రివ్యూలు, సాంకేతికాలు, స్క్రీన్ ప్లే సంగతులు...

టికెట్లు దొరకడం యోగం, సినిమాలు చూడడం భోగం, రివ్యూలు రాయడం రోగం!

20, జులై 2014, ఆదివారం

రివ్యూ..


షుగర్ కోటింగ్ మిస్సయిన సీరియస్ నెస్ !
దర్శకత్వం : వై. సునీల్ కుమార్ రెడ్డి
తారాగణం : మనోజ్ నందం, ప్రియాంకా పల్లవి, సత్యానంద్ తదితరులు
సంగీతం: ప్రవీణ్ ఇమ్మడి
బ్యానర్: శ్రావ్య ఫిలిమ్స్ ,  నిర్మాత : వై. రవీంద్ర
విడుదల: 18 జులై 2014     సెన్సార్ : ‘A’
*
దర్శకుడు వైసునీల్ కుమార్ రెడ్డి  రోమాంటిక్ కథలకి యూత్ ఎదుర్కొంటున్న సమస్యల్ని జోడిస్తూ యూత్ స్పృహ వున్న దర్శకుడిగా పేరు తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంతకి ముందుసొంతూరు’, ‘గంగపుత్రులులాంటి సినిమాలతో సామాజిక స్పృహ  వున్న దర్శకుడుగా అవార్డులు సాధించుకున్నారు. యూత్ వైపు దృష్టి సారించాక  ‘ఒక రోమాంటిక్ క్రైం కథ’, ‘వెయిటింగ్ ఫర్ యూ’, ‘నేనేం చిన్న పిల్లనాతర్వాత ఇప్పుడు  ‘ఒకక్రిమినల్ ప్రేమకథతీశారు.  వీటిలోనేనేం చిన్న పిల్లనాకాలం చెల్లిన ఫ్యామిలీ డ్రామాగా వర్కౌట్ కాలేదు, ‘వెయిటింగ్ ఫర్ యూఫ్యాక్షన్ , టెర్రరిజం, మతకలహాల కలగూరగంపలా దెబ్బతింది . ఇప్పుడుఒక క్రిమినల్ ప్రేమ కథతో మరో యూత్ సమస్యని ఎత్తుకున్నారు. సమస్య ఎక్కడొచ్చిందంటే, యూత్ కి సెక్సు సమస్యలు తప్ప ఇంకేవీ ఉండనట్టు భావించడం దగ్గరే. వీటికంటే కెరీరిజం మీద, డబ్బు సంపాదనల మీద ఆసక్తికరమైన కొత్త  కథలు చెప్పవచ్చన్న ఆలోచన చేయకపోవడం దగ్గరే!


ప్రస్తుత సినిమాలో ఇళ్ళల్లో దగ్గరి బంధువులతో ఆడవాళ్ళు ఎదుర్కొంటున్న  లైంగిక హింస గురించి చెప్పాలనుకున్నారు.  దీనిపట్ల యువతీ యువకులు ఎలా రియాక్టయ్యారన్నది చూపించాలనుకున్నారు. అయితే ఆ కామ ప్రకోపిత బంధువు అసలలా ప్రవర్తించడానికి గల మానసిక కారణాల  మూలాల్లోకి దర్శకుడు వెళ్లకపోవడం వల్ల, సమస్యకి చూపించిన పరిష్కారం రొటీన్ ఫార్ములా చట్రంలో ఉండిపోయింది.

ఇదొక క్రిమినల్ ప్రేమ కథ అన్నారు. కానీ కథలో అతడ్ని క్రిమినల్ గా చూపించలేదు, కథంతా అయ్యాకే అతను క్రిమినల్ గా మిగిలాడు. అదెలాగో చూద్దాం...

బాబోయ్ మేనమామ!

శీను (మనోజ్) ఓ గ్రామంలో ఫోటో స్టూడియోలో పనిచేసే కుర్రాడు. బిందు (ప్రియాంక పల్లవి) పెద్దమనిషైన శుభకార్యానికి వీడియో తీయడానికి వెళ్లి ఆమె ఆకర్షణలో పడతాడు. ఇదామె గమనిస్తుంది. ఇక్కడనుంచీ ఆమె వెంట పడతాడు. ప్రేమ ఖరారవుతుంది. అప్పుడు తాగుబోతు  అయిన బిందు తండ్రికి పక్షవాతం రావడంతో, విధిలేక ఉదర పోషణకు బిందు తల్లి వైజాగ్ లో ఉన్న తన అన్న ( సత్యానంద్) పంచన చేరుతుంది- భర్తా కూతురూ సహా. 

ఈ ఎడబాటు తాళలేక శీనుకూడా వైజాగ్ వెళ్ళిపోయి, బిందు చదివే కాలేజీలోనే క్యాంటీన్ బాయ్ గా చేరతాడు. ఐతే విచిత్రంగా బిందు ఇతన్ని చూడదు, మాట్లాడదు. ఆమె కోపానికి కారణమేంటో అర్ధంగాదు. అతడి కళ్ళ ముందే సిటీలో వేరే కుర్రగ్యాంగ్ తో తిరుగుతూంటుంది.

ఈమె క్లాస్ మేట్స్ గా ఇద్దరమ్మాయి లుంటారు. వీళ్ళు తమ శరీరాల్ని తాకే మగవాళ్ళ అంతు చూస్తూంటారు. ఒక రోజు ఉండబట్టలేక శీను మొండికేసిన బిందూని పట్టుకోవడంతో దేహశుద్ధి జరిగి క్యాంటీన్ నుంచి డిస్మిస్ అవుతాడు. ఈ అవమానంతో ఆత్మహత్య చేసుకోబోతాడు. అప్పుడు బిందు వచ్చి పలకరిస్తుంది. ఇద్దరూ మళ్ళీ ఒకటవుతారు. కానీ బిందూ అంతవరకూ తనకి దూరంగా వున్నా కారణం మాత్రం శీనుకి చెప్పాడు. పైగా అతడికి చెప్పి కొన్ని సాహసాలు చేయిస్తూంటుంది. అమ్మాయిల్ని లైంగికంగా వేధిస్తున్న లెక్చరర్ కి బుద్ధి చెప్పడం, బయట ఓ కారు అద్దం పగలగొట్టడం వంటివి...

చివరికి నా కోసం ఏమైనా చేస్తావా అని, ఒకడ్ని చంపమంటుంది. అతను మేనమామ. అతను లైంగికంగా వేధిస్తున్నాడు. తను భరించలేకపోతోంది-ఆ ఫ్లాష్ బ్యాక్ చెప్పుకొస్తుంది  ...ఇదీ విషయం. విషయం తక్కువే, దీనికి తగ్గట్టు హీరోయిన్ గ్లామర్ కూడా తక్కువే ! నటనకూడా నవ్వుతెప్పించేంత కృతకమే!

ఈ కొత్త హీరోయిన్ ది ఫోటోజెనిక్ ఫేసు కాదు. దీంతో సినిమాకి ‘సి’ గ్రేడ్ లుక్ వచ్చేసింది. ఈమెతో తీసిన లైంగిక వేధింపుల దృశ్యాల ధాటి చూస్తే, ఇలాటి గ్లామర్ తక్కువ హీరోయిన్లే ఇందుకు ధైర్యం చేస్తారేమో అఅన్పించేలా వుంది. కాబట్టి ఇంతకంటే అందమైన హీరోయిన్ ని తెచ్చుకునే అవకాశం లేదు దర్శకుడికి.

హీరో మనోజ్ ఓవరాక్షన్ లేకుండా బాగా చేశాడు. పాత్ర ఎలావుండాలో అలా అండర్ ప్లే చేశాడు. ప్రేమలో బాధని ఓర్చుకోవడంలోనూ పరిణతి కనబర్చాడు. కథల విషయంలో అతడింకా రాటుదేలితే, తనకంటూ ఫాలోయింగ్ వున్న ప్రేక్షకులకి ఇంకా మంచి వినోదాన్ని అందించగలడు.

పోతే, మేనమామగా  నీలి చిత్రాల బాపతు నిమ్న పాత్ర పోషించిన యాక్టింగ్ స్కూల్ అధినేత సత్యానంద్ గట్టి షాకిస్తారు ఈ సినిమాలో. ఇదికూడా ఒక సినిమాపాత్రేనా, సినిమా పాత్రే అనుకుంటే, పోర్న్ స్టార్ సన్నీ లియోన్నే సినిమా ప్రేక్షకులు ఆదరించారు గనుక ఇదెంతా అనుకున్నా, విజువల్ గా దీని పరిమితులు ఎంతవరకుండాలనేది కూడా గాలి కొదిలేస్తే ఎలా? నిజజీవితంలోని  అన్ని చేష్టలూ కళారూపాల సన్నివేశాలవుతాయా? వాస్తవికత అంటే ఇదేనా? అంతా అయోమయం!

సాంకేతికంగా డీ టీ ఎస్ మిక్సింగ్ సృజనాత్మకంగా లేదు. సన్నివేశాల వెలుపల ఎక్కడో  దూరంగా వినిపించే గొంతుకలు కూడా ఫుల్ వాల్యూంలో వుండడం ఇబ్బంది పెట్టే వ్యవహారం. ఎంత లో బడ్జెట్ సినిమాకైనా క్వాలిటీ విజువల్స్ సాధించే డీఐ ఇప్పుడు అందుబాటులో వున్న కాలంలో ఈ సినిమా దాన్నందుకోనట్టే కన్పిస్తోంది. ఉన్నపాటల్లో మాత్రం మొదటి రెండూ సాహిత్యంతో సహా బావున్నాయి. కెమెరా వర్క్ డిస్టర్బింగ్ సీన్లలో కూడా స్టాటిక్ షాట్లతో చలనం లేకుండా వుంది. సినిమా త్వరత్వరగా చుట్టేసినట్టుంది.

స్క్రీన్ ప్లే సంగతులు!

ఇది నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలు నాలుగు రకాలు –ఒకే ఏకబిగి ఫ్లాష్ బ్యాక్ తో నడిచేవి, తడవకింత చొప్పున మల్టిపుల్ ఫ్లాష్ బ్యాకులుగా వడ్డించేవి.  ఫ్లాష్ బ్యాకులో ఫ్లాష్ బ్యాకులుగా సాగేవి,  ఫ్లాష్ బ్యాకులో ఫ్లాష్ బ్యాకులుగా సాగుతూ, అడపాదడపా వాటికి అడ్డుతగులుతూ,  వర్తమాన కాలంలో నడుస్తున్న కథ కొనసాగించేవి. ఈ సినిమా స్క్రీన్ ప్లే ఈ నాల్గో తరగతికి చెందుతుంది. చాలా సంక్లిష్టం చేసుకున్న స్క్రీన్ ప్లే. దీంతో ‘కథ’ కి స్థానం లేకుండా పోయింది. సూటిగా చెప్పుకోవాలంటే ఈ సినిమా  ‘కథ’  అసలే రకం ఫ్లాష్ బ్యాకులతోనూ కలిపి  తీయాల్సింది కాదు!

నిజజీవితంలో అనేక చేదు లుంటాయి. అవన్నీ సినిమాకి తీపి అయిపోవు.  వాటిలో చెప్పుకుని చప్పున కట్ చేసేసే  చేదు ఉదంతాలుంటాయి. వాటిని చెప్పుకునీ, ఊహించుకునీ  ఆనందించలేం. ఖండించగలం. అలాటి చేదుల్లో ఒకటి  వావీవరసల్లేని లైంగిక వేధింపులు. ఇందులో వుండేది బూతు కాదు, పెర్వర్షన్. వయసు మీదపడిన మేనమామ టీనేజి మేనకోడల్ని అనుభవించడం,  మామ కోడల్ని చెరచడం, తండ్రి కూతుర్ని రేప్ చేయడం అప్పుడప్పుడు మనచుట్టూ జరిగే పెర్వర్టెడ్ కేసులే. అంత మాత్రాన దీంట్లో సెక్సప్పీల్ ని చూసి,  ఇలా కూడా కొత్తగా యూత్ ప్రేక్షకుల్ని రెచ్చగొట్టి సొమ్ము చేసుకోవచ్చన్న  ఆలోచన కలగడమే బూమరాంగ్ అయ్యే పరిస్థితి! బూతు వేరు, పెర్వర్షన్ వేరు. యువ ప్రేక్షకులు బూతు బానిసలనే దుర భిప్రాయం నుంచి, వాళ్ళు ప్రమోటై సెక్సువల్  పెర్వర్షన్ కూడా ఎంజాయ్ చేసే సైకోలనే  నిర్ణయానికి  రావడం చాలా విచారకరం.

