రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

23, ఫిబ్రవరి 2016, మంగళవారం

షార్ట్ రివ్యూ!




స్క్రీన్ ప్లే – దర్శకత్వం : వాసూ వర్మ 

తారాగణం: సునీల్‌, నిక్కీ గల్రానీ, డింపుల్‌ చోపడే, ఆశుశుతోష్‌ రాణా, అజయ్‌, తులసి, ముఖేష్‌ రిషి, పవిత్రా లోకేష్‌, బ్రహ్మానందం, సప్తగిరి, పృధ్వీ, వైవా హర్ష తదితరులు
కథ: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, సంగీతం: దినేష్‌, ఛాయాగ్రహణం: చోటా కె. నాయుడు’ 
బ్యానర్‌: శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌, నిర్మాత: రాజు

విడుదల : ఫిబ్రవరి 19, 2016


రేళ్ళ క్రితం తెలుగు సినిమా హీరోల సరసన తనుకూడా చేరిపోయిన స్టార్ కమెడియన్ సునీల్, ‘కమెడియన్ ముదిరితే గ్యారంటీగా హీరో అవుతాడు’ అనుకుంటున్న కొత్త ఇమేజి మేకోవర్ కోసం ఇంకా స్ట్రగుల్ చేయాల్సే వస్తోంది. పెద్ద పెద్ద స్టార్లే కామెడీలు చెయ్యందే సినిమాల్ని వదలనప్పుడు కమెడియన్లంతా కంగారుపడిపోతోంటే, తన లాంటి స్టార్ కమెడియన్  హీరోనై పోవాలనుకోవడం అప్పటికి ముందు జాగ్రత్త చర్యే.  కానీ తను వేసిన ప్లానుకి కౌంటర్ గా హీరోలే   ‘హీరో ముదిరితే సెంట్ పర్సెంట్ గ్యారంటీగా కమెడియన్ అవుతాడు’ అన్న ఐడియాలజీని ఆల్రెడీ డెవలప్ చేసుకుని సాగిపోతూంటే, తగుదునమ్మా అని ఇటొచ్చి తను ఇంకా సీరియస్ ఎమోషనల్ పాత్రలతో హీరోగా ఏదో  సాధించాలనుకోవడం తప్పటడుగే. రెండేళ్ళ విరామం తర్వాత ‘కృష్ణాష్టమి’ కి  ఇంత  కష్టపడి యమ సీరియస్ పాత్రలో ఫైట్లూ అవీ చేసేస్తూ పదేళ్ళ క్రితం అయిపోయిన ఆటే మళ్ళీ ఆడుకుంటూంటే ట్రెండ్ ఎలా ఒప్పుకుంటుందన్న ప్రశ్న ఎదురవుతోంది. ఉట్టి కొట్టాల్సిన ఈ కృష్ణాష్టమి ఆటకి సపోర్టుగా ఇతర స్టార్ల పాత్రలూ, వాళ్ళు నటించేసిన సీన్లే వాడుకుంటే,  హిట్టు కొట్టడం కూడా కనా కష్టమేనని తేలుతోంది.   


         స్టార్ నిర్మాత దిల్ రాజు స్టార్లతోనే  బ్యాలెన్స్ తప్పడం జరగాల్సిన పని కాదు. స్టార్లు వస్తూంటారు పోతూంటారు, ఓ వ్యవస్థగా స్థిరంగా నిలబడాల్సిన  పని స్టార్ ప్రొడ్యూసర్ గా తనది. ఏ  మీడియాలోనూ స్థిరత్వం అనేది లేదు, రోజురోజుకీ మారిపోయే స్వరూపాలే తప్ప. ఇంకా దిల్ రాజు తనకి అలవాటయిన పాత మూస కుటుంబ కథలే తెలుగు ప్రేక్షకులకి శిరోధార్యం అనుకోవడం తన స్థిరత్వం చేజారిపోతూండడానికి కారణం. యశ్ చోప్రా ఫిలిమ్స్ ఈ జాడ్యం వదిలించుకున్నారు. కరణ్ జోహార్ కూడా వదిలించుకుని ముందుకెళ్తున్నాడు. దిల్ రాజు వదలకపోవడం వ్యూహాత్మక తప్పిదంన్నర తప్పిదం. 

        2009 లో ‘శివ’ లాంటి ‘జోష్’ తీసి  దెబ్బతిని, 2016 లో అంకె చూసుకుని జేమ్స్ బాండ్ 116 లా తిరిగి వచ్చిన దర్శకుడు వాసూవర్మ,  ‘కృష్ణాష్టమి’ ని ఎన్నో దిల్ రాజు తీసిన, ఇతరులూ తీసిన  సినిమాల చద్దన్నంలా తయారు చేసి వడ్డించడం చాలా కామెడీ. ఈసారి కమెడియన్ సునీల్ సినిమాలో కామెడీ అనేది లేకపోయినా ఆ లోటుని సినిమా చుట్టూ జరిగిన  చాలా కామెడీలు తీరుస్తాయి- వదిలేద్దాం.

        ఒకే ఒక్క సినిమాతో తిరుగులేని కమెడియన్ గా ఎస్టాబ్లిష్ అయిన సునీల్, ఆరేళ్లుగా అయిదు సినిమాలు నటిస్తున్నా హీరోగా తన భవితవ్యం ఏమిటో తనేకే తెలీని సందిగ్ధావస్థ లో వుండడం త్రిశంకు స్వర్గం లాంటిదే.

        ‘కృష్ణాష్టమి’ తో ప్రేక్షకుల్ని కూడా త్రిశంకు స్వర్గంలో పడెయ్యడం పరాకాష్టకి చేర్చింది. చూసిందే చూడమంటున్న ఈ సినిమాలో అసలేముందో ఇక చూద్దాం...

ఎన్నారై ఇన్ ట్రబుల్ !
         ఎన్నారై కృష్ణ వరప్రసాద్ (సునీల్) కి అందరు ఎన్నారై హీరో పాత్రల్లాగే ఇండియా అంటే చచ్చే ప్రేమ. ఇక్కడి సంస్కృతీ సాంప్రదాయాలంటే చాలా ప్రాణం. అమెరికా వదిలి ఇండియా వచ్చేసి తన గ్రామంలో సెటిలవ్వాలని తాపత్రయం. ఈ తాపత్రయానికి ఇండియాలో  వుండే పెదనాన్న ( ముఖేష్ రిషి) పెద్ద అడ్డంకి. పద్దెనిమిదేళ్ళ నుంచీ ఇండియా రానియ్యడం లేదు. పైగా ఇప్పుడు అమెరికాలోనే  పిల్లని చూసి పెళ్లి  కూడా చేసేద్దామనుకుంటున్నాడు. ఇది  భరించలేక ‘మిస్టర్ పర్ఫెక్ట్’ లో ప్రభాస్ లా అమెరికాలో వీడియో గేమ్  డిజైనర్ గా ఉంటున్నకృష్ణ, ఫ్రెండ్ గిరి ( సప్తగిరి) ని వెంట బెట్టుకుని చెప్పా పెట్టకుండా ఇండియా బయల్దేరతాడు. ‘ఇష్క్’ లో నితిన్ కి జరిగినట్టు కనెక్టింగ్ ఫ్లైట్ (యూరోప్ లో ) ఆలస్యం కావడంతో మూడ్రోజులూ అక్కడే ఉండిపోవాల్సి వస్తుంది. అప్పుడు ‘ఇష్క్’ లోనే  నితిన్ రోమాన్స్ కి నిత్యా మీనన్ దొరికినట్టు కృష్ణకి పల్లవి ( నిక్కీ గల్రానీ) అనే అమ్మాయి దొరుకుతుంది. ఈమె పవనిజం లాగా తన పల్లవిజం అనే ఫిలాసఫీ చెబుతూ బెలూన్లతో జనాలకి కౌన్సెలింగ్ చేస్తూ తిరుగుతూంటుంది  ‘బాద్షా’ లో కాజల్  క్యారక్టర్ లాగా.

        ఈమెని ప్రేమలో పడెయ్యడానికి  ‘1- నేనొక్కడినే’ లో భ్రాంతులకి లోనయ్యే  మానసిక వ్యాధి పీడితుడైన మహేష్ బాబు ని ఇన్స్పిరేషన్ గా తీసుకుని కృష్ణ అలా నటిస్తూంటాడు. ఈమెని ప్రేమలో పడెయ్యడం పూర్తయ్యాకా ఫ్లైట్ టైమవుతుంది.

        ఈ జనవరి- ఫిబ్రవరీల్లోనే  వచ్చిన ‘ఎక్స్ ప్రెస్ రాజా’, ‘స్పీడున్నోడు’, ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ ల్లాగే రొటీన్ గా మళ్ళీ రాయలసీమకే కథని లాక్కెళ్తూ  చిత్తూరులో దిగుతాడు కృష్ణవరప్రసాద్ తన ఫ్రెండ్ తో కలిసి. ఈ ప్రయాణంలో ‘సంతోషం’ లో నాగార్జునలా ఓ పి ల్లాణ్ణి వెంటేసుకుని డాక్టర్ అజయ్ ( అజయ్) తగుల్తాడు. వెంటనే ఇతడి మీద ఫ్యాక్షన్ ఎటాక్ జరగడంతో  కోమాలోకి వెళ్ళిపోతాడు. ఇతణ్ణి హాస్పిటల్లో పడేసి పిల్లాడితో వాళ్ళింటికి వెళ్తాడు  కృష్ణ.  ఆ ఇల్లు రెడ్డి (ఆశుతోష్ రాణా) అనే ఫ్యాక్షనిస్టుది. కోమాలో వున్న డాక్టర్ అజయ్ ఇతడి అల్లుడే.

        గతంలో చచ్చిపోయిన పెద్ద కూతురు పెళ్లి చేసుకున్నప్పుడు పెళ్ళికొడుకు అజయ్ ని  ఈ రెడ్డి చూడలేదు కాబట్టి, కృష్ణే తన అల్లుడనుకుని మర్యాదలు చేస్తూంటాడు. ఇక్కడ అజయ్ మరదలు ( డింపుల్ చోపడే) బావగారనుకుని హద్దులు మీరి కృష్ణని కవ్విస్తూంటుంది. ఈమెతో కృష్ణకి పెళ్లి కూడా అనుకునేస్తారు. అప్పుడు అసలు సంగతి కృష్ణకి తెలుస్తుంది. తనే  అనుకుని అజయ్ మీద హత్యాయత్నం చేశారని, నిజానికి తనని చంపడానికే  ఈ ఇంట్లోంచి  ప్రయత్నాలు జరుగుతున్నాయనీ, ఈ ఇంట్లోనే ‘మర్యాదరామన్న’ లో హీరోలా ( ఇదీ సునీలే!) తానుంటున్నాడనీ.. ఇపుడేం చెయ్యాలి?

