని బ్రేక్ డౌన్  చేస్తాం. ఇది కూడా సీక్వెన్సులో వుండదు. ఒక్కో సీన్ లాటరీ తీసి విడివిడిగా వాటి మీద వర్క్ చేస్తాం. మళ్ళీ పోల్చుకుంటాం. ఇది కూడా పూర్తయ్యాక డ్రాఫ్ట్ రాస్తాం. ఇది అనేక సార్లు తిరగ  రాశాకే ఫైనల్ కాపీ తీసి అందిస్తాం.


కొత్త రచయితలకి సూచనలు :

1. రాయండి, రాస్తూనే వుండండి :  రచయితగా మారాలంటే  ఏం కిటుకు లుంటాయంటే కిటుకులేమీ వుండవు, ఒకరికి చెప్పకూడని రహస్యాలేమీ లేవు. జస్ట్ రాయండి, అంతే. ఎక్కడైనా ఎప్పుడైనా రాయండి. ‘వన్ నోట్’  మీద రాయడం రైటర్స్ కి బాగా కలసివచ్చే అంశం. ఎక్కడైనా ఎప్పుడైనా అందుబాటులో  వున్న కంప్యూటర్, లాప్ టాప్, మొబైల్.. ఇలా  ఏ డివైస్ లో  నైనా  ‘వన్ నోట్’ ని ఓపెన్ చేసి వర్క్ చేసుకోవచ్చు.
కాఫీ షాప్ లో  ఓ మూడు నిమిషాలు లీజర్ దొరికిందా? ఐతే టాబ్లెట్ ఓపెన్ చేసి ‘వన్ నోట్’ లో ఓ రెండు పేరాలు రాయండి. ట్రైన్ లో పోతూండగా ఐడియా ఏదైనా తట్టిందా? మీ ఫోన్లో ‘వన్ నోట్’ ఓపెన్ చేసి రాయండి. రైటింగ్ అనేది నిరంతరం  సానబట్టుకుంటూ ఉండాల్సిన వృత్తి. రాయడానికి అవకాశం చిక్కినప్పుడల్లా రాస్తూనే వుండాలి.

 
2. బాగా చదవండి : గొప్ప రచయితలు ఎంత రాస్తారో అంత చదువుతారు. మీరు సినిమా రచయిత అయితే సినిమా స్క్రిప్టులు చదవండి. నవలా రచయిత అయితే నవలలు చదవండి. కథా రచయిత అయితే కథానికలు చదవండి. చెడ్డ కథలు చదివి వాటిని బాగా ఎలా రాయవచ్చో ఆలోచించండి.  మంచి కథలు చదివి ఇంకా మంచిగా ఎలా రాయవచ్చో ఆలోచించండి. ఏ ఖాళీ దొరికినా మేం స్క్రిప్టులు చదువుతూనే వుంటాం. వర్క్ తో బాటు  ఎంజాయ్ మెంట్ కోసం కూడా. వన్ నోట్’ తో ఇది సులభమవుతోంది. ‘వన్ నోట్’  లొ సేవ్ చేసిన వందల,  వేల స్క్రిప్టులు మా టాబ్లెట్ లో ఓపెన్ చేసి చదువుకుంటాం.

 
3. అవుట్ లైన్ తో  ప్రారంభించండి :  అవుట్ లైన్ చాలా  ముఖ్యం. మళ్ళీ రిపీట్ చేస్తాం :  అవుట్ లైన్ పెట్టుకుని  రాయడం ప్రారంభించండి.  మా కొచ్చే పెద్ద పెద్ద అయిడియాలన్నిటికీ    డైలాగులూ  యాక్షన్ ఆలోచించేకంటే ముందు, అవుట్ లైన్ వేసి చూస్తాం. ఒక్కటి బాగా గుర్తు పెట్టుకోండి : అవుట్ లైన్ గా వర్కౌట్ కాని ఐడియా స్క్రిప్టుగా వర్కౌట్ గాదు. అవుట్ లైన్ మీ కథకి రోడ్ మ్యాప్. స్క్రిప్టు రాస్తున్నప్పుడు రిఫరెన్స్ కోసం అవుట్  లైన్ ని వెతుక్కునే అవసరం లేకుండా,  ఈజీ యాక్సెస్ కోసం,  ‘వన్ నోట్’ లో   మీ వర్కింగ్ డ్రాఫ్ట్ పక్కన పెట్టుకోండి.


4. రాయండి, ఎడిట్  చేయండి, రిపీట్ చేయండి : రచయితలు  తిరిగరాత గాళ్ళే. రాసేకన్నా తిరగ రాసేదే  ఎక్కువ వుంటుంది. ఈ వృత్తే అలాంటిది. చాలా మానసిక శ్రమ డిమాండ్ చేసేది. ‘ది కంజూరింగ్-2’ అనే మా  స్క్రిప్టుని 150 సార్లు తిరగ రాస్తే గానీ ఫైనల్ కాపీ తయారు కాలేదు. ఆ తిరగ రాసిన ప్రతి చిత్తు ప్రతినీ ‘వన్ నోట్’ లో సేవ్ చేసి వుంచాం. స్క్రిప్టు ని  స్టూడియోకి సబ్మిట్ చేసే ముందు ఇదంతా చేస్తాం. ప్రొడక్షన్ ప్రాసెస్ లో స్టూడియో ఎగ్జిక్యూటివ్ ల నుంచి, నిర్మాతల నుంచి, నటీనటుల నుంచీ, దర్శకుడి నుంచీ మాకందే బెటర్ మెంట్ నోట్స్ ని దృష్టిలో పెట్టుకుని మళ్ళీ తిరగ రాస్తాం. ఇదంతా పేపర్ మీద గంటల కొద్దీ పట్టే  ఎడింగ్ పని కాదు, ఖర్చుతో కూడిన ప్రింటింగ్ తోనూ పనిలేదు, నోట్స్ ఎక్కడో మిస్సయ్యే సమస్యా  వుండదు- ‘వన్ నోట్’ లోనే ఇదంతా సాఫీగా తేలిగ్గా జరిగిపోతుంది.


5. కలిసి  రాసే ప్రయత్నం చేయండి : ఇంకొకర్ని కలుపుకుని రాయడం ఎప్పుడూ మంచిదే. చేస్తున్న తప్పులు తెలుస్తూంటాయి. మేమిద్దరం పగలు కలిసి పని చేస్తాం. రాత్రి  ‘వన్ నోట్’ లో వర్కింగ్ స్క్రిప్ట్ ఇంటికి పట్టుకు  పోతాం. ఆ రోజు జరిగిన వర్క్ మీద నోట్స్ రాస్తాం, సందేహాలు నోట్ చేస్తాం, కొత్త ఆలోచనలు ప్రతిపాదిస్తాం.  అప్పటి కప్పుడు ఒకరు రాస్తున్నది మరొకరం  రియల్ టైంలో   టాబ్లెట్ లో  చూసుకుంటాం. కలిసి రాయడంవల్ల మా క్రియేటివిటీ మరింత విస్తృతమవుతూంటుంది. అంతే గాక కొత్త పద్ధతుల్లో రాసే ఉపాయాలు తెలుస్తూంటాయి ‘వన్ నోట్’ లాగా.



   ***