సామాజిక సమస్య చెబుతున్నామని గణాం కాలేసి, చూపించిందంతా పెర్వర్షన్నే. లేకపోతే, పదేపదే కూతురు వయసున్న మేనకోడలితో బలవంతంగా మాస్టర్బేషన్ దగ్గర్నుంచీ ఓరల్ సెక్సు వరకూ పచ్చిగా చూపించాల్సిన అవసరం లేదు.

ఇటీవలే  ‘హైవే ‘ తీసిన ఇంతియాజ్ అలీకి బూతుకీ, పెర్వర్షన్ కీ మధ్య సన్నని గీత తెలుసేమో.. అందుకే జాగ్రత్త పడి,  తను తీస్తున్న కమర్షియల్ ఎంటర్ టెయినర్ లో లైంగిక వేధింపుల గురించి సూచన ప్రాయంగా మాత్రమే తెలియజేసి  వదిలేశాడు. వీటిని దృశ్య పరంగా చూపిస్తే వెగటు పుట్టి  వైడ్ యాక్సెప్ టెన్స్ ఉండదని, కేవలం ఇంటర్వెల్ దగ్గర- తన బాల్యం దగ్గర్నుంచీ ఒక అంకుల్ పాల్పడుతున్న లైంగిక వేధింపుల గురించి హీరోయిన్ చేత  వాచికంగా హీరోకి చెప్పించాడు. క్లైమాక్స్ లో ఆ అంకుల్ ని అందరి ముందూ దులిపేసి, షాక్ కి గురిచేసి వెళ్లి పోతుందామె, అంతే!

ఇలా నీటుగా చెబితే  ప్రేక్షకులామె బాధని ఫీల్ అవడానికి సరిగ్గా సరిపోయింది. సునీల్ కుమార్ రెడ్డి  సినిమాలో హీరోయిన్ బాధకన్నా, ఆ బాధని సెక్సువల్ గా చూసి ప్రేక్షకులు బాగా ఎంజాయ్ కూడా చేయాలన్న కసి ఎక్కువ వుంది. ఇంతియాజ్ అలీ సినిమాలో హీరోయిన్ ఆలియా భట్ కి లైంగిక వేధింపులనే విషాదముంది, అది కేవలం ఇంటర్వెల్లోనూ, ముగింపులోనూ రెండు చోట్ల  తప్ప, ఎక్కడా  బయట పెట్టకుండా బందిపోటు (రణదీప్ హూడా) తో ఆమెకి రోడ్ రోమాన్స్ అనే షుగర్ కోటింగ్ ఇచ్చి ఎంటర్ టెయిన్ చేస్తూ పోయాడు. గొప్పింటి బిడ్డ తనని కిడ్నాప్ చేసిన డెకాయిటీనే  ప్రేమించడమనే  స్టాక్ హోమ్ సిండ్రోం అనే  మానసిక స్థితిని తెలియజేస్తూ వుంటుందే తప్ప, ఆమె చెప్పే వరకూ అసలు కారణం మనం పసిగట్టలేం. మంచి కథల్లో హిడెన్ ట్రూత్ ఉంటుందని అంటాడు జేమ్స్ బానెట్. ఐతే దాన్ని నిర్వహించడంలోనే అంతా వుంది. ఇంతియాజ్ అలీ దాన్ని మరుగు పరచి,  ఆరు రాష్ట్రాల పొడవునా సాగే రోడ్ రోమాన్స్ అనే షుగర్ కోటింగ్ ఇస్తే, సునీల్ కుమార్ రెడ్డి దాన్ని బట్టబయలు చేసి ఎలాంటి షుగర్ కోటింగూ లేకుండా పచ్చి పచ్చిగా అదే ప్రధాన కథ అనుకుని చెలరేగిపోయారు!

***

ఈ కథలోని ‘సమస్య’ని మల్టిపుల్ ఫ్లాష్ బ్యాకులుగా – ఆమాటకొస్తే అసలు ఏకబిగి ఫ్లాష్ బ్యాక్ గాకూడా  ఎందుకు చెప్పకూదదంటే...అది ‘కథ’ కాదు కాబట్టి!

ఒకసారి పైన ఇచ్చుకున్న వివరణని మళ్ళీ ప్రస్తావించుకుంటే - ఇది నాన్ లీనియర్ స్క్రీన్ ప్లే. నాన్ లీనియర్ స్క్రీన్ ప్లేలు నాలుగు   రకాలు –ఒకే ఏకబిగి ఫ్లాష్ బ్యాక్ తో నడిచేవి, తడవకింత చొప్పున మల్టిపుల్ ఫ్లాష్ బ్యాకులుగా వడ్డించేవి.  ఫ్లాష్ బ్యాకులో ఫ్లాష్ బ్యాకులుగా సాగేవి. ఫ్లాష్ బ్యాకులో ఫ్లాష్ బ్యాకులుగా సాగుతూ, అడపాదడపా వాటికి అడ్డుతగులుతూ,  వర్తమాన కాలంలో నడుస్తున్న కథ కొనసాగించేవి. ఈ సినిమా స్క్రీన్ ప్లే ఈ నాల్గో తరగతికి చెందుతుంది. చాలా సంక్లిష్టం చేసుకున్న స్క్రీన్ ప్లే. దీంతో ‘కథ’ కి స్థానం లేకుండా పోయింది. సూటిగా చెప్పుకోవాలంటే ఈ సినిమా  ‘కథ’  అసలే రకం ఫ్లాష్ బ్యాకులతోనూ కలిపి  తీయాల్సింది కాదు!

ఇలా ఫ్లాష్ బ్యాక్స్ ని ‘కథ’ అని ఎందుకు అనుకోవడం లేదు మనం? ఏ సినిమాలో ఫ్లాష్ బ్యాకు అయినా కథా లక్షణాలతో వుండదు కాబట్టి!

దీన్ని వివరించుకుందాం- ఉదాహరణకి హీరో చేసే యాసిడ్ దాడితో ఈ సినిమా మొదలౌతుంది. అరెస్టయి లాకప్ లోపడ్డాక అతడికి జరిగిందంతా గుర్తొస్తూంటుంది. ఫ్లాష్ బ్యాక్ మొదలౌతుంది. ఆ ఫ్లాష్ బ్యాక్ లో- విలేజిలో తను ఫోటో  స్టూడియోలో పనిచేసుకుంటూ, సమర్తాడిన రోజున హీరోయిన్ని చూసి ప్రేమిస్తూ, ఆమె వైజాగ్ వెళ్లిపోవడంతో తనూ అక్కడి కెళ్ళి, అదే కాలేజీ క్యాంటీన్ లో చేరి పనిచేస్తూ, ఆమెకోసం ప్రయత్నిస్తూ వుండి నప్పుడు, ఒకానొక ఘట్టంలో ఆమె తన మేనమామని చంపమంటుంది..ఎందుకు చంపాలన్న దానికి తనూ ఓ ఫ్లాష్ బ్యాక్ ఎత్తుకుంటుంది. అంటే ఇన్నర్ ఫ్లాష్ బ్యాక్ అన్నమాట!

ఈ ఇన్నర్ ఫ్లాష్ బ్యాక్ లో, మేనమామతో తను పడుతున్న లైంగిక వేధింపులు ఏకరువు పెడుతుంది. ఇదయ్యాక మళ్ళీ హీరో ఫ్లాష్ బ్యాక్ కంటిన్యూ అవుతుంది. హీరోయిన్ చెప్పిన సమస్యకి పరిష్కారంగా మేనమామని చంపడానికి ఒప్పుకుని ప్లానేస్తాడతను. దీంతో ఈ ఫ్లాష్ బ్యాకు కూడా  ముగిసి, హీరో యాసిడ్ దాడికి వెళ్ళే దృశ్యంతో మొదటి కొస్తాం. అంటే వర్తమాన కాలంలోకి వస్తాం. ఈ వర్తమాన కాలంలో కోర్టుకి తీసుకెళ్తున్న హీరో తిరిగి దాడి చేసి మేనమామని చంపడంతో సినిమా ముగింపుకొస్తుంది.

ఫ్లాష్ బ్యాక్స్ నడుస్తున్నప్పుడు మధ్య మధ్యలో వర్తమానం లోకొచ్చి,  యాసిడ్ దాడి కేసులో పోలీసుల విచారణా, లాకప్ లో వున్న హీరో ఇంటరాగేషన్ వగైరా జరుగుతూంటాయి.

ఇప్పుడు పాయింటేమిటంటే – హీరో ఫ్లాష్ బ్యాక్, హీరోయిన్ ఇన్నర్ ఫ్లాష్ బ్యాక్, మధ్యమధ్యలో వచ్చిపోయే  వర్తమానకాలంలో జరిగే సంఘటనలూ - ఈ మూడింట్లో  ఏది సినిమా కథ?

***
వర్తమానంలో జరిగేదే సినిమా కథ!

ఫ్లాష్ బ్యాక్స్ ఎప్పుడూ కథలు కాబోవు!

వర్తమాన కాలం (రియల్ టైం) లో మొదలెట్టిన  కథ లేకుండా, పూర్వ మెప్పుడో  జరిగిన విశేషాల తాలూకు ఫ్లాష్ బ్యాక్ (సింహావలోకనం- డ్రీమ్  టైమ్ ) మనజాలదు. ఫ్లాష్ బ్యాక్ దానికదే స్వతంత్ర కథాంగం కాదు. వర్తమాన సంఘటనలతో మొదలెట్టి చెప్తేనే ఫ్లాష్ బ్యాక్ కి అర్ధం. అదే వర్తమాన కథ ఫ్లాష్ బ్యాక్ లేకున్నా సర్వస్వతంత్రంగా సాగే సంపూర్ణ ప్రక్రియ.

ఎలాగంటే, ఓ కథని తీసుకుంటే, దాంట్లో ఓ  సమస్య- దాంతో ఓ సంఘర్షణా – దానికో పరిష్కారమూ అనే మూడంకాల పరిపూర్ణ ఫోటో  ఫ్రేముగా కన్పిస్తుంది. ఇది కథా లక్షణం.

అదే ఫ్లాష్ బ్యాక్స్ లో చూస్తే, ఈ లక్షణం వుండదు. సమస్య-సంఘర్షణ-పరిష్కారం అనే మూడంకాల నిర్మాణం వుండదు. వీటిలో సమస్య, సంఘర్షణ అనే రెండంకాలే వుంటాయి, మూడోదైన పరిష్కారం వుండదు. వుంటే అసలు ‘వర్తమాన కథే’ వుండదు. ఎందుకంటే, ఫ్లాష్ బ్యాక్ లోనే సమస్య పరిష్కారమై పోయింది కాబట్టి!
ఈ సినిమా హీరోకి  కథలో ముందుగా ఎందుకో ప్రేమించని హీరోయిన్ తో సమస్య ఏర్పడింది, తర్వాత ఆమె చెప్పిన ఇన్నర్ ఫ్లాష్ బ్యాక్ తో సంఘర్షణ మొదలయ్యింది. ఈ సంఘర్షణకి పరిష్కారమార్గం వర్త మాన కథలో హీరోయిన్ మేనమామని చంపమనడం దగ్గర వుంది. ఫ్లాష్ బ్యాక్ లో లేదు.

