రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

4, జూన్ 2015, గురువారం

ఉత్తమ స్క్రీన్ ప్లే!




స్క్రీన్ ప్లే- దర్శకత్వం :  గోపీచంద్ మలినేని
తారాగణం: రామ్‌, రకుల్‌ ప్రీత్‌ సింగ్‌, సోనాల్‌ చౌహాన్‌, సంపత్‌ రాజ్‌, సాయికుమార్‌, బ్రహ్మానందం, అభిమన్యుసింగ్‌, జయప్రకాష్‌రెడ్డి, పవిత్రా లోకేష్‌, రావు రమేష్‌, ఎమ్మెస్‌ నారాయణ తదితరులు
కథ : వెలిగొండ శ్రీనివాస్   స్క్రీన్ ప్లే- మాటలు : కోన వెంకట్ 
సంగీతం: ఎస్‌.ఎస్‌. తమన్‌   ఛాయాగ్రహణం: సమీర్‌రెడ్డి
బ్యానర్ : యునైటెడ్‌ మూవీస్‌ లిమిటెడ్‌    నిర్మాత: పరుచూరి కిరీటి
విడుదల మే
29, 2015     సెన్సార్ : U/A
*
సక్సెస్  కోసం హీరో రామ్ చేస్తున్న విశ్వ ప్రయత్నాల్లో భాగంగా ఈసారి ‘పండగ చేస్కో’ అనే రెగ్యులర్ కమర్షియల్ వచ్చింది. ఈ రెగ్యులర్ కమర్షియల్ కూడా కుటుంబ సంబంధాలకి సంబంధించింది. ఈ కుటుంబ సంబంధాల కథ కూడా హేమా హేమీలైన నటీనటులతో వినోద ప్రధానంగా సాగేదే. కాబట్టి ఈ రెగ్యులర్ కమర్షియల్ = కుటుంబ సంబంధాల కథ + వినోదం అనే బేసిక్ బాక్సాఫీస్ ఫ్రెండ్లీ ఈక్వేషన్ ని రామ్ పికప్ చేసుకోవడంలో ఎలాటి పొరపాటూ చేయలేదు. ఆ తర్వాత ఈ బేసిక్ ఎక్వేషన్ తో సదరు ‘కిచెన్’ లో జరిగే  ‘కుకింగ్’ తో రామ్ కెలాటి సంబంధమూ లేకపోవచ్చు. కానీ ఈ బేసిక్ ఈక్వేషన్ ని రామ్ జడ్జ్ చేయగల్గినట్టూ- సంబంధీకులు కూడా  వాళ్ళ ‘కిచెన్’ లో మిగతా తమ ’కుకింగ్’ నీ జడ్జ్ చేయగల్గారా లేదా అనే దాని పైనే రామ్ అదృష్టం ఈసారి ఆధారపడింది.

        ర్శకుడు గోపీచంద్ మలినేని  గత మూడు సినిమాలూ సక్సెస్ అయినవే. వీటిలో ‘బాడీగార్డ్’  అనే రీమేక్ ప్రేమకథని తీసేస్తే, మిగతా రెండూ ‘డాన్ శీను’, ‘బలుపు’ లు మాత్రం భారీ మూస యాక్షన్ సినిమాలే. కానీ మళ్ళీ ఈ సారి ఓ ప్రేమకథ కాకపోయినా ఆ తరగతి కింది కొచ్చే అలాటి కుటుంబ సంబంధాలూ అనే సున్నిత సబ్జెక్టునే తీసుకున్నప్పుడు, ఈ కొత్త అనుభవాన్ని తానెలా తెరానువాదం చేయగలిగాడన్నది ఆసక్తి రేపే అంశం సహజంగానే. డార్క్ మూవీస్ తీసే రాంగోపాల్ వర్మ కూడా ‘365 డేస్’ అనే  పెళ్లి కథ తీసినా( ఇదెలా ఉన్నప్పటికీ), లేదా హిందీ లో ‘నిశ్శబ్ద్’ వంటి  రిలేషన్ షిప్ కథ తీసినా వాటి జానర్ మర్యాదల్ని కాపాడుతూనే తీశాడు. వాటిలో మళ్ళీ తన డార్క్ మూవీస్ చాపల్యాల్ని జొప్పించి కలగూరగంప చేయలేదు. సినిమా క్రాఫ్ట్ తెలిసిన వాళ్ళెవరూ అలాటి పని చేయరు. గోపీచంద్ మలినేని కూడా తన చేతిలో వున్న సున్నితమైన  బేసిక్ ఈక్వేషన్ ని కిచెన్ లో వేసి వండుతున్నప్పుడు, దాని జానర్ మర్యాద ని కాపాడగల్గాడా లేదా అన్నదే ప్రధాన ప్రశ్న! 


          ఈ ప్రశ్న మీదే రామ్ సక్సెస్ చేస్కోవడం ఆధారపడింది.  


          హీరో రామ్ తో కలర్ఫుల్ క్యారక్టరైజేషన్, రకుల్ ప్రీత్ సింగ్, సోనాల్ చౌహాన్ ల వంటి హిందీ  హీరోయిన్లతో దండిగా  గ్లామర్ కోషెంట్, బ్రహ్మానందంతో హాయైన కామిక్ రిలీఫ్, సంపత్ రాజ్ తో టఫ్ విలనిజం- ఈ నాలుగు మూల స్థంభాలతో ప్రేక్షకులకి ఒక అపూర్వ ఆనందానుభూతుల్ని ఇవ్వగల అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నారా లేదా ఈ కింద చూద్దాం..


ఏమిటీ ఈ కుటుంబ సంబంధాలు?

          ఎప్పుడో పాతికేళ్ళ క్రితం భూపతి ( సంపత్ రాజ్)- సాయి రెడ్డి (సాయికుమార్) లు స్నేహితులు. తమ కుటుంబాల్లోనే పెళ్ళిళ్ళు కుదుర్చుకున్నారు. భూపతి తమ్ముళ్ళు సాయిరెడ్డి చెల్లెళ్ళని చేసుకున్నారు. భూపతి ఒక చెల్లెలు సరస్వతి ( పవిత్రా లోకేష్) సాయిరెడ్డినే  చేసుకోవాలి. కానీ ఆమె రహస్యంగా వేరే వ్యక్తి ( రావురమేష్) ని ప్రేమించి గర్భవతి అయింది. ఈ విషయం సాయి రెడ్డికి చెప్పేస్తే  అతను వాళ్ళిద్దరి పెళ్లి జరిపించేసి ఫారిన్ పంపించేశాడు. దీంతో సాయి రెడ్డిని  అపార్ధం జేసుకున్న భూపతీ,  అతడి తమ్ముళ్ళూ మొత్తం సాయిరెడ్డి చెల్లెళ్ళనీ సాయి రెడ్డి ఇంటికే  పంపించేశారు. పాతికేళ్ళుగా ఈ ఎడం ఇంకా కొనసాగుతూనే వుంది.

          భూపతికి పుట్టిన కూతురు దివ్య ( రకుల్ ప్రీత్ సింగ్) ఎవరి దగ్గర ఉండాలన్న దానిపై కోర్టు తీర్పునిచ్చింది. ఈమె మేనమామ సాయిరెడ్డి దగ్గరే ఉండొచ్చు- పెళ్లి మాత్రం తండ్రి భూపతి చూసిన సంబంధమే  చేసుకోవాలి.


           
ఈ నేపధ్యంలో ఫారిన్ లో ( పోర్చుగల్) లో సరస్వతికి పుట్టి పెరిగిన కార్తీక్ ఆ వయసులోనే కోట్లకు పడగలెత్తి, పెద్ద పెద్ద కంపెనీలు నడుపుతూంటాడు. తన దగ్గరే తండ్రి, చెల్లెలు, బావ పనిచేస్తూంటారు. ప్రతీదీ డబ్బుతో కొలుస్తాడు. ఇంకా ఎదగాలని కలలు గంటాడు.  అక్కడే అనుష్కా (సోనాల్ చౌహాన్) అనే యంగ్ బిజినెస్ వుమన్ వుంటుంది. ఈమెదీ కార్తీక్ లాంటి మనస్తత్వమే. కాకపోతే ఈ మె తండ్రి ఒక వీలునామా రాశాడు-  ఇంకో నెల రోజుల్లోగా ఈమె పెళ్లి చేసుకోక పోతే- మొత్తం 300 కోట్ల రూపాయల ఆస్తీ ట్రస్ట్ కి వెళ్ళిపోతుందని. దీంతో వీకెండ్ వెంకట్రావ్ ( బ్రహ్మానందం) అనే అసిస్టెంట్ సలహా తీసుకుని కార్తీక్ కి పెళ్లిని ప్రతిపాదిస్తుంది. ఇద్దరూ కలిస్తే బిజినెస్ కి మంచిదేనని కార్తీక్ ఈమె తో ఎంగేజ్ మెంట్ కి సిద్ధపడతాడు, కుటుంబ సభ్యుల అంగీకారంతోనే. 

           అప్పుడు ఇండియా నుంచి ఒక సమాచారం అందుతుంది. అక్కడ తెలుగు రాష్ట్రం లో తను నడుపుతున్న ఒక ఫ్యాక్టరీని మూసేయాలని కోర్టు ఆదేశాలిచ్చిందని. గ్రీన్ ఆర్మీ అనే ఎన్జీవో ఈ ఫ్యాక్టరీ పర్యావరణానికి ప్రమాదకరంగా మారిందని అర్జీ పెట్టుకోవడంతో కోర్టు ఆ ఫ్యాక్టరీని మూయించేసింది!

          కార్తీక్ బయల్దేరి తెలుగు రాష్ట్రానికి వచ్చేస్తాడు. దివ్య మీద ప్రేమాస్త్రం ప్రయోగిస్తాడు- ఆమెని లొంగ దీసుకుని ఫ్యాక్టరీ ని తెరిపించుకోవాలని. అయితే నేరుగా ప్రేమించకుండా ఆమె రూమ్ మేట్  ని ప్రేమిస్తున్నట్టు నటిస్తూ ఉడికిస్తూంటాడు. దివ్య తండ్రి దగ్గర ఉండక, మేనమామ దగ్గరా వుండకా ఏటో వెళ్ళిపోయిందని ముఠా లేసుకుని వెతుకుతున్న భూపతి- సాయి రెడ్డిలు ఆమెని పట్టుకోవడం కోసం ఎట్టకేలకు వచ్చేసినప్పుడు- కార్తీక్ ఎదుర్కొంటాడు. అప్పుడు భూపతికి కార్తీక్  బాగా నచ్చుతాడు. ఇతనే తన అల్లుడని ప్రకటిస్తాడు. అసలు ఫ్యాక్టరీ మూతబడ్డం, దివ్య ఉద్యమం ఏవీ నిజం కావనీ, వేరే  ప్లానుతో తను ఈ రూట్లో వచ్చాననీ కార్తీక్ చెప్పి కథ మలుపు (!) తిప్పుతాడు. ఆ ప్లాన్ ఏమిటంటే ఈ విధంగా  భూపతిని ఆకట్టుకుని, అతడి ఇంట్లో మకాం వేసి అందర్నీ బకరాల్ని చేసి, తల్లి సమస్యకి పరిష్కారం చూపడ మన్నమాట! 


ఎవరెలా చేశారు? 


         ఈ కథలో పాత్రలే ఆషామాషీగా వున్నప్పుడు నటనల గురించి మాట్లాడుకోవాల్సిన అవసరమే రాదు, వదిలేద్దాం.  ఎడిటర్ గౌతమ్ రాజు సినిమా నిడివిని రెండు గంటలా నలభై రెండు నిమిషాల దాకా ఉదారంగా సాగదీసి వదిలేశారు. యాక్షన్ - ఫ్యామిలీ- కామెడీ- సెక్స్  మొదలైన జానర్స్ తో  కలగాపులగమైపోయిన కథా గమనం ఇది కాబట్టి-  ఈ ఒడిదుడుకుల ప్రయాణంలో సమీర్ రెడ్డి ఛాయగ్రహణం కూడా ఓడిదుడుకుల పాలైపోయింది. కథ ఏదో ఒక ఫీల్ తో సాగితే,  ఆ ఫీల్ ని పట్టుకుని ఆసాంతమూ ఆయన దృశ్యమానం చేసే  ఛాయాగ్రహణాన్ని ఆస్వాదించే వీలయ్యేది. ఒక దిశా దిక్కూ లేని స్క్రిప్టు ఎంత ఘోరంగా నటనల్ని, ఎడిటింగ్ ని, ఛాయాగ్రహణాన్నీ, రీరికార్డింగ్ నీ దెబ్బ తీసి వదుల్తుందో తెలియడానికి ఈ చలనచిత్రమే ఉదాహరణ. ఇక కథలో, సన్నివేశాల్లో కిక్కు లేనప్పుడు తమన్ సంగీతంలో పాటలు మాత్రమేం హైలైట్ అవుతాయి. 

