రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

30, జనవరి 2016, శనివారం

వీకెండ్ కామెంట్

       ఏర్ లిఫ్ట్’ లిఫ్ట్ చేసిందెవర్ని? 
    నిజమే..’ఏర్ లిఫ్ట్’  సినిమా చూస్తున్నంత సేపూ కువైట్ సంక్షోభంలో భారత ప్రభుత్వపు ఉనికి కోసం అడుగడుగునా వెతుక్కోవాల్సి వస్తుంది...1990 లో కువైట్ మీద ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ దాడికి ఆజ్ఞాపించిన చారిత్రక ఘట్టంలో అక్కడ చిక్కుకుని అల్లల్లాడిన లక్షా డెబ్బై వేలమంది భారతీయుల్ని, సినిమా క్లయిమాక్స్ వరకూ  వాళ్ళ ఖర్మానికి వదిలేసి, భారత ప్రభుత్వం ఏం చేస్తోందా అన్న సందేహం మనల్ని పీడించక మానదు.

కేవలం దర్శకుడు రాజా కృష్ణ  మీనన్ సృష్టించిన  కల్పిత పాత్ర అయిన రంజిత్ కటియాల్ ( అక్షయ్  కుమార్ ) మొత్తం బాధ్యతనంతా తన భుజానేసుకుని, అక్కడ చిక్కుకున్న  భారతీయుల్నందర్నీ ఇండియాకి తరలించే బృహత్ ప్రణాళిక రచించినట్టు చూపించారు. చిట్ట చివర్లోనే  భారత ప్రభుత్వపు రెడ్ టేపిజం కొలిక్కివచ్చి విమానాల్ని పంపినట్టు చూపించారు. విదేశాంగ మంత్రిని చాలా సోమరి వ్యక్తిలా, కువైట్ సంక్షోభం కంటే ఇంకా చాలా ముఖ్యమైన పనులేవో పెట్టుకుని  ఫీలయ్యే  వ్యక్తిలా చూపించారు. ఈ శాఖ ఉన్నతాధికారి అయిన జాయింట్ సెక్రెటరీని  చూపించిన తీరైతే చాలా హాస్యాస్పదంగా వుంది. అతనొక పెద్ద హాల్లో ఎందరో ఉద్యోగుల సమూహంలో, ఫైళ్ళ గుట్టల మధ్య గుమస్తాలా లంచ్ బాక్సుతో, కప్పులో చాయ్ తో  పనిచేసుకుంటూ కూర్చుని ఉంటాడు. టేబుల్ మీద టెలిఫోన్ కూడా వుండదు. మంత్రిని కలవాలనుకుంటే చేతులు  కట్టుకుని గంటల తరబడి నిరీక్షిస్తాడు. ఇలాటి వెన్నో భారత ప్రభుత్వానికి సంబంధించిన చిత్రీకరణలు బ్యాడ్ టేస్టుతో వున్నాయి -  ఏర్ ఇండియా పైలట్స్  స్పందించిన తీరు సహా. నిజానికి కువైట్ సంక్షోభం ప్రారంభమైన వెంటనే యుద్ధ ప్రాతిపదికన భారత ప్రభుత్వం చర్యలు చేపట్టింది. అప్పట్లో అధికారంలో వున్నది ప్రధాని విపి సింగ్ ప్రభుత్వం. అప్పటి విదేశాంగ మంత్రి ఐకె గుజ్రాల్. ఈయనే 1997 లో ప్రధానమంత్రి అయ్యారు.

        ఈ సినిమాలో తమ శాఖని ఇంత హీనంగా చూపించడాన్ని తీవ్ర  అవమానంగా భావించిన మాజీ రాయబారి ఒకరు, మాజీ విదేశాంగ శాఖాధికారులు కొందరూ,  ప్రస్తుత విదేశాంగ ప్రతినిధి సహా నిన్న శుక్రవారం ధ్వజమెత్తారు. అమెరికా మాజీ రాయబారి నిరుపమా రావ్ అయితే, ఈ సినిమాలో విదేశాంగ శాఖని చూపించిన తీరు ‘లాఫింగ్ గ్యాస్’ అని హాస్యమాడారు. ప్రస్తుత విదేశాంగ శాఖ ప్రతినిధి వికాస్ స్వరూప్, అప్పట్లో తమ శాఖ క్రియాశీలంగా వ్యవహరించిందనీ, విదేశాల్లో వున్న భారతీయుల రక్షణకి తమ శాఖ మొదటి ప్రాధాన్య మిస్తుందనీ, ఈ సినిమాలో అనవసరంగా చాలా సృజనాత్మక స్వేచ్చ తీసుకున్నారనీ అభ్యంతరం వ్యక్తం చేశారు. దౌత్యాధికారులు ఈ సినిమా వాస్తవాలకి దూరంగా వుందని విమర్శించారు.

        కువైట్  సంక్షోభంలో చిక్కుకున్న భారతీయుల్ని సురక్షితంగా తరలించడంలో కీలక పాత్ర పోషించిన రాయబారి కెపి ఫేబియన్, చాలా ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు. అప్పటి మంత్రి ఐకె గుజ్రాల్ నేతృత్వంలోని విదేశాంగ శాఖతో బాటు, ఏర్ ఇండియా, పౌరవిమానయాన శాఖా సమన్వయంతో పనిచేసి చరిత్రలో ఎన్నడూ చోటు చేసుకోని మహా ప్రజా సమూహ తరలింపు యజ్ఞాన్ని దిగ్విజయంగా పూర్తి చేశాయని  చెప్పుకొచ్చారు. టర్కీలో, జోర్డాన్ లో వున్న విదేశాంగ శాఖాధికారులు  కూడా అహర్నిశలు శ్రమించారని చెప్పారు.

        స్వయంగా విదేశాంగ మంత్రి ఐకె గుజ్రాల్ ఇరాక్ వెళ్లి సద్దాం హుస్సేన్ తో  చర్చించారనీ, ఫలితంగానే భారత్ తో సత్సంబంధాల్ని కొనసాగిస్తున్న సద్దాం,  టిప్పు సుల్తాన్ నౌక ని కువైట్ పంపించారనీ, విమనాల్లోనే కాకుండా ఆ నౌకలో కూడా భారతీయుల్ని తరలించామనీ వెల్లడించారు. ( సినిమాలో దీన్ని హీరో కష్టాల కోసం వక్రీకరించారు. హీరో బాగ్దాద్ వెళ్లి ఇరాక్ విదేశాంగ మంత్రి తారీక్ అజీజ్ ని కలిసి అభ్యర్ధించినట్టు చూపించడాన్ని మనం క్షమించగల్గినా; అజీజ్ నౌకని పంపడం, తీరా ప్రజలు ప్రయాణానికి తరలి వస్తున్నప్పుడు  ఆ నౌక రద్దయిందని ప్రకటించి  హీరో కష్టాలు  పెంచడమనే  సృజనాత్మక స్వేచ్ఛ సరైనదేనా - టిప్పు సుల్తాన్  కూడా ఇండియాకి కువైట్ భారతీయుల్ని మోసుకొచ్చినప్పుడు?).

        ఫేబియన్ ఇంకా చెప్పుకొస్తూ, కువైట్ మీద సద్దాం దాడిని ఖండించాల్సిందిగా  అమెరికా నుంచి ఎంత వొత్తిడి వచ్చినప్పటికీ విదేశాంగ శాఖ తలొగ్గలేదనీ.  కువైట్ లో చిక్కుకున్న భారతీయుల కోసం అమెరికా మాటనే పక్కన బెట్టామనీ, కానీ సినిమాలో భారతీయుల్ని తరలించడానికి విదేశాంగ శాఖ అయిష్టంగా వున్నట్టు చూపించారనీ, దర్శకుడు విదేశాంగ శాఖ ఎలా పనిచేస్తుందో తెలుసుకోలేదనీ విమర్శించారు.

        దర్శకుడు రాజా కృష్ణ మీనన్ కొన్నేళ్ళ పాటు రీసెర్చి చేశామన్నారు. అయితే నిన్న  శుక్రవారం రాత్రే  ‘టైమ్స్ నౌ’ ఛానెల్ న్యూస్ అవర్ ప్రోగ్రాం లో పాల్గొన్న మాజీ విదేశాంగ అధికారులూ, జర్నలిస్టులూ,  యాంకర్ అర్ణాబ్ గోస్వామీ సహా,  దర్శకుడు తప్పే చేశారని మెత్తగా మందలించారు. దర్శకుడు ఇచ్చుకున్న వివరణలేవీ చర్చకి నిలబడలేదు.

        జరిగిన చరిత్రని పక్కన పెట్టి సినిమా చూస్తే దర్శకుడు మీనన్ చేసింది గొప్ప కృషే. కళారూపంగా అది గొప్ప సినిమానే. గొప్ప కలెక్షన్లు సాధిస్తున్నదే. ఒక మాజీ విదేశాంగ అధికారి అన్నట్టు, ఇప్పుడు ఇరవై ఏళ్ల తర్వాత  ఈ సినిమా చూసే ఎక్కువ మంది ప్రేక్షకులు కువైట్ ఉదంతం జరిగినప్పుడు పుట్టి వుండరు. వారికి  తప్పుడు సమాచార మివ్వడమే అవుతుంది- చరిత్రలో ఒక పార్శ్వాన్ని పూర్తిగా ఇలా ఉపేక్షించి. పైగా విదేశాంగ శాఖని ఇలా చిత్రించడం విదేశాల్లో ఆ శాఖ ప్రతిష్టకే భంగకరం. స్థానిక  ప్రేక్షకుల్లో దర్శకుడు ఈ సినిమా ద్వారా క్లయిమాక్స్ లో గొప్ప దేశ భక్తిని  రగిలించాడు సరే, అదే సమయంలో ఇలా తీసి విదేశాల్లో విదేశాంగ శాఖ ఇమేజిని  దెబ్బతీయడం కూడా చేసినట్టే. దేశభక్తే కాదు, విదేశాంగ భక్తి కూడా అవసరం.  