అలాగే  హీరోయిన్ ఇన్నర్ ఫ్లాష్ బ్యాక్ లో మేనమామాతో ఆమెకి లైంగిక వేధింపుల సమస్యే వుంది. దాంతో సంఘర్షణ మాత్రమే వుంది. అంతేకానీ, అదే ఇన్నర్ ఫ్లాష్ బ్యాక్ లో ఆ సమస్య పరిష్కారమై పోలేదు!


కనుక ఏ కథ ఫ్లాష్ బ్యాక్ లోనైనా సమస్య, సంఘర్షణ ఈ రెండూ మాత్రమే కన్పించి, ఒక  అసంపూర్ణ ఫోటో ఫ్రేములానే వుంటుంది. ఏ సినిమా ఉదాహరణ తీసుకున్నా ఫ్లాష్ బ్యాకులు ఇలాగే వుంటాయి. చిరంజీవి ‘ఖైదీ’ లో చిరంజీవిని పరారీలో వున్న ఖైదీ గా ఎష్టాబ్లిష్ చేసి, గతంలో అసలేం జరిగిందనే దానికి ఒకే ఏకబిగి మోనో ఫ్లాష్ బ్యాక్ ప్రారంభించి,  రావుగోపాలరావుతో సమస్య, సంఘర్షణా  చెప్పుకొచ్చారు. గతంలో అసలేం జరిగిందో ఫ్లాష్ బ్యాకు ద్వారా మనకి తెలియబర్చాక, తిరిగి వర్తమానంలో కొచ్చి, ఇప్పుడేం జరగాలన్న దానికి పరిష్కారంగా క్లైమాక్స్ ప్రారంభించారు. ఇలా ఫ్లాష్ బ్యాక్ లో వుండేది కథే కాదని స్పష్టం చేయడంజరిగింది. కనుక ఫ్లాష్ బ్యాక్స్ లో కూడా చెబుతున్నది కథే అనుకుని సాగిపోతే అంతా అభాసు అవుతుంది.

వర్తమాన కథలో ‘ఎందుకు?’ అన్న ప్రశ్నలోంచే కదా ఫ్లాష్ బ్యాక్ పుడుతుంది? వర్తమానంలో హీరో యాసిడ్ దాడి చేశాడు. ఎందుకు? అన్న ప్రశ్నలోంచే అతడి ఫ్లాష్ బ్యాక్ వచ్చింది. మళ్ళీ హీరోయిన్ మేనమామని చంపాలన్నప్పుడు కూడా ఎందుకు? అన్న ప్రశ్నలోంచే కదా ఆమె తాలూకు ఇన్నర్ ఫ్లాష్ బ్యాక్ వచ్చింది?
ఫ్లాష్ బ్యాక్ అనేది వర్తమాన కథలో తలెత్తిన సమస్య కి సంబంధించి -ఎందుకు, ఏమిటి, ఎలా-  అన్న సందేహాలకి అవసరమైన సమాచారాన్ని అందించి సంతృప్తి పర్చే వనరు మాత్రమే- డేటా బ్యాంక్ మాత్రమే!

మరి కథ కాని ఇలాటి ఉత్త సమాచారాన్నే ఊకదంపుడుగా అన్నేసి తడవలు ఫ్లాష్ బ్యాక్ మీద ఫ్లాష్ బ్యాకులుగా వేస్తూ పోవడం ఏం స్క్రిప్టింగ్ న్యాయం? ఎంత స్క్రీన్ టైం వేస్టు? పైగా ప్రేక్షకులు జీర్ణించుకోలేని దృశ్యాల పరంపర తో ఎంత సమ్మెట పోటు?
***

లిండా కౌగిల్ 
ఇలా పాలూ నీళ్ళూ వేరుచేసి చూసే క్షీర నీర న్యాయం చేశాం. ఫ్లాష్ బ్యాకులు మింగేసిన నీటి గుంట  లోంచి తెల్లటి పాల లాంటి కథని వేరు చేసి పట్టుకున్నాం. ఎంటా కథ? అదెంత మాత్రం వుంది?

హీరో యాసిడ్ దాడి చేసి లాకప్ లో పడ్డం, ఆతర్వాత అప్పుడప్పుడూ ఇన్వెస్టిగేషన్ ఇంటరాగేషన్ లూ, చిట్టా చివర్లో కోర్టుకి తీసి కెళ్తున్న హీరో మళ్ళీ మేనమామ మీద దాడి జరిపి చంపేయడం-ఇంతే ఈ సినిమా కథ!

ఈ అత్తెసరు కథ కూడా ఫ్లాష్ బ్యాకుల వల్ల ముక్కలయ్యింది, త్రీ యాక్ట్ స్ట్రక్చర్ ని కోల్పోయింది, సింహభాగం స్క్రీన్ టైముని ని ఫ్లాష్ బ్యాకులు మింగేయ్యడం వల్ల ఈ కథలో ఉండాల్సిన టైం ఎండ్ టెన్షన్ గ్రాఫ్ వీలు పడకుండా పోయింది! అప్పుడప్పుడు వచ్చిపోయే ఈ కథని ఫాలోకావడం కష్టమై పోయింది.

మరేం చెయ్యాలి?

నాన్ లీనియర్ కాకుండా లీనియర్ స్క్రీన్ ప్లే ద్వారా ఈ కథ చెప్పాలి, ఫ్లాష్ బ్యాకులు చెప్పడం కాదు.

హీరో నిద్ర లేచాడు, అరటి తొక్క మీద కాలేశాడు, సర్రున జారి కింద పడ్డాడు- ఇది లీనియర్ కథనం. కర్త- కర్మ- క్రియ అనే మైండ్ రిసీవ్ చేసుకునే సక్రమ పద్ధతిలో- వర్తమాన కాలంలో.

హీరో సర్రున జారి కింద పడ్డాడు, అరటి తొక్క మీద కాలేశాడు, హీరో నిద్ర లేచాడు-ఇది నాన్ లీనియర్ కథనం- అక్రమ పద్ధతిలో.

ఇక్కడ ప్రశ్న వేసుకోవాలి  -హీరో ఎందుకు జారి కింద పడ్డాడు? అరటి తొక్క మీద కాలేశాడు కాబట్టి అని- వెనక్కెళ్ళి  ఫ్లాష్ బ్యాకుతో అరటి తొక్క మీద కాలేసినట్టు చూపించాలి. కాలెలా వేశాడూ-అనే మరో సందేహానికి- నిద్ర లేచి మంచం దిగుతున్నట్టు మరో ఫ్లాష్ బ్యాక్ వేయాలి. ఓహో అలాగా అని అప్పుడర్ధం అవుతుంది అడిగేవాడికి.

ఈ సినిమాకి ఎంచుకున్న కథలో వావీవరసల్లేని లైంగిక వేధింపులనే బాక్సాఫీసు వ్యతిరేక, డాక్యుమెంటరీ అనుకూల అంశం వుంది. సినిమాకి దీన్ని లీనియర్ కథనం చేయడం వల్ల రెండు ప్రయోజనాలుంటాయి. ఒకటి, ఈ అంశం లోని బాక్సాఫీసు వ్యతిరేక వెగటుతనాన్ని తప్పించడం, రెండు- కథకి బలాన్ని చేకూర్చడం. స్టైల్ ఎప్పుడూ కంటెంట్ ని డామినేట్ చేయకూడదన్న ప్రాథమిక విషయాన్ని  గుర్తుంచుకోవాలి. ఈ కథకి బాక్సాఫీసు అప్పీలు లేకపోయినా సమస్యగా చూస్తే  ఇది బరువైనదే.  వెంకటేష్ నటించిన ‘దృశ్యం’ లో కూడా ఆ కుటుంబానికి ఎదురైన సమస్య బరువైనదే.  ఈ బరువైన సమస్యకి ఫ్లాష్ బ్యాకుల చిత్రణ చేసి వుంటే ఎలావుండేదో ఒకసారి ఊహించుకుంటే ఎలా వుంటుంది?  బరువైన ఫ్యాక్షన్ కథలు ఫ్లాష్ బ్యాక్స్ తో తీస్తే హిట్టయ్యాయి కదా అనొచ్చు. పగా ప్రతీకారాల రొటీన్ యాక్షన్ కథలు వేరు, నైతిక విలువల నిగ్గు తేల్చే సామాజిక సమస్యల కథాబలం వేరు. ఎంచుకున్న సమస్యలో ఎనర్జీ వున్నప్పుడు ఆటోమేటిగ్గా సినిమాకి అదే ఒక స్టామినా అవుతుంది. కథ చెప్పడంలో ఫ్లాష్ బ్యాకులూ వగైరాలతో వేరే టెక్నిక్కులు అవసరంలేదు. ఈ టెక్నిక్కులకి పాల్పడితే ఆ బరువైన సమస్య కాస్తా చెల్లాచెదురై పోతుంది. ప్రస్తుత సినిమాలో జరిగిందిదే...అంతటి సీరియస్ సమస్యకి ఎలా స్క్రిప్టింగ్ చేయాలా అన్నది తేలక, లేదా ముందు చెప్పుకున్నట్టు- సమస్య బలం కోల్పోయినా సరే, దీనికి సెక్స్ అప్పీల్ వుంది కాబట్టి అనుకుని ఆ దృశ్యాలకోసం కథని ఖూనీ చేయడం జరిగిపోయింది..

స్క్రీన్ రైటర్, లాస్ ఏంజిలిస్ ఫిలిం స్కూల్ లో స్క్రీన్ రైటింగ్ అధ్యాపకురాలు లిండా కౌగిల్ లీనియర్- నాన్ లీనియర్ తేడాల గురించి ఏమంటారో చూద్దాం -  We generally see action unfold in time. Audiences find it easier to focus on action that develops chronologically than action that skips around time periods. Film is more immediate, and more easily grasped if we see a clear progression of cause and effect relationships leading to a climax, held together by a single protagonist.

ఇంతకంటే వివరణ వుండదు. కాబట్టి, ప్రస్తుత సినిమా కథని హీరో హీరోయిన్ల ప్రేమకథ గానే షుగర్ కోటింగిస్తూ లీనియర్  గా చెబుతూ, హీరోయిన్ వ్యక్తిగత సమస్యని ఇంతియాజ్ అలీ ‘హైవే’ లోలాగా  డైలాగుల్లో చెప్పించేసి, ఆ సమస్యకి హీరో తీసుకునే చర్యని ముగింపుగా పెట్టుకుంటే- అన్నేసి పచ్చి దృశ్యాలతో ప్రేక్షకుల్ని అఫెండ్ చేసే అగత్యం తప్పేది.  కథకి ఆ సమస్య అంతర్లీనంగా ప్రవహిస్తూ (సబ్ టెక్స్ట్ గా ఉంటూ) కథాత్మని ఆవిష్కరించి బలాన్ని చేకూర్చేది. ఇలా చేయాలంటే ఇంతియాజ్ అలీ పడ్డట్టే చాలా కష్టపడక తప్పదు. లేదంటే ఇలాంటి నికృష్ట సమస్యని ఎత్తుకోనే కూడదు!

 -సికిందర్











17, జులై 2014, గురువారం

రివ్యూ..
దుస్సాధ్య  దృశ్యం!