       చేయడానికి చాలా సినిమా బిట్లున్నాయి. ఒక్కోటి తీసి వాడుకోవడమే. ‘రెడీ’, ‘బృందావనం’, ‘మిర్చీ’, ‘అతడు’ ఇలా సెకండాఫ్ లో కూడా చూసేసిన  సినిమాల కత్తిరింపులే  మనకి చూపించి సంతోష పెడతారు.

ఎవరెలా చేశారు      సునీల్ బిగిసుకు పోయి చేశాడు. హీరోగా నటించాలంటే తనలోంచి అది సహజంగా రావడం లేదే అన్న బెంగతో మెగాస్టార్ లా కాస్సేపు, ప్రిన్స్ మహేష్ బాబులా కాస్సేపూ నటించుకు పోతున్నట్టు కన్పిస్తాడే తప్ప ఈజ్ లేదు.  చాలా సీన్లలో దీన్ని గమనించ వచ్చు. పైగా నలభైల్లో పడ్డాడని కాబోలు, ఇదివరకు ‘పూలరంగడు’ లో వున్న పంచ్ కూడా అక్కడక్కడా వున్న కామెడీలో వేయలేకపోతున్నానూ అన్నట్టు అలసటతో కన్పిస్తాడు. సిక్స్ ప్యాక్ చూపించి ఫైట్ చేసినంతమాత్రానే సినిమాకి చాలదు కదా? సీరియెస్ నెస్ కితోడు, చాలా సీన్లలో పాత్ర ఉదాత్తమైనదిగా కన్పిస్తుంది. ఇది తనకి అవసరమా? తనలోని  కమెడియన్ని మర్చిపోయి, గుమ్మడిని చూడమనడమా? పాత్ర ఏదో త్యాగం చేస్తోంది సరే, దాన్ని అంత బరువుగా చూపించడం కూడా అవసరమా? పైగా పది సినిమాలు గుర్తొచ్చేలా బిట్స్ ని పట్టుకుని నటించేసి ఇంతే తన వల్లయ్యేదని చాటుకుంటే ఎలా? 

        బిట్స్ అతికింపులని మరిపించాలంటే క్యారక్టర్ అనే మంత్రదండాన్నే  ప్రయోగించాలి. ‘భలే భలే మగాడివోయ్’ లో  కథకి స్ట్రక్చర్ లేకపోయినా ఆ లోపం తెలియకుండా, పదినిమిషాలకో గట్టి బ్యాంగ్ చొప్పున ఇచ్చుకుంటూ  హల్చల్ చేసే నాని పాత్ర చిత్రణే  సినిమాని సూపర్ హిట్ చేసింది. సునీల్ పాత్రకూడా కథనంలో వున్నఅన్ని లోపాలనీ చిత్తు చేసి, చదును చేసి, తొక్కుకుంటూ రాచబాట వేసుకుంటూ  వెళ్ళిపోయే సూపర్ ఫాస్ట్ కామిక్ సెన్స్ తో తొణికిసలాడాల్సింది. కథలో తనబాట తను బలంగా వేసుకోలేని వాడు కథానాయకుడెలా అవుతాడు.  

        హీరోయిన్ల గురించి చెప్పుకోవడానికి ఏమీ లేదు. సినిమాకొక హీరోయిన్ చొప్పున వచ్చిపోతూంటే వాళ్ళ గురించి ఇప్పుడే చెప్పుకోనవసరం లేదు, అదృష్టవంతురాళ్లై  ఇంకో రెండు సినిమాల్లో కన్పిస్తే అప్పుడు వాళ్ళ గురించి ఆలోచించడం మొదలెడదాం. చివర్లో వచ్చే బ్రహ్మానందం క్యారక్టర్, మొదట్నించీ  వుండే పోసానీ, సప్తగిరిల క్యారక్టర్స్ –వీటితోనే కాస్సేపు నవ్వుకోగాల్గుతాం. 

        బహుశా ఛాయాగ్రాహకుడుగా ఛోటా కె. నాయుడు చేసిన ఓ విషయం లేని ఇదే. పాటలకి సంగీతం కూర్చిన దినేష్ నుంచీ  ఒక్క క్యాచీ సాంగ్ కూడా రాలేదు. నిర్మాతగా దిల్ రాజు ప్రొడక్షన్ విలువలకి ఏ లోటూ రానివ్వకుండా డబ్బు ఖర్చుపెట్టారు. కానీ బ్యానర్ విలువ ఇలా నిలబడుతుందా?

        దశాబ్దానికి పైబడి దిల్ రాజు కాంపౌండ్ లో ఉంటూ పౌరసత్వం సంపాదించుకున్న వాసూవర్మ, ప్రేక్షకుల హృదయాల్లో స్థానికత పొందాలంటే ఇలా బిట్సు దోపిడీలు చేస్తే కాదు, పురాతన శైలిలో దర్శకత్వం వహిస్తే కూడా కాదు, రాంగోపాల్ వర్మ ఒక్కడే ఎందుకుంటున్నాడు, ఇంకో వర్మని ఎందుకు యాక్సెప్ట్ చేయడం లేదూ అని దీని మీదే కథ ఆలోచించడం మొదలెడితే ఒరిజినాలిటీ, నావెల్టీ అన్నీ వాటికవే వచ్చి పలకరిస్తాయి.


-సికిందర్
http://www.cinemabazaar.in/






       







20, ఫిబ్రవరి 2016, శనివారం

స్క్రీన్ ప్లే సంగతులు!



     సినిమా బావుందనే రివ్యూలు వచ్చాయి, బాక్సాఫీసు కలెక్షన్లే ఆశించినంతగా లేవు...అంటూ పునరాలోచనలో పడ్డాయి ట్రేడ్ వర్గాలు. రెండే సందర్భాల్లో ఇలా జరుగుతుంది : అది క్లాస్ సినిమా అయి, అది బావుందని రివ్యూలు వచ్చినా బాక్సాఫీసు తన్నేసినప్పుడు ఒక సందర్భం;  అది మాస్ సినిమా అయి బావుందని రివ్యూలు వచ్చినా బాక్సాఫీసు బై బై చెప్పేసినప్పుడు రెండో సందర్భం. మొదటి సందర్భాన్ని అర్ధం జేసుకోవచ్చు. కమల్ హాసన్ నటించిన ‘చీకటి రాజ్యం’  లాంటి  క్లాస్ సినిమా బావుందని అనుకున్నా మాస్ కి నచ్చక ఫ్లాప్ అవడంలో అర్ధముంది. కానీ ఒక మాస్ సినిమా బావుందని రివ్యూలిచ్చాకా మాస్ ప్రేక్షకులే చూడకపోతే, రివ్యూలు విఫలమైనట్టే. రివ్యూల్లో బయటపడని నగ్నసత్యం మాస్ ప్రేక్షకులేప్పుడో కనిపెట్టేసినట్టే- మాస్ సినిమాల పేరుతో  తమమీద వరసగా రుద్దుతున్నది ఒకే నాటు దర్శకత్వాలతో వుండే మోటు సినిమాలేనని! వినియోగదారుడి స్పృహ వినియోగదారుడి స్పృహే! ఇదే జరిగింది ‘కృష్ణ గాడి వీర ప్రేమ గాథ’ విషయంలోకూడా. రివ్యూలదో దారి, ఈ వీర ప్రేమ గాథదో దారి...ఒకదారి అని  కాదు, ఎన్నో దారులు వీర ప్రేమ గాథకి : ఏ దారిని ఫాలో అవ్వాలో తెలీలేదు  ప్రేక్షకులకి. అదీ సమస్య!  

        అందుకే ఏకసూత్రత అనే రూలుని పాటించమన్నారు. కానీ ఏకసూత్రత అంటే దర్శకుడు హను రాఘవపూడికి పడదో, లేక అసలు దాని గురించి తేలీదో మనకి తెలీదు. కానీ 2012  లో తన మొదటి ప్రయత్నం ‘అందాల రాక్షసి’ లో ఇంతే, ఇప్పుడు నాల్గేళ్ళ తర్వాత ఈ రెండో ప్రయత్నంలోనూ ఇంతే. ఏకసూత్రత శివార్పణం!

        గత రెండు వారాల్లో ‘లోఫర్’ లాంటి మూడు సినిమాలని  ( కృష్ణ గాడి వీర ప్రేమ గాథ, గరం, స్పీడున్నోడు) విశ్లేషించుకుంటే, ఇవి తేడా లేకుండా  అచ్చు గుద్దినట్టు ఒకదానికొకటి నకళ్ళుగా తెలిసిపోతాయి. ఇలాటి నకళ్ళని చాలా భరించి భరించి వున్నారు  ప్రేక్షకులు. ఈ మూడింట్లోనూ  అవే మాస్ కథలు. అవే హీరోల ఆవారా పాత్రలు, అవే మొరటుగా వుండే కథా కథనాలతో నాటు దర్శకత్వాలు. తెలుగు సినిమా కథకి సంస్కారం అక్కర్లేదనుకోవడం, సున్నితత్వం అసలే  పనికి రాదనుకోవడం, ఎంత
నాటుగా వుంటే అంత జనం చూస్తారనుకోవడం – ఇదే నేటి కొత్తా పాతా  దర్శకులకి  ఆదర్శమైనప్పుడు- రివ్యూల్లోఎక్కడా నిరసన వ్యక్తం కాకపోవడం విచిత్రం. 

