రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

26, మార్చి 2016, శనివారం

తెలుగు సినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్- 10








(స్ట్రక్చర్ నేర్చుకునే ఆసక్తి పరులందరికీ జరుగుతున్న జాప్యానికి  మరొక్కసారి సారీ చెప్పుకుంటూ, ఈ పదవ భాగం నుంచీ వ్యాస పరంపరని తిరిగి కొనసాగిస్తూ, ఇక క్రమం తప్పకుండా వారంవారం అందించి ముగిస్తామని ఇంకోసారి ప్రామీస్ చేస్తూ...మరొక్కసారి స్వాగతం!)

తెలుగుసినిమా స్క్రీన్ ప్లే స్ట్రక్చర్ వ్యాసాల్లో భాగంగా ‘శివ’ ని ఆధారంగా చేసుకుని బిగినింగ్ విభాగ రచన గురించే చెప్పుకున్నాం. ఇంకా మిడిల్ విభాగాన్ని ప్రారంభించేముందు, మిడిల్ ఏ సైజులో, ఏ నిష్పత్తుల్లో ఉండాలో, వుండనప్పుడు ఫలితలెలా వుంటాయో  గత రెండు వ్యాసాల్లో చెప్పుకొచ్చాం. ఒకరు తయారు చేసే కథల మీద ఎక్కువగా  మిడిల్ విభాగం మీదే ఇతరుల చేతులు పడతాయి. అందువల్ల మిడిల్ విభాగపు స్ట్రక్చర్ చెదిరిపోయే అవకాశాలే ఎక్కువ వుంటాయి. దీన్ని రచయితలు ఆపలేకపోవచ్చు.  రాజీ పడడమో, లేదా కథ వెనక్కి తీసుకోవడమో ఏదో ఒకటి చేయాలి తప్ప మరో మార్గం లేదు. అలా కాకుండా కథ మీద ఎన్ని అమృత హస్తాలు పడ్డా పూర్తిగా చెడిపోకుండా  కాపాడుకునే రహస్యమేదైనా వుందా అన్న అన్వేషణలో భాగంగా గత వ్యాసం(ఫిబ్రవరి 4, 2016) వెలువరించాం. ఇక తర్వాతి భాగం కొనసాగిద్దాం.

       సినిమా కథెప్పుడూ రచయిత భావ స్వేచ్ఛ కాదు. దర్శకుడి భావ స్వేచ్ఛ కావొచ్చు, అరుదుగా నిర్మాత భావస్వేచ్ఛ కావొచ్చు. అయితే ఈ భావ స్వేచ్ఛతో వుండే  ప్రమాద మెంతవరకూ అంటే, దాంతో పైపై నియమాల ఉల్లంఘన జరిగేంతవరకూ మాత్రమే. ఈ నియమాల అడుగున కథకో ఆత్మ వుంటుంది. ఆ ఆత్మని దెబ్బతీసే దాకా భావ స్వేచ్ఛ పోదు. చాలా మందికి కథకి ఆత్మ ఉంటుందనే తెలీదు. కాబట్టి ఆ లోతులదాకా  వాళ్ళ ఆలోచనలు సాగవు. ఒకవేళ ఆత్మ వుంటుందని తెలిసిపోయి, దానిమీద కూడా చేతులేద్దామనుకుంటే, అది సాధ్యంకాని పద్ధతిలో లాక్ వేస్తామన్న మాట. ఆత్మకి లాక్ వేసేస్తాం. అయినా కూడా  తాలిబన్ మర్కటాలు బామియాన్ బుద్ధ  విగ్రహాల్ని కూల్చినట్టు, ఆ లాక్ ని కూడా పేల్చేసి కథా సౌధాన్ని కూల్చే సాంస్కృతిక విద్రోహానికి పాల్పడుతూంటే మాత్రం, కథని ఎత్తుకుని పారిపోయే పూర్తి రాజ్యాంగ హక్కు ప్రతీ రచయితకీ  ఎలాగూ వుంటుంది.

          మిడిల్ విభాగంలో కథాత్మకి ఈ లాక్ వేసే రహస్యాన్నే  మనం తెలుసుకోబోతున్నాం. రహస్యాన్ని ఇంత ఓపెన్ గా చెప్పేస్తే వాళ్లకి తెలిసి పోతుంది కదా, అప్పుడేం లాభమని అన్పించవచ్చు. వాళ్ళు కూడా తెలుసుకుంటేనే  బావుంటుందని..  తాలిబన్లు అన్పించుకోవడం ఎవరికీ ఇష్టముండదన్న నమ్మకంతో.

          సినిమా కథని మౌఖికంగానే చెప్పే సాంప్రదాయం కొనసాగుతోంది. రచయిత తన స్నేహితులకి, అదే రచయిత  దర్శడికి, దర్శకుడు నిర్మాతకి, ఆపైన హీరోకీ మౌఖికంగానే కథ చెప్పుకుంటారు. చదువుకోమని ఫైలు ఇచ్చేసి రావడం వుండదు.  ఇలా ఒకరి నుంచి  ఒకరికి మౌఖికంగా చేరే కథ మారకుండా ప్రసారమవుతూ వుంటుంది. మౌఖికంగా చెలామణిలో వున్నంతవరకూ ఢోకా వుండదు. ఓవరాల్ గా అది ఓకే అయ్యి, ఆతర్వాత రాత పనిలో కొచ్చే టప్పటికి రోజుకో రకంగా మారిపోతూ వుంటుంది. ఎన్ని చేతులు పని చేస్తే అన్ని రకాలుగా మారిపోతూ వుంటుంది. ఇందుకే స్టీఫెన్ కింగ్ కూడా అన్నాడు- మిలియన్ డాలర్లు పెట్టి నా నవల కొనుక్కుని, దాంతో సంబంధంలేని సినిమా ఎందుకు తీస్తారో అర్ధం కాదని!  

          కాబట్టి తెలుగు సినిమా రచయితలు  ఈ ప్రపంచంలో తామొక్కరే బాధితులమని ఆత్మస్థైర్యం  కోల్పోనవసరం లేదు, హాలీవుడ్ లో కూడా తమలాంటి బాధితులు తోడుగా వున్నారు.

          కథల్ని క్రియేట్ చేయలేని వాళ్ళే ఎక్కువ. వాళ్ళే కథలమీద గొప్ప గొప్ప వ్యాఖ్యానాలూ విమర్శలూ చేస్తారు. కథల్ని  ముందు పెట్టుకుని డిస్కస్ చేస్తారు, డిసెక్షన్ చేస్తారు, మొత్తంగా డిమాలిష్ చేస్తారు. డిస్కషన్స్ కి వచ్చేవాళ్ళు చాలా మంది ఒక్క  కథ రాయలేరుగానీ, పేపర్ మీద ఓ రైటర్ మెదడులోంచి బయటికి తీసి అక్షర రూపమిస్తే, అది ముందు పెట్టుకుని జడ్జీ లైపోతారు, అలా కాదు ఇదిలా వుండాలని మార్చేస్తూంటారు. పైగా నిర్ణయించే హోదాలో వున్న తామే గొప్ప వాళ్ళమని ఫీలైపోతూ, ఆ రైటర్ ని హీనంగా చూస్తారు, అతణ్ణి తప్పించేస్తారు. కోటి రూపాయల సినిమా అయినా పుట్టడానికి కారణమైన రైటర్ ఎక్కడో నించుని, తను వేసిన బీజం మీద జరుగుతున్న తమాషానీ, దాంతో వాళ్ళ కోరికల్నీ జాలిగా చూస్తూంటాడు. 

          కనుక సున్నిత  హృదయులు కథలు రాసుకుని ఇక్కడికి రానక్కర్లేదు. పత్రికకి కథ ఇస్తే దాన్ని విడివిడిగా పాఠకులు చదువుకుంటారు. సినిమాని ఒకే సారి థియేటర్ కి వెయ్యిమంది చొప్పున, కొన్ని వందల థియేటర్లలో కొన్ని లక్షలమంది ఏకకాలంలో చూస్తారు. ఏమాత్రం తేడాగా వున్నా అన్ని లక్షలమంది  గోలగోల చేసి ఒకే సారి తిప్పి కొడతారు. సినిమా వాళ్లకి నిత్యం ఈ భయం వెన్నాడుతూంటుంది. పత్రికలకి ఈ సమస్య వుండదు. పత్రికల్లో ఆ ఒక్క కథే కాకుండా ఇంకా కొన్ని కథలూ, శీర్షికలూ వుంటాయి. బాగా లేని కథ కల్గించే  అసంతృప్తిని  ఇవి కవర్ చేస్తాయి. సినిమా వాళ్ళకి కవర్ చేసుకోవడానికి ఏమీ మిగలదు, నెత్తి  మీద గుడ్డ తప్ప. అందుకని వాళ్ళ దృష్టి కోణం లోంచి కూడా చూడాలి. సమంజసమైన వాళ్ళ అభద్రత వీలైనంత ఎక్కువమందితో  సలహాసంప్రదింపుల్ని కోరుతుంది కథల మీద. వచ్చిన చిక్కేమిటంటే వాళ్ళందరూ  నిష్ణాతులు కారు. లేకపోతే ఇంత చేసినా ఏటేటా 90 శాతం సినిమాలెందుకు ఫ్లాపవుతాయి? 

          కాబట్టి, హిచ్ కాక్  చెప్పినట్టు సినిమా తీయడమంటే 90 శాతం పేపర్ వర్కే,  90 శాతం ఫ్లాపులు తీయడం కాదు! ఇక్కడేం జరుగుతోందంటే, హృదయంలోంచి వచ్చిన, ఓ సుముహూర్తాన సబ్ కాన్షస్ మైండ్ అందించిన, దాన్ని నల్గురూ  మౌఖికంగా చెప్పుకుని ఆనందించిన కథే, పేపర్ మీదికి వచ్చేటప్పటికి ఒరిజినాలిటీని కోల్పోయి రకరకాలుగా మారిపోతోంది! 

          నిజంగా సినిమా రంగం చాలా విచిత్రమైనది. సమాజానికి రివర్స్ గేర్ లో వుంటుంది! మానవ చరిత్రలో చూసుకుంటే, కథలు మౌఖికంగా చెప్పుకుంటూ పోతున్నంత కాలం రకరకాలుగా మారిపోతూ ఉండేవి, అవే రాతల్లో  కొచ్చేటప్పటికి మారకుండా స్థిరంగా  వుండిపోతున్నాయి శతాబ్దాల కాలం. లిపి రెండంచుల కత్తి అన్నమాట!

