రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

15, జూన్ 2015, సోమవారం

నాటి రహస్యం!


          జానపద వీరుణ్ణి కౌబాయ్ హీరోగా మార్చేసి, మొత్తం భారతీయ సినిమానే కొత్త జానర్ లోకి కదం తొక్కించిన యాక్షన్ సినిమాల డైరెక్టర్ కె ఎస్ ఆర్ దాస్. కె ఎస్ ఆర్  దాస్ - కృష్ణ- ఓ కౌబాయ్ పాత్రా కలిస్తే అదొక ‘మోసగాళ్ళకు మోసగాడు’ అయి తెలుగు ప్రేక్షకుల్ని ఉర్రూతలూగిస్తే, మళ్ళీ భాష మార్చుకుని నూట పాతిక దేశాల్లో ‘ట్రెజర్ హంట్’ గా డబ్బింగై రికార్డులు కూడా  సృష్టించింది!  
          ఇవ్వాళ్ళ నాలుగైదు దేశాల్లో ఓవర్సీస్ వ్యాపారం చేసుకోగల్గుతోంది తెలుగు సినిమా. దీన్నే ‘ప్రపంచవ్యాప్తంగా విడుదల’ అంటున్నారు. కానీ నాలుగు దశాబ్దాల క్రితమే ‘మోసగాళ్ళకు మోసగాడు’ సాధించిన యూనివర్శల్ సక్సెస్ స్టోరీ ముందు ఇదెంత! ఎల్లెలెరుగని సక్సెస్ కొత్త కొత్తగా చేసే సాహసాల వల్లే వస్తుంది!


ఇది హీరో కృష్ణ సాహసం. కానీ దీనికంటే ముందు కె ఎస్ ఆర్ దాస్ చేసిన సాహసం వుంది. 1970 లోనే విజయలలిత తో ‘రౌడీ రాణి’ తీసి, ఆలిండియా లోనే మొట్టమొదటి హీరోయిన్ ఓరియెంటెడ్ యాక్షన్ సినిమాగా ఆయన నిలబెట్టాడు. తనూ మొట్ట మొదటి యాక్షన్ సినిమా డైరెక్టర్ అయ్యాడు. అలాగే 1971 లో కృష్ణ నటిస్తూ నిర్మించిన ‘మోసగాళ్ళకు మోసగాడు’ తో దేశానికి మొట్ట మొదటి కౌబాయ్ సినిమాని అందిస్తూ, చరిత్రని సృష్టించాడు కె ఎస్ ఆర్ దాస్.   ప్రతీ ట్రెండ్ సెట్టర్ ఒక చారిత్రక అవసరం కోసం పుడతాడు. 1970 ల నాటికి ఆదరణ కోల్పోతున్న  జానపద సినిమాల స్లాట్ ని కె ఎస్ ఆర్ దాస్ తన కౌబాయ్- యాక్షన్ చిత్రాల పరంపరతో భర్తీ చేస్తూ, సగటు ప్రేక్షకుల్నితండోపతండాలుగా కొత్త ఉత్సాహంతో థియేటర్లకి రప్పించిన ఘనత సాధించాడు. కానీ ఏదైతే ఫారిన్ అన్పిస్తుందో దానికి సినిమా పండితుల ఆదరణ లభించదు. కాబట్టి యాక్షన్ దాదా దాస్ ఎలాటి అవార్డులకీ అర్హుడు కాలేకపోయారు. ఇది చూడముచ్చటగా సినిమా పండితులు చేసిన చారిత్రక తప్పిదం (ఈ వ్యాసం చదివి బెంగళూరు నుంచి కె ఎస్ ఆర్ దాస్ ఫోన్ చేసి బాధని పంచుకున్నారు).


      ‘మోసగాళ్ళకు మోసగాడు’ దాస్ కి 
దర్శకత్వంలో గోల్డ్ మెడల్ లాంటి సినిమా. ‘మెకన్నాస్ గోల్డ్’, ‘ద గుడ్ ద బ్యాడ్ ద అగ్లీ’ లాంటి హాలీవుడ్ సినిమాలు ఈ తెలుగు కౌబాయ్ కి స్ఫూర్తే గానీ నకలు కాదు. నేడు దృశ్యాలే యదేచ్ఛగా కాపీఅవుతున్న నేపధ్యంలో ‘మోసగాళ్ళకు మోసగాడు’ లో ప్రతీ దృశ్యం  సొంత సృష్టే కావడం గర్వకారణం. లేకపోతే  125 దేశాల్లో విడుదలైన దీని డబ్బింగ్ వెర్షన్ ని తిప్పికొట్టేసే  వాళ్ళు ప్రేక్షకులు. తెలుగు ప్రేక్షకులు ఎప్పటికీ గర్వ పడాల్సిన ఓ అద్భుత కౌబాయ్ సృష్టి ఈ సినిమాతో  చేశారు మహా కవి ఆరుద్ర. కవులేంటి, కౌబాయ్ లు రాయడమేంటని జుట్లు పీక్కోనక్కర్లేదు. ఆ రోజుల్లో కొందరు కవులూ రచయితలు కూడా నన్న విషయం మరువకూడదు. ఆరుద్ర అలాంటి సృష్టి చేస్తే, హాలీవుడ్ ప్రభావం పడనీ దర్శకుడు దాస్, ఛాయాగ్రాహకుడు వీఎస్సార్ స్వామి దీన్ని తెరకెక్కించారు. అప్పటివరకూ తెలుగు ప్రేక్షకులకి ఏమాత్రం పరిచయం లేని పరాయి పాత్రలో కలర్ కౌబాయ్ గా హీరో కృష్ణ సూటిగా వాళ్ళ హృదయాల్లోకి దూసుకు పోయారు. అంతే, ప్రాణాంతకమైన ఇంత రిస్కుతీసుకుని ఎక్కడో హాలీవుడ్ కౌబాయ్ పాత్రని తెలుగుకి నమ్మించి, టోకున అమ్మించేయడం మామూలు విజయం కాదు, విజయంన్నర విజయమది!

ఇంకా ఈ సినిమాతో ముందు కాలంలో ఎదురవబోయే ఓ సమస్య ని అప్పుడే ఊహించేసినట్టు, దానికో పరిష్కారాన్ని కూడా సూచించేశారు. ఇప్పుడు మారిపోయిన జీవన విధానంలో ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులు ఓ సినిమా దృశ్యం పై ధ్యాస పట్టే అటెన్షన్ స్పాన్  అనేది పది సెకన్లకి పడిపోయిందని హాలీవుడ్ ఆందోళన చెందుతోంది. దీంతో  తెలుగులో కూడా ఎంటీవీ తరహా హడావిడి మెరుపు షాట్స్ కట్ చేస్తున్నారు. దీనివల్ల పసలేని వాక్యాల్లా దృశ్యాలు తే లిపోతున్నాయి. దీనికో పరిష్కారంగా అన్నట్టు ‘మోసగాళ్ళకు మోసగాడు’ లో దృశ్యాత్మక వైభవాన్ని సంతరించిపెట్టారు. ఆ దృశ్యాత్మక వైభవాన్ని  హీరో పాత్ర ఆలంబనగా సృష్టించారు. వాణిజ్య సినిమాకి హీరో పాత్ర తప్ప మరేదీ ప్రధానాకర్షణ అవదు కాబట్టి,  దృశ్య దృశ్యానికీ మారిపోయే కొత్త కొత్త కౌబాయ్ డ్రెస్సులతో హీరో కృష్ణ కలర్ఫుల్ గా కనువిందు  చేస్తూంటే, ప్రేక్షకుల కళ్ళు తెరకి అతుక్కుపోక ఏమౌతాయి? అప్పుడు అటెన్షన్ స్పాన్ అనే వేధించే సమస్య కి స్థానం ఎక్కడుంటుంది? జీవన వేగంతో పరుగులెత్తే హడావిడీ బిజీ ప్రేక్షకుల పరధ్యానాన్ని దృశ్యం జయించాలంటే, ఎప్పటికప్పుడు అలరించే కంటెంటే ముఖ్యం తప్ప, ఎలాంటి ఫ్లాష్ కట్స్ లతో సారం లేని టెక్నాలజీ కాదని ఆనాడే తేటతెల్లం చేసింది ‘మోసగాళ్ళకు మోసగాడు’! 

     ఎర్రటి రాజస్థాన్ ఎడారులు, బికనీర్ కోట లు, ఆకుపచ్చ- నీలి వర్ణపు ప్రవాహంతో సట్లెజ్ నదీ తీరం, తెల్లటి సిమ్లా మంచుకొండలు, టిబెట్ పీఠభూమి, పాక్- చైనా సరిహద్దూ..ఇలా ఎన్నెన్నో అంతర్జాతీయ స్థాయి దృశ్యాల చిత్రీకరణలతో, ఉత్తర భారతాన్ని ప్రపంచానికి చూపెట్టిన దక్షిణ సినిమా ఇది!  మద్రాసు నుంచి ప్రత్యేక రైల్లో రాజస్థాన్ కి యూనిట్ అంతా తరలి వెళ్తోంటే సినిమా వర్గాల్లో ఆందోళన. ఇంత బరితెగించిన హంగామాతో పద్మాలయా బ్యానర్ ఉండేనా పోయేనా అని దిగులు. తీరా బాక్సాఫీసు వైపు చూశాక కళ్ళు చేదిరేట్టు  కనకవర్షం!

         కృష్ణ, విజయనిర్మల, నాగభూషణం, రావుగోపాలరావు, గుమ్మడి, కాంతారావు, ధూళిపాళ, సత్యనారాయణ, ప్రభాకరరెడ్డి, సాక్షి రంగారావు, త్యాగరాజు, ఆనందమోహన్, కాకరాల, గోకిన రామారావు, సి హెచ్ కృష్ణమూర్తి ...ఇంకా జ్యోతిలక్ష్మి, రాజసులోచన, శాంతకుమారి, ఎస్ వరలక్ష్మి, తదితర హేమాహేమీలతో  కూడిన భారీ తారాగణం!

          పాటలూ హిట్టే! స్వరకల్పన ఆదినారాయణరావు. గీతరచన ఆరుద్ర, అప్పలాచార్య. ‘కోరినది నెరవేరినది’, ‘గురిని సూటిగా చూసేవాడా’, ‘ఎలాగుంది ఎలాగుంది అబ్బాయా’..పాటలు మాంఛి కిక్కు. అప్పట్లోనే ఫిరోజ్ ఖాన్ తీసిన ‘అపరాథ్’ లోని ‘తుమ్ మిలే జో ముజే’ ( కిషోర్-ఆశా) పాట బాణీకి దగ్గరగా వుండే పాట ‘కోరినది నెరవేరినది’..

