రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

Saturday, October 17, 2015

బ్రూస్ శ్రీ!


కథ- స్క్రీన్ ప్లే- దర్శకత్వం : శ్రీను వైట్ల
తారాగణం : రామ్ చరణ్, రకుల్ ప్రీత్ సింగ్, కృతీ కర్బందా, సంపత్ రాజ్, రావు రమేష్, అరుణ్ విజయ్,నదియా, అమితాష్ ప్రధాన్, బ్రహ్మానందం, అలీ,
పోసాని, సప్తగిరి, ముఖేష్ రుషి, సాయాజీ షిండే  తదితరులు
సంగీతం : ఎస్ ఎస్ థమన్, ఛాయాగ్రహణం ;  మనోజ్ పరమహంస,
మాటలు :  కోన వెంకట్,  ఎడిటింగ్ : ఎం ఆర్ వర్మ ,
బ్యానర్ : డివివి ఎంటర్ ప్రైజెస్ , నిర్మాత : డివివి దానయ్య
విడుదల : 16 అక్టోబర్, 2015,  సెన్సార్ : U/A
***
          ఒక్క ‘ఆగడు’ అనే పరాజయ అనుభవంతో ప్రతిష్ట  అమాంతం నేలకు దిగిన అగ్ర దర్శకుడు శ్రీను వైట్ల తిరిగి కోలుకుని, మెగా వారసుడు రామ్ చరణ్ తో ‘బ్రూస్ లీ’ కి శ్రీకారం చుడుతూ,  ఇప్పుడు సరికొత్త శ్రీను వైట్ల ప్రేక్షకుల ముందు కొస్తున్నాడన్న అంచనాలని, ఆశల్నీ అంతే అమాంతంగా పెంచేసుకుంటూ,  ఈ వారం బాక్సాఫీసు పరీక్షకి సిద్ధపడ్డారు. రామ్ చరణ్ కూడా ‘గోవిందుడు అందరివాడేలే’ కల్గించిన నిరాశని దృష్టిలో పెట్టుకుని, ఈసారి శ్రీను వైట్లతోనే తిరిగి తన అదృష్టాన్ని పరీక్షించుకుంటూ ప్రేక్షకుల ముందుకొచ్చేశారు. ‘ఆగడు’ కంటే ముందే శ్రీను వైట్లతో మనస్పర్ధ లొచ్చి విడిపోయిన ఆయన ఆస్థాన రచయితలు, టాలీవుడ్ సలీం -జావేద్ లైన కోన వెంకట్- గోపీ మోహన్ లు, రామ్ చరణ్ మధ్యవర్తిత్వంతో తిరిగి కలిసి ఈ సినిమాకి పనిచేశారు. ఈ మూడు ప్రత్యేకతలతో బాటు, సుమారు ఎనిమిదేళ్ళ  గ్యాప్ తర్వాత మెగా స్టార్ చిరంజీవి ఈ  సినిమాలో అతిధి పాత్ర పోషిస్తూ ప్రేక్షక లోకంలోకి రావడం ఈ సినిమాకి కావలసినంత ప్రచారాన్ని ఇచ్చేసింది. ఇన్ని ప్రత్యేకతలు గల  ‘బ్రూస్ లీ’  అసలెలా వుంది-ఆ ప్రత్యేకతల విలువని  కాపాడుతూ ప్రేక్షకులకి మన్నికైన  వినోద కాలక్షేపాన్ని పంచిచ్చిందా, లేక ఇంకేమైనా జరిగిందా, జరిగితే ఇన్ని వుండగా ఇంకెందుకు జరిగిందీ  వంటి అవసరమైన సమాచారాన్ని శ్రమించి తెలుసుకుందాం.

అసలేమిటి కథ
    చిన్నప్పటి కథ : కార్తీక్, కావ్యాలు రామచంద్రరావు ( రావురమేష్) అనే సగటు ఉద్యోగి పిల్లలు. కార్తీక్ కి చదువుకుని కలెక్టర్ అవ్వాలని వుంటుంది. (ఎప్పటి కథో! ఏనాటి పాత్రోరా నాయనా!)  అతన్ని మంచి స్కూల్లో చేర్పించి, కావ్యాని మామూలు స్కూల్లో వేస్తాడు రామచంద్రరావు. అదేంటని భార్య ప్రశ్నిస్తే,  ఇద్దర్నీ మంచి స్కూల్లో వేసి పెద్ద చదువులు చదివించే స్థోమత లేదంటాడు. దీంతో అక్క  కోసం కార్తీక్ త్యాగం చేస్తాడు. మార్కులు తక్కువ తెచ్చుకుని ఫెయిలై తండ్రి చేత చివాట్లు తిని, అక్క ఐఏఎస్ చదువుకోవడానికి రూటు క్లియర్ చేస్తాడు.

        పెద్దయ్యాక కథ :  ఇప్పుడు ఇంటర్ ఫెయిలైన కార్తీక్ ( తెలుగు కమర్షియల్ హీరో అనేవాడు విద్యకి వ్యతిరేకి కాబట్టి ఇలా మనకి రామ్ చరణ్ ఇమేజిని కాపాడుకుంటూ ఒక రోల్ మోడల్ లా, అవిద్యకి అంబాసిడర్ లా సగర్వంగా కన్పిస్తాడు)  సినిమా ఫీల్డులో స్టంట్ మాస్టర్ గా పనిచేస్తూంటాడు. తనకి బ్రూస్ లీ అంటే ఇష్టం కాబట్టి ఆ పేరుతో  చెలామణీ అవుతూంటాడు. అక్క కావ్య ( కృతీ కర్బందా) ఐఏఎస్ కి ప్రిపేర్ అవుతూ వుంటుంది. ఈ నేపధ్యంలో కార్తీక్ కి రియా ( నార్త్ ఇండియన్ పాత్ర పేరుతో నార్త్  ఇండియన్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్- పాపం ఈమె తెలుగు చక్కగా నేర్చుకుని మాట్లాడేస్తూంటే పాత్రకి తెలుగమ్మాయి పేరు పెట్టి తెలుగు వాళ్ళల్లో కలిపేసుకోవడం మనస్కరించనట్టుంది)  అనే యానిమేటర్ పరిచయమై,  అది ప్రేమగా మారుతుంది. ఒక యాక్షన్ సీన్లో కార్తీక్ ని నిజ పోలీస్ అధికారిగా భ్రమించి అతడి వెంటపడుతూ- అతణ్ణే ఆదర్శంగా తీసుకుని ఒక వీడియో గేమ్ రూపొందించేందుకు పాటుపడుతూంటుంది.  

        దారిలో పడ్డాక కథ: రామచంద్రరావు పని చేస్తున్న వసుంధరా గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ అధినేత జైరాజ్ ( సంపత్ రాజ్ ) సడెన్ గా వచ్చి, రామచంద్ర రావు కూతురు కావ్యాని తన కొడుకు (అమితాష్ ప్రధాన్) కి ఇవ్వాలని కోరతాడు. రామచంద్రరావు ఉబ్బి తబ్బిబ్బు అయి సంబంధం ఒప్పేసుకుంటాడు. ఎంగేజి మెంట్ చేసుకుంటారు.

        నగరంలో దీపక్ రాజ్ ( అరుణ్ విజయ్) అనే మాఫియా పాల్పడుతున్న ఆగడాలకి అనుకోకుండా రియా యానిమేషన్ కోసం అడ్డు తగిలి అతడ్ని గాయపరుస్తాడు కార్తీక్. ఈ దీపక్ రాజ్ ఎవరో కాదు, జైరాజ్ మొదటి భార్య (టిస్కా చోప్రా) కొడుకే. ఈ మొదటి పెళ్లి విషయం భార్య వసుంధర (నదియా) కి తెలీకుండా దాస్తాడు జైరాజ్. కార్తీక్ చేతిలో తన్నులు తిని చావుబతుకుల్లో వున్న దీపక్ రాజ్ ని చూసిన  మొదటి  భార్య, ఈ పని చేసిన వాడెవడో వాడి శవం చూడాలని భర్త మీద  ఒత్తిడి తెస్తుంది. జైరాజ్ కూడా వాడెవడో వాణ్ణి పట్టుకుని చంపాలని గ్యాంగ్ ని పురమాయిస్తాడు.

        తేలాల్సిన కథ :  ఇలా అసలు జైరాజ్ నిజ స్వరూపం  ఏమిటో, ఎందుకు తన అక్కతో కొడుక్కి పెళ్లి సంబంధం కోరుకున్నాడో, ఎందుకు తన మీద పగబట్టాడో- దీనికి విరుగుడుగా కార్తీక్ ఏం చేసి తన కుటుంబాన్ని కాపాడుకున్నాడో అన్నది ఇక్కడ్నించీ సాగే మిగతా కథ.
ఎలా వుంది కథ
        సీనియర్ స్టార్లు ఏనాడో వాడేసిన కథలే ఇంకా సినిమా కథలనుకుంటూ, వాటినే మళ్ళీ మళ్ళీ ప్రేక్షకులకి అందిస్తున్న, విసుగులేని  హైటెక్ జూనియర్ స్టార్ల గిరిగీసుకున్న పరిధిలోనే వుంది కథ. కాకపోతే ఈసారి ఈ వయసు మళ్ళిన కథ జూనియర్ స్టార్ ని ముసలి వాణ్ణి చేయడానికే పోటీపడింది. అంటే నమ్మిన పాత కథలోనూ దమ్ము కూడా లేదన్నమాట.

ఎవరెలా చేశారు
      మాస్ సినిమాలంటూ అవే పాత మూస సినిమాలతో  రాజీపడిపోయిన రామ్ చరణ్ కి ఈ సారి గట్టి షాకే తగిలింది- మొన్నే ‘శివమ్’ తో మరో వూర మాస్ సినిమాల అమర ప్రేమికుడైన ఎనర్జిటిక్ స్టార్  రామ్ షాక్ తిన్నట్టు.  రామ్ చరణ్ ఇంగ్లీషు పత్రికలకిస్తున్న ఇంటర్వ్యూ లలో ఎంతైనా తన ‘బ్రూస్ లీ’ ని  ‘భజరంగీ భాయిజాన్’, ‘ప్రేమ్ రతన్ ధన్ పాయో’ ల వంటి హై క్వాలిటీ సినిమాలతో పోల్చనీగాక, ‘ఇది నా దసరా కానుక’ అనికూడా పొగుడుకోవచ్చుగాక, అవే ఇంటర్వ్యూల కిందే ప్రేక్షకులు వాళ్ళ కామెంట్స్ తో ఎలా విరుచుకు పడుతున్నారో చూస్తే- తనెంతగా ప్రేక్షకులతో కనెక్ట్ కోల్పోయి గుడ్డిగా సినిమాలు చేసుకుపోతున్నాడో  తెలుస్తుంది. వేకప్ చరణ్, వేకప్ మాన్! గ్రో అప్! ఇతర వ్యాపారాల లాగే సినిమాలు కూడా విషయపరంగా మోడర్నైజ్ అయ్యాయి. 

        డాన్సుల్లో, ఫైట్సుల్లో రామ్ చరణ్ చూపిస్తున్న టాలెంట్ కి గుర్తింపు రావాలంటే మొత్తంగా సినిమా బావుండాలి. ఆ సినిమాలో నటన కన్పించాలి. సినిమానీ నటననీ వదిలేసి, కేవలం డాన్సులూ ఫైట్లూ చూసి తననెవరూ స్టార్ గా గుర్తించరు. నటన కన్పించాలంటే నటించడానికి ఓ పాత్ర వుండాలి. అసలు పాత్రే లేనప్పుడు - కామెడీ బాగా చేశాను నా కంఫర్ట్ జోన్ లోంచి బయటి కొచ్చి, సెంటి మెంట్ ఎమోషన్ సీన్లు బాగా చేశాను-  అని చెప్పుకోవడంలో అర్ధం లేదు. ఈ సినిమా చూస్తే అలాటి సీను ఒక్కటయినా గుర్తుంటుందా? సినిమా ఫైటర్ గా, హీరోయిన్ కి లవర్ గా, అక్కకి తమ్ముడుగా, తండ్రికి కొడుకుగా, విలన్ కి హీరోగా..  ఇలా ఎన్నో షేడ్స్ పెట్టుకున్నారు. ఒక్కటైనా పాత్రకి పనికొచ్చిందా? వీటితో ఒక్క సీనైనా పండిందా? ఏ పూర్వరంగమూ వుండని  బలహీన సన్నివేశాల్లో కన్విన్స్ కాని కృత్రిమ కన్నీళ్లు, కృత్రిమ ఆలింగానాలు, కృత్రిమ డైలాగులూ..మొదలైన వాటితో ఒక్క చోటయినా తన క్యారక్టర్ సరీగ్గా రిజిస్టర్ అయిందా? చివర్లో తండ్రీ కొడుకుల త్యాగాల కథలు, ఆ డైలాగులు ఎంత కాలం చెల్లినవో చెప్పనవసరంలేదు. కూతుర్ని కలెక్టర్ని  చేయడం కోసం కొడుకు చదువుకోలేదన్న గొప్ప నిజం ఎప్పుడో పాతికేళ్ళకి తెలిసి, ఆ తండ్రి కొడుకు త్యాగాన్ని కీర్తిస్తూ కన్నీళ్లు పెట్టడం ఏమైనా కదిలించిందా? అదొక త్యాగంగా కన్విన్స్  చేయగల్గారా? ఆ త్యాగం అనే ఎలిమెంట్ కి ఏమైనా అర్ధముందా? ఒక బడా కంపెనీలో మేనేజర్ గా పనిచేసే తండ్రి ఉన్న తన ఇద్దరు పిల్లల్ని సమానంగా చదివించుకోలేడా!

        ఇలా ఈ సినిమాలో ఎక్కాడా దేనికీ సరైన  ‘బేస్’ అంటూ కన్పించదు. గాలిమేడలు కట్టినట్టు వుంటుంది - ఒక్క విషయంలో తప్ప, అది కాపీ చేయడం కోసం ఒక ఫ్రెంచి హిట్ సినిమాని ఫ్రీగా  ‘బేస్’ చేసుకునే విషయంలో మాత్రమే. దీని వివరాల్లోకి తర్వాత వెళ్దాం. 

       హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ గురించి చెప్పుకోవాలంటే, ఈమె టాలెంటెడ్ నటి. ఠికానా లేని గ్లామర్ పాత్రలతో వృధా అయిపోతోంది. ఆ ఒడ్డూ పొడవుతో, వెండి తెరంతా వెలిగిపోయే చిరునవ్వుతో, నటనలో అంత ఈజ్ తో- ఆథర్ బ్యాక్డ్ పాత్రలు చేస్తే, ఇండిపెండెంట్ హీరోయిన్ గా తనదంటూ ఒక స్లాట్ ని క్రియేట్ చేసుకోగలదు అనూష్కా లాగా. ‘కిక్-2’ లో బీహార్ ఎపిసోడ్ లో ఆ చీరకట్టుతో పల్లెటూరి పాత్రలో చేయవలసినదంతా చేసింది. ‘బ్రూస్ లీ’ లో చేయడానికేమీ లేదు. వూరికే హీరోని పోలీసాఫీసర్ గా నమ్మేసి వెంటపడ్డం తప్ప. తన యానిమేషన్  పిచ్చి వల్లే  హీరో విలన్ తో సమస్య తెచ్చుకున్నాడని కనీసం తెలుసుకోలేని పాత్రచిత్రణలతో, పాటలకీ ప్రేమలకీ పరమితం చేస్తూంటే, ఎందరో రకుల్ ప్రీత్ సింగ్ లు ఇలా అపహాస్యం పాలై కనుమరుగవుతూనే వుంటారు.

        ఇక బ్రహ్మానందం సహా డజన్ల సంఖ్యలో వున్న కమెడియన్లూ, క్యారక్టర్ ఆర్టిస్టులూ  వున్న ‘కథ’ కి ఏ ప్రయోజనం కోసం వున్నారో తెలీదు. నానా గందరగోళం సృష్టించి, ఏదో నవ్వించామనుకుని వెళ్ళిపోతారు. శ్రీను వైట్ల ఈ స్థాయికి చేరుకున్నాక కూడా ఇంకా ఎందరో ఆర్టిస్టుల సమూహం లేకపోతే డైరెక్టర్ గా తను నిలబడలేననుకోవడం చాలా విచారకరం. తాను చేరుకున్న ఈ పొజిషన్ కి ఆరేడుగురు ఆర్టిస్టులతో బలమైన కమర్షియల్ సినిమా తీసి ప్రేక్షకులకి కొత్త అనుభవ మివ్వొలేకపోతే చేరుకున్న ఈ టాప్ పొజిషన్ కి అర్ధం లేదు. నిజానికి ‘బ్రూస్ లీ’ ని కేవలం ఆరేడుగురు నటీనటులతో బలంగా, కొత్తగా, ఆశ్చర్య కరంగా తీసి క్రేజ్ సృష్టించవచ్చు. ‘ఆగడు’ పరాజయంతో తప్పులు తెలుసుకుని తాను  మారిపోయానని చెప్పుకున్న వైట్ల ‘బ్రూస్ లీ’ తో ఏం మారినట్టో అర్ధంగాదు. అదే ఆర్టిస్టుల గుంపు, అదే కథా స్కీము, అదే కామెడీ గోల, అదే మూస రైటింగ్, అదే టేకింగూ డైరెక్షన్!

       ఇక ఈ ‘సీ’ గ్రేడ్ అనిపించే కథాకథనాలతో కూడిన  సినిమాకి కొసమెరుపుగా చివర్లో చిరంజీవి రావడమే శ్రీరామ రక్ష . ‘రుద్రమ దేవి’ ని అల్లు అర్జున్ కాపాడినట్టు, ‘బ్రూస్ లీ’ కి ఈమాత్రమైనా కలెక్షన్లు వస్తున్నాయంటే చిరంజీవిని చూడ్డానికి జనం ఎగబడ్డం వల్లే. ఈ ధోరణి చూస్తూంటే, ఇక సరుకులేని ఇలాటి సినిమాలకి క్రేజ్ వున్న స్టార్లతో అప్పీయరెన్సులు  ఇప్పించుకునే సాంప్రదాయానికి తెరతీస్తారేమో. ఈ సినిమాలోనే మొహమాటపడకుండా మాటల రచయిత తన మీద తనే సెటైర్ వేసుకుంటున్నట్టు -  ‘సీన్ లో కంటెంట్ లేని సినిమాల్లో క్లయిమాక్స్ లో హడావిడి ఎక్కువ’ - అని డైలాగు రాయడం, దాన్ని పాటిస్తూ క్లయిమాక్స్ లో చిరంజీవిని రప్పించి హడావిడీ చేయడం అంతా మసిపూసి మారేడు కాయ. కానీ చిరంజీవి రాకతో అంతసేపూ నరకం అనుభవించే ప్రేక్షకులకి హుషారు వచ్చేస్తుంది. చిరంజీవి కూడా జీవితంలో 150 వ సినిమా అంటూ తీస్తే,  దానికి ప్రేక్షకుల రెస్పాన్స్ ఏమేరకు ఉంటుందనే  దానికి ఓ చిన్న ట్రయల్ వేసి చూసుకున్నట్టయ్యింది.  ఆ నూటయాభయ్యోవది తప్పకుండా ఓ చరిత్రే అయ్యేట్టు చూస్తామని ప్రేక్షుకులు కూడా ఇలా హామీ ఇచ్చేస్తున్నారు-  ‘జస్ట్ టైం గ్యాప్, టైమింగ్ లో గ్యాప్ వుండదు’  అన్న మెగాస్టార్ డైలాగ్ కి డంగై పోతూ. 

        మెగా స్టార్ తో బాటు ఎస్ఎస్ తమన్, మనోజ్ పరమహంస, రామ్- లక్ష్మణ్ లు ఈ  సినిమాని నిబెట్టేందుకు చాలా కృషిచేశారు. కానీ కంటెంట్ లేకపోతే  ఎవరు మాత్రమేం చేయగలరు. కంటెంటే లేనప్పుడు వచ్చే పాటలూ ఎంత బావున్నా బోర్ కొడతాయి. ఫైట్లూ సహనపరీక్ష పెడతాయి. కెమెరా వర్కూ వృధా అయిపోతుంది. దేంట్లోనూ ఇన్వాల్వ్ కాలేరు ప్రేక్షకులు. వీటితో కంటెంట్ అయినా కలిసిపోవాలి, లేదా కంటెంట్ తో ఇవైనా కలిసి సాగాలి- ఇలా కాక భిన్నధృవాలైనప్పుడు, ఎవరికివారే యమునా తీరేగా కాశీలో కలుసుకోవడమే అన్నీ కలిసి.


స్క్రీన్ ప్లే సంగతులు 
         విజయవంతంగా ఈ సినిమాకి స్క్రీన్ ప్లే అనేది లేదు, ‘ఐస్ స్క్రీమ్ ప్లే’ అంటూ కొత్తది కనిపెట్టారు.  దీనితర్వాత ‘లాలిపాప్ ప్లే’ రావొచ్చు. ‘చూయింగమ్ ప్లే’ రావొచ్చు. ఆఖరికి ఇంకా కాలం కలిసివస్తూ వుంటే,   ‘పాన్ మసాలా ప్లే’, ‘మాణిక్ చంద్ గుట్కా ప్లే’ లు కూడా వచ్చేస్తాయి. బిగ్ బడ్జెట్ సినిమాలకి కావలసిందల్లా అతి బీదతనంతో కూడిన తెల్ల రేషన్ కార్డు  ‘ప్లే’ మాత్రమే. సబ్సిడీ బియ్యం మాత్రమే. సబ్సిడీ బియ్యంతో బిర్యానీ వంటకం  మాత్రమే. నాణ్యమైన బాస్మతీ బియ్యంతో ప్రేక్షకులకి మంచి బిర్యానీ  పెట్టలేని పేదరికంతో  వుంది టాలీవుడ్ రైటింగ్ డిపార్ట్ మెంట్. సబ్సిడీ బియ్యం మాత్రమే తెలుగు బిగ్ బడ్జెట్ సినిమాల్ని ప్రపంచంలో కెల్లా అతి పెద్ద జోకుగా ( స్కామ్ గా కూడా!)  పేరు ప్రఖ్యాతులు సంపాదించి పెట్టగలదు కాబట్టి ఆ రేషన్ ని వదులుకోరు. టాలీవుడ్ సలీం-  జావేద్ లైన కోన వెంకట్- గోపీ మోహన్లు ఆల్రెడీ సింగిల్ విండో స్కీము అనబడు జారుడుబల్ల స్క్రీన్ ప్లేని  కనిపెట్టారు. అది సినిమా తర్వాత సినిమాగా ఏకసూత్ర కార్యక్రమంగా అమలవుతూ  ‘పండగ చేస్కో’ తో పరాకాష్టకి చేరింది. ఈ స్కీము కింద ఏ స్టార్ అయినా, ఎంతటి వాడైనా; ఏ కథైనా, కథే కాకపోయినా, అదే సింగిల్ విండో లోంచి దూకి, అదే జారుడు బల్లమీదుగా రయ్యిన జారుకుంటూ వెళ్లి బాక్సాఫీసులో పడాల్సిందే. అదంతా ఒక సెట్ చేసిన ప్రోగ్రామింగ్, ఒక టెంప్లెట్, ఒక ఆటోమేషన్, అంతే. మీటలు నొక్కడమే పని. స్టోరీ మేకింగ్ సాఫ్ట్ వేర్ లు అంటూ వున్నాయి. ఈ సింగిల్ విండో స్కీము గురించి ప్రపంచానికి తెలిసిపోతే,  వందల కోట్ల డాలర్ల ఆ స్టోరీ మేకింగ్ సాఫ్ట్ వేర్ రంగం మొత్తంగా మూతబడి పోవాల్సిందే. 

        ఈ సినిమాలో కూడా హీరో వెళ్లి విలన్ ఇంట్లో పడి, మరో పది మందిని తెచ్చుకుని, అదే కన్ఫ్యూ జ్ కామెడీ అనే అదే డ్రామా ఇందుకే మొదలెట్టాడు. పాపం రామ్ చరణ్ కీ తప్పలేదు ఈ జారుడు బల్ల పిల్లలాట!

        ఒక హిట్ దర్శకుడు ఆఫ్ ది  రికార్డ్ గా ఇలా డిసైడ్ చేశారు : ‘సినిమాలు  డిజిటలైజ్ అయ్యాక ‘ఏ’ సెంటర్ నుంచీ ‘సీ’ సెంటర్ దాకా, పక్క స్టేట్స్ నుంచీ  ఓవర్సీస్ దాకా, ఒకేసారి వెయ్యి థియేటర్లలో విడుదల చేసుకుని, శుక్ర- శని- ఆదివారాల్లో పెట్టుబడులూ లాభాలూ లాగేసుకునే సులువు ఏర్పడ్డాక,  ఇంకా క్వాలిటీ, క్రియేటివిటీ లెందుకండీ, కథా కాకరకాయ లేంటండీ - స్టార్ నీ డైరెక్టర్ నీ చూసి పొలోమని జనాలు వచ్చి పడుతోంటే- మూడ్రోజుల్లో దులుపుకు పోయే దానికి!’ 

        ‘ఐతే జనాలు కూడా దులుపుకు పోయేవాళ్ళలాగా తయారైపోయారంటారా డబ్బులిచ్చుకుని?’’ అనడిగితే,  ‘తీసేవాళ్ళూ చూసేవాళ్ళూ అందరూ ఎవరి గేములు వాళ్ళు ఆడుకుంటున్నారండీ.. మీరే రివ్యూలు రాసి టైం వేస్ట్ చేసుకుంటున్నారు’  అన్నారు. నిజమే, నూటికి 90 శాతం ఫ్లాపయ్యే సినిమాలకీ అంతే కష్టపడి రివ్యూలు రాయాల్సిన సంగతలా వుంచి, మూడ్రోజుల్లో వాటికి జనం అలా నిలువు దోపిడీలు ఇచ్చేస్తూంటే, ఇంకా వాటి మంచి చెడ్డలు విశ్లేషిస్తూ బ్లాగులో పోస్టులు పెట్టడం శుద్ధ తెలివితక్కువ పనే. చాలా లో-క్లాస్ యాక్టివిటీ! వెయ్యి థియేటర్లలో డిజిటల్ ప్రొజెక్షన్ల ఇన్ స్టెంట్ కాలంలో రివ్యూలు అవుటాఫ్ ఫోకస్ అయిపోక తప్పదు. సినిమాలు చూడని వాళ్ళే ఎక్కువ మంది రివ్యూలు చదువుతారు. దీంతో ఫటాఫట్ నిర్మాతలకీ నష్ట మేమీ లేదు, పనిగట్టుకుని రాస్తున్న వాళ్ళకీ ఒరిగేదేమీ లేదు.  

***
     ఐనా టైపు చేసే చెయ్యి వూరుకోదు కదా.చదివే వాళ్ళు వున్నా లేకపోయినా టైపింగ్ జరిగి పోతూ  వుంటుంది. కనీసం ఈ టైపు చేస్తున్నప్పుడు కొత్త కొత్త విషయాలు బయటపడుతోంటే, ఈ జ్ఞానధార కోసమైనా అర్రులు చాస్తూ టైపు చేయాల్సిందే. There's no wastage in God's grand economy’ అని కదా కొటేషన్? 
      
          ‘బ్రూస్ లీ’ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. జడివాన వెలసిన వెనుకా జరిగింది  తెలియునులేరా- అనీ ఇప్పుడు ఒకటొకటే  విషయాలు బయటపడుతున్నాయి. శ్రీను వైట్ల అనుకున్న కథ ఇది కాదనీ, ఆయన  కథని కోన- మోహన్ లు కలిసి మార్చేశారనీ, టైటిల్ కూడా ఆయననుకున్నది కాదనీ, వాళ్ళతో మళ్ళీ కలిసి పనిచేయడం వైట్లకి ఇష్టం లేకపోయినా, రాం చరణ్ బలవంతంతో తప్పలేదనీ, చివరికి ఒక ఫ్రెంచి సినిమా  కథని తెచ్చి సెకండాఫ్ లో పెట్టి నడిపారనీ..కథని విస్తరించి డైలాగులు రాయడానికి  పారితోషికం రెండు  కోట్ల రూపాయలకి తగ్గకుండా తీసుకున్నారనీ ...ఇలా ఫిలిం నగర్లో లీకవుతున్నాయి వార్తలు. 