          తాజాగా ఇటీవల భూటాన్ రచయిత్రి  కంజాంగ్ చోడెన్ ఒక ఇంటర్వ్యూ లో పేర్కొన్న దాని ప్రకారం, భూటాన్ లో కథా సాహిత్య మనేది గత యాభై ఏళ్ళు గానే ప్రచురిత మవుతోంది. యాభై ఏళ్ల క్రితంవరకూ శతాబ్దాల పాటు కథలు జనం నోళ్ళలోనే నానేవి. ఒకతరం నుంచి ఇంకో తరానికి మౌఖిగంగానే వ్యాప్తి చెందేవి. ఒక కథని ఎవరో ఒక గ్రామంలో పుట్టిస్తే అది విని పక్క గ్రామంలో ఇంకెవరో తనదైన  కళాపోషణతో ఇంకోలా చెప్పే వాడు. ఇది విని ఇంకొకడు ఇంకోలా చెప్పేవాడు. పాయింటు ఒకటే, వ్యాఖ్యానాలు వేర్వేరుగా ప్రచారమయ్యేవి. శతాబ్దాల పాటు ఇదే జరుగుతూ వచ్చింది.  ఏ కథ పుట్టినప్పుడు ఎలా ఉండేదో ఎవరికీ తెలీదు. ఈ కథల్ని ఇలాగే  మౌఖిక రూపంలో వదిలేస్తే కొన్నాళ్ళకి  అంతరించిపోతాయని, ఇంగ్లీషులో వాటిని రాసి రికార్డు చేశారు రచయిత్రి. అప్పటినుంచి ఇవి మారకుండా స్థిరంగా ఉండిపోయాయి. మహాజనుల మౌఖిక  స్టోరీ డెవలప్ మెంట్  ప్రక్రియకి ఇక ఫుల్ స్టాప్ పడింది. భూటాన్  లో పిల్లలు ఈ ప్రింటైన జానపద, పురాణ కథలే ఇప్పుడు చదుకుంటున్నారు.

          మరో వైపు చూస్తే,  హాలీవుడ్ స్క్రీన్ ప్లే పండితుడు జేమ్స్ బానెట్ జానపద కథలు అక్షర రూపం దాల్చడంతో ఆ సంపదకి తీరని హానియే  జరిగిందని  అభిప్రాయపడ్డారు. 1970 లలో జేమ్స్ బానెట్ రచయితనవుదామని హాలీవుడ్ వచ్చారు. గొప్ప క్వాలిటీతో స్క్రిప్టులూ నవలలూ రాద్దామనుకున్నారు. కొన్నేళ్ళు స్క్రిప్టు లేవో రాసి, ఇక గొప్ప నవల రాద్దామనుకుని ఆర్నెల్లు అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఆరునెలల్లో  600 పేజీలు రాసినా ఆ కథ అంతు చిక్కడంలేదు. దీంతో గొప్ప కథని సృష్టించాలంటే తనకున్న శక్తి చాలదని, ముందు అసలు కథంటే ఏమిటో తెలుసుకుంటేనే రాయగలనని అనుకుని, ఇంకో మహా ప్రయాణానికి ఒడిగట్టారు. ప్రయాణం కట్టేటప్పుడు పదేళ్ళు పడుతుందని ‘కాసాబ్లాంకా’ రచయితకి చెప్పి వెళ్లారు. 

          ఇరవై ఏళ్ళ వరకూ పత్తా లేరు. ఈ ప్రయాణంలో ఎక్కడెక్కడున్నారో తెలీదు. కథంటే ఏమిటో తెలుసుకోవాలన్న పట్టుదలతో రుషిలా మారిపోయి, ప్రపంచ పురాణాలు ( హిందూ పురాణాలు సహా) , జానపద కథలే కాకుండా, వందలాది సినిమాలూ  పరిశీలించారు, పరిశోధించారు. సంఘర్షణ పడ్డారు, చివరికి తను  కనుగొన్నది రాసుకుని బయటికి వచ్చారు. 1999లో దాన్ని ప్రచురించారు. అదే
‘Stealing Fire From The Gods’  (దేవతలనుంచి దివ్యమంత్రాన్ని తస్కరిద్దాం!) అన్న కథలకి బైబిల్లాంటి గ్రంథం. ప్రపంచ వ్యాప్తంగా యూనివర్సిటీల్లో కోర్సుల్లో  బోధిస్తున్న పాఠ్యాంశం. అంతర్జాతీయంగా  రచయితల, దర్శకుల కళ్ళు తెరిపించిన స్క్రీన్ ప్లే శాస్త్రం. 

          మొట్టమొదట లిపి లేని కాలంలో ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషల్లో  పుట్టిన జానపద కథలు మౌఖికంగా ఒకరి నుంచి ఇంకొకరికి వ్యాప్తి చెందుతూ, నిరంతరం మార్పు చెందుతూ ఉండేవి. అవి అరేబియన్ నైట్స్ కథలైనా కావొచ్చు, కాశీ మజిలీ కథలైనా కావొచ్చు- ఏ భాషల్లో ఏవైనా  కావొచ్చు. లిపి లేని కాలంలోప్రజల నోళ్ళల్లో నానుతూ ఆయా కాలాలకి తగ్గ జ్ఞాన సంపదతో, అనుభవాలతో, విలువలతో కొత్త కొత్త రూపాలు సంతరించుకుంటూ మహాప్రయాణం సాగిస్తున్న అవి, లిపిని కనుగొనడంతో ఇక మార్పు చెందని శిలాక్షరాలుగా బందీ అయిపోయాయి. ఇవ్వాళ్ళ మనం చదువుతున్న జానపద కథలు మారే ప్రసక్తే లేదు. ఒక కాలంలో ఆగిపోయిన ఈ కథలవల్ల, ఇంకోనష్టం కూడా జరిగింది. అదేమిటంటే, మా నవ జాతి నేటి కాలంలో ఎదుర్కొంటున్న వివిధ కొత్త సమస్యలకి అవి ఏ మాత్రం సైకోథెరఫీ చేయలేకపోతున్నాయి. ప్రతీ జానపద కథా సైకో థెరఫీ చేస్తూనే  పుట్టింది. సైకో థెరఫీ కోసం, మానసిక రుగ్మతల్ని తొలగించుకోవడం కోసం ఇవి పుట్టాయి. పుట్టిన ప్రతీ జానపద కథా ప్రపంచంలో ఒకే కథా నిర్మాణంతో పుట్టింది. బిగినింగ్, మిడిల్, ఎండ్ అనే పద్ధతిలో. ఏ పద్ధతిలో, లేదా నిర్మాణంలో  కథ చెప్తే మానవ మస్తిష్కం స్వీకరించగలదో, మానవ మస్తిష్కానికే  తెలుసు కాబట్టి, ఆ కథ చెప్పే విధాన ప్రక్రియని యధాలాపంగా మానవ మస్తిష్కమే సరఫరా చేస్తూ వస్తోంది యుగాలుగా. జన్యువుల ద్వారా మానవకోటికి ఈ విద్య తరతరాలుగా సంక్రమిస్తూ వస్తోంది.

          ఇంతకీ ఈ బిగినింగ్, మిడిల్, ఎండ్  నిర్మాణంలో అంతస్సూత్ర మేమిటి? ఏది వీటిని  కలిపి వుంచుతోంది? కథంటే సైకో థెరఫీ గనుక, ఆ సైకాలజీ లోంచే, మానసిక అవసరాలకోసమే,  కాన్షస్ -  సబ్ కాన్షస్ మైండ్స్ ని మధించి పుట్టింది కథనేది. నిత్యం స్వర్గంలాంటి కాన్షస్ లో తారట్లాడుతూ, అటు నిగూఢ రహస్యాల మహా సముద్రంలాంటి సబ్ కాన్షస్ లోకి వెళ్లేందుకు, కనీసం తొంగి చూసేండుకూ జంకుతుంది మన టక్కరి  ఇగో.  అలాటి జిత్తులమారి ఇగో ని,  సబ్ కాన్షస్ లోకి బలవంతంగా నెట్టి,  దాని భయాలన్నీ తీర్చి ఒడ్డున చేర్చడమే ఏ కథ పరమార్ధమైనా!

          మనం ఇగోని హీరోగా చేసి దాన్ని బిగినింగ్ ( కాన్షస్ మైండ్) సుఖ సంతోషాల నుంచి, మిడిల్ ( సబ్ కాన్షస్) లోకి నెట్టి, అక్కడి శక్తులతో సంఘర్షింప జేసి, విజేతగా ఎండ్ ( తిరిగి కాన్ష మైండ్) లోకి తీసుకొచ్చేస్తామన్న మాట. కాబట్టి కథంటే  సబ్ కాన్షస్ లో ఇగో చేసే జర్నీ. రచయితలకి మానసిక శాస్త్ర పరిచయంలేకపోతే, కనీసం తమ సొంత మైండ్ ఎలా పనిచేస్తుందో తమకే తెలియకపోతే  రాణించడం కష్టం.  ప్రపంచంలో ఏదైనా మైండ్ లోంచే, మైండ్ రిసీవ్ చేసుకునే స్ట్రక్చర్ తోనే, మైండ్ కోసమే పుడుతోంది. ప్రజలకి ఓ కథ / సినిమా నచ్చ లేదంటే అది సైకో థెరఫీ చేసే మైండ్ లోంచి పుట్టలేడనే అర్ధం. అంటే కాన్షస్- ఇగో- సబ్ కాన్షస్ ల ఇంటర్ ప్లే తో రాయలేదనే అర్ధం! సినిమా స్క్రీన్ ప్లే అంటే కాన్షస్- సబ్ కాన్షస్ ల ఇంటర్ ప్లే అని సశాస్త్రీయంగా నిరూపించాడు జేమ్స్ బానెట్. ఈ పుస్తకాన్ని  ప్రతివొక్కరూ విధిగా చదివి అర్ధం జేసుకోవాలి!  ఉచితంగా పీడీఎఫ్ ప్రతిని కూడా డౌన్ లోడ్ చేసుకోవచ్చు.

-సికిందర్ 

25, మార్చి 2016, శుక్రవారం

షార్ట్ రివ్యూ!