        సంక్రాంతికి పోటీపడ్డ సినిమాలమధ్య ‘సోగ్గాడే చిన్నినాయనా’ ఒక్కటే ఎందుకు సూపర్ హిట్టయ్యిందంటే అది రొడ్డకొట్టుడు ధోరణుల నుంచి దూరం పాటించినందువల్లే. దీని ఘన విజయాన్ని పురస్కరించుకునే మాస్ ప్రేక్షకులు కోరుకుంటున్న మార్పేమిటో తెలిసివచ్చింది. ఈ నేపధ్యంలో  స్పీడున్నోడు, గరం, క్రిష్ణగాడి వీర ప్రేమ గాథ...లాంటి మరిన్ని నకళ్ళకి దక్కాల్సిన చోటే దక్కుతుంది.
                                                ***
కలగాపులగం!
     గమ్మత్తేమిటంటే ఏక సూత్రతకి ఎసరు పెడుతూనే మళ్ళీ  మూడు నాలుగు జానర్స్ ని తెచ్చి కలిపేసి రసభంగం కూడా గావించుకోవడం. కృష్ణ గాడి ప్రేమ కథకి ( ‘గాథ’ అనడానికి ఇది అంత గొప్ప మహోజ్వల ప్రేమ కథేం కాదు, దేవదాసు లాంటి అమర ప్రేమికుణ్ణి పేరడీ చేసి నవ్వించినప్పుడు ఆ అర్ధంలో  ‘గాథ’ అన్నా కామెడీగా సరిపెట్టుకునే వీలుండేది- దేవదాసుని మోడరన్ లవర్ గా బ్లాక్ కామెడీ చేసి అనురాగ్ కాశ్యప్ ‘దేవ్ డి’ అనే  హిట్ తీసినట్టు) ఫ్యాక్షన్ పాత్రలతో హింస జోడించారు, అది సరిపోనట్టు మాఫియా పాత్రలతో  ఇంకా కూడా హింస జోడించారు, ఇది కూడా సరిపోనట్టు టెర్రరిజంతో  కన్ఫ్యూజ్ చేస్తూ నడిపించారు, మళ్ళీ ఈ మొత్తాన్నీ ఒక రోడ్ మూవీగా  కూడా చేశారు. ఇలా ఇన్ని సజాతి- విజాతి జానర్స్ నీ కలిపేసిన రసభంగంతో సినిమా చూసి బయటికొచ్చే ప్రేక్షకుల మొహాల్లో అసలేం చేశామబ్బా అన్న క్వశ్చన్.

        ఈ వారమే హాలీవుడ్ లో కూడా ఇదే పరిస్థితి. 1813లో జేన్ ఆస్టిన్ ప్రసిద్ధ నవల ‘ప్రైడ్ అండ్ ప్రెజుడీస్’ లోని జగమెరిగిన గొప్ప ప్రేమకథని ఆఫ్రికన్ జాంబియాలతో కలిపి సెటైర్లు వేసి ప్రేక్షకుల్ని పారిపోయేలా ‘ప్రైడ్ అండ్ ప్రెజుడీస్ అండ్ జాంబీస్’ తీసి అట్టర్ ఫ్లాపయ్యారు. ఆఫ్రికాలో వూడూ విద్యద్వారా శవాల్ని లేపి వాటి చేత పనులు చేయించుకుంటారు. వీటిని జాంబీ లంటారు. వీటిమీద ఎన్నో హార్రర్ సినిమాలు వచ్చాయి. ఇలాటి ఒక హార్రర్ జానర్ ని ఆల్ టైం క్లాసిక్ గా నిలచిపోయిన ప్రేమకథలో జొప్పించి సెటైర్ చేసే ప్రయత్నం అలా బెడిసి కొట్టినట్టు, కృష్ణ గాడు కూడా  కలగాపులగమైపోయాడు! 

        ఇక్కడ మరొక్క సారి చెప్పుకుంటే, గత సంవత్సరం హిట్టయిన ఐదారు సినిమాలు కూడా మాస్ ప్రేక్షకుల మద్దతుతో జానర్ మర్యాదని కాపాడినవే! ఒక జానర్ లో  కథ చెప్తున్నప్పుడు ఆ జానర్ లక్షణాలనుంచి అంగుళం కూడా పక్కకెళ్ళని సినిమాలకే పట్టం గడుతున్నారిప్పుడు- రసభంగాన్ని సహించడం లేదు. సూక్ష్మస్థాయిలో ఈ పరిశీలన చేసుకోకపోతే సినిమాలు తీసి సాధించేదేం వుండదు.
                                                ***
ఆదిలోనే రసభంగం! 
      రాయలసీమలో కృష్ణ గాడు బోర్ వెల్ కార్మికుడు. మహాలక్ష్మిని చిన్నపట్నుంచీ ప్రేమిస్తూంటాడు. ఆమె కూడా ప్రేమిస్తూంటుంది గానీ, ఆమె అన్న భయంతో బయటపడకుండా వుంటారు. అన్న అక్కడి ఫ్యాక్షనిస్టు కుడి భుజం. బాలకృష్ణ ని అభిమానించే కృష్ణ గాడు చాలా పిరికివాడు. గొడవలంటే భయం. అందుకే మహాలక్ష్మి అన్నతో జాగ్రత్తగా ఉంటాడు. 

        ఇంకో వూళ్ళో ఈ ఫ్యాక్షనిస్టు ప్రత్యర్ధి ఉంటాడు. ఇతను తన ముఠాని పంపి ఈ ఫ్యాక్షనిస్టు ఇంటి మీద దాడి జరిపిస్తాడు. ఈ ఇంట్లో ముగ్గురు చిన్న పిల్లలుంటారు. వాళ్ళు ఈ ఫ్యాక్షనిస్టు తమ్ముడి పిల్లలు. ఈ తమ్ముడు హైదరాబాద్ లో ఎసిపి. ఇంటి మీద దాడి జరుగుతున్నప్పుడు మహాలక్ష్మి అన్న ఓ పని అప్పజెప్తాడు కృష్ణ గాడికి. పిల్లల్ని తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోతే చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తానంటాడు. కృష్ణగాడు  ఆ పిల్లల్ని తీసుకుని పారిపోతాడు. ఈ పిల్లల కోసం దుబాయికి  చెందిన మాఫియా/టెర్రరిస్టు  అనుచరులు వెంటబడతారు. వీళ్ళకి ఎసిపి మీద పగ వుంటుంది.  ఈ అనుచరుల దాడులనుంచి ఎలా తప్పించుకుని కృష్ణ గాడు పిల్లల్ని హైదరాబాద్ చేరవేశాడన్నది ముగింపు.

        ఈ కథలో  సముచితమైన సమయం అరగంట గడుస్తూండగా బిగినింగ్ విభాగం ముగుస్తుందన్న సూచనలు కన్పిస్తాయి. ఆ ఘట్టం రానే వస్తుంది. హీరోయిన్ అన్న హీరోని వూరి బయటికి తీసికెళ్ళి చూపిస్తూ  ప్రత్యర్ధుల్ని నరుకుతూంటాడు. ఇదొక ప్లాట్ పాయింటుని ఏర్పాటు చేసేలాటి మాస్టర్ షాట్స్ తో కూడిన పెద్దసీను. బిగినింగ్ విభాగంలో ఇంత పెద్ద క్రిటికల్ సీను వచ్చిందంటే, ఇక బిగినింగ్ విభాగం ముగుస్తూ స్టోరీ పాయింటు ఎష్టాబ్లిష్ అవుతోందని  ఆశిస్తాం. అంటే మొదటి మూల స్థంభం ( ప్లాట్ పాయింట్ – 1) వచ్చేసిందని భావిస్తాం.

       
కానీ ఇది జరగదు.  కేవలం తన చెల్లెలికి దూరంగా ఎందుకుండాలో హీరోకి  శాంపిల్ చూపించడానికే ఇంత మేజర్ సీను వేశారని అర్ధమవుతుంది. ఇదొక రసభంగ కారణం. ఏ కథలో నైనా ఒక సీను వుందంటే దానికి ఈ రెండిట్లో ఏదో  ఒక ప్రయోజనం లేకపోతే  అది సీనే కాదు : 1)  ఏదైనా పాత్ర గురించి తెలియజెప్పెందుకు, లేదా 2. కథని ముందుకు నడిపించేందుకు. ఈ రెండూ జరగలేదిక్కడ. పాత్రల గురించి మనకి ముందే తెలుసు- హీరో పిరికి వాడు,  హీరోయిన్ అన్న చాలా కౄరుడు. కాబట్టి  ఈ సీను వేసి పాత్రల గురించి కొత్తగా చెప్పడాని కేమీ లేదు.

        పోతే ఈ సీను కథని ముందుకి నడిపించేందుకైనా పనికొచ్చిందా అంటే, ఇది కూడా జరగలేదు. ఈ సీను తర్వాత కూడా కథలో తిరిగి యధాపూర్వ స్థితే. హీరో ఇంతకి  ముందు ఎలా ఉన్నాడో అదే ధోరణిలో అలాగే వున్నాడు, ఆ సీను ప్రభావం అతడి మీద ఏమాత్రం లేదు. హీరోయిన్ అన్న కూడా డిటో.  ఇలాకాక ఆ నరికివేతల మేజర్  సీను దెబ్బకి తన క్యారక్టరైజేషన్ కి తాను న్యాయం చేసుకుంటూ పిరికివాడయిన హీరో వూరు విడిచి పదిమైళ్ళ దూరం పారిపోయి వుంటే, కథని ముందుకు నడిపించే టూల్ గా ఆ సీను సార్ధకమయ్యేది. ఇదీ జరగలేదు. మరి కథకి ఏ ప్రయోజనాన్నీ సమకూర్చని ఇంత భారీ యాక్షన్ సీను ఎందుకు అన్ని లక్షలు పోసి చిత్రీకరించినట్టు? దీంతో వచ్చిన లాభమేమిటి-  రసభంగమేనా? 

        రసభంగం ఎలాగంటే, ఈ సీనుతో కథ ములుపు తిరిగి మొదటి మూలస్థంభం ఏర్పడుతుందన్న న్యాయమైన, సూత్రబద్ధమైన ఫీలింగ్ ని భంగపర్చింది.

        ఇలా మొదటి మూలస్థంభమూ కాలేకా, పోనీ పాత్రల గురించి కొత్తగా చెప్పడానికీ లేకా, కథని ముందుకు నడిపించడానికీ పనికి రాకా, ఇన్ని రకాలుగా భ్రష్టు పట్టిన ఈ సీను సినిమా ప్రారంభ ఘట్టాల్లోనే స్క్రీన్ ప్లే ఎంత అశాస్త్రీయంగా వుందో తెలియజెప్పింది.
                                               
***
స్టార్ట్...స్టాప్...
     సడెన్ గా పిడుగుపాటులా ఇంకో బిట్ వచ్చి పడుతుంది. ఒక మాఫియా ఎవరో హైదరాబాద్ లో వచ్చి వాలిపోయినట్టు రొడ్డ కొట్టుడుగా షాట్లూ, రీరికార్డింగ్ వేసేసి కట్ చేసేస్తారు. ఇక్కడేదో కథ నడుస్తోంది కదా, ఇదింకా బిగినింగ్ విభాగమే కదా, కానీ మిడిల్ విభాగంలో వున్నట్టు ఈ పిడుగుపాటేమిట్రా బాబూ అని ఇంకో వ్యధ.
        ఈ రెండో రసభంగాన్ని కూడా ఓర్చుకున్నాక, ఇంటర్వెల్ కోసం వీరప్రయత్నం జరుగుతుంది. కథని ఇంటర్వెల్ కి చేరవేయడానికి వేస్తూ పోయిన సీన్లు  ఎలా వున్నాయంటే, ఇదిగో ఈ సీనుతో ఇంటర్వెల్ పడిపోతోంది- అనిపించగానే, ఇంకో సీను వస్తుంది. ఇదిగో ఈ సీనుతో ఇంటర్వెల్ ఇప్పుడు పడిపోతోంది- అనుకోగానే ఇంకా కంటిన్యూ అవుతుంది. ఇంకో సీను - కంటిన్యూ - ఇంకో సీను - కంటిన్యూ...ఇలా స్టార్ట్ అండ్ స్టాప్ టెక్నిక్ తో తంటాలు. అప్పటికి టైము గంటా ఇరవై నిమిషాలు!