        చరిత్రని కాల్పనికం చేసి కమల్ హాసన్ కూడా ‘హేరామ్’  తీశారు. అందులో మహాత్మా గాంధీని చంపిన నాథూరాం గాడ్సే కి సమాంతరంగా కమల్ సృష్టించిన కాల్పనిక పాత్రయిన తమిళ బ్రాహ్మణ యువకుడు,  గాడ్సేకి సమాంతరంగా పథకమేస్తూ,  బిర్లా మందిర్ లో గాంధీ ఎదుటకి వచ్చేస్తాడు. అయితే రెప్పపాటు కాలంలో అతడి పథకం తలకిందులై, గాడ్సే తుపాకీ పేల్చేస్తాడు గాంధీ మీదకి.

        ఫ్రాన్స్ అధ్యక్షుడు చార్లెస్ డీ- గాల్ మీద అక్కడి టెర్రరిస్టు సంస్థ ఒక విఫల హత్యాయత్నం చేయడం చరిత్ర. నవలా రచయిత ఫ్రెడరిక్ ఫోర్సిత్ దీనికి కల్పన జోడించి,  రెండో హత్యా ప్రయత్నంగా ‘డే ఆఫ్ ది జాకాల్ ‘ అనే బెస్ట్ సెల్లర్ రాశారు. ఇదే పేరుతో దీన్ని సినిమాగా కూడా తెశారు. 


ఈ రకంగా చరిత్రలో కాల్పనిక పాత్ర సృష్టించడం ఒకెత్తు. దీంతో అభ్యంతరాలుండవు. కానీ చరిత్రలో గాడ్సే నే తీసేసి, ఇంకెవరో హత్య చేశారని చూపిస్తే ఎలా వుంటుంది. అలాగే వుంది ‘ఏర్ లిఫ్ట్’  లో విదేశాంగ శాఖని డమ్మీని చేసి కాల్పనిక హీరోపాత్రకి ఆ క్రెడిట్ అంతా కట్ట బెట్టడం.


        దర్శకుడు ఒకటి చేయాల్సింది- తన రిసెర్చి ద్వారా నాటి కువైట్ సంక్షోభంలో కీలకపాత్ర పోషించిన అధికారి ఒకరిని  గుర్తించి, ఆయన్నే పాత్రగా చేసి, ఆ పాత్రకి ఎంత కల్పన జోడించినా, అతిశయోక్తులు చూపించినా ఇబ్బంది వుండేది కాదు. కాకపోతే ఆ అధికారి కృషిని ప్రభుత్వం గుర్తించి వుండాలి.


-సికిందర్
http://www.cinemabazaar.in/


29, జనవరి 2016, శుక్రవారం

షార్ట్ రివ్యూ..



హర్రర్ మైనస్ కామెడీ



రచన- దర్శకత్వం : సుందర్ సి
తారాగణం : సిద్ధార్థ్, త్రిష, హంసిక, సుందర్ సి, పూనం బజ్వా, మనోబాల, కోవై సరళ  తదితరులు
సంగీతం : హిప్ హాప్ తమిళ, ఛాయాగ్రహణం : యూకే . సెంథిల్ కుమార్
నిర్మాణం : గుడ్ ఫ్రెండ్స్ గ్రూప్
విడుదల : జనవరి 29, 2016
***
హారర్ కామెడీల పరంపర ఆగకుండా  కొనసాగుతోంది. తమిళ, తెలుగు సినిమాలకి ఇప్పుడు దెయ్యం అనే పదార్ధం నిత్యావసర సరుకైపోయింది. దెయ్యం కామెడీల్ని సీక్వెల్స్ మీద సీక్వెల్స్ కూడా తీస్తూ ఇప్పట్లో నిన్నొదల బొమ్మాళీ అన్నట్టు జోరుమీద సాగిపోతున్నారు నిర్మాతలు, దర్శకులు. ఈ రేసులో ‘చంద్రకళ’  అనే తమిళ డబ్బింగ్ తో దర్శకుడు  సుందర్ సి కూడా జాయినయ్యాడు. ఇప్పడు  దీనికి సీక్వెల్ గా ‘కళావతి’ తో మరో సారి అదే విధంగా  భయపెట్టి నవ్వించే ప్రయత్నం చేశాడు. ఇది ‘చంద్రకళ’ కి కొనసాగింపు కథ కాకపోయినా సీక్వెల్ పేరిట చెలామణి అయిపోతోంది. అయితే సీక్వెల్ అనగానే ఇదివరకున్న ఆకర్షణ ఇప్పుడు లేదు. అయినా సీక్వెల్స్  అంటూ ప్రచారం చేసుకుని విడుదల చేసిన  ఈ లేటెస్ట్ దెయ్యం డబ్బింగ్ కామెడీలో విషయం ఏమిటో, అదెంతవరకూ కొత్తగా వుందో ఓసారి చూద్దాం.
కథేమిటి
ఓ  గ్రామంలో జమీందారు గారి బంగాళా.  ఆ గ్రామంలో ఒక భారీ అమ్మవారి విగ్రహానికి కుంభాభిషేకం చేసి పునఃప్రతిష్టాపన చెయ్యాలని ఆ విగ్రహాన్ని తొలగిస్తారు. అంతవరకూ దుష్ట శక్తుల నుంచి గ్రామాన్ని కాపాడుతూ వస్తున్న  అమ్మవారి విగ్రహం అలా తొలగగానే గ్రామంలోకి ఓ ప్రేతాత్మ జొరబడుతుంది.  నేరుగా జమీందారు  బంగళాలో ప్రవేశించి  మొదట జమీందారు పని బడుతుంది. ఆ దెబ్బకి కోమా లోకి వెళ్ళిపోతాడు జమీందారు. ఈయన కొడుకు ఒకడు మురళీ ( సిద్దార్థ్) అనే అతను అనిత ( త్రిష) అనే అమ్మాయితో నిశ్చితార్ధమై  ఎక్కడో బీచిలో బ్యాచిలర్ పార్టీ ఎంజాయ్ చేస్తూంటాడు. తండ్రి సంగతి తెలిసి  వచ్చేస్తాడు. అప్పుడు కోమాలోంచి బయటపడ్డ తండ్రి మీద మరోసారి ఆత్మ దాడి  చేస్తుంది. ఈసారి చనిపోతాడు తండ్రి.   ఈ సంఘటనలో మురళిని అరెస్టు చేతారు పోలీసులు.
ఇలావుండగా అనిత అన్న ( సుందర్ సి) ఒక వైల్డ్ లైఫ్ ఫోటోగ్రాఫర్. ఇతను ఈ బంగళాలో జరుగుతున్న సంఘటనలకి మూలం తెలుసుకోవాలని వచ్చి సీసీ కెమెరాలూ, థర్మల్ స్కానర్ లూ అమరుస్తాడు. ఈసారి ఆత్మ మురళి అన్న మీద  దాడి చేస్తుంది. దీంతో కెమెరాకి చిక్కుతుంది. ఆ విజువల్స్  చూస్తే ఆ ఆత్మ  మురళి చెల్లెలు మాయ ( హంసిక) దని తేలుతుంది. మురళి ఆందోళన పడతాడు. ఎప్పుడో చనిపోయిన చెల్లెలు పగదీర్చుకుంటోందా కుటుంబం మీద- ఎందుకు? అసలేం జరిగింది? చెల్లెలు ఎలా చనిపోయింది? అన్న ప్రశ్నలతో మిగతా కథ సాగుతుంది...
ఎలావుంది కథ
రొటీన్ గా భయపెడుతూ నవ్వించడమనే స్కీముతోనే వుంది. హన్సిక ఫ్లాష్ బ్యాక్ లో ఒక ఆసక్తికరమైన విషయముంది. అది ఆనర్ కిల్లింగ్స్ కి సంబంధించింది. కులం తక్కువ వాణ్ణి ప్రేమించి గర్భవతి అవడంతో ఆమెణి తండ్రి, అన్న చంపేసిన కథ. ఇదొక సామాజిక సమస్యే. దీనికి పరిష్కారమే ఈ దెయ్యం కథ. ఫ్లాష్ బ్యాక్ లో  ఇంత విషాదముండగా వర్తమాన  హార్రర్ కథలో కామెడీని జొప్పించిన దర్శకుడి కళ అంతంత మాత్రంగానే వుంది.
ఎవరెలా చేశారు
సిద్ధార్థ కి పెద్దగా పాత్ర లేదిందులో సెకండాఫ్ చివరివరకూ. తన చెల్లెలు అసలెలా చనిపోయిందో అతడికి ముందు తెలీదు కాబట్టి కథలో ఇన్వాల్వ్ మెంట్ లేదు. కేసుని పరిశోధించే ఫోటోగ్రాఫర్ గా దర్శకుడు సుందర్ సికి పాత్ర నిడివి ఎక్కువ వుంది. త్రిషకి మోడరన్ గర్ల్ గా ఫస్టాఫ్ లో అంతగా పనిలేదు- గ్లామర్ ప్రదర్శన, పాటలు పాడుకోవడం తప్ప.  సెకండాఫ్ లో రొటీన్ గా ఆత్మ ఆవహించడంతో ఆమెకి పని పెరుగుతుంది.  ఫ్లాష్ బ్యాక్ కథలో హంసిక ఓకే. కామెడీ కోసం  నటించిన నటీనటుల్లో సూరి, కోవైసరళలు అగ్రభాగాన నిలుస్తారు.  
పాటలు, కెమెరా వర్క్ ఓ మాదిరిగా వున్నా, బంగాళా సెట్ భారీగా వేశారు. సీజీ వర్క్ తో ఆత్మని ప్లే చేసిన టెక్నిక్స్ పెట్టిన బడ్జెట్ కి తగ్గట్టే వున్నాయి.
 చివరికేమిటి
ఫస్టాఫ్ లో భయపెట్టే  దృశ్యాల్లో పసలేదు. పసలేకపోగా బోరు కొట్టే ప్రమాదాన్ని కొనిదెచ్చుకున్నాయి. సెకండాఫ్ లో ఫ్లాష్ బ్యాక్ వల్ల కథా బలం చేకూరినా, భయపెట్టే  దృశ్యాల కంటే కామెడీ ఎక్కువైపోయింది. ఎడాపెడా వచ్చి పడుతున్న ఇలాటి హర్రర్ కామెడీల మధ్య మరో హారర్ కామెడీ అంటే చాలానే   కష్టపడాలి. పాతిక సినిమాలకి దర్శకత్వం వహించిన అనుభవమున్న ఈ దర్శకుడికి ప్రేక్షకుల నాడీ తెలీక కాదు, అయితే ‘చంద్రకళ’  తీసిన తర్వాత తనతో తనే పోటీ పడి మరో హార్రర్ కామెడీ  ‘కళావతి’ తీయాల్సి వచ్చింది. ఇదీ సమస్య. సీక్వెల్ అన్నాక సక్సెస్ అంత సులభం కాదని నిరూపించడానికి మాత్రం ఈ సినిమా పనికొచ్చింది.