స్క్రీన్ ప్లే - దర్శకత్వం : వంశీ పైడిపల్లి

తారాగణం : నాగార్జున అక్కినేని, కార్తీ, తమన్నా, ప్రకాష్ రాజ్,
ఊర్వశి, జయసుధ, అలీ, తనికెళ్ళ తదితరులు
మాటలు : అబ్బూరి రవి, సంగీతం : గోపీ సుందర్, ఛాయగ్రహణం : పి ఎస్ వినోద్
బ్యానర్: పివిపి సినిమా , నిర్మాత : ప్రసాద్ వి. పొట్లూరి
విడుదల : 25 మార్చి, 2016
***

       న కెరీర్ సెకండ్ ఇన్నింగ్స్ లో ప్రయోగాత్మక సినిమాలతో దూసుకెళ్తున్న నాగార్జున అక్కినేని ‘ఊపిరి’ తో మరో మెట్టు పైకెక్కి హ్యాట్ ట్రిక్ సాధించారు. సరీగ్గా కెరీర్ ప్రారంభంలో కూడా కొత్త దర్శకులకి, పరభాషా దర్శకులకీ  అవకాశమిస్తూ శివ, గీతాంజలి, ద్రోహి లాంటి డిఫరెంట్ సినిమాలతో ప్రయోగాలు చేసిన చరిత్రే పునరావృతం చేస్తున్నారు. అప్పుడూ ఇప్పుడూ విజయాలే సాధిస్తున్నారు. నాగార్జున ట్రేడ్ మార్క్ ఇప్పుడు విలక్షణ సినిమా అయ్యాక ఆయనకి యూత్ లో ఫాలోయింగ్ అనూహ్యంగా విపరీతంగా పెరగడం గమనార్హం. ఎందుకని? ఆయనేం స్టెప్పులేసి, ఫైట్లు చేసీ  అలరించే ప్రయత్నం చేయడం లేదే? ఇది ఆలోచించాల్సిన విషయం. ‘ఊపిరి’ లోనైతే పూర్తిగా చైర్ కే బందీ అయిపోయి కూర్చున్నా ఆయన్ని అభిమానించడానికి ఇదేం ప్రతిబంధకం కాలేదు.

        నాగార్జున- తమిళ స్టార్ కార్తీ- టాప్ హీరోయిన్ తమన్నాలతో ఊపిరిఒక జాయ్ రైడ్. మనం’, ‘సోగ్గాడే చిన్ని నాయనాలాంటి ఎంటర్ టైనర్స్ తో  పాలిష్ చేసిన కామెడీని, కథల్నీ ఇచ్చిన నాగార్జున,  మరోసారి ఇదే ట్రేడ్ మార్క్ వినోదానికి కట్టుబడ్డం, దీన్ని సరీగ్గా అర్ధం జేసుకుని దర్శకుడు వంశీ పైడిపల్లి నీటుగా తెరకెక్కించడం ఊపిరికి ఊపిరిపోశాయి.
తెలుగు
, తమిళ స్టార్స్ ఓకే సినిమాలో కలిసి నటించిన సందర్భం ఇటీవలి కాలంలో ఎప్పుడూ లేదు. ఇప్పుడు నాగార్జున- కార్తీల కాంబినేషన్ ఆ లోటు తీరుస్తోంది. అయితే ఈ సినిమా పూర్తిగా అనుకున్న లక్ష్యాన్ని నేరవేర్చుకుందా అన్న ప్రశ్న సహజంగానే తలెత్తు తుంది- ఎందుకంటే ఇదొక ఫ్రెంచి సినిమాకి రీమేక్ అంటూ చాలా ప్రచారం జరిగింది కాబట్టి.  మరి ఈ రిమేక్ కి ఎంతవరకు న్యాయం చేశారో చూద్దాం..

కథ 
        దొంగతనాలు మరిగిన శీను ( కార్తీ) పెరోల్ మీద జైలు నుంచి విడుదల అవుతాడు. ఈ పెరోల్ కాలంలో సమాజంలో సత్ప్రవర్తనతో మంచి  పేరు తెచ్చుకుంటే శిక్షా కాలం తగ్గుతుందని లాయర్ (అలీ) చెప్పి,   అనాధాశ్రమంలో, వృద్ధాశ్రమంలో సేవలు చేయడానికి తీసికెళ్ళి విఫలమై, ఒక రిచ్ మాన్ విక్రమాదిత్య దగ్గరికి పంపిస్తాడు. విక్రమ్ ఒక పారా గ్లైడింగ్ ఈవెంట్ లో ప్రమాదంపాలై శరీరం చలనం కోల్పోయి వీల్ చైర్ కి బందీ అయిపోతాడు. అతడికి  శీను సేవలు చెయ్యాలన్నమాట. అక్కడే విక్రమ్  సెక్రెటరీ కీర్తి ( తమన్నా ) వుంటుంది. ఈమెని చూసిన మొదటి క్షణంలోనే మనసు పారేసుకుంటాడు. సున్నితంగా డీల్ చేయాల్సిన  విక్రమ్ తో తన ధోరణిలో రఫ్ గా ప్రవర్తించడంతో ప్రారంభమవుతుంది ఇద్దరి మధ్యా ఒడిదుడుకుల అనుబంధం. ఈ అనుబంధం ఎక్కడికి దారి తీసిందీ, ఈ  పరస్పర పరిచయంలో  భిన్న ధృవాలైన ఇద్దరూ జీవితంలో ఏం నేర్చున్నారూ- అన్నది మిగతా  కథ.

 ఎలా వుంది కథ 
        యూనివర్శల్ బ్రదర్ హుడ్. సౌభాతృత్వం. దీనికి అంతస్తులు అడ్డురావన్న సార్వజనీన అంశంతో కూడుకుని వుంది. ఇద్దరు మగాళ్ళ మధ్య ఇదొక  బ్రోమాన్స్ కావొచ్చు, మేల్ బాండింగ్ కావొచ్చు- ఏమైనా అది పోగొట్టుకున్న చోటే వెతుక్కోవాలన్న కామన్సెన్స్ ని ఉద్బోధిస్తూ క్లాస్- మాస్ వర్గాలందరికీ సూటిగా తాకే విధంగా వుంది.

ఎవరెలా చేశారు 
        నిస్సందేహంగా నాగార్జున ఈ పాత్రకి భిక్ష పెట్టారు. ఎవరూ సాహసించలేని ఇలాటి పాత్రకి తను భిక్ష పెడితేనే ప్రేక్షకుల ముందు కొచ్చింది. ఇలా ముందు కొచ్చాక నిరా శపర్చలేదు. ఎందుకంటే ఇది చైర్ లో కూర్చుని తన దురదృష్టానికి ఏడుస్తూ వుండే తెలుగు మార్కు (బకరా) పాత్ర కాదు. పైపెచ్చు అలా తనమీద జాలి పడుతూ పలకరించే వాళ్ళతో విసిపోయాడు. అందుకే ఏ జాలీ దయా వంటి మనవ గుణాలు ఏమాత్రం లేని శీనుని పెట్టుకున్నాడు. ఎమోషన్స్ ని సున్నితంగా ప్రదర్శించడం, ఓ చిరున్నవ్వుతో కష్టాల్లో వున్న వాళ్ళ సమస్యలు తీర్చేయ్యడం, ఈ రెండు యాంగిల్స్ లో సాగే పాత్ర  నాగార్జున మెచ్యూరిటీకి పరీక్షే. ఒక గుర్తుండి పోయే అభినయ కౌశలంతో  ఇక్కడ నాగార్జునని చూస్తాం.

        అలాగే కార్తీ. ఇతడి వేషాలు ఎంత నవ్విస్తాయో, విశ్వాసం అంత ఆలోచింప జేస్తుంది. పక్కా మాస్ పాత్ర. వచ్చి స్వర్గ సుఖాల్లో పడ్డాడు నాగార్జున బంగళాలో. పైగా అక్కడే అందమైన అమ్మాయి తమన్నా. ఈమె  కూడా నీటుగా  తన పాత్రని పోషించుకొచ్చింది. ఇక నాగార్జున ఫ్రెండ్ గా ప్రకాష్ రాజ్ పాత్రతో శీను పెయింటింగ్ ఎపిసోడ్ కామెడీకి, ప్రకాష్ రాజ్ సెన్సాఫ్ హ్యూమర్ థియేటర్లు దద్దరిల్లేలా వుంది. 

        మిగతా మైనర్ పాత్రల్లో కార్తీ తల్లిగా జయసుధ, నాగార్జున ఆయాగా ఊర్వశి తదితరులు కన్పిస్తారు.

        దర్శకుడు వంశీ పైడిపల్లి గురించి చెప్పుకోవాలంటే అతడి దర్శకత్వ శైలి ఈసారి బాగా మెరుగుపడి ఉన్నతంగా వుంది. ఎక్కడా చీప్ సీన్లు, చీప్ నటనా, ఇంకే చీప్ విషయాలూ వచ్చి చొరబడకుండా చాలా జాగ్రత్త తీసుకున్నాడు. బహుశా ఫ్రెంచి మూవీ ప్రభావం ఇది. విదేశీ సినిమాల్లోంచి దర్శకులు సంస్కారవంతమైన దర్శకత్వాన్ని కూడా నేర్చుకుంటే సినిమాల క్వాలిటీ చాలా మెరుగుపడుతుంది. వంశీ గతంలో తీసినవి రొటీన్ రొడ్డ  దర్శకత్వాల తెలుగు సినిమాలు. నాగార్జున సౌజన్యంతో ప్రస్తుత సినిమాతో పాలీషు పట్టిన మరో  మనంవిక్రం కుమార్ లా తను మెరిసినప్పుడు ఈ మెరుపుని ఇంకా ముందు సినిమాల్లో కూడా ప్రదర్శిస్తారని ఆశిద్దాం.
 

        అబ్బూరిరవి పొడిపొడి సంభాషణలు కొన్ని సందర్భాల్లో చాలా బలంగా వున్నాయి. మనిషి వెళ్ళిన చోటల్లా మనసు వెళ్ళదు... అనే డైలాగుకి ప్రతి వొక్కరూ ఒక్క క్షణం ఆగి ఆలోచనలో పడతారు. 

        సంగీతం పాటలూ కథానుసారం నడిచిపోయాయి తప్ప పెద్దగా చెప్పుకునేది లేదు. పి ఎస్ వినోద్ ఛాయాగ్రహణం ఉన్నత ప్రమాణాలతో వుంది. అలాగే నిర్మాత పొట్లూరి ప్రసాద్ ఎంత ప్రొడక్షన్ విలువలు చాలా చాలా రిచ్ గా వున్నాయి. 