        వెనక, ఇదిగో మొదటి మూలస్థంభమని ఎలా ఆడుకున్నారో, అలా ఇదిగో ఇంటర్వెల్ అంటూ ఎంతకీ తెగని ఆట. 

        మరి మొదటి మూల స్థంభం ఎప్పుడు వచ్చింది?
                                               
***
ప్రపోజల్ – ఛాలెంజ్ 
      మొదటి మూలస్థంభం : ఏ  పార్టుకా పార్టు మొదటి మూలస్థంభాన్ని పోస్ట్ మార్టం చేస్తేనే  సినిమా జాతకం తెలిసేది. మదర్ బోర్డు ఇక్కడే వుంది. ఇక్కడ్నించే మొదలయ్యే అసలు కథకి అన్ని రకాల కమ్యూనికేషన్స్ ప్రసారమౌతాయి. దీనికి ఎటాచ్ చేసిన సౌండ్ కార్డో, వీడియో కార్డో, డాటర్ కార్డో, గ్రాండ్ డాటర్ కార్డో  మరోటో పనిచేయనప్పుడు, లేదా అసలవి  లేనప్పుడు, ఇక్కడ్నుంచీ  మొదలయ్యే అసలు కథతో కమ్యూనికేషన్ ఉండకపోవచ్చు, లేదా తప్పుడు కమ్యూని కేషన్స్ వెళ్తూండొచ్చు. అప్పుడు మొత్తం వ్యవస్థ కుప్పకూలుతుంది- థియేటర్ పైకప్పు మినహా. 

        ఇంటర్వెల్ ముందు  ఫ్యాక్షనిస్టు ఇంటి మీద దాడి జరుగుతున్నప్పుడు పిల్లల్ని తీసుకుని హైదరాబాద్ వెళ్ళిపోతే చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తానని హీరోయిన్ అన్న హీరోతో అనడం మొదటి మూలస్థంభంగా ఏర్పాటయిన మలుపు. 

        దీంతో హీరోకి గోల్ ఏర్పడింది : పిల్లల్ని హైదరాబాద్ చేరేస్తే తన పెళ్ళయిపోతుంది. ఈ గోల్ బలిమికి  ఉండాల్సిన విటమిన్లు 1. కోరిక, 2. పణం, 3. పరిణామాల హెచ్చరిక, 4. ఎమోషన్
 మొదలైన వాటి  సంగతి తర్వాత- అసలు ఈ గోల్ ఏర్పడ్డానికి హీరోయిన్ అన్న పెట్టిన ప్రపోజల్ కి అర్ధముందా?  

        ఒఠ్ఠి పిరికివాడైన హీరోకి అంతటి విపత్కర పరిస్థితుల్లో పిల్లల్ని తీసుకుని హైదరాబాద్ దాకా పారిపొమ్మనడం హీరోకి పెట్టే పరీక్ష అవదు. కాబట్టి ఇక్కడ భలే వుందే ఛాలెంజ్ అని ప్రేక్షకులు థ్రిల్ అవడానికేమీ లేదు. 

        పిరికివాడైన హీరోకి పెట్టే పరీక్షలో అతడి సొంత మాన ప్రాణాలకే రిస్కు వుండాలి తప్ప, పిల్లల ప్రాణాలకి  కాదు. ఇందాక పైన చెప్పుకున్న ముప్ఫయ్యో నిమిషంలో హీరోకి ఇదే హీరోయిన్ అన్న తను పాల్గొని చూపించిన మేజర్ యాక్షన్ సీన్ లోనే, నువ్వెళ్ళి వాళ్ళందర్నీ చంపి వస్తే చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తానని వుంటే, అప్పుడది  హీరోకి పెట్టే నిఖార్సైన పరీక్ష అయ్యేది. ఇందుకు కూడా ఆ సీను ఉపయోగించుకోలేదు. 

        అలాంటి  భయానక మారణహోమం సీను హీరోకి చూపించి ఇంకింత బెదరగొట్టేసిన వాడే, ఇప్పుడు ఇంటి మీదికి  శత్రువులొచ్చిన ఇంతటి ప్రమాదకర పరిస్థితుల్లో,  పూర్తిస్థాయి పిరికివాడుగా ముద్రేసుకున్న హీరో చేతిలోనే  ఆ పిల్లల ప్రాణాలు పెట్టి, కాపాడమనడమేమిటి? 

        కనుక అర్ధం లేని ప్రపోజల్ ఇది. ఇంకొకటేమిటంటే, చెల్లెల్నిచ్చి పెళ్లి చేస్తాననడం. అంటే హీరో పిరికి వాడైనందుకే పెళ్లి చేయడం లేదా, ధైర్యశాలి అయితే ఓకేనా? అంటే  హీరో మీద లోలోపల ఇష్టమేనా? అతను ధైర్యశాలిగా ఎదగాలని కోరుకుంటున్నాడా? మరలాంటప్పుడు ఇరవై మందిని తెగనరికే సీను చూపించి ఇంకింత  బెదరగొట్టడమెందుకూ? ఒకవేళ హీరో భయం పోగొట్టడానికే ఆ సీను చూపించాడా? అలా లేదే?

        ఒక పిరికివాడి చేతిలో పిల్లల్ని పెట్టి పెళ్లి చేస్తాననడం విఫలమైన పాత్ర చిత్రణ. పిల్లల ప్రాణాల కోసం కాళ్ళ బేరానికి రావడానికి హీరో సూపర్ మాన్ కాదు,  స్పైడర్ మాన్ కూడా కాదు.
ఇలా కథకి కేంద్రబిందువైన మొదటి మూలస్థంభం ఏర్పడ్డానికి కారణమే ప్రశ్నార్ధకం కావడంతో, ఈ మొదటి మూలస్థంభంలో గోల్ ఎలిమెంట్స్ కూడా ప్రశ్నార్ధక మయ్యాయి.
                                               
***

k + p + ph + e = G
       గోల్ ఎలిమెంట్స్ = కోరిక, పణం, పరిణామాల హెచ్చరిక, ఎమోషన్.
        ఈ నాల్గూ ఎలావున్నాయో చూద్దాం. 1) కోరికయితే వుంది, అది పెళ్ళిచేసుకోవడం. పెళ్లి కోసం నిజాయితీగానే స్ట్రగుల్ చేస్తున్నాడు కాబట్టి ఈ కోరిక అనే ఎలిమెంట్ బలంగానే వుంది.
        2. మరి ఈ కోరిక తీర్చుకోవడానికి దేన్ని పణంగా పెట్టాడు? ఎందుకంటే ఈ లోకంలో ఫ్రీ మీల్స్ అనేది లేదు. ఒకటి పొందాలంటే ఇంకోటి డిపాజిట్ గా పెట్టాల్సిందే. అలా డిపాజిట్ – అంటే పణంగా ఏం పెట్టాడు? ‘శివ’ లో నాగార్జున మొదటి మూలస్థంభం దగ్గరే  జేడీ మీద తిరగబడి కొట్టేసి, మాఫియాతో యుద్ధానికి తెర లేపినప్పుడు, తన అన్న కుటుంబాన్నే పణంగా పెట్టాడు. తను పాల్పడిన ఈ చర్య తన అన్న కుటుంబానికి హాని కలిగించ వచ్చని తెలుసు. ఆ ప్రకారం గత సీన్లలో రికార్డయింది.  ఇది తెలిసీ తెగించాడు.  హీరోయిజాన్ని ఎలివేట్ చేసేందుకు పనికొచ్చే పణం అనే  ఎలిమెంట్ అంటే ఇదే, ఇంత పవర్ఫుల్ గా , ఎప్పుడు పేలుతుందో తెలీని అణుబాంబులా వుంటుంది.

        కృష్ణ గాడు పణంగా గా పెట్టడానికి అతడికేమీ లేదు. నా అనే వాళ్ళు లేరు, హీరోయిన్ తప్ప. ఆమె పణంగా పెట్టే  డివైస్ కాదు, దేన్నయితే గెలవాలని గోల్ గా పెట్టుకుంటామో  దాన్నే పణంగా పెట్టలేం. పోనీ పిల్లల ప్రాణాలు? డెలివరీ ఇవ్వాల్సిన సరుకునే పణంగా పెట్టడం జరగదు. మరి తన ప్రాణాలు? ఇదీ కరెక్టు. పిరికివాడు ఈ ఆపరేషన్ ని చేపట్టడం నిజానికి ప్రాణాల్ని పణంగా పెట్టడమే. అయితే ఈ భావం ఈ సీన్లో ఉందా? లేదు, ఈ భావం ఉట్టి పడేలా ఈ సీను రూపకల్పన జరిగి వుంటే కృష్ణ గాడి క్యారక్టర్ చాలా పైకి లేచేది. పిరికివాడికి కోరికలుండ వచ్చుగానీ, ఆ కోరికలు తీర్చుకోవడానికి ప్రాణాల్నే పణంగా పెట్టేందుకు తెగిస్తున్నాడంటే, ప్రేమకోసం ప్రాణాలకే తెగిస్తున్నాడంటే ( లేకపోతే వీర ప్రేమ గాథ అని టైటిల్ ఎందుకు) అది అద్భుతమైన క్యారక్టర్ గ్రోత్ మాత్రమేగాక, యూనివర్సల్ గా కనెక్ట్ అయ్యే సెంటిమెంటల్ ప్లే. పిరికివాడైతే  ప్రాణాలకి తెగించేలా చూపడం, ధైర్యవంతుడైతే  ధైర్యం కోల్పోయే ఘట్టం ఎదురయ్యేలా చూపడం- ఇదే  ద్వంద్వాల పోషణతో ఆసక్తికరమైన డైనమిక్స్ ని క్రియేట్ చేయడమంటే.

        దురదృష్టవశాత్తూ ఈ భావం స్ఫురించేలా ఈ సీను చిత్రీకరణ జరగలేదు. అంతా  రొడ్డ కొట్టుడు చిత్రీకరణ అవడం వల్ల. ఇలా పణం అనే పవర్ఫుల్ ఎలిమెంట్ ఆవిరైపోయింది.

