రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

11, నవంబర్ 2014, మంగళవారం

షార్ట్ నోట్స్

టీనేజీ యూత్ ట్రయల్ !

‘పైసా-0005’
రచన-దర్శకత్వం : పి.అనంత గణేష్
***
        ఇంకా విజువల్ మీడియా గురించి అవగాహన లేని టీనేజి ‘టెక్నికల్ సైనికులు’ తామూ షార్ట్ ఫిలిం తీయగలమని ఈ ‘థ్రిల్లర్’ తీశారు. అంతా పిక్నిక్ కి వెళ్లినట్టు, పిక్నిక్ లో ఓ గేమ్ ఆడుకుంటున్నట్టు తమలోకంలో తాము డిజాల్వ్ అయి, ఈ అవుట్ పుట్ ఇచ్చారు. కోట్లకి కోట్లు పెట్టి తీస్తున్న సినిమాలు ఎన్నో లోకం మొహం చూడక ఒకప్పుడు లాబ్స్ లో, ఇప్పుడు డిజిటల్లో లాక్ అయిపోయి వుండి పోతూంటే, యూట్యూబ్ పుణ్యమా అని ఎవరు తీసిన ఎలాటి ఫిలిమ్స్ అయినా క్షణాల్లో విశ్వ వేదిక పైకి వచ్చేస్తున్నాయి. ఇంకా అవకాశాలు రావడం లేదని కంప్లెయింట్ చేసే అవకాశం లేకుండా- కొత్తా పాతా క్రియేటివ్ మైండ్స్ అన్నీ ‘డిజిటల్లీ యువర్స్’ అంటూ ఆత్మీయంగా వ్యూయర్స్ కి దగ్గరైపోతున్నాయి.
          పైసా -0005 పైసల దొంగల కథ. ఒకడు చిన్నప్పటి నుంచీ ఇంట్లో పైసల దొంగ. పెద్దయ్యాక దొంగాగానే సెటిలై పోయాడు. ఇతడికో నేస్తం. పాకెట్ కొట్టి పైసలు పంచుకుంటున్నప్పుడు, బ్యాంకులో పైసలు కొట్టేసి పారిపోతున్న తమలాంటి పిల్ల దొంగలే కనపడతారు. ఆ కోటి పైసలు- సారీ – రూపాయలు వుంటే లైఫ్ లో ఇక దేనికీ వర్రీ కానవసరం లేదని ఆ దొంగల నుంచి ఆ కోటీ కొట్టేస్తారు. ఆ దొంగలు ఈ ఇద్దరు దొంగల్లో ఒకడ్ని కిడ్నాప్ చేసి తమ కోటీ తమకి ఇచ్చేయమంటారు. ఇచ్చేస్తున్నప్పుడు మరో ఇద్దరు ముసుగు పిల్ల దొంగలు మధ్యలో ఊడి పడి, ఆ కోటీ తీసుకుని జంప్ అయిపోతారు!
          ఇదీ విషయం. కానీ ఇంకా వుంది విషయం. సస్పెన్స్ మిగల్చాలని పూర్తిగా ఇక్కడ ఇవ్వడం లేదు. మాటలు తక్కువ, యాక్షన్ ఎక్కువ- చేజింగ్స్ తో సహా వున్న ఈ టీన్ షార్ట్ టెక్నికల్ గా అంటే, సౌండ్ పరంగా అప్ అండ్ డౌన్స్ లేకుండా చూసుకోవాల్సిన వసరం వుంది.
          కృష్ణ వంశీ ‘పైసా’ స్ఫూర్తితో తీశానని చెప్పుకున్న టీన్ డైరెక్టర్ అనంత గణేష్ తన నెక్స్ ట్ షార్ట్ ని మరో సొంత ఐడియాతో మరింత చక్కగా తీస్తాడని ఆశిద్దాం!  


సికిందర్
(నోరీల్స్ డాట్ కాం)




10, నవంబర్ 2014, సోమవారం

షార్ట్ నోట్స్

   తెలంగాణా నుంచి టెర్రిఫిక్ థాట్! 

                                                                                      'ఆనపకాయ’ 
చన, ఛాయాగ్రహణం, సంగీతం : శ్రీనివాస్ బండారి

తారాగణం: రుక్మిణి బండారి, కిషన్, మంగ్యా నాయక్, శ్రీనివాస్ బండారి, సంధ్యా బండారి, సత్యేందర్ మాదికాయల, సుజాతా మాదికాయల తదితరులు 