        ఎన్ని కోట్లు తీసుకున్నారన్నది ముఖ్యం కాదు, తిరిగి ఏమిచ్చారన్నదే ముఖ్యం. ఒరిజనల్ గా ఏం సృష్టించారన్నదే ముఖ్యం. ఒరిజినాలిటీ లేనప్పుడు, మౌలిక అవగాహన లేనప్పుడు, వున్నా మనకెందుకని ఉపెక్షించినప్పుడు మాత్రమే ఇచ్చి పుచ్చుకోవడాలు ప్రశ్నార్ధక మవుతాయి.  ముందుగా కాన్సెప్ట్ పరంగా చూస్తేనే ఇది సినిమాకి పనికి రాదనీ ఇట్టే తెలిసిపోతుంది. ఈ శతాబ్దం లో ఇప్పటివరకూ మహేష్ బాబు నటించిన, గుణశేఖర్ తీసిన  ‘అర్జున్’  దగ్గర్నుంచీ సిస్టర్ సెంటి మెంట్ తో వచ్చిన సినిమా ఏదీ ఆడలేదు. అలాంటప్పుడు శ్రీను వైట్ల కూడా కలెక్టర్ అక్కగార్ని పెట్టుకుని ఇంత పురాతన కథ అనుకోవడమే పొరపాటు. సిస్టర్ సెంటి మెంట్సుని పండించడానికి జ్యూనియర్ స్టార్లు చిరంజీవీ నాగార్జునలు కాదు. ఆ గ్రేస్ వీళ్ళకింకా  రాలేదు. అయినా వర్కౌట్ చెయ్యక తప్పదనుకుంటే, ఈ కాలానికి కనెక్ట్ అయ్యేట్టు చాలా బలంగా సృష్టించాలే తప్ప, ఆషామాషీగా నాల్గు కృత్రిమ సీన్లతో కాదు. మొన్న ఆగస్టులోనే అక్షయ్ కుమార్- సిద్ధార్థ్ మల్హోత్రాలతో కరణ్ మల్హోత్రా దర్శకత్వం వహించిన ‘ బ్రదర్స్’ లో అన్నదమ్ముల సెంటిమెంట్ ఎంత బలంగా,  ఒక సందేశం లాగా వర్కౌట్ అయ్యిందో చూశాం. ఆ సినిమా చూసి చివర్లో ఏడవకుండా ఎవరైనా బయటికి రాగలరా? ఏడ్పించడం  ఎప్పుడో మర్చిపోయిన బిగ్ బడ్జెట్ సినిమాలకి ఈ సెంటి మెంట్ల కథలు అవసరం లేదు.

        అక్క అనేదే కాస్త ఉన్నతంగా వుండే పాత్ర. అప్పుడామె  ప్రవర్తన తనకోసం తమ్ముడు చేసిన త్యాగ మూల్లాల్లోంచి వుండాలి. మూలాల్లేని  ప్రవర్తనతో సెంటిమెంట్లెలా పెల్లుబుకుతాయి. ఇందుకే ఈ సినిమాలో దేనికీ ‘బేస్’ లేదనేది. ఐయ్యేఎస్ చదివే అమ్మాయి అప్పుడే పెళ్ళికి ఒప్పుకుంటుందా? ఆ ఒప్పుకోవడం కూడా ఎవరో పెళ్ళికొడుకుని చూసీచూడగానే తనకి నచ్చేశాడని సగటు అమ్మాయిలా సిగ్గులు పోతుందా? రేపు ఈ పర్సనాలిటీతో గనుక ఈమె ఐయ్యే ఎస్ రాసి ఇంటర్వూ కెళ్తే,  వెంటనే డిస్ క్వాలిఫై అయిపోతుంది. ఇలాటి చిత్రణలు ‘సీ’ గ్రేడ్ సినిమాల్లో కన్పిస్తాయి. నిర్మాత డివివి దానయ్య దయతో దానం చేసిన రెండు కోట్ల కథల్లో కాదు.

        రెండోది- హీరో పాత్ర. మార్షల్ ఆర్ట్స్ లెజెండ్ బ్రూస్ లీ పేరు పెట్టుకుని హీరో ఏం చేస్తున్నాడు. స్టంట్ మాన్ వృత్తిలో ఏ సమస్యలు ఎదుర్కొన్నాడు. ఇవి కూడా వదిలేద్దాం. ఆ వృత్తి కారణంగా కథనంలో సహజసిద్ధంగా ప్రధాన కథతో  ఏర్పడాల్సిన సంబంధం ఎక్కడుంది? తెలీక ఆ వృత్తికి పోలీసు ముసుగేసి హీరోయిన్ ఆడుకోవడం ప్రధాన కథా, లవ్ ట్రాక్ లో భాగమా? ప్రధాన కథ విలన్ తో కదా వుంది. మారా విలన్ హీరో వృత్తిని ఎక్కడ ఎక్స్ ప్లాయిట్ చేశాడు. ఎక్స్ ప్లాయిట్ చేయకపోతే హీరోకి అలాటి స్పెషలైజ్డ్ వృత్తి దేనికి, ఆడియెన్స్ ఎక్స్ పెక్టేషన్స్ ని నీరు గార్చెయ్యడానికి కాకపోతే.

        ఒరిజినల్ సలీం- జావేద్ లు ఇలా కాదు- వాళ్ళు రాసిన  ‘డాన్’ ( 1978) లో ప్రాణ్ నటించిన పాపులర్ పాత్ర సర్కస్ కళాకారుడు. అతడి సర్కస్ విద్యని విలన్ ఎక్స్ ప్లాయిట్ చేస్తాడు. అతడి పిల్లల్నికిడ్నాప్ చేసి,  ఒక సర్కస్ కళాకారుడికి మాత్రమే సాధ్యమయ్యే సాహసంతో కూడిన నేరం చేయిస్తాడు. అదీ పాత్రప్రయోజనమంటే. మరి బ్రూస్ లీకి ఏం జరిగినట్టు, అతడెందుకు ఫైటర్ గా వున్నట్టు? అతడి అసిస్టెంట్లు కమెడియన్లు ఎందుకయిన్నట్టు. కమెడియన్లు స్టంట్ కళాకారులుగా కన్విన్స్ చేస్తారా?  

***
       ఈ స్క్రీన్ ప్లే కి ఒక స్ట్రక్చర్ అంటూ ఏమీ లేదు. చాలా క్లమ్సీగా వుంటుంది కథనం. ఏ సంఘటన ఎందుకు జరుగుతోందో, ఏ యాక్ట్ లో భాగంగా వస్తోందో అర్ధంగానంత గజిబిజిగా వుంటుంది. ఇందాక చెప్పుకున్న ‘బ్రదర్స్’ ఫస్టాఫ్ లో బిగినింగ్ ముగిసి, మిడిల్ ప్రారంభమయ్యాక- మళ్ళీ బిగినింగ్ తాలూకు సీన్లు ఎలా వచ్చి గందరగోళం సృష్టిస్తాయో- శాండ్ విచ్ స్క్రీన్ ప్లే అన్పిస్తాయో- అలాటి గందర గోళం ఇక్కడ మొత్తం సినిమా అంతా కన్పిస్తుంది. చాలా నిర్లక్ష్యంగా రాసుకుపోయిన  విధానమే కన్పిస్తుంది. ప్రారంభించడమే ఇంకా పాతకాలంలో వున్నట్టు-  అనగనగా.. అంటూ చిన్నపిల్లల కథ ఎత్తుకుంటారు. 

        హీరో పెద్దయ్యాక ఓ ఫైట్ ఓ పాటా రొటీన్ గా వచ్చేశాక, హీరోయిన్ తో వచ్చేసి లవ్ ట్రాక్ మొదలవుతుంది. ఇంకోవైపు జయప్రకాష్ రెడ్డి డబుల్ యాక్షన్ తో హీరోకి కన్ఫ్యూజ్ కామెడీ. మధ్యమధ్యలో జెర్కు లిస్తూ చిన్న విలన్  వస్తూంటాడు. ఇతను టెర్రరిజం చేస్తాడు, డ్రగ్ స్మగ్లింగ్ చేస్తాడు, ఇంకేవేవో చేస్తాడు. ఒక్కటీ రిజిస్టర్ కాదు. రొటీన్ గా అతడికి దండాలు పెట్టే  పోలీసు అధికారులు వచ్చేస్తూంటారు. ఏమిటో లీడ్ సరిగ్గా వుండని యాక్టివిటీస్ తో ఔటాఫ్ పేజ్ క్యారక్టర్లై పోతారు. ఎవరూ సరిగ్గా రిజిస్టర్ కారు, ఏదీ సరిగ్గా ముద్రించుకోదు. ఇది చాలనట్టు సడెన్ గా ఒకసారి హీరో అక్క కిడ్నాప్ అవుతుంది. డ్రగ్ కేసులో పోలీస్ స్టేషన్లో వుంటుంది. మరోసారి హీరోయినే కిడ్నాప్ అవుతుంది. ఇలా కిడ్నాపులు కూడా అర్ధం పర్ధం లేకుండా రిపీట్ అవుతూంటాయి. అప్పుడు సడెన్ గా పెళ్లి సంబంధం అంటూ పెద్ద విలన్ వచ్చేస్తాడు. రోగానికి టైముకి టాబ్లెట్ వేసుకోవాలన్నట్టు, పాటలూ ఫైట్లూ ఠంచనుగా వచ్చేస్తూంటాయి. ముందు అక్క కిడ్నాప్ లాంటి మేజర్  సంఘటనని చూసి, హమ్మయ్య ఇక్కడ ఈ గజిబిజి బిగినింగ్ విభాగం ముగించి చక్కగా ప్లాట్ పాయింట్ -1 ని ఏర్పాటు చేస్తున్నారు కాబోలనుకుంటాం. ఆ సంఘటన కాస్తా నీరుగారిపోయి, ఇది కాదు మరేదో జరుగుతుంది కాబోలని మళ్ళీ చూస్తూంటాం. ఇంకేవేవో జరిగి, ఈసారి హీరోయిన్ కిడ్నాపై పోతుంది. ఇలా రిపీటీషన్స్ తో రచనకి ఒక ధ్యేయం, గమ్యం, కథా పథకమంటూ కన్పించక- స్టార్ట్ అండ్ స్టాప్ అనే డాక్యుమెంటరీ లకి వాడే టెక్నిక్ ని విరివిగా వాడేస్తూంటారు. 

        చివరికి ఇంటర్వెల్ ముందు హీరో వెళ్లి ఎలాగో చిన్న విలన్ గాయపర్చి  కోమాలోకి పంపిస్తాడు. అప్పుడు తెలుస్తుంది ఆ చిన్న విలన్ బడా వ్యాపార వేత్త మెయిన్ విలన్  పెద్ద కొడుకే  అని. చిన్న కొడుక్కి హీరో అక్కతో  సంబంధం మాటాడు కున్నాడు. హీరో తండ్రి ఈ బడా వ్యాపార వేత్త కంపెనీలో మేనేజరే. నిజానికి ఇప్పుడు ఇన్నేళ్ళకి ఇంకా పెద్ద హోదాలో వుండాలి. ఎకాఎకీన బడా వ్యాపారి ఈ సంబంధం ఎందుకు కోరుకున్నాడంటే, ఇతను రాజ్యసభ సీటు మీద కన్నేశాడు. టికెట్టు కోసం తనది ఎంత సామ్యవాదమో మంచి మార్కులు కొట్టెయ్యడానికి ఈ సంబంధమట. హీరోగానీ, అతడి తండ్రిగానీ ఈ కుయుక్తి గ్రహించకుండానే ఎంగేజిమెంటుకి కూడా సిద్ధపడి పోతారు. వీళ్ళ అమాయకత్వమే  వీళ్ళ కొంపముంచింది. 

        ఎప్పుడైతే బడా వ్యాపారి మొదటి భార్యకి పుట్టిన పెద్ద కొడకు కోమాలోకి వెళ్ళాడో,  ఆ మొదటి భార్య అల్టిమేటం ఇస్తుంది- తన కొడుకుని ఇలా కొట్టిన  వాడిని చంపాలని. బడా వ్యాపారి ఒప్పుకుని భీకర ప్రతిజ్ఞ చేస్తాడు. ఇటు ఏదో సందర్భంగా హీరో అక్క ఏదో ప్రమాదాన్ని శంకిస్తే, మన ఫ్యామిలీ జోలి కెవరొచ్చినా సెంటీ మీటర్ దూరంలో చావు చూపిస్తానంటాడు హీరో. ఇలా ఇక్కడ విడివిడి బిల్డప్స్  తో ఇంటర్వెల్ పడుతుంది. గత్యంతరం లేదు కాబట్టి ఇదే ప్లాట్ పాయింట్ -1 అనుకోవాలి. దీని నిర్వహణ ఎలా వుంది? ఈ కింద చూద్దాం..

***
      'యాం ఏ ఫైటర్, టేకప్ చేసిన మిషన్ ఫినిష్ చేసేవరకూ నో ఇంటర్వెల్, జస్ట్ క్లయిమాక్స్!’  రామ్ చరణ్ డైలాగ్. 
        పాత్రలు ఆడియెన్స్ కి అర్ధంకాని సినిమా స్క్రిప్టు లాంగ్వేజీ బాగానే మాట్లాడుతూ కోతలు కోస్తాయి వాటి అర్ధాలే తెలీకపోయినా. 

        ఇంటర్వెల్ దగ్గర ఏం ఎస్టాబ్లిష్ అయింది? హీరో, విలన్ ఇద్దరూ ప్రతిజ్ఞలు చేసుకున్నారు. ఎలా?  అసలు తను ఎవరి కొడుకుని కొట్టాడో హీరోకే తెలీదు, అయినా  వాడు తన కుటుంబం జోలికొస్తే వూరుకోనన్నాడు.  అలాగే తన కొడుకుని కొట్టిందెవరో విలన్ కీ  తెలీదు. అయినా ఆ కొట్టిన వాణ్ణి చంపుతానని అతను కూడా శపథం చేశాడు.

        ఈ కథలో విలన్ ఎవరో హీరోకి తెలీదు, అలాగే తన హీరో ఎవరో విలన్ కీ తెలీదు ఇంటర్వెల్ కి వచ్చాక కూడా. ఇద్దరూ డమ్మీలే, ఇద్దరూ పాసివ్ లే. 

        ‘శివమ్’  లో ఎలాగైతే సిగరెట్ లైటర్ కోసం తను కొట్టింది విలన్ కొడుకునే అని హీరోకి తెలీదో, అలాగే తన కొడుకుని హీరోయే కొట్టాడని కూడా విలన్ కి ఎలా తెలీదో- అదే సిట్యుయేషన్ ఇక్కడా ఏర్పాటు చేశారు. ‘శివమ్’ ఫ్లాప్ అయ్యింది, ఇలాటిదే ‘హోరాహోరీ’  కూడా ఫ్లాపయ్యింది. 

        ‘
మెక్సికన్ స్టాండాఫ్’ ( Mexican stand-off) అనే సిట్యుయేషన్ ఒకటుంటుంది. ఈ సిట్యుయేషన్ లో  ప్రత్యర్థులిద్దరూ తుపాకులు గురిపెట్టుకుని వుంటారు. ఎవరు ముందు పేలుస్తారన్నది సస్పెన్స్. ఇది ముఖీముఖీగా ఏర్పడే టెన్షన్. కానీ పై మూడు ఫ్లాపయిన తెలుగు సినిమాల్లో హీరోలూ విలన్లూ పరస్పరం తెలుసుకోకుండా ఒకడు ఎక్కడో, ఇంకొకడు ఇంకెక్కడో వుండి  బీరాలు పలుకుతారు. సమస్య ఏంటో తెలీదు, శత్రువెవరో తెలీదు. అలాటి ఆ ఇద్దరి సౌండ్ పొల్యూషన్ ని ఒక దగ్గర చేర్చి, కాంట్రాస్ట్ చూపిస్తూ- ఫిలిం నగర్ స్టాండాఫ్’ (Film nagar stand-off) అనే ఒక వింత గారడీ చూపించి ప్రేక్షుకులు తెల్లబోయేలా చేస్తారు.