-సికిందర్






షార్ట్ రివ్యూ..

మాస్ యూత్ మసాలా!   
రచన- దర్శకత్వం : శ్రీనివాస రెడ్డి జి
తారాగణం : రాజ్ తరుణ్, అర్థన, షకలక శంకర్, రాజారవీంద్ర, సురేఖావాణి,  శ్రీ లక్ష్మి, హేమ తదితరులు
సంగీతం : గోపీ సుందర్, ఛాయాగ్రహణం : విశ్వ
బ్యానర్ : శ్రీ శైలజా ప్రొడక్షన్స్
నిర్మాతలు  : ఎస్. శైలేంద్ర బాబు, శ్రీధర్ రెడ్డి, హరీష్ దుగ్గిశెట్టి
విడుదల : 29.1.16
***
      ప్రేమకథల రాజ్  తారుణ్ మరో విలేజి ప్రేమతో వచ్చాడు. ఈ సారి మాస్ లుక్ తో మాస్ ప్రేక్షకుల్ని ఆకట్టుకుందామని ఆలోచన చేసినట్టుంది- నటించిన గత సినిమాలకంటే ఎందులోనూ క్వాలిటీ అనేది కన్పించకుండా జాగ్రత్తపడ్డాడు. ఈ ప్రయత్నంలో అర్బన్ యూత్ గురించి పెద్దగా ఆలోచన పెట్టుకోలేదు. తెలుగు సినిమా హీరో అన్నాక  ఒక మాస్త సినిమా నటించాలన్న కోరిక ప్రకారం తప్పనిసరిగా వాళ్ళ అడుగుజాడల్లో ఒకటై నడిచాడు. రూరల్, అర్బన్ యూత్ ఎవరైనా వాళ్ళ జీవితాలు ఇలాగే ఉంటాయా –అంటే ఇలాగే ఉంటాయని టాలీవుడ్ ఇలా బల్లగుద్ది చెప్తున్నాక- యూత్ కనెక్ట్ గురించి మాటాడకుండా ఈ సినిమాలో ఏముందని చూస్తే...
కథేమిటి
        రాము ( రాజ్ తరుణ్), సీత ( అర్థాన) చిన్ననాటి స్నేహితులు. రాము కి క్రికెట్ పిచ్చి. సీత కి చదువు మీద ఇంటరెస్టు. చదువు మీద శ్రద్ధలేని రాము అంటే సీతకి ఇష్టం వుండదు. ఆమె పై చదువులకి వెళ్లి మెడిసిన్ పూర్తి చేస్తుంది. అప్పుడప్పడు సెలవులకి వచ్చినప్పుడు సీతని చూసి ఎప్పటికైనా ఆమె తనది అవుతుందని కలలు గంటూంటాడు రాము.

        ఇంటర్ ఫెయిలైన రాము ఆవారా ఫ్రెండ్స్ తో తిరుగుతూంటాడు. ఇప్పటికైనా మెడిసిన్ పూర్తి చేసుకుని వచ్చిన  సీతకి తన లవ్ గురించి  చెప్పమని ఫ్రండ్స్ బలవంతం చేస్తూంటారు. కొన్ని విఫల యత్నాలు చేసి, చివరికి  ఆమెకి దగ్గరాయ్- ఓ రోజు ఆమెతో బాటు ఆమె అన్నకి దొరికిపోతాడు. గొడవవుతుంది. వూరి ప్రెసిడెంట్ అయిన ఆమె తండ్రి ( రాజారవీంద్ర) ఇక సీతకి పెళ్లి చేసేయాలనుకుంటాడు. అసలు రాముని ప్రేమించని సీత సీత్హ రాము దగ్గరకొచ్చి తిట్టి వెళ్ళిపోతుంది. కొన్ని పరిణామాలు జరిగి రాము మీద మనసుపడుతుంది. కానీ  ఆమెతో పెళ్లి కుదిరిన క్రికెట్ ప్లేయర్ ఇద్దరికీ అడ్డుగా  ఉంటాడు. అప్పుడు ఇతనూ రామూ ఒక అంగీకారానికొస్తారు. అదేమిటనేది క్లయిమాక్స్ పాయింట్.

ఎవరెలా చేశారు
        ముందుగానే చెప్పుకున్నట్టు రాజ్ తరుణ్ రఫ్ క్యారక్టర్ పోషించాడు. ప్రతీ సినిమాలో ఎలా నటించుకొస్తున్నాడో అలాగే షరా మామూలుగా నటించుకొచ్చాడు. మాస్ పాత్ర అయినా తేడా లేదు. ఇలాటి ప్రేమికుడే అయిన ‘గుణ’ లో కమలహాసన్ పోషించిన పాత్ర స్థాయిని రాజ్ తరుణ్ ఇంకా అప్పుడే  ఊహించలేడు. వృత్తిపరంగా నటనలో ఎదిగి  పైస్థాయికి  చేరాలని ఆలోచిస్తే ఒకనాటికి ఇది సాధ్యం కావొచ్చు.

        ప్రతీ తెలుగు సినిమాలో, అదెలాటి దైనా, ఏ తరహా కథైనా,  విధిగా వుండే అదే చదువుసంధ్యలు లేని, తల్లి దండ్రుల మాట వినని,  స్మోకరూ డ్రీంకరూ అయిన, ఆవారా హీరో పాత్రలోనే, ఇక్కడా రాజ్ తరుణ్ దర్శన మిస్తాడు. డబ్బులిచ్చి చూసే ప్రేక్షకులు పదేపదే ఈ పాత్రలే చూడాలి. వెరైటీ లేదు. ఈ పాత్రలో మాస్ ప్రేక్షకులనుంచి మాత్రమే రెస్పాన్స్ ని  రాబట్టుకుంటూ, ఒక పాతబడిన – అదీ అతుకుల బొంతలా వున్న కథని, పాత్రనీ లాక్కొచ్చాడు. తన పాత్ర ఏకపక్ష ప్రేమకి సరయిన కారణం, అర్హతా  లేకపోయినా మెడిసిన్ చదివే అమ్మాయి కావాలనుకుంటాడు. కాబట్టి ఈ సారి రాజ్ తరుణ్ నుంచి ఎక్కువ ఆశించకుండా బిలో ఎవరేజ్ క్వాలిటీతో సర్దుకుపోయి సినిమా చూడాలి.

        కొత్త హీరోయిన్ అర్ధన శారీరకంగానే బలహీనం. అంత స్క్రీన్ ప్రెజెన్స్ కూడా లేని ఈమె మెడిసిన్ పూర్తి చేసిన అమ్మాయి స్థాయిలి చాల్లేదు. పైగా పాత్రపరంగా డెప్త్ లేకపోవడం నటనకి  ప్రబంధకమైంది. ప్రేమ వద్దనడం, మళ్ళీ కావాలని వొళ్ళో వాలిపోవడం ఆటబొమ్మలా తయారయ్యింది. పాత్ర ప్రవేశించిన ప్రారంభ దృశ్యాల్లో ఎంతో సుకుమారంగా,  సంసార పక్షంగా కన్పించే ఈమె ఒక మెడిసిన్ చదివిన అమ్మాయిలా వుండదు. అంతలోనే సడెన్ గా అల్లరి పిల్లగా మారిపోవడం దర్శకుడి పాత్రచిత్రణ లోపమే.
       
        ఇక పక్కపాత్రల్లో షకలక శంకర్ తో బాటు మరికొందరు యువ కమెడియన్లు మందుభాయీ ఆవారా పాత్రల్ని పోషించారు. యూత్ ని  ఇలా చూపిస్తున్న తెలుగు సినిమాల్ని ప్రధాని నరేంద్ర మోడీ కి చూపిస్తే,  వెంటనే ఆయన పదవికి రాజేనామా చేసి వెళ్ళిపోతారు.  ఇకపోతే మరిన్ని విషయంలేని పక్కపాత్రల్లో  రాజారవీంద్ర, సురేఖావాణి,  శ్రీ లక్ష్మి, హేమ మొదలైన వాళ్ళు కన్పిస్తారు.

        గోపీ సుందర్ సంగీతంలో ఓ రెండు  పాటలు తప్ప మిగిలినవి కథలో గానీ, గ్రామీణ వాతావరణంలో గానీ సింక్ అవవు, ఆ ఫీల్ ని ఇవ్వవు. పేరుకి విలేజి వాతావరణమే తప్ప,  విశ్వ నిర్వహించిన ఛాయగ్రహణం కూడా సబ్ స్టాందర్డే. బ్యాక్ గ్రౌండ్ సంగీతం చాలా గోల పెట్టేస్తుంది. అసలు కథలోనె సున్నితత్వం, ఎక్కడైనా సెంటి మెంట్లూ లేనప్పుడు ఎలాటి సాంకేతిక హంగులు కూడా ఆమేరకు జతపడవు.