                                                            ***
        సెన్సిబిలిటీ వుంటే టెక్నాలజీకి కళాత్మక గౌరవం దక్కుతుంది. ప్రకృతితో గాఢంగా
పెనవేసుకున్న హృదయంలోంచే  స్వచ్చమైన సృజనాత్మకత సహజత్వం ఉట్టిపడుతూ పులకింప జేస్తుంది. టెక్నాలజీ ప్రకృతిని పట్టుకోగలగాలే గానీ, టెక్నాలజీని ప్రకృతిమీద రుద్ద కూడదు. అందుకే ‘బెన్ హర్’  లాంటి ప్రపంచ ప్రసిద్ది పొందిన చలన చిత్రంలో, అజరామరంగా నిల్చిపోయిన - సుదీర్ఘంగా సాగే, గుర్రపు రధాల పోటీ ఎపిసోడంతా ఎలాటి నేపధ్య సంగీతం లేకుండా, కేవలం రధ చక్రాల సవ్వడులతో మనం కూడా ఆ సన్నివేశంలో పాల్గొంటున్నట్టే అనుభవాన్నిస్తాయి.  అలాటి స్పందనలే మనలో కలిగించే షార్ట్ ఫిలిం ‘ఆనపకాయ’  అనే అచ్చ తెలంగాణా జీవిత చిత్రణ!
          షార్ట్ ఫిలిం అన్నాక క్షణకాలం కూడా స్క్రీన్ టైంని  వృధాచేయకుండా, మొదటి షాట్ నుంచే ప్రేక్షకుల్ని కట్టి పడేయాలన్న సూత్రానికి నిలువెత్తు నిదర్శనం గా ఈ ‘ఆనపకాయ’ ని చెప్పుకోవచ్చు. ఒక పల్లె జీవితం, దీనికి కాంట్రాస్ట్ గా నగర జీవితం చూపిస్తూ పల్లెనుంచి ప్రయాణం కట్టిన ఒక ఆనపకాయ, ఏ తీరాలకి చేరి ఏం చెప్పబోతోందో నన్న ఉత్కంఠ  రేకెత్తిస్తూ సాగే కథనానికి,  శ్రీనివాస్ బండారి దర్శకుడే గాక ఛాయగ్రహకుడు కూడా.
          పచ్చని పొలాలు, పల్లె మార్గాలు, కాడెద్దులు, కోడి పుంజులు, రైతు బిడ్డలు,గిరిజన యువతి లాలిపాట ...ఇదంతా ఏ నేపధ్య సంగీతమూ లేకుండా కేవలం పక్షికూతల నేపధ్యంలో వాటి వాటి సహజ ధ్వనులతో- చుట్టూ వాతావరణానికి జీవం పోస్తూంటే, బైక్ మీద బయలేదిరిన అతనితో యాంత్రిక శబ్దాలు మొదలుతాయి. పైగా హుషారుగా  ఇయర్ ఫోన్స్ పెట్టుకుని సినిమా పాటల సందడి ! ఇతను ఆ గిరిజన కుటుంబం దగ్గరికి అప్పు వసూలుకి వస్తాడు. వచ్చి వెళ్తూ చెట్టుకి కాసిన ఆనప కాయ అడుగుతాడు.  గిరిజన రైతు సంతోషంగా అది తెంపి ఇస్తాడు. బయల్దేరిన ఆ యువకుడికి ఇంటికి చేరుకునే సరికి, అప్పిచిన అతను కార్లో వస్తాడు. అతనికి విషయం చెప్పి ఇంట్లో పెట్టుకున్న ఆనపకాయ తెచ్చి ఇచ్చేస్తాడు. ఇంటి కెళ్ళిన కారతను ఆ ఆనపకాయని భార్య కిస్తాడు. భార్య అక్క కూతురికి సంబంధం వచ్చిందనీ, సిటీ కెళ్లా లనీ అనేసరికి, ఆమెని సిటీలో దింపి వెళ్ళిపోతాడు వేరేపని మీద. ఆమె అక్క కిద్దామని ఆ కార్లో పెట్టుకొచ్చిన ఆనపకాయ కార్లో అలాగే వుండి పోతుంది...అతను కారులో ల్యాండ్ కొనుగోలు వ్యవహారంలో ఇంకో చోటికి వెళ్లేసరికి, కారులో మళ్ళీ అనపకాయ కన్పిస్తుంది...
          ఇలా చేతులు, స్థలాలు మారుతూ పోతూంటుంది ఆనపకాయ. చివరికి అదేమయ్యిందీ, ఎక్కడికి చేరబోతోందీ చూపించి, మళ్ళీ పల్లె కి వచ్చేసి అదే గిరిజన రైతు మీదికి కెమెరా ని పాన్ చేసి- ఇంగ్లీషులో సబ్ టైటిల్స్ వేయడం మొదలెడతాడు దర్శకుడు. కథనం తెలంగాణా యాసలో సాగుతూ, మొదట్నుంచీ సబ్ టైటిల్స్ కూడా పడుతూనే వుంటాయి. చివరికి గిరిజన రైతు దగ్గరికి వచ్చేసరికి,  కథ ప్రారంభమైనప్పటి కాలుష్యంలేని అదే పల్లె నిశ్శబ్దం పర్చుకుని వుంటుంది. ఆరుబయట  పడుకుని ఆకాశంలోకి చూస్తున్న ఆ రైతుకి పైన విమానం పోతూ కన్పిస్తుంది...ఇక సబ్ టైటిల్స్ మొదలౌతాయి. పల్లె జీవితం, నగర జీవితం రెండిటినీ చూపించు కొచ్చిన దర్శకుడు –ఆ సబ్ టైటిల్స్ ద్వారా మాత్రమే తేల్చి చెప్పదలచుకున్న విషయాన్ని వ్యక్తం చేస్తూంటాడు- ముక్తాయింపుగా ఆ టెర్రిఫిక్ మెసేజ్ ఏమిటో స్వయంగా చూసి చప్పట్లు కొట్టాల్సిందే!
          సంభాషణలు పనిగట్టుకుని రాసినట్టుగా లేవు. పలికే తీరులో కూడా తెచ్చి పెట్టుకున్న నటనలు లేవు. నిత్య జీవితంలో మనం చుట్టూ చూసే దృశ్యాలే అన్నంతగా ఇన్వాల్వ్ చేస్తూ చకచకా సాగిపోతూంటాయి. విజువల్ మీడియాకి రాయాలనుకునే సరికి కృత్రిమ తెలంగాణా యాస  తెరకెక్కడం మనం చూస్తూనే వుంటాం. అలాటి చాపల్యం కూడా కన్పించని నిగ్రహం ఇక్కడ కన్పిస్తుంది. బాగా జీవితం తెలిసిన అనుభవంతో ఆద్యంతం చైతన్యాన్ని నింపిన దర్శకుడ్ని అభినందించక ఉండలేం. తెలుగుదనం తెలుగుదనం అంటూంటాం- అసలు తెలుగుదన మంటే ఏంటో  దాని అసలు రుచెలా వుంటుందో ఈ అనపకాయ చూస్తే తెలుస్తుంది.
          ముందు చెప్పుకున్నట్టు- టెక్నాలజీకే కాదు, తెలుగు దనానికే కళాత్మక గౌరవం చేకూర్చి పెట్టిన ఈ ‘ఆనపకాయ’ ఒనాఫ్ ది బెస్ట్ షార్ట్స్  గా చిరకాలం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుందని చెప్పొచ్చు!

సికిందర్ 
(నోరీల్స్ డాట్.కాం) 


4, నవంబర్ 2014, మంగళవారం

షార్ట్ నోట్స్

           

తమిళ రంగంలో ఉవ్వెత్తున ‘షార్ట్’ తరంగాలు!
 పిజ్జాతెలుగులో కూడా హిట్టయిన తమిళ సినిమా... నడువుల కొంజం పక్కతినే పుస్తకంలో కొన్ని పేజీలు  మిస్సింగ్’), కాదలిల్ సోధపువ్వాదు ఎప్పడి’ (‘లవ్ ఫెయిల్యూర్’) కూడా విజయవంతమైన సినిమాలు. వీటి దర్శకులు ముగ్గురూ షార్ట్ ఫిలిం మేకర్సే నంటే ఆశ్చర్య పోనక్కరలేదు. తమిళ సినిమా రంగంలోనూ షార్ట్ ఫిలిం మేకర్ల హవా నడుస్తోంది. ఈ హవాకు 48అవర్ ఫిలిం ప్రాజెక్ట్ అనే సంస్థ తోడయ్యింది. ఔత్సాహిక షార్ట్ ఫిలిం మేకర్లని  పోటీలకు ఆహ్వానించి ప్రోత్సహిస్తోంది. కాకపోతే 48 గంటల్లో ఆ షార్ట్ ఫిలిమ్స్ రూపొందించాల్సి వుంటుంది దర్శకులు.
     షార్ట్ ఫిలిమ్స్/ డాక్యుమెంటరీల  రంగం మొన్నటి వరకూ ఒక ప్రత్యేక ఫీల్డ్. ఈ ఫీల్డులో కొనసాగే దర్శకులు సినిమాల్లో కి వెళ్లేందుకు ఇదొక షార్ట్ కట్ గా భావించి ఇందులోకి ప్రవేశించే వాళ్ళు కాదు. షార్ట్ ఫిలిం మేకర్స్ అనే ఒక ప్రత్యేక ముద్రతో అంతర్జాతీయ ఫెస్టివల్స్ లో పాల్గొంటూ వివిధ అవార్డులు పొందడమే గాక, తమ షార్ట్ ఫిలిమ్స్ ని  దేశ విదేశాల్లో విక్రయించి కోట్లు గడిస్తూ ఆ రంగంలోనే కొనసాగడం నియమంగా పెట్టుకున్నారు. 
          ఇదంతా డిజిటల్ టెక్నాలజీకి పూర్వం.  సాంప్రదాయ ముడి ఫిలిం పై చిత్రీకరణలు చేస్తున్నంత కాలం వరకూ ఇది కొనసాగింది. ఎప్పుడైతే డిజిటల్ కెమెరాలు వచ్చాయో అప్పటి నుంచి షార్ట్ ఫిలిమ్స్ తీయడం ఇంటి వ్యవహారంగా మారిపోయింది. చవకలో విద్యార్ధులు సైతం తీసేందుకు సౌలభ్యం ఏర్పడింది. పైగా వీటి ప్రదర్శనకు అంతర్జాతీయ ఫెస్టివల్స్ ని వెతుక్కుంటూ తిరగనవసరం లేకుండా- యూట్యూబ్ అందుబాటులోకి వచ్చింది. బాగా హిట్స్ వస్తే యూట్యూబ్ నుంచి ఆదాయం కూడా లభించే అవకాశం ఏర్పడింది. దీంతో లెక్కలేనన్ని షార్ట్ ఫిలిమ్స్ యూట్యూబ్ కె క్కుతున్నాయి. ఎవరెవరు తీస్తున్నారో రికార్డు నిర్వహించలేనంత రద్దీ ఏర్పడిపోయింది. 