            ఈ వెలిగొండ శ్రీనివాస్ రాసిన కథ మామూలు కాపీ కథ కాదు- కాపీ10   కథ! దీనికి కోనవెంకట్ రాసుకుపోయిన డైలాగులు న ‘బూతో’ న భవిష్యతీ..అనే అనాలి. స్టార్ సినిమా లంటే  ఫ్యామిలీలు కూడా చూసే సినిమాలే . ఎప్పుడో అరుదుగా ‘టెంపర్’ లాంటి ఫ్యామిలీస్ కూడా  చూడలేనివి వస్తూంటాయి. ‘పండగ చేస్కో’ ని ఫ్యామిలీస్ కూడా చూడాలన్న సదాశయంతోనే తీసి వుంటే, దీనికి సెన్సార్ వారు ‘U/A’ సర్టిఫికేట్ తో పరోక్షంగా ఫ్యామిలీలు కూడా చూడదగ్గ సినిమా కాదనేశారు! 

స్క్రీన్ ప్లే సంగతులు

        ‘A culture cannot evolve without honest, powerful storytelling. When a society repeatedly experiences glossy, hollowed-out, pseudo-stories, it degenerates. We need true satires and tragedies, dramas and comedies that shine a clean light into the dingy corners of the human psyche and society.’ అంటాడు పాపులర్ స్క్రీన్ ప్లే పండితుడు రాబర్ట్ మెక్ కీ, కమర్షియల్ సినిమాల నుద్దేశించి. 

          ఇది మనకవసరమా? అవసరం లేదు. స్టార్ సినిమాలనేవి  కేవలం బి, సి సెంటర్లలో వూర మాస్ ప్రేక్షకుల్ని దృష్టిలో పెట్టుకుని-
repeatedly thrown upon glossy, hollowed-out, pseudo-stories  మాత్రమే  అయివుండాలి. మానమర్యాదలు ఎంత తక్కువ వుంటే అంత మంచిది.  మిగతా నగరాల్లో, ఓవర్సీస్ లో వుండే పై తరగతి ప్రేక్షకులు కూడా ఈ ‘సబ్సిడీ బియ్యమే’ తినాలి. ఛాయిస్ లేదు. అయితే అదృష్ట మేమిటంటే ఈ repeatedly thrown upon glossy, hollowed-out,  pseudo-stories  తో వస్తున్న స్టార్ సినిమాలతో మాస్ ప్రేక్షక లోకం కూడా degenerate ఏమీ అవడం లేదిప్పుడు. వాళ్ళు బతక నేర్చిన వాళ్ళు. సబ్సిడీ బియ్యంలో కూడా ముక్కిన బియ్యాన్ని తిప్పికొట్టే  స్పృహ వాళ్ళ కొచ్చేసింది!  సగటు మనుషులైనందుకు ఎప్పటినుంచో వాళ్లకి తెలిసింది ఒక్కటే- పల్లెటూరి రచ్చ బండల దగ్గర- రాత్రి  చూసొచ్చిన సినిమా గురించి- ‘ఒరే ఫస్టాఫ్ కామెడీ- సెకండాఫ్ స్టోరీరా!’ అనేసి  తామేదో తెలుగు సినిమాల స్క్రీన్ ప్లే రహస్యాన్ని కనిపెట్టేసినట్టు చంకలు కొట్టుకోవడం!


          మాస్ ప్రేక్షకులకి కూడా మస్తిష్కం  వుంటుంది. వాళ్ళు ఫస్టాఫ్ లో కథ లేకుండానే కామెడీ అంతా ఎంజాయ్ చేసి- ఇక సెకండాఫ్ లో దర్శకుడు సీరియస్ గా చూపబోయే కథ కోసం-పక్కా కథకోసం-  చేతులు కట్టుకుని డిసిప్లిన్డ్ గా కూర్చునేవాళ్ళు. సెకండాఫ్ లో ఎంత బరువైన కథనైనా ఇన్వాల్వ్ అయిపోయి ఆలోచనాత్మకంగా చూసే వాళ్ళు- ఫస్టాఫ్ లో అంత కామెడీని ఎంజాయ్ చేశాంగా?  అన్న ఇచ్చి పుచ్చుకునే ధోరణిలో. సెకండాఫ్ లో మెయిన్ లైన్ లో వున్న ప్రధాన పాత్రల్ని కామెడీ లోకి దింపకుండా,  వేరే హాస్యగాళ్ళతో సపరేట్ కామెడీ ట్రాకులతో ఎంటర్ టెయిన్ మెంట్ తగ్గకుండా చూసే వాళ్ళు. ప్రధాన పాత్రలతో కొనసాగుతున్న ప్రధాన కథని సెకండాఫ్ లో గల్లంతు చేసేవాళ్ళు కాదు. 


          కనుక మాస్ జనంలో ఫస్టాఫ్ కామెడీ- సెకండాఫ్ స్టోరీరా! - కొటేషన్ ఇప్పటికీ మారి ఉండడానికి వీల్లేదు.  ఎవరో  కొంత శాతం కెరీర్ తప్ప మరో ధ్యాసలేని మధ్యతరగతి యువత తమ సాంస్కృతిక మూలాలకి దూరమై, సినిమాల్ని పాప్ కార్న్ ఎంటర్ టైనర్ లుగా మాత్రమే – మెదళ్ళని ఇళ్ళ దగ్గర వదిలేసి- కాసేపు నవ్వేసుకుని వెళ్లిపోతే చాలన్నట్టుగా చూడ్డానికి అలవాటు పడ్డారేమో గానీ- బిసి సెంటర్లలో మాస్ లో మార్పేమీ రాలేదు. 


          స్టార్ సినిమాలు తీస్తున్న వాళ్ళే కథని పణంగా పెట్టి- ఫస్టాఫ్ కథతో సంబంధంలేని కామెడీ, సెకండాఫ్ లోకూడా కథతో సంబంధం లేని కామెడీ-మొత్తంగా  కథతో సంబంధంలేని కామెడీతోనే నడపాలి- అన్న ఆదుర్దానో, తెచ్చి పెట్టుకున్న అభద్రతా భావమో పెంచుకుని అయోమయపు సినిమాలు అందిస్తున్నారు. ఈ రూటులో మొన్నే ఇలాటి ఒక ‘మోసగాళ్ళకు మోసగాడు’ అయింది; ఇప్పుడు ‘పండగ చేస్కో’ అవుతోంది!
ఇర్రెగ్యులర్ కమర్షియల్?

          పైన- రెగ్యులర్ కమర్షియల్ = కుటుంబ సంబంధాల కథ + వినోదం అనే బేసిక్ బాక్సాఫీస్ ఫ్రెండ్లీ ఈక్వేషన్ ని రామ్ పికప్ చేసుకోవడంలో ఎలాటి పొరపాటూ చేయలేదనుకున్నాం. ఈ బేసిక్ ఈక్వేషన్ కి పూసిన పూతలు ( షుగర్ కోటింగ్స్) ఒకటి కాదు, రెండూ కాదు...యాక్షన్ పూత, కామెడీ పూత, సెంటిమెంటు పూత, అశ్లీలపు పూత.. ఇలా ఈ కథలో ఎన్ని రకాల ఇతర సినిమాల కథలుంటే  వాటి తాలూకు పూతలన్నీ పూసేశారు. ఈ పూతల్ని కోన వెంకట్ అనితర సాధ్యంగా కనిపెట్టిన సింగిల్ విండో లోకి పంపిస్తే, ఈరకంగా  స్క్రిప్తుగా తయారై ఇవతలకి వచ్చేసిందన్న మాట. 

          ఈ సింగిల్ విండోలోకి ఇంకో పదేళ్ళు ఏ రకం కథ, ఇంకెలాటి కథ పంపినా అవన్నీ ఒకే పోతలో రూపం పోసుకుని, క్లోనింగ్ బేబీస్ లా డెలివరీ అవుతూనే వుంటాయన్న మాట. 2003 లో  వినాయక్- నితిన్ ల కాంబినేషన్ లో ‘దిల్’ అనే హిట్ వచ్చింది. దీంట్లో పరిచయమైన ‘విలన్ ఇంట్లో హీరో కుటుంబం చేరి చేసే కన్ఫ్యూజ్ కామెడీ’  స్కీము, 2007 లో శ్రీను వైట్ల- మంచు విష్ణుల  ‘ఢీ’  అనే సినిమాలోకి దిగుమతి అయి, కోన వెంకట్ చేతికి సింగిల్ విండో స్కీముగా అంది,  తెలుగు సినిమాలకి వరప్రదాయని అయింది! 


          ఈయన సంగతి ఇలా ఉందా అని, వెలిగొండ శ్రీనివాస్ తను ఎక్కడెక్కడ్నించో లిఫ్ట్ ఇరిగేషన్ చేసుకొచ్చిన  ఘోరమైన, బరువైన  కాపీ10  ప్యాకింగ్ తెచ్చి కోన వెంకట్ కిస్తే, ఆయన ఆటోమేటిగ్గా తన సింగిల్ విండోలో పది పన్నెండు పూతలేసి, మర ఆడించి, పైకి తీస్తే చెక్కు చెదరకుండా రొటీన్ షేపులోనే  వచ్చేసింది!


          ఒక హీరో హీరోయిన్ తో ఆడుతూ పాడుతూ తిరుగుతూంటాడు. ఇంటర్వెల్లో ఏదో  సమస్య ఎదురవుతుంది. అప్పుడు  విలన్ ఇంట్లో మకాం వేసి రకరకాల వాళ్ళని దింపి, ‘కన్ఫ్యూజ్ కామెడీ’ తో బకారాల్ని చేస్తాడు. చివరికి ఈ బకరాలని ఉపయోగించుకుని సమస్య పరిష్కరించు కుంటాడు. ఇవీ సింగిల్ విండో స్కీమ్ సేమ్ స్టోరీ  పూర్వాపరాలు.


సింగిల్ విండో స్కీమ్ మేడీజీ
హీరో హీరోయిన్లు- ఆటాపాటా
హీరోకి ఓ సమస్య
విలన్ ఇంట్లో హీరో
ఇంకా అనేక క్యారక్టర్లు
వాళ్ళని  హీరో బకారాలుగా  చేయడం
కన్యూజ్ కామెడీతో బకారాల్ని ఆటపట్టించడం 
తానెవరో చెప్పి కథం ముగించడం!
దట్సాల్ !


          ఈ స్కీములో ఈ సారి కూడా రెగ్యులర్ కమర్షియల్ = కుటుంబ సంబంధాల కథ + వినోదం అనే బేసిక్ బాక్సాఫీస్ ఫ్రెండ్లీ ఈక్వేషన్ ఇర్రెగ్యులర్ ఈక్వేషన్ గా ఎలా మారిందో ఇప్పుడు చూద్దాం. 

          ఈ సినిమాలో కథనేది  పాతికేళ్ళ క్రితం పుట్టింది. భూపతీ, అతడి తమ్ముళ్ళూ,  పెళ్లి చేసుకున్న సాయి రెడ్డి చెల్లెళ్ళు నల్గుర్నీ అతడి ఇంటికే  పంపేసి పగదీర్చుకున్నారు. దీనికి కారణమైన భూపతి చెల్లెలు, అంటే హీరో తల్లి ఈ విషయం హీరోకి చెప్పింది. హీరో ఆ కుటుంబాల్ని కలిపి తల్లి కోరిక తీర్చాలని బయల్దేరాడు. 


          ఇదెంత అసహజంగా, కృత్రిమంగా వున్నా, మౌలికంగా – మూలంలో ఇది కుటుంబ సంబంధాల కథే. మనసుపొరల్లో పేరుకు పోయిన విష ద్వేషాలతో సంఘర్షణ. మానసిక సంబంధమైనది. తగు జాగ్రత్త తీసుకుని, భావోద్వేగాల్ని అదుపుచేస్తూ, ఆయా పక్షాల మనోభావాలు దెబ్బతీయకుండా- ఒక సైకో థెరఫీ తరహాలో  సున్నితంగా పరిష్కరించాల్సిన సమస్య.


          ఇలాటి కథని  ప్రారంభించడమే దడదడ మని చంపుకునే ముఠాలతో, వాళ్ళ చేతుల్లో రక్తాన్ని చిందించే కత్తులూ తుపాకులతో, స్కార్పియో కార్ల పేలుళ్లతో  హింసాత్మకంగా ప్రారంభించడమేమిటి? చాలా సిల్లీగా లేదూ? ఎవడో జైల్లోంచి విడుదలై ఇంకెవణ్ణో చంపడానికి రావడమనే దాంతో ఈ సినిమాకి సంబంధమేమిటి? ఆ తర్వాత  హీరోయిన్ కోసం భూపతీ, సాయి రెడ్డిలు ముఠాలుగా ఏర్పడి మారణాయుధాలతో తరుముకుంటూ రావడమేమిటి,  హీరోయిన్ నేరస్థు రాలైనట్టు? 