దర్శకత్వం : శ్రీప్రియ
తారాగణం : వెంకటేష్, మీనా, కృతికా జయకుమార్, ఈస్థర్, నదియా, నరేష్, రవికాలే, సప్తగిరి తదితరులు
రచన : జీతూ జోసెఫ్,   సంగీతం : శరత్,  ఛాయాగ్రహణం : ఎస్. గోపాలరెడ్డి,  ఎడిటింగ్ : మార్తాండ్ కె. వెంకటేష్
బ్యానర్ : సురేష్ ప్రొడక్షన్స్, రాజ్ కుమార్ థియేటర్స్ ప్రై. లి., వైడ్ యాంగిల్ క్రియేషన్స్
నిర్మాతలు : డి. సురేష్, రాజ్ కుమార్ సేతుపతి
విడుదల : 11 జులై, 2014
***
సహజ కథల భాండాగారమైన మళయాళ సినిమారంగాన్ని చూస్తే తెలుగుసినిమా రంగం ఎంత వెలవెలబోతోందో  తెలిసిపోతుంది. అసలు దక్షిణ సినిమా రాజధానిగా వున్న  చెన్నై నుంచి తెలుగు ఫీల్డు  విడిపోయినప్పుడే అప్పటివరకూ అక్కడి ఇతర భాషల టాలెంట్స్ తో వున్న కళా బంధుత్వం కాస్తా పుటుక్కున తెగిపోయి అనాధలై  పోయారు తెలుగు సినిమా శ్రామికులు. ప్రతిభని సానబెట్టుకోవడానికి చెన్నై కళాకారులతో దశాబ్దాలుగా కొనసాగిన ఇంటరాక్టివ్ సాంగత్యం లేక, సృజనాత్మకత అంటే ఏమిటో మర్చిపోయి, పరాయి డివిడిలు చూసి తెలుగులోకి దిగుమతి చేసుకునే  బడాయి పండితులుగా,  అసహజ కథల అత్తెసరు క్వాలిటీ సినిమాల కుంభ వృష్టికి ‘మేతమధనం’  చేశారు. అటు తమిళ మలయాళ సోదరులుమాత్రం తరాలు మారినా జీవితపు భిన్న పార్శ్వాల  మీద అదే అధారిటీతో సహజ కథల్ని తవ్వితీసే సృజనకారులై వెలిగిపోతున్నారు. అలాటి వొక సృష్టిగా మలయాళంలో  ‘ద్రిశ్యం’ తీసి ఫ్యామిలీ థ్రిల్లర్ అనే కొత్త ఒరవడికి నాంది పలికారు.  ఇదే నాంది తప్పీజారీ ఎవరైనా తెలుగులో పలకబోతే అవహేళన చేసే అధార్టీ ధాటీగా తిష్టవేసి వుంటుందని చెప్పొచ్చు!

కొత్తదనాన్ని ఏదో ఇతరభాషల్లో  హిట్టయితేనే మన హీరోలు రీమేక్ చేసి,  దయతల్చి తెలుగు ప్రేక్షకులకి అందించాలే తప్ప, లేకపోతే ఒరిజినల్ గా కొత్తదనానికి నోచుకునే అదృష్టమే లేని పరిస్థితుల్లో విక్టరీ వెంకటేష్ పుణ్యమాని ఈ అరువు దెచ్చుకున్న కొత్తదనం వచ్చింది. ‘మనం’ అనే డైరెక్టు కొత్తదనానికి బ్రహ్మరథం పట్టినట్టుగానే ఈ రీమేకుకీ  పట్టంగట్టి, మళయాళ టాలెంటు కి నిరాజనాలందిస్తూ,  తమ సంస్కారాన్ని తెలియజేసుకుంటున్నారు   తెలుగు ప్రేక్షకులు- హాట్సాఫ్!!

మలయాళంలో జీతూజోసేఫ్ దర్శకత్వం వహిస్తే, తెలుగుకి నటి శ్రీప్రియ దర్శకతం వహించడం ఆసక్తికర పరిణామం.  తమిళ, కన్నడల్లో ఐదారు సినిమాలకి దర్శకత్వం వహించి వున్న శ్రీప్రియ,  తెలుగులో వెంకటేష్ ని హేండిల్ చేస్తూ ‘దృశ్యం’ తీయడం, అదీ సూపర్ హిట్టవడం గొప్ప విషయమే.

ఇప్పుడు తెలుగులో ప్రేక్షకాభిరుచి మారిందనడానికి ఇలాటి కుటుంబ కథా చిత్రాలు  హిట్టవడమే  నిదర్శనం. ఈ ఏడాది తొలిసగంలో ఇరవై వరకూ ఫక్తు ప్రేమ సినిమాలు, కామెడీలు  విడుదలైతే అవన్నీ అట్టర్ ఫ్లాపయ్యాయి. ఒక కుటుంబ సమస్యని జోడిస్తూ- ఆ నేపధ్యంలో ప్రేమల్ని డౌన్ ప్లే చేస్తూ తీసిన ‘అత్తారింటికి దారేది’, ‘మనం’, ఇప్పుడు ‘దృశ్యం’లాంటి సినిమాలకే పట్టం గడుతున్నారు ప్రేక్షకులు.

ఈ పట్టం గట్టడం లో నగర జీవితమా, గ్రామీణ జీవితమా అన్న వివక్ష లేదు. గ్రామీణ వాతావరణంలో గ్రామీణుల జీవితాల్ని సంక్షుభితం చేసి, క్రిమినల్ జస్టిస్ సిస్టం ( నేర న్యాయ వ్యవస్థ) ని సవాలు చేస్తూ చూపించినా ప్రేక్షకుల హర్షధ్వానాలు లభిస్తున్నాయంటే, ఇందులో పరీక్షకు  పెట్టిన సమస్య  ప్రతి సామాన్యుడుదీ కావడమే కారణం.

ఇలాటి ఈ ‘దృశ్యం’ లో అసలేముందో ఇప్పుడు చూద్దాం!


మంచి కుటుంబం మీద మరకలు!
అరకులోయ దగ్గరలో రాజవరం అనే వూళ్ళో రాంబాబు ( వెంకటేష్) అనే కుటుంబీకుడు కేబుల్ టీవీ నడుపుకుంటూ ఉంటాడు. ఇతడికి భార్య జ్యోతి( మీనా), చదువుకుంటున్న కూతుళ్ళు అంజూ (కృతికా జయకుమార్), అనూ (ఈస్థర్) వుంటారు. ఇతను నాల్గో తరగతి వరకే చదివిన అనాధ ( సినిమా హీరో ఇలాగే వుండాలి కదా!). ఈ రాంబాబుకి పొద్దస్తమానం టీవీ ముందు కూర్చుని సినిమాలు చూడడమే పని. ఎవరికే సమస్య వచ్చినా  తను చూసిన సినిమాల్లో పరిష్కారాల్ని సిఫార్సు  చేస్తూంటాడు. వూళ్ళో అందరికీ ఆప్తుడిలా ఉంటాడు- ఒక్కడికి తప్ప. అతను కానిస్టేబుల్ వీరభద్రం (రవి కాలే). ఒక తగాదా వచ్చి ఇతను అవకాశం కోసం చూస్తూంటాడు. రాంబాబు భార్యా పిల్లలకి అందరు మధ్య  తరగతి వాళ్లకి లాగే ఎన్నో కోరికలుంటాయి. తనకున్న ఆదాయంతో వాటిని తీర్చడానికి ప్రయత్నిస్తూంటాడు.

ఒకసారి ఇంటర్ చదువుతున్న అంజూ కాలేజీ వాళ్ళు ఏర్పాటుచేసిన నేచర్ క్యాంప్ కి వెళ్తుంది. అక్కడో రాత్రి ఆమె బాత్రూం లో వుంటే సెల్ ఫోన్ తో వీడియో తీస్తాడు వరుణ్ ( రోషన్ బషీర్). ఇతను పోలీస్ ఐజీ గీత (నదియా) కొడుకు. ఆ తర్వాత ఇంటికొచ్చాక, రెండో తేదీ రాత్రి ఆ వీడియో చూపించి బ్లాక్ మెయిల్ చేస్తాడు. అంజూ ఆమె తల్లి జ్యోతీ ఇతనితో తలపడినప్పుడు అంజూ కొట్టిన దెబ్బకి చచ్చిపోతాడు వరుణ్. భయంతో శవాన్ని  ఐదెకరాల ఇంటి ఆవరణలోనే కప్పెట్టేసి రాంబాబు వచ్చాక చెప్పేస్తారు.

ఇక రాంబాబు ఎట్టి  పరిస్థితిలో కుటుంబాన్ని కాపాడుకోవాలన్న ఆందోళనతో  పగిలిన వరుణ్ సెల్ ఫోన్ లో సిమ్ కార్డు తొలగిస్తాడు, కారు తీసికెళ్ళి నీటి కుంటలో తోసేస్తాడు. భార్యా పిల్లలతో విజయనగరం వెళ్ళిపోయి, అక్కడి హోటల్లోనూ, సినిమా హాల్లోనూ తాము వున్నట్టు ఆధారాలు సృష్టిస్తాడు...

తిరిగి వచ్చాక పోలీసులు ప్రత్యక్షమౌతారు. కానిస్టేబుల్ వీరభద్రం, వరుణ్ కారుని రాంబాబు తీసికెళ్తూండగా చూశాడు. దాంతో అసలే పగబట్టి వున్న అతను పదేపదే పై అధికారులకి ఇది నూరిపోస్తూ రాంబాబుని కుటుంబం సహా పోలీస్ స్టేషన్ కి  ఎక్కిస్తాడు.

రాంబాబు భార్యాపిల్లలకి విజయనగరం ఎపిసోడ్ గురించి ఎలాగెలా చెప్పాలో- ముందే చెప్పి వుంచాడు.  దీంతో పోలీసుల ప్రశ్నలకి అందరూ ఒకేలా చెబుతూంటారు. వరుణ్ కన్పించకుండా పోయిన రోజు, మర్నా డూ తాము విజయనగరంలోనే వున్నట్టు గోడ కట్టినట్టు చెప్పడంతో, ఐజీ సహా పోలీసులందరికీ ఎటూ పాలుపోదు. ఇక వాళ్ళ ని హింసించడం మొదలెడతారు.

ఐనా నిజం చెప్పకుండా మొండికేసిన వీళ్ళందర్నీ పోలీసులు ఎలా దారికి తెచ్చారు, తెచ్చినప్పుడు రాంబాబు దాన్ని కూడా ఎలా తిప్పి కొట్టి,  పోలీసుల మీద పై చేయి సాధించాడు, మొత్తానికే హత్య కేసు లేకుండా ఏం చేశాడు...అన్నవి ఈ థ్రిల్లర్ లో మిగిలిన అంశాలు.

వెంకటేష్ కి వయసుకి తగ్గ పాత్ర ఇది. ఐతే కథ పక్క దార్లు పట్టకుండా, ఉపకథలూ డ్యూయెట్లూ కూడా లేకుండా,  ఎత్తుకున్న పాయింటునే పట్టుకుని సాగడంతో మాంచి బిగువు సాధ్యపడింది. ఈ బిగువు వల్లే నటనలూ పకడ్బందీ గా వచ్చాయి. వెంకటేష్, మీనా సహా నటీ నటులందరూ ఈ సిన్మాకి సారధులే. కథా బలమే ఈ నటనలకి బలం. దర్శకురాలు శ్రీప్రియ వెంకటేష్ నుంచి సైతం ఎలాటి బిల్డప్పులకి తావులేని సహజ నటనని మలయాళంలో మోహన్ లాల్ కేమాత్రం  తీసిపోని విధంగా రాబట్టు కోవడం ఆమె ప్రతిభని చాటి చెప్తోంది.

ఎస్. గోపాల రెడ్డి ఛాయాగ్రహణంలో విజువల్స్ బావున్నాయి. శరత్ నేపధ్య సంగీతం కూడా ఓకే. అలాగే మార్తాండ్ వెంకటేష్ ఎడిటింగ్ కూడా.

ఇక ఈ సినిమాకి  బయట పరిస్థితి  చూస్తే,  మలయాళ ఒరిజినల్ చూశాక,  కేరళ పోలీసు అడిషనల్ డైరెక్టర్ జనరల్ సేన్ కుమార్- ఇది నేరాల్ని ప్రోత్సహించేలా వుందని వ్యాఖ్యానించి నంతలోనే, మరో ప్రకటన కూడా చేయాల్సి వచ్చింది. కేరళలోనే ఒక హత్య చేసిన ఇద్దరు నిందితులు,  తాము ‘ద్రిశ్యం’ ఇచ్చిన స్ఫూర్తితోనే శవాన్నీ, హతుడి సిమ్ కార్డునీ మాయం చేశామని చెప్పుకొ చ్చినట్టు ఆ ప్రకటన సారాంశం!