దర్శకుడు శ్రీనివాసరెడ్డి- చేసిన ఈ మాస్ కథని కూడా మనసు పెట్టి చేయలేదు.  పాత్రలకి, కథకి, సంఘటనలకీ దేనికీ సరయిన బేస్ వుండదు. ఈ కథ, దీని ఆవిష్కరణా ఆయన మనసుల్లోంచి తన్నుకు రాలేదని అడుగడుగునా నిదర్శనాలే కన్పిస్తాయి. ఎక్కడబడితే అక్కడ ఎప్పుడో  అవుట్ డేటెడ్ అయిపోయిన ఎపిసోడ్స్ తోనె  సినిమాని నింపేశాడు. ఉంగరం వెతికే, అరటి తొక్క తొక్కే, సోది చెప్పే; పావురాలతో, పాములతో ఆడే, మెడికల్ క్యాంపు పెట్టే, ఐరన్ లెగ్ శాస్త్రి  లాంటి క్యారక్టర్ కామెడీ పెట్టే, దేవుడి పల్లకీ మోసే, అగ్నిగుండం లో నడిచే, హీరోయిన్ పేరు పచ్చబొట్టు పొడిపించుకునే,...ఇలా చెప్పుకుంటే ఈ సినిమా తీయడానికి దర్శకుడు తనకి కలలోకోచ్చిన ప్రతీ పాతసినిమా కమర్షియల్ ఎలిమెంతునీ ఇందులోకి తోసేసినాటు కన్పిస్తాడు. ఆఖరికి బాహాటంగా ‘లగాన్’ ణి కూడా వదలలేదు. క్రికెట్ తో క్లయిమాక్స్ పెట్టేశాడు. అయితే ఈ  మధ్యే ‘గ్యాంగ్స్ ఆఫ్ హైదరాబాద్’ లో ఈ క్రికెట్ కామెడీని ఇంతకంటే ఫుల్ క్రియేటివిటీ తో ఎంజాయ్ చేశాం!

చివరికేమిటి.
        మాస్ ప్రేక్షులు ఎంజాయ్ చేస్తారు. కొత్తకొత్తగా ఇప్పుడిప్పుడే గుర్తింపు పొందుతున్న యువ రాజ్ తరుణ్ తో కాస్త డీసేన్సీనీ, నీట్ నేస్ నీ  ఆశించే వాళ్ళకి మాత్రం మోటుగా వుంటుంది ఈ మాస్ ప్రేమ.  ఇది నయమే. ఎవరో ఒక వర్గం  ప్రేక్షకులు కూడా మోయని  ఇలాటి సినిమాలే ఎక్కువ వస్తున్న ఈ రోజుల్లో,   ఈ  సీతారాముల మాస్ లవ్ మాస్ వర్గాలకైనా పనికి రావడం గొప్పే!


-సికిందర్






27, జనవరి 2016, బుధవారం


క్లాసిక్!






బరాన్ ( వర్షం- ఇరాన్)
రచన, దర్శకత్వం : మజీద్ మజీదీ
తారాగణం : హుస్సేన్ అబిదిని, జహ్రా బహ్రామీ, మహమ్మద్ అమీర్ నాజీ,
అబ్బాస్ రహీమీ, గులాం అలీ బక్షీ
సంగీతం : అహ్మద్ పేజ్మాన్, ఛాయగ్రహణం : మహమ్మద్ దావూదీ
నిర్మాతలు : మజీద్ మజేదీ, ఫువాద్ నాస్
విడుదల : జనవరి 31, 2001
***
          ఇరాన్ దర్శకుడు మజీద్ మజీదీ తన సినిమాల్ని దేశ సరిహద్దులు దాటించి  సార్వజనీనం చేయడంలో తనకే తెలిసిన రహస్యాన్ని మంత్రం దండంలా ప్రయోగిస్తున్నారు. సినిమా తర్వాత సినిమాగా ఆయన కళాఖండాలు అంతర్జాతీయ ప్రేక్షకుల్ని  మైమరపిస్తున్నాయి, ఆలోచింప జేస్తున్నాయి. పదుల సంఖ్యలో అవార్డుల్ని సాధిస్తున్నాయి. చిల్డ్రెన్ ఆఫ్ హెవెన్, కలర్ ఆఫ్ పారడైజ్, ది సాంగ్  ఆఫ్ స్పారోవ్స్, ఫాదర్, గాడ్ విల్ కమ్ ...ఇలా చెప్పుంటూ పోతే ఎన్నో ఆణిముత్యాలు. తాజాగా ఇరాన్ చిత్ర పరిశ్రమలోనే అతి భారీ బడ్జెట్ ( 40 మిలియన్ డాలర్లు) తో నిర్మించిన ‘మహమ్మద్’ గత సంవత్సరమే విడుదలయింది.

        ‘బరాన్’ అనేది మజీదీ చేసిన ఒక కొత్త కళాత్మక ప్రయోగం. కళ ఎప్పుడూ ఉన్న సమస్యల్ని నేరుగా చెప్పదు, సృజనాత్మకతతో అది పరోక్షంగా చెప్తుంది. ఇక్కడ ఒక దేశ సమస్యని రాజకీయ కోణంలో చెప్పకుండా  ప్రేమని ఆలంబనగా చేసుకుని చెప్పారు. ఇరాన్ లో ఆఫ్ఘనిస్తాన్ వలసదార్లు వేల సంఖ్యలో  వుంటారు. వాళ్ళ దుర్భర జీవితాల్ని మానవ ప్రపంచానికి ఎత్తి  చూపడానికి ‘బరాన్’ నిర్మించానని ఆయనే  చెప్పుకున్నారు.

        ఆఫ్ఘాన్ పౌరులు మొదట తమ దేశాన్ని రష్యన్లు ఆక్రమించినప్పుడు సరిహద్దు దేశం ఇరాన్ కి  పారిపోయారు. తర్వాత ఆఫ్ఘాన్ లో అధికారాన్ని తాలిబాన్లు చేజిక్కించుకున్నప్పుడు కూడా ఇరాన్ పారిపోయారు. వీళ్ళంతా ఇరాన్ లో శరణార్ధులుగా బ్రతుకుతున్నారు. భవన నిర్మాణ రంగంలో కార్మికులుగా పనిచేస్తున్నారు. ఇది చట్ట విరుద్ధం. అందుకని కాంట్రాక్టర్లు అతి తక్కువ జీతాలకి వీళ్ళని నియమించుకుని దొంగ చాటుగా పనులు చేయించుకుంటుంటారు.

       ఆఫ్గన్ వలసరదార్ల మీద నిఘా వేసివుంచే  ప్రభుత్వ అధికారులు దాడులు చేసినప్పుడు ఈ కార్మికుల్ని కాంట్రాక్టర్లు దాచేస్తారు. ఈ వలసదార్లని  ఇరాన్ ప్రభుత్వం ప్రత్యేక శిబిరాల్లో ఉంచేది. శిబిరాల్లోంచి  నగరాలకి వెళ్లి స్థిరపడాలన్నా, అక్కడ పనులు చేయలన్నా ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ప్రభుత్వం అంత సులభంగా అనుమతి నిచ్చేది కాదు. తన సొంత దేశస్తుల్ని  దోపిడీల బారి నుంచి, మాదక ద్రవ్యాల అలవాటునుంచీ కాపాడుకునేందుకు, ఆఫ్ఘన్ వలసదారుల్ని శిబిరాలు దాటి వెళ్ళ నిచ్చేది కాదు. .

        దీంతో దొంగచాటుగా వెళ్లి భవన నిర్మాణ కూలీలుగా చేరిపోయేవాళ్ళు. వీళ్ళ పరిస్థితిని  అవకాశంగా తీసుకుని కాంట్రాక్టర్లు తక్కువ జీతాలతో పనులు చేయించుకునే వాళ్ళు. ఇది మళ్ళీ స్థానిక కార్మికులతో గొడవలకి దారి తీసేది. తమ ఉపాధిని ఆఫ్ఘన్ లు వచ్చి లాగేసుకుంటున్నారని ఘర్షణలకి దిగేవాళ్ళు.  ఇలా శరణార్ధుల సమస్యకి ప్రభుత్వం ఒక పరిష్కారాన్ని ఇవ్వలేకపోయింది.

        ఇదీ ఈ కథకి నేపధ్యం. నిజానికి ఇదొక సామాజిక సమస్య తో బాటు రాజకీయ సమస్య కూడా. అయితే దర్శకుడు మజీదీ ఈ రెండు అంశాల జోలికీ వెళ్ళలేదు. వివాద రహితంగా ఈ  సమస్యని ప్రపంచ దృష్టికి తీసుకు వెళ్ళాలనుకున్నారు. రాజకీయం కంటే ప్రేమని జోడించినప్పుడు ప్రేక్షకులకి ఎక్కువ ఆకట్టుకోగలదన్న ఉద్దేశంతో, ప్రేమకథగానే  దీన్ని చెప్పుకొచ్చారు. దీని నేపధ్యంలో ఆఫ్ఘన్ల సమస్యని ప్రేక్షకులు గుర్తించేలా చూశారు. ప్రపంచంలో ఎక్కడైనా ప్రేమ అందరికీ అర్ధమయ్యే భాషే కాబట్టి ఆ భాషలోనే సమస్య చెప్పుకొచ్చారు.

మూగతనాల మురిపాలు  

       ఇరాన్ రాజధాని టెహ్రాన్ లో ఒక భవన నిర్మాణ కార్మికుడుగా ఉంటాడు పదిహేడేళ్ళ లతీఫ్ (హుస్సేన్ అబిదిని). ఈ భవనాన్ని నిర్మిస్తున్న కాంట్రాక్టర్లు వేరే వుంటారు. వాళ్ళ కింద ఇక్కడి పనులు చూసుకునే ఫోర్మన్ గా మెమర్ (మహమ్మద్ అమీర్ నాజీ) 
అనే అతనుంటాడు. లతీఫ్ చేయాల్సిన పని కార్మికులందరికీ టీలు కాచి అందించడం, భోజన ఏర్పాట్లు  చేయడం వంటి తేలిక పనులే. లతీఫ్ చాలా మొండిగా ఉంటాడు. ఆవారా కుర్రాడు. మనసు నిలకడగా వుండదు. ఇతని  ధోరణి కనిపెట్టి మెమర్ కూడా పూర్తి  జీతం ఇవ్వకుండా కొంత తన దగ్గరే పొదుపు చేస్తూంటాడు. లతీఫ్ కార్మికులతో ఎప్పుడూ కయ్యాలు పెట్టుకుంటూ  ఉంటాడు. ఈ కార్మికుల్లో కొందరు ఆఫ్ఘన్ వలసదార్లు వుంటారు. వీళ్ళు ఐడీ కార్డులు లేని, చట్ట విరుద్ధంగా పనిలోకి చేరిన చీప్ లేబర్. ఇన్స్ పెక్షన్ కి ఎవరైనా అధికారులు వచ్చినప్పుడు దొరక్కుండా భవనం గదుల్లో దాక్కుంటారు.