చివరి కేమిటి
        కేవలం నాగార్జున దయాదాక్షిణ్యాల వల్ల మరో సారి తెలుగు సినిమా పరువుప్రతిష్టలు నిలబెట్టుకుంది. ఫ్రెంచి సినిమా ఇన్ టచబుల్స్కి ఇది రీమేక్. కొట్టొచ్చినట్టు ఈ సినిమాలో కన్పించేది ఏమిటంటే హాలీవుడ్ సినిమా కథల స్ట్రక్చర్ అంటూ లేకపోవడం. ప్రధానంగా ఒక సమస్య దానితో పోరాటం, పాత్రకి లక్ష్యం వగైరా టూల్స్ లేకపోవడం. ఫ్రెంచి సినిమా అంటే వరల్డ్ సినిమానే కాబట్టి, ఆర్ట్ సినిమా సరళిలో వుండే వరల్డ్ సినిమాలు కామన్ కమర్షియల్ సినిమాల కథా కథనాలతో వుండవు. అదే ఇందులో కన్పిస్తుంది. ఇది రెండు పాత్రల ప్రయాణం, ఇకంతే. ఇందులో బలమేమిటంటే, ఆ ఇద్దరి మధ్యా ఆసక్తికరమైన కెమిస్ట్రీ.

        అయితే తెలుగులోకి వచ్చేసరికి సెకండాఫ్ లో విషాదం, మెలోడ్రామాల డోసు ఎక్కువైంది. అంత కథ వున్నా మనంచూసికూడా మనం హాయిగా బయటి కొస్తాం, కానీ ఊపిరిచూశాక బరువెక్కిన హృదయాలతో భారంగా బయటికొస్తాం. ఇలా జరిగి వుండాల్సింది కాదు. సినిమా అంతా అక్కడక్కడా కదిలిస్తూ ఎంత ఫన్నీగా నడుస్తుందో, చివరి పదిహేను నిమిషాల పైగా అంత  విషాదంతో ఒకటే హెవీగా సాగి గంభీరంగా ముగిస్తుంది. దీంతో హాయిగా నవ్వుకుంటూ బయటికి రావాల్సిన వాళ్ళం, బరువెక్కిన గుండెలతో అదోలా బయటికొస్తాం. ఇది అవసరం లేదు. కార్తీకి అనవసరంగా సబ్ ప్లాట్ లో కుటుంబ కథ పెట్టడం వల్ల ఈ పరిస్థితి తలెత్తింది. ఆ అంతులేని కథసినిమా టైపు కుటుంబ కష్టాలు తీసేస్తే అరగంట సినిమా నిడివి తగ్గి- నాగార్జున, కార్తీల మధ్య హేపీ నోట్ తో హాయిగా ముగిసేది. ఒరిజినల్లో ఇలాగే వుంది మరి...


-సికిందర్
http://cinemabazaar.in


24, మార్చి 2016, గురువారం

షార్ట్ రివ్యూ!



దర్శకత్వం : అని కన్నెగంటి
తారాగణం : సందీప్ కిషన్, అనీషా ఆంబ్రోస్‌, బాబీ సింహా,  పోసాని కృష్ణమురళి, బ్రహ్మాజీ, కాశీ విశ్వనాధ్‌, ప్రవీణ్‌, మధునందన్‌ తదితరులు
కథ
, కథనం : ఆల్ఫోన్స్‌ పుతిరేన్‌,  సంగీతం : సాయికార్తీక్‌, ఛాయాగ్రహణం : బి. రాజశేఖర్‌
బ్యానర్ : ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఇండియా ప్రై.లి.
నిర్మాతలు : సుధాకర్‌ చెరుకూరి
, కిషోర్‌ గరికపాటి, అజయ్‌ సుంకర
విడుదల : 23 మార్చి, 2016

***

       
తెలుగులో ఈతరం దర్శకులు కూడా సొంత ప్రతిభే  లేనట్టు రీమేకులకి తమ కష్టాన్ని కుదించు కోవడం / అలవాటు చేసుకోవడం మొదటి తప్పయితే, ఇలాగైనా సత్తా చూపి  విజయం సాధించాలన్న  నేర్పు కనబర్చకపోవడం రెండో తప్పు. గతవారం ‘తుంటరి’ పేరుతో రీమేక్ చేసిన తమిళ హిట్ కి ఓ యువదర్శకుడు ఎంత న్యాయం చేయగలిగాడో, అసలు రీమేకే  చేయకూడని తమిళ - మలయాళ రెండు భాషాల్లో హిట్టయిందని చెప్పుకుంటున్న ఇంకో సినిమాని ‘రన్’ పేరుతో  రీమేక్ చేసి ఈవారం అంతే దురన్యాయం చేశాడు ‘అని కన్నెగంటి’ అనే మరో యువదర్శకుడు. కొత్తగా టైటిల్ నే పెట్టుకోలేనప్పుడు రీమేక్ అనే వడ్డించిన విస్తరి కూడా అనవసరమే. అయితే ఈ ప్రయత్నంలో అసలు ట్రాజడీ ఏమిటంటే, ఇది రీమేక్ చేయకూడని ఇండీ ఫిలిం అని తెలుసుకో లేకపోవడమే!

       రెండో తరం హీరోలతో అప్పటి దర్శకులు- పరుచూరి బ్రదర్స్ రాస్తున్నంతా కాలమూ హీరోయిజాల్ని నిలబెట్టారు. మూడోతరం హీరోలతో తరం మారిన అనేకమంది దర్శకులు స్క్రీన్ ప్లే పట్ల- పాత్ర చిత్రణల పట్లా కనీస ప్రాథమిక నియమాలే తెలీక, ఈ హీరోలని చాలా  నష్టపర్చారు. ఇప్పుడు సందీప్ కిషన్ లాంటి నాల్గో తరం హీరోల కెరీర్స్ తోనూ కొత్తగా వస్తున్న ఈతరం దర్శకులూ ఆడుకుంటున్నారు, ఏది తీయవచ్చో, ఏది తీయకూడదో తెలీక!  లేకపోతే సందీప్ కిషన్ వెళ్లి వెళ్లి ఒక ఇండీ ఫిలింలో నటించడమేమిటి!

        నిర్మాణ సంస్థల దేముంది, ఫాంలో వున్న హీరో దగ్గర దర్శకుడు కథ ఓకే చేయించుకుని వచ్చేస్తే అన్నీ ఓకేగానే కన్పిస్తాయి. ఇంకే మార్కెట్ సరళులతో పనిలేదు. ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ఇండియా ప్రై.లి.వారికి కూడా మనం మార్కెట్ కి ఏమిస్తున్నామన్నది కాకుండా,  ఎవరితో ఇస్తున్నామనేదే ముఖ్యమనీ భావించుకోవాల్సి వస్తోంది.

కథ

        సాఫ్ట్ వేర్ ఇంజనీర్ సంజయ్ అలియాస్ సంజు ( సందీప్ కిషన్) పని చేస్తున్న అమెరికన్ కంపెనీ మూతబడ్డంతో రోడ్డున పడతాడు. అక్క పెళ్లికి కి కట్నం తాలూకు ఇంకో లక్ష బావకి బాకీ ఉంటాడు. ఆ వొత్తిడి పెరిగి వడ్డీ రాజా (బాబీ సింహా) దగ్గర అప్పు చేస్తాడు. దీనికి ఒక మిత్రుడు (ప్రవీణ్) హామీగా ఉంటాడు. మూడు నెలలు గడువు. వడ్డీ రాజా ఒక లోన్ షార్క్. పెట్టిన గడువుకి గంటలస్యమైనా ఇంట్లో ఆడవాళ్ళని బందీలుగా పెట్టుకుంటాడు. ఇది వీలుగాక పోతే తన్ని వసూలు చేసుకుంటాడు. అదీ కుదరకపోతే చంపి పారేస్తాడు.

        ఆ రోజు రానే వస్తుంది సంజుకి. ఈ మూడు నెలలూ అప్పు కట్టలేక పోయాడు. ఇప్పుడు హామీవున్న మిత్రుడికే ప్రాబ్లం.  మరో వైపు చిన్నప్పట్నుంచీ ప్రేమించుకుంటున్న అమూల్య (అనీషా ఆంబ్రోస్‌ ) తో సమస్య వుంది. ఆమె తండ్రి పెళ్లికి ఒప్పుకోవడం లేదు. దీంతో ఇద్దరూ లేచిపోవాలనుకుంటారు ఇదే రోజు. ఓ చోట ఆమెని వెయిట్ చేయమని చెప్పి, తను డబ్బు ప్రయత్నాలు ప్రారంభిస్తాడు.  ఎలాగో ఆ మిత్రుడే లక్ష ఇచ్చి ఆదుకుంటాడు. ఆ డబ్బుతో వడ్డీ రాజా దగ్గరికి వెళ్తూంటే దొంగ కొట్టేస్తాడు. అటు వెయిట్ చేస్తున్న ఇంకో దొంగ అమూల్య గొలుసు కొట్టేస్తాడు. ఇటు డబ్బు పోగొట్టుకున్న సంజూ ఇరకాటంలో పడతాడు. అటు అమూల్య తండ్రి సంజు మీద కిడ్నాప్ కేసు పెడతాడు. ఇటు వడ్డీ రాజ పెట్టిన గడువు సాయంత్రం ఐదు కల్లా సంజు లక్ష సంపాదించాలి. ఇదీ విషయం. ఈ గడువు కల్లా సంజయ్ డబ్బు సమస్య, ప్రేమ సమస్య ఎలా తీరాయన్నదే మిగతా కథ.

ఎలా వుంది కథ
            ‘స్వామీ రారా’ తెలుగులో రోడ్ మూవీస్ కి ఒక ఒరవడిని సృష్టించడంతో, ఇదే దారిలో ‘రన్ రాజా రన్’, ‘ఎక్స్ ప్రెస్ రాజా’, ‘భలే మంచి రోజు’, ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’  అనేవి వస్తున్నాయి. అదేపనిగా వస్తూంటే చూడ్డం కష్టమే. ‘రన్’ కూడా వచ్చింది, ఒక రోజులో ముగిసే  కథతో. ఇక్కడ మిగతా వాటికీ దీనికీ ఒక స్పష్టమైన  తేడా వుంది. అదేమిటో  చెప్పమంటే టాలీవుడ్ లో ఒకరిద్దరు కూడా చెప్పగల్గడం మహా కష్టమే.

        ‘రన్’ ని రోడ్ మూవీ అనీ, థ్రిల్లర్ అనీ ఇంకేదో అనీ ఈజీగా  చెప్పేయవచ్చు. గానీ మూలంలో ఇది ఇండీ ఫిలిం కి రీమేక్. ట్రాజడీ ఏమిటంటే, తెలిసి ఎవ్వరూ ఇండీ ఫిలింని రిమేక్ చెయ్యరు!