ఆ ఒరిజినల్ తీసిన దర్శకుడు జీతూ జోసెఫ్ మాత్రం  - ఇది కల్పిత కథే,  దీన్ని సీరియస్ గా తీసుకోకూడదని అనడమూ, తమాషాగా తీసుకోలేని ప్రేక్షకుల కోసం మళ్ళీ ముగింపులో సర్ది చెప్పే ప్రయత్నం చేయడమూ, అంతా ఒక అర్ధం కాని బ్రహ్మ పదార్ధమే ఈ సినిమా! కథలో పరీక్షకు  పెట్టిన సమస్య  తరచూ  సామాన్య పౌరులకి ఎదురయ్యేదే అయినా, ఇలా పరిష్కరించ వచ్చా అన్నదే బుద్ధి జీవుల సందేహం! ఆ మాటకొస్తే, ఇది కథే లేని కథ! ఫస్టాఫ్ లోనే ఒక ఘట్టం దగ్గర శాశ్వతంగా పరిష్కారమై పోయిన సమస్యకి,  హీరో పనిమాలా తవ్వుకున్న తన గోతి! అదెలాగో ఈ కింది విభాగంలో చూద్దాం.

స్క్రీన్ ప్లే సంగతులు!

Visuals can be deceiving…అని ‘దృశ్యం’ టైటిల్ కింద ట్యాగ్ లైన్ పెట్టారు. విజువల్స్ ఏమిటి- సిల్లీగా సినిమా సాంకేతిక భాష? - Appearances can be deceptive -అని ఉండాలేమో. ‘దృశ్యాలు ఏమార్చవచ్చు’ అనేకంటే, ‘కన్పిస్తున్నవి కనికట్టు కావొచ్చు’  అనడం సందర్భోచితంగా వుంటుంది. ఐతే ‘కనిపిస్తున్నవి కనికట్టు కావొచ్చు’ అని ఎవరికి  ఉద్దేశించి నట్టు? ప్రేక్షకులకా? ఏ రహస్యాలూ లేకుండా హీరో చేసింది చేసినట్టు ముందే చూపించేస్తున్నప్పుడు ఇక కనికట్టు ఏముంది? హీరో అబద్ధపు దృశ్యాలు సృష్టిస్తున్నాడని  ప్రేక్షకులకి తెలిసిపోయేదే.

 

మరి హీరో ప్రత్యర్ధులైన పోలీసులకి ఉద్దేశించారా? హీరోనీ, అతడి కుటుంబాన్నీ ప్రశ్నించేటప్పుడు పోలీసులకి ఇలాటి కనికట్టు దృశ్యాల సంగతులు ఇంకా నేర్చుకోవాల్సిన కొత్త విషయాలేం కావు. కాబట్టి  వాళ్లకి  ఉద్దేశించడంలో కూడా అర్ధం లేదు (కానీ వాళ్ళకే ఉద్దేశించినట్టు అర్ధం వస్తోంది!)). రహస్యాలు ప్రేక్షకులకి అసలే తెలియకుండా హీరో ఓ రకంగా, పోలీసులు ఇంకో రకంగా దృశ్యాలు రక్తి కట్టిస్తూంటే, అది ప్రేక్షకుల్ని అతలాకుతలం చేస్తూంటే, అప్పుడా ట్యాగ్ లైన్ వాళ్లకి వర్తించ వచ్చు. అంటే అప్పుడది ఎండ్ సస్పెన్స్ కథ అవ్వాలి. కానీ ఇదీ కాలేదు.

 

కాబట్టి ఇలా కాన్సె ప్చ్యు వల్ క్లారిటీతో బాటు, ట్యాగ్ లైన్ పదాల కూర్పు  సైతం అర్ధవంతంగా లేనప్పుడు కథ గందరగోళమై పోతుంది. అసలు కాన్సెప్ట్ ఏంటో, దాని కథనం ఎలా సాగాలో  దర్శకుడికే/ రచయితకే అర్ధంకాకుండా పోయే ప్రమాదముంది. ఒరిజినల్ దర్శకుడు-రచయిత  జీతూ జోసెఫ్ కి ఈ సినిమాతో చాలా పేరొచ్చింది. అతడి ఈ సృష్టిని ఇంటెలిజెంట్ థ్రిల్లర్ అనీ, ఇది రైటర్స్ మూవీ అనీ, అతను జీనియస్ స్టోరీ టెల్లర్ అనీ, ఏన్ అన్ బిలీవబుల్ మూవీ అనీ, చాలా చాలా పొగడ్తల్లో ముంచెత్తాయి మలయాళ, తెలుగు మీడియాలు. విరగబడి రేటింగ్స్ కూడా ఉదారంగా ఇచ్చేశాయి. జాతీయ ప్రింట్ మీడియా కూడా ఇదే బాట తొక్కింది.

ఇది మలయాళ ఒరిజినల్ కథకాదు. ఇందుకే ఏక్తాకపూర్ తలపట్టుకు కూర్చుంది. జీతూ జోసెఫ్ ఈ కథని ‘ది డివోషన్ ఆఫ్ సస్పెక్ట్ ఎక్స్’ అనే జపాన్ నలల్లోంచి ఎత్తేశాడు. దీన్ని హిందీలో తీద్దామని ఏక్తాకపూర్ ఈ నవలా హక్కులు కొనుక్కుంది. ‘కహానీ’ దర్శకుడు సుజయ్ ఘోష్ తో, విద్యాబాలన్ కథానాయికగా, నసీరుద్దీన్ షా, నవాజుద్దీన్ సిద్దిఖీ లు ఇతర పాత్రధారులుగా తీద్దామనుకుంది.  తీరా జోసెఫ్ చూపించిన హస్తలాఘవం ‘ద్రిశ్యం’ చూసి ఠారెత్తి పోయింది. తన సినిమా పూర్తిగా ఆపేసుకుంది.


ఇంకా ఈ నవల ఆధారంగా లీగల్ గా జపాన్, కొరియా భాషల్లో సినిమాలొచ్చాయి. హాలీవుడ్ లోనూ  రానుంది. ఇల్లీగల్ గా సౌతిండియా లో స్వైర విహారం చేస్తోంది. మళయాళ, కన్నడ, తెలుగు భాషల తర్వాత, తమిళ రీమేక్ కమల్ హాసన్ తో తయారవుతోంది! ఎక్కడో ఉక్రేయిన్ లో ‘ద్రిశ్యం’ ని ఓ విద్యార్థి పైరసీ చేశాడని కేసు వేసిన జోసెఫ్, ఈ సినిమా కథా చౌర్యం గురించి ఏమంటాడో మరి! కథా చౌర్యం ఓకే అయితే  పైరసీ ఓకే కాదా?



ఐతే జోసెఫ్ ఈ నవలని మక్కీకి మక్కీ కాపీ కొట్టలేదు. అదే విషాదం. అలా చేసి వుంటే, ఈ సినిమా ఇంత  గందరగోళం కాకుండా అర్ధవంతంగా వుండేది. ఏక్తా కపూర్ కూడా కొనుక్కున్న హక్కుల  ప్రకారం తీస్తే, నవల్లోలాగా ఇద్దరు గణిత- భౌతిక శాస్త్ర మేధావుల మధ్య  పోటాపోటీ మర్డర్ మిస్టరీ గేమ్ గా అలాగే వుండేదేమో.

నవల ప్రకారం...ఒకావిడ వుంటుంది. ఆమెకో కూతురుంటుంది. పక్కింట్లో గణిత మేధావి ఉంటాడు. ఓ  రెండో తేదీ రాత్రి, విడాకులిచ్చిన భర్త వచ్చి మళ్ళీ డబ్బుల కోసం దాడి చేస్తాడు. ఆత్మ రక్షణ చేసుకునే ప్రయత్నంలో అప్రయత్నంగా ఆ తల్లీ కూతుళ్ళు అతన్ని చంపేస్తారు. గణిత మేధావికి ఆవిడ మీద ప్రేమ వుంటుంది. అతనొచ్చి కాపాడతాడు. ఆ  శవాన్ని రూపురేఖలు తెలియకుండా, వేలిముద్రలు పట్టు బడకుండా చెక్కేసి ఓ చోట పడేస్తాడు.

అక్కడ్నించీ ఆ హత్యా సమయం రెండో తేదీ రాత్రి, ఆ తల్లీకూతుళ్ళు సినిమా కెళ్ళి నట్టు ఎలిబీ సృష్టిస్తాడు. పోలీసులు ఎలాగో శవాన్ని గుర్తించి ఆమె దగ్గరికొచ్చేస్తారు. గణిత మేధావి అడ్డేసిన పకడ్బందీ ఎవిడెన్సు కి పోలీసులు చిత్తవుతారు. ఈ గణిత మేధావి క్లాస్ మేట్ భౌతిక శాస్త్ర మేధావి ఒకడుంటాడు. అతన్ని తెచ్చి ఇతని మీదికి వదుల్తారు. ఇక ఇద్దరి సిగపట్లు మొదలవుతాయి. ప్రియురాలికోసం గణిత మేధావి గెలిచాడా, పోలీసులకోసం ఫిజిక్స్ మేధావి గెలిచాడా అన్నది మిగతా థ్రిల్లింగ్ కథ.


ఈ కథలో శవాన్ని దాచేయ్యలేదు గణిత మేధావి, ‘దృశ్యం’ లో  శవాన్ని దొరక్కుండా చేశాడు హీరో. ఇంతే  తేడా. ఫస్టాఫ్ లో ఈ శవాన్ని దాచిన చోటునుంచి ఇంకో చోటికి తరలించాక కథ అక్కడితోనే ముగిసిపోయిందని గ్రహించ లేకపోయాడు దర్శకుడు!

కథని త్రీయాక్ట్ స్ట్రక్చర్ లోనే కూర్చాడు. చక్కగా నలబై ఐదో నిమిషంలోనే ఫస్ట్ యాక్ట్  ముగుస్తూ హత్య జరుగుతుంది. అక్కడ్నించీ సెకండాఫ్ క్లైమాక్స్ లో చిన్న కూతురు నిజం చెప్పెసేవరకూ సుదీర్ఘంగా సెకండ్ యాక్ట్ సాగుతుంది. సినిమా కథకి సెకండ్ యాక్టే వెన్నెముక లాంటిది. అది ఫస్ట్ యాక్ట్  ముగింపులో ఏర్పాటుచేసిన సమస్యతో పోరాటంగా, దానికి మాత్రమే సంబంధించిన సంఘర్షణతో ఎత్తుకు పైయెత్తుల ఎమోషనల్ డ్రామాగా వుంటుంది. ఇందులోకి ఏమాత్రం ఫస్ట్ యాక్ట్ బిజినెస్ జొరబడ్డా బిగి సడలిపోతుంది. బిగి సడలని సెకండ్ యాక్ట్ ఎంత దీర్ఘంగా వుంటే, అంత టెన్షన్ తో చూస్తారు ప్రేక్షకులు. ఇందుకే మీడియా అంతా కూడా ఇది సీటుకు అతుక్కు పోయేలా కూర్చోబెట్టే థ్రిల్లర్ అంటూ హోరెత్తించింది.

అవసరం లేని కథతో అనవసర టెన్షన్ పెట్టడం అంటే ఇదే. సినిమా చరిత్రలో ఇలాటి సందర్భం ఇదేనేమో కూడా.
తల్లీ కూతుళ్ళు ఇంటి ఆవరణలో పాతిపెటిన శవం, తీరా క్లైమాక్స్ లో ఈ విషయం చిన్న కూతురు పోలీసులకి వెల్లడించే సరికి అక్కడ తవ్వి చూస్తే హతుడి శవం వుండదు, జంతు కళేబరం వుంటుంది.