        ఇలా వుండగా, ఒకరోజు ఆ ఆఫ్ఘన్ కార్మికుల్లో ఒకడైన నజాఫ్ ( గులాం ఆలీ బక్షీ)  అనే అతడికి ప్రమాదంలో కాలు విరుగుతుంది. పన్లోకి వెళ్ళే పరిస్థితి వుండదు. మర్నాడు కార్మికుల్ని సమకూర్చే సుల్తాన్ (అబ్బాస్ రహీమీ )  అనే అతను రహమత్ అనే పద్నాల్గేళ్ళ కుర్రాణ్ణి వెంటబెట్టు కొస్తాడు. గాయపడ్డ వీడి తండ్రి స్థానంలో వీణ్ణి  పనిలోకి తీసుకోవాల్సిందిగా కోరతాడు. బలహీనంగా వున్న వీడేం పనికొస్తాడంటే, కుటుంబానికి ఇప్పుడు వీడే  ఆధారమంటాడు. నజాఫ్ మీద సానుభూతితో వాణ్ణి పనిలోకి తీసుకుంటాడు మెమర్. ఆ కుర్రాడు రహమత్ నోట్లోంచి ఒక్క మాట రాకుండా తలూపుతూంటే మూగోడని చెప్తాడు సుల్తాన్.

        మెమర్ వాడికి లతీఫ్ చేస్తున్న తేలిక పని అప్పజెప్పి, లతీఫ్ కి సిమెంట్  బస్తాలు మోసే పని అప్పజేప్తాడు. దీంతో చిర్రెత్తిపోతాడు లతీఫ్. తనకి శత్రువులా వచ్చి తన పని లాక్కున్న రహమత్  మీద పగబడతాడు. కిచెన్ ని  ధ్వంసం చేస్తాడు. వాణ్ణి బెదిరిస్తాడు. వాడి పనులకి అడ్డు పడతాడు. వాడి మీద నిఘా పెట్టి తప్పు దొరికించు కోవాలని ప్రయత్నిస్తాడు. ఓ రోజు వాడు  పనిలోకి వస్తోంటే, పై నుంచి సున్నం గుమ్మరించి పా రిపోతాడు.

      వొళ్ళంతా సున్నం పడి దులుపుకోవడానికి వెళ్ళిన వాణ్ణి రహస్యంగా గమనిస్తాడు.  అప్పుడు...అప్పుడు.. ఆ గదిలో వాడు...
    లతీఫ్ కి మతిపోతుంది ఆ దృశ్యం చూసి!
    ఎంత నాటకం! వీడు..వీడు.. మోసం చేస్తున్నాడు!
    వీడు  మగపిల్లోడు కాదు,  ఆడపిల్ల వీడు!
    రహమత్ ఆడపిల్ల!
    అది బయట పడకూడదని మూగోడిలా నటిస్తూ, తల దగ్గర్నుంచీ కాళ్ళ దాకా బట్టలు కప్పుకుని ఇందుకే తిరుగుతోంది...
    ఇప్పుడు బట్టలు తీసేసి ఇంత పొడవు జుట్టు దులుపుకుంటున్నాడు  – కాదు – దులుపుకుంటోంది దొంగపిల్ల!!

    ఇలా ఆవేశపడిపోతాడు లతీఫ్. గందరగోళంలో పడతాడు. నెమ్మదిగా తేరుకుంటాడు. ‘రహమత్’ మీద ఎక్కడాలేని సానుభూతి పుట్టుకొస్తుంది. ఆడపిల్లల్ని  పనుల్లోకి తీసుకోరు గనుక ఇలా మగ వేషంలో తప్పని సరై వచ్చిందన్నమాట కుటుంబ పోషణకు.

    ‘రహమత్’  రహస్యం బయటపెట్టేందుకు మనసొప్పక పోగా ఇప్పుడు ప్రేమ పుట్టుకొస్తుంది. ఇంతకి ముందువరకూ వున్న  కోపమూ పగా కాస్తా మాయమై పోతాయి. రహమత్ తో  తన ప్రవర్తన మార్చుకుంటాడు. ఇతను పసిగట్టిన విషయం తెలీక ఆమె అలాగే నటిస్తూంటుంది. ఓ పొగరుబోతు కార్మికుడు సిగరెట్లు తేలేదేమని ‘రహమత్’ ని  నిలదీస్తే,  కోపం పట్టలేక  ఆ కార్మికుణ్ణి కొట్టేస్తాడు రహమత్. ఎవరికీ అర్ధం గాదు, ‘రహమత్’ కి కూడా అర్ధంగాదు- వీడెందుకు రియాక్ట్ అయ్యాడో.

        ‘రహమత్’ ని మూగగా ప్రేమించడం మొదలెడతాడు. మెత్తగా ప్రవర్తించడం మొదలెడతాడు. అతడిలో వచ్చిన మార్పుని అర్ధం జేసుకోలేకపోతుంది. ఇద్దరి మధ్యా ఒక్క మాటా వుండదు. ఇలా ఉండగా, తనిఖీకి అధికారులు వచ్చేస్తూంటారు. ‘రహమత్’ పారిపోతూంటే ఓ అధికారి వెంటపడతాడు. అధికారిని అడ్డుకుంటూ లతీఫ్ పరిగెడతాడు. ‘రహమత్’ దొరక్కుండా  అధికారితో కలబడి కింద పడేస్తాడు. ‘రహమత్’  పారిపోతుంది. లతీఫ్ పోలీస్ స్టేషన్లో ఉంటాడు. మెమర్ వచ్చి తిట్టి విడిపించు కుంటాడు. విషయం ఇలా రట్టయ్యాక ఇక వలస కూలీల్ని పనిలోంచి తప్పించక తప్పదతడికి.  లతీఫ్ డీలా పడిపోతాడు.

వర్షంలో అడుగుజాడ
       అవసరం కొద్దీ ఆమె మూగదానిలా నటించింది సరే, తనూ మూగగా ప్రేమించడమే  అసలు సమస్య. తను మాటల్లో ప్రేమని వ్యక్తం చేయదల్చుకోలేదు. ఆమెని వెతుక్కుంటూ వెళ్లి ఇంకో చోట ఓ నదిలో బండరాళ్ళు తొలగించే పనికి కుదరడం చూసి చలించి పోతాడు. అక్కడామె ఆడపిల్ల దుస్తుల్లో ఆడపిల్లలా వుంటుంది. లతీఫ్ ఒక నిర్ణయం తీసుకుంటాడు. ఆమెకి ఏ కష్టమూ పడే పరిస్థితి ఉండకూడదని, మెమర్ దగ్గర పోగై వున్న తన డబ్బంతా తెచ్చి సుల్తాన్ కిస్తాడు- ‘రహమత్’  తండ్రి కిమ్మని. తీరా చూస్తే ఆ డబ్బుతో సుల్తానే  స్వదేశం ఆఫ్ఘనిస్తాన్ వెళ్ళిపోతాడు. అతడికేదో సమస్య వచ్చి వెళ్ళాల్సి వస్తే ఆ డబ్బు అతడికే ఇచ్చి పంపానని రహమత్ తండ్రి అంటాడు.

        లతీఫ్ తెగించి తన ఐడీ కార్డుని అమ్మేసి ఆ డబ్బు ‘రహమత్’ తండ్రికి ఇవ్వబోతాడు. అతను తీసుకోడు. తీసుకోక పోగా, ఆఫ్ఘనిస్తాన్లో తన  తమ్ముడు మరణించడంతో తను వెంటనే అక్కడికి వెళ్ళిపోవాల్సి వస్తుంది కూతురితో. దేని కోసం లతీఫ్  తాప్రతయ పడుతున్నాడో అదే శాశ్వతంగా దూరమయ్యే పరిస్థితి వచ్చింది. ఈలోగా లతీఫ్ పాట్లు చూసి రహమత్ కీ అతడి మీద ప్రేమ పుట్టినా, ఏమీ చేయలేని స్థితి.

        తండ్రితో పాటు వ్యానెక్కి ఆమె వెళ్లిపోతూంటే, మౌనం గా చూస్తూంటాడు. వర్షం మొదలవుతుంది... ఆ వర్షంలో ఆమె అడుగుజాడ చూస్తూంటాడు. వర్షం రావడం...ఆమె వెళ్ళిపోవడం...  ఆమె కూడా వర్షమే! మగపేరు తీసేస్తే ఆమె  పేరు బరాన్!  అంటే వర్షం..

దర్శకుడు మజీద్ మజీదీ 
       ఒకటి మాత్రం జరిగింది. తన ప్రేమ దేశం దాటి వెళ్ళిపోయింది, కానీ ప్రేమ  వల్ల తను మారాడు. ఎప్పుడూ పెంకెగా, పెచీకోరుగా, ఆవారాగా ఉండేవాడు కాస్తా  ఆలోచించగల యువకుడిగా మారాడు. ఇక అర్ధవంతమైన జీవితంకోసమే  ప్రయత్నిస్తాడు ఆమె జ్ఞాపకాల జడివానలో...