        ఒక దర్శకుడు ముచ్చటపడి తను రాసుకునే  సొంత డైరీ లాంటిది ‘ఇండీ ఫిలిం’ అనే ఇండిపెండెంట్ ఫిలిం. ఇండిపెండెంట్ అనడంలోనే అర్ధమవుతోంది-  స్ట్రక్చర్, క్యారక్టరైజేషన్స్ వంటి ఏ సినిమా నియమావళికీ తను బద్ధుడు కాదనీ, ‘నా సినిమా నా ఇష్టం’ అనే ఆవేశంతో తీసి పడేస్తాడనీ. హిందీలో ఇది నిత్య కార్యక్రమమైపోయింది. కనుక ఇండీ ఫిలిమ్స్ ని మామూలు కమర్షియల్ సినిమాల దృష్టితో చూడరు, చూస్తే  ఎంజాయ్ చేయలేరు. అలాగే జ్ఞానమున్న ఏ రివ్యూ రైటరూ వీటిమీద విరుచుకుపడడు. దీన్ని దీనిలాగే చూడ్డానికి తిప్పలు పడి మైండ్ సెట్ ని మార్చుకుంటాడు. 

        ఇక్కడ సోది అనుకోకుంటే మరి కొన్ని చెప్పుకోవాలి. షార్ట్ ఫిలింని పొడిగిస్తే ఇండీ ఫిలిం( అసలు ఫిలిం ఎక్కడుందిప్పుడు అంతా డిజిటలే! ఫిలిం ఉన్నంత కాలం ఆ ఖర్చుకి, ప్రాసెసింగ్ కీ  జడిసి ఇండీ ఫిలిం అనే పైత్యం పుట్టలేదు- డిజిటల్ రాగానే అడ్డమైన కోరికలూ పుట్టుకొస్తున్నాయి).  మల్టీప్లెక్సుల పుణ్యమాని కమర్షియల్ సినిమాల నుంచి కొద్దిగా పక్కకు జరిగి, క్రాసోవర్ (కమర్షియల్ + ఆర్టు) సినిమాలనేవి ఒక విప్లవం బాలీవుడ్ వరకూ. డిజిటల్ విప్లవంతో క్రాసోవర్స్ నుంచి ఇంకా ముందుకుసాగి వేషం కడుతున్నవే ఇండీ ఫిలిమ్స్.

        ఒకటి గమనిస్తే,  ఆల్ఫోన్స్‌ పుతిరేన్‌ అనే షార్ట్ ఫిలిం మేకర్  మూడేళ్ళ క్రితం తొలిసారిగా సినిమాకి సంకల్పించి, ఏకకాలంలో తమిళ - మలయాళ ద్విభాషా చిత్రంగా ‘నేరమ్’ (అంటే ‘కాలం’)  అనే ఇండీ ఫిలిం తీశాడు. బడ్జెట్ కేవలం కోటిన్నర, ద్విభాషా చిత్రం కాబట్టి. ఒక భాషలోనే తీస్తే ఇండీ ఫిలిమ్స్ ని చాలా తక్కువ ఖర్చుతో తీస్తారు. ఈ రెండు భాషల్లో  18 కోట్లు వసూలు చేసింది.

        చెన్నై లోని మండవిల్లీ లో తను గడిపిన రోజులనాటి అందమైన సొంత డైరీలాంటి సంగతుల్ని అదే మండవిల్లీ నేటివిటీలో తన ఫీలింగ్స్ తో తను ఇండీ ఫిలింగా తీసుకున్నాడు. తమిళ, మళయాళ ప్రేక్షకులకి నచ్చింది. దీన్ని తనే హిందీలో రీమేక్ చేయాలనుకుంటున్నాడు. 

        ఇండీ ఫిలిమ్స్ ని ఒరిజినల్ దర్శకుడు అదే ఎఫెక్ట్ తో సక్సెస్ ఫుల్ గా రీమేక్ చేసుకోగలడు. అందుకే తమిళ మలయాళ భాషల్లో హిట్టయింది. 

        ఇదే దర్శకుడు ‘ప్రేమమ్’ అని మరో  హిట్ తీశాడు. దీన్ని ఇండీ ఫిలిమ్స్ నుంచి పక్కకు జరిగి, పూర్తి  వినోదాత్మకమైన క్రాసోవర్ గా తీశాడు. దీన్నే తెలుగులో రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. 

        ఐతే ‘నేరమ్’ ని  గతేడాది ‘టైం బారా వెయిట్’ అంటూ మరాఠీలో రీమేక్  చేశాడు రాహుల్ భటంకర్ అని వేరే కొత్తదర్శకుడు. ఇతను  పాల్పడిన దుశ్చర్య  ఏమిటంటే, ఆ ఒరిజినల్ ఇండీ ఫిలింలో వున్న బోరునంతా తీసేసి,  వేగంగా పరుగెత్తే పక్కా థ్రిల్లర్ గా తీశాడు. హిట్టయ్యింది.

         తెలుగు దర్శకుడు ఇలాటి దుశ్చర్య కైనా పాల్పడకుండా,  ఒరిజినల్ స్క్రీన్ ప్లేని చెడగొట్టకుండా పూర్తి నిబద్ధతతో తీశామని చెప్పుకున్నాడు (షాట్లు కూడా ఒరిజినల్లో వున్నవే కదా). అసలా ఒరిజినల్ స్క్రీన్ ప్లే కమర్షియల్ సినిమాకోసం రాసిందేనా!

ఎవరెలా చేశారు
        గత మూడేళ్ళుగా ఎనిమిది సినిమాల్లో నటిస్తున్నా మళ్ళీ ఒక్క  హిట్ కూడా దక్కని నాల్గో తరం యంగ్ హీరో సందీప్ కిషన్ కి, మూడో తరం హీరోల కష్టాలే ఎదురవుతున్నాయి మ్యాటర్ కొరవడిన తన తరం దర్శకులతో కూడా! 

        ఇప్పటి హీరోల దురదృష్టమేమిటంటే,  అప్పటి హీరోలు అప్పటి దర్శకుల చేతుల్లో సేఫ్ గా వున్నట్టు,  ఇప్పటి దర్శకుల చేతుల్లో ఇప్పటి హీరోలు సేఫ్ గా వుండలేక పోతున్నారు.

        మిగతా మేకింగ్ విషయాలు పక్కన పెట్టి, అసలు యాక్టివ్ (కమర్షియల్ సినిమా)  – పాసివ్ ( ఆర్ట్ సినిమా) పాత్రల తేడాల గురించి  మూడో తరం  హీరోలతో చాలామంది దర్శకులకి వున్న  అజ్ఞానాన్నే, ఇప్పుడు నాల్గో తరం హీరోలతో యువతరం దర్శకులూ కొనసాగిస్తున్నారు.

        నాల్గో తరం హీరోల ఇంకో దురదృష్టం ఏమిటంటే- వీళ్ళు వివిధ స్కూల్స్ లో యాక్టింగ్ కోర్సులు నేర్చుకుంటారు. కానీ యాక్టింగ్ స్కూల్స్ కి తాము తయారు చేస్తున్న హీరోలు ఎందుకు విఫలమవుతున్నారో తెలుసుకోవాలన్న పరిశీలన లేదు. వుంటే విధిగా నటనలో భాగంగా యాక్టివ్- పాసివ్ (బకరా) పాత్రల తేడాల గురించి కూడా నేర్పి జాగ్రత్త చెప్తారు. 

        ఇంకా ఈ పాసివ్ డైరెక్టర్ల బ్రిగేడ్ నుంచి విముక్తి ఎప్పుడు? తెలుగు సినిమాల్ని భ్రష్టు పట్టిస్తూ దశాబ్దంన్నర కూడా దాటిపోయింది. నాల్గో తరం హీరోలు కూడా బకరాలుగా బలిపీఠం  ఎక్కుతున్నారు.

         సందీప్ కిషన్ కి తాను  పోషిస్తున్నది బకరా పాత్ర అనీ ఎలా తెలియాలి? ఇండీఫిలిమ్స్ లో అన్నీ బకరాలే వుంటాయి. లేకపోతే  విలన్ అనే వాడు పూర్తి స్థాయిలో సందీప్ కిషన్ చేతిలో చావల్సింది పోయి, ఎక్కడో ఆటో గుద్దుకుని ఛస్తే- వాడు చావాల్సింది నా చేతిలో కదా అనిపించలేదా సందీప్ కి?

        హీరోయిన్ తో మొదటి అరగంట లోపే – ఆ తర్వాత కన్పించకుండా పోయిన హీరోయిన్ విలన్ కారు డిక్కీలోనే బకరాలా వుండిపోయి- క్లయిమాక్స్ కూడా అయిపోయాక డిక్కీలోంచి తంతూంటేగానీ, ఆమె గుర్తుకు రాకపోతే- ఇదేమిటి హీరోయిన్ తో నాకు రోమాన్స్ ఏదీ? పాటలేవీ అని అడగాలన్పించలేదా?

        పోయిన డబ్బుకోసమో, హీరోయిన్ కోసమో ప్రయత్నించకుండా,  ఎప్పుడు బడితే అప్పుడు దార్లో మెట్ల మీదా, ఫుట్ పాత్ ల మీదా కూర్చుని, దేశం గురించి మనోజ్ కుమార్ బాధ పడిపోతున్నట్టు,
 ఏడ్పు మోహంతో అలా శూన్యంలోకి చూస్తూంటే-  ఇదేమిటి, నేను యాక్షన్లో కొచ్చి కనీసం టైటిల్ ధర్మం కొద్దీ  లేచి వురకాలి కదా - అని అడగాలన్పించలేదా?

        నేనేం చేయకుండానే నా సమస్యలెలా సాల్వ్ అయిపోతాయి-  అదేదో “It was the best of times, it was the worst of times...”అని రాస్తూ చార్లెస్ డికెన్స్ మహా నవల ప్రారంభించినట్టు, ‘మంచి కాలం, చెడు కాలం’  అంటూ  సినిమా ప్రారంభిస్తూ ప్రతిపాదించిన కాన్సెప్ట్ ప్రకారం- నాకు చెడు కాలం దాపురించి డబ్బులుపోతే, మళ్ళీ మంచి కాలం కోసం  నేనేమీ చెయ్యకుండా, దానికదే వచ్చేస్తుందా మంచి కాలం? కలియుగం యాక్షన్లో వుంటే మాటలతో పని జరుగుతుందా? కర్మలతో విధిని ఓడించవచ్చని తెలిశాకా, నా చేతులు కట్టేసి మెట్ల మీద బకరాలా కూర్చోబెట్టేసి మంచి కాలం వస్తుందంటారా- అని నిలదీయాలన్పించలేదా?