        నాగభూషణం తో  ఆరుద్ర యదేచ్ఛగా పలికించేసిన  ‘తల్లి ముండమొయ్య’ ఊతపదం, ‘నమ్మించి పుట్టి ముంచుతావురో కొడుకో! నీ కాష్ఠం వానొచ్చి ఆరిపోతుందిరో కొడుకో! నిన్ను నక్కలు పీక్కు తింటాయిరా కొడుకో- కొడుకో!!’ అనే తిట్లూ సెన్సార్ కి చిక్కకపోవడం అదో అద్భుతం!
     కృష్ణని కొత్తావతారంతో మొట్టమొదటి ఇండియన్ కౌబాయ్ గా ప్రెజెంట్ చేసిన నిపుణుల్లో ఇంకా కాస్ట్యూమర్స్ బాబూరావ్- వెంకట్రావులు, మేకప్ మాన్ మాధవరావు, ఫైట్ మాస్టర్స్ రాఘవులు- మాధవ్ ప్రభృతులు వున్నారు.

ఆరుద్రామృతం!
  ‘వెండి పలకల గ్లాసు’ వంటి డిటెక్టివ్ కథలు రాసిన ఆరుద్ర (భాగవతుల సదాశివ శంకరశాస్త్రి)  కి కౌబాయ్ యాక్షన్ రాయడం పెద్ద కష్టం కాకపోవచ్చు. కాకపోతే దాంతో తెలుగు ప్రేక్షకుల్ని ఒప్పించడం దగ్గరే వస్తుంది సమస్య. తెలుగు ప్రేక్షకుడు అసలే కొరకరాని కొయ్య. వాడికేం నచ్చుతుందో వాణ్ణి పుట్టించిన బ్రహ్మ కూడా కనుక్కోలేడు. మూసని వడ్డిస్తే ఎంతైనా ఆవురావురని ఆరగించేస్తాడని మాత్రం తెలుసు. కానీ ఆ  మూసలో నైనా ముక్కూ  మొహం తెలీని, విచిత్ర వేషధారి  కౌబాయ్ పాత్రని దించడమెలా?

         ‘ఏక్  నిరంజన్ ‘ లో పూరీ జగన్నాథ్ విదేశాల్లో కనిపించే బౌంటీ హంటర్ అనే పాత్రలో ప్రభాస్ ని చూపించాడు. అది నేటివిటీ లేక ప్రేక్షకులకి ఎక్కలేదు. ఆరుద్ర ఈ నేటివిటీ గురించే ఆలోచించి వుంటారు. తన కౌబాయ్ హీరో పాత్ర కూడా విదేశీ బౌంటీ హంటరే! అంటే నేరస్థుల్ని చట్టానికి పట్టించి తృణమో పణమో సంపాదించుకునేవాడు. అందుకని ఆరుద్ర కథని సమకాలీనం చేయకుండా తెలివిగా ఇండియాని ఏలిన బ్రిటిష్- ఫ్రెంచి ల కాలంలో స్థాపించారు. అనగనగా బొబ్బిలి యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళు అమరవీడు సంస్థానం మీద దాడి చేస్తారు. అక్కడ్నించీ మొదలెడితే గద్వాల, కర్నూలు సంస్థానాల వరకూ ఓ నిధికోసం వేట కొనసాగుతుంది. అప్పటి నేపధ్యవాతావరణం, ఆ నట్ట నడి తెలుగు ప్రాంతంలో విదేశీ సంస్కృతీ, నిధి వేటా అనేవి  ఆరుద్ర సృష్టించిన కృష్ణ ప్రసాద్ (కృష్ణ) పాత్రకి సరిపోయి- క్రిమినల్ పాత్రలో నాగభూషణాన్ని పదే పదే  పట్టిచ్చే బౌంటీ హంటర్ లాగా చూపించినా చెల్లిపోయింది. పైగా విలన్స్ కి బెజవాడ మంగయ్య, ఏలూరు లింగయ్య, నెల్లూరు రంగయ్య, చిత్తూరు చెంగయ్య, చెన్నపట్నం చిన్నయ్య..అంటూ మాస్ పేర్లు కూడా తగిలించడంతో అప్పటి నేలక్లాసు ప్రేక్షకులు పేచీ పెట్టకుండా ఆ పాత్రల్ని ఆనందంగా ‘ఓన్’ చేసేసుకున్నారు. 

            ఇక ఆరుద్ర ఈ యాక్షన్ కథ అల్లిన తీరు ఒక అద్భుత విన్యాసమనే చెప్పాలి. కథకి మెయిన్ లైన్ ఒకటి, లూప్ లైన్ ఒకటి పెట్టుకున్నారు. ఇక సరైన సమయంలో సరయిన నిర్ణయం అన్నట్టు కథేమిటో అప్పుడప్పుడే  చెప్పకుండా ప్రేక్షకుల్ని ఊరిస్తూ, ఓ చోట మెయిన్ లైన్లో లూప్ లైన్ ని కలిపేస్తూ పాయింటాఫ్ ఎటాక్ ని సృష్టించారు!

          ఇందువల్ల ఆలశ్యంగా వచ్చిన కథలో ఈ మొదటి మలుపు- టైమింగ్ ని కోల్పోయిందని అన్పించదు. మెయిన్ లైన్ లో సత్యనారాయణ  గ్యాంగ్ తో నిధికి సంబంధించిన కుట్రలు చూపిస్తూ, దీని బ్యాక్ డ్రాప్ లో దీనితో సంబంధంలేని లూప్ లైన్ లో కృష్ణ – నాగభూషణం ళ పరస్పరం దెబ్బ దీసుకునే ఎత్తుగడలతో వినోదాత్మక కథనం నడిపారు. ఫైనల్ గా కృష్ణని  నాగభూషణం అమాంతం పట్టేసుకుని కాళ్ళూ చేతులు కట్టేసి ఎడారిలో పడేసి పగదీర్చుకుని వెళ్ళిపోయాక, ఒంటెల బండిలో కొన ప్రాణాలతో వచ్చిన ఓ అపరిచిత వ్యక్తి  కృష్ణ చెవిలో నిధి గురించి రహస్యం చెప్పిపోయే ఘట్టం ( పాయింటాఫ్ ఎటాక్) తో,  ఈ లూప్ లైన్ కాస్తా మెయిన్ లైన్ తో స్పర్శిస్తుందన్నమాట  మాట! 

          ఇలా కథ, మాటలు, స్క్రీన్ ప్లే, పాటలూ అన్నీ ఆరుద్రే రాసుకుని వెళ్ళాక, ఒక ఎదురు చూడని అనుభవం ఎదురయ్యిందాయనకి. అదేమిటో సినీ విజ్ఞాన  విశారద ఎస్వీ రామారావు ఇలా చెప్పారు- ఆరుద్ర ఇంత అద్భుతంగా స్క్రిప్టు రాసి చూపించాక, ఆయన్నే దర్శకత్వం వహించమని పట్టుబట్టారు పద్మాలయా నిర్మాతలు జి. ఆది శేషగిరిరావు, జి. హనుమంతరావులు. అయితే ఆరుద్ర అసలు ఒప్పుకోలేదు!


 సికిందర్
ఫిబ్రవరి 2010 ‘సాక్షి’  



14, జూన్ 2015, ఆదివారం

ఇదే కథ?

కథ : మల్లాది వెంకటకృష్ణమూర్తి
తారాగణం :  ఛార్మీ,  సత్యదేవ్, బ్రహ్మానందం, టార్జాన్‌, సాక్షి రాంరెడ్డి తదితరులు
సంగీతం :  
సునీల్‌ కశ్యప్‌ ;   ఛాయాగ్రహణం :  పి.జి. విందా ;
బ్యానర్ : 
సి కె ఎంటర్‌టైన్‌మెంట్స్‌ ప్రై.లి. ; శ్రీ శుభస్వేత ; సమర్పణ: ఛార్మి కౌర్‌ ;
నిర్మాతలు: శ్వేతాలానా, వరుణ్‌, తేజ ;  సహ నిర్మాత: బి.ఏ. రాజు
రచన – దర్శకత్వం :  పూరీ జగన్నాథ్
విడుదల :  జూన్  12, 2015     సెన్సార్ :  U/A
*

టాప్ డైరెక్టర్ చిన్న బడ్జెట్ సినిమాకి దర్శకత్వం వహిస్తే అదెలాటి రూపం ధరిస్తుంది?  అది కూడా బిగ్ బడ్జెట్ యాక్షన్ సినిమాల బిల్డప్స్ తోనే  కృత్రిమంగా వుండి తీరుతుంది. టాప్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్  తన ప్రారంభదినాల్లో తీసిన ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ లాంటి సున్నిత కథా చిత్రం ఇంకెప్పుడైనా తీయగలరా? అనుమానమే! ఆయన ‘జ్యోతిలక్ష్మి’ అనే ‘మిసెస్ పరాంకుశం’ నవలాధారంగా చిన్న కథతో కూడిన స్మాల్ మూవీని కూడా ‘టెంపర్’ లాంటి వయొలెంట్ మూవీ హంగామా తోనే చాతనయినంత  గజిబిజి చేయగలరు.  టాప్ హీరోలతో బిగ్ యాక్షన్ మూవీస్ తీసీ తీసీ  అక్కడే ఘనీభవించిన క్రియేటివిటీ తాలూకు ప్రభావమేమో ఇది!

          దాదాపు నలభై ఏళ్ల క్రితం  ప్రసిద్ధ నవలారచయిత మల్లాది వెంకటకృష్ణమూర్తి రాసిన నవల ‘మిసెస్ పరాంకుశం’ ఆధారంగా ఈ సినిమా తీశామన్నారు. మూలకథ తీసుకుని మిగతా నేపధ్య వాతావరణాన్ని తప్పకుండా ఈ కాలానికి తగ్గట్టు అప్ డేట్ చేయాల్సిందే సినిమాకోసం. ఐతే ఇలా జరిగిందా? చూద్దాం..

రెండు కథల రంగేళి!
       సత్య ( సత్యదేవ్) ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగి. అతడికి ఓ వేశ్యని ప్రేమించి పెళ్ళాడాలని వుంటుంది. అలాటి ఓ వేశ్య జ్యోతి లక్ష్మి( ఛార్మీ) ఓ చోట కంటపడి మిస్సవుతుంది. ఆమె కోసం వెతుకులాట అతణ్ణి ఓ వ్యభిచార గృహానికి చేరవేస్తుంది. అక్కడే ఆమెని కలుస్తూ ప్రేమిస్తూ ఉంటాడు. ఇతణ్ణి పిచ్చి వాడి కింద జమకడుతుంది. పెళ్ళికూడా చేసుకుంటానంటాడు. ఇంకా పిచ్చివాడి కింద లెక్కేస్తుంది. ఎలాగో ఒప్పించి ఆమెని తీసుకుని పారిపోతాడు. పెళ్లి చేసుకుంటాడు. ఈ పెళ్ళికి అతడి అక్క కూడా వుంటుంది. కాపురం పెడతారు. మొదటి రాత్రే కండోమ్ గురించి గొడవపడి తాళిని తెంపేస్తుంది. మళ్ళీ రాజీ పడుతుంది. ఈమెని పట్టుకోవడం కోసం బ్రోతల్ హౌస్ ఓనర్ ప్రయత్నిస్తూంటాడు. సత్యని గాయపరుస్తాడు. 