          హీరోయిన్ ట్రైన్ లో తమ వూరికి వస్తోందనే అనుకుందాం; ఆమెని తీసి కెళ్ళేందుకు పోటీలు పడి వస్తున్న భూపతి, సాయి రెడ్డీలు ముఠాలు లేకుండా ఫన్నీ క్యారక్టర్స్ తో ఎత్తుకు పైయెత్తు లేసుకుంటూ ఫన్నీగానే రావాలిగా? అలా దీన్ని ఓపెనింగ్ లోనే ఇది ఫ్యామిలీ ఫన్ మూవీ  అన్న భావాన్ని ఎష్టాబ్లిష్ చేసి,  ప్రేక్షకుల్ని థ్రిల్లింగ్ గా కొత్త అనుభూతితో సంసిద్ధుల్ని చేయాలిగా? ఫస్ట్ యాక్ట్  బిజినెస్ ఏమిటి? ఇక్కడ ఎష్టాబ్లిష్ చేయాల్సిన కథానేపధ్యం అనే టూల్ తో చూపబోయే కథ గురించి ప్రేక్షకులకి ఏం హింట్ ఇవ్వాలి?


          ప్రతీ సినిమాకీ కాపీ కొట్టినట్టు ఇదే ప్రారంభమా? ప్రతీ కథా ఒకేలాగా ప్రారంభామౌతాయా ఎక్కడైనా? ‘సన్నాఫ్ సత్య మూర్తి’ అనే ఫ్లాపైన కుటుంబ సంబంధాల కథని కూడా ఇంతే రాక్షసంగా చాలా దారుణంగా ప్రారంభించారు. ప్రతీ సినిమాకీ గత పదేళ్లుగా  ఈ బెడద వదలదా?


          ఇవి తప్ప వేరే కథా ప్రారంభాలే ఉండవా?  అసలు కుటుంబ కథకి ఈ ముఠాల ముష్టి హింసతో ప్రారంభాలేమిటి? ఈ తెచ్చిపెట్టుకుంటున్న బిల్డప్పులేమిటి? వీటికేమైనా ప్రేక్షకులు సీట్లకి అతుక్కుపోయి కూర్చుంటున్నారా? ఇవెంత హాస్యాస్పదంగా తయారయ్యాయో ఎవరైనా ఫీల్డు బయట నుంచి గమనించారా? 


          ఇంకా ఈ సినిమాలో అడుగడుగునా అర్ధంపర్ధం లేకుండా కొత్త కొత్త ముఠాలు పుట్టుకొస్తాయి. ఫ్యామిలీ ఓరియెంటెడ్ మూవీ అన్న స్పృహ కూడా లేకుండా రాక్షసమైన అరుపులతో బీభత్సం సృష్టిస్తాయి. ఒక కుటుంబ సంబంధాల కథని దాని జానర్ మర్యాదని గౌరవిస్తూ- రాక్షస విలన్లూ వాళ్ళ ముఠాలూ లేకుండా-  ఫీల్ గుడ్ నేచర్ తో తీయలేకపోతే, ఫ్యామిలీ కథల జోలికే వెళ్ళనవసరం లేదు. సినిమా ఈజ్ సైకో థెరఫీ అన్న ప్రాథమిక సూత్రాన్ని ఒప్పుకో గల్గితే వాటి జోలి కెళ్ళొచ్చు. అన్ని కథలకీ ఒకే రొడ్డ కొట్టుడు ట్రీట్ మెంట్ ఇస్తే ఇలాగే మొరటుగా, నాటుగా అవకరాలతో పుట్టిన ఇర్రెగ్యులర్ కమర్షియల్స్ చేతికొస్తాయి.


*
కథలో హీరోనా? అతనెవరు?


          ఈ కథకి ఒక కథా పథకం ( ప్లాటింగ్) అంటూ లేదు. ఆ కథా పథకంలో మూల స్థంభాల్ని గుర్తించిందీ లేదు. మూలస్థంభాల్ని గుర్తిస్తే కథా పథక మనేది వస్తుంది. హీరో- ఇద్దరు హీరోయిన్లు- బ్రహ్మానందం- సంపత్ రాజ్ పాత్రలు ఈ కథకి మూలస్థంభాలు. ఈ పాత్రలతోనే కథని ప్రధానంగా నడపాలి. వీటిలో హీరో ని తప్పిస్తే, మిగిలిన నాల్గు పాత్రలూ హీరోకి అనుకూలంగానో, వ్యతిరేకంగానో ప్రవర్తిస్తూ హీరో సంఘర్షణని హైలైట్ చేస్తూండాలి. 

          కానీ ఇదేమీ పట్టకుండా- ఎక్కడపడితే అక్కడ ఎవరెవరో ముఠాల్ని దింపుతూ, వాటితో కామెడీలతో ఉపకథల్ని పెంచేస్తూ, గందరగోళం సృష్టించారు. ఒక దశలో ఏ పాత్ర ఏమిటో ఫాలో కాలేని భారాన్ని మోపేశారు. 

          సినిమా ప్రారంభించిన అరగంట లోపు బిగినింగ్ ముగిసింది. పోర్చుగల్ లో సెకండ్ హీరోయిన్ తో ఎంగేజ్ మెంట్ చేసుకున్న హీరోకి, ఇండియాలో తన ఫ్యాక్టరీ ఫస్ట్ హీరోయిన్ కారణంగా మూతబడిందని తెలియడంతో- సమస్య ఏర్పాటయి మిడిల్ లో పడింది కథ. ఈ మలుపు నిజానికి చాలా సెన్సాఫ్ డేంజర్ ని క్రియేట్ చేసింది! ఆ ఎంగేజ్ మెంట్ వల్ల  సెకండ్ హీరోయిన్ తో అలా లాక్ అయిపోయిన హీరో- ఇప్పుడు ఫస్ట్ హీరోయిన్ తో ఏం చేస్తాడన్న ఆందోళనని సృష్టించింది నిజానికి. ఈ సైన్ పోస్టుని  హైలైట్ చేయగలిగారా అంటే అదీ లేదు. ఈ సెన్సాఫ్ డేంజర్ నేపధ్యంలో కథ నడిపి ప్రేక్షకుల్ని  కదలకుండా కట్టి పడేశారా అంటే అదీ లేదు. ఎంతసేపూ కామెడీ కామెడీ! తెలుగు ప్రేక్షకులు ఇంతోటి తెలుగు సినిమాల్లో కామెడీ కోసమే చచ్చిపోతున్నట్టూ,  అది లేకపోతే  సినిమాల్ని అట్టర్ ఫ్లాప్ చేసేస్తున్నట్టూ ఫీలైపోయి- ప్రేక్షకులతో నిజమైన సంబంధాలు తెగిపోయిన వాతావరణంలో కథ లేకుండా కామెడీల్ని వండేస్తున్నారు. ఈ కామెడీలు కూడా ఫ్రెష్ గా వుండవు. 


          కమర్షియల్ సినిమా కథెప్పుడూ హీరో హీరోయిన్లదే. వాళ్లకి ఏం జరిగిందన్నదే కథ. అంతే  గానీ, ఈ సినిమాలోలాగా  తల్లి చెప్పిందని, తల్లి కోసం బయల్దేరడం కథ కాదు. తల్లి కోసం, తండ్రి కోసం, చెల్లి కోసం, ఫ్రెండ్ కోసం హీరో బయల్దేరడమనేది కాలం చెల్లిన ఓల్డ్ ఫార్ములా. హీరోయిన్ కోసం హీరో చేయడమే నేటి సక్సెస్ ఫుల్ కమర్షియల్ ఫార్ములా. 


          పాతికేళ్ళూ
సైలెంట్ గా వున్న తల్లి, హఠాత్తుగా మహాతల్లి అవతారం దాల్చి- అదికూడా తన స్వార్ధంకోసం కుటుంబాల్ని కలపమంటూ కొడుకుని ప్రేరేపించడం కాకుండా, కొడుకు కోసం ఒక పాయింటు చెప్పివుండాల్సింది...


          ‘బాబూ, నేనెలాగూ ఇలా అయిపోయాను. నువ్వు కూడా రేపు చుట్ట పక్కాల్లేని ఒంటరి కాకూడదు. ఎలాగైనా నువ్వైనా వెళ్లి అక్కడ నీ మరదల్ని చేసుకుని వాళ్ళందరితో సంబంధాలని కలుపుకో, అప్పుడే నాకు మనశ్శాంతి’ – అన్నదనుకుందాం, అప్పుడామె త్యాగశీలి అన్పించుకునేది. 


          హీరో అక్కడ హీరోయిన్ని చేపట్టడానికి మాత్రమే  బయలేదేరే వాడు. ఇది పైకి కన్పించే బాక్సాఫీస్ అప్పీలున్న రొమాంటిక్ యాంగిల్ తో కూడిన ఫిజికల్ గోల్. దీన్ని సాధిస్తే ఆ పునరుద్ధరించిన బంధుత్వాల్లోకి ఆటో మేటిగ్గా తల్లికూడా జాయినై పోయి హీరో ఎమోషనల్ గోల్ కూడా పూర్తవుతుంది. 


          ఆల్రెడీ ఎంగేజ్ మెంట్ అయిన కొడుకుతో వెళ్లి మరదల్ని చేసుకోమని తల్లి ఎలా అంటుందని అనొచ్చు. ఈ తల్లి క్యారక్టర్ బయోగ్రఫీ ప్రకారం చూస్తే- వేరే  పిల్లతో ఎంగేజ్ మెంట్ కి ససేమిరా అంటుంది. అప్పటికే ఆమె మేనకోడల్ని డిసైడ్ చేసుకుని వుంటుంది. కాబట్టి సినిమాలో చిత్రించినట్టుగా- సెకండ్ హీరోయిన్ తో పెళ్ళికి తల్లి ఒప్పుకోవడమనేది హీరో పాత్ర పరంగా చూసినా చాలా పూర్ కథనం. ఎంగేజ్ మెంట్ విషయం అసలు ఇంట్లో చెప్పకుండా సస్పెన్స్ క్రియేట్ చేసే వాడే నిజమైన హీరో!


         
What is character but the illumination of  incident? And what is incident but the illumination of character?-  అని పాత్రచిత్రణ గురించి హెన్రీ జేమ్స్ అన్నట్టు ఈ బ్లాగ్ లో అనేక సార్లు ప్రస్తావించుకున్నాం. హీరో పాత్ర దేదీప్యమానంగా వెలిగిపోవాలంటే పై పేరాలో చెప్పినట్టుగా ఇంట్లో చెప్పకుండా అతను సస్పెన్స్ క్రియేట్ చేయాల్సిందే. డైనమిక్స్ ని మెయింటైన్ చేయాల్సిందే. అప్పుడే దాన్ని  క్యారక్టరైజేషన్ అంటారు. 


          హీరోకి ఇంకో రూటు క్లియర్ చేయాల్సి వుంటుంది- ఫస్ట్ హీరోయిన్  మేనమామ దగ్గరే ఉండొచ్చని,  కానీ పెళ్లి మాత్రం తండ్రి చూసిన సంబంధమే చేసుకోవాలనీ కోర్టు ఉత్తర్వు లిచ్చిందని సొంత కవిత్వం చెబుతూ కథ రాసుకున్నారు. దీనికి అర్ధం పర్ధం ఏమైనా ఉందా? హీరోయిన్ తల్లిదండ్రు లేమైనా విడాకులు తీసుకున్నారా? మరి కోర్టు ఎలా ఉత్తర్వులిస్తుంది? కోర్టు మేనమామ దగ్గరే వుండాలని ఎలా చెప్తుంది? మేనమామ దగ్గర తల్లి ఉంటోంది. ఆ తల్లి దగ్గరే వుండాలని చెప్పకుండా మేనమామ ఏమిటి? ఆడదానికి పాత్ర ఉండరాదని  కోర్టు వివక్ష చూపిందా? పైగా మైనారిటీ తీరాకా కూడా అక్కడే వుండాలని చెప్పిందా? తండ్రి చూసిన సంబంధమే హీరోయిన్ చేసుకోవాలని కూడా కోర్టు ఎలా చెప్తుంది? చట్ట ప్రకారం మైనారిటీ తీరాక ఆమె పెళ్లి ఆమె ఇష్టమని చెబుతున్న చట్టాలేమైనా మారిపోయాయా?
స్టార్ సినిమాకి ఏ లాజిక్కూ అవసరంలేదా?