        3. మరి పరిణామాల హెచ్చరిక? హీరోకి ప్రత్యర్ధిలా కన్పిస్తున్న హీరోయిన్ అన్నే ఈ  ప్రపోజల్ పెట్టడంతో, ఆ అన్న రాజీ ధోరణికి వస్తున్నట్టే. కాబట్టి అతడితో ఇక ప్రమాదం లేనట్టే. పిల్లల్ని హైదరాబాద్ లో అప్పజెప్పేస్తే తన పెళ్లి చేసేస్తాడు, అంతే. ఇంకేముంది? ఇదే ఇంకో పాత్ర వచ్చి కృష్ణ గాడితో – నీకిదే అవకాశం, పిల్లల్ని అపాయం నుంచి నువ్వే కాపాడు, అప్పుడు ఆ అన్న తనే దారికొస్తాడు నీ  ధైర్యానికి మెచ్చి- అన్నాడనుకుందాం,   అప్పుడు ఆ ప్రకారం హీరో చేస్తే, తను తీసుకుంటున్న ఈ చొరవకి ఆ అన్నఎలా రియాక్ట వుతాడో నన్న శంక పీకుతూనే వుంటుంది. ఇదే పరిణామాల హెచ్చరిక అంటే!

        ‘శివ’ లో నాగార్జున జేడీ ని కొట్టడం తీవ్ర పరిణామాలకి  హెచ్చరికగా వుంటుంది.  వెళ్లి వెళ్లి మాఫియా రఘువరన్ మనిషినే కొట్టి కాలేజీ మీద ఆధిపత్యానికి సవాలు విసిరాడు. ఇక రఘువరన్ వైపు నుంచి ఏఏ ప్రమాదాలు ముంచుకొస్తాయోనన్న ఆదుర్దా సృష్టించాడు. ఇందుకే కదా ‘
What is character but the determination of incident? What is incident but the illumination of character? ―   అని  సాహిత్యంలో సైంటిస్టు లాంటి హెన్రీ జేమ్స్ అన్నాడు. 

       
ఇలాటిది కృష్ణ గాడి విషయంలో జరగ లేదు. ఎందుకంటే కొట్టేవాడు (అన్న) కాస్తా పెట్టే దోస్తుగా మారిపోయాడు. రివర్స్ లో ఇలాటి సీను ఎందుకు క్రియేట్ అయ్యిందంటే,  హీరో పాసివ్ పాత్ర  అవడం వల్లే. పాసివ్ పాత్ర తను సీన్ క్రియేట్ చేయదు. ఎవరో క్రియేట్ చేసిన  సీన్లోంచి అప్పనంగా తనప్రయోజనాలు నెరవేరుతూంటే సంతోషిస్తుంది. కాబట్టి ఈ  సీను ఎలాటి పరిణామాల హెచ్చరికకీ తావివ్వకుండా చప్పగా ఉండిపోయింది.  

        4. ఎమోషన్ విషయానికొస్తే పాసివ్ పాత్రకి కోరిక అప్పనంగా తీరుతూంటే ఎమోషన్  ఏముంటుంది. కోరికయితే వుంది, పణంగా పెట్టదానికేమీ లేదు, పరిణామాల హెచ్చరికకీ అలాటి చర్యకి పాల్పడలేదు. ఈ రెండూ లేకపోయాక నాల్గోదైన ఎమోషన్ లేదు.
పై నాల్గింట్లో కోరిక మాత్రమే వుంది, పణం, పరిణామాల హెచ్చరికా, ఎమోషన్ లేకపోవడంతో, వీటన్నిటి బలం తో ఏర్పడే గోల్ 75 శతం డొల్లగా మారింది. 

       
 k (కోరిక) 25% +  p (పణం) 25 % + ph (పరిణామాల హెచ్చరిక) 25 % + e ( ఎమోషన్) 25 % = 100% G (గోల్).
          వీటిలో p, ph, e  లు జీరో అయ్యాక ఆ నష్టం 75%. వెరసి G = 25 %. అంటే  చాలా బలహీన కథ.

         
హీరోకి గోల్ ఇవ్వడమంటే బంతి చేతిలో పెట్టి గోల్ కొట్టుకో పొమ్మనడం లాంటిది కాదు - ఇరుపక్షాల మధ్య ఆ బంతి చుట్టూ ఆవేశించి వుండే ఎలిమెంట్స్ ని కూడా పరిగణనలోకి తీసుకుని గోల్ ని నిర్మించడం. గోల్ కి స్ట్రక్చర్ లేకపోతే స్క్రీన్ ప్లేకి ఏ దిక్కూదిశా వుండవు.
                                       
        ***
ఇదే మోడల్?   
       పై పరిస్థితికి కారణమేమిటి? పాత్ర పాసివ్ కావడమే. పిరికివాడు పాసివ్ గానే ఉంటాడు నిజమే, అది ఎంతవరకూ అన్నది కాన్సెప్ట్ డిసైడ్ చేస్తుంది. గోల్ ఎదురయ్యవరకూ పాసివ్ గానే  వుండి  అక్కడ్నించీ యాక్టివ్ గా మారడమా, లేక గోల్ తోకూడా పాసివ్ గానే మొత్తం కథంతా కొనసాగడమా అనుకున్న అన్నది కాన్సెప్ట్ ని బట్టి వుంటుంది. పాత్ర గోల్ దగ్గరి నుంచీ యాక్టివ్ గా మారాలని సినాప్సిస్ లో రాసుకున్న కాన్సెప్ట్ అయితే, గోల్ వరకూ పాసివ్ గానే ఉంటాడు. ‘శివ’ లో నాగార్జున గోల్ సమయం ఆసన్నమయ్యే వరకూ జరుగుతున్న మైనర్ సంఘటనలకి ప్రేక్షకపాత్ర వహిస్తూ ఉంటాడు. ఎప్పుడయితే ఆ  మేజర్ సంఘటన ఎదురవుతుందో ఇక  యాక్షన్ లోకి దిగిపోతాడు. కథ మొత్తాన్నీ తన చేతిలోకి తీసుకుంటాడు. కృష్ణ గాడి విషయంలో ఒకవేళ ఆసాంతం నవ్వించే వెర్రి చేష్టలతో పిరికి పాత్రగానే కథంతా విన్యాసాలు చేస్తూ, చివరకి యాక్సిడెంటల్  హీరో ఐపోవడం అనే కాన్సెప్ట్ అనుకుంటే ఇదీ ఓకేనే. కాబట్టి సినాప్సిస్ లో కాన్సెప్ట్ ఏమని రాసుకున్నారు? ఈ రెండు మోడల్స్ కాదని సినిమా చూస్తే తెలుస్తోంది. ఈ రెండూ కాక, లేని- ఉండని - మూడో మోడల్ ని ఎలా కనిపెట్టి రాశారు? ఆ రహస్యం చెపితే నేర్చుకునే వాళ్ళు చాలా మంది వుంటారు హాలీవుడ్ దాకా.
                                       
        ***
దివ్యాభరణం  గల్లంతు 
       ఒక్క నాల్గు పేజీల సినాప్సిస్ స్క్రీన్ ప్లే స్ట్రక్చర్  సహితంగా రాసుకుంటే తప్పులన్నీ  తెలిసిపోతాయి. వాటిని సరిదిద్దుకోవడం ఇక్కడే ఈజీ, సవ్యమైన సినాప్సిస్ వచ్చేదాకా. సినాప్సిస్ నస పెడుతోందంటే సినిమా ఎన్ని  ఆటలేసినా కష్టపెట్టకుండా వుండదు. ఆటలు వేస్తున్న కొద్దీ తప్పులన్నీ ఒకటొకటే అరిగిపోయి, సినిమా తేటగా మారే  ఏర్పాటు ప్రకృతి
కల్పించలేదు. అది పిండి మరకే కల్పించింది, పొట్టూడి పోయి పిండి తేటగా పడేలా.
        పాత్రపట్ల స్పష్టత లేకపోవడం వల్ల మొదటి మూలస్థంభం దగ్గర్నుంచీ కూడా ఏ  నిర్వచనాలకీ అందని పాసివ్ పాత్రగా మారిపోయాడు. పాసివ్ పాత్రలు  రెండే రకాలు - విషాద పాత్రలు, ఫుల్ రేంజిలో కామెడీ పాత్రలు. ఈ రెండూ కాక ఇంకోటి లేదు. కాబట్టి ఒక యాక్షన్ హీరోలా మారిపోయినట్టు పిల్లల్ని తీసుకుని పారిపోతున్నప్పుడు,  తమ మీద దాడులు చేస్తూ వెంటపడుతున్న కొత్తగా ఈ మాఫియా గ్యాంగ్ ఎవరో, ఎందుకు వెంటబడుతున్నారో ఎక్కడా తెలుసుకునే ప్రయత్నం చెయ్యకపోవడం, తనుకాకుండా ప్రత్యర్ధుల్ని ఆత్మరక్షణలో పడేట్టు చేయకపోవడం  విషాద పాత్ర కిందే లెక్క.  ఏమంటే వాళ్ళు దాడి చేసినప్పుడల్లా ఆత్మరక్షణ చేసుకుంటూ ఎదురు దాడి చేస్తూంటాడు.  చూడ్డానికి ఇది హీరోయిజంతో గొప్ప యాక్షన్ కి పాల్పడుతున్నట్టే  వుంటుంది. కానీ మూలంలో ఆ యాక్షన్ దివాలాకోరు రియాక్షనే. ఎవరో దాడి చేస్తూంటే దాన్ని తిప్పి కొడుతూ అప్పటికప్పుడు తాత్కాలికంగా క్షేమంగా ఫీలవడం.. 

         ‘అశోక్’ లో ఎన్టీఆర్ తన మీద దాడులు చేస్తున్న దెవరో, ఆ విలన్ తననెందుకు టార్గెట్ చేశాడో తెలుసుకోవాలనుకోడు. దాడి జరిగినప్పుడల్లా తిప్పి కొట్టడమే పనిగా పెట్టుకుంటాడు. దీన్ని పాసివ్ రియాక్టివ్ క్యారక్టర్ అంటారు. ఇది కథని రక్తి  కట్టించదు. ఎందుకంటే కథ తన చేతిలో వుండదు, దురదృష్టవశాత్తూ విలన్ చేతిలో వుంటుంది. ఇతరపాత్రలు కథ నడిపిస్తూంటే దాన్నిబట్టి వెళ్ళేవాడు సొంతవ్యక్తిత్వం లేని పాసివ్ క్యారక్టరే. 