***
         ‘వేట ఎలా ఉంటదో నేను చూపిస్తాను. మొదలు పెట్టాకా పూర్తయ్యేవరకూ రిక్వెస్ట్ లు వినపడవ్, రియాక్షన్ లు కనపడవ్, ఓన్లీ రీసౌండ్’ - రామ్ చరణ్ మరో డైలాగ్ డీటీఎస్ టెక్నాలజీని కూడా లాగి. ఈ ‘రీసౌండ్లు’-  ‘స్క్రీన్ ప్లే’ లో తాటాకు చప్పుళ్ళు. 

        పాసివ్ పాత్రకి ఇన్నేసి డైలాగులా. సరే, ఇంటర్వెల్ దగ్గర వేసిందే ప్లాట్ పాయింట్ -1 అనుకుందాం. ఈ ప్లాట్ పాయింట్- 1 లో-  a) హీరోకి గోల్,  b) ఆ గోలో ఎమోషన్, c) తను తీసుకోబోయే చర్యల తాలూకు పరిణామాల హెచ్చరికా - ఉన్నాయా? ఏవీ లేవు. వాడెవడో తెలీదు, వాడు తన ఫ్యామిలీ జోలికొస్తే అంతు చూస్తానన్నాడు. వచ్చినప్పుడు కదా. రాకపోతే ఏమీ లేదు. కాబట్టి హీరోకి గోల్ లేదు. గోల్ లేకపోయాక మిగిలిన రెండు అంశాలూ లేవు. ప్లాట్ పాయింట్ -1 దగ్గర కూడా హీరోకి గోల్ ఏర్పడక పోతే అది కథెలా అవుతుంది. ప్లాట్ పాయింట్ -1 అనే మొదటి మూలస్థంభంలో ఏ బలమూ లేకపోతే, 40 కోట్ల సినిమాకి ఆధారభూతమయ్యే స్క్రీన్ ప్లే అనే మహా సౌధాన్ని అదెలా నిలబెడుతుంది? యథా ప్లాట్ పాయింట్- 1 తథా ప్లాట్ పాయింట్- 2  అని కదా? మొదటి మూలస్థంభం బలంగా లేకపోతే, రెండో మూలస్థంభమూ అంటే- క్లయిమాక్సూ ముగింపూ కూడా తేలిపోతాయని కదా జనరల్ రూలు? ఈ సినిమాలో ఇదే జరిగింది కదా?  

        కథ నడపాల్సిన  కథానాయకుడు, ఓ అక్క ఊహాజనిత భయాలకి ఊహాగానాలు చేస్తూ వున్నాడు. మరి కథెవరు నడపాలి?

***
      ‘నీ మీటర్ పగిలితే గానీ నా మీటర్ అర్ధంగాదు’ - రామ్  చరణ్ ఇంకో డైలాగ్ బీటెక్ ఎలెక్ట్రానిక్స్ భాషలో. 

        ఏమీ చేయలేని దానికి ఈ డైలాగు లెందుకో. తనకున్న మీటరేంటి-అదెందుకు పనికొచ్చింది? నీ మీటర్ తో నువ్వు సినిమాని ఫ్లాప్ చేశావ్ కదా అని విలన్ అంటే పరిస్థితి ఏంటి? ఎస్, ఇంటర్వెల్ తో అదే ప్లాట్ పాయింట్-1  అనుకుని అలాగే కంటిన్యూ చేద్దాం. సినిమా అంతా నిండిపోయి వున్న నానా వ్యర్ధ పాత్రలన్నిటినీ తీసేద్దాం. కేవలం హీరో, అతడి కుటుంబం, హీరోయిన్, విలన్, అతడి కుటుంబం- ఈ పాత్రలతోనే ఒక ఫ్యామిలీ డ్రామాకి తెర తీద్దాం. విలన్ ప్రస్తుత భార్య - ‘కోడలిని తెచ్చుకునేది మనకున్న స్టేటస్ ని పెంచుకునేందుకు కాదు, మనకి లేని కూతుర్ని తెచ్చుకునేందుకు’  అని అందమైన డైలాగు పలికింది. ఎస్, ఫ్యామిలీ డ్రామాకి తెర తీద్దాం. అక్క పెళ్లి సంబంధం నేపధ్యంలో ఇటు హీరో- అటు విలన్ పరస్పరం ఒకరికొకరు తెలీక ఏం హాని చేసుకున్నారో, ఇంకేం  చేసుకోబోతున్నారో, ఆ పెళ్లి సంబంధం ఏమౌతుందో -ఎవర్ని ఎవరు క్షమించుకోవాలో, ఎవరికి  ఎవరేం నేర్పాలో- తక్కువ పాత్రలతో సిస్టర్ సెంటిమెంట్ కాన్సెప్ట్ ని మానవ సంబంధాల చట్రంలో సూటిగా బలంగా ఎక్కిస్తూ- ఈ కథని నిలబెట్టొచ్చు.

***
    ‘సలహాలు ఇవ్వడానికి చదువు అక్కర్లేదండీ’  రామ్ చరణ్ గోల్డెన్ వర్డ్స్. తనకేం జరుగుతోందో తెలుసుకోవడానికి లోకజ్ఞానం కూడా అక్కర్లేదా? వచ్చిన వాడెవడో తెలుసుకోకుండా అక్కని విలన్ చేతుల్లో పెట్టేశాడు. సెకండాఫ్ ప్రారంభం కాగానే ఒక ఇంటలిజెన్స్ అధికారి వచ్చి ఆ వియ్యమందుకున్న విలన్ గుట్టు చెప్తే గానీ  హీరో తెలుసుకోలేకపోయాడు. ఇదీ హీరోయిజం. ఆ అధికారి- ఆ విలన్ రాజ్యసభ టికెట్ పొందకుండా ఆపడానికి అతడు చేస్తున్న నేరాలపై రుజువులు సంపాదించడం కోసం హీరోని నియమించాడు. హీరోకి పనేలేదు, గోల్ లేదు. రెండూ ఆ అధికారివే. ఆ అధికారి చేతికింద కిరాయి సైనికుడుగా హీరో వెళ్ళిపోయాడు. ఓన్ పవర్ వున్న ఫైటర్ గా కాదు. ఇందులో భాగంగా విలన్ ఇంట్లో చేరాడు కామెడీ కోసం. 

        ఇదీ విషయం. సింగిల్ విండో స్కీము ప్రకారం జర్రున జారుకుంటూ హీరో వెళ్లి విలన్ ఇంట్లో పడాలి కాబట్టి- అక్కడ ఒకర్నొకరు గుర్తుపట్టుకోలేని కన్ఫ్యూజ్ కామెడీతో ప్రేక్షకులకి కితకితలు పెట్టాలి కాబట్టి - అలా ఇంటర్వెల్లో ఇద్దర్నీ అనామకంగా వుంచేశారన్న మాట!

        ఇక ఆ  ఇంట్లో సమయానికి మాత్ర వేసుకోవాలన్నట్టు బ్రహ్మానందం ఎంట్రీ, ఇంకొందరు కమెడియన్ల ఎంట్రీ- ఈ బోలెడు క్యారక్టర్లనీ కలిపి విలన్ ని బకరా చేస్తూ- రచయితలకి, దర్శకుడికీ అలవాటైపోయిన ‘హమ్ ఆప్కే హై కౌన్’ బ్రాండ్ కామెడీ వెర్షన్ కి శంకు స్థాపన చేయడం. సిస్టర్ సెంటి మెంటుని ఏటో పంపించెయ్యడం. 

        ఇందులోకి మళ్ళీ ఇంకో కథ విలన్ కోసం ఇరికిస్తూ, ఫ్రెంచి హిట్ కామెడీ ‘ది వాలెట్’ ని కాపీ కొట్టి పెట్టేశారు. ఇదే శ్రీను వైట్ల ‘దూకుడు’ లో జర్మన్ సినిమా ‘గుడ్ బై లెనిన్’ ని తెచ్చి ప్రకాష్ రాజ్ కోమా కథకి పెట్టేసుకున్నట్టు.

        కానీ ఒక్క ముక్కా ఈ సెకండాఫ్ కామెడీ అర్ధంగాదు. ప్లాట్ పాయింట్ -2 ఎక్కడుందో గుర్తు పట్టడం కూడా కష్టం. మాటిమాటికీ విలన్ ఏది ఎందుకు మాట్లాడుతున్నాడు, మాటిమాటికీ ఆ పథకాలేంటి బుర్ర కెక్కించుకోవడం చాలా కష్టం. బక్వాస్ తో బుర్ర వాచిపోతుంది. ఇక క్లయిమాక్స్ అంటూ మొదలెట్టిన ప్రహసనం ఫస్టాఫ్ లో కథనం లాగే, స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ బారిన పడి-  ఇదిగో ముగిసిందీ అనుకోగానే మళ్ళీ విలన్ బతికి ఏదో చేయడం; అదిగదిగో ముగిసిందీ అనుకోగానే మళ్ళీ విలన్ బతికి, చిరంజీవి రావడం కోసం  హీరోయిన్ ని కిడ్నాప్ చేయడం, చిరంజీవి బుద్ధి చెప్పి వెళ్ళిపోగానే మళ్ళీ హీరోయిన్ ని పిప్పళ్ళ బస్తాలా ఎత్తుకెళ్ళి పోవడం...ఓ గాడ్..ఇంకా చెప్పుకోవడం మనవల్ల కాదు!!

        ఇంత లోపభూయిష్టమైన స్క్రీన్ ప్లే తో సినిమాని కాపాడుకోవడానికి చివర్న ఐస్ క్రీమ్ లా చిరంజీవిని రప్పించుకున్నారు కాబట్టి, ఇది  ‘ఐస్ క్రీమ్ ప్లే’. ఎం.ఆర్.పి : రెండుకోట్లు, ప(త)న్నులు అదనం. ఆల్ ది బెస్ట్.

-సికిందర్
       


       
       
 

Friday, October 16, 2015

గుణశేఖరీయం!


        ‘రుద్రమదేవి’ సినిమా కథాకథనాల వెనుక మహా మహులుంటారు. ఏళ్ల తరబడి  దర్శకుడు చేసిన చరిత్ర శోధనా సారముంటుంది. ఆ సారమే ఎప్పుడూ కథా కథనాలకి ఆధారమవుతుంది. చరిత్రలోంచి ఆ పిండుకున్న సారమెలాటిదన్నది సినిమా గతిని నిర్ణయిస్తుంది. ఆ గతి సినిమా బలిమికీ, తద్వారా దాని చరిత్ర భాండాగార ప్రవేశార్హతకీ  దారి తీస్తుంది. చరిత్రని ఎత్తుకున్న సినిమా తానే  చరిత్ర అవడం కన్నా భాగ్యం  లేదు. ఎక్కడ్నించో వచ్చి ఒక అటెన్ బరో ‘మహాత్మాగాంధీ’ చరిత్రని ఎత్తుకుంటాడు. ఇంకెక్కడ్నించో వచ్చి ఒక త్రిపురనేని మహారధి ‘అల్లూరి సీతారామ రాజు’  జీవిత కథ ఎత్తుకుంటాడు. ఆ ఎత్తుకుంటున్నప్పుడు ఎంచుకున్న లేదా పిండుకున్న సారమెలాటిదో పరిశీలిస్తారు. ఆ సారంతో సినిమా చూసే ప్రేక్షకులకి ఏమైనా ప్రయోజనమా, స్ఫూర్తా అని కూడా ఆలోచిస్తారు. జీవిత చరిత్రల పరమార్ధమే అది. ఆ పరమార్ధానికి చేరువ కాని చిత్రణలతో చారిత్రక వ్యక్తులని పలచన చేయరు. అటెన్ బరో అయినా, మహారధి అయినా తామెత్తుకున్న చారిత్రక పురుషుల జీవిత చిత్రణల్ని అజరామరం చేశారు- ఎప్పుడు? వీఎఫెక్స్ ల టెక్నాలజీ కూడా లేని కాలంలోనే. ఎలా? ఆ చారిత్రక పురుషుల గాథల్లో పక్కాగా ఆత్మని పట్టుకునే. గాథలుగా ఆత్మని పట్టుకుని, కథలుగా ఆత్మని  పట్టుకుని కాదు. గాథల్లో  ఆత్మ దానికదే వుంటుంది. కథల్లో  ఆత్మని కల్పించుకుంటారు. గాథల్లో దానికదే ఏర్పడిన ఆత్మ ఉదాత్త చిత్రణలకి దారితీస్తుంది. కథల్లో కల్పించే ఆత్మ వ్యాపార యావతో వుంటుంది. వ్యాపార యావ కూడదని కాదు, జీవిత చరిత్రలో బిగ్ స్టార్ కాంబినేషన్లతో వ్యాపార యావే పరమార్ధమైపోతే అదొక సర్కస్ కంపెనీ అయిపోతుంది. గాథని కథగా కుదేసి ఆత్మని కృత్రిమంగా కల్పిస్తే అదొక ‘రుద్రమదేవి’ అనే కమర్షియల్ ఫార్ములా అవుతుంది. చరిత్రతో సిన్సియారిటీ సడలిన తాత్కాలిక బాక్సాఫీసు బిజినెస్ అవుతుంది.  మళ్ళీ భావికాలంలో ఏ థియేటర్ ప్రదర్శనలకీ నోచుకోలేని చెత్తబుట్ట చిరునామా నజరానాగా వుంటుంది. ఇవ్వాళ్ళ  ‘గాంధీ’ ని పట్టుకొచ్చి ఇలాగే  స్టీరియో స్కోపిక్ త్రీడీ ఎఫెక్ట్స్ తో నవీకరించి ప్రదర్శిస్తే మళ్ళీ మళ్ళీ ప్రేక్షకుల నుంచి జేజేలే అందుతాయి. ఇవ్వాళ్ళ ‘అల్లూరి సీతారామారాజు’ ని పట్టుకొచ్చి ఇదే డోల్బీ అట్మాస్ తో ఉన్నతీ కరించి ప్రదర్శిస్తే,  మళ్ళీ మళ్ళీ వహ్వాలే ధ్వనిస్తాయి ప్రేక్షకుల నుంచి.  
        
ఎందుకు?
          ఎందుకు?
          ఎందుకు?