          అయితే
, ఇలావస్తున్న ఈ షార్ట్ ఫిలిం మేకర్లు కేవలం సినిమా అవకాశాల మీద దృష్టి పెట్టి మాత్రమే వస్తున్నారనడం వాస్తవం. వాటిని చూపించుకుని సినిమా అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నారు. షార్ట్ ఫిలిమ్స్ కి సంబంధించి అదొక కళాత్మక ప్రక్రియ- మేధోపరమైన రంగం అనే హద్దులు చెరిగిపోయి- ఫక్తు సినిమా దర్శకత్వ ఛాన్సు పొందేందుకు షోకేస్ గానే పరిగణించే పరిస్థితి ఏర్పడింది. కాలమహిమ!ఇలా టెక్నాలజీ తెచ్చే ఎటువంటి మార్పునీ అంగీకరించి తీరాల్సిందే.
          ఈ నేపధంలోనే తమిళంలో షార్ట్ ఫిలిం దర్శకులు సినిమా దర్శకులవుతున్నారు. రాజా లాంటి షార్ట్ ఫిలిం కెమెరా మాన్ లూ సినిమాలకి ఛాయాగ్రాహకులవుతున్నారు.
పిజ్జాదర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ ఇలాగే సినిమా దర్శకుడయ్యాడు. ఒక ఛానెల్ నిర్వహించిన షార్ట్ ఫిలిమ్స్ పోటీల్లో పాల్గొన్నప్పుడు ఇతని పనితనం నిర్మాత సివి కుమార్ దృష్టి నాకర్షించింది. పిలిచి మరీ సినిమా అవకాశమిచ్చారు. అలా పిజ్జాఅనే హిట్ హార్రర్ తెరకెక్కింది.

         ఇలాగే నడువుల కొంజం పక్కతినే కానుందర్శకుడు బాలాజీ తరణీతరణ్ పాపులర్ షార్ట్ ఫిలిం మేకర్. కాదలిల్ సోధపువ్వాదు ఎప్పడిదర్శకుడు బాలాజే మోహన్ కూడా షార్ట్ ఫిలిమ్స్ నుంచి వచ్చిన వాడే. పిజ్జా హీరో విజయ్ సేతుపతి నటించిన మరో చిత్రం సూదు కవ్వుందర్శకుడు నలన్ కుమార స్వామి, విజయ్ సేతుపతియే నటించిన మరో చిత్రం పన్నాయరం పద్మినీయందర్శకుడు అరుణ్ కుమార్ సైతం షార్ట్' డైరెక్టర్ లే!
          ఇలా తమిళ రంగంలో క్రమక్రమంగా సాంప్రదాయ పద్దతిలో ప్రవేశ మార్గాల్ని  బద్ధలు కొట్టుకుని నేరుగా దూసుకొచ్చేస్తున్నారు షార్ట్ ఫిలిం మేకర్లు. దర్శకత్వ శాఖలో సహాయకులుగా చేరి
, ఏళ్లకేళ్ళు శిక్షణ పొంది, అవకాశాలకోసం మళ్ళీ ఏళ్లకేళ్ళు నిర్మాతల చుట్టూ, హీరోల చుట్టూ తిరగడమనే రొటీన్ కి- షార్ట్ ఫిలిం మేకర్లు సవాలు విసురుతున్నారు. ఫీల్డులో ఉంటూ ప్రయత్నాల్లో ఉంటున్న వారిని వెనక్కి నెట్టేస్తున్నారు. అన్ని కష్టాలు పడ నక్కర లేదు- ఒక్క షార్ట్ ఫిలిం తీసి ప్రత్యక్షంగా నీ టాలెంట్ ఏమిటో నిర్మాతలకి లాప్ టాప్ లో చూపించుకో...కథ చెప్పి మేం అలా తీస్తాం, ఇలా తీస్తాం అనే ఊహల్లో నీ అయిడియాలు ఎవరికీ అర్ధం కావు- అంటూ షార్ట్ ఫిలిం మేకర్లు తమకున్న కంప్యూటర్ నాలెడ్జి తో ఒక మెట్టు పైనే, వంద అడుగులు ముందే వుంటున్నారు.


          విద్యార్థి దశనుంచే ఎందరో కెమెరాలతో ప్రయోగాలు చేస్తూ తమ టాలెంట్ ని అంచనా వేసుకుంటున్నారు. రవిచంద్రన్ అనే శాస్త్ర యూనివర్సిటీ విద్యార్థి ఉరంగా ఒండ్రుగోల్అనే షార్ట్ ఫిలిం తీసి ఐ ఐ టీ సరంగ్ లో ప్రథమ బహుమతి పొందాడు. ఆరుథ్ నటరాజన్ అనే మరో విద్యార్థి స్నేహితులతో కలిసి ఆరు షార్ట్ ఫిలిమ్స్ తీశాడు. తమిళనాట కళాశాలలు కూడా విద్యార్ధుల్లో ఫిలిం మేకింగ్ టాలెంట్ ని ప్రోత్సహిస్తూ కళాశాలల  ఉత్సవాల్లో ప్రదర్శనలు నిర్వహించే ట్రెండ్ కూడా మొదలయ్యింది. శాస్త్ర యూనివర్సిటీలో కురుక్ శాస్త్రకల్చరల్ వింగ్ కమిటీ సభ్యుల్లో ఒకరైన బాలాకుమార్ చెప్పిందాని ప్రకారం 2009 లో ఈ ట్రెండ్ ప్రారంభించినప్పుడు అతి తక్కువ ఎంట్రీలు వచ్చేవి. గత రెండేళ్లుగా 80 నుంచి 90 వరకూ వస్తున్నాయి. ఈ ప్రదర్శనల్ని విద్యార్ధులు క్రిక్కిరిసి చూస్తున్నారు! దీంతో స్ఫూర్తి పొంది కొత్త వాళ్ళూ ఈ ప్రయత్నాల్లోకి దిగిపోతున్నారు. కాబట్టి ఇలా కళా శాలల ప్రోత్సాహంతో కూడా వందలాది ఫిలిం మేకర్లు తయారై సినిమారంగం మీద పడొచ్చు.
          ఇదంతా ఇలా వుంటే
, చెన్నై లోని యూటీవీ దక్షిణ డివిజన్ చీఫ్ జి.ధనంజయన్ షార్ట్ ఫిలిం మేకర్లకి ఒక హెచ్చరిక లాంటి సలహా నిస్తున్నారు. అప్పుడే షార్ట్ ఫిలిం మేకర్లు సినిమా దర్శకులై పోవాలని ప్రయత్నించవద్దు. షార్ట్ ఫిలిమ్స్ తీయడం వేరు, ఒక పూర్తి నిడివి సినిమా తీయడం వేరు. పూర్తి నిడివి సినిమా గ్రామర్ ని అర్ధం చేసుకో గల్గాలి. షార్ట్ ఫిలిమ్స్ దృష్టితో సినిమాలు తీయడం వల్ల చాలా సమస్య లొస్తాయి. షార్ట్ ఫిలిం మేకర్లకి సినిమా అవకాశాలివ్వడానికి యూటీవీ సంస్థ కే అభ్యంతరమూ లేదు. కాకపోతే వారు రెండు మూడు సినిమాలకు పనిచేసి వస్తే మంచిది..
          అలాగే ఆయన సినిమా ఫీల్డులో
సాంప్రదాయబద్ధంగా దర్శకత్వ అవకాశాలకోసం వెతుక్కుంటున్న సహాయదర్శకులకి మరో హెచ్చరికలాంటి మాట చెప్పారు- నిర్మాతలు విజువల్ ప్రెజెంటేషన్ లేని సినిమా ప్రపోజల్స్ ని అంగీకరించని రోజులు త్వరలో రాబోతున్నాయని!
          ఇది షార్ట్ ఫిలిం మేకర్లకి శుభవార్త! ఇతరులకి కనువిప్పయ్యే వాత!!