          ఇలా బాధ్యతారాహిత్యంగా లింకులు పెట్టి ఫస్ట్ హీరోయిన్ కి లాజిక్కి నిలబడని ట్విస్టు పెట్టారు. ఆల్రెడీ మొదట్లోనే సెకండ్ హీరోయిన్ కి ఓ  ట్విస్టు ఉండనే వుంది. నెలలోగా ఆమె పెళ్లి చేసుకోక పోతే ఆస్తి ట్రస్టుకి పోతుందని. ( ‘ది బ్యాచిలర్’ ( 1999) అనే హాలీవుడ్ హిట్ కథకి మెయిన్ పాయింటు ఇదే. కాకపోతే ట్విస్టు హీరో మీద వుంటుంది. ఈ హిట్ కూడా 1925 లో తీసిన మూకీ ‘సెవెన్ ఛాన్సెస్’ కి రీమేక్.. ఇదే పాయింటుతో ఒక యంగ్ స్టార్ కి కథ విన్పించాలనుకుంటున్న దర్శకుడికి ‘పండగ చేస్కో’ సినిమా చూస్తున్న ఈ వ్యాసకర్త,  ఈ సినిమాలో ఈ పాయింటే వుందని మెసేజి కొడితే ఆయన షాకై పరుగులు తీశాడు!  ఇంకో సినిమా చూస్తూ ఇంకో దర్శకుడికీ ఇలాగే ఓ మెసేజీ కొడితే ఆయన కూడా  చేసుకున్న స్క్రిప్టు అవతల పడేసి కింకర్తవ్యం ఆలోచిస్తున్నాడు. కనీసం విడుదలవుతున్న తెలుగు సినిమాలు చూడకపోవడం, వాటి కథలేమిటో నెట్ లో ఓ నిమిషం పాటు చదువుకుని  తెలుసుకోక పోవడం కొందరి స్టయిల్. ఎందుకంటే టాలీవుడ్ @ జోరుగా లిఫ్ట్ ఇరిగేషన్ కదా! అంత టైముండదు!)


         
సెకండ్ హీరోయిన్ కి అలా ట్విస్టు పెట్టాకా,  మళ్ళీ ఫస్ట్ హీరోయిన్ కీ ట్విస్టు పెట్టడం అనాలోచితమైన కథనం. పునరుక్తితో రెండూ పేలవంగా తయారయ్యేవే. కాబట్టి ఫస్ట్ హీరోయిన్  కి ఎలాటి నిషేధాజ్ఞాలూ వుండే అవకాశం లేదు. ఇవి లేకపోయాక తండ్రీ మేనమామాలు తనకోసం ముఠాలతో  కొట్టుకు చచ్చే – బలవంతంగా ఇరికించిన యాక్షన్ ఎపిసోడ్స్ కీ స్థానం వుండదు. కథ చాలా క్లీన్ గా స్పష్టంగా అర్ధమవుతూ హాయిగా వుంటుంది.


          ఇదంతా స్టోరీ సెటప్- దీన్నందుకుని మిగతా కథ చెప్పాలి. ఇది వదిలేసి విలన్ ఇంట్లో ఇంకేవేవో లెక్కకందని పాత్రలతో, వాటి ఉపకథ లతో గందరగోళం చేశారు.
ఒకవైపు శృంగారం కోసం నల్గురు భార్యలు- నల్గురు భర్తల పాట్లు, సెకండ్ హీరోయిన్ ని ఎలాగైనా అనుభవించాలని బ్రహ్మానందం ఆరాటం- ఆమే  అనుకుని సంపత్ రాజ్ తో ‘గే’  చేష్టలకి పాల్పడడం...ముందు ఫస్ట్ హీరోయిన్ తో- తర్వాత సెకండ్ హీరోయిన్ తో విలన్ అభిమన్యూ సింగ్ వెర్రి చేష్టలు- వీటికి జేపీ సపోర్టు; భూపతి ముఠా- సాయిరెడ్డి ముఠాలేగాక, జేపీ ముఠా, వీళ్ళందరి మీదా ఇంకో ముఠా...బయట ముఠాల గొడవలు, లోపల కామ గోలలు, ఇంట్లోకి దూరిన మరో ఇద్దరు దొంగలూ- వీటన్నిటి మధ్యా హీరో మాయం! హీరో ఎక్కడుంటాడో తెలీదు- అసలు జ్ఞాపకమే రాడు! ఇదీ వరస.


          సత్యజిత్ రే జీవిత చరిత్ర రాసిన మేరీ సెటన్ ఎప్పుడో 1960 లలోనే ఆ పుస్తకంలో పేర్కొంది - భారతీయ సినిమాలు ఇంకా వీధి భాగోతాల స్థాయి దాటుకుని రాలేక పోతున్నాయని! ‘పండగ చేస్కో’ చూస్తూంటే ఇప్పటికీ -ఇంకెప్పటికీ ఆమె మాటలు నిజమౌతూనే వుంటాయన్పిస్తోంది!


పాత్రోచితానుచితాలు

            విదేశంలో అంత శక్తిమంతమైన  యంగ్ బిజినెస్ మాన్ గా చెలామణి  అయిన  హీరో, సొంత ఊరికొచ్చేసరికి  తానెవరో చెప్పుకునే ధైర్యంలేక దొంగాటకాలు మొదలెడతాడు. అద్భుతమైన వ్యాపార వ్యూహాలున్న వాడిలా బిల్డప్పిచ్చిన తను, ఇక్కడి సమస్యని తేల్చే బుద్ధికుశలత లేక భీరువులా ఏవేవో వేషాలేస్తాడు. ఫ్యాక్టరీ మూత బడ్డమూ, ఫస్ట్ హీరోయిన్ ఉద్యమమూ అంతా నాటకమని తేల్చేస్తాడు. ( ఎవరైనా స్క్రీన్ ప్లేలో బిగినింగ్ లో ఎస్టాబ్లిష్ చేసిన-టర్నింగ్ పాయింటుని ఇలా తీసిపడేసుకుని ప్రేక్షకుల్ని చీట్ చేసే సాహసం చేస్తారా!).

         
ఛీ, కథా కాకరకాయా ఎవడిక్కావాలి-  అన్నట్టు హీరోగారు ఆ టర్నింగ్ పాయింటుని తీసి అవతలకి గిరవాటేసి- తను వచ్చిన పని వేరే అని ఇంటర్వెల్ ఇచ్చుకుని వెళ్ళిపోతాడు. అంతే, ఇక సెకండాఫ్ లో పనేం వుండదు. అతడికి క్కావాల్సిందదే! దర్శకుడూ రచయితలూ కథని తప్పించుకోవాలి- హీరో పని తప్పించుకోవాలి!


          కానీ ఇంటర్వెల్ లో ప్లేటు ఫిరాయించే ముందు- ఎంగేజ్ మెంట్ చేసుకున్న సెకండ్ హీరోయిన్ తో అయినా తన ఎథిక్స్ ఏమయ్యాయో, ఇక్కడ ఫస్ట్ హీరోయిన్ తో ప్రేమాయణం మొదలెడతాడు. ఫస్ట్ హీరోయిన్ని  నేరుగా ప్రేమించే దమ్ముల్లేక  ఆమె రూమ్మేట్ ని ప్రేమిస్తున్నట్టు నటిస్తూ ఉడికిస్తూంటాడు. ఆ రూమ్మేట్  తల్లిదండ్రులు ఇక పెళ్లి చేసుకోమనగానే- తను ప్రేమిస్తున్నది ఫస్ట్ హీరోయిన్నే అని ఫస్ట్ హీరోయిన్ సహా అందరి ముందూ తోక ముడిచేస్తాడు! రూమ్మేట్ అమ్మాయిని ని ఘోరంగా అవమానిస్తాడు! ఇక్కడ్నించీ ఈ రూమ్మేట్ పాత్రకి- నువ్వు ఆడదానివే, నువ్విలాగే పడుండాలి సుమా- అన్న తీరులో అద్భుతమైన పాత్రచిత్రణ!!


          ఫస్ట్ హీరోయిన్ని కూడా హీరో ప్రేమించడం అలా ప్రేమించి ఫ్యాక్టరీని తెరిపించుకోవడానికట!  అంత కొమ్ములు తిరిగిన బిజినెస్ మాన్ కి వ్యవస్థ గురించే తెలీనట్టుంది? తీర్పు ఇచ్చేశాక ఈమె చేతుల్లో మాత్రం ఏముంటుంది? వెళ్లి అప్పీల్ చేసుకోవాలి. అసలు హీరో గారి పక్షం వాదన వినకుండానే- అసలు ఆయనకీ నోటీసులు పంపకుండానే, ముద్దు ముద్దు అల్లరి పిల్ల  హీరోయిన్ పడేసిన పిటీషన్ ని పట్టుకుని, ఏకపక్షంగా కోర్టు తీర్పు పళ్ళెంలో పెట్టి ఇచ్చేసిందా?


          ఇదంతా కట్టుకథ అంటాడు హీరో. ఇదేమిటో అస్సలు అర్ధంగాదు. కట్టు కథలో ఇన్ని బొక్కలా? అమ్మాయిల జీవితాలతో ఆడుకునే హీరోకి వేరే నాలెడ్జ్ ఏమంత వుంటుంది?


          30 రోజుల టైం లాక్ తో హీరోతో పెళ్ళికోసం ఎదురు చూస్తున్న సెకండ్ హీరోయిన్ కూడా కామెడీగా మారిపోవడంతో ఈ పాత్రకూడా చచ్చిపోయింది. హీరో ఎర వేసిన బ్రహ్మానందం ని కాదనుకుని, ఛోటా విలన్ని చేసుకుని అంతటి హైఫై యంగ్ లేడీ కూడా ఈసురోమంటుంది దర్శకుడూ- రచయితల చేతుల్లో.


          ఫస్ట్ హీరోయిన్ పిచ్చి పిల్ల. అంత ఎదిగినా తన హక్కులేంటో  తనకే  తెలీవు, అట్నుంచీ ఇట్నుంచీ తండ్రీ మేనమామలు పీకుతూంటే దాన్ని ఎంజాయ్ చేస్తూంటుంది. పైగా పర్యావరణ హక్కులంటూ టీనేజీ పిల్లాలా ఎగురుతూ కిలకిల నవ్వులతో ఊరేగింపులు తీస్తుంది. ఈమెని చూసి భయపడి ఫ్యాక్టరీ మూత  పడేలా కోర్టు తీర్పు ఇచ్చిపారేసిందట! ఇంత ఉద్యమం చేస్తూ ఈమె అంతో ఇంతో పబ్లిక్ ఫిగర్ అయ్యే వుంటుంది. ఈమె ఎక్కడుందో ఛానెల్స్ లో చూస్తే  తెలిసిపోతుంది. అయినా  తండ్రీ మేనమామల ముఠాలు పదండ్రా అని ఎక్కడెక్కడో పడి వెతుకుతూంటారు. సినిమాలో యాక్షన్ సీన్స్ బాగా ఇరగదీయాలనా?


          తల్లి క్యారెక్టర్...తన కోసం త్యాగం చేసుకున్న సాయిరెడ్డినీ, అతడి నల్గురు చెల్లెళ్ళనీ వాళ్ళ ఖర్మానికి వదిలేసి ఎక్కడో విదేశంలో సకలైశ్వర్యాలూ అనుభవిస్తున్న తను- ఎప్పుడో మేల్కోవాలి. పాతికేళ్ళుగా కాపురాల్లేక కొడిగట్టిన ఆ చెల్లెళ్ళ జీవితాల్ని, ఇక పిల్లలు పుట్టే వయసు కూడా దాటిపోయిన వాళ్ళ దైన్యాన్నీ పట్టించుకోకుండా ఎలా వుంటుంది? పాతికేళ్ళ తర్వాత తన స్వార్ధం కోసం వాళ్ళంతా గుర్తొచ్చారా? ఇప్పుడు వాళ్ళతో కలుపుకోకుంటే తను బతకలేదా?


         
భూపతి కూడా  మూర్ఖుడు. తను ఒక పిల్లని కనేశాడు, తనకి బాధలేదు. తన తలతిక్క తనం తో తమ్ముళ్ళని భార్యల నుంచి విడగొట్టి మొండి గోడల్ని చేశాడు. పాతికేళ్ళుగా ఆ తమ్ముళ్ళు  పెళ్ళాం పిల్ల ల్లేకుండా, అన్నకి ఎదురు తిరక్కుండా ఎలావుంటారో అర్ధంగాదు. అటు సాయి రెడ్డి కూడా ఇలాటి మొగుళ్ళ పీడా తన చెల్లెళ్లకి  వదిలిస్తూ విడాకు లిప్పించి వేరే పెళ్ళిళ్ళు చేసెయ్యొచ్చు. అదేదో గొప్ప ఫ్రెండ్ షిప్ అయినట్టూ- ఆ ఫ్రెండ్ షిప్ కోసం త్యాగాలు చేస్తున్నట్టూ మూర్ఖంగా చెల్లెళ్ళని బలితీసుకోవడం! భూపతితో తనకి సెంటిమెంటు వుంటే, చెల్లెళ్లకి సంబంధమేమిటి?