***

       కనుక సారం- ఆత్మ- గాథ- స్ఫూర్తి- ప్రయోజనం అనే స్క్రిప్టింగ్ టూల్సే  చారిత్రక సినిమా సంగతులకి మూల కేంద్రాలవుతాయి. 13వ శతాబ్దపు లెజండరీ రుద్రమదేవి జీవితమంతా  యుద్దాలతోనే గడిచిపోయింది. ఆమె తండ్రి కాలంలో కూడా నిద్రంటూ పోని శత్రువులతో నిత్యపోరాటాలే. రాజ్యం మీద కన్నేసి ఎవడో ఒకడు శత్రు రాజు పనిగట్టుకుని కత్తి దూస్తాడు. వాడితో విసుగు లేకుండా ఆమె పోరాడి మట్టి కరిపించాలి. ఓరుగల్లు (వరంగల్) రాజధానిగా కాకతీయులది సుభిక్ష రాజ్యమే అయినా, పాలకులకి మాత్రం యుద్ధాలతో శాంతి లేదు. చివరికి తన 80వ యేట, నవంబర్ 27, 1289 న యుద్ధ రంగంలోనే నేలకొరిగింది రుద్రమదేవి. ఆ నేలకొరగడం కూడా వెన్నుపోటుతోనే. మహా టక్కరి శత్రువు అంబ దేవుడితో రెండు వారాల పాటు సాగిన ఆ యుద్ధంలో ఆ వయసులో కూడా అతడామెని ఓడించ లేకపోయాడు. ఓ రాత్రి పూట గుడారంలో పూజలు చేసుకుంటున్న ఆమె దగ్గరికి పూజారుల స్థానంలో తన మనుషుల్ని పంపించి వెనుక నుంచి పొడిచి చంపించాడు.  

        ఇక రెండో పాయింటు : క్రీ.శ. 1261 -89 మధ్య కాలంలో మూడు దశాబ్దాల పాటూ పరిపాలించిన ఆమె రాజ్యంలో ప్రజలకి ఏ  లోటూ రాకుండా చూసుకుంది. కరువు కాటకాలనేవి ఏర్పడకుండా చర్యలు  తీసుకుంది. దేశమంతా కలియదిరుగుతూ ప్రజా సమస్యలు తెలుసుకుంటూ అక్కడికక్కడే పరిష్కరిస్తూ  వుండేది. తన కళ్ళ ముందే కాన్పులో ఓ స్త్రీ కన్ను మూయడంతో, తక్షణం గ్రామ గ్రామానా ప్రసూతి శాలలు కట్టించింది. వ్యవసాయం, వాణిజ్యం రెండిటినీ పట్టుగొమ్మలుగా తీర్చిదిద్దింది. సాగు నీటి కొరత లేకుండా పెద్ద పెద్ద చెరువులు తవ్వించింది. అప్పట్లో ఇటాలియన్ యాత్రీకుడు మార్కోపోలో చైనా నుంచి తిరిగి వెళ్తూ, కాకతీయ సామ్రాజ్యాన్ని సందర్శించి, రుద్రమ దేవి పాలన అమోఘమంటూ శ్లాఘించాడు. ఇలా రాజకీయ సామాజిక ఔన్నత్యాలే కాకుండా, సాంస్కృతిక అభ్యున్నతికి కూడా కృషి చేసిందామె. సంగీత సాహిత్యాల్నీ, శిల్ప నృత్య కళల్నీ పోషించింది.  పేరిణీ శివతాండవమనే కొత్త నృత్య విధానం ప్రాణం పోసుకుంది ఆమె కాలంలోనే.

        మూడో పాయింటు : ఆ మధ్యయుగాల్లో  లింగ వివక్ష ఎలా ఉండేదో వేరే చెప్పనవసరం లేదు. ఒక ఆడది రాజ్యాధి నేత కావడాన్ని ఎవడూ అంగీకరించే పరిస్థితి లేదు. రుద్రమదేవి ఈ లింగ వివక్షని కూడా అనుభవించింది యుద్ధ పీడలకి తోడూ. సామంత రాజులు, శత్రు రాజులూ చివరికి దాయాదులూ అందరూ ఒకటై
,  ఆడదైన రుద్రమదేవిని ఎప్పుడెప్పుడు పదవీచ్యుతురాల్ని చేద్దామా అని కుట్రలు పన్నిన వాళ్ళే. ఈ పురుషాహంకారాన్ని కూడా  తిప్పికొడుతూ చివరి శ్వాసవరకూ పాలించింది.
         1) యుద్ధాల్లో గెలవడం 
         2) జనరంజకంగా పాలించడం
        3) పురుషాధిక్య భావజాలాన్నిమట్టు బెట్టడం
         - ఈ మూడు  ధీర లక్షణాలూ  రుద్రమదేవి జీవితపు పార్శ్వాలు. 

          ఈ మూడింటినీ సమదర్శనం చేసి స్పృశించకపోతే ఆమె చరిత్ర సమగ్రం కాదు. ఆమె చరిత్రని  ఎంత శోధించినా సారం- సందేశం- స్ఫూర్తి- ప్రయోజనం ఇవన్నీ పై మూడు పార్శ్వాల్లోనే ప్రతిఫలిస్తాయి.
        ఆమె పాలనని వెండితెరమీద ఆవిష్కరిస్తూంటే చూస్తున్న ప్రేక్షకులు  నేటి తమ నాయకుల తీరుతెన్నుల్ని బేరీజు వేసుకోగల్గాలి.  శత్రువులతో, సామంతులతో, దాయాదులతో ఆమె పోరాటాల్ని చూస్తూంటే, నేటి అధికార పార్టీల స్వపక్షంలో, ఆ అధికార పార్టీలకి విపక్షాలతో, చివరికి బంధువర్గంతో సైతం తలెత్తుతున్న రకరకాల సంఘర్షణలూ కళ్ళ ముందు కదలాడాలి. రాజ్యమేలే ఆడదిగా వివక్షని ఎదుర్కొంటున్న ఘట్టాల్ని చూస్తూంటే, జయలలితల్లో -మమతా బెవర్జీల్లో- మాయావతీల్లో- ఆ రుద్రమదేవి కన్పించి కళ్ళు తెరవాలి.  బేరీజు వేసుకునే దృష్టితో కాకపోతే చరిత్రని తీయడం, చూడడం, చదవడం ఎందుకు? చాలా శుద్ధ దండగ పని.
        ఈ మూడు పార్శ్వాలూ సినిమా కెందుకుండాలి? 
        ఆ చరిత్ర చెప్పే స్క్రీన్ ప్లే కి ఫౌండేషన్ ఇదే కాబట్టి. ‘ది స్క్రీన్ రైటర్స్ ప్రాబ్లం సాల్వర్’ అన్న ప్రసిద్ధ గ్రంధంలో సిడ్ ఫీల్డ్  పేర్కొనే ప్రకారం, మహోజ్వల సృష్టి ‘గాంధీ’ కి స్క్రీన్ ప్లే రాస్తున్నప్పుడు దర్శకుడు సర్ రిచర్డ్ అటెన్ బరో కి మహాత్ముడి జీవితంలో ఏ కోణాల్ని పట్టుకుని చిత్రించాలన్న సందేహం చాలాకాలం వేధించింది. అనేక శాఖోప శాఖలుగా విస్తరించి వున్న  మహావృక్షం లాంటి మహాత్మా గాంధీ జీవితాన్నంతా  ఎలా కాచి వడబోసి తెర క్కించాలి? ఆయన జీవితంలోని అన్ని ఘాట్టాలనీ చూపించడం సాధ్యం కాదు, మరెలా? అప్పుడు మహాత్ముడి జీవితంలోని ప్రధాన ఘట్టాల్లో మూడు  తన స్క్రీన్ ప్లేకి ఫౌండేషన్ గా బలంగా  నిలుస్తాయని ఆయన గుర్తించాడు. అవి-
         1) దక్షిణాఫ్రికాలో యువ న్యాయవాదిగా గాంధీ పోరాట జీవితం
        2) భారదేశానికి తిరిగి వచ్చి  చేపట్టిన సహాయ నిరాకరణోద్యమం
        3) హిందూ ముస్లిం సమస్య
         -ఈ మూడు పార్శ్వాల్నీ స్పృశిస్తూ తెర కెక్కిస్తే  గాంధీ జీవిత చరిత్రకి సమగ్రత వచ్చేసింది! దీనికి బుకెండ్  ముగింపు (అంటే సినిమా ప్రారంభించిన దృశ్యం దగ్గరికే వచ్చి ముగించడం : ఫ్లాష్ బ్యాక్ కథనంతో)  గాంధీ హత్యా దృశ్యం!
        ఇలా జీవిత చరిత్రల్ని చిత్రానువాదం చేసే మార్గాన్ని సులభతరం చేసి చూపించాడు అటెన్ బరో. ఈ ఫౌండేషన్ నే ఫాలో అయి, అనిల్ కపూర్ నిర్మాతగా ఫిరోజ్ అబ్బాస్ ఖాన్ దర్శకత్వం వహించిన ‘గాంధీ మై ఫాదర్’  (2007) అనే క్లాసిక్ క్రియేషన్ లో, మహాత్ముడి తనయుడి యాభై ఏళ్ల జీవితకాల గమనానికీ విజయవంతమైన స్క్రీన్ ప్లే చేశాడు. 

         2007 లోనే శేఖర్ కమ్ముల తీసిన సూపర్ హిట్ ‘హేపీ డేస్’ లోనూ కాకతాళీయంగా ఈ స్క్రీన్ ప్లే ఫౌండేషనే కన్పిస్తుంది. ఇంజనీరింగ్ కాలేజీలో ఓ నాల్గేళ్ళ కాలం హేపీగా గడిపేసిన విద్యార్థుల అనుభవాల సారం ఈ సినిమా. ఇక్కడా గాంధీ జీవితం లాంటి సమస్యే. ఏం అనుభవాలు చూపించాలి? ఎన్నెన్ని అనుభవాలు చూపించాలి? వాటన్నిటినీ ఒక అర్ధవంతమైన కథగా ఎలా కూర్చాలి? అటెన్ బరో పూనినట్టే అప్పుడు శేఖర్ కమ్ములకి సులువు తెలిసిపోయింది. 
        1) కాలేజీలో ఫ్రెషర్స్ ఎదుర్కొనే ర్యాగింగ్
        2) వాళ్ళ చదువుల సమస్య
        3) వాళ్ళ ప్రేమల గురించిన స్ట్రగుల్ 
         -అనే మూడు బ్లాకులుగా ఆ నాల్గేళ్ళ టైం లైన్ ని విభజించి, వాటి తాలూకు అనుభవాల్ని గుమ్మరించుకుంటూ పోవడంతో-  కథగా చూస్తే సమగ్రంగా కన్పిస్తుంది, చూడకపోతే తన వెంట సాఫీగా తీసుకు వెళ్ళగల  అనుభవాల దొంతరలా వుంటుంది.
         రుద్రమదేవి చరిత్రకీ విజయవంతమైన స్క్రీన్ ప్లే ఫౌండేషన్ ఇదేనని బల్లగుద్ది చెప్పొచ్చు. పండు ముదుసలి వయసులో ఆమెని వెన్నుపోటు పొడిచే ఘట్టంతో ప్రారంభించి, ఫ్లాష్ బ్యాక్ లోకెళ్ళి మొదట్నించీ ఆమె గాథంతా  చెప్పుకు రావచ్చు.
         ‘గాంధీ’ లో గాడ్సే గాంధీని చంపే సంఘటనతోనే ప్రారంభిస్తాడు అటెన్ బరో. ఆ తర్వాత ఫ్లాష్ బ్యాక్ లో కెళ్తూ  ఓ  దృష్టినాకర్షించే సంఘటన - (సౌతాఫ్రికాలో గాంధీజీని జాత్యాహంకారంతో  రైల్లోంచి తోసేసే సంఘటన) ని  ‘వెంటనే’ ఎత్తుకుంటాడు.  ఫ్లాష్ బ్యాక్ ని ఓపెన్  చేసే సరైన పద్ధతే ఇది. చెంఘీజ్ ఖాన్ చరిత్రతో రష్యన్ దర్శకుడు సెర్గీ బోద్రోవ్  తీసిన ‘మంగోల్’  (2007) లోనూ ఫ్లాష్ బ్యాక్ తో ప్రారంభిస్తూ, తొమ్మిదేళ్ళ చెంఘీజ్ ఖాన్ కి పెళ్లి సంబంధం చూసే ఆసక్తికర ఘట్టంతో ‘వెంటనే’ ఎత్తుకుంటారు. ఫ్లాష్ బ్యాక్ ఎత్తుగడ ఎప్పుడూ కథతో ‘వెంటనే’ కనెక్ట్ అవుతూ చురుకుదనంతోనే వుండాలి. అనగనగా ...అంటూ సోది చెబుతూ నిద్రపుచ్చ కూడదు. డైరెక్టుగా పాయింటు కొచ్చేయాలి. అప్పటి అమెరికా అధ్యక్షుడు రిచర్డ్ నిక్సన్ జీవితం ఆధారం గా 1995 లో సుప్రసిద్ధ దర్శకుడు ఆలివర్ స్టోన్ తీసిన ‘నిక్సన్’ ని కూడా ఫ్లాష్ బ్యాక్ తోనే ప్రారంభిస్తూ- నిక్సన్ జీవితంలో అత్యంత వివాదాస్పద ప్రధాన ఘట్టం వాటర్ గేట్ కుంభకోణపు ఒక దశతో ‘వెంటనే’ ఎత్తుకుంటారు. అంతేగానీ, జీవిత చరిత్ర ఫ్లాష్ బ్యాక్ అంటే, పుట్టుకతో మొదలెట్టి చావు దాకా తీరుబడిగా ఫ్యామిలీ వీడియో తీసుకుంటూ పోవడం కాదు. ఫోటో ఆల్బం తయారు చేసుకుని మురిసిపోవడం కాదు.
           ‘రుద్రమదేవి’ కి ఫ్లాష్ బ్యాక్ ని ప్రారంభిస్తూ వెంటనే నేరుగా,  రుద్రమ దేవిని మగపిల్లాడిగా పెంచుకుంటున్న ఆమె తండ్రి గణపతి దేవుడు,  ఆమె పద్నాల్గో ఏట ఆమెని రాజప్రతినిధిగా ప్రకటించే మహోత్సవంతో ప్రారంభించవచ్చు. ఆమె ఎందుకు మగపిల్లాడిగా పెరిగిందనే  దానికి రెండు మాటల్లో చెప్పేసి ముందు కెళ్ళి పోవచ్చు, అంతే. ఆ తర్వాత పైన చెప్పుకున్న-
        1) జనరంజక పాలన
        2) పురుషాధిక్య భావజాలం
        3) యుద్ధాలు 
        -అనే మూడు పార్శ్వాల్ని తడుముతూ సాగిపోవచ్చు. బుకెండ్ ముగింపుగా తిరిగి మొదట్లో చూపించిన అంబ దేవుడితో యుద్ధం దగ్గరికి వచ్చి, ఆమె నిర్యాణాన్ని హైలైట్ చెయ్యొచ్చు. ఎవరి చరిత్ర అయితే చెప్తున్నామో ఆ పాత్రని మించి మరో పాత్రని హైలైట్ చేసే చాపల్యానికి లోనుకాకూడదు.
***
   1983 లో కమాల్ అమ్రోహీ దర్శకత్వంలో హేమమాలిని- ధర్మేంద్ర లు  నటించిన ‘రజియా సుల్తాన్’ చరిత్రకి రుద్రమ దేవితో దగ్గరి పోలికలుంటాయి. 1205 లో జన్మించి 1240 లోనే ముప్పై ఐదేళ్ళకే తనువు  చాలించిన రజియా సుల్తాన్, ఓరుగల్లులో రుద్రమదేవి కంటే ఓ పాతికేళ్ళ ముందు, 1236 లో ఢిల్లీ సింహాసనాన్ని అధిష్టించింది. నాలుగేళ్లే పాలించింది. ఆమె తండ్రి ఢిల్లీ సుల్తాన్ తాగుబోతు, తిరుగుబోతు అయిన కుమారుణ్ణి కాదని రజియాకి అధికారాన్ని కట్ట బెడదామంటే సామంత రాజులందరూ భగ్గు మన్నారు. ఆడది రాజ్యాలేలడ మేమిటని వ్యతిరేకించారు.  కానీ చిన్నప్పట్నించీ తండ్రి ఆమెని ఆడపిల్లగా చూడలేదు. అన్ని యుద్ధ కళలూ నేర్పాడు. అంతః పురంలో ఆమె ఎప్పుడూ జనానా మొహాల్ని చూడలేదు. కాబట్టి వాళ్లలాగా పరదా పాటించడం తెలీదు. మగ పిల్లాడిలానే పెరిగింది. తనని రజియా సుల్తానా అంటే కూడా ఒప్పుకునేది కాదు. సుల్తానా అంటే  సుల్తాన్ కి భార్యో  ప్రియురాలో అవుతుంది కాబట్టి,  తనని సుల్తాన్ గా పిలిస్తేనే  పలికేది. అలా ఆమె పేరు రజియా సుల్తాన్ గా స్థిరపడిపోయింది. అయినా లింగ వివక్ష అడ్డుగోడై,  విధిలేని పరిస్థితుల్లో ఆ చెడిపోయిన కొడుక్కే రాజ్యాన్ని అప్పగిస్తే, ఆర్నెల్లకే తల్లితో బాటు హత్యకి గురయ్యాడు. ఇంకా రజియా సుల్తాన్ ని తమ అధినేత్రిగా ఒప్పుకోక తప్పలేదు సామంతులకి. 
        రుద్రమ లాగానే రజియా సమర్ధ, జనరంజక  పాలకురాలు. తిరుగుబాట్ల తలనొప్పులు ఆమెకీ తప్పలేదు. ఆ తిరుగుబాటు దార్లని వాళ్ళల్లో వాళ్లకి తంపులు పెట్టి బలహీనపర్చడం ద్వారా గొప్ప రాజనీతిజ్ఞురాలిగా పేరు గడించింది. ఆమె బలహీనత ఒక్కటే. చిన్ననాటి నుంచీ తెలిసిన ఓ బానిసని ప్రేమించడం. ఆ బానిసకి కొలువులో కీలక పదవి కట్టబెట్టడం. ఇక సామంతులతో ఆమెకి దినదిన గండమే అయ్యింది. ప్రేమకావాలా, రాజ్యం కావాలా తేల్చుకోవాల్సిన పరిస్థితి...ఇక పతనమై, ఖైదు కూడా అయి, విడుదలై ప్రేమ వైపే మొగ్గి, ఆ బానిసనే పెళ్ళి చేసుకోవడంతో ఆమె చరిత్ర ముగిసింది.
        ఈ సినిమాలోనూ  కూడా మూడే పార్శ్వాలు కన్పిస్తాయి-
        1) రజియా పట్ల లింగ వివక్ష
        2) ఆమె పాలనా తీరు
        3) ప్రేమ కోణం
        -అనేవి
                                                     ***
      ‘రుద్రమదేవి’  సినిమాలో రుద్రమదేవి  పాత్రకి కన్పించే పార్శ్వాలేమిటో ఇక  చూద్దాం. ఎంత వెతికినా ఈ సినిమాలో రుద్రమ దేవి జీవితంలో దర్శకుడు దర్శించిన  పార్శ్వం ఒక్కటే. అది - ఆడది! ఆడది! ఆడది! రుద్రమదేవి ఆడది! ఇంతకి  మించి ఏమీకాదామె! ఆమె జీవితంలోంచి పన్నెండేళ్ళు రీసెర్చి చేసి దర్శకుడు పిండుకున్న సారం- ఆత్మ- గాథ- స్ఫూర్తి- ప్రయోజనం వగైరా వగైరా ఏదైతే అది- ఇదొక్కటే! ఆడదానికి సొంత వ్యక్తిత్వమా - హమ్మా- తప్పు కదూ అన్నట్టుగా!