        ఇలావున్న కథ కమర్షియల్ కాదని అనుమానమే  రాలేదా?

చివరికేమిటి?
        గంభీరంగా చెప్పుకోవడాన్ని ఇంకా కంటిన్యూ చేస్తే, చిట్టడివి లాంటిది క్రియేటివ్ లోకం. ఇందులో దారులు కనుక్కోవడం ఎవరి తరంగాదు, జీవిత కాలం సరిపోదు. దారులు అనేకం ఉంటాయన్న స్పృహ అయినా వుండాలి. కాక, ఈ చిట్టడివిని దాటించే దారి ఒక్కటే అనీ, అది మాకు తెలిసిన కమర్షియల్ దారేననీ అనుకుంటే మాత్రం దారి తప్పిపోక తప్పదు. కమర్షియల్ సినిమా ఒక్కటే, సమాంతర సినిమాలెన్నో జాతులు. ఆర్ట్ సినిమాల మీదుగా, అవాంట్ గార్డ్, ఫిలిం నాయిర్, మ్యాజిక్ రియలిజం...ఇలా జాతోపజాతులుగా విస్తరిస్తూ వచ్చి, క్రాసోవర్ ని కూడా దాటేసి ఇండీ ఫిలిమ్స్ దగ్గర వుంది ప్రస్తుతం. క్రియేటివ్ లోకమనే చిట్టడివిని దాటించే ఇంకెన్ని దారులున్నాయో, ఎప్పుడెప్పుడు ఏవేవి బయట పడతాయో ఎవరికీ తెలీదు...వీటన్నిటినీ కమర్షియల్లో కుదెయ్యొచ్చని  ఆశపడి కుక్కర్ లో కుక్కి వండే ప్రతయ్నం చేస్తే మాత్రం పేలిపోతుందా కుక్కర్!



-సికిందర్
http://www.cinemabazaar.in/

 

















22, మార్చి 2016, మంగళవారం

సాంకేతికం





సీన్ - 1 : పుణె 
    చేతిలో సిగరెట్ పట్టుకుని డైలాగ్స్ కొడుతున్నాడు విలన్. హీరో విసిరిన కత్తి వేటుకి ఆ సిగరెట్ ఎగిరి వెళ్లి పెట్రోల్ ట్యాంకర్ దగ్గర పడింది. అంతే, ఆ ట్యాంకర్ తో బాటు అక్కడున్న ఇతర వాహనాలు టపటపా పేలిపోయి పైకేగిరాయి. ఆకాశమంతా భగ్గున అగ్నిగోళాలు!  

సీన్ -2 : హిమాచల్ ప్రదేశ్ 
     శత్రువుల్ని చావదన్ని గుడారాల్లోకి విసిరేశాడు హీరో. హీరోయిన్ తో కలిసి నడుచుకుంటూ పోతున్నాడు. ఉన్నట్టుండి ఆగి
, ఆ గుడారాల మీదికి  రాకెట్ లాంచర్ ప్రయోగించాడు. ఒక్కసారి లేచిన మంటలకి గుడారాలు భస్మీపటలమై మాడి మసయ్యారు శత్రువులు.

          పేలుళ్లు లేదా బ్లాస్టింగ్స్ అన్నవి తప్పనిసరి యాక్షన్ ఎపిసోడ్స్ అయ్యాయి సినిమాల్లో. పేలుళ్లు లేని ఫైటింగ్ సీన్ అంటే బ్యాంగ్ వుండని ఇంటర్వెల్ లాంటిదన్న మాట. ఒక కళ అనే కంటే కూడా ఈ పేలుళ్ళ ప్రక్రియని సైన్స్ అనాలి. కళలు పతనమవుతాయోమే గానీ సైన్స్ చెక్కుచెదరదు. పై రెండు యాక్షన్ సీన్లూ ‘ఖలేజా’, ‘పరమవీర చక్ర’ ల్లోనివి. వీటి సైన్స్ వెనుక హస్తం ఎస్. రామకొండది. ఏ ప్రేలుడుకైనా పెట్రోలే మూలాధారం. లక్ష్యాన్ని భస్మీపటలం చేసే ఇంధనం పెట్రోలే. ఒక కణితిలో పెట్రోలు నింపి, దానికి వైరింగ్ ఇచ్చి, ఆ వైరింగ్ ని స్విచ్ బోర్డుకి అనుసంధానించి, మళ్ళీ కణితి దగ్గర క్రాకర్స్ (టపాసులు) ఏర్పాటు చేసి- స్విచ్చి నొక్కితే క్రాకర్స్ లో స్పార్క్ పుట్టి, ఆ నిప్పురవ్వతో పెట్రోలు కణితి పేలిపోవడం!

          మరి ఈ పేలుడుతోనే టాటా సుమోలు ఉవ్వెత్తున పైకెగిరి పడతాయా అంటే  - నో - ఇది మరింకో సైన్స్. ఈ ప్రాసెస్ పేరు క్యానన్ బ్లాస్టింగ్. దీని టెక్నీషియన్లు వేరే ( క్యానన్ బ్లాస్టర్స్  మోహన్- కృష్ణ ల గురించి గతంలో చెప్పుకున్నాం).


     ఇలాటి సందర్భాల్లో రామకొండ క్యానన్ బ్లాస్టర్స్ తో కలిసి పనిచేస్తారు. వాహనాల కింద తను పెట్రో బాంబు పేల్చిన క్షణాన్నే, క్యానన్ బ్లాస్టర్స్ నైట్రోజన్ ట్యాంకుల్ని పేల్చేస్తారు. అప్పుడు పైకి లేచి ఆకాశంలోకి దూసుకుపోతాయి టాటా సుమోలు.

          ఇంకొన్ని సీన్లలో హీరోనో, విలనో అద్దాన్ని బద్దలు కొట్టుకుని అవతలికి దూసుకు పోతూంటాడు. దీని టెక్నిక్ చెప్పమని  రామకొండతో అంటే,  ‘మరేం లేదండీ, షుగర్ గ్లాస్ వాడతాం. అడుగున క్రాకర్స్ ఏర్పాటు చేసి స్విచ్ బోర్డుకు కలుపుకుంటాం. ఆ ఆర్టిస్టు అద్దానికి తగులుతున్న క్షణంలోనే స్విచ్చి నొక్కి అద్దాన్ని పగుల గొట్టేస్తాం. అప్పుడు ఆర్టిస్టు సేఫ్ గా  అవతలికి దాటేస్తాడు’  అన్నారు రామకొండ. క్షణం అనేది ఇక్కడ చాలా కీలకం. ఏమాత్రం ఒక్క క్షణం అటు ఇటైనా ఆర్టిస్టుకి ప్రమాదం తప్పదన్నారు. అయితే తన  సమర్ధత వల్ల  అలాటి ప్రమాదాలు ఇంతవరకూ జరగలేదు.

          రామకొండ కెరీర్ కూడా తండ్రి లాగే చిరంజీవితో ప్రారంభమైంది. ఈయన తండ్రి గారు సీనియర్ యాక్షన్ స్పెషల్ ఎఫెక్ట్స్ టెక్నీషియన్ సాదిరెడ్డి రామారావు గురించి కూడా గతంలో చెప్పుకున్నాం. రామకొండ ‘కొదమసింహం’ (1990) కి స్టిల్ ఫోటోగ్రాఫర్ గా మొదలై, చివరికొచ్చేసరికి, అప్పట్లో సౌత్ లో యాక్షన్ స్పెషల్ ఎఫెక్ట్స్ నిపుణుడుగా పేర్గాంచిన  ఏకనాథ్ కి అసిస్టెంట్ గా చేరిపోయి, ఆ ‘కొదమ సింహం’ తోనే బ్లాస్టింగ్స్ మొదలెట్టేశారు.



          తర్వాత ఏకనాథ్ కి హైదరాబాద్ ఇన్చార్జిగా వచ్చేసి, బాలకృష్ణ నటించిన ‘బొబ్బిలి సింహం’ తో ఆపరేటర్ గా మారారు. అదిమొదలు దాదాపు ప్రతీ భారీ బడ్జెట్ సినిమాకీ పనిచేస్తూ వస్తున్నారు.

          అన్ని రకాల బ్లాస్టింగ్సే  కాకుండా గన్ షాట్స్ కీ పని చేసే ఈయన్ని, మరి బాంబు పేలుడు తర్వాత దృశ్యాల సృష్టి ఎలా అని అడిగితే, ‘అక్కడంతా గొడ్డు మాంసం పడేస్తామండి. ప్రేగులు సహా. రక్తం కూడా చల్లుతాం. గొడ్డు గుండెకాయ కూడా పడేసి దాంట్లోకి గాలిని పంప్  చేస్తూ అది కొట్టుకుంటున్న ఎఫెక్ట్స్ తీసుకొస్తాం’ అని బీభత్సంగా చెప్పుకొచ్చారు.  ఇలా ఫిజిక్స్, కెమిస్ట్రీ కాకుండా బయాలజీలో కూడా తన చేతి వాటం చూపిస్తున్నారు.

          ఇంకా సోడా గ్యాస్ బ్లాస్టింగ్ గురించీ చెప్పారు. దీన్ని డ్రై ఐస్ బ్లాస్టింగ్ అని కూడా అంటారట. దేవతా లోకం వుంటుంది. ఆ లోకం నేల భాగమంతా పొగ మంచు కమ్మేసి వుంటుంది. ఇందుకు సోడా గ్యాస్ ని మరిగే నీటితో కలిపి వదుల్తామన్నారు. ఈ  ‘పొగ మంచు’  ఇరవై సెకన్ల పాటే వుంటుంది. అందుకని నిరంతరాయంగా సోడా గ్యాస్ ని వదులుతూనే వుంటామన్నారు.



       కత్తి పోరాటాల్లోనూ, గదలు ఢీ కొన్నప్పుడూ మెరిసే మెరుపుల ఎఫెక్ట్ పాజిటివ్, నెగెటివ్ బ్యాటరీ కనెక్షన్లు ఇవ్వడం ద్వారా సాధిస్తామని వివరించారు. ‘పాటల చిత్రీకరణలో కురిసే పూలవాన కూడా మా టాలెంటే నండీ’  అన్నారు. అంటే బోటనీ కూడా నన్నమాట. పాటల్లో సిందూరం బ్లాస్టింగ్ కూడా వుంటుంది. ఈ గ్లామర్ ప్రక్రియలతో కళా దర్శకుడికి ఏ సంబంధమూ లేదు. ఈ గ్లామర్ ప్రక్రియలు, ఇంకా ఇందాకా చెప్పుకున్న గద, కత్తి యుద్ధాల్లో  మెరిసే మెరుపులూ, ఎంత  గ్రాఫిక్స్ తోనూ సాధ్య పడవన్నారు. భారీ పేలుళ్ళని గ్రాఫిక్స్ తో సృష్టించినా, ఆ తేడా తెలిసిపోతుందన్నారు. గ్రాఫిక్స్ తో  మెరుపులూ మంటలూ వగైరా చాలా పేలవంగా వస్తాయన్నారు.