-సికిందర్ 


noreels.com (nov 3, 2014)
         
         
         

2, నవంబర్ 2014, ఆదివారం

సాంకేతికం 

పేల్చేస్తారు క్యానన్ బ్లాస్టర్లు!
మోహన్- కృష్ణ 

సాంకేతికం


పెళ్లంటే పరాయి డ్రెస్సులా?
కాస్టూమ్స్ డిజైనర్ మోహన్ 


ఇప్పుడు తెలుగు సినిమాల్లో డిజైనర్ పెళ్ళిళ్ళ ట్రెండ్ నడుస్తోంది. హైదరాబాద్‌లో కూడా తెలుగు పెళ్ళిళ్ళలో మెహందీ అనీ, సంగీత్ అనీ ఎక్కడిదో కల్చర్ తెచ్చిపెట్టుకుని నవ్వాలో ఏడ్వాలో తెలీని పరిస్థితి కల్పిస్తున్నారు. సానియా మీర్జా పెళ్లిలో ఇవి చూశామంటే అర్థముంది. కళల్లో లాగే నేటివిటీని కూడా ఫ్యూజన్ చేసి చూపిస్తామంటే ఎలా? తెలుగు సినిమా పెళ్ళి సన్నివేశాల్లో షేర్వానీ చుడీదార్లూ, పెళ్లిపీటల మీద అప్పుడే శోభనం పెళ్లికూతురి వేషంలో హీరోయినూ కన్పిస్తే ప్రేక్షకులు తెలుగు సినిమా చూస్తున్నట్టా, లేక ఏ రాజస్థానీ వేడుకకో తరలివెళ్ళినట్టా?


కాస్ట్యూమర్లని కంపెనీకి పరిమితం చేసి, స్టార్లు తమ దుస్తుల్ని తామే నిర్ణయించుకునే కాలం ప్రారంభమయినపుడు ఇలాటివి తప్పవేమో. ఆ మధ్య ఒక హాలీవుడ్ సినిమాలో అమెరికా ప్రాంతపు కథకి, నేపథ్యంగా ఆసియా ఖండపు కొండలు కన్పించేసరికి విమర్శకులు ఖండించారు. మనకా ప్రమాణాల పట్టింపు లేదు. ఈ పూర్వ రంగంలో ప్రముఖ కాస్ట్యూమర్ అవ్వారు మోహన్‌రావు అలియాస్ మోహన్ తన వృత్తినెలా సమర్థించుకుంటారో చూద్దాం. "నా వరకూ నేను పని చేసిన సినిమాల్లో పెళ్ళి దృశ్యాల్ని మధుపర్కాలతో మన నేటివిటీలోనే చూపించాం. హీరోయిన్లకి సాధారణ తెలుపు కాటన్ చీరా జాకెట్లనే తొడిగాం. పెళ్ళి సీనుందని చెప్పి నాకొప్పజెప్పాక, ఇక ఎందులోనూ ఎవరూ జోక్యం చేసుకోవడం జరగలేదు.''

జగపతిబాబు 'జాబిలమ్మ పెళ్ళి'తో ప్రారంభమై ఇప్పుడు బాలకృష్ణ 'శ్రీరామరాజ్యం' వరకూ చేరుకున్న మోహన్ ఏ కాస్ట్యూమర్ ప్రతిభయినా నేటివిటీలో ఒదిగినప్పుడే రాణిస్తుందని స్పష్టం చేశారు. అలాటి నేటివిటీకి పరాకాష్ఠ అయిన పౌరాణికాలకే ఆయనకి అవకాశాలొచ్చినప్పుడు ఇక చెప్పేదేముంది?
'పరమవీరచక్ర'లో బాలకృష్ణని ధర్మరాజుగా చూపించి మంచి మార్కులే కొట్టేశారు. దీనికి వాడిన గద, కిరీటం ఎక్కడివి? నాటి 'సీతారామకళ్యాణం'లో ఎన్టీఆర్ వాడినవే! ఆభరణాలు 'లవకుశ'లో ఎన్టీఆర్ ధరించినవే! రామకృష్ణా సినీ స్టూడియోస్‌లో ఇవన్నీ భద్రపర్చి ఉన్నాయి. ఒక్క బొట్టు తప్ప, మిగతా దుస్తులు, ఆభరణాలు, పాదరక్షలు, చేతి వాచీలు, అవసరమైతే ఓ విగ్గు కూడా కాస్ట్యూమర్ బాధ్యతల క్రిందికే వస్తాయి. బొట్టు మాత్రం మేకప్‌మాన్‌కి దఖలుపడిన ప్రత్యేక హక్కు. ఇక పౌరాణికాల్లో గదలు, కిరీటాలు, వడ్డాణ కంకణ గింకణ గొడవంతా కాస్ట్యూమర్లదే!


ఈ విధంగా బాపు దగ్గర 'శ్రీరామరాజ్యం'కి పని చేయడం గొప్ప అదృష్టమని తన్మయం చెందారు మోహన్. బాపు వేసి ఇస్తున్న డిజైన్ల ప్రకారం కాస్ట్యూమ్స్ రూపొందిస్తున్నానన్నారు. ఇక్కడ మనం బాపులో కాస్ట్యూమ్స్ డిజైనర్‌ని కూడా చూడొచ్చు. మోహన్ ప్రయత్నిస్తున్న ఈ పౌరాణిక కళారూపం అవతలి పార్శ్వంలో 'అలా మొదలైందిఅనే ఆధునిక సక్సెస్‌ని కూడా చూడొచ్చు. ఒక దర్శకురాలి (నందినీరెడ్డి)తో తొలిసారి పనిచేసిన అనుభవ గాథ. బాలకృష్ణతో పాటు వరుణ్ సందేశ్‌కీ పర్సనల్ కాస్ట్యూమర్‌గా కొనసాగుతున్న ఆయన "కాస్ట్యూమ్ వేల్యూ ఉన్న సినిమా మహేష్‌బాబు నటించిన కౌబాయ్ సినిమా టక్కరి దొంగ'' అని చెప్పుకొచ్చారు. తను చెన్నయ్‌లో ఒక సినిమా పని ముగించుకుని వచ్చేవరకూ ఈ కాస్టూమ్స్ కోసం దర్శకుడు జయంత్ నిరీక్షించారన్నారు.