అది పోలీసులకి ఫైనల్ బ్రేకు. దాంతో హీరో, అతడి కుటుంబం సురక్షితంగా బయట పడిపోతారు. అప్పుడు శవం గురించి భార్య అడిగినప్పుడు, మూడో తేదీ రాత్రే అక్కడ్నించి తొలగించానంటాడు. తొలగించి, ఊళ్లోనే  కడుతున్న పోలీస్ స్టేషన్ స్థలంలో పాతి పెట్టినట్టు మనకి చూపిస్తాడు దర్శకుడు. ఆ స్థలం మీద పోలీస్ స్టేషన్ కట్టేశారు. ఇక ఎన్నటికీ శవ రహస్యం బయటపడే అవకాశం లేనే లేదన్నమాట!

ఇది కూడా  ఒరిజినల్ ఐడియా కాదు.  ‘బ్లూ స్ట్రీక్’ (1999) అనే హాలీవుడ్ సినిమాలోని సిట్యుయేషనే  ఇది. ఓ దొంగ వజ్రాల్ని దోపిడీ చేసి ఓ స్థలంలో పాతిపెట్టి జైలు కెళ్తాడు. తీరా విడుదలయ్యాక వెళ్లి చూస్తే సరీగ్గా  ఆ స్థలం మీదే  కొత్త పోలీస్ స్టేషన్ కట్టి  వుంటుంది. ఈ కథనే మార్పులు చేసి తెలుగులో ‘బ్లేడ్ బాబ్జీ’ (2008) తీశారు.

ఇప్పుడు ప్రశ్నేమిటంటే, ‘దృశ్యం’ హీరో చివరికి తనే చెప్పినట్టు ఆ మర్నాడే- అంటే ఫస్టాఫ్ లో హత్య జరిగిన మర్నాడు మూడో తేదీ రాత్రే శవాన్ని తీసేసి ఇంకెన్నటికీ,  బ్రహ్మదేవుడు కూడా కనిపెట్టలేని నిర్మాణంలో వున్న పోలీస్ స్టేషన్ స్థలంలో ఖననం చేసేసి- సమస్యని అక్కడికక్కడే సేఫ్ గా, శాశ్వతంగా పరిష్కరించుకుంటే, ఆ మర్నాటి నుంచి భార్య పిల్లలతో తను విజయనగరంలో వున్నట్టు కంగారుగా సాక్ష్యాలు సృష్టించుకునే వేటలో ఎందుకు పడాలి?

అదృశ్యమైన ఎం హెచ్-370 మలేషియా విమాన రహస్యంలాగే, హతుడి శవాన్ని అంత శాశ్వతంగా అడ్రసు లేకుండా చేశాకా ఇంకా ఆందోళన దేనికి?

పోలీసులు వచ్చి అడిగితే, వరుణ్ ఎవరో మాకు తెలియదనీ, కావాలంటే మొత్తం సోదా  చేసుకోవచ్చనీ అనుమతిస్తే, పోలీసులు రూఢీ చేసుకుని వెళ్లి పోయే వాళ్ళు గా?

ఇలా మూడో తేదీ రాత్రే సింపుల్ గా సమస్య తీరిపోయింది! సమస్య తీరిపోయాక ఇక కథెక్కడిది? ఫస్టాఫ్ ముప్పావు గంట తర్వాత కథే లేక పోయాక ఇంకా స్క్రీన్ ప్లే ఎక్కడిది? స్క్రీన్ ప్లే లేకపోయాక దాని విశ్లేషణ ఎక్కడిది?

దర్శకుడు పాత్ర ద్వారా పోలీసుల్ని చీట్ చేయవచ్చు, లేని కథతో దర్శకుడే అమాయక ప్రేక్షకుల్ని చీట్ చేస్తే?

పాత్రోచితానుచితాలు!
వెంకటేష్ పోషించిన రాంబాబు పాత్ర కి నాల్గో తరగతి చదువు, కేబుల్ టీవీలో సినిమాల నాలెడ్జి ఇవే సరిపోయాయి ఐజీ స్థాయి అధికారిణి ని ఫూల్ చేయడానికి. రాంబాబు సరదా మనిషి. భార్యా పిల్లలతో చక్కగా ఆనందంగా ఉంటాడు. ఇంటా బయటా ఏ గొడవలూ వుండవు,  ఆ వొక్క కానిస్టేబుల్ తో తప్ప. ఈ కానిస్టేబుల్ కేబుల్  కనెక్షన్ తీసుకున్నట్టు లేదు. చిన్న విషయానికి పెద్ద కక్ష పెంచుకుంటాడితను రాంబాబు మీద! సాధారణంగా కేబుల్ వాళ్ళూ  పోలీసులూ సత్సంబంధాలు కలిగివుంటారు. అందరి సమస్యలకి సినిమా సీన్ల సిఫార్సులతో పరిష్కారం చూపే రాంబాబు, ఎందుకో కానిస్టేబుల్ వీరభద్రంతో తన సొంత సమస్యకి పరిష్కారాన్ని వెతుక్కోడు.

నేరం చేసిన తన కుటుంబానికి చట్టం నుంచి ప్రమాదం తలెత్తినప్పుడు రాంబాబు అమోఘమైన తెలివితేటలతో ప్రవర్తిస్తున్నట్టు చూపించారు. ఈ క్రమంలో అతను నెగెటివ్ పాత్రగా –అంటే యాంటీ హీరోగా మారాలి. తద్వారా చివర్లో తన చర్యలకి తప్పక శిక్ష అనుభవించి న్యాయాన్ని స్థాపించాలి.  దీనికి విరుద్ధం గా యాంటీ హీరోకి ఏ సినిమాలోనూ ముగింపు నివ్వలేదు - ‘గాడ్ ఫాదర్’ మార్లన్ బ్రాండో సహా. చాలా అరుదుగా ‘డెత్ విష్’ లాంటి సినిమాల్లో యాంటీ హీరోని శిక్ష నుంచి తప్పించారు. అదెలాగో తర్వాత చూద్దాం. రాంబాబు విషయానికొస్తే, ఇతను నేరాన్ని ఒప్పుకుని శిక్షకి తలవంచాలనుకోలేదు. చట్టానికి దొరక్కుండా వ్యవస్థనే ధిక్కరిస్తూ గెలిచాడు. ఈ విధంగా ఇతను యాంటీ ఎస్టాబ్లిష్ మెంట్ క్యారక్టర్ అయ్యాడు. ఇది మింగుడుపడని వ్యవహారమే. ఇందుకే  రాంబాబు చేత పరోక్షంగా నేరాన్ని అంగీకరిస్తున్నట్టు కొన్ని ముగింపు వాక్యాలు చెప్పించారు. ఇలా చెప్పడం వల్ల ఇతను దొరికిపోయినట్టే నని దర్శకుడు తెలుసుకోలేక పోయాడు!

ఈ ముగింపు వాక్యాల  గురించి ఒక న్యాయవాదిని సంప్రదించినప్పుడు ఆయన చెప్పిన దాని ప్రకారం- కస్టడీలో నిందితుడి నుంచి పోలీసులు రాబట్టే వాంగ్మూలాన్ని కోర్టు పరిశీలనార్హ మైనదిగా పరిగణించదు- కానీ అదే ఇతరులముందు  అతను చేసిన నేరం గురించి నోరు పారేసుకుని వుంటే అది సాక్ష్య మవుతుంది. రాంబాబు రిజైన్ చేసిన ఐజీ ముందు, ఆమె భర్త ముందూ  అలా చెబితే, వెంటనే వాళ్ళిద్దరూ సాక్షులుగా రాంబాబు మీద కేసు పెట్టొచ్చు. అతడిక  తప్పించుకోలేడు. వాళ్ళ ముందు అతనలా  నోరు పారేసుకున్నాక, బ్రహ్మ రహస్యం శవాన్ని కూడా బయటికి రప్పించడం పోలీసులకి చిటికెలో పని!

దర్శకుడి తెలివి తక్కువతనం వల్ల రాంబాబు బతికిపోయాడు గానీ, లేకపోతే తన నోటితో తన బతుకునే  కాక, ఏ కుటుంబాన్ని చట్టాన్నుంచి కాపాడుకోవడానికి చిట్టచివరి వరకూ కష్టించాడో - ఆ కుటుంబం మొత్తాన్నీ కటకటాల పాల్జేసి కూర్చునే వాడు శుభ్రంగా!

యాంటీ హీరో శిక్ష తప్పించుకునే సినిమాలూ రాకపోలేదు.  1974లో చార్లెస్ బ్రాన్సన్ నటించిన వివాదాస్పద సినిమా ‘డెత్ విష్’ లో తన పెళ్ళైన కూతుర్ని చెరచి, భార్యని చంపిన దోపిడీ దొంగలెవరో తెలీక, వాళ్ళని పోలీసులూ పట్టుకోలేక, తనే నగరంలో కన్పించిన దొంగానల్లా చంపుకుంటూ పోతాడు. పోలీసు అధికారి ఇతన్ని పట్టుకోవాలని చూస్తాడు. చివరికి తమవల్ల కాని నేరగాళ్ల ప్రక్షాళన హీరో చేయడంతో, అతడికి క్లీన్ చిట్ ఇస్తూ,  హత్యాయుధాన్ని మాయం చేసి నగరం నుంచి సురక్షితంగా పంపించేస్తాడు!

ఈ ముగింపుని ప్రేక్షకులు అంగీకరించారు. ఎందుకంటే చట్టమే సహకరించింది కాబట్టి. ఈ సినిమానే  రాజ్ బబ్బర్ తో ‘ ఇన్సాఫ్ కా తరాజూ’ అని బీఆర్ చోప్రా హిందీలో తీశారు. దీన్నే మురళీమోహన్ హీరోగా  ‘ఇదే నా సమాధానం’ అని తెలుగులో తనే రీమేక్ చేశారు. ఇరవై ఏళ్ల కాలంలో ‘డెత్ విష్’ కి మూడు సీక్వెల్సూ వచ్చాయి.

‘దృశ్యం’ సినిమాని పట్టుకుని, పగబట్టినట్టు ఇంత రంధ్రాన్వేషణ అవసరమా అన్పించ వచ్చు. తప్పకుండా అవసరమే. ఈ సినిమా రొటీన్ మూస ఫార్ములా అయివుంటే రంధ్రాన్వేషణ తలనొప్పి వుండదు, మూస ఫార్ములాల్లో లాజిక్కులతో పెద్దగా పనుండదు గనుక. కానీ నేర పరిశోధనే ప్రధానంగా కథ సాగినప్పుడు తప్పకుండా లాజిక్కు అవసరమే. నేరపరిశోధక కథకి లాజిక్కే ప్రాణం, అది  లేకపోతే నవ్వులపాలవుతుంది. ఈ సినిమాలో హీరో పాత్ర రాంబాబు అల్లిన కట్టు కథని, కింది నుంచీ పైదాకా పోలీసులు చేస్తూ పోయింది కూడా రంధ్రాన్వేషణే ! కేవలం రంధ్రాన్వేషణ అనే కథనం వల్లే అంత టెన్షన్ తో చూశారు ప్రేక్షకులు.

ఐతే పోలీసుల ఈ రంధ్రాన్వేషణకి పనిమాలా రాంబాబే అవకాశం కల్పించాడని ముందే చెప్పుకున్నాం-శవాన్ని బ్రహ్మ దేవుడు కూడా కనిపెట్టకుండా పోలీస్ స్టేషన్ కడుతున్న స్థలంలో పాతిపెట్టేశాకా కథ అక్కడితో బేషరతుగా ముగిసిపోయిందనీ, ఇంకా ఫ్యామిలీని కాపాడుకోవడానికి రాంబాబు ఏ తిప్పలూ పడనవసరం లేదనీ కామన్ సెన్సు  మాట్లడుకున్నాం. అయినా కుదురుగా ఉండక రాంబాబు తెల్లారి నప్పటినుంచీ హత్యా నేరాన్ని హాంఫట్ చేయడానికి విశ్వప్రయత్నాలూ చేశాడు. అందులో మొదటిది హతుడు వరుణ్ వేసుకొచ్చిన కారుని మాయం చేయడం!