          ఇలా ఫ్యామిలీ స్టోరీ అన్న ప్రచారంతో ఎలాపడితే అలా అడ్డగోలు చిత్రణలూ, కథలూ ఎందుకొస్తాయంటే ఇవి నరుక్కునే దుర్మాగుల కుటుంబాల కథలు కావం వల్లే. నరుక్కునే దుర్మాగుల కుటుంబ కథలు తప్ప ఇంకే కుటుంబాల కథలూ  చెప్పడం చేతగానందు వల్ల! కాబట్టి ఫ్యామిలీ సినిమా వచ్చిందంటే నరుక్కునే దుర్మార్గుల కుటుంబాల గోడు చూడబోతున్నామని ముందే సిద్ధపడి వెళ్ళాల్సి వుంటుంది..

సికిందర్



 
         

           
         
         






         

       



















25, మే 2015, సోమవారం

రచన, దర్శకత్వం: వంశీకృష్ణ
తారాగణం: లక్ష్మీ మంచు, అడివి శేష్‌, మధునందన్‌, ప్రభాకర్‌, బ్రహ్మానందం, పృధ్వీ, పవిత్ర
మాటలు: సాయి మాధవ్‌ బుర్రా - సంగీతం: సత్య మహావీర్‌, సాయి కార్తీక్‌, రఘు కుంచె ఛాయాగ్రహణం: సామల భాస్కర్‌
బ్యానర్‌: మంచు ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రై.లి., నిర్మాత: లక్ష్మీ మంచు
విడుదల : మే 8, 2015
*
తెలుగు సినిమా - అందులోనూ ప్రత్యేకించి ఎక్కువ సంఖ్యలో విడుదలయ్యే చిన్న సినిమాల తీరుతెన్నుల్ని అర్జెంటుగా పునర్నిర్వచించు కోవాల్సిన అవసర మేర్పడిందేమో ఇప్పుడు. చిన్న సినిమాల అందచందాలకి, హావభావాలకి ముసలితనం ఎప్పుడో వచ్చేసింది. అయినా అవే ముదు సలి నడకలు పట్టుకుని, విడుదలైతే పది పదిహేను టికెట్లు కూడా తెగని పాపాన ఒకే మూస సింగారాలతో ప్రౌఢలా ముస్తాబు చేసి వదుల్తున్నారు. తెలుగు ప్రేక్షకులు ప్రేమల కోసం తెగ ఇదైపోతున్నట్టు,  మొహం వాచి ఇంకా ఇంకా కావాలని గోలెడుతున్నట్టూ, అర్ధం పర్ధం లేని ప్రేమ సినిమాలకి లాకులు ఎత్తేసి చేతులు దులిపేసుకుంటున్నారు. ఈవారం –అంటే ఈ సినిమా విడుదలైన వారం- ఈ దాడి నుంచి కొంత తప్పించుకునే అదృష్టవంతులయ్యారు ప్రేక్షకులు.


          రెండు చిన్న బడ్జెట్ సినిమాలు ప్రేమ సినిమాల ప్రకోపిత వైరస్ ని చావుదెబ్బ కొడుతూ విడుదలయ్యాయి. అవి ‘దొంగాట’, ‘దాగుడు మూత దండాకోర్’ అనే  ఏమాత్రం హీరో హీరోయిన్లూ, వాళ్ళ ఫార్ములా  ప్రేమకలాపాలూ పాటలూ లేని  డేరింగ్ ప్రయత్నాలు. మొదటిది డబ్బుల కోసం కిడ్నాప్ కథకి మూసని బద్దలు కొట్టే  బ్రాండ్ న్యూ థ్రిల్లర్ అయితే, రెండోది పెంపుడు కోడి చుట్టూ తిరిగే జీవకారుణ్య కథ. ఈ జీవకారుణ్య కథకి జీవం పోయడంలో దర్శకుడు రాధాకృష్ణ మలినేని విఫలమయ్యారనేది వేరే విషయం ( ఈ సినిమా విడుదలకి ముందు వారం, తను ఒక అగ్ర హీరో కోసం రాసుకున్న జీవంతో తొణికిసలాడే కొత్త కథ ఒకటి ఈ వ్యాసకర్తకి చెప్పారు – ఇంత బాగా ఈ కథ చెప్పగల్గిన తను ‘దాగుడు మూత దండాకోర్’ అలా ఎందుకు తీశారో మరి!)

         
చాలా కాలం తర్వాత ఓ చిన్న సినిమాకి – పైగా ‘దొంగాట’ లాంటి ఫక్తు క్రైం థ్రిల్లర్ కి- థియేటర్ ప్రాంగణం కార్లతో నిండి కన్పించడం ఆశ్చర్య పర్చే దృశ్యమే కావొచ్చు- ఇది మిడిమేలపు ప్రేమ సినిమాలని కసిదీరా వెక్కిరించే  విశేషమే కావొచ్చు- దీనికన్నా పూర్వం ఇలాగే ‘స్వామిరారా’ అనే న్యూవేవ్ థ్రిల్లర్ కి బ్లాకులో టికెట్లు అమ్ముడయిన రికార్డే వుంది. ఓ చిన్న సినిమాకి బ్లాకులో టికెట్లు అమ్ముడయ్యే ఆనందభరిత సన్నివేశం చూసి ఎన్నాళ్ళయ్యిందో!

          మంచు లక్ష్మి నిర్మాతగా ఈసారి ఓ మోస్తరు విజయాన్ని కళ్ళ జూడడం కేవలం మూసలోంచి పూర్తిగా బయటికి రావడం వల్లే జరిగింది. సినిమాలు ఎప్పుడూ యూత్ ఫుల్ గానే వుంటాయి. ఒకప్పుడు ’40 ల - ’50 ల నాటి సినిమాల్లాగా ’60 లలో వచ్చిన సినిమాల్లేవు. అవి వ్యాపార ధోరణిని అరవర్చుకోక పోతే ఇక మనలేమని గుర్తించాయి. కానీ ’80 లలో- ‘90 లలో వచ్చిన సినిమాల్లాగే ఇంకా 2015 లోనూ మార్పులేకుండా  తెలుగు సినిమాలు రావడం  చూస్తే, సినిమా కర్తలు అవే రీసైక్లింగ్ కథలు తప్ప, తాముగా కొత్తగా ఆలోచించలేని అయోమయంలో వున్నారనీ అర్ధం జేసుకోవచ్చు. మనం ఇప్పుడు తీస్తున్న సినిమా ఫలానా అప్పుడొచ్చిన  తెలుగు సినిమాలాగా వుందా లేదా - అన్న పరాధీనతతో మగ్గిపోతున్నారు! దీనికి అసలు కారణం తలపండిన మద్రాసు తరం సినిమా కళాకారులు చెప్తారు- చెన్నై కనెక్షన్ తెగిపోవడం వల్లే క్రియేటివ్ టాలెంట్ కొల్లేరయ్యిందని! 

          ఇప్పుడు చెన్నై నుంచి వచ్చిన గౌతమ్ మీనన్ శిష్యుడు వంశీ కృష్ణ ‘దొంగాట’ తో చాలా ఉపశమనంగా ఓ వెరైటీని ప్రదర్శించాడు( ‘దొంగాట’ తో బాటు ‘దాగుడుమూత దండాకోర్’ రీమేక్ కూడా తమిళ వెరైటీయే కావడం ఇక్కడ గమనించాలి). ఇతను  ‘దొంగాట’ అనే యాంటీ సెంటిమెంటల్ థీమ్ ని, మంచులక్ష్మి మాత్రమే ఇవ్వగల గ్రీన్ సిగ్నల్ తో తీసిపడేసి, తెలుగు సినిమాలు ఇలా కూడా సక్సెస్ అవుతాయని ఆదరిస్తున్న ప్రేక్షకుల సాక్షిగా నిరూపించాడు.  
         ఇంతకీ ఏముందనీ ఈ సినిమాలో?

కిడ్నాప్- కౌంటర్ కిడ్నాప్ 
       శృతి ( మంచు లక్ష్మి) ఓ సినిమా తార. ఆమెకో తల్లి జ్యోతి లక్ష్మి ( ప్రగతి). ఓ ముగ్గురు దుష్ట త్రయం- వెంకట్ ( అడవి శేష్ ), విజ్జూ ( మధునందన్), కాటం రాజు ( ‘మర్యాదరామన్న’ ప్రభాకర్) అనేవాళ్ళు.. వీళ్ళు జీవితంలో పెద్ద నేరం చేసి సంపాదించుకుని సెటిలై పోవాలని నిర్ణయిం చుకుంటారు. కన్ను శృతి మీద పడుతుంది. అమాంతం ఎత్తుకొచ్చేస్తారు. విజ్జూ ఫ్లాట్ లో దాచేస్తారు. విజ్జూ డిటెక్టివ్ బ్రహ్మీ ఫ్లాట్ లో ఉంటున్నాడు. డిటెక్టివ్ బ్రహ్మీ ప్రస్తుతం ఫారిన్ టూర్ వెలగబెడుతున్నాడు. శృతి ని ఆ ఫ్లాట్ లో కుర్చీకి కట్టేసి జ్యోతి లక్ష్మికి కాల్ చేసి పది కోట్లు డిమాండ్ చేస్తారు. ఈ విషయం పొక్కితే కూతురి కెరీర్ కే నష్టమని భావించిన ఆమె ఎసిపి కనకాంబరం ( పృథ్వి) సంప్రదిస్తుంది. కనకాంబరం పరిస్థితిని గమనించి ఫారిన్ నుంచి డిటెక్టివ్ బ్రహ్మీ దింపి, ఈ సీక్రెట్ ఆపరేషన్ అప్పజెప్తాడు. శృతి ఎక్కడుందో రహస్యంగా తెలుసుకుని ఆ కిడ్నాపర్ల  చెర విడిపించాలన్న మాట. 

          ఉన్నట్టుండీ ఫ్లాట్ లోకి  డిటెక్టివ్ బ్రహ్మీ దిగబడే సరికి కంగారు పడ్డ దుష్టత్రయం అతడి కంట శృతి పడకుండా నానా తంటాలూ పడతారు. బాధితురాల్ని ఇంట్లోనే ఉంచుకుని బ్రహ్మీ ఊరంతా తిరుగుతూంటాడు. కానీ ఈ గాలింపు కంటే ఓ గోలే అతడికి ఎక్కువైపోతుంది. శృతి తల్లి జ్యోతిలక్ష్మితో రోమాంటిక్ గా ప్రవర్తిస్తూంటాడు. ఇతడికి పోటీగా ఆల్రెడీ ఎసిపి కనకాంబరం ఎస్టాబ్లిష్ అయి ఉండనే వున్నాడు. వీళ్ళిద్దరూ శృతి ని వదిలేసి ఆమె తల్లితో  జాయింటుగా రోమాన్సు వెలగబెడుతూంటారు.

          ఇలా వుండగా ఒకానొక గడ్డు పరిస్థితిలో వెంకట్, విజ్జూలు కలిసి శృతి ని ఫ్లాట్ లోంచి తీసుకుని పారిపోవాల్సి వస్తుంది. దీంతో వీళ్ళిద్దరూ తనని మోసం చేస్తున్నారని అనుమానిస్తాడు కాటం రాజు. ఇక వెంకట్ – కాటం ఇద్దరూ తన్నుకుంటారు. ఇక్కడ్నించీ ఒకొక్కరి నిజస్వరూపాలూ బయట పడ్డం మొదలౌతుంది. ఉన్న ఈ కిడ్నాప్ గొడవ చాలనట్టు, ఇంకో తెలిసిన దుష్ట శక్తే ఇందులోనే కౌంటర్ కిడ్నాప్ ని ప్లే చేస్తున్నట్టు బయటపడుతుంది.

          ఇలా క్రమంగా ఒకరి నిజస్వరూపా లొకరికి  తెలిసిపోతూ, ఎత్తుకు పైయెత్తు లేసుకుంటూ ఎలా ఆ డబ్బు కొట్టేయాలని ప్రయత్నించారు, ఇదంతా ఓ కంట గమనిస్తున్న శృతి  ఒక ఫినిషింగ్ టచ్ తో గేమ్ అంతటినీ ఎలా ముగించిందీ - అన్న సస్పెన్స్ కొత్త మలుపులు  తిరుగుతూ, పొరలుపొరలుగా వీడిపోతుంది...