          ప్రకృతి సూత్రాలతో నడిచే సైన్సే  వేరు. సాంకేతిక ప్రావీణ్యం పెంపొందే కొద్దీ కళలు చవకబారుగా ఉంటాయని ఏనాడో కొడవటిగంటి కుటుంబ రావు గారు రాసి పెట్టారు. ఈ దోషం రామకొండకి అంటదు. ఎందుకంటే ఆయనది కళ  కాదు, సైన్సు!



-సికిందర్
( ఆంధ్రజ్యోతి -2011)

21, మార్చి 2016, సోమవారం

నాటి సినిమా!






        ‘అంకుశం’ నిరంకుశంగా ఫార్ములా మీద ఖడ్గ మెత్తితే ఏమవుతుంది? ‘భారత్ బంద్’ అవుతుంది!
          ‘ఈ సృష్టిలో ఏదైనా మనం సృష్టించామా? ఆకు మనది కాదు, పోక మనది కాదు, సున్నం మనది కాదు... ఈ మూడూ కలిపికట్టి నోరు పండించడమే మన పని!’ అని  కాస్టూమ్స్ కృష్ణ విసిరే  డైలాగుని  –
          ‘పాట మనది కాదు, ఫైటు మనది కాదు, ఆట మనది కాదు...ఈ మూడూ కలిపికొట్టి తెలుగు సినిమాని బాగా మట్టి కరిపించవచ్చు!’  గా మార్చుకుంటే  డైనమిక్ కొటేషన్ అవుతుంది.

        
        స్టామినా అనేది టాలీవుడ్ ప్రింట్ మీడియాకి చాలా ఇష్టమైన పదం. తెలుగు సినిమా దాని వైఖరి మార్చుకుంటే నిజమైన ‘స్టామినా’ ఏమిటో  బయటపడుతుందేమో. వాపు ‘స్టామినా’ అన్పించుకోదు. విటమిన్ బిళ్ళలు పౌష్టికాహారం లోపం తలెత్తాక అవసరపడే సప్లిమెంట్స్. బిళ్ళలతో బలుపు రాదు. తెలుగు సినిమాల సాంప్రదాయ కథా కథనాల పౌష్టికాహారాన్ని వదిలేసుకుని, బిల్డప్పుడు, డాన్సులు, మాస్ ఫైట్లు, టెక్నికల్ హంగులూ, తాటాకు బ్యాంగులూ వగైరా ఫార్ములా విటమిన్లు వాడినంత కాలం, తెలుగు సినిమా  బాక్సాఫీసు బలిమికి బలుసాకు లేదు.

        మొదట కోడి రామకృష్ణ అనే హైడ్రామా హాలికుడు తీసిన అంకుశమే అన్ని ఫార్ములా నమ్మకాల్నీ బద్దలు కొట్టింది. పచ్చి కథే తప్ప ఇంకే కృత్రిమ హంగుల్నీ ఖాతరు చేయని ఒక బలమైన, ఆరోగ్యవంతమైన అచ్చ తెలుగు సినిమాగా బాక్సాఫీసుని బద్దలు కొట్టాక, తిరిగి దాని కొనసాగింపుగా అన్నట్టు, ‘భారత్ బంద్’ మరో అడుగు ముందు కేసిన  డేరింగ్ కమర్షియల్ ప్రయోగాత్మకం అయింది. 

           
డైలాగ్ నంబర్ టూ- పార్టీని బట్టి సున్నం రాస్తే, అదే సర్దుకుంటుంది’  అంటూ, మూస ఫార్ములా ప్రేమికులైన  ప్రేక్షకులకి ‘భారత్ బంద్’ ఓ మాంచి విరుగుడు డోసే ఇచ్చింది. ఈ సినిమా తీసి కోడి రామకృష్ణ  ‘ఆకులో సున్నం ఎక్కువ రాశానంటా డేమిటీ...మన చేతిలో తేడా రాదే?’  అన్న డైలాగ్ నంబర్ త్రీ ప్రకారం, ఈ ప్రయోగాత్మక సృష్టితో తనే డైలమాలో పడిన పరిస్థితీ లేదు.

        ఆకు లాంటి సినిమాలో సున్నం లాంటి కథ ..ఎంతో కథ.. రాసి రాసి, కథలోంచి కథానికలు, సన్నివేశాల్లోంచి సన్నివేశాలు, డైలాగుల్లోంచి సన్నివేశాలు, చర్యల్లోంచి ప్రతి చర్యలూ... ఒకే  టెంపో, స్పీడ్, థ్రిల్... ఎన్నెన్నో పాత్రలు, వాటన్నిటి మీదా అతిసూక్ష్మ దృష్టితో వాటి వాటి ప్రణాళికా బద్ధమైన ఆశయ సిద్ధికి ప్రయాణాలూ, అవి పడిపోకుండా, డీలా పడిపోకుండా, అనుక్షణం వేడిని పుట్టించడం, సినిమా ‘స్టామినా’ సంగతి ని మరువకూడదని , దాని అతి ముఖ్యమైన కథాంగమైన టైం అండ్ టెన్షన్ థియరీని  పక్కాగా అమలుపర్చడం!

        నేటి ఒక సినీ – టీవీ రచయిత అంటాడు : ప్రకృతిలో వుండే ఎలిమెంట్సే, వాటి నిష్పత్తుల్లో కథల్లోనూ  వుంటాయని. మరైతే  ప్రకృతిలో ఆ పంచభూతాలనే ఎలిమెంట్స్  కల్లోలం కూడా సృష్టిస్తాయి కదా అంటే, ఆ కల్లోలం సర్దుబాటు కోసమే నంటాడు. దట్సిట్! కాబట్టి ఇక్కడ కల్లోలం గురించే! భూమ్మీద డెబ్బై  శాతంగా చలనశీలంగా వున్న జలమే, సినిమాల్లో కన్పించే కథనమైతే, దీంతో ఏం చేస్తున్నామన్నదే బర్నింగ్ టాపిక్ అవ్వాలి! దీంతో కోడి రామకృష్ణ సృష్టించే కల్లోలం, తదనంతరం చేసే సర్దుబాటూ, చిట్ట చివరికి చేకూర్చే యథా పూర్వ స్థితీ, అతడి అందెవేసిన సృజనాత్మక కళావ్యక్తికి  నిదర్శనాలవుతాయి! ఎక్కడా ఈ ప్రకృతి విలయంలో ఆటవిడుపుగానైనా ఓ ఈల పాట సత్కాలక్షేపమే వుండదు. ఈ సినిమాలో ఎంటర్ టైన్మెంట్ ఏదీ అన్న వాడు నవ్వులపాలవుతాడు. పంచదారలో కూడా తీపిని వెతకడమేనా! ఈ కోడి క్రియేషన్ లో ఎలాటి ప్రేమాయణాలు, డ్యూయెట్లు, స్టెప్పులూ, విలన్లతో వ్యాంప్ డాన్సులూ, ఇంకే కామెడీ ట్రాకులూ, ప్రేక్షకజనం చీప్ టేస్టుని సంతృప్తపర్చే  ద్వంద్వార్ధాల డైలాగులూ కనపడవు. ఇలా వున్నాక ఇదొక  ‘ప్రయోగాత్మక కమర్షియల్’ కాకపోతే ఇంకేమిటి? దీని ఫలితాలు బ్రహ్మరధం పట్టి అందించారు ప్రేక్షకులే!

        తెర వెనుక పనిచేసుకునే ప్రొడక్షన్ సిబ్బంది విలక్షణ నటనలతో ఆర్టిస్టులుగా తెర మీద మెరవడం 1990 లో ఒకసారి, 1991 లో మరింకో సారీ సంచలనాత్మకంగా జరిగాయి. ఆ ఇద్దరు పుణ్యజీవులు నిర్మాత ఎ. పుండరీ కాక్షయ్య, కాస్ట్యూమ్స్ కృష్ణ.  నీ జీవితం మీద నా కసహ్యమేస్తోంది!’ అంటూ మర్డర్లు చేసి పారేసే పచ్చి రాజకీయ విలన్ గా ‘కర్తవ్యం’ లో పుండరీ కాక్షయ్య టెర్రిబుల్ గా వూపేస్తే, ‘ఆకు- పోక- సున్నం’ ఛలోక్తులతో కాస్ట్యూమ్స్ కృష్ణ  ‘భారత్ బంద్’ లో కరుడు గట్టిన క్రిమినల్ గా ఇంకా టెర్రిఫిక్ గా వూపేశాడు. అప్పటికింకా తెలుగు ఫీల్డులో విలన్స్ కి కరువు లేని కాలం. ‘భారత్ బంద్’ కి కాస్ట్యూమ్స్  కృష్ణ వన్నె తరగని ఎస్సెట్ అయ్యాడు. 

     ఈ మెగా పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ లో కోడి రామకృష్ణ సమకాలీన రాజకీయ వ్యవస్థని బరిబత్తెలుగా చూపించేశాడు!
     రాజకీయ సినిమా అన్నాక, అది సమకాలీన పరిస్థితుల్ని ఎత్తి చూపాలంటాడీయన. అంతే గాకుండా, ‘భవిష్యవాణి’  విన్పించాలనీ ( ఈ ‘భవిష్యవాణి’ ఏంటో అర్ధంజేసుకోలేక, కథల్ని మరింత  పై స్థాయికి తీసికెళ్ళగల బంగారు అవకాశాల్ని చేజార్చుకునే  వాళ్ళే ఎక్కువ మంది వున్నారు ఫీల్డులో),  మరికొన్నేళ్ళ తర్వాత చూసిన ప్రేక్షకులకి అప్పటి పరిస్థితులకి అద్దం పట్టి అబ్బురపర్చేదిగా వుండాలనీ విశ్లేషిస్తాడు కోడి. ఈ లక్షణాలన్నీ ‘భారత్ బంద్’ లో  పుష్కలంగా ఉన్నాయి. అసమ్మతి- వెన్నుపోటు రాజకీయాలు 1983-84 ల కాలం నుంచీ  బాగా పాపులర్ అయ్యాకే, సినిమాల్లో కథల్లో అవి చొరబడ్డం మొదలెట్టాయి. వీటిలో ఒకటి 1989లో కోడిరామకృష్ణే తీసిన ‘అంకుశం’ లో  ఓ నీతిగల సీఎం తో ఈ సమస్యని చర్చకి పెడితే, 1991 కి వచ్చేసరికి,  ‘భారత్ బంద్’ లో ఒక నీతిలేని సీఎంతో రచ్చ చేశాడు రామకృష్ణ! నిత్య చలనశీలమైన కథ ఎప్పుడూ అవుట్ డేటెడ్ గా వుండ కూడదు, పాత్రలూ మారిపోతాయి కాలంతో బాటు. కోడి రామకృష్ణలా ఇది గ్రహించకపోతే  అన్ టచబుల్ బాస్టర్డ్స్అన్పించు కుంటాయి సినిమాలు...