          ఇలా వుండగా అటు వేశ్యా గృహంలో ఓ అమ్మాయిని పోలీస్ కేసులో ఇరికించి ఆమె కుటుంబం పరువు తీస్తాడు బ్రోతల్ హౌస్ ఓనర్. ఆమె ఆత్మహత్య చేసుకుంటుంది. దీంతో జ్యోతి లక్ష్మి ‘నేను వెళ్ళనా అంటుంది?’ వెళ్ళ మంటాడు సత్య. ఇక జ్యోతిలక్ష్మి చెలరేగి ఆ వ్యభిచార కొంపని మూయించడం కోసం, వ్యభిచారిణులకి వాళ్ళ విటుల చేత తగిన న్యాయం జరిపించడం కోసం పోరాటం మొదలెడుతుంది..

          ఇలా తయారయింది కథ! ఫస్టాఫ్ సత్య కథ, సెకండాఫ్ వ్యభిచారిణుల కథ!

స్క్రీన్ ప్లే సంగతులు 
             ఒక నవలని సినిమాగా మార్చారు. మార్చినప్పుడు సగం నవల్లో వున్న కథ, మిగతా సగం పూరీ మార్కు అతికించిన కట్ అండ్ పేస్ట్ కథతో సినిమా తీశారు. దీంతో ఇది ఫస్టాఫ్ ఒక కథ- సెకండాఫ్ దాంతో సంబంధం లేని ఇంకో వ్యవహారంగా  తయారయ్యింది. ఇలాటి వింత సినిమాలు గతంలో తెలుగులోనూ, హిందీలోనూ  కొన్ని వచ్చాయి. తెలుగులో రవితేజ ‘దొంగోడు’, జగపతిబాబు ‘ధమ్’, హిందీలో సల్మాన్ ఖాన్ ‘తెరేనామ్’, టబూ ‘హవా’ లాంటివి ఈ కోవకే చెందుతాయి.

          ‘దొంగోడు’ కథా ప్రారంభంలో హీరో చిన్నప్పటి విషాదకర జీవితంతో అదొక కథాత్మగా ఏర్పడ్డ ‘సర్కిల్ ఆఫ్ బీయింగ్’ అనే స్క్రిప్టింగ్ టూల్ ని అందిపుచ్చుకుని అటుపైన కొనసాగాల్సి వుండగా, హీరో పెద్దయ్యాక దీని ఊసే లేక ఆ కథాత్మ తెగిపోతుంది!

          ‘థమ్’ లో నల్గురు యువకుల ప్రేమల్ని చక్కబర్చే హీరో కథగా నడుస్తున్న కథనం కాస్తా, పాత ప్రియురాలు కన్పించగానే హఠాత్తుగా వీళ్ళని వదిలి పారేసి, ఆమెతో ఆ హీరో ప్రేమాయణంగా కథ ప్లేటు ఫిరాయించి ధ్వంసమై పోతుంది!

          ‘తెరేనామ్’ లో కొనసాగుతున్న హీరో హీరోయిన్ల  ప్రేమలతో అస్సలు సంబంధంలేని ఇంకో కథతో అతుకు పడుతుంది!

           ‘హవా’లో- తల్లి కథగా నడుస్తున్న కథనం కాస్తా- ఆమె కూతురి కథగా కథనం మార్చుకుని అలాగే ముగుస్తుంది!

          అలాగే ‘జ్యోతి లక్ష్మి’ లోనూ వేశ్యని  ప్రేమించి పెళ్ళాడిన కథగా నడుస్తున్న పెళ్లి కథ కాస్తా, దాన్ని వదిలేసి పక్కా వేశ్యాగృహపు యాక్షన్ కథలోకి దిగిపోయింది!


        ఈ వ్యాధిని సెకండాఫ్ సిండ్రోమ్ అంటారు. ఫస్టాఫ్ వరకూ కథ నడుపుకుంటూ వచ్చాక- ఇక ఆ ఇంటర్వెల్ ఘట్టం అనే చౌరాస్తా నుంచి ఎటు వెళ్ళాలో అర్ధంగాక, రాంగ్ రూటులో వెళ్తున్నామని కూడా తెలుసుకోకుండా, సెకండాఫ్  అనే చిట్టడవి లోకి స్టయిలుగా అడుగు పెట్టేయడం ఈ వ్యాధి లక్షణం.  

          ఇంటర్వెల్ దగ్గర నించుని సెకండాఫ్ లోకి చూస్తే అదొక దారీ తెన్నూ తెలీని చిట్టడవి లాగా ఎందుకు కన్పిస్తుందంటే, కథకి ఓ స్ట్రక్చర్ అనేది ఉంటుందని తెలియక పోవడం వల్ల.  ఆ స్ట్రక్చర్ ని కచ్చితంగా పాటించి తీరాలని తెలియక పోవడం వల్ల. లేదా తెలిసీ ప్రయోగాలు చేద్దామని అనుకోవడం వల్ల. ఐతే ప్రయోగం దేంతో చేస్తున్నారనేది ప్రశ్న. స్ట్రక్చర్ తోనా? ట్రీట్ ఏమంట్ తోనా? 

          తెలియక స్ట్రక్చర్ తోనే ప్రయోగాలు చేసేస్తున్నారు! ప్రయోగాలు చేయడంగానీ, ఉన్న రూల్స్ ని బ్రేక్ చేయడంగానీ  ఎక్కడ జరగవచ్చంటే- ట్రీట్ మెంట్ తోనే ! స్ట్రక్చర్ ర్ తో ప్రయోగాలు చేయబోతే ఇలాటి ‘జ్యోతిలక్ష్మి’ లాంటి సినిమాలే వస్తాయి!

          స్ట్రక్చర్ అనేది ఒక ఇంజనీరింగ్ వ్యవస్థ అనుకుంటే, దాని మీద కథకి ఇచ్చే ట్రీట్ మెంట్ అనేది క్రియేటివ్ ప్రక్రియ. స్ట్రక్చర్ ఒక మారని సైన్స్ అయితే, ట్రీట్ మెంట్ ఎలాగైనా మార్చుకునే వీలున్న క్రియేటివ్ అభివ్యక్తి. అందరిలాగా ఒక యాక్షన్ సీనుతో నేనెందుకు సినిమా ప్రారంభిస్తాను, నేను కామెడీతో మొదలెడతాను- అనుకోవడమే  క్రియేటివిటీ పరంగా రూల్స్ ని బ్రేక్ చేయడం, అంతేగానీ స్ట్రక్చర్ పరంగా కాదు. బిగినింగ్, మిడిల్, ఎండ్ నియమనిబంధనలతో స్ట్రక్చర్ శాశ్వతం. దీన్ని బ్రేక్ చేస్తే అర్ధంపర్ధం లేని కథలే వస్తాయి. 

          ‘A general conventional story telling structure is necessary. If you want to violate those rules, those beginning, middle and end rules, and be truly avant garde, then I am not sure that you are going to be helped by anybody’s advice on screen writing. 

          The only advice you can get is somewhat conventional, but those kinds of stories have worked for thousands of years and will continue to work. The thing is to find new ways to tell them and surprise along the way…
—Lawrence Conner 

          (వేల సంవత్సరాలుగా ఆకట్టుకుంటూ ఇంకా మున్ముందు కూడా ఆకట్టుకోగల సాంప్రదాయ నిర్మాణాన్ని కలిగివుండే కథల నిర్మాణపరమైన నియమ నిబంధనల్ని ఉల్లంఘించి, అవాంట్ గార్డ్ పద్ధతిలో అంటే- కమర్షియలేతర యూరోపియన్ సినిమాల తరహాలో- ఇంకా చెప్పాలంటే మన ఆర్ట్ సినిమా టైపులోనే - కథ చెప్పాలనుకుంటే మిమ్మల్ని కాపాడే వారెవరూ ఉండరని అంటున్నాడు ఇంటర్నెట్ స్క్రీన్ రైటింగ్ కోర్సు ఎడిటర్ లారెన్స్ కానర్. కనుక సాంప్రదాయబద్ధంగానే ( అంటే బిగినింగ్-మిడిల్-ఎండ్ నియమ నిబంధనల్ని పాటిస్తూ) కథ చెప్పాలనీ, చెబుతూ అందులోనే కొత్తగా, ఆశర్యపర్చే విధంగా కథనం చేసుకోవాలనీ చెబుతున్నాడు. ఇలా చెప్పే వాళ్ళు తెలుగు ఫీల్డులో లేరు! )

          ఇంతకీ ఏమిటా యుగాలుగా పాటిస్తూ వస్తున్న సాంప్రదాయబద్ధమైన నియమ నిబంధనలు? ఈ బ్లాగులో పదేపదే చెప్పుకోవడం బోరుగానే ఉండొచ్చు. బిగినింగ్ రూల్ ఏమిటంటే దాని చివర్న సాధించాల్సిన సమస్యని ఏర్పాటు చేయడం. మిడిల్ రూల్ ఏమిటంటే ఆ సమస్య ని సాధించడానికి సంఘర్షించడం, ఎండ్ రూల్ ఏమిటంటే ఆ సమస్యకి సముచితమైన పరిష్కార మార్గాన్ని కనుగొనడం.

          ఒక నిర్ణీత సమస్య, ఆ నిర్ణీత సమస్యతో మాత్రమే సంఘర్షణ, ఆ నిర్ణీత సమస్యకి మాత్రమే పరిష్కారం- ఇవి పరస్పరాధారభూతాలు. వీటిని ఒకదాన్నుంచి ఇంకోటి విడగొట్టలేం. ఏర్పాటు చేసిన నిర్ణీత సమస్యని వదిలిపెట్టి, ఇంకో సమస్య ఎత్తుకుని ఆ సమస్యని పరిష్కరించడం కథ కాదు. రోగి ఒక రోగం పేరు చెప్పాక, వైద్యుడు దానికి మందులు రాస్తూంటే, మళ్ళీ రోగి రోగం అది కాదనీ, ఫలానా ఇదీ అని ప్లేటు ఫిరాయిస్తే, వైద్యుడు ఈ చీటీ చించి పారేసి, ఇంకో చీటీ మీద వేరే మందులు రాస్తాడనుకోం - నాల్గు పీకవచ్చు రోగిని పట్టుకుని!