        కృష్ణగాడు యాక్టివ్ పాత్రయివుంటే ఆ  దాడులు చేస్తున్న దెవరో, ఎందుకు చేస్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేసేవాడు. వూళ్ళో ఫ్యాక్షనిస్టులు కాక, ఇంకెవరో ముఠా కి దీంతో సంబంధమేమిటో ప్రమాదంలో వున్న వాడు తెలుసుకోకుండా ఎలా ఉంటాడు. ఇది కూడా అర్ధం జేసుకోలేని పక్కా  వెర్రి బాగులవాడి క్యారక్టరైజేషన్ అయితే,  ఆ పాత్ర స్వభావం కొద్దీ కామెడీ ఆఫ్ ఎర్రర్స్ తో ఈలవేసుకుంటూ సాగిపోతూనే వుండొచ్చు.

        కానీ  జరిగిందేమిటంటే- సెకండాఫ్ మొదట్నించీ కృష్ణ గాడు పిరికి వాడనే క్యారక్టరైజేషన్ ని వదిలేశారు! ఇక్కడే వచ్చింది చిక్కంతా. నాని గత సినిమా ‘భలే భలే మగాడివోయ్’ లో  మతిమరుపు అనే పాత్రచిత్రణ ని చివరివరకూ నిభాయించారు. ఒక  హాస్య పాత్రకి ఏ లోపమైతే ఆభరణంగా భాసిస్తుందో  అదే కథకి వెన్నెముకవుతుంది. దాన్నెలా విరిచేస్తారు?
                                               
***
అసలు కథ? 
       కృష్ణ గాడు కేవలం ఆత్మరక్షణ చేసుకునే సొంతవ్యక్తిత్వం లేని పాసివ్ – రియాక్టివ్ క్యారక్టర్. ఇందుకే మొదటి మూలస్థంభం దగ్గర తను సృష్టించాల్సిన సంఘటనని తను సృష్టించలేకపోయాడు. ఆ ఫ్యాక్షనిస్టు ఇంటి మీద దాడి జరుగుతున్నప్పుడయినా ధైర్యం తెచ్చుకుని - ఓ నల్గురు దుర్మార్గుల్ని చంపేసి వుంటే, పిరికితనమంతా వదిలిపోయి యాక్టివ్ గా మారిపోయే వాడు. మొదటి మూలస్థంభం వరకూ హీరో పాసివ్ గా అమాయకంగా ఉన్నంతవరకూ అభ్యంతరం లేదు. కానీ అక్కడ్నించీ యాక్టివ్ గా మారకపోతే పాత్రకి అర్ధం లేదు. 

        ‘కోయీ మిల్ గయా’ లో హృతిక్ రోషన్ మానసికంగా దుర్బలుడు. ఆ దుర్బలత్వం తోనే గోల్ కోసం సంఘర్షిస్తూ ఉంటాడు. ఇది భౌతికంగా బాహిర్ సమస్యతో చేసే పోరాటం.  అంతర్గతంగా ఆ దుర్బలత్వాన్ని జయించాలనుకోవడం మానసికంగా అంతర్గత సమస్యతో చేసే పోరాటం. ఇలా ఒక అర్ధవంతమైన ద్వంద్వాల పోషణతో చివరికి తన  దుర్బలత్వాన్ని జయించి ప్రత్యర్ధుల్ని చిత్తు చేస్తాడు. ఇలాటి పర్సనాలిటీ లోపాలున్న క్యారక్టర్ కేస్ స్టడీకి ‘కోయీ మిల్ గయా’  మంచి సబ్జెక్టు.

        కృష్ణ గాడు మొదటి మూల స్థంభం దగ్గర హీరోయిన్ అన్న క్యారక్టర్ కి దిమ్మ దిరిగేలా తనే ఓ నల్గుర్ని చంపేసి వుంటే పిరికితనం వదలడానికీ, యాక్టివ్ గా మారడానికీ అదొక మంచి అవకాశమే కాకుండా, ఇది కళ్ళారా చూసి దిమ్మదిరిగిన హీరోయిన్ అన్న కూడా, హీరో మీద ఇప్పుడు పూర్తి నమ్మకం కలిగి పిల్లల్ని అప్పజెప్పినా అర్ధంపర్ధం వుంటుంది. 

        అయితే ఇక్కడ మరో చిక్కు వుంది. మొదటి  మూలస్థంభం దగ్గర కృష్ణ గాణ్ణి యాక్టివ్ గా మార్చి,  పిల్లల బాధ్యత అప్పజెప్పినా, అది మొదలెట్టిన అసలు కథ అవుతుందా? కచ్చితంగా కాదు. మొదలెట్టిన  ప్రేమకథకి ఉపకథ అవుతుందా? కచ్చితంగా కాదు. 

        విప్పుతున్న కొద్దీ ఇలా ఇందాకట్నించీ, ఒక దాంట్లోంచి ఒకటి పొరలుపొరలుగా ఘోరమైన తప్పులు పైకి తేలుతున్నాయి కదూ?  సినిమా కంటే ఈ మొదటి మూలస్థంభం పోస్ట్ మార్టమే  థ్రిల్లింగ్ గా వుంది...మృతప్రాయమైన మూలస్థంభం ఇంతే. భావి  తరాల    పరిశోధనల కోసం మమ్మీగా తయారు చేసి పెట్టాల్సిందే దీన్ని!
                                                ***



ఎందరో కృష్ణులు- ఎంతో గొడవ!
     
     సెకండాఫ్ లో ఎప్పటి దాకానో ఈ కొత్త కథతో తెగిపోయి ఐపు లేకుండా పోయిన హీరోయిన్ తో ఇంకా రోమాంటిక్ థ్రిల్లర్ ఏమిటి? ప్రేమగాథ ఏమిటి? పిల్లలుంటే వుండనీ హీరోతోబాటు, హీరోయిన్ ని కూడా హీరో ఎత్తుకొచ్చి వుంటే, కథ తెగకుండా మొత్తం వీళ్ళం దరితో  కలిపి ఏకత్రాటిపై సాగేది కాదా?

       ఒకళ్ళు చెప్తే చేసే వాడు యాక్టివ్ హీరో అవడు. యాక్టివ్  హీరో ఓ నల్గుర్ని చంపి పారేసి  హీరోయిన్ ని ఎత్తుకుని  పారిపోవడం రోమాంటిక్  థ్రిల్లర్ జానర్ లక్షణం. ప్రేమగాథ అన్నాక సంఘటనలు లవర్స్ ఇద్దర్నీ కనెక్ట్ చేసేవి గానే వుండాలి కదా? ఒకరికోసం ఒకరు చేసుకునే సాహసాలుగానే వుండాలి కదా? మధ్యలో పిల్లలు వచ్చి హీరోమీద పడిపోవడమేమిటి? 

        పిల్లకాయలొచ్చి కథని హైజాక్ చేశారు. రెండుగా చీలిపోయింది కథ. హీరోయిన్ పక్కకెళ్ళి పోయింది. ఏకసూత్రత దెబ్బ తింది. పిల్లలు రంగంలో కొచ్చారు. కొత్త కథ మొదలయ్యింది. పిల్లలతో పాసివ్ వీర యాత్రగా మారిపోయింది. సెకండాఫ్ సిండ్రోం కింద తిరగ బట్టింది. నిట్టనిలువునా స్క్రీన్ ప్లే ఫ్రాక్చరైంది. ఇన్ని వ్యాధులు బయటపడుతున్నాయి.

        ఇంతేనా? ఇంకోటి కూడా వుంది. అన్న అనే ప్రత్యర్ధి అయిపోయాడు, ఫ్యాక్షనిస్టులూ అయిపోయారు. ఇప్పుడు మాఫియాలు వచ్చేశారు. ఒక సినిమాకి ఒకే విలన్ కదా ఉంటాడు? ఒకటవ కృష్ణుడుగా హీరోయిన్ అన్న, రెండో కృష్ణులుగా ఫ్యాక్షనిస్టులు, మూడో నాల్గో కృష్ణులుగా మాఫియాలు, టెర్రరిస్టులూ..ఏమిటిది? స్థిరంగా ఒక్కడూ లేకుండా ఇంతమంది ఆయారాం గయారాంలా? ఒక్కో జానర్ నుంచి ఒక్కో విలన్ ని తెచ్చుకుని ఒకే సినిమాలో ఇన్ని కథలు చెప్పడమా? 

        ఇదంతా కలిపి అత్యంత క్రూడ్ గా, భరించలేని తలపోటు వచ్చేలా అరుపులతో, శబ్దాలతో హార్డ్ కోర్- వయొలెంట్ నాటు- మోటు - ‘ఎంటర్ టైనర్’ గా తయారుచేయడమా?
                                                ***

కథెందుకు తెగాలి? 


     సెకండాఫ్ లో ఎప్పటి దాకానో ఈ కొత్త కథతో తెగిపోయి ఐపు లేకుండా పోయిన హీరోయిన్ తో ఇంకా రోమాంటిక్ థ్రిల్లర్ ఏమిటి? ప్రేమగాథ ఏమిటి? పిల్లలుంటే వుండనీ హీరోతోబాటు, హీరోయిన్ ని కూడా హీరో ఎత్తుకొచ్చి వుంటే, కథ తెగకుండా మొత్తం వీళ్ళం దరితో  కలిపి ఏకత్రాటిపై సాగేది కాదా?

        మొత్తం కుటుంబాన్నే హతమార్చడానికి వచ్చిన ఫ్యాక్షన్ గ్యాంగ్ హీరోయిన్ని ఎందుకు వదిలి పెడతారు? హీరోయిన్ కోసం ఆ గ్యాంగే వెంటపడుతూ వుంటే, ఇతర కృష్ణుల జానర్ల జాతర తప్పి- మొత్తం ఉన్న హీరో- హీరోయిన్ – విలన్ పాత్రలూ ఏకత్రాటి పైకొచ్చి స్టోరీ పాయింటుకి న్యాయం చేసే వాళ్ళు కాదా?

        ఈ పారిపోవడాలూ వెంట పడ్డాలతో వయొలెన్స్ తగ్గి, ఒక హిలేరియస్ కామిక్ థ్రిల్లర్ లా ఎంటర్ టైన్ చేసేది కాదా? 1993లో మహేష్ భట్ దర్శకత్వం వహించిన సూపర్ హిట్ లైటర్ వీన్ ఎంటర్ టైనర్ ‘హమ్ హై రాహీ ప్యార్ కే’ ( మేము ప్రేమ ప్రయాణికులం) లాగా పిరికివాడి ప్రేమకథ కొత్త గాలితో సరదా సరదాగా వుండేది కాదా? 


-సికిందర్

cinemabazaar.in

17, ఫిబ్రవరి 2016, బుధవారం

స్క్రీన్ ప్లే సంగతులు!