ఎవరెలా చేశారు.
           ఈ సినిమాలో హీరోహీరోయిన్లూ, వాళ్ళ రొమాన్సూ లేకపోవడం  మంచు లక్ష్మి ఈ పాత్ర పోషించడానికి కలిసివచ్చింది. అడవి శేష్ తనూ లవర్స్ అని తర్వాతెప్పుడో రివీల్ అయినా అందులో రోమాంటిక్ యాంగిల్ కంటే కూడా ఒక థ్రిల్లింగ్ ట్విస్టే వుంది. పోషిస్తున్న పాత్రకి ఎలాటి బంధనాలు లేకపోవడంతో ఈ పాత్రలో తనదైన శైలిలో స్వేచ్ఛగా నటించుకు పోయింది తను. 

          కానీ డిటెక్టివ్ బ్రహ్మీగా నటించిన బ్రహ్మానందం ఆ పాత్రని దానికి ఒనగూడిన  ప్రత్యేకతలతో ఎంతో హైలైట్ చేసే వీలున్నప్పటికీ, ఆ మేరకు దర్శకుడు శ్రద్ధ చూపించక పోవడంతో దాన్ని రొటీన్ కామెడీ  పాత్రగానే నటించుకుపోవాల్సి వచ్చింది బ్రహ్మానందానికి. ఒక కమెడియన్ డిటెక్టివ్ అయితే  అతడి క్రైం డిటెక్షన్ ఎలా అఘోరిస్తుందో వివరంగా చూపించి బాగా నవ్వించొచ్చు. అలా కానప్పుడు ఇలాటి కొత్త పాత్ర సృష్టించి ప్రయోజనం లేదు. ‘పింక్ పాంథర్’, ‘ఏస్ వెంచురా’ సిరీస్ వంటి హాలీవుడ్ సినిమాల్లో కామిక్ డిటెక్టివ్ పాత్రలు ప్రొఫెషనల్ గా ఎలా నవ్విస్తాయో తెలిసిందే.  

       పృథ్వీ పాత్రకూడా ఇంకా బలమైన హాస్యపాత్రగా ఎదిగే వీలుంది- దీన్ని కూడా కొన్ని పరిమితుల్లో వుంచేశాడు  దర్శకుడు. వీళ్ళిద్దరి మధ్య ఇరుక్కున్న పడతిగా ప్రగతి తన పాత్రని దిగజార్చకుండా హూందాగా  నటించింది. అడవి శేష్ పాత్ర అసలు స్వరూపం బయటపడ్డాకే తన పాత్రని బలంగా నిలబెట్టుకుంటే, మధునందన్ పాత్ర ఆసాంతం హస్యపాత్రగానే ఉండిపోయింది. ఇక భారీకాయం ‘మర్యాదరామన్న’ ప్రభాకర్ ఫన్నీగా నటించడానికి అతడి అమాయక బేబీ ఫేస్ బాగా తోడ్పడింది.

          పాటలు పెద్దగా చెప్పుకోవాల్సినవి కావు. కానీ నేపధ్య సంగీతం సినిమాలో సమత్వాన్ని సాధించలేకపోయింది. బహుశా ఆర్ ఆర్ సమకూర్చిన సంగీతదర్శకుడీదీ  దర్శకుడి తికమకే అయుంటుంది-  ఇది ఏ జాతి సినిమా అన్న విషయంలో. ఇది కిడ్నాప్ తో కూడిన కామెడీ డ్రామానా, లేకపోతే  క్రైం థ్రిల్లరా అని. ఫస్టాఫ్ టేకింగ్ చేసిన దృశ్యాలూ, వాటిలో కామెడీ సీన్లకి కంపోజ్ చేసిన నేపధ్య సంగీతమూ చాలా అవుట్ డేటెడ్ గా వున్నాయి. కామెడీ సీన్ వస్తే చాలు- భజన చేస్తున్నట్టు మద్దెలు వాయించడం ఈ సినిమా స్టేటస్ ని బాగా దిగజారుస్తూ, దర్శకుడు ఏ రస ప్రధాన సినిమా చూపిస్తున్నాడో అర్ధంగాని అయోమయం ఏర్పడింది. 

          మళ్ళీ సెకండాఫ్ లో నేపధ్య సంగీతం, ఛాయాగ్రహణం  సినిమాకి తగ్గట్టు స్టైలిష్ గా మారిపోయాయి- ఒక్క ఆ అనాధా శ్రమపు ఎపిసోడ్ తప్పిస్తే. సాగదీసిన ఈ అనాధాశ్రమం ఎపిసోడ్ లో  గిరిబాబు- అన్నపూర్ణ తదితరుల మీద ఏకంగా ఓ పూర్తిస్థాయి సెంటిమెంటు పాటే పెట్టే యడంతో, ఎప్పటిదో పాత సినిమా లుక్ వచ్చేసింది. ఈ ఎపిసోడ్లోనే అనాధ పిల్లల గురించి, ఆడపిల్లల గురించీ, ఇంకేవో సామాజిక సమస్యల గురించీ చర్చించడం నారాయణ మూర్తి సినిమా చూస్తున్నట్టు తయారు చేసింది సినిమాని. 

          ఇవన్నీ దర్శకుడికి ఒక విజన్ అంటూ లేకపోవడం వల్లే జరిగాయి. చెప్పలేం, తెరవెనుక కొందరి ప్రోద్బలమే దర్శకుణ్ణి దర్శకుడిగా ఉండనీయక పోయి ఉండొచ్చు. ఇలాటివి జరుగుతూంటాయి. ప్రోద్బలమో దర్శకుడి దౌర్బల్యమో అది ఈ సినిమా మేకింగ్ లో ఏకసూత్రతని  దెబ్బ కొట్టింది. 

          అయినా కూడా కొంత ప్రాణాలతో మిగిలిన కథ, అందులోని పాత్రలూ వాటికిచ్చిన ముగింపూ మూస సినిమాలకి కి భిన్నంగా- విలక్షణంగా  ఉండడంతో ఈ సినిమా బతికి బయటపడ గల్గింది.  చాలా సినిమాల విషయంలో కథ బాగా లేకపోయినా కామెడీ నిలబెట్టిందని అంటూంటారు. అది సరైంది కాదు. కథే బాగా లేనప్పుడు ఇంకా మాటాడుకోవడానికి సినిమా ఎక్కడుంటుంది? ‘దొంగాట’ దర్శకుడి చేతిలో కొత్త తరహా కథ వుంది. దాని వాడకంలో కిందా మీదయ్యాడంతే. 

స్క్రీన్ ప్లే సంగతులు
      ఓ స్క్రీన్ ప్లేలో కథని చాలా ముందుగా - అంటే- సినిమా ప్రారంభించిన ఐదు పది నిమిషాల్లోపే సెటప్ చేసేస్తే,  ఆ పైన దాని నడకకి ఏ గతి పడుతుంది? సద్గతే పడుతుంది-  కథని ఏ కాలావధిలో సెటప్ చేసినా, ఆ తర్వాత జరగాల్సిన నిర్ణీత బిజినెస్ కథనంలో జరిగేలా చూసుకున్నప్పుడు సల్లక్షణంగానే  వుంటుంది స్క్రీన్ ప్లే అంతా!

           విభిన్న కథన రీతుల్ని ట్రై చేయడమంటే ట్రీట్ మెంట్ లో వాటన్నిటినీ ఒకే గాటన కట్టి రొడ్డ కొట్టుడు కొట్టడం కాదు. రోడ్డు రోలర్ తో పిల్లినీ నల్లినీ చదును చేసేయడం లాంటిది కాదు. పిల్లి పచ్చడై పోయినా, సందు చూసుకుని బయటపడుతుంది నల్లి.

          ప్రారంభించడం ప్రారంభించడం విభిన్నంగా ప్రారంభించి – తీరా దాని కొనసాగింపు దగ్గరి కొచ్చేసరికి అలా విభిన్నంగా ప్రారంభించని అనేక ఇతర సినిమా కథల్లాగే  ట్రీట్ మెంట్ ఇచ్చేసినప్పుడు తప్పక బోరుకొడతాయి సినిమాలు. ఇక్కడ చాలామంది అర్ధం చేసుకోలేని ఒక ప్రాథమిక సూత్రముంది : ఒక సినిమాని ప్రేక్షక సమూహానికి చూపించడమంటే, యుగాలుగా డీఫాల్టుగా వాళ్ళ అంతరంగాల్లో నిబిడీకృతమై వున్న కథని రిసీవ్ చేసుకునే స్పందనలతో అనుసంధాన మవగల్గడమే!

        కథని పత్రిక కోసం రాసినా, సినిమా కోసం రాసినా ఆయా పాఠకులతో, ప్రేక్షకులతో అదొక సైకలాజికల్ ఎక్సర్ సైజే అవుతుంది మరి.

          కథలు వాటి మూడంకాల నిర్మాణంలో- అంటే- బిగినింగ్, మిడిల్, ఎండ్ విభాగాలతో- లేదా త్రీయాక్ట్ స్ట్రక్చర్ తో వున్నప్పుడే – అదీ ఆ అంకాల్లో లేదా విభాగాల్లో లేదా యాక్స్ట్ లో – వేటికవిగా జరిగే బిజినెస్సుల్ని కలిగి ఉన్నప్పుడే, మనుషుల అంతరంగ స్పందనలతో  మ్యాచ్ అవుతాయి. మ్యాచ్ కానప్పుడు ఆ కథలు ఫెయిలవుతాయి. ఇట్స్ దట్ సింపుల్! 

          కథని ఐదు పది నిమిషాల్లోపు సెటప్ చేసేస్తే, ఆ తర్వాత దానికి ఇవ్వాల్సిన ట్రీట్ మెంట్ కో  పధ్ధతీ, కథని సాంప్రదాయంగా అరగంటకో, ముప్పావు గంటకో, లేదా ఇంటర్వెల్ దగ్గరో సెటప్ చేసినప్పుడు, ఈ మూడు కాలావధుల సెటప్ లకీ  మూడు వేర్వేరు  ట్రీట్ మెంట్ పద్ధతులూ అమల్లో పెట్టడం ఆనవాయితీ. కానీ ఏ టైంస్పాన్ ( కాలావధి) లో కథని సెటప్ చేసినా, ఇంటర్వెల్ ఘట్టాన్నే మైలురాయిగా పెట్టుకుని రొడ్ద కొట్టుడు ట్రీట్ మెంట్ ఇచ్చుకుంటూ పోతే, ప్రస్తుత ‘దొంగాట’ స్క్రీన్ ప్లే లాగానే వుంటుంది పరిస్థితి.

          ఈ సినిమా ఫస్టాఫ్ లో విషయం లేక, కథ ఎటు వెళ్తోందో అర్ధం కాక, బోరుకొట్టిందని టాక్ రావడానికి కారణం, సెటప్- దాని తర్వాతి బిజినెస్ విషయంలో పైన చెప్పుకున్న పద్ధతుల్లో పూర్తిగా తప్పులో కాలేయడం వల్లే. 

          బిజినెస్ అంటే ట్రీట్ మెంట్ కాదు. స్క్రీన్ ప్లేలో ఆయా  విభాగాల్లో జరగాల్సిన కార్యకలాపాల తీరుని బిజినెస్ అంటారు. స్క్రీన్ ప్లే లో మనం చెప్పుకునే బిగినింగ్- మిడిల్- ఎండ్ అనే విభాగాలు మూడూ ఒక్కోటీ ఒక్కో తరహా బిజినెస్ ని కలిగి వుంటాయి. రిలయెన్స్ బిజినెస్ రిలయెన్స్ బిజినెస్సే, టాటా బిజినెస్ టాటా వాళ్ళ బిజినెస్సే. అలాగే బిర్లా కార్యకలాపాలు బిర్లాలవే. ఒక్కరూ ఇంకో తమ సాటి పోటీ దార్లా తమ వ్యవస్థల్ని నడుపుకోవడానికి ఒప్పుకోరు. స్క్రీన్ ప్లేలో కూడా బిగినింగ్- మిడిల్- ఎండ్ విభాగాలు మూడూ కూడా  ఒకదాని లక్షణాలతో మరొకటి విభేదిస్తూ పోటీ పడినప్పుడే మజా. స్క్రీన్ ప్లే విభాగాల రచనలో ఈ అంకాల విలక్షణీయతల్ని గుర్తించకపోతే, ఆ మొత్తం కథ ప్రసారం చేసే తరంగాలని ప్రేక్షకుల అంతరంగ రాడార్ వికర్షించడం మొదలెడుతుంది.