          పైన పేర్కొన్నట్టు అవాంట్ గార్డ్- యూరోపియన్ సినిమాలకీ - మన ఆర్ట్ సినిమాలకీ, ఇప్పుడొస్తున్న ఇండీ ఫిలిమ్స్ కీ -  స్ట్రక్చర్ వుండదు. అందుకే ఇవి ఆబాలగోపాలాన్ని ఆకట్టుకోవు, ఫిలిం ఫెస్టివల్స్ లో మేధావుల్ని సంతృప్తి పరుస్తాయి. ఇప్పుడు ‘జ్యోతి లక్ష్మి’ స్ట్రక్చర్ ఎలా  వుందో చూద్దాం.

          సమయం వృధా చేయకుండా బిగినింగ్ ని సరీగ్గా అరగంటలో ముగిస్తూ,  హీరో చేత జ్యోతిలక్ష్మికి తను ప్రేమిస్తున్నట్టు చెప్పించారు. ఈ టర్నింగ్ పాయింటుతో కథలోకి ఎంటర్ అయ్యారు. ఈ టర్నింగ్ పాయింట్- స్టోరీ పాయింట్ – లేదా సమస్య ని ఏర్పాటు చేస్తూ  బిగినింగ్ అధ్యాయాన్ని బాగానే ముగించారు. 

          ఇక్కడ్నించీ మిడిల్ అధ్యాయాన్ని ప్రారంభించారు. జ్యోతిలక్ష్మితో ప్రేమకోసం హీరోకి స్ట్రగుల్  పెట్టి  మిడిల్ నియమాలకి న్యాయం చేశారు. అప్పుడు ఇంటర్వెల్ కి లీడ్ చేసేందుకు సీన్ ని క్రియేట్ చేస్తూ- (పించ్ -1, లేదా ఉత్ప్రేరకం- 1) హీరో చేత జ్యోతిలక్ష్మికి పెళ్లిని ప్రతిపాదించారు. పెళ్లి జరిపించారు. ఇంటర్వెల్లో మొదటి రాత్రి తగాదా పెట్టించి జ్యోతి లక్ష్మి చేత తాళిని తెంపించేశారు. ఇలా మిడిల్ అధ్యాయంలో మిడ్ పాయింట్ కి చేరింది కథ. 

          ఏ కథ? మొదలెట్టిన సత్య కథ. ఇది సత్య కథెందుకయ్యింది? బిగినింగ్ లో, మిడిల్ లో జ్యోతిలక్ష్మిని పొందేందుకు ప్రయత్నించింది అతనే కాబట్టి.  అతడికోసం ఆమె ప్రయత్నించ లేదు కాబట్టి. ఆమెని జీవితంలోకి తెచ్చుకుని తీరా ఇంటర్వెల్లో ఆమె తాళిని తెంపేస్తే బాధతో అలమటించింది అతను కాబట్టి. 

          కనుక యీ మిడిల్ లో మిడ్ పాయింట్ (ఇంటర్వెల్) దగ్గర్నుంచీ ఇతడి కథే ఆమెతో సంఘర్షణతో కొనసాగాలి. ఇలా జరగలేదు. బ్రోతల్ హౌస్ ఓనర్ జ్యోతిలక్ష్మి కోసం సృష్టించే హింసతో మొదలేట్టేశారు. బిగినింగ్ లో జ్యోతిలక్ష్మి అనే కొరకరాని కొయ్యతో హీరోకి ఏర్పాటు చేసిన ఆసక్తి గొలిపే సమస్యని వదిలేసి, వ్యక్తిత్వాల వైరుధ్యాలతో అదెలా పరిష్కార మయ్యిందో చూపించడం మానేసి, జ్యోతిలక్ష్మీకి  – ఆ బ్రోతల్ హౌస్ ఓనర్ కీ మధ్య సమస్యగా కొత్త కథ ఎత్తుకుని యాక్షన్ సీన్లతో నింపేశారు!  
   
          ఒక నిర్ణీత సమస్య, ఆ నిర్ణీత సమస్యతో మాత్రమే సంఘర్షణ, ఆ నిర్ణీత సమస్యకి మాత్రమే పరిష్కారం- అన్న ఏక సూత్రతని, కామన్స్ సెన్స్ నీ గాలికి వదిలిపారేశారు! 

          టాప్ డైరక్టర్ అంటే అన్ని సెన్సిబిలిటీస్ నీ బుల్ డోజ్ చేసుకుపోయే ఇల్లాజికల్ తస్మాత్ జాగ్రత్త మూసఫార్ములా మాంత్రికుడేమో! ఒక స్మాల్ మూవీని జాతీయ స్థాయికి చేర్చడానికి మనస్కరించని వెల్త్ క్రియేటరేమో!!

          స్ట్రక్చర్ ప్రకారం బిగినింగ్ లో హీరోకి సమస్య ఏర్పాటు చేశాక, పించ్ వన్ దగ్గర అతడి పెళ్లి ప్రయత్నం మొదలెట్టాక, పెళ్లి చేశాక ఇంటర్వెల్లో అతడిని పెద్ద రిస్కులో పడేశాకా- సెకండాఫ్ లో ఈ మిడిల్ ని ముగించడానికి  లీడ్ గా వేసిన  పించ్-2  దగ్గర,  అతడిసమస్య ఊసే లేకుండా, కథా లేకుండా, వేరే బ్రోతల్ అమ్మాయి ఆత్మహత్యని సృష్టించారు! ఇక దీన్ని పట్టుకుని జ్యోతిలక్ష్మిని వేశ్యల సమస్యమీద యుద్ధానికి పంపేశారు! ఓహ్ గాడ్!!

          ఈ కింది రెండు పటాల్లో ఎలా ఉండాల్సిన కథ ( స్ట్రక్చర్) ఎలా మారిపోయిందో గమనించవచ్చు..
ఉండాల్సిన కథ (స్ట్రక్చర్)

ఉన్న కథ (స్ట్రక్చర్)  

 దీంతో ఏం సినిమా చూశామో అర్ధం కాని పరిస్థితి. మల్లాది రాసిన నవలలో హీరో ఓ వేశ్యని పెళ్లి చేసుకుని ఇల్లాలిగా మర్చాలనుకుంటాడు. ఆ ప్రయత్నంలో అతను ఎదుర్కొనే కష్టాలూ అవమానాలతో కూడిన కథ అది. సినిమాలో ఈ కథ మొదలెట్టి సగం వరకూ చెప్పి వదిలేసి మరో కథ ఎత్తుకోవడం అన్యాయం. ఈ మరో కథ ఎత్తుకోవడం వల్ల, మొదలెట్టిన సెకను నుంచే చివరి సెకను వరకూ ఒకటే వ్యభిచార కొంప గోలగా – ఓ డార్క్ మూవీలాగా తయారయ్యింది మొత్తం వ్యవహారం!


పాత్రోచితానుచితాలు
           మొదలెట్టిన కథ ప్రకారం చూస్తే,  టైటిల్ రోల్లో జ్యోతిలక్ష్మి పాత్ర యాంటీ హీరోయిన్ పాత్ర అవుతుంది. అంతేగానీ  ఎట్టి పరిస్థితిలోనూ ఆమె సెకండాఫ్ లో చూపిన విధంగా వీర హరోయిన్ అయ్యే అవకాశం లేదు. ఈ సినిమాలో పాత్ర చిత్రణలు పూర్తిగా విఫలమయ్యాయి. పాపం జ్యోతి లక్ష్మిని ఉద్ధరించాలనుకున్న హీరో ఏమైపోయాడో, జ్యోతి లక్ష్మి ఎవరో వేశ్యల్ని ఉద్ధరించడానికి బయల్దేరింది! హీరోని అర్ధం జేసుకుని తను మారదు గాని, ఎవర్నో మార్చడానికి వెళ్తుందట!

          హీరో ఆమెని బయట ఎక్కడో చూసి ప్రేమించానంటాడు. ఆమె ఎక్కడుంటుందో  తెలుసుకోవడం కోసం ఓ బ్రోకర్ ని పట్టుకుని నానా ప్రయత్నాలూ చేస్తాడు. ఆమె పట్టపగలు నడి  రోడ్డుమీద ఒక విటుడి దగ్గర డబ్బులు తీసుకుంటూంటే, హీరో చూసి ఆమే కావాలని డిసైడ్ అయిపోయాడు. అలా ఆమె ఒక సందులో అనాధ పిల్లలకి డబ్బిచ్చి పోతూంటే కూడా హీరో చూశాడు. ఆ తర్వాత ఆమె మిస్సయ్యింది.  హీరో ఆ అనాధ పిల్లల దగ్గరి కెళ్ళి ఆమె గురించి అడిగితే, ఆమె ప్రతిరోజూ వచ్చి డబ్బిచ్చి పోతూంటుందని ఆ పిల్లలు చెప్తారు. అలాంటప్పుడు ఆ మర్నాడు హీరో అక్కడే కాపలా కాస్తే ఆమె దొరికిపోతుంది కదా? బ్రోకర్ని పెట్టుకుని ఊరంతా వెతకడమేంటి!! సినిమా ప్రారంభంనుంచీ ఓ పదినిమిషాల చిత్రీకరణ అంతా డబ్బు వృధా కదా?

          జ్యోతిలక్ష్మే కాదు, ఆ బ్రోతల్ హౌస్ లోంచి ఇంకే వేశ్యా బయటికి వెళ్లేందుకు వీల్లేనంత గృహ నిర్బంధంలో వుంటారు. అలాంటప్పుడు జ్యోతి లక్ష్మి రోజూ బయటికి వస్తున్నట్టు హీరో పాయింటాఫ్ వ్యూలో ఎలా చెప్పించారు / చూపించారు?

          ఆమెకి బయట తిరిగే స్వేచ్చే గనుక వుంటే,  హీరో బయటే ఆమెని కలుసుకోవచ్చుగా- పనిగట్టుకుని బ్రోతల్ హౌస్ కి వెళ్లి కలవాల్సిన  అవసరమేమిటి?

          ఆమెని బయటే ప్రేమించి, బయటే పెళ్ళి ప్రతిపాదనతో తీసికెళ్ళి పోవచ్చుగా- బ్రోతల్ హౌస్ లోంచి సాహసం చేసి- గూండాలని తప్పించుకుని తీసుకు పారిపోవాల్సిన అవసరమేమిటి?

          ఒక సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన హీరోకి టెక్నాలజీ గురించి బ్రోకర్ అన్ని క్లాసులు తీసుకోవడమేమిటి? 

          హీరో జ్యోతిలక్ష్మి  పెళ్లి చేసుకున్నాక హీరో అక్కని బస్సెక్కిస్తూంటే, అక్కడే ఒకడ్ని చావదన్నుతున్న బ్రోతల్ హౌస్ ఓనర్, జ్యోతిలక్ష్మిని చూసి అప్పుడే పట్టుకోకుండా- బ్రోతల్ హౌస్ కి వెళ్ళిపోయి- తబలావాయిస్తూ అనుచరుల్ని తన్నించదమేమిటి?
 