           సామాజిక న్యాయం గురించి మాట్లాడాల్సి వస్తే, సమాజంలో బడుగు వర్గాలకి చెందిన వ్యక్తులు రాజకీయ పార్టీలకి లంపెన్ శక్తులుగా ఉన్నంత కాలం, ఎలాటి సామాజిక న్యాయమూ సాధ్యం కాదనేది గమనించాలి. వాళ్ళొక వేళ పాలకుల స్థానాన్ని అధిష్టించినా, తిరిగి ఆ ఎలీట్ వర్గాలకే  జీ హుజూర్ తొత్తులుగా ఉండిపోతారు. ఈ పరిస్థితి కళ్ళకి కట్టినట్టు ‘భారత్ బంద్’  లో పోరంబోకు మంత్రి వర్గం దృశ్యాల్లో గమనించవచ్చు.  ఈ కుప్పతొట్టి మంత్రి వర్గానికి నాయకుడు సీఎం పదవిని ఎంజాయ్ చేస్తున్న – తన పూర్వపు వృత్తి ద్వారా సంక్రమింప
జేసుకున్న, కొబ్బరిబోండాలు నరికే కత్తిని వెంట బెట్టుకు తిరిగే – కిరాయి కిల్లర్ కాస్ట్యూమ్స్ కృష్ణ! 

        ఇతను తనని పెంచి పోషించిన పెద్దాయన్నే పడదోసి సీఎం  అయిపోయాడు. నిత్యం తన బాగోగుల గురించే ఆలోచిస్తూ వాటి సాధన కోసం శరవేగంగా నిర్ణయాలు తీసుకుంటాడు.  ఆ నిర్ణయాల్ని తక్షణం అమలు చేసేస్తాడు. చాలాటక్కరి. గుంటనక్క. ఎవరికీ చిక్కడు, ఇంకెవరికీ దొరకడు. తన సీఎం గిరీకి ఎసరు రాకూడదని, ఏకంగా ఒక  ‘పావురాయి పేట’ సంఘటన (వై.ఎస్. రాజశేఖర రెడ్డి ప్రయాణిస్తున్న  హెలికాప్టర్ కూలింది ‘పావురాయి గుట్ట’ లో కదూ) సృష్టించడమే కాదు, ఇంకాఇంకా ఎదిగిపోయి దేశ ప్రధాని కూడా అయిపోవాలన్న దుగ్ధతో  దేశంలో మరో జలియావాలా బాగ్ ఉదంతాన్నీ రీ - క్రియేట్ చేయగలడు. నోర్మూసుకుని యావద్భారత్ ‘బంద్’ పాటించేలా చేయగల  శక్తి సంపన్నుడూ కాగలడు. ఎంత నిజాయితీ అంటే ఇతడికి, చచ్చినా దొంగ నిరాహార దీక్ష మాత్రం చెయ్యడు. ఆకలితో చచ్చే అచ్చమైన నిరాహార దీక్షే చేస్తాడు తన సొంత లాభం కోసం కాబట్టి, ప్రజల కోసం కానే  కాదు కాబట్టి. తన సొంత లాభం కోసమే బజారుకుక్కలా వీధిన పడి పచ్చి కోడిగుడ్లు విసిరేయించి, పార్టీ కూడా పెట్టించేస్తాడు నార్త్ ఇండియన్ సేటు  బాబూ మోహన్ చేత. ఇక మిగతా చిల్లర పనులు చూసుకోవడానికి బామ్మర్ది ( అశోక్ కుమార్ ) ఎలాగూ వుండనే వున్నాడు.

   ఈ అరచాకాల్ని ఎదుర్కోవడానికి ఎస్సై గా హీరో వినోద్ కుమార్ తీవ్ర పోరాటం చేస్తూంటే, అతడి భార్య పాత్రలో అర్చన లెక్చరర్ గా విద్యార్ధి బృందంతో ఇంకో వైపు నుంచి నరుక్కొస్తూంటుంది.  ఈ బృందానికి నాయకుడుగా మరో హీరో రఘు ( రెహ్మాన్ అని అసలు పేరు) వుంటాడు. ఇలా బలాబలాల సమీకరణ.

        ఇక ఆట మొదలు. ఊపిరి సలపనివ్వని ఈ ఏకబిగిన సాగే రాజకీయపు ఆటలో అడుగడుగునా పవర్ఫుల్ సన్నివేశాలతో మాటల తూటాలు పేల్చుతూ. పైన చెప్పుకున్న మూడు సంఘటనలే గాక, ఇంకా ప్రారంభంలో గిరిజనుడితో బూటకపు రాజకీయం, న్యాయ విచారణ జరిపే జడ్జి సఫా, రేషన్ కార్డుల బాగోతం, కొనవూపిరితో వున్న రఘుకి బతికుండగానే పోస్ట్ మార్టం చేసేసే  కుతంత్రం, అతణ్ణి కాపాడుకునేందుకు తను అరెస్టై పోయే అర్చన, ఆమె గర్భావతని తెలిసినప్పటి మెలోడ్రామా, సీఎం మీద  విద్యార్థి బృందపు అడ్డంగా విఫలమయ్యే ‘డే ఆఫ్ ది  జాకాల్’ టైపు హత్యా యత్న ఘట్టం, సీఎం కుప్పతొట్టి మంత్రివర్గం మెక్కిందరక్క   బట్టలు చింపేసుకుంటూ కొట్టుకునే ‘ముత్యాల ముగ్గు’ ఫేం ది గ్రేట్ క్లయిమాక్స్ సీను టైపు సన్నివేశం,  దేశమంతటా ఉద్విగ్న భరిత – హింసాత్మక ‘భారత్ బంద్’ దృశ్యాలు, చిట్ట చివరికి...ఆ నీచ సీఎం మీద... గంగి గోవుకి కూడా...ఏవగింపు కలిగి....

     చెప్పుకుంటే పోతే క్షణక్షణం రగిలించే సంభ్రమాశ్చర్యకర దృశ్యాలే... ఇదంతా చూస్తూంటే ఒకటి అర్ధమవుతుంది...టైమింగ్ అనేది కేవలం కామెడీ ఒక్కదానికే వాడే మాట కాదనీ, కథనానికి కూడా వాడాల్సిన మాటేననీ...టైమింగ్ స్పృహ తో చేసిన కథనం ఆకాశాన్నంటుతుందనీ...

        మంచి స్క్రిప్టు రాస్తున్నప్పుడే సినిమా జయాపజయాల సంగతి  తెలిసిపోతుందని, కోడి రామకృష్ణ ఇంకో కొటేషన్. అలాంటప్పుడు ఇది కన్నడ, తమిళ, హిందీ భాషల్లో తీస్తే అక్కడా హిట్టే.

        ఈ సక్సెస్ ఫుల్ ప్రయోగాత్మకానికి నిర్మాతగా అల్లూరి సుభాష్ వుంటే, కోడి రామకృష్ణ సోదరుడు కోడి లక్ష్మణ్ ఛాయాగ్రాహకుడిగా, విజయ్ శేఖర్ కొత్త సంగీత దర్శకుడిగా, జొన్నవిత్తుల రామలింగేశ్వర రావు మాటలూ- పాటల రచయితగా వున్నారు. చాలా పవర్ఫుల్ గా మాటలు పేలిన ఈ హైడ్రామా ప్రధానమైన రాజకీయ సినిమాకి, దర్శకుడే గాక కోడి రామకృష్ణ స్క్రీన్ ప్లే రచయిత కూడా.

         నేటి ఆసక్తి వున్న రచయితలూ దర్శకులూ బలమైన కథా, పాత్రల సృష్టీ, వాటి నిర్వహణా  ఎలాఎలా జరుగుతాయో బేసిక్స్ తెలుసుకోవాలంటే ‘భారత్ బంద్’  ని ఒక గైడ్ గా లైబ్రరీలో దాచుకోవాల్సిందే.

డైలాగ్ డిస్క్ 
కాస్ట్యూమ్స్ కృష్ణ :
*‘రాజకీయ నాయకుల మచ్చను తుడిచి వెయ్యడానికి, తప్పుడు నినాదాలుగా మార్చడానికీ, రాజకీయ సముద్రాన్ని నాలాంటి వాడు చిలికితే పుట్టిన కల్పవృక్షమేరా ఈ భరత్ బంద్!’
*ఈ గుడ్డు మీద నీ పేరు రాసి ఆడి మొహాన కొట్టి నేను సీఎం నయ్యా!’
*‘ఉత్తరాలిస్తూ వూరంతటికీ తెలుసుకదాని పోస్ట్ మాన్ ఎలక్షన్లో నిలబడితే గెలుస్తాడా ఏమిటి?’
*ఎవరికీ తృప్తి కల్గించని వాడు ముఖ్యమంత్రేమిటి...ముష్టి మనిషిగా కూడా పనికిరాడు’
వినోద్ కుమార్ :
*హిట్లర్ లా హీనం గా చావకుండా కనీసం ఒక ఖైదీగా బతుకుతావ్’
రఘు :
*ఒక రాజకీయ నాయకుడి కనుసైగతో రంగు మారిపోయే చట్టం మాకెందుకు?’
బాబూ మోహన్ :  
 *ఏమిటండీ ఈ రాజీనామా బాగోతం? మీరు నిజంగా రాజీనామా చేయదల్చుకుంటే గవర్నర్ కివ్వాల. మీ పార్టీ ప్రెసిడెంటు కివ్వడం గొడవలు రెచ్చ గొట్టడానికేగా? అవతల ఛస్తున్నారండీ జనం!’


-సికిందర్
(సాక్షి –ఫిబ్రవరి 2010)