          దీన్ని అర్ధం జేసుకోకుండా స్క్రీన్ ప్లేలు – అందునా విభిన్న స్క్రీన్ ప్లేలూ రాయడం వృధా. ఈ మూడు విభాగాల్లో ఏ రెండిటి బిజినెస్ ఒకలా వుండదు. ఉదాహరణకి- సినిమా ప్రారంభించినప్పుడు మొదలయ్యే బిగినింగ్ విభాగాన్నే తీసుకుంటే, దీంట్లో మొదటగా పాత్రల్ని పరిచయం చేసి, ఆ తర్వాత కథా నేపధ్యాన్ని ఏర్పాటు చేస్తూ, ఇదే బిగినింగ్ విభాగపు చివర్న ఏర్పాటు చేయాలనుకుంటున్న సమస్య, లేదా స్టోరీ పాయింటుకి దారి తీసే పరిస్థితుల కల్పనా చేసుకుంటూ వచ్చాక, ఆఖర్న ఆ సమస్య లేదా స్టోరీ పాయింటుని ఎస్టాబ్లిష్ ( సెటప్)  చేస్తే ప్రేక్షకుల అంతరంగ రాడార్ సంతోషించి మిగతా ఆ కథని రిసీవ్ చేసుకోవడానికి ఉబలాట పడుతుంది. ఇదంతా బిగినింగ్ బిజినెస్. 

        ప్రస్తుత సినిమాలో- ఈ బిగినింగ్ బిజినెస్ పదినిషాల్లోపే పూర్తయ్యింది( ఆ మధ్య వచ్చిన ‘చక్కిలిగింత’ లోనూ ఇలాగే పది నిమిషా ల్లోపే బిగినింగ్ విభాగం ముగించుకుని- ఆ పైన ఎలా సాగాలో తగిన విషయ పరిజ్ఞానం లేక, తీరా ఇంటర్వెల్ దాకా ఏదో రాసుకుంటూ పోతూంటే, మొత్తం ఎత్తుకున్న కథంతా అక్కడే  ముగిసిపోయింది. ఇదేంట్రా బాబూ అన్నట్టు ఇంటర్వెల్ తర్వాత సెకండాఫ్ అనే తద్దినం ఒకటుంటుంది కాబట్టి- అర్జెంటుగా వేరే కథ వండేసి అతికించు కుంటూ పోయారు. ఆ సినిమా ఈ భూమ్మీద ప్రేక్షకులకి ప్రకృతి పనిగట్టుకుని ప్రసాదించిన రాడార్ పనితీరు రీత్యా అట్టర్ ఫ్లాప్ అయితీరింది). 

          మొదటే సెటప్ చేస్తే ఎలా మోసపోకుండా ఉండాలో తెలియకపోవడమే ఈ వైపరీత్యాలకి కారణం. ‘దొంగాట’ లో కథని మొదటే ఇలా సెటప్ చేశారు : ఓపెనింగ్ లోనే మంచు లక్ష్మి విరగదీసి ఒక ఫైట్ చేశాక, ఆమె సినిమా స్టార్ అని రివీల్ చేసి- ఆ షూటింగ్ స్పాట్ లోనే అక్కడే అప్పటి కప్పుడే అడవి శేష్- మధునందన్- ‘మర్యాద రామన్న’ ప్రభాకర్ త్రయాన్ని చూపించి ( ఇదంతా ‘ప్రధాన పాత్రల పరిచయ’ ప్రక్రియ అనే మొదటి టూల్ ని ప్రయోగించడం ),  వీళ్ళు ఆమెని కిడ్నాప్ చేయాలని నిర్ణయించుకున్నట్టు చెప్పించడం ( ఈ సినిమా ‘కిడ్నాప్ డ్రామా’ అని చెప్పే ‘కథా నేపధ్యం’  అనే రెండో  టూల్ ని ఏర్పాటు  చేయడం), నిర్ణయిం తీసుకున్న మర్నాడే ఒక పార్టీలో ఆమెని చూపించడం ( ‘సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన’ అనే మూడో టూల్), ఆ పార్టీలోంచి ఆమెని అపహరించుకుని వెళ్ళిపోవడం ( ‘సమస్య లేదా స్టోరీ పాయింట్ ఎస్టాబ్లిష్ మెంట్ లేదా సెటప్’ అనే టూల్ వినియోగం)  చకచకా జరిగిపోయాయి. ఇదంతా బిగినింగ్ విభాగపు బిజినెస్.

          బిగినింగ్ విభాగపు బిజినెస్
= ప్రధాన పాత్రల పరిచయం + కథా నేపధ్యం ఏర్పాటు + సమస్యకి దారితీసే పరిస్థితుల కల్పన + సమస్య లేదా స్టోరీ పాయింట్  ఏర్పాటు!

          ఇలా  స్టోరీ సెటప్ అయి  ‘దొంగాట’ బిగినింగ్ విభాగం ముగిసిపోయింది. ఇక మిడిల్ లో కెళ్ళాలి. అంటే అసలు ఆట మొదలెట్టాలి. పైన చెప్పుకున్న బిగినింగ్ బిజినెస్ లోని నాల్గు టూల్స్ నీ పూర్తిగా వదిలెయ్యాలి. అలాటి దృశ్యాలు గానీ కథనంగానీ  ఇక రాకూడదు. అసలు ఆట మొదలయ్యాక టీ కాఫీలు తాగుతూ, మళ్ళీ టాస్ వేసుకుంటూ క్రీడాకారులు కూర్చుంటే స్టేడియంలో ప్రేక్షకుల కెలా వుంటుందో చెప్పనవసరం లేదు- ఈ అపక్రమాన్ని వాళ్ళ యూనివర్సల్ రాడార్ తీవ్రంగా ప్రతిఘటించి తీర్తుంది.

           
ఏళ్ల తరబడీ సినిమాల్ని చూస్తూ వస్తూంటే ఒక తత్త్వం బోధపడుతోంది : తీసుకున్న స్టోరీ ఐడియాని లైన్ ఆర్డర్ ఒక మెట్టు పైకి తీసికెళ్ళాలి, ఆ లైన్ ఆర్డర్ ని స్క్రీన్ ప్లే ఇంకో మెట్టు పైకి తీసికెళ్ళాలి, ఆ స్క్రీన్ ప్లేని డైలాగ్ వెర్షన్ మరింకో మెట్టు పైకి లాగాలి, ఆ డైలాగ్ వెర్షన్ ని నటనలు కొండెక్కిస్తే, ఆ నటనల్ని దర్శకత్వం అందలా లెక్కించాలని !

          ఒక పాట రాసినప్పుడు పల్లవి తర్వాత చరణం వస్తుంది. చరణం రాకుండా పల్లవే వస్తే? ఇదే జరిగింది ‘దొంగాట’ లో. అదెలా జరిగిందో ఇప్పుడు చూద్దాం..

         స్క్రీన్ ప్లే లో రెండో సెక్షన్ అయిన మిడిల్ విభాగాన్ని తీసుకుంటే- ఇదిలాటి లక్షణాలతో కూడుకుని వుంటుంది :  బిగినింగ్ విభాగం ముగింపులో ఏర్పాటయిన సమస్యని ఈ మిడిల్ విభాగం జీర్ణించుకోవడం మొదలెడుతుంది. మనం అన్నం, కూరా పప్పూ పచ్చళ్ళూ పెరుగూ వగైరా కలుపుకుని ( బిగినింగ్ - సెటప్) నోటికి పట్టించాక, అది కడుపులో ( మిడిల్ ) లో కెళ్ళి జీర్ణ రసాలతో తలపడుతుంది. అలాగే సెటప్ చేసిన కథ మిడిల్లో పడిందంటే పాత్రల మధ్య సంఘర్షణని సృష్టిస్తుంది. ఈ సంఘర్షణ కథానాయక పాత్ర- ప్రత్యర్ధి పాత్ర ఈ రెండిటి నడుమ వుంటుంది. 

          కథానాయకుడు ఆ సమస్యని సాధించడానికి పూనుకుంటాడు. ప్రత్యర్ధి దానికి అడ్డు పడుతూంటాడు. ఈ క్రమంలో కథానాయకుడికి ఎదురు దెబ్బలు తగలడం, కోలుకుని మరో వ్యూహంతో ప్రత్యర్ధిని మరో దెబ్బ తీయడం, ఆ ప్రత్యర్ధి ఇంకో ఉపాయంతో కథానాయకుణ్ణి మట్టికరిపించడం, మళ్ళీ కథానాయకుడు లేచి...ఇలా యాక్షన్-రియాక్షన్ల సంకులసమరం సాగుతూ విశ్రాంతి దగ్గర కొచ్చేసరికి- ఓ మోస్తరు కథానాయకుడిదో, ప్రత్యర్ధిదో  పైచేయి అయి- పరిస్థితి తీవ్రతరమవుతుంది. విశ్రాంతి తర్వాత నుంచీ  క్లయిమాక్స్ ప్రారంభం వరకూ కొనసాగే ఈ మిడిల్ విభాగం లో తిరిగి యాక్షన్- రియాక్షన్ల ఇంటర్ ప్లే  సాగుతుంది. ఈ మిడిల్ విభాగం ఇక ముగుస్తుందనగా కథానాయకుడు సర్వం కోల్పోయి సమస్యని ఇక సాధించలేని జీరో స్థితి కొచ్చేసి  కూలబడిపోతాడు. అప్పుడు..సమస్యని సాధించడానికి ప్రత్యర్ధి మీద అంతిమంగా తిరిగులేని పరిష్కారమార్గం కథానాయకుడి చేతి కందుతుంది. ఇక్కడ మిడిల్ ముగుస్తుంది. 

          మిడిల్ విభాగం = సమస్యతో సంఘర్షణ + ప్రత్యర్ధితో యాక్షన్ రియాక్షన్ ప్లే + విభాగం ముగింపులో శూన్య స్థితి + అంతిమ పరిష్కార మార్గం. 

         ఈ యాక్షన్ – రియాక్షన్ ల ఇంటర్ ప్లే  అంటే టైం అండ్ టెన్షన్ ని మెయింటెయిన్  చేసే టూల్ గా అర్ధం జేసుకోవాలి. అంటే స్క్రీన్ మీద టైం గడుస్తున్న కొద్దీ కథలో టెన్షన్ అంతకంతకూ పెరుగుతూ పోవడమన్నమాట. 

          ఇదెలా పెరుగుతుందంటే, ఉదాహరణకి ఓ చిన్న పిల్లాడు ఓ చిన్న పిల్ల దగ్గర్నుంచి చాక్లెట్ లాక్కున్నాడనుకుందాం, అప్పుడు ప్రతీకారంగా ఆ పిల్ల పిల్లాడి డబ్బులన్నీ లాగేసుకుంటుంది. దీంతో పిల్లాడు ఆ పిల్లకి ప్రాణప్రదమైన ఆట బొమ్మ లాగేసుకుంటే, ఆ పిల్ల పిల్లాడి టోపీ ఎగరేసుకుపోతుంది. వాడు బోడి గుండుతో బ్యారు మంటాడు. మళ్ళీ పిల్ల దగ్గర్నుంచీ  ఉంగరం లాగేసుకుంటే, ఆ పిల్ల ఈసారి పిల్లాడు పేరెంట్స్ కి చూపించకుండా దాచేసిన సున్నా మార్కుల ప్రోగ్రెస్ రిపోర్టు కొట్టేసుకుని పోతుంది!

          ఇలాగన్న మాట. ఇరువైపులా ఇలా నష్ట తీవ్రత పెరుగుతూ పోవడమే టైం అండ్ టెన్షన్ థియరీ. అసలైన యాక్షన్ –రియాక్షన్ ల ఇంటర్ ప్లే.     
    
          ఇక ఎండ్ విభాగాని కొస్తే- ఇక్కడ జరిగే బిజినెస్ ప్రకారం,  ప్రత్యర్ధికి ఇంకా బంగరు అవకాశాలుండవు. ఆత్మరక్షణలో పడిపోవడమే. వెతికి వెతికి వేటాడి ఆ ప్రత్యర్ధి అంతు చూడడంతో కథానాయకుడి విజయబావుటా రెపరెప లాడుతుంది. దీంతో శుభం పడుతుంది. 

          ఎండ్ = కథానాయకుడి పైచేయి + ప్రత్యర్ధి ఆత్మరక్షణ+ ప్రత్యర్ది ఓటమితో సమస్య పరిష్కారం. 

         మిడిల్ లో జరిగే బిజినెస్ యాక్షన్ - రియాక్షన్ ల ఇంటర్ ప్లే అనేది,  సీరియస్ కథ అయితే సీరియస్ గానూ, కామెడీ కథ అయితే కామెడీ గానూ, యాక్షన్ కథ అయితే హింసాత్మకంగానూ, రోమాంటిక్ కామెడీ అయితే హీరో- హీరోయిన్ల మధ్య ఇగో ల సంఘర్షణ గానూ వుంటుంది.