          హీరోని తీవ్రంగా గాయపరచిన సంఘటనలో హీరోకి సహకరిస్తున్న పోలీసు అధికారి మైపోయాడు? హీరో ఫ్రెండ్ కూడా ఏమై పోయాడు? సాఫ్ట్ వేర్ ఉద్యోగి అయిన హీరోకి ట్రీట్ మెంట్ కోసం అతడి ఎక్కౌంట్ లో డబ్బే ఉండదా? మెడిక్లెయిమే ఉండదా? ఇన్స్యూరెన్సే లేదా?జ్యోతిలక్ష్మి అంత యాతన పడాలా?

          పెళ్ళికి ముందు, పెళ్లి తర్వాత తనతో పోలీసుల ప్రవర్తన చూశాకే జ్యోతిలక్ష్మికి ఇల్లాలిగా వుండడంలోని గౌరవమేమిటో  తెలిసివచ్చిందా? ఆమె ఉన్నతి కోసం హీరో చేస్తున్న ప్రయత్నాలకి విలువేలేదా?

          ఇలా ఫేక్ క్యారక్టరైజేషన్స్ తో, ఫేక్ ఎమోషన్స్ తో, ఫేక్ విలువలతో సూడో మేధావితనానికి పోయిన కథనం గురించి ఇంత చాలు. సెకండాఫ్ లో బ్రోతల్ హౌస్- వేశ్యలూ వాళ్ళ ఉద్ధరణా- మేసేజ్ లతో కూడిన మూస యాక్షన్ స్టోరీ విశ్లేషణ జోలికి వెళ్ళడం లేదు –అది స్టోరీ కాదు కాబట్టి!



సికిందర్ 


          

 


          
          
          
         





6, జూన్ 2015, శనివారం

క్రైమ్మూస!





రచన, దర్శకత్వం: కృష్ణ విజయ్‌
తారాగణం: నారా రోహిత్‌, రవివర్మ, ప్రియా బెనర్జీ, మధు, సత్య తదితరులు
సంగీతం: సాయి కార్తీక్‌, కూర్పు: ధర్మేంద్ర కాకరాల, ఛాయాగ్రహణం: ఎస్‌.వి. విశ్వేశ్వర్‌.
 బ్యానర్‌: దేవాస్‌ మీడియా అండ్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌
నిర్మాతలు: శ్యామ్‌ దేవభక్తుని, కృష్ణ 
విడుదల  జూన్‌ 5, 2015
*
మూసకి భిన్నంగా కొత్త ఐడియాలతో  ముందుకొస్తున్న  దర్శకుల్ని ప్రోత్సహిస్తున్న హీరో నారా రోహిత్ ఈసారి తనని  ‘అసుర’ అనే  నెగెటివ్ టైటిల్ తో ప్రమోట్ చేసుకుంటూ  సినిమా నిర్మించడం ఓ ప్రయోగం అనకూడదు. కమర్షియల్ సినిమాల పేరిట ఇంకా పాత మూస ఫార్ములాలతో వస్తున్న సినిమాలే నిజానికి ఈ కాలంలో ప్రయోగాలు!  ‘అసుర’, ‘ దొంగాట’ లాంటి థ్రిల్లర్స్ ప్రయోగాలు అన్పించుకోవు, నేటి అత్యవసరం అన్పిస్తాయి!

          కొత్త దర్శకుడు కృష్ణ విజయ్ కొత్త కథని కొత్తగా చెప్పాలని పడ్డ  తాపత్రయం అభినందించదగ్గదే. చాలా మంచి రిలీఫ్ ఏమిటంటే, ఇందులో కామెడీ అనేదే కనపడకుండా  నిలువునా పాతరేయడం! అయినా ప్రేక్షకులు కదలకుండా చూడ్డం!  కామెడీ లేకపోతే, విలన్లు  నరుక్కుని పెడబొబ్బలు పెట్టకపోతే, ప్రేక్షకులేమైనా పారిపోతారా? అది ప్రతి ఏడాది వంద ఫ్లాప్స్ కి ఇంకో వంద ఫ్లాప్స్ ని జత చేస్తూ పోతున్న కూపస్థ మండూకాల భయాందోళనే!

          ‘అసుర’ అయినా మరోటయినా ఆఫ్ బీట్ మార్గం లో ఫ్రెష్ నెస్ తో రావడం ఇవ్వాళ్ళ చాలా అవసరం. చిన్న బడ్జెట్ సినిమా అంటే పసలేని ప్రేమ సినిమాలుగా మార్కెట్ ని కోల్పోయిన నేపధ్యంలో అటు బయ్యర్స్ వైపు నుంచి, ఇటు ప్రేక్షకుల వైపు నుంచీ ఒక శూన్యం ఏర్పడింది. ఈ శూన్యాన్ని భర్తీ  చేసే ఏకైక మార్గం ప్రేక్షకులు తప్పకుండా ఆదరించే ఆఫ్ బీట్ సినిమాల సంఖ్యే కావాలి. 

          ఐతే ఈ ఆఫ్ బీట్ సినిమాల కొత్త దర్శకులు గమనించాల్సిన విషయం  ఒకటుంది. ఆఫ్ బీట్ సినిమా అంటే మళ్ళీ అందులో మూస ఫార్ములా  కలపడం కాదు, అలా చేస్తే శూన్యాన్ని భర్తీ చేస్తూ ఏ సొమ్మూ చేసుకోలేరు. ఆఫ్ బీట్ ఆఫ్ బీటే- దాంట్లో మళ్ళీ మూస ఫార్ములాల్ని కలిపితే రెంటికీ చెడ్డ రేవడే. 

          ఒక జైలర్ కీ, ఉరిశిక్ష పడ్డ ఖైదీకీ మధ్య సంఘర్షణగా ‘అసుర’ ఆవిర్భవించినపుడు, నిజానికి ఇందులో జరిగిందేమిటో ఇప్పుడు  చూద్దాం..


అసురోపాఖ్యానం..
        ధర్మతేజ (నారా రోహిత్) ఓ జైలర్. విధి నిర్వహణలో రాక్షసుడు లాంటి వాడు. తప్పు చేస్తే ఎవర్నీ క్షమించడు. రాజమండ్రి సెంట్రల్ జైల్లో విధులు నిర్వహించే ఇతడికి ఓ క్లాస్ మేట్  - గర్ల్ ఫ్రెండ్  హారిక ( ప్రియా బెనర్జీ) కూడా వుంటుంది. వీళ్ళ ప్రేమకి ఈమె తండ్రి అంత ఇష్టంగా వుండడు. 

          ధర్మతేజ చిన్నప్పుడు తల్లిదంద్రుల్ని ఓ రాజకీయ నాయకుడు క్రూరంగా హత్య చేయడంతో, అన్యాయం- మోసం- చెడు చేసే వాళ్లకి బతికే హక్కు లేదనే దృక్పథంతో ఉంటాడు ధర్మ తేజ. 

          ఈ నేపధ్యంలో  ఓ ఉరిశిక్ష పడ్డ ఖైదీ చంద్రశేఖర్ అలియాస్ చార్లీ ( రవివర్మ) ని జైలుకి తెస్తారు. ఈ చార్లీ తన సవతి తల్లికీ, ఆమె పిల్లలకీ తన తండ్రి ఆస్తిపోతోందని మూకుమ్మడి హత్యలు చేసిన వాడు. ఆ హత్యాకాండ లోంచి సవతి తల్లి ఎలాగో తప్పించుకుంది. చార్లీ జువెలరీ బిజినెస్ చేసిన మల్టీమిలియనీర్. ఇతను ఈ ఉరిశిక్ష తప్పించుకుని బయట పడాలనే ఆలోచనతో ఉంటాడు. రాష్ట్రపతి క్షమాభిక్ష కూడా తిరస్కరించడంతో ఉరి తీసేందుకు సన్నద్ధ మవుతారు. తీరా ఉరితీసే సమయానికి డ్రగ్ సేవించడంతో ఆ ఉరి ఆగిపోతుంది. 

          ఇక జైల్లోనే వున్న ఓ తెలిసిన దొంగతో ప్లాన్ వేస్తాడు చార్లీ. దొంగకి బెయిల్ వచ్చేలా చూస్తాడు. ఆ దొంగ బయటికి వెళ్లి ఎలాగైనా తనని ఈ జైల్లోంచి బయట పడేలా చేస్తే, తను దాచుకున్న వజ్రాల్లోంచి 50 కోట్ల వజ్రాలు ఇస్తానని బేరం పెడతాడు. ఈ దొంగ బెయిల్ మీద విడుదలై వెళ్లి ఒక  ముఠా కి డీల్ పెడతాడు. మళ్ళీ చార్లీకి ఉరిని తప్పించడానికి ఈ ముఠా ప్రయత్నాలు ప్రారంభిస్తుంది...వీళ్ళ ప్రయత్నాలు ఫలించాయా, ధర్మ తేజ ఈ కుట్రని ఛేదించి చార్లీ ని ఉరికంబం ఎక్కించాడా..అన్నవి మిగతా కథాకమామిషూ.

ఎవరెలా చేశారు?
           ఈ సీరియస్ జైలర్ పాత్ర నారా రోహిత్ కి ఓ ఛాలెంజి పాత్ర అయితే కాదుగానీ, చూసే ప్రేక్షకులకి భిన్నమైనదే. అయితే లావెక్కిపోవడం వల్ల నారా శరీరాకృతి గుండ్రటి బంతిలాగా తయారై హీరోని కాక  సహాయ పాత్రని చూస్తున్నట్టైంది. ఈ పాత్ర వెయిట్ కోసం వొళ్ళు పెంచానని నారా చెప్పడంలో ఔచిత్యం లేదు. అది పోలీస్ గైడ్ లైన్స్ కే వ్యతిరేకం. జైలు మాన్యువల్ కూడా జైలర్ ‘షేపు’ లో వుండాలని చెప్తోంది. పైగా రెండు ప్రమోషన్లు దాటుకుని జైలర్ అయ్యేసరికి నడివయసు దాటి పోతుంది. క్రైం థ్రిల్లర్ లో యంగ్ జైలర్ వుండే అవకాశం లేదు. రొటీన్ మూసఫార్ములాల్లో  వుంటారు. పోతే, నారా వాయిస్ మాడ్యులేషన్, డైలాగ్ డెలివరీ బావున్నాయి. పాత్రపరంగా రాయని కవికూడా కాబట్టి, కోపం వచ్చినప్పుడల్లా ధిక్కార కవిత్వం పలకడం మొదటి నిమిషం నుంచీ చివరి నిమిషం దాకా చూడొచ్చు. 

          సాధారణ మధ్యతరగతి అమ్మాయిగా నటించిన హీరోయిన్ ప్రియా బెనర్జీది రొటీన్ పాత్రే. ఐతే మొహంలో స్వాభావికమైన అమాయకత్వం వల్ల ఆమె ఆ పాత్రకి సరిపోయింది. 