రాత్రి పూట కారేసుకొచ్చిన వరుణ్, దానెక్కడో ఆపి, రాంబాబు ఇంటికి వచ్చి చనిపోయాడు. ఆ కారు అక్కడుంటే ప్రమాదమని రాంబాబు దాన్ని తీసికెళ్ళి నీటి కుంటలో ముంచేశాడు. కారుని ఎలా మాయం చేయాలా అనేదానికి తాను చూసిన సినిమాల  యాక్షన్ క్లిప్పింగ్స్ ని తల్చుకున్నాడు. ఆ సీన్ల ప్రకారం కుంటలో తోసేశాడు.

అసలు అంత తెలివైన రాంబాబు గుర్తు తెచ్చుకోవాల్సింది, కారు వున్న చోటే వదిలేసివుంటే, తమకి ప్రమాదమా కాదా అని తెలిపే సినిమా క్లిప్పింగ్స్ ని! కారుని మాయం చేసే పధ్ధతి గురించి కాదు!

అతడికి ప్రమాదం ముంచుకొచ్చే అవకాశమే లేదు. ఎందుకంటే, కనిపించ కుండాపోయిన వరుణ్ గురించి ఆచూకీ తీస్తున్న పోలీసులకి, ఎవరైనా అక్కడ వదలేసిన అతడి  కారు గురించి సమాచారమిస్తే- పోలీసులు వచ్చి చూసినా  అది మిస్టరీగానే వుంటుంది. కారిక్కడ వదిలేసి అబ్బాయి ఎక్కడికెళ్లాడబ్బా అనే ఆలోచిస్తూ ఉండిపోతారు. వరుణ్ ఆ రాత్రి రాంబాబు ఇంటికి వెళ్ళగా ఎవరూ చూడలేదు! రాంబాబు కుటుంబానికి వచ్చే ప్రమాదమేమీ లేదు! వరుణ్ అసభ్య వీడియో తీసిన రాంబాబు పెద్ద కూతురు అంజూ తో వరుణ్ కి  ఏ ఫ్రెండ్ షిప్పూ లేదు, వీడియో తీశాకే బ్లాక్ మెయిల్ చేయడానికి అతడామెతో రహస్యంగా కాంటాక్టు లోకి వచ్చాడు. ఈ సంగతి మూడో కంటికి తెలీదు. వరుణ్ కాల్ లిస్టు లో కూడా అంజూ నెంబర్ వుండదు.

వరుణ్ వదిలేసిన కారు మిస్టరీ తేల్చడానికి ఒకవేళ పోలీసులు ఇల్లిల్లూ విచారణ చేపట్టి వచ్చేసినా,  రాంబాబు నిర్భయంగా ఇల్లు మొత్తం సోదా చేసుకోమనొచ్చు-బయట ఆవరణ సహా! శవాన్ని  ఇంటి ఆవరణ లోని గోతిలోంచి తీసి, పోలీస్ స్టేషన్ స్థలం లోకి ఎప్పుడో తరలించేసి సేఫ్ అయిపోయాడు కాబట్టి!

ఇంత సింపుల్ గా పరిష్కారం కన్పిస్తూంటే, అతితెలివికిపోయి రాంబాబు కారుని దొంగిలించే పని పెట్టుకున్నాడు. ఇది గనుక చూస్తే- ఎర్ల్ స్టాన్లీ గార్డెనర్ సృష్టించిన ప్రఖ్యాత నవలా సిరీస్ పాత్ర, క్రిమినల్ లాయర్ పెర్రీ మేసన్- ‘టట్! టట్! టట్- ఆ కారుని  ముట్టుకున్నావంటే సాక్ష్యాధారాల్ని టాంపరింగ్ చేయడమే- నువ్వు ఇరుక్కుపోవడమే!- అని రాంబాబుని లాగి అవతల పడేసేవాడు!

అసలా కారుని తీయడానికి రాంబాబుకి తాళం చెవి ఎక్కడిది? పట్టపగలు తాను ఆ కొట్టొచ్చి నట్టున్న బ్రాండ్ న్యూ పసుపురంగు కారుని అలా డ్రైవ్ చేసుకుంటూ పోతూంటే వూళ్ళో జనాల దృష్టి నాకర్షించడా?

 కారుని తీసుకు పోతున్నప్పుడు కానిస్టేబుల్ వీరభద్రం చూసేశాడు! అప్పటికింకా వీరభద్రానికి తమ ఐజీ గీత గారి కుమారుడు వరుణ్ కన్పించడం లేదన్న సంగతి తెలీదు. ఆ పసుపురంగు కారు కూడా వరుణ్ దని తెలీదు. ఆ కారేసుకుని రాంబాబు పోతూంటే చూసి తికమక పడ్డాడంతే!

తర్వాత నీటి కుంటలో కారు బయట పడడంతో పరిస్థితి తీవ్రత పెరిగిపోయింది పోలీసులకి. వరుణ్ ఎక్కడికెళ్లా డబ్బా అని వెతుక్కుంటున్న పోలీసులకి,  ఇలా అనుమానాస్పద స్థితిలో కారు బయట పడ్డంతో భయ సందేహాలు పెరిగిపోయాయి! చేతులారా ఇలా పరిస్థితిని తీవ్రతరం చేస్తూ దృశ్యం చూపించేశాడు మన ఆంధ్రా షెర్లాక్ హోమ్స్ రాంబాబు! ... నేరాలెప్పుడూ జరిగేవే, లాజిక్కే ఎప్పుడో గానీ వుండదు. కాబట్టి మనం నేరాల మీదికంటే లాజిక్ మీద ఎక్కువ దృష్టి పెట్టాలబ్బా - అంటాడు ప్రియ నేస్తం డాక్టర్ వాట్సన్ తో, జగద్ప్రసిద్ధ కాకలు తీరిన క్లాసిక్ డిటెక్టివ్ షెర్లాక్ హోమ్స్ –ది అడ్వెంచర్స్ ఆఫ్ ది కాపర్ బీచెస్ అనే కథలో!

కారు బయటపడి, వీరభద్రం చూసిన ప్రకారం కారుతో- తద్వారా వరుణ్ అదృశ్యం తో  రాంబాబుకి సంబంధం వుందని తెలిసిపోయి, వచ్చేసి పీడించడం మొదలెట్టారు పోలీసులు! శవానికి గోతులు తీయడంలో మొనగాడు అన్పించుకున్న రాంబాబు, ఇలా కారు జోలికి పోయి తన గొయ్యిని తనే తవ్వుకున్నాడన్న మాట! పూర్ ఫెలో!

తన వైపు నుంచి  ఇలా లాజిక్ లేని తిక్క పని ఇంకోటి చేస్తాడు రాంబాబు- హత్యా స్థలంలో పగిలిపోయిన వరుణ్ సెల్ ఫోన్ సిమ్ కార్డు అతడ్నేదో అంతర్జాతీయ టెర్రరిజం కేసులో బాగా ఇరికించేసేదిగా వున్నట్టే ఫీలైపోయి- క్రైం సీనులో పోలీసులు సకల జాగ్రత్తలూ తీసుకున్నట్టు,  రాంబాబు తన వేలిముద్రలు ఎక్కడ పడతాయోనని, సిమ్  కార్డుని ఎంతో జాగ్రత్తగా కాగితం లో ఎత్తి పట్టుకుని,  పొట్లం చుట్టేసి మనకి నవ్వు తెప్పిస్తాడు. ఆ సిమ్ కార్డుని ఉత్తచేత్తో ముక్కలు చేసి అవతలకి విసిరేస్తే సమస్యే తీరిపోయేదానికి ఇంత హాస్యాస్పదమైన బిల్డప్ సీను!

ఇంకా ఆ సిమ్ కార్డుని విజయనగరం కూడా తీసికెళ్ళి,  అక్కడొక షాపులో చవకలో సెకండ్ హేండ్ సెల్ ఫోన్ కొని, సిమ్ కార్డుని ఇన్సర్ట్ చేసి, సెల్ ని ఆన్ లో వుంచి, ఒక లారీలో పడేస్తాడు. వరుణ్ దగ్గర వున్నది గెలాక్సీ స్మార్ట్ ఫోన్ అయితే, అందులో వాడేది మినీ మైక్రో సిమ్ అయితే, రాంబాబు పొట్లం చుట్టుకున్నది నార్మల్ సిమ్!  దర్శకత్వంలో వచ్చిన తేడా!

ఇక వరుణ్ సెల్ ఫోన్ని మానిటరింగ్ చేస్తున్న పోలీసులకి ఆ సెల్ ఫోన్ టవర్లు మారుతూ ఖరగ్ పూర్ దాకా వెళ్లినట్టు తెలుస్తుంది. అది ఏ రూటులో ఎలా వెళ్తోందో సరదాగా ఐజీ గారికి అప్డేట్స్ చెప్పుకుంటూ గడపడమే తప్ప, ఎక్కడికక్కడ పోలీస్ స్టేషన్లని అప్రమత్తం చేసి ఆ సెల్ ఫోన్ ని పట్టుకోవాలన్న ఇంగితమే వుండదు అర్భక పోలీసులకి!

ఏ కథలోనైనా ఒక సెటప్ వుంటే అది చెల్లుబాటయ్యే పేఆఫ్ కూడా వుండి తీరాలి. సిమ్ కార్డుతో ఒక ఎత్తుగడ ( సెటప్) పన్నాడు గానీ రాంబాబు, దాంతో ఒరిగింది (పే ఆఫ్) ఏమీలేదు. అసలు రాంబాబు తొలగించాల్సింది, వరుణ్ సెల్ ఫోన్ శకలాల్లో తన కూతురు అసభ్య వీడియో ని సేవ్ చేసిన మైక్రో ఎస్డీ కార్డుని కదా!

అలాగే మరొక పేఆఫ్ కాని సెటప్ వుంది. ఫస్ట్ యాక్ట్ లో-  అందరికీ సినిమా పరిష్కారాలు చెప్తూ ఆదుకుంటున్నప్పుడు - ఓ పేరెంట్స్ మిస్సయిన తమ కొడుకు గురించి పోలీసులు పట్టించుకోవడంలేదని బాధపడి నప్పుడు- దీనికి కోర్టులో హేబియస్ కార్పస్ పిటిషన్ వేయవచ్చని, తనకి తెలిసిన లాయర్ ఉన్నాడని లీగాలిటీస్ మాట్లాడతాడు రాంబాబు. అంటే తనకో లాయర్ తెలుసుననే పాయింటుని ఎష్టాబ్లిష్ చేశారు. మరి తన కుటుంబాన్ని ఏ అరెస్టు వారెంటూ లేకుండా లాగి వ్యానులో పడేసుకుని పోలీస్ స్టేషన్ తీసికెళ్ళి- వరుణ్ ఏమయ్యాడని  పోలీసులు కుమ్మేస్తోంటే, లీగాలిటీస్ తెలిసి వున్న రాంబాబు లాయర్ని వెంటనే పిలిపించుకోడు! అతడి మామగారు కూడా ఏ లీడర్నీ ఆశ్రయించడు!