జయంత్‌తో బాటు జగపతిబాబు, నిర్మాత బూర్గులపల్లి శివరామకృష్ణ, బాపు, దాసరి, కోడి రామకృష్ణ, అరుణ్ ప్రసాద్, సి. కళ్యాణ్ తదితరులందించిన ప్రోత్సాహంతో ఈనాడు 50 సినిమాల కాస్ట్యూమర్‌గా నిలబడ్డానని చెప్పారు. 1986లో చిలకలూరిపేట నుంచి బయల్దేరి చెన్నయ్ చేరుకున్నారు మోహన్. అక్కడ కాస్ట్యూమర్‌గా ఉన్న అన్న ప్రసాద్ దగ్గర కొంతకాలం పనిచేసి, కాస్ట్యూమ్స్ కృష్ణకి అసిస్టెంట్‌గా చేరారు. తండ్రి పిడబ్ల్యుడిలో అసిస్టెంట్ ఇంజనీర్. 1992లో హైదరాబాద్ చేరుకుని ఫీల్డులో కొనసాగిన మోహన్, 1996లో 'జాబిలమ్మ పెళ్ళి'తో జగపతిబాబుకి పర్సనల్ కాస్ట్యూమర్‌గా మారారు. అల్లరి పిడుగు, వీరభద్ర, మహారథి, ఈనాడు, చందమామ, ఘర్షణ, లవ్‌ఫరెవర్ (హిందీ) సినిమాలకు పనిచేశారు.


ప్రస్తుతం శ్రీరామరాజ్యంతో బాటు, బాలకృష్ణ మరో సినిమా, అల్లరి నరేష్, వరుణ్ సందేశ్ సినిమాలు రెండు ఆయన వస్త్రాలంకరణలో భాగమయ్యాయి. అయితే శ్రీరామరాజ్యంలో సీత పాత్ర పోషిస్తున్న నయనతారకి చెన్నయ్ నుంచి పర్సనల్ కాస్ట్యూమర్ పనిచేస్తున్నారు. ఫిబ్రవరి 28- ప్రపంచ టైలర్లకి ఒక మహత్తర దినం. 1845లో ఇదే రోజున అమెరికాకు చెందిన ఎలియాస్ హోవ్ అనే ఆయన కుట్టు మిషన్‌ని కనిపెట్టాడు. ఆయన పేరు మీదుగా ఆ రోజు తామంతా టైలర్స్ డే జరుపుకుంటామని తెలియజేశారు మోహన్. ఆ మహానుభావుడి  పటాలు రెండు మోహన్ బిజీ  వర్క్‌షాపులో వేలాడదీసి ఉన్నాయి.

సికిందర్

(డిసెంబర్ 2010 ‘ఆంధ్రజ్యోతి’ కోసం)

అల్లరి ప్రాబ్లం!

బొమ్మాళి బ్రదర్ బాగుపడతాడా?

        ల్లరి నరేష్ కిప్పుడు మంచి కాక మీద అగ్ని పరీక్ష ఎదురయ్యింది! ఈ నెల విడుదలవుతున్న తాజా కామెడీ  ‘బ్రదర్ ఆఫ్ బొమ్మాళి’ ఏమవుతుందో ఏమో నన్న సస్పెన్సే ఈ అగ్నిపరీక్ష! గుండెల్లో గుబులు, బయట నవ్వులు. ఐదు వరస ఫ్లాపులతో నిర్మాతలకీ కొనుగోలుదార్లకీ  గాభరా పుట్టిం చేస్తున్న ఒకప్పటి ఓపెనింగ్స్ హీరో నరేష్ ఇప్పుడు తాజా నవ్వుల సినిమాతో ఏం పంచిపెడతాడో నన్నదే  ఉత్కంఠ అంతటా. తీపి మిఠాయా - గొడ్డు కారమా- ఏది రుచి చూపిస్తాడు? ఉన్న పోటీలేని ఏకైక హాస్య కథా నాయకుడనుకుంటే, అతడికే సమస్య లెదురవడం విచిత్ర పరిస్థితి. నవ్వించే నటుడికి సమస్యలేమిటి? నవ్విస్తే కొడతారా? లేక నవ్విపోతారా? అలాగైతే అసలు కామెడీ హీరోలే కాని స్టార్లందరూ ఏమైపోవాలి?
                     గ్ర హీరోలు సక్సెస్ కి ఇక కామెడీయే ఏకైక మార్గమని, తమ ప్రతీ సినిమాలో కథ వదిలేసి కథతో సంబంధం లేని కామెడీ మీద కామెడీ ట్రాకులతో, బ్రహ్మానందాన్ని బాసటగా దింపుకుని, ఏడాది పొడవునా ప్రేక్షకుల్ని నవ్వించి నవ్వించి ఇంకా నవ్విస్తూనే వున్నా బోరు కొట్టడం లేదు కదా? పెద్ద హీరోల సినిమాలంటే ఇప్పుడు కామెడీ సినిమాలే అన్నంతగా అర్ధమే మారిపోయింది. అలాంటిది 2002 లో అల్లరిఅనే సినిమాతో పుట్టడమే కామెడీ హీరోగానే పుట్టి, ఈ పన్నెండేళ్ళుగా ఫక్తు కామెడీ సినిమాల్లోనే నటిస్తూ వస్తున్న, రికార్డు స్థాయిలో  అప్పుడే 49 సినిమాల వయస్సు కొచ్చేసిన అల్లరి నరేష్, అంతలోనే గల్లంతయ్యే పరిస్థితి ఎందుకొచ్చింది?

          సూటిగా చెప్పాలంటే, తను కామెడీ హీరోగా ఉంటున్న వాడు  కాస్తా ఏదో దుష్ట శక్తి ఆవహించినట్టు, పేరడీ హీరోగా మారిపోవడమే కారణం. ఇతర స్టార్ల సినిమాల్ని, పాత్రల్ని, కామెడీ లనీ పేరడీ చేయడం, సెటైర్లు వేయడం వంటి పనులు చేస్తూ, నవ్విస్తున్నాననుకుంటూ ఎక్కడేసిన గొంగళి లా వుండిపోవడం. దీంతో ప్రేక్షకులు పగలబడి నవ్వడమే లేదు సరికదా, నవ్విపోవడం మొదలెట్టారు. ఎలా తయారైందంటే, ఇతర స్టార్ల సినిమాల్లో చూసేసిన అవే తిరగమోత తాలింపు సీన్లని కామెడీ పేరుతో మళ్ళీ మళ్ళీ చూడాల్సిరావడం చాలాచాలా గుది బండగా మారింది! యాక్షన్ స్టార్లు కామెడీని నమ్ముకుని హింసని తగ్గించుకుంటే, నరేష్ సినిమాలేమో కామెడీ పేరుతో హింసిస్తున్నాయి.