రైటర్స్ కార్నర్


    ఒక రోజు సెట్ ని తీర్చిదిద్దడంలో తీవ్ర కృషి చేస్తున్న ఓ కుర్రాణ్ణి చూసి అతను ఆర్ట్ డైరెక్టరా అనడిగారు కన్నడ హీరో రవి చంద్రన్. అతను అసిస్టెంట్ డైరెక్టరని ఎవరో చెప్పడంతో ఆశ్చర్యానికి గురయ్యారు. వెంటనే ఆ కుర్రాణ్ణి పిలిపించుకుని తను తీయబోయే సినిమాకి నియమించుకున్నారు. ఏడువేల జీతంతో స్క్రిప్టు, డైలాగులు రాసే పని అప్పజెప్పడంతో ఎంతో థ్రిల్ ఫీలయయ్యాడా కుర్రాడు.  అలా 1995లో రవిచంద్రన్ నిర్మించి, దర్శకత్వం వహించి, నటించిన ‘పుట్నంజా’ అనే హిట్ కి ఆ కుర్రాడు డైలాగులు రాశాడు. రాస్తూండగానే జీతం పెంచి 13 వేలు ఇచ్చారు  రవిచంద్రన్. ఆ సినిమా విడుదల రోజున ఆ కుర్రాడు బైక్ వేసుకుని థియేటర్ కి వెళ్తే మధ్యలో  పెట్రోల్ అయిపోయింది. బండి నెట్టుకుంటూ  రవిచంద్రన్ ఆఫీసు కెళ్ళాడు. రవిచంద్రన్ లోపలికి  పిలిచి జీతం ముట్టిందా అనడిగారు. చాలాకాలం క్రితం ముట్టిందన్నాడు కుర్రాడు. ఈ రోజు కూడా ముట్టలేదా అంటే ముట్ట లేదన్నాడు. చేతిలో లక్షా ముప్పయి వేలు పెట్టారు రవిచంద్రన్. షాక్ కి గురయిన కుర్రాడు ఆ డబ్బుతో ఇంటికి పరిగెడితే, ఎక్కడో దొంగతనం చేశాడని భార్య అనుమానించింది. కానీ ఆ సినిమా అతణ్ణి  స్టార్ ని చేసింది. వెంటవెంటనే రెండు సినిమాలకి దర్శకత్వం వహించాడు. అవి ‘టపోరీ’, ‘అర్ధ’ అనే సినిమాలు. ఇంకో 4 వేల ఎపిసోడ్స్ వివిధ సీరియల్స్ కీ కూడా దర్శకత్వం వహించేశాడు.  ‘అర్థ’ కి కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ దర్శకుడు, ఉత్తమ చిత్రం అవార్డులతో గౌరవిస్తే,  2011 లో ప్రకాష్ రాజ్ తో తీసిన ‘పుట్టక్కన హైవే’ కి ఉత్తమ ప్రాంతీయ చిత్రం అవార్డుతో సత్కరించింది కేంద్ర ప్రభుత్వం.
          మొత్తం 10 సినిమాలకి రచన, దర్శకత్వం, కొన్నిటికీ నిర్మాణమూ చేపట్టిన కెమికల్ ఇంజనీర్ అయిన బి. సురేష్, కొన్ని సినిమాల్లో నటించారు కూడా.  తాజాగా ప్రకాష్ రాజ్ తో నిర్మించి దర్శకత్వం వహించిన ‘దేవర నాదల్లి’’ ఫిబ్రవరి అయిదున విడుదలయ్యింది. సహాయ పాత్రగా నటించిన ‘బద్మాష్’ 26 వ తేదీన విడుదలవుతోంది. ఈ నేపధ్యంలో ఆదిత్యా సన్వాల్ కి ఆయనిచ్చిన ఇంటర్వ్యూ  పాఠం...
మీరు స్క్రిప్టులు రాయడం ఎప్పుడు ఎలా ప్రారంభించారు?
        నా క్రియేటివ్ జర్నీ నాటకాలతో ప్రారంభమయ్యింది. నాటకాలు చేస్తున్నప్పడు పాపులర్ కన్నడ నటుడు, దర్శకుడు, రచయితా శంకర్ నాగ్ ని కలిశాను. ఆయనే నాకు సినిమాల్లో అవకాశాలు ఇప్పించారు. ఘోస్ట్ రైటర్ గా చాలా స్క్రిప్టులు రాశాను. 1988 లో బీహెచ్ఈఎల్ లో నా రెగ్యులర్ జాబ్ మానేసి ఫుల్ టైం రైటర్ గా మారాను. రైటర్ గా నా మొదటి సినిమా ‘మిథిలేయ సీతేయరు’. అప్పట్నుంచీ నాకు అవకాశాలు బాగా రాసాగాయి. 1992 వరకూ ఆర్టు తరహా సినిమాలే రాస్తూ వున్నాను అసిస్టెంట్ డైరెక్టర్ గా వుంటూనే. రవి చంద్రన్ గారు నన్ను పికప్ చేసినప్పటి నుంచీ కమర్షియల్ సినిమాల్లోకి వచ్చేశాను. ఇది నాకు చాలా ఆర్ధిక స్వాతంత్రాన్ని ఇచ్చింది, కానీ క్రియేటివ్ స్వేచ్ఛన్ని మాత్రం హరించి వేసింది.

మీ రైటింగ్ ప్రాసెస్ గురించి చెప్పండి. ఎంత మేరకు అది రీసెర్చి ప్రధానంగా వుంటుంది?
        సినిమాలకి సంబంధించి నా రైటింగ్ ప్రాసెస్ అంటే రైట్- రీరైట్- రీరైట్ మోర్...ఇంతే! నా అన్ని సినిమా స్క్రిప్టులూ ఎన్నో సార్లు తిరగరాసినవే. సబ్జెక్టు పైన చేసే రీసెర్చి నిరంతరంగా ఆ ఇన్ పుట్స్ కి స్థానం కల్పించే పరిస్థితి తెస్తోంది. ఇందువల్లే అసంఖ్యాక మైన రీరైటింగ్స్. ‘పుట్టక్కన హైవే’. ‘దేవర నాదల్లి’ సినిమాల విషయంలో యంగ్ టీం నాకు రీసెర్చి విషయంలో ఎంతో తోడ్పడ్డారు. ఎక్కడెక్కడినుంచో కొత్త  కొత్త సమాచారాన్ని తీసుకుని నా దగ్గరికి వచ్చేవాళ్ళు. ఈ టీముతోనూ, ఈ సబ్జెక్టు లపైన నిపుణులతోనూ కూలంకషంగా చర్చించే వాణ్ణి. ఆ తర్వాతే స్క్రిప్టులో వాటికి చోటు కల్పించే వాణ్ణి. ఒక అంశంపై ప్రతీ చర్చా భిన్న కొణాల వైపు నుంచి జరిగేది. ఈ చర్చల ఆధారంగా కొత్త వెర్షన్లు తయారు చేసేవాళ్ళం కథలకి. ఇక స్క్రిప్టులు పక్కాగా వచ్చినట్టు టీము ఫీలవగానే కాస్టింగ్ ఎంపికకీ, లొకేషన్ హంట్ కీ వెళ్ళేవాళ్ళం. ఇది చాలా  ఎక్కువ టైము తీసుకునేది. కాస్టింగ్, లోకేషన్స్ ఫైనలైజ్ అయ్యాక స్క్రిప్టుని మళ్ళీ రీరైట్ చేసేవాళ్ళం. ఈసారి డైలాగుల్లో వచ్చే వివిధ యాసలకి కచ్చితత్వాన్ని దృష్టిలో పెట్టుకుని. మూవీ మేకింగ్ మా మొత్తం టీము ఉమ్మడిగా తీసుకునే నిర్ణయం మీదే ఆధారపడేది. షూట్ చేయాల్సిన ఫైనల్ వెర్షన్ ని టీం మొత్తం కలిసి నిర్ణయించేది. ఇది నిర్ణయించాక, తిరిగి ఫైనలైజ్ చేసిన లోకేషన్స్ కెళ్ళి, ఫోటో గ్రాఫ్స్ తీసే వాళ్ళం. 800 షాట్లుగా సినిమా తియ్యాలనుకుంటే,  ఆ 800 షాట్లు ఎలా ఉండాలో 800 ఫోటో గ్రాఫ్స్ తీసేవాళ్ళం. వీటితో ఫైనల్ షూట్ ని ప్లానింగ్ చేసేవాళ్ళం. నా మూవీ  మేకింగ్ ప్రాసెస్ చాలా నెమ్మదిగా సాగుతుంది. అందుకనే చాలా తక్కువ సినిమాలు తీశాను.

మీ సినిమాలు సామాజిక స్పృహ గలవి. సబ్జెక్టుల్ని  మీరెక్కడ నుంచి తీసుకుంటారు- సమాజం లోచి యధాతధంగానా, లేక సమాజంలో జరుగుతున్న వాటికి ని కల్పన చేశా?
       
నాటకాలు, వీధి నాటకాలూ వేస్తున్నప్పుడు ఆ ఇతివృత్తాలన్నీ చుట్టూ వుండే  సమాజంలోంచి వచ్చినవే. ప్రయాణాలంటే నేను ఇష్ట పడతాను. సమాజంలో అట్టడుగు వర్గాలతో ఇంటరాక్ట్ అవడాన్ని కూడా ఇష్టపడతాను. సమాజంలో ప్రతీ ఒక్కరికీ ఒక్కో కథ వుంటుంది. వీటి గురించి నోట్స్ రాసుకుంటాను. ప్రస్తుతం నేను ప్లాన్ చేస్తున్న సినిమా కథ రైతులు- వాళ్ళు  వాడే   క్రిమిసంహారక మందుల గురించి. దురదృష్టమేమిటంటే అవే క్రిమి సంహారక మందులతో వాళ్ళు ప్రాణాలు తీసుకుంటున్నారు. ఇది నన్ను   బాగా కదిలించిన సామాజిక సమస్య. ఇంకో కథ మత సామరస్యం గురించి...ఇవ్వాళ మతసామరస్యమే ఉద్రిక్త పరిస్థితులకి లోనవుతోంది.

         
ఒక సమస్యని తీసుకున్నాక ముందు కథగా రాసుకుంటాను. ఆతర్వాత మిత్రులతో చర్చించి వాళ్ళ అభిప్రాయాలు తీసుకుంటాను. దాన్ని పూర్తి స్థాయి స్క్రిప్టుగా రాస్తున్నప్పుడు ఇది సినిమాగా తీయ వచ్చా, సీరియల్ గా తీయాలా, లేక నాటకంగా వేయవచ్చా నిర్ణయిస్తాను.