          రవివర్మ లో కావలసిన క్రూర ప్రతినాయక కోణాలన్నీ వున్నాయి. అయితే పాత్ర పేలవవంగా వుండడంతో వాటిని పూర్తి స్థాయిలో ప్రదర్శించుకునే వీల్లేకుండా పోయింది.

          సంగీతం, కెమెరా కథకి తగ్గ మూడ్ ని క్రియేట్ చేశాయి. దర్శకుడికి దృశ్యాల్లో పస వుంటే  పకడ్బందీగా తెరకెక్కించే సామర్ధ్యం వుంది. ఫస్టాఫ్ లో 40 నిమిషాలూ సస్పెన్స్ ని సృష్టించడానికి, టెంపోని పెంచడానికీ  ‘ఉరి’ అనే టూల్ బాగా తోడ్పడ్డంతో దర్శకుడుగా తన నైపుణ్యం ప్రదర్శించుకునే అవకాశం ఏర్పడింది. ఆ తర్వాతనుంచీ  అసలు కథ నడపడానికే అలాటి ఆసక్తికరమైన ఇంకో టూల్ ఏదీ లేకపోవడంతో,  దృశ్యాల్లో పసలేక దర్శకత్వం నస పెట్టేసింది- కవిత్వం తో సహా!  

స్క్రీన్ ప్లే సంగతులు
        బిగినింగ్ ని ప్రారంభించిన  ఇరవై నిమిషాలకి కథానేపధ్యం ఏర్పాటు చేస్తూ విలన్ ని ప్రవేశ పెట్టారు. నలభయ్యోవ నిమిషానికి ఉరితీసే టర్నింగ్ పాయింట్  సృష్టించారు. ఈ టర్నింగ్ పాయింట్ దగ్గర ఆ వురి శిక్ష పడ్డ విలన్ డ్రగ్ తీసుకునేట్టు చేసి, ఉరితీతని విఫలం చేస్తూ, హీరోకి సమస్య సృష్టించారు. అలా బిగినింగ్ కి ముగింపు నిచ్చారు.

          కానీ ఇలా ఈ నలభై నిమిషాలపాటు మంచి బిగితో సాగిన బిగినింగ్ విభాగం తర్వాత వచ్చే మిడిల్ విభాగం, అటు తర్వాత వచ్చే ఎండ్ విభాగమూ ( క్లయిమాక్స్) రెండూ కూడా కుప్పకూలాయి. కారణం ఈ రెండు కీలక విభాగాల్లో చెబుతున్న కథ పట్ల  ఒక స్పష్టత, ఒక వ్యూహం, ఒక లక్ష్యం లేకపోవడమే. దీనికి మూలం ఎక్కడుందంటే, బిగినింగ్ ని ముగించిన తీరులోనే!

          బిగినింగ్ ని ముగించే తీరు మీదే  మిగతా కథ నిలబడ్డమో, కుప్పకూలడమో ఆధారపడతాయి. బిగినింగ్ ని ముగిస్తూ హీరోకి ఒక సమస్యని అందిస్తున్నప్పుడు- అది అన్ని కోణాల్లో సహేతుకంగా, ఎమోషన్ అంశతో బలీయంగా ఉండకపోతే ఎండ్ విభాగం ( క్లయిమాక్స్) కూడా బలహీనంగానే ఉంటుందనేది జగమెరిగిన సత్యం. కానీ ఈ సినిమా స్క్రీన్ ప్లేలో మిడిల్ కూడా ఆషామాషీగా తయారయ్యింది. ఇదే విచిత్రం!

          దీనికి కారణం, (1) మొత్తం సమస్య ఏర్పాటే లోపాలమయంగా ఉండడమే గాకుండా, (2) ఈ సమస్య సృష్టించిన విలన్ ఏ కుట్ర పన్నకుండా బలహీనుడిగా, పాసివ్ గా ఉండడంతో పాటు, (3) కథనానికి స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ కి పాల్పడుతున్నామని తెలుసుకోకపోవడమే!

          1. ( సెటప్ సమస్య) సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పనలో భాగంగా, ముందుగా విలన్ గర్ల్ ఫ్రెండ్ విలన్ని జైల్లో కలవడానికి వచ్చినప్పుడు ఒక స్వీట్ బాక్సు అందిస్తుంది. ఆ బాక్సుని ని జైలు సిబ్బంది అందుకుని అందులోని స్వీట్స్ ని ఎంజాయ్ చేస్తూ రుచి చూస్తారు. ఫరవాలేదని విలన్ కి అందిస్తారు. తర్వాత ఉరితీసే ముందు, ఆ విలన్ ఆ బాక్సు లో  స్వీట్ల అడుగున వున్న డ్రగ్ తీసి మింగేస్తాడు. ఉరికంబం దగ్గరికి తీసుకుపోతున్నప్పుడు అకస్మాత్తుగా  విరుచుకు పడిపోతాడు. ఉరి ఆగిపోతుంది. అతణ్ణి హాస్పిటల్లో చేరుస్తారు. ఇదీ కథని మలుపు తిప్పే, బిగినింగ్ విభాగాన్ని ముగిస్తూ ( హీరోకి) ఏర్పాటు చేసిన సమస్య.

          ఉరిశిక్ష పడ్డ ఖైదీకి బయటి ఆహారాన్ని ఎలా అనుమతిస్తారు? జైల్లో తయారైన ఆహారాన్నే పరీక్షించి- ఉన్నతాధికారి, లేదా వైద్యాధికారి  స్వయంగా పరీక్షించి – ఇతర అధికారుల సమక్షంలో మరీ ఆ ఖైదీకి అందిస్తారు. గర్ల్ ఫ్రెండ్ వచ్చేసి స్వీట్లు అందిస్తానంటే అనుమతించరు. అసలా గర్ల్ ఫ్రెండ్ గేట్ కీపర్ ని దాటుకుని ఆ బాక్సుని లోపలికి తేవడమే కుదరదు. గేట్ కీపర్ దాన్ని అనుమతించడు. తనిఖీ చేశాడంటే అప్పుడే డ్రగ్ బయట పడిపోయి జైలర్ కి రిపోర్టు చేసేస్తాడు. ఆమె అడ్డంగా అక్కడే జైలర్ కి దొరికిపోతుంది! 

          ఒకవేళ ఈ లాజిక్ ని మనం పట్టించుకోకుండా దర్శకుడు ఆ తర్వాత అల్లిన ప్రకారమే ఫాలో అయినా, ఉన్నతాధికారి కాకుండా కింది సిబ్బంది ( సెంట్రీలు) ఆ స్వీట్ రుచి చూడడ మేమిటి? అది కూడా ఎంజాయ్ చేస్తూ రుచి చూడడ మేమిటి? ఈ లాజిక్ ని కూడా సినిమాటిక్ లిబర్టీ కింద ఉపేక్షించి ఆ తర్వాత చూసినా, ఆ స్వీట్ల కింద వున్న డ్రగ్ ఆ సెంట్రీలకి  కన్పించనే లేదా? సరే, ఈ కామన్ సెన్స్ ని కూడా చంపుకుని ఆ తర్వాత చూసినా- ఉరి తీయబోతూండగా విలన్ ఆ డ్రగ్ తీసుకుని పడిపోయినప్పుడైనా- జైలర్ తో సహా మొత్తం ఆ సంబంధిత సిబ్బంది అంతా సస్పెండ్ అయిపోవాలికదా! 

          కనుక ఏ విషయంలోనూ  లాజిక్ అనేదే లేకుండా ఇంత లోపభూయిష్టమైన సంఘటనతో ఇంత పస లేని సమస్యని సృష్టించారు. 

          సమస్యలో పస లేకపోతే  హీరో చేయడానికి ఏమీ లేకపోవడమేగాక, ఏం చేస్తున్నాడో తనకే తెలీక ఏదేదో చేసుకు పోతాడు. ఇదే జరిగిందీ సినిమాలో. 

          సమస్యని ఏర్పాటు చేయడం రెండు రకాలని తెలిసిందే. మొదటిది హీరోయే విలన్ ని సమస్యలో పడెయ్యడం, రెండోది విలనే హీరోకి సమస్య సృష్టించడం. ‘శివ’ లో మొదటిది జరిగింది. ఇందులో కాలేజీ  స్టూడెంట్ గా ఉంటున్న నాగార్జున, కాలేజీమీద బయటి గూండాల ఆధిపత్యం గమనిస్తాడు, ఈ గూండాల నాయకుడు పవర్ఫుల్ రఘువరన్ అని తెలుసుకుంటాడు, వీళ్లకి ప్రతినిధిగా జేడీ చక్రవర్తి ఆగడాల్ని భరిస్తాడు. దీన్ని అలుసుగా తీసుకున్న జేడీ అమల తో మిస్ బిహేవ్  చేయడం తో ఇక నాగార్జున యాక్షన్ తీసుకుంటాడు- సైకిల్ చైన్  తెంపి జేడీని చావబాదడం ద్వారా కథని మలుపు తిప్పేస్తూ- రఘువరన్ అంతటి వాడికి కి సవాలు విసురుతాడు- అతణ్ణి సమస్యలో పడేస్తాడు!

          ఇక్కడ నాగార్జున యాక్షన్ తీసుకోవడానికి తగిన నేపధ్య బలమంతా వుంది. దీనికి అదనంగా నైతిక బలం ( ఎమోషన్ అంశ) కూడా తోడయ్యింది. కాబట్టి రఘువరన్ ని డైలెమాలో పడేసే సమస్య అంతే పవర్ఫుల్ గా ఎస్టాబ్లిష్ అయింది. ఇక ఇప్పుడేంటి?- అన్న బిగ్ క్వశ్చన్ అర్జెంటుగా ప్రేక్షకుల ఎదుటకొచ్చి నిల్చింది.

          ఇలాటి అర్జెంట్ క్వశ్చన్ ‘అసుర’ లో మిస్సయ్యింది.  ‘అసుర’ స్క్రీన్ ప్లేలో ఉరిని తప్పించుకుంటూ విలనే హీరోకి సమస్య సృషించాడు. ఈ సృష్టించడంలో ఎక్కడా లాజిక్కి అందలేదని పైన గమనించాం. తర్కానికి నిలబడని కారణాలతో వీగిపోయే సమస్యని సృష్టించాడు విలన్. సమస్యే వీగిపోతున్నప్పుడు హీరో- విలన్ల మధ్య సంఘర్షణ ఎక్కడిది? అయితే ఈ వీగిపోయే ఇల్లాజికల్ సమస్య కూడా కొసమెరుపుగా చివర్న ఓ టర్నింగ్ పాయింటుని సృష్టిస్తోందని గమనించాలి!  విలన్ కి అసలా డ్రగ్ ఎలా వచ్చిందనే పాయింటు ఆధారంగా  హీరో సహా సంబంధిత జైలు సిబ్బంది ఎందరో సస్పెండ్ అయిపోవాలి నిజానికి!