          2012 వరకూ కొన్ని  అపజయాలున్నా విజయాలే ఎక్కువగా సడెన్ స్టార్, కింగ్ ఆఫ్ కామెడీ, ఈతరం రాజేంద్ర ప్రసాద్, సిక్స్ సిగరెట్ ప్యాక్ హీరో లాంటి రకరకాల బిరుదులతో పాపులారిటీ ప్రవాహంలో నవ్వుల నదిలో పువ్వుల పడవ మీద హాయిగా ప్రయాణిస్తున్న నరేష్ కి అదే సంవత్సరం ‘సుడిగాడు’ తో ఫుల్ రేంజిలోనే  క్రేజ్ పెరిగింది. ఎక్కువగా తమిళ రీమేకులు తీసే దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు ఆరేళ్ళ అజ్ఞాతం తర్వాత నరేష్ తో తీసిన మరో తమిళ రీమేకు “సుడిగాడు”. ఇందులో సినిమా సాంతం బాగా రోటీనై పోయిన సినిమా హీరోల పాత్రల్ని, ప్రేమల్ని, హీరోయిజాల్ని, పంచ్ డైలాగుల్నీ ఆట పట్టించడమే పనిగా పెట్టుకున్నారు. ఈ క్రియేటివిటీ చాలా ఒరిజినల్ గా, మరెంతో కొత్తగా అన్పించడంతో అంతే రెచ్చిపోయి, దీన్నో పెద్ద హిట్ చేసి రుణం తీర్చుకున్నారు నాణ్యతకి విధేయులైన ప్రేక్షకులు కూడా!



       టైమ్స్ ఆఫ్ ఇండియా, ది హిందూ, ఎన్డీటీవీ వంటి జాతీయ మీడియా సంస్థలు సైతం దీనికి బ్రహ్మరధం పట్టాయి. ఎనిమిది కోట్ల బడ్జెట్ తో తీస్తే, 33 కోట్లు వచ్చాయని చెప్పుకున్నారు! ఏదీ వదిలిపెట్టకుండా ఈగ, టాగూర్, దూకుడు, పోకిరీ, సింహా, జల్సా, ఖుషి, ఖలేజా, మగధీర, రచ్చ, చంద్రముఖి, భారతీయుడు, రోబో, అపరిచితుడు, ప్రేమికుడు, బాయ్స్, సెవెంత్ సెన్స్, 7జి బృందావనం కాలనీ, మాస్, మిస్టర్ పర్ఫెక్ట్, లీడర్, పెదరాయుడు, నరసింహా, మర్యాదరామన్న, ఏమాయ చేశావే, శశిరేఖా పరిణయం, బొమ్మరిల్లు ...వంటి మొత్తం 28 సినిమాల్లోంచి వివిధ దృశ్యాల్నీ పేరడీ చేసి పారేశారు! 

          తెలుగు సినిమా హీరో 24x7 సమాజంలో ప్రజా సమస్యలే పరిష్కరిస్తూ ఉంటాడని; సమాజంలో జరిగే నేరఘోరాలకు, ప్రజలకు జరిగే అన్యాయాలకూ కోపం తో అతడి కళ్ళు తీవ్రంగా ఎర్రగా భగభగ మండి పోతాయని; చాలా ఈజీగా డీటీఎస్ సౌండులో అతడి నోటెంట పంచ్ డైలాగ్స్ పేల్తాయని; భారత ఆర్ధిక వ్యవస్థ నంతా తన భుజాల మీదే మోస్తూంటాడని; హీరోయిన్ పక్కన లేకపోతే అతడి హృదయం పేదల పట్ల ఆర్తితో కొట్టుకుంటుందని; అతడి హస్తాలు వందలమంది పవర్ఫుల్ విలన్లని ఇట్టే చిత్తుగా చితగ్గొట్టేస్తాయని; ఎక్కడ అతడి పాదాలు తాకితే అక్కడంతా సిరిసంపదలు, సుఖ సంతోషాలూ వెల్లివిరుస్తాయనీ ఒకటే సెటైర్లు!


          తెలుగు సినిమా హీరో అర్హతల మీద కూడా కామెడీ- దేవుళ్ళూ దేవతల కంటే కూడా తనకు జన్మనిచ్చిన తల్లినే అపారంగా ప్రేమించడం; చెల్లెలు ఎలాటి అపాయంలో వున్నా ఆమెని కాపాడడానికి తనే ఠంచనుగా వెళ్ళడం; తను నిరుపేద అయినా ఎలాంటి ధనికురాలైన హీరోయిన్ నైనా ప్రేమలో పడెయ్యడం; సమాజానికి ద్రోహం చేసే వాడు హీరోయిన్ తండ్రి అయినా సరే క్షమించకుండా శిక్షించడం; అసలు విలన్ కూతురైన హీరోయిన్నే ప్రేమించడం; తను మోడరన్ డ్రెస్సుల్లో వుండీ  సంస్కృతి గురించి, కట్టుబాట్ల గురించీ హీరోయిన్ కి క్లాసు పీకడం; తన ఫ్రెండ్ చెల్లెల్ని తన చెల్లెలుగానే చూడ్డం, ఆమె అందంగా వుంటే ఆమెనే ప్రేమించడం; సమాజశత్రువుల మీద అతి సులువుగా విజయం సాధించడం; విమానాలనీ, హెలికాప్టర్ లనీ  జీవితంలో మొట్ట మొదటిసారిగా చూస్తున్నా, సిటీ బస్సుల్లా  అవెక్కేసి ఎడాపెడా తిరిగెయ్యడం; వందల మందితో భీకర పోరాటాలు చేసినా తను ఫ్రెష్ గానే  వుండడం, సిక్స్ ప్యాక్ బాడీ కలిగివుండి, డైలాగ్ డెలివరీ లో- ఫైట్స్ లో అపర ఎక్స్ పర్ట్ అయిపోయి  ఉండడం!


          ఇంతటి  క్రియేటివిటీ తో బాక్సాఫీసుని ఊపేసిన ఈ  ‘అల్లరి’ మార్కు కామెడీ, నిజానికి మహేష్ బాబుకి వచ్చిన ‘దూకుడు’ అంతటి రేంజి నిచ్చింది నరేష్ కి తన కామెడీ సెగ్మెంట్ లో. కానీ ఆతర్వాత జరిగిందేమిటి? అదే క్రియేటివిటీని మక్కీకి మక్కీ రిపీట్ చేస్తూ యముడికి మొగుడు, కేవ్వుకేక, జంప్ జిలానీ అనే మూడు సినిమాల్లో నటించడం. ‘సుడిగాడు’ తర్వాత 2012- 2014 మధ్యకాలంలో వచ్చిన ఈ మూడు కామెడీలే కాక, యాక్షన్- త్రీడీ, లడ్డూ బాబు  అనే రెండు ప్రయోగాలూ కలిపి - మొత్తం ఐదు సినిమాలు వరసపెట్టి అట్టర్ ఫ్లాపయ్యాయి. ప్రయోగాల్ని పక్కన పెడదాం, అవి ఎప్పుడో గానీ జరిగే ప్రయత్నాలు కావు. నటుడిగా తనని నిలబెడుతున్న తన రెగ్యులర్ బ్రాండ్ కామెడీ విషయంలో ‘సుడిగాడు’ తర్వాత అనుసరించిన విధానమే మట్టికరిపించింది. ఒక క్రియేటివ్ ప్రయత్నం హిట్టయితే ఇక అదే జీవనాధారమని దయనీయంగా  సాగిలపడి కొనసాగాలనుకోవడం ఎదురు దెబ్బ తీసింది. మహేష్ బాబు ‘దూకుడు’ లాంటి క్రియేటివిటీ తో ఏ రేంజికి వెళ్లి, మళ్ళీ అదే ‘దూకుడు’ క్రియేవిటీ ని , అదే కోవలోని టైటిల్ తో ఫాలో అయిపోయి  ‘ఆగడు’ తో ఏమయ్యాడో- సరీగ్గా ఇదే నరేష్ తోనూ జరిగింది! దూకుడుకి ముందు- దూకుడు కి తర్వాత అని మహేష్ బాబు అయినట్టు, సుడిగాడుకి ముందు- సుడిగాడుకి తర్వాత  అయ్యింది సరీగ్గా నరేష్ బాబు  పరిస్థితి!