        సినిమా సాంతం ఆమె ఆడతనాన్ని ఒక ఇష్యూ చేసి, సినిమాలోని పాత్రలకంటే కూడా దర్శకుడే ఎక్కువ వివక్ష ఫీలవుతున్నట్టు; ఆమెని ఎదగనివ్వకుండా, స్వతంత్రంగా రాజ్యాన్నేల నివ్వకుండా, నిర్ణయాలు తీసుకోనివ్వకుండా, అడుగడుగునా అడ్డుపడుతూ, ముగ్గురు మగాళ్ళ సహాయంతో పాలించిన, యుద్ధాలు చేసిన అబల అన్నట్టుగా గా చిత్రించిన వైనం ఇందులో కన్పిస్తుంది.  ‘ఈ ప్రజలకోసం నా ఆడతనాన్ని, సుఖాలనీ చంపుకుని నిలబడ్డాను’  అని ఏ బలహీన క్షణం లోనైనా రుద్రమ దేవి అని ఉంటుందా? ఒక నాయకురాలు అనే మాటేనా ఇది? మామూలు ఫిక్షన్లో అయినా ఎవరైనా ఇలా రాస్తారా?
        
        గ్లామర్ క్వీన్ అనూష్కా ని అడ్డు పెట్టుకుని, రెగ్యులర్ కమర్షియల్ సినిమాల్లోలాగా, పాత్ర ఆడతనాన్ని వీలయినంత ఎక్స్ ప్లాయిట్ చేయడమే, కామోద్రేకాల్ని రెచ్చగొట్టడమే ఆద్యంతం కన్పిస్తుంది. పుట్టిన ఆడశిశువు జననాంగాల్ని కూడా క్లోజప్ వేసి చూపించడంతో మొదలెట్టి ( చాలా నిగ్రహం తప్పిన, అభ్యంతరకర  చిత్రణ), మగవేషంలో వున్న రుద్రమదేవి పాత్ర చీటికీ మాటికీ గదిలో కెళ్ళిపోయి కవచం తొలగించి, అద్దం వైపు తిరిగి పృష్ఠబాగాన్ని నగ్నంగా ప్రదర్శిస్తూ, ఎద భాగాన్ని పరిశీలించుకోవడమే కన్పిస్తుంది.  కౌమార దశ నుంచీ ఇదే వరస. పద్నాల్గేళ్ళ వయసులో వున్నప్పుడు, ఎవడో అర్ధనగ్న విగ్రహం చూపిస్తూ, సెక్సీగా అంగాంగ వర్ణ చేస్తూంటే - ఆ ఆవయవాలు తనలో చూసుకుంటే తప్ప తను ఆడది అని తెలుసుకోలేక పోయిందట ఓ అమ్మాయి! అప్పుడు తెలుసు కోవడమే కాదు,  వెంటనే సమర్తాడేసింది కూడా ఆ దెబ్బకి! కాళ్ళ  మీద ఆ రక్తం పడిన వైనాన్ని  రెండు సీన్లవరకూ లాగిలాగి చూపించడం కూడా! ఎక్కడ ఎంత వీలయితే అంత కామోద్రేకాల్ని రెచ్చగొట్టి సొమ్ము చేసుకోవాలనుకోవడమే ఈ సినిమాతో  పెట్టుకున్న గోల్ అన్నట్టు వుంది.
        
         చెలి కత్తెలతో చెరువు గట్టు సీనొకటి! ఎంతసేపూ ఈమె మగాడు కాదు, ఆడదే అన్న నిజం ఎప్పుడెప్పుడు బయట పడుతుందా అన్న ఎజెండాతోనే కథనీ, పాత్రనీ నడపడం!

చూసుకోవో  తీసుకోవో
ఏమి కావాలో వచ్చి పుచ్చుకోవో
విందు ఉందోయి పొందు ఉందోయి
గుప్పిట్లోనే నీ గుట్టు పట్టుకోవోయీ..’
  అనే అశ్లీల  పాటతో  బాటు- 

అంతఃపురంలో అందాల చిలుక -
సందేహమేలనే అంతగా-
అంబర మేలగా అడ్డు
ఎవరు నీకిక..’
అనే బాధ్యత మర్చిన  పాటా- 

‘పున్నమి పువ్వై వికసిస్తున్నా 
వెన్నెల గువ్వై విహరిస్తున్నా..’
అని అవతల ప్రపంచం కొట్టుకుపోతున్నా నీరో చక్రవర్తిలా పట్టనట్టు మరో విరహం పాటా..
        
        ఉన్న ఐదు పాటల్లో మూడు ఇవే వుండేసరికి చూపించాలనుకున్నది  వీరగాథా కాదనీ,  పచ్చిశృంగార కథే అనీ తేలుతోంది.
***

     కథే అనడానికి సాక్ష్యం వుంది- ఈ స్టోరీ లైన్ ని చూసినా, స్టోరీ లైన్లో వుండే ప్లాట్ పాయింట్స్ ని చూసినా, ఇవి ఏ పాయింటుని ఆధారంగా చేసుకుని ఏర్పడ్డాయో, ఏ పాయింటు మీద ఈ కథంతా నడుస్తోందో తెలిసిపోతుంది.  మొదట  ఆడశిశువు జననం, ఆమె మగ పిల్లాడిగా ఎదగడం- (ఇది బిగినింగ్),  తను ఆడపిల్ల అని తెలుసుకోవడం- (ఇది ప్లాట్ పాయింట్-1)-అయినా మగవాడిగానే నటిస్తూ పాలన చేయడం, ఆడపిల్లగా విహరిస్తున్నప్పుడు నిడదవోలు  సామంత రాజు దృష్టిలో పడ్డం, అతడామె రుద్రమ దేవుడే అని గుర్తించకుండా, ఆ అదృశ్య సుందరిని ప్రేమించడం, అతణ్ణి సస్పెన్స్ లో పెట్టి తనూ ప్రేమలో పడ్డం- ( ఇది మిడిల్లో జెండర్ ఐడెంటిటీ స్ట్రగుల్ తో సంఘర్షణ),  తను ఆడపిల్లే అన్ననిజం బయట పడ్డం- ( ఇది ప్లాట్ పాయింట్ -2), దీన్ని ఓర్వలేని శత్రువు లందరూ యుద్ధానికి దిగడం - ( ఇది ఎండ్- క్లయిమాక్స్). 

        కనుక ఏ పాయింటు చుట్టూ  ఈ కథంతా నడిచింది? ఏ మలుపులు ఈ కథని ముందుకు నడిపించాయి? ఏ మలుపు ముగింపుకి దారితీసింది? అన్నీ ఆడతనాన్ని దాచిపెట్టే రహస్యంతోనే!   దాని తాలూకు దోబూచు లాటలతోనే. ఆ దోబూచులాటల్లోంచి సాధ్యమైనంత శృంగార (అశ్లీల) రసాన్ని పిండుకోవడంతోనే! ఈ స్క్రీన్ ప్లే కుట్లు విప్పదీసే కొద్దీ బయటపడే నిజాలివే కనిస్తున్నాయి. 

        ఉదాత్త గాథలా తీయాలనుకుని వుంటే ఆడతనమనే పాయింటే  వుండదు. అటువంటి ప్లాట్ పాయింట్సే వుండవు. రుద్రమదేవి జీవితం ప్రేమ చుట్టూ తిరగలేదు. రజియా సుల్తాన్ జీవితంలో మొదటినించీ ప్రేమ కూడా ఒక కోణమైనట్టు రుద్రమదేవికి అలా లేదు. కానీ ఇక్కడ ఆడతనపు రహస్యాన్నీ, ప్రేమనీ ప్రధానం చేసి - కమర్షియలైజ్ చేసి- మిగిలిన మూడు పార్శ్వాల్నీ గాలికి వదిలేశారు. ఏమంటే ఆమె చెరువులు తవ్వించినట్టు, రోడ్లు వేయించినట్టు వాయిసోవర్ తో నాలుగు యానిమేషన్ బొమ్మలేసి చూపించేసి సరిపెట్టేశారు. కళల్ని, సాహిత్యాన్నీ ఎలా పోషించిందో రసపోషణతో కూడిన చిత్రణే లేదు. ‘ఆదిత్య 369’  లో శ్రీకృష్ణ దేవరాయలి దర్బారులో ఆ కవి సమయాలు లేకపోయివుంటే, ఎంత డ్రైగా దర్శనమిచ్చేదో ఆ సినిమా చెప్పనవసరం లేదు.

        రెండో పార్శ్వం పురుషాధిక్య భావజాలం : దీన్నిఎక్కడా ఎప్పుడూ ప్రశ్నించదామె. అలాటి భావజాలాన్ని తుంగలో తొక్కి ముందుకు సాగిపోతున్న ఒక్క దృశ్యమూ లేదు. వాదోపవాదాలు, బోలెడు ఖండన మండనలు చేసుకునేది కోటలో ఇతర పాత్రలే. ముఖ్యంగా ప్రకాష్ రాజ్ మంత్రి పాత్రదే హల్చల్. నిర్ణయాలూ, చాంతాడంత వ్యూహ ప్రకటనలూ అన్నీ తనవే. ఆమె ఆడతనానికీ ప్రేమకూ మాత్రమే పరిమితం. కమర్షియల్ సినిమాల్లో  ఆర్టిస్టుని బట్టి పాత్ర, డైలాగులు ఎలా రాసుకుంటారో- అలా ప్రకాష్ రాజ్ పవర్ఫుల్ ఆర్టిస్టు కాబట్టి ఆయనకి ఆ బిల్డప్పులు, ఆ డైలాగులు. అలాగే కమర్షియల్ సినిమాలలో  హీరోయిన్ అందాలు ఆరబోసుకుంటూ, పాటలు పాడుకుంటూ ఎలా వుంటుందో అలా అనూష్కా. 