ప్రత్యక్షానుభం! 
      ఏకకాలంలో మజీదీ  ప్రేమకథని చూపిస్తూనే  వలస దారుల కష్టాల్నిచెప్పాడు. రెండూ మనకి గుర్తుండి పోతాయి. సగభాగం నిర్మాణంలో వున్న భవనంలోనే కథ జరిగినా, ‘రహమత్’ పారిపోయాక మిగతా సగభాగం అవుట్ డోర్లో సాగుతుంది. వర్షం అంటే నీళ్ళు. నీరు వివిధ రూపాల్లో వుంటుంది. సింబాలిక్ గా ఈ వివిధ రూపాల్ని కథనానికి, భావోద్వేగాలకీ  అనుగుణంగా చూపించుకుంటూ పోయాడు  దర్శకుడు  మజీదీ. మొదట్లో ‘రహమత్’ పనిలోకి చేరుతున్నప్పుడు మంచు కురుస్తుంది. చేరాక చాయ్ కాస్తున్న పొయ్యి దగ్గర్నుంచి ఆవిరి తెరల్లోంచి ‘రహమత్’ ని  చూస్తూంటాడు లతీఫ్. ఆవిరి కూడా నీటి రూపమే. ఇలా పరోక్షంగా వున్న నీటిని  ఇక ప్రత్యక్షం చేస్తాడు దర్శకుడు. ‘రహమత్’ నదిలో కష్ట పడుతూండగా  ఆ నీటి ప్రవాహం, హోరూ... వేరే సందర్భంలో ఏం చేయాలా అని లతీఫ్ కూర్చున్నప్పుడు,  పక్కనే సందు చూసుకుని పారే సెలయేటి నీళ్ళూ... ఇక చివరగా...వర్షం! ఎమోషన్స్ ని ఇలా వివిధ నీటి రూపాలతో మనం పసిగడితే గానీ తెలీనంతగా కథనంలో మిళితం చేశాడు.

       ఒకోసారి మనం ఆడే అబద్ధాలు నిజమై మనకే ఎదురు తిరుగుతాయి. దీన్ని దర్శకుడు మనకి హెచ్చరికలా చిత్రించాడు. ‘రహమత్’ తండ్రికి డబ్బిద్దామని ఆలోచించిన లతీఫ్, మెమర్ దగ్గర ఏడ్చేస్తూ  తను వూరెళ్ళాలనీ, తన చెల్లెలికి బాగా లేదనీ, దాచుకున్న డబ్బులన్నీ ఇమ్మని ఓవరాక్షన్ చేసి ఆ డబ్బులు తీసుకుని సుల్తాన్ కి అప్పజెప్తాడు,  ‘రహమత్’ తండ్రికిమ్మని. లతీఫ్ చెల్లెలు నిక్షేపంలా వుందిగానీ, సుల్తాన్ తమ్ముడే చనిపోతాడు. దాంతో ఆ డబ్బు తీసికెళ్ళమని సుల్తాన్ కే ఇచ్చేస్తాడు ‘రహమత్’ తండ్రి!  ఏదీ అబద్ధం కాదు, మనం కావాలని అబద్ధమాడేది ఎక్కడో నిజమవుతూనే వుంటుంది...అబద్ధమాడి మనం పొందేది అటెళ్ళి పోతుంది... ఆశించిన ప్రయోజనం నెరవేరే ఛాన్సే లేదు.

      లతీఫ్ పాత్రలో కుర్ర హుస్సేన్ అబిదిని ఒక ఎసెట్ అనొచ్చు ఈ సినిమాకి. 1996 నుంచీ అరడజను సినిమాల్లో నటించిన అనుభవమున్న ఇతను- మాటలు తక్కువ, హావభావాలు ఎక్కువుండే ఈ పాత్రలో ప్రేక్షకుల్ని ఆలోచింప జేసేలా నటించాడు. రహమత్ అలియాస్ బరాన్ గా నటించిన జహ్రా బహ్రామీ కౌమార దశలో వున్న ఆడపిల్ల పాత్రకి,  ఒక్క మాటా కూడా లేని హావభావ ప్రదర్శతోనే దృశ్యాల్ని నిలబెట్టింది. ఈ రెండు పాత్రలే కీలకమైనవి, నిడివి గలవి.

         సంగీతం విషయానికొస్తే, నేపధ్య సంగీతం కేవలం పదిశాతమే వుంటుంది. మిగిలిన దంతా శబ్ద ఫలితాలతో నిండిన సన్నివేశాల చిత్రణే. ఛాయగ్రహణం ముఖ్యంగా అవుట్ డోర్లో జలదృశ్యాల్లో అక్కడ మనం ప్రత్యక్షంగా ఉన్నట్టే ఫీల్  ని కలిగిస్తుంది...ఇప్పుడు టెక్నాలజీ అప్ డేట్ అయి డిజిటల్ గా ఇలాటి ప్రత్యక్షానుభవాన్నే ఇస్తున్న  ‘వర్చువల్ రియాలిటీ’ సినిమాలు దక్షిణ కొరియాలో ఆకట్టుకుంటున్నట్టు. ఇది లేని కాలంలోనే ఎప్పుడో పదిహేనేళ్ళ క్రితం కేవలం కెమెరా, లైటింగ్, కలర్స్ తో ఇలాటి అనుభవాన్నే  ఇచ్చారంటే అది కెమెరామాన్ మహ్మద్ దావూదీ ఘనతే! 

        మజీద్ మజీదీ జీవితాన్ని చూసే కన్ను చాలా భిన్నం. ఒక జీవితాన్ని చిత్రిస్తే అది పదుల సంఖ్యలో అంతర్జాతీయ అవార్డుల్ని వెంట బెట్టుకు రావడం నిత్యకృత్యం. ఇలాటి జీవితాలే మనకున్నా, అలాటి కన్ను లేక మిన్నకుండడం మనకున్న మన్నుతిన్న పాము మనస్తత్వం.


-సికిందర్
http://www.filmyfreak.com/



26, జనవరి 2016, మంగళవారం

స్పెషల్ ఆర్టికల్

సింగిల్ స్క్రీన్ మజా పోతోందా?
 
ల్టీప్లెక్స్ లో మహారాజులా కూర్చుని ఆర్డరిస్తే మన సీటు దగ్గరికే వచ్చే స్నాక్స్ తింటూ, సాఫ్ట్ డ్రింక్స్ సిప్ చేస్తూ,  కొత్త కొత్త సినిమాల్ని బాగా ఎంజాయ్ చేయడంలో మునిగిపోయి, పాత మజానంతా కోల్పోతున్నామా? ఒకప్పుడు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో  సినిమాల్ని మజా చేసిన రోజుల్ని మర్చిపోయి ఆ థియేటర్లు మూతబడే పరిస్థితులు కల్పిస్తున్నామా? పెద్ద పెద్ద నగరాల్లోనే కాదు, చిన్నచిన్న పట్టణాల్లో కూడా మల్టీప్లెక్స్ ల నిర్మాణాలు జోరందుకోవడంతో సింగిల్ స్క్రీన్ థియేటర్లు ఆదరణ కోల్పోతూ వరసగా మూతబడుతున్నాయి.