          ‘దొంగాట’  కొచ్చేసరికి మొదటి పది నిమిషాల్లో కథని సెటప్ చేస్తూ బిగినింగ్ ముగించి మిడిల్లో ప్రవేశించగానే యాక్షన్- రియాక్షన్ ల ఇంటర్ ప్లే చోటుచేసుకోవాలి. అప్పుడే ఈ రెండో దశలో కథనాన్ని హ్యూమన్ రాడార్ హై ఫ్రీక్వెన్సీ తో రిసీవ్ చేసుకోగల్గుతుంది. నిర్ణీత పాత్రల మధ్య ఈ ఇంటర్ ప్లేతో  బిజినెస్ సాగకుండా, ఇంకా బిగినింగ్ విభాగాన్ని తలపించే లక్షణాలతోనే సీన్లు వస్తూంటే, కామెడీ జరుగుతూంటే- కథనం పక్కదోవ పట్టిందన్నమాటే. అంటే బోరు కొట్టడం ప్రారంభమైందన్న మాటే. ఇంటర్ వెల్ దగ్గర దుష్ట్ర త్రయం మధ్య మోసం బయటపడే మలుపు పెట్టుకుని, అప్పటిదాకా ఖాళీని ఏవో సంగతులతో నింపుకుంటూ పోయారు. కానీ ఈ ఖాళీ వాళ్ళ ప్రేక్షకులు అనుభవించే సహన పరీక్షని, ఇంటర్వెల్లో పెట్టుకున్న మలుపు కాంపెన్సేట్ చేయజాలదు. 

          ఈ కథలో అడవి శేష్- మధునందన్- ప్రభాకర్ దుష్ట త్రయాన్ని హీరోలుగానూ- మిగిలిన మంచులక్ష్మి, ప్రగతి, బ్రహ్మానందం, పృథ్వీ పాత్రల్ని ఆ దుష్ట త్రయానికి ప్రత్యర్దులుగానూ గుర్తించి- స్పష్టమైన గీత గీసి, కథ నడపాల్సి వుంటుంది. దుష్ట త్రయమే హీరోలు - పోనీ యాంటీ హీరో లెలా అవుతారంటే, పది కోట్లు సంపాదించాలన్న గోల్ వాళ్ళకే వుంది కాబట్టి!

          ముందస్తుగానే కథని సెటప్ చేస్తే, ఆ తర్వాత మిడిల్ ని ఎలా నిర్వహించాలనే దానికి ‘అన్ ఫెయిత్ ఫుల్’ అనే హాలీవుడ్ సినిమానే తార్కాణం. 2002 లో విడుదలైన ఈ సినిమాని అప్పట్లో చూసినప్పుడు స్ట్రక్చర్ పరంగా బలమైన ప్రభావం చూపింది. దీని దర్శకుడు ‘ఫాటల్ ఎట్రాక్షన్’, ‘లోలిటా’, ‘ఇండీసెంట్ ప్రపోజల్’ వంటి హిట్స్ తీసిన అడ్రేయిన్ లైన్. ‘అన్ ఫెయిత్ ఫుల్’ ని క్లాడ్ చబ్రాల్ రాసిన నవల ఆధారంగా తీశాడు. చిత్రానువాదం రెండు ఆస్కార్ అవార్డుల రచయిత, ‘స్పైడర్ మాన్’ సినిమాల కథకుడూ అయిన ఆల్విన్ సార్జంట్ చేశాడు. దీన్ని హిందీలో ‘మర్డర్’ గా ఫ్రీమేక్ చేసుకుని సొమ్ములు చేసున్నారు కూడా మహష్ భట్ అండ్ కంపెనీ. 

         ‘అన్ ఫెయిత్ ఫుల్’ లో రిచర్డ్ గేర్ (భర్త), డయాన్ లేన్ (భార్య), ఆలివర్ మార్టినెజ్ (బాయ్ ఫ్రెండ్) పాత్రల మధ్య వివాహేతర వ్యవహారం- దాని పర్యవసానంగా జరిగే హత్యోదంతపు కథ.  సినిమా ఎంత కళాత్మకంగా వుంటుందో, స్క్రీన్ ప్లే పరంగా అంత పకడ్బందీ గా వుంటుంది. 

          మొదటి ఐదు సీన్లలోనే సెటప్ పూర్తయి పోతుంది. హీరోహీరోయిన్లు మధ్యతరగతి కుటుంబీకులు. వాళ్లకి ఓ కొడుకూ ఉంటాడు. అన్యోన్య దాంపత్యం లాగే వుంటుంది గానీ, ఎందుకో అందులో సాన్నిహిత్యం వుండదు. ఒకరోజు హీరోయిన్ సిటీకి బయల్దేరుతుంది. అప్పుడు ఉన్నట్టుండి పెనుగాలులు వీచేసరికి టాక్సీ ఎక్కేస్తూంటే ఒకడు బ్యాలెన్స్ తప్పి ఆమెని  ఢీకొంటాడు. అంతే, అక్కడ్నించీ అతడి పరిచయం, పలకరింపూ అయస్కాంతంలా లాగేసి, ఓ రెండురోజుల్లోనే  అతడితో పడక ఎక్కేంతగా అతడికి దాసోహమైపోతుంది. ఇదీ ఐదు నిమిషాల్లో సెటప్. 

దర్శకుడు అడ్రెయిన్ లైన్
      సెటప్ ఇంత త్వరగా ఏర్పాటు చేయడమంటే అనుభవం లేని రచయితలు తమకి తామూ ఉచ్చు బిగించు కున్నట్టే. ఎందుకంటే ఈ అయిదూ పది నిమిషాల సెటప్ తర్వాత నుంచీ క్లయిమాక్స్ వరకూ దాదాపు గంటా ఇరవై  నిమిషాలూ సంఘర్షణాత్మకమైన మిడిల్ విభాగాన్ని నిర్వహించాలి! 

          సినిమా నిడివి సగటున రెండు గంటలుం టుందనుకుంటే, అరగంట సేపు బిగినింగ్ 25%, గంట పాటు మిడిల్ 50%, ఇంకో అరగంట పాటు ఎండ్ 25% స్క్రీన్ ప్లే లో ఆక్రమిస్తాయి. 1 : 2 : 1 నిష్పత్తిలో అన్నమాట. ఈ గంట సేపు మిడిల్ ని నిర్వహించడమే కత్తిమీద సాము అనుకుంటే, ముందస్తు సెటప్ కారణం గా ఈ మిడిల్ నిడివి అమాంతం ఏ గంటా ఇరవై నిమిషాలకో, ముప్పై నిమిషాలకో పెరిగిందంటే ఇంతే సంగతులు!

          ఇక్కడ ఎలాంటి భ్రమలో ఉంటారంటే, కథని పది నిమిషాల్లోనే సెటప్ చేశాక, ఇదంతా ఇంకా ఫస్టాఫే గా, ఇంటర్వెల్ దాకా ఇంకా సరదా సరదాగా సీన్లు లాగించెయ్యొచ్చు అనేసుకుంటారు. ఇలా అనుకోవడం వల్లే ‘దొంగాట’ లో ఫస్టాఫ్ లో విషయం లేకుండా చేశారు. నిజానికి  సినిమా ప్రారంభమైన పదినిమిషాల్లోపే మిడిల్ ప్రారంభమైపోయిందని గుర్తించలేదు!

          ‘అన్ ఫెయిత్ ఫుల్’ రచయిత ఆల్విన్ సార్జంట్ ఐదు నిమిషాల్లో కథని సెటప్ చేశాక- ( భార్య బాయ్ ఫ్రెండ్ ని చూసుకుందన్న సమస్యని స్థాపించాక)- వెంటనే టూల్స్ పట్టుకుని మిడిల్ బిజినెస్ లోకి దిగిపోయాడు. 

రచయిత ఆల్విన్ సార్జంట్ 
           *భార్య తరచూ సిటీకి వెళ్లేందుకు చెబుతున్న కారణాలని భర్త నమ్మలేక పోవడం
          *భర్త తన సన్నిహితుల దగ్గర భార్య ప్రవర్తన గురించి చెప్పుకోవడం
          *భర్త కొలీగ్ ఒకతను సిటీలో ఆ భార్య ఒకడ్ని కిస్ చేయడాన్ని చూడడం
          *ఈ సంగతి భర్తకి వచ్చి చెప్పడం
          *భర్త ఆ భార్య మీద నిఘాకు డిటెక్టివ్ ని నియమించడం
          *ఆ డిటెక్టివ్ భార్యా ఆమె బాయ్ ఫ్రెండ్ ల ఫోటోలు తీసి భర్తకి చూపించడం
          *భర్త నవనాడులూ కుంగిపోవడం
          *భార్య ఇక కేర్లెస్ గా బాయ్ ఫ్రెండ్ కోసం సిటీకి వెళ్లి పోతూండడం
          *ఆ బాయ్ ఫ్రెండ్ ఇంకో అమ్మాయితో ఉండడాన్ని ఆమె చూడడం
          *వాళ్ళని ఆమె ఫాలో అయి బాయ్ ఫ్రెండ్ మీద దాడి చేయడం
          *బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్ లో ఆమె ఘర్షణ పది అతడితో మళ్ళీ సెక్స్ కి లొంగిపోవడం
          *ఆ సమయంలో బాయ్ ఫ్రెండ్ తో మాట్లాడడానికి వచ్చి బయట వెయిట్ చేస్తున్న భర్త కళ్ళబడకుండా ఇద్దరూ తప్పించుకోవడం.
          *మళ్ళీ బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్ కి భర్త వెళ్లి అతణ్ణి నిలదీయడం, అప్పడు వెడ్డింగ్ యానివర్సరీకి      తాను భార్య కిచ్చిన విలువైన గిఫ్టే ఈ బాయ్ ఫ్రెండ్ ఫ్లాట్ లో వుండడం చూసి, కోపోద్రిక్తుడై   అదే గిఫ్ట్ పెట్టి బాయ్ ఫ్రెండ్ తలమీద ఫటేల్మని కొట్టడం.
          *బాయ్ ఫ్రెండ్ చచ్చూరుకోవడం...

         
ఇలా ఫస్టాఫ్ లో యాబై నిమిషాలూ మిడిల్ సాగి ఏ కీలక మలుపుతో ఇంటర్వెల్ కొస్తుంది..ఇక్కడ్నించీ ఇంకో ముప్పావుగంట సేపు ఈ మర్డర్ లో ఇరుక్కున్న కథగా సాగి, క్లయిమాక్స్ కొస్తుంది. 

          ఒక్క క్షణం ఈ కథలో జరుగుతున్న బిజినెస్సుల నుంచి కళ్ళు తిప్పుకోలేం. ఐదు నిమిషాల్లో ముందస్తు సెటప్ చేసినా అంత సుదీర్ఘంగా స్ట్రక్చర్ దెబ్బ తినకుండా, ఇతర చాపల్యాలకి లోనవకుండా, నిగ్రహంతో సూటిగా కథ మీదే దృష్టిని కేంద్రీ కరించి మిడిల్ విభాగం ఎక్కడ్నించీ ప్రారంభమయ్యిందో అక్కడ్నించీ అది ముగిసి ఎండ్ లో పడేదాకా నిర్వహించడం తలపండిన ఆల్విన్ సార్జంట్ కె చెల్లింది! 





          ఒక రహస్యముందంటే దాని చుట్టూ బెల్లం చుట్టూ చీమల్లా కొన్ని శక్తులు చేరతాయ్. ఆ రహస్యాన్ని రట్టు చేయాలనో, లేదా బ్లాక్ మెయిల్ చేసి డబ్బు లాగాలనో చూస్తూంటాయి. రహస్యం, లేదా గుట్టు ఎక్కడుంటే అక్కడ ఇవే జరుగుతాయి. ఇది లోక రీతి. దీన్ని పట్టుకుని ‘అన్ ఫెయిత్ ఫుల్’ లో భార్య రహస్యం మీదికి భర్తని ప్రయోగించి అది గుట్టు రట్టయ్యే దాకా వదల్లేదు, ‘దొంగాట’ లో కిడ్నాప్ గుట్టు కి ఈ లోక రీతినే ట్రీట్ మెంట్ గా పెట్టుకోవడం మరిచారు. అదీ తేడా. 




దొంగాటదర్శకుడి ఒరిజినల్ కథ కూడా కాకపోవచ్చు. ఓపెనింగ్ లో మంచు లక్ష్మి ఫైట్ ని ఎవెంజర్స్ బ్లాక్ విడోనుంచి యధాతథం గా ఎత్తేశారు. మిగతా కథాపరంగా  టై మీ అప్- టై మీ డౌన్హాలీవుడ్ సినిమాలోంచి సంగ్రహించారు.



సికిందర్