        మూడో పార్శ్వం,  యుద్ధాల దగ్గరి కొచ్చేసరికి ఆమె తన ప్రేమికుడైన నిడదవోలు సామంత రాజుని ఆదేశించడమో, లేదా గోన గన్నా రెడ్డి మీద ఆధార పడడమో చేస్తుంది. క్లయిమాక్స్ లో నైతే పద్మవ్యూహంలో చిక్కుకుని దిక్కులు చూస్తుంది. గన్నారెడ్డి వచ్చి రక్షిస్తాడు. అసలు ఇంటర్వెల్ దగ్గర గన్నారెడ్డి ఎప్పుడైతే ప్రవేశిస్తాడో అప్పట్నించి మరీ పాసివ్ గా మారిపోతుందామె. తన బాగోగులు చూసుకునే, తన పోరాటాలు మీదేసుకుని చేసే, తన నిర్ణయాలు శ్రమించి తీసుకునే వాళ్ళంతా కోట లోపలా బయటా బోలెడుమంది వుండగా-  ఎండ కన్నెరగని కన్యగా అంతఃపురంలో తియ్యటి ప్రేమ ఊహలతో, పాటలతో పడుండక తనకెందుకట తలనొప్పి-  అన్నట్టు తయారయ్యింది వీరనారి గాథ- సారీ- కథ!  

        ఇక సెకండాఫ్ లో ప్లాట్ పాయింట్-2 వరకూ కథ ఎంతకీ కదలక, యాక్షన్ లోకీ  దిగక, దిగడానికి విషయమూ లేక, ఏవేవో మనం ఫాలోకాలేని భారీ డైలాగులతో, వ్యూహాలతో, కుట్రలు మాటాడుకోవడంతో, ఇష్టం వచ్చిన ఊహాగానాలతో నిండిపోతుంది. ఆశ్చర్యకరంగా ఇన్ని పదుల కోట్లు ధారబోసి తీస్తున్న సినిమాకి  టైం అండ్ టెన్షన్ ఫ్యాక్టర్ ని పట్టించుకోనే లేదు. ఏమో, ఇంకా ముందు ప్లాట్ పాయింట్ -2 దగ్గర ఆమె ఆడదే అని బయటపడే దాకా, ఏం చెయ్యడానికీ విషయమే లేదు కాబట్టి-  ప్రేక్షకుల సహనాన్ని ఇలా పరీక్షకి పెట్టి కాలక్షేపం చెయ్యక తప్పలేదేమో!

        రుద్రమదేవి  చరిత్రని  గాథగా కాకుండా కథగా చేశారు కాబట్టి, ఈ కథతో ప్రేక్షకులకి ఆడతనం (సెక్సప్పీల్)  పాయింటుతో గాలం వేస్తున్నారు కాబట్టి, ఆ పాయింటు ఎక్కడైతే పూర్తయ్యిందో  అక్కడే కథని ముగించేసి అసంపూర్ణ చరిత్ర చూపించాల్సి వచ్చింది!

        ఇది కమర్షియల్  రొమాంటిక్- యాక్షన్ మూవీ (కథ) కాబట్టి, ఓపెనింగ్ బ్యాంగ్ ఏమని ఇచ్చారో ఆ బ్యాంగ్ కి ఎదురు బ్యాంగ్ ఇచ్చే ముగింపే శరణ్య మయింది.  ఓపెనింగ్ బ్యాంగ్ ఏమిటి? కాకతీయ వంశంలో పుట్టింది మగపిల్లాడు అని ప్రకటన వెలువడడంతో ఆవతలి దేశపు రాజు (విలన్) పిచ్చెత్తి పోతాడు. మగపిల్లాడు పుడితే ఏమయ్యింది? వాడు తనకెలా అడ్డు? వాడు పెరిగి చేతికొచ్చే టప్పటికి పది యుద్ధాలైనా చేసి గెలవచ్చు కదా కాకతీయ సామ్రాజ్యాన్ని. ఇప్పుడే ఏదో కొంప లంటుకున్నట్టు- నిస్సహాయంగా ఆ పెడ బొబ్బలేమిటి? చరిత్రని నాటకీయత కోసం కొంత కల్పన చెయ్యొచ్చు- అదిలా  అభూత కల్పన ఐపోకూదడుగా?

        ఇప్పుడు పాతికేళ్ళ తర్వాత క్లయిమాక్స్ లో రుద్రమ దేవుడు ఆడదని తెలిశాక, యుద్ధానికొచ్చేస్తాడు విలన్ మహాదేవుడు. అతణ్ణి గన్నారెడ్డి చంపబోతూ ఆ చంపే ఛాన్స్ ని  దయతలచి ఇచ్చినట్టు రుద్రమ దేవికిస్తాడు..లేకపోతే కథకూడా ఆమె ముగించినట్టు వుండదు. పరువుపోతుంది. 

        ఇక్కడితో కథ ముగిసింది. కానీ  రుద్రమదేవి  చరిత్ర ఇంకా వుంది. ఇంకో ఐదు దశాబ్దాలపైబడి ఆమె జీవితం వుంది. అదంతా సినిమాగా కుదరదని మహాదేవుడితో యుద్ధం దగ్గర ముగించి నట్టున్నారు. ఒక చారిత్రక వ్యక్తి  జీవితాన్నంతా చూపించాలని కూడా లేదు. ఒక ‘నిక్సన్’ లాగా, ఒక ‘గాంధీ మై ఫాదర్’  లాగా జీవితంలో ఒక ఘట్టాన్నో, ఒక కొణాన్నో చూపించ వచ్చు. 2012 లో ఆల్ఫ్రెడ్ హిచ్ కాక్ జీవితం మీద తీసిన సినిమా ‘హిచ్ కాక్’  అనే దాన్ని ఒక ఘట్టం గురించే చెప్పి ముగించారు. ఎటొచ్చీ ఆ ఘట్టానికి చారిత్రక ప్రాధాన్యం వుండాలి. లేదా చరిత్రలో మరుగున పడిపోయిన అంశాన్ని రీసెర్చితో వెలికి  తీసి  చూపించాలి. 

        రుద్రమదేవి సినిమాలో చూపించిన ఆడతనపు రహస్యానికి ఏ చారిత్రక ప్రాధాన్యం వుందని? అదేదో చరిత్రలో మరుగున పడిపోయిన చిదంబర రహస్యం కూడా కాదే? ఈ అప్రధాన ఘట్టాన్ని సాగదీసి సాగదీసి తీయడంలో  ఉద్దేశమేమిటి? అటెన్ బరో కూడా మొత్తం ఎనభై ఏళ్ల గాంధీ జీవితమంతా కాకుండా- ఓ న్యాయవాదిగా గాంధీ జీవిత ఘట్టాన్ని మాత్రమే తీసుకుని సినిమా నిర్మించలేదే?  ‘మంగోల్’ లో మొత్తం చిన్నప్పట్నించీ చెంఘీజ్ ఖాన్ జీవితమంతా చూపించు కొచ్చారుగా? ‘రుద్రమదేవి’ కి ఎందుకు సాధ్యం కాదు- ఉయ్యాల్లో బోసినవ్వుల కాడ్నించీ గుడారంలో నిర్యాణం వరకూ? ఏంత గొప్పగా వుండేది? కేవలం ఆ సెక్సప్పీల్ బావుందని ఆడతనపు డ్రామానే ప్రధానం చేసి చరిత్ర చెప్పడమేమిటి?

        ఇంకో  క్రియేటివిటీ కూడా ప్రదర్శించారు. దీనికీ కథాపరంగా సపోర్టు లేదు. ఏమిటంటే,  ఈ కథంతా మార్కోపోలో తన ఇటలీ దేశపు రాజులకి (ఫ్లాష్ బ్యాక్) చెప్పుకొస్తాడు. కాబట్టి తను యాత్రేకుడిగా ఎంత చూశాడో, ఏం తెలుసుకున్నాడో అంతవరకే చెప్పగలడు. రుద్రమ నిర్యాణం వరకూ చెప్పే ప్రసక్తే రాదు. అయితే ఈ సినిమాలో చూపించిందాని ప్రకారం అంత గొప్పగా ఫీలై చూసిందేమిటి రుద్రమదేవిలో? ఏముందని ఈ కథలో ఆమె సమర్ధ రాజకీయ, వీరపరాక్రమ గుణగణాల గురించి చెప్పుకోవడానికి? అయినా మార్కో పోలో చెప్పడం ముగించగానే, ఇటలీ రాజులు  తాము కూడా రుద్రమదేవిని ఆదర్శంగా తీసుకుని కూతుళ్ళకే పట్టాభిషేకం చేస్తామని శపధాలు చేయడం హాస్యాస్పదంగా లేదూ? సినిమా సాంతం ఎలా వున్నా, ఫినిషింగ్ టచ్ కూడా నవ్వుకునేలా వుంటే ఎలా? ఈ స్థాయి సినిమా ఇంటలిజెంట్ రైటింగ్ ని కదా డిమాండ్ చేస్తుంది. పరిశోధనతో పోటీ పడాలి కదా ఫలితం.  

                                                ***
         గుణశేఖర్  తీవ్రంగా అలసిపోయినట్టు కన్పిస్తారు తెరవెనుక ఈ సినిమాకి. ఆయన తలకి మించిన భారాన్ని మోశారు. పైగా ఆయన గత  ‘నిప్పు’ తోనే పూర్తిగా అలసిపోయారు. చదువుకున్న రుద్రమదేవి చరిత్రకూడా కూడా ఆయనలో నిప్పుని రాజెయ్యలేక పోయింది. మేకింగ్ పరంగానూఎన్నో లోపాలు, ఒడిదుడుకులూ. చరిత్రని రీసెర్చి చేశామన్నారు. రీసెర్చి చేసి కనుగొన్న గరంగరం కథాసా(గ)రం  ఏమిటో తెలుసుకున్నాం. వదిలేద్దాం. కానీ ఆ కాలపు వస్తు సామగ్రిని, ఆచార వ్యవహారాల్ని, వివిధ వృత్తులూ వగైరాల్ని రీసెర్చి చేసినట్టు లేదు. కోటలూ కత్తులూ, కట్టుబట్టలూ, తినే పళ్ళేలూ,  తాగే గ్లాసులూ, తొంగునే పడకలూ అన్నీ డిజైనర్ సరుకే. కృత్రిమ కాకతీయ వైభవం. దీనికి తెలంగాణా ప్రభుత్వపు వినోదపు పన్ను మినహాయింపు. ఆంధ్ర ప్రభుత్వానికి ఏ వినోదమూ పట్టలేదు. వినోదం చూస్తోందంతే.     

        ఇళయరాజా సంగీతం కూడా విఫలమవడానికి కారణం ఆయనకీ తగినంత సరుకు కన్పించకపోవడమే. ఈ చరిత్ర ఒక గాథగా నిర్మాణం జరిగివుంటే- ఆ రుద్రమదేవి కేంద్ర బిందువై- ఆవేశాన్ని రగిలించే బలమైన సన్నివేశాల్ని ఆమె నడిపించుకుంటూ పోతూంటే, ఆ పాత్ర ప్రయాణాన్ని మరింత ఎలివేట్ చేసే, మనల్ని ఎమోషనల్ గా కనెక్ట్ చేసే,  థీమ్ మ్యూజిక్ తో సంగీతపరంగా ఇళయరాజా ఆత్మని పోసినంత  పని చేసేవారు.  ‘నాయకుడు’ సినిమాని ఇప్పటికీ మర్చిపోలేనంతగా ఆయన కూర్చిన ‘ఎవరు కొట్టారు’ థీమ్ మ్యూజిక్ ఉండనేవుంది.

        ఒక మహాచరిత్రకి చాలని కథతో, చాలని బడ్జెట్ తో, అల్లుఅర్జున్ పుణ్యాన ఒక మంచి మాస్ కమర్షియల్ గా బాక్సాఫీసు విజయాన్ని చవిచూసి ఉండొచ్చు- కానీ ఈ సినిమాని తీసే విధానం మాత్రం ఇది కాదు. ఇలా తీసినా సక్సెస్ అవుతున్నాయి కదా అంటే, ఇక చరిత్రలన్నీ కామెడీ లవుతాయి. సినిమా చివర్న ‘ప్రతాపరుద్రుడు’  సీక్వెల్ ఉండొచ్చని హింట్ ఇచ్చారు. అందులో రుద్రమదేవి తతిమ్మా జీవితాన్ని చూపిస్తారేమో  తెలీదు. అలా సెకండరీ క్యారక్టర్ గా చేసి చూపించడం అన్యాయమే. మొత్తానికి చదివిన చరిత్రని చాలా గజిబిజి గందరగోళం చేసుకుని- చరిత్రకి పట్టం గట్టడం కోసం తానుగా తీసుకున్న ఈ సినిమా తీసే బంగారు అవకాశాన్ని దుర్వినియోగం చేసుకున్నారు గుణశేఖర్.


- సికిందర్
                
       


                
          

Tuesday, October 13, 2015

రచన -దర్శకత్వం- నిర్మాణం :  గుణశేఖర్ 

తారాగణం : అనూష్కా, అల్లు అర్జున్, రానా దగ్గుబాటి, నిత్యా మీనన్, కృష్ణంరాజు, ప్రకాష్ రాజ్, సుమన్, ఆదిత్యా మీనన్, విక్రం జిత్ విర్క్, కేథరిన్ ట్రెసా తదితరులు
సంగీతం : ఇళయరాజా
,  ఛాయాగ్రహణం : అజయ్ విన్సెంట్, ఎడిటింగ్ : శ్రీకర్ ప్రసాద్
బ్యానర్ : గుణా టీం వర్క్స్
విడుదల : అక్టోబర్ 9
, 2015

***

             పెద్ద బడ్జెట్  సినిమా వసూళ్లు సాధించుకోవడానికి కనీసం ఓ రెండు వారాలు కూడా గ్యాప్ లేకపోతే రిస్కే. ‘రుద్రమదేవి’ బాలారిష్టాల్ని దాటించి ఎట్టకేలకు ఎందరో మోసి విడుదలకి నోచుకునేలా చేసినా, పోటీ సినిమాల విడుదల వెన్నంటే వుండడాన్నినివారించలేక  పోయారు.మరుసటి వారమే  రామ్ చరణ్- శ్రీను వైట్లల ‘బ్రూస్ లీ’,  మళ్ళీ ఆ పైవారమే  అఖిల్- వి.వి. వినాయక్ ల ‘అఖిల్’  అనే మరో రెండు భారీ కమర్షియల్సూ వచ్చి పడుతూండడంతో  ‘రుద్రమదేవి’ బ్రీతింగ్ స్పేస్ అనేది లేకుండా పోయింది. పెట్టిన పెట్టుబడి ఎనభై కోట్లని చెప్పుకుంటున్నా, 50 కి మించి ఆవదని నిపుణులు అంటున్నారు. సీజీ క్వాలిటీని చూస్తే   తెలిసిపోతోంది. ఈ యాభై కూడా ఒక్కవారంలో వెనక్కి రావడమెలా అన్నది ఇప్పుడు ప్రశ్న. క్యూకట్టి వున్న పై  రెండు పెద్ద కమర్షియల్స్ తో పోటీని తట్టుకో గల్గితే  ఫర్వాలేదు-  ఐతే అలా తట్టుకునే శక్తి వుందా దీనికి? 