        ఈ పరిస్థితి పదిహేనేళ్ళ క్రితం ఒకసారి వచ్చింది. టీవీ చానెళ్ళ వైపు సినిమా ప్రేక్షకులు మళ్ళడంతో థియేటర్లు విలవిల్లాడాయి. ఒకటొకటే మూత బడ్డాయి. ఫంక్షన్ హాల్సుగా, గోడౌన్లుగా, షాపింగ్ కాంప్లెక్సులు గా మారిపోతూ వచ్చాయి. అప్పట్లో అవిభక్త ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో అన్ని సెంటర్లలో దాదాపు మూడు వేల వరకూ వుండిన సినిమాహాళ్ళు, పదమూడు- పద్నాల్గు వందలకి పడిపోయాయి.
        ఈ పరిస్థితి హైదరాబాద్ తో బాటు నైజాం ఏరియాలో ఎక్కువ కన్పించేది. కోస్తా, సీడెడ్ లలో నైతే ‘సి’ సెంటర్లలో ఛోటా మోటా సినిమాహాళ్ళన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. ఈ సెంటర్లలో ఆ రోజుల్లో  ఏ సినిమా కూడా రిలీజ్ అయ్యేది కాదు. పాత సినిమాల రీరన్స్ జోరుగా అడేవి. చిరంజీవి నటించిన ‘ఖైదీ’ ఒక ‘సి’ సెంటర్లో ఎన్నిసార్లు వేసినా ఆడేది. ఇక రిలీజయ్యే కొత్త సినిమాల్ని దగ్గరున్న పట్టణాలకెళ్ళి చూసి వచ్చే వాళ్ళు.  అలా రెండు వైపులా థియేటర్లకి లాభసాటిగా వుండేది. కానీ ఎప్పుడైతే 1996 లో ఈటీవీ ప్రసారాలు ప్రారంభమాయ్యాయో- అప్పుడు ఇక ‘సి’ సెంటర్లలో సీను మారిపోయింది. దూరదర్శన్ మాత్రమే వున్న కాలంలో ఊరికొక్క  పెద్దమనిషి ఇంట్లో ఒక్క టీవీ వుండి- వారానికోసారి చిత్రలహరి సినిమా పాటలొచ్చి, వారానికో పాత సినిమా మాత్రమే వచ్చేది. అలాటిది ఈటీవీ వచ్చేసి సీను మార్చేసింది. 24x7 దాంట్లో వినోదమే. రాత్రిపదిన్నరకి ఓ పాత సినిమా. దీంతో అప్పోసప్పో చేసి టీవీలు కొనుక్కుని సినిమా హాళ్ళకి వెళ్ళడం మానేశారు. సినిమాహాల్లో వచ్చే పాత సినిమాలే టీవీలో వస్తున్నప్పుడు సినిమా హాలు కెందు కెళ్ళాలి? ఇలా ‘సి’ సెంటర్ హాళ్ళ పనైపోయింది.  సినిమాలు రీరన్స్  కూడా ఆగిపోయాయి.
        ‘బి’ సెంటర్లలో ఇందుకు భిన్నంగా ఏం లేదు. కాకపోతే నెమ్మది నెమ్మదిగా జరిగింది. పట్టణాల్లో ‘బి’ సెంటర్స్ లో కూడా రీరన్స్  ఆడేవి. ఈటీవి సినిమాల ధాటికి అవికూడా ఆగిపోయాయి. ఇక పెద్ద సినిమాలకే పట్టణ  జనం థియేటర్లకి  వచ్చి, చిన్న సినిమాల్ని అంతగా పట్టించుకునే వాళ్ళు కాదు. చుట్టు  పక్కల వూళ్ళ నుంచి పనులమీద  పట్టణాలకి వచ్చే జనాలే మార్నింగ్, మ్యాటినీ షోలకి చిన్న సినిమాలకి వుండేవాళ్ళు. ఫస్ట్ షోకి ఎఫెక్ట్ కనపడేది. ఎంతో అయిష్టంగా పట్టణ జనం ఫాస్ట్ షోకి కదిలేవాళ్ళు. ఇక సెకండ్ షోలకి టీవీ చుట్టూ మూగి పోయే వాళ్ళు. దీంతో చిన్న సినిమాలకి సెకెండ్ షోకల్లా  థియేటర్లు ఖాళీ.
నగరాల్లోనూ  ఇదే పరిస్థితి. తెలుగుతో బాటు హిందీ సినిమాలు ఆడే  థియేటర్ల  పరిస్థితీ  ఇదే. దీంతో పట్టణాల్లో, నగరాల్లో థియేటర్ల మూత మొదలయ్యింది. హైదరాబాద్ లో ఒకప్పుడు మహోజ్వలంగా  వెలిగిపోయిన ప్యాలెస్, విక్రాంత్, జమ్రుద్, టివోలీ, పారడైజ్, అజంతా, కమల్, మొదలైన పదుల సంఖ్యలో థియేటర్లు  ఒకటొకటే మూతబడ్డాయి. మళ్ళీ వీటిని తెరిచే పరిస్థితులు కూడా లేవు. చాలా వరకూ వీటి స్థానే షాపింగ్ కాంప్లెక్సులు వెలిశాయి. ఇప్పుడు ఆబిడ్స్ లో బిగ్ బజార్ వున్న చోట  ప్యాలెస్ టాకీస్ వుండేది. పక్కనే కొత్తగా 1980 లలోనే ప్రారంభించిన సూర్య జంట థియేటర్లు 1998 కల్లా మూతబడి ఇప్పటికీ అలానే వున్నాయి. కాచీగూడాలో ప్రభాత్ థియేటర్ షాపింగ్ కాంప్లెక్స్ గా మారిపోయింది. హిమాయత్ నగర్లో ఇంగ్లీషు సినిమాలాడే ల్యాండ్ మార్క్ థియేటర్ లిబర్టీ కూడా షాపింగ్ కాంప్లెక్స్ గా మారింది. అటుపక్క స్కై లైన్ జంట థియేటర్లూ మూతబడి అలాగే వున్నాయి. ఒక్క ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లోనే మొత్తం అన్ని థియేటర్లూ, కాచీగూడా చౌరాస్తాలో మహేశ్వరి- పరమేశ్వరి థియేటర్లూ, కూకట్ పల్లి, దిల్ సుఖ్ నగర్ లోని థియేటర్లూ టీవీ చానెళ్ళ ధాటికి తట్టుకోగాలిగాయి. అయితే క్రాస్ రోడ్స్ లో  కొన్ని ప్రసిద్ధ థియేటర్లకి,  కాచిగూడాలో మహేశ్వరి- పరమేశ్వరి జంట థియేటర్లకీ మల్టీప్లెక్స్ ల ట్రెండ్ లో కాలం చెల్లింది. మహేశ్వరి - పరమేశ్వరి జంట థియేటర్లు  షాపింగ్ మాల్స్ తో కూడిన మల్టీప్లెక్స్ గా  మారాయి. క్రాస్ రోడ్స్ లో సుదర్శన్ ఈ బాటలోనే వుంది.
        టీవీ చానెళ్ళ తర్వాత,  మల్టీప్లెక్స్  ట్రెండ్ ఉన్న సింగిల్ స్క్రీన్ థియేటర్లకి పెద్ద పరీక్షా కాలాన్ని తెచ్చి పెట్టింది. అప్పటి అవిభక్త రాష్ట్రంలో స్వర్గీయ ఎన్టీ రామారావు హైదరాబాద్ నడిబొడ్డున ఆబిడ్స్  లో  అధునాతనంగా రామకృష్ణ  జంట థియేటర్లు కట్టారు. ఇది 1966 లోనే జరిగింది. విశేష మేమిటంటే,  అప్పటి దాకా రాష్ట్ర ప్రజలకి ఎక్కడా అందని 70 ఎంఎం  బొమ్మ తోపాటు, సిక్స్ చానెల్ స్టీరియో ఫోనిక్ సౌండ్ అందించిన  ఘనత ఆయనది. అలాటి సౌండ్ సిస్టం తో 70 ఎంఎం వెండితెర మీద ‘మెకన్నాస్ గోల్డ్’ విడుదలై సినిమా ప్రదర్శనలో  విప్లవాన్నే సృష్టించింది! తర్వాత  ‘షోలే’ విడుదలైనప్పుడు అది  నాల్గు ఆటలతో ఐదేళ్లూ ఆడిందంటే కేవలం అది ఎన్టీఆర్ అందించిన ఆ అధునాతన టెక్నాలజీ  పుణ్యమే. ఒక్కొక్కళ్ళు వంద సార్లు ఆ థియేటర్లో ఆ సినిమా చూసి వుంటారు. కాలేజీ స్టూడెంట్లు రోజుకొక సారి చూసేవాళ్ళు.
        ఈ విప్లవం తర్వాత,  రాష్ట్రంలో మళ్ళీ 2002 లోనే కొత్త విప్లవం వచ్చింది. అది ప్రసాద్స్ ఐమాక్స్ థియేటర్ రూపంలో. ఇందులోనే మల్టీప్లెక్స్ థియేటర్ల సముదాయంతో. అయితే దేశంలో మొట్టమొదట  మల్టీప్లెక్స్ కల్చర్ వచ్చింది 2000 వ సంవత్సరంలో ముంబాయిలోనే. అనిల్ అంబానీకి చెందిన యాడ్ లాబ్ ఫిలిమ్స్ దీన్ని ప్రారంభించింది. ఈ కల్చర్ అంచెలంచెలుగా దేశంలో వివిధ నగరాలకి విస్తరించింది. ప్రేక్షకుల సినిమాల్ని వీక్షించే కల్చర్ నే  మార్చేసింది. ఇదలా వుంచితే, అసలు ఏ టీవీ చానెళ్ళ పుణ్యాన నగరాల్లో థియేటర్లు జీవన్మరణ సమస్య నెదుర్కొన్నాయో, మళ్ళీ కొత్త సింగిల్ స్క్రీన్ థియేటర్ల నిర్మాణాల జోలికి వెళ్ళలేదో, ఆ స్లంప్ ని కూడా ఏమాత్రం లెక్క చెయ్యక మరిన్ని థియేటర్లు మల్టీప్లెక్స్ ల రూపంలో పుట్టుకొచ్చాయి. మరి ఇంత కాలం  సింగిల్ స్క్రీన్ థియేటర్ల కే తగ్గిన ప్రేక్షకులు మల్టీప్లెక్స్ లకి ఎక్కడ్నించి వస్తారని అనుకున్నారు? వుంటే గింటే పూర్వం కొన్ని చోట్ల  35 ఎంఎం, 70 ఎం ఎం అని జంట థియేటర్లే ఉంటున్న నేపధ్యంలో ఏకంగా నాల్గు నుంచి ఆరు థియేటర్ల సముదాయంగా మల్టీప్లెక్సులు కట్టే ధైర్యం ఎలా చేశారు?  
        ఈ ధైర్యం రావడానికి కారణమేమిటంటే, అంతవరకూ సింగిల్ స్క్రీన్ థియేటర్లతో సింగిల్ యాజమాన్యాలకి సాధ్యంకాని పద్ధతిలో, ఈ రంగంలోకి కొత్తగా కార్పోరేట్ కంపెనీలు ప్రవేశించడంతో మొత్తం ప్రదర్శనా రంగం రూపురేఖలు మారిపోలేదు. మొట్టమొదట అనిల్ అంబానీ కంపెనీ, ఆతర్వాత ప్రసాద్స్, పీవీఆర్, ఆసియన్..ఇలా కార్పోరేట్ కంపెనీలు ఒకటొకటిగా వచ్చిన మాట నిజమే. అయితే ఇవి రావడానికి సినిమాలు డిజిటలీ కరణ చెందడమే కారణం. సినిమాల ప్రదర్శన ఉపగ్రహాల ద్వారా జరగడమే కారణం. అదే ఇంకా సినిమా రీళ్లే వుంటే  ఏ కంపెనీ వచ్చేది కాదు. డిజిటలీ కరణతో సినిమాల నిర్మాణమే కాదు, పంపిణీ, ప్రదర్శనా పద్ధతులూ సులభతరం కావడమే మల్టీప్లెక్సుల ఆవిర్భావానికి కారణం. ఇది ప్రపంచవ్యాప్తంగా సంభవించిన పరిణామం. దీన్నుంచి మనం దూరంగా ఉండలేం.
        అయినంత మాత్రానా- భారీ యెత్తున థియేటర్ల కి రావడం మానేసిన ప్రేక్షకులు ఇంత భారీ సంఖ్యలో  కడుతున్న మల్టీప్లెక్సు లకి వస్తారని ఎలా భావించారు? ‘ఆసియన్ సినిమాస్’ లో భాగస్వామి అయిన డి.  సురేష్ బాబు దీనికి వివరణ ఇచ్చారు : చాలా కారణాల వల్ల  ప్రేక్షకులు థియేటర్లకి రావడం మానేశారనీ, నగర  శివార్లలో పాతబడిన సింగిల్ స్క్రీన్ థియేటర్ల పరిస్థితి బాగాలేకపోవడం ఒక కారణమనీ, వాటిలో ప్రొజెక్షన్ దగ్గర్నుంచీ టాయిలెట్స్ వరకూ అన్నీ అధ్వాన్నంగా వుంటున్నాయనీ, స్వల్ప టికెట్ ధర పెంపుదలతో అత్యాధునిక సౌకర్యాలతో మల్టీప్లెక్సులు కడితే తప్పకుండా ప్రేక్షకులు వస్తారనీ ఆయన అంచనా.
        ఇది నగర శివార్లలో మల్టీప్లెక్సుల సంగతి. మరి నగరాల ప్రధాన కూడళ్ళలో వెలసిన, వెలుస్తున్న మల్టీప్లెక్సులు కొత్తగా ఏ ప్రేక్షకుల్ని టార్గెట్ చేస్తూ వెలుస్తున్నట్టు?
(వచ్చేవారం ..)