          హిందీలో ఆనాడు రమేష్ సిప్పీ ‘షోలే’ అనే మెగా హిట్ తీసిన వెంటనే అటువంటి ‘షోలే’ లాంటిదే  ‘షాన్’ తీద్దామనుకుని అట్టర్ ఫ్లాపయ్యాడు. ఆ గుణపాఠాన్ని చూసే అందులోంచి ఓ  కొటేషన్ పుట్టించారు - “షోలే కా షాన్ మత్ బనావో!” అని.


          చరిత్ర చదువుకోవాలిగా? షోలే షోలే నే! అదే అద్భుతం మళ్ళీ సిప్పీ తనే చేయలేడు. మొగలే ఆజం, మల్లీశ్వరి, మాయాబజార్..లాంటి అద్భుతాల్నిఆ దర్శకులు అలా వదిలేసి వేరే సినిమాలతో ముందు కెళ్ళి పోయారు. దూకుడు దూకుడే, సుడిగాడు సుడిగాడే ... ‘దూకుడు కా ఆగడు మత్ బనావో...సుడిగాడు కా యముడికి మొగుడు, కేవ్వుకేక, జంప్ జిలానీ  వగైరా వగైరా మత్ బనావో!’ –అని చరిత్ర మళ్ళీ మళ్ళీ గుర్తు చేయాల్సిన అవసరం లేదు. హీరో కృష్ణ కూడా అప్పట్లో ‘మోసగాళ్ళకు మోసగాడు’ అనే సాహసోపేతమైన ఇంటర్నేషనల్ హిట్ తీసి, తర్వాత అలాటిదే ‘మంచివాళ్ళకు మంచివాడు’ తీస్తే ఏమయ్యిందో  తెల్సిందే. ఒక ఇన్నోవేషన్ ఇచ్చిన సక్సెస్ మత్తు లోంచి చప్పున బయటి కొచ్చేయాలంతే. కానీ దాన్నే పట్టుకుని సినిమా తర్వాత సినిమాగా  నరేష్ ఇంకేవో  నగిషీలు చెక్కుకుంటూ ఉండడంతో అది  సుడిగుండం లోకి లాగేసింది! ఒక్క సుడిగాడు మూడు సుడిగుండాల్ని సృష్టించింది! 


          ఒక సందర్భంలో, ఫ్లాప్ హిట్ అని లేకుండా తను నటించే అన్ని సినిమాల ఫలితాల్ని పోస్ట్ మార్టం చేసుకుంటా నన్నాడు నరేష్. కానీ ‘సుడిగాడు’  హిట్ ని గనుక పోస్ట్ మార్టం చేసుకుని వుంటే, ఆ చేసుకున్న విధానం ప్రశ్నార్ధకమైనదే. 


          తత్ఫలితంగా డోలాయమానంలో పడింది పరిస్థితి. నిర్మాతలు భయపడ్డారు మళ్ళీ నరేష్ తో సినిమా అంటే. తను తీసుకునే పారితోషకం మూడు కోట్లే అయినా నిర్మాణ ఖర్చు లు విపరీతంగా పెట్టించి పది- పన్నెండు కోట్లకి చేరవేస్తాడనే టాక్ వున్న నరేష్ తో సినిమా అంటే ఇక ముందుకు రాలేని పరిస్థితి (బ్రదరాఫ్ బొమ్మాళికి పదమూడు కోట్లయిందని అంటున్నారు). అన్ని సెంటర్ల అభిమాన హాస్యనటుడనే పేరు తెచ్చున్న నరేష్ కి బి, సి సెంటర్ల ప్రేక్షకులు సైతం బైబై చెప్పేస్తున్న పరిస్థితి ఎదురయ్యింది. 



          వ్యక్తిగతం గా నరేష్ లో ఏ లోపమూలేదు. ఏ సక్సెస్సూ అతని తలకెక్కి స్వారీ చేయలేదు.
తను ఏకైక కామెడీ హీరోననే గర్వం, అహంకారం లేవు. మీడియం రేంజి నిర్మాతలకి, కొత్తగా వచ్చే దర్శకులకి కూడా అతను ఫ్రెండ్లీ హీరోయే.  తన పొజిషన్ చూసుకుని అడ్డగోలుగా పారితోషికం కూడా పెంచుకు పోలేదు. కాకపోతే నిర్మాణ వ్యయం బాగా పెంచేస్తాడన్న అభియోగం మాత్రం వుంది. అతడికి ఇంకా పాత  స్టయిల్లో పాటలకి భారీ సెట్టింగులు వేయించుకునే చాదస్తముంది. దీంతోనే వ్యయం తడిసి మోపెడవుతోంది. ఒకప్పుడు నరేష్ అంటే మినిమం గ్యారంటీ హీరో అని డేట్స్ కోసం పోటీలు పడేవారు నిర్మాతలు. ఆ డిమాండ్ తట్టుకోలేక ఏడాదికి సగటున నాల్గు సినిమాల్లో విశ్రాంతి లేకుండా నటించాడు నరేష్. 2008 లో నైతే బాపు తీసిన ‘సుందరకాండ’ తో మొదలు పెట్టి, విశాఖ ఎక్స్ ప్రెస్, పెళ్లి కాని ప్రసాద్, గమ్యం, బొమ్మన బ్రదర్స్- చందన సిస్టర్స్, సిద్దూ ఫ్రమ్  శ్రీకాకుళం, బ్లేడ్ బాబ్జీ, దొంగలబండి ..ఇలా అక్షరాలా ఎనిమిది సినిమాల్లో నటించి రికార్డు సృష్టించాడు. అలాగే 2010లో ఏడు సినిమాల్లో నటించాడు( శంభో శివ శంభో, రాంబాబు గాడి పెళ్ళాం, ఆకాశ రామన్న, బెట్టింగ్ బంగార్రాజు, శుభప్రదం, సరదాగా కాసేపు, కత్తి కాంతారావు). కానీ 2008 లోనే, రంగ ప్రవేశం చేసిన ఆరేళ్ళ కు గానీ అతని  స్టార్ డమ్ ప్రారంభం కాలేదు. అతడి జీవితంలో ఈ   ‘స్వర్ణయుగం’ మరో 16 సినిమాలతో అలాగే కొనసాగి, 2012 ఆగస్టు నాటికల్లా  “సుడిగాడు’ తర్వాత ముగిసింది. ‘సు’ (సుందరకాండ) తో మొదలైన స్టార్ డమ్ ‘సు’ (సుడిగాడు) తోనే ముగిసిపోయింది. మొత్తం 2014 వరకూ నటించిన 49 సినిమాల్లో 39వరకూ కామేడీలే వున్నాయి.