          ఇలా జరిగితే హీరో జైలర్ యూనిఫాం లేకుండా జైలు బయట ఉండేవాడు. అప్పుడెంతో హాయిగా వుండేది! క్రైం థ్రిల్లర్ డిమాండ్  చేసే లాజిక్ కి ఇదే కరెక్టు. లేకపోతే  ఒక జైలర్ యూనిఫాం వేసుకుని మూసఫార్ములా పాత్రలా హీరో అడ్డదిడ్డంగా చెలరేగిపోవడ మేమిటి?( దీని గురించి  చివర్లో చూద్దాం). 

          ఇలా లోపభూయిష్టంగా సమస్యని ఏర్పాటు చేయడం వల్ల ఎండ్ విభాగం (క్లయిమాక్స్) కూడా విషయంలేక, అది ఓ విజువల్ యాక్షన్ ద్వారాగాక, హీరో ఇచ్చే లెక్చర్ తో వెర్బల్ గా పేలవంగా సినిమా ముగిసిపోయింది! 

          2. ( క్యారక్టర్ సమస్య)  యంగ్ విలన్ ని తన కుటుంబాన్ని హతమార్చిన కచ్చా విలన్ గా అంత బిల్డప్ ఇస్తూ ప్రవేశపెట్టారు. జైల్లో ఇతను  ఎంతసేపూ ‘నేను బతుకుతాను, చావను’ అంటూంటాడు. కానీ దీనికి ఓ వ్యూహం అంటూ వుండదు. డ్రగ్ తీసుకుని ఆ సమయంలో ఉరిని తప్పించుకున్నాక, తెలిసిన ఓ దొంగకి బెయిలు వచ్చేలా చేసి అతడితో మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటాడు. ఆ దొంగ బయటికి వెళ్లి తనని బయట పడేస్తే 50 కోట్ల వజ్రాలిస్తానని మాటిస్తాడు. ఆ దొంగ బెయిలు మీద విడుదలై, బయటి కెళ్ళి ఒక ముఠా సహాయంతో ప్రయత్నాలు ప్రారంభిస్తాడు. ఇందులోభాగంగా ఉరి తీసే తలారి తల్లిని, ఉరిని అమలు చేసే మేజిస్ట్రేట్ కొడుకుని, జైలర్ ధర్మ తేజగర్ల్ ఫ్రెండ్ నీ కిడ్నాప్ చేస్తారు. అయినా, ఇంటర్వెల్లో విలన్ కి ఉరి ఆగదు!
          అసలు విలన్ ఆలోచనేమిటి? అతనెలా జైల్లోంచి బయటపడా లనుకున్నాడు? డ్రగ్ తీసుకోవడమనే ఆలోచనలోనే ద్విముఖ వ్యూహం కలిసివచ్చిందని అతను గమనించాడా? అలా డ్రగ్ మింగడం ద్వారా ఉరిని తప్పించుకోవడం తో బాటు, పనిలోపనిగా మొత్తంగా  జైల్లోంచే ఉడాయించ వచ్చనే  విషయం గ్రహించాడా?  

          గ్రహిస్తే మరి తనని హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు, అక్కడ్నించి పారిపోగల అవకాశాన్ని ఎందుకు చేజార్చుకున్నాడు? కుటుంబాన్ని అంత క్రూరంగా హతమార్చిన హంతకుడు, హాస్పిటల్లో ఎస్కార్ట్  పోలీసుల్ని వాళ్ళ గన్స్ తోనే కాల్చి పారేసి పారిపోలేడా? అలా చేయకుండా హాస్పిటల్ నుంచి మళ్ళీ జైలుకే తెచ్చి పడేస్తూంటే బేలగా చూస్తూ ఉండిపోయాడేమిటి? 

          నువ్వు బయటి కెళ్ళి నన్నెలాగో బయట పడెయ్యి- అని తర్వాత ఓ దొంగని కోరడమేమిటి? ఎలా బయట పడెయ్యాలో తనే ఒక మాస్టర్ ప్లాన్ ఇవ్వచ్చుగా? తను మైనర్ క్యారక్టరా, మేజర్ క్యారక్టరా?

          కనుక ఎంతో భయంకర హంతకుడుగా బిల్డప్ ఇస్తూ  ప్రవేశపెట్టిన ఈ విలన్ కి, ఒక సొంత ప్లాను అంటూ లేని, ఇతరులమీద భారం వేసి కూర్చునే బలహీనుడిగా, ఒక పాసివ్ విలన్ గా సృష్టించడంతో- బిగినింగ్ లో సమస్య ఏర్పాటుతో బాటు, మిడిల్ లో యాక్షన్- రియాక్షన్ ల తో కూడిన బిజినెస్,, ఎండ్ లో హీరోతో ఫైనల్ షో డౌన్ వంటి థ్రిల్లింగ్ కథనమే లేకుండా పోయింది. 

          గర్ల్ ఫ్రెండ్ స్వీట్ బాక్సులో డ్రగ్ దాచి ఎలా తెచ్చింది? ఆ ప్లాను ముందే అనుకున్నారా? ఎలా అనుకున్నారు?  ఉరిశిక్ష పడ్డ ఖైదీతో కమ్యూనికేషన్ కి అవకాశమే వుండనప్పుడు?  ఉరిశిక్ష పడ్డ ఖైదీ, దొంగ తనం నేరం మీద వచ్చిన ఇంకో ఖైదీతో ఎలా మాట్లాడతాడు? ఎలా మ్యాచ్ ఫిక్సింగ్ చేసుకుంటాడు? అతణ్ణి ఉంచే సెల్, అతడికి వుండే సెక్యూరిటీ అంతా వేర్వేరు కదా? అసలు ఉరిశిక్ష పడి తేదీ కూడా ఖరారైన ఖైదీ ఇంకో ఖైదీని బెయిల్ మీద ఎలా బయటికి పంపిస్తాడు? ఎలా పంపించాడో ఈ సినిమాలో చూపించలేదే? అసలే డ్రగ్ తో అంత పన్నాగం పన్నిన ఖైదీ ని అందరితో మాట్లాడుకునే స్వేచ్ఛతో వదిలేస్తారా అధికారులు? 

          క్రైం థ్రిల్లర్ లో క్రిమినల్ ఎప్పుడూ పోలీసులతో పోటాపోటీగా ఉంటాడు. ముపు తిప్పలు పెడతాడు. నిత్యజీవితంలో నేరాలు చేసేవాళ్ళు పెద్ద తెలివితేటలున్న వాళ్ళయి వుండరు. పూర్తి దద్దమ్మలై కూడా వుంటారు. కానీ క్రైం థ్రిల్లర్ అనేటప్పటికి అలా వుంటే కుదరదు. క్రిమినల్ తో పోలీస్ ఆఫీసరుకి గట్టి సవాలు – సంఘర్షణా ఏర్పడాల్సిందే. ఇది లాజికల్ గా వుండాలి. లాజిక్ వుండాలి. 

3. ( ప్లాటింగ్ సమస్య)  జైలర్ ఉరితీయడానికి ప్రయత్నిస్తూంటే, విలన్ డ్రగ్ మింగి దాన్ని విఫలం చేస్తాడు. మళ్ళీ ఇంటర్వెల్లో అతణ్ణి ఉరికంబం ఎక్కించి ఈసారి విజయవంతంగా ఉరి తీసేస్తారు. ఇంటర్వెల్ తర్వాత అది అబద్ధమనీ, విలన్ బతికేవున్నాడనీ చూపిస్తారు. బయటి ముఠా కిడ్నాపులకి పాల్పడిన ఫలితంగా తమవార్ని రక్షించుకునేందుకు- అన్న అర్ధంలో. దీని తర్వాత ఇంకో వ్యూహంతో మళ్ళీ ఉరి  తీసేందుకు ప్రయత్నాలు.

          ఇదంతా తెలియక పాల్పడిన స్టాప్ అండ్ స్టార్ట్ అనే కమర్షియల్ సినిమాలకి పనికిరాని టెక్నిక్. ఈ టెక్నిక్ తో  కథనం చేయడం ఏ డాక్యుమెంటరీకో, ఆర్టు సినిమాకో అయితే సరిపోతుంది. కమర్షియల్ సినిమా టెంపోని ఇది కిల్ చేసేస్తుంది. అది క్రైం థ్రిల్లర్ అయినా సరే. క్రైం థ్రిల్లర్ ప్రధాన కర్తవ్యం అనుక్షణం కథనంతో టెన్షన్ ని పెంచుతూపోవడమే తప్ప దించడం కాదు. స్టాప్ అండ్ స్టార్ట్ టెక్నిక్ లో టెన్షన్ పెంచడం, మళ్ళీ దించడం పదేపదే జరుగుతూంటుంది.        2003లో  ‘టైగర్ హరిశ్చంద్ర ప్రసాద్’ అనే సినిమాని ఈ టెక్నిక్ తోనే తీస్తే అది అట్టర్ ఫ్లాపయి కూర్చుంది. ఇందులో ఎపిసోడ్ - టు – ఎపిసోడ్ గా విడివిడి సంఘటనలు జరుగుతూంటాయి రైతు సమస్యలమీద. ఒక రైతు సమస్య ఎత్తుకుని నడిపి దాన్ని ముగించేసి, ఇంకో రైతు సమస్య నెత్తుకుని ముగించడం..ఇలా కంటిన్యూ అవుతూంటుంది. దీంతో ఒక ప్రధాన కథా- సమస్యా- దాంతో సంఘర్షణా అనేవి లేక- హోల్మొత్తంగా టెన్షన్, టెంపో, ఏకధాటి ఎమోషన్ మొదలైనవన్నీ మృగ్యమైపోయాయి!

          ‘అసుర’ లోనూ ఇంతే. ఒకసారి కాదు, మూడు సార్లు ఉరితీయడమనే ప్రహసనంతో కాలం గడిపారు. మొదటి సారి డ్రగ్ తో స్టార్ట్ చేసి విఫలం చేస్తూ స్టాప్ చేశాక, మళ్ళీ ఇంటర్వెల్లో స్టార్ట్ చేసి ఫినిష్ చేశారు. కానీ  ఇంటర్వెల్ తర్వాత ఈ ఉరితీత కూడా ఉద్దేశపూర్వకంగా విఫలం చేసినట్టు రివీల్ చేసి టెంపోని  స్టాప్ చేశారు ( ఈ టెక్నిక్ తో సినిమా నడపడం, ఫ్లాష్ బ్యాక్స్ తో సినిమా నడపడం ఒకటే).  సెకండాఫ్ లో మళ్ళీ మరో  ఉరితీత ప్రహసనంతో కథనం స్టార్ట్..