             ప్రేక్షకులు భలే  ఎమోషనల్ జీవులు. ఒక్కోసారి సినిమా బాగోగులతో సంబంధం లేకుండా భారీ సినిమాలకి ఓపెనింగ్స్ ని భారీగానే ముట్టజెప్పేస్తారు.  స్టార్ బ్యాగేజితో అట్టహాసంగా తమ ముందు కొచ్చేసిన ‘రుద్రమదేవి’ కి తొలి మూడు రోజుల్లో  26.10 కోట్ల గ్రాస్ ని అందించేశారంటే, వాళ్ళ భావోద్వేగాలు ఏ స్థాయిలో వున్నాయో ఊహించుకోవచ్చు. కాబట్టి భారీ సినిమాలు నిర్మించడానికి పెద్దగా తెలివితేటలు అవసరం లేదనుకోవచ్చు. విషయపరంగానూ తీవ్రంగా కష్ట పడిపోనక్కర లేదని కూడా  అనుకోవచ్చు. బుద్ధిజీవుల కోసం భారీ కమర్షియల్స్ ని తీయరు. అయితే ఒకజాతి గర్వించదగ్గ చరిత్రతో కూడిన సినిమాని కూడా మైండ్ ని అప్లయ్ చేయకుండా, మసాలా సినిమాలా తీసెయ్యొచ్చా అన్నది ఆ దర్శకుడే  వేసుకోవాల్సిన ప్రశ్న. 

          నిజానికి దర్శకుడు గుణశేఖర్ కి చరిత్ర అవకాశామివ్వలేదు గానీ, మామూలు కమర్షియల్స్ తో వరస ఫ్లాపులు చవిచూసి విసిగిపోయి, ఆపద్ధర్మంగా తనే ఓ చారిత్రిక అవకాశాన్ని సృష్టించుకుని, ‘రుద్రమదేవి’ అనే మహాయజ్ఞానికి సమకట్టారు. దీనికి బాక్సాఫీసు క్షమించినంతగా చరిత్ర కూడా క్షమిస్తుందా, లేకపోతే ఇది ఇలావచ్చి అలా జనం మర్చిపోయే చెత్తబుట్ట దాఖలు బాపతు మరో విఫల యత్నమేనా ,  ఓ సారి ఈ కింద చూసుకుంటూ వెళ్దాం..

 దేవియే దేవుడుగా! 
         కాకతీయ సామ్రాజ్య చరిత్రలో  రాణీ రుద్రమ దేవి  (పాలనా కాలం 1261–1289)  పోషించిన పాత్ర తాలూకు చిత్రణ ఇది.  రుద్రమదేవిగా అనుష్కా ఇందులో కన్పిస్తుంది. రుద్రమ దేవి పుట్టే టప్పటికే రాజ్యానికి చాలా ప్రమాదాలు పొంచి వుంటాయి. శత్రు రాజులు, దాయాదులూ రాజ్యాన్ని కబళించాలని చూస్తూంటారు. అప్పటికే ఒక కూతురున్న రాజు గణపతి దేవుడు (కృష్ణం రాజు) తన వారసత్వాన్ని కొనసాగించే  మగ సంతానం లేకపోవడంతో శత్రువుల దృష్టిలో బలహీనపడతాడు. అలాంటప్పుడు మగసంతానం కోసం ఎదురు చూస్తూంటే ఆడపిల్ల రుద్రమ దేవి పుడుతుంది. ఈ విషయం పొక్కిందంటే, శత్రువులు విజృంభిస్తారు. దీనికో ఉపాయం చెప్తాడు మంత్రి శివ దేవయ్య (ప్రకాష్ రాజ్ ). పుట్టింది మగ సంతానమని ప్రకటించమంటాడు. పుట్టిన పిల్లని రుద్రమ దేవుడిగా పెంచుదామంటాడు. కోటలోనే పాగావేసి కుయుక్తులు పన్నుతున్న దాయాదులు హరిహర దేవుడు ( సుమన్), మురారీ దేవుడు ( ఆదిత్యా మీనన్) లకి  సైతం ఈ విషయం  తెలియకుండా దాచాలంటాడు. అలాగే ప్రకటన చేస్తాడు గణపతి దేవుడు. 

               ఇది తెలుసుకుని శత్రు దేశపు రాజు మహాదేవ నాయకుడు ( విక్రం జిత్ విర్క్) పిచ్చెక్కిపోతాడు. ఇటు మగపిల్లాడిలా పెరుగుతున్న రుద్రమదేవికి నిడదవోలు సామంతరాజు చాళుక్య వీరభద్ర ( దగ్గుబాటి రానా),   మరో దివంగత సామంత రాజు గోన బుద్ధా రెడ్డి కొడుకు గన్నారెడ్డి (అల్లు అర్జున్) లు స్నేహితులుగా ఏర్పడతారు. గన్నారెడ్డి పెద్దయ్యాక బందిపోటుగా మారి  ప్రజల్ని దోచుకుంటున్నాడని ప్రచారం జరుగుతూంటుంది. తన తండ్రిని చంపి గణపతి దేవుడి  పంచన చేరిన అన్నల మీద కక్షతో ఉంటాడు గన్నారెడ్డి. ఇటు ‘యువరాజు’ గా ఎదిగి తండ్రితో కలిసి పరిపాలిస్తూ చెరువులు తవ్వించీ, పన్నులు మాఫీ చేయించీ ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతూంటుంది రుద్రమ దేవి. కక్షతో ఈమె పాలనకి ఆటంకాలు సృష్టిస్తూంటాడు మహాదేవ నాయకుడు. 

            ఈ నేపధ్యంలో రుద్రమదేవి ఆడపిల్లన్న సంగతి ఎలా ఎప్పుడు బయటపడింది, అప్పుడు ఎలాటి విషమ పరిస్థితులు ఏర్పడ్డాయి, వాటినామె ఎలా ఎదుర్కొంది; వీరభద్రుడు, గన్నారెడ్డి లు ఆమెకెలా తోడ్పడ్డారు మొదలయిన అంశాలతో మిగతా కథ సాగుతుంది.


ఎవరెలా చేశారు 
        ఇప్పుడున్న తారల్లో రుద్రమదేవి పాత్రలో అనూష్కా ని తప్ప మరొకర్ని ఊహించలేమన్నది నిజమే. రుద్రమ దేవుడుగా పురుష పాత్రలో, రుద్రమదేవిగా స్త్రీ పాత్రలో రెండింటిలోనూ కన్పిస్తుంది అనూష్కా. రాజరికపు వీరత్వంతో కాఠిన్యంతోనూ, ప్రేమలో పడిన కుమారిగా సౌకుమార్యంతోనూ కన్పిస్తుంది. రుద్రమదేవి నిజజీవితంలోనే కొంతకాలం పురుషుడి వేషంలో వున్న స్త్రీగా జీవించిందన్న స్పష్టత వుంది కాబట్టి  ఇంతవరకూ మాత్రం ఏ కన్ఫ్యూజనూ లేదు అనూష్కాకి. 

          ఫస్టాఫ్ గడిచి సెకండాఫ్ లో తను స్త్రీ అన్న విషయం ప్రపంచానికి తెలిసిపోయాకే, ఫైనల్ గా ఆ కీలకమైన స్త్రీ పాత్రతో ఉండాల్సిన అసలు నటనంతా నీరుగారిపోయింది. ఇక్కడ్నించీ కథ ఇతర పాత్రల చేతుల్లోకి వెళ్లిపోవడంతో, ఇంకా క్లయిమాక్స్ లో కొచ్చేసరికి  పూర్తిగా కథ అల్లు అర్జున్ నటించిన గోన గన్నారెడ్డి పాత్ర వశమైపోవడంతో,  చేష్టలుడిగినట్టు కన్పిస్తుంది అనూష్కా. ఎంతగానంటే, ఈ కథకి తాను ముఖ్య పాత్ర కానంతగా. ఆయా సీన్లలో తనెందుకుందో అర్ధంగానంత తికమకగా. 

          దీనికి తోడూ అప్పీరియన్స్ కి కంటిన్యూటీ సమస్య కూడా ఎదురయ్యింది. ఎప్పుడో 2013 లో ఈ సినిమాని ప్రారంభించిన నాటి నాజూకుదనంతో సినిమా సాంతం కన్పించదు. సెకండాఫ్ గడుస్తున్న కొద్దీ బరువెక్కిపోతూ  కన్పిస్తుంది. 2013 నాటి అనూష్కా -2015 నాటికి ఎలావుందో ఫిజికల్ ఫీచర్స్ పరిణామక్రమాన్ని రికార్డు చేస్తుంది ఈ సినిమా. ఈ కథ అనూష్కా పాత్రని  కేంద్రంగా చేసుకుని  నడవక పోవడంతో ఓవరాల్ గా చూస్తే తను చేసిందేమిటో అంతగా గుర్తుకు రాదు. అంటే నటిగా తను విఫలమైనట్టు కాదు. పాత్ర చిత్రణలో దర్శకుడు చేసిన పొరపాట్ల ఫలితం. ఒక ‘ప్రతిఘటన’ లాంటి హీరోయిన్ ఓరియెంటెడ్ సినిమా తీసుకున్నా, అందులో పవర్ఫుల్ గా నటించిన విజయశాంతి ఇప్పటికీ గుర్తుంటుంది. కానీ ఇక్కడ ఇంత భారీ చారిత్రాత్మకంలోనూ వీరవనిత రుద్రమదేవిగా అనూష్కా గుర్తుండదు, అల్లు అర్జునే గుర్తుంటాడు. 

         అనూష్కా కంటే గోన గన్నారెడ్డి పాత్రలో అల్లుఅర్జున్ ఎక్కువ హల్చల్ చేయడంతో ఈ సినిమాకి ‘గోన గన్నారెడ్డి’ అని టైటిల్ పెట్టినా నష్టం లేదు,  పైగా ‘బ్రూస్ లీ’  లకీ, ‘అఖిల్’ లకీ బస్తీమే సవాలుగా వుంటుంది తొడగొట్టి సినిమా. తెలంగాణా యాసలో అర్జున్ డైలాగులకే ఎక్కువ హుషారు ప్రేక్షకులకి. పోషించింది అతిధి పాత్రయినా గంగి గోవు పాలు గరిటెడైనా చాలన్నట్టు, ఈ సినిమా చూస్తూంటే వచ్చే నీరసాన్నంతా హుష్ కాకీ చేసేస్తాడు ఎమోషనల్ డ్రైవ్ జాస్తిగా వున్న తెలుగుజాతి ప్రేక్షకులకి అర్జున్. 

          రానా దగ్గుబాటి కాల్పనిక చరిత్ర ‘బాహుబలి’ లోలాంటి పాత్రతోనే, ఆహార్యంతోనే, డిజైనర్ చరిత్ర ‘రుద్రమదేవి’ లోనూ నటించాడు. కానీ ఈ పాత్రకూడా ఆటలో అరటి పండు అయిపోవడంతో తన గురించి చెప్పుకోవడాని కేమీ లేదు. ఇతర పాత్రల్లో కృష్ణం రాజు, ప్రకాష్ రాజ్, నిత్యామీనన్ సుమన్, ఆదిత్యా మీనన్ తదితర భారీ తారాగణమంతా కలిసి, భారీ డైలాగులతో, ప్రధానపాత్ర రుద్రమ దేవి ఉనికిని ప్రశ్నార్ధకం చేశారు. ఇక మహాదేవ నాయకుడుగా నటించిన ముప్ఫయ్యేళ్ళ కుర్రాడు విక్రంజిత్ విర్క్ అయితే,  ఇంత భారీ చారిత్రాత్మకానికి కురచ విలన్ అయిపోయాడు.

          ఇళయరాజా సంగీతం హిట్టేమీ కాదు. పాటలూ - నేపధ్య సంగీతమూ అంతంత మాత్రంగానే వున్నాయి. నేపధ్య సంగీతమైతే మరీ వెనకబడిపోయింది. అజయ్ విన్సెంట్ ఛాయాగ్రహణానికి లైటింగ్ లో, కలర్ స్కీం లో ఏకత్వం కన్పించదు. కొన్ని ఔర్ డోర్ దృశ్యాలు మాత్రం బావున్నాయి. సాంకేతికంగా ఈ సినిమా అంత ఉన్నతంగా ఏమీ లేదు.  గ్రాఫిక్స్ మరీ చవకబారుగా వున్నాయి.  సెకనుకి ఇరవై వేలు వెచ్చిస్తే వచ్చే క్వాలిటీ నాలుగైదు వేలు పెడితే ఏమొస్తుంది. అలాగే యాక్షన్ సీన్సు సైతం బలహీనంగా వున్నాయి. కత్తి పోరాటాలు ఈ కాలపు సినిమానే  చూస్తున్నామా అన్నట్టున్నాయి- పాత జానపద సినిమాల్ని జ్ఞప్తికి తెస్తూ. 

          పరుచూరి బ్రదర్స్ రాసిన సంభాషణలు ఫస్టాఫ్ వరకూ మంచి ఫీల్ నిస్తాయి. సెకండాఫ్ లోనే మరీ  భారమన్పిస్తాయి. కారణం,  కథని యాక్షన్ తో కాకుండా, ఎంతసేపూ వ్యూహ ప్రతివ్యూహాలు, కుట్రలూ కుతంత్రాలూ మాటాడుకోవడాలతో, ఊహాగానాలతో నిండి పోవడమే - ఆ నాడు కృష్ణ దర్శకత్వం వహించిన డైలాగుల మోత  ‘సింహాసనం’ ని గుర్తుకు తెస్తూ.  ఒక్క అల్లు అర్జున్ కి రాసిన డైలాగులు మాత్రమే క్రియేటివిటీతో శక్తిమంతంగా వున్నాయి. ఇలాటి పవర్ఫుల్ డైలాగులు  అసలుండాల్సిన  రుద్రమదేవి పాత్రకే మృగ్యమైపోయాయి.

          పాత్రల పంపకం, డైలాగుల పంపకం, సాంకేతిక హంగుల పంపకం.. ఇలా వేటిలోనూ బ్యాలెన్సింగ్ యాక్ట్ పాటించని అగ్ర దర్శకుడు గుణశేఖర్ మేకింగ్ పనితనం మొత్తంగా ఎలా వుందో ఈ కింద  ‘స్క్రీన్ ప్లే సంగతులు’ తర్వాత చెప్పుకుందాం..

స్క్రీన్ ప్లే సంగతులు