          ఐతే గమ్మత్తేమిటంటే, ఇతర స్టార్లకి ఒకరి స్టార్ డమ్ మరొకరికి వెళ్ళిపోయే తలనొప్పి ఎప్పుడూ పొంచి వుంటుంది. ఒకటో నంబర్ స్టార్ ఫ్లాపులిస్తే, ఒక్క హిట్ తో రెండో నంబర్ స్టార్ ఆ స్టార్ డమ్ ని లాక్కోవచ్చు. మళ్ళీ ఈ రెండో నంబర్ నుంచి నంబర్ త్రీ కూడా లాక్కోవచ్చు. ఇంకెప్పుడో కాలం  కలిసొచ్చి కసిమీద వున్న ఒకటో నంబర్ స్టారే మళ్ళీ త్రీ నుంచి లాగేసుకో వచ్చు! ఇదో ఎందరు స్టార్ లుంటే అన్ని స్తంభాలాట లాంటిది!


          అల్లరి నరేష్ కీ తల నొప్పి లేదు.  తన హాస్య నట ప్రపంచంలో తానొక్కడే స్టార్. తన స్టార్ డమ్ ని  లాక్కునే మరో కామెడీ హీరోయే లేడు. ఇతర స్టార్లు ఎందరున్నా, ఎప్పుడైనా కామెడీ స్టార్ ఒక్కడే ఉంటాడు. ఈ సౌలభ్యం కేవలం రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితం. ఈ  ఒంటి స్తంభపు ఆట తానొక్కడే తీరుబడిగా ఆడుకుంటాడు. స్టార్ డమ్ ఎటూ పోనే పోదు. పోతే అక్కడే కింద పడి వుంటుంది. దాన్నీ మళ్ళీ తనే ఎత్తుకో వచ్చు. ఇది కూడా కనా కష్టమై పొతే అంతకన్నాకన్నా ట్రాజెడీ హీరో ఉంటాడా! అప్పుడు కామెడీ కోసం ప్రేక్షకులు ఎటు చూడాలి? 


         
ఈ నేపధ్యంలో, పట్టుదలతో తనని నిలబెట్టిన తన తండ్రి ఈవీవీ సత్యనారాయణ నే ఈ ఆపత్కాలంలో తిరిగి  నమ్ముకోవాల్సి వచ్చింది నరేష్ కి.  ఆ దివంగత తండ్రి సమర్పణలో ‘సిరి సినిమా’ బ్యానర్ లో  బంధువు అమ్మిరాజుని నిర్మాతగా చేసుకుని,   బ్రదర్‌ ఆఫ్‌ బొమ్మాళీ’. పూర్తి చేశాడు నరేష్. దీనికి గతంలోనే   దర్శకుడుగా మారి, నిఖిల్ తో  ‘వీడు తేడా’ అనే సినిమా తీసిన ప్రముఖ రచయిత ఈసారి తనని గుర్తు పట్టకుండా మారు పేరు వెనుక దాక్కుని,  బాహాటంగానే దర్శకత్వం వహించాడు. ఆయనే  చిన్నికృష్ణ  అనే బి. చిన్ని!

              నరేష్ ని నిలబెట్టడానికి చేయాల్సిన గిమ్మిక్కులన్నీ ఈ సినిమాతో చేశారు. అందులో ప్రధానమైనది తమిళ హీరోయిన్ కార్తీక ని పెట్టుకోవడం. నాటి అగ్ర తార రాధ కూతురైన కార్తీక 2009లోనే  నాగచైతన్య నటించిన ‘జోష్’ తో తెలుగు తెర కెక్కింది గానీ, తెలుగు ప్రేక్షకులకి తన తల్లిలా దగ్గర కాలేకపోయింది. తమిళ డబ్బింగ్ హిట్ ‘రంగం’ తో మళ్ళీ తిరిగి వచ్చింది. అల్లరి నరేష్ కి ఇంకో రికార్డుంది. అతనితో నటించిన ఏ హీరోయినూ పై స్థాయికి వెళ్ళిన పాపాన పోలేదు. రాజేంద్ర ప్రసాద్ తో అలాకాదు. ఆయనతో కెరీర్ ప్రారంభ దశలో నటించిన సౌందర్య, ఆమని, రంభ అగ్ర తారలయ్యారు. అగ్ర తారలయ్యాక కూడా మళ్ళీ రాజేంద్ర ప్రసాద్ తో నటించారు. కానీ నరేష్ తో ఎంట్రీ ఇచ్చిన ఏ హీరోయిన్ కీ పట్టుమని నాల్గు అవకాశాలు దక్కలేదు. అలాగే అగ్ర హీరోయిన్లతో నటించాలని నరేష్ కీ వుంటుంది. అయితే వాళ్ళు భగ్న హీరోయిన్ లయ్యాకే ఆ అవకాశం దక్కుతూ వస్తోంది - చార్మీ, భూమిక, శ్రియ మొదలైన వాళ్ళతో అయ్యాక ఇప్పడు కార్తీక తో!

          మళ్ళీ ఇక్కడ కార్తీక హీరోయిన్ గా నటించ లేదు. నరేష్ కి కవల సోదరిగా నటించింది.  హీరోయిన్ గా వేరే మోనాల్ గుజ్జర్ వేసింది. సినిమా ప్రధానంగా నరేష్- కార్తీక ల మధ్యనే నడుస్తుందని అంటున్నారు. కొత్త తరహా కథతో, కొత్త రకం కామెడీతో- ఆ కవల సోదరుడికి తలనొప్పులు తెచ్చే కవల సోదరి స్పీడ్ పాత్రతో ఇదో భిన్నమైన అనుభవమే కాగలదు ప్రేక్షకులకి అని నిర్మాత ఆశాభావం.


          ఐతే అసలు సంగతేంటో నవంబర్ లో మాత్రమే తేలుతుంది. ఇది నరేష్ ని బయట పడేసిందా ఇక సమస్య వుండదు. ఐతే ఇదిచ్చే సక్సెస్ తో మళ్ళీ ‘సుడిగాడు’ తర్వాత చేసిన పొరపాట్లే చేస్తే కథ మళ్ళీ మొదటి కొస్తుంది. ఎప్పటికప్పడు సక్సెస్ ని మర్చిపోతూ, ఆ సక్సెస్ ఇచ్చిన సినిమా ఛాయలు లేని మరో కొత్త ప్రయత్నం చేస్తూంటేనే తనకు పోటీలేని, ప్రత్యాన్మాయం కూడా లేని ఈ స్థానాన్ని నిలబెట్టుకోగలడు. 


          దీని తర్వాత మోహనకృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో తయారవుతున్న  ‘బందిపోటు’ విడుదలవుతుంది. తనతో ‘అహ నా పెళ్ళంట’ తీసిన వీరభద్రంతో “బిస్కెట్ రాజా’ అనే మరోసినిమా ప్రకటించాడు నరేష్. తన యాభయ్యోవ సినిమా జనవరి 1,2015న విడుదలయ్యేలా చూడాలనుకుంటున్న అల్లరినరేష్ ఇంకో యాభై సినిమాల రికార్డు కూడా తనే పూర్తి చేసి దాన్ని  తండ్రికి నివాళిగా అర్పిస్తేనే జన్మ ధన్యమైనట్టు!

-సికిందర్
నవంబర్ 2014 ‘ఈవారం’ కోసం




.