          ఇలా మెయిన్ పాయింటుతోనే స్టాప్ అండ్ స్టార్ట్  టెక్నిక్ కి పాల్పడడం వల్ల ఇది సహన పరీక్షకి దారితీసింది..

పాత్రోచితానుచోతాలు 
          విలన్ పాత్రగురించి పైన చెప్పుకున్నాం. ఇక హీరో పాత్ర విషయానికొస్తే, సినిమా ప్రారంభమే జైలర్ గా వున్న హీరో పారిపోతున్న ఖైదీల్ని తరుముతూంటాడు. శుభమా అంటూ క్రైం థ్రిల్లర్ ని ప్రారంభిస్తూనే - ఇంత అసజత్వం ఏమిటా అని చూస్తూంటే, ఆ పారిపోయిన ఖైదీలతో ఫైట్ చేసి తిరిగి జైల్లో తెచ్చి పడేస్తాడు  జైలర్ హీరో. ఇక జైలుకి తనే బాస్ అన్నట్టు ప్రవర్తిస్తూంటాడు. 

          నిజానికి ఒక పక్కా మూసఫార్ములా పాత్రని ఇలా క్రైం థ్రిల్లర్ లో వాడుకున్నారు. అందుకే ఇతడికి ఏ నియమాలూ లేకుండాపోయాయి. జైల్లోంచి ఖైదీలు పారిపోతే ముందుగా సస్పెండయ్యేది తనే. అలాటిది తనకు అథారిటీ లేని జైలు బయటి ప్రాంతంలో ఖైదీల్ని వెంటాడి పట్టుకుని తెచ్చి జైల్లో పడేస్తాడు. నిజానికి ఖైదీలు జైల్లోంచి పారిపోవడం ఓ నేరం కిందికొస్తే, ఈ నేరాన్ని పోలీస్ స్టేషన్ లో కంప్లెయింట్ చేస్తారు జైలు అధికారులు. అప్పుడా పోలీసులే పారిపోయిన ఖైదీల కోసం వేట ప్రారంభిస్తారు. జైలర్ కాదు. 

          ఒక జైలర్ గా జైల్లో జరిగే అన్ని కార్యకలాపాలూ తనకి తెలిసివుంటాయి. అసలు జైలర్ జైలు ప్రాంగణంలోనే క్వార్టర్ లో నివసిస్తాడు. జైలుకి పూచిక పుల్ల వచ్చినా, జైల్లోంచి పూచిక పుల్ల వెళ్ళినా తన దగ్గర రికార్డు వుంటుంది. కనుక పైన చెప్పుకున్నట్టు ఆ విలన్ గర్ల్ ఫ్రెండ్ స్వీట్ బాక్సుతో రావడమే కుదరదు. కుదరకపోతే కథ ఎలా నడుస్తుందని అంటే, మూసఫార్ములాకి ఈ సినిమాలో చూపించినట్టే నడిచి పోతుంది. లాజిక్కే ప్రాణమైన క్రైం థ్రిల్లర్ కి నడవదు. వేరే మార్గం చూసుకోవాల్సిందే.

          ఇక ఉరితీసే టప్పుడు పదేపదే ఈ సినిమాలో చూపించినట్టుగా, అక్కడ జైలర్ కి అనుమతి వుండదు. ఉరితీసేతప్పుడు చట్టప్రకారం అక్కడ జైలు సూపరిటెండెంట్, డాక్టర్, మేజిస్ట్రేట్, ఇంకో సెంట్రీ, తలారీ మాత్రమే వుంటారు. 

          ఇక సెకండాఫ్ లో ఈ జైలర్ హీరో ఏకంగా అవుట్ డోర్ అడ్వెంచర్ చేసినట్టే చూపించేశారు! 

          ఇదంతా కాకుండా హీరో పాత్ర ఒక ఎస్సై అయివుంటే, పాత్రపరమైన అడ్డంకులు 
తొలగిపోయేవేమో. ఈ క్రైం థ్రిల్లర్ కి అది లాజికల్ సపోర్టు నిచ్చేదేమో. ప్రారంభంలో పారిపోయిన ఖైదీల్ని వెంటాడి పట్టుకోవడానికి అలాటి ఎస్సైగా తను సరిపోతాడు. ఇక ఉరిశిక్ష పడ్డ విలన్ విషయానికొస్తే- అతణ్ణి సామూహిక హత్యల కేసులో ఒక ఎస్సైగా అరెస్ట్ చేసి శిక్ష పడేలా చూసింది కూడా తన అయ్యి, తెచ్చి జైల్లో పడేసి, బయటి శక్తులతో విలన్ ఆటలు సాగకుండా కట్టడి చేస్తూ- ఏదైనా వ్యక్తిగత కారణంతో ఉరి అమలయ్యేలా చూసేందుకు,  పోరాడే శక్తిగా మారివుంటే సరిపోయేది.

          హీరోయిన్ పాత్ర కేవలం ప్రేమ సన్నివేశాలకోసం, పాటలకోసం మాత్రమే  అన్నట్టు కృతకంగా వుంది. ఒక్క కిడ్నాపయ్యే ఘట్టం మినహాయిస్తే, కథతో ఈమెకెలాటి సంబంధమూ  లేదు. వృత్తిపరంగా హీరో పడుతున్న సంఘర్షణ  ఏమిటో కూడా కనుక్కోకుండా, ఎప్పుడూ ప్రేమ గోల తోనే వుంటుంది. ఒకానొక ప్రముఖ దర్శకుడు పరస్పరం సంబంధంలేని మూడు ట్రాకులతో నడిపే సినిమాలు కొన్ని వున్నాయి. ఆ దృశ్యాలు ఇలా రిపీట్ అవుతూ వుంటాయి- ఒక కథకి సంబంధించిన దృశ్యం, ఒక కామెడీ దృశ్యం, ఒక ప్రేమ సన్నివేశం...ఈ మూడు ముక్కలే రిపీట అవుతూ సినిమా నడుస్తూంటుంది క్రియేటివిటీ లేకుండా.  సరీగ్గా ఇదే ‘అసుర’ దర్శకుడి పద్దతిగా ఉన్నట్టుంది. హీరోయిన్ తో ప్రేమ దృశ్యాలు, పాటలు,  మెయిన్ స్టోరీతో సంబంధం లేకుండా ఇలాగే మధ్యమధ్యలో వచ్చి పోతూంటాయి.

చివరిగా..
         ఓ  కొత్త దర్శకుడి సినిమాని పట్టుకుని ఇంత రంద్రాన్వేషణ  అవసరమా అన్పించవచ్చు. తప్పకుండా అవసరమే. అది క్రైం థ్రిల్లర్ అయినప్పుడు మరీ అవసరం. ఆ క్రైం థ్రిల్లర్ కూడా నాసిరకం  ‘బి’ గ్రేడో,  ‘సి’ గ్రేడో అయ్యుంటే అవసరం లేదు. మూసఫార్ములా తీసి వుంటే అసలే అవసరం లేదు. కానీ తీస్తున్నది ఎలాటి సినిమా అయినా, తీస్తున్నది కొత్త దర్శకుడైనా పేరున్న దర్శకుడైనా,  స్టోరీ సిట్టింగ్స్ లో చాలా హాట్ హాట్ గా డిస్కస్ చేసుకుంటారు. ఉన్న తలకాయలు చాలకపోతే, ఇంకొన్నిటిని చేర్చుకుని గరం గరం ‘మేధో మధనం’ గావిస్తారు. లాజిక్కులతో తగాదాలు పడతారు, మ్యాజిక్కులకోసం అరుచుకుంటారు, కాగితాలు విసిరేసుకుని లేచిపోతారు. ఇంత రొష్టు పడి ఓ కథని తయారుచేస్తారు. కనుక తెర వెనుక జరిగే  ఇంత  తీవ్రమైన  మేధోమధనానికి దీటుగా, తెరమీద సినిమా చూసిన వాడు కూడా తగిన  తీవ్రతతో రంధ్రాన్వేషణ చేసుకోవడం న్యాయమే. 

          ముందుగా, క్రైం థ్రిల్లర్ ని మూసఫార్ములా గాటన కట్టి తీయలేరు. ఎందుకంటే క్రైం థ్రిల్లర్ దానికదే టెక్నికాలిటీస్ ని కలిగివుండే కథా ప్రక్రియ. క్రైం థ్రిల్లర్ తీస్తున్నప్పుడు కథనానికి సీరియస్ నెస్, ప్రొఫెషనలిజంలతోబాటు, పోలీస్ ప్రొసీజర్, ఇన్వెస్టిగేషన్, వ్యవస్థ పనితీరు  వంటి టెక్నికల్ అంశాల్ని కూడా తు చా తప్పకుండా పాటించినప్పుడే ఆ క్రైం థ్రిల్లర్ కి రాణింపు! అదే మూసఫార్ములా ఏ ప్రొ ఫెషనలిజమూ, లాజిక్కూ, వ్యవస్థల వాస్తవిక చిత్రణా డిమాండ్ చెయ్యదు. కామన్ సెన్సుని కూడా పట్టించుకోదు. 

          గత ఫిబ్రవరి లో విడుదలైన శ్రీరాం రాఘవన్ దర్శకత్వం వహించిన ‘బద్లా పూర్’ అనే హిందీ క్రైం థ్రిల్లర్ ని చూస్తే, అందులో ఇరవయ్యేళ్ళుగా  శిక్ష తప్పించుకుంటున్న ఇద్దరు హంతకుల జైలు కథ- దాని కథనాలూ- పాత్రలూ వాస్తవికతతో కూడి లాజికల్ గా, ఎంత ప్రొఫెషనల్ గా చిత్రీకరణ జరుపుకున్నాయో తెలుస్తుంది. అలాగే ఎప్పుడో 1971 లో  జడ్జి పాత్రలో గుమ్మడి హత్య చేసే క్రైం థ్రిల్లర్ ‘నేనూ మనిషినే’ లో పోలీసధికారి పాత్రలో హీరో కృష్ణ  చేసే ఇన్వెస్టిగేషన్ ఎంత లాజికల్ గా, ఆనాడే బుల్లెట్స్ సైన్స్ తో కొత్త విషయాలు తెలియ జెపుతూ ఎంత శాస్త్రీయంగా వుంటుందో తెలుసుకోవచ్చు. ఇలా ఎన్నో. 

          క్రైం థ్రిల్లర్, సస్పెన్స్ థ్రిల్లర్, మర్డర్ మిస్టరీ ..ఇవన్నీ లాజిక్కే ప్రాణమైన  ప్రొఫెషనల్ కథా ప్రక్రియలు.  వీటి విలువని మూసఫార్ములా కథనాలతో దిగజార్చకుండా వుంటే ఎంతో మేలు చేసిన వాళ్ళవుతారు! 


సికిందర్
   



         







          .