గిరీష్ కాసరవల్లి, పి శషాద్రి వంటి దర్శకులు సామాజిక స్పృహగల
సినిమాలెన్నో  తీశారు. అయితే వాటిని విడుదల చేసుకోవడానికి చాలా ఇబ్బందులు పడ్డారు. కారణ మేమిటంటారువిశాల ప్రాతిపదికన ప్రేక్షక బాహుళ్యంలోకి ఇటువంటి సినిమాలని చేరవేయాలంటే ఏంచేయాలంటారు?
         
వారిద్దరి సినిమాలని నేను చాలా ఇష్టపడతాను. వాళ్ళ ప్రయాణంలో వాళ్ళు పట్టిన పట్టు వీడ లేదు. వాళ్ళ సినిమాల్ని రెగ్యులర్ థియేటర్లలో విడుదల చేసుకోవడానికి ప్రయత్నించే వాళ్ళు. అవి కొద్ది రోజుల కంటే ఎక్కువ ఆడేవి కావు. బహుశా అందుక్కారణం వాళ్ళ కథలు చెప్పే పధ్ధతి. కమర్షియల్ ఫ్రెండ్లీగా ఉండేట్టు వాళ్ళెప్పుడూ సినిమాల్ని ఎమోషనలైజ్ చేయలేదు. మెలోడ్రామా, డ్రామా అనేవి కూడా ఇష్టపడే వాళ్ళు కాదుఅందువల్ల ప్రేక్షకులకి  కథల్లో ఇన్వాల్ మెంట్ అసాధ్యంగా వుండేదిపెద్ద పోటీగా కమర్షియల్ సినిమాలు వున్నప్పుడు కథల్ని తరహాలో చెప్తే ఆదరణ ఎక్కడ వుంటుంది

         
కానీ గిరీష్, శేషాద్రిల సినిమాల్ని కర్ణాటకలో  చాలా నగరాల్లో ప్రైవేట్ ప్రదర్శనలుగా వేసేవాళ్ళు ప్రదర్శనలకి  ఒక ప్రత్యేక బృందం ప్రేక్షకులు వుండే వాళ్ళు. మేధావులు అనొచ్చు. కొన్ని సంఘాలు  సినిమాలు ప్రదర్శించేవి. ఫిలిం సొసైటీల ఉద్యమానికి కొనసాగింపుగా సంఘాలు పనిచేసేవి. అలా వచ్చిన సొమ్ములు నిర్మాతలకి పంపేవి. తరహా సినిమాలు సాధారణ ప్రేక్షకుల్లోకి తెసికెళ్ళడం అసాధ్యం. వాటి పోషణకి సంఘాల మీదే ఆధారపడాలి.

 కన్నడలో 30 శాతానికి పైగా రీమేక్స్ ఉంటున్నాయి. దీనిపై మీ అభిప్రాయంఫ్రెష్  గా, డిఫరెంట్ గా వున్న స్టోరీస్ పట్టుకుని కొత్త వాళ్ళు వస్తే వాళ్ళని ప్రమోట్ చేయడానికి మీదగ్గర మార్గాలున్నాయి

     రీమేకులు ఒక శాపమే. కానీ రీమేకులే బాగా హిట్టవు తున్నాయి. దీంతో మరిన్ని రీమేకులు వస్తున్నాయి. కన్నడలోనే కాదు, హిందీ సహా ఇతరానేక భాషల్లో రీమేకుల సందడి నడుస్తోంది. అదేపనిగా వీటిని చూస్తున్న ప్రేక్షకులకీ  విసుగెత్తడం లేదు. కొత్త వాళ్ళని ప్రమోట్ చేయడం గురించి...దీని అవసరం చాలా వుంది. మా మీడియా హౌస్ స్టూడియో సంస్థకొత్త వాళ్లతో ప్రాక్జెక్టుకింద ఇద్దరు కొత్త దర్శకులకి అవకాశా లిచ్చాం. సంవత్సరం మరో ఇద్దరికి  ఇస్తాం. మొత్తం సినిమా పరిశ్రమా యువ టాలెంట్స్ ని ప్రోత్సహించడం చాలా అవసరం. వాళ్ళు కొత్త తరహా కథా కథనాలనే కాదు, కొత్త శక్తిని కూడా పరిశ్రమలో నింపుతారుప్రతీ పరిశ్రమా కొత్త టాలెంట్స్ కి ప్రయోగశాల కావాలి. షార్ట్ ఫిలిమ్స్ కొత్త తరహ కథా కథనాలకి మాత్రమే ప్రయోగశాలలు  కావు, అవి కొత్త టాలెంట్స్ కి లైబ్రరీలు వంటివి కూడాషార్ట్ ఫిలిం మేకర్స్  ఎక్కువ ప్రాధాన్య మివ్వాలి.

కన్నడ లో డబ్బింగులపై  నిషేధం ఇప్పటికీ వివాదా స్పదంగానే వుంది. ఒకవైపు కన్నడ సినిమాల్ని ఇతర భాషల్లోకి డబ్ చేస్తూనే కన్నడలో డబ్బింగులని  నిషేధించడం విచారకరం కాదంటారా?
         
నా అభిప్రాయంలో ఒక భాష నుంచి ఇంకో భాషలోకి డబ్బింగ్ ( లిప్ సింక్ డబ్బింగ్) చేయడం నేరంతో సమానం. ఒక దర్శకుడు  ఉద్దేశపూర్వకంగా కథనీ, నేపధ్య వాతావరణాన్నీ సెట్ చేస్తాడు. ఇందులో నటించే నటుడు వొరిజినల్ వాతావరణంలో ఇమిడిపోయి నటించి, పాత్రకి న్యాయం చేస్తాడు. నేపధ్యంలో వేరొకరు వచ్చి వేరే భాషలో నటుడి గొంతుని అనుకరించడమంటే మొత్తం  సెట్ చేసిన వాతావరణాన్నీ, కథనీ కిల్ చేయడమే అవుతుంది. దర్శకుణ్ణీ నటుణ్ణీ అవమానించడమే అవుతుంది

         
మన  నాట్య శాస్త్రంలో నటనని వాచికం, ఆంగికం, ఆహార్యం, సాత్వికం  అనే నాల్గు డైమెన్షన్లుగా నిర్వచించారు. నాలుగూ కలగలిసిపోతేనే అది అభినయ చతుర్ధం అవుతుంది. అలాంటప్పుడు  ఒక నటుడి వాచికాన్ని మరొకరు వచ్చి తన గొంతుతో మార్చేస్తే అప్పుడా మిగిలిన మూడు డైమెన్షన్లూ వికలమై పోతాయిఅప్పుడా ఒరిజినల్ నటుడి నటనకి అర్ధమే లేకుండా పోతుంది. ఇందువల్ల  డబ్బింగుల్ని నేనెప్పుడూ సమర్ధించను. ఇతర భాషల సినిమాల్ని డబ్బింగులు కాక, సబ్ టైటిల్స్ తో వున్నవే చూడమని నేను చెపుతూంటాను. ఇప్పటి వరకూ నాల్గు సినిమాలకి నేను దర్శకత్వం వహించాను, మరో ఆరు సినిమాలు  నిర్మించాను. దేన్నీ డబ్బింగ్ చెఉఅలెదు. సబ్ టైటిల్స్ తోనే ప్రపంచవ్యాప్తంగా అవి వెళ్ళాయి.

         
ఇక మీరన్నట్టు కన్నడ మార్కెట్లో ఇతర భాషల డబ్బింగులపై  అధికారికంగా నిషేధమూ లేదు. కానీ  1964 నుంచీ ఇతరభాషల సినిమాలని కన్నడలోకి డబ్బింగులు చేయడం  లేదు. కన్నడ సినిమా పరిశ్రమకి దీంతో ఏం సంబంధం లేదు. 1964లో కొందరు ప్రముఖ సాహిత్యవేత్తలకి ప్రజలూ తోడై డబ్బింగులకి వ్యతిరేకంగా ఉద్యమించారు, అంతే మధ్య కొందరు ఐటీ ప్రొఫెషనల్స్ సిసిఐ ( కాంపిటేషన్ కమిషన్ ఆఫ్  ఇండియా) కి కంప్లెయింట్ చేశారు. సిసిఐ చర్య తీసుకుంటే డబ్బింగులపై వున్న నిషేధం తొలగిపోవచ్చు. కానీ ఒక్క సిసిఐ ఆదేశంతో ఆరు దశాబ్దాలుగా అలవాటు పడిన సాంప్రదాయం తొలగిపోతుందనుకోను. కొందరు  తెగించి డబ్బింగులకి పాల్పడవచ్చు. అయితే   ఆర్నాల్డ్ ష్వార్జ్ నెగ్గరో, అమితాబ్ బచ్చనో డబ్బింగుల్లో వచ్చేసి తమది కాని గొంతుకలతో మాట్లాడుతూంటే కన్నడ ప్రేక్షకులు భరించలేరు.  

మీ  కొత్త సృష్టిదేవర నాదల్లిగురించి చెప్పండి...

 
         ఇది మల్టీ టైం లైన్ నెరేటివ్ మూవీ. ఒక న్యూస్ పేపర్ క్లిప్పింగ్  లోంచి ఐడియా పుట్టింది. 1998 లో దీన్ని చదివి కత్తిరించి పెట్టుకున్నాను. అప్పట్నుంచీ  ఎన్నో వెర్షన్లు రాశాను. ఫైనల్ గా 2014 లో స్క్రిప్టు ని లాక్ చేశాను. సంవత్సరం ఆఖర్లో ప్రొడక్షన్లోకి దిగాను. సమాజం తాను  ఏర్పరచిన చట్టాలకే తానెలా భిన్న భాష్యాలు చెప్తుందో ఇందులో చూపించదల్చుకున్నాను. దర్శకుడిగా మల్టీ టైం లైన్  కథనం నాకు కత్తిమీద సామే. దీన్ని పూర్తిగా ఎంజాయ్ చేశాను

మీకు స్ఫూర్తి నిచ్చిన దర్శకుల గురించి చెప్పండి?
         
అకిరా కురసోవా, ఇంగ్మార్ బెర్గ్ మాన్, ఎమిర్ కుస్తురికా, కిమ్ కీ డాక్, గిరీష్ కాసరవల్లి ...ఇలా ఎందరో. మంచి సినిమా, చెడ్డ సినిమా అని వుండవు నా దృష్టిలో. చూసిన ప్రతీ సినిమా నుంచీ ఏదో ఒక విజువల్ కమ్యూనికేషన్స్ పాఠాన్ని నేర్చుకుంటాను...

-సికిందర్
cinemabazaar.in