-సికిందర్
http://www.filmyfreak.com/










వీకెండ్ కామెంట్

ఇవి విచారణా సంఘాల  రిపోర్టులా?

       దేశంలో వివిధ భాషలకి చెందిన సినిమా పరిశ్రమలున్నాయి. కానీ అసహనమంటూ ఏ భాషా సినీరంగమూ ఫీలవని సమస్యని   ఒక్క బాలీవుడ్ మాత్రమే ఫీలవుతోంది. మొత్తం బాలీవుడ్ అని కాదుగానీ, అందులో ప్రముఖులనదగిన ఇద్దరు ఖాన్ స్టార్లు, మరికొందరు దర్శకులూ దేశంలో తమ వృత్తి వ్యాపారాలతో  సంబంధం లేని  అసహనంగురించి అడపాదడపా వివాదాలు సృష్టిస్తున్నారు. ఇలా కొందరు ఇబ్బందుల్లో కూడా పడుతున్నారు. ముఖ్యంగా ఇద్దరు ఖాన్ స్టార్లు. ఖాన్ స్టార్ల విషయమే తీసుకుంటే,  వాళ్ళు తాము కొనసాగుతున్న  బాలీవుడ్ రంగంలో నిర్మాతల నుంచో, దర్శకుల నుంచో అలాటి అసహనాన్ని గానీ, వివక్షని గానీ, అణిచివేతని గానీ ఎప్పుడైనా ఎదుర్కొన్నారా అని అడగాలి. వీళ్ళని మోస్తూ ఇంతటి వాళ్ళని చేసిందెవరని కూడా అడగాలి. అసలు బాలీవుడ్ ఒక సెక్యులర్ రంగం, ఇక్కడ అందరి సహకారంతో మైనారిటీలమైన మేము ఇంతటి వాళ్ళమాయ్యమని ఎప్పుడైనా చెప్పుకున్నారా?  అలాంటప్పుడు దేశం గురించి మాట్లాడ్డం ఏం బావుంటుంది. 
          ఇప్పుడు తాజాగా ప్రముఖ నిర్మాత, దర్శకుడు కరణ్ జోహార్ ఆరిపోతున్న అసహనం  కుంపటిని రగిలించారు. యధావిధిగా మళ్ళీ దీనిమీద రాజకీయ పార్టీలు గళమెత్తాయి.
         
ఇలా బాలీవుడ్ ప్రముఖులే  ఎందుకు అసహనం గురించి మాటాడుతున్నారు. దేశంలో మిగతా బెంగాలీ, తమిళ, మలయాళ, తెలుగు, కన్నడ తదితర సినిమా పరిశ్రమల నుంచి ఈ వ్యాఖ్యలు ఎందుకు రావడం లేదు. ఇక్కడి వ్యక్తులకి దేశంలో అసహనముందని అన్పించడం లేదా, లేక పోతే మనకెందుకులే అనుకుని మౌనం దాల్చారా? ఈ విషయంలో బాలీవుడ్ ప్రముఖుల్ని సమర్ధిస్తున్నారా, వ్యతిరేకిస్తున్నారా?          అసలు బాలీవుడ్ ప్రముఖులకి దేశంలో అసహనం వుందని ఎందుకు అన్పించింది. అన్పించినా ఎందుకు కల్పించుకోవాల్సి వచ్చింది. మౌలికంగా కొన్ని అవాంఛనీయ సంఘటనల దృష్ట్యా  బాలీవుడ్ తో సంబంధంలేని కొందరు మేధావులూ, రచయితలూ అసహనం మీద మాట్లాడడం మొదలు పెట్టారు. అవార్డులు వెనక్కి ఇవ్వడం మొదలెట్టారు. దీంతో బాలీవుడ్ లో  కూడా రాగాలు తీయడం మొదలెట్టారు. అకాడెమిక్ మేధావులు చూసుకుంటున్న అంశంలో  వాళ్ళతో  ఎందులోనూ పోలికగానీ, సంబంధంగానీ  లేని, కమర్షియల్ సినిమాలు తీసి జనాన్ని వినోదపర్చే బాలీవుడ్ వ్యక్తులు ఎందుకు జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. ప్రజాసమస్యల మీద సినిమాలు తీయని బాలీవుడ్ కి అకస్మాత్తుగా ఈ స్పృహ ఏమిటి
          తాము తీసే  సినిమాల మీద దాడులు జరిగినప్పుడో, అవి నిషేధానికి గురయినప్పుడో  అసహనమంటూ మాట్లాడితే అర్ధముంది. అంతవరకే సంబంధం. కానప్పుడు అరకొర జ్ఞానంతో దేశ సమస్యల్లో జోక్యం చేసుకుంటే శృంగభంగమే బహుమానం.  అసహనం గురించి  ఈ గళాల్నిచూసి చూసి,  ఇందుకే శత్రుఘ్న సిన్హా సినిమా స్టార్లు రాజకీయాలు  మాట్లాడ వద్దన్నారు. 
         
 కానీ స్టార్లు ఇలా తమకి వ్యతిరేకంగా రాజకీయాలు మాట్లాడేస్తూంటే, చాప కింద నీ రొచ్చేస్తున్నట్టు కేంద్రంలో అధికార పార్టీ కంగారు పడిపోవడం, దీన్ని చూసి ప్రతిపక్షాలు ఆ వ్యాఖ్యల్ని పట్టుకుని అధికార పార్టీని  ఇరుకున బెట్టాలని చూడ్డం పదేపదే జరిగిపోతోంది. ఏమో, ఏం చెప్పగలం.. రేపు ఈ సినీ సెలబ్రిటీలే  తమ పార్టీల్లో చేరి ఓట్లు రాల్చే అధిదేవత లవుతారేమో. 
         
తాజాగా కరణ్ జోహార్ వ్యాఖ్య- దేశంలో భావ స్వేచ్చ ఒక జోక్-  ప్రజాస్వామ్యం రెండో పెద్ద జోక్ అని! తక్షణం దీన్ని పట్టుకుని, ఇదేదో విచారణా  సంఘం రిపోర్టు అయినట్టు, కాంగ్రెస్ వెళ్లి బీజేపీ మీద పడడం,  రొటీన్ గా బిజేపీ ఆ రిపోర్టుని తిప్పికొట్టడం జరిగిపోయాయి. చూస్తే ఈ పార్టీలు ఒక్కో బాలీవుడ్ ప్రముఖుడు అసహనం గురించి ఒక్కో విచారణా  సంఘం రిపోర్టు విడుదల చేస్తున్నట్టే భావిస్తున్నట్టున్నాయి. వాటికంత విలువిచ్చి రాద్ధాంతం చేస్తున్నాయి. ప్రముఖ వార్త చేస్తున్నాయి. అందుకే కాబోలు  కాంగ్రెస్  పార్టీకి చెందిన మనీష్ తివారీ, కరణ్ జోహార్ ని వెనకేసుకొస్తూ -  మోడీ ప్రభుత్వం ఇంటలెక్చువల్స్ కి వ్యతిరేకమని కేంద్రం మీద విరుచుకు పడ్డారు. విచారణా సంఘం రిపోర్టిచ్చారంటే  కరణ్ జోహార్ ఇంటలెక్చువల్లే అయివుండాలి. ఇంతకి ముందు రిపోర్టు లిచ్చిన బాలీవుడ్ స్టార్లు కూడా ఇంటలెక్చువల్సే అన్నమాట. పాపం అసహనం ఎజెండాతో ప్రారంభమైన అసలైన  ఇంటలెక్చువల్స్ ఈ బాలీవుడ్ హైజాకింగ్ ని చూస్తూ వున్నారు. కరణ్ జోహార్ మసాలా సినిమాలు తీయకుండా, దేశసమస్యల మీద వివాదాస్పద సినిమాలు తీసి వ్యతిరేకత నెదుర్కొన్నప్పుడు,  భావ స్వేచ్చ గురించి, ప్రజాస్వామ్యం గురించీ మాట్లాడవచ్చు. బాలీవుడ్ సినిమాల కిస్తున్నంత స్వేచ్చ ప్రాంతీయ సినిమాల కివ్వడం లేదు సెన్సార్ బోర్డులు. 
       
టాలీవుడ్ లో బాలీవుడ్ కి మించిన ఫైర్ బ్రాండ్ స్టార్- పోలిటీషియన్ వున్నారు. ఆయనెప్పుడూ  విచారణా సంఘం రిపోర్టులు ఇవ్వలేదు. దాని మీద రాజకీయ పార్టీలు పోట్లా డుకోనూ లేదు. ఇస్తే గిస్తే అప్పుడప్పుడు మాత్రమే సెలెక్టివ్ గా ప్రజల్లోకి వెళ్లి సమతూకంతో గ్రౌండ్ రిపోర్టు లిస్తారు. తోచినప్పుడు మాత్రమే ప్రజల్లోకి వెళ్ళడం, సమతూకం పాటించడం, ఈ రెండిటి వల్ల మేధావులూ రాజకీయనాయకులూ నోళ్ళు మెదపలేక  పోతున్నారు. బాలీవుడ్ మేధావులుతాము దేశానికే ప్రతినిధులమని భావించుకుంటే భావించుకోవచ్చు. కానీ టాలీవుడ్ ని  కేవలం తెలుగు సినిమాలు రీమేక్ చేసుకోవడానికి మాత్రమే  ఉపయోగించుకోకుండా, ఇక్కడి రాజకీయ టాలెంట్ ని కూడా గుర్తించి, ఆ ప్రకారం కాస్త ప్రజల్లోకి వెళ్లివస్తూ,  గ్రౌండ్ రిపోర్టు లివ్వడం నేర్చుకుంటే ఏ పేచీ వుండదు. లేకపోతే ఇలా స్వయం ప్రతిష్ఠాపిత విచారణా సంఘాల  రిపోర్టులతో ఎప్పటికీ శృంగభంగాలే!

-సికిందర్