ఇలా ఇదంతా చూస్తే,  రాంబాబు పాత్ర అమాయక ప్రేక్షకుల్ని మాయ చేసి – ఇదే కరెక్టు అంటూ స్టాంపు వేసే  పాసివ్ లేదా ఫెయిల్యూర్ క్యారక్టర్ గా నిలిచిపోతుంది!
***


రాంబాబు భార్య జ్యోతి పాత్ర మోడరన్ గా బతకాలని ఉబలాటపడే మధ్యతరగతి గృహిణి, కానీ తన జెండర్ విషయానికొస్తే భావాలు మధ్య యుగాల నాటివి. అవే భావాలతో నేటితరం తన కూతుళ్ళ జీవితాల్నీ చూస్తోంది. నూరిపోస్తోంది. రాంబాబు కంటే ఎక్కువే పదో తరగతి చదివింది. తన ఆడపిల్లల్ని పెద్ద చదువులు చదివించాలనుకుంటోంది. రేపు ఊరు దాటిపోయి ఊరుకాని వూళ్ళో చదవబోయే కూతుళ్ళు. మరో వైపు ఆడవాళ్ళ మీద పెరిగిపోతున్న అత్యాచారాలు. వీటికి తోడవుతున్న సోషల్ మీడియా, ఇతర టెక్నాలజీలు. ఇవ్వాళ్ళ తెల్లారి కేబుల్ టీవీ ఆఫీసుకి పోతే సినిమాలు చూస్తూ మళ్ళీ తెల్లారేదాకా ఇంటికే  రాని భర్త. ఆ సినిమాల పిచ్చేంటో ఇంటిదగ్గరే టీవీకి అతుక్కుపోయి తీర్చుకోవచ్చు. ఇలా కూతుళ్ళ భద్రత గురించి ముందునుంచీ ఏ పట్టింపూ లేని భర్త. పోనీ, అత్యాచారాల నివారణకు పోలీసులు ఏం జాగ్రత్తలు చెబుతున్నారో, ఎలాంటి సెల్ ఫోన్ యాప్స్ వాడమంటున్నారో, ఎవరైనా వేధిస్తే నిర్భయంగా పోలీస్ కంప్లెయింట్ ఇమ్మని ఎందుకు చెబుతున్నారో- డజన్ల ఛానెళ్ల సాక్షిగా వీలయినప్పుడల్లా మహిళలకి మొ ర పెట్టుకుంటోంటే,  ఈవిడకి ఆ ఎవేర్నెస్సే వుండదు. కారణం తాను  మధ్యయుగాల భావాలతోనే, నాటి పరిస్థితుల్లోనే ఇంకా జీవిస్తోంది. ఎవడైనా అపకారం చేస్తే, కాళ్ళమీద పడి నా జీవితాన్ని పాడు చెయ్యకూ - అని ఏడ్చే విక్టిం మెంటాలిటీ రకం.

పట్టుమని పద్దెనిమిదేళ్ళు లేని పొట్టి కుర్రాడు వరుణ్ వచ్చి, తన కూతురు వీడియో చూపించి తనతో ఒక రాత్రి గడపాలని, లేకపోతే నెట్ లో పెట్టేస్తాననీ బెదిరిస్తూంటే,  వెంటనే గది  తలుపేసి వాణ్ణి బందీ చేసేసి భర్తకి ఫోన్ చేయాల్సింది పోయి, ప్రాధేయ పడుతుంది. ఆమె గదిలోకి వచ్చినప్పుడు తలుపు మూసేసి పైన బోల్టు బిగిస్తుంది- ‘దీవార్’ లో అమితాబ్ బచ్చన్ చిల్లర గ్యాంగ్ ని తన్నడానికి గోడవున్ తలుపు మూసి తాళం వేసినట్టు- ఈమె కూడా వేలెడంత లేని పొట్టి కుర్రాడితో బిగ్ షోడవున్ కి రెడీ అయిపోతోందని మనం సంతోషిస్తాం! తీరా చూస్తే కన్నీళ్ళతో ప్రాధేయపడ్డం! ఇక్కడ కూడా సెటప్, దాని పేఆఫ్ ఫ్లాపే!

ఇలా  మా పరువు తీస్తే  మేమెంతా చచ్చిపోతామంటుంది. నీ కూతురు కాకపొతే నువ్వు నాతో గడపాలంటాడు వరుణ్. అప్పుడైనా ఈడ్చికొట్టక ఇంకా బతిలాడుకోవడం మొదలెడుతుంది. ఇలా తన ప్రమేయంలేకుండా ఆడపిల్ల పరువుపోతే, ఆమెకే కాదు, మొత్తం ఆమె కుటుంబానికీ చావే శరణ్యమనే భావజాలాన్ని కూతురి సమక్షంలో ప్రతిపాదిస్తోంది. ఇలాటి వాళ్ళుంటే పోలీసులింకా ఛానెళ్ళలో ఊదరగొడతారా?

ఇలా బెదిరించేవాడు ప్రమాదకారికాడు, వాడి నేరానికి వాడే సాక్ష్యాధారాన్ని సమకూర్చుకున్నాడని ఆమెకి అర్ధమేకాదు. ఇలాటి పరిస్థితి ఎదురయితే నేటి స్త్రీ ఏం చేయాలో అది చేసి చూపించే ప్రయత్నంలో, పొరపాటున  వాడి ప్రాణాలు తమ తల్లీ కూతుళ్ళ చేతుల్లో పోతే, కథకి కీలకమైన ఈ సీను ఇంత బలహీనంగా వుండేది కాదు! పైగా ఈ పాత్ర ఉన్నతంగా ఎదిగి నిజమైన సానుభూతిని సంపాదించుకునేది...
***


పోలీస్ ఐజీ గీత విషయానికొస్తే, ఈవిడ తన అధికార హోదా మర్చి సగటు తల్లిలా పగబట్టేసి, ఇంటరాగేషన్ మాటున ఓ కుటుంబాన్ని రాచిరంపాన బెట్టే రెబెల్ క్యారక్టర్ లా కన్పిస్తుంది. ఉన్నతాధికారిగా ఏ రూల్ బుక్ నీ ఖాతరు చేయకుండా, పోలీసుస్టేషన్ ని రౌడీ అడ్డాలా మార్చేసి, థర్డ్ డిగ్రీ తో చెలరేగిపోయిన డెసర్టర్ లా అన్పిస్తుంది. పాత్ర స్థాయిని దిగజార్చిన ఈ తరహా చిత్రణ లో కనీస స్థాయి కామన్ సెన్సు కూడా కన్పించదు. ఒకళ్ళు నేరం చేశారన్పిస్తే, దానికికారణం ఏమైవుంటుందా అని కూడా ఆలోచించదు. మోటివ్ లేకుండా ఏ నేరాన్నీ ఆపాదించలేమనీ తెలుసుకోదు. ఇంటరాగేషన్ కంటే ముందు దానికి సపోర్టు చేసే ఇన్వెస్టిగేషన్ ముఖ్యమని  ఆమెకి తట్టదు

రాంబాబు అమాయకుడు కాబట్టి –మీ కొడుకుని మేమెందుకు మాయం చేస్తాం, కారణం చెప్పండి?-అని అడగడు. ఇతను అడక్కపోయినా రేపు ఛార్జి షీటు ఏమనిపెడతారు? ముందా కారణం ( మోటివ్ ) తెలుసుకునే ప్రయత్నం చేయకుండా ఐజీ చివరంటా ఒకటే హింసకి గురిచేస్తుంది. ఏడెనిమిదేళ్ళ చిన్న కూతుర్నీ వదిలిపెట్టదు.

రాంబాబు వరుణ్ కారుని తీసి కెళ్ళాడన్న కానిస్టేబుల్ వీరభద్రం సాక్ష్యమే ఈ కుటుంబాన్ని ఇరికిస్తే, అసలు రాంబాబు ఆ కారుని నీటి గుంటలో తోసేశాడని ఏ సాక్ష్యముంది? విచారించారా? అతను ఆగివున్న కారుని  సరదాగా కొంత దూరం తోలి వదిలేసి ఉండొచ్చు. ఇంకెవడో నడపరానివాడు నడిపి, నీటిగుంటలో పడేసి, వాడు బతికి బయటపడి పారిపోయి వుండొచ్చు!

వరుణ్ సరీగ్గా రాంబాబు ఇంటికే వచ్చాడని కూడా ఏ సాక్ష్యం వుంది? అది సేకరించారా? పోనీ రాంబాబు ఇంటిని సోదా చేశారా? పోలీస్ కుక్కల్ని తెప్పించి చూశారా? అలా చూస్తే జంతు కళేబరం దొరికేది. దాన్ని పట్టుకుని ఇంటరాగేట్ చేస్తే రాంబాబు భార్యా పిల్లలు ఆశ్చర్య పోయే వాళ్ళుగా?ఎందుకంటే, అక్కడ వరుణ్ శవం ఉండాలనే వాళ్లకి తెల్సు, రాంబాబు జంతు కళేబరం తో రీప్లేస్ చేశాడని వాళ్లకి తెలీదు. మైండ్ రీడింగూ ఫేస్ రీడింగూ తెలిసి వుంటే ఐజీకి వాళ్ళ ఆశ్చర్యానికి కారణం తెలుసునే దిశగా ఇంటరాగేషన్ ని మార్చేది. నిజం బయటపడేది!

ఐజీ పాత్రని కిల్ చేసి, రాంబాబు సోకాల్డ్ స్కిల్స్ ని హైలైట్ చేసే అసమగ్ర పాత్రచిత్రణలు ఇక్కడ జరిగాయి.
కొడుకు కన్పించకపోతే ఐజీ ముందే అతడి ఫ్రెండ్స్ ని విచారించకుండా, కథ ఆఖర్న ఓ ఫ్రెండ్ ని పట్టుకుని కొడుకు అసలేం చేశాడో అప్పుడు తెలుసుకుంటుంది. అంటే తప్పు తనవైపు కూడా వుంది.అయినా చిన్నమ్మాయిని చిత్ర హింసలకి గురిచేయించి నిజం కక్కిస్తుంది. అమ్మ, అక్క వరుణ్ శవాన్ని పాతిపెడుతోంటే చూశానని చెప్పేస్తుంది చిన్నమ్మాయి.

వెంటనే ఇజీ పటాలంతో వెళ్లి తవ్విస్తే, అక్కడ జంతు కళేబరం వుంటుంది. మరు క్షణం జనం తిరగబడి కొట్టడంతో ఐజీ పటాలంతో సహా పారిపోతుంది. చాలా ముతక క్లైమాక్స్ ఇది.

ప్రత్యక్ష సాక్షిగా చిన్నమ్మాయి స్టేట్ మెంట్ ఉన్నాక, అక్కడ శవం లేదంటే రాంబాబు మరో గేమ్ ప్లే చేసినట్టే. శవం స్థానంలో జంతు కళేబరాన్ని పెట్టడంలోనే అతను దొరికిపోతున్నాడు...ఎప్పుడైనా పోలీసు కుక్కలొస్తే ఈ కళేబరం దొరికిపోతుందని రాంబాబుకీ తెలిసే వుంటుంది. అప్పుడతను ఏం చెప్పాలనుకున్నాడు? ఎవరిదా జంతువు? రాంబాబు దగ్గర పశువులున్నట్టే లేదు, మరి ఎవరిదో పశువుని ఇంట్లో ఎందుకు పాతిపెట్టుకున్నాడు?

కారు- సిమ్ కార్డు - ఈ కళేబరం- ఈమూడూ అతడి అమెచూరిష్ చేష్టలకి నిదర్శనాలైతే, దర్శకుడు అడ్డం పడ్డాడు. అడ్డం పడి, చిన్నమ్మాయి స్టేట్ మెంట్ ఆధారంగా కేసుపెట్టే ఆలోచన ఐజీ పాత్రకి లేకుండా చేసి, జనం తిరగబడిన ఓటమిభావంతో ఆమె చేత రిజైన్ చేయించి భర్తతో సహా ఫారిన్ పంపించేశాడు!

కొసమెరు పేంటంటే, ఒక కోర్టు భవనం ఎక్స్ టీరియర్ షాటు వేసి, రాంబాబు నిర్దోషిగా విడుదలయ్యాడని ప్రకటించడం!

ఏ కేసులో? వరుణ్ హత్య కేసేనా? అదెలా ఎప్పుడు పెట్టారు? మృతదేహం లేకుండా (corpus delicti) హత్య కేసెలా పెడతారు?

మానసిక సంఘర్షణల కథలకి, నేరపరిశోధక కథలకీ చాలా లోతులుంటాయి. ఆ లోతుల్లోకి పూర్తిగా వెళ్లి, అక్కడ్నించీ సమస్య ని చూడకపోతే, ఇలాటి పేలవమైన కథలే పెల్లుబుకుతాయి!

నవలని మార్చి నేర కథని అల్లే నేర్పు, దాని లీగల్ పరమైన అంశాల కూర్పూ సరిగ్గా లేకుండా తీసిన ఓ బలహీన ఫ్యామిలీ థ్రిల్లరే  ఈ 'దృశ్యం'!

 -సికిందర్